Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రోతలలో ఆలోచనను రేకెత్తించే కంట్రీ సాంగ్ ‘రేటెడ్ ఎక్స్’

[లోరెట్టా లిన్ రచించి, పాడిన ‘రేటెడ్ ఎక్స్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

లోరెట్టా లిన్‌ను చాలా మంది స్త్రీలు ఇష్టపడడానికి కారణం, ఆమె గానం చేసిన పాటల్లో ధైర్యంగా చర్చించిన విషయాలు. కంట్రీ గాయకులందరినీ పరిశీలిస్తే తన పాటల ద్వారా వ్యవస్థలోని లోపాలను స్త్రీల అసహాయ జీవితాలను సూటిగా, నిజాయితీగా చర్చించిన లోరెట్టా నిబద్ధత ఆశ్చర్యపరుస్తుంది. తాగుబోతు భర్తలతో జీవితాన్ని గడిపే స్త్రీల మానసిన స్థితి, ఇంటినిండా పిల్లలతో సతమతమవుతూ తమ జీవితాలను కరిగించుకునే గృహిణుల నిశబ్ద దుఃఖం, స్త్రీల జీవితంలో కుటుంబ నియంత్రణ అవసరాన్ని గుర్తించి దాన్ని ప్రచారం చేసిన ధైర్యం, పేదరికంతో నిండిన బాల్యం నుండి నేర్చుకున్న జీవిత పాఠాలు, ప్రేమ లేని వివాహబంధం నుండి తప్పించుకోలేక చాటుగా ప్రేమను అందుకుంటూ అభద్రతాభావంతో రగిలిపోయే అక్రమ సంబంధాలలో పడి కొట్టుకుంటున్న జీవితాలు, ఇలా బాహాటంగా చర్చించడానికి ఆనాటి సమాజం ఇబ్బందిపడే ఎన్నో అంశాలను తన పాటల ద్వారా వినిపించారు లోరెట్టా .

వివాహ బంధం నుండి బైటపడి స్త్రీ విడాకుల ద్వారా స్వేచ్ఛను పొందినా సమాజం ఆమెను ఎన్ని రకాల పరీక్షలకు గురి చేస్తుందో, ఆమెను ఎంత అనుమానంగా చూస్తుందో, నీతి లేనిదిగా ఆమెను ఎంచి స్త్రీ సమాజం, ఆమె తమకు సులువుగా అందుతుందనే భావనతో పురుషసమాజం ఇలాంటి స్త్రీని ఎన్ని కఠిన పరీక్షలకు గురి చేస్తుందో చర్చించిన పాట ‘రేటెడ్ ఎక్స్’. మనుష్యులలోని ద్వంద నీతిని ప్రశ్నించే ఈ పాట ఒంటరి స్త్రీల జీవితంలోని కష్టాన్ని బైటపెడుతుంది. అలా అని వివాహ బంధంలో నలిగిపోతూ ఉండమనే సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ పాట సాగదు. విడాకులు తీసుకున్న స్త్రీ పట్ల సమాజం ప్రదర్శించే క్రూరత్వాన్ని బట్టబయలు చేస్తూ సమాజంలో మార్పు అవసరాన్ని సూచిస్తుంది. లోరెట్టా తన గాత్రంలో కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శిస్తూ స్త్రీల పట్ల సమాజంలో రావలసిన మార్పును సూచిస్తుంది కాని నలిగిపోతూ వివాహబంధంలోనే ఉంటూ సమాజ క్రూరత్వం నుండి తనను తాను స్త్రీ కాపాడుకోవాలనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయదు. ఆమె గాత్రంలో ద్వనించే భావాలు ప్రశ్నలుగా మారి శ్రోతలను చేరుతాయి. అంతే తప్ప ఈ పాటలో ఎటువంటి సందేశం ఉండదు. లోరెట్టా తన పాటలలో చర్చించిన సామాజిక విషయాలలో ఏ పక్షమూ తీసుకోకుండా, వాస్తవ స్తితిగతులను మాత్రమే చర్చకు పెడుతుంది. అందుకే అవి స్త్రీ పురుషులందరినీ ఆలోచింపజేస్తాయి. ఈ పాటలలో స్త్రీల కోపం, బాధ ఉంటుంది తప్ప పురుష ద్వేషం కనిన్పించదు. ఆమె పాటలు అందరూ మెచ్చడానికి అది ముఖ్య కారణం.

