[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
పెద్ద పెద్ద రెడ్లకు న్యాస్తుడు మా నాయన!
పెద్దిరెడ్డి పెద్దయ్య మమ్మల్ని బంధువుల లెక్కన పలకరిచ్చి ‘పార్రి పార్రి, మొగాలు కడుక్కోపార్రి’ అని తొందరపెట్టినాడు. నాయనా, నేనూ దొడ్లో వుండే జలాట్లో ముఖాలు కడుక్కోనొచ్చినాం. అంతలోనే వొకాయమ్మ వాకిలి దగ్గరికొచ్చి ‘యేమి చిన్నాయనా బాగుండారా? రాండి, లోపలికి రాండి, కాఫీ తాగుదురు. ఈ పిల్లోడు నీ కొడుకంటనే, ఇప్పుడే మా నాయన చెప్పినాడు’ అని ప్రేమగా లోపలికి పిల్చింది. మేము లోపలికి పోయిు జెగితి మింద కూర్చుండాం. పెద్దిరెడ్డి పెద్దయ్య జెగితి మిందనే స్తంభానికి ఆనుకొని కూర్చుండాడు. ఆ యమ్మ కాఫీ తెచ్చి యిచ్చింది. నాకంటే ఎడెనిమిడెండ్లు పెద్ద దుంటుందేమో, చాలా చక్కగా వుంది. పెద్దింటి ఆడబిడ్డ అయినందువల్ల ఆయమ్మ ముఖంలో బంగారు కళ కనిపిస్తా వుంది. షావుకార్ల ఇండ్లల్లో ఆడోళ్లు ఈ మాదిరిగానే వుంటారేమో అనుకుంటా కాఫీ తాగుతావుండాను.
కాఫీ ఎంత రుచిగా వుందో! అట్లాంటి కాఫీ నేనెప్పుడూ తాగలేదు. దండిగా పాడి వుండే వాళ్లు దినామూ ఇట్లా కాఫీనే తాగుతారేమో అని అనుకుంటా ఇల్లంతా చూడసాగినాను. ఎవురో ఇంగోగాయమ్మ దూరంగా, స్తంభానికి కట్టిన కవ్వాన్ని తిప్పుతా, కుండకు కవ్వం తగల కుండా మజ్జిగ చిలుకుతా వుంది. జెగితికి కడాన గోడ దగ్గర, పెద్ద కుంపట్లోని నుగ్గుల మింద పెట్టిన పాల కుండలో కాగుతావుండే పాలవాసన కమ్మగా వస్తావుంది. యాడో స్వర్గంలో వున్నట్ల అనిపిస్తా వుంటే, మురిసిపోతా కాఫీ తాగినాను. అంతలోనే బయట్నుంచీ వొగాయప్ప ఇంట్లోకొచ్చి, నాయనను నవ్వుతా పలకరిచ్చి, మామా రేవు పొద్దన్నే వరినారు పీకిచ్చేకి ఐదారుమంది కూలోల్లను పిల్చినాను, అని ఆ పెద్దయ్యకు చెప్పినాడు. ఆ యప్ప, పెద్దిరెడ్డి పెద్దయ్యకు అల్లుడని అర్థమయింది నాకు.
కాఫీ తాగినంక ఆ పెద్దయ్య మేకమార్కు బీడీ అంటిచ్చుకొని పొగపీల్చుకుంటా ‘పిల్లోడు సదువుకుంటా వుండాడని చెప్పింటివి, మల్ల ఆకుల గంపను వానినెత్తికెత్తినావే, ఐస్కూలు దంకా సదివిచ్చకూడదా!, అని నాయనకు చెప్పుతా వుంటే నాకు భలే సంతోషమయింది. కనుగుడ్ల మింద నీళ్లు పారాడినాయి. నాయన మా సంసారం సంగతి చెప్పి, పాత పాటే పాడినాడు. అదంతా విని ఆ పెద్దయ్య మల్లా ఏమి మాట్లాడలేదు. ఆయన నాయనకు నచ్చజెప్పుతాడని ఆశపడిన మనసు వెంటనే సప్పగయింది.
ఆ తర్వాత నాయన నన్ను ఊర్లేకి పిల్చుకొనిపోయినాడు. వాడుకయిన ఇండ్లకాడ వొక్కొక్కరికి కట్టా, అరకట్టా తమలపాకులు వర్తనగా ఇవ్వసాగినాడు. పోయిన ప్రతి ఇంటికాడా నాయనను ఎంతో ప్రేమగా పలకరిచ్చి, నన్ను గురించి అడిగినారు. అమ్మిడి పొద్దప్పుడు మల్లా ఇద్దరము పెద్దిరెడ్డి పెద్దయ్య ఇంటికి చేరుకుండాం. ఆ ఇంటి పెద్దమ్మ ఇద్దరికీ అన్నం పెట్టింది. కొర్ర బియ్యంలేకి కొన్ని వరిబియ్యం అడుగులు పోసి చేసిన అన్నం అది. అన్నంలేకి చింతాకుపప్పు ఎంత అద్భుతంగా వుందో! మజ్జిగన్నం ఎంత కమ్మగా వుందో!
అన్నం తిన్నెంక, నాయనా పెద్దిరెడ్డి పెద్దయ్యా వసారాలో అరుగుమింద కూర్చోని సవాలాడుకుంటా వుండారు. నేను కోనారెడ్డన్నయ్య వెంట వాళ్ళ తోటకాటికి పోయి వంకాయ, మిరపచెట్లను చూసి భలే సంతోషపడినాను. ఆ పక్కనే జీతగాళ్ళు మడికయ్యల్లో పిట్టక దున్నుతాండారు. వరినారు అద్భుతంగా వుంది. ఆ అన్నయ్యను అడిగితే, ఢిల్లీభోగాల నారు అని చెప్పినాడు. ఎకరాకు ఇరవైఐదు మూటలకు పైబడే అయితాయని, వరి కోసినంక శెనిక్కాయ వేస్తామని, వరి కొయికాలు కాబట్టి వడ్లకంటే శెనిక్కాయ పంటే ఎక్కువయితాదని, ఎకరాకు దరిద్రమంటే ఇరవై మూటలు; వాటం పడితే ముప్పై మూటలు వరకూ అయితాయని ఆ అన్నయ్య చెప్పుతావుంటే నేను నోరెల్లబెట్టి వినసాగినాను. ఆ తర్వాత నన్ను బావి దగ్గరికి పిల్చుకొని పోయినాడు. బావిలో వొంగి చేయి పెడితే చేతికి అందేటట్లుండే నీళ్ళను చూసి అబ్బురపోయినాను. పెద్ద ఆయిలింజన్ పెట్టి, మూడించిల నీళ్ళు పొద్దస్తమానమూ బయటికి కొట్టినా తగ్గవని, తడకలేరు పక్కనే వుండడం మా అదృష్టమని, ఆ అన్నయ్య చెప్పుతా వుంటే నేను మరింత ఆశ్చర్యపోయినాను, మా శింగనమల చెరువుకు వొచ్చే తడకలేరు పేరు వింటానే నాకు ఆనందమయింది. కోనారెడ్డి నన్ను ఏటిగట్టుకు పిల్చుకొని పోయి తడకలేరును చూపిచ్చినాడు. దాన్ని చూసి, ఏటి మధ్యలో, ఈతచెట్ల సందుల్లో చిన్నగా పారుతా వుండే నీటి జాలును చూసి, అది మా సొంత యేరయినట్లు సంబరపడినాను, ఎంతసేపయినా అక్కడే వుందామనిపిచ్చింది. పెద్దిరెడ్డి పెద్దయ్యోళ్లు ఎంతదృష్టవంతులో అని అనుకుంటా, కోనారెడ్డి వెంట వాళ్ళింటికొచ్చినాను. వొగ పదినిమిషాలైనంక దంతులూరుకు పోయొస్తా మన్న్యాడు నాయన.
రాత్రి కల్లా ఇంటికి రాండి యెంగడస్వామీ అని పెద్దిరెడ్డి పెద్దయ్య ప్రేమగా చెప్పినాడు. సరే అన్న్యాడు నాయన. పెద్దగంపను వాళ్లింట్లోనే పెట్టి చిన్న గంపెత్తుకొని బయలుదేరినాం నేనూ నాయనా. బండి జాడలో నాయన నడుస్తా వుంటే వెనక నేను చిన్న గంపెత్తుకోని పోతావుండాను. నాయన పెద్దిరెడ్డి సంసారం గురించి చెప్పసాగినాడు. నీలంపల్లెలో ఆ పెద్దయ్యోళ్లే పెద్ద ఆసాములని, సమ్మత్సరానికి చేండ్లల్లోనా, తోటల్లోనా మొత్తం నన్నూటా యాభై, ఐన్నూరు మూటలు శెనిక్కాయలూ ఇన్నూరు మూటలు వడ్లు అయితాయని, మగ పిల్లోల్లు లేనందువల్ల కోనారెడ్డికి బిడ్డనిచ్చి ఇల్లటం తెచ్చుకుండాడని నాయన చెప్పుతా పక్కనుండే చేనిపక్క చెయ్యిచాపి ఈ పదెకరాల పట్టి పెద్దిరెడ్డోళ్ళదేనని చూపిచ్చినాడు. అద్భుతమైన ఎర్రన్యాల, మెత్తగా సేద్యంచేసి వానొస్తానే విత్తనం వేసేకి రెడీ చేసి పెట్టినారు. బండిజాడ పక్కనుండే చేండ్లనూ, తోటలనూ చూసుకుంటా నడుస్తా వుండాను.
ఇట్లాంటి భూములు వొగ ఐదారెకరాలు మాకూ వుంటే ఎంత బాగుండేది. ఈ జన్మలో అంతోయింతో భూమిని కొనుక్కోగలమా? వూరి దగ్గర రెండు మూడెకరాలు మాగాణి వుంటే కుటుంబానికి ఈ తిప్పలు వుండేటివా? ఐస్కూలు వరకూ చదువుకొని పదకొండో తరగతి పాసయితే, యెవుర్నో వొగర్ని పెద్దోళ్ళను పట్టుకొని యాడో వొగ చోట గవుర్మెంటులో జవానుగానో, గుమాస్తాగానో ఇరుక్కుందామనుకుంటే మొదటికే మోసమాయ! ఎవురి మాటలో విని నాయన బడి మానిపిచ్చే. చదువుకొని వొగ చిన్న ఉద్యోగం సంపాయిచ్చుకుంటే అంతో యింతో భూమి కొనుక్కోలేమా?
ఆలోచిస్తా వుండంగనే ఊరు వొచ్చింది. నీలంపల్లి నుండి మూడు మైళ్ళుండే దంతులూరికి ఎంత బిరీన వొచ్చినాం అని అనుకుంటా వూర్లోకి అడుగుపెట్టినాం. దంతులూరులోనా నాయనకు చాలా మంది తెలిసినోళ్లూ బంధువుల మాదిరి పలకరిచ్చే వాళ్లూ వుండారని నాకు రోంతసేపటికే అర్థమయింది. ఊర్లో మంచి రైతులందరూ కమ్మొళ్ళేనని, మనుషుల్ని ప్రేమగా పలకరించడంలో గాని నెర్లుచూపడంలో గానీ కాపోళ్ల మాదిరుండరని మధ్యమధ్యలో నాయన చెప్పినాడు, అయితే నాయనను వాళ్లందరూ బాగానే పలకరిచ్చినారు. మూడు నాలుగిండ్ల కాడ కాఫీ తాగమన్న్యారు గానీ నీలంపల్లి పెద్దిరెడ్డోళ్ల మాదిరి ఇండ్లల్లోకి పిలిచి కూర్చోమని ఎవురూ చనువుగా పిల్చలేదు.
