Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పుట్టపర్తివారితో సంభాషణ

[28 మార్చ్ 2026న సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక రచనని అందిస్తున్నాము. పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి భావతరంగాలు సంకలనం ‘స్వాంతస్సుఖాయ’ నుంచి డా. పుట్టపర్తి నాగపద్మిని గారి అనుమతితో ఈ రచనని అందిస్తున్నాము.]

ప్ర: ప్రజాకవిత్వమంటే మీ దృష్టిలో ఏమిటి? ఇటీవలి వారిలో ప్రజాకవులుగా మీరెవరినైనా పరిగణిస్తారా? ఎందుకు?

జ: నా దృష్టిలో ప్రజాకవి అని వేరే వింగడింపు లేదు. అన్ని రచనలూ ప్రజల కోసం ఉండేవే. అధికార విశేషాన్నిబట్టి వాడు వాడు రచనల్ను చదువుకుంటాడు. ఈ ప్రజా సాహిత్యమని చెప్పబడే వాటిలో మాత్రం వివక్ష లేకుండా అన్నీ అందరికీ అర్థమవు తున్నాయా? తప్పెట కొడితే కొందరికి సంతోషం. దాసరి వాడు శంఖం పూరిస్తే కొందరికి సంతోషం. లైట్ మ్యూజిక్ వింటే కొందరికి సంతోషం. ఏ పినాకపాణిగారో, బాలమురళీ కృష్ణగారో, పశుపతిగారో పాడితే కొందరికి సంతోషం. అందుకే నేనింతకుముందన్నది. అధికార భేదమని పురజనులకూ, గిరిజనులకూ వీళ్ళు రాసే ప్రజాకవిత్వాలు ఎంతవరకు అర్థమవుతాయి? ప్రజల్లో ఎరుకలు, ఏనాదులు కూడా ఉన్నారు కదా! అందరికీ పనికివచ్చే రచన బ్రహ్మదేవుడు కూడా చేయలేడు. ప్రజా సమస్యలు అంటే కూడూ గుడ్డా రెండూ మాత్రమే కాదు. ఇంకా ఎన్నో ఉన్నాయ్!

ప్ర: భావ, అభ్యుదయ, విప్లవ కవిత్వాల కోవకు చెందని శ్రీ జాషువా, శ్రీ దువ్వూరి వంటివారి స్థానాలేమిటి?

జ: జాషువా పద శిల్పాన్ని బాగుగా ఎరిగినవాడు. ఆయన చెప్పిన అర్థానికంటే చెప్పేది బావుంటుంది. దువ్వూరి వారిలో ‘పారశీక’ కవిత్వ ఛాయలు అక్కడక్కడా తొంగిచూస్తూ ఉంటాయ్. మన భాషకు ఆ భావాలు కొత్తగా ఉంటాయ్.

ప్ర: కృష్ణపక్షం, భావకవిత్వమైతే, గబ్బిలం ఏమిటి?

జ: కృష్ణపక్షం భావకవిత్వమని మీరే అన్నారు. గబ్బిలం సంఘాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో వ్రాయబడింది కానీ, అందులో కూడా వస్తువును బట్టి కాదు గౌరవం – ఆయన రచనా శిల్పాన్ని బట్టి.

ప్ర: ఆధునిక తెలుగు కవిత్వానికి మార్గదర్శకులని చెప్పదగ్గవారు మీ దృష్టిలో ఉన్నారా? ఉంటే – ఎవరు? ఎందుకు?

జ: ఆధునికత అన్నది ఎక్కడి నుండి విడదీస్తున్నారో నాకర్థం కావడంలేదు. మంచి రచనలు చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. కాని, వాళ్ళల్లో అంతా టాగూర్ ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనబడుతూ ఉంటుంది.

ప్ర: మీ దృష్టిలో (ఎ) ఆధునిక సాహిత్యంలో పదికాలాలపాటు నిలబడగల రచనలేమైనా ఉన్నాయా? (బి) మీవి ఏవైనా ఉన్నాయా? (సి) లేవంటే ఇంత సాహిత్య కృషీ వ్యర్థమైపోయిందనుకోవడానికి ప్రత్యేక కారణాలున్నాయా?

