Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాతి పర్రెలలో నుంచి..-11

[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]

కొత్త స్కూలు, కొత్త ఉత్సాహం

నేను  ఐస్కూల్లో చేరినానని అమ్మయ్య చాలా సంబరపడసాగింది. మిషన్‌ కుళ్లాయప్ప తాతను అడిగి నేను పుస్తకాలు పెట్టుకొని హైస్కూలుకు పొయ్యేకి వొగ చెయిసంచిని కుట్టిచ్చుకొని  వొచ్చింది. మా వెంకటస్వామి అయవారు స్కూలు పాత రికార్డు బుక్కుల్లో కాగితాలను చించి, నోటు బుక్కుల కోసరం ఇచ్చి, వొగ కొత్త పెన్సిల్‌ గుడకా చేతిలోపెట్టి ఈసారి  వొచ్చినప్పుడు వొగ పెన్ను ఇస్తానన్నాడు. ఆ సారు  నా మీద అంత నెర్లు చూపుతా వుంటే నాకు చాలా సంతోషమయ్యింది.

మరుసటి రోజు నేను పొద్దున్నే లేచి ప్యాడాగసువు నూకి దిబ్బలో వేసొచ్చినంక బిరీన పోయి ఏటిమడుగులో దబ్బ జమ్ముకోసుకొని  వొచ్చి, గాటిపాట్న పరిచినాను. స్కూలుకు టైమయితుందని గబగబ బొగ్గూ, ఉప్పూ నూరిన పొడితో పండ్లు తోముకొని, రెండు చెంబులు నీళ్లు పోసుకొని ఇంటికి వొచ్చేలోపలే అమ్మయ్య కంచుపల్లెంలో వేడివేడి అన్నం పెట్టింది. నేను హైస్కూలుకు పోతానని అమ్మయ్య నసుకులోనే లేచి అదంతా చేసిందని మురిసిపోతా అన్నం తిని కొత్త అంగీ నిక్కరూ తొడుక్కుంటావుంటే అమ్మయ్య చెక్క దువ్వానితో తలకాయ దువ్వుతా, ‘ఇంత వొత్తుగా వుండే నీ యెంటకల్లో దువ్వేకి ఇట్లా దువ్వాన్లు తట్టు కోవప్పా. ఈటికే మూడు దువ్వాన్లు ఇరిగిపోయినాయి’ అని నా జుట్టును, తిడతానే మెచ్చుకుంది. పయిటాల బువ్వ వొగ సిలవరి (సత్తు) క్యారీర్లో పెట్టి ‘జాగర్త బంగారూ’ అని సాగనంపుతా తన వక్కాకు చిత్తిలో నుంచి తీసి వొగ అణా నా చేతిలో పెట్టింది.

సంకలో పుస్తకాల బ్యాగు తగిలేసుకొని బజారుగుండా పోతావుంటే అందరూ నా పక్క చూస్తా వుంటే నా యెదలు ఉబ్బుకున్నెట్లయినాయి. ముఖంలో జెంబం పారాడినట్లయింది. ఊరి బయట మా గడ్డి దొడ్డి దగ్గర ఇరుక్కంతుకాడ, మేము, ఐస్కులుకు పోయే వాళ్లందరమూ కలుసుకుండాం. నాగభూషణం, మాదిగోళ్ల కుళ్లాయప్పా నేసేవాళ్ల నారప్పా, ఈడిగోళ్ల కొండన్నా, జానగొండ నారాయణ, జోడోళ్ల ఓబుళ నారాయణా, కురవోళ్ల కోనయ్యా అంతా పదిమంది జమయినాం. కాలువ వెంట వరుసగా పోతావుండాం. కుళ్లాయప్ప నా ముందు నడుస్తా తన దగ్గర రెండు పెన్నులుండాయని, వొగటి, రోంత స్క్రూ లూజయిందని, ఇంటికొచ్చినంక దానికి నైస్‌ దారం చుట్టుకొని ఇంకు పోసుకుంటే బాగా రాస్తాదని, నాలుక (నాబ్‌) చాలా బాగుందని నాకు ఇచ్చినాడు. దాని క్యాప్‌ భలే బాగుంది. వెంటనే జోబీకి చెక్కుకొని చూస్తా మురిసిపోయినాను.

అందరూ దారెంట నడుస్తా ఐస్కూల్లోని అయవార్లను గురించి మాట్లాడుకోసాగినాం. హెడ్మాష్టర్‌ అశ్వత్థప్ప సార్‌ చాలా స్ట్రిక్ట్‌ అని, అయితే పేద విద్యార్థులంటే ఎంతో ప్రేమ చూపుతాడని, ఎప్పుడూ ముతక గోసి పంచె, జుబ్బా వేసుకొని భలే సింపుల్‌గా వుంటాడని చెప్పుతావుంటే వాళ్లు చెప్పే పదాలు స్ట్రిక్ట్‌, సింపుల్‌ అనేవి నాకు అర్ధం కాలేదు. కుళ్లాయప్పను అడిగి తెలుసుకందామనుకున్నా. భారతం సుబ్రమణ్యం, భీమప్ప సార్లకు కోపమెక్కువని, వాళ్లంటే పిల్లోళ్లందరూ హడల్‌ అని, పాఠం అప్పజెప్పకుంటే ఈత బర్రతో వాంచుతారని చెప్పుతావుంటే  ఐస్కూల్లో గుడకా అయ్యవార్లు స్టూడెంట్స్‌ను కొడతారా అని అనుకుండాను. మేము అట్ల మాట్లాడుకుంటా పోతావుంటే, మరవంక దాటి కొంచెం దూరం పోతానే శివపురం వాళ్లు కృష్ణారెడ్డి, రంగారెడ్డి ఇంకా ఇద్దరు మాతో  కలుసుకుండారు. అందరమూ బెల్లుకొట్టే లోపలనే స్కూల్లోకి చేరుకుండాం. మా తరగతి రూములో బ్యాగులూ, క్యారీర్లూ పెట్టి ప్రేయర్‌ చేసేచోటికి పోయినాం.

మా ఆరోతరగతి పిల్లోళ్లందరూ వొగచోట మూడు బేర్లుగా నిలబడినారు. స్కూల్‌ లీడర్‌ అటేన్షన్‌ అని చెప్పుతా వుంటే, నేను నాముందుండే పిళ్లోని కాళ్లపక్క చూస్తా అడుగులేసి, ఇంతేనా అనుకుండాను. ప్రేయర్‌ అయిపోగానే అందరమూ క్లాస్‌ రూములోకి పోయినాం. మొదటి పీరియడ్‌ ఇంగ్లీషు భీమప్ప సార్‌  వొచ్చినాడు. అందరమూ పైకి లేచి గుడ్‌మార్నింగ్‌ సార్‌ అని చెప్పి, నల్లబండలు పరిచిన నేలమీద కూర్చుండాం. సారు అందరినీ పేర్లతో పిలుస్తా అటెండెన్స్‌ తీసుకుండాడు, కొత్తగా చేరిన మమ్మల్ని కొంత మందిని వివరాలు అడిగినాడు. నేను పైకి లేచి నా పేరూ, వూరి పేరూ, నాయన పేరూ చెప్పినాను.

భీమప్ప సారు, పిల్లోల్లందరికీ  ABCD లు బోర్డు మీద రాసి పలుకుతా మా చేత పలికించినారు. F వరకూ రాసి అందరి చేత పది పదిసార్లు పలికిచ్చినాడు. బోర్డు వైపు చూసి చెప్పిచ్చినాడు. అందరికీ మా చూచివ్రాత పుస్తకాల్లో మొదటి లైన్లో రాసి పెన్సిల్‌తో అదే మాదిరి పది పదిసార్లు రాయమని చెప్పినాడు. పలక మింద రాసేది అలవాటయిన మాకు పుస్తకంలో రాయడం కష్టమనిపిచ్చింది. ఇంగీషక్షరాలు రాయడం అదే మొదటిసారి! హైస్కూల్లో చేరినాను. కష్టపడి రాయల్సిందేనని అనుకుంటా మెల్లగా రాసినాను, అవస్థపడి రాస్తా వుండంగనే బెల్లు కొట్టినారు. భీమప్ప సారు వెళ్లిపోయినాడు. ఇంకొగ సారు  వొచ్చినాడు. ఆయన తెలుగయివారంట. పేరు భారతం సుబ్రమణ్యం. క్లాసులోకి రాగానే, మేము అల్లరి చేస్తావుండామని అందరినీ కోపంగా ఇంగ్లీషులో తిట్టినాడు. తెలుగయివారు ఇంగ్లీషులో ఏమని తిడతా వుండాడో నాకు అర్థం కాలేదు. నేను నా పక్కనుండే వాణ్ణి అడిగినాను. అది గమనిచ్చి, నన్ను పైకి లేపి “రేరు గాడిదా యేవూరు నీది? ఎందుకు పక్కవానితో మాట్లాడుతున్నావు? క్లాసులోకి టీచర్‌ రాంగానే సైలెంట్‌గా వుండాలనే జ్ఞానం లేదా? ఇంకోసారి మాట్లాడినావంటే తోలు తీస్తాను రాస్కెల్‌, సిడౌన్‌” అని కోపంగా తిట్టినాడు. నేను భయపడతా మౌనంగా కూర్చుండాను. చాలా సేపు అందర్నీ తిట్టి నీతులు చెప్పి, ఆ తర్వాత సుభాషితాలు అనే పాఠంలోని మొదటి పద్యం, చదివి అర్థం చెప్పినాడు. కొంతమందితో పద్యం చదివిచ్చినాడు. రంగారెడ్డి, కొండన్నా పద్యాన్ని తప్పులు తప్పులు చదివినారు. వాళ్లను కోపంగా తిడుతా ‘మాంసం తినే శూద్రజాతి నాయాళ్ళకు మీకెందుకురా చదువు, మాంసం తిని వొక్కొక్కనికి నాలుకలు అరచేతి మందమున్నాయి’ అని కోపంగా అరిచినాడు.

