Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పువ్వుల సింగారం

[శ్రీ కర్లపాలెం హనుమంతరావు రచించిన ‘పువ్వుల సింగారం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

వాన ఒక్క పావుగంట జల్లుగా కురిసి అప్పుడే వెలిసింది. పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లమీద నిలిచి ఉన్న వాన చినుకులు నేలకు రాలుతూంటే వాన లేకున్నా కురిసినట్టే అనిపిస్తోంది. ఫాఠశాల గంట గణగణ మ్రోగింది. కొత్త పిరియడ్లు మొదలవటంతో బడి ప్రాంగణం నిశ్శబ్దంగా అయిపోయింది. నాకూ నా సహోపాధ్యాయుడు లక్షింపతికీ మధ్యాహ్నం రెండు పిరియడ్లూ పనిలేదు. ఇద్దరికీ పరిసరాల సింగారం చూసి ఆనందించాలని కుతూహలం కలిగింది. పాఠశాలకు వెనక వేపు నుంచి రాజావారి తోట గుడికి దారి ఉంది. ఆ దారిన నడుస్తూ నడుస్తూ ఆ తోటలోని ఆంజనేయస్వామి గుడికి చేరుకొన్నాం. భక్తులతో సందడిగా ఉంది గుడి.

గుడ్డి మనిషి ఒకామె గుడి మెట్లకు వారగా ఒక గుడ్డ పరుచుకొని కూర్చొనున్నది. గుడ్డమీద నాలుగైదు నాణేలున్నాయి.

“కళ్ళులేని కబోదిని. ధర్మం చెయ్యండి తల్లులూ! మాపిటికి తిండిలేదు. ఒక రూపాయి బిళ్ళ దానం చెయ్యండి తండ్రులూ!” అంటూ అడుగుకుంటోంది ఆ ఆడమనిషి.

“చూశారా మాష్టారూ! ప్రకృతి అంతా కన్నుల పండువుగా ఉంటే, ఈ గుడ్డిది మాత్రం కడుపు కోసం పాపం ఎంతలా కష్టపడుతూందో! కళ్ళే ఉంటే ఈ అందం చూసన్నా ఆకలి దప్పులు మరిచుండేది కదా.. పాపం” అన్నాడు జాలిగా లక్ష్మీంపతి.

ఇంతట్లో, ఒక చిన్న పిల్ల, అయిదారేళ్లది, బుట్టబొమ్మలా ముచ్చటగా ఉన్నది, తోటలో నుంచి నడుచుకుంటూ వచ్చి గుడ్డి మనిషి ఎదురుగా నిలబడిపోయింది. గుడ్డి మనిషి ఎట్లా పసిగట్టిందో ఆ పసిదాని వంక చూస్తూ “కళ్లు లేని కబోదిని తల్లీ! ఒక్క రూపాయి బిళ్ళ ధర్మం చెయ్యి తల్లీ.. చచ్చి నీ కడుపున పుడతా” అని తన రాగం అందుకొంది.

తనా పరా అనే భేదం ఇంకా ఎరగని ఈ పసిపాప గుడ్డిదాని వంక పరీక్షగా చూస్తూ జాలిపడింది. ఆశకొద్దీ తన దోసిలి పట్టిన కబోది దీనస్థితికి ఈ చిన్న బిడ్డ మనసు కరిగిపోయింది.

“అవ్వా! ఇప్పటి కిప్పుడు నాదగ్గర ఏమీ లేదు. ఆంజనేయ స్వామి కోసం రూపాయి పెట్టి ఈ పువ్వు కొనేసాను. ఇదిగో, తీసుకో” అంటూ తన చేతులోని గులాబీని బిచ్చగత్తె దోసిట్లో వేసింది పాప.

చేతిలో పడ్డ వస్తువును తడివి చూచుకొంది ఆ కళ్ళులేని కబోది. వాసనను బట్టి పూవు అని పోల్చు కోగానే ఆమె మొగం విప్పారింది. ఆ గులాబీ పూవును తటాలున తన చింపిరి తలలో తురుముకొంటూ, “మాయమ్మా మాతల్లి, నీ ఇల్లు వేయిళ్లు గావాల! నీ కడుపు కండపెరుడు గావాల! నీ పసుపు కుంకం చల్లగుండాలి” అనిదీవించింది ఆ పసిదాన్ని.

గుడ్డి మనిషి తలలోని పువ్వూ ఆ అమ్మిలా నవ్వడం చూని బుట్టబొమ్మ కూడా పకపకా నవ్వేసింది.

“గుడ్డిదానికి పువ్వుల సింగారం కూడాను” అన్నాడు మా లక్షింపతి వెటకారంగా.

ప్రకృతిమాతకు తన సంతానాన్ని సంతోషపెట్టడానికి సవాలక్ష మార్గాలున్నవి; అందులో ఇదొకటి. పుట్టుగుడ్డికీ పూర్వజన్మల వాసన ఉంటుందని ఈ లక్ష్మింపతికేమి తెలుసు?

Exit mobile version