[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
కరువు గంజీ, ముంతా, నేనూ!
1954వ సమ్మత్సరం వేసవి కాలం. అప్పటికి నా వయసు ఎనిమిదేండ్లు. చిక్కెం ముంత తీస్కోని శింగనమలకు బయల్దేరినాను. పొద్దున తొమ్మిది గంటలకే ఎండ సురుక్కు మనిపిస్తా వుంది. అప్పుడే మా వూరోళ్ళందరూ యెల్లవారిపోయినారని తెలిసి, నేను ఆదరాబాదరా నడుస్తా శింగనమల తలబాలకట్ట దగ్గరికి చేరుకుండాను. ఆడ గంజి కోసరం ముంతలూ, సిలవరి క్యారీర్లూ పట్టుకోనుండేవాళ్ళ క్యూ లైన్లను చూస్తానే నా నోట్లో త్యామ అరిపోయింది. ఆడోళ్ళూ, మొగోళ్లూ వేరే వేరే బేర్లలో (క్యూలైన్లలో) నిలుచుకుండారు.
ఒక్కొక్క లైను రెండు పగ్గాలకు పైగానే పొడవుండేది చూసి, ఏమయితాదో యేమో, గంజి పోయిచ్చుకోడానికి వీలయితాదో కాదో, ఇంత పెద్ద లైన్లో నా దంకా అవకాశం వొస్తాదో రాదో అని ఆందోళన చెందుతా మొగోళ్ళ లైన్లోకి పోయి నిలుచుకుండాను. నాకంటే ఆలస్యంగా వొచ్చిండేవాళ్లు నా యెనకలే నిల్చుకోవడంతో నాకు రోంత ధైర్యమొచ్చింది. వాళ్లందరూ శింగనమలకు చుట్టు పక్కలుండే గోవిందరాయుని పేట, సోదనపల్లి, శివపురం, చిన్నజలాలపురం వాళ్లని, నా కంటే వయసులో పెద్దోళ్లని గమనిచ్చి, పర్వాలేదను కొని, ఊపిరి పీల్చుకుండాను.
క్యూ లైను మెల్లగా ముందుకు సాగుతా వుంది. పొద్దు పైకొచ్చే కొద్దీ ఎండవేడి పెరుగుతా వుంది. టైం ఎక్కువయ్యేకొద్దీ జనంలో తోసులాట మొదలైంది. నిన్నా, మొన్నా పదిగంటలకే, పది ఆండాలనిండా తయారుచేసిండే గంజి అయిపోతానే, పోయడం ఆపేసినారని, గంజి దొరకని వాళ్లు బాధపడతా, నిన్న రోంత గొడవ చేయడంతో ఈ రోజు రెండు అండాలు ఎక్కువ చేసినారని, అయినా తమ వరకూ వొస్తాదో రాదోననే దిగులుతో జనం తోసులాడుకో సాగినారు. నా వెనకా ముందూ వుండే వాళ్లు, తోపులాటలో నన్ను పక్కకు నూకేసినారు, నేను కిందికి పడబోతా చాలా కష్టపడి నిలదొక్కుకుండాను.
1954 లో ఫ్యామిన్ గంజి కోసం వెళ్లిన శింగనమలలోని ‘గంజి కేంద్రం’ తలబాల మంటపం
నేను కింద పడకుండా నిలదొక్కుకుండానని రోంత వూరటపడినానుగానీ లైన్లో లేనందుకు బాధయింది. ఈ రోజు గంజి పోయిచ్చుకోడానికి వీలుకాదేమో అని అనుకోగానే కండ్లల్లో నీళ్లు మెదిలినాయి. క్యూలైన్లో తోసులాడతావుండే వాళ్లను ప్రాధేయపడినాను. అయితే వాళ్లెవురూ నా కన్నీళ్లను చూసి, నన్ను కనికరిచ్చే రకంగా లేరు. ఆ క్యూ లైన్లో వుండే వాళ్లందరి కంటే నేనే చిన్నోన్ని. ఇద్దరు ముగ్గురు మాత్రం నా కంటే రెండు మూడేండ్లు పెద్దోళ్ల మాదిరే కనిపిస్తావుండారు. వాళ్ళు నా కంటే బలంగా వుండడంవల్లనేమో, తోపులాటలో గట్టిగా నిలదొక్కుకొని క్యూలైన్లోనే వుండారు. వాళ్ళ చేతుల్లో సిలవరి (సత్తు) క్యారీర్లుండాయి. అవి వుండడంవల్లనే వాళ్లు ఆ తోపులాటలో తమ బలమంతా ఉపయోగిచ్చి లైన్లో నిలదొక్కుకున్నెట్లుంది. నేనూ ఆ పిల్లోళ్ళ మాదిరే బలంగా గుంజులాడి లైన్లో నిలుచుకోడానికి వీలుగాకుండా చేసింది నా చేతిలోని చిక్కెంలో వుండే మట్టి ముంతే! అది తలచుకోగానే దుఃఖం పెల్లుబికి వొచ్చింది. కారుతావుండే కన్నీళ్లతో పెదవులు తడుపుకుంటా దీనంగా నిల్చుకుండాను.
లైన్లో ఆ పెద్దోళ్ళ మధ్యలో నిలుచుకోడానికి నేను గుంజులాడితే, గంజి కోసరం తెచ్చిండే చిక్కెంలోని మట్టిముంత పగిలిపోతాది. అది పగిలిపోతే, నేను గంజి పోపిచ్చుకోలేను, పోపిచ్చుకోడానికి నా దగ్గర ఏందీ లేనప్పుడు నేను వొట్టి చేతులతో క్యూలో నిల్చుకుంటే ఏం ప్రయోజనం? ఈ కొత్తవూర్లో ఇప్పటికిప్పుడు గంజి పోయిచ్చుకోడానికి ముంతో, క్యారీరో నాకు ఎవురిస్తారు? అందరూ నా మాదిరే గంజి పోయిచ్చుకోడానికి తాపత్రయపడతా వొచ్చినోళ్లే! అందరూ కరువు దెబ్బతో ఆకలిగొన్నోళ్లే! ఎంత ఆకలిగొన్నోళ్లయినా, వాళ్ల చేతుల్లో సిలవరి (సత్తు) క్యారీర్లయినా వుండాయి. ఆ మాత్రం సత్తు క్యారియర్ కొనుక్కోలేని మా ఇంటి పరిస్థితి గుర్తుకు రాగానే బాధ మరింత ఎక్కువయింది. గట్టిగా ఏడ్చల్లనిపిచ్చింది. ఏడిస్తే ఎవురికి ముద్దు? ఎవురు వోదారుస్తారు? ఏడిస్తే సర్కారోళ్లు దగ్గిరికి పిలిచి గంజిపోస్తారా? గంజి పోసేటట్లయితే గట్టిగా ఏడ్చచ్చు. అది జరగదు. జరగనప్పుడు ఏడ్చడం వల్ల ఏం ప్రయోజనం?
ఏడ్చడమూ చాతగాక ఏడ్చకుండా వుండల్యాక సమయం గడిచే కొద్దీ పెల్లుబుకుతావుండే దుఃఖాన్ని లోపలే దిగమింగుకోసాగినాను.
‘కరువు కాలంలో బీదాబిక్కిని ఆదుకోడానికి గంజికేంద్రాలు పెట్టిండే గవర్నమెంటు, ప్రతి పల్లెలోనా, ల్యాకపోతే రెండు పల్లెలకో వొగ గంజికేంద్రం పెడితే ఇంత అవస్థ వుండదు కదా! ఎవురయినా పెద్దోళ్లు గవర్నమెంటుకు నచ్చజెప్పితే బాగుంటాది కదా! పెద్దోళ్లు పేదోళ్లకు ఆ మాత్రం సహాయపడలేరా?’ అని మనసు లోపల అనుకుంటావుంటే ఎక్కిళ్లు రాసాగినాయి. అది గమనిచ్చి దగ్గరికొచ్చిన పోలీసాయన, “యా వూర్రా పాపోడా? ఇంట్లో పెద్దోళ్లు లేరా? సన్న బిల్లోనివి, గంజి కోసరం నువ్వొచ్చినావా?” అని ప్రేమగా అడిగినాడు.
