[23 అక్టోబరు 2022 న నారపల్లిలోని స్వాధ్యాయ లైబ్రరీహాలులో ‘రామం భజే శ్యామలం’ పుస్తకావిష్కరణ సందర్భంగా శ్రీ పాణ్యం దత్తశర్మ చేసిన ప్రసంగ పాఠం]
శ్లో:
వైదేహీ సహితం సురదృమ తలే హైమే మహా మంటపే
మధ్యే పుష్పక మాసనే మణిమయే వీరాసనే సుస్థితం
అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్త్వం మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భారతాదిభిః పరివృతం రామం భాజేశ్యామలమ్
ఈ శ్లోకానికి, గురువు గారు శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్య వారు రాసిన ముందుమాటలో, లోతైన అర్థాన్ని చెప్పారు.
“వైదేహి దేహాతీతమైన చైతన్యం. లక్ష్మణుడు ఇందులో లేకున్నా, స్వామివారి ప్రవృత్తిలో ప్రసరించబడే లక్షణంగా భాసిస్తున్నాడు. భరతాదులు.. అంటే శత్రుఘ్నుడు, దేవతలు, మునులు. ఆంజనేయస్వామి శివాంశ. ఆయన తొలి శ్రోత. వీరందరికీ గురుస్థానంలో శ్రీరామచంద్ర పరబ్రహ్మ, పరమార్థాన్ని బోధిస్తున్నాడు. ఇక శ్యామలత్వం ఆకాశానికి సంకేతం. అనంతం. ఆత్మ తొలి ఆవిష్కారం ఆకాశమే.”
కోవెల సంతోష్ కుమార్ శ్రీరాముని పరబ్రహ్మముగానే భావిస్తున్నట్లు, మనుష్యత్వము కేవలం వ్యావహారికమైన సత్యమే ఐనట్లు, వారి తండ్రిగారు రచయిత హృదయాన్ని ఆవిష్కరించారు.
రచయిత మొత్తం 55 వ్యాసాల పరంపరను వ్రాశారు. వాటిలోని విషయాన్ని consolidate చేస్తే ఈ క్రింది అంశాలు స్థూలంగా తేలతాయి.
- పాశ్చాత్యులు మన చరిత్రను, సంస్కృతిని ఎలా తగ్గించి చూపారో, దానిని ఎలా belittle చేశారో వివరించారు రచయిత.
- వారి తర్వాత, మన పాలకులేం తక్కువ తినలేదనీ, విదేశీ పాలకుల మార్గంలోనే మన చరిత్రను సంస్కృతిని distort చేసే ప్రయత్నాలను, అవి సఫలీకృతమైన క్రమాన్ని చెప్పారు.
- కేవలం రామాయణం మీదే, రాముని వ్యక్తిత్వం మీదే విషం ఎందుకు చిమ్ముతున్నారో విశ్లేషించారు.
- కుహానా సెక్యులరిజాన్ని బట్టబయలు చేశారు.
- ఆనాటి రాజరికంలోని అంతర్లీన ప్రజాస్వామ్యాన్ని వివరించారు.
- అశోకుడిని అహింసామూర్తిగా, భారతజాతికి ప్రేరణగా ఎందుకు చేశారో విపులీకరించారు. ఆయన నిజస్వరూపం బయటపెట్టారు.
- బౌద్ధమతం యొక్క లొసుగులు చూపించారు.
- కాలనిర్ణయంలో ఉద్దేశపూర్వకంగా చేసిన అవకతవకలను వివరించారు.
- మనుస్మృతిపై వచ్చిన, మహిళా వ్యతిరేక విమర్శలను తిప్పి కొట్టి, మహిళలలో సైతం అత్యంత చైతన్యశీలురై, ఉద్యమ స్ఫూర్తి రగిలించిన వారిని గురించి తెలిపారు.
- ‘సూపర్ హిస్టారియన్లు’ బయలుదేరి, మన భారతదేశ చరిత్రను ఒక నిశ్చిత పద్ధతి ప్రకారం ఎలా వక్రీకరించారో, దానిలోని డొల్లతనమేమిటో బయటపెట్టారు.
- ప్రపంచ వ్యాప్తంతా లభించిన, లభిస్తూన్న antique ఆనవాళ్ళను సాక్ష్యంగా ఉదహరిస్తూ, నిజమైన కాలనిర్ణయాన్ని, చరిత్రను విశదపరిచారు.
- రాముడిని ఒక టార్గెట్‍గా, శంబూక వధ, సీతా పరిత్యాగం వంటి అంశాలను స్వయం ప్రకటిత మేధావులు, ఎలా తమకు అనుకూలంగా మార్చుకుని ‘శ్రీరామ వ్యక్తిత్వ హననం’ అనే దుర్మార్గానికి పాల్పడ్డారో చెప్పారు.
- రామాయణంలో రాముడు పరబ్రహ్మగా కాకుండా, ఒక మానవునిగా, సుఖదుఃఖాలకు స్పందించేవాడిగా, కోపతాపాలకు అతీతుడు కాని వాడుగా, మొదట ఆయన human, తర్వాతే Divine అని నిరూపించారు.
- ఉత్తర రామాయణాన్ని అదే పనిగా కల్పించి, పూర్వ రామాయణంలో వాల్మీకి మహాముని చెప్పిన అద్భుతమైన రామ తత్వాన్ని ఎలా హీనపరిచారో చూపించారు. రామ పట్టాభిషేకం వరకు ఉన్న versions, ఉత్తర రామాయణంలో ఉన్నట్టుండి రామునికి వ్యతిరేకంగా ఎలా మారాయో, దాని వెనుక ఎవరున్నారో బయటపెట్టారు.
- సుగ్రీవుడు వానర సైన్యానికి సీతాన్వేషణలో దిశానిర్దేశం చేస్తూ – తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం – ఇలా నాలుగు దిక్కులా ఉన్న వివిధ ప్రదేశాలు భూగోళం మీద ఇప్పటికీ ఉన్నాయనీ, దానిని ‘సుగ్రీవుని అట్లాస్’గా అభివర్ణించారు. అప్పటి భరతఖండ వర్ణన అది. ఇప్పుడు కూడా కొద్ది మార్పులతో అట్లే నిలిచి ఉందని నిరూపించారు.
