రామాయణంలో ఉత్తరకాండను చొరబరిచారనడానికి ఇప్పటికే పలు ఉదాహరణలను చూశాం. దీని గురించి ఇప్పుడు ఎందుకు చర్చ అన్నవాళ్లు ఉన్నారు. దీనివల్ల ఉపయోగమేమిటి అన్న వాళ్లూ ఉన్నారు. కానీ.. ఇప్పుడు ఈ విషయం కచ్చితంగా అవసరం. దశాబ్దాలుగా భారతీయ ధర్మంపై జరుగుతున్న దాడిలో ప్రధానమైన దాడి రాముడిపైనే జరిగింది. రాముడి వ్యక్తిత్వాన్ని, రామాయణాన్ని కించపరిచేందుకు మూలాధారమైంది ఈ ఉత్తరకాండ మాత్రమే. ఫెమినిస్టులకు అస్త్రం దొరికింది ఈ ఉత్తరకాండలోనే. ఎంత దుర్మార్గం అంటే.. రామాయణం అంతా సీత కోసం.. సీత ద్వారా.. సీతే కేంద్రకంగా, సీతే నాయకురాలిగా జరిగితే.. ఉత్తరకాండలోని ఓ పిచ్చి కథను పట్టుకొని మొత్తం రాముడి వ్యక్తిత్వ హననానికి పూనుకొన్నారు. ఎంత దారుణమంటే.. మొదటి ఆరుకాండల్లో అద్భుతంగా వ్యక్తమైన సీతారాముల ప్రేమ మాయమైపోయింది. వారి మధ్య అన్యోన్యత, అనురాగ, ఆప్యాయతలు, దాంపత్యం.. ఒకరినొకరు అమితంగా ప్రేమించుకోవడం.. ఆమె లేకపోతే.. చిన్నపిల్లాడిలా ఏడవటం.. ఇవన్నీ ఏమైపోయినట్టు.. కనీసం లాజిక్కు కూడా అందకుండా.. తమకు అనుకూలమైనదేదో కనిపించగానే రెచ్చిపోయి.. దాడులు చేయడం.. ఈ దేశ ధర్మానికి, సంస్కృతికి మూలస్తంభంగా నిలిచిన రామాయణాన్ని కనుమరుగుచేయడమే లక్ష్యంగా శతాబ్దాలుగా కుట్ర జరుగుతూనే ఉన్నది. చరిత్రను అబద్ధం చేశారు. సంస్కృతిని అబద్ధం చేశారు. నాగరికతను అబద్ధం చేశారు. శాస్త్రాల్లోని శాస్త్రీయతను అబద్ధం చేశారు. శిల్పాలకు, చిత్రాలకు, విగ్రహాలకు, ఆలయాలకు, వాటి నిర్మాణాలకు ఒకటేమిటి.. అన్నింటికీ దుర్వ్యాఖ్యానాలు చేశారు. తప్పుడు నిర్వచనాలు ఖరారు చేశారు. ఇప్పటికీ.. పనికిమాలిన మేధావులని తమను తాము భుజకీర్తులు తగిలించుకొని తిరిగేవారు ఇదే ప్రచారాన్ని చర్వితచర్వణంగా చెప్పుకొంటూ వస్తున్నారు. అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుందన్నట్టుగా రాముడిని, రామాయణాన్ని పదే పదే నిందిస్తే ఆ నిందే నిజమైపోతుంది. స్థిరపడిపోతుంది. అందుకే.. వాస్తవాలేమిటన్నది ఇంత లోతుగా చెప్పాల్సి వస్తున్నది.
రామాయణంలోని తొలి ఆరు కాండల్లో ఆది కవి వాల్మీకి రచనాశైలికి.. ఉత్తరకాండలోని రచనాశైలికి భిన్నత్వం స్పష్టంగా కనిపిస్తుంది. పాత్రల చిత్రణలో స్పష్టమైన అంతరం కనిపిస్తుంది. రాముడి నుంచి.. ఋషుల నుంచి ప్రతి ఒక్కరి పాత్రలోనూ తేడా కనిపిస్తుంది. పట్టాభిషేక అనంతరం మున్ముందు జరుగనున్న గాథను ఉత్తరకాండలో చెప్పనున్నట్టుగా బాలకాండ మూడోసర్గ చివరి శ్లోకంలో ప్రస్తావించారు. మరి ఉత్తరకాండలో రావణుడి పూర్వ వృత్తాంతము.. సనత్కుమారాదులు వచ్చి విష్ణువు రాముడిగా నిన్ను చంపడానికి అవతరించనున్నాడని ఫ్లాష్‌బ్యాక్‌లోకి ఎందుకు వెళ్లినట్టు?
