Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాజకీయ వివాహం-9

యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘.  ఇది 9వ భాగం.  

అధ్యాయం- 9

“ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రియాంక. అసలు ఈ సందర్భంలో అంకుల్ సుస్తీ చేసిన విషయం కూడా నేనీ మర్చిపోతానంటే నమ్ము” ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ తన ఎదర ఉన్న గ్లాస్‌ను ఖాళీ చేసాడు సిధ్ధార్థ. వారిద్దరూ ఇప్పుడు తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో అత్యంత ప్రముఖమైన హోటల్‌లో ఉన్నారు.

సహజంగా బయట పార్టీలకు డిన్నర్లకు అంతగా ఆసక్తి చూపని ప్రియాంక ఈరోజు సిధ్ధార్థ బలవంతం మీద తాజ్ కృష్ణ హోటల్‌కు రాక తప్పలేదు. ఆమె ఫలానా అని ఎవరికీ తెలీని విధంగా అక్కడ డిన్నర్‌కి రిజర్వేషన్ చేయించాడు సిధ్ధార్థ. తన తండ్రి గురించి ప్రస్తావన రాగానే ఆమె వదనంలో ప్రశాంతత స్థానంలో ఇబ్బంది చోటు చేసుకుంది. అది గమనించిన సిధ్ధార్థ కొద్దిగా చిన్నబుచ్చుకున్నాడు.

“అయాం వెరీ సారీ ప్రియాంక. అంకుల్ పరిస్థితి గుర్తు చేసి నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ అలా కనుక ఫీల్ అయితే ఐ అపాలజైజ్. కానీ నాకు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంది. అబ్బో నువ్వసలు పార్టీ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడం మన విజయానికి తొలి మెట్టు తెలుసా. ఎంతోమంది తలలు పండిన నాయకులను పక్కకి తోసి నువ్వు విజయం సాధించావంటే అస్సలు ఊహించలేము. అందరికీ ఇదొక పెద్ద షాక్ లాంటిది, నిజం చెప్పాలంటే నాకే ఇదింకా నమ్మబుద్ధి కావడం లేదు.

అసలు రాజకీయాలంటే ఇష్టం లేదని, వాటి గురించి మాట్లాడడానికి కూడా ప్రయత్నించని నువ్వు, ఈ పరిస్థితుల్లో పార్టీలో చేరడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అఫ్కోర్స్ ఈ టైం లో నీ అవసరం, పార్టీకి ప్రజలకి కూడా చాలా ఉందనుకో, ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఫ్యాక్షన్స్‌ని అదుపులోకి తీసుకువచ్చి సమన్వయపరిచే ఫోర్స్ ఒకటి కావాలి. నువ్వు సరైన టైములో సరైన నిర్ణయం తీసుకున్నావు. సినిమా భాషలో చెప్పాలంటే ఇదొక డ్రామాటిక్ ఎంట్రన్స్ అన్నమాట” ఆమెవంక చూస్తూ చెప్పాడు సిధ్ధార్థ.

అతనన్న మాటలకు ఏ విధంగా స్పందించాలో తెలీడం లేదు. క్షీణిస్తున్న తండ్రి ఆరోగ్యం ఒకవైపు, రోజురోజుకీ పార్టీలో పెరుగుతున్న అసమ్మతి మరొకవైపు, ఇవికాకుండా వర్గపోరాట రాజకీయాలతో అంధకారమయం అవుతున్న ప్రజల భవిష్యత్తు ఇంకొకవైపు ఇవన్నీ తలుచుకుంటుంటే ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది.

నిజంగా రాజకీయ రంగప్రవేశం చేసి తాను మంచి పని చేశానా లేదా అని ఆలోచించడానికే ఆమెకు భయంగా ఉంది. జె.హెచ్. పార్టీ ప్రెసిడెంట్‌గా తాను ఎన్నికకావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్ని ప్రముఖ న్యూస్ ఛానెల్స్, వార్తా పత్రికలు, ఇతర ఎలెక్ట్రానిక్ మీడియాలో ఇదే వార్త మారుమ్రోగింది. సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఆమె ఫేస్‌బుక్ పేజ్ టెన్ మిలియన్ లైక్స్ దాటిపోయింది.

యంగెస్ట్ పొలిటీషియన్ విత్ ఏ బ్యాంగ్ ఆన్ టార్గెట్ అంటూ జాతీయ దినపత్రికలు కూడా ఆమెను వేనోళ్ళ పొగిడాయి. కానీ ఆమెకు ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగిస్తున్నట్లు ఉన్నాయి. ఆరోజున జరిగిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో అనూహ్యమైన మెజారిటీతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఈ విషయంలో ప్రసాద్ గారు, సిధ్ధార్థ తనకు చాలా సహాయం చేశారు.

పైకి చాలా మామలుగా నవ్వుతూ తన పరాజయం స్వీకరించినప్పటికీ సీనియర్ లీడర్ హనుమంతరావుకి మనసులో అసంతృప్తి ఉందని, అతను ఎప్పటికైనా తన వర్గం విశ్వాసం తిరిగి పొందుతాడని ప్రియాంక అక్కడున్న అతి తక్కువ వ్యవధిలోనే గ్రహించగలిగింది.

అయితే ఆయన గురించి ప్రస్తుతం అంతగా భయపడవలసిన అవసరం లేదని ప్రసాద్ గారు, సిధ్ధార్థ ఆమెను సమాధాన పరిచారు. వారు ఆమెకు అలా సలహాలు ఇస్తుంటే ఆ సమయంలో తాను అప్పుడే రాజకీయ నాయకురాలు అయిపోయినట్లుగా ఆమెకు అనిపించి ఇబ్బంది పడింది.

“సిద్ధూ నాకు ఒక విషయం ఎప్పటికీ అర్థం కాదు. నువ్వునేను ఒకే స్వభావం కలిగిన వాళ్ళం. చదువులోనూ, సంస్కారం లోనూ ఇంకా మిగిలిన అన్ని విషయాల్లో అలోచించి చూస్తే నాకన్నా నువ్వే సమర్థుడివి. మరి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తివి, పైగా డెమోక్రసీ, ప్రజాప్రభుత్వం అంటూ పెద్ద పెద్ద మాట్లాడేవాడివి పార్టీ ప్రెసిడెంట్‌గా నీ బదులు నన్ను ఎందుకు బరిలో దింపావు. దీని వెనుక ఏమైనా రాజకీయం ఉందా” అతనివంక అనుమానంగా చూస్తూ కన్నుగీటి అడిగింది ప్రియాంక.

ఆమె అలా చెయ్యడంతో అక్కడ వాతావరణం కొద్దిగా తేలికపడినట్లు అయ్యింది. తను ఇందాకా నకునారెడ్డి గురించి చేసిన వ్యాఖ్యను ఆమె పెద్దగా పట్టించుకోలేదు అని తెలుసుకున్న సిద్ధూ

“అబ్బో అప్పుడే అవతలి వ్యక్తి మూవ్స్‌ను ఎస్టిమేట్ చెయ్యడం మొదలెట్టావే. ఇట్ మీన్స్ దట్ యూ ఆర్ ఇన్ ద గేమ్ నౌ” ఆమె వైపు చూస్తూ అన్నాడు.

“అయాం ఆల్రెడీ ఇన్ దా గేమ్ రైట్ ఫ్రం దీ స్టార్ట్. నువ్వింకా నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు” అతనివంక చురుగ్గా చూస్తూ అడిగింది ప్రియాంక.

బేరర్‌ను పిలిచి ఇంకో రౌండ్ ఆర్డర్ చెప్పాడు సిధ్ధార్థ. సహజంగా డ్రింకింగ్‌కి, ఆల్కహాలిక్స్‌కీ దూరంగా ఉండే ప్రియాంక ఎందుకో సిధ్ధార్థ డ్రింక్ చేస్తుంటే వారించలేకపోయింది. వారిద్దరూ అక్కడికి వచ్చి గంట దాటింది.

