[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘రంగులు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
దేశ దేశాల పతాకాలలో
దేదీప్యమానంగా రాజిల్లే వర్ణాలు
జాతి జాగృత ఆదర్శాలను
ప్రకటించే జాత్య చిహ్నాలు!
ఇనరశ్మి వర్ణాలు
సమైక్యత ఔన్నత్యాన్ని చాటే
సమున్నత సంయోజనాలు!
ఇంద్ర చాప వర్ణాలు
ఏకీభావ వైభవాన్ని ప్రదర్శించే
సరాగ సమ్మేళనాలు!
తోటలోని
వివిధ జాతుల విరుల వర్ణాలు
ఐకమత్య సౌందర్యాన్ని వెల్లడించే
సామూహిక సందేశాలు!
నవరత్నాలలో శోభిల్లే వన్నెలు
నవగ్రహాల ఛాయల చిన్నెలు!
ప్రపంచమంతా రంగుల మయం!
రంగుల ప్రపంచ రంగం
ఉల్లాన్ని ఉత్సాహపరచి
ఉల్లాసాల ఊయలలూపగలదు!
ఆకర్షించి వరించి
ఉపకారం చేయగలదు!
వికర్షించి విషాదంలో ముంచి
ఉసురుతీయగలదు!
జన్మతః అబ్బిన జాతి వర్ణం
మెరుపు తగ్గినా
మేలు చేసే గుణవతి!
ధగ ధగలాడే పూత రంగు
దగాచేసే దుర్మతి!
నీలం
నింగికీ, నీటికీ,
నిశ్చల ప్రశాంతతకూ,
ధవళిమ
పవిత్రతకూ,
శాంతికీ, సత్యానికీ
ప్రతిరూపాలైనట్లే
ప్రతి వర్ణం
ఒక భావానికి భాష్యం!
ఒక రూపానికి ప్రతిరూపం!
నల్లని మేఘమే
జీవజల వర్షిణిగా,
నల్లని చీకటి రాత్రే
విశ్రాంతి ప్రదాయినిగా,
నల్లనయ్యే దైవంగా ఉండగా
నీల వర్ణంపై జనులకెందుకో
వైరస్యం?
శ్వేత వర్ణంపై ఎందుకో వ్యామోహం?
నలుపు, తెలుపు
మేని చాయల వలన వేర్పడి
జన్మ జన్మలూ జగడించడం
బుద్ధి జీవుల మనో దౌర్బల్యం!
ఒకే రంగు రక్తంతో
జన్మించే జనులలో
అనేక అవగుణాలు
అంటువ్యాధుల్లా ప్రబలడం
లోకుల బుద్ధి వైకల్యం!
పుడమిపై ఎన్నెన్ని వన్నెలున్నా
హరిత వర్ణమొక్కటి
హరించిన వేళ
అన్ని రంగులూ వెలవెలబోవలసిందే!
అన్ని రంగాలూ విలవిలలాడవలసిందే!
పచ్చదనం
పంటవలతి ప్రాణ ధనం!
రంగులను మార్చుకోవడం
ఊసరవెల్లి ప్రాణ రక్షణ ధర్మం!
రంగులను మార్చుకోవడం
రాజకీయ మాయా మర్మం!
రణ క్షేత్రాలలో
రాక్షస శస్త్ర విస్ఫోటనల కారణంగా
రగులుకునే క్రూర మారణాయుధాల
ఎర్రదనమూ,
ఆ రక్తిమం చివరకు మిగిల్చే
బూడిద కుప్పల
కారు నల్లదనమూ
రంగుల బీభత్సాకారాలు కావు!
అవి
రక్త పిపాసుల
నీచ, నిర్దయ బుద్ధుల
భీషణాకృతులు!
యుధ్ధోన్మాద ఉధ్ధృతులు!
రక రకాల రంగుల
అంగులను రంగరిస్తూ,
ఆనందోత్సాహాల
ప్రవాహాలను పొంగజేస్తూ
ప్రత్యక్షమయ్యే హోలీ
రస రమ్య వర్ణాల కేళి!
వర్ణ రింఛోళి హేళి!
బ్రతుకులను
చక్కని చాయలతో నింపే హోళీపై
విశ్వమంతా విస్తరించాలి హాళి!
