[2026 మార్చ్ 27 న శ్రీరామనవమి సందర్భంగా శ్రీమతి షేక్ కాశింబి గారు రచించిన ‘రాముడెందుకయ్యాడు దేవుడు?’ అనే కవితని అందిస్తున్నాము.]
మానవుడిగా జన్మించి
మనుష్య రూపాన సంచరించి
ఇక్కడి కష్టానష్టాల ననుభవించి
ఇక్కడి నియమాల నాచరించి..
ఓరిమి మధుర ఫలాలను
కూరిమి కూర్చే బలాలను
సంబంధాల సార్థకతని
కుటుంబాల ప్రతిష్ఠని..
వ్యక్తి బాధ్యతల బరువుల్ని
వ్యక్తిత్వపు భిన్న పార్శ్వాల్ని
మనో వాంఛలపై నియంత్రణని
మనసు చలించని నిగ్రహాన్ని..
కన్నవారి మాటకు కట్టుబడడాన్ని
అన్నదమ్ముల పట్ల అవ్యాజానురాగాన్ని
సహచరితో ధర్మాచరణని
సంతానంతో వాత్సల్యాన్ని..
దాసుల పట్ల దయని
పెద్దల పట్ల ఆదరణని
శత్రువు పట్ల కాఠిన్యాన్ని
శరణాగత రక్షణని..
రాజనీతి లోని విజ్ఞతని
ప్రజా పక్షపు ధర్మ సూక్ష్మాన్ని
రణ రంగాన శౌర్యాన్ని
త్యాగంలో ఔన్నత్యాన్ని ప్రదర్శించి..
మానవతా చిరునామాయై
ఉన్నత విలువల నిలువెత్తు రూపమై
ధర్మమే సర్వోపరి యని యెంచి
జనరంజక పాలనతో మెప్పించి..
ఒకే మాట ఒకే బాణం ఒకే పత్నికి
ఏకైక ప్రతినిధిగా నిలిచి
అందరి మనసుల్ని గెలిచి
అయ్యాడు దేవుడు శ్రీరాముడు!
