[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘రాయని భాస్కరుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో న్యాయనిర్ణేతల ప్రశంసలు పొందిన కథ.]
భాస్కర రావు రిటైరవుతున్నాడు. కొన్నేళ్ల క్రిందనే అవాల్సింది. కాని ప్రభుత్వాలు పదవీవిరమణ వయస్సును 58 నుంచి 60, 61, 62 ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల మరో నాలుగేళ్లు ఎక్కువ చేయాల్సివచ్చింది. పదవీ విరమణకు ముందు, మళ్లీ 65 చేస్తారేమో అని భయపడేవాడు భాస్కరావు. రిటైర్మెంటు బెనిఫిట్స్ ఇవ్వడానికి ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవనీ, అందుకే ఇలా పెంచుతున్నారనీ భార్యకు చెప్పేవాడు. ఆమె ఉత్తమ యిల్లాలే!
రేపే భాస్కరరావు రిటైర్మెంటు. ఎండోమెంట్స్ శాఖలో సూపరింటెండెంట్ అతను. సర్వీసులో ఉండగానే యిల్లు కట్టుకున్నాడు. ఒక్కతే కూతురు. ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అల్లుడు శ్యామలరావు మంచివాడే. “అల్లుని మంచితనంబును, గొల్లని సాహిత్యవిద్య, కోమలినిజమున్” ఉన్న పద్యంలో మొదటి పాయింటు అతనికి వర్తించదు. కాని సుమతీ శతకకారుడు గనుక ఇప్పుడు ఉండి ఉంటే, రెండో పాయింటులోని వారు తమ మనోభావాలు దెబ్బతీశాడంటూ, ఆయన మీద కేసు వేసేవారేమో! ‘తెల్లని కాకులును లేవు’ అనీ పాయింట్ వివాదం లేదు.
పదవీ విరమణ రోజు భాస్కరరావుకు ఆఫీసులో సన్మానం జరిగింది. కూతురు, అల్లుడు, వియ్యంకులు కూడా విచ్చేశారు. వక్తలందరూ అతని ‘శేష జీవితం’, ‘శేష జీవితాన్ని’ అంటూ రెఫర్ చేయడం అతనికి చిరాకు తెప్పించింది. ఆ పదంలో ‘ఇక జీవితం కొద్దిగానే మిగిలుంది’ అనే అర్థం అతనికి తోచినందునే ఆ చిరాకు.
ఒక సహోద్యోగి, ఇలా అడిగాడు – “ఇక అంతా విశ్రాంతే కదా బ్రదర్? టైం ఎలా గడపాలనుకున్నావు? ఏదైనా మ్యూజికల్ ఇన్‍స్ట్రుమెంట్ నేర్చుకోకూడదూ?”
శ్యామలరావుకు చిర్రెత్తుకొచ్చింది.
“నాకంత సీన్ లేదులే!”
“మరి, ఏం చేస్తావు?”
చెబితే గాని వదిలేలా లేడనిపించింది. కొందరు రిటైరీలు సంగీతం నేర్చుకోవడం, ఆన్‌లైన్‌లో సంస్కృతం నేర్చుకోవడం, లేదా పెన్షనర్ల అసోసియేషన్‌లో చేరి వారి సమస్యల కోసం పోరాడటం చేస్తుంటారు.
చివరి రకం వారు ఉద్ధరించేదేమీ లేకపోయినా, ఎప్పుడూ ‘నాయకత్వం’ లోనే ఉండాలని వారికి ఉబలాటం. అతనికి ఏదో సినిమాలో ఒకర్ని “ఏం చేస్తుంటావు?” అని అడిగితే “బుక్ రాస్తున్నా” అనీ, “దాని పేరేమిటి?” అనడిగితే, “నా సావు నేను సస్త నీ కెందుకు?” అనీ చెప్పడం గుర్తొచ్చింది. ఆ జవాబు పుస్తకం పేరో, లేక అడిగిన వాడికిచ్చిన పంచో తెలియదు!
“రచనలు చేయాలనుకుంటున్నా బ్రదర్” అన్నాడు భాస్కర రావు.