“ఒకే బాబా, చెప్తాను విను. కానీ నా ఆన్సర్ నిన్ను సంతృప్తి పరచకపోతే నేనేమీ చెయ్యలేను. ప్రపంచం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నాయకత్వం అనేది కోరుకుంటే వచ్చేది కాదు, పోరాడితే గెలిచేది కాదు. తనను తాను నాయకుడు అనుకున్నవాడు ఎప్పటికీ పోరాటం సాగిస్తూనే ఉంటాడు.

అలా కాకుండా తనతో ప్రమేయం లేకుండా ప్రతీ ఒక్కరికీ అవకాశం కలిపించదలుచుకున్న వాడే తనకు తెలియకుండా తానే ప్రజల దృష్టిలో నాయకుడౌతాడు. నీలో నాకు ఆ లక్షణం కనిపించింది. ఇంక నా గురించి అంటావా, నేను ఎప్పటికీ నాయకుడిని కాలేను, కావాలనే ఆశ కూడా నాలో లేదు. ఎందుకంటే….” తాను చెప్తున్నది ఆమె వింటుందో లేదో అని తెలుసుకోవడానికి మధ్యలో ఆపాడు సిధ్ధార్థ. అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ రెట్టించింది ప్రియాంక

“చెప్పు ఎందుకంటే…”

తన నోటిమీద చూపుడువేలు ఉంచుకుని నింపాదిగా చెప్పాడు “ఎందుకంటే ఎవరికీ చెప్పకు,చాలా కాలం నుంచీ నాకు కూడా అంకుల్ లాగ పెద్ద రాజకీయ నాయకుడు అవ్వాలని కోరిక” మెల్లిగా అన్నాడు.

అతను ఏమి చెప్తున్నాడో అర్థం అవ్వగానే ఆమె పెదవులపై సన్నని చిరునవ్వు ఒకటి మెరిసింది. వెంటనే అర్థం చేసుకుని సున్నితంగా అతని భుజం పైన తట్టింది. ఒక్కసారి గట్టిగా నవ్వాడు సిధ్ధార్థ.

“జోక్ కాదు సిద్ధూ, నాకు నిజంగా ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకో నాకన్నా నువ్వే గొప్ప నాయకుడివి అవుతావని నా అభిప్రాయం” అతడితో అంది ప్రియాంక.

“చెప్పాను కదా మేడం నేను చెప్పే జవాబు మీకు నచ్చకపోతే నేనేమీ చెయ్యలేను అని. అందుకే ఇప్పుడు మీకు నన్ను నమ్మడం తప్ప వేరే గత్యంతరం లేదు. సరికానీ ఈరోజు నీకు ఇంకో విషయం చెప్పాలి, అసలు అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఫోన్‌లో ఈ విషయం చెప్పడం అంత మంచిది కాదని నాకు అనిపించింది” ఆమె వైపు చూస్తూ అన్నాడు సిధ్ధార్థ. ఇంతలోపు బేరర్ వచ్చి డిన్నర్ సర్వ్ చెయ్యడం ప్రారంభించాడు. అతను వెళ్ళిపోగానే అడిగింది ప్రియాంక

“ఏ విషయం” తాను పార్టీ ప్రెసిడెంట్ అయ్యిన దగ్గర నుంచీ తన కార్యకలాపాలన్నీ సిధ్ధార్థనే చూసుకుంటున్నాడు.

“రేపు మనం విశాఖపట్నం వెళ్తున్నాం. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరెక్ట్ గా సిక్స్ ఓ క్లాక్‌కి ఎయిర్పోర్ట్‌కి బయల్దేరుతాం.”

“విశాఖపట్నం దేనికీ” అర్థం కానట్లుగా అడిగింది ప్రియాంక.

“మీ రాహుల్‌ను చూడడానికి” ఆమె వంక చూస్తూ కన్నుగీటి చెప్పాడు సిధ్ధార్థ. అతను చెప్పిన పేరు వినగానే చిన్నగా నవ్వింది ప్రియాంక.

***

“ఇంత అర్జెంట్‌గా బయలదేరదీసి విశాఖపట్నం తీసుకొచ్చావు. ఇప్పుడేమో ఇంకా ప్రయాణ బడలికలు తీరకుండానే మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తున్నావు. కొంపతీసి నన్ను కిడ్నాప్ చేయడంలేదు కదా” అతడివైపు కొంటెగా చూస్తూ అంది ప్రియాంక.

 ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చెయ్యడానికి ఆమెను హోటల్ మూన్ లైట్ గార్డెన్స్ దగ్గరకు తీసుకువెళ్తున్నాడు సిద్ధార్థ. అప్పుడు సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలయ్యింది.

“పొలిటీషియన్ అయ్యిన దగ్గర నుంచీ నీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ రెట్టింపు అయినట్లుంది ప్రియాంక” ఆమె వంక సీరియస్‌గా చూస్తూ అన్నాడు సిద్ధార్థ.

“సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదు బాబు సెన్స్ ఆఫ్ ఫియర్”అంతే సీరియస్ గా చూస్తూ చెప్పింది.

“సెన్స్ ఆఫ్ ఫియరా ఎందుకు?” అడిగాడు సిద్ధార్థ.

 “ఉండదు మరీ. పక్కనే నాయకుడు కావాలని మనసులో ఉన్నా కాలేని ఒక వ్యక్తిని పక్కనే పెట్టుకుంటే హ్యాండ్ బాగ్ లో టైం బాంబ్ పెట్టుకున్నట్లే” చిలిపిగా చూస్తూ అంది ప్రియాంక.

“స్టాప్ జోకింగ్ ప్రియాంక, నీకు అర్థం కాని విశేషం ఏంటంటే, ఒకవేళ నీకు నా నుంచి అలాంటి భయం ఉన్నప్పటికీ నువ్వు బహిరంగంగా బయటపడకూడదు. తెలిసిందా?” స్టీరింగ్‌ను జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ ఆమెకు చెప్పాడు.

”అఫ్కోర్స్ యు ఆర్ ది ఎక్స్పర్ట్ రైట్. సరే ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నట్లు” వారిద్దరూ మాటల్లో ఉండగానే రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసారు. కార్ పార్కింగ్‌కు ఇచ్చేసి మూన్ లైట్ గార్డెన్స్‌లో టాప్ ఫ్లోర్లో రెస్టారెంట్ వైపు దారి తీసాడు సిద్ధార్థ. మాట్లాడకుండా అతడిని అనుసరించింది ప్రియాంక.

“ఆన్సర్ చెప్పు బాబూ. ఇందాకటి నుండీ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను” అతడిని వెనకకు లాగుతూ అడిగింది.

ఇంతలో ఒక వ్యక్తి వాళ్ళదగ్గరకు వచ్చి “హలో మేడం, నమస్తే. సార్ చెప్పినట్లుగా మన ముగ్గురికీ ఆ కార్నర్ సీట్ రిజర్వ్ చేయించాను” అని వాళ్ళ ఇద్దరినీ తీసుకువెళ్ళి అక్కడ కూర్చోపెట్టాడు.

“ఈయన మిస్టర్ సుదర్శన్, సంవత్సరం క్రితం అంకుల్‌ని చూడడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు మొదటిసారి ఈయనను కలిసాను. ఇన్‌ఫాక్ట్ ఈయనే నన్ను కలవడం జరిగింది. బ్యాక్ ఎండ్ మీడియా సర్వీసెస్ అని ఒక ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా కన్సల్టింగ్ ఫర్మ్ నడుపుతూ ఉంటారు సుదర్శన్ గారు” తన ఎదర ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ చెప్పాడు సిద్ధార్థ.

