[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
గర్భవతులకు రెండు కూల్లు (కూలి+లు)
మాగాణి కింద వరికోతలు ప్రారంభమైనాయి. మా పాపయ్యోళ్ల మడి కోయడానికి వొప్పందం వొప్పిచ్చినాం. ఎకరాకు పదైదు కూల్లు! వొగ కూలి అంటే మూడుముంతల (12 శేర్లు) వడ్లు. పదిమందే వొచ్చినా, ఎకరా మడికోసి, కట్టలు కట్టి, కల్లంలోకి చేర్చి కుప్ప వెయ్యల్ల. వేస్తే వొప్పందం ప్రకారం పదైదు కూల్ల వడ్లు కొలిచెయ్యాల్సిందే! కూలి పెట్టి కోయిస్తే రెండెకరాల మడికోసి, కల్లంలో కుప్ప వెయ్యడానికి కనీసమంటే ముప్పైమంది కూలీలు కావల్ల, వాళ్లయినా అంతా కోస్తారో లేదో తెలియదు. వరిమడి అంతా కిందికి వొగిందని, పైరు విపరీతంగా వుందని, కోతకు పోయినప్పటి నుంచీ గొనుగుతా సరిగా మడి కోయరు. వాళ్లు సరిగా మడికోసినా కోయకపోయినా, సాయంత్రం యాలపొద్దు అయితానే వరి వోదులన్నీ అట్లే మడిలోనే వదిలేసి, పైకి లేస్తారు. కూలీయేమో రెండు ముంతల (8 శేర్లు) వడ్లు కొలిచెయ్యాల్సిందే! అందుకే రైతులు వరి కోయడానికి వొప్పందానికే ఇస్తారు. మా చెరువు మాగాణి కింద అన్నిచోట్లా ఇదే పద్ధతి.
మా మడి కోసేకి రామేవాళ్ళ రామక్క గుంపు, వొప్పందం చేసుకుంది. ఆ గుంపులో మా అమ్మయ్య కూడా వుంది. వరికోతలు ప్రారంభమై అపుడే వారం దినాలయింది. అమ్మయ్య ఐదారు నెలల నిండుమనిషి. అందుకే నాయన అమ్మయ్యను వరికోతలకు పోవద్దని చెప్పినాడు. నాలుగు గింజలు కూడబోసుకుండే కాలం, వరి కోతకు పోకుంటే యెట్ల? గర్భమో, గిర్భమో యేమయితే అది అయితాదిలే అని అమ్మయ్య నాయన మాటలు వినకుండా వరికోతలకు పోబట్టింది. నాకయితే చాలా బాధయింది. రెన్నాళ్లు బడి మానేసి వరికోతలకు పోదామని పిచ్చింది నాకు. అయితే నాకు ఇంగా సరిగా వరిమడి కోసేకి రాదు. వొప్పందం గుంపులో కాకుండా కూలికయినా పోదామనుకుంటే రైతులెవురూ నన్ను కోతపనికి పిలుచుకోరు. అందుకే వరిగడ్డి తొక్కిచ్చే పడుగు మీద, బంతులు తిప్పే దానికి దున్నపోతులు తోలుకోని పోతావుండాను.
మూడు మూడు పశువుల్ని వొగబంతి లెక్కన మూడు నాలుగు బంతులు పడుగు మింద తిప్పల్ల. పశువులు బంతి తిరుగుతా, మాటిమాటికీ ప్యాడవేస్తాయి. ఆ ప్యాడను పడుగు మింద పడనీయకుండా కొంచెం గడ్డితీసుకొని చుట్టచుట్టి పశువుల ముడ్డిదగ్గర పట్టుకొని, బంతి తోలుతా వుండల్ల. అవి ప్యాడ వేస్తానే దాన్ని బయటవేసి రావల్ల! కొన్ని పశువులు వొక్కొక్కసారి ప్యాడ పుర్రు పోస్తాయి. అప్పుడు అదంతా కారుతాది. దాండ్ల తోకలకంతా అంటుకుంటాది. అట్లాటి తోకల్ని పశువులు విదిలిస్తాయి. విదిలిచ్చినప్పుడు బట్టలకంతా ప్యాడపుర్రు చిట్లుతాది. బట్టలన్నీ గబ్బుగబ్బయితాయి. అప్పుడు చూడల్ల, బంతులు తిప్పే మా పిల్లోళ్ళ మొగాలు! ‘తూ..తూ..తూ..!’ అనుకుంటా, అసహ్యిచ్చుకుంటా, వొగర్ని చూసి వొగరు నవ్వుకుంటా పయిటాలదంకా బంతి తోలితే కాడి దున్నపోతులకూ, మనిషికీ కలిపి మూడు తవ్వల వడ్లు కూలి! సాయంత్రం వరకూ అయితే నాలుగు తవ్వలు కూలి.
ఢిల్లీభోగాల వడ్లగడ్డి పడుగుల మింద బంతి తిప్పే పనయితే నాకు భలే ఇష్టం. ఎందుకంటే, కూలిగింజలు, ఢిల్లీభోగాల వడ్లే! గడ్డి తొక్కుడు గింజలు, ఏమంత బాగుండవు. అయినా ఢిల్లీభోగాల వడ్లు అని సంతోషం నాకు.
దిగవ మోతలగడ్డ మళ్ళకంతా వొక్కటే కల్లం గడ్డ. ఆ గడ్డమీదే మూడు కల్లాలు. వొగ కల్లంలో నేను బంతి తిప్పేకీ, ఇంకొగ కల్లంలో పెద్దక్క, పడుగు పీకేవాళ్లు కట్టేసే వరిగడ్డి కట్టల్ని ఎత్తుకొని పగ్గం దూరం పోయి, సామెన్లుగా వేసొచ్చేకి ఇద్దరమూ వొగే గడ్డమీదే వుండాం. ఆ కల్లం గడ్డమీదనే ఇంకొగపక్క బోయ చెన్నప్పోళ్ల పెద్దమడి కల్లం. ఆ మడికోసేకి రామక్కత్తోళ్ళ గుంపులో మా అమ్మయ్య గుడకా వొచ్చింది. మధ్యాహ్నానికంతా చెన్నప్పోళ్ల మడికోసి, వోదులన్నీ కట్టలు కట్టేది అయిపోయింది. అదంతా నేను గమనిస్తావుండాను. అంతవరకూ అమ్మయ్యకు, పని బరువనిపించదు. మడికయ్యల్లో నుంచీ వెన్నులతో వుండే వరిగడ్డి కట్టల మోపు ఎత్తుకొని గెనాల మీద అంత బరువు మోసుకుంటా రావడం కష్టం! అమ్మయ్య అంత బరువైన మోపుల్ని యెట్ల మోసుకొని వస్తాదో యేమోనని నేను దిగులు పడతా, బంతి తోలుతా దూరంగా వుండే అమ్మయ్య పక్క చూడసాగినాను. రామక్కత్త ఏమి చెప్పిందో యేమో, అమ్మయ్య ఆడే మడిలోనే, గెనం మీద కూర్చుంది. మోపులెత్తుకొని వచ్చే వాళ్ల నెత్తి మీదికి వరికట్టలేస్తా కూర్చుంటా వుంది. అది చూసి నాకు చాలా సంతోషమయ్యింది.
పయిటాల అయ్యింది. మా కల్లాల్లో బంతులిడిసినాం. పడుగు పీకేవాళ్లు పీకి గడ్డిని విదిలించి. కట్టలు కట్టేసినారు. పడుగుల కింద వడ్లు దండిగా రాలినాయి. ఢిల్లీభోగాల వడ్లు కుప్ప కొట్టేటప్పుడు, వరికంకుల్లో నుండి సరిగ్గా గింజలు రాలవు. ఆ వడ్ల రకమే అట్లంట! అందుకే మూడు నాలుగు దినాలు కుప్పను ముగ్గేస్తారు (ముగ్గ బెడతారు). అయినా రాలవు? కుప్పగొట్టిన గడ్డిని పడుగుకేసి, నాలుగైదు బంతులతో చాలాసేపు తొక్కిస్తారు. అట్ల తొక్కియ్యడంతో పడుగుల కింద వడ్లు బ్రమ్మాండంగా రాలినాయి. పెద్దోళ్ళు అన్నీ తూరుపు పోసినారు. వొక్కొక్కరికి రెండు ముంతల వడ్లు (8 శేర్లు) కూలి కొలిచేసినారు. పెద్దక్కకు మూడు తవ్వల వడ్లు కూలి.
మేము కూలి గింజలు వేయించుకుండే సరికి అమ్మయ్య వాళ్ళదీ మోపులు మోసేదంతా అయిపోయింది. మడికోసిన కూలోళ్ళకు తగ్గట్టు, మొగోళ్ళు వరికట్టల్ని రాలగొట్టినారు. రాలిన వడ్లన్నీ వెండిగింజల మాదిరి తెల్లగా చాలా అందంగా కనిపిచ్చసాగినాయి. తూరుపు పోసిన వడ్లను రాసిగా చేసి మొక్కోని, వొప్పదం ప్రకారం వొక్కొక్కరికి మూడు ముంతల వడ్లు (12 శేర్లు) కొలిచేసినాడు చెన్నప్ప. అమ్మయ్య నిండుమనిషి అని రెండుకూల్లు (ఆరు ముంతలు 24 శేర్లు) కొలిచేసినాడు. అదిసూసి నేను సంబరపడతా అబ్బురపోయినాను. దినామూ అమ్మయ్య కూలిగింజలు ఎందుకు ఎక్కువ తెస్తావుందో అర్థమైంది నాకు. అమ్మయ్యకు వొక్కదానికే కాదు, రాయలసీమలో అన్నిచోట్లా పల్లెల్లో పంటకోతలకు పోయిన నిండుమనుషులందరికీ (గర్భవతులకు) రెండుకూల్లు వేస్తారని తెలిసి నేను ఆశ్చర్యపోయినాను. ఎంత మంచి పద్ధతి ఇది. పల్లెలోని రైతాంగం, ఆడోళ్ళ విషయంలో ఎంత మంచిమనుషులు!
