ఆ మధ్య ఎవరో ప్రముఖ రాజకీయ నాయకుడు ఓ కామెంట్ చేశాడు. 1947 ముందు వరకు భారతదేశం దేశం కాదు.. బ్రిటిష్ వాడు.. అన్నింటినీ కలిపి దేశంగా మలిచి ఇచ్చాడు. అంతకు ముందు అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఒక దేశంగా మార్చి మనకు ప్రదానం చేశారు అని. నిజమే కదా.. స్వాతంత్య్రానికి ముందువరకు 550 సంస్థానాలు ఉంటే.. తర్వాత వాటన్నింటినీ పటేలో.. నెహ్రూగారో కలిపితేనే కదా భారతదేశంగా మారింది! అంతకుముందు భారతదేశం అన్న కాన్సెప్టే లేదు అన్నది మన మేధావుల వాదన.. ప్రచారం. ఇక్కడ చిన్న అనుమానం ఏమిటంటే.. భారతదేశం అనే దాన్ని బ్రిటిష్‌వాడు సృష్టించాడా? లేక వాడు వెళ్లిపోయాక నెహ్రూ పటేల్ అండ్ కో సృష్టించారా? ఈ దేశ నిర్మాతలు ఎవరు? ఒకవేళ నెహ్రూ పటేల్‌లు సంస్థానాలన్నింటినీ విలీనంచేసుకొని ఈ దేశాన్ని సృష్టించి ఉండి ఉంటే.. బ్రిటిష్ వాడు రెండు వందల ఏండ్లు 550 దేశాలను పరిపాలించాడని అనుకోవాలా? స్వాతంత్య్రోద్యమాన్ని గాంధీగారు ఈ 550 సంస్థానాల్లోనే ఎందుకు నడిపించారు? ఒక పర్టిక్యులర్ ఔట్‌లైన్‌లోనే ఎందుకు జాతీయోద్యమం జరిగింది? ఈ 550 సంస్థానాలను ఇండియా అని ఎందుకు పిలిచారు. మరాఠా దేశం, పంజాబ్ దేశం, రాజపుత్ దేశం.. పిలిచేసి.. దేనికదిగా స్వాతంత్య్రం ఇస్తే పోయేదికదా.. ఈ నెహ్రూగారు.. ఏ అలహాబాద్ సంస్థానానికో.. కాశ్మీర్ సంస్థానానికో.. పటేల్ గారు జునాగఢ్ సంస్థానానికో ప్రధానమంత్రి అయ్యేవారు కదా? ఇంతెందుకు 1947కు ముందు భారతదేశమే లేనప్పుడు.. బ్రిటిష్‌వాడు బెంగాల్‌కు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీని ఎందుకు పెట్టాడు. అదికూడా ‘ఈస్ట్’.. ‘ఇండియా’ అంటే తూర్పు భారత్.. ఈ పేరే ఎందుకు పెట్టాడన్నది పెద్ద అనుమానం. ఇక్కడి నుంచి మూల ప్రశ్న వేసుకొంటూ పోతే మనల్ని మనం అధ్యయనం చేయడానికి.. మీరు దేశంగానే లేరు అన్న వారి గురించి అధ్యయనం చేయడానికి ఒక అన్వేషణ మొదలైంది. ఈ అన్వేషణకు ప్రధాన భూమిక 2003లో సంక్రాంత్ సాను రాసిన ‘వై ఇండియా ఈజ్ ఏ నేషన్’. ఈ వ్యాసం చదివాక దీని నుంచి మూలాల్లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ అనేక అంశాలు.
ముందుగా 1888లో ప్రచురణ జరిగిన ఒక ఇంగ్లీష్ పుస్తకం. దానిపేరు ‘ఇండియా ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రోగ్రెస్’. సర్ జాన్ ట్రాచె అనే పెద్దమనిషి ఈ గ్రంథాన్ని రచించాడు. ఇతను భారతదేశాన్ని పాలించిన ముగ్గురు బ్రిటిష్ వైస్రాయ్‌ల దగ్గర మంత్రిగా పనిచేశాడు. పరిపాలనా వ్యవస్థల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్నాడు. 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత ఇతను.. బ్రిటిష్‌వారి సామ్రాజ్యం బలిష్ఠంగా తయారుచేయడానికి కావాల్సినవన్నీ చేశాడు. ఇతను రాసిన ‘ఇండియా’ లోని ఒక మాట. ‘ఇండియా గురించి ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏమిటంటే.. చరిత్రలో మునుపెన్నడూ ఇండియా అన్నది లేనేలేదు. ఐక్యతలోకానీ, భౌతికంగా కానీ, రాజకీయంగా కానీ,సామాజికంగా కానీ, మతపరంగా కానీ ఇండియా కానీ, ఇండియన్లు కానీ లేనేలేరు.’ ఇదీ ఆయన రాసిన మాట. ఇతను ఏదైతే చెప్పాడో.. దాన్ని ఆధారం చేసుకొనే మనవాళ్లు తర్వాత మాట్లాడుతూ వచ్చారు. వస్తున్నారు. ఎందుకంటే.. మన ప్రాచీన విశ్వవిద్యాలయాలన్నీ ధ్వంసం చేశారు. మూసేశారు. తర్వాత వచ్చిన యూనివర్సిటీలన్నీ బ్రిటిష్ వాళ్ల గురుపరంపరను కొనసాగిస్తూ వచ్చినవే. ఇండియాను ఇలా చదవాలి. ఇలాగే చదవాలి. ఇదే చెప్పాలి అన్న మౌలికసూత్రంపైనే చరిత్రను చదువుకుంటూ వస్తున్నది. స్వాతంత్య్రం తర్వాత కూడా ఆ పారతంత్య్రం మన పాలకుల్లో పోలేదు. ప్రజల్లోనుంచి పోనివ్వలేదు.
