Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పుట్టినరోజు బహుమతి

[బాలబాలికల కోసం ‘పుట్టినరోజు బహుమతి’ అనే కథ అందిస్తున్నారు యం. ధరిత్రీ దేవి.]

“అమ్మా,”

వంటింట్లో పని చేసుకుంటున్న రోహిణి గౌరి పిలుపు విని హాల్లోకి వచ్చింది. పనిమనిషి శివమ్మ కూతురు గేటు తీసుకొని వస్తూ కనిపించింది. గౌరికి పదేళ్ళుంటాయి. గవర్నమెంట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది.

“అమ్మకు జ్వరంగా ఉంది. నన్ను పంపించిందమ్మా ఈరోజు..”  చెప్పింది గౌరి.

అప్పుడప్పుడూ తనకు కుదరని రోజు కూతుర్ని పంపించడం శివమ్మకు అలవాటే. చిన్నపిల్లయినా పర్వాలేదు, పని బాగానే చేస్తుంది. అందుకని అభ్యంతరం చెప్పకుండా చేయించుకుంటూ ఉంటుంది రోహిణి. కానీ లోలోపల చిన్నపిల్లకు పనులు చెప్పడం ఆమెకు కించిత్ బాధగానే ఉంటుంది. కానీ, పనంతా ఒక్కత్తే చేసుకోలేక కాదనలేకపోతూ ఉంటుంది.

గౌరి చీపురందుకుని గదులు ఊడవడం మొదలెట్టింది. మరి కాసేపటికి,

“అమ్మా, నా స్నానం అయిపోయింది. నేను రెడీ, టిఫిన్ రెడీనా..?” అంటూ తేజస్ వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆ అబ్బాయి రోహిణి, రాజేష్‌ల ఒక్కగానొక్క కొడుకు. ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు.

“కాస్త ఆగరా, అయిపోవచ్చింది. ఈ లోగా నీ బ్యాగు, అవీ సర్దేసుకో..”

రోహిణి కిచెన్ లోంచి చెప్పేసింది. పుస్తకాల సంచిలో అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్న తేజస్ చూపు అప్రయత్నంగా గది ఊడుస్తున్న గౌరి మీదకు మళ్ళింది. తైల సంస్కారం సరిగా లేని జుట్టు చిందరవందరగా నుదుటిమీద పరుచుకుని ఉంది. లంగా, జాకెట్ బాగా పాతబడి చిరుగులతో ఉన్నాయి. మట్టి గాజులు ఎన్నాళ్ళ క్రితం వేసుకున్నదో పాపం..! గౌరిని అప్పుడప్పుడూ ఇంట్లో పని చేస్తుండగా చూస్తుంటాడు తేజస్. ఎన్నాళ్లుగానో శివమ్మ పనిచేస్తున్నా, అంతగా పట్టించుకోని వాడు గౌరిని ఈరోజు పరిశీలనగా చూస్తూ,

‘అయ్యో, చాలా చిన్న పిల్ల కదా..! బడికి కూడా పోతోందట! ఇంటి పనులు చేయడం ఎంత కష్టమో కదా ఈ పిల్లకి!’ అనుకున్నాడు.

“తేజూ, రా, టిఫిన్ రెడీ.” తల్లి పిలుపుతో చూపు మరల్చుకుని బ్యాగ్ తీసుకొని హాల్లోకొచ్చాడు తేజస్.

***

స్కూల్లో ప్రార్థన ముగిశాక, రెండు రోజుల తర్వాత ఫంక్షన్ హాల్లో జరగబోయే తన పుట్టినరోజు వేడుకకు వంశీ తన క్లాస్మేట్స్ అందరినీ ఆహ్వానించాడు. అలాగే టీచర్స్ అందరికీ లంచ్ బ్రేక్‌లో వెళ్లి చెప్పాడు. అందరూ ఒకే చెప్పారు. వంశీ బాగా కలిగిన వాళ్ళ అబ్బాయి. వాడి తండ్రి పెద్ద ఆఫీసర్. తల్లి కూడా కాలేజీలో లెక్చరర్‌గా చేస్తోంది. డబ్బుకు కొదవేమీ లేదు. ఎప్పుడూ దర్జాగా కనిపిస్తాడు. క్లాసులో అందరికీ వాడంటే అదో స్పెషల్ ఇంట్రెస్ట్! ప్రతీ బర్త్ డేకి క్లాసులో అందరికీ స్వీట్స్ మాత్రం పంచేవాడు. ఈసారి ఏకంగా ఫంక్షన్ హాల్లోనే అరేంజ్ చేశారు. వాళ్ల నాన్నకు ప్రమోషన్ వచ్చిందట, అదీ కారణం!

