Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాతి పర్రెలలో నుంచి..-13

[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]

అనంతపురానికీ, సినిమాకూ (చెంచులక్ష్మి) అదే మొదటిసారి!

రాగి కోతలు అయిపోయినాయి. అనుకున్నట్లుగానే మాకు కోరు భాగం పది మూటల రాగులు వొచ్చినాయి. పొలం ఆసామి నాగయ్యకు పదిమూటలు వొచ్చినాయి. మంచి పంట అయ్యిందని నాగయ్య సంతోషపడినాడు. మా వూరి చిన్న పాపయ్య మాదిరి నాగయ్య గడ్డిని ఆశించలేదు. రాగి గడ్డినంతా దొడ్లోకి మోసి వామివేసినాం. ఆ రాగి గడ్డివామిని చూసి నాకు భలే సంతోషమయ్యింది. యాలంటే, రాగిగడ్డి పశువులకు చాలా ఇష్టమయిన మ్యాత (మేత).

రాగి కోతల తర్వాత రైతులందరకీ ఆటిడుపు. పనుల్లేని కాలం. మా గేరిలో చాలా మంది సినిమా చూసేకి అనంతపురానికి పోవల్లని అనుకుండారు. అనంతపురం పాతూరు సినిమా హాల్లో చెంచులక్ష్మి సినిమా ఆడతావుందని సినిమా బ్రమ్మాండంగా వుందని చూసొచ్చి నోళ్లందరూ అంటావుంటే, మా జతగాళ్లు కూడా పోయి చూసి రావల్ల్లని అనుకుండారు. అమ్మయ్య సంతోషంగా వున్నెప్పుడు సంగతి చెప్పి మెల్లగా న్యాల టికెట్టు పావలా అంట మా! అని అడిగినాను ‘సేతిలో! బొట్టు లేదప్పా, పావలా యాట్నుంచి త్యావల్ల’ అని అంటా అమ్మయ్య చేతులు తిప్పేసింది. నా మొగం సప్పగయింది. మనసులో ఆశ చావలేదు. ఎవురికయినా కూలికి పోదామనుకుండాను. ఉర్లో పనులే లేవు. రెండు దినాలయినంక వెంకటాపురం తోటల్లో మిరపకాయలూ, వంకాయలు పీకే పనులుండాయని మాగేరిలో ఏడెనిమిది మంది పోవల్ల అని అనుకుండారు. నేనూ పోతాను మా అని అమ్మయ్యను అడిగినాను. ‘శానా దూరమప్పా! గొందిలో నుంచీ ద్యావర కొండ కడకుప్పదంకా కొండెక్కి, దిగి, ఎలిగొండలు దాటుకొని అడ్డదావల గుండా యెంగటాపురానికి పోవల్ల. అంతదూరం నడుత్తావా. తీరా ఆటికి పోయినంక పని ల్యాకుంటే సెవులు గొట్టుకుంటా రావల్ల. సూడుప్పామల్ల’, అని అమ్మయ్య చెప్పింది. యెట్లయితే అట్లయితాదిలే మా అని వెంకటాపురం పోయేకి రెడీ అయినాను.

తెల్లారగానే అమ్మయ్య సద్ది కట్టిచ్చింది. వొగ పాత వొల్లిగుడ్డ భుజానేనుకొని మా గేరోళ్ళతోపాటు బయల్దేరినాను. గొందిలోనుంచీ జారేబండ దాటుకొని, దేవరకొండ కడకుప్ప దిగదాల యెలిగొండల వైపు దిగినాను. అంతవరకూ చాలాసార్లు కొండగడ్డి కోసుకొని వచ్చేకి పోయినాను గదా! అందుకే యెలిగొండల వరకూ ఈ దారంతా కాళ్ళకు అలవాటు అయిండేదే. నడిచినట్లే అనిపిచ్చలేదు. యెలిగొండలకు తూర్పు పక్కనుండే చెన్నంపల్లిమింద వెంకటాపురానికి పోతారేమో అనుకుండాను. కానీ మా గేరోళ్ళు యెలిగొండలకు పడమర వైపు పోయే సీల్దావకు తిరిగి, ఈ దావగుండా పోతే వెంకటాపురం దగ్గరయితాదని చెప్పిరి. ఆ దావ గుండా మాట్లాడుకుంటా అమ్మిడి పొద్దుకల్లా అందరమూ వెంకటాపురం ఊరిబయటుండే జొన్నావాళ్ల తోటకు చేరుకుండాం.

ఆ తోటను చూసి నేను ఆశ్చర్యపోయినాను, కూలిపని దొరుకుతుందో లేదో అనే సంగతిని పక్కనపెట్టి బావినిండా వుండే నీళ్లనూ, ఆయిల్‌ యింజన్‌ బయటికి కొడతా వుండే నీళ్లనూ, కుతికల వరకూ పెరిగి విరగ్గాసిండే మిరపచెట్లనూ, నడుముల వరకూ పెరిగిండే వంకాయ చెట్లనూ అబ్బురపోయిచూస్తా వుండాను. దాదాపు ఏడెనిమిది ఎకరాలు మిరపతోట, ఐదారెకరాలు వంకాయ తోట, నాలుగైదు ఎకరాలు చెరుకు తోట, మూడు నాలుగు ఎకరాలు నిమ్మతోట, అంత పెద్దతోట నేనెక్కడా చూల్లేదు. కండ్లకు పండగ మాదిరుంది. చూస్తావుంటే ఎవురో పెద్దాసామే అనుకుంటా నీళ్ల తొట్టికాడ నిల్చుకుండాను. వాళ్ళవెంట పోలేదని నన్ను గదురుకుంది మా గేరోళ్ళ రామక్క. నేను పరుగెత్తి వాళ్ళను కులుసుకుండాను. సందకాడ నాలుగు గంటల వరకూ మిరపకాయలు పీకితే రపాయి పావలా కూలి ఇస్తానని, కసుగాయలు పీకగూడదని కరాకండిగ చెప్పినాడు తోట ఆసామి. సరేనని మావాళ్లు వొప్పుకుండారు.

ఆడోళ్లు చీరకొంగుల్నీ, మొగోళ్ళు టువ్వాలను, వొల్లిగుడ్డల్నీ నడుములకు కట్టుకొని మిరపతోటలోకి దిగినాం. విరగ్గాసిన మిరపచెట్లల్లో రెండు చేతులతో జవురుకుంటా వొడినింపుకొని పెద్ద పెద్ద గంపల్లోకి పోస్తావుండాం. మిరపకాయలు పీకడం నాకు తొలిసారి. అయినా పెద్ద కష్టమనిపిచ్చలేదు. నిండిన గంపల నెత్తుకోనిపోయే మొగోళ్ళు కల్లంలో రాసిపోసి వస్తా వుండారు. పోసిన మిరపకాయల రాసిని ఇద్దరు ముగ్గురు మదిర కడతా, మదిర మిందికి ఎక్కి కాళ్లతో తొక్కుతావుండారు. ఇద్దరు కడవలతో నీళ్లు తెచ్చి మదిర మింద చల్లుతా వుండారు, నీళ్లెందుకు చల్లుతా వుండారో నాకు అర్థం కాక వూరి కూలిమనిషిని అడిగినాను. నీళ్లతో తడిపితే మిరపకాయలు బిరుసెక్కి వాడిపోకుండా వుంటాయని, పగిలిన కాయల్లోకి నీళ్లు దూరి తూకం పెరుగుతాయని అన్నీ బెంగుళూరు మార్కెట్టుకు పోతాయని చెప్పుతావుంటే, నేను నోరెల్ల బెట్టి వింటా మిరపకాయులు పీకసాగినాను.