మనసులో అనుకుంటా, మురిసిపోతా, అమ్మయ్య కూలిగింజలూ, నా కూలి గింజలూ అలాద అలాదాగా రెండు మూటలు కట్టుకోని అన్నీ నేను నెత్తిమిందెత్తుకుండాను. ముగ్గురమూ కూలోళ్లతోపాటు ఇంటికి బయలుదేరినాం. రెండో చెల్లెలు వెంకటలక్ష్మి మాకు ఎదురొచ్చి, మా వెంట దున్నపోతుల్ని ఇంటికి తోలుకోని వొచ్చింది.
ఇంట్లో కూలిగింజల రాసి చూసి నాకు పరమానందమయ్యింది. ఇంకా మాగాణి కింద కొయ్యాల్సిన మళ్లు సగం వుండాయి. అప్పడే కూలిగింజలొడ్లు సుమార్గ ఐదు మూటలయినాయి. అందులో రెండు మూటలు ఢిల్లీభోగాలు, మిగతావి కేసరొడ్లూ, సన్నొడ్లూ వొంకొడ్లూ! ఇంకా యెట్లలేదన్యా, మూడు మూటలు జమయితాయి! ఇంట్లో నలుగురు మనుషులు వరికోతలకు దినామూ పోతే పదీపన్నెండు మూటల బత్తెంగింజలు జమ జేసుకోవచ్చు! వానలొచ్చి చెరువు నిండితే సొంతభూమి లేకపోయినా, కూటిగింజలకు ఇబ్బంది వుండదు. కాలం ఇట్లుంటే ఎంత బాగుంటాది!
మొన్న మా మడి కోయిచ్చినాం. కుప్ప బ్రమ్మాండంగా పడింది. దినాము రాత్రి కల్లంలో కుప్పమింద పండుకుండేకి నేనూ పాపయ్య పెద్దకొడుకు వెంకటస్వామీ పోతావుండాం. మొదటి దినం అంతలేదు గానీ, రెండోదినం రాత్రి కుప్పమింద పండుకోనుంటే, కుప్పలో నుంచీ వెచ్చగ ‘ఆయి’ వొచ్చింది. బయట చలి వున్న్యా, వెచ్చని ఆయికి భలే నిద్రపట్టింది. మూడవనాడు రాత్రి పదిగంటలు నుండీ కుప్పగొడతారు. కుప్పగొట్టే వాళ్లందరికీ అమ్మయ్య ‘పాసికం’ (బియ్యమూ, బెల్లమూ వేసి వండిన గట్టి పాయసం) చేసింది. అందరమూ కల్లం కుప్ప మింద కూర్చోని పాయసం తిన్న్యాం. ఆకాశంలో ‘గొరుకొయ్యలు’ నన్నెత్తిమీదికి రాకముందే కుప్పగొట్టేకి మొదలు పెట్టినారు. కుప్పగొట్టేది అంతా అయిపోయే సరికి తొలికోళ్ళు కూసినాయి. వడ్లన్నీ మదిరగట్టినారు. వడ్లు బ్రమ్మాండంగా రాలినాయని ఈ రకంగా యెవురివీ రాలలేదని మూడుపుట్లకు తక్కువేమి కావని కుప్పగొట్టినోళ్లు అంటావుంటే నేను పొంగిపోయినాను.
తెల్లారినంక ఆయగాళ్లకు తీసిపెట్టిండే వడ్లకట్టలు మట్టంగా నాయన పక్కకు తీసిపెట్టినాడు. కుప్పగొట్టిన గడ్డిని పడుగులకేసి, బంతులతో తొక్కిచ్చి, వడ్లన్నీ తూరుపు పోస్తావుంటే మాదిగోళ్ల వెట్టి ఓబన్న చిన్నాయన, నెత్తిమింద గోనిసంచిని కొప్పిరి వేసుకొని పిడికట్టతో ‘దండికట్టు’నంతా (తాలూ, తరకా) పక్కకు నూకసాగినాడు ఆ చిన్నాయన. గట్టిగింజలన్నీ దండికట్టులోకి నూకేస్తా వుండాడని మడి షావుకారి పాపయ్య గొడవ జేసినాడు. “ఇంత కల్లం వొడిపితే యెట్టోనికి తూమెడు వడ్లన్నా వొద్దా సావుకారీ,” అంటా ఓబన్న గొనిగినాడు. నాయన సర్దిచెప్పి వొగ తూమెడన్ని వడ్లు యెట్టోనికి వుండేటట్లు చేసినాడు. వడ్లన్నీ రాసికి యెగేసినాడు యెట్టాయప్ప. రాసిమింద వొగ జిల్లెడు రెమ్మా కొడవలీ చెక్కి, నాయన రాసి చుట్టూరా తిరుగుతా, రాసికింద దేవుని గీతగీసినాడు. వడ్లు కొలిసేకి వొంగుతా మూడు పెద్ద దోసెండ్లనిండా వడ్లు వొగ చాట్లోకి పోసి ఆ చాటను వడ్లరాసికి అవతల వైపున పెట్టమని నాచేతికిచ్చినాడు. నేను నాయన చెప్పినట్ల చేస్తానే, నాయనా ఇంకా ఇద్దరు మొగోళ్లూ కాగుతోవడ్లు కొలుస్తా సంచుల్లోకి పోయసాగినారు, మొత్తం ముప్పై ఎనిమిది మూటలు అయినాయి. నీరుగట్టోనికీ, చాకలోళ్లకూ, మంగలోళ్లకూ, మ్యార కొలిచేసినాడు నాయన. అడుగూ బడుగున ఇంకా వొగ మూటకు పైగానే వుండాయి.
ఆయగాళ్ళు వొక్కొక్కరు వస్తా వాళ్లకు తీసిపెట్టిన వడ్లకట్టల్ని కాలితో నలగదొక్కి రాలిన వడ్లను తీసుకోనిపోతా వుండారు. దేవరకొండ దాసప్ప వడ్లరాసి వెనకల పెట్టిన మాన్నెం గింజలు సంచిలో పోసుకుండాడు. ఆయగాళ్ళకు తీసిపెట్టిన వడ్ల కట్టలు చాలా పెద్దవి తీసిపెట్టినారని పాపయ్య గొనుగుతా నాయనను దండిచ్చడం చూసి నాకు భలే కోపమొచ్చింది. “ఆయిగాళ్ళకు ఇచ్చే ఆ నాలుగ్గింజలే మనకు తక్కవయితాయేమయ్యా? దేవుడు సల్లంగ చూసినాడు, మంచి పంట పండిందిలేయ్యా,” అని అమ్మయ్య అంటానే నోరు మూసుకుండాడు పాపయ్య. ఆయగాళ్ళూ, వడ్లు మోసేకి వొచ్చినోళ్లూ అందరూ, మావూరి మాగాణి అంతటి పైకీ మా మడే పెద్ద పంటయ్యిందని, రెండెకరాల్లో మూడు పుట్ల (పుట్టి=20 తూములు, తూము= 64 శేర్లు) వడ్లు అంటే చిన్నసంగతి కాదని అబ్బురపోతావుంటే పాపయ్య ఇంకేమీ మాట్లాడలేక నిజమేనంటూ సంతోషపడినాడు. నాయన పాపయ్యను అడిగి, రాసి కింద మిగిలిన గింజల్ని భజన చెన్నప్పకూ, ఆజీపీర్ల పకర్దీనుకూ, ఆసాదోళ్లకూ, ఉలిగమ్మకూ తలా చాటెడు వాళ్ళ దుప్పట్లోకి పోసినాడు. ఇంగా మిగిలిన వడ్లల్లో సగం తమ భాగంలోకి కొలిచేయమన్న్యాడు పాపయ్య.
“మూడు దినాల్నుండి, ఇంటందరమూ కల్లాన్ని సూపెట్టుకొని వుండాం గదయ్యా, రాసి కింద మిగిలిండే ఈ నాలుగ్గింజలే నీకు తక్కవైతాయా” అని అమ్మయ్య దీనంగా అడిగింది. ఆట్ల అడగడం నాకు నచ్చలేదు. కూలోళ్లకూ, ఆయగాళ్లకూ అన్నీ పోనూ మిగినవన్నీ చెరి సగమే కదా! మిగిలినవి వొగ తూమెడుంటాయా? వుంటే, అందులో ముప్పయిరెండు శేర్లు మావే కదా! ఇంక ముప్పైరెండు శేర్ల వడ్ల కోసరం అమ్మయ్య అంతగా ప్రాధేయపడల్లనా? అమ్మయ్యకు అవి వొకనాటి కూలిగింజలే కదా! బ్రమ్మాండమైన పంట పండిచ్చినారని ఆయనే సంతోషంగా ఆ అడుగు గింజల్ని వొదిలెయ్యల్ల, అట్లాది, వొదిలెయ్యకుండా యెంత లేకిగా దాండ్లను గుడకా ఆశిస్తా వుండాడీయన! యెంతైనా వడ్డీ వ్యాపారం చేసుకుండే కోమటోళ్లు గదా!
అలోచనచేస్తా బాధపడసాగినాను. అంతలోనే పక్క కల్లంలో వుండే లింగనపల్లి చెన్నారెడ్డి చిన్నాయన వొచ్చి “కాదు పాపయ్యా! ఆ నిండుమనిషి నోరిడిసి అడుగుతా వుందనేది గుడకా ల్యాకుండా, రాసికింద మిగిలిండే ఆ గింజల్ని గుడకా ఆసిత్తాండావా? మీ కోమటోల్ల బుద్ధి యాటికి బోతాది? నీ మడి యానాడన్నా యింత పంట పండిండెనా? ఇంటందరూ యెంత కట్టపడింటే యింత పంట పండిండల్ల? రైతుల మింద రోంతన్నా దయవుండల్లయ్యా బూమొగటే నీదిగానీ, యిత్తనాలొడ్ల కాట్నుంచీ సరువమూ కోరుకు చేసిండేవాల్లే పెట్టుకుండారు గదా! కడాకు పంటలోనే గాదు, గడ్డిలో గుడకా సగభాగం తీసుకుంటావుండావు గదయ్యా! మూడు దినాల్నించి తల్లులూ, పిల్లలూ అందురూ కల్లాన్ని సూపెట్టుకోనుండారు. ఈ మూడు దినాలకూ వాల్లకు కూలి గింజల యెవురిత్తారు?” అని మెత్తగనే పాపయ్య కంపం ఇడిపిచ్చినాడు.