జ: (ఎ) పది కాలాలపాటు నిలిచే కవిత్వాలు లేవని నేనెట్లా చెప్పేది? ఒకానొకనాడు దేశభక్తి కవిత్వాలు ప్రముఖంగా ఉండేవి. అటు తరువాత ఏవో మత కలహాలకు సంబంధించిన గ్రంథాలు. ఈ భావాలన్నీ ఎప్పుడూ తాజాగా ఉంటాయని నాకు నమ్మకం లేదు. ఇలాంటి రచనలన్నీ వాటి అవసరం తీరుతూనే మరుగులో పడిపోతాయ్. శ్రీశ్రీ కవిత్వం కూడా అంతేనేమో! ఎవరికి తెలుసూ? కానీ రామాయణ భారతాలు ఈనాటికీ చదువుతూనే ఉన్నాం, ఎందుకూ? తాత్కాలిక అవసరాలు ఎన్ని తీరినా రామాయణ భారతాల ఆవశ్యకత ఎప్పుడూ ఉంది.

భారత కథలో ‘సన్నివేశ గాంభీర్యం’ ఉంది. రామాయణ కావ్యంలో ‘రచనా శిల్పం’ ఉంది. సంస్కృత భారతం మన విజ్ఞాన సంపుటి. అందువల్ల ఏ కాలంలోనైనా దాన్ని చదువుతాం. ‘సంస్కృతం పనికిరాదు అది బ్రాహ్మణుల భాష’ – ఇలాంటి పిచ్చిపిచ్చి వాదాలు శాశ్వతంగా నిలవవు. ఏనాటికైనా ఎందరు ద్వేషించినా, అగౌరవించినా సంస్కృతానికున్న మర్యాద తొలగదు. తమిళం కూడా మొదట సంస్కృతాన్ని బహిష్కరించడానికి ప్రయత్నించింది. ద్రావిడ నాగరికత కొంత ప్రత్యేకత ఉన్నదని వారి వాదంగా ఉండేది. వేదాల్లోనే కొన్ని ద్రావిడ పదాలు చొచ్చుకొని పోయినాయని వారు ఈనాటికీ వాదిస్తారు. ఏదెట్లున్నా సంస్కృతం తరువాత తమిళం అంత ప్రాచీన భాష మరొకటి లేదు. ఈ దృష్టితో రామాయణం ఆర్య, ద్రావిడ నాగరికతల సమ్మేళనాన్ని మనసులో ఉంచుకొని చేసిన కల్పనగా కొందరు వాదిస్తారు. రామాయణమేమిటి – అంతకు ముందే ఆర్యులు, ద్రావిడులు కలిసిపోవడం బహుళ ప్రచారంలో ఉంది.

ఇంతకూ చెప్పొచ్చేదేమంటే – సంస్కృతానికి లోబడని అనంత శబ్ద సంచయం వారికున్నా, సంస్కృతాన్ని బహిష్కరించడం వారికినీ సాధ్యం కాలేదు. ఇలాగా ఎన్ని భావాలు మారినా భారతదేశంలో ‘ఆస్తికతా బుద్ధి’ పోదేమో అనే విశ్వాసం నాకుంది. దానికి సంబంధించిన ఉత్తమ శిల్పంతో కూడిన కావ్యాలు నిలుస్తాయేమోనని నా ఆశ. (బి) నా రచనలేమన్నా ఉన్నాయా అంటే నేనేమీ చెప్పలేను. దానిని కాలమే నిర్ణయిస్తుంది. (సి) నా సృష్టి వ్యర్థమై పోయిందని నేనెట్లా అనుకోను? నేను కాలంలో నిలుస్తాననే అహంకారం నాకుంది.

ప్ర: మీరు కవిత్వం రాయటం ప్రారంభించిన నాటినుండి, నేటి వరకూ చూస్తే, ఎన్నో మార్పులు వచ్చాయి. మీరిప్పుడే కవిత్వ రచన ప్రారంభించే దశలో ఉన్నట్లయితే మీరెటువంటి కవిత్వం రాస్తారు?

