Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాకూడదా ఒకసారి?!

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘రాకూడదా ఒకసారి?!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

~ ~
నువ్వేమన్నా అనుకో!
నీకూ నాకు మధ్య రోజూ
ఒక రాత్రి ఉండేది!
ఆ రాత్రిలో, వెన్నెలో, అమావాస్యో ఉండేది.
ఏకాంతంలో మనలా ఏడ్చే చందమామ ఉండేవాడు.
బాల్కనీలో విరబూయాలనుకునే
మల్లెల్లో, లిల్లీమొగ్గలో ఉండేవి!
మన మధ్య పైకి చెప్పుకోలేని ప్రేమ ఉండేది!
~ ~
పగళ్లు ఏమై పోయేవాళ్ళమో తెలీదు!
కానీ కొన్ని హఠాత్తుగా ఎదురైన రాత్రిళ్ళు ఉండేవి!
అవి విరహంతోనో., వియోగ దుఖంతోనో వణుకుతూ ఉండేవి!
ఒకరినొకరం అందుకోలేని విషాదం ఉండేది!
నిద్రపోని ఆ రాత్రుళ్ళల్లో రఫీ పాటలో,
ఫరీదా బేగం,మెహదీ హసన్, గజలో ఉండేవి.
చితికిన కలల శబ్దం కాళ్ళ కింది
ఎండుటాకులలా వినిపిస్తూ ఉండేది!
~ ~
కన్నీరు కారుతున్నట్లుగా
కళ్ళకి కూడా తెలిసేది కాదు!
నీకు నిద్ర పట్టనివ్వని రాత్రుళ్ళు
నాకూ తెలిసేవి!
పిలుచుకోక పోయినా పిలుపులు ఉండేవి!
రమ్మనకపోయినా ఎదురుచూపు ఉండేది!
ఒకరినొకరం పోగొట్టుకోకపోయినా
వెదుకులాట ఉండేది.
~ ~
నువ్వేమన్నా చెప్పు!
కుదుర్చుకోకపోయినా, నీకు నాకూ మధ్య
ఒక రహస్య ఒప్పందం ఉండేది!
రాత్రి కలని మోసిన
ఒక ఉదయపు మెలకువ ఉండేది!
ఆహ్వానించడానికి బయలుదేరినట్లే
సాయంత్రపు సుదీర్ఘ నడక ఉండేది!
రాత్రి నిద్రను వెలివేసినతనం ఉండేది!
నువ్వేమన్నా చెప్పు!
నీకూ నాకూ మధ్య ఆకాశమే
సరిపోనంత నక్షత్రాలన్ని
మౌనపు మాటలు ఉండేవి!
పాడకపోయినా వినిపించే పాటలు ఉండేవి!
మౌనం కూడా నిన్నే గుసగుసలాడేది!
~ ~
ఒక దర్బారీ కానడ రాగం
మనిద్దరి మధ్యని దూరాలలోకి
హఠాత్తుగా వెన్నలరేడు
పంపినట్లే వచ్చి ఊయలలోగేది!
రాత్రుళ్లు రహస్యంగా పారిజాత పూలని
పూయించి ఉదయానికల్లా,
కొమ్మని వీడలేని వియోగ దుఃఖంతో
మొరాయిస్తున్న పూలని భూమి మీదికి రాల్చేసి
హడావుడిగా వెళ్ళిపోయేది!
చేతుల్లో మధు పాత్ర లేకపోయినా
మనలో జ్ఞాపకాల మైకం ఉండేది.
చూడూ.. మన మధ్య
ఎంతకీ దొరకని యుగమంత ప్రేమ ఉండేది..
అవును కదా! మనిద్దరి మధ్య వసంతమూ,
రాగాలు పాడే కోయిలా ఉండేవి.
దహించేసే వేసవి తాపం,
మెల్లిగా చీకటి పడుతున్న
చలికాలపు మార్మిక మోహం,
నేరుగా తడిపేసే వర్షాకాలపు
ప్రణయపు వాన చినుకులు ఉండేవి!
~ ~
కాలాల్ని కలిపే మోహ రాగాలేవో
చెరొకవైపూ అల్లుకుంటూ
చేరువైన వాళ్ళం కదా మనిద్దరం?
శృతి కలిశాక కాలం కర్కశంగా విరగ్గొట్టిన
తెగిన వీణా తంత్రులం కదా మనిద్దరం?
~ ~
మనవైన కాలాలే లేవని,
ఇక రావని తెలిసిన కన్నీళ్లను
రహస్యంగా మోసిన రాత్రుళ్లం మనం!
ఖచ్చితంగా ఎప్పుడో కలవాల్సిన వాళ్ళం!
కలవకుండానే ప్రతీ క్షణం విడిపోతున్న వాళ్ళం!
ఒకరినుంచి ఒకరం బహుశా
ఏ బాల్యంలోనో తప్పిపోయిన వాళ్ళం!
మళ్లీ కలపలేని కాలం ఎదురుగా
నిర్ఘాంతపోయి అలిగి నిలబడ్డ వాళ్ళం!
~ ~
కాలానికి అర్థం కాకేం కానీ,
భవిష్యత్తే లేని సంగమం మనది!
వెతికి వెతికి ఎన్ని రాగాలు పాడుకున్నా,
పంచుకున్నా
చూడు కలిసి పాడలేని
మూగ గొంతులం కదా మనిద్దరం!
మౌనం ఒక్కటే మన అంతిమ రాగం!
బహుశా మృత్యు రాగం!
~ ~
నా ప్రియురాలా!
ఈ జీవితానికి నీ హృదయ స్పర్శ తాకింది చూడు!
ఎలా పాటలై, పూలై పులకించిపోతున్నదో?
రహదారి మొదల్లోనో, మలుపులోనో
పోనీ దారి మధ్యలోనో ఎక్కడైనా
క్షణం ఆగి ఒక్కసారి కనిపించకూడ దా?
కనుల దాహం తీరే చూపులు చూసుకొనో,
కడసారి హృదయ గతులు
వినిపించే ఒక గాఢమైన ఆలింగనమో,
కలుసుకోలేని చేతుల వెచ్చని కరస్పర్సో,
పోనీ మరు జన్మ కోసం స్మృతి చిహ్నంగా
ఒక తీయని తొలి ముద్దో,
కానుకలిచ్చుకొని వీడ్కోలు దుఃఖాలతో
మొఖాలు కడుక్కొని విడిపోదాం!
~ ~
చూడు! నువ్వు రావాలనుకున్నప్పుడో,
పలకరించాలనుకుని బయలుదేరినపుడో,
దారిలో నా అంతిమ యాత్ర ఎదురైతే,
మృత్యు రాగమే కదా
నీదైనా, నాదైనా చెప్పు?
రాకూడదా ఒక్కసారి?

Exit mobile version