ఆ రెస్టారెంట్‌లో జనసాంద్రత తక్కువగా గమనించింది ఆమె. బహుశా అందుకే ఈ ప్లేస్‌ను ఎన్నుకుని ఉంటాడు సిద్దార్థ, లేదా తానే ప్లాన్ చేసి జనాలను ఉండకుండా చేసాడేమో అని ప్రియాంకకు అనిపించింది. చూస్తుంటే అక్కడేదో రహస్య సమావేశం జరుగుతున్నట్లు ఉంది.

“మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అని గర్వం కూడా లేకుండా చాలా సామాన్యంగా ఉన్నారు. మీ యొక్క సింప్లిసిటీయే మీ ప్రత్యేకత.” అన్నాడు సుదర్శన్, అతడు ఆమెను అలా పొగడం ఆమెకు చాలా కృత్రిమంగా అనిపించింది.

“నేను ఎప్పుడూ ఇలానే ఉంటానండీ. బహుశా మీరు నన్ను మొట్టమొదటిసారి చూడడం వల్ల అలా భావించి ఉంటారు. ఏదేమైనా మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో నేను ఇప్పటికైనా తెలుసుకోవచ్చా” వారిద్దరి వంకా చూస్తూ అడిగింది ప్రియాంక. సిద్ధార్థ సైగ చెయ్యగానే తన దగ్గరున్న మొబైల్ ఫోన్ ఆమె ముందుంచాడు సుదర్శన్.

ప్రశ్నార్ధకంగా చూస్తున్న ప్రియాంకతో “ ఈ వీడియో ఒకసారి చూస్తారా” అన్నాడు. ఆమె తన పక్కనున్న వారిని గమనిస్తూ ఉంటే “పర్వాలేదు, ఇక్కడ మనకు ఫుల్ ప్రైవసీ ఉంది” అని భరోసా ఇస్తున్నట్లుగా అన్నాడు.

అంటే అతను తనకిప్పుడు ప్రైవేట్ వీడియో చూపిస్తున్నాడు అన్నమాట, ఆ మాట మనసులో అనుకుంది కానీ బయటపడలేదు. అతను అందించిన స్మార్ట్ ఫోన్ వంక ఆసక్తిగా చూస్తోంది. అందులో ఆదిత్య నారాయణ గిరిజన ప్రాంతంలో యువకులను ఉద్దేశించి చేసిన ప్రసంగం, భూషణరావు వారితో కలవడం, ఆ తరువాత జరిగిన ప్రసంగాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి.

తన తండ్రిని కలవడానికి రెండు మూడు సార్లు భూషణరావు తమింటికి వచ్చినప్పుడు ఆయనను చూడడంతో ఆ వీడియోలో కనిపించిన భూషణరావును ఆమె గుర్తించగలిగింది. తన తండ్రి ద్వారా ఆయనకు పని జరగడం లేదని తెలిసి ప్రత్యామ్నాయ వర్గాలతో చేతులు కలపడానికి భూషణరావు ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె గ్రహించింది.

గతంలో నాయుడుపల్లి దగ్గర తన స్థలంపై హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో భూషణరావు ఓడిపోవడం గురించి ఆమె పత్రికల్లో న్యూస్లో చూస్తూనే ఉంది. తన తండ్రికి గుండెపోటు రావడానికి కూడా ఒకరకంగా చూస్తే ఈ పరిస్థితులే కారణం.

“వావ్, ఇది చాలా సెన్సేషనల్ న్యూస్ లాగుంది, చూస్తుంటే మీది ‘సెంట్రల్ ఇంటలిజెన్స్’, ‘రా’ తదితర సంస్థలకన్నా పెద్ద నిఘా వర్గం లాగుందే. దీన్నుంచి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు” అతని వంక సూటిగా చూస్తూ అడిగింది ప్రియాంక.

 “హహహ భలేవారు మేడం. మీరు అనుకుంటున్నట్లుగా మాది అంత పెద్ద సంస్థ ఏమీ కాదు. ఏదో టెక్నాలజీ వాడుకుని ఆడియోలు, వీడియోలు అమ్ముకునే జస్ట్ ఒక చిన్న నెట్వర్క్ అంతే. ఇకపోతే నా ఎక్స్పెక్టేషన్స్ అంటారా అందరూ బాగుండాలి, మీరు బాగుంటే మేము కూడా బాగుంటాము, అప్పుడు ప్రజలు కూడా బాగుంటారు. అంతే కదా సిద్ధార్థ గారూ” అతడిని కూడా మధ్యలో ఇరికిస్తున్నట్లుగా అన్నాడు సుదర్శన్. సిద్దార్థ కొంచెం ఆందోళనగా ప్రియాంక వంక చూసాడు.

“ఓహో అలాగా, మరైతే ఈ విషయం చేరవలసిన వాళ్ళకు చేరితే వాళ్ళు కూడా బాగుంటారు కదా” ఆ వీడియోలో రాహుల్ నిర్వహించబోయే బహిరంగ సభలో జరగబోయే గొడవలు గురించి కూడా ఉంది.

 “ఎగ్జాక్ట్లీ ఇదే డౌట్ నాక్కూడా వచ్చింది” ఆమె వంక చూస్తూ సుదర్శన్‌తో సమాధానం చెప్పమన్నట్లుగా అడిగాడు సిద్ధార్థ.

“సార్ మీకు ఇదివరకే చెప్పను కదా సార్, మళ్ళీ అదే విషయం మేడంకి కూడా చెప్తున్నాను, బిజినెస్ ఎవరితో చెయ్యాలన్నది చేసేవాడి ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను నేను ఏ పని చేసినా అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతోనే చేస్తాను. ఇక మనం వీడియో గురించి మాట్లాడుకుందామా” అడిగాడు సుదర్శన్. అతని ధోరణి చూస్తుంటే ఎంతోకొంత ఎమౌంట్ అడుగుతాడేమో అని ప్రియాంకకు అనిపించింది.

“ఎంత కావాలి” అతనివంక కుతూహలంగా చూస్తూ అడిగింది.

తనకి అస్సలు ఇలాంటివంటే కిట్టదు. ఇలాంటివారు ఎంతో మంది తన తండ్రిని అనునిత్యం కలవడం కలవడం ఆమె చిన్నతనం నుంచే గమనిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇలాంటి వాటికి స్వస్తి పలకాలని ఆమె ధృడ సంకల్పం, అయితే ఈ సుదర్శన్ ఎంతవరకూ వెల్తాడో తెలుసుకోవాలని ఆమెకు అనిపించింది.

“అయ్యో ఎంతమాట మేడం. డబ్బు గురించి వ్యాపారం చేస్తాం నిజమే, కానీ ప్రస్తుతానికి నాకు దానితో పెద్దగా పని లేదు. ముందుగా మీరు రాహుల్ గారిపైన జరిగే దాడి గురించి ఆలోచించండి” అన్నాడు సుదర్శన్.

ఆ మాటతో ఆమె మళ్ళీ ఒకసారి ఆ వీడియోను చూడడం ప్రారంభించింది. ఆ వీడియోలో చీకటిలో కాగడాల వెలుతుర్లలో గిరిజనులను చైతన్యపరుస్తున్న ప్రొఫెసర్ ఆదిత్యనారాయణను ఆమె గమనించింది. ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా సేవలు అందించిన ఆయన ఎన్నో ప్రజా ఉద్యమాలకు నేతృత్వం వహించాడు, చాలా పుస్తకాలు రచించాడు కూడా.

ప్రజల తరఫున పోరాటానికి ఎప్పుడూ ముందుండే ఆయనను చాలావరకు పెట్టుబడిదారులు తమ స్వలాభానికి వాడుకోవడం జరుగుతూనే ఉంది. ఆంగ్లంలో ఆయన రచించిన రెండు పుస్తకాలు ‘దీ హంగ్రీ కేపిటలిస్ట్’, ‘దీ ఎకనామిక్స్ ఆఫ్ పోలిటిక్స్’ను ప్రియాంక చదివింది కూడా. ఎంతో మేధస్సు కలిగిన ఇలాంటి వ్యక్తులు మార్క్సిజం, కమ్యూనిజం వైపు మళ్లడం చాలా దురదృష్టకరం అని ఆమె చాలాసార్లు అనుకుంది.