భారతదేశం భౌగోళికంగా ఒకటిగా లేదన్నది తొలి వాదన. ఎందుకంటే.. ఒక రాజు పరిపాలనలో మొత్తం భారతదేశం ఎప్పుడూ పరిపాలించలేదు. కాబట్టి.. భారత్ ఒక దేశం ఎన్నడూ కాదు.. వీరంతా భారతీయులు కారు అన్నది వీరి తర్కం. కొంతసేపు వీరి తర్కం ప్రకారమే ఆలోచిద్దాం. భారతదేశం ఒక్కటిగా లేదు సరే.. మరి మిగతా ప్రపంచం అంతా ఐదువేల ఏండ్ల నుంచి ఒకే బౌండరీలతో ఉన్నదా? ఈ మాట వితండం అనిపించవచ్చు. కానీ.. భారతదేశం గురించి చాలామంది ఇక్కడికి వచ్చి తెగ పరిశోధనలు చేశారు. అధ్యయనం చేశారు. వందలు, వేలాది సూత్రీకరణలు చేసి పోయారు. మనం మాత్రం వారిని ఎన్నడూ స్టడీ చేయలేదు. వారి గురించి తెలుసుకొనే ప్రయత్నంచేయలేదు. ఇక్కడ కొన్ని ప్రపంచ మ్యాపుల ఆధారంగా వివరాలు తెలుసుకొందాం.
1. 475 ఏడీ గుప్తా ఎంపైర్
ఇది 475 ఏడీ నాటి భారతదేశ చిత్రపటం ఇది. ఇందులో విశాలమైన గుప్త సామ్రాజ్యాన్ని మనం చూడవచ్చు. దీంతోపాటు . ఇతర చిన్న చిన్న రాజ్యాలు కనిపిస్తాయి. అయినప్పటికీ.. మనకు భారతదేశపు బౌండరీలు స్పష్టంగానే కనిపిస్తాయి.
2. 475 ఏడీ.. వెస్టర్న్ యూరప్
ఒకసారి ఇదే సంవత్సరంలో.. అంటే.. 475 ఏడీ.. లో పశ్చిమ యూరప్ ఎట్లా ఉన్నదో ఒక్కసారి చూడండి. ఇవాళ మనకు తెలిసిన.. ఒక్కటంటే ఒక్క దేశం కూడా మనకు ఇక్కడ కనిపించదు. ఒకటి అరా కూడా కనిపించదు. చివరకు ఇంగ్లండ్ కూడా మనకు ఈ మ్యాప్‌లో కనిపించదు. ఆంగ్లో సాక్సన్ దేశాల ఆనుపానులు కూడా లేవు. కొన్ని ట్రైబ్స్ వివిధ గ్రూపుల పేర్లు కనిపిస్తాయి. ఇవాళ్టి దేశం ఏదీ కూడా మనం ఈ మ్యాప్‌లో కనిపించదు.
3. ఏడీ భారత్
ఈ మ్యాప్ 1 ఏడీ కి చెందింది. ఇందులో మనకు అతి పెద్ద సామ్రాజ్యం శాతవాహనులు కనిపిస్తారు. కళింగులు కనిపిస్తారు.
4. 1 ఏడీ యూరప్
ఇదే 1 ఏడీ లో యూరప్ మ్యాప్‌ను చూద్దాం. ఇందులో విశాలంగా రోమన్ సామ్రాజ్యం కనిపిస్తుంది. కానీ ఇవాల్టి సరిహద్దులేవీ ఈ మ్యాప్‌లో సరిపోలడంలేదు. భారత్‌లో రకరకాల రాజ్యాలు మారి ఉండవచ్చు కానీ.. భౌగోళిక అఖండ భారతవర్షం భౌగోళిక స్వరూపం మాత్రం ఎన్నడూ మారలేదు. మనకు భారత్ స్వరూపం స్పష్టంగానే గోచరిస్తుంది. కానీ ఈ మ్యాప్‌లో యూరప్‌కు సంబంధించి ఇవాళ్టి ఏ దేశానికి సంబంధించిన ఫిజికల్ ఐడెంటిటీ ఎంతమాత్రం కనిపించదు.
5. 1000 ఏడి
1000 ఏడీలో యూరప్ ఎలా ఉన్నదో గమనిద్దాం. ఇక్కడ కొన్ని దేశాలు కనిపిస్తాయి. ఇందులో పోర్చుగల్ కనిపించదు. అత్యంత ప్రాచీనమైన నాగరికత అని చెప్పుకొనే గ్రీస్ కనిపించదు. బ్రిటన్ చిన్నగా కనిపించదు. స్పెయిన్ విడివిడిగా కనిపిస్తుంది. రోమన్ సామ్రాజ్యం అంతా విస్తరించిన జర్మనీ ఈ మ్యాప్‌లో కనిపించదు. ఇవాల్టి పరిస్థితికి పూర్తి భిన్నంగా ఈ మ్యాపుల్లో వాటి స్వరూపాల్ని మనం గమనించవచ్చు. భారత్‌ను దేశమే కాదంటున్నారు కదా.. మరి మీరెప్పుడు ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? నీ అస్తిత్వానికి ఉన్న ఆధారం ఏమిటి?
6. 1500 ఏడి
1500 ఏడి లో ఇవాళ్టి యూరప్ దేశాలు మనకు ఈ మ్యాప్‌లో కనిపిస్తాయి. ఈజిప్టు, ఫ్రాన్స్, బ్రిటన్, హంగేరీ, జర్మనీ తదితర యూరప్ దేశాలు మనకు కనిపిస్తాయి. రోమన్ సామ్రాజ్యం వెళ్లిపోయి. ఒట్టమాన్ సామ్రాజ్యం వచ్చింది. గ్రీసు తదితర యూరప్ దేశాలు ఒట్టమాన్ సామ్రాజ్యం పరిధిలోకి వెళ్లాయి. ఇది ముస్లిం సామ్రాజ్యం. సరిహద్దుల మధ్య అప్పటికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా తక్కువ దేశాలు ఇవాళ్టి సరిహద్దులతో సరిపోలుతున్నాయి. ఇందతా కేవలం 5 వందల ఏండ్ల ముందు చరిత్రే.
