Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రామం భజే శ్యామలం-5

దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర.

అభారతీయం 2

‘ఇతరుల భావాలను విదేశీ భాషలో వర్ణించి, వాటితో మెదడు నింపుకొని ఏవో విశ్వవిద్యాలయాల పట్టాలు పుచ్చుకొని మీకు మీరు విద్యావంతులమనుకొంటున్నారా?  మీ విద్యకు లక్ష్యమేమిటి? ఒక గుమాస్తాగిరీయో, ప్లీడరీయో, కాకపోతే ఒక డిప్యూటీ మెజిస్ట్రేట్‌గిరీ.. అదీ ఒక గుమాస్తాగిరీయే కదా! అంతే కదూ! నీ దేశానికి ఇది ఏం మేలు చేస్తుంది? కండ్లు తెరిచి చూడండి. అన్నపూర్ణలాంటి భారతభూమిలో అన్నార్తుల ఆర్తనాదాలు వినండి. మీ విద్య ఈ కొరత తీర్చగలదా? సామాన్య ప్రజలు  జీవిత పోరాటానికి సన్నద్ధం కావడానికి , వ్యక్తిత్వ శశక్తినీ, దాతృత్వ భావాన్ని, సింహ సాహసాన్నీ ఇవ్వని విద్య అదేం విద్య? వ్యక్తిత్వం రూపుదిద్దుకొనే, మనోబలం పెంపొందే, మేధస్సు విశాలమయ్యే, మనిషి తన కాళ్లమీద తాను నిలబడగలిగే విద్య కావాలి మనకు. విదేశీ నియంతణ్ర లేకుండా మన విజ్ఞానంలోని భిన్న శాఖల్ని చదువుకోవాలి మనం. మనకు సాంకేతిక విద్య అనేది మన పరిశ్రమలను వృద్ధి చేసుకోవడంకోసం కావాలి.’

భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి దాదాపు 60 ఏండ్లకు ముందు స్వామి వివేకానంద విద్యార్థులను ఉద్దేశించి అన్న మాటలివి. మన విద్యావ్యవస్థ ఏ విధంగా ఉండాలో.. ఎలా ఉంటే ఈ దేశం ఉన్నతిని సాధించగలదో వివేకానంద స్పష్టంగానే చెప్పారు. వివేకానంద ఈ మాటలు చెప్పేనాటికే ఈ దేశంలో మెకాలేల ఉత్పత్తి మొదలై అరవైఐదేండ్లు అయిపోయింది.