ఊరంతా తిరిగి ఆకులమ్మినాం. సుమారుగ ఇరవై కట్టల ఆకులు అమ్ముడు పోయినాయి. అందరూ దుడ్లిచ్చే, ఆకులు కొనుక్కుండారు. పయిటాల వరకూ వూరంతా తిరిగే సరికి నాకు ఆకలయ్యింది. అప్పుడు నాయన వొగ చిల్లరంగడి దగ్గరికి నన్ను పిల్చుకొని పోయినాడు. అంగట్లో చెక్క పెట్టె మింద కూర్చొనుండే మనిషిని చూసి యేమి నాగయ్యా, బాగుండారా? అని నాయన పలకరిచ్చినాడు. ‘రారా వెంకటస్వామీ పది దినాలకింద నువ్వేసిపోయిన తమలపాకులన్నీ అయిపోయినాయని ఇంతకు ముందే నీ గురించి అనుకుంటిమప్పా! ఆకులు తెచ్చినావు గదా!’ అంటా లోపలికి పిలుస్తా, ‘ఈ పాపోడెవురు, నీ కొడుకా’ అని అడిగినాడు. ‘అవును నాగయ్యా, నా కొడుకే’ అని చెప్పుతా పది కట్టలు ఆకులు నాగయ్యశెట్టి వెదురు పుటకలో పెట్టినాడు. నాగయ్య పరీక్షకోసరమని వొగకట్ట తొటాలను లెక్కబెట్టినాడు. ‘యెంచుకోవల్సిన పనే లేదులే నాగయ్యా, ప్రతి కట్టలోనా రొండాకులు యెక్కవే వుంటాయిలే. కొన్నేండ్ల నుంచీ చూస్తా వుండావు, యానాడయినా, యా కట్టలోనైనా నూరాకులకు తక్కవుండాయా? తక్కవపెట్టి నమ్మకం పోగొట్టుకుంటానా?’ అని యెంతో నమ్మకంగా చెప్పినాడు.
‘ఆకులన్నీ నువ్వొగనివే మాటవు గదా వెంకటస్వామీ! ఇంట్లో ఆడోళ్ళు కట్టల్లో నాలుగయిదు ఆకులు తక్కువ పెట్టిండొచ్చుగదా, అందుకోసరమే యెంచితి, కరెక్టుగానే వుండాయిల’ అని నాగయ్య శెట్టి బదులిచ్చినాడు.
‘అయ్యెయ్యో రామ, రామ అట్ల యెన్నటికీ జరగదులే నాగయ్యా కూటికి పేదోల్లమేగానీ గునానికి పేదోల్లం కాదయ్యా’ అని నాయన చాలా నమ్మకంగా చెప్పినాడు. నిజమే మల్ల, ఇంట్లో తమలపాకులు మాటేతప్పుడు అమ్మయ్య గానీ, నేను గానీ కట్టల్లో మూడు నాలుగు ఆకులు తక్కువ పెట్టల్లని యానాడూ అనుకోలేదు. అట్లాతప్పుడు ఆకులు తక్కువెందుకుంటాయని అనుకుంటా అంగడి పక్క చూడసాగినాను. నాగయ్య ఏమనుకుండాడో యేమో, వొగపేపర్లో ఇన్ని గుగ్గిళ్ళూ వొగ బెల్లంబొరుగులముద్దా ఇచ్చినాడు. నేను ఆకలితో సంతోషపడతా తింటావుండాను. అంతలోనే నాయన మెల్లగా ‘ఇసారన్నా మోతలగడ్డ మడి కయ్యలు కోరుకో, గుత్తకో ఈ నాగయ్యా! కొడుకు చేతికొచ్చినాడు. బాగా పసులెరువూ, పిండీ యేసి మడిని బాగా పెట్టుకుంటాము నాగయ్యా!’, అని అడిగాడు. నాగయ్య అవీ యివీ అన్నీ అడిగి కోరుకయితే ఇస్తానన్నాడు. నాకు భలే సంతోషమయింది. ‘‘నాగయ్యోళ్ళ మడి మా వూరి పాపయ్యోళ్ళ మడి తర్వాత మూడోపట్టె అని నాయన చెప్పడంతో తెలిసింది.
ఆసాముల భూములు కోరుకు చేసుకుండేదే మేలు: గుత్తకు మట్లాడితే పంట పండినా పండక పోయినా ఆసాములకు గుత్త ఇవ్వల్సిందే. దంతులూరికి పోయినందుకు మేలయిందని ఇద్దరమూ నాగయ్య ఇంటి నుంచీ బయలుదేరినాం. ఊరి బయటుండే పెద్దింటి కాటికి పిల్చక పోయినాడు నాయన, చెట్టుకింద మంచమ్మింద కూర్చొని, తాడు పేడుతా వుండే పెద్దయ్య మా పక్క జూసి ‘రా యెంగడసామీ! మంచి యెండకొత్తివే! ఈ పిల్లోడు నీ కొడుకా’, అని పలకరిచ్చినాడు. నాయన ఆ పెద్దయ్య దగ్గరికి పోయి మంచమ్మిందనే కూర్చుండాడు. వాళ్ళ మాటల్లో, ఆ పెద్దయ్య పేరు రామన్న అని తెలిసింది. రోంతసేపు మాట్లాడిన తర్వాత పయిటాలయ్యింది, బువ్వ తిన్న్యారా లేదా యెంగడసామీ అని అడిగినాడు ఆ పెద్దయ్య. నీలంపల్లి పెద్దిరెడ్డోళ్ళ యింట్లో అమ్మిడి పోద్దప్పుడు తినొచ్చినాములే రామన్నా అని నాయన చెప్పినాడు. ‘వోరినీ పాసుగులా, పయిటాలయ్యింది, అమ్మిడి పొద్దప్పుడు తినొచ్చిన బువ్వ కడుపులో యింగా వుంటాదేమప్పా’ అంటా పైకి లేచి మమ్మల్ని ఇంట్లోకి పిల్చుకోని పోయినాడు. తినే తీరల్లని బలంతంచేసినాడు. ఇంట్లో పెద్దమ్మ కూడా ప్రేమగా బలంతం చేసింది. అన్నం దగ్గర మొగమాటం బాగుండదని నాయనా నేనూ కాళ్ళూ చేతులూ కడుక్కోని పోయి కూర్చుండాం. పెద్ద కంచు పల్ల్యాల్లో వరి అన్నం పెట్టి, చిక్కుడుగాయ కూరా చింతతొక్కు ఊరుమిండి వొడ్డిచ్చింది ఆ పెద్దమ్మ. రామన్న పెద్దయ్య, జెగితిమింద కంభానికి ఆనుకొని కూర్చోని, సిగ్గుపడకుండా తిన్రా పాపోడా! ఇది మీ ఇండ్లేలే! మీ నాయిన రేత్తిరిపూట ఇక్కడే నిల్సినాడంటే ఈ సుట్టుపక్కలోల్లందరికీ బొలే సంబరమనుకో. మీ నాయిన సెప్పే పన్నెండ్రాజుల కతలూ, ఆరే మరాటీల కతలూ యినేకి జెనమంతా సుట్టుకుంటారప్పయ్యా! అట్ల మీ నాయిన వూర్లో తమలపాకులు తీసుకుండే వాల్లందరికీ సుట్టముయి పొయినాడు. మీ వూర్లో మీ నాయిన్ని యేమని పిలుత్తారో మాకు తెల్దుగానీ ఈ సుట్టుపక్కల పల్లెల్లో అందురూ కతల యెంగడసామి అని అంటారు పాపోడా!’ అని అంటా మమ్మల్ని ఆ రాత్రికి అక్కడే వుండమన్న్యాడు. ఆ పెద్దయ్య. రాత్రికి వస్తానని నీలంపల్లె పెద్దిరెడ్డోళ్ళకు మాటిచ్చినానని, మల్లా వారంలో తప్పకుండా వస్తానని నాయన బిడియపడతా చెప్పినాడు.
సందకాటి వరకూ ఆడే వుండి, కాఫీతాగి నీలంపల్లికి బయలుదేరినాం నేనూ, నాయన. బయలుదేరుతా గంపలో మిగిలిండే సుమారుగ వొగకట్ట ఆకులు ఆ పెద్దమ్మకు ఇచ్చినాడు నాయన. ఆ పెద్దమ్మ డబ్బులు ఇచ్చేకొచ్చింది. నాయన తీసుకోలేదు. కొట్టిడీ రూములోకి పోయి నాలుగైదు శేర్లు పూనాసి గింజలు తెచ్చింది ఆ పెద్దమ్మ. అవి చేయిసంచిలో పోసుకొని గంపలెత్తుకొని పొద్దు మునగకనే నీలంపల్లి చేరుకుండాం. నాయన పెద్దిరెడ్డోళ్ళ ఇంటివైపు కాకుండా వేరేసందు పక్క పోతాండాడు. నేను అడిగినాను. ఈడ మనోళ్ళుండారు మాట్లాడిచ్చుకొని పోదామన్న్యాడు. సందులో నుండి బజార్లోకి తిరిగి వొగ గారమిద్దె వసారాలోకి పోయి ‘ఋసింగా’ అని పిల్చినాడు. లోపలుండే మనిషి బయటకొచ్చి రా, రాన్నా, నిన్న వొచ్చినావంట ఈ పక్కే రాలేదే’ అని అడుగుతా ఇంట్లోకి పిలుచుకోనిపోయినాడు. నాయన నన్ను పరిచయం చేసినాడు. అదీ యిదీ మాట్లడతా బజారుకు అవతల పక్కన ఎదురుగా వుండే రేకుల కొట్టాన్ని చూపి, మీ జేజీ, కుంటి సిన్నాయనా కల్లాలప్పుడొచ్చి ఆ కొట్టంలోనే వొగ నెల్దినాలుండి అత్తిరసాలూ, కుడుములూ, కర్జికాయలట్లాటివి చేసుకోని అమ్ముకుంటారప్పా అని చెప్పినాడు నాయన.
‘కుంటోడయినా మీ సిన్నాయిన శానా గెట్టోడురా అప్పయ్యా ఇబ్బుడు మీ వూర్లోనే వుండాడా, యాటికన్నా టికానా యెత్తినాడా?’ అని అడిగినాడు రుసింగప్ప. ‘మాజేజి, చిన్నాయనా, నార్పల దగ్గరుండే సుల్తాన్పేటలో వుండారు. అప్పుడే నెలదినాలయింది. ఆ వూరికిపోయి’ అని చెప్పినాను నేను. మేము మాట్లాడతావుండంగనే వొగాయమ్మ బయట్నుంచీ ఇంట్లోకొచ్చి ‘ఏమి బావా బాగుండారా? ఈ పిల్లోడు నీ కొడుకనుకుంటా! చేతికెదిగినాడే! నీ పేరేం బూసీ?’ అని అడిగింది. నేను పేరు చెప్పినాను. విని, మీ చిన్నాయన పేరేనే అని అంటా ఆయమ్మ నాగడ్డాన్ని చేత్తో నిమిరి ముద్దుపెట్టుకుంది. అదే మొదటిసారి మా అమ్మయ్య తప్పా అట్ల యెవురూ నన్ను ముద్దుపెట్టుకోలేదు. ఆయమ్మ చూడడానికి చాలా బాగుంది. ఎత్తయిన మనిషి, ముక్కూ, మొగమూ భలే సొగసుగా వుండాయి. ఎందుకో ఆయమ్మ అదొగరకంగా వుంది. ఋషింగప్ప కూడా భారీమనిషి. కొంచెం మొరటుగా అదొగ రకంగా వుండాడు. పిల్లలు లేనట్లుంది. సంసారమేమో బాగున్నెట్లుంది. మా ఉప్పర కులంలో అంతమాత్రం కుటుంబం మా వూర్లో యాదీ లేదు.