‘X’ రేటింగ్ పెద్దలకు మాత్రమే తగిన కంటెంట్‌ను సూచిస్తుంది. చలనచిత్ర పరిశ్రమలో, ఇది లైంగిక కంటెంట్, తీవ్రమైన హింస, అత్యంత అసభ్య పదజాలంతో నిండిన అంశాలకు ప్రతీక. వీటి కారణంగా విధించబడే ఆంక్షలను సూచన. విడాకులు తీసుకున్న స్త్రీని సమాజం ‘X’ రేటింగ్ పొందిన కంటెంట్‌గా భావించి ఆమెను లైంగికంగా అందుబాటులో ఉన్న వస్తువుగానూ, అసభ్యతకు ప్రతీకగానూ ఎలా ఎంచుతుందో చర్చకు పెట్టిన గీతం ఇది.

ఈ పాటను 1972లో లోరెట్టా లిన్ రాసి, రికార్డు చేసారు. ఇది ఒక సోలో కళాకారిణిగా లిన్‌కు లభించిన ఆరవ ‘నెంబర్ వన్’ కంట్రీ సింగిల్. ఇది ఒక వారం పాటు అగ్రస్థానంలో నిలిచి, చార్టులో మొత్తం పద్నాలుగు వారాల పాటు కొనసాగింది. 1970ల ప్రారంభంలో అమెరికాలో విడాకులు తీసుకున్న మహిళలు ఎదుర్కొన్న సామాజిక వివక్ష గురించి ఈ పాట ప్రస్తావిస్తుంది. ఇందులో వాడిన నిర్మొహమాటపు భాష కారణంగా, ఆ సమయంలో ఇది వివాదాస్పద గీతంగానూ సంచలనం సృష్టించింది

Well, if you’ve been a married woman
And things didn’t seem to work out
Divorce is the key to bein’ loose and free
So you’re gonna be talked about
Everybody knows that you’ve loved once
They think you’ll love again
You can’t have a male friend
When you’re a has-been or a woman
You’re rated X

(నువ్వు వివాహితవయి ఉండి ఆ బంధం సాఫీగా సాగకపోతే, అందులోనుండి స్వేచ్ఛను పొందడానికి విడాకులే మార్గం అయితే, ఇక నువ్వు అందరూ మాట్లాడుకునే విషయంగా మిగిలిపోతావు. నువ్వు ఒకప్పుడు ప్రేమించావని అందరికి తెలుసు. అందుకే ఇక మళ్లీ ప్రేమకోసం ఎదురు చూస్తున్నావని నిర్ణయించేసుకుంటారు. నీకో మగ స్నేహితుడు ఇక ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు ప్రేమించి ఇప్పుడు ఎక్స్ గా ముద్రించబడిన స్త్రీవి మరి)

ఏ స్త్రీ అయినా విడాకులు తీసుకుందంటే ఆ బంధంలోని ఇరుకుని వదిలి స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలనే. కాని దీన్ని సమాజం మరోలా అర్థం చేసుకుంటుంది. ఆమె ఒకరితో జీవితం గడిపింది కాబట్టి ఇక మరొక అనుభవం కోసం ఆత్రపడే యువతిగా ముద్రించబడుతుంది. ఇక ఆమె ఎవరితో మాట్లాడినా అది సహజమైన స్నేహంగా ఎవరూ పరిగణించరు. పొరపాటున ఆమెకు మగ స్నేహితులు ఉంటే అది ఓ కళంకంగా మారిపోతుంది. ఆమె ఎవరితో సంభాషిస్తున్నా అనుమానంగానే చూస్తుంది సమాజం. ఇక అన్నీ కళ్లు ఆమెను నిరంతరం పరిశీలిస్తూ ఆమె జీవితంలో రంధ్రాన్వేషణ చేస్తూనే ఉంటాయి.

And if you’re rated X, you’re some kind of gold
Even men turnin’ silver try to make
But I think it’s wrong to judge every picture
If a cheap camera makes a mistake
And when your best friend’s husband says to you
You’ve sure started lookin’ good
You shoulda known he would, and he would if he could
And he will if you’re rated X

(నువ్వు ఎక్స్ గా ముద్రింపబడ్డాక నువ్వో బంగారు గనిగా మరిపోతావు. వెండి జుట్టున్న మగాళ్లు కూడా నిన్ను పొందాలనే చూస్తారు. ఒక చిల్లర కెమెరాతో తీసిన ఫోటోను అదే దృష్టితో చూడడం తగదని నేను అంటాను. నీ ప్రాణ స్నేహితురాలి భర్త నిన్ను చూసి ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావని అంటే, అతను అలా అంటాడని, అవకాశం ఉంటే అలాగే మాట్లాడతాడని ఎక్స్‌గా ముద్రించబడ్డ నువ్వు గ్రహించాలి)

ఒక చెత్త కెమెరాతో తీసిన ఫొటో అంతే చెత్తగా వస్తుంది. అది కెమెరా తప్పు కాని ఆ వ్యక్తి తప్పు కాదు. నిజానికి ఒక వివాహం విచ్చిన్నమయిందంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. ఆ విచ్చిన్నమైన వివాహం మాటున స్త్రీని చూస్తూ ఆమె అనుమానితురాలిగానే కనిపిస్తుంది. సరిపడని బంధం ప్రభావంతో ఒక వ్యక్తిని ఎంచడం చాలా తప్పు. ఎంత మంచి స్త్రీ అయినా ఒంటరిగా మారితే, ఆమెను అనుమానంగా, వాడిన వస్తువుగా, అందుబాటులో ఉన్న యువతిగా, లేదా దుర్మార్గురాలిగా చూస్తుంది సమాజం. అప్పటిదాకా ఆమె చుట్టూ ఉన్న బంధాలు, స్నేహాలు అన్నీ మారిపోతాయి. ఆమె ప్రాణ స్నేహితురాలి భర్త ఆమెను అందుకోగల వస్తువుగా చూస్తాడు. ఆమెతో అలాగే ప్రవర్తిస్తాడు. ఇది ఆమెను ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. కాని అవకాశం దొరికితే మర్యాదస్థులుగా మసలే మగవారు సైతం స్త్రీని ఉపయోగించుకోవడానికి, పొందడానికి పడే ఆరాటం ఒంటరి స్త్రీల జీవితాలలో కనిపించే ఘట్టాలే. వీటికి ఆమె సిద్దపడి, వీటికి ఎదుర్కోవడానికి, తనకు తాను రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

Well, nobody knows where you’re goin’
But they sure know where you’ve been
All they’re thinkin’ of is your experience of love
Oh, their minds eat up with sin
The women all look at you like you’re bad
The men all hope you are
But if you go too far, you’re gonna wear the scar
Of a woman rated X

(ఎవరికీ నీ ప్రయాణం ఎక్కడికన్నది అవసరం లేదు. కాని నీ గతం ఏంటో మాత్రం వారికి తెలుసు. వాళ్లు ఆలోచించేదంతా నీ పాత అనుభవాల గురించే. వాళ్ల మెదళ్లు పాపంతో కప్పేయబడి ఉంటాయి. స్త్రీలందరూ నువ్వు చెడ్డదానివనే భావించి నిన్ను అదే దృష్టితో చూస్తారు. మగవాళ్లంతా నువ్వు నిజంగా చెడ్డ స్త్రీగా ఉంటే బావుండునని ఆశిస్తారు. నువ్వెంత దూరం ప్రయాణించినా ఈ గతకాలపు మాయని మచ్చలు నీకు అడ్డుపడుతూనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఎక్స్‌గా ముద్రించబడిన స్త్రీవి.)