- ప్రస్తుత శ్రీలంక రావణ లంకయే యని నిర్ధారించారు. రామసేతు నిర్మాణం నిజంగా జరిగిందని, సముద్రంలో లోతు తక్కువగా ఉన్న చోట దానిని నిర్మించుకుంటూ వెళ్ళారని చూపారు, ప్రమాణాలతో సహా.
- రామాయణంలో సీతాదేవి ప్రాముఖ్యతను, ఆమె ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాని, రాజీ పడని మనస్తత్వాన్ని, అరణ్య వాసం లగాయితు, అగ్నిప్రవేశం వరకు సోదాహరణంగా విపులీకరించారు.
- రామ రావణ యుద్ధం భయంకరమైన అస్త్రాలతో రక్తసిక్తమైన శరీరాలతో జరిగిందని; సినిమాలలో చూపినట్లుగా కాదని నిరూపించారు.
- ఏ అంశం తీసుకున్నా, శ్రీరాముని పురుషోత్తముడిగా, రూపు దాల్చిన ధర్మంగా, సుఖదుఃఖాలకు స్పందించే మామూలు మానవునిగానే కోవెల వారు ఆయనను ఆరాధించారు. ఆయనను మానవాతీత, దైవాంశసంభూతునిగా, దివ్య మహిమా సమన్వితుడుగా చూపడానికి ప్రయత్నించలేదు.
- ఈ కారణం వల్లనే, శ్రీరాముడిని భారతీయులు తమ స్వంతం చేసుకున్నారనీ, ఆయన కష్టాలను తమ కష్టాలుగా భావించారని, ఆయన నిర్ణయాలతో ఏకీభవించారని రచయిత స్పష్టం చేశారు.
ఇవీ ఈ గ్రంథంలో నాకు తోచిన స్థూలమైన అంశాలు. నాకు సాధ్యమైనంత మేరకు, ఈ వర్గీకరణ చేశాను. ఇక విపులీకరిస్తూ ముందుకు సాగుతాను.
కావ్యం కాదు చరిత్రే:
రామాయణం నిస్సందేహంగా చరిత్రే. కేవలం కావ్యం కాదు. రాముడు ఒక కల్పిత పాత్ర కాదు. అందుకే రామ రామాయణానికి సార్వకాలీనత ఏర్పడిందంటారు కోవెల. రామాయణానికి, భారతదేశానికి అభేదం అంటారు. అది నిజం. 5550 పైగా సంస్థానాలు, భిన్న భాషలు, మతాలు, సంస్కృతులు, కులాలతో అత్యంత సంక్లిష్టమైన భారతదేశాన్ని ఏక సూత్రంతో ఏకత్రితం చేసింది రామాయణమే, సీతారాములే.
భారతీయ సనాతన ధర్మాన్ని మూలచ్ఛేదం చేసే ప్రయత్నం నెహ్రూ అండ్ కో ప్రారంభించారు. ఆ ప్రయత్నంలో రామాయణం పుక్కిటి పురాణం అని ప్రచారం మొదటి మొట్టు. రెండవది రాముడి వ్యక్తిత్వ హననం. మూడవది రామాయణం భారతదేశంలో పుట్టనే లేదని చెప్పడం. గాంధీ గారి ప్రభావం తగ్గించి, హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టు కనిపించకుండా, మైనారిటీలను నెత్తికెత్తుకున్నట్లు కనిపించకుండా చాలా తెలివిగా ఎత్తువేశారు. రామాయణం కేవలం ఒక మతపరమైన గ్రంథంగానే పరిగణించారు. రాముడిని ఒక myth గా మార్చారు. బౌద్ధాన్ని ప్రమోట్ చేయసాగారు. రాముడిని విలన్ చేయడం కోసం బుద్ధుడి కంటే కూడా అశోకుడు హీరో అయ్యాడు.
Suspension of Readers’ Disbelief:
ఇదంతా రచయిత వివరిస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అదే సమయంలో ఆయన మీద నమ్మకం కలుగుతుంది. ఏదైనా లేశమాత్రం అపనమ్మకం ఉన్నా, తర్వాత వ్యాసాలలో దీనిని ఆయన తార్కికంగా, ఋజువులతో వివరిస్తున్నప్పుడు, పాఠకుల లోని అపనమ్మకం పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది. దీనినే ఆంగ్లంలో ‘Suspension of Readers’ Disbelief’ అని అంటారు. దానిని సాధించినప్పుడే ఇలాంటి పరిశోధనాత్మక గ్రంథాలు విజయవంతమవుతాయి. సోదరుడు సంతోష్ కుమార్ ఈ విషయంలో పూర్తిగా కృతకృత్యుడైనాడని నేను బల్ల గుద్ది చెప్పగలను.
రాముడు ముందు తాను ఆచరించి, అనుసరించి, తర్వాతే లోకానికి దారి చూపాడు. ‘సీతాయాః చరితం మహత్’ అన్న మాటలోనే రామాయణంలో మహిళల పట్ల వివక్ష లేదని తెలుస్తుంది.
హిందూ కోడ్ బిల్లు:
హిందూ ధార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయటానికి ఆనాటి పాలకులు హిందూ కోడ్ బిల్లు తెచ్చారు. ఇతర మతాల జోలికి పోలేదు. దీని వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనమైంది. దంపతులు విడిపోవడం ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, ఒంటరి తల్లిదండ్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు.. ఇలా భారతదేశం మునుపెన్నడూ చూడని విషయాలు సంభవించసాగాయి.
సెక్యులరిజం:
ఇదొక బ్రహ్మ పదార్థంగా, ఎవరికీ అంతుపట్టనిదానిగా తయారు చేశారంటారు రచయిత. “అన్ని మతాలు సమానమే గాని ఒకటి మాత్రం చాలా ఎక్కువ సమానం” అని పరిహసిస్తారు. దానికి తార్కాణం 1952 అక్టోబరు 17న నెహ్రూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో క్రైస్తవ మిషనరీలు చేసే ఎలాంటి కార్యక్రమాలనైనా అడ్డుకోకూడదని ఆదేశించారు. ఒక ముస్లిం మీద దాడి జరిగితే వామపక్ష, మేధాహక్కుల బృందాలు గగ్గోలు పెడతాయి. హిందువుల మీద జరిగితే నోరు విప్పవు.
