Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు చిత్రరంగంలో కొత్త ప్రయోగం ‘రావు బహదూర్’

[‘రావు బహదూర్’ అనే సినిమాని సమీక్షిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

జరిగిన సంఘటనలకు మాయ లేదా ఇంద్రజాలంలా అనిపించే కారణాలను చూపించటం మేజికల్ రియాలిజం (మాయా వాస్తవికత). ఇది ల్యాటిన్ అమెరికా సాహిత్యంలో మొదలయింది. కథలో ఒక వ్యక్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేదానికి అద్భుతరసంతో కూడిన వివరణ ఉంటుంది. ‘రావు బహదూర్’లో అలాంటి అద్భుత సన్నివేశాలు ఉంటాయి. సినిమా మొదట్లోనే ఒక అబ్బాయి రాజమహల్లో గోడ మీద తగిలించిన ఫోటో నుంచి బయటికొచ్చి పారిపోతుంటే పెద్ద తీగలు వచ్చి అతన్ని లాక్కెళ్ళి ఒక చెట్టు కిందకి తీసుకుపోతాయి. అబ్బాయి చనిపోయాడని, అతని ఆత్మకి శాంతి లేదని చెప్పటానికి అద్భుతరసంతో కూడిన సన్నివేశమది. ఇంకో సన్నివేశంలో కట్టుబాట్లంటే పట్టించుకోని ఒక యువరాజు వంశగౌరవం కోసం కఠినాత్ముడుగా మారే క్రమాన్ని ఒక్క పాటలో చూపించారు. ఆ పాటలో ఆ వంశానికి చెందిన పూర్వీకులు అందరూ కలిసి అతని మెదడుని శుద్ధి (brainwash) చేసి అతనికి వంశగౌరవం అనే మందు నూరిపోస్తారు. ఇదేదో మాట వరసకి ఇచ్చిన పోలిక కాదు. నిజంగానే (literally) అతని కపాలాన్ని తెరిచి మెదడుని శుద్ధి చేయటం, మెదడుకి (బంగారు) మందు పూత పూయటం చూపిస్తాడు దర్శకుడు వెంకటేష్ మహా. పాటలో మళ్ళీ మళ్ళీ వచ్చే పదం ‘కండీషనింగ్’. ఈ కండీషనింగ్ పాటని ఇక్కడ చూడవచ్చు: https://www.youtube.com/watch?v=v5aeCxjlCWE

మనమంతా సంఘం చెక్కిన శిల్పాలం. అదే కండీషనింగ్. సంఘం ఎవరినైనా చెక్కేస్తుంది. ఆ చెక్కుడులో మానవత్వం పోయేలా చేస్తుంది. మానవత్వాన్ని కాపాడుకుంటే మనిషి మనీషి అవుతాడు. కథలో భువనం రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) ఒక అనుమానం కారణంగా పిచ్చివాడైపోతాడు. తాగుడు ఎక్కువవటంతో లివర్ క్యాన్సర్ వస్తుంది. ఎంతో కాలం బతకడని డాక్టర్లు చెప్పేస్తారు. ఇంతకీ అతని అనుమానం ఏమిటంటే అతని చిన్న కొడుకు కుసుమప్పకి తాను తండ్రిని కాదని. ఆ కుసుమప్పే మొదట్లో ఫోటో లోంచి బయటికొచ్చిన అబ్బాయి. అతను చనిపోయి ఎనిమిదేళ్ళయింది. అతని భార్య (దీపా థామస్) కుసుమప్ప చనిపోయినప్పటి నుంచి గదిలో నుంచి బయటకి రాలేదు. ఆమె తనని శిక్షిస్తూందని రామప్పకి కసి. కుసుమప్ప తన కొడుకు కాదని నిరూపిస్తే భార్య మీద అతనిదే విజయం. ఈ విజయమే అతనికి ముఖ్యం కానీ భార్యని నమ్ముదామని అనుకోడు. కారణం కుసుమప్ప నల్లగా ఉండేవాడు. వారి వంశంలో ఎవరూ అంత నల్లగా లేరు మరి. రాజవంశం కదా, అందుకని ఇంకా పట్టుదల. ‘అనుమానం పెనుభూతం’ అనే నానుడి మీద చిత్రం ఆధారపడింది. ఆ భూతమే చిత్రానికి హారర్ సినిమా లాంటి వాతావరణాన్ని కల్పిస్తుంది.

మాయా వాస్తవికత అనేది మనకి కొత్తగా ఉంటుంది. మెక్సికోలో కథల్లో ఇది మామూలే. మెక్సికోకి చెందిన దర్శకులు ఇలాంటి కథలతో సినిమాలు తీశారు. ‘ప్యాన్స్ లాబిరింత్’ చిత్రంలో ఆల్ఫాన్సో క్వరాన్ ఇలాంటి కథ చూపించాడు. ‘బర్డ్‌మ్యాన్’ చిత్రంలో అలెహాంద్రో గొంజాలెజ్ ఒక అమెరికన్ నటుడి కథని అద్భుతరసం కలిపి తీశాడు. ఇది ఉత్తమ చిత్రంగా ఆస్కార్ గెలుచుకుంది. ‘ద షేప్ ఆఫ్ వాటర్’లో గియెర్మో దెల్ తోరో ఒక సముద్రపాణికి, ఒక మూగ స్త్రీకి మధ్య ప్రేమకథ చూపించాడు. ఇది కూడా ఉత్తమ చిత్రంగా ఆస్కార్ గెలుచుకుంది. వెంకటేష్ మహా మరీ నేల విడిచి సాము చేయలేదు. కాకపోతే అతని స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఒక్క పాటతో సున్నితమైన యువరాజు కరుడుగట్టిన రాజావారిగా ఎలా మారిపోతాడు అని చాలా మందికి అనిపిస్తుంది. సున్నితంగా ఉంటే జీవితం కఠినంగా ఉంటుంది కాబట్టి కఠినంగా మారితే జీవితం సజావుగా ఉంటుంది అని అతను అనుకోవటమే ఇక్కడ ఉద్దేశం. ఇది అర్థం చేసుకోవటం కాస్త కష్టమే.

మన పురాణాల కథలు ఈ చిత్రకథకి ఉపయోగపడతాయి. పాండవులు పాండురాజుకి పుట్టినవారు కాదు కాబట్టి కౌరవులకి అన్యాయం జరిగింది అంటాడు రామప్ప. ఇది పిచ్చివాడి ప్రేలాపనే అయినా కొందరు హేతువాదులు చేసిన వాదనే ఇది. భార్య శీలవతి అయితే భార్యకి ఒక తప్పు వల్ల కానీ, అత్యాచారం వల్ల కానీ కలిగిన సంతానం కూడా భర్త సంతానమే అని భారతం చెబుతుంది. భార్య గుణాలని దృష్టిలో పెట్టుకోవాలి కానీ అదే పనిగా అనుమానించవద్దు అనేది ఇక్కడ నీతి. కుంతికి, మాద్రికి వరప్రసాదంగా కొడుకులు కలిగారు. కుంతి, మాద్రి గుణాలకి ఏ లోపమూ లేదు. దుర్యోధనుడు కూడా పాండవులు పాండురాజు సంతానం కాదని అనలేదు. వారు అజ్ఞాతవాసం పూర్తి కాకుండానే బయటపడిపోయారు కాబట్టి వారికి రాజ్యం ఇవ్వనన్నాడు. అధికమాసాలు లెక్కించకపోవటంతో పొరబడ్డాడని చెప్పినా వినలేదు. అంతే కానీ వారికి వారసత్వ హక్కు లేదని అనలేదు. మన పురాణాల్లో జీవనగమనం ఎలా ఉండాలో చెప్పారు. అది పట్టించుకోకుండా వక్రభాష్యాలు చెప్పేవారిని మనం మార్చలేం.

రామాయణంలో రాముడు సీతని అనుమానించాడనే కథ కూడా ఇక్కడ అతుకుతుంది. రామప్ప భార్య బయటికి రాకుండా గదిలో ఉండిపోవటం వనవాసంలా ఉంటుంది. కానీ అగ్నిపరీక్ష తర్వాత కూడా రాముడు సీతని అనుమానించాడనేది కల్పిత కథ. ఉత్తరకాండ కల్పితమనే పండితులు చెబుతారు. ఇవన్నీ పక్కన పెట్టి సినిమా గురించి చెప్పుకుంటే ఇది కొత్త ప్రయత్నం. తొందరగా ప్రేక్షకులకి మింగుడుపడదు. కానీ ఒక్కమాట మాత్రం గట్టిగా చెప్పగలను. రెండోసారి చిత్రం చూస్తే మాత్రం చాలామందికి నచ్చుతుంది. మరి రెండుసార్లు చూడాలా అంటే ఎవరి ఇష్టం వారిది. నేను ఒక్కసారే చూశాను. ఓటీటీలోకి వచ్చాక మొదటిరోజే మళ్ళీ చూస్తాను.

రామప్ప కఠినుడిగా మారాక, తర్వాత ముసలివాడయ్యాక సత్యదేవ్ ఆ పాత్రలో జీవించాడనే చెప్పాలి. అంతకు ముందు రామప్ప పాత్రలో సత్యదేవ్ కొంచెం ముదురుగా కనిపిస్తాడు. ఇది పెద్ద లోపమేమీ కాదు. రామప్పకి పెద్ద కొడుకు కూడా ఉంటాడు. అతని పేరు లవణప్ప. సినిమాలో ఇతను ఎందుకు ఉన్నాడు అని అనిపిస్తుంది కానీ చివర్లో అతని ప్రాధాన్యం తెలుస్తుంది. రామప్ప స్నేహితుడు ఆచారి (వికాస్ ముప్పల) డాక్టరు. రామప్పని సైకియాట్రిస్ట్ దగ్గరకి తీసుకెళితే లాభం ఉంటుందని అతని భావన. రామప్ప వినడు. ఆయన కేవలం డాక్టరు, స్నేహితుడే కాదు, ఆయనకి కూడా కథలో ప్రాధాన్యం ఉంటుంది. అచ్చమ్మ (బాలా పరాశర్) మహల్లో పనిమనిషి. ఆమెదీ రామప్ప వయసే. చిన్నప్పటి నుంచీ రామప్ప తెలుసు కాబట్టి చనువుగా ఉంటుంది. రామప్ప, అతని భార్య గురించి చింత పడుతుంది కానీ రహస్యాలు తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉంటుంది. ఆమె ప్రేక్షకులకి ప్రతినిధి. ఆమె కుందేలులా రెండు చేతులూ దగ్గరకి పెట్టి వేళ్ళు కదిలిస్తూ అందరినీ పరిశీలించటం చక్కని క్యారెక్టరైజేషన్.

విరామం తర్వాత చిత్రంలో పోలీసు విచారణ కూడా ఉంటుంది. ఇది అవసరమా అనిపిస్తుంది కానీ దాని అసలు ఉద్దేశం తెలిశాక దాని ప్రయోజనం తెలుస్తుంది. చిత్రం మొదట్లో ఓ రెండుసార్లు ఆచారి పేషెంట్లని నోరు తెరవమని నోట్లోకి చూసినపుడు నోట్లో కెమెరా పెట్టినట్టు ఆయన్ని చూపిస్తాడు దర్శకుడు. ఇదెందుకు? అనిపిస్తుంది. కానీ తర్వాత రామప్ప చెవిలో రహస్యం చెప్పినపుడు చెవిలో కెమెరా పెట్టినట్టు చూపిస్తాడు. రహస్యం చెప్పినవారి హావభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముందు నోట్లో కెమెరా పెట్టి మనని సన్నివేశానికి సిద్ధం చేశారన్నమాట. ఇలా ప్రతి పాత్ర, ప్రతి మలుపు, ప్రతి ప్రయోగం చిత్రానికి అవసరమా అనిపించినవి అవసరమే అనిపిస్తాయి చివరికి. ఇది మొదట్లో కొంచెం అసహనం కలిగిస్తుంది. కానీ చిత్రం అయిపోయాక ఆలోచించకుండా ఉండలేం. దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు “The psychological drama begins after the movie ends”. దీనికి ప్రేక్షకులు సిద్ధమా అనేదే ప్రశ్న. నేనైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ఈ చిత్రం గురించి ఆలోచించాను.

సంభాషణలలో అక్కడక్కడా ఆంగ్లం వినిపించినా వినసొంపైన తెలుగు మాటలు ఆహ్లాదం కలిగిస్తాయి. గత నెల వచ్చిన ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో కూడా సంభాషణల్లో తెలుగుదనం తొణికిసలాడింది. ఇది చూస్తే తెలుగు భాషకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనే ఆశ కలిగింది. ఈ చిత్రంలో ఆచారి అచ్చమ్మ చెప్పే కథలు నమ్మకపోవటం, అచ్చమ్మ ఆచారిని విసుక్కోవటం నవ్వు తెప్పిస్తుంది. చివర్లో కోర్టుకి వచ్చిన రామప్పని ఇన్‌స్పెక్టర్ “యోగనిద్ర నుంచి మేల్కొని వచ్చినట్టు ముఖం వెలిగిపోతోంది. ఆ సిద్ధుల రహస్యం మాక్కూడా చెప్పండి” అంటాడు. అప్పుడు రామప్ప “జీవితం సంక నాకిపోతే ఆటోమాటిగ్గా అవే సిద్ధిస్తాయి” అంటాడు. హాస్యానికి ఇదో ఉదాహరణ. వేదాంతపరంగా ఆలోచిస్తే జీవితం ఆటుపోట్లకి అలసిపోయిన మనిషికి ఇదంతా మాయ అని తెలిస్తే మనశ్శాంతి కలుగుతుంది. ఒక శ్మశాన సన్నివేశంలో కాటికాపరి మృతదేహాన్ని కట్టెతో పోలుస్తాడు. దీని కోసమా ఇంత తాపత్రయం అని అనిపిస్తుంది. రాజఠీవికి గుర్తుగా రాజవంశీయులందరూ ఛాతీపై కుడిచేతిని పెట్టుకోవటం వారి భేషాజనికి ప్రతీక. కోమాలో ఉన్నప్పుడు కూడా ఒకాయన అసంకల్పితంగా చేయి ఛాతీపై పెట్టుకోవటం ఒక వ్యంగ్యబాణం.

రాజమహల్, రామప్ప గదిలో గోడలు గిర్రున తిరుగుతూ ఉండటం, కుసుమప్ప చనిపోయినపుడు అతన్ని చూపించకుండా అతనే అందర్నీ చూస్తున్నట్టు చిత్రించటం ఇవన్నీ కళాదర్శకత్వం, ఛాయాగ్రహణంలో చేసిన ప్రయోగాలు. పాటలే కాక నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. విరామానికి ముందు ఫ్లాష్‌బ్యాక్‌లో రామప్ప ప్రేమకథ హాయిగా ఉంటుంది. పూర్వీకులు ధరించే దుస్తులు కూడా చక్కగా రూపొందించారు. రామప్ప భార్య చెవులకి పెట్టుకునే బుట్టలు చెవి కొసన కాక చెవి డొప్పలకి పెట్టుకుంటుంది. పశువులను కొన్నప్పుడు వాటి చెవి డొప్పలకి బిళ్ళలు తగిలిస్తారు అలాగన్నమాట. అంటే ఆమె మీద సర్వహక్కులూ తనవే అని రామప్ప భావన. దీనికి సన్నివేశాలు అక్కరలేదు. చెవి డొప్పలకి ఉన్న బుట్టలు చెప్పేస్తాయి.

ఇక చివరి మాట ఏమిటంటే చిత్రం ముగిశాక నాకు ఒక పాత తెలుగు చిత్రం గుర్తొచ్చింది. ‘ఓం శాంతి ఓం’ (హిందీ) చిత్రం చూసినవారికి చివరికి ‘మధుమతి’ చిత్రం గుర్తుకొచ్చినట్టు. అయితే ఆ పాత తెలుగు చిత్రం పేరు మాత్రం చెప్పను. ఈ మధ్యనే ఒక మిత్రుడితో మాట్లాడుతుంటే అతను అన్న మాట “కథలోని ముఖ్యమైన అంశం ఇంతకు ముందే ఎవరైనా స్పృశించారా అనేది అప్రస్తుతం. మన కథ ఆ అంశాన్ని బాగా ఆవిష్కరించిందా లేదా అనేదే ప్రధానం”. ఇక్కడ అది నూటికి నూరు పాళ్ళూ నిజమైంది.

Exit mobile version