***
నాలుగు రోజులుండి కూతురు అల్లుడు వెళ్లిపోయారు. మనుమడు రెండున్నరేళ్లువాడు. వాటితో ఆడుకోవడం వల్ల సమయం తెలియలేదు. ఉత్తమ ఇల్లాలు పాపం ఎప్పుడూ అవిశ్రాంత ఉద్యోగే! గృహిణులకు రిటైర్మెంట్ ఉండదు! భాస్కర రావుకు పుస్తకాలు, మ్యాగజైన్లు చదివే అలవాటుంది. కొలీగ్‌తో యథాలాపంగా చెప్పినా, ‘తాను కూడా రచనలు ఎందుకు చేయకూడదు?’ అనిపించింది. వంటింట్లోకి వెళ్లి ‘ఆమె’తో ఇలా ప్రకటించాడు –
“ఏమోయ్, నేనిక మీదట రచనలు చేయాలనుకుంటున్నా!”
ఉ. ఇ. నవ్వింది. “మంచిదే కదండి!” అన్నది. ఎవరికి మంచిదో మరి!
కోవిడ్ మూలంగా చాలా పత్రికలు మూతపడ్డాయి. విచారించగా, స్వాతి, జాగృతి పత్రికలే వస్తూన్నాయని తెలిసింది భాస్కర రావుకు. రైతు బజారు నుంచి వస్తూ స్వాతి వారపత్రిక కొనుక్కొని వచ్చాడు. అందులో ‘సరస కథల పోటీ’ ప్రకటన ఉంది. నియమనిబంధనలు చదివాడు.
కథ చేతివ్రాతలో ఆరు పేజీలు మించకూడదనీ, పేజీకి ఇన్ని లైన్లుండాలనీ, లైనుకు ఇన్ని అక్షరాలుండాలనీ చెప్పారు. ‘అసలు సరసమంటే ఏమిటి?’ అని అలోచించాడు భాస్కర రావు. సరసమంటే శృంగారం కదా అనుకున్నాడు.
‘తమ పెళ్లైన కొత్తలోని మధురానుభూతులను కథగా మారిస్తే పనైపోతుంది కదా’ అనుకున్నాడు. పేర్లు మార్చి కథ చిత్తుప్రతి తయారు చేశాడు. చచ్చీ బతికి నాలుగు పేజీలొచ్చింది. దాన్ని ఫెయిర్ చేసి భార్యకిచ్చాడు చదవమని.
ఉ. ఇ. కథ చదువుతూ సిగ్గుల మొగ్గయింది. “ఇదేమిటీ, మన విషయాలన్నీ వ్రాసారూ. అందరూ ఏమనుకుంటారూ?” అన్నది. ఆమె దీర్ఘాల స్పెషలిస్టు.
“నీ మొహం! పేర్లు మార్చేశా కదా!” అన్నాడు. మిడిల్ క్లాస్ కొత్త దంపతుల సరససల్లాపాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయని అతనికి తెలియదు. కాకి భార్య కాకికి ముద్దు! అలా ఒక యూనివర్సల్ ఎలిమెంట్‌ను భాస్కర రావు తన కథలో స్పృశించాడు. ఒక కాపీ జిరాక్స్ తీయించి పెట్టుకొని, కథ కవర్‍లో పెట్టాడు. హామీపత్రాన్ని వీలునామా అంత శ్రద్ధగా రాసి జతచేశాడు. కథ పోస్టు చేశాడు.
ఫలితం రావడానికి టైం పడుతుంది ఎలానూ. కొన్ని సాహిత్య వాట్సాప్ గ్రూపుల్లో చేరాడు. ‘సమాచారం సాహిత్యం’ అన్న గ్రూపు ఉంది. అందులో కథలు, కవితలు, నవలల పోటీల వివరాలు ఇస్తారు.
కొన్ని పత్రికలు ఆన్‌లైన్ లోనే వస్తాయని తెలిసింది. వాటిని ‘ఇ-మ్యాగజైన్స్’ అంటారట. మరి ప్రింట్ అయ్యేవాటిని ‘ఆ-మ్యాగజైన్స్’ అనాలేమో! అని నవ్వుకున్నాడు. జయహో అనీ ఒక మాసపత్రిక ప్రకటన చూశాడు భాస్కర రావు. “చేతిరాతలో నాలుగు పేజీలు, డి.టి.పి.లో 3 పేజీలు మించకూడదు. యూనికోడ్, వర్డ్ ఫార్మాట్‌లో ఈ క్రింది మెయిల్ ఐడికి పంపాలి. పి.డి.ఎఫ్.లు అంగీకరింపబడవు”.
ఈ భాష అర్థం కాలేదు మనవాడికి. కానీ మెయిన్ రోడ్‌లో ‘ఇక్కడ తెలుగు ఇంగ్లీషు డి.టి.పి చేయబడును’ అన్న బోర్డు చూసినట్లు గుర్తొచ్చింది.
