[బాలబాలికల కోసం ‘రాజుల సొమ్ము..’ అనే కథ అందిస్తున్నారు శ్రీమతి బిందుమాధవి మద్దూరి.]
వేసవి సెలవుల తరువాత స్కూలు తెరిచి నెల రోజులయింది. రెండు రోజుల నించి సన్నగా నానుడు వాన పడుతున్నది.
మూడో క్లాస్ చదువుతున్న రవి ఈ రోజు ఎందుకో చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
స్కూల్ బ్యాగ్ సర్దుతూ కూని రాగాలు తీస్తున్నాడు.
వంటింట్లో రవి లంచ్ బాక్స్ సర్దే పని హడావుడిలో ఉన్న వాసవి.. “ఏంటి నాన్నా.. ఈ రోజు అంత హుషారుగా ఉన్నావు” అని అడిగింది.
“ఇవ్వాళ మా స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటుతున్నారు అమ్మా. మా అందరి చేత కూడా మా టీచర్ మొక్కలు నాటిస్తామన్నారు. నిన్న సాయంత్రం చిన్న ట్రాలీలో బోలెడు మొక్కలు తెచ్చి మా ప్లే గ్రౌండ్ లో పెట్టారు. వాన పడుతున్నది కదా.. మాలి వెంకయ్య ఇంకొక ఇద్దరు పెద్ద వాళ్ళు గోతులు తవ్వి మొక్కలు నాటటానికి నేల పదును చేస్తున్నారు.
అందుకే నేను రెయిన్ కోట్, రబ్బర్ బూట్స్, గ్లోవ్స్ తీసుకెళుతున్నాను. మా టీచర్ అందరినీ ఇవ్వాళ రబ్బర్ బూట్స్ వేసుకురమ్మన్నారు” అన్నాడు మొహంలో వెయ్యి వోల్టుల బల్బుల కాంతితో.
“ఓహ్.. అవును.. వానాకాలం వచ్చేసింది. ఇప్పుడు వేస్తే మొక్కలు బాగా నాటుకుంటాయి. మీ స్కూల్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. ఏం మొక్కలు నాటారో సాయంత్రం వచ్చి చెప్పు” అన్నది వాసవి కూడా ఉత్సాహంగా.
***
అది జనవరి నెలాఖరు రోజులు. పిల్లలకి అసైన్మెంట్స్ అయిపోయి సంవత్సర పరీక్షల ముందు నిర్వహించే ప్రీ ఫైనల్‌కి రెడీ అవుతున్నారు.
రవి స్కూల్ నించి వస్తూనే మొహం వేలాడేసుకుని, దిగులుగా వచ్చాడు. తలుపు తీసిన వాసవి “ఏమైంది నాన్నా.. ఎక్కడైనా దెబ్బ తగిలిందా” అని ఒళ్లంతా తడిమి చూసింది. ఎక్కడా గాయం ఏమీ కనిపించలేదు. “ఓ.. పరీక్ష కష్టంగా ఉందా?” అనడిగింది. రవి తల అడ్డంగా ఊపాడు.
“మరి ఏమైంది. టీచర్ ఏమైనా అన్నారా? బుక్స్ పోయాయా? ఫ్రెండ్స్ తో గొడవ పడ్డావా?” రవిని దగ్గరకి తీసి బుజ్జగిస్తూ అడిగింది. ఆ లాలనకి రవి కళ్ళల్లో నీళ్ళు కట్టలు తెంచుకున్నాయి.
వాసవి కంగారు పడుతూ.. ‘ఏదో పెద్ద సమస్యే అయుంటుంది’ అనుకుంది. కళ్ళు తుడిచి, మొహం చల్లటి నీళ్లతో కడిగి, తాగటానికి మంచి నీళ్లిచ్చి, రవిని ఒడిలోకి తీసుకుని, వీపు నిమురుతూ.. “ఇప్పుడు చెప్పు ఏమయిందో” అన్నది.
“అమ్మా మన సందుకి ముందు ఉన్న మెయిన్ రోడ్డులో ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు. కరెంట్, కేబుల్ వైర్స్ కి అవి అడ్డం వస్తున్నాయిట. వాళ్ళు పెద్ద ఱంపంతో కోసేస్తుంటే.. కొమ్మలు కింద పడేటప్పుడు మా వంక దీనంగా చూస్తున్నట్టుగా అనిపించింది.
