Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రేడియో ఆవిష్కర్త మార్కోనీ

[బాలబాలికల కోసం ‘రేడియో ఆవిష్కర్త మార్కోనీ’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

ఈ మానవ జీవితంలో విడదీయరాని బంధమైన రేడియో, టీ.వి., ఫోన్ వంటి సమాచార వ్యవస్థ ఒకనాడు లేనే లేదు. ఈ సమాచార వ్యవస్థ ఆవిర్భావంతో ప్రపంచ దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. వైర్‌లెస్ టెలిగ్రఫీ వంటి గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణకు ఆద్యుడెవరో తెలుసుకుందామా!

గుగ్లీల్మో మార్కోని ఇటలీ దేశంలోని బలోగ్నా నగరంలో 1874వ సంవత్సరంలో ఏప్రిల్ 25వ తేదీన జన్మించాడు. ఆయన తండ్రి పేరు ‘గ్యుగెప్ మార్కోనీ’, తల్లి పేరు ‘అన్నీ’. మార్కోనీకి చిన్నతనం నుండీ కూడా విద్యుత్ పరికరాలపై ఆసక్తి ఎక్కువ. భౌతిక శాస్త్రం పట్ల మక్కువ పెంచుకున్న మార్కోనీ టెక్నికల్ స్కూల్లో చేరాడు. ఆయన విద్యాభ్యాసమంతా బలోగ్నాలోనూ, ఫ్లారెన్సోలోనూ, లెఘార్న్ లోనూ కొనసాగింది. విద్యుదయాస్కాంత తరంగాలపై అప్పటికే పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల సూత్రీకరణలను గమనించిన మార్కోనీలో కొత్త ఆలోచనలు రేకెత్తాయి. చాలా ప్రయోగాల తర్వాత 1895లో మార్కోనీ వైర్‌లెస్ టెలిగ్రఫీని రూపొందించాడు.

స్వదేశంలో గుర్తింపు లభించని మార్కోనీ 1896లో లండన్ బయల్దేరాడు. 1897 చివరకు మార్కోనీ బ్రిస్టల్ ఛానల్ నుంచి సంకేతాలను పంపి బ్రిటిష్ అధికారుల ప్రశంసలందుకున్నాడు. మార్కోనీ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ కంపెనీని బ్రిటన్‌లో స్థాపించాడు.

ఇంగ్లాండులోని కార్న్‌వాల్ నుంచి పంపిన సంకేతాలు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటివెళ్ళి 2,100 మైళ్ళ దూరాన వున్న సెయింట్ జాన్స్‌లో మార్కోనీని చేరిన రోజు ప్రపంచం యావత్తూ ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వైర్‌లెస్ టెలిగ్రఫీని మరింత అభివృద్ధి పరచి రేడియోను కనుగొన్నాడు. షార్ట్ వేవ్ ప్రసార పద్ధతిని కనుగొని ప్రసార రంగంలో క్రొత్త శకానికి నాంది పలికాడు.

1919లో మార్కోనీ శాంతి మహాసభలో ఇటలీ తరపున అధికారిక ప్రతినిధిగా పాల్గొన్నాడు. ప్రపంచంలోనే తొలి ప్రసార కేంద్రాన్ని ఛెస్స్‌ఫర్డ్‌లో నెలకొల్పాడు. 1909లో మార్కోనీ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నాడు. ప్రపంచానికి మహోన్నతమైన ‘వైర్‌లెస్ టెలిగ్రఫీ’ నందించిన మార్కోనీ 1937వ సంవత్సరం జులై ఇరవైన కన్ను మూశాడు.

ఆనాడు ఆయన గౌరవార్థం ప్రపంచ వ్యాప్తంగా వున్న సమాచార కేంద్రాలన్నీ మూసివేసి ఘనంగా నివాళులర్పించారు.

Exit mobile version