“నాకు భూషణరావు కుమారుడు ప్రతాప్‌తో డైరెక్ట్‌గా పరిచయం ఉంది. ఈ సమావేశంలో భూషణరావుని చూడడంతో నేను నా లీడ్స్ ను ప్రతాప్‌ను ఫాలో అయ్యేలా చేసాను. ఎందుకంటే చాలావరకు భూషణరావుకి అవసరమైన ఇలాంటి ఆక్టివిటీస్ ప్రతాప్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అక్కడ నాకు చాలా ఆశ్చర్యకరమైన సమాచారం తెలిసింది ప్రతాప్ కొంతమంది అరాచక శక్తులను ఆదిత్యనారాయణ లీడ్ చెయ్యబోయే ప్రొటెస్టర్స్ గ్రూపులోకి చొప్పించి రాహుల్‌పై దాడులు జరిగేలా చేసి తద్వారా ప్రజల్లో అశాంతిని కలిగించి ప్రభుత్వాన్ని పడగోట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

అంతేకాదు ఈ మీటింగ్‌కు జోగేశ్వరరావు హాజరుకాకపోవడం వల్ల మొత్తం రాహుల్ మీదే కేంద్రీకృతమై ఈ సభ నడుస్తుంది అని మనకీపాటికే తెలియడం వల్ల రాహుల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. రాహుల్‌పై జరుగుతున్న ఈ కుట్ర గురించి ఆదిత్యనారాయణ గారికి తెలియకపోవడం విచారకరం.” తనకు తెలిసిన విషయాలు వారితో షేర్ చేసుకున్నాడు సుదర్శన్.

“ఈ ఆదిత్యనారయణ గురించి నాకు కూడా తెలుసు. చదువుకునే రోజుల్లో ఆయనను చాలా గొప్ప వ్యక్తిగా ఆరాధించేదాన్ని. అయితే ప్రతీ మనిషికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. అందులో మొదటిది తమను ఎవరో అణచివేయదలుచున్నారు అనే భావన. అలాంటి భావం ఉండడానికి ఎంతటి గొప్పవాడు, మేధా సంపన్నుడైనా అతీతుడు కాదు. ఎనీవే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు చాలా ఉపయోగపడింది. దీన్ని మేము ఏ విధంగా ఉపయోగించుకోవాలి” అతడి వంక ప్రశ్నార్ధకంగా చూస్తూ అడిగింది ప్రియాంక. అతడేమి చెప్తాడా అని ఆసక్తిగా చూస్తున్నాడు సిద్ధార్థ.

“క్షమించాలి ఆ విషయం మీరు ఆలోచించుకోవాలి, మీకు సలహా ఇచ్చే అంత గొప్పవ్యక్తిని కాను. మిగిలిన విషయాలు నేను సార్‌తో మాట్లాడతాను ఉంటాను.” అని చెప్పి ఒక్క క్షణం ఆగి

“వెళ్లబోయే ముందర మీకొక చిన్న ట్రేడ్ సీక్రెట్ చెప్పదలుచుకున్నాను మేడం. మీరనుకున్నట్లుగా ఈ వీడియో మా నెట్వర్క్ గొప్పతనం వాళ్ళ లభించలేదు. ఒక డాక్యుమెంటరీ షూట్ చెయ్యడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిడెంటల్‌గా దొరికింది. అంతే” అని చెప్పి వారిద్దరూ ఆశ్చర్యంగా తన వైపు చూస్తుండగా అక్కడ నుండి నిష్క్రమించాడు.

“మిగిలిన విషయాలు నీతో మాట్లాడతాను అన్నాడు అంటే ఏంటి అర్థం” సిద్ధార్థను అడిగింది ప్రియాంక.

“అర్థం కాలేదా? ఎకనామిక్స్ ఆఫ్ పాలిటిక్స్” అంటూ ఆమె వైపు చూస్తూ చెప్పాడు.

“అంటే” అర్థం కానట్లుగా అడిగింది.

“అదేనమ్మా, ఫైనాన్సిషియల్ మేటర్స్” చెప్పాడు సిద్ధార్థ

“నాకు కూడా రీసెంట్ గానే ఆదిత్యనారాయణ గురించి తెలిసింది. ఆ తరువాత నేను ఆయన రాసిన ఆ పుస్తకం చదవడం జరిగింది” తన వంక ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న ప్రియాంకను ఉద్దేశించి అన్నాడు. ఆమె తన చేతి వాచ్ చూడగానే సమయం మూడు గంటల ముప్పై నిమిషాలు అయ్యిందని గ్రహించి అక్కడ నుండి బయల్దేరింది ప్రియాంక.

తనని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ప్రియాంకతో గట్టిగా అన్నాడు “అయ్యో ఇక్కడ నన్నోక్కడినే ఒదిలేసి బిల్ కట్టకుండా వెళ్ళిపోతున్నావేంటి ప్రియాంక. కం బ్యాక్.”

“ఇంకా నీకు కూడా అర్థం కాలేదా బాబూ. నువ్వు చెప్పినదే, ఎకనమిక్స్ ఆఫ్ పోలిటిక్స్. బిల్ పే చేసి వచ్చేయ్, బాయ్”

***

“ఓహ్ సిద్ధూ, చాలా కాలం తరువాత ఫోన్ చేసావే నా నెంబర్ ఎలా దొరికింది. ఏషియన్ కాలేజీ తరువాత మనం మళ్ళీ ఇప్పుడే మాట్లాడుకుంటునట్లు ఉన్నాం.” అడిగాడు అవతలి వ్యక్తి.

“ఎన్ని రోజులయితే ఏమైంది గణేష్. మనం, మనం ఏదోక విధంగా ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళమే కదా” అన్నాడు సిద్ధార్థ.

తనిప్పుడు విశాఖపట్నంలోని గెస్ట్ హౌసులో ఉన్నాడు, ప్రియాంక కూడా అక్కడే అతనితో ఉంది. ప్రస్తుతం ప్రసాద్ గారు, సిద్ధార్థ ఆమెకు పార్టీకి సంబంధించిన వివిధ వర్గాలను పరిచయం చేస్తున్నారు. ఆమె కూడా చాలా చురుకుగా అన్ని నియోజకవర్గాలనూ సందర్శిస్తూ, తనకు తెలిసినవే అయినా అక్కడ ప్రజల స్థితిగతులనూ, జీవనవిధానాలనూ పరిశీలిస్తూ పార్టీ కార్యనిర్వహణలో కూడా పాలుపంచుకుంటోంది.

గత వారంరోజులుగా సిద్ధూ, వీరిద్దరూ ఇదే పనులమీద చాలా హడావిడిగా నిమిషం కూడా తీరిక లేకుండా తిరుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత వరకూ నమ్మకం ఉంది, అసంతృప్తి ఎంతవరకూ ఉంది, ఒకవేళ ఉంటే కనుక అందులో నిజానిజాలేమిటి తదితర అంశాలలో సాధ్యమైనంతవరకూ అవగాహన తెచ్చుకోగలిగింది. అవసరమైన చోట సర్వేలు నిర్వహించడంలో ఆమెకు తెలీకుండా సిధ్ధార్థ బ్యాక్ ఎండ్ మీడియా సహాయం తీసుకున్నాడు.

“ఓహ్ అయినా మనమిప్పుడు వేరువేరు పక్షాలలో ఉన్నవారం కదా. అందులోనూ నీకు నాతో కన్నా రాహుల్ తోనే ఎక్కువ పరిచయం కదా అతనికి కాల్ చెయ్యకుండా నాకు చేశావేంటి” అడిగాడు గణేష్. కాలేజీలో చదువు పూర్తయ్యిన దగ్గర నుంచీ అతను రాహుల్ తోనే ఉండి, రాహుల్ తండ్రి పార్టీకి తల్లో నాలుకలా వ్యవహరిస్తున్నాడు.

