సంచిక – స్వాధ్యాయ ఆధ్వర్యంలో ది 27 నవంబరు 2022 నాడు హైదరాబాదులోని రవీంద్రభారతిలో శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రామం భజే శ్యామలం’ గ్రంథం ఆవిష్కరించబడింది. మొదటగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు ముఖ్య అతిథులకు, వక్తలకు, సభికులకు ఆహ్వానం పలికారు. ఎల్లోరా రచించిన ‘లక్ష్మణగడ్డ’ కథని ప్రస్తావిస్తూ, ఈ వేదిక లక్షణాన్ని వివరించి, కార్యక్రమం గురించి టూకీగా ప్రస్తావించారు. అనంతరం సభాధ్యక్షత వహించవలసిందిగా గన్నంరాజు గిరిజా మనోహర్‌బాబు గారిని కోరి సభా నిర్వహణ బాధ్యత ఆయనకు అప్పగించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలనం జరిగింది.
అనంతరం సభాధ్యక్షులు శ్రీ గిరిజా మనోహర్‌బాబు మాట్లాడుతూ – ఒక అపూరూపమైనటు వంటి పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నాం అని తెలిపారు. వాల్మీకి రామాయణం మన దేశ సంస్కృతిని వివరిస్తుందని అన్నారు. పుస్తకానికి ముఖచిత్రంగా ఉన్న ఎక్కు పెట్టిన విల్లు – ప్రపంచానికి ఆదర్శపురుషుడైన శ్రీరామునిపై వస్తున్న పెడ ధోరణులను ఖండిస్తున్నట్లు ఉందని అన్నారు. శాంతా బయోటెక్స్ సంస్థ ద్వారా శీ వరప్రసాద్ రెడ్డి దేశానికి చేసిన సేవను ప్రస్తావించారు. ప్రస్తుత గ్లోబల్ విలేజ్‌లో మానవుల మధ్య తలెత్తున్న విభేదాలు, వైవిధ్యాలను ప్రస్తావించి వాటికి నివారణగా భారతీయ సనాతన ధర్మం మనుషులను ఏకత్రితం చేస్తుందని చెప్పారు. రామకథ దేశంలోని ప్రతి వ్యక్తి రక్తంలోనూ ప్రవహిస్తుందని అన్నారు. రాముడి గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తగ్గదని అన్నారు. ఇలాంటి చారిత్రక నేపథ్యంలో సంతోష్ కుమార్ గొప్ప గ్రంథం రచించారని అన్నారు.
అనంతరం శ్రీ వరప్రసాద్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రతులు అందజేశారు.
శ్రీ వరప్రసాద్ రెడ్డి ప్రసంగిస్తూ – భారతీయుల పట్ల, భారతీయ సంస్కృతి పట్ల గౌరవం ఉన్నవారే ఇలాంటి సభలకు హాజరవుతారని అన్నారు. స్వాతంత్రం లభించిన వెంటనే ఇటువంటి పుస్తకం రావలసిన అవసరం ఉందని అన్నారు. ఆంగ్లేయులు అప్పటికే విషబీజాలు నాటారని అన్నారు. మన సంస్కృతిని, భాషని, భారతీయ విద్యావిధానాన్ని, మనకు కాకుండా చేశారని, ఆంగ్ల విద్యను మన మీద రుద్దారని అన్నారు. ఇంగ్లీషు విద్య – అధికారి పట్ల సేవకుడికి ఉండాల్సిన అతి మర్యాద, బానిసత్వం, ఏది చెప్పినా చేయడం వంటి వాటిని భారతీయులకు అలవర్చిందని అన్నారు. ఆంగ్ల విద్య భారతీయులను గుమాస్తాలుగా మార్చి, ఆత్మోన్నతికి దూరం చేసిందని అన్నారు. మన పాఠ్యాంశాలను మార్చేసి, మన ఘనమైన సంస్కృతిని రక్షించుకునే వీలు లేకుండా మెకాలే విద్యా విధానం ద్వారా కుట్రలు పన్నారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం మన రాజకీయ నేతలు కూడా అదే బాటలో నడిచి వారి తొత్తులుగానే వ్యవహరించారని అన్నారు. మనదైన ధర్మాన్ని, సంస్కృతిని పునరుద్ధరించవలసిన అవసరాన్ని విస్మరించారనీ, ఫలితంగా మనం ఆర్థిక సంపదని, వాఙ్మయ సంపదని, సంస్కృతిని కోల్పోయామని అన్నారు.