ముస్లింలలో ఒక అభద్రతా భావాన్ని ఎన్నటికీ అంతరించకుండా సెక్యులరిస్టులు జాగ్రత్త వహించారంటారు కోవెల.
విద్యావిధానం:
మెకాలే విద్యావిధానం కేవలం గుమాస్తాలను తయారు చేయడానికే పనికొస్తుంది. నిజమైన జ్ఞానాన్ని ఇవ్వదు. స్వాతంత్య్రానంతరం అదే కొనసాగింది. గాంధీ గారి విద్యా దృక్పథం పెడచెవిని పెట్టారు. వివేకానందుని ఆలోచనలను పక్కనబెట్టారు. ఈ wasteful, positively harmful (గాంధీ గారి మాటల్లో) విధానాన్ని NCERT, NIECA నెత్తికెత్తుకున్నాయి. ఇందిర దీన్ని మరింత బలపరిచారు. 1969లో JNU ఉనికిలోకి వచ్చింది. దానికి అనుబంధం AMU. ఈ రెండూ మెకాలే మానస పుత్రులను తయారు చేయసాగాయి. ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తాం అని నినదించే స్థాయికి ఆ విద్యార్థులు ఎదిగారు.
దోపిడి, విధ్వంసం:
భారతదేశంలో అంతులేని సంపద పోగుపడి ఉంది. అందుకే విదేశీ మూకలు మనమీద దాడులు చేసి మన సంపదను దోచుకుపోయారు. దానికి వీలుగా రైళ్ళూ, రోడ్లు వేసుకుని, దాన్ని అభివృద్ధిగా చూపించి మరీ దోచుకున్నారు. కొన్ని శతాబ్దాల పాటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, చారిత్రక విధ్వంసం ఎలా జరిగిందో ఈ పుస్తకం తేటతెల్లం చేస్తుంది.
రామాయణంలో పాలనా వ్యవస్థ – అయోధ్యకాండ:
వేలమంది మూర్ఖులను విడిచిపెట్టినా, ఒక మేధావిని మాత్రం చేరదీయాలి అని భరతునికి రాముడు ఉపదేశిస్తాడు. మన పాలకులు దీనికి రివర్స్‌గా చేస్తారు. సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగులకు పనులను ఒప్పజెప్పాలి. ఆదాయం కంటే ఖర్చు తక్కువగా ఉండాలి. అపాత్రుల చేతుల్లోకి డబ్బులు వెళ్ళకూడదు.
భారతంలో రాజధర్మం:
భీష్ముడు ధర్మరాజుకు ఇలా బోధిస్తాడు. అధికారం విలాసాలను అనుభవించడానికి కాదు. ధర్మం కొన్ని విలువలకు కట్టుబడి ఉంటుంది. పాలకునికి మంచి వ్యక్తిత్వం ఉండాలి. నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలి. దేశం పౌరుల సంక్షేమం కోసమే.
రాజరికంలో ప్రజాస్వామ్యం:
రామాయణంలో మూడు రకాల రాజ్యవ్యవస్థలను మన దృష్టికి తెస్తారు రచయిత. మూడూ పరస్పర భిన్నాలు.
- అయోధ్య (ప్రజాస్వామిక రాజరికం)
- కిష్కింధ (అరాచకం)
- లంక (నియంతృత్వం)
రామునికి పట్టాభిషేకాన్ని నిర్ణయించినప్పుడు అందరూ ఏకగ్రీవంగా జేజేలు పలుకుతారు. అప్పుడు దశరథునికి అనుమానం వచ్చిందట. తాను ఇంత వరకు బాగా పాలిస్తున్నాడా లేదా, వీళ్ళకు అసంతృప్తి ఉండి ఇలా చేస్తున్నారా? అని. అదేం లేదు మహా ప్రభో అని ఆయనకు నచ్చచెప్పారట. రాజు తన వారసుని ఎంపిక చేయడానికి గ్రామ స్థాయి నుండి రాజధాని దాకా అన్ని స్థాయిల్లోని ప్రజలను సంప్రదించాడు. ఇది ప్రజాస్వామ్యం కాక మరేమిటి? అని అడుగుతారు రచయిత.
తారుమారు చరిత్రకారులు:
“భవిష్యత్తులోకి మనం వెళ్ళడానికి వర్తమానంలో ఉత్ప్రేరకంగా ఉపయోగపడేది గతం” – కోవెల వారు గతానికిచ్చిన చక్కని నిర్వచనం ఇది.
స్వాతంత్య్రం తర్వాత, అదేం ఖర్మమో మన చరిత్ర నిర్మాణం అంతా కమ్యూనిస్ట్ దృక్పథంతోనే, ప్రభుత్వ జోక్యం తోనే జరిగింది తప్ప భారతదేశ భావనలో జరుగలేదు అంటారు రచయిత. శాస్త్రీయత అంటే మార్క్సిజమే అన్న మౌడ్యంలో పాలకున్నారంటారు. చరిత్రను గురించి పరిశోధించాల్సిన ప్రభుత్వ సంస్థలన్నీ, భారతదేశ అస్తిత్వానికి వ్యతిరేకులు, పాశ్చాత్య, సామ్రాజ్య, సామ్యవాద సిద్ధాంతకర్తలతో అర్ధ శతాబ్దం పాటు నిండిపోయాయి అని రచయిత ఆవేదన. AMU ప్రొఫెసర్ మహమ్మద్ హబీబ్, నూరుల్ హసన్, రోమిలా థాపర్ ICHR ను ఏలారు. 1926 నుంచే ఈ తారుమారు మేధావులు తమ తప్పుడు వాదనలను ప్రచారం చేయసాగారు. తర్వాత వారికి ప్రభుత్వ అండ వుండనే ఉంది. వారి అమూల్య సిద్ధాంతాలు
- భారతదేశంలో ఇస్లాం చొరబడలేదు.
- స్వదేశీ రాజులపై దాని ప్రభావం నిల్.
- ఇస్లాంలోకి హిందువులను బలవంతంగా అసలు మార్చలేదు.
- నిమ్న కులాల వారే బ్రాహ్మణుల, ఇతర అగ్రవర్ణాల అణచివేత నుండి బయటపడడానికి దానిని స్వచ్ఛందంగా కౌగిలించుకున్నారు (embrace).
- సమాజ సమానత్వం ఇస్లాం వల్లే సాధ్యమైంది.
చరిత్ర వక్రీకరణ – మూడు కోణాలు:
- ఆర్యులు భారతీయులు కానే కారు. వేదాలు ఇక్కడ పుట్టలేదు. సంస్కృతం ఈ దేశానిది కాదు అని నిరూపించడం.
- దండెత్తి వచ్చిన ముస్లిం రాజుల అమానుష రికార్డులను మరుగుపర్చడం. వారిని మత సామరస్యానికి ప్రతీకలుగా చూపడం.
- స్వాతంత్ర్య పోరాటానికి నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా మలచడం.
పైవన్నీ, ‘చింతపండు తియ్యగా ఉంటుంది’ అన్నంత అబద్ధాలు.
H. R. Wilson – The Puranaas/ రోమిలా థాపర్ పురాణాల పుట్టుక Duration:
ఈయన అన్ని పురాణాలను తిరస్కరించాడు. కానీ బుక్ రాసిన నాటిక మహా అయితే రెండు మూడు వందల ఏండ్ల ముందు పుట్టి ఉంటాయని చెప్పి, మన పుట్టి ముంచాడు. 12వ శతాబ్దంలో వరాహ పురాణం పుట్టిందని, రామాయణం కూడా అప్పుడే జరిగిందని తేల్చేశాడు. వేదాలు పశువుల కాపర్లు పాడుకునే పాటలన్నాడు. రోమిలా థాపర్ భారత చరిత్ర అర్యుల దండయాత్రతోనే ప్రారంభమయిందన్నారు. ఇరాన్ ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చి, పంజాబ్‌లో స్థిరపడి, ఢిల్లీ దాకా వెళ్ళి విస్తరించారు. నాలుగు వేదాలు రాసుకున్నారు. సింధు నాగరికతతో వీళ్ళ కెలాంటి సంబంధం లేదు. వీళ్ళు గొప్ప గొప్ప నగరాలను నిర్మించడానికి కనీసం వెయ్యి సంవత్సరాలు పట్టింది. ఇదీ ఆవిడ సిద్ధాంతం.
సూర్య సిద్ధాంత గ్రంథం – గోళాధ్యాయనం (29-32 శ్లో):
దీని ప్రకారం భూమి సమఘనవృత్తం. గోళాకారం. రోదసి మధ్యలో వ్యోమ కక్ష, మధ్యలో నక్షత్ర కక్ష. అందులో 12 రాశులు, 9 గ్రహాలు. దానికి దిగువన నక్షత్ర గణాలతో కూడిన భూగోళం.
ప్రస్తుత సోలార్ సిస్టమ్ దీనికి సమానంగా ఇంచుమించు ఉంటుందని రచయిత సూత్రీకరించారు.
రామాయణ వక్రీకరణ:
ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే, దాన్ని చదువుతుంటే మన రక్తం ఉడికి పోతుంది. తర్వాత దుఃఖం వస్తుంది (నా అనుభవం).
- అయోధ్య అనేది లేదు. అది ఒక బౌద్ధ క్షేత్రం.
- రామాయణం పుక్కిట పురాణం, భారతం తర్వాత జరిగింది.
- రాముడు దుర్మార్గుడు, రావణుడు బంగారు కొండ.
- ఇది ఆర్యులు ద్రావిడులపై చేసిన యుద్ధం.
- రాముడు దళిత ద్వేషి, శంబూకుడిని చంపాడు.
- అతడు ఏకపత్నీవ్రతుడు కాదు, నలుగురు భార్యలున్నారు.
- రామాయణం ఇండోనేసియాలో జరిగింది.
వాల్మీకి-నారదుడు-సంవాదం.
దీనికి రచయిత తార్కికమైన వివరణ ఇచ్చారు. నారదుడు రాముని గురించి చెప్పి కావ్యం రాయమన్నాడు. ఇదంతా (సోర్స్) మొదటి పది శ్లోకాలలోనే ఉంది. ఇది భూమిపై జరిగిన కథే అని ఆయన స్పష్టం చేశాడు. ఆయోధ్య సరయూ నదీ తీరంలోని కోసల దేశంలో ఉందనీ, దాని విస్తీర్ణం లెక్కలు కూడా అయన విస్పష్టంగా చెప్పాడు.
అనుష్టుప్ ఛందస్సు, ఒక కాకతాళీయపు అద్భుతం:
జంట పక్షులలో ఒకదానిని చంపిన బోయవానితో వాల్మీకి అన్న మాటలు అప్రయత్నంగా ఛందో రూపాన్ని సంతరించుకోవడం దైవసంకల్పం.
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః।
యత్ క్రౌంచమిథునాదేకం అవధీః కామమోహితమ్॥
వాల్మీకి శిష్యుడు దానిని కంఠస్థము చేసినాడు. దీన్ని శ్లోకం అంటారని ఆయన స్పష్టంగా చెప్పాడు. అంతకు ముందు శ్లోకమనేదే లేదు.
మన సంకల్పం – చరిత్ర:
“జంబూద్వీపే, భరత వర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య నైరుతి ప్రదేశే, శ్రీ కృష్ణాగోదావర్యోః మధ్యమ ప్రదేశే, కలియుగే ప్రథమ పాదే.. నామ సంవత్సరే.. మాసే.. పక్షే.. తిథ్యాం.. వాసరయుక్తానం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం..” అని మన కాలాన్ని, ప్రదేశాన్ని చెప్పుకొనే సంప్రదాయం మనకు ఉంది.
రామాయణంలో కాలనిర్ణయం:
అయోధ్య, కిష్కింధ, యుద్ధకాండల్లో స్పష్టంగా ఋతువుల నిర్ణయం చేశారు వాల్మీకి మహర్షి. భాద్రపదంలో వర్షాకాలం, ఆశ్వీజ పూర్ణిమ నుండి వేసవి కాలం, వైశాఖంలో శిశిరం.. ఇలా
శ్రీరామ జననం:
పుత్రకామేష్టి తర్వాత ఆరు ఋతువులు గడిచాయి. అంటే ఒక సంవత్సరం తర్వాత, చైత్ర నవమి నాడు, పునర్వసు నక్షత్రంలో, రాముడు పుట్టాడు. గ్రహాలన్నీ అత్యంత ఉచ్చస్థితిలో ఉన్నాయి. క్రీ.పూ. 7323 డిసెంబరు 4న మర్యాదాపురుషోత్తములు స్వామి భూమి మీదకు వచ్చారు సోమవారం మధ్యాహ్నం 12 – 1 గంటల మధ్య.
- సీతారాముల వివాహం – 7 ఏప్రిల్ 7307 B.C.
- వనవాసం – 29 నవంబర్ 7306 B.C.
- సేతు నిర్మాణం – 26-30 నవంబర్ 7292 B.C.
- రావణ వధ – 15 నవంబర్ 7292 B.C.
వీటన్నింటికి ప్రమాణాలు చూపారు రచయిత.
బుద్ధుడు – ఇక్ష్వాకు వంశం వాడే:
మహాభారత యుద్ధం తర్వాత కొనసాగిన ఇక్ష్వాకు వంశంలో బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు 23వ రాజు. సిద్ధార్థుడు తన 29వ ఏట జ్ఞానాన్ని అన్వేషిస్తూ బయలుదేరాడు. ఆరేండ్ల తర్వాత బుద్ధుడయ్యాడు.
శ్రీరామునికి ప్రత్యామ్నాయం – అశోకుడు:
అశోకుడు ఒక సూపర్ ‘న్యూమరీ పోస్ట్’ అంటారు రచయిత. శ్రీరాముడి ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు ఆయనను రంగంలోకి తెచ్చారు కుహానా సూపర్ హిస్టారియన్స్. నాలుగు సింహాలు, ధర్మచక్రం.. సరేసరి! భారత ప్రభుత్వం అదే పనిగా బౌద్ధాన్ని మార్కెటింగ్ చేసిందంటారు కోవెల. సుపరిపాలనకు, దేశ పునర్నిర్మాణానికి పునాది కావల్సిన రామాయణం అలా కాలేదు. యుద్ధకాండ చివర్లో రామరాజ్య వర్ణన ఉంది. ఇదంతా వదిలేసి, అశోకుడినే ఎందుకు ప్రమోట్ చేశారు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అశోకుడు – గ్లోరిఫికేషన్ (నిజానికి రక్త పిపాసి – కళింగ యుద్ధం – పరివర్తన – అంతా కల్పితం):
మనకు తెలిసి, అశోకుడు ఒక గొప్ప రాజు. కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మత స్వీకారం చేశాడు. ఇదంతా కట్టుకథ అని తేల్చారు రచయిత. అలా అని ఏ బౌద్ధ మత గ్రంథంలోనూ లేదు. పైగా ఆయన బౌద్ధాన్ని కేవలం రాజకీయంగా వాడుకున్నాడా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మనకు కూడా నిజమే అనిపిస్తుంది. కళింగ యుద్ధానికి సంబంధించిన శిలాశాసనం గుజరాత్ లోని గిర్నార్‍లో లభించింది. కళింగ ఒరిస్సాలో ఉంది. దీనిపై అతని పేరు ప్రియదస్సి. యుద్ధంలో లక్ష మందిని చంపి, మరో లక్షన్నర మందిని యుద్ధ ఖైదీలుగా తీసుకువెళ్ళాడు. ధౌలి (భువనేశ్వర్) శాసనంలో ఆయన పశ్చాత్తాపం కంతే తాను మరో తీవ్రహింసకు పాల్పడతానని ఉన్నదే తప్ప, క్షమాపణ చెప్పినట్టు అనిపించదని కుండ బద్దలు కొట్టారు కోవెల వారు. ‘దేశాన్ని ఏలిన అత్యంత క్రూరమైన రాజుల్లో అశోకుడు మొట్టమొదటి స్థానంలో ఉంటాడు’ – రచయిత ఈ మాటలు మనకు కనువిప్పు కలిగిస్తాయి.
షాజహాన్-ముంతాజ్/సీతారాములు:
19 ఏండ్లలో 14 సార్లు భార్యను గర్భవతి చేసి, ఆరోగ్యం క్షీణించి చనిపోయేలా చేసి, పాతిపెట్టిన ఆరు నెల్లకు ఆ ఎముకలను తెచ్చి ఇంకో చోట పూడ్చి, పాలరాళ్లు కప్పితే, దాన్నో ప్రపంచ వింతగా, అమర ప్రేమకు చిహ్నంగా, మసి పూసి మారేడుకాయ చేసి, మనకు చూపారు. నిజంగా ఆదర్శ దంపతులైన సీతారాములు మనకు లెక్కలేదు. రచయిత ఆవేదనను, అక్కసును, మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మన పాలకుల్లో చంద్రగుప్త మౌర్యుడు, రాజరాజ చోళుడు, కనిష్కుడు, రాణా ప్రతాపుడు, ఛత్రపతి శివాజీ, సముద్రగుప్తుడు, భోజ మహారాజు, విక్రమార్కుడు, శ్రీకృష్ణదేవరాయలు, లలితాదిత్య చక్రవర్తి, ఇలా ఎందరో ఉందగా ‘అశోకా ది గ్రేట్’, ‘అక్బర్ ది గ్రేట్’ లే మనకు హీరోలయ్యేలా మన చరిత్ర వక్రీకరించబడింది. అట్లే మహిళా పరిపాలకులైన రుద్రమ, విష్ఫల (ఋగ్వేదం), ఝాన్సీ లక్ష్మీబాయి, పద్మావతి, అహల్యాబాయి హోల్కర్, మీరాబాయి (యుద్ధ విద్యలోనూ), రాణి సంయుక్త, తారాబాయి (శివాజీ మహారాజ్ కోడలు) – వీరితో బాటు అవధ్ రాజు వాజిద్ ఆలీషా భార్య బేగం హజ్రత్ మహల్‍ను కూడా గొప్ప యోధురాండ్రలో ఒకరిగా ప్రస్తావిస్తారు రచయిత. దీనితో ఆయన నిజమైన సెక్యులరిస్టుగా సాక్షాత్కరిస్తారు.
వాట్సప్ పరిశోధకులపై చెణుకులు:
వాట్సప్ చర్చలను పరిహసిస్తారు కోవెల. వేదం ఒక మతమట. వేదమతంలో దయ, ప్రేమలకు తావు లేదట. బుద్ధుని తర్వాతే ఇవి వేదాల్లో ఉపనిషత్తుల్లో చేర్చారుట. వీటినే ఏసుక్రీస్తు అడాప్ట్ చేసుకుని ప్రపంచానికి చాటాడట. బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టినట్లుంది. కూపస్థ మండూకాలతో పోల్చారు రచయిత ఇలాంతి వాళ్లను. మన వాదనకు హేతువునడుగుతారు. తమ వాదనకు ప్రాతిపదికను చెప్పరు.
గౌతమ బుద్ధునికి ముందు సమాజం, మతం:
రచయిత వాదనాపటిమకు, సత్యశోధనకు, తార్కిక జ్ఞానానికి మచ్చుతునక ఈ చర్చ. బుద్ధునికి ముందు ఒక సమాజం ఉండాలి కదా, అదీ ఒక మతాన్ని అనుసరించి ఉండాలి కదా! దాని జీవన మార్గం ఏమిటి? 29 సంవత్సరాలు ఆయన అదే సమాజంలో జీవించాదు కదా! ఆ మతం, ధర్మం ప్రకారమే ఆయన వివాహం జరిగి ఉంటుంది కదా! అందులో మంత్రాలు ఉండినాయా? దాంపత్య ధర్మం, గృహస్థాశ్రమం ఆయన పాటిమ్చాదు కదా! సో కాల్డ్ కుహానా చరిత్రకారులు ఈ విషయంలో నోరు విప్పరు.
రాముడు – కరుణ:
రాముని జీవితకాలంలో ఉన్నదంతా కరుణే. యుద్ధరంగంలో రాక్షసులు చనిపోతుంటే -”ఒక్కడు చేసిన నేరానికి ఇందర్ని బలిచేయాల్సి వస్తూన్నదే” అని బాధపడతాడు. కైక, భరతుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, గుహుడు, శబరి, జటాయువు, సంపాతి.. ఇలా రాముడు దయ చూపని జీవులేరి? అని ప్రశ్నిస్తారు రచయిత.
కులం:
రఘుకుల దీపకుడు, యదుకుల భూషణుడు ఇలాంటి ప్రయోగాల్లో వంశమే రిఫర్ అవుతుంది కాని కులం కాదు. అది సమూహపరంగా వాడబడింది. అంతే కాని ‘Caste’ అనే అర్థంలో కాదు.
‘చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మవిభాగశః’ – అని గీతాచార్యుడు చెప్పాడు. ‘జన్మనాజాయతే శూద్రః, కర్మణాజాయతే ద్విజః’ అని చెప్పబడింది. ఏ కులాన్నీ తక్కువ చేయలేదు. మన సనాతన ధర్మం కులాన్ని బట్టి వ్యక్తుకలు గౌరవాన్ని ఇవ్వలేదు. ధర్మవ్యాధుడు, మాలదాసరి, అరుంధతి, వాల్మీకి, ఇలా ఎందరో జ్ఞానానికి కులానికి సంబంధం లేదని నిరూపించారు.
సంస్కృతం:
జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలంబునన్ అన్న మాటను నిరూపించి చూపారు రచయిత శాస్త్రీయంగా. ప్రోటో ఇండోయూరోపియన్ భాషలన్నింటిలోనూ సంస్కృత ఛాయలు కనబడతాయి. వాటి స్థానంలో సంస్కృతాన్ని ఉంచి కొత్త మ్యాట్రిక్స్‌గా ట్రాన్స్‌ఫామ్ చేస్తే మాథమాటిక్స్ పరంగా వచ్చే ఫలైతాలు నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అవుతాయి. అన్ని భాషలు సంస్కృతంలో ఇముడుతాయి.
జన్యు అధ్యయనాలు – వలసలు – మన డిఎన్ఎ:
వివిధ వ్యక్తుల నుంచి శాంపిల్స్ సేకరిస్తారు, ముఖ్యంగా లాలాజలాన్ని! దాని శుభ్రపరిచి, దాన్నుండి సీక్వెన్సింగ్ చేయడం ద్వారా డేటాను తెలుసుకుంటారు. దాని నుంచి మాథమెటికల్ అనాలిసిస్ చేస్తారు. తర్వాత SQP విధానం ద్వారా అన్ని రకాల గణాంకాలను కనుగొని, వాటి ఆధారంగా జన్యు ఉత్పరివర్తనాల కాలాన్ని అంచనా వేస్తారు. ఈ రంగంలో రచయిత కున్న లోతైన పరిజ్ఞానం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే భారతదేశానికి ఏ యుగంలోనూ, ఏ దశలోనూ వలసలు వచ్చినట్లుగా, భారతదేశంలోకి జన్యు ప్రవాహం జరిగినట్లుగా, ఎటువంటి ఆధారం లభించదు. ఆర్యులు, ద్రావిడుల జన్యువు ఒక్కటే. వారు వీరు వేరు కాదు, అందరం ఒక్కటే అని conclusion ఇస్తారు కోవెల. మన DNAలో గుణాత్మకమైన నాగరికత సమాజపు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. అతి ప్రాచీనతకు సాక్ష్యాలైన వస్తువులు లభిస్తాయి.