సాయంకాలం నాలుగయింది. అందరమూ కల్లంలోకి చేరుకుండాము, మిరపకాయల మదిరను చూసి నేను అబ్బురపోయినాను నూరు మూటలకు పైగా అయితాయని లారీ క్యాబిన్‌లో పైవరకూ మూటలు నెట్టేయ్యల్సివస్తాదని, ఆ ప్రకారం నాలుగైదు దినాలకొగ లారీలోడు బెంగుళూరుకు వేసుకోని పోతారని విని, తిక్క లెక్క వస్తాదే అని అనుకుంటా కూల్లు ఇప్పిచ్చుకుండాం. తోట ఆసామి మంచోడయినట్లుంది. తాలాకొగ కేజీ అన్ని మిరకాయలు పెట్టినాడు. నేను సంతోషపడతా వొల్లిగుడ్డలో మూటగట్టుకొని మా వాళ్ళతో కలిసి బయలుదేరి పొద్దుమునిగే సమయానికి ఊరు చేరుకోని కూలిదుడ్లు అమ్మయ్యకు ఇచ్చి మిరపకాయలు మలకపుటకలో పోసినాను. కూలినీ, మిరపకాయలను చూసి అమ్మయ్య సంబరపడింది. రేపు పొద్దుగులగ బయల్దేరి సినిమాని చూసుకొని యాటికీ పోకుండా సగిరిపొద్దుకల్లా బద్దరంగా ఇంటికి తిరిగిరావల్లని గట్టిగా చెప్పి నాచేతికి ఐదు అణాలు ఇచ్చింది.

పయిటాల బువ్వతింటానే నా జతగాళ్లతో కలసి సినిమా చూసేకి అనంతపురానికి బయలుదేరినాను. మాకంటే ముందు వొగ గుంపు బయలుదేరినారని తెలిసి మేము అనంతవురం రోడ్డెక్కి బిరబిర నడుస్తా వుండాం. శివపురం నల్లరాళ్ల మిట్టకాటికి పోతావుండంగనే వెనకల నుంచి జీపు హారన్‌ వినిపిచ్చింది. చూస్తే, కమ్యూనిస్టు ఎర్రజెండా కట్టుకొని వొస్తావుంది. దగ్గరికిరాగానే అందరమూ ‘తరిమెల నాగిరెడ్డికీ జై, కమ్యూనిస్టు పార్టీకీ జై’ అంటా గట్టిగా అరిచినాం. జీపు రోంత ముందరికి పోయి నిలబడింది. అది చూసి అందరమూ పరిగెత్తి జీపు దగ్గరికి పోయినాం. అందరూ ఎక్కి కూర్చోమని డ్రైవర్‌ సెప్పుతానే నలుగురమూ సంతోషపడతా జీపెక్కినాం. ముందర సీట్లో కూర్చోనుండే తరిమెల నాగిరెడ్డి సార్‌ని చూసి ఆశ్చర్యపోతా ఆయనకు అందరమూ నమస్కారం చేసినాం. ఈ మధ్యనే జరిగిండే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయినాడు. ఎన్నికలప్పుడు ఆయన మా వూరి కొచ్చినాడు. అంతవరకూ నేను బస్సే ఎక్కలేదు. అట్లాది వొకేసారి ఎమ్మెల్యే కూర్చోనుండే జీవు ఎక్కినందుకు భలే సంతోషమయింది నాకు.

జతగాళ్ళం మేము నలుగురమూ అనంతపురం మొగదాలే, చెరువు కట్టను ఆనుకోనుండే పాతూరులో దిగినాం. నడిచొస్తే నాలుగు గంటలు పట్టేది. జీవులో ఇరవై నిమిషాల్లో వొచ్చినందుకు ఆనందమయింది మాకు. బజార్లో షోడా అంగళ్ళకు వెనక పక్కనుండే సినిమా హాల్లోనే చెంచులక్ష్మి సినిమా ఆడుతా వుండేదని తెలిసినంక ఇంగా సంతోషమయింది, అందరమూ సినిమా హాలు దగ్గరకు పోయినాం. గేటు కాడ వుండే మనిషి, మ్యాట్నీ ఇప్పుడే మొదలయిందని, మొదటి ఆట ఆరు గంటలకని చెప్పినాడు. సినిమా హాల్లోపల నుంచి పాట వినిపిస్తావుంటే అందరికీ మనసు పీకసాగింది. టైము మూడయిందంట. ఎండ సంపుతా వుంది. బజారుకు రెండు పక్కలా రకరకాల అంగళ్ళుండాయి. నీడలో నిల్చుకుండేకి చెట్లే లేవు. ఉండే వొగ వేపచెట్టు తడకల పందిరేసి వొగ సాయిబు పెద్ద షోడా షావు పెట్టుకుండాడు. పందిరికింద మందంగా ఇసక నెరిపి చన్నీళ్ళు చల్లి మూడు పక్కలా బెంచీలు వేసినారు. ఎండకు వొచ్చినోళ్లందరూ బెంచీల మింద కూర్చోని షోడాలు తాగుతా వుండారు. ముగ్గురు నలుగురు నాయంతటోళ్ళు మాటిమాటికీ గోలీ షోడా సీసాల మింద ఎందో రబ్బర్‌ బిరడా పెట్టి గట్టిగా వొత్తుతావుంటే కరు కరు మని సీసాలు అరుస్తా వుండాయి. నిండు సీసాలను వొక్కొక్కటి ఎడమ చేతితో ఎదకు ఆనిచ్చుకోని కుడిచేతితో రబ్బర్‌ బిరడాను సీసామూతిమింద పెట్టి బలంకొద్దీ వొత్తుతావుంటే అవి కరుమని అరుస్తావుంటే మూతికి కరిపిచ్చుకోని గసపోసుకుంటా షోడా తాగేవాళ్ళు తాగుతా వుంటే, మాకూ తాగల్లనిపిచ్చింది. మనసు తండ్లాడసాగింది.

రేటు కనుక్కుండాం. వొగ షోడా అర్ధణా అంట! వింటానే నోరు ఎల్లబెట్టినాం. అర్ధణా అంటే రెండు బొట్లు: ఆరు దమ్మిడీలు వోయమ్మా. ఆ షోడా నీళ్లకు రెండు బొట్లా? డ్రింక్‌ షోడా వొగ ఆణా అంట! వోరి నీపాసుగులా, వుత్తనీళ్లకు దిక్కుల్యాకుండా సంపాదిస్తా వుండారే! అదేందో షోడా తాగితే దాదాసాయిబు షోడానే తాగల్లంట! ఎండకు నడిచొచ్చి దాదాషోడా తాగితే దాని మజానే వేరంట! కడుపులోకి పోతానే చల్లగా తేపు వొస్తాదంట! బజార్లో పోయే వాళ్లంతా ఆ ప్రకారంగా చెప్పుకుంటా అందరూ మూగుతా వుంటే మేము రోంతసేపు వూగిసలాడితిమి. కడాకు అందరమూ సినిమా వొదిలినంక వొగ ఆణాకు బఠాణీలూ గుండుపొప్పులూ కొనుక్కుంటే మ్యాక (మేక) నమిలినట్ల నములుకుంటా పోవచ్చు, అవి తింటే ఆకలీ తీరుతాది, షోడా తాగితే కడుపు నిండుతాదా, కాలు నిండుతాదా? అని మదింపేసుకొని మనసు మార్చుకుండాము.

