[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల గారు రచించిన ‘పుస్తకం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మొదటి ఆడియో పుస్తకం
మౌఖికం వేదం.
శివుని ఢమరుక నాదం
ఘన పాఠ పఠన నిరుక్తం.
పరంపరాభవ సంప్రదాయసూక్తం
విశ్వ శ్రేయం ధ్యేయం.
రాతి శిలపై శాసన పద్యం
చేసింది కాల గణనం
కుప్పాంబిక తొలి కవయిత్రిగ
తెలుగు కవిత ప్రాచీనత
సాహిత్య చరిత్రల కోట బురుజుల కెక్కి
ఎగుర వేసింది కీర్తి ధ్వజం.
అన్నమయ్య పద సంకీర్తనా పథం.
తాళపత్ర ప్రతుల సంశోధనల ఫలితం,
పొందింది ప్రచురణా పర్వం.
ఇపుడు ఇంటింటా శ్రవణ పేయం
వాగ్గేయ గాన పరిమళం.
అలనాటి రాజ సభా మంటపం
కవుల కావ్య కల్పనా విన్యాసాలకు
తొడిగింది కాళ్ళకు గండ పెండేరం,
ప్రబంధాల వ్యాఖ్యాన సౌరభం
అమోఘం కావ్య లహరీ విన్యాసం.
తర తరాల పుస్తక ప్రపంచం
తొలగింది లోక మాయా చిత్త భ్రమణం.
వెలసింది ఉర్వి గ్రంథాలయం.
ఇది వేయి కన్నుల ఇంద్ర భోగం
పోరాటం చేయకనే
పెకిలించి తెచ్చుకున్న
నందన వన కల్పకం.
అనన్యం పుటలు తెరిచిన పుస్తక
పారిజాత పరిమళం.
ఒంటరి ఊహల బ్రతుకు సత్యం.
వాడదు ఈ కుసుమం
నవ నవీనం పద్య గద్య కథా నాటక వచన కవితా
తరుణ కిసలయ రాగం.
బడి నుండి బాహ్యాకాశ ప్రయోగ
జ్ఞాన విజ్ఞాన వైవిధ్యం
పుస్తకం సదా సమ్మోహన మంత్రం
డా. రాజేశ్వరి దివాకర్ల విశ్రాంత తెలుగు ఆచార్యులు. ప్రవృత్తి రీత్యా కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు. కళాప్రపూర్ణ దివాకర్ల వేంకటావధాని గారు, చంద్రావతి గార్ల కుమార్తె. భూమి తడిపిన ఆకాశం, నీరు స్తంభించిన వేళ, నక్షత్రదాహం, కాగితం సంచీ అనే కవితాసంపుటులు, పగడాల దీవి అనే కథాసంపుటి ప్రచురించారు. సోమనాథ కళాపీఠం వారి సాహిత్య పురస్కారం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి మాతృవందనం పురస్కారం పొందారు. అనేక కవితలకు బహుమతులు పొందారు.
