[సముద్రాల హరికృష్ణ గారు రచించిన ‘రాయని భాస్కరుడు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
రాయని భాస్కరుడికి లోటేముంది?
రాసిన కవిచంద్రుడి కన్ని మచ్చలైతే!
చదివేవారికి వ్రాసేవాడు లోకువ
విమర్శించే వాడికి గొప్ప చేకువ
నిత్య కళ్యాణపు వరుడి పక్షం,
బెట్టు చూపటం వాడి సహజ లక్షణం
అది బాగు లేదు ఇది బాగు లేదని
సన్నాయి నొక్కులు, అపశ్రుతులున్నా
సున్నాల పూతలు, మెత్తినట్లున్నా!
పద్యమయితే, భంగం కానిది లేదని
పాటైతే – తూగూ, తాళం కరువని!
వచనమయితే, అర్థం అయినది లేదని
వేదాంతం రాస్తే, ‘గీత’తో పొసగట్లేదని
రాజుల చరిత్ర రాస్తే, తప్పుల తడికని
కథ రాస్తే, పాత్రలు తేలిపోయాయని
నవనవల నవలైతే నావెల్టీ లేదని
నాటకం రాసి, సంభాషణలు గుప్పిస్తే
విషాదపు మోతాదెక్కువైందని
ఏదీ చిక్కక ఏ చేపా దక్కక పోతే,
మనోభావం మహ దెబ్బతీసిందని —
అన్నిటికీ అన్నీ వల్లించే ధారాళం
సున్నలు చుట్టే కళలో పారంగం!
అందరి రాతలు ఈ తీరే కద అంటే
తూకం నీ పని కాదని దబాయింపులు
పాకం కుదరని వంటలని బుకాయింపులు!
***
ఇన్ని చదివింపుల ఫలితం అమోఘం
ఖిన్నుడై, రాతగాడి మనశ్శాంతి భంగం
భరించి భరించి పాపం అర్భకపు బుడి
వినీ వినీ, నిరంకుశ వ్యాఖ్యానాల జడి
అలసి సొలసి, పెరిగి మదిలో అలజడి
అసలు రాయనే రాయనని చిన్నవోయీ —
ఖాళీ కాయితం కన్నా శుభ్రం లేదంటాడు
మూసిన కలం కన్నా భద్రం లేదంటాడు
దుప్పటీ తన్ని నిదరోతాడు, కల కంటాడు
చకచకా రాస్తున్నట్టు అందరు మెచ్చినట్టు!
కలలు ఉచితమేగా, తీర్చుకోనిస్తారా?!
ఆ కలల రాతలనూ చొరబడి చదివేసి
స్పప్న భంగాలూ, నిద్ర భంగాలూ చేసేస్తే,
మహా పాపం, మీ భవితవ్యం మీ ఇష్టం!
కోపంతో హుమ్మని శాపం పెడితే,
మీరూ పెను రాతగాళ్ళైపోవాలని!
మీసం తిప్పే చప్పరింతరాయళ్ళూ,
తస్మాజ్జాగ్రత! ఇక తస్మాజ్జాగ్రత!
***
అయినా —
“కవిత్వ మొక తీరని దాహం”, అనలేదూ?!
“రచనా వ్యాసంగమొక సద్వ్యసనం”, కనలేదూ?!
“ఎదలో జరిగే వాగర్థ మహద్వ్యవసాయం”, వినలేదూ
సందేహమే లేదు, మెలకువ రాగానే మొదలెడ్తాడు,
భావ వనంలో విహరణ, గారపు పలుకుల లాలన
గలగలమని రచనలతో మాట కలిపే ఖేలన!?
వాడొక అన్వేషి – రసలోకపు ఆనందాభిలాషి
వాడొక మనిషి -వాస్తవ విశ్వ నిత్య సంవాసి
పూలను ముళ్ళను ఒకటిగ చూసే అక్షర తాపసి!
అందరి కుశలం కోరే మనస్సౌందర్య సు విశేషి!!