ఇది రాముడి కథ కాదు. రామాయణం అంతకంటే కాదు. ఇది భారతదేశ చరిత్ర. భారతదేశంలో భారతీయులు ఒక పథకం ప్రకారం ఎలా అణగదొక్కబడుతున్నారో ఒక పద్ధతిలో వివరించటానికి చేసిన ప్రయత్నం. ముఖ్యంగా గత వంద సంవత్సరాలలో హిందూ జాతిని ఏ విధంగా అప్రదిష్టపాలు చేయటానికి అనేక వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయో వివరంగా వివరిస్తున్న పుస్తకం. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటినుండి ఏ ఏ వర్గాలు హిందూ మూలాలను పెకలించివేయటానికి చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టిన 56 వ్యాసాల సంపుటం ఇది.
మొఘలాయిలు, బ్రిటిష్ వాళ్లు కూడా భారతీయ మూలాలను నాశనం చేయడానికి ప్రయత్నించి కుదరక చేతులెత్తేసిన పరిస్థితులలో స్వాతంత్రానంతరం ఈ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, వాటిని ప్రస్తుతం ఎదుర్కోవలసిన అవసరం ఏమిటి అన్నది రచయిత ఈ పుస్తకంలో విపులంగా చర్చించారు. మెకాలే విద్యా విధానం భారత దేశానికి చేసిన హాని, అనంతరం వివేకానందుడు, మహాత్మా గాంధీ ఎలాంటి విద్యా వ్యవస్థ స్వతంత్ర భారతదేశంలో రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు, వారి ఆకాంక్షలు ఎలా నాశనం చేయబడ్డాయి రచయిత సోదాహరణంగా వివరిస్తారు. ఒక జాతిని నిర్మూలించాలి అంటే ఆ జాతి సాంస్కృతిక మూలాలను కదిలించి వేయాలనంటారు. ఆ దిశగా స్వతంత్ర భారతదేశంలో ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, అవి ఎందుకు జరిగాయో కూడా ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి. వీటన్నిటికీ కారణం ఎవరు, తప్పు ఎవరిది అంటే ఆనాటి ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మరియు ఆయన ప్రభుత్వం వైపుగా వేలెత్తి చూపటం జరుగుతుంది. ఇంతటి గొప్ప పుస్తకం రాయటం రచయిత శ్రీ కోవెల సంతోష్ కుమార్ గారి పూర్వజన్మసుకృతం అని చెప్పవచ్చు.
ఈ పుస్తకంలో 8వ అధ్యాయం ‘భారతీయ పాలనా వ్యవస్థలు’. భారతదేశంలో అనాదిగా వస్తున్న వివిధ రాజ్యాలు, ఆ రాజ్యాలలో ఏర్పాటయినటువంటి వ్యవస్థలు అంటే ఒకరకంగా ఆ రాజ్యాల రాజ్యాంగాలను గురించి క్లుప్తంగా వివరించారు. రామాయణం, భారతం మొదలుకొని కౌటిల్యుని అర్థశాస్త్ర కాలం నుంచి అనంతరం శాతవాహనులు, పల్లవులు, చోళులు, పాండ్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, వరకు మరాఠాలతో సహా ఆయాకాలాలలో ఆయా రాజ్యాలలో ఎలాంటి వ్యవస్థలు ఉండేవి అనేవి వివరించారు. వీటితో పాటుగా భారతదేశం మీద దండయాత్ర చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న మొఘలుల పరిపాలన గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఒక్కొక్క రాజుది ఒక్కో ధోరణి అయినా కూడా మొత్తంగా చూస్తే ప్రతి వ్యవస్థ ప్రజల సంక్షేమం కోసం తనదైన శైలిలో పనిచేసిందని తెలుస్తోంది. మరి మన దేశంలోనే వేద కాలం నుండి మొఘల్ పరిపాలన వరకు వివిధ రాజ్య వ్యవస్థలు ఉండగా మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత రాజ్యాంగ రచనలో భారతదేశం బయట ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాము. ఇక్కడ రచయిత ఒక మాట చెబుతారు ‘రాజ్యాంగ సృష్టికర్తలు రెండున్నరేళ్ల పాటు దేశమంతటా తిరిగారే తప్ప దేశం లోపలికి తొంగి చూడలేదు’. ఈ ఒక్క వాక్యం మన రాజ్యాంగంలోని డొల్లతనాన్ని తెలియజేస్తోందా లేక రాజ్యాంగాన్ని తిరగ రాసుకోవాల్సిన అవసరం ఉందా అనిపిస్తోంది. రచయిత ఈ పుస్తకం రాయడానికి ఏ స్థాయిలో పరిశోధన చేశారో ఈ ఒక్క అధ్యాయం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రచయిత పరిశోధనలకు గుర్తుగా చాలాచోట్ల రిఫరెన్స్ పుస్తకాల వివరాలు కూడా ఇవ్వడం మనం గమనించవచ్చు.
