[రేవిణిపాటి రమాదేవి గారి ‘రక్త సంబంధాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఇంటి ముందున్న లౌంజులో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూన్నాను. గాలుల తాకిడికి షాల్ సరిచేసుకొని చూస్తున్న నాకు గేటు తెరుచుకుని రొప్పుతూ లోపలికి వస్తున్న యువతి కనబడింది.
ఆమె మా ఇళ్లకు కొంచెము ముందు, రోడ్డుకు అవతలిగా ఉన్న వారి ఇంటి అమ్మాయి రాజేశ్వరిగా గుర్తించాను.
“రా అమ్మా, ఏమిటి అలా రొప్పుతూ పరుగెత్తుకుని వచ్చావు? ఎక్కడినుండి ఇంత చలిగాలిలో వస్తున్నావు?” అని అడిగాను.
“ఆంటీ” అంటూ ఒక్క క్షణం ఆగింది.
“పర్వాలేదు. చెప్పమ్మా, ఎందుకు భయపడుతున్నావు?” అంటూ అనునయంగా అడిగాను.
“ఆంటీ మీ ఇంట్లోకి వెళదామండి.”
“అలాగే పద” అంటూ లోపలికి వెళ్ళాం.
“ఆంటీ, మీరు నాకు ఒక సహాయం చేయ్యాలి. కొంతసేపు మీ ఇంట్లో కూర్చొనిస్తారా?”
“అలాగే. ఉండు, కాఫీ తెస్తాను. ఇద్దరం కలిసి తాగుతూ మాట్లాడుకుందాము.”
***
“భయపడకుండా ఏమిటి చేయాలో చెప్పమ్మా?” అడిగాను.
“ఆంటీ, మీకు మా సంసారం గురించి తెలుసనుకుంటాను.”
“పూర్తిగా తెలియదు. కానీ చెప్పమ్మా, నువ్వు ఏది చెప్పినా, మనిద్దరి మధ్యే ఉంటుంది.”
“మా ఇంట్లో అమ్మానాన్నా అన్నయ్య తమ్ముడు ఉంటున్నారు. నేను వసుందర గారి ఇంట్లో వాళ్ళ ముగ్గురు పిల్లలకి కేర్- టేకేర్గా ఉంటూ, వారి పనులన్నీ పిల్లల రక్షణతో పాటు చూసుకుంటున్నాను. వారి యింట్లోనే వుంటాను. వారానికి ఒకసారి మా ఇంటికి కొన్ని గంటల కోసం వస్తాను. మా అమ్మకి కాళ్ల నొప్పులు. అయినా ఈ వీధి చివర ఉండే కళ్యాణి గారింట్లో వంట చేస్తుంది. ఆ జీతమూ, నేను ఏమైనా నా కోసం ఉంచుకోకుండా ఇచ్చే నా జీతము పెట్టి మా అమ్మ గుట్టుగా సంసారం వెళ్ళదీస్తోంది. మా అన్నయ్య ఉద్యోగం స్థిరం కాదు. ఎక్కడో హోటల్లో సర్వర్గా చేస్తున్నానని అంటాడు. వాడి తాగుడుకే సరిపోదు ఆ జీతం. పైగా మా అమ్మాని తిడతాడు. ‘ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి ఇస్తారు, మీరు నాకు ఏం ఇచ్చారు? మిమ్మల్ని నేను పోషించాలా?’ అంటాడు. అందుచేత మా అమ్మ వాడిని ఏమీ అనదు. ఈ నెలలో నా పుట్టినరోజు వస్తున్నది. ‘నేను ఒక డ్రెస్ కొనుక్కొని మిగతాది నీకు ఇస్తానమ్మా’ అని మా అమ్మతో అన్నాను. అమ్మ ‘అలాగే’ అంది. మా అన్నయ్య అక్కడే ఉన్నాడు. ‘రాజీ నువ్వే అన్ని చేస్తున్నావ్ మన కుటుంబానికి. ఇప్పుడు నేను బాగానే గడిస్తున్నాను. ఈసారి నిన్ను బయటికి తీసుకెళ్తాను. నీకు ఏమి కావాలో అది కొనుక్కుందువు గాని. మరొక మాట నువ్వు ఎవరింట్లో పనిచేస్తున్నావో వాళ్లతో – మరి ఇంక నేను పని చేయను అని చెప్పి ఇంటికి వచ్చి అమ్మకి వంటలో సహాయం చేస్తూ ఉండు’ అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా రాజన్న ఈ మాటను నేను నమ్మలేదు. అయినా వాళ్లకి చెప్పి పది రోజులు సెలవు తీసుకుని ఇంటికి వచ్చాను.
నాలుగు రోజులు కిందట మా రాజన్నయ్య ‘బజారుకు తీసుకెళ్తాను పద’ అన్నాడు. తయారై వాడితో వెళ్లేను. వాడు నన్ను, నేను ఎన్నడూ చూడని మారుమూల జనసంచారం లేని ప్రదేశానికి తీసుకు వెళ్తున్నప్పుడు అడిగాను ‘మాల్కి తీసుకు వెళతానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేవేమిటి? ఎక్కడికి వెళుతున్నాము?’ అని.
‘నా ఫ్రెండు నాకు 20,000 వేలు అప్పు ఇస్తానన్నాడు. ఇక్కడికే రమ్మన్నాడు. అందుచేత ఇటువైపు తీసుకొచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు వారింట్లో కొంతసేపు కూర్చో. ఈ రోడ్డు మీద నువ్వు నిలబడ్డం మంచిది కాదు’ అన్నాడు. సరేనని అక్కడికి దగ్గరగా ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. బయట ఎవరు లేరు. నేను కొంత సేపు అక్కడే నిలబడ్డాను.
ఇంతలో ఒకతను వచ్చాడు. ‘అన్నమాట ప్రకారం నిన్ను తీసుకువచ్చాడు మీ అన్న’ అన్నాడు. ఆ మాటలు ఎంతో కర్కశంగా ఉన్నాయి. ‘మా అన్నయ్య అరగంటలో వస్తాను మీ ఇంట్లో ఉండమన్నాడు’ అన్నాను.
‘ఓసి ఎర్రిదానా వాడు మరి రాడే. ఇంత అందంగా ఉన్న నిన్ను మాకు రెండు లక్షలు అమ్మి వేసి వెళ్ళిపోయాడు. అయినా భయపడకు నీకు కొంత అర్థమై ఉంటుంది. మేము చెప్పినట్లు విన్నవా, నీ పరిస్థితి చాలా బాగుంటుంది. లేకపోతే ఎదురు తిరిగేవో కాళ్లు చేతులు విరగిపోతాయి. ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్లలేవు’ అంటూ నా దగ్గర ఉన్న ఫోన్ తీసేసుకున్నాడు.
‘ఒక వారం రోజులు పాటు హాయిగా తిని తిరుగు ఆ తరువాత నీకు పని బాగా తగులుతుంది. జాగ్రత్త, లోపలికి రా’ అంటూ ఒక మంచి గదిని చూపించాడు.
‘హాయిగా తిని రెస్ట్ తీసుకుని ఇక్కడే పడి ఉండు. కదలడానికి ప్రయత్నించకు. మీ అన్న మళ్లీ వస్తాడు వారం రోజుల్లో. మీ అమ్మానాన్న తమ్ముడిని కూడా తీసుకు వస్తానన్నాడు. అందరికీ కలిపి 15 లక్షలు ఇమ్మన్నాడు. మేము 10 లక్షలు ఇస్తామన్నాము. బేరం ఇంకా కుదరలేదు. అవన్నీ నీకెందుకులే, భోజనం బాగా చేసి హాయిగా విశ్రాంతి తీసుకో’ అన్నాడు.
నా గుండెల్లో రైళ్ళు పరిగెట్టడం మొదలుపెట్టేయి. ‘అంత దుర్మార్గుడివా? రక్త సంబంధాలను కూడా డబ్బుకు అమ్ముకునే నీచ స్థితికి దిగజారి పోయావా’ అని మనసులో అనుకున్నాను.
పైకి మాత్రమూ చాలా అమాయకురాలిగా వాళ్లు పెట్టేవి తింటూ ఆనందంగా ఉన్నట్లు నటించడం మొదలుపెట్టెను. వాళ్ళు మరునాడు మాల్కి బట్టలు కోసమని తీసుకుని వెళ్లేరు. మంచి బట్టల కోసం చాలా ఖర్చు పెట్టించేను వాళ్లతో.
‘పిట్ట మన తిండితో చాలా బాగా తేరుకుందిరా. చాలా అందంగా ఉంది. దాని మీద పెట్టిన రెండు లక్షలు ఈజీగా మనకి వచ్చేస్తాయి’ అనుకుంటున్నారు వాళ్ళు నా ఎదుటే.
నేను వచ్చి నాలుగు రోజులు అవుతున్నది. వాళ్లు ప్రతి రెండేసి గంటలకి వచ్చి చూసుకుంటూ ఉంటారు. రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎనిమిది గంటలకు వస్తారు. అదే నాకు మంచి సమయము. ఏదైనా సాహసం చెయ్యాలి అనుకున్నాను.
వాష్ రూమ్ లోకి వెళ్లి చూసుకున్నాను కిటికీ ఊసలు చాలా బలంగా ఉన్నాయి. ఎలాగో తంటాలు పడి తీసెను. కిటికీ ఎక్కి పక్కనున్న పైపు పట్టుకుని దిగేను. అక్కడ నా అదృష్టం కొలది వాచ్మాన్ లేడు. అందుకని తప్పించుకొని, దారి అంతకు ముందు చూసేను కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఈపాటికి వాళ్లు చూసే ఉంటారేమోనండి..” అంటూ జరిగినదంతా చెప్పింది.
“మరేం పరవాలేదు. నా ఫ్రెండ్ శాంత ఇక్కడ ఎస్సైగా ఉంది. ఫోను చేసి పిలుస్తాను. నువ్వు ఆమెకు ఈ కథనంతా చెప్పి ఆ స్థలానికి తీసుకు వెళ్ళు. ఆమె అందర్నీ పట్టుకుంటుంది. వాళ్లే మీ అన్నయ్య గురించి కూడా చెబుతారు. భయపడకు” అని చెప్పాను.
అంతలోనే ఎస్ఐ శాంత వచ్చి రాజేశ్వరిని వేన్ ఎక్కించుకుంది. వాళ్ళందరూ ఎప్పటినుండో వెతుకుతున్న ముఠా అని, ఇప్పుడు దొరికబోతోందని – నాకూ, రాజేశ్వరికి థాంక్స్ చెప్పి – వెళ్ళి ఆ ముఠాని పట్టుకుంది శాంత.
రేవిణిపాటి రమాదేవి గారి జన్మ స్థలం బరంపురం, ఒడిశా. పెరిగింది చదివింది ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళంలో కాలేజీ చదువు. తరువాత మెట్టినిల్లు బీహార్. ఇప్పటి ఝార్ఖండ్ లోని జెంషెడ్పూర్లో నివాసము. కథలు, వ్యాసాలు, కవితలు రాస్తు వుంటారు. రెండు సాంఘిక నవలలు, సుందరకాండము అను పౌరాణిక కావ్యము రచించారు. హిందీ నుండి తెలుగులోకి అనువాదాలు చేశారు. ప్రస్తుతం బొంబాయిలో వుంటున్నారు.