షోడా సీసా మూతిమింద ‘రబ్బరు పెట్టి వొత్తడమూ, బస్‌ మంటా గ్యాసూ, షోడానీళ్లూ బయటికి రావడమూ, సీసాలోపలుండే గోళీ కిందకు పోకుండా బయటికీ రాకుండా సీసా మధ్యలోనే వుండడమూ, నాకయితే వింతగా అనిపిచ్చింది. నలుగురమూ అట్లే నిల్చుకొని చూస్తావుంటే వొకాయప్ప వొచ్చి, ‘షోడా తాగుతారా, లోపలకి రాండి, ల్యాకుంటే యెల్లిపోండి’ అని చెప్పి, ‘షోడా రింగే, దాదా సోడా రింగే, సల్లసల్లని సోడా రింగే, వొగసారి తాగితే సాలు మల్లా మల్లా తాగల్లనిపిచ్చే సోడా రాండి రాండి’ అంటా ఎండలో తిరిగే జనాల్ని వూరిస్తా వుండాడు.

ఆరుగంటల వరకూ యెక్కడుండల్లబ్బా అనుకొని టౌను చూసేకి పోయినాం. అక్కన్నుంచి కొంచెం ముందుకు పోతానే నాలుగు రోడ్ల సెంటర్‌. అన్నీ తార్రోడ్లే దక్షిణంవైపు పోయేది ధర్మవరం రోడ్డని తెలునుకొని ముందుకు పోయినాం. రోడ్డుకు రెండు పక్కలా అన్నీ పెద్ద పెద్ద మండీ అంగళ్లు! అంగళ్ళనిండా పల్లెటూరోళ్లు. ప్రతి శుక్రవారమూ సంత జరుగుతాదంట! అందుకే బజారు నిండా చీమల పుట్టలు పగిలినట్ల జనం! తాడిపత్రి రోడ్డుకు ఎదురూగా రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూలు! స్కూలు దాటి ముందుకు పోతావుంటే బట్టలు మళిగలూ, కిరాణా షాపులూ, బంగారు అంగళ్లూ, టెంకాయల మండీలూ వరుసగా వుండాయి.

శెట్టి కొండయ్య అంగడి పాతమిద్దె. అక్కడ మసిగుడ్డ కావల్లన్న్యా దొరుకుతాదంట! అది విని అబ్బురపోతా మళ్ళీ వెనక్కి నాలుగురోడ్ల సెంటర్‌ దగ్గరికొచ్చి, పడమరవైపు అనంతపురం కొత్తూరుకు పోయే రోడ్లో కొంతదూరం పోయినాం. పాతూరుకూ, కొత్తూరుకూ మధ్యలో అనంతపురం చెరువు మరవవంకలో గలీజు నీళ్ళు పారుతా వుండాయి. అవతలకి పోయ్యేకి రోడ్డు లేదు. మనుషులు దాటుకోడానికి మురికి నీళ్లల్లో పెద్ద పెద్ద రాళ్లు వేసినారు. అవతలకి దూరంగా సినిమా హాలు కనిపిస్తావుంది. దానిపేరు శ్రీకంఠం టాకీసంట, ఆటికి పోయేకి రోడ్డు ల్యాకుంటే జనం ఎట్లా పోతారో?

మురికినీళ్లు పారబెట్టుకుంటారేమో, అన్నీ వరిమళ్ళు బ్రమ్మాండంగా వుండాయి ఎగువ పక్కన. దక్షిణం వైపున పాతూరుకూ, కొత్తూరుకూ మధ్యలో బ్రిటీషోళ్లు కట్టిచ్చిన ఐరన్‌ బ్రిడ్జి వుందంట. ఆ బ్రిడ్జిమీద పోయి కొత్తూరునూ చూడల్లనిపిచ్చింది. అంతా తిరిగి చూసుకుంటా వుంటే సినిమాకు టైమయితుంది కదా అనుకొని వెనుదిరిగి మాల్లా సెంటర్లోకి వొచ్చినాం. సెంటర్లో కొత్తూరు రోడ్డుకు ఉత్తరం వైపున కార్నర్లో కూరగాయల మార్కెట్‌ కిటకిటలాడుతా వుంది. మార్కెట్టుకు తూర్పు వైపున, సెంటర్లో నుంచి ఉత్తరం దిక్కుకు పోయే గుత్తిరోడ్డు. గుత్తిరోడ్డుకూ తాడిపత్రి రోడ్డుకూ కార్నర్లో గాంధీ తాత విగ్రహమూ, విగ్రహానికి వెనక రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూలు పిల్లోల్లు ఆటలు ఆడుకుండేకి, పెద్దపెద్ద మీటింగులు పెట్టుకుండేకి గవర్నమెంటు ఆసుపత్రి వరకూ వొగ గ్రౌండు, గ్రౌండుకు ఉత్తరం వైపున టీచర్ల ట్రైనింగ్‌ కాలేజీ అన్నీ చూసినాం. ధర్మవరం రోడ్డుగుండా దక్షిణం వైపుకు పోతే ఊరి చివర, చెరువుకు ఎదురుగా బ్రిటీషోళ్ళు కట్టిచ్చిండే కలెక్టర్‌ ఆఫీసు భలే వుందంట. దాన్ని చూడల్లని మనసు పీకింది. అనంతపురాన్ని చూడడం ఇదే మొదటిసారి. సినిమాకు పోకుండా చీకటి పడేవరకూ టౌనంతా చూడల్లని మనసు ఉబలాడపడింది. కానీ జతగాళ్ళు వొప్పుకోలేదు. మల్లా అనంతపురాన్ని చూస్తానో లేదోనని దిగులు పడతా జతగాళ్ళతో కలిసి సినిమా హాలు దగ్గరికి పోయినాం.

సినిమా హాలు పేరు రమేష్‌ టాకీసు. జనం మెల్లమెల్లగా వొచ్చి లైన్లో నిలబడతా వుండారు. మేము అందరకంటే ముందుండాం. కొంతమంది వేరే పక్కపోయి నిలబడతా వుండారు. వాళ్ళు బెంచీ టిక్కెట్టోళ్లూ, కుర్చీ టిక్కెట్టోళ్లంట! ఆ టికెట్ల రేటు అర్ధరూపాయీ, ముక్కాలు రూపాయీ, పైన మాడీ టిక్కెట్టు వొగ రూపాయి అంట! అది తెలిసి వాళ్ళకేమి పెద్దపెద్ద షావుకార్లు, ఎంతరేటయినా పెట్టి సినిమా చూస్తారు అని అనుకుంటా న్యాల (నేల) టిక్కెట్లు తీసుకోని లోపలికి పోయి ముందుపక్క, నేలమింద కూర్చుండాం మేము.