కధ ఇతివృత్తం సామాజికాంశం ఏదైనా సరే అన్నారు. ముఖ్యమంత్రి నెల నెలా పెన్షన్ సరిగ్గా ఇవ్వకపోవడం అన్న పాయింటు మీద కథ లాగాడు. మూడు పేజీలయింది. ఫెయిర్ చేసి డిటిపివాడి దగ్గరకు తీసుకువెళ్లాడు.
“బాబూ, దీన్ని డిటిపి చెయ్యాలి? ఎంతవుతుంది?”
“తెలుగు కదా సార్, ఎ ఫోర్ సైజ్ పేపరుకు అరవై రూపాయలు తీసుకుంటాము.”
“టైపులో ఎన్ని పేజీలు వస్తుందేమిటి?”
“ఇంచుమించు అన్ని పేజీలే వస్తుంది సార్!”
అంటే 180 రూపాయలు అవుతుంది. యూనికోడ్, వర్డ్ ఫార్మాట్‌లో చేయాలన్నాడు.
“మీకు మెయిల్ ఐ.డి ఉందా?”
“లేదు అబ్బాయ్” అన్నాడు గిల్టీగా
“నేను మీకు క్రియేట్ చేసిస్తా లెండి. మీ ఫోన్ లోనే అన్నీ వస్తాయి. మీ పేరు, ఇయర్ ఆఫ్ బర్త్?”
“1954” అని చెప్పి, పేరు చెప్పాడు.
bhaskarrao1954@gmail.com అని ఇ.మెయిల్ ఐడి తయారైంది.
“రేపు రండి” అన్నాడు.
మర్నాడు సాయంత్రం వెళ్లాడు. కథను సిస్టమ్‌లో చూపిస్తూ కరెక్షన్ చేయమన్నాడతడు. అలా కన్‌ఫ్యూజ్ అవుతూంటే, “ఉండండి, ప్రింట్ అవుట్ తీసి ఇద్దాము” అన్నాడు.
ప్రింట్స్ చూస్తే ముద్రారాక్షసాలు బోలెడు కనబడ్డాయి. అన్నీ కరెక్ట్ చేయించాడు.
“మొత్తం 260 రూపాయలు ఇవ్వండి. డిటీపీ 180, మెయిల్ ఐడి జనరేషన్ 50, ప్రింట్ అవుట్స్ 30”.
“ఆ చేత్తోనే కథను మెయిల్ చేసి పుణ్యం కట్టుకో నాన్నా” అని అడిగాడు భాస్కర రావు. జయహో వారికి మెయిల్ వెళ్లి పోయింది, హామీ పత్రంతో సహా. కథ పేరు ‘పెన్షన్-టెన్షన్!’.
రెండు రోజుల తర్వాత మరో ప్రకటన వాట్సాప్ గ్రూప్‌లో వచ్చింది. పత్రికలు కాకుండా ఏవో సాహిత్య సంస్థలు ఎవరో ప్రముఖుల స్మారకంగా పోటీలు పెడుతున్నాయి. నిబంధన ఇలా ఉంది.
“M.S. Word లో మాత్రమే పంపాలి. వర్డ్ ఫైల్ లో పంపాలి. Scan చేసిన చేతివ్రాతలు నిషిద్ధం.”
ఇంకో ప్రకటన “ఓపెన్ ఫైల్ పంపాలి. ఫాంట్ 14, గూగుల్ తెలుగు టైప్. పి.డి.ఎఫ్ కూడా పంపాలి.”
ఇంకో ప్రకటన “ప్రియాంక ఫాంట్, 18 సైజ్‌లో ఉండాలి”
ఇంకోటి – “కధతో బాటు వారి యూట్యూబ్ ఛానెల్లో కనీసం 3 వీడియోలను, వారి గురించి అప్‌లోడ్ చేయాలి. వారి పత్రిక లోని ఒక కథ మీద విశ్లేషణను ఏదైనా పత్రికకు పంపి, దానిని ‘అటాచ్’ చేయాలి!”
పిచ్చెక్కిపోయింది భాస్కర రావుకు. ఆఫీసులో కంప్యూటర్లుండేవి. తన క్రింది వారితో చేయించేవాడు. అంత అప్‌డేట్ కాలేదతడు, తన వయసు లోని ఉద్యోగులు చాలామందిలాగే.