దేశంలో ఒక silent revolution జరిగి మన పురాణాలోని అంశాలను – అవకాశం ఉన్నంతమేర వక్రీకరించారు కుహనా మేధావులు అని తెలిపారు. హైందవాన్ని పక్కకి జరిపి క్రిస్టియానిటీని నిలబెట్టాలని చూశారని అన్నారు. ఒక ధర్మాన్ని, ఒక విశ్వాసాన్ని తప్పించి, మరో ధర్మాన్ని, మరో విశ్వాసాన్ని అందలం ఎక్కించాలనేది ఒక వికృతక్రీడ అని పేర్కొన్నారు.
దేశంలో ‘సెక్యులరిజం’ విధానాన్ని ఉపయోగించిన పద్ధతి తప్పు అని, ఓట్ల కోసం నీచమైన భావాలతో ఆలోచించారని అన్నారు. ‘పరమత సహనం’ పేరిట అనేకులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారని అన్నారు.
ఇటువంటి అంశాలపై ఎవరో ఒకరు విల్లు ఎక్కుపెట్టాలి. అదే ఈ పుస్తకం చేసిందని తనకి అనిపించిందని అన్నారు.
కృత్రిమైన ప్రయోగాలలో, చరిత్రని out of context చేసేసిన చర్యలను ఎదుర్కుంటూ – ఈ పుస్తకాన్ని సహేతుకంగా, శాస్త్రీయంగా, చారిత్రకంగా రాశారు కోవెల సంతోష్ కుమార్ అని అన్నారు. రామాయణం చదివితే వచ్చే ఆనందం కన్నా ఈ పుస్తకం చదివితే వచ్చే ఆనందం ఎక్కువని అన్నారు. రాముడు అనేక ధర్మాలని పాటించాడని, అటువంటి పురుషుడి గురించి వక్రంగా మాట్లాడి, విశ్వాసాన్ని దూరం చేసి, హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నాలకి గండి కొట్టేలా ఈ పుస్తకం రాశారు సంతోష్ కుమార్ అని అన్నారు.
మన దేశాన్ని రక్షించుకోవాలంటే విషయ పరిశీలన కావాలనీ, మనల్ని రెచ్చగొట్టేవారికి సరైన సమాధానాలు చెప్పేందుకు ఊరికి 100 మంది వివేకానందులను తయారు చేసుకోవాలని అన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలు పోతే అంతా నష్టమేననీ, అందుకే ఇటువంటి పుస్తకాలు కావాలనీ, కుహనా మేధావుల నోరు కట్టేయడానికి ఈ పుస్తకం అవసరమనీ తెలిపారు. భారతీయ సంస్కృతినీ, సంప్రదాయాలను రక్షించుకోవాలంటే ఈ పుస్తకాన్ని పిల్లల చేత కూడా చదివించాలని అన్నారు. అత్యంత ఆవశ్యకమైన గ్రంథం ఇదని తెలిపి, సభలో ఉన్న వారందరికీ ఈ పుస్తకం ప్రతిని తాను కొని అందిస్తానని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు.
సభాధ్యక్షులు శ్రీ గిరిజా మనోహర్‌బాబు మాట్లాడుతూ వరప్రసాద్ రెడ్డి గారి సందేశాన్ని సంక్షిప్తంగా ప్రస్తావించారు. పది మందికీ ఈ పుస్తకాన్ని పంచుతానని అనడం హర్షణీయమని అన్నారు.