లంచ్ బ్రేక్‌లో అందరూ కలిసి మాట్లాడుకున్నారు. వంశీకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనీ, అందుకోసం తలా కాస్త డబ్బు వేసుకోవాలనీ నిర్ణయించుకుని.. ఆ బాధ్యత క్లాస్ లీడర్ మనోజ్‌కి అప్పజెప్పారు. మరుసటిరోజు సాయంత్రం మనోజ్, తేజస్, మరో ఇద్దరు కలిసివెళ్లి గిఫ్ట్ కొనాలని కూడా అప్పటికప్పుడు నిర్ణయించేసుకున్నారు.

***

ఆ రోజు రానే వచ్చింది. ఆదివారం సాయంత్రం రెయిన్ బో ఫంక్షన్ హాల్ వద్ద ఆటో దిగాడు తేజస్ అమ్మానాన్నలతో కలిసి. చాలా పెద్ద ఫంక్షన్ హాల్! చూడగానే కళ్ళు మిరుమిట్లు గొలిపేలా రంగురంగుల విద్యుత్ బల్బులతో వెలిగిపోతోంది. లోపలికి వెళ్లే దారిలో పూలతో రకరకాలుగా డెకరేషన్స్!! చాలా అబ్బురంగా అనిపించింది తేజస్‌కి. లోపలికి వెళ్ళాక, అక్కడ అందంగా అలంకరించబడ్డ పెద్ద వేదిక! అప్పటికే చాలామంది తన ఫ్రెండ్స్ వచ్చి కూర్చుని ఉన్నారు. కొందరేమో వంశీ వద్ద నిలబడి మాట్లాడుతున్నారు. తేజస్ తను కూడా అమ్మానాన్నలతో వెళ్లి విషెస్ చెప్పాడు. వంశీ స్పెషల్ సూట్‌లో అందరితో సంతోషంగా మాట్లాడుతూ కనిపించాడు. మరో గంట తర్వాత కేక్ కట్ చేసి, హ్యాపీ బర్త్ డే పాట పాడి అందరూ శుభాకాంక్షలు చెప్పి తెచ్చిన బహుమతులు వంశీకి అందజేశారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనాలకు కదిలారు.

అక్కడ.. రకరకాల డిషెస్! ఒకదాన్ని మించి మరొకటి! తర్వాత ఐస్ క్రీమ్, అరటి పండు! అబ్బో! ఒకటే హడావిడి! తిన్నవాళ్లకు తిన్నంత.. అన్నట్లు ఉంది ఆ వాతావరణం.. భోజనాలయ్యాక పిల్లలందరికీ గిఫ్ట్ బాక్స్‌లు అందించారు. ఆ తర్వాత తేజస్ అమ్మానాన్నలతో ఇంటికి బయలుదేరుతుండగా అక్కడ తిని పడేసిన ప్లేట్లు అన్నీ అప్రయత్నంగా వాడి కంటబడ్డాయి. సగం భోజనపదార్థాలు అక్కడే దర్శనమిచ్చాయి. అదోలా అనిపించింది తేజస్‌కు.

మరో అరగంటలో ఇల్లు చేరారు. రాత్రి పడుకున్నాడన్నమాటేగానీ నిద్ర అసలు పట్టడం లేదు తేజస్‌కి. కళ్ళు మూసినా, తెరిచినా.. వంశీ బర్త్డే సెలబ్రేషన్, ఆ వైభోగమే బుర్రలో కదలాడసాగింది. ఎంత బాగుంటుందో కదా.. అలా బర్త్ డే జరుపుకుంటే! తన బర్త్ డేకు క్లాసులో చాక్లెట్స్ ఇస్తాడంతే. కొత్త బట్టలే అయినా.. అవి మామూలువే వేసుకుంటాడు. ‘ఈసారి నేను కూడా అలా ఫంక్షన్ హాల్లో అందరినీ పిలిచి గ్రాండ్ గా చేసుకుంటే ఎంత బాగుంటుంది! కానీ, అమ్మో! డాడీ ఒప్పుకుంటాడా! ఎంత ఖర్చు!’ భయమేసింది వాడికి. అయినా కోరిక ఆ భయాన్ని అధిగమించింది. అమ్మకు చెప్తా, డాడీకి నచ్చజెప్తుంది, అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ.. ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లారుజామున నిద్రలోకి జారుకున్నాడు.

***

“నిజమే కదండీ, పాపం ఈసారి మన తేజస్ పుట్టినరోజు కూడా గ్రాండ్‌గా చేద్దాం. ఎప్పుడూ మన ముగ్గురమే బయటికి వెళ్లి ఏదో రెస్టారెంటులో నచ్చినవి తిని వస్తున్నాము. ఈసారి కాస్త ఖర్చు అయినా పర్వాలేదు, అందరినీ పిలిచి చేద్దామండి. క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ వస్తూ ఉంటాడు. ఈ ఒక్కసారి వాడి కోరిక తీరుస్తే, వాడూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనకున్నది వీడొక్కడేగా..” మరుసటి రోజు రాత్రి భోంచేస్తూ రోహిణి భర్త రాజేష్‌తో మెల్లిగా తేజస్ కోరిక బయటపెట్టింది.

