[26 ఏప్రిల్ 2026 నాడు ఖమ్మంలో జరిగిన ‘రఘు శేషభట్టర్ గారి సాహితీ సమాలోచనం’ సభ సంక్షిప్త నివేదికని అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
మంచి సాహిత్యాన్ని, రచయితలని పాఠకులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రజ్ఞా భారతి, సంచిక ఆధ్వర్యంలో రచయితల సమావేశాల ఏర్పాటు, సాహితీవేదికల స్థాపన జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ ఉగాది నాడు సదాశివపేటలో మంజీర సాహిత్య అకాడెమీ స్థాపక, రచయితల సమావేశంతో మొదలైన ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇందులో భాగంగా ది. 26 ఏప్రిల్ 2026 నాడు ‘స్తంభాద్రి సాహితీ వేదిక’ నిర్వహణలో ప్రముఖ కవి శ్రీ రఘు శేషభట్టర్ గారి సాహితీ సమాలోచనం సభ ఖమ్మం సివిఆర్ బాంక్వెట్ హాల్‌లో జరిగింది.
శ్రీ పొత్తూరి సీతారామారావు గారు స్వాగత వచనాలు పలికి ప్రజ్ఞా భారతి, సంచిక చేస్తున్న కృషి గురించి వివరించారు, వక్తలను, కవిని సభకు పరిచయం చేశారు. అనంతరం సభను నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు శ్రీ కొల్లూరి సోమ శంకర్‍ని కోరారు.
మంచి సాహిత్యాన్ని, చక్కని రచయితలని పాఠకులుకు చేరువ చేసి, ఓ ఉమ్మది వేదిక కల్పించే సంచిక ప్రక్రియకు ప్రజ్ఞా భారతి అందిస్తున్న తోడ్పాటు గురించి, సంచిక వెబ్ పత్రిక గురించి వివరించారు సోమ శంకర్. సంచికకి రచనలు పంపవలసిందిగా పాఠకులలో ఉన్న రచయితలని కోరారు.
ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ తుమ్మూరి రామ్మోహన్ రావు గారు రఘు సారస్వత వ్యాసాలను విశ్లేషించారు. రఘ గారి ‘సౌరభం’ వ్యాస సంపుటిలోని వ్యాసాలు చక్కని పద్యాల విశ్లేషణ అని తెలిపారు. ఇవి అర్థం కావాలంటే, చదువరులకి సంస్కృతంలోనూ, తెలుగులోని గట్టి పట్టు ఉండాలని అన్నారు. సారవంతమైన కవిత్వమని అన్నారు. ఈ పుస్తకంలో ప్రాచీన కవులని, ఆధునిక కవులని, విస్మృత కవులని ప్రస్తావించుకోడం ముదావహమని అన్నారు. రఘు గారిపై గుంటూరు శేషేంద్రశర్మ గారి ప్రభావం గురించి వివరించారు. ఈ వ్యాసాల ప్రధాన ఉద్దేశాన్ని తెలియజేశారు. కుకవిత్వం గురించి ఎవరినీ నిందించకుండా, మంచి కవిత్వం అంటే ఎలా ఉండాలో ‘అనల్పం’ కవితాసంపుటి ద్వారా నిరూపించారని వ్యాఖ్యానించారు. ‘సౌరభం’ చక్కని వ్యాస సంపుటి కాగా, ‘అనల్పం’ గొప్ప కవితా సంపుటి అని అంటూ, ‘సౌరభం’ పుస్తకం ముఖచిత్రం లోని విశేషతను వివరించి తమ ప్రసంగం ముగించారు.
