Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రంగు రంగుల పూలు

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన బండారి రాజ్ కుమార్ గారి ‘రంగు రంగుల పూలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

పాపం.. చిన్ని బతుకమ్మల మనసు చిన్నబోయింది.

సద్దుల బతుకమ్మ సంబురం లేకుండా గడిచింది.

దసరా రోజున మంది ఎగబడి, ఎగబడి జమ్మి కోసుకున్నరు.

ఆకు దొరక్కపోతే రాణి వాళ్ళ నాన్ననే అడిగిమరీ పట్టుకపోయింది అఖిల వాళ్ళ అమ్మ.

ఇగ అప్పుడైతే రాణి, అఖిల ఇద్దరూ దూరం నుంచే చూస్తూ ఉండిపోయారు.

జరిగిన దాని గురించి ఎవల ఆలోచనల్లో వాళ్ళు చిక్కుబడిపోయి, వలపోసుకున్నారు.

***

“మే.. ఐ కమిన్ టీచర్, మే.. ఐ కమిన్ టీచర్” అఖిల క్లాస్ రూమ్ ముందు నిలబడి అడుగుతుంది.

‘కమ్ ఇన్’ ఆమె వైపు చూడకుండానే బదులిచ్చింది టీచర్.

అఖిల రెండో బెంచీపై కళ్యాణి పక్కన కూర్చుంది. మర్చిపోయిందేమో అని ‘రా.. అఖిల’ అన్నట్టు ముందు బెంచీలో కూర్చున్న రాణి సైగ చేసింది. అఖిల పట్టించుకోలేదు. రాణి ముఖం వాడిపోయింది. ఇదంతా టీచర్ గమనిస్తూనే ఉంది.

“పిల్లలూ.. ఈరోజు మనం ‘సోపతి’ కథ గురించి చెప్పుకుందాం.. సరేనా!” టీచర్ తెలుగు పాఠ్య పుస్తకం తెరిచింది.

“ఒక కుందేలు, కోతి సోపతి ఉండేవి. ఒకరోజు కుందేలు బాయిలో పడింది. అది కోతి చూసింది. కోతి ఊడను పట్టుకుని ఊగులాడింది. కుందేలు కోతి తోకను పట్టుకున్నది. కోతి తోకను పట్టుకొని కుందేలు పైకి ఎక్కింది” కథ పూర్తి కాగానే పిల్లలు చప్పట్లు కొట్టారు.

ఫ్రెండ్షిప్ గురించి ప్రశ్నలు వేయసాగింది టీచరమ్మ.

“అఖిలా.. కథ విన్నాక నీకేం అనిపించింది?”

“అసలు కోతి కుందేలు ఫ్రెండ్షిప్ చేస్తాయా టీచర్?”

“అవును చేస్తాయి. ఎవరైనా ఎవరితోనైనా నచ్చితే ఫ్రెండ్షిప్ చేయవచ్చు”

“మరేమో.. రాణితో స్నేహం చేస్తే మా మమ్మీ ఎందుకు కొట్టింది టీచర్?” అఖిల ఏడుస్తుంది.

అఖిలను చూసి రాణి కూడా ఏడవటం మొదలెట్టింది.

కళ్యాణి లేచి “అవును టీచర్ నేను కూడా చూశాను. రాణి పక్కన కూర్చోవద్దు. తనను ఇంటికి రానీయద్దు. తనతో ఆడుకోవద్దు. క్లాస్ రూమ్‌లో కూడా తన పక్కన కూర్చోవద్దని అఖిల వాళ్ళ మమ్మీ తనను బాగా కొట్టింది” తను చూసినదంతా కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పసాగింది.

వెంటనే టీచర్ వాళ్ళిద్దర్నీ దగ్గరకు తీసుకుంది. ఏదో నలక పడ్డట్టు కళ్ళు తుడుచుకుంది. సమాధానం ఏం చెప్పాలో, ఎలా ఓదార్చాలో తెలియక తికమకపడింది.

“రాణితో నేనెందుకు ఫ్రెండ్షిప్ చేయకూడదు టీచర్” అఖిల వెక్కిళ్లు పడుతుండగా అడిగింది.

పిల్లలకు నీళ్లు తాగించింది. ఎవరెవరు ఏ ఏ పూలతో బతుకమ్మలు పేర్చారో, ఎవరెవరు జట్లు కట్టి పాటలు పాడి బతుకమ్మ ఆడుకున్నారో తెలుసుకున్నది.

వంటమనిషిని పిలిచి అసలేం జరిగిందో ఆరా తీసింది.

“తెలంగాణ వచ్చింది. బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఊర్లల్లో కూడా ధూం ధాం గా ఆడారు పాడారు. దళితులు మాత్రం ఎప్పటిలాగే దూరంగానే బతుకమ్మలు ఆడుకున్నారు. రాణి వాళ్ళ నాన్న ఊరందరి బతుకమ్మల ముందు డప్పు కొట్టితేనే బైలెల్లుతాయి. పాపం అఖిల చిన్న పిల్ల. తనకు ఈ కుల అంతరాల గురించి ఎలా తెలుస్తుంది? రాణితో కలిసి బతుకమ్మ ఆడుకుందామని పోయింది. అది తెలుసుకున్న అఖిల వాళ్ళ అమ్మ తనను కొట్టింది”

విషయం పూర్తిగా అర్థమైంది.

మొదటిసారి పిల్లల ముందు సరైన సమాధానం చెప్పలేక దోషిగా నిలబడింది టీచరమ్మ. ఎలాగైనా సరే ఇలాంటివి మొగ్గలోనే తుంచి వేయాలని నిర్ణయించుకుంది.

***

అందరూ కలిసి వరుసగా బడి తోటకు వెళ్లారు. ఎవరికి నచ్చిన పువ్వులు వారు కోసుకొచ్చారు. కొంతమంది పూల కోసం ఇళ్లకు వెళ్లారు. ఇప్పుడెవరూ అభ్యంతరం చెప్పలేదు. సంతోషంగా పూలు కోసుకు వెళ్ళమని అన్నారు. పిల్లలు ఆనందంతో ఊరంతా తిరిగి రకరకాల పూలు తీసుకొచ్చి వరండాలో కూర్చున్నారు. టీచర్‌తో పాటు అందరూ బతుకమ్మలు పేర్చడం మొదలుపెట్టారు. కొద్దిసేపట్లోనే రంగురంగుల పూల బతుకమ్మలు సిద్ధమయ్యాయి. పిల్లలంతా కేరింతలు కొట్టారు.

“ఎవరు తయారుచేసిన బతుకమ్మలు అందంగా ఉన్నాయి?” పిల్లలను అడుగుతుంది టీచర్.

“కళ్యాణి తయారుచేసిన బతుకమ్మ చాలా బాగుంది టీచర్” పిల్లలందరూ ముక్తకంఠంతో అరిచారు.

“ఎందుకు బాగుంది?” పిల్లల్ని నిశితంగా పరిశీలిస్తూ అడిగింది.

“కళ్యాణి ఒక్కత్తే రకరకాల పూలతో బతుకమ్మ పేర్చింది. మిగిలిన వాళ్లు ఒకటి, రెండు రకాల పూలతోనే పేర్చారు టీచర్” పిల్లలు బదులిచ్చారు.

“ఒకటి రెండు రకాల పూలతో పేర్చిన బతుకమ్మలు అందంగా లేవా మరి?”

“బాగానే వున్నాయి టీచర్. కానీ అన్ని రకాల రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మ ఇంకా అందంగా ఉంది” ఏకాభిప్రాయాన్ని చెప్పారు.

“చూడండి పిల్లలూ.. రంగురంగుల పూల బతుకమ్మ ఎంత అందంగా ఉందో.. మనమందరం కలిసిమెలిసి స్నేహంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం” నవ్వుతూ చెప్పింది టీచరమ్మ.

“అఖిలను వాళ్ల మమ్మీ ఎందుకు కొట్టినట్టు?” ఠక్కున కళ్యాణి అడిగింది. రాణి వంత పాడింది. పిల్లలందరూ గొంతు కలిపారు.

“పిల్లలే కాదు.. అప్పుడప్పుడు పెద్దవాళ్లు కూడా తప్పులు చేస్తారు. అది తప్పు అని మనం వాళ్లకు తెలిసేలా చేయాలి”

“అమ్మో.. మన మాట వింటారా?” అనుమానంగా అడిగింది అఖిల.

“మనం చెప్పేది వినాలంటే ఏం చేయాలి టీచర్?” రాణి ఆసక్తిగా అడిగింది.

“ముందుగా మనం బాగా చదువుకోవాలి. అప్పుడే అమ్మ, నాన్న, ఈ సమాజంలోని అందరూ మనం చెప్పింది వింటారు. అన్ని సమస్యలకూ, అంతరాలకూ చదువే పరిష్కార మార్గం చూపుతుంది.” టీచర్ చెప్తుంటే గాలికి పూలమొక్కలు ఊగినట్టు పిల్లలు ఊ.. కొడుతూ తలలూపుతున్నారు.

“టన్.. టన్..” మధ్యాహ్న భోజనం బెల్లు మోగింది. ప్లేట్స్ కడుక్కోవడానికి పిల్లలందరూ గ్రౌండ్ లోకి చెరువు కట్ట తెగినట్టు వరదలా ముంచెత్తారు.

Exit mobile version