సినిమా హాళ్ళో మా ముందరుండే తెరమింద బొమ్మలు పడతాయంట. అందుకే తెరకు దగ్గరగా కూర్చుంటే బొమ్మలు బాగా కనిపిస్తాయని నేను పూరా ముందుకు పోయి కూర్చుండాను. అంత దగ్గర కూర్చుంటే కండ్లు నొస్తాయని కొండన్న గాడు నన్ను వెనక్కి పిల్చినాడు. నేను సరే నని వెనక్కిపోయి గోడకు ఆనుకుండాను. గోడంటే పెద్ద గోడకాదు. రెండడుగుల ఎత్తుండే గోడ న్యాల మిందుండే వాళ్లు అవతల పక్కకు పోయి బెంచీల మింద కూర్చోకుండా అది అడ్డగోడంట!

రోంతసేపటికే హాలంతా నిండిపోయింది. వెనకపక్క జూసి, ఎంత జనమొచ్చి నారప్పా, వానెమ్మ కడుపుగాలా అనుకుంటా వుండంగనే లైట్లన్నీ ఆపు చేసినారు. జనం కేకలూ, ఈలలూ వేసినారు. హాలంతా దేవరకాడ అరిచినట్లుంది. తెరమింద బొమ్మపడగానే కేకలూ, ఈలలూ తగ్గిపోయినాయి. తెరమింద గాంధీ తాతా, నెహ్రూ ఇంగా ఎవురెవురో పెద్ద మీటింగులో మాట్లాడతా వుండారు. ఆ బొమ్మలన్నీ తెరవెనక పక్కనుంచే వస్తావుండాయనుకుండాను కాదంట, మా వెనక పక్క, మాడీలో కూర్చోనుండే వాళ్ళ వెనకుండే గోడ బొక్కలో నుంచీ యేటవాలుగా వచ్చే వెలుతురు కిరణాలు, తెర మింద బొమ్మలుగా పడతాయంట, తెర వెనక పక్కనుండే లౌడు స్పీకర్లో నుంచీ, మాటలు వినపడతాయంట, కొండిగానికి ఇదంతా యెట్ల తెలుసునో అని అనుకుంటా, వెనకపక్క పైన్నుంచి వొచ్చే కిరణాలనూ, తెర వెనక నుంచీ వొచ్చే మాటలనూ చూస్తా వింటా ఆశ్చర్యపోయినాను.

గాంధీ నెహ్రూలనూ చూపిచ్చేదంతా అయి పోయినంక, తెర మింద రోంతసేపు పేర్లు పడి, ఆనెంక చెంచులక్ష్మి సినిమా పేరు పడతానే యెంట్రికలన్నీ నిక్కబొడుసుకుండాయి. మనిషనేవాడు ఎంత పనిమంతుడో అనుకుంటా సినిమా మింద దృష్టి పెట్టినాను, చెంచులక్ష్మి వేషం వేసిండే ఆయమ్మ పేరు అంజలీదేవి, అయమ్మ మొగునిగా వేషం వేసిండే ఆయప్ప అక్కినేని నాగేశ్వరరావంట! ఇద్దరూ ఎంత సొగసుగా వుండారో అనుకుంటా సినిమా చూడసాగినాను, లక్ష్మీనారాయణులు ఇద్దరూ చెంచులక్ష్మి, నరహరిగా పుట్టినారని అర్థమయింది నాకు. ఆయనెవురో ఎస్వీ రంగారావంట, హిరణ్యకశిపునిగా ఎంతద్భుతంగా వుండాడో ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి గుట్ట లెక్కగలవా’ అని చెంచులక్ష్మి, నరహరి సరసాలాడతా పాట పాడుతా వుంటే చూసేకి ఎంతబాగుందో అనిపిచ్చింది.

సినిమా వొదిలినంక మార్కెట్టు దగ్గరుండే అంగిట్లో వొగ అర్ధణా గుండు పప్పులూ, వొగ అర్ధణా బఠానీలూ కొనుక్కోని. నిక్కర జోబీళ్ళో పోసుకుండాను. మిగతా జతగాళ్లు వొక్కొక్కరు వొక్కొక్కటి, బెల్లమూ, పొప్పులూ కొనుకుండారు. అందరమూ సినిమా గురించి మాట్లాడుకుంటా, ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి గుట్ట లెక్కగలవా’ అనే పాట నుడుగులు చెప్పుకుంటా పొప్పులూ, బఠానీలు నములుకుంటా తాడిపత్రి రోడ్డుమింద ఊరిదావ పట్టినాం చెరువుకట్టకిందుండే రోడ్లో నడుస్తా. నాకయితే చెరువు కట్ట మింద పోవల్లని అనిపిచ్చింది. కట్ట ఎక్కిపోతే ముసలమ్మ కట్టకాడ, చెరువు కట్ట మధ్యలో గుట్ట వొస్తాదని అక్కడ కట్ట మింద నుంచి కిందికి దిగి రావడం కష్టమని కొండిగాడు చెప్పడంతో మల్లా ఆ చెరువును ఎప్పుడు చూస్తానో అని అనుకుంటా వాళ్ళ వెంట నడవసాగినాను. అనంతపురం చెరువు మోట్లో నుంచి మా ఊరు సుమారుగ పన్నెండు మైళ్లుంటాదని, పైన చుక్కల్లో కనిపిస్త్తా వుండే ‘గొరుకొయ్యలు’ యేటవాలేకల్లా ఊరు చేరుకోవల్లని పెద్దపెద్ద అంగలేసి నడుస్తా సగిరి పొద్దుదాటే నరికి అందరితోపాటు ఊరు చేరుకుండాను.

గోలీ గుండ్లాట, మోచేతితో ముక్కుతో దోకడం!

ఎండా కాలముచ్చింది. వచ్చే ముంగార్లకు దంతులూరు నాగయ్యశెట్టి మడికి ఎరువు దండిగా వెయ్యల్లని నేనూ పెద్దక్కా గాటిపాట్న దున్నపోతుల కిందికి వెయ్యడానికి ఆకు అలం కోసరం మిగతా వాళ్ళతో పోటీపడసాగినాం. పొద్దున్నే లేస్తానే చెరొగ గంప తీసుకోని బీటిమళ్ళలోకి పోతాం. అమ్మిడి పొద్దుదంకా పొలాలంతటా మా వూరోళ్లు గంపలు పట్టుకొని ఆకూ, అలం కోసరం వెంపర్లాడతా వుంటారు. మడికట్లల్లో మొలిచిండే చెప్పుతట్లాకు, రాగి కొయిలు, బుటాని కానా పీక్కోని వస్తారు. ఎవురి కండ్లూ పడని బీటికయ్యల్లోకి పరుగెత్తిపోయి నేనూ పెద్దక్కా చెప్పుతట్లాకునూ, రాగి కొయిల్ని పీక్కోని గంపలనిండా వేసుకోని వొచ్చి గాటిపాట్న పరుస్తాం. అమ్మిడిపొద్దు బువ్వ తిన్నెంక పనేమీ వుండదు. నేను నా జతగాళ్లతో కలసి గోలీగుండ్లాట ఆడేకని పీర్ల చావిట్లోకి పోతాను.