“ఖర్చు ఎంత అవుతుందో తెలుసా! మన స్థాయికి అవసరమా! ఆలోచించు. దానికి బదులు ఆ మొత్తం వాడి పేర సేవింగ్స్‌లో వేస్తే రేపు వాడికి దేనికైనా ఉపయోగపడుతుంది.ఆలోచించు మరి..”

తండ్రి మాటలు పక్క గదిలో చదువుకుంటున్న తేజస్ చెవిని పడుతూనే ఉన్నాయి

“..వంశీ వాళ్ళ నాన్నది  పెద్ద ఉద్యోగం. రెండు చేతులా సంపాదన కూడా. భార్య కూడా ఎంప్లాయీనే. ఎంతైనా ఖర్చుపెడతారు. మన వల్ల అవుతుందా! అసలు అవసరమా! ఆలోచించు..” కొనసాగిస్తూ అన్నాడు రాజేష్.

“అది కాదండీ..”

“చూడు రోహిణీ, చిన్నవయసు వాడిది.. ఇలా ఎవరినైనా చూసినప్పుడు అలాంటి కోరిక పుట్టడం సహజమే. వాడు నొచ్చుకోకుండా ఉండాలంటే సరే.. ఉన్నంతలో చేసేద్దాము. కానీ పుట్టినరోజులన్నవి ప్రతీ సంవత్సరం వచ్చేవి. ప్రతిసారీ అంత ఖర్చు పెట్టగలమా! అది కూడా ఆలోచించు..” అన్నాడు రాజేష్ అనునయంగా.

వింటున్న తేజస్ లో ఓవైపు కాస్త నిరాశ ఆవరించినా.. మరోవైపు మరేవో ఆలోచనలు మొదలయ్యాయి.

“..దాని బదులు ఆ రోజు ఏ అనాథ పిల్లల ఆశ్రమానికో వెళ్లి వాళ్లకు ఓ పూట మంచి భోజనం పెట్టించడమో లేదా వాళ్లకు అవసరమైన బుక్స్ కొనివ్వడమో చేస్తే బాగుంటుందేమో చూడు..” భోజనం ముగించి లేచాడు రాజేష్.

***

మరుసటి  రోజు ఉదయం స్కూలుకు రెడీ అయ్యి గది నుంచి బయటకు వచ్చాడు  తేజస్. గౌరి ఇల్లు తుడుస్తూ ఉంది. వాళ్ళ అమ్మకు జ్వరం ఇంకా తగ్గలేదట. రోజూ తనే వచ్చి పనిచేసి పోతోంది. ఎప్పటిలా కాకుండా ఈసారి ఆ అమ్మాయి పరిస్థితిని మరో కోణంలోంచి చూశాడు తేజస్. ఆ పిల్ల ఇంటి స్థితిగతులు వాడి మదిలో మెదిలాయి. గౌరీకి మూడో క్లాసు చదువుతున్న తమ్ముడు కూడా ఉన్నాడనీ, తండ్రి కూలి పనులు చేస్తాడనీ తేజస్ కు చూచాయగా తెలుసు. సడన్‌గా వాడిలో ఏదో ఫ్లాష్ వెలిగింది.

***

తేజస్ పుట్టినరోజు మరో పదిరోజుల్లోకి వచ్చేసింది. రోహిణి మళ్ళీ ఒకటి రెండు సార్లు చెప్పడంతో రాజేష్ కూడా రాజీపడి,ఒక్కసారి గ్రాండ్‌గా వాడి బర్త్ డే పార్టీ జరిపిస్తే వాడి ముచ్చట కూడా తీరుతుంది కదా.. వాడి లైఫ్‌లో అదో మధురస్మృతిగా నిలిచిపోతుంది.. అని తన అభిప్రాయం మార్చుకుని ఆ ఏర్పాట్లు చేసే ఆలోచనలో పడ్డాడు.

ఆ రోజు ఆదివారం. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక, తేజస్‌ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని బర్త్ డేకి స్పెషల్ గా ఎలాంటి డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాడో, ఇంకా ఫ్రెండ్స్‌కు ఏ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాడో చెప్పమని అడిగాడు రాజేష్. రోహిణి కూడా వచ్చి పక్కనే కూర్చుంది.