“మాది బండమిందపల్లె సార్! మా నాయన తమలపాకులు అమ్ముకోనొచ్చేకి వేరే వూర్లకు గంపెత్తుకొని పోయినాడు సార్. మా అమ్మయ్య జ్వరమొచ్చి పండుకోనుంది. మా ఇంట్లో నేనే పెద్దోన్ని సార్! మూడో తరగతి పాసయినాను,. ఎండకాలం సెలవులయినంక నాలుగో తరగతికి పోతాను సార్. నా చెల్లెళ్ళూ, తమ్ముడూ చిన్న పిల్లోల్లు. మా నాయన ఆకులమ్ముకోని వొచ్చేకి ఇంగా రెండు దినాలయితాది. అందుకే గంజి కోసరం నేనొచ్చినాను సార్”, అని భయపడకుండా చెప్పినాను.
“అయ్యో, అట్లనేమిరా? మీ వూరోళ్లు ఎవరూ రాలేదా” అని ఆయన మల్లా అడిగినాడు. “వొచ్చినారు సార్! అరిగో, అప్పుడే గంజి పోయిచ్చుకొని పోతావుండారు” అని వాళ్లను చూపి, నా ఆలస్యానికి కారణం చెప్పినాను. పాపం, ఆ పోలీసాయన ఏమనుకుండాడో యేమో, నన్ను చేయిపట్టుకొని గంజిపోసే మనిషి దగ్గరికి పిల్చుకొని పోయి, పక్కనుండే ఆఫీసర్‌తో ఏందో మాట్లాడి, నా ముంతనిండా గంజిపోయిచ్చి, మా వూరోళ్ల దగ్గరికి చేర్చి, “జాగ్రత్తగా పో బాబూ! గంజి, ముంతనిండా వుంది. తొలికి పోకుండా జాగ్రత్తగా పో!” అని చెప్పినాడు. అదంతా నాకు వొగ కల మాదిరి అనిపిచ్చింది. సంతోషంతో మల్లా కండ్లల్లో నీళ్లు దొర్లినాయి. ముంతనిండా గంజి! కండ్ల నిండా కన్నీళ్లు! ఆ కన్నీళ్లతోనే ఆ సారు వైపు చూస్తే, “పొయ్యొస్తా సార్” అని చెప్పినాను. దానికి బదులుగా ఆ సారు ఎందుకో మౌనంగా నవ్వి, తోసులాడుకుండే క్యూలైను దగ్గరికి పోయినాడు. నేను సంబరంగా మా వూరోళ్ల గుంపుతో యెల్లవారినాను.
శింగనమల కుమ్మరిగేరి పక్కనుండే చిన్న కాలువ మోరీబండ దాటి, ఇరుక్కంతు గుండా బీటి మాగాణిలోకి అందరమూ అడుగుపెట్టినాం. అక్కన్నుంచీ దూరంగా మా బండమిందపల్లె కనిపిస్తావుంది. శింగనమల నుండి మాగాణి గుండా మా వూరికి మూడు మైళ్ల దూరమంట! శింగనమలకు పడమటి వైపుండే చెరువు కట్టకిందుండే రోడ్డు గుండా పోయి, కట్టకు దక్షిణం దిక్కులో వుండే మరవ దాటి, తాడిపత్రి రోడ్డెక్కి పోతే మా వూరు ఐదుమైళ్ళ దూరమంట! అందుకే మా వూరికీ శింగనమలకూ ఎవురూ అంతదూరం చుట్టేసుకొని పోరంట! చెరువు నిండి వరిపంట పెట్టినా, పూర్వకాలం నుండీ మడికట్లల్లో గెనాల మింద సీలుదావ గుండానే జనాలు వొస్తాపోతా వుంటారంట! మా వూరి నుంచీ, మా వూరి పైనుండే శివపురం నుంచీ శింగనమల ఐస్కూలుకు వెళ్లే పిల్లోళ్లు గుడకా గెనాల మింద ఆ సీలుదావ గుండానే పొయ్యొస్తారంట!
ఈ సమాచారమంతా నేను శింగనమల గంజికేంద్రానికి పోబట్టినందుకే నాకు తెలిసింది. ఇరవై దినాల కిందట ఇదంతా నాకు తెలీదు. అంతకు ముందు మా బండమీదపల్లీ వూరి పక్కనుండే ఊరగొండా, ఊరగొండకు దక్షిణవైపుండే వెంకటరమణ స్వామి దేవరకొండా, ఆ రెండు కొండల మధ్య వెళ్లే అనంతపురం తాడిపత్రి రోడ్డూ, దేవరకొండ నుండీ పడమట శింగనమల చెరువు మరవకొమ్మ వరకూ కాళ్లు చాపుకున్నట్లుండే ఢమాం గుట్ట, బోదగుట్టలూ, మా ఊరగొండకు తూర్పు వైపున తాడిపత్రి రోడ్డు పక్కనుండే చక్రాయపేటా, మా పల్లెకు పడమటి వైపుండే పిల్లగుండ్ల గుట్టా, ఊరికి ఉత్తరాన వొనకల గడ్డ (శ్మశానం) దాటినంక మాగాణికి అవతలి వైపున కనిపిచ్చే గోవిందరాయుని పేటా – ఇవి మాత్రమే నాకు తెలును.
బీడుబడిండే మాగాణి భూముల్లో గెనాల మింద కాకుండా గెనాల పక్క నుండే సీలుదావలో వొగరి వెనక వొగరు నడుస్తా మాట్లాడుకుంటా బరువుగా వుండే గంజి ముంతలనూ, క్యారీర్లనూ ఆ చేతిలో నుంచి ఈ చేతిలోకీ ఈ చేతిలో నుంచీ ఆ చేతిలోకీ మార్చుకుంటా అందరూ నడుస్తావుండారు. నేను వాళ్ళమధ్యలో నడుస్తా క్రమంగా ముంత బరువు వల్ల అవస్థ పడసాగినాను. అది గమనిచ్చినాడేమో, వడ్డె పుల్లప్ప కొడుకు సిద్ధప్ప మామ, రోంతసేపు నా గంజి ముంతను తన ఎడమ చేతికి తీసుకొని సులకాగ నడవసాగినాడు.
అందరూ కరువును గురించీ, గంజి కేంద్రాలకు పోయి గంజి పోయిచ్చుకొని వొచ్చి ఇంట్లో తల్లులు, పిల్లలు తాగి కాలం గడిపే గాశారాన్ని గురించీ మాట్లాడుకోసాగినారు. నేను వాళ్లమాటలు వింటా మౌనంగా ఆలోచన చేస్తా నడుస్తావుండాను.
ఇంగా ఎన్నాళ్లు శింగనమల గంజికేంద్రానికి పోయి రావల్లనో! పోయి రావల్లంటే ఆరు మైళ్లు నడచాల్సిందే! మొదట్లో వారం దినాలు బాగా కాళ్ల నొప్పులు. ఆనెంక నొప్పులు తగ్గిపోయినాయి. ఇప్పుడు అలవాటయింది. బీడి మడికట్లల్లో సీలుదావలో ఎక్కడ తగ్గుందో ఎక్కడ మిట్టుందో కాళ్లకు అర్థమైపోయినట్లుందేమో, ఇప్పుడు అడుగులు తడబడేది తగ్గిపోయింది. అనుకుంటావుంటే, కండ్లముందర పోలీసాయన మెదిలినాడు. మొదట రెండు దినాలు పోలీసాయనను చూసి భయపడినాను. ఇప్పుడు భయం తప్పిపోయింది.
పోలీసాయన డ్రస్సు ఎంత విచిత్రంగా వుందో! ఖాకీ అంగీ, ఖాకీ నిక్కరు! కుడిపక్కనా, యెడమపక్కనా ఖాకీ అంగీ రెట్టలపైన గుండీలుండే రెండు చెవులు! అంగీమింద రెండు పక్కలా రెండు జోబీలు! జోబీల పైన పోస్టు కవర్ల మాదిరి గుండీలుండే మూతలు! నిక్కర లోపలికి అంగీని దూర్చి టక్ చేసుకుండాడు. నిక్కర మింద నాలుగేళ్ళ వెడల్పుండే ఎర్రబెల్టు! బెల్టుకు మధ్యలో ఇత్తడి కొక్కీలతో చేసిండే అదేందో బకల్ అంట! ఆ కొక్కీలతో బెల్టును నడుముకు బిర్రుగా బిగిచ్చుకుండాడు! గంజి పెట్టి ఇస్త్రీ చేసిండే తొడల నిక్కరు మడతలు, ముందరా వెనకలా జానెడెత్తు నీలుక్కోని నిక్కబొడుసుకుండాయి! నిక్కర తొడలు అంత లూజుగా వుంటే కూర్చున్నెప్పుడు లోపలుండే ‘సామాన్లన్నీ’ బయటికి కనిపిస్తాయి కదా! కనిపీకుండా వుండల్లంటే నిక్కర లోపల డ్రాయరేసుకుంటారేమో పోలీసోళ్లు!