ఆ చిన్నాయన మాట్లాడతావుంటే నాకు వొగ పక్క సంతోషమూ, ఇంకొగ పక్క బాధా కలిగినాయి, చెన్నారెడ్డి మాటల్తో పాపయ్య గసుకెయ్యకుండా వూరకయినాడు. తన బాకీకి గానూ ఆరు పల్లాలు (మూటలు) మా భాగం లోనివి తీసుకుండాడు. చెప్పినమాట ప్రకారం నాయన ఇచ్చేసినాడు. పాపయ్య యెట్లావాడయినా, తమ మోతలగడ్డ మడిని మాకు కోరుకియ్యడం, మా అదృష్టం కొద్దీ చెరువు నిండడం, నష్టం ల్యాకుండా మంచి పంట పండడం, బాకీలన్నీ పోనూ. పండెండు పల్లాల ఢిల్లీభోగాలొడ్లు మాకు రావడం తలచుకొని సంతోషపడినాం. పాపయ్య తమ భాగం వరిగడ్డి కట్టలను సపరేటుగా సామెన్లు వేయిచ్చుకొని ఇంటికి యెల్లవారిపోయినాడు, రాసి కింద మిగిలిండే గింజలన్నీ తూరుపు పోసిచ్చినాడు ఓబన్న. తర్రాబర్రా వొగ మూటెడయినాయి. దండికట్టులోని గట్టిగింజలు, ఆ చిన్నాయనోళ్లకూ వొగ తూమెడు అయినాయి. అన్నీ సంచుల్లో యెత్తుకొని, చాటా, పరకా అన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరినాం.
మడికోసిండేనాడు విత్తనాలొడ్లకు అని మేము ఇంటికి తెచ్చుకో నుండే వొగ మూటా, కోతకోసినోళ్ళకు, కుప్ప కొట్టినోళ్లకు, పడుగులు తొక్కిచ్చినోళ్లకు, వడ్లమూటలు ఇంటికి మోసినోళ్లకు వేసిన కూలిగింజలూ, ఆయగాళ్ల మ్యారగింజలూ అన్నీ కలిపి సుమారుగ నలభై ఐదు మూటలు అయినాయని, బ్రమ్మాండమయిన పంటనీ మాట్లాడుకుంటా ఇల్లు చేరుకుండాం.
***
సంకురాత్రి శెలవులొచ్చినాయి. మాగాణి కింద రైతులందరూ రెండోపంటకు నార్లు పోసినారు. నాయన వొగ పల్లా (మూట) ఢిల్లోభోగాల వడ్లు ఇచ్చి సోదన పల్లిలో విత్తనాలొడ్లు సన్నొడ్లు తెచ్చి నారుపోసినాడు. ఢిల్లీభోగాలే నారు పోయచ్చు కదా అని నేననుకుండాను. ఎండకారు ఢిల్లీభోగాలు, కేసరొడ్లు వెయ్యరని, సన్నొడ్లూ, వొంకొడ్లూ తోకొడ్లూ (చెన్నంగి) మాత్రమే వేస్తారని, యా కాలంలో వేసే వడ్లు ఆ కాలంలోనే పండుతాయని నాయన చెప్పినంక నాకు తెలిసింది.
మడి అంతా ఇరుసాలు దున్ని నాయన మళ్ళీ ఆకుల గంప ఎత్తుకొని ఎగువ పల్లెలకు పోబట్టినాడు. నిండుమనిషి అమ్మయ్య ఇంటి దగ్గరే వుంటా వుంది. పశువుల మేత కోసుకొనివచ్చే పనిలేకపోవడంతో నేనూ, పెద్దక్క మాగేరోళ్ళతో కలిసి ఎలిగొండలూ, బోదగుట్టల పక్కపోయి దినామూ రెండు మోపుల వెంపలాకూ, తంగెడాకూ పీక్కోని వొచ్చి దున్నిన మడికయ్యల్లో తొక్కుతా, పయిటాల అయినంక, ఈటిడిసిన చేన్లలోకిపోయి తలా రెండు మూడు శేర్లు శెనక్కాయలు ఇనప్పెంకుల్తో గోక్కొని వస్తావుండాం. శెలవులు అయిపోయేలోపల వొగ ఎకరా మడిలో వెంపలాకు తొక్కినాం. వొగ యూరియా మూట నిండా శెనక్కాయలు జమజేసినాం, ఇన్నాళ్లూ శెనక్కాయలకు మొగం వాసిన ఇంట్లో శెనకాయల్ని చూస్తా అమ్మయ్య భలే సంతోషపడసాగింది. నడిమిదొడ్డి వూరోళ్లు బండి పనక నిండా బాగా బలిసిన పచ్చి చింతకాయలు వేసుకొని వొచ్చి అమ్మేకి చావిట్లో వేసుకుండారని, పదిశేర్లు కూలిగింజలు కేసరొడ్లు తీసుకొనిపోయి, మూడు దడేల చింతకాయలు కొనుక్కొని వొచ్చి, పచ్చిమిరపకాయలూ మెంతులూ తగినంత ఉప్పు వేసి మాతో వారంకిందట చింతతొక్కు తొక్కిచ్చింది అమ్మయ్య. అదంతా వొగపెద్ద కాగునిండా అయ్యింది. కాగు కంట్లానికి బట్టచుట్టి వొగ దొంతి కింద పెట్టింది.
చింతతొక్కు వారం దినాలకే వూరింది. రెండు చెయిగెంటెల నిండా చింతతొక్కును తీసి నాలుగు పచ్చిమిరపకాయలూ, శెనగిత్తనాలూ వేపి, అన్నీ రోట్లోకి వేసి నూరి, నూరిన చింతతొక్కుకు తిరుగవాత పెట్టింది అమ్మయ్య. వేడి వేడి ఢిల్లీభోగాల అన్నంలోకి నూరిన కొత్త చింతతొక్కు కలుపుకొని, అందరమూ రెండు మూడు దినాలు ఎంతో ఇష్టపడి తిన్న్యాం. అది తింటావుంటే, దానిముందర, అదేందో అమృతం అంటారే, అది గుడకా దిగదుడుపే అనిపిచ్చింది నాకు. ఇంక యేదీ అంత రుచిగా వుండదని అన్నం తింటా ఆనందంతో పొంగిపోయినాను నేను. ఇట్లాంటి అన్నం పెట్టిన న్యాల (నేల) తల్లి ఎంత గొప్పది అనుకుంటా, ఆ తల్లికి మనసులోనే మొక్కుకుండాను.
మడి నాటిచ్చేకి పిట్టక కిందికి పచ్చి ఆకు తొక్కిచ్చల్లని మడి ఆసామి పాపయ్య గట్టిగా చెప్పినాడు. వొగఎకరాలో వెంపలాకు తొక్కినామని చెప్పినా పాపయ్య వినలేదు. సరే, తొక్కిస్తామని నాయన వొప్పుకుండాడు. పది దినాల నుంచీ దినామూ (ప్రతి దినమూ) మడ్డిపల్లె, నాయనపల్లెల వాళ్లు, ముచ్చుకోట కనుమలో పచ్చి ఆకు కోసుకొని, ఎద్దుల బండ్లల్లో టోపులు వేసుకొని మా పల్లెలకు అమ్మడానికి వస్తావుండారు. దినామూ పదీపదైదు బండ్లు వస్తావుండాయి. టోపు సైజును బట్టి ధర పలుకుతాది. ఎద్దులబండి ఆకుటోపు ధర, వొగటిన్నర మూట వడ్లు, గిత్తలబండి ఆకుటోపు ధర వొకటింకాలు మూటవడ్లు అని రేటు చెప్పుతారు బండ్లోళ్లు. ఇరువైపుల వాళ్లకూ అవసరం కాబట్టి వొగ పదిశేర్లు అటోయిటో రేటు తెంచుకొని పచ్చి ఆకును కొంటావుండారు మావూరోళ్ళు.
ముచ్చుకోట కనుమనుండి పచ్చి ఆకుబండ్లు తోలుకొని వచ్చే వాళ్లకు మావూరి పంచాయితి పల్లెలు అనుకూలం. మా పల్లెలన్నీ, ముచ్చుకోట కనుమ గుండా వొచ్చే తాడిపత్రి అనంతపురం రోడ్డు పక్కనే వుంటాయి. గురుగుంట, చిన్న జలాలపురం, నరసాపురం పల్లెల వాళ్లు. గంపమల్లయ్య కొండల్లోని పచ్చి ఆకును బండ్లమీద తెచ్చి అమ్ముకోడానికీ, పెద్దమట్లగొంది, చిన్నమట్లగొంది పల్లెలోళ్లు ఎలిగొండల్లోని పచ్చి ఆకును తెచ్చి అమ్ముకోడానికీ, మాగాణికి ఉత్తరం వైపుండే శింగనమల, గోవిందరాయునిపేట, సోదనపల్లె గ్రామాలు అనుకూలంగా వుంటాయి. పచ్చి ఆకును తెచ్చి అమ్మే వాళ్లకు వడ్లగింజలు పండవు. అందుకే మా పల్లెలకు పచ్చి ఆకును వేసుకొనివొచ్చి అమ్మి, వడ్లు మూటగట్టుకొని పోతావుంటారు.