తదుపరి, ‘అసంకల్పిత పద్యం’ కవితా సంపుటిలోని వస్తు వైవిధ్యం గురించి ప్రముఖ కవయిత్రి శ్రీమతి తోట సుభాషిణి ప్రసంగించారు. కవితకైనా కథకైనా వస్తువే ప్రధానమని అన్నారు. ‘అనల్పం’ కవితా సంపుటి వెలువడినప్పటి నుంచి తాను రఘు గారి అభిమానినని అన్నారు. మనుషుల్లో మనిషితనం క్షీణించిపోడానికి కారణం విలువలు లోపించడమేనంటూ, వాటిని పునః ప్రతిపలించాలంటే గట్టి సంకల్పం ఉండాలని అన్నారు. రఘు గారికి వస్తువు ఒక నెపం అని చెబుతూ, ‘అసంకల్పిత పద్యం’ సంపుటిని తాను మూడు రోజుల పాటు చదివి ఆస్వాదించాలని తెలిపారు. ఈ సంపుటి అనుభవాలు, అనుభూతులు, భావోద్వేగాల కలయిక అని వ్యాఖ్యానించారు. చేరని ఉత్తరం, తల్లి సంపాదన వంటి కవితలలోని పదాలు పాఠకులను కట్టి పడేస్తాయని అన్నారు. రఘు దృష్టిలో పుస్తకం ఒక ఆత్మీయ నేస్తమని, పుస్తకం పట్ల ఆయనకున్న గౌరవం ఈ సంపుటిలో గోచరిస్తుందని పేర్కొన్నారు. తాత సొత్తు, పెంకుటిల్లు, కూటమి వంటి కవితలను కుప్తంగా విశ్లేషించి, పురాజ్ఞాపకాలను గుర్తు చేశారని అన్నారు సుభాషిణి. ఈ కవితా సంపుటిలో రఘు చేసిన ప్రయోగాలను, సృజించిన ప్రతీకలను ప్రస్తావించి, కవి లోతైన ఆలోచనా ధోరణికి అద్దం పట్టాయన్నారు. కవిత్వం సృజనాత్మక ప్రవాహంగా సాగాలని కవి ఉద్దేశమని వ్యాఖ్యానించారు.
తదుపరి ‘రఘు కవిత – ప్రతీకాత్మకత’ అనే అంశంపై సీనియర్ కవి శ్రీ దిలావర్ ప్రసంగించారు. ముందుగా తనవీ, రఘువి భావజాలాలు వేరైనా ఒకరిపట్ల ఒకరికి గౌరవం ప్రేమా ఉన్నాయని అన్నారు. తనకిచ్చిన అంశం క్లిష్టమైనదని అన్నారు. అసలు కవిత్వం అవసరమేమిటి అనే ప్రశ్న వేసి, మానవ సమస్త అనుభవాలను యథాతథంగా బట్వాడా చేయగలిగే భాష ఉంటే కవిత్వం అవసరం లేదన్న ఓ ఆంగ్ల కవి మాటల్ని ప్రస్తావించి, అటువంటి భాష లేదు కాబట్టి కవిత్వం అవసరమని వ్యాఖ్యానించారు. కావ్య భాష ముఖ్యమని అంటూ ప్రతీకాత్మకత అంటే ఏమిటో వివరించారు. ఋగ్వేదంలోని శ్లోకాన్ని ఉదహరించి, బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం ముఖ్యమని తెలిపారు. కాళిదాసు కావ్యంలోని నీలోదకాలు, హంస ప్రవేశం గురించి, చంద్రుడి ప్రవేశంలోని ప్రతీకాత్మకతని వివరించారు. సాహిత్యం లోని రస, భావ స్వభావాన్ని బట్టి హృదయానికి అందించేది pattern అని చెబుతూ, రఘు గారి కవిత్వంలో pattern ఎలా ఉంటుందో వివరించారు. ఫ్రెంచ్ కవుల Bohemian శైలిని ఉదహరించారు. కవిత్వంలో మాటలకు పరిమళాలు అద్దగల గుణం వోల్టైర్‌కి ఉందన్నారు. సందర్భోచితంగా ‘ఆరని జ్వాల నా తాపం’ అనే పాట పల్లవి పాడి వినిపించారు. మంచి కవికి ఉండాల్సిన లక్షణాలని శేషేంద్ర వేటి గురించి చెప్పారో అవన్నీ ఉన్న కవి రఘు శేషభట్టర్ అని వ్యాఖ్యానించారు. అనంతరం దిశాంతర స్వప్నం, అనల్పం, అసంకల్పిత పద్యం పుస్తకాల లోని కొన్ని కవితలను చదివి, వాటి లోని ప్రతీకలను వివరించారు. మధ్య మధ్య ఉర్దూ గజళ్ళు పాడి సభికులను రంజింపజేశారు.