ఇంతకుముందు వ్యాసంలో సీతాపరిత్యాగం గురించి మాట్లాడుకొన్నాం. ఉత్తరకాండలో సీతాపరిత్యాగం అనంతరం ఆమె వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడే ఇద్దరు కవలలను కంటుంది. సీత కవలలను జన్మనిచ్చిన రాత్రి రాముడి తమ్ముడైన శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఉన్నాడట. సీతాదేవికి సంతానం కలిగిన వార్త తెలిసిన తర్వాత సీత ఉన్న పర్ణశాల దగ్గరకు వచ్చి ‘తల్లీ నీవు అదృష్టవశాత్తూ సుఖముగానుంటివి’ అని వెళ్లిపోయాడు. తెల్లవారిన తర్వాత ముని దగ్గరకు వెళ్లి సెలవు తీసుకొని ఆశ్రమాన్ని వదిలి వెళ్లిపోయాడు. లవకుశులు జన్మించిన కొద్ది గంటలకే శత్రుఘ్నుడు ఆశ్రమాన్ని వదిలి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి పర్ణశాల దగ్గరకు వెళ్లి సీతను పలకరించిన శత్రుఘ్నుడు ఉదయం వాల్మీకికి సెలవు చెప్పి వెళ్లిపోయాడే తప్ప వదినగారిని మాత్రం ఉదయవేళ కలవనేలేదు. ఎందుకోమరి! రాముడితోసహా నలుగురు అన్నదమ్ముల మధ్య అనుబంధం చాలా చాలా గొప్పది. ఒకరి కోసం ఒకరు పడే తపన అనన్యసామాన్యమైంది. రాముడు సీతను పరిత్యజించాడని చెప్పారే తప్ప.. ఇతరత్రా ఎలాంటి నిషేధాజ్ఞలు విధించలేదు. అలాంటప్పుడు శత్రుఘ్నుడు.. అర్ధరాత్రి తన వదినగారికి పుట్టిన సంతానాన్ని ఉదయవేళ చూడకుండా.. పరామర్శించకుండా ఎందుకు వెళ్లినట్టు? లక్ష్మణ, భరత, శత్రుఘ్నులది అలాంటి క్యారెక్టర్ కాదు కదా.. ఆమెను తల్లికంటే ఎక్కువగా చూశారు.. పూజించారు. అలాంటిది.. లోకోత్తర మహాపురుషుడైన రామచంద్రుడికి సంతానం కలిగితే శత్రుఘ్నుడు తనకు పట్టనట్టుగా కేవలం సంతోషాన్ని వ్యక్తంచేసి ఎందుకు వెళ్లిపోయాడు.. ఉత్తరకాండ ప్రక్షిప్తం కాబట్టి. వాల్మీకి ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత శత్రుఘ్నుడు యమునాతీరం చేరి చ్యవనాది మునులతో కొంతకాలం గడిపి.. ఆ తర్వాత లవణాసురుణ్ణి చంపివేశాడు. అనంతరం అక్కడే మధుపురిని నిర్మించాడు. పన్నెండేండ్లు మధుపురిలోనే ఉండి రాజ్యంచేశాడు. పన్నెండేండ్ల తర్వాత శత్రుఘ్నునికి తన సోదరుడు రాముడిని చూడాలనిపించింది. కొంత సైన్యాన్ని వెంటేసుకొని బయలుదేరి.. మార్గమధ్యంలో మళ్లీ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కొద్దిరోజులు ఉన్నాడు. ఈ ఉన్న రోజుల్లో ఏ ఘడియలో కూడా శత్రుఘ్నుడు సీతాదేవిని చూసినట్టుగా కానీ, పలకరించినట్టుగా కానీ ఏ ఒక్క శ్లోకంలోనూ కనిపించదు. పైగా అతను అక్కడ ఉన్న సమయంలోనే కుశలవులు రామగానాన్ని చేస్తే విని.. ఆ మాధుర్యానికి