మా నాయన ఆకును కొనడానికి నన్ను పిలుచుకొని పోయినాడు. ఊరి బయట, బందలదొడ్డికాడ పది బండ్లు, వంకబావి కాడ పది బండ్లు పచ్చి ఆకును వేసుకొని వొచ్చినాయి. నాయన బండ్ల దగ్గరికిపోయి ఆకును గమనిస్తా వొగబండిలో వుండే పలవరాకు టోపును చూసి రేటడిగినాడు. బండి మనిషి “వొగటిన్నర మూట” అని అంటా, ఉత్త ఢిల్లీభోగాలొడ్లు అయితే వొగటింకాలు మూటకు ఇస్తానన్నాడు. చివరికి వొగ మూటా ఇరవయ్యి శేర్లకు (120 శేర్లకు) రేటు కుదిరింది. బండి మా దొడ్డి దగ్గరికొచ్చింది. బండిమనిషి ఎద్దుల్ని కాడిమాను నుంచీ పక్కకు తప్పించి, బండిని ల్యావకు (లేవకు) ఎత్తినాడు. మొత్తం పలవరాకు బ్రమ్మాండంగా వుంది. మా నాయనకు మడిలో తొక్కిచ్చడానికి వెంపలాకూ, పలవరాకూ అంటే చాలా ఇష్టం. ఆ ఆకు, మడిలో తొక్కిన వారం దినాలకే మొత్తం కుళ్లిపోయి సారమంతా భూమిలోకి దిగుతాదని పిట్టక దున్నేనాడు, బుడదమడకలకూ మడకలు తోలేవాళ్ళకూ ఇబ్బంది వుండదని నాయనకు తెలుసు. నేనూ, నాయనా, పెద్దక్కా, వెంకటలక్ష్మీ ఆకును మోపులు కట్టుకొని ఐదు వాయిల్లో మొత్తం మోసి, మడికయ్యల్లో నెరేసి తొక్కినాం. ఆ తర్వాత పదినాలకే మడి నాటేయిచ్చినాం.
చలికాలమూ, నేనూ, మా ఇల్లూ!
చలికాలం నడికొనింది. అందుకే విపరీతమయిన చలి. బిరీన తెల్లారుతుంది, బిరిగ్గ రాత్రి అయితుంది. తెల్లారినంక ఎంత సేపటికీ పొద్దు పొడచదు, ఎండరాదు. ఎండ వొచ్చినా వెచ్చదనమే వుండదు. ఇంట్లోనుంచి బయటికి పోబుద్ధే కాదు. పోకతప్పదు. చెవులకు వొల్లిగుడ్డ గట్టిగాచుట్టుకొని, గాటిపాట్న ప్యాడాగసువు నూకి, గంపకెత్తుకొని దిబ్బలోకి వేసి రావల్ల. వేసొచ్చే లోపల అమ్మయ్య పొయ్యి అంటిస్తాది. పొయ్యి పక్కన, అమ్మయ్య దగ్గర అందరమూ కోడిపిల్లల మాదిరి వెచ్చగ చలిగాపుకుంటాం. చలికి వొణుకుతా పొయ్యి మంటలోకి చేతులు బెట్టినా వేడి తగలదు. అట్ల చల్లగా వుంటే, అమ్మయ్య కాఫీ డికాషన్‌చేసి తలాకొగ సిలవరి (సత్తు) గ్లాసులో పోసిస్తాది. ఆ వేడి వేడి డికాషన్, నోటితో వూపుకుంటా గుటికెడు గుటికెడు తాగుతా వుంటే అప్పుడు రోంత వేడి పుడతాది.
పొయ్యి దగ్గర్నుంచీ పక్కకు రాల్యాక రాల్యాక వొచ్చి, పార తీసుకోని మడి దగ్గరికి బయలుదేరుతాను. బజార్లో, సందుల్లో, గొందుల్లో వొణుకుతా ఎవురి పనులు వాళ్లు చేసుకుంటావుంటే చూసి, వాళ్లకెవురికీ లేని చలి నాకే వుందా అని వుషారుపడి, చలికి ముడుసుకోనుంటే పనులు కావు గదా అని అనుకుంటా మడివైపు నడుస్తాను.
ఊరి దగ్గరే చలి. ఎంతసేపటికీ తగ్గిపోని వూరగొండ నీడా, చుట్టూ మాగాణీ వుండడం వల్లనే ఇంతచలి అనుకుంటా మడి దావ పడతాను. దావ పొడవునా మంచు, గెనాల మీదంతా మంచు, రాళ్ళమీదా, బండల మీదా, పైర్లమీదా యాడ జూసినా మంచే! నీళ్లల్లో కాళ్ళు పెడతానే నీళ్లు చల్లనిముండ్లతో కరుస్తాయి. వొళ్ళంతా గొగ్గిర్లు పుడతాయి. ‘వ్వువ్వువ్వువ్వు’ అని దౌడలు వొనుక్కుంటా శబ్దాలు చేస్తాయి. వొనుకుతా దౌడలు కొట్టుకుంటా మడికాటికి పోతాను. నాకంటే ముందు కొంతమంది అప్పుడే గెనాలు కొడతా, మడకలు తోల్తా, పెల్ల తొక్కుతావుండడం చూసి చలిగిలి అనుకోకుండా బురదకయ్యల్లో పనికి వొంగుతాను, బుడదనీళ్లు కాళ్లను కరుస్తావుంటే, శరీరమంతా వొనుకుతావుంటే పండ్లకింద అంతాబిగబట్టి పారతో గెనాలు కొడతా వుంటే, కొంతసేపటికల్లా చలీగిలీ మాయమైపోతాయి.
నేను వారం పద్దినాలు బుడద మడిలో పనిచేసినందువల్ల, పిక్కకండలన్నీ చలికి పగిలినాయి. చన్నీళ్లు తగిలితే చాలు విపరీతమయిన మంట మూడు నాలుగు దినాలు, తట్టుకుండేకి నా చాతకాలేదు. అందుకే బడికి పోలేదు.
ఇంట్లో తూర్పు గోడవార వడ్లమూటలు! మూటలకు ఆనుకొని నులక మంచం! పడమటిగోడ వారంతా కాగుల దొంతులు! దొంతుల చివర, దక్షిణం గోడపక్కన ఉతికిన బట్టలు వేసుకుండే చెక్కపెట్టె! తలవాకిలి దాటి లోపలికి పోతానే కుడిపక్కన వడ్లు పోసిన గాది! ఇంక మిగిలిన ఇంట్లో మేము పిల్లలం నలుగురమూ పండుకోడానికి స్థలం చాలదు. బయట అరుగు మింద పండుకోవ్వల్లంటే విపరీతమైన చలి. అందుకే, ఆకాశంలో ‘గొరుకొయ్యలు’ రంగయ్యోళ్ల మిద్దె మొరుముపైన కనిపిస్తానే లోగిట్లో వేసుకోనుండే నులక మంచం ఎత్తుకొని పోయి ఇంట్లో వేస్తాం, నేనూ పెద్దక్క.
నాయనకు ఎన్నిసార్లు చెప్పినా లాటీను (లాంతర్) తీసుకొని రాలేదు. నేను బుడ్డీ దీపం వెలుతుర్లోనే రాత్రిపూట చదువుకుంటా వుంటాను, నాయనా అమ్మయ్యా పిల్లోళ్లూ అందరూ లోగిట్లో మాట్లాడుకుంటా వుంటే నేను వాకిలివేసి చదువుకుంటాను. బయటా లోపలా విపరీతమైన దోమలు. నేను వొల్లిగుడ్డతో విసురుతా, తీసుకొని దోమల్ని తోలుకుంటా, చదువుకుందాం అనుకుంటే, వొల్లిగుడ్డ గాలికి బుడ్డీ దీపం ఆరిపోతాది. వొల్లిగుడ్డ వూపకుంటే దోమలు కుట్టి చంపుతాయి. బయట అరుగు మింద కూర్చొని చదువుకుందామంటే, ఇంట్లో కంటే బయట నలిబడ కుడుతాయి. వొగపక్క దోమలు కుడుతా వుంటే, ఇంకొగ పక్క అమ్మయ్యోళ్ల మాటలు! శ్రద్ధ పెట్టి చదువుకుండేకే కావడం లేదు. అందుకే లాటిను, కొనుక్కొని రాలేదని నాయనమీద కోపమొస్తా వుంటాది.
బయట చలి, దోమలూ ఎక్కువైనాయేమో అందరూ ఇంట్లో కొచ్బినారు. నేనూ పెద్దక్కా మంచం ఇంట్లోకి తెచ్చి వొంచినాం. నాయన వొగ మట్టి కుంపట్లో జెముడు పుల్లలు వేసి అంటిచ్చి, అవి బాగా అంటుకొని మంట మండేటప్పుడు, కొట్టంలో గాట్లో వుండే పచ్చిగడ్డి తెచ్చి మంటమింద వేసినాడు. మంట ఆరిపోయి పొగలేచి, రోంతసేపట్లోనే ఇల్లంతా చుట్టుకుంది. దోమలన్నీ బయటికి వురికెత్తినాయి. అట్లనే, దున్నపోతులకు దోమలు కుట్టకుండా కొట్టంలో గుడకా పొగ పెట్టి వొచ్చినాడు నాయన. ఇంట్లోనుంచి పొగతోపాటు దోమలన్నీ వెళ్లిపోయినంక వాకిలి తలుపులు వేసినాను నేను. పెద్దక్క మంచం మింద రెండు గోనిపట్టలు పరిచింది. అగదాళ్ళ మింద మూడు నాలుగు చినిగిపోయిన పట్టలు వేసింది. తలపాట్న రాగి సరుగు నింపి చుట్టేసిన తలదిండు పెట్టింది. ఇంట్లో అదొగటే తలదిండు. మామూలుగా ఇంట్లో ఉన్నెప్పుడు నాయనే ఆ తలదిండును తన తలకాయ కింద పెట్టుకుంటాడు. కానీ ఇప్పుడు అమ్మయ్య నిండుమనిషి అని ఆ దిండును అమ్మయ్యకే ఇచ్చినాడు.
అమ్మయ్యా నాయనా మంచమ్మీద వండుకొని పాత దుప్పటి కప్పుకుండారు. వొగపక్క చెల్లెల్లిద్దరూ ఈతచాప మింద పండుకుండారు. ఈతచాపా, ఈతపరకా ఇంట్లోకి తీసకరాగూడదని అమ్మయ్య ఎప్పుడూ అంటా వుంటాది. సిరిచాపలు అమ్మేకి వొచ్చినప్పుడు దుడ్లు ల్యాక కొనుక్కోలేదు. మా పిల్లోళ్లు రాత్రి పరుచుకుండేకి ఇంక యేందీ లేదు. అందుకే పెద్దక్క ఈతచాప పరుచుకుందామని చెప్పినప్పుడు అమ్మయ్య వొద్దని చెప్పలేదు. నాకూ తమ్మునికి చినిగిపోయిన పాత జంఖానం పరిచింది పెద్దక్క.