ప్రసిద్ధ కవి శ్రీ సిద్ధార్థ గారు ‘రఘు కవిత్వం – వస్తు శిల్పం’ అనే అంశంపై ఉపన్యసించారు. ముందుగా ఖమ్మం పట్టణంతోనూ, జిల్లాతోను తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని వివరించారు. రఘు తనకెలా పరిచయమయ్యారో తెలిపారు. తనకి శేషేంద్ర గారితో ఉన్న పరిచయాన్ని తెలిపారు. కవిత్వంలో నిజాయితీ ఉండాలనీ, కవిత్వానికి బాధ్యత ఉండాలని శేషేంద్ర అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాదులో జీవితం అత్యంత కాంప్లికేటెడ్‌గా ఉంటుందని, అందుకు కారణం నగరం మల్టీ కల్చరల్ సెంటర్ కావడమేనని అన్నారు. కవిత్వం ఇప్పుడు మునుపటి కన్నా ప్రయోజనకరంగా మారిందని వ్యాఖ్యానించారు. బయట యుద్ధాలలో ఉన్న వార్ స్ట్రాటెజీ కవులలో గోచరిస్తోందని అన్నారు. కవిత్వం ప్రతి ఆర్ట్ ఫామ్ లోకి ఒదిగిపోయిందని పేర్కొన్నారు. మల్టీ పోలార్ హెజిమోనీ పోయి యూనీపోలార్ హెజిమోనీ అయిపోయిందని, ఈ సందర్భంలో కవికి నిజాయితీ అత్యంత అవసరమని అన్నారు. రఘులోని నిజాయితీయే అతని ఆకర్షణ అని అభిప్రాయపడ్డారు. రఘుది మనిషిని వెతికే ప్రయత్నమన్నారు. ప్రస్తుతం బైఫర్కేషన్స్ అన్నీ పోయాయనీ; అంతర్ముఖమే బహిర్ముఖమనీ; స్పష్టతే అస్పష్టత అనీ వ్యాఖ్యానించారు. వార్ స్ట్రాటజీస్ కూడా పోయిట్రీనే అని వ్యాఖ్యానించారు. మనుషులందరూ ఒక్కటవ్వాలనీ, కల్పిత విభేదాలని తొలగించాలని, అదే కవి విజయమనీ అన్నారు సిద్ధార్థ. ఉదాత్తమైన అక్షరం, అనవసరమైన, వికృత పదాలని పరిహరించడం, చక్కని పదాల ప్లేస్‌మెంట్ అవసరమని వ్యాఖ్యానించారు. కొన్ని కవితలు చదివి వినిపించారు. సందర్భోచితమైన పాటలు పాడారు. రఘు రచించిన చిన్న కవితలని చదవడం, వినడం ద్వారా అద్భుతమైన అనుభవం కలుగుతుందని, అవి మంత్రాక్షరాలని అన్నారు. ‘దిశాంతర స్వప్నం’ పుస్తకంలోని ఉత్తరం అనే కవిత ఒక విజువల్ నెరెటివ్ అని అన్నారు. పోయెమ్ ఎప్పుడు ఎలా ఎత్తుకుంటాడో, ఎప్పుడు ఎలా ఆపేస్తాడో కవికి కూడా తెలియదన్నారు. రాయడమే తన వస్తువని రఘు డిక్లేర్ చేశారని తెలిపారు. Moment to moment జీవిస్తూ కవిత్వం రాయడం రఘుకి తెలుసన్నారు. శబ్ద వ్యాపకమే కాదు, నిశ్శబ్ద వ్యాపకం కూడా ఉందని అన్నారు. విడిపడిపోవడం, కలపడానికి ప్రయత్నించడమే రఘు కవిత్వమని వ్యాఖ్యానించారు. పాఠకుడే వాస్తవం, పాఠకుడే నిజం, పాఠకుడే చక్రధారి అంటూ ముగించారు.
చివరగా రఘు శేషభట్టర్ తమ స్పందన తెలియజేశారు. సభకు హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. చక్కని ఏర్పాటు చేసిన సమావేశ స్థలం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వక్తలకు, సభాధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిత్రులందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంచికకూ, ప్రజ్ఞా భారతికి కృతజ్ఞతలు తెలిపారు. దాహంతో ఉన్నవాళ్ళు నీళ్ళ కోసం వెతికినట్లు, కవితలు రాసేవాళ్ళు చదివేవాళ్ళ కోసం వెతుక్కుంటారని అన్నారు. తానెప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదని తెలిపారు. శుభ్రంగా ఉండే వాక్యం ఎప్పటికీ నిలబడుతుందనీ, అదే తన తపన అని అంటూ, మరోసారి అందరికీ కృతజ్ఞతలు తెలిపి సభను ముగించారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