జ: ఈ ప్రశ్న కూడా సంస్కారి అయిన వారి విషయంలో వేయదగ్గది కాదు. ప్రతిభావంతుడైన కవి ఎవర్నీ గుడ్డిగా అనుసరించడు. తన్నితరులు అనుసరించేలా చేసుకుంటాడు. వాని మార్గాన్ని వాని ప్రతిభ నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేను రచనను మొదలుపెట్టి ఉండినట్లయితే నా మార్గాన్ని నేననుసరించి ఉండేవాణ్ణి.

ప్ర: మీ సాహిత్య జీవితంలో మరపురాని సంఘటనలు ఉంటే చెప్పండి?

జ: ఎన్నో ఉన్నాయ్ – మరపురాని సంఘఠనలు. ‘అహమేవ పండితాః’ అనే భావనతో మొదలుపెట్టిన వాణ్ణి – ఇప్పుడు ‘నా హం పండితాః’ అనే స్థితికి వచ్చాను. ఈ స్థితికి రావటానికి కొన్ని నూర్ల సన్నివేశాలు జరిగివుంటాయ్. వయసు – దానితోబాటు పరిపక్వత చెందుతుండే మనసు నన్ను మార్చివేశాయ్. నా కాలంలో పెద్దవాళ్ళనిపించుకున్న ఎందరితోనో పేచీలు పడ్డాను. ఈనాటికీ నా భావాలట్లే ఉన్నాయ్. కానీ వాటిని వెల్లడించే పద్ధతిలో మార్పు వచ్చిందంతే!

చెళ్ళపిళ్ళ వారూ, శ్రీపాదవారు – వీరితో పెద్ద రగడలే జరిగిపోయాయ్. చిన్న వయసున, పెద్ద పరిశ్రమ కావడంతో చాలా మందితో పోట్లాడవలసి వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను: నేను నా 19వ సంవత్సరంలో ‘భారతి’లో ప్రాకృత కావ్యాల్ని గూర్చి కొన్ని వ్యాసాలు వ్రాశాను. అప్పుడు మల్లంపల్లి వారు ‘భారతి’ ఎడిటర్‌గా ఉండేవారు. నేనొకసారి ‘భారతి’ ఆఫీసుకు పోయినాను. మల్లంపల్లివారు ఆఫీసులో ఉన్నారు. నన్నెవరో పిల్లవాడనుకున్నారు. నేనే పుట్టపర్తి నారాయణాచార్యులంటే ఆయన ఆశ్చర్యంగా నావైపు చూశారు. ఆయన అన్నారు “నీ వయస్సేదో అరవయ్యో, డెబ్బయ్యో – పెద్ద నామాలూ – ఇట్లా ఉంటారని ఊహించానండీ!”

తరువాత ఆయన మరణించే వరకూ నన్నెంతో గౌరవంగా చూసేవారు. ఆయన చారిత్రికుణ్ణిగా కూడా నన్ను చూసేవారు. శ్రీపాదవారితో నేను కలిసినప్పుడు పెద్ద రంధే అయిపోయింది. చెళ్ళపిళ్ళ వారు “నీ తెలుగు కవిత్వం కంటే సంస్కృత కవిత్వమే నాకు బావుంది నాయనా!” అన్నారు. ఎన్నో ఇలాంటివి! నేనేమని చెప్పేది? విశ్వనాథ వారితో సవాలక్షసార్లు కొట్లాట! కానీ ఆయన మహారసికుడు. మహా మనస్వి. బెజవాడలో ఒకసారి నా ‘శివతాండం’ విని – నన్ను భుజాలపై వేసికొని ఎగిరాడు! అంతటి ‘రసలుబ్ధు’ డాయన. ఇంకా ఇలాంటి సందర్భాలు నూర్లకు ఉన్నాయ్..

ప్ర: మీ రచన వెనుక ఉన్న ప్రభావాలేమిటో చెప్తారా?