ఆ ఒంటరి స్త్రీ ప్రయాణం ఎటు, ఎంత కష్టతరం అన్నది ఎవరికీ అవసరం లేదు. అసలు ఆమె భవిష్యత్తు గురించి ఎవరూ ఆలోచించరు. ఆమె భవిష్యత్తు లేని స్త్రీగానే అందరికీ తోస్తుంది. అందరూ ఆమె గతం గురించే మాట్లాడుకుంటారు. ఇంకెవరి గతం గురించి ఆలోచించని సమాజం, ఒంటరి స్త్రీ గతాన్ని తవ్వి తోడి ఆమెను ఆ గత ప్రభావంలోనే బంధించి ఉంచాలని ప్రయత్నిస్తుంది తప్ప ఆమె జీవిత ప్రయాణం గురించి పట్టించుకోదు. నిజానికి ఆమెకు భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనే ఎవరికీ రాదు. ఆమె చెడ్డదని స్త్రీలందరూ భావిస్తే, ఆమె చెడ్డదయితే బావుండునని పురుషులందరూ ఆశిస్తారు. ఆమె ఎంత కష్టపడి ముందుకు సాగాలనుకున్నా ఆమె గతాన్ని గుర్తు చేసి మరీ బాధిస్తారు. ఆ మచ్చలతోనే ఆమె యుద్దం చేయాల్సి వస్తుంది. ఇది ఎక్స్‌గా ముద్రపడిన ప్రతి స్త్రీ సంఘర్షణ.

And if you’re rated X, you’re some kind of gold
Even men turnin’ silver try to make
But I think it’s wrong to judge every picture
If a cheap camera makes a mistake
And when your best friend’s husband says to you
You’ve sure started lookin’ good
You should known he would, and he would if he could
And he will if you’re rated X

(నువ్వు ఎక్స్ గా ముద్రింపబడ్డాక నువ్వో వింత బంగారంగా కనిపిస్తావు. వెండి జుట్టున్న మగాళ్లు కూడా నిన్ను పొందాలనే చూస్తారు. ఒక చిల్లర కెమెరాతో తీసిన ఫోటోను అదే దృష్టితో చూడడం తగదని నేను అంటాను. నీ ప్రాణ స్నేహితురాలి భర్త నిన్ను చూసి ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావని అంటే, అతను అలా అంటాడని, అవకాశం ఉంటే అలాగే మాట్లాడతాడని ఎక్స్‌గా ముద్రించబడ్డ నువ్వు గ్రహించాలి)

భర్తను వీడి సంసార జీవితాన్ని కాదని బైటకు వచ్చిన స్త్రీ చుట్టూ వింతైన ఆకర్షణ ఉంటుంది. ఆమె పొందదగ్గ సంపదగా భావించిన ముసలి మగవాళ్లు సైతం ఆమె పట్ల ఆకర్షణ కనపరుస్తూ ఉంటారు. పైగా దాన్నికి ఆమెనే బాధ్యురాలిని చేస్తారు తప్ప అది తమ అవకాశవాదంగా వాళ్లు అంగీకరించరు. ఆమె వదిలిన జీవితం గురించి తెలుసుకుని దాన్ని తమ ఆయుధంగా మార్చుకుని ఆమె ఆ గతం దృష్టితో చూస్తూ, ఆ విఫలమయిన జీవితానికి ఆమెనే బాధ్యురాలిని చేస్తూ ఆమెను తమ అధీనంలోకి తీసుకుని రావాలని ప్రయత్నించే వాళ్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది.