కాఫీ తాగుతారా బావా పెట్టిత్తాను అని నాయనను అడిగింది ఆయమ్మ. గంటముందే దంతులూర్లో తాగొచ్చినాము, వొద్దమ్మా అని నాయన తలకాయి అడ్డం తిప్పినాడు. నువ్వు బూసీ అని నన్నడిగింది. నేనూ వొద్దన్న్యాను. నాయనా, ఋషింగప్పా పల్లె సంగతులు మాట్లాడుకోబట్టినారు.
శింగనమల పక్కనుండే కొండపేరు ఋషింగమయ్య కొండ. కొండమింద ఋషింగమయ్య గుడి వుందంట! గుడి పక్కనే పెద్ద దొన, ఆ దొనకు ఫర్లాంగు దూరంలో అక్కమ్మ గారి దొన భలే వుండాయంట! రెండు దాండ్లల్లోనా నీళ్ళు, ఎండల కాలంలో గుడకా తగ్గిపోకుండా వుంటాయంట! అంతపైన నీళ్ళు ఎట్లుంటాయో? రోంత పెద్దయినంక పోయి సూడల్ల. ఆ కొండకు దగ్గరగా వుండే మా పల్లెల్లో ఋషింగమయ్య అనే పేరు ఎవురికీ లేదు. అట్లాది దూరంగా వుండే ఈ వూర్లో ఈయప్పకు ఆ దేవుని పేరు యాల పెట్టుకుండారో అని రోంతసేపు ఆలోచనచేయబడితిని. అంతలోనే నాయన జెగితి మింద నుండీ కిందికి దిగి నసుకయింది, పొయ్యొస్తామని చెప్పి బయలుదేరినాం. ఇద్దరమూ పెద్దిరెడ్డోళ్ళ ఇల్లు చేరుకుండాం.
ఇంట్లో జెగితికీ గాటిపాడుకూ మధ్యలో వుండే నడవపైన దూలానికి వేలాడుతా పెట్రోమాక్స్లైటు వెలుగుతా వుండంచూసి ఆశ్చర్యపోయినాను. మా వూరి లైట్ల తిమ్మన్న పీర్లపండగప్పుడు చెప్పిండే మాటలు గ్నాపకమొచ్చినాయి. మా వూర్లో పెద్ద పావుకార్లయిన ఎలకంటి పాపయ్యోళ్ళుగానీ, మంచికంటి రంగయ్యోళ్లుగానీ దండిగా పొలాలుండే నాగిరెడ్డోళ్ళుగాని ఎవురూ రాత్రిపూట ఇండ్లల్లో పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకోలేదు. వీళ్ళు పెట్టుకుండారంటే మా వూరి షావుకార్లకంటే వీళ్ళు చాలా ముందున్నెట్లే అని అనుకుండాను. నాకయితే ఆ లైటు వెలుతర్లో అందరూ పారాడతావుంటే భలే సంతోషమయింది. ఇట్లాటి వెలుతర్లో రాత్రి పూట చదువుకోవడానికి ఎంత పుణ్యం చేసిండల్లనో అని మనసులో అనుకుంటావుంటే ఐస్కూలూ పుస్తకాలూ నాతోపాటు చదువుకుంటావుండే జతగాల్లూ గుర్తుకొచ్చినారు. వెంటనే కనుగుడ్ల మింద నీళ్ళు పారాడినాయి అది, వాళ్ళు చూస్తారేమోనని బయట వసారాలోకిపోయి కన్నీళ్ళు తుడుచుకుండాను.
నాయన పెద్దగంపలో వుండే ఆకులమింద నీళ్ళు చల్లల్లని బయటికి తెచ్చినాడు. నేను రెండు చెంబులనీళ్ళు తెచ్చి గంపమింద చల్లినాను. రోంతసేపయినంక నీళ్ళన్నీ వొడిగిపోడానికి నాయన అరుగుమింద ఆకుల గంపను వారగిల బెట్టినాడు. అంతలోనే ఆ ఇంట్లోని అక్కయ్య మమ్మల్ని భోజనానికి పిలిచింది. పెద్దిరెడ్డి పెద్దయ్యా, కోనారెడ్డి పక్కనే అందరికీ కూర్చోడానికి సిరిచాపలేసింది. అందరికీ కాలేకాలే వరి అన్నమూ, అలసందుల పులుసూ, శెనిగిత్తనాలూ ఉల్లి గడ్డలూవేసి నూరిండే ఊరిమిండీ వొడ్డిచ్చింది. ఆ తర్వాత గడ్డపెరుగు వేసింది. అంత రుచిగా వుండే అన్నం తింటావుంటే మనసు పొంగిపోసాగింది. దినామూ ఇట్లాటి తిండి తినేకి ఎంతదృష్టవంతులో వీళ్ళు అనుకుంటా, కడుపును పెదింతజేసుకొని కడుపారా తిన్న్యాను.
రాత్రి భోజనాలయినంక, పెద్దిరెడ్డోళ్ళ ఇంటికి దగ్గర్లోవుండే రైతుపాయి జనం, మొగోళ్లూ, ఆడోళ్లూ సుమార్గ నలభై యాభై మంది నాయన చెప్పే కథలు వినడానికి వొచ్చి అందరూ వసారాలో రెండు పక్కలా అరుగుల మింద కూర్చుండారు. గోడవార, సిరిచాప మింద, నాయన గోడకు ఆనుకొని, ఎడమకాలు కింద ముడుచుకొని కుడికాలు కొంచెం ముందుకు మడిచి, మోకాలి చుట్టూ చేతులేసి కథ చెప్పడానికి పూనుకొని, పండెండు రాజుల కథలో పోయినసారి యా రాజు కథ దగ్గర ఆగిపోయినామో అడిగినాడు, కథను క్రమం తప్పకుండా యామారకుండా వింటూ వొచ్చినవాళ్లు, కథ యాడ ఆగిపోయిందో నాయనకు గుర్తుజేసినారు. నాయన అందుకుండాడు.
‘ఆ ప్రకారంగా ఆ చిన్నది తలస్నానం చేసి, భవంతి నెక్కి, కురులార బోసుకుంటా వుంది.’ అంటా తర్వాతి కథ చెప్పడానికి పూనుకుండాడు నాయన. కథ చెప్పడం మొదలు పెట్టినంక నాయన మాట్లాడే భాష చాలా మారిపోయింది. మామూలుగా మాట్లాడే మాటలు, రోంత చదువుకున్నోళ్ల మాటల మాదిరి నైసుగా మారిపోయినాయి. అది చూసి నేను అబ్బురపడతా మురిసిపోయినాను. ఆ చెప్పేకథ అయిదారు నెలల కిందట్నుంచీ సాగుతావుందంట. అది విని నేను ఇంగా ఆశ్చర్యపోయినాను.
నేనెప్పుడూ నాయన కథలు చెప్పడం విన్లేదు. పండెండు రాజుల కథ అయిదారు నెలలనుంచీ చెప్పుతావుండాడంట. అసలు నాయనకు ఈ కథలు ఎవురు చెప్పినారో, చదువురాని నాయన ఈ కథల్ని యెట్ల నేర్చుకుండాడో, యెట్ల గుర్తుపెట్టుకుండాడో, కథను తన మాటల్లో నాయన వర్ణించి చెప్పుతావుండాడు. ఇదెట్ల సాధ్యమయితా వుంది? నాయన ఈ మాదిరిగా కథలు చెప్పడం వల్లనే షావుకారీ, పేదోడు అనే తేడా ల్యాకుండా పెద్ద కులాలోళ్ళూ, చిన్న కులాలోళ్ళూ అనే భేదం ల్యాకుండా, తీరుబడి కలిగినోళ్ళూ, పగలంతా కష్టపడి పనుల్జేసి అలిసిపోయినోళ్ళూ అందరూ యెంతో శ్రద్ధగా వింటావుంటే వాళ్ళను చూసి నాకు చాలా సంతోషమయ్యింది. ఇంతకూ పండెండు రాజుల కథంటే ఎవురో ఆ పన్నెండు మంది రాజులు? ఇంకా నాయనకు యాయాకథలొస్తాయో! ఇన్ని కథలు తెలిసినోడు తనను చదువుకోకుండా చేసినాడే అని అనుకోగానే మనసులో బాధయింది. ఇంతమంది రెడ్లూ, భూములుండే ఆసాములూ, నాయన అడిగితే నా చదువుకోసరం సాయపడలేరా? ఇదంతా నా దురదృష్టమేమో, నా దురదృష్టం అదృష్టంగా మారదా? పెద్దిరెడ్డి పెద్దయ్యట్లావాళ్ళు గట్టిగా అనుకుంటే అది సాధ్యం కాదా?
నాయన చెప్పే కథ వినకుండా రకరకాలుగా ఆలోచిస్తా, తూగొస్తావుంటే ఆడే పండుకుండాను.
***
ప్రొద్దున్నే పెద్దిరెడ్డోళ్ల ఇంట్లో కాఫీతాగి ర్యాగడి (రేగడి) కొత్తూరుకు బయలుదేరినాం నేనూ నాయనా. బరులుదేరుతా మంచివయిన ఆకుల కట్టలు వాళ్లింట్లో ఇచ్చినాడు నాయన. ఆ ఇంటి పెద్దమ్మ సద్దలూ, జొన్నలూ, కందిబ్యాళ్లూ, అవొగ శేరు ఇవొగ శేరు మూటగట్టి ఇచ్చింది. వెనుదిరిగి వూరికి పోయేటప్పుడు తీసుకొనిపోతామని ఆ మూటను అక్కడే పెట్టినాడు నాయన. రామలక్ష్మి అక్కయ్య, నాకు తినేకని పది కర్జికాయలు పేపర్లో పెట్టి ప్రేమగా ఇచ్చింది. నాకయితే ఆ ఇంటిని వొదలల్లనిపిచ్చలేదు. అయితే మా ఇల్లు కాదు గదా యిది! అందుకే ఇష్టం ల్యాకపోయినా నాయన వెంట, చిన్న గంప నెత్తిమింద ఎత్తుకొని రామలక్ష్మి అక్కయ్యతోనా, అందరితోనా చెప్పి యెల్లవారినాను.
