Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రామాయణం కాదు.. రావణాయణం

[ఇటీవల విడుదలైన ‘రామాయణం’ (మొదటి భాగం) సినిమాపై విశ్లేషణా వ్యాసం అందిస్తున్నారు కోవెల సంతోష్ కుమార్.]

~

నిజమైన సోషలిస్టు రావణుడు.

రామాయణం కాదు.. రావణాయణం.

ఒక సక్సెస్‌ఫుల్ ప్రాపగాండా.

~

దేశంలో ఇప్పుడు జెన్ జీ ట్రెండ్ నడుస్తున్నది. వాళ్లను ఇంపాక్ట్ చేసే మీడియాలో అత్యంత ప్రధానమైంది సినిమా.. కొన్నేండ్ల క్రితం కల్కి అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. దేశంలోని చాలా భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. సినిమాలో పాస్ ఆన్ రిఫరెన్స్‌గా ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సినిమా మొత్తం ఎప్పుడో వందేండ్ల తరువాత వచ్చే కాలానికి సంబంధించిన ఇతివృత్తం. ఇందులోకి 5వేల సంవత్సరాల క్రితం మహాభారత కాలంలోని రెండుమూడు క్యారెక్టర్లను తీసుకొచ్చి ఈ వందేండ్ల తరువాత జరుగబోయే ఇతివృత్తానికి లింక్ చేస్తారు. ఇది సినిమాటిక్ ప్రీడమ్ అని ఎవరైనా అనవచ్చు.. ఇబ్బంది లేదు. కానీ.. భారతదేశంలో ప్రధాన ఇతిహాసంగా, పంచమవేదంగా భావించే మహాభారతంలో వ్యక్తుల వ్యక్తిత్వాలను మార్చే స్వేచ్ఛను ఎవరిచ్చారో తెలియదు. కురుక్షేత్రంలో కర్ణుడి రథంపైకి అర్జునుడు బాణం వేస్తాడు. అదొక ఆరడుగులు వెనక్కి వెళ్తుంది. తిరిగి కర్ణుడు అర్జునుడి రథం మీదకు బాణం వేస్తాడు. అదొక రెండడుగులు వెనక్కి వెళ్తుంది. అర్జునుడి పాత్ర వెకిలిగా కర్ణుడి రథం కంటే.. నా రథం రెండడుగులే వెనక్కిపోయింది అంటాడు. అరే నేనుండటం వల్ల మాత్రమే నీది రెండడుగులు పోయిందే తప్ప నువ్వు కర్ణుడి ముందు ఏం ఆగుతావులే అని కృష్ణుడి పాత్ర అర్జునుడిని ఎద్దేవా చేస్తుంది. ఈ ఒక్క సీన్ జెన్ జీలో ట్రెండింగ్ అయింది. ఫుల్ డిస్కషన్ ఇష్యూ అయింది. మహాభారతంలో మహా మానవ హననానికి ఏకైక కారకుడైన కర్ణుడిని హీరో చేయడం కోసం దర్శక రచయితలు రాసుకున్న కథనం ఇది. ఈ సినిమా చూస్తే.. ఈ తరం ఏమనుకుంటుంది? అర్జునుడు ఎందుకూ పనికిరానివాడు.. కర్ణుడు మహా గొప్పవాడు, మానవతావాది అంటూ ఫిక్స్ అయిపోతుంది. 20 ఏండ్ల తరువాత ఈ తరమే.. తమ తరువాతి తరానికి ఇవే పాఠాలు చెప్తుంది. కొన్నాళ్లకు అసలు విషయం మరుగునపడిపోయి.. ఈ సినిమా కథలే నిజమైన చరిత్రలుగా మారిపోతాయి. ఇందుకు ఉదాహరణ 1970వ దశకంలో రావణ దుర్యోధనులను హీరోలు చేసి ఎన్టీయార్ సినిమాలు చేయడం. 1977లో ‘దానవీరశూరకర్ణ’ అనే పేరుతో కొండవీటి వెంకటకవి, ఎన్టీరామారావు కాంబినేషన్‌లో సినిమా వచ్చింది. కర్ణ, దుర్యోధనాదులు గొప్పవారుగా, పాండవులు అధర్మపరులుగా చిత్రించిన సినిమా ఇది. దాదాపు యాభై ఏండ్ల క్రితం 15- 20 ఏండ్ల వయసున్న పిల్లలను బ్రెయిన్ వాష్ చేసిన సినిమా ఇది. ఇప్పటికీ ఆ డైలాగులు కొడుతూ సంబరపడే పరిస్థితులు ఉండటం దురదృష్టం. కర్ణ దుర్యోధనులను సోషలిస్టులుగా, కమ్యూనిస్టులుగా, సామ్యవాదులుగా చిత్రీకరించారు. ఇదే ఎన్టీయారు 60వ దశకంలో రామాయణ భారత, భాగవతాలలోని ఇతివృత్తాలను యథాతథంగా స్వీకరించి ఒక సిరీస్‌గా అనేక సినిమాలను చేసిన నటుడు. 70 దశకానికి వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రతినాయకులను నాయకులుగా చూపించే మార్క్సిస్టు చరిత్రకారులు, ద్రావిడ ఉద్యమకారులు సినిమాను అత్యంత ప్రభావవంతమైన మాధ్యమంగా ఎంచుకున్నారు. ఇప్పటికీ ఆ ట్రెండ్ నడుస్తూనే ఉంది. ఆ మధ్యన ‘ఆదిపురుష్’ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలోని ఇతివృత్తం ఏమిటో ఆ సినిమా తీసిన వాళ్లకైనా అవగాహన ఉన్నదో లేదో ఎవరికీ తెలియదు. పేరుకు రామకథ కానీ.. రామకథ కాదన్నమాట.. పేరుకు సీతారాములు కానీ, సీతారాములు కాదన్నమాట.. ఇదీ సినిమా.. ఏదైనా అంటే.. సినిమాటిక్ ఫ్రీడమ్ అంటారు. సినిమాటిక్ ఫ్రీడమ్ అంటే.. వేల ఏండ్లుగా భారతీయుల మనస్సుల్లో ఉండిపోయిన వ్యక్తుల వ్యక్తిత్వాలను ఏమార్చడమా? నాకైతే తెలియదు.