పండుకున్న రోంతసేపటికే పిల్లోళ్లు ముగ్గురూ నిద్రపోయినారు. దోమలు లేకుండా ఇంట్లో వెచ్చగా వుండడంవల్ల నాకు చదువుకోడానికి అనుకూలమయ్యింది. బుడ్డీదీవం వొత్తిని కొంచెం పైకి లేపి ఆ వెలుతుర్లో చదువుతో సాగినాను. వొత్తి పైన్నుంచీ పొగ పైకి లేస్తా వుంది. వెచ్చగా వుండడం వల్లనేమో నాకు కండ్లమీదికి నిద్ర కమ్ముకోసాగింది. ఇంక అయ్యెల్లేదని బుడ్డీని పక్కకు జరిపి తమ్మున్ని మెల్లగా మంచం కిందికి నూకి వొల్లిగుడ్డను చుట్టజుట్టి తలకాయ కింద దిండు మాదిరి పెట్టుకొని పండుకుండాను. పది నిమిషాల్లో నిద్రబట్టింది. అంతలోనే బుడ్డీలో గబ్బునూనె (కిరసనాయిల్) అయిపోయిందేమో, దీపం ఆరిపోయింది.
పొద్దున లేస్తానే, ముక్కుల్లోకి వేలుబెట్టి చూసుకుండాం. అందరి ముక్కుల్లోనా నల్లగా మసి! వొగరి వేలు వొగరికి చూపుకుంటా నవ్వుకుంటా వుంటే చూసి అమ్మయ్య నాయనను దండిచ్చింది. “ఆ పకారంగా దినామూ గబ్బునూని పొగ, కడుపులోకి పోతే పిల్లోల్ల ఆరోగ్గ్యాలు గబ్బుకావా?” అని అడిగింది. ఈసారి అనంతపురానికి పోయినప్పుడు లాటీను తెస్తానని చెప్పినాడు నాయన. ఆ లాటీను కోసరం నేను ఎదురు చూడసాగినాను.
అమ్మయ్య కానుపూ, మడికోతలూ!
ఉగాది పండగ అయిపోతానే ఎండకారు వరిమడి కోతలు ప్రారంభమయినాయి. మడికోతలకు పోయి నాలుగు కూలిగింజలు జమచేసుకుండేకి వీలుగాక పాయనని అమ్మయ్య దినామూ గొనగసాగింది. గొనుగుతా గొనుగుతా వొకనాడు అమ్మయ్య తీర్థమాడింది. ఆడపిల్ల పుట్టింది. పాప తెల్లగా, తలకాయంతా వెంట్రుకలు నల్లగా వుండడం చూసి, ఆ పాప మా అందరికంటే మంచి కలర్ అని అందరమూ సంతోషపడినాం. బోయోళ్ల సుంకమ్మ అమ్మయ్యకు కానుపు చేసింది. కానుపు చేసిన వారం దినాలకే సుంకమ్మ మడి కోతలుండాయని. కోతలప్పుడే కూలిగింజలు జమజేసుకోవల్లని వెళ్లిపోయింది. కానుపైన నాలుగు దినాలకే అమ్మయ్య నడికట్టు కట్టుకొని, తలకు కొంగు చుట్టుకొని ఇంటి పనుల్లోకి దిగింది. పెద్దక్క అన్ని పనుల్లోనా తోడయింది. దాంతో పొద్దున లేస్తానే ప్యాడకసువు నూకి దిబ్బలోవేసి రావడమూ, బావి నీళ్లు చేదుకొనొచ్చి కాగులూ, పొంతా, పశువులతొట్టె నింపడమూ అంతా నాకు గస అయితా, ప్యాడబడతా వుంది. ఎంత బరువైనా అది నాకు తప్పదునుకొని, బడి గంటకొట్టే లోపలే అన్నీ ముగిచ్చుకొని బడికి పోతావుండాను.
ఎండకాలం శెలవులు అయిపోతానే నేను శింగనమల హైస్కూల్లో ఆరో తరగతిలో చేరుతాననే సంతోషంతో పనిబరువంతా మరిచిపోయి చదువుకోసాగినాను. స్కూలుకు పోతానే పుస్తకాలూ, పలకా, బలపమూ మా ఐదోతరగతిలోని జతగాళ్ళూ మా వెంకటస్వామి అయవారూ తప్పా ఇంక యేవీ నాకు కనిపిచ్చడం లేదు. మొన్నటి వరకూ పొద్దున లేస్తానే దేవరకొండకో, కొండల సందులో వుండే బాటమాన్ల కిందికో పోయి గడ్డీగాదమూ, ఆకులూ, అలములూ నలీనట్రా తెచ్చి గాటిపాట్న పరిచేపని ల్యాక పోవడంతో, మిగతా పనులేవీ బరువనిపిచ్చడం లేదు. పుస్తకాలపైన మనసుపెట్టి చదువుకోడానికే ఇబ్బంది కావడం లేదు.
ఐదో తరగతి అయిపోతానే జోడోళ్ళ ఓబుళ నారాయణగాడూ, ఈడిగోళ్ల కొండన్నగాడూ, జానగొండ నారాయణగాడూ, బడగొర్ల నాగిరెడ్డి కొడుకు ఎర్రప్పగాడూ శింగనమల హైస్కూల్లో చేరుతారని తెలిసినంక నాకు ఉబలాటం ఎక్కువైంది. వాళ్లతోపాటు సరోజ కూడా చేరితే. బాగుంటాది, అయితే ఆ పాప, శింగనమలలో కాకుండా అనంతపురం ఐస్కూల్లో చేరుతాదని తెలిసినప్పట్నుంచీ మనసులో యేందోదిగులు కలగసాగింది. వాళ్లకేం, పెద్ద షావుకార్లు! అనంతపురంలో కాకుంటే, హైదరాబారులో చేరుతారు! వాళ్ల అన్నయ్య లిద్దరూ అనంతపురంలోనే చదువుకుంటా వుండారంట, వాళ్ల నాయన పెద్ద పాపయ్య కొడుకుల కోసరం అనంతపురంలో వొగ ఇల్లే కట్టిచ్చినాడంట! అందుకే సరోజ, చదువుకుండేకి అనంతపురానికి పోతాదంట! పెద్దోళ్ళ మాదిరి పేదోళ్లు అట్ల చేసుకుండేకి అయితాదా అని అనుకుంటా చదువుకోసాగినాను.
ఎండకారు మడికోతలన్నీ అయిపోయినాయి. మా మడి కోపిచ్చినాడు నాయన. సరికోరు భాగంగా మాకు పది మూటలు సన్నొడ్లు వొచ్చినాయి. మరి ఆసామి దగ్గర చేసిండే బాకీకి గానూ మా భాగంలోని నాలుగు మూటల వడ్లు కల్లంలోనే తీసుకుండాడు పాపయ్య. ఇంటికి పందుం వొడ్లూ యిన్నూరు కట్టలు వరిగడ్డి వొచ్చినాయి. దొడ్లో పాతది, కొత్తది కలిపి గడ్డివామి పెద్దగా కనిపిచ్చింది. ఇంట్లో పాత ఢిల్లీ భోగాల వొడ్లమూటల పక్కన కొత్తవి సన్నొడ్ల మూటలు నెట్టేసినాడు నాయన, ఇంటినిండా వొగపక్కన వొడ్లమూటలూ, ఇంకొగ పక్కన దొంతి కుండలు, గాది, మధ్యలో అమ్మయ్య బాలింతమంచమూ అవే సరిపోయినాయి. పిల్లోల్లం మేము పండుకుండేకి జాగానే లేదు. అందుకే అందరమూ బయట వారపాక కింద అరుగుమిందనే పండుకుంటా వుండాం. అమ్మయ్య ఎండకాలంలో కానుపయ్యింది కాబట్టి మేలయింది. చలికాలమైతే ఎంత కష్టమయ్యేదో అనుకుంటా, నాయన కొత్తగా తెచ్చిన లాటీను వెల్తుర్లో ఉత్సాహంగా చదువుకోసాగినాను.
ఈ రోజు మంచిదినమని, పాపకు పేరు పెట్టల్లని అమ్మయ్య అనింది. అందుకే నాయన ఆకుల గంపెత్తుకొని పల్లెలకు పోలేదు. అమ్మిడిపొద్దు కాకముందే అమ్మయ్య దినామూ మాదిరే పాపకు నీళ్లు పోసేకి జలాట గుంత దగ్గర పీట మాదిరుండే కాలుపు రాయి మింద కూర్చుంది. చీరను మోకాళ్ల పైవరకూ జరుపుకొని గుంత అవతలి వైపు నుండే కాలుపు రాయి మీదికి కాళ్లు చాపుకుంది. కాళ్ళమీద పాపను బోర్ల పండేసుకుంది. పెద్దక్క పొంతలో కాగిన వేన్నీళ్లను బకీట్లో పోసుకొని తెచ్చిపెట్టింది. నీళ్లలో చేయిపెట్టి చూసి, నీళ్లు చాలా కాల్తావుండాయని (వేడిగా వుండాయని) పక్కనుండే కుండలో నుంచి రెండు చెంబులు చన్నీళ్లు తోడుకుంది అమ్మయ్య. పెద్దక్క వొనారుగా పాపకు నీళ్లు పోయలేదని, నన్ను పోయమని చెప్పింది. నేను గోరు వెచ్చగా వుండే నీళ్లను చెంబుతో ముంచుకొని ఆల్తి-ఆల్తిగా పోయసాగినాను. వొగ చిన్నగిన్నెలో కలిపి పెట్టిన శెెనిగిపిండిని తీసుకొని పాప తలనురుద్ది వీపంతా తిక్కింది. నేను చెంబుతో కొద్ది కొద్దిగా నీళ్లు పోసినాను. పాపను వొయినంగా వెల్లకిలా పండేసుకొని గడ్డంకింద చెయ్యివేసి పాప తలను పైకెత్తి శెెనిగిపిండితో మెల్లగా వొళ్ళంతా రుద్దింది. పాప ముఖమ్మీద పడకుండా చెంబుతో వొయినంగా నీళ్ళు పోసినాను. అమ్మయ్య పాప చేతుల్ని కుడిపక్కది ఎడమపక్కకూ, ఎడమ పక్కది కుడిపక్కకూ వొంచి, రెండు పాదాలనూ పట్టుకొని మెల్లగా సాగబీకి మల్లా నీళ్ళు పోసింది. సున్నితంగా కండ్లూ, ముక్కూ, నోరూ, అరచేతి నీళ్లతో కడిగి కాళ్లమీద పాపను కూర్చోబెట్టుకొని ఎడమచేతికి పాప తలకాయిని అనిచ్చుకొని మరోచేతిని నొసట మింద అడ్డంగా పెట్టి, తలమీద నాలుగు చెంబులు నీళ్లు పోయమని చెప్పింది. నేను అమ్మయ్య చెప్పినట్లే పోసినాను, నీళ్లు పోసేదంతా అయిపోయినంక మెత్తని పాతచీర బట్టను చుట్టి పాపను ఎత్తుకొని ఇంట్లోకి వొచ్చింది అమ్మయ్య. కాళ్ళమింద పండేసుకొని పొడిబట్టతో తలవెంట్రుకల్ని రుద్ది వొళ్లంతా తుడుస్తా వుంటే పాప కాళ్ళూ చేతులూ పైకెత్తి ఆడిస్తా గుడ్లు మిటకరిస్తా ఎక్కడో చూస్తా ముద్దు ముద్దుగా నోటితో శబ్దం చేస్తావుంది.
“పాప మనుషులను గుర్తుపడతా వుందా మా?” అని పెద్దక్క అడిగింది. “ఇంగా మూన్నెల్లు గుడకా నిండల్యా, అప్పుడే యెట్ల గుర్తుపడతాదమ్మా? ఇంగా సూపు నిలపల్యా, మెడలు నిలపల్యా అయితే యిది, అసాద్దెం దాని మాదిరుంది. మనుషుల పక్క సూపు తిప్పుతా కేకలేత్తావుంది” అని అమ్మయ్య చెప్పుతావుంటే, కోడికింద పొదిగేసిన గుడ్లల్లో నుంచీ మొన్ననే బయటికొచ్చి గునగున పారాడుతా తల్లివెంట బుజ్జి బుజ్జిగా తిర్లాడతావుండే కోడిపిల్లలు గుర్తుకొచ్చినాయి. బోయోళ్ల నారాయణ వాళ్లింట్లో వారం దినాల కిందట ఈనిండే కుక్క పిల్లలు ముద్దు ముద్దుగా తల్లి కాళ్ళ సందులోకి దూరి, పాలుతాగుతా వుండేది గ్నాపకమొచ్చింది. అవన్నీ పుట్టిన రొన్నాళ్లకే నడుస్తాయి, గంతులేస్తాయి! ఏదయినా శబ్దం చేస్తే కోడిపిల్లలు పరుగెత్తిపోయి ‘తల్లి రెక్కలకింద దాక్కుంటాయి. చిన్నచిన్న గింజల్ని పురుగుల్ని యేరక తింటాయి! కుక్క పిల్లలూ పశువుల దూడలూ ఆకలయితే తల్లి పొదుగును కరుసుకొని పాలు తాగుతాయి! మనుషులు పుడతానే ఎవురూ నడచలేరు, చూడలేరు, వినలేరు, ఎందుకో ఇట్ల? అని రోంతసేపు అలోచనచేసినాను. ఏమీ అర్థం కాక పాపవైపే చూడసాగినాను.
అమ్మయ్య చెప్పడంతో పెద్దక్క, పొయిలోని నిప్పుల్ని కంచు గెంటలో వేసుకొని వొచ్చి అమ్మయ్య దగ్గర పెట్టి సాంబ్రాణి పొడిడబ్బా తెచ్చి నిప్పుల మింద చిటికెడు వేసింది. పొగ పైకి లేచింది. అమ్మయ్య పాప తలకాయిని ఎడమచేతితో పట్టుకొని, కుడిచేతితో పాదాలు పట్టుకొని, పైకి లేస్తావుండే పొగమీద అటూ ఇటూ తిప్పింది. పాప తలవెంట్రుకల నిండా పొగ దూరింది. “యెందుకు మా యిట్లచేసేది?” అని నేను ఆసక్తిగా అడిగినాను. “సామ్రాని వాసనకు పిల్లలు ఆయిగా నిద్ర పోతారప్పా, పసిపిల్లోల్లకు వొల్లంతా సామ్రాని పొగ బెడితే, సన్నసన్న సీటీగలూ, సీమలూ, దోమలూ కంటికి కనిపీకుండా గాల్లో వుండే నుసి పురుగులూ ఇట్లాటివి దెగ్గిరికి రావు. సన్న పిల్లోల్లకు ముక్కుల్లో గాలి బాగా ఆడతాది. వాసనకు మత్తుగా నిద్రబోతా రప్పా” అని అమ్మయ్య చెప్పడం విని నేను ఆశ్చర్యపోయినాను.
సాంబ్రాణి పొగ పట్టేదంతా అయిపొయినంక అమ్మయ్య పాపకు పౌడరుకొట్టి, అరికాలి మిందా చెక్కిలి మిందా మసిబొట్టు పెట్టింది. అట్ల మసిబొట్టు పెడితే పాపకు దిష్టితగలదని చెప్పింది అమ్మయ్య. మసిబొట్టు పెట్టినంక పాప నుదుట మింద గోధుమ గింజమాదిరి తిలకం బొట్టు పెట్టింది. చేతులకు నల్లగాజులు తొడిగింది. మొలతాడు కట్టింది. అంతలోపల పెద్దక్క పగ్గంతాడు తీసుకొని రెండు స్తంభాల మధ్యలో ఉయ్యాల కట్టి మధ్యలో మెత్తని పాత చీరబట్ట వేసింది. అమ్మయ్య పాపను ఉయ్యాల్లో పండేసి నీలగినప్పుడు కింద పడకుండా పాపమింద మధ్యలో వొగ మెత్తని బట్టతో ఉయ్యాలకు బిగిచ్చింది. ఏమి సుఖము చూసిందో యేమో పాప కాళ్ళూ చేతులూ పైకెత్తి ఆడిస్తా నోటితో ఉత్సాహాన్ని చూపుతా చిన్నగా కేకలు వేస్తా వుంది. ఇంతలోనే బజార్లోకి పోయిన నాయన వొచ్చి మా దగ్గర కూర్చున్నాడు.
“పాపకు ఏమి పేరు పెడితే బాగుంటా దప్పా? నువ్వు సదువుకుంటా వుండావు నీ చెల్లెలికి యాదయినా వొగ మంచి పేరు నువ్వే పెట్టు” అంటా అమ్మయ్య నవ్వుతూ నా పక్క చూసింది. నేను రోంతసేపు ఆలోచనచేసి ‘జయమ్మ’ అనే పేరు బాగుంటాదని చెప్పినాను, నాయనా అమ్మయ్యా బాగుందిలే అని అదే పేరు ఖరారు చేసినారు. యేమ్మా జయమ్మా, నువ్వు ఇంటికొచ్చినావు యింగ అంతా జయమే జరగల్ల తల్లీ అంటా పాపను ముద్దుబెట్టుకుంది. పాపకు పేరుపెట్టినామని అమ్మయ్య ఇంట్లో అందరికీ పరమాన్నం చేసింది.
నా కల నెరవేరింది!
ఎండకాలం శెలవులు అయిపోయినంక మళ్ళీ బడి వాకిలి తీసినారు, బెల్లు గొట్టినారు, నేను బడికి పోయి వెంకటస్వామి అయవారిని కలిసినాను. “నువ్వు ఐదో తరగతి పాసయినావు రా నారాయణా! మార్కులు కూడా బాగొచ్చిన్నాయి. ఎట్లన్నా గాని శింగనమల హైస్కూల్లో చేరప్పా! మీ నాయనతో నేను గట్టిగా చెప్పుతాన్లే!” అని మాటిచ్చినాడు మా హెడ్మాస్టర్ సార్, నాకు చాలా సంతోషమైంది. “మీరు మా నాయనతో గట్టిగా చెప్పల్ల సార్, అప్పుడే ఆ పెదగొర్ల నరసమ్మ మా నాయన చెవుల్లో యేందో వూదుతా వున్నెట్లుంది సార్” అని ప్రాధేయపడి అడిగినాను. “నువ్వేం దిగులు పడొద్దురా. నేను చెప్పి మీ నాయన్ను వొప్పిస్తాను” అని వెంకటస్వామి సారు ధైర్యం చెప్పినాడు. నేను సంతోషంగా ఇంటికొచ్చినాను. మామూలుగా చేసే ఇంటిపనులన్నీ చేస్తా శింగనమల హైస్కూలును గురించీ ఆరో తరగతి పుస్తకాలను గురించి ఆలోచిస్తా మధ్య మధ్యలో చిన్న పాపయ్య కొడుకు నాగభూషణం ఏడో క్లాసుకు పోతాడని, ఆ పిల్లోని ఆరో క్లాసు పుస్తకాలను అడగమని అమ్మయ్యకు గుర్తుచేస్తావుండాను. అమ్మయ్య వొగరోజు చిన్నపాపయ్యోళ్లింటికి నున్ను పిలచుకొనిపోయి నాగభూషణం వాళ్లమ్మకు విషయం చెప్పి పుస్తకాలు అడిగింది.
“ఏమి కేశమ్మ, నీకొడుకుని హైస్కూలుకు పంపించల్లని అనుకుండావా? చేతికొచ్చిన పిల్లోన్ని లక్షణంగా కూలిపనులకు పంపిచ్చుకుంటే పేద కుటుంబానికి ఎంతో ఆసరాగా వుంటాడు కదా” అని నాగభూషణం వాళ్లమ్మ పుస్తకాల సంగతి గురించి మాట్లాడకుండా అసలుకే ఎసురు పెట్టేతట్ల వుందని అనుకుంటా ఆయమ్మను మనసులో తిట్టుకుండాను.