నేను నాగభూషణంతో తెలుగు వాచకం కూడా ఇప్పిచ్చుకోని ఎండకాలం సెలవుల్లో వేమన పద్యాలన్నీ నేర్చుకొని వుండాను. పైకిలేచి నేను చదువుతాను సార్‌ అని అడుగుదామను కుండాను, ఆయన తిట్టే తిట్లను చూసినంక నాకు ధైర్యం రాలేదు. నా వొంతొచ్చినప్పుడు చూస్తాములే అని వూరుకుండాను. అంతలోనే రెండో బెల్లు, వొంటేలుకు పోయే బెల్లు కొట్టినారు. ఆ సార్‌ వెళ్లి పోగానే పిల్లోల్లందరూ బిలబిల బయటికి పోయినాం. నేనూ కుళ్లాయప్పా ఇంకా ఇద్దరు వొంటేలుకు దూరంగా పోయి తెలుగయవారును గురించి మాట్లాడుకోసాగినాం.ఆయన బాపనయవారని చాలా కోపిష్టి అని, శూద్రోళ్ళు తప్పు చేస్తే భలే తిడతాడని, పాఠం బాగా చెప్పుతాడని కుళ్లాయప్ప చెప్పినాడు. ఆయనకు మనూరి దగ్గర మడి వుందని, దాన్ని నారపరెడ్డోళ్లు గుత్తకు చేస్తారని, వాళ్లకు తప్పా వేరేవాళ్ళకు ఈడని చెప్పినాడు. మేము అవీ యివీ మాట్లాడుకుంటా వుండంగనే లోపలి బెల్లు కొట్టినారు. మేము మా క్లాసులకు పరుగెత్తి పోయినాం.

మూడో పీరియడ్‌ మొదలయింది. హిందీ అయవారు  వొచ్చినాడు. అయన పేరు మహబూబ్‌ ఖాన్‌ అంట. మనిషి పయిల్మాన్‌ మాదిరి బలంగా వుండాడు. అందరినీ ప్రేమగా పలకరిచ్చి అటెండెెన్సు తీసుకుండాడు. హిందీ అక్షరాలు అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ వరకూ బోర్డు మీద రాసి చదివినాడు. ఇవి ఇంగ్లీషులో మాదిరి కాకుండా తెలుగులో ఉన్నట్లే అచ్చులని నాకు సంతోషమైంది. వేరే భాష కాబట్టి అక్షరాలు మాత్రం వేరేగా వుండాయని, సులభంగా నేర్చుకోవచ్చునని అనుకుండాను. ఆ సారు అందరి నోటుబుక్కులూ తీసుకొని పైనుండే లైను మీద, బోర్డు మీద రాసిండే ఎనిమిది అక్షరాలనూ రాసి, అదే మాదిరిగా వొగ లైను వదలి మరొక లైను మింద పదిసార్లు రాసుకొని  వొచ్చి రేపు చూపమన్నాడు. ఆందరమూ మా నోటు బుక్కులు సార్‌తో ఇప్పిచ్చుకొని పెన్సిల్‌తో క్లాసులోనే చూచి వ్రాత మొదలు పెట్టినాం. తర్వాత నాలుగో పీరియడ్‌లో సైన్స్‌ సార్‌  వొచ్చి జీవశాస్త్రం గురించి చెప్పినాడు. ఆయన పాఠం చెప్పుతావుంటే భలే వినబుద్ధి అయింది. టైం ఎప్పడు అయిపోయిందో యేమో లాంగ్‌ బెల్లు కొట్టినారు.

పల్లెల నుంచి  వొచ్చిన పిల్లోళ్లలందరూ క్యారీర్లు తీసుకొని భోంచేసేకి వూరి బయటకి పోతావుండారు. నేను మావూరి వాళ్ళవెంట, ఊరి బయట, తలబాలకట్టకు ఉత్తరం వైపున ఫర్లాంగు దూరంలో కొండదడిలో వుండే చెలమ దగ్గరికి పోయినాను. చెలమలో నీళ్లు టెంకాయపాల మాదిరి వుండాయి. నీళ్ల పైన అంతరగంగ ఆకు తేలాడతా వుంది చెలమలో నీళ్లు చిన్నగా బయటికి పారతా వుండడంతో అక్కడ పచ్చగా సొంటిగడ్డి పెరిగింది. చెలమలోకి దిగకుండా అందరమూ బయట నుంచే కాళ్ళూ మొగాలు కడుక్కుండాం.  అంత ఎండకాలంలో గుడకా నీళ్లు చల్లగా వుండి మెల్లగా బయటికి పారుతా వుంటే చూసి, మావూరి ఊరకొండా దేవరగొండల దడుల్లో వుండే చెలమలను గుర్తుచేసుకొని సంతోషపడినాను. అయితే మా వూరి దగ్గరుండే చెలమల్లోని నీళ్ల కంటే ఇవి భలే తీయగా వుండాయనిపించింది.

పిల్లోళ్లం అందరమూ చెలమ పక్కన బండల మింద కూర్చోని క్యారీర్ల మూతలు తీసి అన్నం తినడానికి సిద్ధమయినాం. మా వూరి నాగభూషణం, మాకు కొంచెం ఎడంగా కూర్చుండాడు. అట్లే కుళ్లాయప్ప ఇంకొగపక్క మాకు దూరంగా కూర్చుండాడు. నాగభూషణం కోమటోళ్ల మనిషి. తాను మాకంటే పెద్దకులస్థుడు. తనకు ఆ ఆలోచన మనసు నిండా వుంది. అందుకే మాకు దూరంగా కూర్చుండాడు. అట్లే కుళ్ళాయప్ప ఆ పిల్లోడు మాకంటే తక్కువ కులస్థుడు. తనకూ ఆ ఆలోచన మనసు నిండా వున్నట్లుంది. అందుకే తానూ మాకు దూరంగా కూర్చుండాడు. స్కూల్లో అందరమూ పక్కపక్కనే కూర్చుంటా వుండాం అట్లాది అన్నం తినే దగ్గర ఇట్ల దూరదూరంగా కూర్చోవడం ఎందుకు? నాకు ఎందుకో కొతుకనిపిచ్చింది. ఈ పొద్దుగాక పోయినా ఇంకా కొన్నాళ్లకయినా కుళ్లాయప్పను దగ్గరికి పిలుచుకోని అన్నం తినల్లని అనుకుండాను.

ఇది గొల్ల కొండరాయుని కొండంట. అందరూ దీన్ని గోల్‌ కొండ్రాయునికొండ అని అంటారు. చెలమకు ఇంకా కొంచెం పైన గోల్‌ కొండ్రాయ స్వామి గుడి వుంది. ఆ గుడికి పోడానికి మాదిగిండ్ల దగ్గర్నుంచీ మెటికలుండాయి. మేము అన్నం తినే చోట్నుంచీ శింగనమల ఊరంతా కనిపిస్తావుంది. అట్లే దూరంగా పోతురాజు కాలువా, చక్రాయపేటా, మా బండమీదపల్లె, శివపురము, శింగనమల చెరువూ, చెరువులో నీళ్ళూ బాగా కలిపిస్తా వుండాయి. అంతలక్కా చూసుకుంటా వొగరినొగరు పలకరిచ్చుకుంటా పయిటాలన్నం తిని కడుపునిండా నీళ్ళు తాగినాం. మా క్యారీర్లో తెచ్చుకోనుండే బువ్వకంటే చెలమ నీళ్లే భలే రుచిగా వుండాయనుకుండాం. కాళీ చేసిన క్యారీర్లను కడుక్కుంటా అది యిది మాట్లాడుకుంటా మధ్యాహ్నం స్కూలుకు టైమయితుందని గబగబా గుట్టదిగి మా బడి దగ్గరికి చేరుకుండాం. చేరుకున్నెంక రోంత సేపటికే స్కూలు బెల్లు కొట్టినారు.