ఇప్పుడొక కొత్త సినిమా వచ్చింది. అదీ రామాయణమే. మరల నిదేల రామాయణంబన్నచో అని విశ్వనాథ వారు ఊరికే అనలేదు. ఎవరి పిచ్చి వారికి ఆనందం కావచ్చు కానీ, చారిత్రక పురుషుల విషయంలో మనకు తోచినట్టు.. మనకు ఇష్టం వచ్చినట్టు వాళ్ల వ్యక్తిత్వాలను ఏమార్చేసి.. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో, వీఎఫ్ ఎక్స్ టెక్నాలజీతో ఏదేదో తీసేసి జనాల మీదకు వదిలేస్తే.. మరో ‘దానవీరశూరకర్ణ’ మాదిరి ప్రాపగాండా సినిమా కాకుండా పోతుందనుకుంటే పోరపాటు. తాజాగా విడుదలైన ‘రామాయణం’ (2026) సినిమా అచ్చంగా అలాంటి ప్రాపగాండా సినిమాయే. ఒక పరమచెత్త సినిమా అయిన ‘ఆదిపురుష్’తో పోలిస్తే.. తక్కువ చెత్త సినిమాగా ఈ రామాయణాన్ని చూసి సంతోషించాలేమో. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్సు, కాస్ట్యూమ్స్ గురించి నేను చర్చించటం లేదు. ఇతివృత్తం మాత్రమే ప్రధానంగా చర్చనీయాంశం. చర్చించుకోవాల్సింది కూడా కచ్చితంగా ఇతివృత్తమే. లేకపోతే.. భవిష్యత్తులో ఇదే నిజమైన చరిత్రగా మారిపోతుంది. పాతికేండ్ల తరువాత ఇవాళ ఈ సినిమాతో బ్రెయిన్ వాష్ చేయబడిన యువత దీన్నే నిజంగా ప్రచారం చేస్తుంది.