ఆ తర్వాత కొంతకాలానికి మహాత్మాగాంధీ తన సృజనాత్మక ఆలోచనలతో ఈ దేశానికి మార్గదర్శకత్వం వహించపూనుకున్నారు. 1931లో లండన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మహాత్మాగాంధీ మాట్లాడుతూ.. భారతదేశంలో లోపభూయిష్టమైన ప్రాథమిక విద్యావ్యవస్థ గురించి ప్రస్తావన చేశారు. ఆనాటికి దేశంలో అమలులో ఉన్న విద్యావిధానం సామాజిక ఆర్థిక పరిపుష్టికి ఎంతమాత్రం పనికిరాదని స్పష్టంగానే వివరించారు. ‘I am convinced that the present system of education is not only wasteful but positively harmful’ అని గాంధీజీ అన్నారు. ఆ తర్వాత 1937 నాటికి మన దేశానికి కావాల్సిన విద్యావిధానాన్ని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని చర్చించడానికి ముందు మనం ఒక రెండేండ్లు వెనుకకు వెళ్దాం. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం బ్రిటిష్ ఆధీనంలోని ఏడు ప్రావిన్సులలో కాంగ్రెస్ మంత్రి మండళ్లు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ కూడా అందరికీ నిర్బంధ ఉచిత విద్యను అందించాలని వాదిస్తూనే ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తాను డిమాండ్ చేస్తున్నట్టుగా విద్యావిధానాన్ని అమలుచేసే అవకాశం కలిగింది. కానీ ఆ పార్టీ నేతలు ఆ పని మాత్రం చేయలేదు. అప్పటికే మహాత్మాగాంధీ భారతదేశానికి అనువైన, అవసరమైన విద్యావిధానాన్ని ప్రతిపాదించారు. ‘నేను ఈ దేశానికి ఎన్నో ఇచ్చాను. కానీ ఈ విద్యావిధానానికి మించినది మరొకటి లేద’ని ఆయన అన్నారు. 1937 అక్టోబర్‌లో జరిగిన వార్ధా జాతీయ సదస్సునాటికి గాంధీ తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ ముందుంచారు. సామాన్య భారతీయుల జీవన విధానము, సంస్కృతి, వృత్తి స్థితిగతులను ఆధారంచేసుకొని ఆయన విద్యావిధానం ఎలా ఉండాలో దార్శనికతతో వివరించారు. అంతకుముందు జూన్, 1931లో తన హరిజన్ పత్రికలో ఇందుకు సంబంధించి వరుసగా వ్యాసాలు కూడా రాశారు. దేశంలోని ప్రతి పిల్లవాడికి ప్రాథమిక విద్య నిర్బంధంగా అందించాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలోనే జరగాలని ఆయన అన్నారు. విద్యార్థికి  ఒకపక్క చదువు చెప్తూనే మరోపక్క అతనికి ఇష్టమైన ఏదో ఒక చేతి వృత్తిలో (అప్పటికి కంప్యూటర్లు అందుబాటులో లేవు) నైపుణ్యం సాధించి కనీసం పంతులుకు ఫీజు చెల్లించేంతనైనా సంపాదించేలా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగమే వస్తుందనో.. తాను బతుకలేనేమోననే ఆందోళనలు విద్యార్థికి ఏ దశలోనూ రావు. విద్యార్థి ఆత్మవిశ్వాసంతో పూర్తి వ్యక్తిత్వంతో విద్య పూర్తిచేసుకొని బయటకు వస్తాడు. ప్రతి వ్యక్తికి చదువుతోపాటు ఏదో ఒక నైపుణ్య విద్య కచ్చితంగా అబ్బటం వల్ల ఆకలి బాధలు ఉండే అవకాశమే ఉత్పన్నం కావు. ఇది మహాత్ముడి ఆలోచన.

స్వామి వివేకానందుడు, మహాత్మాగాంధీ ఆలోచనలు, ప్రతిపాదనలు ఒకేవిధంగా ఉన్నాయి. ఇద్దరు మహానుభావులూ దేశీయ పరిస్థితులను సంపూర్ణంగా ఆకళింపు చేసుకొని భవిష్యత్ భారతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనలు చేశారు. 1937 అక్టోబర్ 22, 23 తేదీలలో జరిగిన   వార్ధా సదస్సుకు పలువురు విద్యావేత్తలు, ఏడు ప్రావిన్సులకు సంబంధించిన కాంగ్రెస్ విద్యామంత్రులు హాజరయ్యారు. గాంధీజీ ప్రతిపాదనలపై తీవ్రంగా చర్చ జరిగింది. విద్యావిధానంతోపాటు సంపూర్ణ మద్య నిషేధం గురించి కూడా గాంధీ ఈ సదస్సులో గట్టిగా పట్టుబట్టారు. దీనిపై రెండురోజుల పాటు పెద్ద చర్చే జరిగింది. గాంధీ ప్రతిపాదించినట్టుగా తప్పనిసరిగా మాతృభాషలో విద్యాబోధన చేయాలంటే చాలా డబ్బులు అవసరమవుతాయని.. ఇందుకోసం కొత్త పన్నులు విధించాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలే అన్నారు. దీంతోపాటు మద్యనిషేధం విధిస్తే భారీగా ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని గాంధీజీ సముఖంలోనే తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అదే సమయంలో ‘మద్యనిషేధం, నిర్బంధ విద్య’కు కాంగ్రెస్ కట్టుబడే ఉంటుందన్నారు కూడా.. నిధులు లేవనో.. మరో కారణంతోనో నిర్బంధ విద్యను నీరుగార్చడం సరికాదని గాంధీ స్పష్టంచేశారు. రెండురోజుల చర్చ జరిగిన తర్వాత గాంధీజీ మాటను కాదనలేక.. వార్ధా సదస్సు నాలుగు తీర్మానాలను ఆమోదించింది.

  1. That in the opinion of this conference, free and compulsory education be provided on a nation-wide scale.
  2. That the medium of instruction be the mother tongue.
  3. That the process of education through this period should centre round some form of manual productive work suitable for the local condition.
  4. That the conference expects that the system of education will be gradually able to cover the remuneration of the teacher.

ఇక్కడ తీర్మానాలు చేయడం అంటే.. అమలు చేయడమని కాదు. తీర్మానాలు చేసి.. తదనుగుణంగా సిలబస్ ఏవిధంగా ఉండాలో నిర్ణయించడానికి, అనంతరం అమలుచేయడానికి అధ్యయనంచేసి విస్తృత నివేదికను సమర్పించడానికి డాక్టర్ జాకీర్‌ హుస్సేన్ నాయకత్వంలో ఒక కమిటీని వేశారు. ఎవరినీ నొప్పించకుండా.. తాము నొచ్చుకోకుండా.. ఒక విషయాన్ని ఎటూ తేల్చకుండా సుదీర్ఘకాలం నాన్చడానికి ఈ దేశ రాజకీయ వ్యవస్థలో బ్రహ్మాస్త్రం కమిటీ వేయడం. ఇదిగో ఈ కమిటీల సంప్రదాయానికి బహుశా జాకీర్ హుస్సేన్ కమిటీతోనే కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. గాంధీ ప్రతిపాదనలను అమలుచేయలేక.. ఆయన మాటను కాదనలేక ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం తొమ్మిది మంది ప్రముఖులతో ఈ కమిటీ ఏర్పాటైంది. ప్రొఫెసర్ కేజీ సైగిడైన్, ఆర్య నాయకమ్, వినోభాభావే, కాకా కాలేల్కర్, జేసీ కుమారప్ప, కిశోరీలాల్, కేటీ షా తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటిలాగా కమిటీలు ఎక్స్టెన్షన్లు తీసుకోవడం ఆ రోజుల్లో పెద్దగా అనుభవంలోకి రాని విషయం.  కాబట్టి, జాకీర్ హుస్సేన్ తొందరగానే తనకు అప్పగించిన పనిని పూర్తిచేసింది. రెండు నివేదికలు రూపొందించి అధిష్ఠానానికి సమర్పించింది. మొదటి నివేదిక 1937 డిసెంబర్‌లో, రెండో నివేదిక 1938 ఏప్రిల్‌లో సమర్పించారు. దేశంలో మౌలిక విద్యావిధానానికి సంబంధించిన ప్రధాన నివేదిక ఇది. ‘వార్ధా స్కీం ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్’ అని ఇది ప్రసిద్ధి చెందింది. ఈ నివేదికను గాంధీజీ ఆమోదించారు. దీన్ని 1938 హరిపురా కాంగ్రెస్ సదస్సుముందుంచారు. మొదటి నివేదికలో విద్య లక్ష్యాలు, ఉపాధ్యాయులు వారికి శిక్షణ, పాఠశాలల నిర్వహణ, పరిపాలన, పర్యవేక్షణతోపాటు ఏదైనా ఒక చేతిపని అది చెక్కపని కావచ్చు.. లోహపు పని కావచ్చు.. లేదా వ్యవసాయ సంబంధమైన పనికావచ్చు.. ఏదో ఒక పనిలో విద్యార్థిని నిపుణుడిని చేయడం వంటి ప్రతిపాదనలు చేశారు. హరిపురా కాంగ్రెస్ సదస్సు ఏమీ తేల్చలేదు. తర్వాత మరికొన్ని కమిటీలు వేశారు. అవీ చర్చించాయి. నివేదికలిచ్చాయి. 1945లో సేవాగ్రామ్‌లో జరిగిన సదస్సులో గాంధీ విద్యావిధానాన్ని ‘ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్’ అని జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపించే ‘నయీ తాలీమ్’ అని తెగ ప్రశంసలు కురిపించారు. మొత్తానికి 1946లో సదరు ఏడు ప్రావిన్సుల్లో గాంధీజీ విద్యావిధానాన్ని అమలుచేయడానికి కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. కొన్ని ప్రతిపాదనలతో మౌలిక విద్యావిధానం రూపొందింది. ఆ ప్రతిపాదనలు ఇవి.·

ఏదో ఆలస్యంగానైనా ఈ విద్యావిధానం అమలవుతుందని భావిస్తున్నంతలోనే 1947లో స్వాతంత్య్రం వచ్చింది. నెహ్రూ గారు ఢిల్లీ సింహాసనంపై కొలువుదీరారు. సహజంగానే నెహ్రూ అనుచరగణం అన్ని వ్యవస్థల్లోకి విస్తరించారు. మార్క్సిస్టులూ పరోక్షంగా నెహ్రూతో జతకలిశారు. గాంధీ విద్యావిధానం ఏమైపోయిందో ఎవరికీ పట్టలేదు. నెహ్రూ మార్కు విద్యావిధానం మొదలైంది. భారత్ స్వతంత్రం కావడం.. జాతి పునర్నిర్మాణానికి ఒక సువర్ణావకాశం.  ఒకప్పుడు యావత్ ప్రపంచానికి కన్నుకుట్టేలా సమస్త రంగాల్లో సుసంపన్నంగా ఉన్న దేశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాల్సిన మొట్టమొదటి ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేసింది. గాంధీ చనిపోయిన తర్వాత అఖిలభారత విద్యాసదస్సును ఏర్పాటుచేసిన నెహ్రూ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమార్పులను తీసుకొస్తానని నినదించాడు. వెంటనే యూనివర్సిటీ విద్యను సంస్కరించడం మొదటిపనిగా పెట్టుకొని అందుకోసం సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో ఒక కమిటీ వేశాడు.

ఏ దేశంలోనైనా, ఏ నాగరికతకైనా చదువు అనేది ప్రాణంలాంటిది. దేశీయమైన మూలాలను పట్టించుకోకుండా విదేశీమూలాలను చొప్పించడానికి జరిగిన విద్యా విధ్వంసకాండను నిలువరించి మౌలికస్థాయి నుంచి   మన జాతి అవసరాలు, దేశ పురోగతి, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాలను దృష్టిలో ఉంచుకొని విద్యావిధానాన్ని రూపొందించాల్సిన స్వతంత్ర భారతదేశ తొలి ప్రభుత్వం ముందుగా పైనుంచి కిందికి దిగాలని ప్రయత్నించింది. ఒకప్పుడు ఇంగ్లిష్ వాడు చూసి ఒకింత ఆశ్చర్యపడి, మరికొంత భయపడిపోయి.. బలవంతంగా తన భాషను, విద్యను మనపై రుద్ది.. ఏలినవారికి గులాంగిరీ చేసే మరమనుషులను తయారుచేసిన విద్యావ్యవస్థను నిర్వీర్యంచేసి మనదైన విద్యను పునరుద్ధరించి.. కాలానికి అనుగుణంగా తీర్చిదిద్ది, సంస్కరించి పురోగమింపజేయాల్సిన పనిని నెహ్రూ అండ్ కో కించిత్ మాత్రమైనా చేయలేదు. ఒకదాని తర్వాత ఒకటిగా యాభై అరవై కమిటీలను వేస్తూనే పోయింది. చివరకు ఈ కమిటీలన్నీ రద్దుచేయడానికి మరో కమిటీ (కొఠారీ కమిషన్)ని వేసింది. గత ఏడున్నర దశాబ్దాలుగా ఈ కొఠారీ కమిషన్ సిఫార్సుల గురించి సమావేశాల్లో, సదస్సుల్లో, పుస్తకాల్లో, పత్రికల్లో, చర్చల్లో వింటూనే ఉన్నాం.. చదువుతూనే ఉన్నాం.. ఆ తర్వాత కూడా అనేక కమిషన్లు వచ్చాయి.. పోయాయి. కాంగ్రెస్ చెప్పిన నిర్బంధ ఉచిత విద్యను అమలుచేయడానికి ఈ 73  ఏండ్లలో ఎన్నడూ నిధులు సమకూరలేదు. ఈ దేశానికి అవసరమైన విద్యావ్యవస్థ రూపకల్పనకు తీరిక దొరకలేదు. కానీ బ్రిటిష్‌వాడు ప్రారంభించిన విధ్వంసాన్ని మరింత వేగంగా.. మరింత పటిష్ఠంగా అమలుచేయడానికి మాత్రం అత్యంత ఉత్సాహంతో ప్రభుత్వాలు పనిచేశాయి.

మన స్వాతంత్య్రానంతర విద్యావిధానం పూర్తిగా నిరర్థకంగా సాగింది. జాతీయ ప్రయోజనాలకు, లక్ష్యాలకు పనికిరాకుండా పోయింది. ఒక విధంగా మన దేశానికి వ్యతిరేకంగా, విదేశీ శక్తుల పక్షాన పనిచేసే విధమైన వ్యక్తులను పుంఖానుపుంఖాలుగా తయారుచేస్తూపోయింది. ఇది నిజంగా జాతికి జరిగిన తీరని అన్యాయంగా  భావించాలి. ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటే ఇదెంత వాస్తవమో అర్థమవుతుంది. ఒక సైన్స్ గ్రాడ్యుయేట్‌నో, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్‌నో, ఇంజినీర్‌నో, డాక్టర్‌నో తయారు చేయడానికి ఎంత ఖర్చవుతున్నది? ఇందులో విద్యార్థి చెల్లిస్తున్న రుసుము ఎంత? ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత? ఈ ప్రజల ఖర్చుతో ఖరీదైన చదువు చదువుకున్న వారు తన జ్ఞానాన్ని, ఎవరికోసం వినియోగిస్తున్నాడు? తన చదువుకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉచితంగా పొందుతాడు. కానీ ఈ దేశాన్ని మాత్రం ప్రేమించడు. ఇక్కడ చదువు చదివి ఎవడికో ఊడిగం చేస్తాడు. ప్రభుత్వం విద్యకోసం పెడుతున్న ఖర్చు.. అభివృద్ధి చేస్తున్న సాంకేతికత ఈ దేశానికి, ఈ సమాజానికి, ఇక్కడి సామాన్య ప్రజల అవసరాలకు, ఉన్నతికి ఉపయోగపడనప్పుడు ఆ చదువును నిరర్థకమనకుండా ఏమనాలి?