7. 1800 ఏడీ
1800 ఏడీ మ్యాప్‌లో గ్రేట్ బ్రిటన్ అన్న మాట స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత యూరప్ దేశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. ఐర్లండ్‌తో కలిపిన గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. ఆ తర్వాత ఐర్లండ్ కూడా వేరుగా వెళ్లిపోయింది. అది వేరే సంగతి.
8. 1900 ఏడీ
1900 ఏడీ యూరప్ మ్యాప్‌లో గ్రీసుదేశం స్పష్టంగా కనిపిస్తున్నది. యూరప్ పూర్తిగా కనిపించే మ్యాప్ ఇది. అత్యంత ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు అని ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తే ముందుగా చెప్పుకొనేది గ్రీసు, ఆ తర్వాత ఈజిప్టు ఇలా చెప్పుకొంటూ వస్తారు. గ్రీసు పరిస్థితిని మనం ఒక్కసారి గమనిస్తే ముందుగా రోమన్ ఎంపైర్‌లో ఉన్నది. గ్రీసు ఎప్పుడైతే క్రైస్తవంగా మారిపోయిందో.. గ్రీసు సంప్రదాయాలన్నీ నాశనమైపోయాయి. వాళ్ల దేవుళ్లు.. ప్రార్థనలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వాళ్ల పద్ధతులు అన్నీ మారిపోయాయి. చివరకు ఒలింపిక్ గేమ్స్‌ను కూడా వారు ఆపించారు. క్రైస్తవ రాజులు గ్రీసు మందిరాలు, పూజలు, పునస్కారాలను పూర్తిగా బంద్ చేయించారు. దీంతో గ్రీకు పూర్తిగా క్రైస్తవంగా మారిపోయింది. కాబట్టి.. గ్రీకు నాగరికతను… అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న నాగరికత (సివిలైజేషనల్ కంటిన్యూటీ..) గా మనం చెప్పలేము. మరి గ్రీసు మళ్లీ ఎట్లా వచ్చింది? అంటే దానికీ కారణం లేకపోలేదు. 1800 ఏడీలో బ్రిటన్ గ్రీకు రచనలను అన్వేషించడం మొదలుపెట్టింది. ఎందుకంటే.. అప్పటికే అరబ్ గ్రంథాల్లో గ్రీక్ వాసనలు బ్రిటన్‌కు లభించాయి. దీంతో మాకు కూడా ప్రాచీన చరిత్ర ఉన్నదని, తమ మూలాలు గ్రీక్ నాగరికతలో ఉన్నాయని చెప్పుకోవడానికి అన్వేషించింది. ఏ గ్రీకు నాగరికతనైతే నాశనం చేశారో.. అదే గ్రీకు నాగరికత.. వారి మూలాలని చెప్పుకోవడానికి అవసరమైంది. ప్రధానంగా చాలా వరకు విజ్ఞానమనేది ఇండియా, అరబ్ నుంచి యూరప్‌కు వచ్చింది. దీన్ని సవరించుకోవడానికి, కరెక్ట్ చేసుకోవడానికి గ్రీసు అస్తిత్వాన్ని అంగీకరించి, దానితో తమ మూలాలను కలుపుకోవాల్సి వచ్చింది. చరిత్రను ప్రాచీనమైనదని చెప్పుకోవడానికి బ్రిటన్ పడ్డ తంటాలివి. గ్రీకు స్టాంప్ వేసుకుంటే నడిచిపోతుంది అని వేసేసుకున్నారు. ప్రాచీన గ్రీసుకు.. ఇప్పుడు మనకు కనిపిస్తున్న గ్రీసుకు ఏ మాత్రం సంబంధం లేదు. యూరప్ వాళ్లు తమకేమో ప్రాచీన స్టాంప్ వేసుకొని.. మనకు ఉన్న ప్రాచీన చరితన్రు కాదని తిరగరాస్తుంటే.. మనం గంగిరెద్దుల్లా తలూపుతూ.. మనకు ఉన్న చరిత్రను కూడా చెప్పుకోవడం చేతకాక.. మనమే ఏమీ లేదు లేదంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాం.
ప్రపంచంలో మరో శక్తిమంతమైన దేశం అమెరికా గురించి చెప్పుకొందాం. 1776 లో అమెరికా ఎలా ఉన్నది? ఈ మ్యాప్ చూస్తే తెలుస్తుంది. అమెరికాకు స్వతంత్రం వచ్చిన సంవత్సరం. అమెరికాకు స్వతంత్రం వచ్చిన 1776 లో ఉన్న ఆ దేశానికి ఉన్న రూపం. మిగతా ప్రాంతం అంతా ఇంకా ఘర్షణల్లో ఉన్నది. వీరికి ఎలాంటి మూలాలు లేవు.
1800 ఏడీ
1800 ఏడీలో అమెరికా రూపం కొంతమేర పెరిగింది. అప్పటికి బ్రిటిష్ వాళ్లు భారత్‌లోకి పూర్తిగా చొరబడ్డారు. అప్పటికి ప్లాసీ యుద్ధం జరిగింది కూడా. ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకోవడం.. ఇండియాను పూర్తిగా అన్వేషించి ఆక్రమించుకోవడంలో బ్రిటిష్ వాళ్లు మునిగిపోయారు. అప్పటికి అమెరికా పరిస్థితి ఈ మ్యాప్‌లో బోల్డ్‌గా కనిపిస్తూ ఉన్నదే.
1861 ఏడీ
1861 లో అమెరికాకు ఒక రూపం రావడం మొదలైంది. చాలా రాష్ట్రాలు వచ్చాయి. వీటిలోనూ అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. క్యాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు ఇందులో ఏర్పడ్డాయి.
1912 ఏడీ
1912 ఏడీలో పూర్తిస్థాయిలో యాభై రాష్ట్రాలతో కూడిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. న్యూ మెక్సికో వచ్చింది. ఆరిజోనా వంటి రాష్ట్రాలు వచ్చాయి. అంటే ఇవాళ్టి రాజకీయ పరిపాలనా వ్యవస్థలతో పోల్చుకుంటే.. అమెరికా ఇవాల్టికి 109 సంవత్సరాల పాతదన్నమాట. వీళ్లంతా ఎవరు? వీళ్ల అస్తిత్వానికే దిక్కులేదు. మన దగ్గరకు వచ్చి పాఠాలు చెప్తారు. భారతదేశం ఒకప్పుడు దేశం కాదని, భారతీయులనేవారే లేరని.. వాళ్లకు తోచినట్టు మాట్లాడతారు. పుస్తకాలు రాస్తారు.