సినిమా ప్రారంభం దేవదానవుల యుద్ధంతో మొదలవుతుంది. ఆ యుద్ధానికి నాయకత్వం వహించింది రావణుడి తల్లి కైకసి. కైకసి దేవతలతో యుద్ధం చేయడం అనే కథ ఈ దర్శకుడి అనూహ్యమైన సృజనాత్మక  ఊహాకల్పనలకు నిదర్శనం. కైకసి తో పాటు.. ఆమె తండ్రి మాలి (ఒరిజినల్‌గా ఆమె తండ్రి సుమాలి) కూడా యుద్ధం చేస్తుంటాడు. వీళ్లపై యుద్ధానికి విష్ణువు అండతో దేవేంద్రుడు వచ్చి వీళ్లను ఓడించేశాడు. లంకను దేవతలు స్వాధీనం చేసుకొని.. కుబేరుడికి పట్టం కట్టారు. ఇది సినిమాకు ఇంట్రో సీన్.. వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో నాలుగు నుంచి ఏడో సర్గ వరకూ  ఈ రాక్షసుల వృత్తాంతం మనకు కనిపిస్తుంది. విశ్వకర్మ అప్పటికే నిర్మించిన లంకలో ఉంటూ.. ప్రజలందరినీ బాధిస్తున్న రాక్షసులతో  విష్ణువే ప్రత్యక్షంగా యుద్ధం చేస్తాడు. అంతే కానీ.. ఇంద్రుడు యుద్ధం చేయడు. అక్కడ యుద్ధం చేసి కైకసి తండ్రితో సహా రాక్షసులను భూమి మీద ప్రజలను బాధించకుండా ఉండేందుకు రసాతలానికి తరిమికొడతాడు. సినిమాలో మాత్రం కైకసి తండ్రి చనిపోతాడు. తరువాత లంకను ఖాళీగా వదిలేశారు. ఆ తరువాత చాలా కాలానికి కుబేరుడిని అతని తండ్రి విశ్రవసుడు లంకకు పంపిస్తాడు. ఈ కుబేరుడు రావణుడికి సవతి అన్న. ఈ కుబేరుడిని చూసి సుమాలి తన కూతురు కైకసిని విశ్రవసుడికి ఎరవేసి మోహింపజేసి పెండ్లి చేస్తాడు. ఆమెకు అలా కలిగిన వారు రావణ కుంభకర్ణాదులు. సినిమాలో మాత్రం ఆమె యుద్ధ నైపుణ్యం చూపిస్తుంది. ఇంద్రుడు దుర్మార్గంగా వారి నుంచి లంకను లాక్కున్నట్టుగా చూపుతారు. ఉత్తరకాండలో రావణుడి పుట్టుకే చాలా భయంకరంగా ఉంటుంది. పుట్టిన క్షణం నుంచే రావణ కుంభకర్ణులు అత్యంత భయంకరమైన వ్యక్తులుగా పెరుగుతారు. కుబేరుడి భోగభాగ్యాలు చూసి కైకసి రావణుడిని నువ్వు నీ అన్న సంపదంతా కొల్లగొట్టాలని తాను, తన కుమారులు ఆ భోగభాగ్యాలలో తులతూగాలని కోరుకుంటుంది. అందుకే రావణుడిని లంకను స్వాధీనం చేసుకోవాలని చెప్తుంది. రావణుడు కుబేరుడి దగ్గరకు దూతను పంపించి లంకను వదిలిపెట్టాలని ఆదేశిస్తాడు. కుబేరుడి తండ్రి విశ్రవసుడు రావణుడి దుర్మార్గాన్ని చెప్పి లంకను వదిలేయమని హితవు చెప్తాడు. దీంతో సింపుల్ గా కుబేరుడు లంకను విడిచి వెళ్లిపోతాడు. కానీ, ఈ రామాయణం సినిమాలో మాత్రం అంతా రివర్స్‌గా ఉంటుంది రావణుడు చాలా చాలా