“మనది పార్టీలకి అతీతమైన ఫ్రెండ్షిప్ కదా గణేష్. అందులోనూ నువ్విప్పుడు కాబోయే ముఖ్యమంత్రికి ఆంతరంగిక అనుచరుడివి. ఆయన్ని కలుసుకోవాలంటే ఫస్ట్ నీద్వారానే కదా అప్‌రోచ్ అవ్వాలి.” చిన్నగా నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ.

“అరెరే ఎంత మాట, తన తండ్రి జోగేశ్వరరావు లాంటి రాజకీయ దురంధరుడు ఉండగానే, దానికింకా చాలా టైం ఉంది సిద్ధూ. నువ్విలా అన్నావని రాహుల్ కి తెలిస్తే కొద్దిగా హర్ట్ అవుతాడు.” చెప్పాడు గణేష్.

“ఇంతకీ విషయం ఏంటో క్లియర్ గా చెప్పు” మళ్ళీ తనే అన్నాడు.

“ఏమీ లేదు, నీకున్నట్లే నాకు కూడా ఒక ఆంతరంగిక మిత్రులు ఉన్నారు. ఆ మిత్రులకీ, నీ మిత్రునకీ కలిపి ఒక ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేద్దామని. చాలా రోజులనుంచీ రాహుల్‌ని రీచవ్వడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అతను ఈ మధ్యలో బిజీ అయిపోయినట్లు ఉన్నారు. తరచుగా ఢిల్లీ కూడా వెళ్ళొస్తున్నట్లు ఉన్నారు. అందుకే నువ్వు నాకీ సహాయం చేసిపెట్టాలి” కొద్దిగా అభ్యర్ధిస్తున్నట్లుగా అడిగాడు సిద్ధూ.

“ఇంతకీ ఎవరో ఆ ఆంతరంగిక మిత్రులు” అడిగాడు గణేష్.

“ఇంకెవరు మన ప్రియతమ ప్రతిపక్ష నేత నకునారెడ్డి గారి కుమార్తె ప్రియాంక.” మెల్లిగా చెప్పాడు సిద్ధూ.

“నువ్వు నిజమే చెప్తున్నావా.” కొద్దిగా అనుమానంగానే అడిగాడు గణేష్.

 “ఏం, నీకెందుకా ఆ డౌట్.”

“ఆఁ ఏమీ లేదు. వారిద్దరికీ మధ్య సమావేశానికి ఎవరి రాయభారాలు అవసరం లేదని నా అభిప్రాయం” చెప్పాడు గణేష్.

“అంటే” అర్థం కానట్లుగా అడిగాడు సిద్ధార్థ

“కమాన్ బాస్. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కాలేజ్ టైం లోనే ఈ విషయం అందరికీ తెలుసు. నీకు ఆంతరంగిక స్నేహితురాలని నువ్వే చెప్పావు, అలాంటిది నీకే ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది.”

“మరీ విషయం నీకెలా తెలుసు” అడిగాడు సిద్ధూ.

“ఇందులో తెలియడానికి ఏముంది, ఇద్దరివీ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ కదా, వారి పేరెంట్స్ కూడా ఒకే ఊరివారు. ఇద్దరిదీ ఒకరిని మించిన అందం మరొకరిది. ఇన్ని కలిసినప్పుడు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ అని నీకెవరైనా ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి” చాలా తేలికగా ఆ విషయాన్ని తేల్చిపడేసాడు గణేష్.

“ఏమో నాకైతే ఈ విషయం గురించి పెద్దగా ఐడియా లేదు. అంతేకాకుండా ప్రియాంకను చూస్తే నాకెప్పుడూ ప్రేమలో ఉన్నట్లు అనిపించలేదు. ఎనీవే అది పక్కనపెడితే కనుక నేను ఈ మీటింగ్ అరేంజ్ చేస్తున్నట్లు ప్రియాంకకు ఇంకా చెప్పలేదు. కాబట్టి నువ్వు ఇదొక అఫీషియల్ మీటింగ్ లాగ అనుకుని, ఒక ఇంపార్టెంట్ గెస్ట్ కింద రాహుల్‌తో అప్పాయింట్మెంట్ తీసుకోమని నా కోరిక” అడిగాడు సిద్ధార్థ.

“తప్పకుండా బ్రదర్ నువ్వంతగా అడగనవసరం లేదు. మేము జరపబోయే నాయుడుపల్లి బహిరంగ సభ పనుల్లో రాహుల్ నేను ఇద్దరం బిజీగానే ఉన్నాం. అయినప్పటికీ ప్రియాంక, రాహుల్ కలుసుకోవడానికి అఫీషియల్ మీట్ ఏర్పాటు చేస్తాను. అయినా అధికార పక్షాన్ని ప్రతిపక్షం కలవడం, మాట్లాడడం చాలా చారిత్రాత్మకంగా ఉంది. విశేషం ఏమై ఉంటుందో ఆలోచించడానికే ఆసక్తిగా ఉంది” సంబరపడుతూ అన్నాడు గణేష్.

“ఆఁ ఇంకో విషయం గణేష్, ఈ మీటింగ్ ను మనం పార్టీకి సంబంధించిన మీటింగ్ కింద అనుకోకుండా ఉంటే బెటర్ లేదంటే ఇది అనవసరమైన విషయాలకు దారితీస్తుంది” చెప్పాడు సిద్ధార్థ్.

“ఓకే ఓకే చెప్పావు కదూ, ఆంతరంగిక సమావేశం అని. డెఫినెట్‌గా ఈ విషయం మా ఫ్రెండ్స్ షేర్ చేసుకోవాల్సింది. గతంలో కాలేజీలో ఉన్నప్పుడు ప్రియాంకను చూపింది మేము రాహుల్‌ను ఇలాగే ఏడిపించేవాళ్ళం. సరే నేను రాహుల్‌తో మాట్లాడి ఫిక్స్ చేస్తాను. మా సెక్రెటరీ మీకు డీటెయిల్స్ మెయిల్ చేస్తుంది” అని చెప్పాడు. అ తరువాత కాల్ డిస్కనెక్ట్ చేసాడు

***

“సార్ ఈ రోజుకి లాస్ట్ అపాయింట్మెంట్ మిగిలిపోయింది “తన సెక్రెటరీ ఇంటర్‌కమ్‌లో చెప్పింది.

“అబ్బా ఈ మధ్య ఈ గణేష్ గాడు రోజుకి వందల వందల అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. ఏం చేస్తాం ప్రజాసేవ అని దిగిన తరువాత తప్పుతుందా” అని తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు.

“వారిని లోపలి పంపించండి మేడం” అని తన సమాధానం కోసం ఎదురు చూస్తున్న సెక్రెటరీతో చెప్పి రివాల్వింగ్ చైర్లో రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాడు రాహుల్.

“నమస్తే యువనేత రాహుల్ గారూ” తనకు పరిచయమైన గొంతు వినబడేసరికి ఒక్కసారిగా కుర్చీలో అలర్ట్‌గా కూర్చుని వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు రాహుల్.

“ప్రియాంకా నువ్వా. ఏంటి నన్ను కలవడానికి అప్పాయింట్మెంట్ తీసుకున్నావా? అసలు అంకుల్‌కి సుస్తీ చేసిన దగ్గర నుండీ కనీసం వచ్చి కలవనైనా కలవలేదు. ఈ సడెన్ సర్‌ప్రైజ్ ఏంటి?” ఆమెను నిలదీస్తున్నట్లుగా అడిగాడు రాహుల్. చాలా కలం తరువాత ఆమెను కలుసుకోవడం అతనికి ఆనందంగా ఉంది.