జ: నా రచన వెనుక ప్రభావాలు ఎన్నని చెప్పేదీ! 10-15 భాషల ప్రభావం నా రచనల్లో ఉంది. సంగీతమూ, నాట్యమూ నా రెండు ప్రాణాలు, కానీ ఆ రెండున్నూ కూడా సరిగా రావే! కారణం – ఆ రెంటికీ తెలుగుదేశంలో దండిగా కూడు పుట్టదు కనుక. నేను నా జీవితాన్ని బేరీజు వేసుకొంటే – నేను ఎక్కువగా కష్టపడింది మూటికి: సంగీతమూ, నాట్యమూ, ఇంగ్లీషు భాష, కానీ ఈ మూడున్నూ సరిగ్గా రాలేదు. ఈ జన్మకా ప్రాప్తి లేదేమో! సంగీత నాట్యాలను సాహిత్యం మింగేసింది. ఈనాటికిన్నీ సంగీత నాట్యాలు సరిగ్గా తెలియకపోతే నా రచనా విధానం సరిగా అర్థం కాదేమో అనిపిస్తుంది.

ఈ అనేక భాషా ప్రభావాల వల్ల రచనలో నేను పడ్డ బాధలు కొన్ని ఉన్నాయ్. నేను ఏది వ్రాసినా అంతకంటే బావుండేది ఏదో మనసులో మెదులుతుంది. నాలో నిరుత్సాహం బయలుదేరుతుంది. మలయాళంలో ‘వళ్ళత్తోళ్’ మహాకవి. ఆయన ‘గాంధీజీ’ని గురించి ‘ఏండ్రెగురునాథన్’ అనే ఓ ‘ఖండిక’ వ్రాశారు. అలాంటి ఒకదాన్ని నా జీవితంలో వ్రాయలేకపోయానే అనుకుంటూ ఉంటాను.

ప్ర: ఈ ముప్ఫై ఏళ్ళనుండి ప్రభుత్వంగానీ, ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థలుగానీ వాటి దృష్టిలో ఉత్తమ రచనలనిపించిన వాటికి బహుమతులిస్తున్నాయి. ఈ విధానం బాగుందా! ఉత్తమ రచన ఎన్నికకు మీరు సూచించే విధానం ఏదైనా ఉందా?

జ: ఏదో వారికి తోచిన రచనలకు బహుమతులిస్తుంటారు. ఆ విధానం మంచిదే! ఆ విధంగా కొంతమందికి ఉత్సాహం లభిస్తుంది కదా!

ప్ర: ఈ వ్యక్తుల్ని గురించి మీ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పండి.

గురజాడ అప్పారావు

నా దృష్టిలో గురజాడ చక్కని నాటకకర్త. హాస్యాన్ని చాలా గొప్పగా పోషించా డాయన. సంస్కృత నాటకాల్లో కూడా ‘గురజాడ’ వలె హాస్యాన్ని పోషించినవారు లేరు. షేక్స్‌పియర్ కూడా తన నాటకాల్లో చాలాచోట్ల ‘శ్లేష’తో హాస్యాన్ని సృష్టిస్తాడు. కొన్నిచోట్ల వల్గర్‌గా కూడా దిగుతాడు. నాటకాల్లో ఆ స్థితి తప్పదంటాడు. కాళిదాసు కూడా ఎక్కడో తప్ప హాస్యాన్ని బాగా పోషించాడు. ఒక్క ‘మృచ్ఛకటిక’కారుడు మాత్రం తమాషాగా వ్రాస్తాడు. వీరికెవ్వరికిన్నీ లేనిశక్తి ‘గురజాడ’కుంది. ఇక ఆయన పరిష్కరించడానికి పూనుకున్న సమస్యలు అప్పటికీ, ఇప్పటికీ ఉన్నాయ్. ఈ కుళ్ళు సమాజంలో, రచనలతో మానవుడు బాగుపడతాడనడం కల్ల.

దేవులపల్లి కృష్ణశాస్త్రి

పదాల యొక్క స్వరూపం తెలిసినవాడు.