ఈ పుస్తకంలో అనేక అధ్యాయాలు భారతదేశ చరిత్ర ఏ విధంగా వక్రీకరించబడింది వివరిస్తారు. ముఖ్యంగా స్వాతంత్రానంతరం చరిత్రకారులు ఆధునిక భారతదేశ ప్రాచీన చరిత్రను కూడా ఒక పద్ధతి ప్రకారము ఒక ప్రయోజనాన్ని ఆశించి చరిత్రను తప్పుదోవ పట్టించారు అంటారు రచయిత. ఈ వక్రీకరణకు కేంద్రబిందువుగా మార్క్సిస్టు, ఇస్లామిస్ట్ చరిత్రకారులు, మొదలైన వారందరూ మూకుమ్మడిగా రామాయణాన్ని వక్రీకరించడం మొదలుపెట్టారు. కారణం రాముడి చరిత్రను తెలుసుకోవడం అంటే.. అధ్యయనం చేయడం అంటే.. మన ప్రాచీన చరిత్రను, నాగరికతను తెలుసుకోవడం. అందుకే ఈ వక్రీకరణ పద్ధతి ప్రకారం జరిగింది అనేది రచయిత ఉద్దేశం. భారతదేశ చరిత్రను వక్రీకరించిన, తప్పుదోవ పట్టించిన ఆ మహనీయుల గురించి ఒక అధ్యాయం లోనే వివరించడం మనం గమనించవచ్చు. భారతదేశ చరిత్ర లిఖించిన ముఖ్యంగా 19వ శతాబ్దం నుండి మన చరిత్రకారులు అశోకునికి పెద్దపీట వేయటం కనబడుతుంది. అశోక చక్రవర్తిని కావాలని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు అని ఆరోపణలు చేసారు రచయిత. అదే సమయంలో భారతదేశ చరిత్రలో గుర్తుంచుకోవలసినటువంటి ఎందరో శౌర్యవంతులైన రాజుల గురించి చరిత్రకారులు మర్చిపోయారు అంటారు. అలాంటి రాజుల గురించిన వివరాలు పొందుపరుస్తూ ఆయా కాలాలలో వారు సాధించిన విజయాలను, ప్రజలకు చేసిన సేవలను క్లుప్తంగా వివరించారు రచయిత. కేవలం రాజులే కాకుండా భారతదేశ చరిత్రలో మహారాణుల గురించి కూడా ఎన్నో వివరాలను అందిస్తారు. స్వాతంత్రానంతరం మన చరిత్రకారులు ఝాన్సీ లక్ష్మీబాయికి ఇచ్చినంత ప్రాముఖ్యత ఎందుకో మిగిలిన మహారాణులకు ఇవ్వలేదు. ఆ మహారాణుల గురించి ఆయా ప్రాంతాలలో, ఆ ప్రాంతీయ చరిత్రలలో వారి గురించి లిఖించబడింది. అంతేకానీ యావత్ భారతదేశ చరిత్రలో చాలామంది మహారాణులకు విలువ ఇవ్వలేదు మన చరిత్రకారులు అని రచయిత ఆరోపణ. అలాంటి వీర మహిళలు రాణి చెన్నమ్మ, పద్మావతి, సంయుక్త, అహల్యాబాయి హోల్కర్, మరి కొంతమంది కాశ్మీరు రాణుల గురించి క్లుప్తంగా వివరాలు ఇవ్వటం జరిగింది.
భారతదేశ చరిత్రలో ఇప్పటికీ చాలామంది బలంగా విశ్వసించే సిద్ధాంతం ఆర్య ద్రావిడ సిద్ధాంతం. వీళ్లు ఇద్దరూ ఒకటి కాదు వేరు వేరు జాతులు. ఇంతకాలం అనుకుంటున్న ఆర్యుల చరిత్ర కూడా ఒక బూటకం అంటారు రచయిత. ఆదివాసులుగా ఉన్న ద్రావిడులపై దండెత్తి వారిని దక్షిణ భారతదేశానికి పారద్రోలి ఉత్తర భారతదేశంలో సెటిలయ్యారు అన్నది ఒక సూపర్ డూపర్ ధియరీ అని అంటారు. ఆర్యులు విదేశాల నుండి భారత్ మీద దండెత్తి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న జాతి. దక్షిణ భారతీయులు అంటే మనం ద్రావిడుల మూలవాసులు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం జరిగింది. దాన్ని ఇప్పటికీ పట్టుకొని వేలాడుతున్న వాళ్లు చాలామంది ఈ దేశంలో ఉన్నారు. నిజానికి ఆర్య ద్రావిడులు ఒకే జాతి వారని ఈ దేశంలో 60 వేల సంవత్సరాల పూర్వం నుండి నివసిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఇద్దరి పూర్వీకులు ఒకరే అని మన సిసిఎంబి వాళ్ళు నిరూపించటం కూడా జరిగింది. ఇప్పటికైనా మనందరం ఒకటే అని, ఉత్తర దక్షిణ భారతీయులు వేరువేరు కాదు అని ఏకతాటిపై ముందుకు పోవాల్సిన అవసరం వుంది.
ఏ సమాజంలో అయినా ఏ దేశంలో అయినా ప్రజలు అభివృద్ధి చెందాలి అంటే జల వనరులు పుష్కలంగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా నాగరికత అభివృద్ధి చెందేది నదీతీరాల వెంటే అనేది అందరికీ తెలిసిందే. అలా భారతదేశంలో నాగరికత అభివృద్ధి చెందినది గంగా తీరం వెంట అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. హిమాలయ సానువుల్లో జన్మించిన గంగ భారత భూమిని పావనం చేయడానికి కారకుడు భగీరథ మహర్షి. “ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి..” అంటూ మనం పద్యరూపంలో చదువుకున్నా వాస్తవానికి భగీరథుని తపః ఫలితం గంగ భూమి మీదకు రావడం, భారతదేశాన్ని సుసంపన్నం చేయడం అనేది మర్చిపోలేని వాస్తవం. మరి ఈ భగీరథుడు ఎవరు? శ్రీరామచంద్రుడి ముత్తాత. అంటే ఈ దేశంలో రామాయణం రచింపబడింది, శ్రీరాముడు ఈ భూమి మీద నడిచినటువంటి గొప్ప చక్రవర్తి అని మనం ఒప్పుకుని తీరాలి కదా. రాముడు లేడు, రామాయణం ఓ మిథ్య అని ప్రచారం చేసే హేతువాదులు ఈ చరిత్రను అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది అంటూ సాధికారికంగా నిరూపించారు కోవెల సంతోష్ కుమార్. వాల్మీకి రచించిన 6 కాండల రామాయణం అనంతరం చేర్చబడిన ఉత్తర రామాయణం ఈ అనర్థాలు అన్నిటికీ మూలకారణం అని రచయిత వక్కాణిస్తారు. అందుకు భారతదేశ చరిత్ర అంతటిలో అనేక ప్రాంతాలలో రామాయణంలోని విశేషాలను వివరాలను వివరిస్తూ శ్రీరాముని ప్రాశస్త్యాన్ని మరొకసారి తెలియజేశారు.