మా వూరి పీర్ల చావిడి చాలా పెద్దది. తూర్పు పక్క వొగభాగమూ, పడమర పక్క వొగ భాగమూ వుంటాది. రెండు పక్కలా మూడడుగల ఎత్తు అరుగులూ, ఆరడుగుల మధ్యలో కోట్లో వుండే ఇండ్లకు పొయ్యేకి ఆరడుగుల నడవా, అరుగులమింది వొక్కొక్క పక్క ఆరేసి కంబాన్లూ (స్తంభాలు), కంబాన్ల పైన రెండు భాగాలనూ కలుపుతా బెలుంబండలతో పైకప్పు అంతా బ్రమ్మాండంగా వుంటాది. కోట్లోవాళ్ల ఇండ్లకు పోయేకి చావిట్లో వుండే నడవను వూర వాకిలి అంటారు. ఆ పేరునుబట్టి బండమీదపల్లి అంటే పూర్వం కోటలోపల వుండే ముప్పై ఇండ్లు మాత్రమేనని, మిగతా ఇండ్లవాళ్లు మధ్యలో వొచ్చి చేరింటారని బండమీద వుండే మాదిగోళ్ల ఇండ్ల వల్లనే ఆ పేరు వొచ్చింటాదని నాకు అనిపిస్తావుంటాది.

ఎండల కాలంలో మా వూరి చావిడి భలే వుంటాది. ముందు వైపునగోడలు లేకుండా అరుగుల మింద కంబాన్లు (స్తంబాలు), దాండ్ల పైన బెలుబండల పైకప్పు, కప్పుపైన ఇటికపెల్ల ముక్కలూ, గారా కలిపి చేసిన చురికీ, దాని పైన చవుడూ వెయ్యడంవల్ల కింద చావిట్లో చల్లగా వుంటాది. నడవ గుండా వీసే గాలి చల్లబడి హాయిగా వుంటాది. అందుకే చుట్టు పక్కలుండే ఇండ్లల్లోని మొగోళ్లందరూ చావిట్లో చేరుకొని కొంతమంది సవాలాడుకుంటూ, కొంతమంది బారాకట్ట, పులిజూదం ఆడతా, దుడ్లు లేకుండా ఉత్త సలాములు చేసే ఇస్పేటాకులు ఆడతా, ఇంగా కొంతమంది తాళ్లు పేడుకుంటా వుంటారు. నాయట్లా పిల్లోళ్లు అరుగుల మధ్యలో నేల మింద బద్ది తవ్వి గోలీగుండ్లు ఆడతారు.

నేనూ నా జతగాళ్ళు కొండల్లో నుంచీ పారుతా వచ్చే పెద్దొంకలో కొట్టుకొని వొచ్చి వొచ్చి గుండ్రంగా మారిన గులకరాళ్లను గుండ్రాళ్లతో మలిచి మలిచి గోలీగుండ్లను తయారు చేసుకుంటాం. నేను గులకరాళ్లను గోలీగుండ్లుగా మలుస్తా వుంటే చూసి మా నాయన గుండ్రాయిని చేతికి తీసుకొని నాలుగు గోలీగుండ్లను బొగు సొగుసుగా మలిచినాడు. అట్లాటి గోలిగుండ్లను నిక్కరు జోబీలో యేసుకొని నేను చావిట్లోకి పోయినాను. నేను పోయినంక ఇంకా ఐదారు మంది వొచ్చినారు.

ఈత పీచు చెప్పులు

పయిటాల బువ్వ తిన్నెంక నేనూ, పెద్దక్కా మల్లా గాటిపాట్న వేసే ఆకూ అలం కోసం బీటిమళ్లల్లోకి యెల్లవారినాం. ఎండలు మండుతావుండాయి. మళ్లల్లో నల్లన్యాల మింద కాళ్లుపెడితే రొట్టి పెనుం మింద పెట్టినట్లుంది. లోపల నిప్పులుండే బూడిద మింద పెట్టినట్లుంది. ముందుకు అడుగెయల్లంటే భయమైతాంది.

టైరురబ్బరు చెప్పులైనా కొనియ్యమంటే నాయన చెవిలో వేసుకోలేదు. అడిగి అడిగి సాలైపోయింది. బాలింతప్పుడు అమ్మయ్యకి కొనిచ్చిన చెప్పులు, వుంగటాలు తెగిపోయినాయి. దాండ్లకు రెండుసార్లు పిన్నీసులేసిచ్చింది అమ్మయ్య. కాళ్లకు తొడుక్కొని రెండు దినాలు బీటిమల్లల్లో తిరుగుతానే ఆ పాతచెప్పులు విరిగిపోయినాయి. ఇంగ వుత్తకాళ్లతోనే ఎండకు తిరిగేది తప్పలేదు. నేనే కాదు, నా జతగాల్లదీ ఇదే గతే!

పెద్దక్కా ఆ యమ్మ జతకత్తే పాపక్కా. నా జతగాళ్లు అందరూ ఎండకు బీటిమళ్లలో తిరిగేకి మొగమెక్కక ఆలోచన చేయబడితిమి. నాకు సాకిరేవు గుర్తుకొచ్చింది. జతగాళ్లతో అందరమూ సాకిరేవు దగ్గరికి పోయి, ఆడ సాకిరేవు గుట్ట వారన ఐదారు ఈతచెట్లుండాయి. ఈత కొమ్మలు జంపు జంపు ముండ్లతో రాకాసుల మాదిరుండాయి. నేను కొడవలి లిక్కితో ముండ్లను నరికేసి ఈత కొమ్మల అడుగు పక్కనుండే ఈత పీచును తెగదెంచుకొని రెండుకాళ్ల పాదాల కింద రెండు పీచుల్ని చెప్పుల మాదిరి వేసుకుని అవి జారిపోకుండా అదే పీచుదారాలతో పాదాలపైన, మెడాలకు (మెడిమలు) గట్టిగా బిగిచ్చుకొని కాలే కాలే న్యాలమింద నడిస్తిని. చెప్పుల మాదిరి బాగుండాయర్రా కాళ్లు కాలలేదని చెప్పుతానే అందరూ అదే పనిజేసిరి.

జతగాళ్లు అందరమూ ఈత పీచుచెప్పులు తొడుక్కొని ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు పోయి, బీటిమడికట్లల్లో న్యాలకు కరుచుకోనుండే చెప్పుతట్లాకునూ, ఎండిపోయిన రాగి కొయిలనూ కొడవలి లిక్కితో పెరుక్కొని సందకాటికల్లా పెద్దపెద్ద ఈతగంపల నిండా నింపుకొని వొస్తిమి. ఆ మాదిరి వారం దినాలయ్యేసరికి వూరి మడికట్లన్నీ కన్నెగా కడిగేసినట్లయినాయి. మా వూరు మడికట్లే కాదు, మా శింగనమల చెరువు కింద మడికట్లన్నీ ఇదే మాదిరైనాయి. ఎవురైనా కొత్తోళ్లు వొచ్చి చూస్తే, కన్నెగ నాకేసినట్లుండే మడికయ్యలు. చాలా యేండ్ల నుంచి బీడు వుండాయేమోనని అనుకుంటారు. రాగి కొయికాలు కంటే వరి కొయికాలే పీక్కోనొ చ్చేకి బాగుంటాయి. వొగ మడికయ్యలోని వరికొయిలు పీకితే వొగ పెద్ద వెదురు గంపనిండా అయితాయి. మడికయ్యల్లోని చెప్పుతట్లాకు వరికొయిలు పీక్కుని వచ్చేకి వెదురు గంపలైతేనే బాగుంటాయి. నెత్తిమింద యెత్తుకొని వచ్చేకి అవి లాయిగ్గా వుంటాయి. అవి పల్లెల్లో దొరకవు. అనంతపురంలో మేదరోల్లదగ్గరే దొరికేది. వాళ్లు పచ్చి వెదురుబొంగులు తెప్పిచ్చుకొని చిన్నచిన్న ఈనెలుగా చీల్చుకొని ఈనెలతో బుట్టలు, గంపలు, పొట్టుజల్లలు, బండి పనకలు, తడకలు, గొర్రెగూళ్ళు, చాటలు, జల్లలు, రోటికుదుర్లు అట్లాంటివన్నీ అల్లి అమ్ముతా వుంటారంట! వెదురు గంపలు, జల్లలు చాలా రేటెంట! అందుకే నాయన తన ఆకులగంప తప్పా ప్యాడగసువు, మన్నూ మశానం మోసేకి ఈత గంపలే కొంటాడు.