బాలగంగాధర్ తిలక్

ఆశ్రయించింది ఫ్రీవర్స్ – రాసింది భావకవిత్వం. కొన్ని ఖండికలు బాగానే ఉంటాయ్.

కుందుర్తి

ఇతని కొన్ని రచనలే చూచినాను. ఇతన్ని- గూర్చి స్పష్టమైన భావం నాకు లేదు. రాజకీయ కవిత్వం చెబుతుంటాడు.

నారాయణబాబు

ఈయనను గూర్చి నాకెక్కువ తెలియదు.

సి. నారాయణరెడ్డి

చక్కని భావకవి. రచనలో అనేక ప్రయోగాలు చేసినాడు. మనిషిగా చాలా మంచివాడు. హృదయమున్న కవి.

పఠాభి

చమత్కారం కవిత్వం కాదు!

దాశరథి

వీళ్ళంతా నాకెక్కువ దగ్గరివారు. వీళ్ళను గూర్చి నేనేమని చెప్పను. పద్యమూ గద్యమూ వ్రాస్తుంటారు. కొన్ని రచనలు బావుంటాయ్. స్నేహపాత్రులు, దాశరథి, నారాయణరెడ్డి ప్రభృతులు నన్ను ప్రేమతో ‘అన్నా!’ అని పిలుస్తుంటారు.

విశ్వనాథ సత్యనారాయణ

నా దృష్టిలో గొప్ప ‘అదృష్ట జాతకుడు!’. ఈయనతో ఎన్నోసార్లు నాకు కలహం జరిగింది. కవులలో కొంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్న మనిషి కావున – అంతకంటే మించిన వాఙ్మి కావడంతో చాలామంది ఇతనికి భయపడేవారు. నాపై తన బాణాలు కొన్నిసార్లు ఉపయోగించాడు. ప్రతిబాణాలు నా దగ్గర తయారుగానే ఉండేవి!

ఇతనికి చాలామంది శిష్యులున్నారు. ఒకసారి ఎవరో నాకు జ్ఞాపకం లేదు – సంగీత పాండిత్యాన్ని గూర్చి నాతో చెబుతూ వచ్చాడు. నాలో నేను నవ్వుకున్నాను. ఏదైనా నేర్చుకోందే ఎలా వస్తుంది? ఈయన శిష్యగణం ఇతన్ని గూర్చి బ్రహ్మాడంగా చెబుతూ ఉంటుంది. ఆయన స్వరూపం తెలిసిన మావంటి వాళ్ళు ఊరికే వింటూ ఉంటాం. చాలామందికి కష్టంగానే ఉంటుంది.

ఒక్క విషయం – సత్యం చెబుతున్నా – కొన్ని ఏళ్ళనుంచి ‘రాయలసీమ’ ప్రతిభను ఇతర ప్రాంతీయులు తుడిచేస్తున్నారు! రజాకర్ మూవ్‌మెంట్ జరక్కపోయి వుంటే దాశరథి, నారాయణరెడ్డి కూడా రాయలసీమ వాళ్ళలాగే ఉండేవాళ్ళు!

నా పాండిత్య విషయంలో నాకు చాలా గర్వం ఉంది. సంస్కృత వ్యాకరణాన్ని ప్రధానంగా చదవడం, తక్కిన శాస్త్రాల్లో లక్షణ గ్రంథాలు చదవడాలు కారణం. శంకర భాష్యం వేంకటేశ్వర దీక్షితులు వారి వద్ద చదివాను. ఆ జ్ఞానంతో తమిళంలో ఆళ్వార్ల వ్యాఖ్యానం చదివాను. మలయాళ, కన్నడాలు సరేసరి! సంగీత నాట్యాల్లో చిన్ననాటి నుండీ కృషిచేశా!

ఒకసారి ఈ ఊళ్ళోనే (కడపలో) విశ్వనాథ ‘రామాయణం నాకు తప్ప ఎవరికర్థ’మౌతుందని బూతులన్నాడు. ఆ సభలోనే ఉన్న నేను తరువాత మాట్లాడుతూ, ‘నీకు రామాయణం ఒక్క ముక్క కూడా అర్థం కాలేద’ని చెప్పినాను. శబ్దార్థాలు సంస్కృతం వచ్చిన వారందరికీ అర్థమౌతాయి. ద్వైతులకు ‘భాగవతం’ ప్రాణం. దానికి వాళ్ళే వ్యాఖ్యానం చెయ్యాలి. అలాగే ‘రామాయణం’ వైష్ణవుల సొత్తు. అళ్వార్లు – అంటే, తమిళ భక్తులు ఎంతో మనోహరమైన అర్థాలు రామాయణ శ్లోకాలకు చెబుతూ వచ్చారు. ఎవరినీ లెక్కపెట్టకుండా ఊరికే నోరున్నదని వాగితే ప్రయోజనమేముందీ? ‘రామాయణ కల్పవృక్షం’ చాలా గొప్పదని అనేకులంటుంటారు. అలా అనేవాళ్ళలో చాలామంది దాన్ని చదివి ఎరుగరు!

ఇంతకూ ఒక్కటి మాత్రం నిజం – అతడు గొప్ప ‘భావుకుడు.’ బుద్ధిపుడితే అతి లోకంగా రాస్తాడు. లేకుంటే సర్వసభ్యంగా చేరుస్తాడు! సాహిత్యంలో ఎన్నో పోకడలు పోయినాడు. నవలలూ, నాటకాలూ, గేయాలూ ప్రతిదానలో ఆయన వ్యక్తిత్వం ఒకటుంది. నేను ఆయన ‘ఏకవీర’ను మలయాళంలోకి ట్రాన్స్‌లేట్ చేసినాను. ఆయన నోటిదుడుకుతో చాలామంది శత్రువుల్ని సంపాదించుకున్నాడు,

నిజం చెప్పవలసి వస్తే – ఒకసారి తిరుపతిలో గౌరిపెద్ది రామసుబ్బ శర్మగారి ఇంట్లో “నీవంటి వాళ్ళు తగులుకుంటే మాదేముందయ్యా?” అన్నాడు. ఇది అక్షరాల నిజం! రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగార్ని గూర్చి కొన్నిసార్లు నా ఎదుట తేలికగా మాట్లాడేసరికి ఉగ్రుణ్ణయిపోయినాను. ఆయన నీకూ సాపత్యమేమిటి – పొమ్మన్నాను.

ఒకసారి ఆయన అకాడమీ సభల్లో తన సంస్కృత రచన చదువుతున్నాడు. నేనూ, అనంతకృష్ణ శర్మగారూ ప్రక్కప్రక్కల్లో కూర్చున్నాం. శర్మగారు “నారాయణా! ఇదేం భాషరా?” అన్నారు. ఇద్దరూ నవ్వుకున్నాం.

రవీంద్రభారతిలో విశ్వనాథ మెట్లు దిగి వస్తున్నాడు. నేను పైకి ఎక్కుతున్నాను. మధ్యలో “నీకు సంస్కృత కవిత్వం ఏమివచ్చు? నేను చదువుతాను, విను” అని సవాల్ చేశాను. నా సంస్కృతం చదివాను. విని ఊరుకున్నాడు.

ఎందుకు చెబుతున్నానంటే – ఆయనపై నాకు గౌరవం లేకకాదు. గౌరవం లేకుంటే ఆయన ‘ఏకవీర’ను నేనెందుకు భాషాంతరీకరణ చేస్తాను? కానీ, ఆయన ‘వెల’ చెఱచారు!

(స్వాంతస్సుఖాయ – ఆధునిక కవిత అభిప్రాయ వేదిక. సేకరణ ఆచార్య తిరుమల. కిన్నెర ప్రచురణ ద్వితీయ ముద్రణ 2000. ‘సరస్వతీ పుత్రునితో సంభాషణలు’ – పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి భావతరంగాలు సంకలనం. ముద్రణ: పుట్టపర్తి నాగపద్మిని)

Exit mobile version