పురాణేతిహాసాలలో కాలక్రమంలో అనేక కథలు అనంతర కాలంలో రచయితలు, గాయకులు, సామాన్య ప్రజలు కూడా సృష్టించి వాటిని అసలు ఇతిహాసాలలో భాగంగా చేయడం మనం ఎప్పటినుంచో చూస్తున్నాం. వాటిని ప్రక్షిప్తాలు అంటారు. ఇలాంటి ప్రక్షిప్తాలు రామాయణంలో అనేక ఉన్నాయి అని రచయిత నిరూపిస్తారు. సీతా పరిత్యాగం, శంబూక వధ మొదలైనవి ఇలాంటి ప్రక్షిప్తాలే. ముఖ్యంగా రామాయణంలో ఉత్తరకాండ వాల్మీకి రాసింది కాదు అదొక పెద్ద ప్రక్షిప్తం అని రచయిత అనుమానపడ్డారు. కేవలం ఇలాంటి ప్రక్షిప్తాలే కాక 19, 20, 21వ శతాబ్దాలలో వచ్చిన సినిమా, టీవీ మాధ్యమాలు కూడా తగినంత మసాలా కోసం అసలైన వాల్మీకి రామాయణానికి ఎన్నో పిట్టకథలు సృష్టించటంతో అవే అసలైనవి అని జనబాహుళ్యంలో ప్రచారంలోకి రావడం మనం గమనించవచ్చు. ఇలాంటి అర్థం పర్థం లేని, సృష్టించబడిన బడిన కథలు పవిత్రమైన రామాయణ గ్రంథాన్ని అవహేళన చేసే అవకాశం ఉంది. అందరి టార్గెట్ ఆ శ్రీరాముడే కావటం ఆ శ్రీరాముడి చరిత్రను వక్రీకరించడం వల్ల భారతదేశ చరిత్ర కూడా వక్రీకరించబడింది అని కోవెల సంతోష్ కుమార్ ఉద్దేశంగా కనబడుతుంది.
రామాయణ కాలం నాటి పరిపాలనా వ్యవస్థలను విపులంగా చర్చించారు రచయిత. ఈ పుస్తకంలో రాచరిక వ్యవస్థ అయిన మూడు రకాల వ్యవస్థలు ఏ విధంగా పనిచేశాయి అనేది వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. దశరథుడు చక్రవర్తి అయినా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాడు. అందరితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన టువంటి నిర్ణయాలు తీసుకునేవాడు. రామాయణంలో కనిపించే మరో రాజ్యం కిష్కింద. ఇది వానరరాజులది. ఇక్కడ సమస్త అధికారాలు, నిర్ణయాలు కూడా రాజువే. ఇది ఒక ఆటవిక వ్యవస్థ. ఇకపోతే మూడవ వ్యవస్థ రావణుడి లంక. ఇది నియంత రాజ్యం. ఇక్కడ రాజే సర్వస్వం. రాజే దైవం. రాజు మాట శాసనం. దశరథుడి ప్రజాస్వామ్య పరిపాలనకు సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది రావణుడి పరిపాలన. దశరథుడు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే రావణ లంకలో రాజు ఏం చేయాలనుకున్నాడో అనుచరులు అదే చెప్తారు. విభీషణుడు లాంటి వ్యక్తి ఒంటరి పోరాటం చేసినా రావణ లంకలో ఫలితం లేకుండా పోయింది. ఈ రాజ్య వ్యవస్థలు భారతదేశ చరిత్రలో చర్చించటానికి కానీ అనుసరించడానికి కానీ అవకాశం లేకుండా పోయింది అని ఆవేదన చెందుతారు రచయిత. అలాగే రాముడు చాలా చక్కగా నేను మనిషిని మనిషి ధర్మమే నాది అని చాలా క్లియర్‌గా చెప్పాడు. రామ రావణ యుద్ధం ఒక ఉదాహరణగా తీసుకుంటే మనం టీవీలలో సినిమాలో చూసిన దానికంటే భిన్నంగా వాల్మీకి వివరిస్తూ రావణవధ అనంతరం శ్రీరామచంద్రుని శరీరం కూడా రక్తసిక్తమైంది అంటారు సంతోష్ కుమార్. ఇద్దరు సమస్కంధుల మధ్య భీకరమైన పోరాటం జరిగిన తీరు ఇది అంటారు రచయిత. అందుకే ఒకే ఒక్కసారి వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా చదవండి అని సమస్త భారతీయులను ఈ రచయిత వేడుకోవటం ఈ పుస్తకంలో మనకి కనపడుతుంది.
ఈ పుస్తకం చివర కొన్ని అధ్యాయాలు సీతారాముల ఆదర్శ దాంపత్యం గురించి క్లుప్తంగా అయినా బహు రమ్యంగా వివరించారు రచయిత కోవెల సంతోష్ కుమార్. సాధారణ మానవుల వలె భార్యాభర్తల వలె వారిద్దరి మధ్య ఉన్న రాగద్వేషాలు అతి సాధారణమైనవి అంటారు రచయిత. వాల్మీకి విరచితమైనటువంటి సీతారాముల జీవితాన్ని బహు సుందరంగా వర్ణిస్తారు. అలాగే రామాయణంలో మరొ ముఖ్యమైన పాత్ర రావణాసురుడు. ఇటీవల కాలంలో కొందరు ఈ పాత్రని ఆకాశానికి ఎత్తి వేయడం మనం చూస్తున్నాం. కానీ రావణుడు అన్ని అర్హతలు ఉన్న వాడు కాదని ఈ రచయిత అనేక దృష్టాంతాలను తెలియజేశారు
మనం మన దేశ చరిత్రను ఎందుకు చదవాలి? చదివి తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి? ఎందుకంటే మన దేశ చరిత్రలో ఎన్నో విషయాలు, వాస్తవాలు మరుగున పడ్డాయి. మరెన్నో విషయాలు అదనంగా వచ్చి చేరాయి. ఈ అదనంగా వచ్చిన సంఘటనలు, విషయాలు వాస్తవాల్ని దాచిపెట్టి ఇదే చరిత్ర, ఇదే మీ దేశచరిత్ర అంటూ భారతీయుల మీద రుద్దబడింది. ఈ రుద్దుడు కార్యక్రమం నిన్న మొన్నటిది కాదు. రామాయణ కాలం నుంచి జరుగుతున్నది. అప్పటి నుంచి భారతదేశ చరిత్ర వక్రీకరించబడుతున్నది అన్న ఒక అనుమానం అందరిలోనూ ఉంది. ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ వాస్తవాలని వెలికితీసే బృహత్తర కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకున్నారు ఈ పుస్తక రచయిత కోవెల సంతోష్ కుమార్. ఈ పుస్తకం అంతా చదివిన తరువాత ఒక అనుమానం మెదడును తొలిచేసింది. వాల్మీకి రామాయణానికి తోకలు తగిలించింది ఎవరు? ఉత్తరకాండ రచయిత ఎవరు?
అత్యంత అద్భుతమైన రచనా శిల్పంతో మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముని చరిత్రను ఇతివృత్తంగా తీసుకొని ఆదికావ్య నిర్మాణం చేసిన వాల్మీకి రుణం తీర్చుకోవడానికి మనకు శక్తి చాలదు అంటూ చాలా గొప్పగా చెప్పారు ఈ రచయిత. అలాంటి గొప్ప కావ్యాన్ని అసలైన వాల్మీకి విరచిత రామాయణంలోని అనేక పాత్రలు సన్నివేశాలు సంఘటనలు భారతదేశ చరిత్రతో పాటుగా ఏ విధంగా దురుపయోగం చేయబడ్డాయో ఈ పుస్తకంలో రచయిత సోదాహరణంగా వివరించటం పాఠకులకు అత్యంత ఆనందం కలిగిస్తుంది. ఈ పుస్తకం చదివిన తర్వాత అయినా ప్రతి తెలుగువాడు, భారతీయుడు మన చరిత్ర పట్ల ముఖ్యంగా వాల్మీకి రచించిన రామాయణ కావ్యం పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండటం చాలా అవసరం. ఎంత అవసరం అంటే భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం.
***
రచన: కోవెల సంతోష్ కుమార్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పుటలు: 402
వెల: ₹ 300/-
ప్రతులకు
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
రచయిత – 9052116463
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు:
https://www.amazon.in/Ramam-Bhaje-Shyamalam-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B2%E0%B0%82/dp/B0BD4Y6467/
దూరదర్శన్ విశ్రాంత కార్యనిర్వాహణాధికారి