“అసలు ఇక్కడికి వచ్చేవరకూ నాక్కూడా తెలీదు, నిన్నే కలుసుకోవడానికి సిద్ధూ మీటింగ్ అరేంజ్ చేసాడని, అయితే నేను విశాఖపట్నం రావడానికి మాత్రం కొంతవరకూ కారణం నువ్వే అని గ్రహించాను” చెప్పింది ప్రియాంక.

“వచ్చావు బాగానే ఉంది, డైరెక్ట్‌గా ఫోన్ చెయ్యకుండా ఈ మీటింగ్లూ అవీ ఏంటి. ఐ థింక్ వీ షుడ్ క్యాన్సిల్ దిస్ రైట్ నౌ అండ్ గో ఫర్ ఏ డిన్నర్” అన్నాడు రాహుల్.

“ఏం చేస్తాం బాబూ, తండ్రిగారు విదేశీ పర్యటనలో ఉంటే తనయుడు పార్టీ బాధ్యతనంతా భుజాన వేసుకుని సమర్ధవంతంగా అన్ని పనులూ ఒక్కడే చేస్తుంటే, ఇంకా ఇతరులను కలిసే తీరిక ఎక్కడుంది. నాకిప్పుడు అర్ధమైంది సిద్ధూ అదే విషయం నీ గురించి పదేపదే చెప్తూ నీతో మాట్లాడమంటే ఏంటో అనుకున్నాను. నాకిప్పుడు పూర్తిగా అర్ధమయ్యింది” ఆఫీస్ కిటికీలో నుండి క్రింద ట్రాఫిక్‌ను చూస్తూ చెప్పింది ప్రియాంక.

 “ఏ విషయం” అర్థం కానట్లుగా అడిగాడు రాహుల్.

“ఏంటి డిన్నర్‌కి తీసుకెళ్తాను అన్నావ్. ఇక్కడే మాట్లాడుకుందామా చెప్పు” అతని వంక చూసి కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది ప్రియాంక.

“అయ్యో సారీ. కం లెట్స్ గో” అని ఆమెకు ఆమెకు చెయ్యందించాడు. ఆమె మొహమాటపడకుండా అతని చెయ్యి పట్టుకుని ఆఫీస్ రూమ్ వెలుపలకి వచ్చింది. సెక్రెటరీ వీరిద్దరినీ చూసి ముసిముసిగా నవ్వుకుంది. ఆమెకు రెస్టారెంట్‌లో సీట్స్ బుక్ చెయ్యమని చెప్పి బయటకు నడిచాడు రాహుల్. చిన్నగా నవ్వుతూ అతడిని అనుసరించింది ప్రియాంక. పది నిమిషాల్లో వారిద్దరూ కూర్చునున్న కార్ సిటీలోని ఫైవ్ స్టర్ హోటల్స్‌లో ఒకటైన ‘ఫోర్ పాయింట్స్’  వైపు పరుగులు తీసింది.

“సో అతనింకా నీతోనే ఉన్నాడన్నమాట” చాలాసేపటి తరువాత ఆమెతో అన్నాడు రాహుల్. అర్థం కానట్లుగా చూసింది ప్రియాంక. తన సెక్యూరిటీ వాళ్ళను ఈరోజుకి ఇంటికి వెళ్ళిపోమని చెప్పి తనంతట తానే కార్ డ్రైవ్ చేస్తున్నాడు రాహుల్.

“నీకు మీ పార్టీ వ్యవహారాల్లో ఉపయోగపడి నువ్వు ప్రెసిడెంట్ కావడానికి కారణమయ్యాడు కదా. అదే మన మ్యూచువల్ ఫ్రెండ్ సిద్ధార్థ్” కార్ ప్రశాంతంగా రోడ్ మీద వెళ్తోంది. ఆ రోజు ట్రాఫిక్ కూడా పెద్దగా లేకపోవడం వలన, నగరవీధులలో సునాయాసంగా పోనిస్తున్నాడు రాహుల్.

“అవును నాతోనే ఉన్నాడు, నిజం చెప్పాలంటే నాకన్నా ముందే డాడీ అతడిని పార్టీలోకి తీసుకుని కార్యనిర్వాహక బాధ్యతలు అప్పగించారు. ఏం నీకేమైనా ప్రోబ్లమా, లేదంటే జెలసీ లాంటిదేమైనా ఫీల్ అవుతున్నవా” అతనివంక చిలిపిగా చూస్తూ నవ్వుతూ అడిగింది ప్రియాంక.

“జెలసీయా నాకెందుకు ఉంటుంది. ఎనీవే అవి మీ పార్టీ అంతర్గత విషయాలు నాకెందుకు. నేను జస్ట్ క్యూరియాసిటీతో అడిగానంతే” చెప్పాడు రాహుల్. ఇంతలో వారిద్దరి మధ్యన సంభాషణకు అంతరాయం కలిగిస్తూ అతడి జేబులో సెల్‌ఫోన్ మోగింది. రాహుల్ ఒకసారి ఫోన్ తీసి అందులో ఉన్న నెంబర్ చూసి రోడ్ పక్కగా కార్ ఆపి, సెల్‌లో మాట్లాడడం ప్రారంభించాడు.

“ఆ చెప్పండి మేడం” అతడీమాట అనగానే కిటికీలోనుంచి పక్కన ట్రాఫిక్‌ను చూస్తున్న ప్రియాంక ఒక్కసారిగా ఇటు తిరిగి అతడినే ఆసక్తిగా గమనిస్తోంది.

“అయ్యో మీరు ప్రత్యేకంగా చెప్పాలా, డెఫినెట్‌గా మీకు సంబంధించిన వాళ్ళు అందరికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం, మీకు తెలుసు కదా డాడీ కూడా ఊళ్ళో లేరు. మీరేమి మాట్లాడాలో కూడా మనం డిస్కస్ చేద్దాం, ఆ లాండ్ అక్విజిషన్ విషయంలో మీరు చాలా హెల్ప్ చేసారు. మీరు సభకు రావడం చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది” అతడింకా మాట్లాడుతూనే ఉన్నాడు. అది రాహుల్ అధ్యక్షతన జరగబోయే సభ విషయం  అయ్యుంటుందని ఆమె గ్రహించగలిగింది. కొంతసమయం తరువాత అతను మాట్లాడడం ముగించి తిరిగి కార్ స్టార్ట్ చేసాడు.

“నాకిప్పుడొక విషయం అర్థమయ్యింది” సీరియస్‌గా చూస్తూ అన్నాడు రాహుల్.

 “ఏమిటది” అతనివంక ఆసక్తిగా చూస్తోంది.

“అసూయ ముందుపుట్టి ఆడది తరువాత పుట్టింది అంటారు కదా బహుశా అది నిజమేనేమో” తన నవ్వును ఆమె గమనించకుండా పక్కకి తిరిగి చెప్పాడు రాహుల్.

“ఎందుకనో” రెట్టించింది ప్రియాంక.

“ఎందుకేమిటి ఇందాక నేను గమనించలేదు అనుకున్నావా. ‘చెప్పండి మేడం’ అని నేను ఫోనులో అన్న వెంటనే అటెటో చూస్తున్న నువ్వు సడెన్‌గా నా వైపు తిరగడం” ఆమె వైపు తిరిగి సన్నగా నవ్వుతూ అన్నాడు అన్నాడు రాహుల్.

“ఒహో అలాగా, అయితే ఆడది పుట్టడానికన్నా ముందు మగాడు పుడతాడు కాబట్టి మగాడికి రెట్టింపు అసూయ ఉండి ఉంటుంది” తను కూడా అంతేధాటిగా మాట్లాడింది ప్రియాంక

“ఏంటి మగాడు ముందు పుట్టాడా. ఈ విషయం నేనెక్కడా వినలేదే” అయోమయంగా చూస్తూ అన్నాడు రాహుల్.