సాత్వికుడిగా సంగీత శాస్త్రాలకు మాత్రమే పరిమితమైన వ్యక్తిగా పెరుగుతుంటే.. తల్లి కైకసి పనిగట్టుకొని వచ్చి.. మన రాక్షసులకు తీరని అన్యాయం జరిగింది.. నువ్వు రాక్షసజాతికి న్యాయం చేయాలని రెచ్చగొడుతుంది. రసాతలంలో రాక్షసులు క్రిమికీటకాల్లా దుర్భర జీవితం సాగిస్తుంటారు. ఆకలిదప్పులతో అల్లాడిపోతుంటారు. అకాలమరణాల పాలవుతుంటారు.. దీనికంతటికీ విష్ణువే కారణం.. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి.. అంటారు.. దీంతో అప్పటిదాకా వీణ వాయిస్తున్న రావణుడు వెంటనే వీణను వదిలేస్తాడు.. నీళ్లలో దూకుతాడు.. ఎడారి ఇసుకతిన్నెల్లో చెమటోడుస్తూ నడుస్తాడు.. ఆకలి, చలి, పాములు, జంతువులను అధిగమిస్తూ.. దుర్గమారణ్యంలోకి వెళ్లి కొండ అంచున ఒంటికాలిపై తపస్సు చేసి బ్రహ్మ వరప్రసాదిగా మారి.. లంకకు పోయి.. కుబేరుడిని చావగొట్టి లంకను లాక్కుంటాడు. దేవతల ఆధిపత్యాన్ని తట్టుకోలేక మాత్రమే.. కేజీఎఫ్ సినిమాలో ప్రతినాయక నాయకుడి మాదిరిగా తిరుగుబాటు చేసి కుబేరుడిని ఓడించి, లంకను, పుష్పకాన్ని చేజిక్కించుకొని సోషలిజాన్ని స్థాపిస్తాడు. తల్లి కైకసి వచ్చి.. దశగ్రీవుడిగా ఉన్నఅతడిని రావణుడు అని పిలిచేస్తుంది. రావణుడు సోషలిజంపై ఉపన్యాసం చెప్పేస్తాడు. సమసమాజ స్థాపన గురించి చెప్తాడు. రాజు, ప్రజలు ఒకటేనని ఉద్ఘోషిస్తాడు. పెండ్లిళ్లు జరిగిపోయిన తరువాత ముల్లోకాలను జయించి రాజదర్బార్ లో సమావేశమవుతాడు. అక్కడ శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడు ఒక పరిచారికను అవమానిస్తాడు. దీంతో రావణుడికి తెగ కోపం వచ్చి.. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో.. శయ్యాగృహానికి, రాజసభకు తేడా లేదా అంటూ ఊగిపోతాడు. ఈ కారణంగా అక్కడ విద్యుజ్జిహ్వుడిని పురికొల్పి అతడిని హతమారుస్తాడు. రావణుడు స్త్రీలోలుడు కాదని నిరూపించడం కోసమే ఈ ఎపిసోడ్ ను సృష్టించారు. రావణుడు తన జైత్రయాత్రలో కాలకేయులను వధించినప్పుడు వారిలో ఒకరైన ఈ విద్యుజ్జిహ్వుడు చనిపోతాడు. ఆపాత్రను ఇక్కడికి తీసుకొచ్చి రావణుడు చాలా మంచివాడని ప్రాపగాండా చేయడం కోసం.. స్త్రీలు అంటే మోహమే లేనట్టుగా చూపడానికి సీన్ క్రియేట్ చేశారు. భర్త చనిపోయిన తరువాత ఎవరినైనా చూసుకొని వస్తే రెండోపెళ్లి చేస్తానంటూ శూర్పణఖ జనస్థానానికి పంపించేస్తాడు.