ఊరు దాటుతానే తడకలేరు! మా చెరువులోకి పోయే పెద్దొంక! ఈతచెట్లల్లో ఇసకదిన్నెల మధ్యలో రెండు యాతాలన్ని (ఏతం) పారే నీళ్లలో దిగి పోతావుంటే భలే సంతోషమయ్యింది నాకు. నా జతగాళ్లూ మావూరోళ్ళు యెవురూ చూడని ఆ యేట్లో పోతా, యాలనో రోంతసేపు ఉబ్బి పోయినాను, పెద్ద వానలొచ్చినప్పుడు ఈ యేరు యెట్లుంటాదోనని నాయనను అడిగినాను. అత్యద్భుతంగా పారుతాదని, వొగొగసారి, ఆడ కనిపిచ్చే నాగలింగేశ్వరస్వామి గుడిని యేటి నీళ్లు తాకుతాయని, ఆ ప్రకారంగా నాలుగు దినాలు పారితే శింగనమల చెరువు నిండి మరవ పారుతాదని నాయన చెప్పుతావుంటే వినుకుంటా ఏటిగడ్డలు దాటినాం. దాటుతానే ర్యాగడి భూములొచ్చినాయి. ఇంగ అక్కన్నుంచీ ర్యాగడికొత్తూరు దాటి కొత్తపల్లి వరకూ అన్నీ ర్యాగడి భూములేనని నాయన చెప్పినాడు. అదెందుకో వొగొగచోట నాలుగైదు మైళ్ల మధ్యలోనే కొంత భూమి నల్లర్యాగడి, కొంతభూమి ఎర్రనేలా యెట్ల యేర్పడిందో, కొండలూ, గుట్టలూ, పర్వతాలు, మహాపర్వతాలు, సముద్రాలూ యారకంగా యేర్పడినాయో ఆలోచిస్తా, చదువుకుంటే అదంతా తెల్సుకోవచ్చునేమో అనుకుంటా బండిరస్తాలో నాయనెంట ముందుకు పోతావుండాను.
బండి రస్తా చక్కగ, స్కేలుతో గీసినట్ల కనిపిస్తావుంది. వొగపల్లెనుంచీ యింగొగ పల్లెకు పోవల్లంటే అన్నీ సీల్దావలూ, బండిరస్తాలే తప్ప రోడ్లు ఉండవేమో అనుకుంటా గంపలో వుండే కర్జికాయలు గుర్తుకొచ్చి, చెరొగటి తిని, మిగతావన్నీ ఇంటికి అమ్మయ్యకూ, పిల్లోళ్లకూ తీసుకొని పోదామని నాయనను అడిగినాను. తనకు వద్దు నన్నే తినమన్న్యాడు నాయన. వొగటి తీసుకొని నేను తినుకుంటా, ర్యాగడి చేన్లల్లో ఏమేమి పంటలు పండిస్తారో నాయనను అడిగి తెలుసుకుంటా, అక్కడక్కడ వేసిండే కొర్ర పైరును చూసుకుంటా పోతావుండాను. అంతలోనే ర్యాగడికొత్తూరు వొచ్చింది. ఊరి మొగదాల, వొగొగటి అర్ధ ఎకరాకు పైగా వుండే గట్టి డొడ్లనూ, యానాడూ చూడనంత పెద్దగా వుండే గడ్డివాములను చూసి వూర్లో రైతులందరూ గాథాగా వున్నెట్లుందనుకుండాను. దొడ్లన్నీ, చిదుగు ల్యాకుండా బొగు మట్టంగా వుండాయి. ఊర్లోకి పొయ్యే దొడ్ల సందు గుడకా చాలా పెద్దగా వుంది. ఎర్రనేల పల్లెల రైతులకూ, ర్యాగడి పల్లెల రైతులకూ చాలా తేడా వుందనుకుంటా ఊర్లోకి అడుగు పెట్టినాను.
ర్యాగడికొత్తూరు! బజారు విశాలంగా వుంది! అన్నీ పెద్ద పెద్ద గారమిద్దెలే! బజార్లో పోతావుంటే నాయనను చాలామంది పలకరిచ్చినారు. వాళ్లను మాట్లాడిచ్చుకుంటా నాయన వొగ ఇంటికాడ ఆగి గేటుతీసి లోపలికి పోయినాడు. నాయనెంట నేను పోయినాను. ఎదురుగా నల్లగా, పల్చగా వుండే వొగాయప్ప, వసారా అరుగుమింద కూర్చొని బీడీ తాగుతా నాయన పక్క చూస్తా ‘అబ్బబ్బబ్బా, ఈసారి యేమి యిన్నాల్లు పోతివి యెంగడసామీ? ఈ పిల్లగాడు నీ కొడుకే వున్నెట్లుందే! రా, రా పాపోడా!’ అని ప్రేమగా పిల్చినాడు. ఆ పక్కన దొడ్లోవుండే వాళ్లమ్మను క్యాకేసి, రా, రా, యెంగడసామొచ్చినాడు అని పిలిచినాడు. నేనూ, నాయనా అరుగు మింద ఆకుల గంపల్ని దించినాం. ‘అందరూ బాగుండారా నాగలింగారెడ్డీ?’ అని నాయన ఆ యప్పను పలకరిచ్చినాడు. బయట నాయన మాట్లాడేది విని లోపల్నుంచీ, సీతారాముల పటంలోని సీతాదేవి మాదిరుండే వొగాయమ్మ నవ్వుకుంటా వొచ్చింది. ‘బాగుండావా చెన్నమ్మా?’ అని ఆ యమ్మను నాయన పలకరిచ్చినాడు. అంతలోనే దొడ్లో నుంచీ తెల్లచీర కట్టుకోనుండే వొగ పెద్దాయమ్మ వొచ్చి, ‘మేమప్పా యెంగడసామీ, మా వూర్ని మర్సిపోయినావనుకుంటిమే! ఇన్నాల్లు రాకుంటే యెట్లప్పా? నీ తమలపాకుల కోసరమూ, నీ కతల కోసరమూ కలవరిచ్చినట్లుండాది’ అంటా దండిచ్చింది. ఆ మాటల్లో ఆ మనుషుల్లో కనిపిచ్చే నెర్లును చూసి నేను పొంగిపోయినాను. తెల్లని యెంటికలు కొప్పుకట్టుకొని, చేతుల్లో వెండి కడియాలేసుకోని ఆ అవ్వ పెద్ద రెడ్డెమ్మ మాదిరుంది. ఆ అవ్వ మాదిరే అవ్వ కొడుకు నాగలింగారెడ్డి, శ్రీరామచంద్రుని మాదిరి, నలుపయినా ఎంతో అందంగా వుండాడు. వయసులో నాయన కంటే కొంచెం చిన్నోని మాదిరుండాడు. నాయననూ, నన్నూ ఆ యింటి మనుషులుగా చూస్తా ఇంట్లోకి పిల్చుకొనిపోయినాడు.
కాళ్లూ మొగాలూ కడుక్కున్నెంక, మొదట రోంత కాఫీ తాగండి, వొగర్ధ గంటలో పొప్పు అయితాది. ఆనెంక భోంచేత్తురు అని అంటా చెన్నమ్మ పిన్నమ్మ కాఫీ యిచ్చింది. నన్ను కొడుకు లెక్కన, ఆ పిన్నమ్మ మాట్లాడిస్తావుంటే నేను మా పేదరికాన్ని మరిచిపోయినాను. ఆనెంక అందరికీ ఆ పిన్నమ్మ భోజనం పెట్టింది. నాకయితే కొసిరి కొసిరి పెట్టింది. సిగ్గూ యెగ్గూ ల్యాకుండా తృప్తిగా తిన్న్యాను.
భోజనం అయినంక నాయనా, నాగలింగారెడ్డి చిన్నాయనా ఆ అవ్వా జెగితి మింద కూర్చొని రోంతసేవు వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడినారు. మిగతా విషయాలు మల్లా మాట్లాడుదాములే, అని నాయన లేచి, ఊర్లోకి పొయ్యొస్తామని చెప్పి యెల్లవారినాడు. నేను ఆకుల గంపెత్తుకొని నాయనెంట నడిచినాను, పెద్ద పెద్ద ఇండ్ల దగ్గరంతా నిలిచి వొక్కొక్క ఇంట్లో కట్టా, అరకట్టా, కాలుకట్టా ఆకులిచ్చినాడు నాయన. దాదాపందరూ డబ్బులే ఇచ్చినారు. రెండు మూడిండ్లోళ్ళు మాత్రం జొన్నలు, కొర్రలు పోసినారు.
ఇంగా సగం వూరుంది. సాయంత్రం వొస్తామని చెప్పి రాముల గుడి దగ్గరికి చేరుకుండాడు నాయన. అక్కడ అయిదారు మంది పెద్దోళ్ళు మాట్లాడుకుంటా వుండారు. వొగ పెద్దమనిషి నాయనను చూసి ‘అబ్బబ్బబ్బా నీకు నూరేండ్లాయుష్షు వెంకటస్వామీ ఇప్పుడే అనుకుంటా వుంటిమి అంతలోనే నువ్వొస్తివి. రా, రా, నువ్వు లేకుండా ఈ పంచాయితి తెగేతట్ల లేదు రా’ అని నవ్వుతూ పిల్చినాడు. ఆయప్ప నాయన మాదిరే వుండాడు. అదే పట్టతలకాయి. అదే ముక్కు, అదే సైను గుడ్డ చేతుల బనీను, అదే గోసిపంచ!
‘శీలం రామచంద్రారెడ్డివి నువ్వున్నెంక ఆ పంచాయితి తెగలేదంటే ఆశ్చర్యమేనప్పా’ అంటా నాయన గుడి కటాంజనంలోకి పోయి బెంచీ మింద కూర్చుండాడు. రామచంద్రారెడ్డి నాయన రెట్టబట్టుకొని ఇనప కుర్చీలో కూర్చోబెట్టి నా గురించి అడిగి, వొరెవొరెవొరే, పిల్లోడు చేతికెదిగినాడే అంటా నన్ను పిలిచి బెంచీమీద కూర్చోబెట్టినాడు. అతని మాటల్ని బట్టి నాగలింగారెడ్డి, ఉత్సిలోళ్ళ నాగలింగారెడ్డి అని తెలిసింది.
గుడి కటాంజనం లోపలుండే వాళ్ళు నాయనతో యేందో మెల్లగా మాట్లాడసాగినారు. నేను కటాంజనంలోనుంచీ దూరంగా కనిపిస్తా వుండే చెన్నమ్మ పిన్నమ్మోళ్ళ ఇంటిపక్క చూస్తా ఆలోచిస్తా వుండాను.
యాడ బండమీదపల్లీ, యాడ ఉప్పరోల్ల ఆకుల వెంకటస్వామీ, యాడ నీలంపల్లీ, యాడ పెద్దిరోడ్డోళ్ళూ, యాడ దంతులూరు, యాడ కురవ రామప్పోళ్ళూ, యాడ ర్యాగడి కొత్తూరూ, యాడ నాగలింగారెడ్డోళ్ళూ, యాడ ఈ పెద్ద మనుషులూ, యాడ ఈ వూరి పంచాయితీ! ఆకులమ్ముకుంటా, కూలిపనులు చేసుకుంటావుండే నాయనకు ఈ పల్లెల్లో పెద్దపెద్దోళ్ల దగ్గర ఇంత గౌరవం ఉందంటే యెవురన్నా నమ్ముతారా? యెట్ల నాయన ఈ పెద్దపెద్దోళ్ళ దగ్గర ఇంతపేరు పెట్టుకుండాడు? ఇంతమంది షావుకార్లు, బంధువుల మాదిరున్నెప్పుడు నన్నెందుకు చదివిచ్చలేదు? నా కొడుకును చదివిచ్చల్లని అడిగితే వీళ్ళు సాయపడరా? నాయనకు ఈ పల్లెల్లో చాల మర్యాద వుందని, నేను చదువు మానేసి నాయనెంట ఆకుల గంపెత్తుకొని ఆకులమ్ముకుంటే, ఆ మర్యాద, బండమీదపల్లెలో మా కుటుంబాన్ని అభిరుద్ది చెయ్యలేదు కదా! ఈ రెన్నాళ్లూ పండుగ భోజనం మాదిరి తింటిని. ఇంటికి పోతే మల్లా అదే తిండి అదే అవస్త కదా! ఇంటికి పోకుండా ఈడే వుండేకి అయితాదా?