“బుకాయించకు, నువ్వు సిద్ధార్థ గురించి అడిగావా లేదా? అయినా ఎక్కడైనా చెట్టు ముందా, విత్తు ముందా, కోడి ముందా గుడ్డు ముందా ఇలాంటి డైలమా వచ్చింది కనీ ఆడది ముందా మగాడు ముందా అని ఎవరూ అలోచించి ఉండరు. నీకింకా ఇన్ఫర్మేషన్ కావాలంటే తీరిక టైములో డార్విన్ థియరీస్ చదువుకో కొంచెం. ఖచ్చితంగా మగాడే ముందు పుట్టి ఉంటాడు” గట్టిగా సమాధానం చెప్పింది ప్రియాంక. తను చెప్పినదానికి కిలకిలమని నవ్వాడు రాహుల్.

ఆమెకు ఆ నవ్వు చాలా మనోహరంగా అనిపించింది. ఇంతలో వారు చేరుకోవాల్సిన స్థానం వచ్చేటప్పటికి వారిమధ్య మాటలు తాత్కాలికంగా ఆగాయి. తను బయల్దేరే ముందరే సెక్రెటరీకి టేబుల్ రిజర్వ్ చేసి ఉంచమని చెప్పడంతో వారికి ఎంట్రన్స్ దగ్గర ఆ సంస్థ చీఫ్ మేనేజర్ స్వాగతం పలికాడు. ఇది ప్రైవేట్ విజిట్ కావడంతో పెద్దగా అర్భాటాలేమీ లేకుండా చూడవలసిందిగా సెక్రెటరీకి మరీ మరీ చెప్పాడు రాహుల్. మేనేజర్ చాలా మర్యాదతో వారిద్దరినీ తీసుకుని ఒకచోట కూర్చోపెట్టి ఆర్డర్ తానే స్వయంగా అరేంజ్ చేస్తానని బాగా బలవంతపెట్టి అక్కడనుంచి వెళ్ళాడు.

“సరే ఇందాకా నువ్వు చెప్పినది ఆర్గ్యుమెంట్ కోసం బాగానే ఉన్నప్పటికీ కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఏదేమైనా నువ్వు సడెన్‌గా నన్ను విజిట్ చెయ్యడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. అసలు ఈ మధ్యకాలంలో ఇంత ఫ్రీగా, ఓపెన్‌గా మాట్లాడనే లేదు. నాకు తెలిసి నువ్వు నన్ను కలుసుకోవడం వెనుక ఎదో ప్రత్యేకమైన కారణం ఉంది ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్‌లో లాస్ట్ టైం మీ ఫ్రెండ్‌తో కలిసినప్పటి నుంచీ ఇప్పటికి చాలా కాలం అయ్యి ఉంటుంది.

ఆ తరువాత కూడా ఎగ్జామ్స్ అన్నీ అయ్యిన తరువాత మనం పెర్మనెంట్‌గా హైదరాబాద్ వచ్చి  దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతోంది. ఈ మధ్యలో ఎవరి బిజీలో వారున్నాము. నువ్వు కూడా మీ పార్టీలో ఆక్టివ్‌గా ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఒకరి ఉనికి ఒకరు మర్చిపోయినప్పటికీ ఇద్దరం మనకు తెలీకుండానే ఒకరి గురించి ఒకరికి తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ అంత సమయంలో ఒక్కసారి కూడా మాట్లాడని నువ్వు ఇప్పుడిలా కలవడం ఆశ్చర్యకరం కాదంటావా. అందుకే విషయం ఏంటో డైరెక్ట్‌గా చెప్పు” సూటిగా అడిగాడు.

ఒక్కసారిగా అతనీ విషయం అడిగేప్పటికి ఉలిక్కిపడింది ప్రియాంక. తనని ఇప్పటివరకూ చలాకీగా నవ్వించిన వ్యక్తితోనేనా తానిప్పుడు మాట్లాడుతోంది అని ఆమెకు అనుమానం కలిగింది. తానిప్పుడు రాహుల్‌ని కలవడానికి ఎందుకు వచ్చానా అని ఆమెకు జ్ఞాపకం వచ్చింది. సిద్ధార్థ తనకి రాహుల్ మీద జరగబోయే అటాక్ గురించి పదేపదే చెప్పి రాహుల్ ను హెచ్చరించమని కోరడం తనకి తెలిసింది.

“మీరు రేపు జరబోయే సభలో నీ మీద కొన్ని అరాచక శక్తులు దాడి చేసే అవకాశం ఉందని నాకు కొంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లభించింది” ఆమె ఈ మాట అనడంతో మంచినీళ్ళు తాగుతున్న రాహుల్‌కి ఒక్కసారిగా పొలమారింది. కొంచెం సర్దుకున్నాక అతను ప్రియాంకవైపు  చూసాడు.

“అవును, నిజమే రాహుల్. మీరు వ్యర్ధనిర్వహణ ప్లాంట్ నిర్మించే స్థలంలో అత్యంత అరుదైన వనాలు నశించిపోతున్నాయి, దానితోపాటుగా ఉంటూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్న గిరిజనులు తమ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉందని, కొన్ని శ్రామికవర్గాలు వాళ్ళతో చేరి మీ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చెయ్యడానికి చూస్తున్నారు. ఈ గ్రూప్‌ని లీడ్ చేస్తున్నది ఎవరో తెలుసా విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ ఆదిత్యనారాయణ గారు” కొద్దిగా ఆగి ఆమె అతనివైపు చూసింది, అతని ముఖం కొద్దిగా ఎర్రబడడం ఆమె గమనించింది.

“ఈ ప్రొటెస్టులు ఎప్పుడూ ఉండేవే ప్రియాంక. గడచిన కాలంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇటువంటి వ్యతిరేకతను ఎదుర్కోకుండా పనిచెయ్యలేదు. అసలు ఒకొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రశాంతమైన జీవితం గడపాలని ప్రజలకుండదో లేదా ప్రజానాయకులకు ఉండదో, నిత్యం ఏదో ఒక అసంతృప్తి రగులుతూనే ఉంటుంది.

ప్రభుత్వం ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న దేశంలోనే మొట్టమొదటి కావడం మన రాష్ట్రానికే గర్వ కారణం. ఇందువల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమంది ఉపాధి పొందుతున్నారో వీరికి అర్థం కాదా.

ఎంతసేపూ బూజుపట్టిన ఎందుకూ పనికిరాని సిద్ధాంతాలు వల్లిస్తూ నినాదాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం తప్ప, వీరి అసంతృప్తికి లోనుకాని ప్రభుత్వం భారతజాతిలోనే ఎక్కడా లేదేమో. నన్నడిగితే కమ్యునిస్టులకు ఇంకొక యుగం గడచినా ఇండియా లాంటి డెమోక్రాటిక్ గవర్నమెంట్‌లో స్థానం ఉండదు” కొద్దిగా ఆవేశపడుతూ అన్నాడు రాహుల్. అతను అన్నదానికి ఏ విధంగా స్పందించాలో ఆమెకు అర్థం కాలేదు.

“కూల్ డౌన్ రాహుల్ ఇవి చాల సెన్సిటివ్ ఇష్యూస్. వీటిని మనం ఆవేశంతో పరిష్కరించలేము. అయినా ఏ ఐడియాలజీ అయినా ఒకరికన్నా ఎక్కువమందిని నమ్ముతున్నారు అంటే అందులో కనీసం ఒక్కశాతం అయినా నిజం ఉండకపోదు, ఒక్కశాతమైనా వంద శాతమైనా నిజానికి ఎప్పుడూ ప్రాముఖ్యత ఉంటుంది.