ఇక శూర్పణఖ కథ. ఈమె చాలా అందమైంది. సీత సోసోగా ఉంటుంది. అన్న పంపాడని జనస్థానానికి వచ్చి అక్కడ సోదర సమానులైన ఖరదూషణులతో ఉంటుంది. ఈ సినిమా ప్రకారం ఈ శూర్పణఖ చాలా మంచిది. పంచవటిలో ఉన్న రాముడి దగ్గరకు వచ్చి ఆయనతో చాలా చాలా చక్కగా సంభాషిస్తుంది.. వారి మధ్య సంవాదం వినండి..

శూ: మా రాజ్యంలోకి మీరెందుకు వచ్చారు.. వచ్చీ రాగానే మా అసురులను ఎందుకు చంపారు

రా: మేము వనవాసంలో భాగంగా ఇక్కడ ఆశ్రయం కోసం వచ్చాం. మీ అసురులు ముందు దాడి చేస్తేనే మేం చంపాం.

శూ: మీరు చూస్తే సాధువుల్లాగా లేరే

రా: అవును.. మేం దశరథరాజ కుమారులం..

శూ: మరి ఇక్కడెందుకు ఉండటం.. మీరు మా రాజభవనానికి రండి.. మా అతిథి మర్యాదలు స్వీకరించండి

రా: ధన్యవాదాలు రాజకుమారి.. మేం ఇక్కడే ఉంటాం

ఇలా శూర్పణఖ ఎంతో మర్యాదగా రాముడితో మాట్లాడి అతిథి మర్యాదల ఆఫర్ చేస్తుంది.

ఆ తరువాత వెంటనే సీత పాత్ర చేత దర్శకుడు అనిపించిన మాటలను చదవండి

సీత: ఆమె మిమ్మల్ని మోహిస్తున్నది

రా: నీకు ఎలా తెలుసు..

సీ: ఒక స్త్రీ మనసులో ఏముందో మరో స్త్రీకే తెలుస్తుంది.. (నవ్వు)

మర్నాడు మళ్లీ శూర్పణఖ పంచవటికి వచ్చి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది. నేను చేసుకోను పొమ్మన్నాడు రాముడు.. ఆ తరువాత సీత ఆ సన్నివేశాన్ని చూసి.. రాముడితో మాట్లాడుతుంది.

సీత: ఆ రాజకుమారితో ఏం మాట్లాడుతున్నారు..

రా: నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగింది. రాజును చేస్తానంది

సీత: అయిపోవచ్చుగా ఆమెకు రాజు.. !!

రా: నేను ఆమెకు రాజు అయితే.. నీకు సేవకుడు ఎవరవుతారు?

సీత: ఆమె అద్భుత సౌందర్యవతి.. ఒకసారి ఆలోచించండి

రా: సూర్యకిరణమే తోడుంటే మిణుగురు పురుగులతో పనేమిటి?

..ఆ మర్నాడు సీత వేషంలో శూర్పణఖ వస్తుంది. రాముడిని వశం చేసుకొనే ప్రయత్నం చేస్తుండగా సీతాలక్ష్మణులు చూసి అవాక్కవుతారు. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోస్తాడు. దీంతో సీతకు కోపం వస్తుంది. ముక్కు కోసేంత తప్పుడు పని శూర్పణఖ ఏం చేసిందంటూ లక్ష్మణుడిని నిలదీస్తుంది. ఒక స్త్రీని ఇలా ముక్కు కోసినందుకు తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తుంది.

ఈ సుదీర్ఘ సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు.. శూర్పణఖ క్యారెక్టర్‌ను చాలా అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడమే ఒక వింత. సీత పాత్ర చేత ఈ రకమైన డైలాగులు కొట్టించడం ఏమిటి? దారుణం కాకపోతే.. శూర్పణఖ చాలా మంచిది.. అందగత్తె.. రెండో పెళ్లి చేసుకోవాలంటూ సీత అలవోకగా చెప్పేస్తుంది. సూపర్ స్క్రిప్టింగ్.. యావత్ భారతజాతి నిత్యం కొలిచే సీతారాముల మధ్యన ఇలాంటి సంభాషణమా? పోనీ వాల్మీకి రామాయణంలో ఈ రకమైన ఆలోచనను సీత ఎక్కడైనా ప్రదర్శించిందా? మరి ఏ ప్రాతిపదికన సీత వ్యక్తిత్వాన్ని ఈ రకంగా హననం చేయ ప్రయత్నించారు..

ఈ సినిమాలో సీతపాత్ర చాలా చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఏ సన్నివేశంలో కూడా ఏ కోశాన కూడా ఎలాంటి హావభావాల వ్యక్తీకరణ లేకుండా నటించడం ఎలాగో ఇందులో సీత పాత్ర చేసిన నటిని చూసి నేర్చుకోవచ్చు. స్వయంవర సమయంలో శివధనుర్భంగం చేస్తున్న సమయంలో మహామహులే సీతారాముల మనోభావాలను అద్భుతంగా వర్ణించారు.

‘అతని దృష్టికి జానకి యాగలేదు.. అతని కృష్టికి శివధనుస్సాగలేదు

సీత పూజడ వెన్నుగా శిరసు వంచె.. చెఱకుగడవోలె నడిమికి విఱిగె ధనువు’

ఇంత అద్భుతమైన సన్నివేశాన్ని ఈకాలంలో ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో ఇంకెంత అద్భుతంగా తీయాలి.. వచ్చాడురా సామీ.. ధనుస్సు లేపాడు.. విరిచాడు.. ఆమె అలా నిర్వికారంగా నిలుచుని చూస్తూ ఉండిపోయింది. ఇదేనా సృజనాత్మకత..? ఏ సీతారాముల కల్యాణం సమస్త లోకానికి ఆదర్శ ప్రాయమైనదో.. అనుసరణీయమైనదో.. అలాంటి కల్యాణ ఘట్టాన్ని ఇంత చప్పగా తీయడమే విడ్డూరం.. ఇక అత్తగారింటికి వచ్చిన తరువాత మహిళలకు సీత యుద్ధ విద్యలు నేర్పుతుంటుంది.

అడవిలో శూర్పణఖ అవమానం తరువాత కూడా ఖరదూషణాది రాక్షసులు రాముడిపై యుద్ధానికి తెగబడ్డప్పుడు రామలక్ష్మణులతో పాటు.. సీతాదేవి కూడా కత్తి పట్టుకొని యుద్ధం చేస్తుంది. సీతారామలక్ష్మణులు ముగ్గురూ కలిసి ఈ అసుర సంహారం చేస్తున్నట్టు చూపిస్తారు. ఒక దశలో సీతాదేవి యుద్ధం చేయకపోతే.. రాముడు ఖరదూషణుల చేతిలోనే ఓడిపోయేవాడేమో అన్నంతగా చూపుతారు. బంగారు లేడి కోసం రాముడు వెళ్లిన తరువాత ‘లక్ష్మణా నన్ను రక్షించు’ అని రాముడి గొంతు వినపడగానే లక్ష్మణుడిని రాముడికోసం వెళ్లాలన్న సీత.. అతను వెళ్లను అనేసరికి.. తానే కత్తి పట్టుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అద్భుత రామాయణంలో శక్తిస్వరూపిణిగా కనపడే సీతాదేవే తమకు ప్రేరణ అంటూ సినిమా రచయితలు చెప్పుకొచ్చారు.. వాల్మీకి రామాయణంలో ఖరదూషణుల మీదకు వెళ్లినప్పుడు ఒక గుహలో సీతాదేవిని ఉంచి.. దానికి లక్ష్మణుడిని కాపలా పెట్టి తాను ఒక్కడే వెళ్లి 14 వేల మంది రాక్షసులను హతమార్చి వస్తాడు రాముడు. వర్తులాకారంలో విల్లును వంచి మరీ ఒకేసారి పదులకొద్దీ బాణాలను వదిలాడని వాల్మీకి రాస్తాడు. పాపం సినిమాలో మాత్రం రాముడు డిపెండెంట్ లాగా మాత్రమే కనిపిస్తాడు. లక్ష్మణుడు కూడా రాముడిపై వ్యంగ్యాస్త్రాలు వేస్తుంటాడు. నీలో కొంచెం కుటిల బుద్ధి కూడా ఉంటే బాగుండు.. మనకు ఈ వనవాసం తప్పేదని రాముడితో అంటాడు.