ఈత గంపల రేటు శానా సలీసు. యెరికిలోల్లు వూరూరా తిరిగి పందులు కాసుకుంటా ఆ వూర్ల దగ్గరుండే ఈతకొమ్మలు నరికి, ఆకులన్నీ జివిరేసి, ఈతబర్రలతో గంపలు, తడకలు, అట్లాంటివన్నీ అల్లి యా వూర్లోవి ఆ వూర్లోనే అగ్గవగా అమ్మిపోతారు. అందుకే మా యట్లా బీదాబిక్కి ఈత బర్రలతో అల్లిండేదాండ్లనే కొనుక్కుంటారు. నాయన గడకా ఇంటి పనులకు ఈత గంపల్ని తెచ్చినాడు. ఈతగంపల్లో పుల్లలు తొందరగా విరిగిపోతాయి. గంపల అడుగుల్లో పుల్లలు విరిగిపోయిన రెండు ఈత గంపలకు త్యాపలేసి కుట్టినాడు నాయన. త్యాపలేసి కుట్టిన అట్లాంటి ఈతగంపల్లోనే ఆకు అలము పీకి నింపుకొని వొచ్చి పశువుల కింద గాటిపాట్నా వేస్తా ఎరువు దిబ్బను పెద్దగా చేసినాం నేనూ, పెద్దక్కా.

తవుడూ, మజ్జిగ నీళ్లూ

మా వూర్లో మున్నూటాయాభై గడపలు. అన్నింటిలో పజ్జెనిమిది ఇరవై ఇళ్లల్లో మాత్రమే పాడిపశువులుంటాయి. ఏడాది పొడుగునా పాలు, పెరుగు వుండే ఇండ్లు ఏడెనిమిదే! పాడివుండే ఇండ్లల్లో మూడు నాలుగు ఇండ్లు మాత్రమే పెరుగు చిలికి ఇరుగుపొరుగోళ్ళకు మజ్జిగ పోసేది! అది గుడకా తవుడు తీసుకొనిపోతేనే మజ్జిగ పోసేది! ఈ సమ్మత్సరం పచ్చిగడ్డి ల్యాక చాలా ఇండ్లల్లో పాలిచ్చే పశువులు ఎండిపోయినాయి. పాలుండే వాళ్ళు కోమటోల్లకు, బాపనయవార్లకు పాలు వర్తన పోసేకి సరిపోతాయి. మూడు నాలుగు ఇండ్లల్లో పాలిచ్చే పశువులు ఒంటిపూటకు వేసుకుండాయి. అందువల్ల మజ్జిగనీళ్లు కరువైపోయినాయి. వడుగూరు చెండ్రాయుడోల్లు మాత్రమే ఇరుగు పొరుగోళ్లకు ఏమీ గొనగకుండా ధారాళంగా మజ్జిగ పోస్తారు. తౌడు తీసుకొనిపోతే చెంబునిండా మజ్జిగ పోస్తారు. వేరేవాళ్ళ మాదిరి మజ్జిగ చిలికినప్పుడు చెండ్రాయుడు పెదనాయనోళ్లు నున్నగా వెన్నతీయరు. అందుకే వాళ్ళ మజ్జిగ భలే కమ్మగా రుచిగా వుంటాయి. రోంత వూరుమిండి వుంటే చాలు, మజ్జిగతో కడుపునిండా బువ్వ తినొచ్చు. అట్లాది ఇప్పుడు వాళ్ళింట్లోనా రెండు పూట్ల పాలిచ్చే యెనుగొడ్డు వొగపూటే ఇస్తాందంట! దాంతో వాళ్లు రెండు వారాల నుంచి మజ్జిగ పోయడం లేదు. అందుకే పది దినాలనుంచి మజ్జిగ కోసరం పోతురాజు కాలువకు పోతాండాను.

మా వూరు నుంచి చక్రాయపేట మిందపోతే పోతురాజు కాలువ మూడు మైళ్ళు వుంటాది. బీటిమళ్లల్లో అడ్డంగా పోతే, రెండు మైళ్లుంటాది. పోతురాజు కాలువలో అందరూ తలారోల్లే, (బోయోల్లే) వేరే కులస్తులు కలికానికైనా లేరు. వుండే నూరిండ్లలో ఇరవైకి పైగానే పాడివుండే ఇండ్లుండాయి. చెరువుకు కుడివైపుండే కూతలేరు నుండే మాగాణి కడద్దన వుంటాది పోతరాజు కాలువ. చెరువు మరవంకలో పారే నీళ్లతో, వూరికి తూర్పువైపుండే ‘కూతలేరు’ ఏటి కాలువ నీళ్లతో ఆ వూరి పొలాలు నూరు నూటాయాభై ఎకరాలు చెరువులో నీళ్లు ల్యాకపోయినా కనీసం వొగ పంటైనా పండుతాయి. పచ్చిగడ్డి దొరుకుతాది. అందుకే ఆ వూర్లో ఎప్పుడూ పాడి వుంటాది. వూర్లో అందరూ రైతులే. కష్టపడి సేద్యం చేసుకోవడం తప్ప, ఆ వూరోళ్లకు వేరే ధ్యాసే వుండదు. అందుకే నిమ్మలంగా వుంటారు.

ఆ వూరికి తౌడు తీసుకొనిపోయి మజ్జిగ పోయిచ్చుకొని రావడం నాకు ఐదో తరగతి నుంచి అలవాటైంది. వొగ డబ్బా పావునిండా తౌడు తీసుకొనిపోతే పెద్ద ముంత నిండా మజ్జిగ పోస్తారు వాళ్లు. ఈ పొద్దు ఇంట్లో తౌడు లేకపోవడంతో మజ్జిగ ముంత మాత్రమే తీసుకొని నలుగురైదుగురు మా వూరు పిల్లోళ్లతో కలిసి, రోంత ‘కొతుకు’తో పోతురాజు కాలువలో బోయ నాగప్పోళ్ల ఇంటికి పోయినాను. నాతోపాటు కొండిగాడు తౌడు తీసుకొని వొచ్చి ఇంట్లోకిపోయినాడు. నాగప్ప పెండ్లాము వానికి మజ్జిగ పోసింది. నేను తౌడు తీసుకొని రాలేదని నా యంతకు నేను బిడియబడతా వాకిలి పంచన నిల్చుకొని వుండాను. నాగప్ప నన్ను చూసి ‘ఏమిరా పాపోడా? ఆడే నిలుచుకుండావు, లోపలికి రా’ అని పిలిచినాడు. నేను తౌడు తీసుకొని రాలేదని బిడియపడతా చెప్పినాను. ‘కాదురా దొంగబడవా, దానికల్లా అంతగా బిడియపడాల్నా రా రా, మజ్జిగ పోయిచ్చుకుందురా’ అని ప్రేమగా పిలిచినాడు. నేను రోంత తేలికపడి లోపలికి పోయినాను. ఆ యమ్మ నవ్వుతా ‘నువ్వు తౌడు తీసుకొని రాకుంటే మేము మజ్జిగ పోయమనుకుండావా? అంతదూరాన్నుంచి మజ్జిగ నీళ్లకోసరం కాళ్లుకాళ్లు కొట్టుకుంటా వొచ్చినావు. మజ్జిగ పోయకుంటే వుత్తముంత తీసుకొని పోతావేమిరా రా రా’ అంటూ పిలిచి ముంతనిండా మజ్జిగ పోసింది. నేను సంతోషపడతా మజ్జిగ పోయిచ్చుకొని పరమానందంగా ఇంటికొచ్చినాను.