తలకాయి మింద రోంత నీలం రంగుండే ఎర్రటోపీకి వొగ పక్కన అదేందో జూలుపట్టీ, భలే వుంది! టోపీకి ముందు పక్క సిలవరితో చేసిండే మూడు సిమ్మాల బొమ్మ కరిపిచ్చినారు! టోపీ మధ్యలో అదేందో గోపురం మాదిరిపైకి నిక్కబొడుసుకోనుంది! ఆ పోలీసాయన మూతిమింద బుగ్గమీసాలు ఎంత లావుండాయో! మోకాళ్లకింద, మోకాళ్లదంకా అవేంటివో ఖాకీరంగు గుడ్డలగొట్టాలు బిర్రుగా ఎక్కిచ్చుకుండాడు! కాళ్లకు తొడుక్కోనుండే నల్లబూట్లు ఎంత మందముండాయో! చేతిలో లాఠీ పట్టుకోని, దానికుండే ‘వార’తో తిప్పుకుంటా, బూట్లతో శబ్దం చేసుకుంటా గంజికేంద్రం కాడ తిరుగుతావుంటే మొదటి దినం భయిమయింది!
కరువుగంజి పోస్తా వుండే తలబాల మండపం ఎంత భద్రంగా వుందో! ఎప్పుడు ఎవురు కట్టిచ్చినారో? నాలుగు వరుసల్లో నలభైనాలుగు తెల్లరాతి కంబాలుండాయి. మధ్యలో నాలుగు మూలల్లో నాలుగు నల్లరాతి కంబాలు పెండ్లిమండపం మాదిరి ఎంత అద్భుతంగా వుండాయో! కంబాలపైన పెద్దపెద్ద కాలుబ్బండలు పరిచి, పైనంతా గార యేసి నారంట! ఎన్నేండ్లయినా ఎన్ని వానలొచ్చినా యానాడేగానీ పొటుకెత్తలేదంట! చుక్కనీళ్లు కారలేదంట! కిందంతా కాలుబ్బండలు పరిచినారు. బీదాబిక్కీ పెండ్లిండ్లు చేసుకోడానికీ, పరస్థలం వొచ్చి నోళ్లు తలదాసుకోడానికీ, అడక్కతినేవాళ్లూ, పూసలోళ్లూ, దొమ్మరోళ్లూ అట్లాటోళ్లొచ్చి దిగడానికీ ఆ తలబాల మండపం భలే వుపయోగపడతాదంట! అట్లాటి మండపం పక్కన్నే గాడిపొయ్యి తాగి, గంజి వాండి, వొండిండే గంజి అండాలన్నీ పెట్టుకోడానికీ, వొచ్చినోళ్లందరికీ గంజి పోయడానికీ నడుములెత్తుతో తలబాల మండపం ఎంత బాగుందో!
మనసుతో తలబాల మండపాన్ని చూస్తా, పోలీసాయనను తలచుకుంటా ముందుకు నడుస్తా వుండాను.
‘ఆ పోలీసాయన ల్యాకుంటే ఈ పొద్దు వొట్టి ముంతతో నేను వెనక్కి రావల్సొచ్చేది. అట్ల కాలీ ముంతతో వెనక్కి పొయ్యుంటే జ్వరంతో ముడుక్కోనుండే అమ్మయ్య ఎంత బాధపడేదో! ఇంటికాడ నా కోసరం గంజికోసరం ఎదురు చూస్తావుండే చెల్లెండ్లూ, తమ్ముడూ ఎంత నిరాశపడేవాళ్లో! దీనికంతా కారణం నేను తెల్లవారుజామున లెయ్యకుండా తీరా తెల్లవారినంక లేచి, గోని సంచి తీసుకోని, కొండల సందులో రోడ్డు పక్కనుండే బాటమాన్ల కింద రాలిన వేపాకూ జియ్యాకూ నూక్కోని సంచికెత్తుకోని రావడం ఆలస్యమయినందువల్లనే కదా! ఆకు నూక్కొని వొచ్చినంకయినా గంజి కోసరం బయల్దేరడానికి వీలుగాకపాయ! కొట్టంలో గాటిపాట్న కట్టేసిన దున్నపోతుల్ని పెద్ద చెల్లెలు పెద్దక్క తలుగులు తప్పిచ్చి బయటికి తోల్తాది గానీ, పేడాగసువు పిడికట్టితో నూకి దిబ్బలో వేసి రాలేదు గదా! మొన్నటి దంకా ఆ పని అమ్మయ్యే చేసింది. అమ్మయ్యకు బాగలేనప్పుడు పేడాగసువు ఎత్తేసేపని నేను తప్పా ఇంగెవురు చేస్తారు? పేదింట్లో పెద్దోన్నయి పుట్టినంక ఈ బరువు తప్పదా?’
ఆలోచనల్లో పడి నడిచినట్లే అనిపిచ్చలేదు. పదకొండు గంటలకు వొచ్చే బుడ్డప్పోళ్ల బస్సు హార్న్ వినిపించడంతో ఆలోచనల్లో నుండి బయటపడి అందరితోపాటు ఊరు చేరుకుండాను.
ఇంటి ముందున్న అరుగు మింద గోడకు ఆనుకోని, కాళ్లు చాపుకొని కూర్చున్న అమ్మయ్య, చిన్నోన్ని గదురుకుంటా మూలుగుతా వుంది. వాడు “బువ్వపెట్టు మా” అని ఏడుస్తా వుండాడు. చెల్లెలు పెద్దక్క వాన్ని వోదారుస్తావుంది. మా ఇంటి సందులోకి అడుగుపెట్టిన నాకు అదంతా వినిపిస్తావుంది. పొద్దున్నే, నాతో పాటు తలా రెండు పిడచలు సద్దిబువ్వ తినిండే పిల్లోళ్ళు బాగా ఆకలి గొన్నెట్లుందనుకొని గబగబా ఇంటి లోగిట్లోకి చేరుకుండాను. నా చేతిలోని గంజి ముంతను చూస్తానే తమ్ముడు పెద్దన్న ఏడుపు మానేసి, చీమిడి కారే ముక్కును అంగీ అంచుతో తుడుచుకుంటా దగ్గరికొచ్చినాడు.
“ఒత్తివా నాయినా, రాప్పా!.. ఆకిలి గొని పిల్లోల్లు తనకలాడతాండారు.” అని తాపత్రయ పడతా, అందర్నీ పొంతలో నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొనిరాండని చెప్పింది అమ్మయ్య. చెప్పిందే తడవు సంబరపడతా ముగ్గురూ చేతులు కడుక్కోని వాళ్ల వాళ్ల సిలవరి పళ్లేలు తెచ్చుకోని అరుగు మీద కూర్చుండారు. జ్వరమెట్లుందని అడిగి అమ్మయ్యను గుడకా చేతులు కడుక్కోమని చెప్పి, నేనూ కాళ్లూ, మొగమూ కడుక్కొని వొచ్చి కూర్చుండాను. ముంత మీద మూతబెట్టి, బట్టతో ముంతమూతి బిర్రుగా బిగించుకొని రావడంతో గంజి పూర్తీచల్లారి పోకుండా నులి వెచ్చగా వుంది. పోసినప్పుడు పొగలు గక్కుతా, పల్చగా నీళ్ల నీళ్లగా వుండే గంజి చల్లబడి చిక్కెగా మారింది. సిలవరి గెంటితో తలా నాలుగు గెంటెలు (గరిటెలు) పోసి, నేనూ పోసుకుండాను. కొంచెం సప్పగా వుందని అమ్మయ్య నూరిన ఉప్పు తలా చిటికెడు వేసింది. జ్వరం వొచ్చిన నోటికి, బాగుంటుందని తాను కొంచెం చింతతొక్కు ఊరిమిండి జేసుకుంది.