ఈ సినిమాలో తనను అపహరించడానికి వచ్చినప్పుడు రావణుడిని సీత అనుమానిస్తుంది. ‘నువ్వు సాధువే అయితే.. ఋగ్వేదం పదో మండలంలోని ఫలానా 120 మంత్రం చదివి వినిపించు’ అంటుంది.. ‘ఏయ్ నన్ను అడుగుతావా’ అని గట్టిగా అరిచేస్తాడు రావణుడు.. ఆ వెంటనే ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తాడు.. దీంతో ‘మహానుభావా ఆగు.. ఆగు’ అని ఆమె వెంటపడి ఆయనకు కందమూలాలు ఇవ్వడానికి పరిగెత్తుతుంది. అప్పుడు రావణుడు ‘నీ అహంకారం అణిగిందా’ అని కూడా ప్రశ్నిస్తాడు.. ఇలాంటి అద్భుతమైన సృజనాత్మక ఆలోచనలు ఈ సినిమా రచయితలకు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కాదు. పుష్పక విమానంలో లంకకు వెళ్తున్న సీత ముఖంలో ఎలాంటి హావభావాలు మనకు కనిపించవు.. చాలా ప్రశాంతంగా నిర్వికారంగా అలా చూస్తూ ఉంటుంది. విమానం నుంచి కింద ఉన్న పరిసరాలను పరికిస్తూ ఉంటుంది. జటాయువు వచ్చి రావణుడిని ఎదిరించినప్పుడు.. ఇద్దరి మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నప్పుడు.. జటాయువు రెక్క తెగి నేల రాలిపోతున్నప్పుడు కూడా సీత ముఖంలో ఎలాంటి భావనలు వ్యక్తం కావు. ఇలా ఏ రకమైన భావాన్ని వ్యక్తం కానివ్వకుండా నటించడం కూడా గొప్ప కళే కావచ్చు. గమ్మత్తేమిటంటే.. జటాయు మరణం తరువాత సీత ఒక డైలాగ్ కొడుతుంది.. ‘నీవు నన్ను అపహరించినంత మాత్రాన నీ ప్రతీకారం తీరుతుందని అనుకోవద్దు’ అని.. ఈ ఒక్క డైలాగ్ ద్వారా రావణుడు కేవలం ప్రతీకారం కోసమే తప్ప కామం కోసం కాదని సీత పాత్ర ద్వారానే స్పష్టంగా చెప్పించాడు దర్శకుడు.