మూర్ఛపోతాడు. తానెక్కడ ఉన్నానని అంటూ ఆశ్చర్యపోతాడు. కానీ మునివేషధారణలో ఉన్న ఆ మునిబాలల గురించి కనీసం వాకబు చేసినట్టు కూడా అనిపించదు. ఆ తర్వాత తాను రాముడిని చూడటానికి వెళ్తున్నానని, అనుజ్ఞ ఇమ్మని వాల్మీకి అనుమతి తీసుకొని మరీ అయోధ్యకు వెళ్తాడు. అప్పుడు కూడా సీతా పుత్రుల ప్రస్తావన ఉండదు. తర్వాత శత్రుఘ్నుడు అయోధ్యకు వెళ్లాడు. రాముడి దర్శనం చేసుకొన్నాడు. నువ్వు లేకపోతే నాకు తల్లి లేనట్టే ఉన్నది. కాబట్టి నేను నీ దగ్గరే ఉంటానన్నాడు. ఈ మాట అనగానే రాముడు తమ్ముణ్ణి ఓ వారం రోజులు ఉండి పొమ్మన్నాడు. రాముడిని కలిసినప్పుడు కూడా.. అన్నా.. సీతాదేవి ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిందన్న మాట చెప్పనేలేదు. ఉత్తరకాండలో సీతాపరిత్యాగం సమయంలో సీతాదేవిని వదిలి రమ్మంటాడే తప్ప ఆమెపై ఇతరత్రా ఆంక్షలు విధించడం కానీ, సమాచారం తెలుసుకోకూడదన్న ఆంక్షలు విధించినట్టుగా కూడా కనిపించదు. అయినా శత్రుఘ్నుడు ఎందుకు అన్నగారికి ఆయన సంతానం గురించి ఎందుకు చెప్పలేదు. తొలి ఆరుకాండల్లో దశరథుడి కుటుంబంలోని అనుబంధాలను అనుభవంలోకి తెచ్చుకుంటే.. శత్రుఘ్నుడు ఈ విధంగా ప్రవర్తించేందుకు వీలే లేదు. ఉత్తరకాండలో ఈ అనుబంధాలకు, ఎమోషన్లకు అసలు ప్రాధాన్యమే ఇవ్వలేదు. మానిషాద ప్రతిష్ఠాంతాం అంటూ కరుణరసంతోనే ప్రారంభమైన కారుణ్యభావనాత్మకమైన రామాయణ కావ్యంలో ఇలాంటి పొడిపొడి సన్నివేశాలు ఉండటానికి ఆస్కారమే లేదు. మరి ఉత్తరకాండలో ఇలాంటి సన్నివేశాలు ఎందుకు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. ఎందుకంటే అది వాల్మీకి రచన కాకపోవచ్చును కాబట్టి. రాముడు అశ్వమేథయాగం చేసినప్పుడు వాల్మీకి శిష్యులుగా కుశలవులు అయోధ్యాపురిలో రామాయణ గానం చేసినట్టుగా ఉత్తరకాండలో మనకు కనిపిస్తుంది. రాముడు తన తమ్ముళ్లు, తల్లులు, మంత్రులు, దండనాధులు, ప్రజలందరితో కూడి రామాయణ గానాన్ని విని ముగ్ధుడయ్యాడు. అప్పుడు కూడా శత్రుఘ్నుడికి వారెవరో తెలియరాలేదు. బహుశా గుర్తుపట్టలేదేమో! వారి గానానికి ముగ్ధుడైన రాముడు మీరు ఎవరి కుమారులు అని అడిగితే మేము వాల్మీకి శిష్యులము అని చెప్పారే తప్ప తల్లి ప్రస్తావన తేలేదు. లవకుశ సినిమాలో మాదిరిగా ఉత్తరకాండలో సీతాదేవి మారుపేరుతో వాల్మీకి ఆశ్రమంలో నివసించలేదు. యథార్థ నామంతోనే మనుగడ సాగించింది. కుమారులకు కూడా తమ తల్లి గురించి బాగా తెలుసు. అయోధ్యలో రామాయణ గానం విన్న రాముడు లక్ష్మణుడిని పిలిచి ఆ ఇద్దరికి 18 వేల బంగారు నాణాలతోపాటు మరింకేదైనా కావాల్సి ఉంటే ఇవ్వాలని ఆదేశించాడు. కానీ వారు తిరస్కరించారు. వాల్మీకి.. రామాయణాన్ని