ఉత్తర రామాయణం – ఒక అభూత కల్పన:
వాల్మీకి రామాయణం యుద్ధకాండతో ముగుస్తుంది. మరి ఈ ఉత్తర రామాయణం ఎలా వచ్చింది? యుద్ధకాండ చివర ఫలశ్రుతి స్పష్టంగా ఉంది. కానీ రాముడిని తిట్టడానికి కావల్సినంత స్టఫ్ ఉత్తర రామాయణంలో ఉందంటారు రచయిత. ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేర్చడం జరిగింది. విశ్వనాథ వారు కూడా రామాయణం ఆరు కాండలేనని స్పష్టం చేశారు. తన కల్పవృక్షాన్ని కూడా అంతవరకే రాశారు. 1874లో రాల్ఫ్ టి. హెచ్. గ్రిఫిత్ రామాయణాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అందులోనూ ఆరు కాండలతో ముగుస్తుంది.
తులసీదాస్ రామచరిత్ర మానస్ లోని ఉత్తరకాండతో సైతం ఈ పైత్యపు కథనాలు కనిపించవు.
శంబూక వధ:
రాముడిని దళిత వ్యతిరేకిగా, దుర్మార్గునిగా చిత్రీకరించడం కోసం దీన్ని వాడుకున్నారు. శంబూకుడు తపస్సు చేసినందువల్ల రాముడు అతని శిరస్సును ఖండించాడట. దళితుడు తపస్సు చేయకూడదని ఎక్కడా లేదే? మరి శబరి తపస్సును ఎందుకు అంగీకరించాడు? పొంతన లేని విషయాలు ఇవి.
సీతాపరిత్యాగం:
ఇదీ హేతుబద్ధంగా ఉండదు. శంబూక వధ వల్ల గ్రామాల్లో పిల్లలు చనిపోతున్నారన్న వాళ్ళు, లంకలో అన్ని రోజులున్న సీతను ఏలుకుంటున్నాడని నిందలు వేస్తారా? ఆదర్శ దంపతులు వారు. భార్యను ఎవరో వాగిన మాటలను విని అడవుల్లో వదిలేస్తాడా? అప్పుడు ఆదర్శ పురుషుడు ఎలా అవుతాడు? అని ప్రశ్నిస్తారు రచయిత.
రాముడు మనలాంటి మనిషే:
‘ఆత్మానం మానుషం మన్యే రామం దశరాథాత్మజం’ అని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. ఎక్కడా మిరకిల్స్ చేయలేదు. మనిషిగా సుఖదుఃఖాలు, కోపతాపాలు, ప్రేమానురాగాలు అన్నీ ఆయన ప్రదర్శించాడు. అగ్నిపరీక్ష ద్వారా సీతను మహాతేజోమూర్తిగా నిరూపించాడు.
సుగ్రీవుడి అట్లాస్ – సమగ్రం, సత్యం, విపులం:
వానర వీరులకు సుగ్రీవుడు సీతాన్వేషణలో దిశానిర్దేశం చేస్తూ, భరతఖండంలోని నాలుగు దిక్కులలోని ప్రదేశాలను వర్ణిస్తాడు. ఇవన్నీ authentic గా ఈ రోజుకు కొన్ని మార్పులతో ఉన్నాయి. ఆయా దేశాలు, నదులు, పర్వతాలు అన్నీ..
రామసేతు – రావణలంక, శ్రీలంక ఒకటే:
ధనుష్కోడి నుండి శ్రీలంక లోని మన్నార్ వరకు 36 కిమీ మేరకు సేతువు కనిపిస్తుంది. ఆకాశం నుంచి చూస్తే అది నక్షత్రాకారంలో ఉంది. మహేంద్రగిరి మీదుగా సముద్రంలో లోతు తక్కువ ఉన్న చోట్ల సేతువు నిర్మించాలని నలునికి సముద్రుడు సూచించాడు. ఇది man-made bridge అని నాసా సహా పలువురు శాస్త్రవేత్తలు ఋజువు చేశారు. 2017 డిసెంబరు 11న సైన్స్ ఛానెల్ దీని మీద స్పెషల్ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది.
కిష్కింధకాండలో సుగ్రీవుడు చెప్పిన వివరాల ప్రకారం లంకాద్వీపం త్రికూట పర్వతం మధ్యలో ఉంది. ఈ త్రికూట పర్వతం ఇవాల్టి శ్రీలంకలో ఉంది. శ్రీలంకలోని పలు ప్రాంతాలలో రామాయణం ఆనవాళ్లున్నాయి. శ్రీలంక పార్లమెంటులో విభీషణుడి చిత్రపటం ఉంది. బలరాముని తీర్థయాత్రల్లో కూడా సేతు దర్శనం ఉంది. జపాన్ శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ ద్వారా శ్రీలంక లోని ఆనవాళ్లు రామాయణ కాలం నాటివిగా తేల్చారు. కాబట్టి రావణలంక ఇప్పటి శ్రీలంకే అని కోవెల వారు ఘంటాపథంగా చెప్పారు.
అయోధ్య – ఒక నిజం:
అయోధ్య ఒక నిజం కాకపోతే, కల్పనే ఐతే, వర్ణనలు తప్ప వివరణలు ఉండేవి కావు అంటారు రచయిత. ఆ నగరాన్ని గురించిన ప్రస్తావనల్లో నగర నిర్మాణం, నిర్మాణశైలి, నైపుణ్యం, రక్షణ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, నివాస సదుపాయాలు, ఇలా సవివరంగా వాల్మీకి మహాముని వర్ణించారు. రచయిత మాటల్లో అది ఒక secured, sophisticated, beautiful city!
యుద్ధ వర్ణన భయానకం:
ఇద్దరు సమఉజ్జీల మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అతి సహజంగా వర్ణించబడింది. ఇరువురూ గాయాలతో, రక్తసిక్తమైన దేహాలతో, భీకర యుద్ధం చేశారు. రావణుడు నేలకూలిన తర్వాత రాముడు జయనినాదం చేశాడు. ఇదంతా మాయామర్మాలతో జరగలేదు.
రాముడు ఒక ఇంటిగ్రేటింగ్ ఫోర్స్:
ఇల్లు వదిలి, వనవాసానికి బయలుదేరినది మొదలు, భిన్న జీవన విధానాలున్న భిన్న సమాజాలతో మమేకం అయి, ఈ దేశాన్ని ఏకత్రితం చేసుకుంటూ వెళ్ళాడంటారు రచయిత. గుహుడు, శబరి, జటాయువు, ఇలా అందరినీ ఆదరించాడు రామచంద్ర ప్రభువు. కిష్కింధలోని వాలి చంపిన తర్వాత ఆయనేమీ రాజ్యాధికారం చేపట్టలేదు. సుగ్రీవునికే పట్టాభిషేకం చేశాడు. తన పట్టాభిషేకం సమయంలో వీళ్ళందరినీ ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, సత్కరించి, గౌరవించాడు. సర్వత్రసమదర్శనయోగం అంటే అదీ! దీన్ని కన్వీనియెంట్‌గా ఇగ్నోర్ చేసి, అదే పనిగా నిందలు మోపే దౌర్భాగ్య సమాజం ఈ దేశంలో తయారయిందని ఆవేదన చెందుతారు రచయిత.
సీతారాముల వివాహం, స్వయంవరం, సీత వ్యక్తిత్వం:
రాముడు మిథిలకు కేవలం శివధనుస్సును చూడడానికే వెళ్ళాడు. తండ్రి అంగీకరించిన తర్వాతే వైదేహిని పెళ్ళాడాడు. సీత ఆయనను భర్తగా స్వీకరించిన తర్వాతనే ప్రేమించింది. వాళ్ళిద్దరూ మానవాతీతులు కాదు. మనలాంటి మనుషులే. అందుకే వారు మనకు ఆరాధ్యులైనారంటారు రచయిత. అది నిజం! సీత తనను తన ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళమన్నప్పుడు (రావణవధానంతరం) ఆమె తీవ్రంగా స్పందిస్తుంది. నీవు వీరుడి వలె కాకుండా ఒక సామాన్య మానవుని వలె మాట్లాడుతున్నావని ఆయనను నిందిస్తుంది. అలా, పతివ్రత అంటే మొగుడు ఏమన్నా కిమ్మనకుండా, కాళ్లకు దండాలు పెట్టేది కాదని, భర్త తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ఆమెకు ఉంటుందని నిరూపిస్తుంది సీత.
సీతారామ తత్వం – విశ్వనాథ:
ఏపున మంటి నుండి యుదయించిన జానకి మింటి నుండి, ఆ
వాపముగన్న రాఘవుడు వచ్చి బుగధ్వజులందు నుండి, ద్యా
వాపృథువుల్ సమాహరణ భావము పొందిన రీతి సంగమ
వ్యాపృతి పండు వెన్నెలమయంబుగ చేసెద రాత్మరోదసిన్
విశ్వనాథ వారు సీతారామ తత్త్వాన్ని ఆవిష్కరించిన తీరు హృద్యంగా ఉంటుంది. అందుకే ఆయన కవిసామ్రాట్ అయినాడు. జ్ఞానపీఠం ఆయన్ను వరించి ధన్యమైంది. రాముడు భువి నుంచి వచ్చిన చైతన్యం, సీత భూమి నుంచి ఉబికి వచ్చిన మహాశక్తి. ఈ ఇద్దరి అవతారం భూమ్యాకాశాల సమాహరణం ద్వారా విశ్వకల్యాణం. అందుకే సీత పరదేవత. రాముడు వేదవేద్యుడు. ఆ వేదమే రామాయణం.
కోవెల సంతోష్ కుమార్ పితృవాక్య పరిపాలన:
తండ్రి గారు, మహామహోపాధ్యాయ శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యుల వారి ఆదేశంతో ఈ గ్రంథ రచనకు పూనుకొన్నట్లు రచయిత చెప్పుకోవడం ఆయన పితృభక్తిని సూచిస్తుంది. తండ్రి హరిజేరుమనియెడు తండ్రి తంద్రి అని ప్రహ్లాదుడన్నట్లు అటువంటి తండ్రి ఉండడం, అదీ గురుస్థానంలో ఉండడం సంతోష్ కుమార్ పూర్వజన్మ సుకృతం.
అరిస్టాటిల్ – Import:
అరిస్టాటిల్ మహాశయుడు చెప్పినత్లుగా, రచయిత ఏ అనుభూతిని పొంది రచన చేశాడో, అదే అనుభూతిని పాఠకులు పొందడమే Import. దాన్ని తెలుగులో కావ్యపరమార్థం అనవచ్చు. ఈ రచనను పలికించిన వాడు తప్పకుండా రామభద్రుడే అనడానికి నాకే మాత్రం సందేహం లేదు. పలికి, భవహరము చేసుకొన్నారు కోవెల! ‘నాహం కర్తా హరిః కర్తా’ అని అన్నమాచార్యులన్న మాటలు ఈ కృతికి సరిగ్గా సరిపోతాయి. Paradise Lost ను రాసే సమయంలో John Milton తనలోకి Divine Muse (జ్ఞానానికి గ్రీకుల అధిష్టాన దేవత, మన సరస్వతీ దేవి లాగా)ను ఆవహింపజేసుకున్నట్లు, కోవెల సంతోష్ కుమార్ కోకి ఏదో దివ్యశక్తి తప్పకుండా ప్రవేశించే ఉంటుందని నా నమ్మకం.
రాముని గురించిన నిందలు, అపోహలు, అపార్థాలు, వక్రీకరణలు – ఈ పుస్తకం చదివిన తర్వాత మనలో సమసిపోతాయి. పనికిమాలిన సిద్ధాంత గ్రంథాలకు పి.హెచ్.డి.లు ఇచ్చే మన ఘనత వహించిన విశ్వవిద్యాలయాలు బుద్ధి తెచ్చుకుని ఈ గ్రంథానికి తప్పక డాక్టరేట్ ఇవ్వాలని నేనీ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను.
ధన్యవాదాలు.
***
రచన: కోవెల సంతోష్ కుమార్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పుటలు: 402
వెల: ₹ 300/-
ప్రతులకు
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
రచయిత – 9052116463
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు:
https://www.amazon.in/Ramam-Bhaje-Shyamalam-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B2%E0%B0%82/dp/B0BD4Y6467/
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.