Why, us women don’t have a chance
‘Cause if you’ve been married, you can’t have no fun at all
No, you’re rated X
No matter what you do, they’re gonna talk about you
Look down their noses
I, I don’t know what to think about it
Just give ‘em somethin’ to talk about, I guess
Best thing we can do is let ‘em talk

(స్త్రీలకు ఎందుకు మరో అవకాశం అంత సులువుగా దొరకదు? అంతకు ముందు పెళ్ళయి ఉంటే ఆనందాన్ని అనుభవించే అవకాశాన్ని కోల్పోవాలా? ఎక్స్‌గా ముద్రపడ్డాక, నువ్వేం చేసినా వాళ్ళు తప్పు పడుతూనే ఉంటారు. వాళ్ల చూపులను పట్టించుకోకు. వాళ్ల గురించి ఏం ఆలోచించాలో నాకు తెలియదు. సరే.. వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏదో విషయాన్ని ఇస్తూనే ఉండు. పోయేదేముంది? నాకు తెలిసినంతవరకు అలా మాట్లాడుతున్న వాళ్ళని వదిలేయడమే మనం చేయగలిగింది)

ఈ చివరి చరణంలో లిన్ కొన్ని ప్రశ్నలు సంధిస్తుంది. ఒక సారి వివాహం అయి బైటకొచ్చిన స్త్రీకి సుఖంగా జీవించే హక్కు లేదా? ఆమెకు మరో అవకాశం జీవితంలో దొరకకూడదా? ఆనందాన్ని అందుకునే అవకాశం ఆమెకు దక్కకూడదా? ఎక్స్‌గా ముద్రపడ్డాక ఆమె ఏం చేసినా ప్రపంచం మాట్లాడుకుంటూ ఆమెను అనుమానంగా చూస్తూ వేధిస్తూనే ఎందుకు ఉంటుంది? అలాంటి స్త్రీలు ధైర్యం తెచ్చుకుని ఆ మాటలను పట్టించుకోకుండా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళడమే చేయాలి తప్ప వారిని పట్టించుకోకూడదు. వాళ్లకు మాట్లాడుకోవడానికి ఏదో ఒక విషయం ఆమె జీవితంలో నుండి దొరుకుతూనే ఉంటుంది. దాన్ని వదిలేయాలి, వారి మాటలను, చూపులను దాటుకుంటూ భవిష్యత్తులోకి ప్రయాణించాలి. ఆ ధైర్యాన్ని ఎవరికి వారే సంపాదించుకోవాలి.

ఒంటరి స్త్రీల పట్ల సమాజ వైఖరిని వేలెత్తి చూపుతూ అలాంటి వారిని పట్టించుకోకుండా ముందుకు అడుగులు వేస్తూ స్త్రీలు సాగాలని, ఎవరి జీవితాలను వారే ధైర్యంగా మలచుకోవాలనే సందేశాన్ని ఇస్తూ పాటను ముగిస్తుంది.

ఇందులో ప్రతి చరణాన్ని గానం చేస్తున్నప్పుడు లిన్ గొంతులో ఆవేశం, ఆవేదన సమపాళ్లలోద్వనిస్తాయి. చివరి చరణంలో అసహనం, తిరుగుబాటు ధోరణి శ్రోతలను ఉత్తేజితులను చేస్తుంది. ఎక్కడా బేలతనం కనిపించదు. ముఖ్యంగా ఎక్స్ గా మారిన స్త్రీని విక్టింగా చూపించదు లిన్. ఆమె పట్ల సమాజ ప్రవర్తన పట్ల అసహ్యాన్ని కోపాన్ని ప్రదర్శిస్తుంది. అసలు ఆమె గతం భవిష్యత్తుకు ఎందుకు అడ్డుపడాలని ప్రశ్నిస్తుంది. స్త్రీకి మరో అవకాశం ఎందుకు ఉండకూడదని, ఏ బంధం విచ్ఛిన్నమయినా ఆమె పట్ల అనుమాన దృష్టితో ఎందుకు అందరూ ప్రవర్తిస్తారనే వేదన ఆమె గాత్రంలో ధ్వనిస్తూ ఈ పాట వింటున్నవారిలో ఆలోచనను రేకెత్తిస్తుంది.

~

ఈ పాట యూ ట్యూబ్ లింక్ ఇది..
https://www.youtube.com/watch?v=Qv8tMhOVRHU

Exit mobile version