మేము స్కూల్లో పెట్టిన చెట్లు కూడా పెరిగి పెద్దయ్యాక ఇలాగే కొట్టేస్తారా? మాలి రోజు వాటికి నీళ్ళు పోస్తాడు. రోజు మేము కూడా మా వాటర్ బాటిల్లో మిగిలిన నీళ్లు ఆ మొక్కలకి పోస్తూ అవి ఎలా ఎదుగుతున్నాయో చూస్తున్నాం. దగ్గరకెళ్ళి చెట్టుని ముద్దు పెట్టుకుంటాం. మేము పెట్టినట్టే ఈ చెట్లని కూడా ఎవరో ఒకరు పెట్టి ఉంటారు కదా. వాళ్ళు కూడా మా లాగే బాధ పడతారు కదా! అంతే కాదమ్మా.. మా టీచర్ చెప్పారు.. చెట్లకి కూడా ప్రాణం ఉంటుంది అని.. మరి అలా వాటిని ఱంపంతో కోస్తే నొప్పి పెట్టదా? అవి కూడా ఏడుస్తాయి కదా” అన్నాడు ఎక్కిళ్లు పెడుతూ!
వాడి సున్నిత హృదయానికి సంతోషిస్తూనే.. “అవును నాన్న.. మీ టీచర్ చెప్పినట్లు చెట్లకి ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటుంది కాబట్టే అవి పెరిగి పువ్వులు పుట్టాయి.. కాయలు కాస్తాయి. దెబ్బ తగిలితే అవి కూడా బాధ పడతాయి. అందుకే రోడ్ల పక్కన నాటే చెట్లని ఎంత ఎత్తు ఎదుగుతాయో, భవిష్యత్తులో వాటి ఎత్తుని బట్టి ఏ ఇబ్బందులు వస్తాయో అంచనా వేసుకుని అలాంటి చెట్లను ఎంచుకుని నాటాలి.
కొన్ని విదేశాల్లో కేబుల్ వైర్స్ భూమిలో వేస్తారు. కరెంట్ తీగలకు, మొక్కకి మధ్య ఎత్తులో కొంత తేడా ఉండే లాగా చేస్తారు. కొమ్మలు పక్కకి విస్తరించకుండా, నిలువుగా పెరిగే చెట్లు నాటుతారు. అప్పుడు చెట్ల కొమ్మలు అడ్డం వస్తాయి అనే సమస్య ఉండదు.
యూకే ఇంకా కొన్ని ఐరోపా దేశాల్లో గాలి ఉధృతంగా ఉంటుంది. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోయి ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగకుండా చెట్లకి పక్కన బలమైన మానులని అటొకటి ఇటొకటి నాటి, పెరిగే చెట్టుకి వాటికి బలమైన రబ్బర్ ట్యూబులతో కలిపి కట్టేస్తారు.
అలా ఒక పద్ధతి ప్రకారం చెట్లు నాటితే, మనకి ఇబ్బంది కలుగుతున్నది అని కొట్టేసే అవసరం రాదు” అన్నది.
“అమ్మా.. అసలు అన్ని మొక్కలు ఎక్కడి నించి తెస్తారు” అన్నాడు రవి అమాయకంగా.
“మొక్కలని ముందు నర్సరీల్లో పెంచి, కొంచెం పెరిగాక తెచ్చి ఇలా రోడ్స్ పక్కన, స్కూల్స్, పార్క్స్‌లో నాటుతారు. రోజు ట్యాంకర్స్‌తో తెచ్చి నీళ్ళు పోస్తారు. అవి చక్కగా గుబురుగా పెరిగి నీడనివ్వటం మొదలుపెట్టాక.. ఇదిగో ఇలా కేబుల్స్కి అడ్డం వస్తున్నాయని కొట్టేస్తారు” అన్నది నిట్టూరుస్తూ!
“మన గార్డెన్లో మొక్కలకి నువ్వు అప్పుడప్పుడు ఎరువులు వేస్తూ పురుగు మందు కొడతావు కదా! మరి మా స్కూల్లో మొక్కలకి, ఇలా రోడ్స్ పక్కన మొక్కలకి కూడా వేస్తారా” అన్నాడు రవి కుతూహలంగా అమ్మ వంక చూస్తూ.
“నేరుగా నేలలో నాటే ఇలాంటి మొక్కలకి ఎరువులు వెయ్యక్కరలేదు కానీ, పశువులు తినకుండా కంచె కట్టాలి. వాటన్నిటికీ బోలెడు డబ్బు ఖర్చు పెట్టి.. చివరికి ఇలా తేలికగా కొట్టేస్తారు. ముందే ఆలోచన, ప్లానింగ్ చేసి మొక్కలు నాటితే కొట్టేసే పని ఉండదు.
ఇలా అనాలోచితంగా చేసే పనులు చూసి మా అమ్మ చిన్నప్పుడు ‘రాజుల సొమ్ము రాళ్ల పాలు’ అనేది” అని వాసవి లేచి లోపలికి వెళ్ళింది.
‘అమ్మ చెప్పినట్టు.. చెట్లు పెంచటానికి ఉపయోగించే డబ్బులన్నీ నిజంగా వృథానే! కానీ దీనికి ఒక పరిష్కారం నేను పెద్దయ్యాక కనుక్కోవాలి’ అనుకున్నాడు రవి.