ఇక రాముడి పాత్ర విషయానికి వస్తే.. రాముడి పాత్ర మొదటి నుంచి కూడా సంకుచితంగా చూపించడానికే ప్రయత్నించాడు ఈ సినిమా దర్శకుడు. రాముడు కొంత వయసు రాగానే.. అతనిలో బుద్ధుడి పాత్రను చొప్పించాడు. సమాజంలో వెల్లువెత్తుతున్న దు:ఖాన్ని చూసి రాముడు చలించిపోతాడు. తండ్రిని పిలిచి ఈ అనంతమైన దుఃఖానికి, అంతులేని పేదరికానికి, అమితమైన సంపదకు మధ్య అంతరాలకు కారణం ఏమిటంటూ కమ్యూనిజం కాగితపు సూత్రాలను రాముడిలో ప్రదర్శింపజేస్తాడు. ఆ తరువాత పెరిగిన తరువాత తమ్ముడు భరతుడి పట్ల చిన్న చూపు ఉన్నట్టుగా తక్కువ చేసినట్టుగా వ్యవహరించే ఒకట్రెండు సన్నివేశాలను క్రియేట్ చేశాడు దర్శకుడు. విశ్వామిత్రుడు రాముడిని తీసుకొని వెళ్లడానికి వచ్చినప్పుడు నేరుగా రాముడే వచ్చి నేనే వచ్చేస్తాను అని చెప్పేస్తాడు. ఆ వెంటనే భరతుడు వచ్చి నీతోపాటు నేను కూడా వస్తాను అన్నయ్యా అంటే.. కాదు కాదు.. నువ్వు అయోధ్యలో ఉండి రాజ్యాన్ని చూసుకోవాలి అంటాడు రాముడు. ఆ వెంటనే లక్ష్మణుడు వచ్చి నేనూ వస్తాను అనగానే రమ్మంటాడు. అదిగో భరతుడిని తక్కువ చేసి.. లక్ష్మణుడిని వెంటబెట్టుకొని వెళ్లాడు చూశావా అని మంథరతో డైలాగులు అనిపిస్తారు. చిత్రకూటంలో భరతుడు వచ్చి పాదుకలు తీసుకొని వెళ్లిపోయాక.. మళ్లీ భరతుడు ఎక్కడ వస్తాడేమోనని భయపడి అక్కడి నుంచి పంచవటికి వెళ్లాడట రాముడు. ఈ రకమైన క్రియేటివిటీకి దండాలు. లక్ష్మణుడు కూడా భరతుడిపైన సెటైర్లు విసురుతుంటాడు. విశ్వామిత్రుడి యాగ సంరక్షణకు వెళ్లినప్పుడు అక్కడ అడ్డు పడుతున్నది తాటక సుబాహులు మాత్రమే.. మరి మారీచుడు ఏమయ్యాడో తెలియదు. తాటక సుబాహులను మాత్రమే వధిస్తాడు రాముడు.. మరి అసలైన మారీచుడి పాత్ర ఎందుకు పెట్టలేదు.. దానివల్ల వచ్చిన నష్టం కానీ లాభం కానీ ఏదైనా ఉన్నదా? యాగ సంరక్షణ తరువాత రామలక్ష్మణులను కూర్చోబెట్టి ఒక్క రాముడికి మాత్రమే దివ్యాస్త్రాలు ఇచ్చి లక్ష్మణుడిని అలా వదిలేస్తాడు విశ్వామిత్రుడు.. ఇదేం లాజిక్కో అర్థం కాదు.

ఇలా చెప్తూ పోతుంటే.. ఒక్కో సన్నివేశం గురించి ఒక్కో సినిమా తీయవచ్చేమో.. అంతిమంగా ఈ సినిమా ద్వారా దర్శక రచయితలు చెప్పదలచుకున్న పాయింట్లు ఇవే..

రావణుడు చాలా మంచివాడు, సమసమాజాన్ని కాంక్షించే లోహియా సోషలిస్టు.

ఆడవారిని అమితంగా గౌరవించే వ్యక్తి. చెల్లికి జరిగిన అవమానంకు ప్రతీకారమే సీతాపహరణం తప్ప మరే దురుద్దేశం లేదు.

అంత అందంగా ఉన్న శూర్పణఖ ప్రేమిస్తే.. కాదన్న రాముడు మంచివాడు కాదు.

సీతమ్మ యుద్ధంలో సహాయపడకపోతే.. రాముడు ఓడిపోయేవాడు.

చాలా కూల్‌గా.. రిచ్‌గా తయారు చేసిన రామాయణ వ్యతిరేక ప్రాపగాండా ఈ సినిమా.. ఇది అర్థమయ్యేసరికి ఒక తరం గడిచిపోతుంది. ఈ లోగా రావణుడు గొప్ప సోషల్ జస్టిస్ వారియర్‌గా స్థిరపడిపోతాడు. అన్యాయానికి ప్రతీకగా రాముడు విలన్‌గా మారిపోతాడు. వాళ్ల లక్ష్యం అదే. దాని సాధించే మార్గంలో ఒక అడుగే ఈ సినిమా నిర్మాణం.

Exit mobile version