[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘రక్తపుటేరుల రాజ్యం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఇప్పుడిక్కడ అరాచకం
గర్వంగా తలెత్తుకొని
రాజ్యమేలుతోంది!
పచ్చదనం ముసుగులో
హరితవనాలను మరిపించే పల్లెసీమలు..
రాజకీయ కక్షలకు వర్గ పోరాటాలకు
వేదికలుగా మారిపోయాయి!
బంధుత్వాలను విస్మరించి..
రక్త సంబంధాలను ప్రక్కన బెట్టి..
ఐకమత్య భావనకు తిలోదకాలిచ్చి..
ఆజన్మ శతృవుల మాదిరి
కొట్టుకు చస్తున్నారు!
రక్తపుటేరుల ప్రవాహంతో
సిరుల భాండాగారాలు గ్రామసీమలు
నెత్తుటి మేఘం ముసుగేసుకొని
భీతి గొలుపుతున్నాయి!
వాడెవడో..
అధికారం అందలమెక్కి ఊరేగుతున్నాడు!
వీడెవడో..
కోట్లు కూడబెట్టుకొని
ప్రతిపక్షం పాత్రలో కులాసాగానే ఉన్నాడు!
అమాయక పిచ్చి జనం మాత్రం..
అభిమానాన్ని మూర్ఖంగా గుండెల్లో దాచుకొని
ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొని
గ్రామ సీమల శాంతి సౌభాగ్యాలను
రక్తచందనంతో అభిషేకిస్తున్నారు!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.