ఎదకొచ్చిన ఎనుములెంట దున్నపోతులు

పొలాల్లో మడక దున్నేటప్పుడూ, గుంటక తోలేటప్పుడూ కాడికి కట్టే దున్నపోతులు గానీ, గిత్తలు గానీ సమకోలుగా ల్యాకుంటే కష్టం. దాయికోల్లో, చెవికోల్లో యాది వెనకబడినా, మెత్తబడినా గట్టిగావుండేదాని పక్క పోగు జరపల్ల. అట్ల మాటిమాటికీ జరిపితే అది బరువుతో ఆయాస పడతాది. మడక సలీసుగా ముందుకు సాగదు. మా దున్నపోతుల్లో దాయికోలుకు కట్టే బోడి కొమ్ములపోతు రోంత మెత్తబడింది. అందుకే నాయన రెండేండ్ల కిందట, దాన్ని అమ్మి, గట్టిగా బలంగా వుండే చుక్కపోతును సాములూరులో కొనుక్కొని వొచ్చినాడు. అది వొచ్చినంక మళ్లల్లో మడక దున్నడం బాగా అనుకూలమైంది.

చుక్కపోతు మా ఇంటికి వొచ్చినంక సేద్యం పనులు ఎక్కువగా లేవు. అందుకే పోతులు రెండూ బాగా కండబట్టినాయి. చుక్కపోతుకు ఇంకా వట్టలు కొట్టిచ్చలేదు. అందుకే అది భలే మకురుగా వుంది. ఇంటికొచ్చిన కొత్తలో అది నన్ను దగ్గరికి రానిచ్చేది కాదు. నేనే దానికి శెనక్కాయ చెక్క పలకలు నోటికందిస్తా మచ్చిక చేసుకుండాను. కడుగు నీళ్లలో తొట్టిలోకి కనికెడు శెనిక్కాయ చెక్క పలకలు గానీ, తౌడు గానీ, వేసి కలబెట్టితే పోతులు నీళ్లు బాగా తాగుతాయి. రాగిగడ్డి తిని, చెక్కగలిపిన కడుగునీళ్లు తాగి మా దున్నపోతులు రెండూ ఈగ వాలితే జారిపోయే మాదిరి నిగనిగలాడుతాండాయి. నేను రెండు దినాలకు ఒగసారి యేటి మడుగులోకి దాండ్లను తోలుకొనిపోయి ఈతాడిచ్చి, గడ్డిపోసల్ని మడతపెట్టి తడిపి, ఆ తడిపిన గడ్డితో పయికడిగి వొగ పోతు మీదికెక్కి కూర్చొని రాజు మాదిరి ఇంటికొస్తాను. చుక్కపోతు మా ఇంటికి వొచ్చినంక కోరు భూములు మంచిపంటలే పండినాయి. పశువులను కొనేటప్పుడు నిగాగా గమనించి మంచి సుడి వుండే దాన్లనే కొనుక్కోవల్లని నాయన అంటా వుంటాడు. చుక్కపోతుకు మంచి సుడి వుందని అందుకే రెండు రూపాయలు ఎక్కువైనా దాన్నే పట్టుకొని వొచ్చినానని నాయన రెండు మూడుసార్లు చెప్పినాడు.

మా దున్నపోతులు రెండూ రామలక్ష్మణుల మాదిరి చాలా వొద్దికగా వుంటాయి. యాటికి పోయినా రెండూ జతగాపోతాయి. జతగా ఇంటికొస్తాయి. పొలాల్లోకి వంకల్లోకి తోలి ఇంటికొస్తే కడుపునిండే వరకు మేసి, కడుపు నిండుతానే మెల్లగా దావపట్టుకొని ఇంటికొచ్చి తొట్లో వుండే కడుగునీళ్ళు తాగి కొట్టంలో యాదాని తలుగు దగ్గరికి అది పోయి నెమ్మదిగా పండుకుంటాయి. పండుకున్న రోంతసేపటికి నెమురేస్తాయి. నిమురేసేటప్పుడు దాన్ల పక్క చూడల్లంటే నాకు భలే ఇష్టం. దాండ్ల కండ్లల్లోనా, కంటిదొప్పల మీదా పండగ భోజనం భోంచేసినంత తృప్తిగా మెరుస్తాంటాయి. కడుపు లోపల వుండే మేతను వుంటలు వుంటలుగా నోట్లోకి తెచ్చుకొని దవడ పండ్లతో నములుతావుంటే దవడల్లో నున్నగామెదిగిండే తిండిసారంలోనుంచి చుక్కలు చుక్కలుగా నురుగుబిందువులు కిందికి కారుతా వుంటే చూసేకి ఎంత బాగుంటుందో. నల్లగా నిగనిగా మెరిసే ముక్కు దొప్పలు ఎంత శుభ్రంగా వుంటాయో!

మనిషి దినామూ పొద్దున లేస్తానే పండ్లు తోముకొని, నాలుక తిక్కుకున్నెంక సందకాటికంతా నోరు గబ్బువాసన వస్తాది. పైర్లు పండినంక ముఖ్యమైన గింజలన్నీ తెచ్చుకొని రోట్లో దంచుకుని బియ్యం కడిగి పొయ్యి మింద పెట్టి వుడికించుకొని తింటాడు మనిషి. అట్ల తినే మనిషి ఉదయం కక్క చేస్తానే దుర్వాసన వొస్తాది. ఆ వాసన భరించేకి కాదు. పశువు లేమో మనిషి వొదిలేసిన గడ్డి తింటాయి. పండ్లు తోముకోవు. నోరు కడుక్కోవు. అయినా దాన్ల నోర్లు మనుషుల నోర్ల మాదిరి చెడ్డవాసన రావు. ప్యాడ వేస్తే మనిషి మలం మాదిరి దుర్వాసన రాదు. ఎందుకో? ఎంత ఆలోచన చేసినా నాకు అర్థం కాలేదు. మనుషుల కంటే పశువులే శుభ్రం. పశువులే ఆరోగ్యం. పశువులే బలమైనవి. పశువులే మలినం లేనివి. ఏది వేస్తే అది తిని, కడుగునీళ్లు ఎంగిలినీళ్లు తాగి తృప్తిపడే పశువులు ఎంత నెమ్మదిగా వుంటాయో అని, అవి గాటిపాట్న పండుకొని నెమురేసినప్పుడల్లా కొట్టంలో వంటరూము మాదిరి చేసుకోనుండే కట్టమీద కూర్చొని దాన్లపక్క చూస్తా మురిసిపోతావుంటాను.

మాగాణి భూముల్లో పంట పెట్టినప్పుడల్లా మా వూర్లోనే కాదు చెరువు కింద పల్లెల్లో అందరూ పాడిపశువుల్ని, ఎద్దుల్ని తప్ప మిగతా పశువులన్నీ బీటి పొలాల్లోకి తోలుతారు. తోలిన పశువులన్నీ పొద్దుమునిగే సమయానికల్లా ఎవురిండ్లకవి చేరుకుంటాయి. కొన్ని కుర్రదూడలూ, ఎనుపోతులూ ఎదకొచ్చిన ఆవులెంట ఎనుములెంట బడి నసుకైనా ఇండ్లకు చేరుకోవు. అట్ల మా చుక్కదున్నపోతు పొద్దు మునిగినా ఇంటికి రాలేదు. రాముడు వొచ్చినాడు. లక్ష్మణుడు యాల రాలేదు అని అమ్మయ్యతో చెప్పినాను. ఆ దొడ్లసందుల్లో సరగామాడుతా వుందేమో చూసిరాపోండిరా అని నాకూ, పెద్దక్కకూ చెప్పింది అమ్మయ్య. ఇద్దరమూ చెరొగ పక్కా పోయి అంతలక్కా యెతికినాం. అది యాడా కాన్రాలేదు. నేను చాకిరేవుగుట్ట, మరవంక ఇంగా చాలాచోట్ల చూసినాను. యాడా దానిపలకవే ల్యాకపోయేసరికి మనసులో వొనుకు పుట్టింది. కాళ్లు చేతులు వొనకసాగినాయి. ఆకులు అమ్ముకొని నాయనొస్తే ఏమి చెప్పల్లని దిక్కుతెలీక భయపడతా ఇంటికి వొచ్చినాను. అప్పటికే నాయన ఇంటికి వొచ్చినాడు. చుక్కపోతు యాడా కనిపిచ్చలేదని చెప్పుతానే నాయన కోపంతో పడమడ్లకు పుట్టినోడా సందకాడ కాకముందే పసులు యాడుండాయో చూసుకుండెల్లేదా గాడిదీ!, దెంగితిని ఇంట్లో కూచ్చోకుండా పోతులెంట యాలపోలేదు? అంటా నోటికొచ్చినట్ల తిట్టసాగినాడు. నేను ఏదో చెప్పపోతే నన్ను కొట్టేకి చెలకోల తీసుకుండాడు. అమ్మయ్య నాయనకు అడ్డం పోయి చెలకోల పీక్కోని దూరంగా పడేసి, ‘దినామూ వొచ్చినట్లే వత్తాదనుకుంటాము. అదే మకురుబట్టి యాటికోపోతే వాడేం జేత్తాడు. దాని ముడ్డి యెనకలే పొయ్యికి అయితాదా. వూరోళ్లందరూ బీటిమళ్లల్లో తోలిండే పసువుల ముడ్డి పట్టుకొని పోతారా? అది యాడికి పోతాదని వాన్ని అంతగా తిడతాండావు? దాని గుద్దగాలితే అదే వత్తాది! రాకుండా యాడికి పోతాది?’ అని అమ్మయ్య గట్టిగానే మాట్లాడింది.

‘ఇయ్యాలదంకా రాంది ఎట్లొత్తాదని కూత్తాండావు? ఎవుడు తోలక పోయినాడో ఏమో? అది రాకుండా పోనీ, నీ కతా వాని కతా చెప్పుతాను. అని గొనుగుతా జలాటి గుంత కాటికి పోయినాడు నాయన. నేను పొంతలో వుండే వేడి నీళ్లు బకెట్లో తోడుకొని వొచ్చి జలాటి బండ దగ్గర పెట్టినాను. అమ్మయ్య నాయన వీపురుద్ది నీళ్లు పోసింది.

బువ్వ తిన్నెంక నాయన బజారుకల్లా పోయినాడు. నేను గోనిపట్ట పరుచుకొని అరుగుమింద పండుకుండాను. పొద్దుపోయేదంకా నిద్దరాలేదు. చుక్కపోతు ఇంటికొస్తాదో రాదో ఎవురైనా దొంగనాయాల్లు తోలుకొని పోయినారేమో, తోలుకొనిపోయి గోరంట్ల సంతలోనో, కొచ్చెరువు సంతలోనో అమ్మిపోతే ఎట్ల? మనసునిండా ఇవే ఆలోచనలు.

తెల్లారింది. చుక్కపోతు ఇంటికి రాలేదు. నాయనా ఇంట్లో లేడు. దున్నపోతు, పాతింటి మర్లుతో సాములూరికి పోయిండొచ్చునని నసుకులోనే లేచి సాములూరికి పోయినాడని అమ్మయ్య చెపుతానే దేవునికి మొక్కుకుండాను. సాములూరులో కొనుక్కోని వొచ్చిన ఇంట్లో మా చుక్కపోతుండల్ల స్వామీ అని.

అమ్మిడిపొద్దుకల్లా వొక్కడే తిరిగొచ్చినాడు నాయన. మా చుక్కపోతు సాములూరులో లేదని అర్థమయింది నాకు. నేను అడుగుతా వుండంగనే, నాయన కోపంతో ‘ముదినట్టం నా కొడకా, మంచి దున్నపోతును అన్నాలంగా నీగితివి గదరా! యింగ యాడ కనబడతాదిరా! అది యానాకొడుకో సంతకు తోలకపోయి అమ్ముకోనుంటాడు. పసువుల్ని బీటికితోలి ఇంట్లో గాడిదలు కాస్తావుండావేమిరా? అని కోపంగా చెలకోల తీసుకోని పీకినాడు నన్ను. ఆ దెబ్బకు తట్టుకోల్యాక ‘నాయనా’ అని గట్టిగా చావరుపు అరుస్తా, నాయన నడుమును కరుచుకోని ‘నాయనా, నాది తప్పయింది నాయనా నన్ను కొట్టొద్దు నాయనా’ అని గట్టిగా యేడ్చినాను. నన్ను కొట్టేది చూసి పిల్లోలందరూ గోంగలు పెట్టి యేడ్చినారు. మా అరుపులు విని పొయ్యి దగ్గరుండే అమ్మయ్య ఆదరాబాదరా వొచ్చి, నన్ను పక్కకు లాక్కొని తన కడుపుకు అదుముకొని నా తొడ మీదుండే చెలకోల వాతలు చూసి ఏడుస్తా ‘నువ్వేమి మనిసివి? పసువును కొట్టినట్ల చేతికొచ్చిన కొడుకును కొట్టేకి నీకు చేతులెట్లొచ్చినాయి. ఆ ముదనట్టం దున్నపోతు పోతే పొయ్యింది, ఏం కొంపలు కూలిపోయినాయా? నా తాలిబొట్టును అమ్మి ఇంగొగ దున్నపోతును కొనకరాపో! నేను పసుపుతాడు కట్టుకుంటాను పో! సెటాయింపు పుట్టి వాడు యే నుయ్యో, గొయ్యో చూసుకుంటే అప్పుడు యెవుని మిందపడి మొత్తుకుంటావు?’ అంటా అమ్మయ్య కుమిలి కుమిలి యేడ్చింది.

మా నాయన కూడా నేను చెలకోల దెబ్బలకు తట్టుకోల్యాక గట్టిగా, ‘నాయనా తప్పయింది నాయనా, కొట్టొద్దు నాయనా’ అని అరుస్తా వుంటే చెలకోల పక్కకు పడేసి నిలుచుకుండాడు. పిల్లాజల్లా అందరూ ