Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పూరి జగన్నాథస్వామి ఆలయ సందర్శనం

[పూరి లోని జగన్నాథస్వామి ఆలయం సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]

పూ రీ జగన్నాథ స్వామి  ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో జగన్నాథ, సుభద్ర, బలభద్రులకు అంకితం చేయబడినా, జగన్నాథస్వామి ఆలయంగా పిలవబడుతుంది. ఈ ఆలయంలో నిర్వహించే జగన్నాథ రథాయాత్ర దేశ విదేశాల్లో అతి ప్రాచుర్యం పొందింది. చార్‌ధామ్ యాత్రలో ఉన్న నాలుగు ధామాల్లో పూరీ ఒకటి. మిగిలినవి రామేశ్వరం, ద్వారక, బదరీనాధ్.

ఆలయ రికార్డుల్లో అవంతి రాజు ఇంద్రద్యుమ్నుడు ప్రధాన ఆలయాన్ని నిర్మించాడని, ప్రాంగణంలోని మిగిలిన ఆలయాలు 11వ శతాబ్దంలో పునర్నిర్మించబడ్డాయని తెలుస్తుంది. ఈ ఆలయంలో దేవతామూర్తులను శిలతోనో, లోహంతోనో కాకుండా దారువు (వేపచెక్క) తో చేశారు. విగ్రహాలు కూడా పూర్తిగా ఉండకుండా, కాళ్లు, చేతులు లేకుండా ఉంటాయి.

జగన్నాథస్వామి ఆలయం

బయటకు ఆలయ శిఖరం చక్కగా కనిపిస్తుంది. ఆలయ గోపురం చాలా ఎత్తుగా ఉంది. 214 అడుగుల ఎత్తు (65 m). తల పూర్తిగా ఎత్తి చూడాల్సిందే. కర్రతో చేసినట్లు అనిపించేలా రాయిని చెక్కారు. చూస్తుంటే కళ్ళు పట్టడం లేదు. అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎక్కడకు వెళితే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అదేనేమో ఈ జగన్నాథ ఆలయం ప్రత్యేకత. తమిళనాడులో ఎన్నో ఆలయాలు చూసాను. బృహదేశ్వరాలయ గోపురం చూడగానే ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత నన్ను ఆకట్టుకునే గోపురమిదే. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. చెక్కతో చేసినట్లు అనిపిస్తుందేమో! ఆ అందమే వేరు. చూసి తీరాలి. అంతే!

ఈ ఆలయానికి నాలుగు ద్వారాలున్నాయి. తూర్పున ఉండే సింహ ద్వారం (ద్వారాని కిరువైపులా సింహాలుంటాయి), ఈ ద్వారం గుండానే జగన్నాథుడు గుండిచా ఆలయానికి వెళ్ళడం, రావడం జరుగుతుంది. మిగిలిన ద్వారాల కిరువైపులా ఏనుగులు (హస్తి ద్వారం), పెద్ద పులులు (వ్యాఘ్రద్వారం), అశ్వాలు (అశ్వద్వారం) ఉంటాయి.

ఆలయ విగ్రహాలు దారువు (చెక్క)తో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. విగ్రహాలను ఎత్తయిన పీఠం (రత్నబేది)పై ఉంచారు. జనం విపరీతంగా ఉన్నారు. మనలను తోసుకుంటూ వెళుతున్నారు. అలాగే లోపలకు వెళ్ళాం. ఒకటే తోపులాట. జగన్నాథ స్వామి ఎదురుగా మనలను నిలవనిచ్చేది క్షణ కాలమే. ఆ క్షణంలో స్వామి ఎంత అందంగా అగుపించారో. జీవకళ ఉట్టిపడుతుంది. పెద్ద కళ్ళతో.. అబ్బో! అప్పుడు కలిగిన భావం వర్ణించడం నావల్ల కాదు. ఇంక సుభద్రా దేవి, బలభద్రస్వామి దారుమూర్తులు కూడా అంతే! సజీవంగా ఉన్నట్లు ఉన్నారు. వారిద్దరి కంటే కూడా, నలుపు రంగులో ఉన్న జగన్నాథ స్వామి మరింత అందంగా ఉన్నారు. కాస్సేపు నిలబడి చూద్దామన్నా ప్రత్యేక దర్శనాలు ఆ సమయంలో ఏమీ లేవు. జనం తోసేస్తున్నారు. అయినా మరల క్యూలోకి వెళ్ళి పునర్దర్శనం చేసుకున్నాం. అక్కడే, పండాలు ప్రసాదం తెచ్చి అమ్ముతుంటే కొనుక్కున్నాం. బయటకు వచ్చి మిగిలిన ఆలయాలు చూసాం.

ముందుగా ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది. ఆంజనేయ స్వామి నిలువెత్తు మూర్తి. సింధూరం వర్ణంలో ఉన్నారు. చాలా అందంగా అనిపించారు.

