Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రక్తబంధం

[డా. సి. భవానీదేవి రచించిన ‘రక్తబంధం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

(ప్రతీకాత్మక చిత్రం, అసలైన వ్యక్తులు కారు)

పెనుతుఫానులో అమ్మపేగు తెంచుకు పుట్టావు.
అందరికన్నా అమ్మకు ముద్దుల కొడుకయ్యావు
నాన్నకు ఇష్టమైన కృష్ణునిపేరు నీది
చదువుల తండ్రివైన విద్యాసాగరుడివి
నా చేతివేలు పట్టుకుని లేత అడుగులేశావు
నీ అక్షరాల దారిలో టీచర్ నయ్యాను
లాలపోసి.. జోలపాడి ఉయ్యాలలూపాను
నిద్రపోతున్న బుగ్గమీద చిరుముద్దిచ్చి
బడికి వెళ్తుంటే పాలనవ్వుల వీడ్కోలిచ్చేవాడివి
కనని తల్లిమీద.. అలిగి వెళ్లిపోయావా!
నువ్వు తమ్ముడివి మాత్రమే కాదు..
నా కళ్లముందు రూపుదిద్దుకున్న పుస్తకానివి
కాలం దారిలో ఎందరికో గురువయ్యావు.
ఫిజిక్స్ పాఠాలు బోధించినా,
మానవత్వమే నీ గొప్ప పాఠమైంది.
ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించినా,
నిర్మల సమాజ నైజమై వికసించావు
ఎన్నెన్ని జ్ఞాపకాలు.. జవాబులేని ప్రశ్నలు
మరణం మనల్ని విడదీయగలదా..?
కనుమరుగైనంతమాత్రాన నిన్ను మర్చిపోగలనా
మనది మామూలు బంధం కాదురా
ఒకే తల్లి రక్తాన్ని పంచుకున్నాం కదా!
నీ ఆరాటాలు పోరాటాలు నావనుకున్నాను కదా
నీ అర్థాంగితో కూడా ఒక్క మాటైనా చెప్పకుండా
అలా ఎటు మాయమయ్యావురా..
నీ నవ్వులు.. మాటలు గుర్తుంచుకోమంటూ
మిగిలిన నా చిన్నజీవితాన్ని
చిన్నబుచ్చి వెళ్లిపోయావా!

(29-5-2026 తేదీన మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన మా చిన్న తమ్ముడు చి.కోటంరాజు వాసుదేవ విద్యాసాగర్ కు నివాళిగా)

Exit mobile version