మధ్యాహ్నం మొదటి పీరియడ్‌ లెక్కలు. లెక్కల క్లాసుకు హెడ్మాష్టర్‌ అశ్వత్థప్పసారు  వొచ్చినాడు. ఆయన క్లాసులోకి రాగానే అందరూ గప్‌ చిప్‌. ఆ సారంటే అందరికీ భయమంట, పాఠం చెప్పేటప్పుడు చీమ చిటుక్కు మనగూడదంట! మనిషి ప్రశాంతంగా వుంటాడు. యానాడూ స్కూలుకు లీవు పెట్టేది గానీ, క్లాసుకు లేటుగా వచ్చేది గానీ, అనవసరంగా మాట్లాడేదిగానీ వుండదంట! అందుకే ఆయనంటే పిల్లల్లకే కాదు, ఆయవార్లకు కూడా భలే గౌరవమంట, క్లాసులోకి రాగానే ఎక్కాలు అడిగినాడు. నన్ను పదమూడవ ఎక్కం చెప్పమన్నాడు, నేను గడగడ చెప్పేశాను. సారు నన్ను మెచ్చుకుండాడు. కొంత మందికి మూడంకెల హెచ్చింపులు, నాలుగంకెల భాగింపులు ఇచ్చినాడు. నేను భాగింపు లెక్క బిరబిర చేసి చూపించినాను. సారు మళ్లీ మెచ్చుకుండాడు.

ఆరో పీరియడ్‌ సోషియల్‌ సారు రాలేదు. ఏడవ పీరియడ్‌ డ్రిల్‌ క్లాస్‌. డ్రిల్లయవారు చిదంబరరెడ్డి సారు. స్కూలు బిల్డింగుకు పడమరవైపున విశాలంగా వుండే స్థలంలో ఆ సారు మాకు ఎక్సైజులు చేయిచ్చినాడు. అదేదో కోకో అంట, అది ఆడిచ్చినాడు. ఆ ఆటల్లో మునిగిపోయిన నాకు స్కూలు వొదిలే లాంగ్‌ బెల్‌ కోట్టే వరకూ టైమే తెలియలేదు.

స్కూల్‌ వొదలగానే మా వూరి పిల్లోళ్లూ, శివపురం పిల్లలూ అందరమూ జమై వూర్లకు బయలుదేరినాం. బీటిమళ్లల్లో దావ గెనుము పక్కనే ఏర్పడిన దారెంట వొగరి వెనక వొగరు నడుస్తా మాట్లాడుకుంటా పోతావుండాం. ఇంకా అలవాటులేని దావకింద చూసుకుంటా జాగ్రత్తగా నడుస్తా స్కూలుకు పోయినప్పట్నుంచీ స్కూలు వొదిలే వరకూ గడిపినదంతా నెమరేసుకోసాగినాను.

ఐస్కూలు వాతావరణం ఎంత బాగుందో! లెక్కలకు వొగరూ. ఇంగ్లీషుకు వొగరూ తెలుగుకు మరొగరూ ఇట్ల వొక్కొక్క సబ్జెక్టుకు వొక్కొక్క అయ్యవారు  వొచ్చి పాఠం చెప్పడమూ ప్రతి పీరియడుకూ వొగరు మారుతా వుండడమూ ఉదయం ప్రేయర్‌, సాయంత్రం ఆటల క్లాసులూ అన్నీ ఎంత బాగుండాయో! వొగ కొత్త రకమైన చదువు, రకరకాల వూర్లనుంచీ వొచ్చే పిల్లోళ్లు, ఆరు, ఏడు తరగతుల పిల్లోళ్లకు లేవు గానీ ఎనిమిదో తరగతి నుంచీ పిల్లోల్లందరికీ  బెంచీలు, డెస్కులూ వుండాయి. ఆ క్లాసులకు పోయినంక బెంచీల మింద కూర్చొని పుస్తకాల బ్యాగులు డెస్కులోపల పెట్టి డెస్కుల మింద నోటు బుక్కులు పెట్టుకోని రాసుకుంటే ఎంతబాగుంటాదో! చదువంటే ఇట్లుండల్ల! అయ్యవార్లు పాఠాలు ఎంతబాగా చెప్పుతారో!

తీయగా కమ్మగా ఆలోచన చేసుకుంటూ ఇల్లు చేరుకుండాను. ఇంటికి పోతానే నేను రాసిన ఇంగ్లీషు, హిందీ అక్షరాలను అమ్మానాయనలకు చూపినాను. చూసి వాళ్లిద్దరూ ఎంతో సంబరపడతా మురిసిపోయినారు. వాళ్ల ఆనందాన్ని చూసినంక నాకు కొండంత బలమొచ్చింది.

నేను ఐస్కూల్లో చేరినందుకు మాకు గుత్తకు పొలం ఈలేదు!

వానకాలమొచ్చింది. చెరువులకి నీళ్ళు, వొగపంటకు అయ్యేటన్ని  వొచ్చినాయి. ఢిల్లీ భోగాలొడ్లు నార పొయ్యల్లని అనుకోని నాయన, మడి ఆసామి చిన్న పాపయ్యను అడగడానికి వాళ్లింటికి పోయినాడు. ‘ఈ సమ్మత్సరము మడిని వేరే వాళ్లకు ఇచ్చినాను వెంకటస్వామి! అప్పుడే మాటయిపోయింది’ అని అన్న్యాడు పాపయ్య. ఆ మాట వింటానే నాయన గుండెలు అదిరినాయి. పెదవులు అరిపోయినాయి,

“అదేంది పాపయ్యా, అట్లంటావు? మూడేండ్లు నాకే ఇత్తానని మాటిచ్చి ఇప్పుడు, మాట తప్పితే ఎట్లయ్యా? తీరా నార్లు పోసే టైములో మడి ఇవ్వనంటే ఇప్పుడు మా గతేమి? పోయిన సమ్మత్సరం ఇరుగారూ నువ్వు చెప్పినట్లే ఎరువులు తోలి మంచి పంట పండిచ్చి సరిగోరు పంటా, గడ్డీ ఇత్తిమి గదయ్యా! అంతా నువ్వు చెప్పినట్లే చేసినాము. మేము నీకు యానాడన్నా ఇబ్బంది కలిగిచ్చినామా పాపయ్యా” అని నాయన గట్టిగానే నిలదీసినాడు.

“అవును వెంకటస్వామీ, పోయినేడు నేను చెప్పినట్లే ఎరువేసి మంచి పంట పండిచ్చినావనుకో, నేను కాదనను. ఈసారి మీ దిబ్బలో వొగ అయిదారు బండ్ల ఎరువన్నా వుందా? మడిలో గుడకా కనీసం రెండు బండ్ల దిబ్బన్నా కుప్పేసినారా అంటే అదీ లేదు, నువ్వేమో ఆకుల గంపెత్తుకొనిపోయి వారం దినాలయినా ఇంటిపక్క రావు. నీపెండ్లామేమో బాలింతరాలాయ. చేతికొచ్చిన కొడుకన్నా మా మడి సంగతి చూసుకుంటాడనుకుంటే వాన్ని సదివిచ్చల్లని హైస్కూల్లో చేరిపిస్తివి. ఇంగెవురు, కోరుకిచ్చిన మా మడిని సరిగ్గా చూసుకుండేది? అందుకే వొగ మంచిరైతుకిస్తే సక్రమంగా పంటబెట్టుకుంటాడని రొట్టేవాళ్ల పుల్లప్పకు మా మడి గుత్తకిచ్చినాను వెంకడస్వామీ! నిన్ననే మాటయి పోయింది” అని రోంతన్నా దయలేకుండా చెప్పినాడు పాపయ్య.

చేసేదేమీ లేక దిగులుపడతా వొచ్చి అమ్మయ్య మింద కోపగిచ్చుకుండాడు నాయన. నా మనసంతా యెట్లెట్లో అయ్యింది. అమ్మయ్య నెమ్మదిగానే నాయనకు ధైర్యం చెప్పింది. వాళ్ల మడి కోరుకుచేసుకుంటా వుండామని వాళ్లు చెప్పినట్ల మనం బతకల్లనా? వాళ్లు మనకు ఆ మడిని దానమిచ్చినారా? వాళ్ల మడి కాకుంటే యింగొగ మడాయ! యాదీ దొరక్కుంటే కట్టపడి బతికేకి రెక్కలుండాయి గదా! అంతగా దిగులుపడితే యెట్ల? ఇంటందరమూ రెయ్యింబగలూ పనిజెయ్యకుండానే వాళ్ల మడి పండిందా? మడిలో నార బోసినప్పట్నుంచీ కల్లం వొడిపే దంకా ఇంటందరమూ చేసిండే పనికి రావల్సిన కూలిగింజలే గద! ఆ మడిలో వొచ్చిండే వొడ్లగింజలు, ఇంగ ఇరవైబండ్ల యెరువూ, యిత్తనాల గింజలూ మడి నాటిచ్చినదానికీ, కలుపు తీయిచ్చిన దానికీ, యూరియాలకూ, గీరియాలకూ పెట్టిన దుడ్లన్నీ మొత్తం లక్కేత్తే యెంతయితాదని!’ చాలా అక్కసుతో అడిగింది అమ్మయ్య. నాయన ఇంకేమీ మాట్లాడకుండా గొనుగుతా ఇంటిబయట మంచం మింద కూర్చొని ఆలోచన చేయసాగినాడు.

