Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రామాయ స్వస్తి, రావణాయ స్వస్తి

[బాలబాలికల కోసం ‘రామాయ స్వస్తి, రావణాయ స్వస్తి’ అనే జాతీయం కథ అందిస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాధం పట్రాయుడు.]

రసన్నపేటలో ఆనందరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ అధికార పార్టీ నాయకుల అండతో తన పనులు చేయించుకుంటూ పబ్బం గడిపేవాడు.

ఒకసారి ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. పోటీ ప్రధానంగా ఇద్దరి మధ్య నెలకొంది. ఒకరు మృదుస్వభావి అయిన పాత సర్పంచ్ శివయ్య, రెండో వ్యక్తి ధనబలం ఉన్న కరుకు మనిషి రంగయ్య.

మొదట ఆనందరావు శివయ్య దగ్గరికి వెళ్ళాడు. ఎంతో వినయంగా, “అయ్యా! మీలాంటి ధర్మపరులే ఈ ఊరికి శ్రీరామరక్ష. రాముడి వంటి మీరు ఉండగా ప్రజలు ఇంకెవరికి ఓటేస్తారు?” అని పొగిడి, అక్కడ కాఫీ తాగి వచ్చాడు.

గంట తర్వాత రంగయ్య ఇంటికి వెళ్లి, “రంగయ్య గారు! ఈ కాలంలో మంచితనం పనికిరాదు. మీలాంటి గంభీరమైన వ్యక్తే ఈ ఊరిని ఏలాలి. రావణబ్రహ్మ లాంటి పరాక్రమం మీ సొంతం” అని అక్కడ విందు భోజనం ఆరగించి వచ్చాడు.

ఎన్నికల్లో రంగయ్య గెలిచాడు. ఆనందరావు గజమాలతో పరిగెత్తుకుంటూ వెళ్లి, “నాకు ముందే తెలుసు సార్! మీరే గెలుస్తారని ఊరంతా చాటాను” అని రంగయ్య ముందు మోకరిల్లాడు.

అదే సమయంలో ఓడిపోయిన శివయ్య దగ్గరకు వెళ్లి, “అయ్యో! ప్రజలకు మంచి చేసే వాళ్లు నచ్చడం లేదు. మీలాంటి ఉత్తముడికి కాలం కలిసి రాలేదు” అని కపట సానుభూతి కురిపించాడు.

ఇదంతా గమనిస్తున్న ఒక పెద్దాయన, “నువ్వు ‘రామాయ స్వస్తి.. రావణాయ స్వస్తి’ అనే రకం” అన్నాడు.

ఆనందరావు ఆశ్చర్యంగా చూస్తుంటే ఆయనే వివరించాడు: “ఇది ఒక జాతీయం. స్వస్తి అంటే శుభం కలగాలని కోరుకోవడం. రాముడికీ, రావణుడికీ ఇద్దరికీ శుభం కలగాలని కోరుకుంటూ తన పబ్బం గడుపుకునే నీలాంటి వారిని ఇలా అంటారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం నీకు అలవాటే కావచ్చు, కానీ ఇలాంటి వారు ఎవరికీ నిజమైన మిత్రులు కాలేరు.”

ఈ జాతీయాన్ని అవకాశవాదులను, ఊసరవెల్లి మనస్తత్వం గల వారిని ఉద్దేశించి నెగెటివ్ అర్థంలో వాడుతారు. అయితే, ఎవరితోనూ గొడవ పడకుండా, అందరితో సఖ్యంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే వారిని ఉద్దేశించి కొన్నిసార్లు పాజిటివ్ అర్థంలోనూ వాడుతుంటారు.

Exit mobile version