[కాకర్ల రమణయ్య గారి ‘రాజు తలచుకొంటే..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“దండాలయ్యా.”
రెండు చక్రాల బండిదిగి శిరస్త్రాణం ఒక చేతిలోకి తీసుకుని, మరో చేతిలో సతీమణి మధ్యాహ్నం కొరకు పెట్టిన భోజనం డబ్బా ఉంచిన సంచి పట్టుకుని కార్యాలయము లోపలి అడుగు పెట్టబోతున్న భూమి కొలతల అధికారి శ్రీధర్ ఆ పలకరింపుతో తలెత్తి చూశాడు.
రెండు చేతులు జోడించి ఎదురుగా రాములమ్మ. ఆమెను చూడగానే అతని వదనం అప్రసన్నమయింది.
‘అబ్బా..! మళ్ళీ తయారయిందే..! ఎన్ని సార్లు చెప్పినా వదలని నీడలా వెంటాడుతూనే ఉంది.’ అని మనసులో అనుకుంటూ, తన్నుకొస్తున్న చిరాకును అణచుకుని, రాని చిరునవ్వును బలవంతాన ముఖాన పులుముకుని “దండాలు రాములమ్మ” అంటూ ప్రతి నమస్కారం చేసి, అక్కడ నిలబడకుండా ఆమె నుంచి తప్పించుకుని వడివడిగా తన గదివైపు అడుగులేశాడు.
అదేమీ పట్టించుకోకుండా అతన్ని అనుసరించింది రాములమ్మ.
రాములమ్మ వయసు యాభై పైనే ఉంటుంది. కాని చూడడానికి ఇంకో పదేళ్ళు ఎక్కువ వయసు ఉన్నట్లనిపిస్తుంది. కాయకష్టం చేసుకుని బ్రతికిన మనిషి. సరైన పోషణ లేక శుష్కించిన శరీరం. ఉతికి ఉతికి చీకుపట్టిన ముతక చీర కట్టుకుని, తైల సంస్కారం లేని జుట్టును ముడివేసుకుని దారిద్రానికి పెద్దమ్మలా ఉంది.
కట్టెలలాంటి చేతులను జోడించి దీనంగా శ్రీధర్ ఎదురుగా నిలబడింది. ఆమెను అలా చూడగానే శ్రీధర్‌కు కోపం తన్నుకొచ్చింది. చికాకు ఎక్కువైంది. అన్నిటిని అదుపు చేసుకుంటూ,
“రాములమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ‘ఇపుడేమి అవకాశం లేదు. అవకాశం ఉన్నప్పుడు తప్పక చెప్తాను’ అని చెప్పాను కదా. ఎందుకు నువ్వు ఊరక తిరగడం..” ఎంత అదుపు చేసుకున్నా అసహనంతో అతని మాటలు కఠినంగానే వచ్చాయి.
“కోపగించుకోకయ్యా..! దిక్కులేని దాన్ని, నా గోడు మీలాంటి ధర్మ పెబువులు కాకుంటే ఇంకెవరు ఇంటారు. మొన్న వర్సానికి మురికికాలవ పొంగి గుడిసేలోకి నీరొత్తదేమో అని రాత్రంతా కంటిమీద కునుకు లేదు. మున్సిపాలిటి వోల్లు కాలి చేయమంటున్రు. నీ దయ అయ్యా..! కనిపిత్తే అయినా గుర్తొస్తదని ఇటోచ్చినా..” దీనంగా ముఖంపెట్టి ప్రాధేయ పూర్వకంగా అన్నది.
“సరే, సరే నీవెళ్ళు నాకు చాలా పని ఉంది.” ఆ రోజు విధులు మొదలు పెట్టడానికి ఉద్యుక్తుడవుతూ, భావ రహితంగా చూస్తూ, విసుగ్గా అన్నాడు.
నిజానికి రాములమ్మకు సహాయం చేయాలని ఉన్నా సహాయం చేయలేని అశక్తత. చెప్పిందే చెప్పాల్సి రావడం, పలుమార్లు ఎదురు పడడంతో, ఆమెకు సమాధానం చెప్పలేని నిస్సహాయతే కోపంగా పరిణమిస్తుంది.
“ఏమిటి సర్ రాములమ్మ నస.. నెలల తరబడి ఇక్కడే తిరుగుతుంది. అయ్యే పనేనా..?” ఆరాగా అడుగుతూ గది లోపలికొచ్చాడు గుమస్తా ఏడుకొండలు.
“ఏముంది కొండలు..! రాములమ్మకు ఇంటి స్థలం కావాలి. నియోజక వర్గ ప్రధాన కేంద్రం, మున్సిపాలిటీ పరిది అయిన ఇక్కడ అంకణం రేటు ఎంత ఉందో నీకు తెలియదా. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంచారని..! ఎపుడో బడా బాబులు ఆక్రమించి అంతస్తులు లేపారని తెలియని అమాయకురాలు. నా చుట్టూ తిరిగితే మాత్రం నేను ఎక్కడినుంచి తీసుకురావాలి. ఏదైనా స్థలం ఉన్నా ఊరి బయట ఆమడ దూరంలో ఉంటాయి. వాటికి స్థానిక నాయకుల సిఫారసు ఉండాలి. ఒకటీ అరా పట్టాలు ఇవ్వడానికి కుదరదు. ఎక్కువమంది లబ్దిదారులను గుర్తించాలి. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందాలి. ఆ తరవాత జాబితా తయారు చేయాలి. అది స్థానిక నాయకుల ఆమోదం పొందాలి. అంతా సిద్ధమయ్యాక వీళ్ళు మా పార్టీకి ఓటు వేయలేదు. వీళ్ళకు ఇవ్వడానికి లేదని కొర్రీలు, ఎన్నో మతలబులు ఉన్నాయి. ఈ పిచ్చి మాలోకం అమాయకంగా బెత్తెడు స్థలం ఇవ్వక పోతామా అని, కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది. నా చేతిలో ఏమి లేదని చెప్పినా తెలుసుకోలేదు.. తిరగొద్దు అని చెప్పినా ఆశ చావక తిరుగుతూనే ఉంది..” తన నిస్సహాయతను వెలిబుచ్చాడు శ్రీధర్.
“మనమే అలా అంటే అలాంటి వారికి ఇక దిక్కెవరు సర్.” సానుభూతిగా అన్నాడు ఏడుకొండలు.
“ప్రభుత్వ నిర్ణయాలు అలానే ఉంటాయి కొండలు. నిజానికి రాములమ్మ ముమ్మాటికి స్థలం పొందడానికి అర్హురాలు. మురికి కాలవ పక్కన చిన్న గుడిసె వేసుకుని ఒంటరిగా బ్రతుకీడుస్తుంది. గత ఆర్నెల్ల నుంచి నన్ను అడుగుతూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. ఖాళీ ప్రభుత్వ భూములు లేవు. గ్రామ రెవిన్యూ అధికారిని కూడా విచారించాను తనూ లేవనే చెప్పాడు. గతంలో ఇచ్చిన పట్టాల మద్యలో ఏవైనా ఖాళీలు ఉన్నాయోమోనని విచారిస్తే బడి, గుడి, ఆట స్థలాలకు కేటాయించిన స్థలాలకు కూడా పట్టాలు పుట్టించి అమ్మేసుకుని ఉన్నారు ప్రబుద్దులు. ఇలాంటి వెన్నో గమ్మత్తులు చూస్తున్నాము. చివరికి వాగులు స్మశానాలను కూడా వదలకుండా ఉన్నారు.” తన ఆవేదనను వెళ్లగ్రక్కాడు శ్రీధర్.
“అవకాశం ఉన్నంతలో సహాయం చేయండి సర్..” అంటూ తన గదివైపు కదిలాడు ఏడుకొండలు.
మండల స్థాయి ఉద్యోగం వెలగ పెడుతూ అనామకురాలికి సెంటు స్థలం చూపించలేక పోతున్నాననే భావనే ఆవేదనకు గురిచేస్తుంది. ఆలోచనలు బరువెక్కాయి. నిర్లిప్తంతో కూడిన శుష్క మందహాసం అతని మోముపై మొలిచింది.
***
“సర్వేయర్ గారు, వెంటనే అధికార పార్టీ కార్యాలయానికి ముప్పైసెంట్లు స్థలం కావాలి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల నకలు ఇదిగో” అంటూ నకలును చేతికిస్తూ,
“నియోజక వర్గ శాసన సభ్యులు స్వయంగా చెప్పారు. నిర్లక్ష్యం చేయకుండా అతి త్వరగా చూడాలి.” తీవ్రతను గుర్తు చేశారు తహశీల్దార్ గారు.
“ఖాళీ స్థలాలా..! అవెక్కడ ఉన్నాయి సర్? దస్త్రాలు అన్నీ చూస్తూనే ఉన్నాను ఖాళీ స్థలాలు ఉన్న దాఖలాలు ఏమీ లేవు.” నెమ్మదిగా చెప్పినా స్పష్టంగా చెప్పాడు శ్రీధర్.
“అలా అంటే ఎలా సర్వేయర్ గారు? అక్కడ చెప్పింది స్వయాన శాసన సభ్యులు. గ్రామ రెవిన్యూ అధికారిని పిలుచుకుని దస్త్రాలన్ని వడపోయండి. ఆలశ్యం చేయకుండా వెంటనే కార్యరంగంలోకి దిగండి.. సార్ మళ్ళీ అడిగే దాకా ఉండకుండా మనమే వెళ్లి వారికి స్థలం వివరాలు చెప్పాలి.” హడావిడి చేశారు తహశీల్దార్ గారు.
కిక్కురుమనకుండా ఆ కాగితాన్ని తీసుకుని తన గదివైపు అడుగులేశాడు శ్రీధర్.
***
బల్లనిండా దస్త్రాలను పరిచి రెండు గంటల నుంచి కుస్తీపడుతున్నారు సర్వే అధికారి శ్రీధర్, గ్రామాధికారి శివ. ఆ పూట అన్ని పనులు పక్కన పెట్టి వారిరువురు అదే పనిమీద పూర్తి సమయం కేటాయించారు. పోరంబోకు భూములు ఇవ్వడానికి కుదరదు కాబట్టి గయాలు భూములు కావాలి. ప్రభుత్వ భూములు ఖాళీగా ఉండే పరిస్థితి ఉండదు. కానీ.., వారు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అడిగిన వారు స్వయాన నియోజకవర్గ శాసన సభ్యులు మరి. పార్టీ కార్యాలయం ప్రధాన రహదారికి ఆనుకుని ఉండాలి. లోపలెక్కడో ఉంటే కుదరదు. శాసన సభ్యులు నచ్చక పోవచ్చు. ఎన్నో విధాలుగా తలపోస్తూ ప్రతి దస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, తలమునకలు అవుతున్నారు. సుమారు ఒక పూట పూర్తిగా కేటాయించినా ఎలాంటి భూమిని గుర్తించలేక పోయారు.
“శివ గారు ఇక లాభం లేదు తహశీల్దార్ గారికి చెప్పేద్దాం.” ముఖానికి పట్టిన చిరు చెమటను రుమాలుతో తుడుచుకుంటూ, పట్టేసిన నడుమును సవరించుకొంటూ నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు శ్రీధర్..
“ఏదైనా సర్వే నెంబర్‌ను గుర్తించారా?” మొహాలు వేలాడేసుకుని ఎదురుగా నిల్చోన్న శ్రీధర్, శివల వైపు పరిశీలనగా చూస్తూ అడిగారు తహశీల్దార్ గారు. ఇద్దరూ ఒకేసారి అడ్డంగా తలఊపారు లేదన్నట్లు.
అంత నింపాదిగా సమాధానం చెప్తున్న వారిరువురిపై విపరీతమైన కోపం ముంచుకొచ్చినా, ఆయన అనుభవం వివేకాన్ని మేల్కొల్పింది. కోపాన్నిఅదుపులో పెట్టుకుంటూ దీర్ఘాలోచనలో మునిగిపోయారు. కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నారు. ఏదో గుర్తొచ్చినట్లు టక్కున కళ్ళు తెరిచి పక్కనే ఉన్న కంప్యుటర్ సహాయకుడి వైపు తిరిగి,
“అసైన్మెంట్ బదిలీ అయిన భూములను స్వాదీనం చేసుకోవడానికి సంయుక్త కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వు నకలు ఇవ్వు..” అని అడిగారు.
కంప్యుటర్ సహాయకుడు ఇచ్చిన నకలు వారివైపు నెడుతూ “ఇందులో చూడండి. ఏదోకటి పనికి రావొచ్చు.” అన్నారు తహశీల్దార్ గారు, గుండెల మీదనుంచి కొంత భారం తగ్గినట్లు అనుభూతి నొందుతూ..!
***
“నాలుగు మూలలా జెండాలు పాతడం అయిపోయిందా సర్వేయర్ గారు. త్వరగా పూర్తి చేయించండి. సార్ వచ్చే సమయం కావస్తుంది.” హడావిడి చేశారు తహశీల్దార్ గారు.
“అదే సర్ చివరి జెండా.. పాతేస్తున్నారు.” అటువైపు చూపిస్తూ సమాధానం చెప్పాడు శ్రీధర్.
“సార్ వస్తారని నిన్న సాయంత్రమే మీకు చెప్పాను కదా, ఇప్పటిదాకా జెండాలు పాతకుండా ఉంటే ఎలా..?” కంగారు పడుతూ శ్రీధర్ పై ఇంతెత్తున లేచారు తహశీల్దార్ గారు. అంతలోనే సర్దుకుంటూ,
“సరే దస్త్రాలు, భూమి కొలతల పటం అన్నీ సిద్దంగా పెట్టుకుని సార్ అడిగిన దానికి సమాధానం చెప్పేలా సమాయత్తమయి ఉండండి.” అంటూ శ్రీధర్‌కు చెప్పి శాసనసభ్యులు వస్తున్నారేమో అని చూడడానికి హడావిడిగా పక్కన్నే ఉన్నజాతీయ రహదారి పైకి ఎక్కారు.
మరికొద్ది నిముషాలలో వేగంగా నాలుగైదు వాహనాలు వరుసగా వచ్చి కీచు శబ్దాలతో ఆగాయి. అందులో ఒక వాహనం నుంచి ఠీవిగా దిగారు స్థానిక శాసనసభ్యులు. మిగిలిన వాహనాలలోని మందీ మార్బలం బిలబిలా దిగి అయన చుట్టూ మూగారు. వ్యక్తిగత రక్షణ కొరకు నియమించబడిన రక్షకభటుడు చేతిలో ఆధునిక తుపాకితో పహారా కాస్తూ చుట్టూ గమనిస్తున్నాడు. అప్పటివరకు నిశబ్ధంగా ఉన్న వాతావరం సందడిగా తయారయింది.
తహశీల్దార్ గారు పరుగులాంటి నడకతో శాసనసభ్యులు దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టి, శ్రీధర్ వైపు చేతులూపుతూ ‘దస్త్రాలు త్వరగా తీసుకురా’ అన్నట్లు సంజ్ఞలు చేశారు.
పరుగులాంటి నడకతో వచ్చిన శ్రీధర్ భూమి కొలతల పటం చూపించి, నాలుగు హద్దులలో పాతిన జెండాలను చేయి చాపి చూపిస్తూ “ఆ నాలుగు జెండాల మధ్యలో ఉన్నది పూర్తి విస్తీర్ణం సర్” అని చెప్పాడు.
జాతీయ రహదారి పక్కన ఉండి పట్టణానికి అతి దగ్గరలో ఉన్న ఆ స్థలం శాసనసభ్యులు గారికి బాగా నచ్చి ఖుషి అయ్యారు. తహశీల్దార్ గారి వైపు తిరిగి “మంచిస్థలం చూపించారు, మిగిలిన ప్రక్రియ కూడా ఆలశ్యం కాకుండా పూర్తి చేయండి..” అని అభినందనగా చెప్పి వచ్చినంత వేగంగా తమ వాహనాలలో వెళ్ళిపోయారు. ఆ ప్రశంసకు తాహసీల్దార్ గారి మొహం వికసించింది.
అప్పటిదాకా ఊపిరి ఉగ్గబట్టుకుని ఉన్న శ్రీధర్ మరియు వారి సమూహం “హమ్మయ్య” అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తీరం నుంచి తుఫాను దాటిన భావం కలిగింది.
కంప్యుటర్ సహాయకుడు ఇచ్చిన జాబితాలో రహదారిని ఆనుకోని ఉన్న భూమి ఇదొక్కటి కావడంతో తహశీల్దార్ గారు తనిఖీ చేసి తృప్తి చెందిన తరవాత శాసన సభ్యులు గారికి విషయం చెప్పడం, వారు కూడా చూడడం, వారికి నచ్చడం వెంటనే జరిగిపోయింది.
***
“సాయంత్రానికి పార్టీ కార్యాలయ దస్త్రం పూర్తి ఆకారంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయానికి పంపించాలి. సర్వేయర్ గారు, మీరు భూమి కొలతల పటానికి భిన్నం చేసి, పార్టీ కార్యాలయానికి ముప్పై సెంట్లకు ఒక భిన్నం సంఖ్యను కేటాయించాలి.” అపుడే కార్యాలయంలోకి అడుగు పెట్టిన శ్రీధర్‌కు హుకుం జారీ చేశారు తహశీల్దార్ గారు.
“అలాగే సర్.” అంటూ మరోమాటకు అవకాశం లేకుండా తన గదికి వచ్చి ఉన్నపళంగా భిన్నపు దస్త్రాన్ని సిద్దం చేయడానికి సిద్దపడిపోయాడు. మరో రెండు గంటలలో అన్నికాగితాలతో దస్త్రం సిద్ధం చేసి తన సంతకాలతో పాటు, తహశీల్దార్ గారి సంతకాలు కూడా పెట్టించి ముప్పై మైళ్ళదూరంలో ఉన్న రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఉండే సర్వే ఉపపరిశీకుల పరిశీలన మరియు సంతకం కొరకు గ్రామ సహాయకునికి రాకపోకలకు డబ్బులు ఇచ్చి పంపించాడు శ్రీధర్.
సాయంత్రానికి గ్రామసహాయకుడు తిరిగి రావడంతో, ఆ దస్త్రాన్ని తహశీల్దార్ గారికి అప్పగించి ఊపిరి పీల్చుకున్నాడు.
పని అయిపోవడంతో ఆ విషయం అంతటితో మర్చిపోయి వేరే పనులలో తలమునకలయ్యాడు శ్రీధర్.
***
సరిగ్గా పక్షం రోజుల తరవాత తహశీల్దార్ గారు పిలిచి, “సర్వేయర్ గారు పార్టీ కార్యాలయానికి ముప్పై సెంట్లు కాకుండా యాబై సెంట్లుగా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం దస్త్రాన్ని సవరించి సిద్ధం చేయండి” అంటూ ఉత్తర్వుల నకలు చేతికి అందించారు.
ఉత్తర్వుల నకలు పుచ్చుకుని తన ఆసనంలో కూర్చున్న శ్రీధర్ అంత త్వరగా ప్రభుత్వం నుంచి మార్పుతో ఉత్తర్వులు వెలువడడంతో ‘అసలు దానిలో ఏముందా’ అని ఆసక్తిగా చూశాడు. మొదట ఇచ్చిన ఉత్తర్వు నకలు తనకు అవసరం అయినంత మాత్రమే చదివిన శ్రీధర్, ఈసారి ఆసాంతం చదవాలని నిర్ణయించుకొని చదవడం మొదలుపెట్టాడు. చదివేకొద్దీ అతని మోహంలో రంగులు మారాయి. మనసు బాధగా మూలిగింది. విరక్తితో కూడిన నవ్వోకటి అతని పెదాలపై మొలిచింది.
ప్రభుత్వభూమి అందుబాటులో లేదని నిర్ధారించుకున్న స్థితిలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, శాసనసభ్యులు ఆదేశాలు ఇవ్వగానే కొన్ని గంటలలో తమ యంత్రాంగమంతా కదిలి, ఉరుకుల పరుగులతో రోజుల వ్యవధిలోనే శాసనసభ్యులు కోరిన భూమిని అప్పగింత కార్యక్రమం పూర్తి చేసిన విషయం స్పురణకు వచ్చింది.
‘రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా’ అన్నట్లు ప్రభుత్వం తలచుకొంటే ఉత్తర్వులకు కొదవా..! కోట్ల విలువ చేసే భూమికి సంవత్సరానికి వెయ్యి రూపాయల నామ మాత్రపు రుసుముతో తొంభై తొమ్మిది సంవత్సరాలు కౌలుకు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేసిన నకలు అది.
‘చట్టాలను రూపొందించే అధికారం తమ చేతుల్లో ఉన్నదని సొంత పార్టీ కార్యాలానికి ప్రభుత్వ స్థలాన్ని నామ మాత్రపు రుసుముతో కౌలుకు తీసుకోవడానికి చట్టాన్ని రూపొందించడమేమిటో..? ఎన్నికలకు వందల కోట్లు ఖర్చు పెట్టే రాజకీయ పార్టీలు సంవత్సరానికి వెయ్యి రూపాయల కౌలు ఇచ్చేంత పేదరికంలోకి ఎపుడు జారిపోయాయో?’ అర్థంకాక శుష్కమందహాసం చేశాడు శ్రీధర్.
ఆ ఉత్తర్వులు చదివాక అతని మనసును కమ్ముకున్న అజ్ఞానపు పొరలు తొలగిపోయాయి. ఆలోచనల నిండా రాములమ్మ లేనితనం నిండుకున్నది.
‘మనసుంటే మార్గం ఉండకపోదు’ అని పెద్దలు చెప్పిన మాట గుర్తుకువచ్చి, నిలువ నీడలేని రాములమ్మకు, ఎన్ని ఇబ్బందులెదురైనా ఇంటిస్థలం చూపించాలని గట్టిగా నిర్ణయించుకుని, ‘ఆలశ్యం అమృతం విషం’ అన్న చందాన తన దగ్గర ఉన్న అన్ని పాత దస్త్రాలను వడపోయడానికి ఆ క్షణమే సమాయత్తమయ్యాడు శ్రీధర్.
రాములమ్మకు స్థలం చూపించేంత వరకు విశ్రమించకూడని స్థలం చూపించినప్పుడే తన ఉద్యోగ జీవితానికి సార్థకత అని దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంతో అతని మనసు కుదుటపడింది.