అనంతరం శ్రీ కోవెల సుప్రసన్నాచార్య ప్రసగించారు. అందరినీ ఆశీర్వదించి మన సంస్కృతిపై జరుగుతున్న దాడులను ఖండించాలని అన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సంతోష్ కుమార్ ఈ గ్రంథం వెలువరించారని పేర్కొన్నారు. తనకూ శ్రీ వరప్రసాద్ రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావించారు. వరప్రసాద్ రెడ్డి గారు ఔషధ రంగంలోనూ, సాంస్కృతిక రంగంలోనూ ఎముక లేని చేతితో ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. భావుకత్వాన్ని పెంచాలి, సౌందర్యాన్ని పెంచాలి, అందుకు మీ వెంట ఉంటామని చెప్పాలి – ఆ విషయంలో వరప్రసాద్ రెడ్డి గారు ముందున్నారని అన్నారు. కృష్ణుడి పైన కూడా ఎన్నో దాడులు జరిగాయనీ, సంతోష్ కుమార్ కృష్ణుడిపై కూడా ఒక పుస్తకం రాయాలని అభిలషించారు.
సభాధ్యక్షులు శ్రీ గిరిజా మనోహర్‌బాబు మాట్లాడుతూ సరైన సమయంలో సరైన నిర్ణయం సంతోష్ కుమార్ తీసుకోవాలని, కృష్ణుడిపై కూడా ఇటువంటి రచన జాతికి అవసరమని, అభిలషణీయమని అన్నారు.
అనంతరం ప్రసంగించిన ప్రముఖ రచయిత శ్రీ పాణ్యం దత్తశర్మ పుస్తకాన్ని సమీక్షించారు. ఈ గ్రంథాన్ని సమీక్షించడం కత్తి మీద సాము అని అన్నారు. ఈ సమీక్షపై సుమారు 30 – 40 గంటలు కృషి చేశానని అన్నారు. ఈ పుస్తకం తనని దిగ్భ్రమకి గురి చేసిందని, చదివాకా అలౌకిక ఆనందానికి లోనయ్యానని తెలిపారు. రచయిత ఇంటి పేరు కోవెల అని, అంటే గుడి అని అన్నారు. తరతరాలుగా రాముని సేవలో తరించిన కుటుంబం వారిదని అన్నారు.
ఈ పుస్తకం శీర్షిక భావగర్భితమని పేర్కొన్నారు. రామాయణంపై జరుగుతున్న దాడిని, వక్రీకరణలని ఎలా తిప్పి కొట్టాలో హేతుబద్ధంగా, తార్కికంగా పరిశీలించి ఈ గ్రంథాన్ని సంతోష్ రచించారని అన్నారు. భారతీయ సనాతన ధర్మపు ప్రతిష్ఠని కాపాడిన రచన ఇదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటీవలి తాను అనువదించి సంచికలో ప్రచురించిన ‘భారతీయులకు హెచ్చరిక’ అనే రచనను ప్రస్తావించారు. మూల రచనని సావిత్రీదేవి 1939లో రచించారని, ఆ రచనలో ప్రస్తావించిన హెచ్చరికలు నేటికీ వర్తిస్తాయని అంటూ, ఆ హెచ్చరికలనే సంతోష్ తన పుస్తకంలో కొనసాగించారనీ అన్నారు.
‘వైదేహీ సహితం సురదృమ తలే హైమే మహా మంటపే’ అనే శ్లోకాన్ని గానం చేసి, ఈ పుస్తకం ముందుమాటలో శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్య వారు ఈ శ్లోకానికి లోతైన అర్థాన్ని చెప్పారని తెలిపారు. రామాయణమే కాదు, మనుస్మృతి కూడా అనేక దాడులకు గురైందని అన్నారు. ఈ పుస్తకం మొత్తం 55 వ్యాసాల పరంపర అని, వాటిలోని విషయాన్ని consolidate చేస్తే 20 అంశాలు స్థూలంగా తేలతాయని అంటూ వాటిని వివరించారు. రామాయణం నిస్సందేహంగా చరిత్రే. కేవలం కావ్యం కాదని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు కనిపించకుండా, మైనారిటీలను నెత్తికెత్తుకున్నట్లు కనిపించకుండా పాలకులు చాలా తెలివిగా ఎత్తువేశారని అన్నారు. రామాయణం కేవలం ఒక మతపరమైన గ్రంథంగానే పరిగణించి రాముడిని ఒక myth గా మార్చి. బౌద్ధాన్ని ప్రమోట్ చేశారని రచయిత తెలిపారని అన్నారు. రాముడిని విలన్ చేయడం కోసం బుద్ధుడి కంటే కూడా అశోకుడు హీరో అయ్యాడని అన్నారు.