కమ్యూనిజంపైన ఆధారపడి కొన్ని దేశాలే తమ చరిత్రను నిర్మించుకున్నాయి, ఆచరణలో లోపం తప్పితే ఆలోచనలో ఎప్పుడూ లోపం ఉండదు. కమ్యూనిజం కూడా ఒక ఐడియాలజీనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినవారికి అది ఉపయోగపడుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దీనిగురించి ఆలోచించు, నేను చెప్పడం కన్నా ఈ విషయం పైన నువ్వు తెలుసుకుంటే నీ అంతట నీకు భారత దేశంలోనే ఎక్కువ ఉదాహరణలు దొరుకుతాయి.

అయినా మీ ప్రభుత్వం కూడా ఏమి చేస్తోంది గిరిజనులు, సామాన్య ప్రజలు, పేదా గొప్పా అని తేడా లేకుండా అభివృద్ధి పట్టణీకరణ పేరుతో లబ్దిదారుల దగ్గర ఉన్న స్థలాన్ని ఏదో పేరుతో స్వాధీనపరుచుకోవడం లేదూ. దీనికి నీ సమాధానం ఏంటి” సూటిగా అడిగింది ప్రియాంక. ఆమె ఈ విధంగా మాట్లాడుతుందని అతను అస్సలు ఊహించలేదు. అందుకే అతని ముఖం ఇంకా ఎర్రబడింది. అయితే అతను తన ముఖకవళికలు ఆమె గుర్తించకుండా జాగ్రత్తపడుతున్నాడు.

“అంటే నువ్వొక కమ్యూనిస్టువా. అయినా నాకు తెలియక అడుగుతాను ప్రియాంకా నువ్విక్కడికి అస్సలు ఎందుకొచ్చావు నాతో కలిసి మాట్లాడడానికా, లేదా ప్రభుత్వ విధానాలపై నన్ను ప్రశ్నించడానికి వచ్చావా. ఒక్కటి చెప్తున్నాను గుర్తుంచుకో ఒక మహాకార్యం ప్రజాహితార్ధం చేపట్టి విజయవంతం చెయ్యాలి అంటే, ఎన్నో త్యాగాలూ, ఎంతో ఓర్పు అవసరం.అయినా మీకీ విషయం ఎలా అర్థం అవుతుంది ఎంతైనా ఇప్పుడు మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నవారు కదా ఎప్పుడూ విమర్శనాత్మకంగానే మాట్లాడతారు” తనలో ఉన్న కోపాన్ని అతడు ఆమెపై ఆ విధంగా ప్రదర్శించాడు.

ఆ మాటలకు ఆమె దెబ్బతిన్నట్లుగా చూసింది, అతను ఆ చూపులు పట్టనట్లుగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు.

 “ఒక సిద్ధాంతంపై నమ్మకం ఏర్పడాలి అంటే నిజానిజాలు గ్రహించగలిగే జ్ఞానం ఉంటే చాలు ఆచరణలో పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు రాహుల్. ప్రజల హితం నీతోపాటు నాకు కూడా అవసరం. ఎందుకంటే నీ మాటల ప్రకారం ఇప్పుడు నేను కూడా సామాన్య ప్రజల్లో ఒకరిని కదా.

అందుకే నీ మంచి కోరి ప్రజల మంచి కోరి చెపుతున్నాను నువ్వీ బహిరంగ సభకు హాజరు కావాలనే ఆలోచన మానుకుంటే మంచిది. నీ మీద దాడి జరపడానికి ఇండస్ట్రీయలిస్ట్ భూషణరావు కుమారుడు పెద్ద ఎత్తున పన్నాగం పన్నుతున్నాడని మాకు తెలిసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే గుంపులో అసాంఘిక శక్తుల ద్వారా విధ్వంసం సృష్టించాలి అని వాళ్ళ యోచన. ఈ వీడియో ఒకసారి చూడు” సుదర్శన్ తనకు చూపించిన వీడియోలతోపాటు అతనే కొత్తగా ప్రతాప్‌పై ఉంచిన నిఘా సంబంధించిన వివరాలు కూడా రాహుల్ ముందుంచింది ప్రియాంక.

ఆ వీడియో చూస్తున్నంత సేపూ రాహుల్ ముఖకవళికలు గమనించింది. “ఓ మై గాడ్. ఎంత దారుణం, నామీదే ఇన్ని కుట్రలు పన్నుతారా. నాకు తెలిసి వరదరాజన్ గారి మృతికి కూడా వీరే బాధ్యులయ్యి ఉంటారు. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటారు. ఎటువంటి సంబంధం లేకుండా కేవలం నా రిక్వెస్ట్‌పై ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చిన ప్రొఫెసర్‌ను పొట్టనపెట్టుకున్నారు.

అందరికీ మంచి చెయ్యాలనే మా తండ్రి లక్ష్యాన్ని రాజకీయం చేసి నన్ను బలిచేయ్యడానికి చూస్తున్నారు. అసలు వీరికి కావలసింది ఏంటి. వీరి ఆగడాలకి అంతే లేదా. ప్రభుత్వ నిఘావర్గాలు కన్నుగప్పి ఇలాంటి ప్రయత్నాలు వారు చెయ్యగలుగుతున్నారు అంటే వాళ్లకి ఏయే పెద్దమనుషుల సపోర్ట్ ఉంది ఉంటుందో తలుచుకోవడానికే భయం వేస్తోంది” చివరిమాట అంటూ ఒక్కసారిగా అనుమానంగా ప్రియాంక వైపు చూసాడు రాహుల్.

“అంటే నీ మంచి కోరి చెప్పిన నన్నే అనుమానిస్తున్నావా? దానివల్ల నాకోచ్చే లాభం ఏంటని నువ్వనుకుంటున్నావ్. మనిద్దరం క్లాస్‌మేట్స్ అన్న విషయం మర్చిపోకు” కొంచెం ఇబ్బందిపడుతూ సమాధానం చెప్పింది ప్రియాంక.

 “నేను చెప్పేది నిజం కాకపోతే నీ దగ్గరకు ఈ వీడియో, ఈ ముఠా కార్యకలాపాల వివరాలు ఎలా వచ్చాయి. బహుశా నీ సోర్సెస్ నీకుండవచ్చు అలాగే నా అనుమానాలు కూడా నాకుండవచ్చు కదా. ఎంతైనా మా తండ్రిగారు అధికారంలో ఉన్నారు, అందరి కళ్ళూ మా మీదే ఉంటాయి. ఎనీవే నా మంచికోరి నాకీ విషయం చెప్పినందుకు చాలా థాంక్స్. కానీ ప్రజలందరి మంచి కోరుకునే నాకు ఇలాంటి పన్నాగాలు ఒక లెక్క కాదు.

 నా సెక్యూరిటీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నా ప్రాణాలు పోయినా నేను ఖాతరు చెయ్యను, ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం జనసమాజ్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఈ ప్రాజెక్ట్ ప్రజలకు ఎంతో అవసరం.ఆ అవసరాన్ని ప్రజలకు తెలియచేయ్యాలనే కంకణం కట్టుకున్న నేను ప్రజల్లో పుట్టాను. అవసరమైతే ప్రజల్లోనే పోతాను” ఉద్వేగంగా అన్నాడు రాహుల్. ఆ సమయంలో ఆమెకు రాహుల్‌లో పూర్తిగా పరిణతి చెందిన రాజకీయనాయకుడు కనిపించాడు.

ఇంక తనేమి చెప్పినా అతను వినే పరిస్థితిలో లేదని నిర్ణయించుకున్నాక ఆమె అతడిని అడిగింది “అది సరే ఇందాక ఫోన్‌లో నీతో మాట్లాడిన ఆ మేడం గారు ఎవరు” వాతావరణం తేలికపడినట్లుగా అనుకున్నాడు రాహుల్.

“ఛాయాదేవి. రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు. గత ఎన్నికల్లో పార్టీకి చాలా ఉపయోగపడ్డారు. ప్రస్తుతం సభకు ఆమె కూడా హాజరు అవుతున్నారు” చెప్పాడు రాహుల్.

(సశేషం)

Exit mobile version