అనుకుంటావుంటే కండ్లల్లో నీళ్లు మెదిలినాయి. అమ్మయ్య మాదిరి అన్నం పెట్టిన చెన్నమ్మ పిన్నమ్మ నా చదువును గురించి నాయనను అడిగితే బాగుంటాది. అప్పుడు ఆ పిన్నమ్మ, నన్ను చదివిచ్చమని నాయనతో తప్పకుండా గట్టిగ చెప్పుతాది. ఆ పిన్నమ్మ చెప్పినంక నాయన వినకుండా వుంటాడా? మనసులో ఆశ కలిగింది. అంతలోనే రామచంద్రారెడ్డి పెద్దయ్య నాయనను తమ ఇంటికి భోజనానికి రమ్మని బలవంతం చేసినాడు. రాత్రికి వస్తాములే అని అంటా వుండంగనే చెన్నమ్మ పిన్నమ్మోళ్ల జీతగాడు వొచ్చి ‘అయ్యా, అన్నం తినేకి రావల్లంట, చెన్నమ్మక్క పిల్సుకోని రమ్మనింది అంటా నాయనను పిల్చినాడు.
‘‘రేయ్ నారిగా, వెంకటస్వామి ఈపూట మా ఇంట్లో భోంచేస్తాడు. నేను పిల్చుకోనిపోతా వుండానని ఆ చెన్నమ్మతో నా మాటగా చెప్పు’’ అని మా ఇద్దరినీ వాళ్లింటికి బయలుదేరిచ్చినాడు. ఆ వొచ్చిన నారప్ప సరేనయ్యా అని వూకొట్టి వెళ్లిపోయినాడు. మేము రామచంద్రారెడ్డోళ్ల ఇంట్లో భోంచేసి, పొద్దు వాలినంక చెన్నమ్మ పిన్నమ్మోళ్ల ఇంటికి పోయినాం. పయిటాల బువ్వ తినేకి రాలేదని ఆ పిన్నమ్మోళ్ల ఇంట్లో అందరూ నాయనను దండిచ్చినారు. ‘నువ్వన్నా రాకూడదేమీరా దొంగబడవా?’ అని నన్ను మందలిచ్చింది పిన్నమ్మ. ఆ మాటలు ఎంత బాగుండాయో అనిపిచ్చింది నాకు.
సాయంత్రం మల్లా వూర్లోకి పోయి నాయనా, నేనూ ఆకులు అమ్ముకోనొచ్చినాం. ఇంగా పదైదు కట్టల ఆకులు మిగిలినాయి. రేపు పొద్దున్నే కొత్తపల్లికి పోయోస్తామన్న్యాడు నాయన. రాత్రి చెన్నమ్మోళ్ల ఇంట్లోనే ఇద్దరమూ భోంచేసినాం. ఆ పిన్నమ్మ ‘అట్లు’ నాలుగు, పల్లెంలో పెట్టి డాండ్ల మింద నెయ్యి పోసింది. తింటా వుంటే ఎంత కమ్మగా వుండాయో! అమ్మయ్య కూడా రెండుమూడుసార్లు చెన్నంగి బియ్యం పిండీ బెల్లమూ వేసి పాకుబట్టి, అట్లు చేసింది. శెనిక్కాయనూనెలో దేవేసిన ‘అట్లు’ మీద నెయ్యి పోసుకొని తింటారని నాకు తెలీనే తెలీదు.
భోజనాలయిపోయినంక ఆ యింటి అవ్వయ్యా నాయనా వక్కాకు యేసుకుండారు, నాయన వక్కాకులోకి మామూలుగా వేసుకుండే పొగాకు బదులు డబ్బీ పొగాకు యేసుకుండాడు. నాగలింగారెడ్డి చిన్నాయన బీడి అంటిచ్చుకుండాడు. పెద్దోళ్ళు వక్కాకు నములుతా, బీడీ తాగుతా వున్నంగనే చుట్టుపక్కలోల్లు సుమారుగ నలభై మంది వొచ్చినారు. పయిటాలప్పుడు గుడిలో కలిసిన రామచంద్రారెడ్డీ మిగతా పెద్దమనుషులూ వొచ్చి కూర్చుండారు. నాయన కథ చెప్పేకి మొదలు పెట్టినాడు. నీలంపల్లిలో చెప్పిండే పండెండు రాజుల కథ కాకుండా కాశీ మజలీ కథలంట! పోయిన వారం యెంత వరకూ చెప్పినాడో రామచంద్రారెడ్డి పెద్దయ్య్ల గుర్తుచేసినాడు. ఆట్నుంచీ చెప్పడం మొదలు పెట్టినాడు నాయన. వింటావుంటే ఆశ్చర్యమయింది నాకు.
ఎప్పుడు కునికినానో యేమో లేచేటప్పటికి తెల్లారింది. పండ్లు తోముకొని, ముఖాలు కడుక్కుంటానే పిన్నమ్మ కాఫీ చేసిచ్చింది. అద్భుతమైన కాఫీ తాగుతా, కుంపటి మింద కుండలో కాగుతా వుండే పాలవాసన పీలుస్తా జెగితి మింద కడానుండే కంబం పక్కన మజ్జిగ కుండలో మజ్జిగ చిలుకుతా తిరుగుతా వుండే కవ్వాన్ని చూసి, రైతులంటే వీళ్లని, పాడిపంటలంటే ఇట్లుండల్లని అనుకుంటావుండగా, కొత్తపల్లికి పోవల్లనే సంగతే మరిచిపోయి, నాయన భుజం తడతానే పైకి లేచినాను.
ఇద్దరమూ కొత్తపల్లికి పోయే బండిజాడ పట్టినాం. కొత్తపల్లి, ర్యాగడికొత్తూరుకు ఎగువన పడమట వైపున, అనంతపురం నుండి గుత్తి, కర్నూలు పొయ్యే రోడ్డు పక్కనే వుంటాదని నాయన చెప్పుతా వుంటే వినుకుంటా నడుస్తావుండాను. రోంత దూరం పోయినంక ఎర్రన్యాలలు (నేలలు) వొచ్చినాయి. అమ్మిడి పొద్దుకల్లా కొత్తపల్లి చేరుకుండాం. నేరుగా వొగ ఇంటి దగ్గరికి పోయినాడు నాయన. ఆ ఇంటి యజమాని, నాయనను ప్రేమగా పలకరిచ్చినాడు. వాళ్ళమాటల్లో ఆయప్ప పేరు నాగిరెడ్డి అని అర్థమయింది నాకు. మనిషి మొరటుగా వుండాడు. ఇల్లు కూడా కళకళగా లేదు. ఆస్తిపాస్తులు యామాత్రం వుండాయో గానీ, సంసారంలో నాయన అప్పుడప్పుడు అంటా వుండే ‘జిగి’ కనిపిచ్చలేదు. నీలంపల్లి, రేగడి కొత్తూరు రెడ్ల కుటుంబాల మాదిరి కొత్తపల్లి నాగిరెడ్డి కుటుంబం దర్పంగా లేదు. మొరటుగా వున్న్యా నాగిరెడ్డి, మంచి నెర్లుండే మనిషని తెలిసింది. వాళ్లింట్లో అమ్మిడిపొద్దు బువ్వతిని నాయనతో పాటు వూరంతా తిరిగినాను. కడాకు రోడ్డు వారనుండే ఇంటికి పోయినాం. ఆ ఇంటి రెడ్డి తిమ్మారెడ్డి. ఆయప్ప గుబురు మీసాలు చూస్తే ఎవురయినా భయపడాల్సిందే. ఇంట్లో గోడకు తగిలేసిన తుపాకి చూసి, ఊర్లో పార్టీలుండాయెమో! అందుకే ఇంట్లో తుపాకి పెట్టుకుండారేమో అనుకుండాను. మాటిమాటికీ మీసాలు జవురుకుంటా ‘ఈ పిల్లకాయి యెవురు యెంగడసామీ?బొగు వుశారుగా వుండాడే! యీడు సదువుకుంటా వుండాడా?’ అని ఆ మీసాల రెడ్డి శానా గర్వంగా అడిగినాడు నాయన్ని. నాయన అంతా చెప్పినాడు. ‘మంచి పన్జేసినావులే, సేతికొచ్చిండే పిల్లోనికి లచ్చినంగా పనీపాటా నేర్పిచ్చకుండా యేం సదువులప్పా? సదువుకున్నోనికంటే సాకలోడు మేలంటారు?’ అంటా శానా తిరస్కారంగా మాట్లాడినాడు. నాకు ఆయప్ప మాట్లాడతావుంటే భలే పిత్తరం రేగింది. ఇంగ అక్కడ వుండబుద్ధి కాలేదు. నాయన వొగ అరకట్ట ఆకులు లెక్కబెట్టి ఇచ్చినాడు. వొగ ఆడమనిషి ఆకులు తీసుకోని డబ్బులిచ్చేకి వొచ్చింది.
‘కడాన మిగిలినవీ, సగిలినవీ మనకు ఇచ్చేకొచ్చినాడు యెంగడసామి దుడ్లు ఇబ్బుడేమిత్తావులే, మల్లా వారంలో ఇత్తువుగాని’ అంటా అడ్డకూతలు కూసినాడు మీసాలాయప్ప. ఆయప్ప మాటలు ఏమీ పట్టిచ్చుకోకుండా ఆడమనిషి డబ్బులిచ్చింది. నాయన ఆయమ్మతో యేందో మాట్లాడతా వుంటే నేను ఇంట్లోనుంచీ బయటికొచ్చినాను. రోంతసేపయినంక నాయనా వొచ్చినాడు. ఇద్దరమూ వెనుదిరిగి వూరికి బయలుదేరినాం. ఊరుదాటి బండిజాడ బట్టినంక నాయనను అడిగినాను మీసాలాయప్పను గురించి.
‘బూములేమో దండిగా వుండాయప్పా, వుంటే యేం లాబం? ఇతగాని ఆము సేట్టల్తో యా జీతగాడూ రోన్నాల్లుండడు. మేడితోక పట్టుకోని మడక దున్ని సొంత సేద్దెం చేసుకుండేకి శాతగాదు. ఇంట్లో కుచ్చోని అన్నీ డౌలు కూతలు కూత్తా వుంటాడు. అందికే వూర్లో ఎవురికీ సరిపోదు ఇతగాడంటే’ అని నాయన కొత్తపల్లి మీసాల తిమ్మారెడ్డి బండ్వాలమంతా చెప్పినాడు. నేను వినుకుంటా దావ నడుస్తా మూడు దినాల సంగతులన్నీ గుర్తు చేసుకుంటిని.