నాయన నన్ను ఐస్కూల్లో చేర్చి నాడనే ఈర్ష్యతోనే ఆ పాపయ్య మాకు గుత్తకు మడి ఇవ్వలేదా! నిరుడు మావూరి మాగాణిలో ఎవురూ పండించనంత ఢిల్లీ భోగాల పంట పండిచ్చినామే! వేసవి పంట గుడకా ఎవురికీ తీసిపోనంత పండిచ్చినామే! అది గుడకా ఆ శెట్టికి కనిపిచ్చలేదా! నేను చదువుకుంటే ఆయప్ప పొలాన్ని అశ్రద్ధ చేస్తామా? అమ్మయ్య అన్నెట్ల ఎరువులూ, మందులూ, కూలి డబ్బులూ అన్నీ లెక్కవేస్తే వరి పంటంతా మాకు రావల్సిందేనే! నేను చదువుకుంటే ఈయప్పకు ఇబ్బందేమిటి? పేదోడు చదువుకో కూడదా! జానెడు పొలం లేని కూలోని కొడుకు చదువు కోవల్లనుకుంటే, పావుకార్లు ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డుపడతారు! ఇదంతా చూస్తా వుంటే తన చదువు ఏమయితుందో యేమో! ఏమయినా సరే, బాగా చదువుకొని, ఎగతాళి చేసిన వాళ్లముందరే వొగ గొప్ప ఉద్యోగస్థునిగా తలెత్తుకొని తిరగల్ల! మరి కాలం ఏమి చేస్తాదో చూడ్లల్ల! అనుకుంటా గేళి చేసిన వాళ్ల్లందరి మింద కసి పెంచుకుండాను మనసులో, నా చదువుతోనే వాళ్లను తలదించుకునే తట్ల చెయ్యల్లనుకుండాను.

***

వానకాలం  వొచ్చినా వానలు సరిగా రాలేదు. పోయిన సమ్మత్సరము నీళ్లే చెరువులో కొన్ని మిగిలినాయని, ఆ నీళ్లతో పొలాల్లో నార్లు పోసుకుంటే, నారు వచ్చేలోగా వానలొచ్చి చెరువుకు నీళ్లు తప్పకుండా వస్తాయన్న ఆశతో మాగాణి రైతులందరూ మాట్లాడుకొని నార్లు పోసినారు, నార్లు పోసిన నెలదినాలకయినా తగినంత వర్షం రాక, చెరువుకు నీళ్లు రాలేదు. రైతులకు దిక్కు తెలియలేదు, కొంచెం తగ్గుప్రాంతాల్లో వుండే పొలాల్లో, పైన్నుంచీ జారొచ్చిన ‘పులుసు నీళ్ల’తోనే సేద్యం చేసి కొంతమంది రైతులు ధైర్యంతో వరి నాటుకుండారు. తీరా వరి నార్లన్నీ ముదిరి పోయినంక చెరువుకు వొగపంట నీళ్లొచ్చినాయి. దాంతో కొంత మంది రైతులు గబగబా మళ్ళు దున్ని ముదిరిపోయిన నారునే నాటేసుకుండారు. మరికొంతమంది తమ మళ్లను గబగబా అదును చేసుకొని, వొంకొడ్లనూ, చెన్నంగొడ్లనూ నారు పోయకుండా, నేరుగా చల్లుకుండారు.

నేను మా వూరి పిల్లోళ్ళతో కలసి స్కూలుకు పోయి బాగా చదువుకుంటా వుండాను. మాకు గుత్తకో, కోరుకో మడి దొరకలేదని పశువుల కింద గాటిపాట్న, గాదీ, గాదమూ ఆకులూ, అలములూ, నలీనట్రా వెయ్యడం కానీ దొడ్లో ఎరువు దిబ్బను పెంచ్చుకోడంగానీ తగ్గిచ్చలేదు. ప్రతి దినమూ మా దేవరకొండకు పోయి గడ్డి కోసుకొని రావడమూ ల్యాకుంటే మరవంక మడుగుల్లోకి పోయి జమ్ము కోసుకొని రావడమూ మానుకోలేదు. ఇవన్నీ చేస్తా అందరితో పాటు టైముకు స్కూలుకు పోతా ఇంటి పనుల్లో అమ్మయ్యకు సాయపడతా వుండాను. శని ఆదివారాల్లో మాత్రం, ముందుగా ఎవురికి అవసరమో తెలుసుకొని వాళ్ల మళ్ళల్లోకి దున్నపోతుల్తో మడక కట్టుకొని బాడుగ మడక తోలి రెండు దినాలకు మూడు రూపాయలు మడక బాడుగా పయిటాల నుంచి సందకాటి వరకూ పారతో గెనాలు జవిరి పెల్ల తొక్కినందుకు రెండు దినాల కూలి  రెండు రూపాయలు మొత్తం ఐదు రుపాయలు అమ్మయ్య చేతికి ఇస్తాను. నాయన ఆకులు అమ్ముకొని  వొచ్చినంక అమ్మయ్య విషయం చెప్పి, ఆ దుడ్లు నాయనకు యిస్తాది. నాయన ఎంతో ఊరట పడతాడు, అమ్మా నాయన లిద్దరూ ఆ ప్రకారంగా ఊరట పడితే నా చదువుకు ఇబ్బంది కలుగదని, పని బరువయినా సరే అలసట చెందకుండా వుంటావుండాను.

ఇట్ల కాలం గడిచి పోతావుండంగనే చెరువులో నీళ్లు అయిపోయినాయి. తగ్గు ప్రాంతాల్లో వుండే మళ్ళు తప్పా మిగతావన్నీ బొందుబోయినాయి. పాపయ్యోళ్ల మోతలగడ్డ మడి గుడకా బొందుబోయిందంట అని తెలిసి ఇంటందరమూ సంతోషపడినాం. ఆ మడి బొందుబోయినందుకు మేము సంతోషపడలేదు. ఆ నష్టం నుండి మేము తప్పిచ్చుకున్నందుకు ఊరట పడినాం. వొగ పక్క ఊరట పడతా యింగొగపక్క మాగాణి పండింటే, ఇంట్లో ముగ్గురమూ ఎట్ల లేదన్నా ఐదారు మూటలు కూలిగింజలు జమజేసుకోనుందుము కదా అని బాధపడినాం. అట్ల బాధపడతావుంటే నాయన, యెట్ల జరగల్లనో అట్ల జరుగుతాది! అది మన యత్నమా? మనం వొగటనుకుంటే భగమంతుడు యింగొగటి తలుత్తాడు అని అమ్మయ్యను వోదార్చినాడు.

చూస్తా చూస్తా వుండంగనే సమ్మత్సర కాలం గడిచి పోయింది, నేను ఆరో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని పాసయినాను, అయవార్లందరూ మేము పరీక్షరాసిన పేపర్లన్నీ దిద్ది మాకు మార్కులు చెప్పినారు. నాకు అన్నిటిపైకీ తెలుగులో ఎక్కువ మార్కులు ఎనభై పర్సెంట్‌  వొచ్చినాయి. మిగతా పేపర్లల్లో కూడా అరవైకి పైగానే  వొచ్చినాయి. ఇంగ్లీషులో 75 మార్కు లొచ్చినాయి. మార్కులన్నీ అమ్మయ్యకు చెప్పినాను. అమ్మయ్య నాకంటే ఎక్కువగా సంతోషపడింది. నాకు మార్కులు తెలిసిన నాలుగు దినాలను నాయనొచ్చినాడు. వస్తాడని తెలసి నేను చాలా ముందుగా పిల్లిగుండ్ల దగ్గరికిపోయి కూర్చొని, నాయన దూరంగా వస్తావుండాడని గుర్తించి పరుగెత్తిపోయి నాయన నెత్తిమీదుండే గంపను నా నెత్తిమీదికి ఎత్తుకొని నాయన వెంట ఇంటి కొచ్చినాను. అది చూసి అమ్మయ్య సంతోషడింది. నాయన అమ్మయ్యతో ‘అడ్డపయికి’ నీళ్లు పోయిచ్చుకుండాడు.

నా చదువు ఆగిపోయింది, లోకమంతా చీకటే..!