గోధుమ రంగులో నోరూరించే వాసనతో వుండే గంజిలో వుడికి వుబ్బిండే నూకలు, గుడ్డు గుడ్లు ఇడుస్తావుండాయి. ఇంట్లో అన్నం అయినంక వొంచిన గంజి మాదిరి కాకుండా, ఇది వేరే రుచితో వుండడంవల్ల పిల్లోల్లందరూ లొటకలేసుకుంటా తాగసాగినారు. పళ్లెం నోటికి కరిపిచ్చుకోని తాగడానికి అవస్థపడతా వుండే చిన్నోన్ని చూసి నవ్వుతా అమ్మయ్య, వాడు ఇష్టపడే కంచులోటాలోకి పోసి తాపిచ్చింది. రెండువారాలుగా అలవాటయి రుచి మరిగిన పిల్లోళ్లు ఎంతో ఇష్టంగా జుర్రుకుంటా తాగి, నాలుకల్తో పెదవుల్ని తుడుచుకుంటా, పరమాన్నం తాగినంత సంబరపడ సాగినారు. నాలుగు దినాల నుండి జ్వరంతో చింపిరి తలకాయతో వికారంగా వుండే అమ్మయ్య ముఖంలో కొత్త వెలుగు కనిపిచ్చింది. నా మనసు ఊరటపడింది.
మొండిగోడలు పడిపోయిన మా నివాసం గూడుమిద్దె
ఇసకలో (ఓ,న, మ, లు) తొలిచదువు
మా వూరి నాటు వైద్యుడు రామేవాళ్ల నారాయణరెడ్డి ఇచ్చిండే మాత్తర్ల ప్రభావం వల్ల అమ్మయ్య లేచి తిర్లాడతా వుండడం చూసి సంతోషమైంది నాకు. నారాయణరెడ్డి మామ మంచి వైద్యగాడు. చూడడానికి గోసిపంచ కట్టుకొని రైతు మాదిరుంటాడు. ఆ మామను ఎవురూ డాక్టరని అనుకోరు. చేయిపట్టుకొని నాడిచూస్తానే మనిషిలో యేమి రోగముందో కనిపెట్టేస్తాడని మా వూర్లో అందరూ అనుకుంటారు. మా వెనకింటి జోడోళ్ళ పెద్దకుళ్ళాయప్ప పెదనాయన, దగ్గూ జ్వరంతో చాలా దినాలు ముడుక్కొని వుంటే, ఆ మామ వొచ్చి సూదేసి మాత్తర్లు ఇచ్చినప్పుడు నేను చూసినాను. ఆ తర్వాత రెండు దినాలకే ఆ పెదనాయన లేచి కూర్చుండాడు. అటువంటి మంచి పనివంతుడయిన డాక్టర్ ఆ మామ. మా వూర్లోనే కాదు, ఆ చుట్టు పక్కలుండే చక్రాయ పేట, శివపురం, ఎలిపొలాలు దండిగా వుండే కొర్రపాడు, బోడిగానిదొడ్డి, (ఇప్పటి రోటరీపురం) చెదళ్ల, దంతులూరు, నీలంపల్లి, రెడ్డిపల్లి మొదలయిన పల్లెలకంతా పోయి, ఆ మామ వైద్యం చేసి వొస్తావుంటాడు. అటువంటి నారాయణరెడ్డి మామ, మా అమ్మయ్యకు మంచి మాతర్లిచ్చినంకనే జ్వరం పూర్తీ తగ్గిపోయిందని సంతోషపడతా మధ్యాహ్నం మా పశువుల కొట్టం గోడ నీడ కింద ఈత చాప పరుచుకొని పలకా బుక్కులు చేతికి తీసుకుండాను.
నాలుగో తరగతి బుక్కులు చూస్తానే నేను పొంగి పోయినాను. ఎండకాలం శెలవులు అయిపోతానే నేను నాలుగో తరగతికి పోతానని మా అమ్మయ్య, ఎలకంటి నాగభూషణం పుస్తకాలు మూడుదినాల కిందట్నే ఇప్పిచ్చుకొని వొచ్చింది.
నాగభూషణం, ఎలకంటి చిన్న పాపయ్య రెండో కొడుకు. మా అమ్మయ్య వాళ్లింట్లో పాచి పనులు చేస్తాది. చెరువునిండినప్పుడు వొగ ఎకరా మడికయ్య కోరుకో గుత్తకో పాపయ్యశెట్టి మాకు ఇయ్యలంటే మా అమ్మయ్య వాళ్లింట్లో పాచిపనులు చెయ్యల్సిందే! మా అమ్మంటే పాపయ్యోళ్లకు చాలా నమ్మకం. నమ్మకమే గానీ యానాడూ యేందీ సర్దుకుండే రకం కాదు పాపయ్యోళ్లు. అమ్మ చాలా అభిమానముండే మనిషి! అందుకే యానాడూ చేయి చాపలేదంట! నాకూ అందుకే అమ్మంటే ఎంతో గౌరవం! అట్లాంటి అమ్మయ్య నాకోసరం నాగభూషణాన్ని పాత పుస్తకాలు అడిగిందంట!
నాగభూషణం శెలవులయినంక ఐదో తరగతికి పోతాడు. పైతరగతులకు పోయే వాళ్ల పుస్తకాలు కింది తరగతి వాళ్ళకు అర్ధరేటుకు అమ్ముతారు. అయితే అమ్మయ్య అడుగుతానే నాగభూషణం, వాళ్ళమ్మనడిగి తన పుస్తకాలు ఫ్రీగా ఇచ్చినాడంట, భద్రంగా అట్టలేసిన నాగభూషణం పుస్తకాలన్నీ కొత్తదాండ్ల మాదిరే వుండడంతో నేను కొత్తపుస్తకాలు దొరికినట్ల సంబరపడతా అమ్మయ్య కుట్టిచ్చిన కాకీ బ్యాగులో నుండి వొక్కొక్క పుస్తకంతీసి చూస్తా మురిసిపోయినాను.
నేను చదివిన మూడో క్లాసు పుస్తకాలన్నీ చెల్లెలు పెద్దక్కకు పనికొస్తాయనుకుంటే ఆ పాప ఇసకలో అక్షరాలప్పుడే బడి మానేసింది. అమ్మయ్యకు గుడకా ఆడపిల్లోళ్లు చదువు కుండేది ఇష్టంలేదు.
నేను నాలుగో తరగతి పుస్తకాలు చేతిలో పట్టుకొని, అప్పుడే ఆ క్లాసులో వున్నెట్ల పొంగిపోయినాను. పలకా, బలపమూ, పుస్తకాలూ చేతిలోకి వొచ్చినంక యేదో బలమొచ్చి నట్లనిపిచ్చింది. మూడో తరగతికి వొచ్చినంక అ=అమ్మ, ఆ=ఆవు, ఇ=ఇల్లు ఈ=ఈగ ఇట్లాటి పదాలతో వుండే తెలుగు పుస్తకమూ, డబ్బారేకు చెక్కపలకా, రెండు బలపాలూ కొనిచ్చినాడు మా నాయన. డబ్బారేకు పలక నాకు వొద్దంటే, మార్కాపురం చెక్కపలక కిందపడితే పగిలిపోతాదని, డబ్బారేకు పలక మింద రాసేది అలవాటయినంక మార్కాపురం పలక కొనిస్తామని అమ్మా నాయనా ఇద్దరూ బుజ్జగిచ్చి చెప్పడంతో నేను డబ్బారేకు పలక మిందనే అక్షరాలు రాయడం మొదలుపెట్టినాను. ఆ పలక మింద నేను అక్షరాలు గుండ్రంగా
రాసి చూపిచ్చినప్పడంతా అమ్మా నాయనా మురిసిపోతా, మూడో తరగతి సంక్రాంతి శెలవులు అయిపోతానే నాకు మార్కాపురం చెక్కపలక కొనిచ్చినారు. ఆ పొద్దు భలే సంతోషపడినాను. మార్కాపురం చెక్కపలకా, తలకట్లూ, దీర్ఘాలు, బొమ్మల కింద పదాలు, ఎక్కాలూ, గుణింతాలూ వుండే తెలుగు పుస్తకమూ గుర్తుకు రాగానే అంతకు ముందు ఇసకలో ఓ నామాలు దిద్దిండేదంతా గ్నాపకమొచ్చింది.
