[శ్రీ కర్లపాలెం హనుమంతరావు రచించిన – రాధ ‘కృష్ణ’ – అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“కృష్ణా! కృష్ణా!.. గోపాలా! ఇల్లారా. ఎక్కడకీ షికార్లు మళ్లీ? ఆ యేటిగట్టుకేనా? చెట్లు పుట్టలూ ఎక్కితే యెప్పుడే కాలు విరుగుతుందో. ఏ పురుగు అంట పొడుస్తుందో! ముందు ఇల్లారా! తల దువ్వుకోలేదు నిన్నటినుంచీ.”
“తల దువ్వుకున్నానే, అమ్మా, పొద్దున్న”
“అబద్ధాలు. దువ్వేదాన్ని నాకు తెలీదురా?”
“నువ్వేనా? ఇంకెవరూ లేరా?”
“ఎవరున్నారా? నీ మేనమామ పెళ్ళామేనా? ఆ రాధమ్మేనా? బొత్తిగా దేశద్రిమ్మరివయిపోయావు! వాళ్ల పంచలోను వీళ్ల పంచ లోను బతుకుతావా దిక్కులేని పిల్లాడిలాగ! పో.. అక్కడికే పో! తల దువ్వే దాన్ని అన్నం కూడా పెట్టమను.”
“అక్కడే తినేసానే!”
“అదీ అయిందన్న మాట! అయినా పట్టుమని నాలుగురోజులు ఇంట్లో తిన్నావా? ఈ వేళ నీ కోసం వెన్నపూస దాచాను. రా నాదగ్గిర తిందుగాని”
“అమ్మా ఏమిటే అవీ?మిరపకాయలా? ఎందుకు అల్లా తిప్పుతావు నా చుట్టూ?”
“దేశాలన్నీ తిరిగివచ్చావు గిలగిచ్చకాయ లాగ. ఎవరికళ్లు ఎటువంటివో?”
“రాధ కళ్లు బాగుంటాయే, అమ్మా! వాట్ల తోటి నా కళ్లలోకి చూస్తుంది. రాధ చూస్తే అల్లా అవుతుందా?”
“ఏమో, ఎవరి కళ్లో! నువ్వింక యిల్లు కదలకూ!”
“అల్లా అనకే, అమ్మా, రాధ మంచిదే. నిన్న నేను వెళ్లలేదని ఏడ్చిందే. అమ్మ కోప్పడుతుందంటే అడిగి రమ్మందే. వెళతానే అమ్మా! ఇంకెక్కడికీ వెళ్లన్లే , రాధ గారింటికి తప్ప. నిన్న కోపం వచ్చి నేను వెళ్లలేదే. అందుకనీ అన్నం తినలేదుట.”
“కోపం ఎందుకు?”
“చూసి చూసి గబుక్కుని రెండు చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటుందే. అందుకని”
“చిన్న పిల్లాడివి గదా అని ముద్దు! నేను పెట్టుకోనూ! అల్లాగా.”
“నువ్వు పెట్టుకున్నట్టు కాదే. నువ్వు పెట్టుకుంటే చల్లగా ఉంటుందే. రాధ ముద్దు వేడిగా.. ఊపిరిసలపదు! ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఒక పట్టాన వదల్దు.”
“పాపం! ఇంతోటి నల్ల బంగారం అంటించుకుందామనీ.”
“రాధ కూడా నలుపే కదా మరీ?”
“అందుకనే రంగులో రంగు కలిసింది.”
“అమ్మా!”
“..”
“రాధని పెళ్లి చేసుకొంటానే?”
“ఏడిశావు. నీకంటే పెద్దదిరా. నీకు అత్తయ్య అవుతుంది.”
“అవుతే ఏం? నే పెళ్లి చేసుకుంటాను.”
“అదికాదు, రేపెళ్లినప్పుడే, అత్తా! అత్తా! ఓ మంచికూతుర్ని కని నాకిమ్మని అడుగు!”
“ఇద్దర్నీ చేసుకుంటాగా.”
