Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాస్మృతులు..

[రమణ బంధకవి గారు రచించిన ‘పురాస్మృతులు..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

కారులో ముందుకెళ్ళుతున్న నేను
కాలంలో వెనుక్కు వెడుతున్నా!
నాగరికతకు దూరంలో ఉన్న పల్లెటూరు
బాల్యం చుట్టూ చిక్కగా అల్లుకున్న మధుర స్మృతులు
అవే నాలో మాటిమాటికి నిదుర లేచే పురాస్మృతులు

పెంకుటింటి పంచాయతీ పాఠశాల చదువులు
మట్టి పలక మీద దిద్దిన ‘ఓ న మా లు’
హెడ్ మాష్టారు కట్టిన తెల్లటి గ్లాస్గో పంచె
మామిడి పిందెల కోసం దూకిన కంచె

వీధిలో ఆడుకున్న ఒంగుడు దూకుళ్ళు
అంగడిలో కొనుక్కున్న బెల్లపు జీళ్ళు
గరువులో ఆడుకున్న గూటీ బిళ్ళ
పొలం గట్టున ఏరుకున్న సీమ చింతలు
ఎడ్ల బళ్లలోంచి లాక్కున్న చెరుకు గడలు

కార్తీకమాసపు చెరువు స్నానాలు
పూజారి పెట్టిన తీపి ప్రసాదాలు
గుడి చుట్టూ వెలసిన షష్టి తీర్ధం
తీర్ధంలో గుర్రెమెక్కి తిరిగిన రంగులరాట్నం

ఊరి చివర ఉన్న టూరింగ్ సినిమా హాలు
చూసి మరచిపోలేని జానపద చలనచిత్రాలు
కాలానికి గాలం వేసి నా ముందుకు తెచ్చే ప్రయత్నాలు
భూతకాలపు గాఢ పరిష్వంగం ఇచ్చే పురాస్మృతులు

నేను లేకపోతే ఉండని ఆ జ్ఞాపకాలు
అవి లేకపోతే ఉండని నా అస్థిత్వం
వెనుక నుండి నన్ను ముందుకు నడిపే స్మృతులు
అతీతం నాకిచ్చిన వెలలేని బహుమతులు

Exit mobile version