***
మా ఇంటి సందుదాటి అవతలికి పోతానే వరట్ట (వరబీజం) రంగయ్యశెట్టి ఇల్లూ, ఆ ఇంటి పక్కనే బురుజూ, అది దాటి కుడిపక్కకు తిరుగుతానే ఎదురుగా వుండే గారమిదే మా వూరి స్కూలు. ఆ పొద్దు నన్ను స్కూల్లోకి చేర్చల్లనుకుండారు మా అమ్మా నాయనా. పొద్దున్నే అమ్మయ్య, మా ఇంటి లోగిలికి పడమటి పక్కనుండే జలాటి బండమీద కూర్చోబెట్టి నా తలకు వేన్నీళ్ళు పోసింది. సిలవరి గిన్నెలో, అంతకు ముందే వడగట్టి పోసిన చవుటి నీళ్ళు తలకాయ మింద పోస్తా కండ్లు మూసుకోమని చెప్పి, తలవెంట్రుకలు రుద్దింది. నేను సరిగా కండ్లు మూసుకోకపోవడంతో చవుటి బురుగు కండ్లల్లోకి పడిందేమో, కండ్లు మంటకెత్తుకుండాయి. నేను ‘అల్లల్లల్లా’ అని అరచబట్టినాను. ఏడిస్తే స్కూల్లోకి చేర్చెల్లేదని అమ్మ బెదిరిచ్చడంతో నేను ఏడుపు బిగబట్టుకొని నీళ్లు పోయిచ్చుకుండాను. అమ్మయ్య మెత్తని పాతచీరతో నా తల తుడిచి, వెంట్రుకలన్నీ ఆరినంక ఆముదం బెట్టి చెక్కదువ్వెనతో క్రాప్ దువ్వింది. ఇంటి పంచ సున్నపుగోడను అరచేతితో రాకి, చేతికంటుకున్న సున్నం పౌడర్ని నా ముఖానికి రాసి, తన చీరకొంగుతో మెత్తగా మెల్లగా తుడిచి, నా చేతికి పగిలిపోయిండే అద్దం ముక్కనిచ్చి “ఇబ్బుడు సూసుకో, సందమామ మాదిరుండావు” అంటా చెంపకు మసిబొట్టు పెట్టసాగింది అమ్మయ్య.
“అమా, నేను పెద్దయినంక తెల్లగయితానా” అని అడిగినదానికి చిన్నగ నవ్వుతా, “బాగ సదువుకుంటే తెల్లగయితావు బంగారు కొండా! అయినా శానా తెల్లగుంటే యెంత యికారంగా వుంటారో ఆ సన్నపాపయ్య కొడుకుల్ని సూసినావు గదా! నా బుజ్జికొండ, సావు నలుపుగా వున్న్యా యెంత సొగుసుగా వుండాడో” అని ముద్దు బెట్టింది అమ్మ. నన్ను బడిలో చేరిపిచ్చల్లని వారం ముందుగానే లాంగ్లాత్ గుడ్డతో కుట్టిచ్చిండే తెల్లంగీ, కాకీ నిక్కరూ తొడిగిచ్చింది అమ్మయ్య. నాకు స్కూల్లో చేరే వరకూ నిక్కరే లేదు. కొత్తగా నిక్కర తోడుక్కుంటానే నాకు గజ్జల్లో యెట్లెట్లో అయితావుంటే స్కూల్ బెల్లు వినిపిచ్చింది. వినిపిచ్చగానే ఉత్సాహం పొంగి వొచ్చింది.
అమ్మా నాయనా నన్ను వెంట బెట్టుకొని స్కూలు దగ్గరికి పిలుచుకొని పోయినారు. అప్పుడు పెద్దయవారు హెడ్మాష్టరు వెంకటస్వామి సార్. మా నాయన పేరు గుడకా అదే? ఆకులు అమ్ముతాడు కాబట్టి, మా వూర్లో అందరూ మా నాయనను ఆకుల వెంకటస్వామి అని పిలుస్తారు. మా అమ్మ కేశమ్మ. మేము స్కూలు దగ్గరికి పోయినాం. బురుజుకు ఎదురుగా స్కూలు! మధ్యలో పదడుగుల సందు! స్కూలుకు దక్షిణం పక్కన అప్పస్వామి శెట్టి వాళ్ళ ఇల్లు! దాని తర్వాత కోట్లో మసూద్ సాబ్ వాళ్లు! ఆ వరుసలో అదే కడానుండే ఇల్లు! సందు గుడకా అంతవరకే! బురుజుకు ఆనుకొని దక్షిణం వైపున అప్పసామి ఇంటికి ఎదురుగా వుండే గారమిద్దె గుడకా అప్పస్వామి వాళ్లదే! స్కూలూ, దానికి ఇరువైపులా వుండే ఇండ్లూ, ఎదురుగా వుండే ఇండ్లూ అన్నీ అంటు మిద్దెలే! గార మిద్దెలే!
బడి పడమటి మొగంగా వుంది. మేము బడి మెట్లెక్కినాం. మెట్లెక్కుతానే మెరుస్తా వుండే రెండు పెద్ద గార స్తంభాలు, స్తంభాల పైన కమాను తిప్పి కట్టినారు. కమాన్ల మింద నుండి తలుపు గోడ మీదికి రెండు బలమైన చెక్క దూలాలు! దూలాల మింద అడ్డంగా చెక్క రీపర్లు! రీపర్ల పైన ఎదురు తడకలు! తడకల పైన వొత్తుగా నారవేప పుల్లలు! పుల్లల పైన గార! గారపైన బంక చవుడు! గారస్తంభాలకూ తలుపులగోడకూ మధ్యలో బెలుం బండల వసారా శుభ్రంగా వుంది. మూడు కమాన్లకు ఎదురుగా బడి తలుపుగోడకు మూడు వాకిళ్లు! మధ్యలో వుండే పెద్ద వాకిలి గుండా మేము బడిలోపలికి పోయినాం. అంతకు ముందు నేను బడి లోపలికి పోయి ఎప్పుడూ చూడలేడు.
బడి ముందరుండే వసారా పైన కమాన్ల మింద నుండీ దూలాలు, అదే వరసలో బడి తూరుపు గోడవరకూ లైనుగా కనిపిస్తావుండాయి. దూలాల కింద రెండు వరసల్లో మూడేసి స్తంభాలు మొత్తం ఆరు స్తంభాలు, పైకప్పు బరువునంతా ఎత్తి నిలుచుకున్నెట్ల కనిపిస్తావుండాయి. శాగబారిన బలమయిన చెక్క స్తంభాల కింద ఇనప పొన్నులు, చౌకంగా పొందేసిన కాలుపుబండల మీద భద్రంగా అని వుండాయి. చివరి మూడోస్తంభం వరకూ పరిచిన నల్లని బెలుం బండలు, పిల్లలు పారాడి పారాడి నునుపు దేలినాయి, చివరి మూడో స్తంభం నుంచి గోడ వరకు ఇంవొగపోసినారు. అందరి కంటే చిన్న పిల్లోళ్లు ఆ ఇసకలో అక్షరాలు రాస్తావుండారు.
దక్షిణం వాకిలికి దగ్గరగా ఉత్తరం మొగంగా చెక్క కుర్చీలో హెడ్మాస్టరు కూర్చొని వుండాడు. ఆయనకు ఎడమ వైపున గోడవారగా చెక్క బెంచీ, కుడివైపున చెక్క పెట్టె, కుర్చీ ముందర చెక్క టేబులూ పాతవయినా భద్రంగా కనిపిస్తావుండాయి.