గణేశ్ మందిరం: గణేశుని నిలువెత్తు మూర్తి మనల్ని చూస్తున్నట్లే ఉంటుంది.

మహలక్ష్మిదేవి మందిరం: మహాలక్ష్మి నిజంగా మనలను చూస్తున్నట్లే ఉంటుంది. ఎంత అందం! కళ్ళు తిప్పుకోనివ్వని రూపం. ఆ అలంకారం అద్భుతం. అస్సలు బయటకు రాబుద్ధి కాలేదు. చాలాసేపు లోపలే ఉన్నాం. మహాలక్ష్మి ఆలయానికి ప్రధాన ఆలయ పూజా కార్యక్రమాలలో ముఖ్య పాత్ర ఉంది. జగన్నాథునికి పెట్టె నైవేద్యాన్ని మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని చెబుతారు. అలాగే రథయాత్ర సమయంలో అమ్మవారిని బయటకు తీసుకువెళ్లనందున, రసగుల్లా పెట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నాకే దేవతామూర్తులకు లోపలికి ప్రవేశం ఉంటుందట.

ఇంకా సత్యన్నారాయణ స్వామి మందిరం, రాధాకృష్ణుల మందిరం, సూర్య భగవానుడు, నరసింహ మందిరాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో సాంస్కృతిక ఉత్సవాల కోసం అనేక మండపాలు ఉన్నాయి.

జగన్నాథ ఆలయ వంటశాల:

భారతదేశంలోనే అతి పెద్ద వంటశాల. వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వంట చేస్తారు. వంట కోసం వంటశాల దగ్గర వున్న గంగ, యమునా అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు.

ఫోన్లను లోపలకు తీసుకు వెళ్ళనివ్వరు. సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. ఉదయం 5am నుండి రాత్రి 10pm వరకు దర్శనం ఉంటుంది. ఇక్కడ హిందువులకు (జైనులు బౌద్ధులు) మాత్రమే ప్రవేశముంటుంది. విదేశీయులకు అనుమతి లేదు.

ఆలయం గురించిన మరి కొన్ని విశేషాలు:

  1. ఈ ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం మనం ఎటు నుండి చూసినా అటు వైపే ఉన్నట్లు కనిపిస్తుందట.
  2. ఆ శిఖరం మీద ఎరుపురంగు పతాకముంటే స్వామి ఆలయంలో ఉన్నట్లట.
  3. శిఖరం మీద పతాకం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందట.
  4. ఈ ఆలయంపై పక్షులు ఎగరవట.

జగన్నాథుని దర్శనమయ్యాక నాకు కలిగిన భావన

హిందూ మత విశ్వాసాలకు ప్రతీక,

దారువులో అందమైన అమరిక,

క్షణమాత్రపు వీక్షణం కోసం,

సంవత్సరాలుగా నిరీక్షణం

వేలాది మంది భక్తుల రాక

దర్శనానికి ఉండాలి ఓపిక

పరివార దేవతలతో కొలువు

అదే జగన్నాథ, సుభద్ర, బలభద్రుల నెలవు

పూరి బీచ్:

దీనినే గోల్డెన్ బీచ్ అని కూడా అంటారు. ఆలయానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బీచ్‌లో ఒంటెలు, గుర్రాలు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు వాటి మీద స్వారీ చేస్తూ, ఎంజాయ్ చెయ్యవచ్చు. వైజాగ్ బీచ్ లాగ ఏటవాలుగా లేదీ బీచ్. గట్టులాగ ఎత్తుగా ఉండి, వెంటనే లోతుగా ఉంది. నేను స్నానానికి వెళ్లకుండా ఒడ్డునే ఉన్నాను. నాతో వచ్చినవాళ్లు నీటిలో దిగారు. మేము వెళ్లిన సమయంలో పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. అలా రెండు అలలు వచ్చినపుడు, ఒకరిని మీదకు తోసేసి, మరో ఇద్దరిని మొత్తం ముంచేసింది. కొంచెంలో ప్రమాదం తప్పింది. అదే వాళ్లను సముద్రం లోపలకు లాగేసి ఉంటే.. బహుశా ఈ టూరు గురించి నేను రాసి ఉండనేమో! అందుకే సముద్రస్నానం చెయ్యాలనుకునే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి.

చోటా గోపాల్ టెంపుల్:

ఇక్కడ రాధా కృష్ణుల మూర్తులున్నాయి.

నరేంద్ర టాంక్:

ఇది చాలా పెద్ద మంచినీటి సరోవరం. 800 అడుగుల పొడవు, వెడల్పులతో విశాలంగా ఉంది. శుభ్రంగా ఉంది. జగన్నాథ స్వామి నౌకా విహారానికి ఇక్కడకు వస్తారు. మధ్యలో పెద్ద ప్లాట్‌ఫారం ఉంది. అందులో మెయిన్‌గా లక్ష్మీదేవి విగ్రహం ఉంది. మిగిలిన దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. లక్ష్మీదేవి డాలర్ ఇచ్చి, చేతికి ఒక తాడు కట్టేసి ఏభై ఇవ్వు, ఇరవై ఇవ్వు అని డిమాండ్ చేస్తున్నారు. గోత్రనామాలు చదివి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ దానికి ఒక రేటు.