ఇదంతా రచయిత వివరిస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుందని అంటూ అదే సమయంలో ఆయన మీద నమ్మకం కలుగుతుందని అన్నారు. ఏదైనా లేశమాత్రం అపనమ్మకం ఉన్నా, తర్వాత వ్యాసాలలో దీనిని ఆయన తార్కికంగా, ఋజువులతో వివరిస్తున్నప్పుడు, పాఠకుల లోని అపనమ్మకం పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుందని దత్తశర్మ అన్నారు. దీనినే ఆంగ్లంలో ‘Suspension of Readers’ Disbelief’ అని అంటారని తెలిపారు. దానిని సాధించినప్పుడే ఇలాంటి పరిశోధనాత్మక గ్రంథాలు విజయవంతమవుతాయనీ, సంతోష్ కుమార్ ఈ విషయంలో పూర్తిగా కృతకృత్యులైనారని అన్నారు.
ఆనాటి పాలకులు తెచ్చిన హిందూ కోడ్ బిల్లుతో హిందూ ధార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం అయిందనీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనమైందని అన్నారు. ‘సెక్యులరిజం’ను ఒక బ్రహ్మ పదార్థంగా, ఎవరికీ అంతుపట్టనిదానిగా తయారు చేశారని రచయిత పేర్కొన్నారని చెబుతూ, 1952 అక్టోబరు 17న నెహ్రూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖని ప్రస్తావించారు. ఆనాటి పాలకులు మన విద్యా విధానాన్ని నాశనం చేసిన తీరుని రచయిత వివరించారని చెప్పారు. వందల సంవత్సరాలు దేశాన్ని దోచుకున్నారని అంటూ, కొన్ని శతాబ్దాల పాటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, చారిత్రక విధ్వంసం ఎలా జరిగిందో ఈ పుస్తకం తేటతెల్లం చేస్తుందని తెలిపారు.
వేలమంది మూర్ఖులను విడిచిపెట్టినా, ఒక మేధావిని మాత్రం చేరదీయాలి అని భరతునికి రాముడు ఉపదేశించాడని రచయిత తెలిపారని చెబుతూ, పాలకునికి మంచి వ్యక్తిత్వం ఉండాలనీ, నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని తెలిపారని అన్నారు. రామాయణంలో మూడు రకాల రాజ్యవ్యవస్థలను ప్రస్తావించారు. సంతోష్ కుమార్ పేర్కొన్న తారుమారు రచయితల గురించి ప్రస్తావిస్తూ చరిత్రని వక్రీకరించిన సూపర్ హిస్టారియన్ల గురించి చెప్పారు. చరిత్ర వక్రీకరణ మూడు కోణాల్లో సాగిందని రచయిత తెలిపారని చెప్పారు. పురాణాల పుట్టుకని, చరిత్ర duration ని మార్చేసారని అన్నారు. సూర్య సిద్ధాంత గ్రంథం లోని 29-32 శ్లోకాలను రచయిత బాగా ఉపయోగించారని, సోలార్ సిస్టమ్ దీనికి సమానంగా ఇంచుమించు ఉంటుందని రచయిత సూత్రీకరించారని తెలిపారు. రామాయణం వక్రీకరణ ఏ విధంగా జరిగిందో 7 అంశాల ద్వారా రచయిత నిరూపించారని అన్నారు.
రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకికి వినిపించాడని, తొలి శ్లోకం అప్రయత్నంగా వాల్మీకి నోటి నుంచి ఛందోబద్ధంగా వెలువడిందని రచయిత తెలిపారని అన్నారు. మనం నిత్యం చెప్పుకునే సంకల్పంలో మన చరిత్ర ఉందని రచయిత అభిప్రాయపడ్డారని అన్నారు.
సీతారాముల వివాహం తేదీని, వనవాసం ప్రారంభమైన తేదీ, సేతు నిర్మాణం జరిగిన కాలమూ, రావణ వధ తేదీ తదితర వివరాలను ప్రమాణాలతో చూపారని అన్నారు. బుద్ధుడు ఇక్ష్వాకు వంశం వాడే అనేందుకు ఆధారాలు చూపారని తెలిపారు.
అశోకుడు ఒక సూపర్ ‘న్యూమరీ పోస్ట్’ అని రచయిత వ్యాఖ్యానించారనీ, శ్రీరాముడి ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు అశోకుడిని కుహానా సూపర్ హిస్టారియన్స్ రంగంలోకి తెచ్చారని తెలిపారని చెప్పారు. దేశాన్ని ఏలిన అత్యంత క్రూరమైన రాజుల్లో అశోకుడు మొట్టమొదటి స్థానంలో ఉంటాడని రచయిత అభిప్రాయపడ్డారని తెలిపారు. మన దేశంలో అసలైన ఆదర్శదంపతులు సీతారాములేనని అన్నారు. మనదేశపు రాజులెందరో గొప్పవాళ్ళని, రాణులలో సైతం వీరవనితలు ఉన్నారని రచయిత పేర్కొన్నారని తెలిపారు. గౌతమ బుద్ధునికి ముందున్న సమాజం, మతం ఏమిటని రచయిత ప్రశ్నించారని చెప్పారు.
జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలంబునన్ అన్న మాటను రచయిత శాస్త్రీయంగా నిరూపించి చూపారని అన్నారు. భారతదేశానికి ఏ యుగంలోనూ, ఏ దశలోనూ వలసలు వచ్చినట్లుగా, భారతదేశంలోకి జన్యు ప్రవాహం జరిగినట్లుగా, ఎటువంటి ఆధారం లభించదని రచయిత వెల్లడించారని అన్నారు.
రాముడిని ఒక టార్గెట్‍గా, శంబూక వధ, సీతా పరిత్యాగం వంటి అంశాలను స్వయం ప్రకటిత మేధావులు, ఎలా తమకు అనుకూలంగా మార్చుకుని ‘శ్రీరామ వ్యక్తిత్వ హననం’ అనే దుర్మార్గానికి పాల్పడ్డారో సంతోష్ కుమార్ చెప్పారని తెలిపారు. రామాయణంలో రాముడు పరబ్రహ్మగా కాకుండా, ఒక మానవునిగా, సుఖదుఃఖాలకు స్పందించేవాడిగా, కోపతాపాలకు అతీతుడు కాని వాడుగా, మొదట ఆయన human, తర్వాతే Divine అని నిరూపించారని అన్నారు.
ఉత్తర రామాయణాన్ని అదే పనిగా కల్పించి, పూర్వ రామాయణంలో వాల్మీకి మహాముని చెప్పిన అద్భుతమైన రామ తత్వాన్ని ఎలా హీనపరిచారో చూపించారని తెలిపారు. సుగ్రీవుడు వానర సైన్యానికి సీతాన్వేషణలో దిశానిర్దేశం చేస్తూ – తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం – ఇలా నాలుగు దిక్కులా ఉన్న వివిధ ప్రదేశాలు భూగోళం మీద ఇప్పటికీ ఉన్నాయనీ, దానిని ‘సుగ్రీవుని అట్లాస్’గా అభివర్ణించారని అన్నారు. ప్రస్తుత శ్రీలంక రావణ లంకయే యని నిర్ధారించారు. రామసేతు నిర్మాణం నిజంగా జరిగిందని, సముద్రంలో లోతు తక్కువగా ఉన్న చోట దానిని నిర్మించుకుంటూ వెళ్ళారని ప్రమాణాలతో సహా చూపారని తెలిపారు.
రామాయణంలో సీతాదేవి ప్రాముఖ్యతను, ఆమె ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాని, రాజీ పడని మనస్తత్వాన్ని, అరణ్య వాసం లగాయితు, అగ్నిప్రవేశం వరకు సోదాహరణంగా విపులీకరించారని అన్నారు. రామ రావణ యుద్ధం భయంకరమైన అస్త్రాలతో రక్తసిక్తమైన శరీరాలతో జరిగిందని; సినిమాలలో చూపినట్లుగా కాదని నిరూపించారని తెలిపారు.
శ్రీరాముడిని భారతీయులు తమలో ఒకడిగా భావించారనీ, ఆయన కష్టాలను తమ కష్టాలుగా భావించారని, ఆయన నిర్ణయాలతో ఏకీభవించారని రచయిత స్పష్టం చేశారని తెలిపారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన కల్పవృక్షంలోని ‘ఏపున మంటి నుండి యుదయించిన జానకి మింటి నుండి, ఆ’ అనే పద్యాన్ని పాడి వినిపించి, విశ్వనాథ వారు సీతారామ తత్త్వాన్ని ఆవిష్కరించిన తీరు హృద్యంగా ఉంటుందని తెలిపారు దత్తశర్మ. ‘నాహం కర్తా హరిః కర్తా’ అని అన్నమాచార్యులన్న మాటలు ఈ రచనకి సరిగ్గా సరిపోతాయని శర్మగారు చెప్పారు. రాముని గురించిన నిందలు, అపోహలు, అపార్థాలు, వక్రీకరణలు – ఈ పుస్తకం చదివిన తర్వాత మనలో సమసిపోతాయని అంటూ, ఈ గ్రంథానికి తప్పక డాక్టరేట్ ఇవ్వాలని కోరుతూ తన ప్రసంగాన్ని ముగించారు.
సభాధ్యక్షులు శ్రీ గిరిజా మనోహర్‌బాబు మాట్లాడుతూ అసలైన పుస్తకావిష్కరణ ఇప్పుడు జరిగిందని అన్నారు. గొప్ప విషయాలని అంతే గొప్పగా, సరళంగా, సామాన్యుడికి అర్థమయ్యేలా దత్తశర్మగారు చెప్పారని అన్నారు. జాతి మీద ద్వేషం ఉన్నవారికి సంతోష్ సరైన సమాధానం చెప్పినట్లు దత్తశర్మ నిరూపించారని అన్నారు.
శ్రీ కస్తూరి మురళీకృష్ణ మాట్లాడుతూ – ఆదివారమైనా, వీలు చేసుకుని ఈ సభకి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పుస్తకం రావడానికి ఉన్న నేపథ్యాన్ని వివరించారు. ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తిని మరో వ్యక్తి అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నారని, భౌతికపరమైన ఆధిక్యమే కాకుండా, మానసిక ఆధిక్యం నెరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి ప్రయత్నాలే గతంలోనూ మన దేశంలో జరిగాయని అన్నారు. విభిన్న సంస్కృతులు, జాతులు ఉన్న మన దేశాన్ని చీల్చితే సంభవించే మార్పును పరిగణనలోకి తీసుకుంటే ఈ పుస్తకం రావల్సిన అవసరం తెలుస్తుందని అన్నారు. రత్నగర్భ అయిన మన దేశంలో ఆలయాలపై జరిగిన దాడులను ప్రస్తావించారు. కొన్ని శతాబ్దాల పాటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, చారిత్రక విధ్వంసం జరిగిందని అన్నారు. భారతీయులను అణగదొక్కాలంటే, భారతీయ సంస్కృతిని, ధర్మాన్ని నాశనం చేయాలని గ్రహించి అటువంటి చర్యలు చేపట్టారని అన్నారు. అటువంటి ప్రయత్నాల నుంచి కాపాడుకునేందుకు – భారతీయ ధర్మం స్ఫూర్తిని ఒకరి నుంచి ఒకరు అందుకుని – రిలే పరుగు పందెంలోలా బాటన్ అందుకున్నట్లుగా – ముందుకు సాగాలని కోరారు. ప్రజలు తమ మూలాలు మర్చిపోయి, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం లేని మనుషులుగా మారితే తమకి ఉపయోగమని గ్రహించి పరాయి పాలకులు ఆ విధంగా ప్రవర్తిస్తే, మన నాయకులు కూడా వారిలా మారిపోయి వారి బాటలో నడిచారని తెలిపారు. వీటికి జవాబుగా – భారతీయుల ప్రతిక్రియలా, స్వధర్మ పరిరక్షణలో భాగమైన అకుంఠిత పోరాటంలా ‘రామం భజే శ్యామలం’ పుస్తకం వెలువడిందని అన్నారు.
హిందూ ధర్మాన్ని ఎంతగా హేళన చేస్తే తమకి అంత లాభమని విచ్ఛిన్నకారులు భావిస్తున్న వైనాన్ని తెలిపారు. కొన్ని పవిత్రమైన పదాల అర్థాలను – ఎలా తప్పుడు అర్థాలుగా మార్చేస్తున్నారో తెలిపారు. హారతి, గోవిందా, శఠగోపం, చెవిలో పువ్వు.. వంటి పదాలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇలా హేళన చేయడం వల్ల మానసిక ఆధిక్యం సాధించాలని ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించనక్కరలేదని నేటి తరానికి నేర్పుతున్నారనీ, రాముడిని, రామాయాణాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారనీ అన్నారు.
అయితే అటువంటి వారి ప్రయత్నాలకు ప్రజలే గండి కొట్టాలని అన్నారు. మన దేశంలో ప్రతీ ఊరిలో ఒక రామాలయం ఉంటుందని అన్నారు. మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపేది రామాయణమేనని అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నవారి కుట్రలను భగ్నం చేసిన పుస్తకమిది అని అన్నారు.
గతంలో ఇలాంటి ప్రయత్నాలనే సంత్ జ్ఞానేశ్వర్, లల్లాదేవి, అక్క మహాదేవి వంటి వారు తమ రచనల ద్వారా చేసి చూపించారని అన్నారు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి వంటి వారు భారతీయ ధర్మాన్ని కాపాడేడటు వంటి రచనలు చేశారని తెలిపారు. మన దేశంలో తరానికి ఒకరు రామాయణాన్ని రచిస్తూ దేశాన్ని ఏకత్రితం చేసే ప్రయత్నం చేశారన్నారు. దేశ సమైకతను, సంస్కృతిని కాపాడేందుకు వాఙ్మయం ప్రధాన పాత్ర పోషించిందని, అది కొనసాగుతుందని అన్నారు. ఈ పుస్తకాన్ని పదిమందికీ చేరేలా చేయాలని కోరి తన ప్రసంగాన్ని ముగించారు.
సభాధ్యక్షులు శ్రీ గిరిజా మనోహర్‌బాబు మాట్లాడుతూ ఈ పుస్తకం యొక్క బలమైన నేపథ్యాన్ని కస్తూరి మురళీకృష్ణ గొప్పగా వివరించారని అన్నారు. ఈ రచన వెనుక ఉన్న ఆలోచనలను స్పష్టం చేశారని తెలిపారు. భారతీయ జీవితంలో రామాయణం పాత్రని వివరించారు. ఈ సందర్భంలో విశ్వనాథ గారి ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ ఔచిత్యాన్ని ప్రశంసించారు.