డి.టి.పి/నెట్ సెంటర్ అబ్బాయి మంచివాడు. ఓపిగ్గా ఇతని పనులు చేసిపెట్టేవాడు. నెలనెలా రచనల కోసం రెండువేల వరకు ఖర్చు అవుతూంది. స్వాతివారు ‘మీ కథ ప్రచురించ లేకపోతున్నామ’ని మెసేజ్ పంపారు. చాలామంది కథ అందినట్లు గానీ, సెలెక్ట్ అయిందా లేదా అనిగాని తెలపరు.
సంవత్సరం గడిచింది. ఒక బాలల కధను సాధారణ ప్రచురణకు తీసుకొన్నట్లు ఒక ఇ.పత్రిక ఫలితాలలో ప్రకటించింది. అది భాస్కరరావు రాసిందే. తమ మనుమడితో అనుబంధాన్ని ఆ కథలో రాశాడు.
తానెన్ని కథలు పంపినా, వేయడం లేదు! ‘సింహ కిషోర్’ అనే పెద్దాయనకు ఏ కథ రాసినా బహమతి వస్తూండడం గమనించాడు. ఆయన కధలు చదివిం తర్వాత, ఆయన నిజంగా ఆ బహుమతులకు అర్హుడే అని గ్రహించాడు. ‘జాణశ్రీ’ అనే పెద్దాయన ఇప్పటికి వెయ్యికి పైగా కథలు వ్రాసి ‘సహస్రకథాకిరీటి’ అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన కథలు చదివాడు భాస్కర రావు. చివర్లో కథను ఊహించని మలుపు తిప్పుతాడాయన. ‘అభినవ ఓ. హెన్రీ’ అంటారట ఆయనను.
ఇక పాట్ల దేవసాయంరాజు, రామభద్రపాత్రుని భవాని, విధుబాబు, కొత్తూరి జయలక్ష్మి, వలీ మహమ్మద్, సుధాకర్ సైని వీళ్లందరిలా కథలు రాయలేకపోతున్నానే అని మథన పడేవాడు భాస్కర రావు.
పైగా, రాయడం కాకుండా, ఈ టెక్నికల్ అంశాలు ఒకటి. డిటిపి అబ్బాయి, “ఒక ల్యాప్‌ట్యాప్ కొనుక్కోండి సార్. అందులోనే మీరు తెలుగు టైప్ చేసి పంపొచ్చు” అని సలహా ఇచ్చాడు. భాస్కర రావుకు సెల్‌ఫోన్‌లో మెసేజులు కొట్టటమే సరిగా రాదు. ఇంగ్లీషులో తెలుగు పదాన్ని కొడితే అది ఆటోమ్యాటిక్‌గా తెలుగులోకి మారివచ్చే యాప్ ఇన్స్టాల్ చేసి యిచ్చాడు డిటిపి కుర్రాడు. అది కూడా గందరగోళం అనిపించింది. ల్యాప్‌ట్యాప్ నలభై వేలట!
చివరికి భార్య ద్వారా జ్ఞానోదయమైంది. ఉ. ఇ. ఇలా చెప్పింది నవ్వుతూ –
“నన్నడిగితే రాయడం కంటే, చదవడమే హాయంటానండీ. రచనలు చేయడం ఆషామాషీ కాదు కదా, ఎంత సృజనాత్మకత కావాలి? పైగా బోలెడు టెక్నికల్ విషయాలు తెలియాలాయే. నా మాట విని హాయిగా చదువుకుందురూ!”
‘అమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నాడు భాస్కర రావు. తాను మంచి పాఠకుడిగానే మిగిలిపోవడం మంచిది. వంట వండటం కంటే తినడం సులువు కదా!! సినిమా తీయడం కంటే చూడడం ఈజీ! పాట పాడటం కంటే వినడం హ్యాపీ!
అలా రాయని భాస్కరుడైనాడు. కానీ రాయని భాస్కరుడనే మంత్రి ఉండేవాడట. ఆయనను ‘హుళక్కి భాస్కరుడు’ అని కూడ అనేవారట. ఆయన పేరులో ‘రాయని’ అంటే ‘రాసేవాడు కాద’ని అర్థం కాదండోయ్. మన భాస్కర రావుకు సరిపోతుందని పేరడీగా పెట్టానంతే! భాస్కర రామాయణం అని కొంత భాగాన్ని రాసిన వాడాయన. ఆయనతో మనవాడికేం పోలిక లేదు.
“తన కొలది తానె యెఱుగుచు” రాయకుండా మానేయడం భాస్కర రావు గొప్పదనం. ఉ.ఇ. గొప్పదనం కూడా!
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