నరేంద్ర టాంక్

నరేంద్ర ట్యాంక్‌లో ఉన్న మందిరం వద్ద రచయిత్రి బృందం

గుండిచా ఆలయం:

ఒరిస్సా రాజు భార్య గుండిచా పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది రథయాత్ర సమయంలో, జగన్నాథ స్వామి విడిది చేసే ఆలయం. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఒక్క పూరీలోనే మూల విరాట్టును ఊరేగింపుగా తీసుకు వచ్చి, ఇక్కడ వారంరోజుల పాటు కొలువుంచుతారు. జగన్నాథ, సుభద్ర, బలభద్రులను పెట్టడానికి పెద్ద పీఠాలు ఉన్నాయి. ఆ వారం రోజులూ కొన్ని లక్షలమంది భక్తులు గుండిచా ఆలయంలోని జగన్నాథుని దర్శించుకుంటారు.

గుండిచా ఆలయం వద్ద రచయిత్రి బృందం

ఆలయ ప్రాకారం లోపల రథచక్రాలు ఉన్నాయి. అంతకుముందు రథాయాత్రలకు వాడిన చక్రాలట. ఎవరైనా కొనుక్కోవచ్చట. ఇంట్లో పెట్టుకుంటారట. లేకపోతే సెంటిమెంటుగా, పొలం దున్నడానికి మంచిదన్న భావనతో వాడతారట.

ఈ ఆలయంలో లోపలకు వెళ్లే ప్రవేశ మార్గం, బయటకు వచ్చే మార్గం వేర్వేరుగా ఉన్నాయి. వన్ వే అన్నమాట. లోపల పార్టిషన్సులా చేసి ఒక్కో దగ్గర ఒక్కో దేవున్ని పెట్టి, అక్కడున్న పండాలు డబ్బులు వసూలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో దక్షిణ వెయ్యకపోతే, సరిగ్గా దర్శనం కూడా చేసుకోనివ్వడం లేదు.

రథయాత్ర:

ఆషాఢ శుక్ల విదియనాడు పండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి, విగ్రహాలను రథాల మీదకు చేరుస్తారు. జగన్నాథుని ముందు ఎంత వారైనా సేవకులే అని చెప్పడానికి సూచనగా, పూరీ రాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడ్చడాన్ని, ‘చెరా పహారా’ అంటారు. విగ్రహాలను రధాల మీద ఊరేగింపుగా గుండిచా ఆలయానికి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేసే, ఉత్సవాన్ని ‘పహండీ’ అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. రధాలను తిప్పడానికి వీలుగా ఈ గుండిచా టెంపుల్ ఎదురు రోడ్డు చాలా విశాలంగా ఉంటుంది. వారం రోజులు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని ‘బహుదాయాత్ర’ అంటారు

రథయాత్రకు రెండు నెలల ముందు నుండి, ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. జగన్నాథుని రథాన్ని నందిఘోష అని, బలభద్రుని రథాన్ని తాళధ్వజమని, సుభద్రాదేవి రథాన్ని పద్మ ధ్వజమని పిలుస్తారు.

రథయాత్రకు లక్షలమంది భక్తులు హాజరై, జగన్నాథుని దర్శించుకుని, రథాలను లాగుతూ తరించి పోతారు.

గోవర్ధన పీఠం:

ఆది శంకరాచార్యుల వారు దేశం నాల్గు దిక్కులా స్థాపించిన చతురామ్నాయ పీఠాలలో ఇదొకటి (మిగిలినవి ద్వారకా మఠం, గోవర్ధన మఠం, శృంగేరీ మఠం). చాలా విశాలంగా ఉంది. పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచారు. ఇక్కడ ఆది శంకరాచార్యుల వారి ప్రతిమ, శివాలయం, ఇంకా మీదకు వెళ్తే కాళీమాత ఆలయం ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది.

సిద్ధవకుల్ మఠం:

ఇక్కడ జగన్నాథుని ప్రతిమ, రాధా కృష్ణుల ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే చైతన్య దేవ్ జగన్నాథుని పళ్ళు తోముకునే పుల్లని, (ఇది వకుళ వృక్షం పుల్ల) పాతితే వృక్షం అయిందట. ఇంతకీ ఆ వృక్షం ప్రత్యేకత ఏమిటంటే చెట్టు మజ్జ (Tree marrow) ఉండదు. బయట బెరడు (Tree skin) మాత్రమే ఉంటుంది. ఆ విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

Exit mobile version