పయిటాలకల్లా ఇద్దరమూ మల్లా రేగడి కొత్తూరు చేరుకుంటిమి. చెన్నమ్మ పిన్నమ్మ నా పక్కజూసి ‘అయ్యయ్యో, ర్యాగట్లో కాల్లు కాల్తావుంటే చెప్పులు గుడకా ల్యాకుండా యెండలో యెట్లొత్తివిరా? యేమప్పా వానికి లబ్బరు (రబ్బరు) సెప్పులన్నా తీసీగూడదా?’ అని యెంతో మమకారంగా అడిగింది. ఆ పిన్నమ్మ అడుగుతావుంటే ర్యాగడి రస్తాలో యెండకు నడిసొచ్చేటప్పుడు కాల్లుగాలినదంతా గుర్తుచేసుకుంటి. ఆ పిన్నమ్మ మాటలతో అలసటంతా తీరిపాయ. కన్నతల్లి మాదిరుండే ఆ ఇంట్లో పయిటాల బువ్వ కమ్మగా తిని, రెండు గంపల్లో గింజలూ పూనాసి గింజలూ అన్నీ సర్దుకుంటిమి. ఆ పిన్నమ్మ వొగ క్యారీర్లో సుమార్గ ‘అట్లు’ వేసిచ్చింది. మీ నాయనెంట అబ్బుడబ్బుడు వొత్తావుండు బూసీ అంటా అట్లే నాపక్క చూసింది. ఆ కండ్లల్లో మా అమ్మయ్యే కనిపిస్తావుంటే యేందో మనసును యెనిక్కి లాగుతావుంటే వదల్లేక వదల్లేక ఇల్లు వదలి గంపలెత్తుకోని ఊరికి బయలుదేరినాం. మధ్యలో నీలంపల్లి పెద్దిరెడ్డి పెద్దయ్యోళ్ళ ఇంట్లో పెట్టిండే గింజలన్నీ రెండు గంపల్లో సర్దుకోని కాఫీ తాగి యెల్లవారినాం.
బండమీదపల్లి మా గూడుమిద్దె ఇంటికి చేరుకుండేటప్పటికి పొద్దు మునిగేకొచ్చింది. ఇంట్లో అందరూ కండ్లల్లో వొత్తులేసుకొని చూస్తావుండారు. మమ్మల్ని చూస్తానే అమ్మయ్య కనుగుడ్లమింద నీళ్లు పారాడినాయి. దుమ్మూ, ధూళికి మాసిపోయిన మా తలకాయల మింద వేడి వేడి నీళ్లు పోసింది అమ్మయ్య. స్నానం చేసినంక బయట అరుగు మింద తీరిగ్గా కూర్చుండాను, గంపల్లోని గింజలూ, పూనాసి గింజలూ అన్నీ బయటికి ఎత్తిపెట్టినారు అమ్మయ్యా, పెద్దక్కా. మేము తీసుకోనొచ్చిండే కర్జికాయలూ, అట్లూ అమ్మయ్యా పిల్లోళ్లూ అందరూ తింటా వుంటే, నేను పొయ్యిండే పల్లెల్లో యెక్కడెక్కడ ఏమేమి జరిగిండేది, యేమేమి తినిండేది, ర్యాగడి కొత్తూర్లో ఉత్సిలోళ్ల ఇంట్లో చెన్నమ్మ పిన్నమ్మ యెట్లెట్ల చూసిండేదీ అంతా ఆనందంతో చెప్పినాను. అమ్మయ్య అంతా వింటా మురిసిపోయింది.
రంకులాటతో ఊరిపేరు గబ్బు గబ్బు!
మాగాణి మోతలగడ్డలో దంతులూరు నాగయ్యోళ్ల మడి కోరుకు చేసుకుండేకి చేతికొచ్చిందని ఇంటందరమూ సంతోషపడినాము గానీ ఆ సంతోషం రెండు నెలలకే మాయమయిపోయింది. వానలు సరిగా పడక చెర్లోకి తగినన్ని నీళ్లు రాలేదు. అందుకే ఎవురూ పంట పెట్టలేదు. అక్టోబర్ చివర్లో అంతకు ముందుండే నీళ్లకు రోన్ని కొత్త నీళ్లు తోడయినాయి. అన్నీ కలిసి వొగపంటకు సరిపోతాయని, అయితే వరిపంట పెట్టుకుండేకి ఇది ‘సాయి’ కాదని, డిసెంబర్లో రాగి నాటుకుంటే నమ్మకంగా పంట చేతికొస్తాదని కట్టకింద పల్లెల్లోని పెద్దోళ్లందరూ కలిసి రాగి పంట పెట్టుకోవల్లని నిర్ణయించుకుండారు. అదే విషయమే నాయన దంతులూరు నాగయ్యకు తెలియజేసినాడు. ‘అట్లనే కానీలేప్పా, అందరికి అయ్యింది మనకూ’ అని వొప్పుకుండాడు నాగయ్య.
మా కుంటి చిన్నాయనోళ్ల ఇంటి తూర్పున పొత్తల గోడతో వుండే గారమిద్దె, వరట్ట రంగయ్యోళ్ళ ఇండ్లని, ఆ ఇంట్లో చిల్లరంగట్లోనే రంగయ్య శెట్టి సమ్మత్సరానికి డెభ్బై ఎనభై మూటలు గింజలు జమచేస్తాడని ఇంతకు ముందే చెప్పినాను కదా! ఆ రంగయ్య బిడ్డను తాడిపత్రికి ఇచ్చినాడు. రంగయ్య బిడ్డా, అల్లుడూ పుట్నింటి కొచ్చినారు. నేను ఇంతకు ముందెప్పుడూ నిగాగ ఆయమ్మను చూల్లేదు. ఈసారి చూసినాను. నిమ్మపండు రంగుతో ఎంత అందంగా వుందో ఆ యమ్మ! రంగయ్య అల్లుడు కూడా శ్రీకృష్ణుని మాదిరి నల్లగా భలే చక్కగా వుండాడు. వాళ్ళ రూపాలను చూస్తానే పెద్ద షావుకార్లనుకుండాను.
రంగయ్యోళ్ల అంగడి వాకిలికి ఎదురుగా వుండే కొట్టంలో, కురవ కొండన్నోళ్లు కాపురముండారు. కొండన్నను మేము చిన్నాయనా అని పిలుస్తాం. ఆ కొండన్నంటే. వూర్లో అందరికీ భయమే. అయితే మనిషి మాత్రం మెత్తనోని మాదిరుంటాడు. అయినా యాలనో ఆయప్పంటే జనం జడుసుకుంటారు. చక్రాయపేట నల్లపరెడ్డోళ్లకు, కొండన్నకూ మధ్యలో చాలా కాలం నుండి పార్టీ వుందంట! మా వూరికి రెడ్డిపనిచేసే వెంకటనారపరెడ్డికీ, నల్లపరెడ్డోళ్ళకూ దగ్గర బంధుత్వముంది. వెంకటనారపరెడ్డి కూతురు కొండన్నతో చాటుమాటు సంబంధం పెట్టుకుందనే కోపంతో నల్లపరెడ్డోళ్లు కొండన్నపైన కక్ష పెట్టుకుండారంట! అయితే కొండన్నోళ్ళ గుంపు బలంగా వుండడంవల్ల, కొండన్నను ఎదుర్కొనేకి కాపోళ్ళు వెనకంజ వేస్తావుండారంట!
అట్లాటి కురవ కొండన్నను రంగయ్య బిడ్డా, అల్లుడూ భలే నెర్లుగా చూస్తారు. కమ్మగా చేసిపెడతారు. కొండన్న ఏదడిగితే అది సర్దుకుంటారు. కొండన్న గుడకా వరట్ట రంగయ్యను కొడుకు మాదిరి ఆదుకుంటా వుంటాడు. అందుకే రంగయ్యశెట్టి తన చిల్లరంగట్లో ఎంత తారాతిగిడి చేసినా ఎవురూ అతని జోలికిపోరు. పోతేే గీతే మా కుంటి చిన్నాయనొక్కడే? మా చిన్నాయన జోలికొస్తే మా ఉప్పరోళ్లంతా ఏకమయితారని కొండన్నకు తెలుసు, అందుకే మేము బీడీలకూ, కాఫీపొడికీ, బెల్లానికి, కట్లపొడి, పొగాకు, వక్కపేళ్ళకూ, పప్పులూ, బొరుగులకూ పోయినప్పుడల్లా వరట్ట రంగయ్య చాలా తక్కువ తక్కువ ఇచ్చినాడనీ, పెద్దక్క (పెద్దశేరు)తో వడ్లు కొలుచుకొని చిన్నక్క (చిన్నశేరు)తో బొరుగులు ఇచ్చినాడనీ మా చిన్నాయన బోనాకట్టి వూదబొడుచుకొని కుంటుకుంటా మా మిద్దె వెనకున్న మొండిగోడ దగ్గరికిపోయి కూర్చొని, రంగయ్యోళ్ళకూ ఆ సందులో వుండే వాళ్లందరికీ వినపడేటట్లు అనరాని మాటల్తో తిడతాడు. అట్ల తిట్టినప్పుడల్లా కొండన్న వొచ్చి మా చిన్నాయనను మెల్లగా మందలిస్తాడు అంతే!
***
ఆదివారం శెలవని నా జతగాళ్లు మా ఇంటికొచ్చి ఆట్లాడుకుండేకి నన్ను పిల్చినారు. ఇంట్లో పనిలేదని అమ్మయ్యను అడిగి జతగాళ్లతో కలిసి టైరుగోను దొర్లిచ్చుకుంటా బజార్లోకి పోయినాను. వొక్కొక్క కాలంలో వొక్కొక్క ఆట ఆడతారు మా జతగాళ్లు, ఇప్పుడు టైరుగోన్లు, ఇనుపగోన్లు దొర్లిచ్చుకుంటా పొయ్యే ఆట, టైరుగోన్లు అంటే, బుస్సులవో, లారీలవో పాత టైర్లను, మాదిగోళ్లు రబ్బరు చెప్పులు తయారుచేసేకి తెచ్చుకొని దాండ్లను కోసినప్పుడు, అంచుల్లో లోపల ఇనపకడ్డీలతో రౌండుగా వుండే భాగాలను పక్కకు పడేస్తారు, అవే టైరుగోన్లు. అట్లాటి టైరుగోన్లును దొర్లిచ్చుకుంటా బజారుగుండా తూర్పుగేరి కాటికి పోయినాం. మా ముందర, కురవ కొండన్న తమ్ముడూ, ఇంకా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటా యాటికో పోతావుండారు. వాళ్లు వెంకట్రామయ్యోళ్ల అంగడి మోటు దాటుతానే మాదిగిండ్లల్లో నుంచీ తటాల్న నల్లపరెడ్డీ మరొగ మనిషీ, కొండన్నోళ్ల ముందుకొచ్చినారు. వొచ్చీ రావడంతోనే నల్లపరెడ్డి దుప్పటి చాటున పెట్టుకోనుండే యాటకొడవలి తీసి పైకెత్తి కొండన్న మెడకాయ నరికినాడు. నరుకుతానే రక్తం చిమ్మింది. అది చూసి మేము భయపడతా పక్కనుండే ఇండ్లల్లోకి పరిగెత్తినాం. నేను టైరుగోను పక్కన పడేసి మా ఉప్పరోళ్ల అంజినప్ప మామోళ్ల ఇంట్లోకి దూరుకొని, వాకిలి ముందుకేసి, వాళ్లతో జరిగిండే సంగతి చెప్పినాను. వాళ్లు, వాకిలి గడిపెట్టి కిటికిలోనుంచి తొంగి చూడసాగినారు. నేను గుడకా వాళ్ల మధ్యలో ఇరుక్కొని కండ్లు నిక్కబెట్టి చూసినాను.
కొండన్న కింద పడిపోయినాడు. కొండన్న మనుషులు నల్లపరెడ్డిని పట్టుకుండారు. అదే యాట కొడవలి గుంజుకొని నల్లపరెడ్డిని నరుకుతారేమో అనుకుంటా వుండంగనే ఆయప్ప కొడవలిని దూరంగా విసిరేసినాడు. నల్లపరెడ్డితోపాటు వొచ్చిన మనిషి కొడవలిని తీసుకొని పరుగుతీసినాడు. అసలయినోడు దొరికినాడని కొండన్న మనుషులు నల్లపరెడ్డిని కింద పడేసి నలగదొక్కుతా వుండారు. ఎవురు చెప్పినారో యేమో కొండన్న మనుషులు సుమారుగ ఎడెనిమిది మంది బండిగుజ్జులూ, బోనాకట్టెలు తీసుకోని గట్టిగా కేకలేసుకుంటా వొచ్చినారు. ఐదారుమంది కొండన్నను చేతుల మింద ఎత్తుకోనిపోయినారు. అతని తలకాయి మెడకాయికి వేలాడతావుంది. మిగతా వాళ్లందరూ నల్లపరెడ్డిని కట్టెలతో చిదగ్గొట్టేశారు. ఇద్దరు మనుషులు పరిగెత్తొచ్చి నల్లపరెడ్డి దొమ్మలమింద ధబిల్లన దుముకసాగినారు. వొగ ఆడమనిషి కోపంతో సిగ్గిడిసి, నల్లపరెడ్డి ముఖమ్మీద కూర్చొని, కొంచెం చీర పైకెత్తి, అతని నోట్లోకి ఉచ్చబోసింది. మొగోళ్లు కట్టెలు విరిగి పోయేటట్లు కొట్టి కాళ్లతో పోర్లాడిచ్చితన్ని, కడాకు అతడు చచ్చిపోయినాడని అనుకొని అక్కన్నుంచీ వెళ్లి పోయినారు. కొండన్నను నరికేసినారని నల్లపరెడ్డిని చంపేసినారని తెలసిందేమో, జనమంతా గుంపులు గుంపులుగా వొచ్చి మూగినారు. అంజినప్పోళ్లు తలుపులు తీసి బయటికొచ్చినారు. నేను వాళ్ళ పక్కనే నిల్చుకుండాను. ప్రశాంతంగా వుండే వూరు అబులు గుబులు అయ్యింది. జరిగిండే సంగతి తెలుసుకొని సుంకురంగప్పశెట్టి ఇంకాకొంత మంది పెద్ద మనుషులూ ఊరి రెడ్డి వెంకటనారపరెడ్డీ జనాన్ని తోసుకుంటా వొచ్చి, నేలమింద నెట్టుదప్పి పడిండే నల్లపరెడ్డిని పరిశీలించినారు. సుంకురంగప్ప కోమటిశెట్టి అయినా మంచి గుండె ధైర్యముండే మనిషి. అతని మాటంటే వూరందరికీ గురి. అయన ఏమి చెప్పినాడో యేమో, జనమంతా సల్లుకుండారు. నల్లపరెడ్డిని పెద్దమనుషులంతా నిగాగ పరిశీలిచ్చి వెంటనే అనంతపురం ఆసుపత్రికి వేసుకొని పొయ్యేది మేలని, పోలీసోళ్ళు వొచ్చి చూసేంతవరకూ ఈడనే వుంటే ప్రాణాలు పోతాయని చెప్పినాడేమో, అతని అన్నదమ్ములంతా వొచ్చి బండిలో యేసుకొని పోయినారు. గుంపులో దూరంగా వుండే అమ్మయ్య దగ్గరికి నేను పరిగెత్తిపోయినాను. అమ్మయ్య నున్ను కసురుకొని మందలిస్తా ఇంటికి పిల్చుకొని వొచ్చింది.
మధ్యాహ్నానికంతా ఊర్లోకి పోలీసోళ్ళు వొచ్చివారని తెలిసి అమ్మయ్య నన్ను గడప దాటనీయలేదు. తర్వాత ఏమయిందో యేమో, మరుసటి దినం పోద్దున్నే వరట్ట రంగయ్యోళ్లందరూ తాడిపత్రికి వెళ్లిపోయినారు. కొండన్నను యాట కొడలితో నరికిండేదీ, నల్లపరెడ్డిని బజార్లో కింద పడేసి కట్టెలు విరిగి పోయేటట్ల కొట్టి కాళ్లతో దొమ్మల మింద తొక్కిండేదీ, వొగ ఆడమనిషి నల్లపరెడ్డి నోట్లోకి చీరెత్తి ఉచ్చబోసిండేదీ అంతా శానాదినాలు గుర్తుకొచ్చి నన్ను కలవరపెట్టినాయి. అదింకా మాసిపోక ముందే మల్లా వొగ గలాటా జరిగింది.
కోమటోళ్ళల్లో మా వూరి సుంకు రంగయ్య మొనగాడు!
అది కావల్ల, ఇది కావల్లని ఇంట్లో గలాటా చేస్తావుండే తమ్మున్ని బజారుకల్ల పిల్చుకొని పొమ్మని చెప్పింది అమ్మయ్య. నేను వాన్ని పిల్చుకొని, తూరువు గేరి బయట రామే వాళ్ల దొడ్డిదగ్గరుండే ‘ఇరిక్కాయ’ మానులో మాగిండే బంకిరికి పండ్లు పీకీయ్యలని పోతావుండాను. ఆదివారం కదా, కొండన్న గాడు ఇంటికాడనే వుంటే అట్లే వాన్ని గుడకా పిల్చుకొని పోదామనుకుండాను. ఇంకా పయిటాల కాలేదు. నేను వెంకట్రామయ్యోళ్ళ అంగడి మోటు దాటినాను. అక్కడ మాదిగోళ్ళ ఇండ్లకు ఎదురుగా వుండే బోయోళ్ళ ఇండ్లకాడ, జనం కొట్లాడుతా వుండారు. బోయనాగప్ప, పెద్ద బాడిశ తీసుకోనొచ్చి, అరుగెక్కి బాడిశ పైకెత్తి, ‘లే నా కొడకల్లారా ముందుకు అడుగేస్తే బాడ్సితో మొద్దును జివిర్నట్ల జివుర్తాను వొగొగన్ని’ అంటా అరుస్తా వుండాడు. మనిషి తాగినాడేమో, తూలుతా మాట్లాడుతావుండాడు. రాత్రి గొర్లమందకాడ ఉప్పిడి సప్పిడి కాకుండా ఇత్తనం తరుగును, (పొట్టేలు) ఎత్తుకోనొచ్చి తెల్లారుతానే కోసి, కుప్పలేసి అమ్ముకుండాడని, తెల్లారకముందే నసుకులో ఆ పొట్లని (పొటేలు) చూసినోడు చెప్పినాడని, కురువోళ్లు నాగప్ప ఇంటిమీదికి వొచ్చినారంట. సొమ్ము పోగొట్టుకున్నోళ్ళు అక్కసుతో గట్టిగా మాట్లాడతా వుండారు. ఊర్లో దొంగతనం జరిగిండేది నేనెప్పుడూ విన్లేదు. అట్లా నడతలు మా మావూర్లో లేనే లేవు, మా చెరువు కింద పల్లెల్లోనే లేవు. ఏమి జరుగుతుందో చూస్తామని నేను అంగడి దగ్గరే నిల్చుకుండాను.
నాగప్ప మాటిమాటికి బాడ్సి పైకెత్తుతా వుండాడు. అది ఎవురి మీదన్నా పడితే తలకాయో చేతులో చెక్కపేళ్ల మాదిరి ఎగిరిపోతాయి. పెద్దగా లావుగా జంపుగా వుండే తుమ్మ వేప మొద్దుల్ని మడక నగలో, పాకుమాన్లో, గుంటక దిండ్లో చెయ్యల్లంటే, చెక్కపని చేసేవాళ్లు నిల్చుకొని, పెద్ద బాడిశ తీసుకోని వొడుపుగా చాలా చాకచక్యంగా మొద్దుల మీద అరచెయ్యి మందం చెక్కపేళ్లు ఎగిరిపోయేటట్ల జవురుతారు. అట్ల జవిరేది చూస్తేనే భయమయితాది. అట్లాటి బాడిశ పైకెత్తి కురవోళ్లను భయపడిస్తా వుండాడు నాగప్ప.
ఎవురు చెప్పినారో యేమో, పెద్ద మనుషులు కొత్తపల్లి కురవనారాయణప్పా అట్టే లింగన్నా, బడగొర్ల నాగిరెడ్డి, యెలకంటి సుబ్బయ్యా, సుంకురంగయ్యశెట్టిని వెంటపెట్టుకొని వొచ్చినారు. మా వూరి సుంకురంగయ్యను, సుంకు రంగప్ప అని గుడకా అంటారు. సుంకు రంగప్ప అదరకా బెదరక దగ్గరికి పోయి ‘రేయ్ నాగప్పా. కిందకి దిగు మాట్లాడదాం’ అని గట్టిగా చెప్పినాడు. ఊహూ నాగప్ప కిందికి దిగలేదు. పెద్దమనుషుల్ని చూసి ఇంగా రెచ్చిపోయినాడు. అదేమి ధైర్యమో యెమా, రంగప్ప శెట్టి ఎడమ చేతితో స్తంభాన్ని చుట్టి అరుగు మీదికి ఎగిరి కుడిచేతితో నాగప్ప మెడమింద చెయ్యేసి అతన్ని కిందికి నూకినాడు. మిగతా పెద్దమనుషులు అతని చేతిలో వుండే బాడిశెను గుంజుకొని పక్కకు పడేసినారు. సింహం మాదిరి రంగయ్య శెట్టి అరుగెక్కి బాడిశను పైకెత్తిన బోయ నాగప్పను మెడమింద చెయ్యేసి కిందికి నూకడం కండ్లారా చూచి నేను అశ్చర్యపోయినాను. నా తలకాయిలో యెంటికలు నిక్క బొడుసుకుండాయి. శరీరమంతా గగుర్పొడిచింది.
పొట్లి చర్మాన్ని యెవురో తెచ్చి చూపిచ్చినారు. తాగిన మైకం తగ్గిపోయిందేమో, నాగప్ప తన తప్పును వొప్పుకుండాడు. పెద్ద మనుషులు నాగప్ప మింద తప్పు మోపి, పొట్లి రేటు డబ్బు కురవోళ్లకు ఇయ్యల్లని, తప్పు చేసినందుకు. రెండు గుంటక దిండ్లు తుమ్మవి చేసియ్యల్లని తీర్మానం చేసినారు. దానికి నాగప్ప వొప్పుకుండాడు.
సాయంత్రం నాయన ఆకులు అమ్ముకొని వొచ్చినాడు. రాత్రి బువ్వ తినేటప్పుడు నాయనకు జరిగిండేదంతా చెప్పి సుంకురంగప్ప ధైర్యాన్ని మోచ్చుకుంటా అయనను గురించి అడిగినాను. సుంకురంగప్ప చాలా నికార్సయిన పెద్దమనిషని, అందుకే ఆయనంటే అందరూ గౌరవిస్తారని చెప్పినాడు నాయన. అట్లాటి పెద్దమనుషులుండి గుడకా మొన్న ఊర్లో వొకర్నొకరు చంపుకుండే పరిస్థితి యెందుకొచ్చిందో అని రెండు మూడు దినాలు యాటికి పోయినా, యాపని చేస్తావున్న్యా అదే ఆలోచిస్తా ఈ కొట్లాట్లతో పార్టీలతో ఊరు యేమయితాదోనని చెరువు కింద పల్లెలో మంచిపేరుండే మా బండమీదపల్లెకు నల్లపరెడ్డీ, కొండన్నోళ్ళవల్ల చెడ్డపేరొచ్చెనో అని కొన్నాళ్ళు అనుకుండాను.
మా చెరువు కింద యానాడూ లేని రాగి పంట
మా వూరి పెద్ద మనుషులు చాటింపు వేయించినారు. చెరువులో నీళ్ళు వరిపంటకు సరిపోవని, అందువల్ల రాగి పంట పెట్టుకోవల్లని, ముందుగా రాగినార్లు వేసుకొని పొలాల్లో వొట్టి సేద్యం చేసుకోవల్లని మాదిగ వోబన్న తప్పెట కొట్టుకుంటా చాటింపేసినాడు. మరసటి దినమే నాయన కొత్తచెక్కల గుంటకను ఆచారితో తయారుచేయిచ్చినాడు. చేన్లు లేనోళ్లు ఎవురూ చెక్కల గుంటకను వాడరు. ఎలిభూములుండే రైతులు చేన్లల్లో సేద్యం చేసేటప్పుడు చెక్కల గుంటకను చూసినాను గాని అది మా ఇంట్లో యెప్పుడూ లేదు. చెక్కల గుంటక తయారైతానే నాయనా, నేనూ దాన్ని కోటేరేసుకోని మోతలగడ్డ నాగయ్యోళ్ల మడికాటికి పోయినాం. నాయన మోకుతో గుంటక కట్టి, దున్నపోతుల మెడల మింద వుండే కాడిమానుకు మొక్కోని, మేడితోక మిందచెయ్యేసి సెలకోలతో దున్నపోతుల్ని అదిలిచ్చినాడు. మళ్లల్లో వొట్టి సేద్యం దున్నపోతులకు కూడా కొత్తకదా అందుకే అవి పరిగెత్తుతా ముందుకు పోయినాయి. గుంటక కొయ్యలు నేలమింద పైపైన గీసుకుంటా పోయినాయి. గుంటక ఎలువు అయిందని నాయన గుంటక నొగల మోకును సల్లుచేసి కట్టినాడు. దాంతో నొగలు జలువయినాయి. అప్పుడు దున్నపోతులను అదిలిచ్చినాడు నాయన, దాంతో గుంటక కొయ్యలు నేలను చీల్చుకుంటా పోయినాయి. గుంటక మేడితోక మిందుండే నాయన చెయ్యి అదురుతా వుంది. అదంతా నేను నిగాగ గమనిచ్చినాను.
నాయన కయ్యలో మొదటి సాలుతోలి మల్లా అడ్డసాలు తోలుతా గుంటకమిందికి ఎక్కి నిల్చుకొని పోతుల పగ్గాలు చేతిలో పట్టుకుండాడు. మొదటి కయ్య అయిపోయిన తర్వాత రెండో కయ్యలోకి పోతా కిందికి దిగి, గెనుము కాడ గుంటకను మేడితోకతో కొంచెం పైకెత్తినాడు. గుంటక సులభంగా రెండో కయ్యలోకి పోయింది. పోతానే పగ్గాలు సెలకోల నాచేతికిచ్చి నన్ను గుంటక తోలమన్న్వాడు నాయన. నేను ఉత్సాహంతో మేడితోకమింద చేయ్యేసి గుంటక తోలేకి పూనుకుండాను. నెర్రెలు చీలిన మడికయ్యల్లో గుంటక కొయ్యలు న్యాలను చీల్చుకుంటా ముందుకు పోతావుంటే నల్లని మట్టిగడ్డలు పైకి లేస్తా వుండాయి. మేడితోక మింద చేతులు అదురుతా వుండాయి. పెల్లల మీద నడుస్తా కాళ్ళు నొప్పి పెడతా వుండాయి. మళ్లల్లో వొట్టి సేద్యం కంటే నీళ్లు పారిచ్చి మడకతో దున్నడమే సులువనిపిచ్చింది. ఇద్దరమూ కష్టపడి పయిటాల కల్లా పది కయ్యలు గుంటకతో ఇరుసాలు దున్నినాం. ఆ ప్రకారంగా రెండెకరాలు దున్నడానికి నాలుగు దినాలు పట్టింది.
చిన్నగా చెరువు తూములెత్తినారు. చాలా మంది రైతులు మళ్ళలో రాగినార్లు పోసుకుండారు. మాకు దొడ్లో అనుకూలముంది కాబట్టి దొడ్లోనే పది పీకలు కట్టి పీకల్లో రాగులు చల్లినాడు నాయన. నేను కాలువలోకి దిగి గబ్బునూనె డబ్బాతో నీళ్ళు ఎత్తిపోసినాను. అంతకు ముందు మేము దొడ్లో వంకాయలు, చెండుపూలు పండిచ్చుకున్నెప్పుడు చేసిండే కాలువ పొర్రా, నీళ్లు ఎత్తి పోసేచోట బెలుంబండ పొందేసి, దానికి మూడుపక్కలానీళ్లుకారిపోకుండా బంకతో కూడిన గరిక చెక్కలు అట్లే వుండాయి. సమ్మత్సరము నుంచీ ఎండిపోయిన కాలువ పొర్రలో నేను ఎత్తిపోసే నీళ్ళు ముందుకే సాగలేదు. ఎత్తిపోసి ఎత్తిపోసి రెట్టలావు గసవస్తా వుంటే చూసి నాయన వొచ్చి కొంచెంసేవు నీళ్లెత్తి పోసినాడు. అంతకు ముందు యాతం (ఏతం) పెట్టల్లని నాయన చాలాసార్లు ప్రయత్నం చేసినాడు. కానీ దడి కట్టడానికి అనుకూలంగా ల్యాక, వద్దనుకుండాడు. యెట్లోగట్ల పది పీకలకూ నీళ్లు పారిచ్చినాం.
పనిలో పని బాగుంటాదని కాలవ పొర్రవారగా ఎలి దడికి నేను బీర, కాకర విత్తనాలు పూడ్చినాను. చూస్తా చూస్తా వుండంగనే. రాగినారు భలే సొగసుగా బెత్తడెత్తు పెరిగింది. బీరా, కాకర మొక్కలు తీగల పాకుతా వుండాయి. నేను, పెద్దక్కా, బాట్లోవుండే చింతచెట్లల్లో చిన్న చిన్న కొమ్మలూ, రెమ్మలూ కొట్టుకొని వొచ్చి బీరా కాకర తీగలు అర్లుకోడానికి అనుకూలంగా పాతినాం.
రాగినార వొచ్చే లోపల దిబ్బలోని ఎరువంతా రాగిమడి కోసరం. తోలిచ్చినాం. పాలు తాగే పిల్లను ఆమ్మయ్య మడిదగ్గరికి ఎత్తుకొని వొచ్చి, పాలిచ్చి వెంకటలక్ష్మి వొడిలో కూర్చోబెట్టింది. పెద్దక్కా, అమ్మయ్యా, నేనూ గంపలు తీసుకొని, మడిలో తోలిండే ఎరువును, సేద్యం చేసిండే కయ్యల్లో అంతలక్కా నెరజల్లినాం. అట్ల ఇంటందరమూ, మడే బతుకనుకొని రెండు దినాలు కష్టపడి ఎరువంతా మడిలో చల్లినాం. నాయనా, నేనూ మడి కయ్యల్లో పలుగు గుంటక పాసినాం. పాసేటప్పుడే రెండో సాలులో నాయన కుడివైపు గుంటక దిండును కుడికాలుతో తొక్కుతా పోతావుంటే, మెత్తని మన్ను, గెనుము మాదిరి పైకి లేయసాగింది. అది చూసి, మళ్లీ సపరేటుగా పార్లతో గెనాలు ఎగేయాలని పని తప్పిందని సంతోషపడినాను. పలుగు గుంటక పనంతా అయిపోనంక గుంటక సాళ్లకు అడ్డంగా ప్రతి కయ్య మధ్యలో బోదిగుంటక తోలినాడు నాయన. బోదిగుంటక సాలు చిన్న కాలువ మాదిరి తయారయి, మల్లా సపరేటుగా కాలువ చెయ్యల్సిన పనిలేదని భలే సంతోషమయ్యింది నాకు. రాగి పంట పెట్టుకోవడంవల్ల నాకు చెక్కల గుంటక, పలుగ్గుంటక, బోదిగుంటక తోలే విధానం తెలిసిపోయింది.
నెల దినాలకల్లా రాగినార నవురుగా ముదురాకు రంగుతో భలే అద్భుతంగా వొచ్చింది. నాయన ఆకులు అమ్ముకొని వచ్చేకి పోకుండా రాగి నాటిచ్చేకి దిగినాడు. దినానికి పదైదు మంది లెక్కన రెండు దినాల్లో కూలోళ్లు రెండెకరాల్లో మట్టసంగా రాగి నాట్న్యారు. కూలోళ్ల కోసరం నాయన నూర్రుపాయలు అప్పుచేసినాడు. నాట్లు తేరుకొని మారాకులు పుట్టినంక, కుర్చికలతో రాగిలో కలుపుతీయిచ్చేకి మల్లా నుర్రూపాయలు బాకీ చెయాల్సివస్తాదని దిగులు పడినాడు. మడి కయ్యల్లోని పీకల్లో రాగి పైరు నవురుగా పెరుగుతా వస్తావుంటే చూస్తా సంతోషపడతా నాయనా, అమ్మయ్యా బాకీ దిగులు మరిచిపోయినారు.
నేను దినానికి రెండుసార్లు రాగి మడికాటికి పోయి ఎత్తుగావుండే గెనుము మీద కూర్చోని ఆలోచన చేయసాగినాను.
ఇప్పటికి ఐదారుసార్లు నాయన వెంట నేను ఆకుల గంపెత్తుకొని చెదళ్ల, నీలంపల్లి, దంతులూరు, ర్యాగడికొత్తూరు, పొర్రాళ్ళ, కొత్తపల్లి, ఆకులేడు ఇంకా మూడు నాలుగు పల్లెలకు పొయ్యొచ్చినాను. అన్ని పల్లెల పైకి ర్యాగడి కొత్తూరూ, ఆ మనుషులూ, ఉత్సిలోళ్ల నాగలింగారెడ్డి కుటుంబమూ, చెన్నమ్మ పిన్నమ్మ చూపే నెర్లు బాగా నచ్చినాయి. ఆ పల్లెల్లో నాయన చెప్పే కథలు, ఆ కథల వల్ల పొందుతా వుండే ప్రేమాభిమానాలు ఎంతో సంతోషాన్ని కలిగించినాయి. కానీ, అవి యేవీ చదువుకోవల్లని ఆరాటపడతావుండే తన ఆశను తీర్చేరకంగా కనిపిచ్చడం లేదు. నాయన వెంట పోతా, అట్ల కథలు చెప్పడం తాను నేర్చుకొని, నాయన మాదిరే తమలపాకులు అమ్ముకుంటా బతకాల్సిందేనా? చదువుకుండే మార్గమే లేదా? రాగి పంట బాగా పండేటట్ల కనిపిస్తా వుంది. పంట బాగా పండితే ఎకరాకు పదీ పన్నెండు మూటల రాగులు అయితాయంట! ఆ లెక్కన కోరు భాగంగా తమకు కనీసమంటే పది మూటల రాగులు రావొచ్చు, పోయినేడు వొచ్చిన రెండు పంటల వొడ్లగింజలు ఇంగా సుమారుగ వుండాయి, అన్నీ కలిపితే వొగ సమ్మత్సరము తిండిగింజలకు కొరతుండదు. అట్లాటప్పుడు నేను మల్లా హైస్కూలుకు పొయ్యే అదృష్టం రావచ్చునా? యేమో నా అదృష్టం యెట్లుంటాదో చూడల్ల’ అని అనుకుంటా చాలాసేపు ఆలోచనచేసి ఇంటికి బయలుదేరినాను.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