అనంతరం రచయిత శ్రీ కోవెల సంతోష్ కుమార్ ప్రసంగిస్తూ తన స్పందనను తెలియజేశారు. ముందుగా పుస్తకాన్ని ఆవిష్కరించిన వరప్రసాద్ రెడ్డి గారికి, సభకి అధ్యక్షత వహించిన గిరిజామనోహర్‌బాబు గారికి, పుస్తకాన్ని సమీక్షించిన పాణ్యం దత్తశర్మగారికి, కస్తూరి మురళీకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సభకి రాలేకపోయినా, తనకి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు కె.వి. రమణాచారి గారికి, భాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి, నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకులు తిగుళ్ల కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రిగారికి నమస్కారాలు తెలిపి కుటుంబ సభ్యులకు అభివాదం చేశారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం చేశారు.
తనకి రాయటం తప్ప, మాట్లాడడం రాదని అన్నారు.
ఈ పుస్తకం రాయడానికి గల నేపథ్యాన్ని వివరించారు. రాముడిని తిడితే బాగా పేరొస్తుందన్న ఒక ప్రముఖ కవి అన్న మాటలూ, అలాగే, సోషల్ మీడియాలో ఓ యువ కవయిత్రి రాముడిపై రాసిన కవిత తనని బాధించాయని తెలిపారు. దానికి ప్రతిక్రియ ఎలా ఉండాలో అన్నది తన తండ్రి గారితో సుదీర్ఘంగా చర్చించానని, తమ సంభాషణల ఆడియో రికార్డింగులు వందకి పైగా ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలో వచ్చిన ఆలోచనల్లోండే ఈ పుస్తకం రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ పుస్తకంలో ఆధ్యాత్మిక కోణంతో పాటు మానవీయ కోణం కూడా ఉందని తెలిపారు.
రాముడు కేంద్రంగా భారతీయుల ఆత్మావిష్కరణకి చేసిన ప్రయత్నం ఈ పుస్తకమని అన్నారు. మన సంస్కృతి, భాషలను అంతర్లీనంగా ఒక తాడుతో కలిపి ఉంచుతున్నది రామాయణమేననీ, ఆ తాడు రాముడేనని అన్నారు. దేశాన్ని ఏకత్రితం చేసేది రామాయణమేనని అన్నారు.
మన దేశపు ఆత్మని నాశనం చేసి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలు వందల ఏళ్ళుగా కొనసాగుతున్నాయని, అసలు రామాయణాన్ని చదవకుండా, ఆ కావ్యంలోని లేని అంశాలను జొప్పించి మూల రామాయాణానికి ఆపాదించి కించపరిచే ప్రయత్నాలు ఇప్పటికీ సాగుతున్నాయని అన్నారు.
దేశన్ని ఓ పథకం ప్రకారం చీల్చాలనే కుట్రని వివరించేందుకు చేసిన ప్రయత్నమే ఈ పుస్తకమని తెలిపారు. ఈ పుస్తకాన్ని ఆదరించాలనీ, అందరికీ చేరేలా చూడాలని కోరి – సభకు హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపి తమ ప్రసంగాన్ని ముగించారు.
కస్తూరి మురళీకృష్ణ మాట్లాడుతూ – ఈ పుస్తకాన్ని దేశంలోని ఇతర ప్రాంతాల వారికి, విదేశీయులకి కూడా చేరువ చేయడం కోసం పాణ్యం దత్తశర్మ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తున్నారని తెలిపారు.
అనంతరం డా. తుమ్మలపల్లి వాణీకుమారి క్లుప్తంగా ప్రసంగించారు. ఈ పుస్తకం తనకెంతో ఆనందం కలిగించిందని అన్నారు. ఇటువంటి ప్రయత్నమే తాను 16 ఏళ్ళ ముందు చేశాననీ, అది అంతగా ఫలించలేదని అన్నారు. భౌగోళిక, చారిత్రక ఆధారాలతో, సాక్ష్యాలు, చిత్రాలలో సహా అందించి సంతోష్ కుమార్ గొప్ప కృషి చేశారని అన్నారు.
అనంతరం వేదికని అలంకరించిన పెద్దలకు శాలువాలతో చిరు సత్కారం జరిగింది. మురళీగారి వందన సమర్పణతో సభ ముగిసింది.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.