మా ఐస్కూలు రీవోపనయింది. మా వూరి పిల్లోళ్లూ, నా జతగాళ్లూ అందరూ మల్లా స్కూలుకు పోతావుండారు. వాళ్లు పోబట్టి నాలుగు రోజులయ్యింది. నేను శెలవుల్లోనే కుళ్లాయప్ప దగ్గర అర్ధరేటుకు పుస్తకాలన్నీ తీసుకొని అమ్మయ్యనడిగి డబ్బులు ఇప్పిచ్చుకొని, కుళ్లాయప్పకు ఇచ్చేసినాను. నిరుడు నాగభూషణం, తన పుస్తకాలన్నీ ఫ్రీగా ఇచ్చినాడని ఈసారి కూడా అడిగినాను. వాళ్లింట్లో ఇవ్వద్దన్నారని చెప్పి ఇవ్వలేదు. నాగభూషణం తన పుస్తకాలు ఎందుకు నాకివ్వలేదో అర్థమయింది నాకు, నేను తనతోపాటు ఐస్కూల్లో చేరి చదువుతున్నందుకు వాళ్ల పెద్దోళ్లు మోతలగడ్డ మడి మాకు కోరుకు ఈలేదు. ఈయప్ప నాకు పుస్తకాలు ఈలేదు. కలిగినోళ్లకు పేదోళ్ల మింద యాలనో యింత చిన్నచూపు?రెండు దినాలయినంక, వొగనాడు పాలుతాగే పాప జయమ్మ రాత్రి పొద్దుబోయే దంకా ఏడుస్తా నిద్రపోలేదు. అమ్మయ్య పాలిచ్చినా తాగకుండా గుక్కపట్టి ఏడుస్తానే వుంది. కడుపు నస్తావుందేమో వామూ, వజా నూరి తాపేది మేలని నాయన అనడంతో నేను పైకి లేచి లాటీను అంటిచ్చి, గూట్లో వుండే వామూ, వజ డబ్బా అమ్మయ్య చేతికిచ్చి అట్లే సాన్రాయీ, గుండ్రాయీ, నీళ్ల చెంబూ అందిచ్చినాను. అమ్మయ్య నీళ్లచుక్కలు సాన్రాయి మిందవేసి వజకొమ్మును రాయి మింద సాదింది. వజ గంధం మాదిరి  వొచ్చింది. అందులోకి చిటికెడు వాము పోసి గుండ్రాయితో నున్నగా నూరింది, ఉయ్యాలలో వుండే పాప ఏడుస్తానే వుంది. నేను ఉయ్యాల ఊపుతానే వుండాను, పెద్దక్కా మిగతా పిల్లోల్లిద్దరూ గొరకబెట్టి నిద్రబోతావుండారు. అమ్మయ్య నూరిన వామూ, వజను పాలడిలోకి వేసి అందులోకి కొంచెం చనుబాలు పిండి వామూ, వజనంతా వేలుతో కలిపి పక్కన బెట్టి, కాళ్లు చాపుకొని ఉయ్యాల్లో వుండే పాపను కాళ్ల మింద ముఖము తన వైపు తిప్పి వెల్లకిలా పండుకోపెట్టింది. పాప ముక్కు మూయమని నాతో చెప్పి వొగచేత్తో పాపనోరు తెరిచి ఇంకోచేతిలో పాలడి పట్టుకొని వామూ వజ కలిపిండే నీళ్లను నోట్లోకి పోసింది. పాప తాగకుండా నాలుకను బయటకు తోస్తావుంటే పాలడి కొనను నోట్లోకి పెట్టి పోస్తూ ఎడమ చేతితో దొమ్మల్ని సాదుతా కడాకు అంతా తాపింది. వామూ, వజా కారంగా వుందేమో, ఇంకా గట్టిగా ఏడవసాగింది పాప, అమ్మయ్మ మళ్ళీ కొన్ని చనుబాలు పాలడిలోకి పిండి, బలవంతంగా  పాపనోట్లో పోసింది. పైకి లేచి, పాపను పక్కెదకు ఆనిచ్చుకొని  బయటకొచ్చి చేతితో తట్టసాగింది. వొగపది నిమిషాలకల్లా పాప ఏడువు మానింది. అంతటితో ఇంట్లోకొచ్చి మంచం కోళ్ళకు కట్టిన వుయ్యాల్లో పండేసింది. నేను ఉయ్యాల వూపుతా తూగసాగినాను. నాకంటే ముందు పాపనిద్రపోయింది. నేనూ నిద్రలోకి జారుకుండాను.

రోంత సేపయినంక నాకు మెలకువ  వొచ్చింది. అమ్మయ్యా నాయనా మాట్లాడే మాటలు వినిపిచ్చసాగినాయి. “వాడు ఇస్కూలుకు పొయ్యే సంగతి ఏమనుకుండావు? ఆరో తరగతలో మంచి మార్కులు తెచ్చుకుండాడు. ఏడో తరగతికి పోవల్లని ఆ మాదిగోల్ల కుళ్ళాయప్పతో బుక్కులన్నీ ఇప్పిచ్చుకోనొచ్చి పెట్టుకుండాడు. నువ్వు యామాటా సెప్పకుండా వుండావు!”

“ఈ సంసారం బరువు మోసేవానికి తెలుత్తాది దాని బరువేందో, నీకేం తెలుత్తాది మొగోని అగచాట్లు? నాకు మాత్తరం వాన్ని సదివిచ్చల్లని వుండదా? చేతికొచ్చిన మొగపిల్లోన్ని, బతుకుదెరువు చూసుకోకుండా బడికి పంపిత్తే చూసేవాళ్లు నగరా? వాడు యాటికి బొయినా రొండు రూపాయల కూలికి కొదవుండదు. కుటుంబానికి  అది ఎంత ఆదరువయితాది?”.

“సదివిచ్చుకుంటే వాని బతుకన్నా బాగుపడతాది. రోంతాలోసెన సెరు”

“యెమో లే, పొద్దుబొయ్యింది, పండుకో”.

వాళ్లు మాట్లాడేది వింటా వుంటే, నాకు నిద్ర రాలేదు. అమ్మయ్యేమో నన్ను సదివిచ్చల్లనే వుంది. నాయన ఆలోచన్లు వేరేగా వుండాయి. చూస్తావుంటే నా చదువు ఇంతటితో ఆగిపోతాదేమో! అదే జరిగితే ఏమి చెయ్యల్లబ్బా! అని రకరకాలుగా ఆలోచన చేస్తావుంటే ఎంత సేపటికీ నిద్రరాలేదు.

తెల్లారింది. రాత్రయింది. మళ్లీ తెల్లారింది. నాయనేమో యా విషయమూ చెప్పలేదు. మూడో రోజు నాయన పెదగొర్ల్ల నరసమ్మోళ్ల ఇంటికిపోయి చాలాసేపటికి తిరిగొచ్చినాడు. అమ్మయ్య అడిగింది. “వొగరిద్దరితో ఆలోచన చెయ్యల్ల గదా! అందుకే నరసమ్మతో శానాసేపు మాట్లాడొస్తిని. ఆయమ్మ దూరమాలోచన చెప్పింది. ‘ఏమి నీ కొడుకు సదువుకొని కలెకటరు అయితాడా, గవుర్నోరు అయితాడా? నీకేమన్నా బూములుండాయా, బుట్రలుండాయా వాన్ని సదివిచ్చేకి? ఆరో తరగతి వరకూ సదువుకుండాడు, జాబు రాసేది వస్తాది, అది సాల్దేమప్పా? చేతికెదిగిన మొగపిల్లోడు, యాపనికి బోయినా, రెండు మూడు రూపాయలు తెస్తాడు. యేన్నీళ్లకు సన్నీళ్లు తోడయితే నీ సంసారానికి యెంత ఆసరా అయితాది? బతికే ఆదరువును కాదని చేతికొచ్చిన మొగపిల్లోన్ని సదువుకుండేకి పంపల్లనుకోడం బుద్ది తక్కవ పని కాదేమిరా యెంగడసామీ!’, అని నరసమ్మ గట్టిగా చెప్పింది. అందుకే, ఆరో తరగతి వరకు సదువుకుండావు గదా, ఇంగ సాల్లేప్పా!” అని నాయన నా పక్క జూస్తా నిక్కచ్ఛిగా చెప్పినాడు. నాకు మాటలు రాలేదు. తలకాయొంచుకొని కన్నీళ్లు పెట్టుకుండాను.

అమ్మయ్య నాపక్క జూస్తా తానూ కన్నీళ్లు కారుస్తా “యాల ఏడుత్తావు లేప్పా! మీ నాయనకు పరగావాల్ల కూతలే తలకాయికి ఎక్కుతాయి. పేదోల్లు చదువుకుంటా వుంటే ఆ కాపోల్ల పానాలు నిమ్మలంగా యెట్లుంటాయి? వాల్ల కొంపలో వొగడూ సదువుకోల్యా! అట్లాతప్పుడు, కూలి నాలి చేసుకొని బతికే మనట్లా తక్కవ కులమోల్లు సదువుకుంటా వుంటే వాల్ల కడుపుల్లో మంట! అది మీ నాయనకు బాగా పురెక్కిచ్చి పంపిచ్చింది ఆ సుప్పనాతి. కడుప్మంటతో ఆ ముండ ఏంటివేంటివో చెప్పితే, ఈ మొగోడు వినేదేనా? ఏంటి వేంటివో నీతికతలు చెప్పుతాడే, ఆ మాత్రం సొంత ఆలోసెనొద్దా! ఈ మనిసికి! నా కెవురూ పుట్టింటోళ్ల ఆదరువు లేదనే కదా ఈయప్ప ఆడిచ్చినట్లల్లా నేను ఆడతా వుండేది”, అంటూ చాలా బాధపడింది.

“నీకీ మద్దెలో కొవ్వెక్కవయిందే, పాడుమడ్లకు పుట్టిందానా! అందికే నోటికొచ్చినట్ల కూత్తా వుండావు. సంసారం బరువు, తూగిచ్చేవానికి తెలుత్తాది. బొగు జంబంగా మాట్లాడతావుండావు మల్ల రేపుట్నుంచీ నువ్వే సంసారాన్ని నడుపు. నడుపుతా, నీ కొడుకును యెమ్మే, బియ్యేలు సదివిచ్చుకో” అని విసురుగా ఇంట్లోకి పోయినాడు. నాయన ఆ మాట అనడంతో అమ్మయ్య మల్లా ఏమి మాట్లాడలేదు.

అందరూ మవునంగా వుండారు. నాయన నిర్ణయం అర్థమయింది నాకు. నేను మొండి చెయ్యడం బాగుండదనిపిచ్చిది. రోంతసేపు గట్టిగా ఆలోచనచేసి, “సరే నాయనా, నేను బడిమానేస్తాన్లే! వూరకనే మీరెందుకు కొట్లాడుకుంటారు” అని స్పష్టంగా చెప్పేసినాను.