అంతకు ముందే మా నాయన, హెడ్మాష్టర్ సారుకు పరిచయమయినాడేమో, ఆయన మా నాయనను ప్రేమగా పలకరిచ్చి బెంచీమింద కూర్చోమన్న్యాడు. నాయన కూర్చుండాడు. బెంచీమింద కూర్చోనుండే నాయనను చూసి నేను భలే సంతోషపడినాను. అమ్మయ్య స్తంభానికి ఆనుకొని నిల్చుకుంది. అమ్మయ్య పక్కన నేను నిల్చుకుండాను. హెడ్మాష్టర్ సారు, నాయనను అడిగి విషయం తెలుసుకుండాడు. వెంటనే చెక్కపెట్టెలో నుంచి వొగ పుస్తకం తీసి, కొన్ని పేపర్లు తిప్పి, మా నాయన్ని నా పేరు అడిగినాడు. సవుటి దాసప్పగారి నారాయణ అని మా నాయన నా పేరు చెప్పినాడు. సవుటి దాసప్ప ఎవరని హెడ్మాష్టర్ ప్రశ్న వేసినాడు. అది తన జేజయ్య పేరని నాయన చెప్పినాడు. పుట్టిన తేదీ తమకు గుర్తులేదని, మాఘమాసంలో పెద్దపప్పూరు అశ్వత్థం తిర్నాలప్పుడు పుట్టినాడని, అందుకే ఆ అశ్వత్థ నారాయణస్వామి పేరుకు గుర్తుగా ‘నారాయణ’ అని పేరు పెట్టినామని, ఇప్పుడు అందాజుగా ఐదేండ్లు నిండి ఆరో సమ్మత్సరం నడుస్తా వుండాదని చెప్పినారు అమ్మా నాయనా. కులం ఉప్పర కులం అన్న్యారు. అన్నీ రాసిన పేపర్ మింద నాయనతో బొట్నేలు వొప్పితం వేయిచ్చుకున్నాడు హెడ్మాష్టర్ తప్పిచ్చుకోకుండా ప్రతి దినమూ బడికొచ్చి బాగా చదువుకోవల్లని నాకు చెప్పి, ఇంవొగదగ్గర కుర్చీలో కూర్చోనుండే అయవారు దగ్గరికి నన్ను పంపిచ్చినాడు హెడ్మాష్టర్.
నేను చేతులు కట్టుకొని ఇంవొగదగ్గరుండే చిన్నయవారు దగ్గరికి పోయినాను. నా వెంట మా నాయనొచ్చి “నా పెద్దకొడుకు స్వామీ, సదివిచ్చుకుందామని బల్లేకి యేసినాం” అని ఆయనతో చెప్పినాడు. ఆ చిన్నయవారిది మా వూరే! లక్ష్మినరసయ్య. మా వూరి దేవరకొండ వెంకటరమణస్వామి పూజారి. ఆయన సంతోషపడి మా నాయన ఎదురుగానే నన్ను ఇసకలో కూర్చోబెట్టి నా కుడిచేయి పట్టుకొని బొట్నేలు (బొటనవ్రేలు) పక్కనుండే వేలు తప్పా మిగతా వేళ్లన్నీ ముడుచుకోమని చెప్పి.. చూపిచ్చి, నా వేలుతో ఇసకలో ‘ఓం నమః..’ అని రాయిచ్చి పలికిచ్చినాడు. ఆ ప్రకారంగా మూడుసార్లు పలికిచ్చి ఆ తర్వాత ‘అ ఆ, ఇ ఈ’ లు నా వేలితోనే రాయిచ్చి పలికిచ్చినాడు. నేను భయపడకుండా స్పష్టంగా దిద్దడమూ, పలకడమూ చూసి “నీ కొడుకు చాలా హుషారుగా వుండాడు వెంకటస్వామీ! పిల్లవాన్ని కూలి పనులకు పంపకుండా బాగా చదివిచ్చు” అని మెచ్చుకుండాడు లక్ష్మినరసయ్య సారు. అదంతా చూసి, విని మా నాయన సంతోషపడతా అమ్మయ్యను పిల్చుకొని ఇంటికెళ్లిపోయినాడు.
ఇసకలో ఒగటో తరగతి రెండో తరగతి పిల్లోళ్లు పజ్జెనిమిది మంది వుండారు. ఒగటో తరగతి వాళ్లు వొగవైపు రెండో తరగతి వాళ్లు మరొగవైపు కూర్చుండారు. మా వొగటో తరగతిలో ఆడపిల్లోళ్లు లేరు. రెండో తరగతిలో ఇద్దరుండారు. వొగ పాపపేరు సరోజ, ఎలకంటి పెద్దపాపయ్య కూతురు. ఇంకొగ పాప పేరు రామలక్ష్మి మిషను కుళ్ళాయి మామ కూతురు. మా వాగటో తరగతి పిల్లోళ్లు నాకంటే ముందే బడిలో చేరినారు. అందరూ సాయంకాలం లోపలే జతగాళ్లయినారు.
చిన్నప్పటి నా జతగాడు జానగొండ నారాయణ
బడిలో చేరిన మొదటి దినమే అంతమంది జతగాళ్లయినందుకు నాకు భలే సంతోషమయింది. ఇద్దరు తప్పా మిగతా వాళ్లందరూ మా బండమీదపల్లి పిల్లోళ్లే! కృష్ణారెడ్డిది మా వూరికి ఎగదాలుండే శివపురం. దిగదాలుండే చక్రాయపేట పిల్లోడు ఆది నారాయణరెడ్డి. మా వూర్లో కమ్మోళ్ళు కలికానికి వొగ ఇల్లు గుడకా లేదు. మిగతా కాపోళ్ల, కోమటోళ్ల, శూద్రోళ్ల పిల్లోళ్లతో పాటు మాదిగోళ్ల కుళ్ళాయప్ప గుడకా వుండాడు. సాయంకాలం వరకూ అందరూ వొగింటి వాళ్ళ మాదిరి కూర్చొని ఇసకలో అక్షరాలు దిద్దుకుంటా, అయ్యవారు పక్కకు పోయినంక మాట్లాడుకుంటా, గిచ్చుకుంటా, గిల్లుకుంటా, నవ్వుకుంటా, నవ్విచ్చుకుంటా వుంటే, ఇల్లూ అమ్మా నాయనా, చెల్లెళ్ళూ, తమ్ముడూ, దున్నపోతులూ గుర్తుకే రాలేదు. నాకు. ఆకలి కాలేదు, దప్పికా కాలేదు.
సాయంకాలం హెడ్మాష్టర్ సారు చెప్పుతానే ఐదో తరగతిలో వుండే వన్నూరు రెడ్డిళ్ళ అనుమంతరెడ్డి బడిబెల్లును వొగసారి కొట్టినాడు. కొడతానే పిల్లోళ్లందరూ లేచి నిలబడినారు. ఐదో తరగతి వాళ్ళు ఇద్దరు హెడ్మాష్టర్ సారు టేబుల్ దగ్గరికి పోయి జాతీయగీతం ‘జనగణమన’ పాడినారు. మిగతా పిల్లోళ్లందరూ వాళ్ళు పాడినట్లే పాడినారు. మా వొగటో రెండో తరగతి పిల్లోళ్లకు ఈ పాట సరిగా రాదేమో, గట్టిగా కాకుండా మెల్లగా తప్పులు తప్పులుగా పాడినారు. వాళ్ళ మాదిరయినా పాడడానికి నాకు చాతకాలేదు. పాటంతా అయిపోతానే ‘జైహింద్’ అని అన్న్యారు. అనుమంతరెడ్డి బడి బెల్లును రెండుసార్లు కొట్టినాడు. పిల్లోళ్లందరూ కేకలేసుకుంటా బిలబిలమని ఇండ్లకు పోయినారు.