రచించిన సంగతి కూడా వారే రాముడికి చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి రాముడు వారిద్దరినీ సీతాపుత్రులుగా తెలుసుకున్నట్టుగా ఉన్నది. ఎవరు చెప్పారు? ఎలా కనుగొన్నాడన్న మాట మాత్రం లేదు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఎంతో పరిణతితో.. అద్భుతమైన శిల్పంతో రసాత్మకంగా నిర్మాణమైన రామాయణ కథాకావ్యం.. ఉత్తరకాండలో కథానిర్మాణం ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు సాగింది? వాల్మీకి రచన కాకపోవడం వల్లనేనేమోనని నా అభిప్రాయం. పెద్దలెవరైనా సందేహం తీరిస్తే మంచిది! మునికుమారులు సీతాపుత్రులని తెలుసుకొన్న వెంటనే రాముడు సభను ఏర్పాటు చేశాడు. అక్కడికి దూతలను పిలిపించి “మీరు పూజ్యులైన వాల్మీకి దగ్గరకు వెళ్లి నా మాటగా.. ‘సీత పరిశుద్ధమైన ప్రవర్తన కలదైనచో, పాపరహిత అయినచో మహాముని అనుజ్ఞ పొంది ఇక్కడ తన శుద్ధిని నిరూపించుకొనుగాక’ అని చెప్పుడు. వాల్మీకి అభిప్రాయమును, నమ్మకము కలుగు ప్రమాణమును చూపుటకు అంగీకరించిన సీత అభిప్రాయమును తెలుసుకొని శీఘ్రముగా వచ్చి నాకు తెలుపుడు. జనకుని కుమార్తె అయిన సీత రేపు ప్రాతఃకాలము పరిషత్తు మధ్యయందు నన్ను నిర్దోషినిగా నిరూపించుటకు కూడా శపథము చేయుగాక” అని అన్నాడు. దూతలు వెంటనే వెళ్లి వాల్మీకికి రాముడి మాటలను తెలియజేయడం.. ఆయన అంగీకరించడం.. సీతను వెంటబెట్టుకొని రాముడు చెప్పిన టైంకు పరిషత్తుకు వచ్చాడు. అయ్యా నేను వాల్మీకిని.. ప్రచేతసుడి పదవ సంతానాన్ని.. నేను ఎన్నడూ అబద్ధమాడలేదు. నీ భార్య పరిశుద్ధురాలు అని చెప్పాడు. అందుకు రాముడు స్పందిస్తూ, అయ్యా నేను నీ మాటలను నమ్ముతున్నాను. నాకెలాంటి అనుమానం లేదు కానీ.. లోకాపవాదు బలవత్తరంగా ఉన్నది కాబట్టి, ఈ శపథం చేయించక తప్పడంలేదు అని అన్నాడు. దీంతో సీత ముందుకు వచ్చి.. నేను రాముడిని తప్ప అన్యమెరుగని దానినైతే భూదేవి నాకు చోటు ఇచ్చుగాక అని శపథం చేసింది. వెంటనే భూతలం నుంచి గొప్ప సింహాసనం వచ్చి.. దానిపై భూదేవి కూర్చొని.. సీతను తోడుకొని రసాతలానికి వెళ్లిపోయింది. సీత రసాతలానికి వెళ్లడాన్ని చూసి రాముడు చాలా చాలా దుఃఖితుడయ్యాడట. …. ఇది సీతా పరిత్యాగానికి సంబంధించి ఉత్తరకాండలోని పూర్తి ఎపిసోడ్. ఇక్కడే నాకు చాలా చాలా సందేహాలు వస్తున్నాయి. పండితులు ఎవరైనా తీర్చాలని వినతి. లోకాపవాదు ఏదీ లేనప్పుడే.. రాకముందే.. రాముడు దాని గురించి ఊహించాడు కదా.. యుద్ధకాండలో ఈ లోకాపవాదు గురించి ప్రముఖంగానే చర్చించారు. పబ్లిక్ లైఫ్‌లోకి వెళ్లేవాడు కించిత్ కళంకం కూడా లేకుండా ఉండాలని