తెల్లరుతానే నాయన చుక్కలూరికి, తమలపాకుల తోటలో ఆకులు కోయిచ్చుకొని వచ్చేకి బస్సుకు పోయినాడు. పోతాపోతా అమ్మయ్యతో, వాన్ని యాటికీ పంపిచ్చొద్దని చెప్పి పోయినాడు, సాయంకాలం బస్సొచ్చే టయానికి రోడ్డు దగ్గరికి రమ్మని చెప్పినాడు.

నాయన చెప్పినట్లే అమ్మయ్య యాటికీ నన్ను పంపలేదు. పంపితే నేను బాధతో యాటికయినా పారిపోతానని వాళ్ళ భయం. అయితే నేను ఇంటి నుండి పారిపోయి సాధించేదేముంది? పారిపోయి దూరంగా వుండే బంధువుల పంచన పడతానా?  అనంతపురంలో వుండే నాయన వైపు బంధువులుగానీ, ఎరతిమ్మరాచ్చెరువులో వుండే అమ్మయ్య వైపు  బంధువులు గానీ అందరూ తూకాసోల్లే! వాళ్లందరి కంటే మా కుటుంబమే మేలు!

పాడుబడిన పెద్దమ్మ గుడి దగ్గర వేపచెట్టు కింద గోనిసంచి పరుచుకొని దాని మీద కూర్చోని ఆలోచన చేస్తావుంటే ఆకలి దప్పికే మరిచిపోయినాను. చెట్టు మొదలు వైపు తిరిగి పండుకొని అమ్మయ్యకు కనిపిచ్చకుండా ఎంతసేపు ఏడ్చినానో నాకే తెలియదు. అమ్మయ్య పరిస్థితీ అదే.  చివరికి పయిటాల పొద్దుదాటినంక, నాదగ్గరికొచ్చి తట్టి లేపి “యాల బాధపడతావు లేప్పా? యెట్లయితే అట్లయితాదిలే” అని బతిమాలి అన్నం తినిపిచ్చింది. అన్నం రోంత తిన్నానని అనిపిచ్చుకొని మల్లా చెట్టు దగ్గర గోనిపట్ట మీద కూర్చుండాను.ఆకాశంలోకి తిక్కచూపులు చూస్తాండాను. నా కండ్లకు వెల్తురే కనిపించడం లేదు.   సాయంకాలం వరకు చెట్టుకిందే గడిపినాను. ‘బుద్ధ మహానుభావుడు బోధివృక్షం కింద జ్ఞానోదయం పొంది, జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ప్రపంచయాత్రకు బయలుదేరినాడని’ పాఠంలో రాసినారు. ఆయన వొగ మహారాజు పెద్దోళ్లు ఏమిచేసినా అది పెద్దదే. మా వేపచెట్టు కింద కూర్చుని నేను ఎన్ని చెప్పినా అవి యెవురింటారు అని అనుకుంటా అమ్మయ్య నడిగి పశువులకు రాత్రి మేతకు నాలుగు వరిగడ్డి కట్టలు పీక్కోని వస్తానని చెప్పి దొడ్డిదగ్గరకు పోయినాను.

ఎరువు దిబ్బను చూసి నిరుడు కంటే దిబ్బలో ఎరువు ఎక్కువ పడిందని అనుకుంటా ఎలకంటి చిన్నపాపయ్య దిబ్బసాకుతో మడి కోరుకు ఈలేదని, దిబ్బకంటే, నేను ఐస్కూల్లో చేరి తన కొడుకుతోపాటు చదువుకోవడం వోర్చుకోలేకనే ఇవ్వలేదని అనుకుండాను. ఇట్లనుకుంటానే, ఈసారి పాపయ్యశెట్టి మాకు కోరుకు మడి ఇవ్వకపోవడమే మంచిదయిందని, వొగవేళ ఇచ్చి వుంటే, మళ్లన్నీ బొందుబోయి పంటరాక పోగా, సుమారుగ బాకీలు నెత్తి మింద మొయ్యాల్సి వచ్చేదని, భగవంతుడు ఈ రకంగా ఆదుకుండాడని బరువుగా నిట్టూర్చినాను. అంతలోనే, హైస్కూలు జతగాళ్లు ఇరుక్కంతుకాటికి  వొచ్చినారు. కుళ్ళాయప్ప ప్రేమతో అడిగినాడు, ఏమి నారాయణ స్కూలుకు రాలేదని? అట్లే కోనయ్య, కొండన్నా అడిగినారు. అశ్వత్థప్ప సారు పదేపదే అడిగినాడని చెప్పినారు. ఆ మాట వింటానే నాకు కన్నీళ్లొచ్చినాయి. కన్నీళ్లు తుడుచుకుంటా విషయం చెప్పినాను. జతగాళ్లందరూ విచారపడినారు. సాయంత్రం చీకటిపడే సమయానికి రోడ్లోకి చేరుకొని యాడికి బస్సుకోసరం కాసుకుండాను. అంతలోనే బస్సొచ్చి నిలబడింది. డ్రైవర్‌ నన్ను చూసి చెయ్యి వూపినాడు. అతని పేరు వెంకటప్ప, కొన్ని యేండ్లనుండి అదే బస్సులో డ్రైవరుగా పనిచేస్తా పల్లెజనంతో ఎంతో స్నేహంగా వుంటాడు. అతని కొడుకు కూడా అనంతపురంలో ఏడో క్లాస్‌ చదువుతావుండాడు. అందుకే ఆ చిన్నాయనకు నేనంటే భలే ప్రేమ.

నేను ఆయన వైపు చూసి నవ్వుతా చేతులూపి, వెనకమెట్ల మీదనుంచి బస్సుపైకెక్కి మా ఆకుల పిడిని కిందికి వేయడానికి వూకిచ్చినాను. “ఉండు బాబూ! నేనొచ్చి పట్టుకుంటాను. పిడి దభిల్లున కిందికి వేస్తే ఆకులన్నీ చిట్లి పోతాయి” అంటా  వొచ్చి, నేను కిందికి వేసిన ఆకుల పిడిని పట్టుకుండాడు. నేను గబగబా కిందికి దిగొచ్చి ఆ చిన్నాయనకు థాంక్స్‌ చెప్పినాను. ఆయన నా భుజం తట్టి “బాగా చదువు కోవల్ల బాబూ” అంటా నాయనకు కూడా “వస్తానన్నా” అని చెప్పి బస్సెక్కినాడు.

ఎంత మంచి మనిషి! బస్సు డ్రైవర్లూ, కండక్టర్లూ చాలా మంది తాగుబోతులంటారు. కానీ వెంకటప్ప చిన్నాయనకు ఏ దురలవాటూ లేదు. నాయనను గౌరవంగా అన్నా అని పిలుస్తాడు. అట్లా మనిషితో చదువు విషయం చెప్పితే, ఆయన నన్ను చదివిచ్చమని నాయనను వొప్పిచ్చలేడా? ఆలోచిస్తా ఆకుల పిడి ఎత్తుకొని నాయనతోపాటు ఇంటి కొచ్చినాను. నాయనకు వేడి వేడి నీళ్లు పోసింది అమ్మయ్య. భోజనాలన్నీ అయిపోయినంక లాటీను మధ్యలో పెట్టుకొని తమలపాకులు ‘మాటడానికి’ కూర్చుండాం. తమ్ముడు పెద్దన్నకు ఆకులు మాటేకి రాదు. కాబట్టి వాడు మంచం కిందికి దూరుకొని పండుకుండాడు. వెంకటలక్ష్మి పాపను ఉయ్యాలలో ఊపుతవుంది. మిగతా నలుగురమూ ఆకులు మాటుతా వుండాం.

ఆకుతోటవాళ్లు మంచివీ చెడ్డవీ, అన్నీ కోసి వాళ్లే వొక్కక్క కట్టకు నూట ఐదాకులు ప్రకారం పేర్చి కడతారంట! ఆకులు కొనుకుండే బేరగాళ్లను ఎవురినీ ఆకులు కోసే  తోటలోపలికి రానీయరంట! వాళ్లు బోట్నేళ్లకు (బొటన వేళ్ళకు) ఇత్తడితో చేయిచ్చిన గోరుగోలు (కవచాన్ని) పెట్టుకొని ఆకుల తొటాల (తొడిమల) దగ్గర గిళ్లి గంపల్లోకి వేస్తారంట కూలోళ్లు ఆ గంపల్లోని ఆకులన్నీ వొగచోట పోస్తారంట! అట్లపోసిన ఆకులను చిన్నవీ పెద్దవీ అన్నీ కలిపి రిక్కలు రిక్కలుగా కట్టగా మాటి, ఆవిశాకూ, అరిటాకూ ఇంగా రెండుమూడు రకాల ఆకులన్నీ పరిచి దాండ్ల మధ్యలో వొగకట్ట పక్కన  మరొగ కట్ట రెండుగా పేర్చి, నూరు కట్టలకు వొగ పిడిని తయారుచేసి, ఎండిన అరిటాకులను తడిపి దాండ్లతో పిడిని బిగిచ్చి కడతారంట! నాయనట్లా వాళ్లు గంపల్లో పెట్టుకొని అమ్ముకుండే చిల్లర వ్యాపారస్తులు, వారానికి పదీపదైదు మంది మాత్రమే వుంటారంట! వాళ్లు బంగపోయి బతిమాలుకుంటే, వారానికొగసారి పాపం చిల్లర వ్యాపారస్థులని దయదలచి, ఆ కట్టిన పిడులను యాదో వొగరేటుకు ఇస్తారంట! ఎక్స్‌ప్రెస్‌  మోటర్‌ సర్వీస్‌ యాడికి బస్సు డ్రైవరు వెంకటప్ప రెకమెండేషన్‌తో నాయనకు నూరు కట్టల ఆకుల పిడి ఇస్తారంట! మిగిలిన ఆకుల పిడులు వారానికి సుమారుగ నూరు, మద్రాసుకు పంపిస్తారంట! అంత డిమాండు ఉన్నప్పుడు, మాకు మంచి కవటాకులే వెయ్యండి, గుల్ల ఆకులు వద్దు అని అడిగేకి వుండదంట!

నాయన చెప్పినదంతా విని నేను ఆశ్చర్యపోయినాను. అట్లా ఆకు తోట వొక్కటుంటే చాలు, నిరంతరమూ డబ్బుల పంటే అనుకుండాను. అదేమాటే నాయనతో అన్నాను. అది చాలా ఖర్చుతో కూడుకొన్నపని అని, చిన్న రైతులు ఆకుతోటలు పెట్టుకోలేరని, రెండు. మూడెకరాలుండే ఆకుతోట రైతు పెద్ద షావుకారి అన్న్యాడు నాయన. తోట చుట్టూరా ముందుగా ఎర్రి చెరుకు పెంచల్లని, అది దట్టంగా పదడుగులెత్తు పెరిగినంక మెత్తని నల్లమసుకు ఎర్రనేలను బాగా సేద్యం చేసి ఆరడుగులకు వొగబోదె తోలల్లని, ఆ బోదెల మింద ఆరడుగులకు వొగటి రెండు అవిసె గింజలు వెయ్యల్లని, అవి మొలకెత్తి సుమారుగా పది అడుగుల ఎత్తు పెరిగినంక, అవిశ చెట్ల పక్కనే మంచి తమలపాకుల తీగలు నాటుతారని, అవి మారాకులు వేసి తీగలు పారినంక ఆ తీగలకు ఎండిన దబ్బజమ్ము పాసల్ని (పోసల్ని) నీళ్లల్లో తడిపి తమలపాకుల తీగలకు కడితే దాండ్ల సహాయంతో పైకి ప్రాకుతా అవిసె చెట్లకు చుట్టుకొని ఆనల కొనలు సాగుతా గెనుపు గెనుపు దగ్గరా నాలుగు ఆకులతో విచ్చుకుంటా జానెడుకొగ గెనుపును వొదులుతా తమల పాకుల తీగ పైకి ఎగబాకుతా పోతాదని, పైనుండే ఆకులను పీకడానికి బోదెల మధ్యలో రెండు నిచ్చెన్లు  క్రాస్‌గా ఎదురెదురుగా కట్టి దాండ్ల మిందెక్కు తారని నాయన చెప్పుతావుంటే మా ప్రాంతానికి తెలియని ఆ కొత్త వ్యవసాయాన్ని గురించి ఆసక్తిగా వింటా ఆకులు మాటసాగినాను.   తమలపాకులు కట్టలుగా ‘మాటడం’ నాకు బాగా అలవాటయింది. తమలపాకు తోటల యజమానులు కట్టిచ్చిన ఆకుల పిడిని నాయన నానా అవస్థలుపడి చుక్కలూరు నుంచో, రాయలచెరువు నుంచో మోసుకొని వస్తాడు. తమలపాకుల తోటలు, మా ఊరికి దగ్గర్లో వుండే కొర్రపాడు, రెడ్డిపల్లి, బోడిగానిదొడ్డి, దంతులూరు, చెదళ్ల, నీలారెడ్డిపల్లి మొదలయిన పల్లెల్లో ఎందుకు వేయరో నాకు అర్థం కాలేదు. నాయనేమో రాయలచెరువు, చుక్కలూరు పల్లెల భూములే ఆకుతోటలకు అనువైనవని, ఆకుతోటల్లో చాకిరీ ఎక్కువని, కొంచెం అజాగ్రత్తగా వున్న్యా, ముట్టయిన ఆడోళ్లు  వొచ్చినా తుమలపాకుల తీగలు వాడిపోతాయని యేందెందో చెప్పుతాడు నాయన. నేను, నిజమేనేమో అని అనుకొని నమ్ముతాను.

నాయన తెచ్చిన ఆకుల పిడిని విప్పి, కట్టలన్నీ బయటపెట్టి అందులో పెద్ద పెద్ద కవటాకుల్ని రిక్కలు రిక్కలుగా పేర్చి దాండ్ల మధ్యలో చిన్నచిన్న గుల్లాకులను ఇరికిస్తాం. తొటిమలేమో అన్నీ సమానంగా వుంటాయి. నాయనా, అమ్మయ్యా, నేనూ పెద్దక్కా నలుగరమూ, కింద చెక్కామిల్లి-చక్కిలిమిల్లి (పద్మాసనం) వేసి కూర్చొని, తొడమింద ఆకుల్ని కట్టగా మాటుతా, వొక్కొక్క కట్టకు నూటొక్క ఆకుల్ని మాటి, చివరగా రెండు మంచి కన్నాకుల్ని పెడతా వుండాం. అమ్మయ్యా, పెద్దక్కా ఐదారు కట్టల్ని మాటేలోపల నేను పది కట్టలు మాటుతా వుండాను, వొక్కొక్క కట్టను మాటి, కుడిచేయి బొటన వేలూ, చూపుడు వేలుతో ఆకులకట్ట వెనకముందు భాగాలనూ, మిగతా మూడు వేళ్లుతో కట్టకింది భాగాన్ని వొత్తి పట్టుకొని తొటాలను (తొటిమలను) లెక్కబెట్టి సరిచూసి, పెద్దాకుల్ని, బయటికి కనిపించేటట్ల రిక్కలు రిక్కలు చేసి నాయనకు ఇస్తావుంటే, నాయన ఆముదం ఆకులూ, అవిసి రెమ్మలూ లోపల చుట్టూ పెట్టిన గంపల్లో చుట్టలు చుట్టలుగా పెడతా వుండాడు. పెద్దక్కకు ఆకులకట్ట పట్టుకుండేది రాదు. పొడుగ్గా మాటి నాచేతికిస్తాది. నేను దాన్ని కుడిచేతి వేళ్లతో పట్టుకొని వొంపు తిరిగిన చింతకాయ మాదిరిగా వొంచి ఆకుల్ని రిక్కలు రిక్కలు చేసి లెక్కబెట్టి నాయన చేతికిస్తాను. ఆ పాప, పదీ పదైదు కట్టలు మాటేలోపలే మెల్లగా తూగుతావుంటే చూసి, పండుకోమని చెప్పింది అమ్మయ్య.

పదిగంటలకల్లా ఆకులు మాటేదంతా అయిపోయినంక నాయన ఆకుల కట్టలన్నీ రెండు గంపల్లో సర్దినాడు. పెద్ద గంపలో డెబ్బై కట్టలూ, చిన్న గంపలో ముప్ఫైఅయిదు కట్టలూ పెట్టి పైన ఆముదం ఆకులూ వరిగడ్డీ పల్చగా వేసి, పాత పంచెగుడ్డల్ని కప్పి బిర్రుగా బిగిచ్చి, రెండు చెంబుల నీళ్లు చల్లి, బయట, అరుగుమీద గంపలు, గోడకు వారగిల పెట్టినాడు. అట్ల పెడితే, చల్లిన నీళ్లన్నీ తమలపాకుల కట్టలు గుండా కిందికి మెల్లగా దిగిపోతాయని, ఆకులు వాడిపోకుండా వుంటాయని నాయన ఎప్పుడో చెప్పినాడు. చంటిపిల్ల జయమ్మ ఆకలయిందేమో, ఏడ్చింది. అమ్మయ్య పాలిచ్చి ఉయ్యాల్లో పండేసింది. కడుపు నిండిందేమో, పాప గుడ్డివెలుగులో చేతులూ, కాళ్ళూ ఆడిస్తా అర్థంకాని అరుపులతో ఎవురినో పలకరిస్తావుంది. నాయన వొంటేలు పోసేకేమో బయటికి పోయినాడు. అప్పుడు అమ్మయ్యను మెల్లగా అడిగినాను, ఆ చిన్న గంప ఎందుకమ్మా అని. తెల్లారుజామున మీ నాయినెంట ఆ సన్న గంపెత్తుకొని నువ్వూ పోవల్ల అని చెప్పింది అమ్మయ్య. అవునా అని అంటా వుండంగనే నాయన ఇంట్లోకొచ్చి, “ఇంగ పండుకోప్పా. తెల్లారజామున్నే లేసి నువ్వు గుడకా నావెంట రావల్ల! పొద్దుగలగ యెల్లవారితే అమ్మిడిపొద్దు కాక ముందే నీలంపల్లి సేరుకుంటాం” అని అసలు సంగతి చెప్పినాడు. నేను సరే అని పండుకుండా.