చెక్కపలకా బలపం
చెక్కపలకా కొత్తపుస్తకాల సంబరంతో, నేను బడిలో చేరి ఇసకలో అక్షరాలు దిద్దుకున్నదంతా గుర్తుచేసుకొని నాలో నేను కాసేపు నవ్వుకొని నాగభూషణం ఇచ్చిన పుస్తకాలన్నిటిపైనా నాగభూషణం పేరు కొట్టేసి నా పేరూ తరగతి పేరూ రాసుకుండాను. పుస్తకాలన్నీ వొగసారి తిప్పేసినాను. లెక్కల బుక్కులో వుండే నెమలీకల్ని చూసి మురిసిపోతా నేను గుడకా శింగనమల దర్గాసాయిబు వొచ్చినప్పుడు రెండు నెమలీకల్ని అడిగి ఇప్పిచ్చుకోని ఆ మాదిరి తెలుగు బుక్కులో పెట్టుకోవలని అనుకుంటా, పుస్తకాలన్నీ మల్లా మట్టంగా కాకీ బ్యాగులో సర్దిపెట్టినాను. చెక్కపలక వొగమూలలో, ములికి వూడిపోయి అల్లాడతా వుంది. నాయన వొచ్చినంక చెక్కపని చేసే మస్తాన్ చిన్నాయన దగ్గరికి పిల్చుకొని పోయి ఆయన్తో పలక నాలుగు మూలల్లో రేకు ముక్కలతో పలక అల్లాడకుండా బిర్రుగా బిగిచ్చుకోవల్లని అనుకుండాను. దానికంటే ముందు, బలపంతో అక్షరాలు రాసినప్పుడు సరిగ్గా అంటని పలకకు కుంటగరగం ఆకూ, బొగ్గు నూరి తయారుచేసిండే చిక్కని రసాన్ని పలకమింద పూస్తే మేలనుకుండాను. అనుకున్న వెంటనే బుక్కుల బ్యాగు ఇంట్లో బెట్టి అమ్మయ్యతో చెప్పి దిగవగేరిలో వుండే ఈడిగోల్ల కొండన్నను, మాదిగోళ్ళ కుళ్ళాయప్పనూ పిల్చుకోని చాకిరేవు గుట్ట బుగ్గకాలవ కాటికి పోయి కాలువగట్లల్లో వుండే కుంటగరగం ఆకును తలాకింత పీక్కొని వొచ్చినాం. అందరమూ మా ఇంటి దగ్గరే నున్నని బండమింద గుండ్రాయితో కుంటగరగం ఆకులోకి నాలుగు బొగ్గులేసి నూరి ఆ పసురంతా టెంకాయ చిప్పల్లోకి యెత్తుకొని మా పలకల మింద చిక్కెగా పూసి గంటసేపు ఆరబెట్టినాం. పలక మింద కుంటగరగం రసమంతా బాగా ఆరినంక, పలకలు గరుకుగా నల్లగా కావడంతో బలపం, బొగు సొగుసుగా అంట సాగింది. తమ పలకలను తీసుకొని ఖుషీగా కొండన్నా కుళ్ళాయప్పా వాళ్లిండ్లకు వెళ్లిపోయినారు.
అప్పటికి సాయంకాలం కావొచ్చింది. బీటిమళ్లల్లో మేయడానికి పోయిండే దున్నపోతులు ఇంగా ఇంటికి రాలేదని అమ్మయ్య దిగులు పడతా చెప్పడంతో, అవి యాడ సచ్చినాయో అని విసుక్కుంటా మైలు దూరంలో గోవిందరాయునిపేటకు దగ్గరగా వుండే మరవంక దగ్గరికిపోయి చూసినాను. యేటి అవతల గోవిందరాయునిపేటోళ్ల ఎనుగొడ్ల (ఎనుముల)ల్లో ఎదకొచ్చిన దాండ్ల వెంటబడి మోరలెత్తి ఎగబారుతా పోతావుండే మా దున్నపోతుల్ని గుర్తుబట్టి, కడుపునిండా తిండిలేక పోయినా దీండ్లకెంత కొవ్వు, ఎదకేసుకొని పోతావుండాయి? అని గొనుక్కుంటా పరుగెత్తిపోయి మా దున్నపోతుల్ని వెనక్కి మల్లగొట్టి ఇంటికి తోలుకోనొచ్చి పసుల కొట్టంలో గాటిపాట్న గుంజల తలుగులతో కట్టేసి, గాట్లోవుండే నలీనట్రా వూడ్చి గాటిపాల్లో విదిలిచ్చినాను. పొద్దున్నే బాటమాన్లకింద వూడ్చుకొని వొచ్చిన జియ్యాకూ వేపాకూ దున్నపోతుల కింద పరిచినాను.
చిన్న పాపయ్యోళ్ల ఇంటి పనికిపోయిన చెల్లెలు పెద్దక్క ఇంగా రాలేదు. అమ్మయ్య పాలుమాలి పండుకోవడంతో మూడు దినాల్నుండీ పాపయ్యోళ్ల ఇంటిపనికి పెద్దక్కే పోతావుంది. ఆ పాప ఇంటికాడ వుంటే సందకాడ ఇంటి ముందర కసువులూడ్చి నీళ్లు చల్లి కడప్మాను తుడిచి ఇంటి ముందర ముగ్గు పెట్టేది. బుడ్డీదీపం గ్లాసు తీసి ముగ్గు పిండితో రుద్ది పొడిబట్టతో తుడిచి దీపం ముట్టిచ్చేది. పాపయ్యోళ్ల ఇంట్లో పనంతా ముగిచ్చుకొని పెద్దక్క ఇంటి కొచ్చేసరికి చీకటి పడతాదని ఆ పనులు రెండో చెల్లెలు వెంకటలక్ష్మికీ, నాకూ చెప్పింది అమ్మయ్య.
దినామూ సాయంకాలం వూరిబయటుండే దొడ్లోకి పోయి గడ్డివామిలో నుండి రెండు వరిగడ్డి కట్టలు మట్టంగా తీసుకోనొచ్చి కొట్టం గోడ పక్కన వెయ్యడమూ, అందరూ బువ్వలు తినేదంతా అయిపోయినంక ఆ గడ్డకట్టలు దున్నపోతులకు గాట్లో వెయ్యడమూ నా డ్యూటీ. నేను దొడ్లోకి పోయి గడ్డి తెచ్చినంక బుడ్డీదీపం గ్లాసు తుడుస్తానని అమ్మతో చెప్పి దొడ్డికాటికి పోయినాను.
మా గడ్డి దొడ్డి మాదే సొంతం! గుట్టకింద మడి ఆసామి సీతయ్యతో మా నాయన ఆ దొడ్డిని కొనుకుండాడంట! అయితే దానికి సంబంధించిండే రిజిష్టర్ పత్రాలూ గిత్రాలూ ఏమీ లేవు. ఐదు రూపాయలకు కొన్న్యాడంట! అది గుడకా రెండు దఫాలుగా ఇచ్చి తెల్లపేపరు మింద రాయిచ్చుకుండాడంట! ఆ పేపరయితే ఇంట్లో చెక్క పెట్టె అడుగులో వొగ తిత్తిలో వుండేది నేను చూసినాను.
దొడ్డి అంటే అది దొడ్డి మాదిరి లేదు. మా వూర్లోనుండి శింగనమలకు పోయే దావలో ఉద్దిబండమీద నుండి కాలవ దాటుతానే ఎడమ వైపున వుండే ఐదు సెంట్ల స్థలం. అంతా బయలు స్థలమయితే బాగుండేది. చిన్న గుట్టలో సగభాగంలో వుండే పెద్ద గుండ్లు, గుడ్ల పక్కన కాలువ హద్దుగా వుండే మూడు సెంట్ల స్థలం! అందులో వొగ మూలన శింగనమల దావ వారనే ఎరువు దిబ్బ కోసరం తవ్వుకోనుండే గుంత! గుట్టకు పక్కనే ఉత్తరం వైపున సీతయ్య మడి!
నసుకయితే పురుగూ బుట్రా కనిపీవని నేను బిరబిరా మా దొడ్డి కాటికి బయలు దేరినాను. కాలువ ఇవతలి వైపున్న దొడ్లమధ్యలో వంకదారిలో పోతావుండాను. ఉండే ఆ దారిలో గుడకా ఏటవాలుగా హెచ్చు తగ్గులుండే పెద్ద బండ! ఏ మాత్రం యామారినా తొట్రుకొని కింద పడక తప్పదు! యావూరి దగ్గరా వొగ పల్లెనుండి మరొగ పల్లెకు పోయే దారి ఇంతద్దుమానంగా వుండదేమో! వంకదారిలో వుండే బండ దాటగానే దారికి పడమటి వైపున నామదారుల గోరీలు తూర్పు వైపున మోడోళ్ళ గోరీలూ! గోరీలన్నీ కాలువకు ఇటువైపునే! కాలువ ఉద్దిబండ దాటగానే ఇరుక్కంతు! ఇరుక్కంతు దాటుతానే సీతయ్య మడితో మాగాణి ప్రారంభమయితాది.
నేను కాలువ ఉద్దిబండ దాటి ఎడమవైపుండే మా దొడ్లోకి అడుగు పెట్టినాను. ఇరుక్కంతు దగ్గరుండే కల్లమండ తీసిన అలికిడి వినిందేమో గడ్డివామి పక్కన పడగ విప్పి బుసకొడతావుండే నాగుపామూ, దాన్ని ముందుకు కదల నీయని ముంగిసా రెండూ సరసరా వెళ్లిపోవడం చూసి నా గుండెలు చల్లగయినాయి. ఇంతకు ముందు గుడకా మూడు, నాలుగుసార్లు మా దొడ్లో నాగుపాముల్ని చూసినప్పడల్లా గుండెలు జల్లుమనేవి.
దొడ్డి చుట్టూరా అంతా చిదుగే! అందుకే నసుకయినంక నేను దొడ్లోకి పోను. పాము కనిపిచ్చినప్పుడల్లా అమ్మయ్యకు చెప్పుతా వుంటాను. అది విన్నప్పుడల్లా అమ్మయ్య నాయనను అంటుకుంటాది. ‘నీకు యింగ్యాడా దొడ్డే దొరక్కపాయనా! పొయి పోయి గోరీలకాడ కొని, ‘మా దొడ్డి మా దొడ్డి’ అని మురిసిపోతాంటావు, సంబడం! ఎవురికయినా యిత్తగిల్సి కొల్లబెట్టు! అదురుట్టం బాగుండబట్టి సరిపాయ, ల్యాకుంటే, సేతికొచ్చిన పిల్లోడు పొరపాట్న గడ్డివామి దెగ్గిర యామారింటే యేమయ్యిండేది, అని రెండు, మూడుసార్లు చెప్పింది. చెప్పినప్పుడల్లా నాయన యాదో వొగ పిట్టకత చెప్పి చివర్లో యేదాంతం వివరిస్తాడు. అది నాకు అర్థమయ్యేది కాదు.
గతంలో కనిపిచ్చిన పాములనూ, ఇప్పుడు కనిపిచ్చిన పామూ ముంగిసలనూ మనసులో అనుకుంటా గబగబా రెండు గడ్డికట్టల్ని వామిలో నుండి మట్టంగా పీకి, నెత్తి మిందపెట్టు కొని, రెండేండ్ల కిందట పదిబారల పొడవుతో వేసిండే గడ్డివామి ఇప్పుడు బారెడంత గుడకా లేదని, అంతా అయిపోయినంక దున్నపోతులకు మ్యాత యెట్లనో నాయనతో చెప్పల్లని ఆలోచిస్తా ఇల్లు చేరుకుండాను.
అమ్మయ్య బాధపడతా, చెల్లెలు వెంకటలక్ష్మిని తిడతా వుంది. అరుగు మీదంతా వులకబోసిన గబ్బునూనె (కిరసనాయిల్) వాసన గుప్పు మంటా వుంది. ఈ పొద్దుటికి తగ్గట్టు సీసాలో వుండే గబ్బునూనెనంతా వెంకటలక్ష్మి పొరపాట్న ఉలకబోసినందుకు అమ్మయ్య చెల్లెల్ని తిడతా వుందని తెలుసుకొని సర్దిచెప్పి, వరట్ట రంగయ్య అంగట్లో అప్పుకింద కాల్లీటరు గబ్బునూనె పోయిచ్చుకొని వొచ్చి దీపం బుడ్డీలోపోసి గట్టిగా బిరడాతిప్పినాను. మసిబారిన బుడ్డీ గ్లాసును ముగ్గుపిండితో తిక్కి శుభ్రం చెయ్యల్లని చూస్తే, రవంతుండే ముగ్గుపిండితో ముగ్గేసినానని, ముగ్గుపిండి అంతా అయిపోయిందని చెప్పింది చెల్లెలు. పసుల కొట్టంలోకి పోయి కొంచెం ప్యాడ తెచ్చి దానితో జాగ్రత్తగా బుడ్డీగ్లాస్ లోపలా, బయటా తిక్కి నీళ్లతో కడిగి పొడిబట్టతో తామంతా తుడిచి, దీపం బర్నల్తో వొత్తిని పైకెక్కించి, కొడిగట్టిండే వొత్తినంతా నలిపి మళ్ళీ కిందికి దించి, పొగ సూరకుండా ఆల్తిగాపెట్టి, బుడ్డీగ్లాసును బిగిచ్చినాను. అక్కడికి దీపం బుడ్డీ పనంతా పూర్తయింది.
పొద్దు మునుగుతా వుంది. ఎండకాలమయినందువల్ల ఇంకా చీకటి ముసురుకోలేదు. పొద్దు మునిగిన కాసేటికే చలికాలంలో చీకటి ముసురుకోవడమూ ఎండకాలంలో చాలా సేపు వెలుతురుండడమూ ఎందుకో తెలుసుకోవలని అనుకుంటా కాళ్లూ, మొగమూ కడుక్కుండాను. అంతలోనే పెద్దక్క వొచ్చింది. పాపయ్యోళ్లు పెట్టినారని వొగడబ్బా శేర్లో తెచ్చిన నూకలు చాటలో పోసి అమ్మయ్యకు చూపిచ్చింది. అమ్మయ్య సంతోషపడతా దాండ్లల్లో వుండే వూదర్లనూ చిన్నచిన్న మట్టి పెల్లలను వేరేసి, చాటను మెల్లగా ‘నేమి’, నూకల్లో వుండే చిన్న యిసకనంతా వేరుచేసింది. ఇంకా రాయీ, రప్పా లేకుండా వొగ సిలవరి గిన్నెలో నీళ్లు పోసి గాలిచ్చి, పెద్దక్కను కుండలో యెసురుపెట్టి పొయ్యి అంటిచ్చమని చెప్పింది. కొట్టం పడమట గోడ పక్కనుండే కట్టెల మండీ దగ్గరికిపోయి రెండు కందిపుల్లలూ, నాలుగు జెముడు కట్టెలు తెచ్చింది వెంకటలక్ష్మి పొయిలోకి కందిపుల్లలూ రెండు జెముడు కట్టెలూ పెట్టి, పొయ్యి అంటిచ్చడానికి అగ్గిపెట్టె తీసింది పెద్దక్క. అందులో అగ్గిపుల్లలు లేవు. అగ్గిపెట్టె ఖాళీగా వుంది. అది చూసి అమ్మయ్య బరువుగా నిట్టూర్చి “యేం బతుకులో యేమో!” అని కొంచెంసేపు గొనిగి, ఇంటెనకుండే నాగమ్మక్క వాళ్లింట్లో రోంత అగ్గి ఇప్పిచ్చుకొని రాపొమ్మని కంచుగెంటి పెద్దక్క చేతికిచ్చింది. చీకటిపడతావుంది, వాళ్లు అగ్గినిప్పులు ఇస్తారో లేదోనని అనుమానపడతా వెళ్లి సంతోషపడతా గెంటినిండా అగ్గినిప్పులు తెచ్చింది పెద్దక్క.
పడిపోయిన మా ఇల్లు
పొయ్యి అంటిచ్చినారు. వొగ అరగంటకల్లా నూకలగంజి తయారయితాదని అంతదంకా చిన్నోన్ని యెత్తుకొని బజార్లోకిపోయి ఆట్లాడిచ్చుకొని రమ్మని చెప్పింది అమ్మయ్య. ఏడుస్తావుండే తమ్ముడు పెద్దన్నను సంకలో ఎత్తుకొని బజారువైపు పోయినాను.
ఏడ్చినప్పుడల్లా వాన్ని సంకలో ఎత్తుకొని బజారువైపు పోయి వాని ఏడుపు మానిపిచ్చి ఆడిచ్చడం నా డ్యూటీగా మారింది. వాన్నేకాదు, వెంకటలక్ష్మిని గుడకా మొన్నటి దంకా సంకకెత్తుకొని చావిట్లోకిపోయి ఆడిచ్చినాను. వాళ్ళను ఎత్తుకొని ఎత్తుకొని తిప్పడంవల్ల నా నడుము మింద నల్లగా కాయలు కాసినాయి. ఇప్పుడు పెద్ద చెల్లెలు పెద్దక్క పెద్దదయింది కాబట్టి నాకు రోంత పనిబరువు తగ్గినట్లయింది.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