ఇక్కడ మరో మ్యాప్‌ను కూడా పరిశీలించాల్సి ఉన్నది. అది ఆఫ్రికా. 1500 ఏడీలో ఆఫ్రికా మ్యాప్‌ను పరిశీలిస్తే. ఒకటి రెండు రాజ్యాలు తప్ప ఏ ఒక్క దేశమూ కనిపించదు. దాదాపుగా ఏ ఒక్క దేశ సరిహద్దూ ఇప్పుడు కనిపించదు. ఎందుకంటే ఆఫ్రికా నక్షానే పూర్తిగా యూరోపియన్లు మార్చేశారు. 1800 ఏడీలో యురోపియన్లు ప్రపంచమంతటా తమ సామ్రాజ్య విస్తరణలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో 1885లో బెర్లిన్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆఫ్రికాను తమకు ఇష్టం వచ్చినట్లు ముక్కలుచేసుకొన్నారు. 13 యూరప్ దేశాలు, ఒట్టమాన్, అమెరికా.. ఈ పదిహేను అధికార కేంద్రాలు కలిసి సమావేశమై ఆఫ్రికాను ఎలా పంచుకోవాలో గీతలు గీసుకున్నారు. ఆఫ్రికన్లు అనేవాళ్లు ఎవరూ లేకుండా వాళ్ల ప్రమేయం లేకుండా.. స్థానిక పరిస్థితుల అంచనా లేకుండా గోడ మీద ఆఫ్రికా బొమ్మ పెట్టుకొని రూళ్ల కర్రతో గీతలు గీసుకొని ఆఫ్రికాను యురోపియన్లు పంచుకొన్నారు. ఇంత ఘోరంగా ఆఫ్రికాను నాశనం చేశారు. దీని ప్రభావం ఇవాళ్టికీ మనం ఆఫ్రికాలో చూస్తూనే ఉన్నాం. దేశాల మధ్య ఇప్పటికీ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే.. హేతుబద్ధత లేని సరిహద్దులు గీయడం వల్ల జరిగిన పరిణామాలివి.
మొదట దేశాల విస్తరణ యుద్ధాల ద్వారా జరిగేది. అలెగ్జాండర్‌లాంటి వాళ్లు సైన్యాన్ని వెంటేసుకొని.. ఆయుధాలతో శత్రు సైన్యాన్ని జయించి రాజ్యాలను జయించి స్వాధీనం చేసుకొనేవారు. యురోపియన్లు తమ రాజ్య విస్తరణ మైండ్‌గేమ్‌తో చేశారు. ఇందుకు ఆయా దేశాల్లోకి చొరబడి.. రకరకాల కుయుక్తులు పన్నేవారు. ఇందుకు ఉదాహరణ రువాండా.. రువాండాలో యురోపియన్లు మైడ్‌గేమ్ ఆడి వినాశనానికి ఒడిగట్టారు. రువాండాలోని హుటు, టుట్సూస్‌కు వేరే అస్తిత్వాన్ని సృష్టించారు. వాళ్లకోసం వేరే చరిత్రను రాశారు. వాళ్ల మధ్య అంతర్యుద్ధానికి తెరతీశారు. ఫలితంగా రువాండాలో భారీ మానవ ఊచకోత జరిగింది. ఇదే సిద్ధాంతాన్ని, వ్యూహాన్ని భారతదేశంలో అమలుచేశారు. భారతీయులను ఆర్య, ద్రావిడులుగా విడదీశారు. ద్రవిడ జాతి సిద్ధాంతాన్ని యూరప్ నుంచి దిగుమతి చేశారు. ఆ తరువాత దళిత జాతి సృష్టి కూడా ఇదే పద్ధతిలో తీసుకొచ్చారు. ఆర్యులు.. ద్రవిడులు అన్న సిద్ధాంతాన్ని తీసుకొచ్చినట్టే.. దళిత బ్రాహ్మణ భేదాన్ని తెచ్చిపెట్టారు. దళిత అగ్రవర్ణ భేదాన్ని తెచ్చిపెట్టారు. అసలు జాతి అన్న భావనే లేని దేశంలో జాతి అన్న అస్తిత్వాన్ని చొప్పించారు.
