[బాలబాలికల కోసం ‘రాజ్యకాంక్ష’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]
దేవరకొండరాజు శ్రీముఖుడికి ఎనలేని రాజ్యకాంక్ష. అనేక రాజ్యాలతో యుద్ధం చేసి ఆ రాజ్యాలను తన రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఆయా రాజ్యాల సంపద కొల్లకొట్టాడు. అయినా ఆయనకు ఆశ చావలేదు!
ఒకరోజు చల్లని వాతావరణంలో అడవిలో తిరగాలనే కోరిక కలిగింది. వెంటనే మంత్రి సుహస్తుడుని ఐదుగురు సైనికులను తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. అలా అడవిలో ఆహ్లాదకర వాతారవరణం అనుభవిస్తూ ఆనందం పొందసాగారు.
మెల్లగా ఆకాశంలో నల్లని మబ్బులు పరచుకున్నాయి. చినుకులు పడసాగాయి! వంటనే వెనుతిరిగి పోతామంటే చినుకులు కాస్త పెద్ద వానగా మారి పోయింది! తల దాచుకుందామంటే అడవి కాబట్టి ఇల్లు కానీ మంటపం కానీ లేవు! ఒక సైనికుడు ఓ గుట్టనెక్కి అటు ఇటు పరిశీలిస్తే అడవి చెట్లమధ్య ఒక చిన్న గుడి గోపురం కనబడింది! వెంటనే ఆ సైనికుడు పరుగెత్తుకొచ్చి రాజుతో ఆ గుడిని గురించి చెప్పాడు
“పదండి అక్కడికి పోదాము” అని అందరూ ఆ గుడివైపు వెళ్ళిగుడిలోకి ప్రవేశించారు. ఆ గుడి అడవి లోపల ఉండటం వలన దానిని గురించి ఎవ్వరికీ తెలియదు!
ఏది ఏమైనా వాన నుండి తప్పించుకునేందుకు గుడి దొరికింది. గుడి ముందు మంటపంలో ఒక ముసలి వాడు కూర్చుని ఉన్నాడు. అతనిని చూసి రాజు ఆశ్చర్య పోయాడు.
“నీవేమిటి ఒక్కడివే ఇక్కడ ఉన్నావు? నీ తిండి ఎలా? నీ జీవితం ఏవిధంగా గడుస్తోంది?” అడిగాడు రాజు.
“అయ్యా తమరు మీతో వచ్చిన వారు తడిసిపోయి ఉన్నారు. ఈ గుడ్డ తీసుకుని అందరూ తుడుచుకోండి మరలా మాట్లాడుకొందాం” చెప్పాడు ముసలాయన.
అందరూ తుడుచుకుని వాన తడి నుండి తేరుకున్నారు.
“అయ్యా ఈగుడిలోనే ఉంటాను. ఈ గుడి బావినీళ్ళనే తాగుతాను. ఇక్కడ దగ్గరలోని గూడెం వాళ్ళు ఇచ్చే పండ్లు, వెదురు అన్నం తిని బతుకుతున్నాను. గుడిలోని శివయ్య చల్లని చూపు నామీద ఎప్పుడూ ఉంటుంది. అదే నా తృప్తి” చెప్పాడు వృద్ధుడు.
“ఈ వయస్సులో నీకెందుకు ఒంటరి బతుకు? గుడిని కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి నీకు కొంత డబ్బు పంపుతాను. అప్పుడప్పుడూ నగరానికి వచ్చి నీవు చూడాల్సినవి చూసి, తినాలనుకొన్నవి తిను. నేను ఈ రాజ్యానికి రాజును” చెప్పాడు రాజు.
వృద్ధుడు రాజుకి నమస్కరించి “అయ్యా నేను అన్ని విధాలుగా తృప్తిగా ఉన్నాను. గూడెంవారు మంచి మనసుతో ఇచ్చే ఆహారం ఎనలేని తృప్తి ఇస్తుంది. ఆ శివయ్యను చూస్తూ నిద్రపోతే అదొక తృప్తి. గుడి ఆవరణలోని జామ, బొప్పాయి పండ్లు తింటే తృప్తే కాదు శక్తి కూడా! అంతే చాలు ఈ జీవితానికి. తమరు డబ్బు ఇస్తే దానిని దాచుకోవాలి. ఏ దొంగ దొంగలిస్తాడో అనే గిలితో నిద్ర పట్టదు. నగరానికి పోతే లేనిపోని తిండ్లు, కోరికలు పుట్టుక వచ్చి జీవితం అస్తవ్యస్త మవుతుంది! అందుకే నాకు ఏమీ వద్దు, నన్ను ఇలా బతకనివ్వండి” చిరునవ్వుతో కళ్ళలో తృప్తితో కూడిన ఆనందంతో చెప్పాడు.
అతని మాటలు రాజులో ఆలోచనలు రేకెత్తించాయి. తనకు పెద్ద రాజ్యం ఉన్నా ఇతర రాజ్యాలను కబళించాలనే ఆశ తనకు నిద్ర పట్టకుండా చేస్తుంది! ఇతర రాజ్యాల సంపద తన రాజ్యానికి తేవడం వలన అక్కడి ప్రజల బాధను అర్థం చేసుకోలేక పోతున్నాడు. ఆ వృద్ధుని సంతృప్తి అర్థం అయింది. ఉన్నదానితో తృప్తి పడితే అంతకన్నా కావలసిందేముంది? చేతనైతే ఇతర రాజ్యాలు కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకుంటే ఆ మంచి ఎంతో తృప్తి నిస్తుంది. ఈ విషయాలు మంత్రి సుహస్తుడితో చెప్పాడు.
“మీ ఆలోచన చాలా గొప్పది మహారాజా సంతోషం, తృప్తి కంటే ఏ ఆస్తీ అక్కరలేదు. మీరు చేసే మంచి పనులలో మేమూ సంతోషంగా పాలు పంచుకుంటాం”అని చెప్పాడు సుహస్తుడు.
వాన తగ్గి పోయింది. అడవిలో పక్షులు సంతోషంతో పాడాయి. అదరూ హాయిగా రాజధాని వైపు సాగిపోయారు.