తెల్లారజామయింది. తొలికోళ్లు కూస్తా వుండాయి. అనంతపురం రోడ్లో నాయన వెనకల ఆకుల గంపెత్తుకొని నడుస్తా వుండాను. నెత్తిమింద పాత వొల్లిగుడ్డ చుట్టపెట్టి ఆ చుట్ట మింద అమ్మయ్య పెట్టిన ఆకుల గంప పెద్దగా బరువనిపించ లేదుగానీ మనసు బరువు ఎక్కువయితా వుంది. కంకరరోడ్లో గుంతలుంటాయని నాయన రోడ్డు పక్కన మట్టిబాట మింద నడుస్తావుండాడు. నాయన వెనకలే నేను పోతావుండాను. ఎడమ పక్కన బోదగుట్ట మొన, దయ్యం మాదిరి కనిపిస్తావుంది. కుడిపక్కన బీటి మాగాణి, చీకట్లో కలిసి పోయింది. ఆకాశంలో చుక్కలు మాట్లాడతా వుండాయేమో, ఏంటివో తెలీని శబ్దాలు వినిపిస్తా వుండాయి. చెరువు మరవకొమ్మ కాటికి చేరుకుంటానే, కొండమోటు తేలిపోయి, వొక్కసారిగా గాలి బస్సుమని వీచసాగింది. చెరువులో నీటి అలలు చెరువుకట్టను తాకుతా శబ్దం చేస్తా వుండాయి. దూరంగా కనిపిచ్చే చెరువునీళ్లల్లో చుక్కలు కనిపిస్తా, ఆకాశమంతా చెరువులోకి వొచ్చినట్లుండాది.

మరవకొమ్మ దగ్గర రోడ్డు వొంపు తిరిగింది. కొండమోటు పూర్తిగా తేలిపోవడంతో ఎదురుగా దూరంగా చీకట్లో అక్కడక్కడ దీపాలు కనిపిస్తా వుండాయి. నేను మా వూరగొండా దేవరకొండా ఎక్కినప్పుడు మాత్రమే చెరువుకు ఎగవనుండే చెదళ్ల, నీలంపల్లి, బోడిగానిదొడ్డి, కొర్రపాడు, ఇంగా మూడునాలుగు పల్లెల్ని చూసినాను గానీ మరవకొమ్మ దాటి ముందుకు ఎప్పుడూ పోలేదు.

వొంపు తిరిగిన రోడ్లో వొగ ఫర్లాంగు దూరం ముందుకు పోయినంక నాయన రోడ్ల్లోనుండి పక్కకు సీలుదావలోకి తిరిగినాడు. ఈ దావ, నీలంపల్లికి పోతాదేమో అనుకుంటా నాయన వెనక నడుస్తా వుండాను. అలవాటయిన దారి కాబట్టి శానా బిరబిరా ముందుకు పోతావుండాడు నాయన. చీకట్లో చుక్కల గుడ్డివెలుగులో ఆ సీలుదావ నాకు కొంచెం కష్టమనిపించింది. అంత వరకూ రోడ్లో నడకా దయ్యం మాదిరున్న బోదగుట్టా, మరవకొమ్మకు చేరుకుంటానే బురుమంటూ వీసిండే గాలి ఆకాశంలో చుక్కల మాటలు, చెరువులో నీటి అలల శబ్దాలూ, దూరంగా నీళ్లలో కనిపిచ్చే చుక్కల ఆకాశం అవన్నీ మనసులోని బరువును దూరం చేసినాయి. ఇప్పుడు కండ్లూ, మనసూ, శరీరమూ అన్నీ చీకట్లో సరిగా కనిపియ్యని దావ మిందే? దావ, రోంత దూరం పోయినంక బండిజాడలో కలుసుకుంది. పరవాలేదని పిచ్చింది. నడిచినంత దూరమూ దూరంగా చెరువు నీళ్లు కనిపిస్తావుండాయి. చెరువునిండితే ఈ దావంతా మునిగి పోతాదేమో అనుకొని, నాయనను అడిగినాను. చెరువు నిండితే మేము నడిచేచోట నడుముల లోతు నీళ్లుంటాయని పక్కన కనిపించే గంగమ్మకట్ట మునిగిపోయి, నీళ్లు రోడ్డుకు ఆనుకుంటాయని నాయన చెప్పుతా వుంటే నేను ఆశ్చర్యపోయినాను.

పాత చెదళ్ళు దగ్గరికి పోయేటప్పటికి తెల్లారింది. మేము దొడ్ల సందులో వూర్లోకి పోతాండాం. కొంతమంది మొగోళ్లు చెంబులు పట్టుకోనొచ్చి దావపక్కనే రొంటాలుకు కూర్చుంటా వుండారు. వాళ్లను చూస్తా మనుషులు నడిచే దావ పక్కన కాకుండా ఇంగ కొంచెం ముందుకు పోయి బీటిచేన్లలో కూర్చోవచ్చు గదా అని గొనుక్కుంటా, పాపం ఆడోళ్లూ ఇదే మాదిరే చెంబులు పట్టుకొని దొడ్ల సందుల్లో, కోపు గుంతల్లో కూర్చోవల్సిందేగదా, అన్ని పల్లెల్లోనా ఇదే గతేనేమో అనుకుంటా నాయన వెంట వూర్లోకి అడుగుపెట్టినాను. బజార్లో ముందుకు పోతా ‘ఇది చెదళ్ల’ అని నాయన చెప్పడంతో నీలంపల్లి ఇంగా దూరంగా వుంటాదని అనుకుండాను. ఊరు దాటినంక చక్కగా వుండే బండిజాడలో పోతావుండాం. పొద్దు బొడిసింది. లోకమంతా వెల్తురు పరుసుకుంది. అంతవరకూ దావను వెతుకులాడతా వుండే కండ్లు ఎక్కడో చూస్తావుండాయి. మనసులో మెల్లిగా చీకటి ముసురుకోసాగింది.

ఇంగ నా బతుకు ఇదేనేమో! చదువుకుండే అదృష్టం రాదేమో! నేను చదువుకుండేకి బడికి పోయినంత మాత్రాన ఇంటి పనులు చెయ్యకుండా వుంటానా? ప్రతి శని ఆదివారాల్లో కూడా పనికి పోతాను గదా! మడకలు దున్నేటప్పుడూ, వరిమళ్లు కోసేటప్పుడూ, వారం పద్దినాలు బడికి శెలవు బెట్టి పనులకు పోతా వుండాను గదా! పొలం పనులు మున్నూటా అరవై దినాలు వుండవు కదా? పనుల కాలమంతా పనులకు పోతా, నేను ఆప్సెంటయినప్పుడు జరిగిండే పాఠాలను గురించి నా క్లాసుమీట్స్‌ను అడిగి తెలుసుకొని వాళ్ళ నోట్సులు ఇప్పిచ్చుకొని, అంతా రాసుకొని, యెట్లోగట్ల అవస్తపడి చదువుకుంటాను గదా! మల్ల యాల నాయన నన్ను బడి మాన్పిచ్చినాడు? ఆ పెదగొర్ల నరసమ్మ అంతా గబ్బు లేపింది, పనికి మాలింది! నాయన, ఆయమ్మ మాటలు వినే కదా నన్ను బడి మానిపిచ్చిండేది అనుకుంటా వుంటే కండ్లల్లో నీళ్లు పారాడినాయి. పొంగి పొర్లుకోని వస్తావుండే దుఃఖాన్ని గొంతులోనే ఆవుకోని నాయన వెంట నడుస్తావుండాను. ఆడ కనిపిచ్చేదే నీలంపల్లి అని చెప్పుతా వూరి కడద్దన, మొదట్లోనే వుండే పెద్దగారమిద్దె ఇంట్లోకి పోయి వసారాలో అరుగు మింద ఆకుల గంప దించినాడు నాయన. నేనూ నా నెత్తి మీదుండే గంపను దించినాను.

ఇంట్లోనుంచి వొగ పెద్దాయన బయట కొస్తా, “యేమి యెంగడస్వామీ, బాగుండావా? ఇసారి శానా దినాలకొస్తివే, ఈ పిల్లోడెవురు” అని ప్రేమగా పలకరిచ్చినాడు. “నా పెద్దకొడుకు పెద్దిరెడ్డి! మీరందురూ బాగుండారా?” అని నాయన వొగ జతగాన్ని అడిగినట్ల అడిగాడు. నాకు ఆశ్చర్యమయింది, ఆ పెద్దాయనను నాయన మాట్లాడించే పద్దతిని జూసి.

ఆ ఇల్లూ, గాటిపాట్న వుండే దేశపెద్దులూ, ఇంటి పక్కన దొడ్లో వేసిండే గడ్డివామీ అంతా చూసి, ఎవురో పెద్దసంసారం మాదిరుండారు, పైగా రెడ్లు, అట్లాంటి ఇంటి యజమాని పెద్దిరెడ్డిని, నాయన అంత చనువుగా మాట్లాడిస్తా వుంటే నేను నిజంగా ఆశ్చర్యపోయినాను.

(ఇంకా ఉంది)

Exit mobile version