ఆదర్శం చెప్పాడు. ఆ మధ్య బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోనికా లూయిన్‌స్కీతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నందుకు అమెరికా జాతికి క్షమాపణ చెప్పాల్సివచ్చింది. (మనదగ్గర ఇలాంటివి జరుగవనుకొండి!) రావణ వధ అనంతరం రాముడు మొట్టమొదట చేసిన పనే సీతకు పరీక్ష పెట్టడం.. ప్రతిజ్ఞ చేయించడం. ఆ తరువాతే ఇంటికి తీసుకొచ్చాడు కదా. మామూలుదైనా.. మహత్తరమైనదైనా.. లోకాపవాదు అపవాదే. ఇందులో సందేహం లేదు. దీని గురించి భయపడే రాముడు అగ్నిపరీక్ష చేశాడు.. ఆ తరువాత అదే లోకాపవాదు నిజంగా వచ్చిందని సీతమ్మను అడవిలో వదిలేశాడు (ఉత్తరకాండ ప్రకారం). లవకుశులు సీతాదేవి కుమారులని తెలిసిన తర్వాత రాముడు చేసిన పని, మళ్లీ సీతతో శపథం చేయించడం. నిండు సభలో శపథం చేయాలని వాల్మీకి ఆశ్రమంలో ఉన్న సీతమ్మను పిలిపించడం. తాను చెప్పినట్టుగా శపథం చేస్తే ఆమెపై తనకు తిరిగి ప్రేమ కలుగుతుందని.. మళ్లీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పడం. ఇదంతా విడ్డూరంగా ఉన్నదా లేదా.. ఈ కత.! సభలో శపథం చేస్తే లోకాపవాదు పోతుందని అనుకుంటే.. అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న వెంటనే సీతాదేవితో శపథం చేయిస్తే సరిపోదా? పోనీ.. లోకాపవాదు గురించి విన్న తరువాతైనా.. ఇదే శపథం అప్పుడే నిండు సభలో చేయిస్తే సరిపోయేది కదా.. ఇంతోటిదానికి సీతను అడవిలో వదిలేయడం, లేని వాల్మీకి ఆశ్రమానికి పంపించడం, బంగారుసీతను చేయించుకోవడం, అశ్వమేథం చేయడం, సీతాదేవి రసాతలంలోకి వెళ్లిపోవడం వంటివన్నీ అవసరమా? ఆల్రెడీ పరీక్ష అయిపోయి పాసైన తర్వాత మళ్లీ పరీక్ష పెట్టడం వింత కాక మరేమిటి? ఈ మొత్తం ఏపిసోడ్‌ను నిర్వహించింది వాల్మీకే. రామాయణంలో వాల్మీకి పాత్ర ప్రత్యక్షంగా కనపడటం.. అదీ తన గురించి తానే రాసుకోవడం కూడా ఈ ఉత్తరకాండలో జరిగిన సన్నివేశమే. మొదటి ఆరు కాండల్లో తనను కలిసినట్టుగా కానీ, ప్రస్తావించినట్టుగా కానీ వాల్మీకి ఎందుకు చెప్పుకోలేదు. రాముడి సభలో, పరిషత్తులో ప్రత్యక్షంగా పాల్గొని.. సీతాదేవి పరిశుద్ధత గురించి ఉద్ఘోషించిన వాల్మీకి.. రామాయణ కథాకావ్య నాయకుడి గురించి ఏమీ తెలియనట్టుగా నారదుడిని వాకబు చేయడమేమిటి? వీటన్నింటినీ లోతుగా గమనిస్తే ఏ విధంగానూ ఉత్తరకాండ వాల్మీకి విరచితం కాదనేది స్పష్టంగానే తేలిపోతున్నది. దీనిపై మరింత లోతుగా పరిశోధన జరగాల్సి ఉన్నది.
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. వీరి టీవీ సీరియల్ పుస్తకం దేవ రహస్యం అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది.