అలసి సొలసి
పండించిన రైతన్న పంటకు
లేదా M.R.P.?
పారిశ్రామిక ఉత్పత్తులన్నిటికి
వారే M.R.P. నిర్ణియిస్తారు.
మరి రైతన్నకు లేదా ఆ హక్కు?
ధర నిర్ణయించుకునే హక్కు తనకు లేదా?
దళారులు నిర్ణయించిన ధరకే అమ్మాలా?
తాను మార్కెట్టుకు తెచ్చిన పంట
దళారుల చేతిలో పడి వారే నిర్ణయిస్తారు ధరను.
ఆ ధర యిష్టం లేక వెనక్కు తీసుకెళ్లాలంటే
ఇంట్లో నిల్వ సామర్థ్యం ఉండదు
కాగా తీసుకెళ్లడానికి ఖర్చు
యెంత దారుణం?
రైతన్న
ఈ విధంగా
నష్ట పోవాల్సిందేనా?
ఎన్నాళ్లిలా?
ఏతా వాతా
తేలిన సారాంశమేమంటే
దళారులయింట సిరుల పంట
కష్టపడి పండించిన
రైతన్న ఇంట
కన్నీటి పంట
రైతన్నా!
ని పంట ధరను నీవే
నిర్ణయించుకునే
రోజు వస్తుందా?
ఎన్నటికీ రాదనే అనిపిస్తుంది.
ఏమంటారు?
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.