“ఓరి నీ ఆఘాయిత్యం కూలా! ఎవరిదగ్గర నేర్చుకున్నావురా ఈ పనికిమాలిన మాటలూ? పుట్టికొన్నీ, పుట్టక కొన్నీ విపరీతపు బుద్ధులు..”
2
“అత్తా! అత్తా!”
“రాధా! రాధా! ఎంత పిల్చినా పల్కవేం? ఎక్కడ?”
“దొడ్లో; ఇల్లా; పాకలో; అల్లరి చెయ్యకు మెల్లిగా రా.”
“ఏం?”
“ఆవు బెదురుతుంది. మాట్లాడితే ఎద చేపుతుంది”
“నువ్వు మాట్లాడుతున్నావుగా మరి?”
“నా దగ్గరంటే అలవాటు. అదుగో చూడు. అప్పుడే అడుగు లేస్తోంది అమ్మవారు. అల్లా కూచో కొబ్బరి చెట్టుకింద.”
“మా అమ్మ రోటిమీద కూచోవద్దంది.”
“రోళ్లు ఎక్కమ్మందా? దొంగతనాలు చెయ్యడానికి! అబ్బ! అదే వొద్దన్నది. జడ నెప్పి పెడుతోంది, అయ్యో! అయ్యో! పడిపోతాను కన్నయ్యా! పాలొలికిపోతాయి.”
“ఇల్లా ఇయ్యి! నా పొట్టలో వలకపోస్తాను.”
“పూర్తిగా పితకనీ, నీ కోసమే. బుద్ధిగా కూచో ఒక్క నిమిషం.. పోదూ, అంతా మోట సరసం. అయింది లే! నా కేం! ఆవు బంధం తెంపుకుంది ఇంకో గుటకైనా ఇవ్వదు.. ఇదుగో పిల్లంగోరు! ఊదు, నుంచుంటుంది.”
“అమ్మదొంగా, తెలిసిందిలే నీ వేషం. నువ్వు కూడా వినడానికి కాదూ? ఊరికే అడిగితే పాడనని.”
“అయితే నే పాలివ్వను.”
“బలవంతంగా తాగుతా.”
“చూద్దాం”
“అత్తయ్యోయ్! నీకు దణ్ణం, నీకు దణ్ణం, విడిచి పెట్టవూ?.. బాబోయి, బాబోయి, ఊపిరి సలపడంలేదు. అత్తాయ్!”
“అదేవొద్దన్నది. అత్తేంటి.. అత్త! రాధ అనరాదూ. శుభ్రమైన పేరుంటే? అత్తట.. అత్త.”
“రాధీ! రాధోయి! రాధోయి! రాధోయి!”
“తాగు. ఎల్లా తాగుతావో పాలు! ..తప్పించుకుందామనుకున్నావేం? ఇందుకే ఈ ఎత్తు.”
“ఇంక చెయ్యను విడిచి పెట్టవూ!”
“ఏమిస్తావు?”
“చాల్దేంవిటమ్మా? అన్ని మాట్లు పెట్టుకున్నా?”
“ఇంకోమాటు, ఏం? ముచ్చటగా మూడుమాట్లు.”
“ఊ! ఊ! ఒకటీ.. రెండూ..”
“మూడోదిచ్చుకో రాధా దబ్బుని!”
“నా యిష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటాను, అది దాచుకుంటాను. మొన్నటి దొకటి. ఇదొకటి. రెండు ముద్దులు బాకీ. తెలిసిందా కన్నయ్యా!”
“సరే. విడిచిపెట్టు మరి.”
“అప్పుడే అయిపోలేదు. ఇంకాఉంది.”
“అబ్బా! విడిచి పెట్టమంటే, వేడిగా ఎర్రగా కళ్లూ నువ్వూను. బాగున్నావులే.”
“అందుకనే చల్లబడడానికే.”
“ఈ వేళ విడిచిపెట్టవా!”
“వేణువుమీద పాడతావా మరీ?