ఇక దక్షిణ అమెరికా గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఇది చాలా చిత్రమైన కథ. 1493లో పేపల్ బుల్ అనే ఒక డాక్యుమెంట్‌ను యురోపియన్లు, అమెరికన్లు ఇంటర్ కాటెరా పేరుతో విడుదలచేశారు. దీని ద్వారా ‘డాక్ట్రిన్ ఆఫ్ డిస్కవరీ’ సిద్ధాంతాన్ని అమలుచేయడం మొదలుపెట్టారు. దీని ప్రకారం ఈ భూమండలం మొత్తం క్రైస్తవ దేవుడిది. క్రైస్తవులు కానివారికి ఈ భూమ్మీద ఉండే హక్కు లేదు. మారితే క్రైస్తవులుగా మారాలి. లేకపోతే చచ్చిపోవాలి. ఇదే వారి సిద్ధాంతం. స్పెయిన్ రాజు అనుచరులు.. పోర్చుగల్ రాజు అనుచరులు.. దక్షిణ అమెరికా దేశాలకు వచ్చి.. అక్కడి ప్రజలకు ఈ పేపల్ బుల్ కాగితాన్ని చూపించేవారు. ‘ఈ భూమి మాది. ఇదిగో భూమి మాది అనడానికి ఆధారంగా ఉన్న కాగితం. మీదగ్గర ఏదీ ఇలాంటి కాగితం.. చూపించండి.. లేకపోతే భూమిని వదిలి వెళ్లిపోండి’ అని బెదిరించడం మొదలుపెట్టారు. స్థానికులకు ఇదేమీ అర్థం కాలేదు. భూమి ఒకళ్లకు సొంతం కావడం ఏమిటి? అసలు ఈ కాగితం ఏమిటి? భూమి మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది కదా.. అలాంటప్పుడు ఒకరికి సొంతం అని ఎట్లా అనుకొంటారు.. దాన్ని చూపించి బెదిరించడం ఏమిటి? అసలు వీళ్లెవరు.. ఇలా ఏమీ అర్థం కాక తలలు బద్దలు కొట్టుకొన్నారు. ఇట్లా.. ఓ కాగితం పట్టుకొని.. స్పానిష్‌లు దక్షిణ అమెరికాను అక్రమించుకొన్నారు. ఆఫ్రికా మాదిరి కాకపోయినా.. ఇక్కడ కూడా సంఘర్షణలు అనేవి యూరప్‌లో చోటుచేసుకొనే పరిణామాల ఆధారంగా సాగేవి. దాదాపు వంద మిలియన్ల మంది దేవుడిపేరుతో చంపేశారు. పాత స్పానిష్ ప్రభుత్వం అనుసరించిన రీతిలో ప్రావిన్సులు ఏర్పడ్డాయి. గ్లోబ్‌పైన గీతలు గీసుకొని పంచుకొన్నారు. ఈ గీతల్లో గీతలకు ఎడమవైపు స్పెయిన్, కుడివైపు పోర్చుగల్ పంచుకొన్నాయి. అందుకే స్పెయిన్ భారత్‌కు రాలేదు. అమెరికాను ఆక్రమించుకొన్నది. పోర్చుగల్ భారత్‌కు చేరింది. ఈ డాక్ట్రిన్ డిస్కవరి అన్నది 20వ శతాబ్దంలో కూడా అమెరికన్ సుప్రీంకోర్టులో రాటిఫై చేశారు. ఎందుకంటే దక్షిణ అమెరికాలోని స్థానిక భూముల ఆక్రమణను జస్టిఫై చేసుకోవడానికి ఇవాళ్టికీ ఇదే డాక్యుమెంట్ లీగల్‌గా ఉపయోగపడుతున్నది.
బార్బేరియన్లు పూర్తిగా నాగరిక దేశాలను ఆక్రమించుకొన్నారనడానికి దక్షిణ అమెరికా స్పష్టమైన ఉదాహరణ. దక్షిణ అమెరికాలో మాచుపిచు, పెరు ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ కుస్కో అనే ప్రాంతం ఉన్నది. ఇక్కడి నాగరికత చాలా చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో కూడుకున్నది. వీళ్లు అత్యంత శాంతియుత సహజీవనాన్ని కోరుకొనేవారు. అనేక జాతుల్లో సంఘర్షణకు ప్రధాన కారణమైన ఆహారం గురించిన అధ్యయనం చేశారు. వీళ్లు ఇన్కా అనే ఒక మందిరాన్ని నిర్మించారు. స్పానిష్‌లు వచ్చి దాన్ని ధ్వంసంచేసి దానిపైన తమ చర్చిని నిర్మించారు. భూకంపం వచ్చి.. చర్చి కూలిపోయింది. దాని కింద ఉండిన ఇన్కా మందిరం మాత్రం చెక్కుచెదరలేదు. ఎందుకంటే.. వాళ్లు మన భారతదేశంలో నిర్మించిన మహామహా నిర్మాణాల మాదిరిగా ఒక రాయిలో మరో రాయి ఇమిడిపోయేట్లు ఈ మందిరాన్ని నిర్మించారు. భూకంపం దాన్ని ఏమీచేయలేకపోయింది. యురోపియన్లు, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్లు భారతదేశంపై చేసిన దాడి.. ఆక్రమణ కూడా ఇదే కోవలో సాగింది. మిగతా ప్రపంచంపై చేసిన ప్రయోగాలన్నీ కలిపి భారత్‌పై చేసి ఆక్రమించుకొన్నారు.
ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టిన అంశానికి వద్దాం. దేశం అంటే ఏమిటి? భారతదేశం దేశం కాదు. బ్రిటిష్ వాడు వచ్చి కన్సాలిడేట్ చేశాడు అన్నది కదా వాదన. అసలు ఈ దేశం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది. సావరిన్ స్టేట్.. సార్వభౌమాధికార దేశం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా యూరప్ నుంచి పుట్టుకొచ్చిన మాటే.
1648లో ట్రీటీ ఆఫ్ వెస్ట్ ఫేలియా జరిగింది. యూరప్‌లో అనేక పరిణామాల నేపథ్యంలో చర్చి రాజులమీద అధికారం చెలాయించడం మొదలుపెట్టింది. బైబిల్‌కు పోప్ చెప్పిన వ్యాఖ్యానమే కరెక్టు.. దాని ప్రకారమే నడుచుకోవాలి. లేకుంటే నరకానికి పోతారు. మార్టిన్ లూథర్ వంటి ప్రొటెస్టెంట్‌లు పోప్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో రెండు పెద్ద యుద్ధాలు జరిగాయి. ఒకటి 30 ఏండ్లు.. మరొకటి 80 ఏండ్లపాటు సుదీర్ఘమైన యుద్ధాలు జరిగాయి. దీని అనంతరం ట్రీటీ ఆఫ్ వెస్ట్ ఫేలియా ఒప్పందం జరిగింది. ఇందులో మొట్ట మొదటిసారి సావరిన్ అన్న మాట వినిపించింది. ఈ సావరిన్ అన్న మాట కూడా క్రైస్తవ భావజాలం నుంచి పుట్టుకొని వచ్చిందే. దేవుడు అంతిమంగా గొప్పవాడు. ఆయన నియంత్రణలోనే అంతా ఉంటుంది. ఇది సావరిన్ అన్న పదానికి అర్థం. ఈ రకంగా రాజు సార్వభౌముడు.. రాజు చెప్పినట్టు వినాలి. ఈ విధంగా చర్చి మాట వినవద్దని నిర్ణయం జరిగింది. మనం కూడా మన రాజ్యాంగంలో ప్రియాంబుల్‌లో రాసుకున్నాం. ఈ రకంగా సావరిన్ అన్న మాట వచ్చింది. సెక్యులర్ అన్న మాట కూడా ఇలా వచ్చిందే. ఈ పదాలన్నీ యూనివర్సల్ కావు. ఒక వ్యవస్థ నుంచి వచ్చినవే. స్వాతంత్య్రోద్యమకాలంలో జాతీయవాదం లాంటి మాటలు కూడా యూరోపియన్ దేశమనే ఐడియానుంచి వచ్చినవే. లెఫ్ట్ అయినా..రైట్ అయినా.. నాయకులంతా ఒక విధంగా యురోపియన్ మాయలో పడిపోయారు.
మీకు ఎవరికైనా తెలుసా.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి పాస్‌పోర్టులు, వీసాలు ఎప్పటినుంచి అమల్లోకి వచ్చాయి? చెక్‌పోస్టులు ఎప్పుడు పుట్టుకొచ్చాయి? 20 వ శతాబ్దంలోనే. 1914లో బ్రిటిష్ నేషనాలిటీ అండ్ స్టేటస్ యాక్డ్ వచ్చింది. 1920లో లీగ్ ఆఫ్ నేషన్స్ చట్టం వచ్చింది. 1924లో అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం వచ్చింది. అప్పటివరకూ ప్రపంచంలో పాస్‌పోర్టులు, వీసాలన్నవి తెలియవు. ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి ప్రజలు హాయిగా వెళ్లివచ్చేవారు. రాజు ఎవరినైనా ప్రత్యేకంగా దూతను పంపిస్తేనే.. అతనికి ఒక లేఖను రాసిచ్చి పంపేవారు. సామాన్య ప్రజలకు ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు. ఇవన్నీ యురోపియన్లు సృష్టించినవే. వ్యవస్థీకృతం చేశారు. ఎందుకంటే.. వీళ్లు ప్రపంచం నుంచి చాలా దోచుకున్నారు.. ఇప్పుడు ప్రజలను ఫ్రీగా ప్రయాణం చేయనిస్తే ఎలా? కాబట్టి తాము దోచుకున్న సంపదను కాపాడుకోవడానికి ఈ రకమైన నిబంధనలు విధించారేమో..తెలియదు.
భారతదేశంలో ప్రాచీన రాజ్యాలకు.. ప్రస్తుతం దేశమనే కాన్సెప్ట్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఒక ప్రాంతానికి సంబంధించిన పరిపాలన చేసేవాడు రాజు అయితే.. అతణ్ని ఆ ప్రాంత ప్రజలు రాజుగా అంగీకరించి పన్నులు చెల్లించేవారు. వారి బాగోగులను రాజు చూసేవాడు. అయినంతమాత్రాన ఉజ్జయినిలో ఉన్నవాళ్లు కాశీకి.. కాశీలో ఉన్నవాళ్లు ఉజ్జయినికి వచ్చిపోవడానికి పాస్‌పోర్టులు, వీసాలు ఉండాల్సిన అవసరం ఎన్నడూ లేదు. సామాన్య ప్రజలు ఆసేతు హిమాచలం స్వేచ్ఛగా తిరాగారు. తీర్థయాత్రలు చేశారు.
అసలు ఇండియా అన్నదే లేకపోతే.. ఈ ఇండియాను వెతకడానికి యురోపియన్లు తమ శక్తియుక్తులన్నీ ఎందుకు ఉపయోగించారు. కొలంబస్ తిరిగింది ఈ ఇండియా కోసమే కదా.. చివరకు పోయి పోయి అమెరికాను పట్టుకొన్నాడు. బ్రిటిష్ వాడు బెంగాల్‌కు చేరుకొని ఇండియాకు వచ్చానని ఊపిరి పీల్చుకొన్నాడు. పోర్చుగీసు వాస్కోడిగామా గోవాకు వచ్చి హమ్మయ్య ఇండియాకు వచ్చానని సంబరపడ్డాడు. ఇండియాకు తూర్పు, పడమరల సరిహద్దుల గురించి చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏంకావాలి? బ్రిటిష్‌వాడు రావడం రావడమే ఈస్ట్ ఇండియా కంపెనీ అని పెట్టుకొన్నాడు. ఇండియా వంటి సంపన్న దేశం కోసం ఏండ్ల తరబడి వెతికినవాళ్లు.. తీరా వచ్చాక.. అసలు దేశమే కాదన్నారు. వాట్ ఏ వండర్.. భారతదేశాన్ని చూశాక వాళ్లకు ఆశ్చర్యమేసింది. ఇది ఒక దేశం ఎట్లా అవుతుంది. మన యూరప్‌లాగా లేదు కదా.. అని అనుకొన్నారు. వాళ్లు కనిపించిన వాళ్లను కనిపించినట్లు చంపేసి.. మతం మార్చి.. భాష మార్చి..నాగరికత ధ్వంసంచేసి ఒక జాతిగా కనిపించేట్లు చేసుకొన్నారు. కానీ..భారతదేశం పూర్తి భిన్నంగా కనిపించింది. ఇక్కడ వంద మైళ్లు దాటితే భాష మారిపోతుంది. వేషం మారుతుంది. ఆహారపు అలవాట్లు మారుతాయి. సంప్రదాయాలు మారుతాయి. పండుగలు మారుతాయి. ఇంత తీవ్రమైన భిన్నత్వం ఉన్న దీన్ని దేశంగా ఎలా భావించాలి? ఇలాంటి భిన్నత్వం యూరప్‌లో కనిపించదు. యూరప్ తరహాలో భారత్ ఎలా ఉంటుంది? కానీ.. దీంతో దేశం అన్నది..దేశీయులు అన్నది లేదు అని వాళ్లు చెప్తే.. మన ఆలోచన ఏమైంది.
భారతవర్ష అంటే ఏమిటి? ప్రపంచ జియోగ్రాఫికల్ చిత్రపటాన్ని చూసినట్టయితే.. భారతదేశ రూపం స్పష్టంగానే కనిపిస్తుంది. ఇది పూర్తి సురక్షితమైన సరిహద్దులున్న దేశం. మూడువైపుల సముద్రం.. ఒకవైపు హిమాలయాలు.. ఇక్కడి సమాజం అంతా విసృ్తతమైన పరిశోధనలు.. అన్వేషణలు, వాదవివాదాలు, ఇతర విజ్ఞాన సంపదను పెంపొందించుకోవం కృషిచేస్తూ వచ్చింది. మన సమాజం మౌలికంగానే జ్ఞాన సముపార్జన సంప్రదాయంగా కలిగి ఉన్నది. అంతర్గత, బహిర్గత విజ్ఞానాన్ని అధ్యయనం చేయడం, పరిశోధించడం ప్రధాన విధిగా కొనసాగిన నాగరికత మనది. తద్వారా ఇక్కడి నాగరికత అత్యంత సుసంపన్నంగా విలసిల్లింది. సింధుకు పక్కనున్నవాళ్లను హిందువులుగా పిలిచారు. సింధు నుంచి హిందు అన్న పదం వచ్చింది. స్పానిష్‌లో హెచ్ సైలెన్స్ కావడం వల్ల ఇందు, ఇండి, ఇండికా, ఇండియా.. ఇలా పరిణామం చెందుతూ వచ్చింది. అంతే తప్ప హిందు అనే మతం ఈ దేశంలో ఎన్నడూ లేదు. దీన్ని సృష్టించింది కూడా యురోపియన్లే. మన నాలెడ్జి పుస్తకాల ద్వారా వ్యాప్తి చెందలేదు. మీరు మీ పిల్లలకు సైకిల్ నేర్పాలనుకుంటారు. ఇందుకు పుస్తకం ఇవ్వరు కదా. సైకిల్ ఎక్కిస్తారు..కాస్త హెల్ప్ చేస్తారు అంతే కదా.. నాలెడ్జ్ ట్రాన్స్‌మీట్ అయినట్టే కదా.. మన నాలెడ్జి పుస్తకాల రూపంలో ఉంటేనే లెక్క లేకుంటే నాలెడ్జి లేదంటే ఎలా?
265 బీసీలో గుప్త సామ్రాజ్యం ఉన్న మ్యాప్‌ను గమనించండి. సంపూర్ణ భారతదేశం ఒక చక్రవర్తి ఆధీనంలో ఉన్నది. 265 నాటికి ఇవాళ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క దేశమూ అస్తిత్వంలో లేనే లేదు. ఆచార్య చాణక్యుడు సంపూర్ణ భారతవర్షాన్ని ఏ రాజైతే పరిపాలిస్తాడో అతను చక్రవర్తిగా పిలువబడతాడు అని అప్పుడే చెప్పాడు. అంటే 265 బీసీ నాటికే రాజకీయంగా కూడా భారతదేశ భావన ఉన్నదని తేలుతున్నది. ప్రపంచంలో ఏ ఒక్కరికీ నాగరికత అంటే కూడా తెలియని కాలం నుంచి కూడా మనం భారత్ అన్న మాటను మాట్లాడుతున్నాం.
ఋగ్వేదంలో ‘విశ్వామిత్రస్య రక్షతి బ్రహ్మమేదం భారతం జనం’ అన్నారు.
విష్ణు పురాణంలో ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణమ్.. వర్ష తద్ భారతం నామ భారతీ యత్ర సంతతి. అన్నారు.
భారత్ ఉనికి అత్యంత స్పష్టంగా వ్యక్తమైన అతి ప్రాచీనమైనదని స్పష్టమైంది. వేర్వేరు ఇతిహాసాలను పరిగణనలోకి తీసుకొందాం.. మనం యురోపియన్ పద్ధతిలో చర్చిస్తే సమస్యలు వస్తాయి. ఒక దేశం.. ఒక భాష.. ఒక మతం.. ఒక సంప్రదాయం అన్న దృష్టికోణమే భారత్ విషయంలో పనికిరాదు. మహాభారతం తీసుకొండి.. భారత్ అన్నదే లేకుంటే మహాభారతం ఎక్కడి నుంచి వస్తుంది. కనీసం రచయితకైనా ఆ భావన ఉండి ఉండాలి కదా.. ఇందులో దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల గురించి విసృ్తతంగా చర్చించడం జరుగుతుంది. రామాయణం ఉత్తరం నుంచి దక్షిణం దాకా అనుసంధానం చేసింది. రాముడు అయోధ్య నుంచి బయలుదేరి శ్రీలంక దాకా ప్రయాణించిన ప్రాంతం అంతా సంఘటితమైంది. ఇవాళ దేశంలో ఏ మూలకు వెళ్లినా ఏదోవిధంగా రాముడి కథ..సీతమ్మ గాధలు వినిపిస్తుంటాయి. వారి ఉనికిని ఇవాళ్టికీ సమస్త భారతదేశం అన్ని ప్రాంతాల్లోనూ ఆస్వాదిస్తుంటుంది. ఒక్కో చోట ఒక్కో గాథ వినిపిస్తుంటుంది. ఇదంతా అనంతకాలం నుంచి ఏకత్రితమైన మన సంస్కృతికి సంకేతం.
ఇంతెందుకు.. ఆదిశంకరాచార్యులు ఉన్నారు. బాలుడిగా ఉండి.. చరిత్రాత్మకమైన రీతిలో భారత దేశమంతటా పర్యటించారు. కానీ మన చరిత్ర పుస్తకాల్లో ఆయన గురించి రాయరు. చరిత్రకారులు చెప్పరు. కేరళ నుంచి ఒక బాలుడు బయలుదేరి సమస్త భారతదేశమంతటా పాదయాత్రచేసి భారతదేశంలోని నాలుగు దిక్కుల నాలుగు మఠాలను స్థాపించాడు. ద్వారక, పూరీ, శృంగేరి, బద్రీనాథ్‌లలో స్థాపించారు. కంచి కూడా ఆయన స్థాపించిందే. శ్రీనగర్‌లో శంకరాచార్య హిల్ కూడా ఉన్నది. అసలు భారతదేశం అన్న భావనే లేదని చెప్తున్నప్పుడు ఆదిశంకరులు ఈ నాలుగు దిక్కులనే ఎందుకు ఎంచుకొన్నట్టు? అన్నీ కేరళలోనే స్థాపించుకొనేవారు కదా.. లేకుంటే చుట్టుపక్కల పెట్టేవారు కాదా? ఆయన దార్శనికుడు. ఇలాంటి భావన చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఇలా ఎన్నింటిని పరికించి చూసినా మనకు ఈ విషయం పదే పదే స్పష్టమవుతుంది. మన యాత్రా స్థలాల ఏర్పాటు గురించి పరిశీలించినా ఇది అర్థమవుతుంది. మనం భారతదేశంలో శక్తిపీఠాల గురించి చదువుకున్నాం.
పౌరాణిక కథను చెప్పుకుంటే.. దక్షవాటికలో సతి ఆత్మార్పణ చేసుకుంటే.. దుఃఖితుడైన మహాశివుడు ఆమె దేహాన్ని భుజాన వేసుకొని వెళ్తుండగా.. విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ఖండించాడు. ఆ దేహ ఖండికలు ఎక్కడైతే పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. 51 ప్రదేశాల్లో పడ్డాయి. ఇది కూడా ఆశ్చర్యమేస్తుంది. ఈ ముక్కలన్నీ కలిపితే ఒకవిధంగా స్త్రీ రూపం కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఉత్తరాన తల భాగం పడింది. దక్షిణా కాళ్లు పడినాయి. ఇలా అనుకోకపోయినా.. ఈ ముక్కలన్నీ భారతవర్షంలోనే ఎందుకు పడ్డాయి. అందుకే భారత్‌ను మాతగా కొలుస్తారు. సాంస్కృతిక అస్తిత్వానికి భారత్ ప్రతీక. భారతదేశం సాంస్కృతిక అస్తిత్వం ప్రపంచంలో మరెక్కడా లేదు. మరొక్క విషయం ఈ దేశంలో గంగేచ యమునేచైన గోదావరీ సరస్వతీ, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు.. అని సమస్త నదులను కొలుస్తారు. యురోప్‌లో ఎంతమంది వారి ఖండంలో ప్రవహించే నదులను పూజిస్తారు.. కనీసం ఒకటిగా భావిస్తారు? మనదేశంలో ఇలవేల్పులు ఉంటారు. ఉత్తరభారతంలో ఉన్నవారికి దక్షిణాన ఉన్న బాలాజీ ఇలవేల్పుగా ఉంటారు. దక్షిణాన ఉన్నవారికి కాశీ విశ్వనాథుడో.. అయోధ్యరాముడో ఇలవేల్పుగా ఉంటాడు. ప్రజలు ఒకరినొకరు.. సమాజం అంతా అంతర్లీనంగా ఒకే సూత్రంతో బంధించబడిన దేశం భారతదేశం. ఈ సంబంధాలను తెంచడానికే బ్రిటిష్‌వాడు ప్రయత్నించాడు. ద్రావిడులపై ఆర్యులు దండయాత్రచేశారన్నాడు. ఉత్తరాదివారి దగ్గరకు వెళ్లి మెయిన్ ల్యాండ్ వాళ్లు మీమీద అత్యాచారాలు చేశారన్నాడు. దళితుల దగ్గరకు వెళ్లి మీకేం తెలియదు.. మీమీద అత్యాచారాలు జరుగుతున్నాయన్నాడు. సిక్కుల దగ్గరకు వెళ్లి..అరే మీరు హిందువుల సంస్కృతిని, ఆచారాలను పాటిన్తున్నారు. మీ గురువు మీకేం చెప్తున్నాడో మీకు తెలియదు. నేను చెప్తానన్నాడు. సిక్కుల గురువు ఏం చెప్పాడో బ్రిటిష్‌వాడు వచ్చి చెప్తాడు. సిక్కులు 19వ శతాబ్దం దాకా అగ్నిసాక్షిగా వివాహం చేసుకొనేవారు. బ్రిటిష్‌వాడు వచ్చి దాన్ని ధ్వంసంచేశాడు. మనం వాడి మాయలో పడి కొట్టుకుపోతూనే ఉన్నాం. ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి బయటపడేందుకు ప్రయత్నించాలి. మనం స్వాభిమానంతో ముందుకుపోవాలంటే.. మన భాష, సంస్కృతిని పునర్వ్యవస్థీకరించుకోవడం, పునర్నిర్మించుకోవడం అవసరం. ఇప్పుడు చైనా చేస్తున్నది అదే. అక్కడ కన్ఫ్యూషియస్ సెంటర్లను తిరిగి తెరుస్తున్నారు. చైనా భాషపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నది. మెషిన్ లెర్నింగ్ రీసర్చ్ సాయంత్రం ప్రచురణ జరిగితే.. తెల్లవారి చైనా భాషలో విడుదలైంది. భాష పట్ల వారి నిబద్ధత అట్లాంటిది. మనం ఎందుకు చేయలేం. అనువాదం చేయడమా? ఎన్ని పుస్తకాలున్నాయి? వాటిని అనువాదం చేయడమంటే ఎంతవుతుంది? అని తెగ బాధపడిపోతాం.. ఉంటేగింటే ఎన్ని ఉంటాయి పదివేల పుస్తకాలు ఉంటాయా? ఒక్కో పుస్తకానికి ఐదు లక్షలు అనుకొన్నా.. ఐదువేల కోట్లు అవుతాయి. ఒక మహత్తర మైన నాగరికత మూలాల అన్వేషణకు ఐదువేల కోట్లు ఏమూలకు? మన పాలకులకు, మేధావులకు కనీసం ఆ ఆలోచనైనా రాదేమి?
***
Images Courtesy : https://www.worldhistorymaps.com
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. వీరి టీవీ సీరియల్ పుస్తకం దేవ రహస్యం అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది.