[2026 మార్చ్ 27న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘రామనామ మహిమ’ అనే సినిమా వ్యాసాన్ని అందిస్తున్నాము.]
మన తెలుగు చలన చిత్రాల్లో శ్రీరాముడి మీద కోకొల్లలుగా పాటలు వచ్చాయి. అన్నీ ఆణిముత్యాలే! అన్నీ మధుర గీతాలే! రామనామం కవుల కలాల్లో కదం తొక్కింది. అవి గాయనీ గాయకుల గళాల్లో ఒదిగి పసిడికి పరిమళం అబ్బినట్లుగా మరింత శోభాయమానమై ఇంటింటా మారుమ్రోగాయి. అలాంటి గీతాల్లో ఒకటి బాపు దర్శకత్వం వహించిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ (1975) చిత్రంలో గబ్బిట వెంకటరావు రచించినది. కే.వి.మహదేవన్ సంగీత సారథ్యంలో రఘురామయ్య గానం చేయగా, హనుమంతుడుగా అర్జా జనార్ధన రావు నటించారు. పాటను వివరించే ముందుగా ఈ పాట నేపథ్యం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం.
శ్రీరాముడు యయాతిని సంహరిస్తానని ప్రతినబూనాడు. ఆ సంగతి చెప్పి యయాతిని అయోధ్యకు తీసుకువెళ్ళటానికి వచ్చాడు భరతుడు. ఇద్దరూ రథంలో ప్రయాణిస్తూ ఉండగా హటాత్తుగా పెద్ద గాలి, వాన వచ్చి ఇద్దరూ చెరొకదారి అయ్యారు. మెలకువ వచ్చి చూసేసరికి అంజనాదేవి ఆశ్రమంలో ఉన్నాడు యయాతి. ఆమె అతడిని సేద తీర్చి కాపాడింది.
“తల్లీ! నీవెవరో దేవతలా కాపాడావు. ఈ దీనుడి ప్రణామం స్వీకరించు” అన్నాడు. “దీర్ఘాయుష్యమస్తు!” అని దీవించింది. “అమ్మా! నీ ఆశీర్వాదం అమోఘమైనా నా పట్ల మాత్రం నిరర్ధకం.” అన్నాడు నిస్పృహగా.
“నాయనా! ప్రమాదం తప్పినా భయం తీరలేదా! ఈ ఆశ్రమంలో నీకే ఆపదా రాదు”
“నా వృత్తాంతం తెలిస్తే నీవిట్లనవు. సుర యక్ష కిన్నెరాదులైనా నన్ను రక్షించలేరు. అబలవు. నీవెట్లు కాపాడగలవు?”
“ఆందోళన చెందకు నాయనా! నేను అబలనైనా నా తనయుడు మహా బలసంపన్నుడు. నా ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాడు” అని చెప్పి, “హనుమా!” అని తలచుకుంటూ కళ్ళు మూసుకుంది అంజనాదేవి. ఆ సమయంలో హనుమంతుడు కిష్కింధలో వానరులతో కలసి రామనామ జపం చేస్తున్నాడు ఇలా..
“జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం”
“జన్మను సాఫల్యం చేసేది, జననము మరణము మొదలైన భేదాల వలన కలుగు బాధలను పోగొట్టేది, సకల వేదాలలోనూ ప్రధానము అయినది, సర్వ శాస్త్రాలలోనూ ముఖ్యము అయినది, రాముని నిజమైన మంత్రము అయినట్టి రామ రామ అనే మంత్రమునకు జయము” అని మొదలు పెడుతున్నాడు ఆంజనేయుడు. కైలాసంలో పరమేశ్వరుడు సైతం పార్వతీదేవికి రామనామ మహిమను తెలియజేస్తాడు. అడవిలో జంతువులను వేటాడి జీవించే కిరాతుడు అమాయకంగా తిరగేసి పలికినా ఆదికవిగా మార్చిన మంత్రం రామనామం. వానరులు సేతువు కట్టేటప్పుడు రాళ్ళ మీద శ్రీరామ అని రాసి నీటిలో విడిచి పెడితే రాళ్ళు కూడా తేలుతూ నిలిచేటట్లు చేసిన మంత్రం రామనామం. అలాంటి రాముడిని ఇలా ప్రార్థిస్తున్నాడు హనుమ.
“రామ నీలమేఘ శ్యామా కోదండరామా!
రఘుకులాబ్ది సోమా, పరంధామా! సార్వభౌమా!”
నీలి మేఘము వంటి శరీర ఛాయ కలిగినవాడు, కోదండమును చేతబూనిన వాడు, రఘువంశము అనే సముద్రంలో ఉదయించిన నిండు చంద్రుడు, అద్వితీయమైన తేజస్సు కలిగిన పరమాత్ముడు, సమస్తమైన భూమిని పరిపాలించేవాడు అయిన రామునికి నమస్కరించుచున్నాను.
“తల్లితండ్రి గురువూ నీవే, తోడునీడ నీవే!
ధరణి యెల్ల పాలన చేసే పరంజ్యోతివే
జాగు ఇక చాలును రామయ్యా!
దాసులను బ్రోవగ రావయ్యా!
తెలియ తరమా, పలుక వశమా,
నీదు మహిమా రాఘవా!”
నాకే కాదు భక్తులు అందరికీ తల్లీ నీవే, తండ్రీ నీవే, గురువు నీవే, తోడూ నీడా కూడా నీవే! ఈ భూమండలాన్ని మొత్తం పరిపాలించే పరమాత్మవి, నీ భక్తులను కరుణించటానికి రావయ్యా, చేసిన ఆలస్యం ఇక చాలు అని అంటున్నాడు ఆంజనేయుడు.
శ్రీరాముడి ప్రభావాన్ని గురించి చెప్పాలంటే – శరభంగ మహర్షి అమోఘ తపస్సంపన్నుడు. అయన తపశ్శక్తి వలన బ్రహ్మలోకం, స్వర్గలోకం మొదలైనవి అన్నీ లభించాయి. ఆయన్ని తోడ్కొని వెళ్ళటానికి బంగారు రథం మీద దేవేంద్రుడు స్వయంగా వస్తాడు. “బ్రహ్మదేవుడి ఆజ్ఞ మీద నిన్ను సత్యలోకం తీసుకువెళ్ళటానికి వచ్చాను” అని చెబుతాడు దేవేంద్రుడు మహర్షితో. “సమీప భవిష్యత్తులో రాముడు ఇక్కడికి రానున్నాడు. ఆయన్ని దర్శించిన తర్వాతే నేను వస్తాను” అని ఇంద్రుడి ఆహ్వానాన్ని కూడా తిరస్కరిస్తాడు శరభంగ మహర్షి. రాముడు సీతా లక్ష్మణులతో కలసి వచ్చిన తర్వాత వారిని కన్నులారా దర్శించి, అతిథి సత్కారాలు చేసి, అప్పుడు రాముడి అనుమతి తీసుకుని భౌతిక దేహాన్ని త్యజిస్తాడు శరభంగ మహర్షి. శ్రీరాముడి తేజస్సు, ఓజస్సు అలాంటివి.
అంతేకాదు, జటాయువు విషయంలో కూడా.. “నా చేత దహన సంస్కారాలు పొందిన నువ్వు మోక్షప్రాప్తికి అర్హుడవు. జితేంద్రియులకు, సత్పురుషులకు లభించే పునరావృత్తి రహితమైన ఉత్తమలోకాలు నీకు ప్రాప్తిస్తాయి” అని చెబుతాడు రాముడు. కన్నతండ్రికి కూడా జరిపించలేని దహన సంస్కారాలు రాముడి చేతుల మీదుగా జరిపించబడి మోక్షాన్ని పొందిన ధన్యుడు జటాయువు.
అందుకే సామాన్యులకు నీ మహిమను తెలుసుకోవటం సాధ్యమా! చెప్పటం సాధ్యమా రామా! అని అంటున్నాడు హనుమంతుడు. తర్వాత చరణంలో ఇంకా ఇలా చెబుతున్నాడు.
“రాతి నైన నాతిని చేసే నీ దివ్య పాదము
కోతి నైన జ్ఞానిని చేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్యా!
నిన్ను నే నమ్మితి రామయ్యా!
నీదు చరణం పాపహరణం!
మాకు శరణం రాఘవా!
రఘురాం.. రాం.. రాం.. రాం.. రఘురాం.
జయరాం.. రాం.. రాం.. రాం.. జయరాం”
శిలగా ధూళిలో పడిఉన్న అహల్య శ్రీరాముడి పాద స్పర్శ వలన పూర్వ రూపాన్ని పొందింది. పర పురుషుడి స్పర్శ వలన అపవిత్రురాలైన ఆమె పరమాత్మ పాదస్పర్శ వలన పవిత్రురాలై శాప విమోచనం పొందింది. అదీ శ్రీరాముడి పాద మహిమ! ఆ పాదాలు ధరించిన పాదుకలు కూడా పట్టాభిషేకం జరుపుకుని ధరను పాలించాయి.
కోతులను కూడా జ్ఞానులను చేసే నామం రామనామం. హనుమంతుడు, వాలి, సుగ్రీవుడు మొదలైన వారందరూ వానరులు. రాముడితో పరిచయం అయిన తర్వాతే హనుమంతుడు రామబంటుగా కొనియాడ బడ్డాడు. అలాగే సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు వంటి వానరులు కూడా రాముడిని ఆశ్రయించటం వలనే ప్రసిద్ధులైనారు.. వాలి కూడా.. వాలి సుగ్రీవుడితో యుద్దానికి వెళ్ళబోతుంటే తార వారిస్తుంది. “వాసుదేవ తరుచ్చాయా నాతి శీతా, న ఘర్మదా, నరకాంగారశమనీ, సా కిమర్థం న సేవ్యతే!” అని చెబుతుంది. అంటే శ్రీరాముడు సాధుజనులకు ఒక మహా వృక్షము వంటి వాడు. మహావృక్షం తనను చేరిన వారికి మొదట తాపాన్ని పోగొడుతుంది. తర్వాత ఫలాలు అందించి సంతోషం చేకూరుస్తుంది. అదే విధంగా శ్రీరాముడు తనను ఆశ్రయించిన వారికి మొదట అభయమిచ్చి, ప్రాణ భయాన్ని పోగొడతాడు. తర్వాత అన్ని విధాలా తోడు నీడగా ఉంటాడు. అటువంటి మహాపురుషుడితో విరోధం నీకు క్షేమం కాదు.” అని చెబుతుంది.
అయినా వాలి వినిపించుకోడు. రామబాణానికి ఆహుతి అయిపోతాడు. అప్పుడు తెలుసుకుంటాడు రాముడి ప్రభావాన్ని! అపచారాన్ని మన్నించమని వేడుకుంటాడు.. సాధారణంగా పశు పక్ష్యాదులకు మానవులకు లాగా దహన సంస్కార క్రియలకు అర్హత లేదు. కానీ వాలి రాముడి చేతిలో మరణించటం వలననే ఉత్తర క్రియలకు అర్హత కలిగింది. రాముడిని చూసిన క్షణంలో తన భర్తను సంహరించాడు అనే విషయం మర్చిపోయి క్షణకాలం ఆయన దివ్య తేజస్సు చూసి విస్మయం చెందుతుంది తార. అప్పటి వరకూ రాముడి గురించి విని ఉన్నది. ప్రథమ వీక్షణం మాత్రం ఇప్పుడే! “నా నాథుడిని చంపిన బాణంతోనే నన్ను కూడా సంహరించు” అని చేతులు జోడించి వేడుకుంటుంది తార.
అందుకే “నీతో సమానమైన దైవం లేదు. నిన్నే నమ్ముకుని ఉన్నాను. ఎలాంటి పాపాలనైనా పోగొట్టే నీ చరణాలే మాకు శరణ్యం రామా!” అని అంటున్నాడు హనుమ ఈ గీతంలో.
ఇలా ప్రార్ధన చేస్తూ ఉండగా హనుమంతుడికి తల్లి తనను తలచుకోవటం వినిపించి ఆమె దగ్గర ప్రత్యక్షమవుతాడు. “అమ్మా! నన్ను తలచుకున్న కారణం ఏమిటి?” అని అడిగితే, “ఆపదలో ఉన్న ఒక అభాగ్యుడికి ప్రాణదానం చేస్తానని మాట ఇచ్చాను నాయనా!” అన్నది అంజనాదేవి.
యయాతిని చూసి, “సూర్యచంద్రుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా నీకు అభయమిస్తున్నాను” అన్నాడు హనుమ. ఇంతలో నారదుడు వచ్చి “ముందు వెనుకలు చూడకుండా అభయమివ్వటమేనా! అది నీ శక్తికి మించినది అయితే నీ తల్లికి ఎంత తలవంపు?” అన్నాడు నర్మగర్భంగా.
“శ్రీరామచంద్రుని కరుణా కటాక్షమే నా శక్తి” అంటూ ఇలా చెప్పాడు హనుమ.
“భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ!”
“దయకు నిలయమైన దశరధ కుమారా, రామా! యుద్ధంలో శత్రువులకు భయంకర రూపమును దాల్చిన వాడవు, బాధలు పడేవారి సముహములకు బాంధవుడవు. బాణాలు, అమ్ముల పొదులు కలిగిన విలువిద్య అనే ప్రచండమైన కళయందు ఆరితేరిన వాడవు అయిన నీకు సాటి అయిన రెండవ దైవం లేడు అని తెలియజేస్తూ నీ కీర్తి స్తంభాన్ని నాటి, మదించిన ఏనుగు నెక్కి భేరీలు మొదలైన వాయిద్యాల నుంచీ ‘ఢాం ఢాం’ అనే ధ్వనులచేత బ్రహ్మాండము మారుమ్రోగేటట్లు చాటిస్తాను. నన్ను కరుణించు” అని ఈ పద్యం అర్ధం.
ఈ సన్నివేశంలో హనుమతుడుగా అర్జా జనార్ధన రావు, అంజనాదేవిగా హేమలత, యయాతిగా ధూళిపాళ, నారదుడుగా కాంతారావు నటించారు. పాట మొదట్లో చెప్పిన శ్లోకం ఆదిశంకరాచార్యుల వారు రచించిన ‘శ్రీరామ కర్ణామృతం’ లోనిది, చివరలో పద్యం కంచెర్ల గోపన్న రచించిన ‘దాశరథి శతకం’ లోనిది. ఇవి రెంటినీ సినిమాలో ఉపయోగించుకున్నారు. పాట సినీ రచయిత గబ్బిట వెంకటరావు రచించినది. వీటిని అన్నిటినీ కళ్యాణం రఘురామయ్య గానం చేశారు. ఈయన ఈలపాటలో నిష్ణాతుడు కాబట్టి ఈలపాట రఘురామయ్య అని ప్రతీతి. ఈయన 1975లో మరణించారు. వృద్ధాప్యంలో కూడా ఈ సినిమాలో హనుమంతుడి పాటలు, పద్యాలు అన్నీ అత్యంత శ్రావ్యంగా ఆలపించటం విశేషం.
(‘రామ నీలమేఘ శ్యామా కోదండరామా’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=xCWlQLsNlrU )
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.