నెహ్రూ ప్రభుత్వం భారతీయులకు అత్యంత ఆవశ్యకమైన విద్యావిధానంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేదు. బ్రిటిష్ వాడు రావడానికి ముందు ఇక్కడ ఎలాంటి విద్యావిధానం ఉండింది,  ఆ తరువాత ఏరకంగా మారిపోయింది,  దాదాపు నూటయాభై ఏండ్ల తరువాత మారిన సమాజానికి ఏ విధమైన విద్య ఉపయోగపడుతుందన్న ఇంగితాన్ని నెహ్రూ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ ప్రదర్శించలేకపోయాయి. భారత్‌లో భారతీయత నిర్మూలనానికి కావాల్సినంత చేయూతను అధికారికంగానే అందించారు. తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌తో మొదలుపెడితే.. నూరుల్ హసన్ దాకా అంతా ఒకే విధానంలో ముందుకు పోయారు. భారతీయ మూలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థుల దరికి చేరకూడదు. భారతీయ సమాజంలో అన్నీ అసమానతలే ఉన్నాయని చెప్పాలి. తద్వారా అసమానతలను పెంచి పోషించాలి. వివిధ వర్గాలను ఏ విధంగానూ ఏకత్రితం కాకుండా చూడాలి. కుల విభేదాలు, వర్గ విభేదాలు, వర్ణ విభేదాలు, మత విభేదాలు కొనసాగుతూనే ఉండాలి. హిందూ మతం మినహా మిగతా మతాలన్నీ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించాయని చెప్పాలి.  చరిత్రమొత్తం  ఈ లక్ష్యం ప్రకారం  రూపొందించారు.  మహమ్మద్ ఘజనీ, బాబర్‌,  అక్బర్, ఔరంగజేబ్‌  వంటివారు   మానవతావాదులయ్యారు. పందొమ్మిది సంవత్సరాల దాంపత్యజీవితంలో పద్నాలుగు సార్లు గర్భవతిని చేసి 39 ఏండ్లకే తనువుచాలించేలా భార్యతో కాపురం చేసిన రాజు (షాజహాన్).. ఆ భార్య చనిపోయిన ఆరు నెలల తర్వాత సదరు సమాధిలోంచి అస్తికలు తెచ్చి మరోచోట పూడ్చిపెట్టి దాన్ని తాజ్‌మహల్ అంటే.. యూనివర్సల్ ప్రేమకు ప్రతిరూపంగా కొనియాడుతూ పాఠాలు రాశారు. ఆ అమరప్రేమను అమరం చేస్తో సినిమాలు పుట్టుకొచ్చాయి.   తాజ్ మహల్,  అక్బర్  సలీం అనార్కలి, శాజహాన్, బాబర్, హలాకూ , మొఘలే ఆజం నుంచి మొన్న మొన్నటి జోధా అక్బర్ దాకా సినిమాలు పుట్టుకొచ్చాయి. ఔరంగజేబును ముప్పుతిప్పలు పెట్టి ఔరంగాబాద్‌లో దిక్కులేని చావుచచ్చేలా చేసి.. యావత్ దేశాన్ని తన ఏలుబడిలోకి తెచ్చిన శివాజీ చరిత్రపాఠాల్లో లేకుండాపోయాడు. రాణాప్రతాపుడు, కాకతీయులు, శాతవాహనులు, చాళుక్యులు, చోళులు, పల్లవులు.. ఒకరేమిటి.. వీళ్లెవరూ ఈ దేశ చరిత్రలో చోటు సంపాదించుకోలేపోయారు. వీళ్ల టెక్నాలజీ టెక్నాలజీ కాకుండా పోయిందా? వీళ్ల సంస్కృతి సంస్కృతి కాదా? వీళ్ల కాలంలో విజ్ఞానం లేకుండానే అద్భుతమైన నిర్మాణాలు, వస్త్రాలు, వజ్రాభరణాలు, ఉపకరణాలు తయారయ్యాయా? నౌకా వ్యాపారాలు ఏ పరిజ్ఞానం లేకుండానే కొనసాగిందా? ఇవన్నీ ఏమైపోయాయో అర్థం కాదు. ఒకప్పుడు ఈ దేశంలో ఏ పనికి ఆ పనిగా పని విభజన చేసుకొని విభేదాలు లేకుండా కొనసాగిన సమాజాన్ని విచ్ఛిన్నంచేశారు.

జాతీయ పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ), జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (ఎన్‌ఐఈసీఏ)ల ద్వారా నెహ్రూ ఎజెండా కొనసాగింది. పాఠ్యపుస్తకాల్లో సెక్యులరిజం పేరుతో అభారతీయ అజెండాను గుప్పించడం మొదలుపెట్టారు. నెహ్రూ అనంతరం ఇందిరాగాంధీ దీన్ని మరింత ముందుకు తీసుకొనిపోయారు. ఆమె మంత్రివర్గంలో విద్యామంత్రిగా ఉన్న నూరుల్ హసన్ అభారతీయ అజెండాకు పదునుపెట్టారు. ఎన్‌సీఈఆర్టీలో సామాజిక శాస్త్రాల విభాగానికి అధిపతిగా హెచ్‌ఎస్ ఖాన్ దాదాపు 20 సంవత్సరాలు కదలకుండా ఉన్నారు. ఇస్లాం ప్రవేశించిన తర్వాతే భారతదేశం నాగరకమైందని ఈయనగారి బలమైన విశ్వాసం. నూరుల్ హసన్ కూడా ఈ కోవలోకి చెందినవారే. ఆయనకు మార్క్సిస్టులు సంపూర్ణంగా అండగా నిలిచారు. పాఠాలు మారాయి. పాఠ్యాంశాలు మారాయి. భారతీయ వ్యతిరేక ప్రచారాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ అజెండాను ఇంకా బలోపేతం చేయడం కోసమే జవహర్‌లాల్ యూనివర్సిటీ ఆవిర్భవించింది. 1966లో జేఎన్‌యూ చట్టం ఆమోదం పొందింది. 1969 నుంచి ఈ యూనివర్సిటీ ఉనికిలోకి వచ్చింది. భారత రాజధానిలో అప్పనంగా ఉంటూ.. భారతీయుల సొమ్ము తింటూ.. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడం ఇక్కడి స్వయం ప్రకటిత మేధావుల విధి,  కర్తవ్యం. మెకాలే వారసులు వారికి అప్పగించిన బాధ్యత ఇదే. జేఎన్‌యూకు అనుబంధంగా పనిచేసేది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. ఈ రెండూ కూడా తమ తమ విద్యాసంస్థల్లో చాలా మంది  మెకాలే మానసపుత్రులను  తయారుచేసి దేశం మీదకు వదిలాయి. ఈ దేశాన్ని ముక్కలు చేస్తామని బరితెగించి నినదించే స్థాయికి అక్కడి విద్యార్థులను తయారుచేశాయి. దేశంలోని అత్యున్నత శాసన వ్యవస్థకు వేదికైన పార్లమెంట్‌పైన దాడి చేసిన పరాయిదేశపు మూకలకు అండగా నిలిచి.. కుట్ర ప్రణాళిక రచించిన వ్యక్తి నేరం రుజువై, శిక్ష అమలైతే.. ‘భారత్ తేరే టుక్డే టుక్డే హోంగే.. హమ్ షర్మిందాహై అఫ్జల్ తేరే కాతిల్ జిందాహై.. ఛీన్ కర్ లేంగే ఆజాదీ’ అంటూ దేశరాజధాని నడిబొడ్డులోని ఒక యూనివర్సిటీలో నినాదం చేయడానికి ఏ దేశంలోనైనా ఏ విద్యార్థి అయినా సాహసించగలడా? సాహసించి జీవించి ఉండగలడా.. అది కేవలం ఒకే ఒక్క దేశంలో మాత్రమే సాధ్యమవుతుంది. అది మన భారతం. అందుకు ఉపయోగపడే అస్త్రం భావ ప్రకటనా స్వేచ్ఛ. అలా నినదించిన వాడు బాజాప్తా వీధుల్లో తిరుగుతూ.. ఎన్నికల్లో నిలబడుతూ.. ఓట్లతో గెలుస్తూ.. అదే శాసన వ్యవస్థలో భాగస్వామి కావడం కూడా మనదేశంలో మాత్రమే సాధ్యపడే వింతైన అంశం. దీనికి సోషలిజం, సెక్యులరిజం అన్న బలమైన పునాది వేసిన మహానుభావుడు పండిత జవహర్‌లాల్ నెహ్రూ.

ప్రజలుగా మనం తెలివి తక్కువవాళ్లం కాదు. దేశంగా మానవ వనరులు లేనివాళ్లం కాదు. సాంస్కృతికపరంగా ఘనమైన చరిత్ర, సంస్కృతి, ఘన విజయాలు లేనివాళ్లం కాదు. ఇన్ని ఉన్నా కొన్ని శతాబ్దాలుగా మన చరిత్ర బలిపశువైంది. మన చరిత్రను మనమే కాదనుకునే దశకు చేరుకున్నాం. శతాబ్దాల బానిసతనపు  చీకట్లనుంచి స్వేచ్ఛను సంపాదించుకున్న తర్వాత కూడా బానిసతనపు  దుర్లక్షణాలు పోలేదు. ఫలితం మనం ఇంకా విదేశీ పాలనలోనే.. బానిసతనపు  భావనల్లోనే  కొనసాగుతుండటం.

 

References:

  1. Collected Works of Mahatma Gandhi
  2. Wardha System of Basic Education Document
  3. Eternal Values for a Changing Society
  4. The Deciphered Indus Script
  5. Memorial Lectures of Moulana Abul Kalam Azad

Images Courtesy:

Swadhyaya Resource Centre and Internet

Exit mobile version