“అదేమిటమ్మా అట్లంటావు! సదువు సందెలు ల్యాక మా బతుకులు ఇట్లయినాయి. సదువుకోకుండా మా పిల్లోడు గుడకా బతికినన్నాళ్ళూ కూలి బతుకే బతకల్లంటావా? మగ పిల్లోడు, మా సన్నకులాల్లో మావొంశెంలో సదువు మింద యెవురికీ లేని శ్రెద్ద వానికెట్లో కలిగింది. వాని ఆరాటాన్ని చూసి, యెట్లన్నా గానీ వాన్ని సదివిచ్చల్లను కుండానమ్మా. రోంత పెద్ద మనుసు చేసి నీకొడుకు పుస్తకాలు ఇప్పిత్తే నీ రుణం తీర్చుకుంటాన్లే తల్లీ” అని అమ్మయ్య మెత్తగా ఆ కోమటాయమ్మకు తగ్గకుండా బదులిస్తా, ఆయమ్మ మనసు కరిగేతట్ల మాట్లాడింది. ఏమనుకుందో యేమో ఆయమ్మ కొడుకును పిలిచి, “నీ పుస్తకాలన్నీ మన పనిమనిషి కేశమ్మ కొడుకు నారాయణ గానికి ఈయప్పా భూషణా! వేరే వాళ్లకు అమ్మితే అర్ధరేటు వొస్తాదనుకో, పోనీలేప్పా పాపం కేశమ్మ మన పనిషాయ, వెంకటస్వామి మన మడిని కోరుకు చేస్తావుండాడు. అట్లా వాళ్లదగ్గర అర్ధరేటు ఎట్ల తీసుకుంటామురా! ఇచ్చెయ్ ఇచ్చెయ్” అని దయజూపింది కోమటాయమ్మ.
నేను సంతోషంగా నాగభూషణం ఇచ్చిన ఆరో క్లాసు పుస్తకాలన్నీ తెచ్చుకొని చినిగిపోయిన పుస్తకాలన్నిటికీ అట్టలేసి భద్రంగా బ్యాగులో పెట్టుకుండాను. ఈ విషయం నాయనకు తెలీదు. నాయన ఆకుల గంపెత్తుకొనిపోయి నాలుగు దినాలయ్యింది. ఇంగా రాలేదు. నాగభూషణమూ, మాదిగోళ్ల కుళ్లాయప్పా, కోనయ్యా అప్పుడే శింగనమల హైస్కూలుకు పోబట్టి వారం దినాలు అయితా వుంది. ఇప్పుడు వాళ్లందరూ ఏడోక్లాస్. నాయన వొస్తానే వెంటనే పిలుచుకొనిపోయి ఆరోక్లాసులో చేరల్ల. ఆలస్యమయితే వొగటి రెండు పాఠాలు అయితాయేమో! అయిపోయినంక నేను క్లాసులో ఉంటే చేరితే ఆ పాఠాలు అర్థమయ్యేదెట్ల? క్లాసులో అయవారు చెప్పేటప్పుడు వింటేనే కదా పాఠాం సరిగా అర్థమయ్యేది.
రకరకాలుగా ఆలోచిచ్చుకుంటా ఆత్రపడతావుండాను. అంతలోనే నాయన గంపెత్తుకొని బరువుగా ఇంటికొచ్చినాడు. వొచ్చీరాగానే “యాటికి సచ్చింటివి రా గాడిదీ! గంపెత్తుకొని బరువుగా వొత్తావుంటాడనే గ్నానం లేదా? దెంగితిని ఇంటికాడ వూరకనే కుచ్చుండేదేనా! పిల్లగుండ్ల దంకా ఎదుర్రావొచ్చు గదా!” అంటా నా మింద ఎగిరినాడు నాయన. నాయన కోపాన్ని చూసి నాకు నోరెండక పోయింది. ఏమి చెప్పల్లనో అర్థం కాక భయమయ్యింది. నేను మౌనంగా గంప దించుతుండాను. నాయన విసురుగా ఇంట్లోకి పోయినాడు.
నిజమే! నేనే రోంత పొరపాటు చేసినానేమో! ముందుగా ఆలోచనచేసి, నాయన గంపనిండా ఆకులమ్మిన గింజలు తీసుకొని బరువుగా వొస్తా వుంటాడేమో అని అనుకోని, పిల్లగుండ్ల వరకూ కాకపోయినా చింతొనుం కాటికి ఎదురుపోయి, నాయన నెత్తి మీదుండే గంపను ఎత్తుకొని వొచ్చుంటే బాగుండేది! అట్ల ఎదురు పోయి, నాయన నెత్తిమీదుండే బరువును ఎత్తుకొని వచ్చేకి ఇంట్లో మొగోన్ని నేనొక్కన్నే కదా వుండేది! ఇంగెవురుండారు? ఇంటి ఆరంభారం మోసేది ఇంటి పెద్ద కొడుకే అంటారు. అందుకే గదా, నాయన నా మింద కోప్పడతా వుండేది, ఎదురు పోయింటే బాగుండేది. అవును, నాయన ఇంటికొచ్చేది యెప్పుడో తెలిస్తే గదా, నేను ఎదురు పోయేటకి!
ఎవురూ ఏమీ మాట్లాడలేదు. పెద్దక్కా వెంకటలక్మీ గంపలోని గింజల సంచులన్నీ బయటికి తీస్తావుండారు. అమ్మయ్య నాకు సైగ చేసింది. నేను వెంటనే కొట్టంలో పొంతలోని వేడినీళ్లు బకీట్లో తోడుకొని వొచ్చి జలాటి బండదగ్గర పెట్టి “నీళ్లు కాల్తా వుండాయి, పోసుకుందువురా నాయనా!” అని పిల్చినాను. నాయన బుబ్బా, బనీను ఇడిచేసి జలాటి బండదగ్గరికి వొచ్చినాడు. అమ్మయ్య వుతికిండే వొల్లిగుడ్డను తీసుకొని వొచ్చి, “తానం జేత్తావా, అడ్డపయికి పోసుకుంటావా?” అని అడిగింది. “అడ్డ పయికే పోసుకుంటాన్లే” అని అన్న్యాడు. ‘అడ్డపయికి యాల్లే! నీళ్లు పోసుకోక నాలుగైద్దినాలు ఆయె గదా! తలకాయంతా మాసి పొయ్యింది. నీల్లు బాగా కాల్తా వుండాయి. తలకాయికే పోత్తాన్రా! వొల్లు నొప్పులన్నీ పోతాయి’ అంటా అమ్మయ్య, అన్నం వొంచిన గంజి వొగ చెంబులో పోసుకోని వొచ్చింది. నాయన ఇంకేమీ మాట్లాడకుండా జలాటి బండమీద కూర్చుండాడు.
అమ్మయ్య, నాయనకు నీళ్లుపోసి మాసిపోయిన తలకాయి మింద గంజిపోసి, తల తిక్కి, వేడివేడి నీళ్లు పోసింది. తర్వాత వీపు రుద్దుతా, “నువ్వు పలానా దినం వొస్తావని తెలిస్తే గదా, వాడు ఎదురొచ్చేకి! ఇంటి కొత్తానే పిల్లోన్ని అట్ల గదురుకుంటే యెట్ల? వాడు ఎన్నిసార్లు నీకు ఎదురొచ్చి గంపెత్తుకొని రాలేదు?” అని మెల్లగా దండిచ్చింది. దానికి నాయన ఏమీ మాట్లాడలేదు. అది గమనిచ్చి, నాయనకు కోపం తగ్గిపోయిందనుకుంటా వుంటే మనసు తేలికపడింది.
రెండు దినాలు గడిచిపోయినాయి, వాళ్లింటికాటికి పోయినప్పుడు పెదగొర్ల నరసమ్మ నాయనతో ఏదో చెప్పినట్లుందేమో, రాత్రి అందరూ పండుకున్నెంక నాయనా అమ్మయ్యా మాట్లాడుకుంటావుండారు. నాకు నిద్ర రాలేడు, కానీ నిద్రబోయినట్ల పండుకుండాను.
“సన్న కులాలోల్లు సదువుకొని బాగుపడితే పెద్దకులాలోల్లు ఈ రొడ్లు వోర్సుకుంటారా? వోర్సుకోల్యాకనే ఆ ముండమోపాయమ్మ నరసమ్మ నీతో అట్ల మాట్లాడిండేది! కూటికి కురాక్కూ మనం నలిగిపోతాంటే దెగ్గిరికి పిల్చి యానాడన్నా ఆదుకుండాదా ఆ తెంపరిగత్తె? మన బతుకులు మనవి. వూరకనే వాల్ల మాటలూ యీల్ల మాటలూ యిని యాల గబ్బులేపుతావు పిల్లోన్ని? మన బతుకులు ఇట్లయిపోయినాయి. మా తాత ముత్తాతలకూ, మీ తాత ముత్తాతలకూ యెవురికే గానీ సదువు అబ్బిండేది కానము. యెట్లనో మనోనికి అబ్బింది. అబ్బడమే గాదు, సదువంటే వానికి పానం. యెప్పుడూ సదువు మిందే ద్యాసంతా! అట్లా వాన్ని సదివిచ్చుకుంటే వాని బతుకూ బాగపడతాది, మన కుటుంబమూ బాగుపడతాది” అంటా అమ్మయ్య నాయనకు నచ్చజెప్పతావుంది. నాయన అడ్డ ప్రశ్నలు వేస్తా అమ్మయ్య నోరు మూపిచ్చేకి చూస్తావుండాడు. అమ్మయ్య మాత్రం సల్లుకోలేదు. అన్నిటికీ అన్ని బదులు చెప్పుతా వుంది.
అమ్మయ్య మాటలు వింటావుంటే కన్నీళ్లు పెల్లుబికినాయి. నాయన మాటలూ న్యాయంగానే అనిపిచ్చసాగినాయి, కానీ, ఏమయితే అది అయితాదిలే అనుకుంటా నిద్రలోకి జారుకుండాను. తెల్లారింది. నాయన పొద్దున్నే లేచి సాములూరికి పోయినాడు. నాయన వెళ్లి పోయినంక అమ్మయ్య చెప్పింది అసలు సంగతి. నాకు పరమానందమయ్యింది. నాయన నన్ను శింగనమల హైస్కూల్లోకి చేరిపిచ్చేకి వొప్పు కుండాడంట! నాకు రెండంగీలు రెండు నిక్కర్లు కుట్టిచ్చల్లని, సాములూరు సుబ్బరాయుని దగ్గర అంగీ గుడ్డా, నిక్కర బట్టా కొనుక్కొని వొచ్చేకి పోయినాడని తెలిసి మురిసిపోతా సంతోషంతో అమ్మయ్యను కరుసుకుండాను. ‘ఇప్పుడు సంతోసపడడం కాదప్పా, బాగా సదువుకోవల్ల. అట్లనే ఇంతకు ముందాకట్లనే సక్కరమంగా ఇంటి పనులన్నీ చేత్తావుండల్ల’, అని బుద్ధి చెప్పింది అమ్మయ్య. నేను సంతోషంగా వూకొట్టినాను.
నాయనా, నేనూ బడిలోకిపోయి, వెంకటస్వామి సారును కలిసినాం. ఆయన విషయం తెలుసుకొని సంతోషపడి, నాయనను మెచ్చుకుంచాడు. టీ.సీ. రాసి ఇచ్చినాడు. నేను సార్ కాళ్లకు నమస్కారం చేసినాను. బాగా చదువుకొని, తల్లి దండ్రులకూ వూరికీ మంచి పేరు తీసుకొనిరావల్లని దీవిచ్చినాడు. నాయన బాపనయవారి దగ్గరికిపోయి మంచి దినం తెలుసుకోనొచ్చినాడు. నేను శింగనమలలో ఆరో తరగతిలో చేరేకి నాయన వెంట బయలుదేరుతానని అమ్మయ్య పొద్దున్నే నాకు తలస్నానం చేయిచ్చింది. నేను కొత్తబట్టలు తొడుక్కున్నెంక, నా తలకాయి దువ్వి ముఖానికి పౌడర్ కొట్టింది. బయలుదేరేకి ముందు నేను దేవరమూల రాముల పటానికి మొక్కుకుండాను. నేను అమ్మా నాయనల కాళ్లకు మొక్కినాను. అమ్మయ్య ఆనందంతో కన్నీళ్లుకారుస్తా నాకు ముద్దుపెట్టి బాగా సదువుకోవల్ల నా బంగారు తండ్రీ! అని దీవిచ్చింది. మా వూరి నుంచి హైస్కూలుకు పోతావుండే నాగభూషణమూ, కోనయ్యల వెంట నేనూ, నాయనా శింగనమలకు బయలుదేరినాం.
చెరువుకు ఇంకా నీళ్లు రాలేదు. అందుకే మాగాణి అంతా బీడే! బీటికయ్యల్లో కాలిదావవెంట నేను చాలా సార్లు శింగనమలకు పోయి గంజి కేంద్రంలో గంజి పోయిచ్చుకొని వొచ్చినదంతా గుర్తు చేసుకుంటా శింగనమల కుమ్మరిగేరి దుగ్గరుండే చిన్నకాలువ ఇరుక్కంతుకాటికి చేరుకుండాం. శింగనమలలో హైస్కూలు యా పక్కనుందో తెలీదు. అందుకే నాగభూషణం వాళ్ళవెంట మేము పోతావుండాం. తలబాలకట్టకు పోయే సందుగుండా కాకుండా వాళ్లు వేరే సందుగుండా ముందుకు పోతావుండారు. కుమ్మరోళ్ల ఇండ్లు దాటినంక రెండు పెద్ద పెద్ద మాడీ ఇండ్లొచ్చినాయి. దాండ్ల పక్క జూసి నేను అబ్బురపోతావుంటే, అవి ఘట్టప్ప, సాంబయ్య అనే బాపనోళ్ల ఇండ్లని, వాళ్లు పెద్ద భూస్వాములని చెప్పినాడు నాయన. ఎన్నోసార్లు ఆకుల గంపెత్తుకొని శింగనమలకు వొచ్చినాడేమో, నాయనకు శింగనమల విషయాలన్నీ తెలసినట్లుందని అనుకుంటా నాగభూషణం వెంట హైస్కూల్ దగ్గరికి పోయినాం.
అంతా పెంకుల బిల్డింగ్ చాలా ఎత్తుగా వుంది. ఎదురెదురుగా రెండు బిల్డింగులూ, ఆ రెండిటినీ కలుపుతా వెనకల అడ్డంగా వొగబిల్డింగూ, దూరం నుంచి చూస్తే సందులు ల్యాకుండా కరిపిచ్చిన పొయ్యి గుండ్ల మాదిరుంది. అడ్డంగా వున్న బిల్డింగ్ పైభాగంలో మాధ్యమిక పాఠశాల అని రాసిన అక్షరాలను చూసి ఇది హైస్కూలు కాదేమో అనుకుండాను. నాగభూషణం వాళ్ళ క్లాసులోకి పోతా హెడ్మాష్టర్ రూం చూపిచ్చి, ప్రార్థన అయిపోయిన తర్వాత హెడ్మాష్టర్ని కలవండని చెప్పినాడు. అంతలోనే బెల్లు కొట్టినారు. పిల్లలందరూ మూడు బిల్డింగుల మధ్యలో వుండే జాగాలోనికి వొచ్చి వొక్కొక్క తరగతి పిల్లలు వొక్కొక్క పక్క బేర్లు బేర్లుగా నిలబడినారు. వొగ పెద్దపిల్లోడు పిల్లలకు ఎదురుగా నిల్చుకుండాడు, ఆ పిల్లోనికి కొంచెం ఎడంగా, వొగ రైతు మాదిరుండే గోసిపంచమనిషి వొచ్చి నిలబడినాడు, ఆయనకు బోడిగుండు వెనకల వొగ పిలక జుట్టు వుంది. ఆయనేనేమో హెడ్మాష్టర్ అని అనుకుండాను. ఆయన పక్కన నిల్చుకోనుండే పెద్దపిల్లోడు స్కూల్ లీడర్ అనుకుండాను. చూస్తా వుండంగనే ఆ పిల్లోడు గట్టిగా అటేన్షన్ అని అరిచినాడు. పిల్లోళ్ళందరు కాళ్లను నేలమింద గట్టిగా కొట్టి రెండు పాదాలనూ కలిపి రెండు చేతుల పిడికిళ్లు బిగిచ్చి పక్కతొడల మిందికి చాపినారు.. ఆ పిల్లోడు మళ్ళీ ఎందోగట్టిగా చెప్పినాడు, పిల్లోళ్లు ఈసారి పాదాలను ఎడం చేసి గట్టిగా నేలకు కొట్టి రెండు చేతులను వెనకల నడుములు మింద పెట్టుకుందారు. ఆ పిల్లోడు మల్లా ‘అటెన్షన్’ అని అన్న్యాడు. పిల్లోళ్లందరు మొదటిసారి చేసినట్ల చేసినారు. అప్పుడు ఆ లీడర్ ప్రేయర్ అని అన్న్యాడు. అందరూ ‘సరస్వతి’ అని ప్రార్థన చేసినారు. అదయిన తర్వాత పిల్లలందరూ క్లాసు రూముల్లోకి వెళ్లిపోయినారు.
నాయనతో పాటు నేను బయట నుండి అదంతా గమనిచ్చసాగినాను. నాకు భలే బాగుందనిపిచ్చింది. తరగతులకు పోయినంక నేను కూడా అట్ల స్కూల్ లీడర్ అయితే ఎంత బాగుంటాదో అనుకుండాను. మేము హెడ్మాష్టర్ రూములోకి పోతావుండంగనే ఇంకా ఇద్దరు ముగ్గురు స్కూల్లోకి చేరల్లని వొచ్చినారు. నేను వాళ్లను పలకరిచ్చినాను. ఇద్దరు పిల్లోళ్లు రంగారెడ్డి, కృష్ణారెడ్డి శివపురం నుంచి వొచ్చినారు. ఇంకొక్క పిల్లోడు రామలింగారెడ్డిది గోవిందరాయునిపేట.
బెల్లు గొట్టిన మనిషి నన్నూ నాయననూ హెడ్మాష్టర్ రూములోకి పంపిచ్చినాడు. ఆ రూము బయట పంచగోడకు వొగ చెక్కపలక తగిలేసినారు. దాని మీద బి. అశ్వత్థప్ప హెడ్మాష్టర్ అని రాసినారు. నాయన వెంట నేను లోపలికిపోయినారు. హెడ్మాష్టరు సారు నాయనను పలకరిచ్చినాడు. పిల్లోన్ని ఆరోతరగతిలో చేర్చడానికి వొచ్చినావా అని అడిగినాడు. అవునయ్యా! అని నాయన మా ఊరి స్కూల్లో నుంచి తెచ్చిన సర్టిఫికెట్ ఇచ్చినాడు. హెడ్మాష్టరు హైస్కూలు బుక్కులో నా పేరు రాసుకోని, నా పుట్టిన తేదీ అడిగినాడు. 1-7-1946 సార్ అని నేను భయపడకుండా చెప్పినాను. ఆరోజే పుట్టి నావని నీకెట్ల తెలుసురా అని ఆ సార్ అడిగినారు. మా వెంకటస్వామి అయవారు ఇచ్చిన సర్టిఫికెట్లో వుంది కదా సార్ అని నేను గట్టిగా చెప్పినాను. ‘వెరీ గుడ్. బాగా శ్రద్ధగా చదువు కోవల్ల. స్కూలుకు తప్పిచ్చుకోకుండా రెగ్యులర్‌గా రావల్ల. అటెండెన్సు తక్కువయితే కూడా ఫెయిల్ చేస్తాం, తెలిసిందా!’ అని భయంచెప్పి అటెండెన్స్ బుక్కులో నాపేరు రాసినాడు. నా తర్వాత ముగ్గురు పిల్లోల్లు చేరినారు. పీవన్ని పిల్చి మమ్మల్నందరినీ ఆరోక్లాసులో కూర్చోబెట్టమన్న్యాడు. ఆయప్ప వెంట మేము క్లాసు రూములోకి పోయి కూర్చుండాం. ఊర్లోకి పోయొస్తానని నాయన బయటికి పోయినాడు.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
