[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘రైతు మనసే కేదారము’ అనే కవితని అందిస్తున్నాము.]
తొలకరి చినుకుల ఆహ్లాద తన్మయము
వేయికనులతో చూసే కర్ష కాహ్వానము
తొలి చినుకుల ఆగమనమునకు
ఆగమ ఆహ్వానము! వరి మడి దేవళము
కర్షకుని పూజితము! కళకళపెరిగే పైరున
‘వయ్యారి భామ’ చేరే! వరిచేలో చాప
కింద నీటిలా అల్లుకుపోయే వయ్యారియై!
వరి సహత కేదారం వరిరహితమైతే..
మన మనుగడ ప్రశ్నార్ధకమై పోదా!
పైరును ఎదగనిచ్చేనా? వరి కంకులతో
పాలు పోసుకోనిచ్చునా? సస్యక్షేత్రం
వరి రహితం ఐపోదా! మాగాణిలోన
వరి తలలు వాల్చి దుఃఖించగ.. అన్నదాత
వదనము చిన్నబోయె చింతతోడ !
రైతన్న పంతముతో కలుపు తీయ
పంతగించి మూల మూలలలో ఉన్న
కలుపులన్ని ఏరి పెరికి, వరి మొలకల
కాపాడగ.. చిన్న చిన్న వయ్యారులు
తలలు ఎత్తి పెరగసాగె! పంతగొండి
రైతన్న కలుపుతీసి ఎరువు వేసి
కంటి పాపలా కాచి.. మాగాణిని రక్షించి
తల్లీ! భూదేవమ్మా! కరుణించవె అమ్మా!
మా కష్టము చూడవమ్మ! తల్లీ!
ఆకాశములో గుంపులలో వచ్చేవు!
చల్లని గాలులు వీచగ చినుకుల
దారము వోలే.. తుప్పురతో వచ్చి నీవు
జల్లులుగా కురిసేవు! నెలకు మూడు
వానలను కురిపించుము మబ్బుతల్లి!
సంకురాత్రి నాటికి ధాన్యపు రాశులనిమ్మా!
పంట కారకుడు రేరాజు చంద్రుడు!
పున్నమి రేయి నాడు.. క్షీరాన్నము
వెన్న చలిమిడినీకు ఆరగింపు చేసెదము!
చల్లని వెన్నెల రాజును మనసారా
కొలచెదము.. తెల్లని మల్లెలు కూర్చి
మాలికలను వేతుము! నెలరాజువు
నీవేగా ఆహార ప్రదాతవు! పేరుగన్నము
నీకు నివేదనలు చేసెదము! పెద్దలకు
పిల్లలకు ఆనందంగా పెట్టెదము!
ప్రకృతి శక్తులకే మా వందనము!
అభివందనము, మండనము!