“నువ్వల్లా పట్టుకుంటే ఎలా పాడతాను?”
“విడిచి పెట్టిన తరువాత పాడకపోతే?”
“నీ యిష్టంవచ్చినన్ని ముద్దులు పెట్టుకో.”
“ఇల్లా కూచునే పాడాలి మరి”
“నీ వొళ్లోనా? నన్ను ముట్టుకోకుండా ఉంటే”
“సరే”
“ఊఁ.. ఊఁ.. వ్వూఁ..”
“మరి నేనల్లాచేస్తే కేకలేస్తావెందుకు?”
“ఊరికేనే. మరినువు చేస్తున్నావుగా నే కేకలేసినా? కేకలేస్తే నీకు కోపమా? ముద్దు బాగుండదూ?”
“అదికాదు. నీకిష్టంలేదేమో అని”
“ఎందుకు రాధా అల్లా కళ్లమ్మటనీళ్లు? కోపం వచ్చిందా ఇందాకా కేకలేశానని?”
“కాదు.”
“మరి ఎందుకు?”
“నువ్వు వెళ్లిపోతావని”
“ఏడవకు రాధా! నేవెళ్లను. ఎప్పుడూ ఇక్కడే ఉంటాను”
“మీ మామయ్య రమ్మన్నాట్టగా మధురలో ఉండటానికి? అక్కడ రాజభవనంలో ఉండి నన్ను మర్చిపోతావేమో అని”
“రోజూ ఇక్కడి కొస్తాను రాధా. ఏరుదాటి చెప్పకుండా వస్తాను. ఏం? ఏడవకింక. పోనీ నువ్వుకూడా రా నేను ఎక్కడి కెడితే అక్కడికి.”
“ఎల్లాగా?”
“పెద్దాణ్ని అయాక నిన్ను పెళ్లి చేసుకుంటాను”
“అందుకనే నువ్వు పెద్దవాడి వయిపోతావని”
“అయితేయేం? నిన్ను పెళ్లి చేసుకుంటాగా? అప్పుడు మనిద్దరం ఉండొచ్చు ఎంచక్కా ఏం?”
“వద్దు. నువ్వు ఇల్లాగే ఉండాలి, కృష్ణా! ఎప్పుడూ ఇంతే. పాలు తాగుతూ, ఇక్కడే, నీ మురళీ నువ్వు ఊదుతూ, ఇదే మోస్తరుగా ఉండాలి. పెద్దవాళ్లయితే ఏం బాగుంటారు? పెద్దాళ్లయితే అసహ్యంగా ఉంటారు. కృష్ణా! అదేమిటో అంతా పెద్దాళ్లని పెళ్లి చేసుకుంటారు? నా చిన్నికృష్ణుణ్ణి చేసుకోకూడదూ, కృష్ణా! ముద్దుకృష్ణా! రాధాకృష్ణా!”
“మరెల్లాగ, అల్లాగే ఉన్నాననుకో. నీకెప్పుడూ ఇల్లాగే కనబడతాను.”
“కృష్ణా!”
“ఎందుకల్లా చూస్తావు?”
“తనివితీరదు, కృష్ణా! నీకు నేను బాగుండను?”
“ఏం?”
“మరినా కేసి నువ్వల్లా చూడవేం?”
“ఎప్పుడు నువ్వే చూస్తావుగా. నన్ను చూడనివ్వందే.”
“చూసి ఏం చేస్తాను?”
“గట్టిగా పట్టుకుని ఊపిరిసలపకుండా ముద్దు పెట్టుకుంటావు. వేడిగా ఊపిరి నువ్వూ నీ ముద్దు”
“నువు కూడా అలా చెయ్యి. ఇంక నిన్ను కూడా చూడనిస్తాను. చూడు, కృష్ణా! నాకేసి, నీ యిష్టం. నీకిచ్చేశాను నన్ను. రాధ నీదే. ఏం చేసినా సరే దీనితోటి.. ఇప్పుడే కావాలా?”
“ఊ”