“డాడీ, సారీ డాడీ. నాకు అలాంటివేవీ వద్దు. ఎప్పటిలాగే మామూలు డ్రెస్ చాలు. అలాగే మా క్లాసులో చాక్లెట్స్ ఇస్తా ప్రతీసారి ఇచ్చినట్టు..” తేజస్ మాటలకు రోహిణి, రాజేష్ మొహమోహాలు చూసుకున్నారు.

“అయ్యో! అదేంటి తేజూ, వంశీలాగా ఈసారి నీ బర్త్ డే కూడా గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నాం నాన్నా. ఎందుకలా వద్దంటున్నావు! ఖర్చవుతుందనా? మరేం పర్వాలేదు. ఈ అచ్చట్లు ముచ్చట్లు ఈ వయసులోనే జరగాలి. పెద్దయ్యాక ఎలాగూ కుదరవు..” చేయివేసి దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు రాజేష్.

“అయ్యో నాన్నా, అలా ఏం లేదు. కాకపోతే ఒకటనుకుంటున్నాను. వంశీ బర్త్ డే రోజు కాసేపు అలా అనిపించింది గానీ, ఆ ఆర్భాటం, అనవసరపు ఆ ఖర్చు.. ఇంకా సగం దాకా వృథాగా పడేసిన ఆహారపదార్థాలు..! అవన్నీ తలుచుకుంటే ఒక్కరోజు భాగ్యానికి అంతేసి ఖర్చు అవసరమా అనిపించింది డాడీ. అలా కాకుండా మనకు తోచినంతలో సద్వినియోగం అయ్యేలా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన కూడా వచ్చింది..”

కొడుకు వైపు విస్మయంగా చూశారిద్దరూ. అంతలోనే పని పూర్తి చేసుకుని వచ్చిన శివమ్మకు మిగిలిన చపాతీలు, కూర గిన్నెలో పెట్టి ఇచ్చింది రోహిణి. ఆమె వెళ్ళగానే,

“అమ్మా, మన పనామె శివమ్మ కూతురు గౌరికి పాపం సరైన బట్టలు లేవు. గౌరీ తమ్ముడు కూడా బడికి పోతున్నాడట కదా. వాడి పరిస్థితీ అలాగే ఉండి ఉంటుంది. గౌరి చిన్నపిల్ల అయినా ఇంట్లో పనులు కూడా కష్టపడి చేస్తూ ఉంటుంది. ఆ ఇద్దరికీ ఏదైనా చేయాలనిపిస్తోందమ్మా. రెండు జతల బట్టలు, అవసరమైన పుస్తకాలు.. అలాగన్నమాట..”

ఇంత చిన్న వయసులో కొడుకులో అంత గొప్ప ఆలోచన రావడం విన్న ఆ ఇద్దరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు క్షణంసేపు. వెంటనే ఎంతో సంతోషం అనిపించింది వాళ్ళకి. శివమ్మ ఎంతో కాలంగా ఇంట్లో పని చేస్తూ ఉంది. గౌరీ కూడా తల్లికి తోడుగా వస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళూ తమకు రాని ఆలోచన చిన్నవాడైనా తేజస్‌కు వచ్చింది. సంతోషం నుండి తేరుకొని వాడిని దగ్గరకు తీసుకుంటూ,

“అలాగే నాన్నా, తప్పకుండా. అలాగే మనకు దగ్గరలోనే ఓ అనాథ శరణాలయం ఉంది. అక్కడ పిల్లలందరికీ ఓ పూట భోజనాలు ఏర్పాటు చేద్దాం. వాళ్లకు బుక్స్, పెన్నులు లాంటివి కూడా ఇద్దాం. సరేనా..”

“థాంక్యూ డాడీ. అలాగైతే వృధా అన్నది ఉండదు. మన వల్ల కొందరికి సాయం అందుతుంది.పైగా పెద్దగా ఖర్చు ఉండదు కాబట్టి ప్రతీ పుట్టినరోజుకి ఇలాగే ప్లాన్ చేయొచ్చు..”

నవ్వుతూ ఇద్దరి మధ్యా చేరిపోయి వారిని హత్తుకున్నాడు తేజస్.

“అవును కరెక్ట్.. అలా చేస్తే, మనకు సంతోషం కంటే మనసుకు సంతృప్తిగా ఉంటుంది.. మన వల్ల కొందరికి సంతోషం కలుగుతుంది కాబట్టి..” అన్నారిద్దరూ తేజస్ ను మెచ్చుకుంటూ.

అప్పుడనిపించింది వాడికి, ‘అది కదా అసలైన బర్త్ డే సెలబ్రేషన్! అదే కదా నాకు అమ్మానాన్నలిచ్చే ఎంచక్కటి పుట్టినరోజు బహుమతి..’ అని..!!

కొద్దిరోజులుగా ఆందోళనతో నిండిఉన్న వాడి మనసు ఒక్కసారిగా  నిర్మలంగా అయిపోయింది.

Exit mobile version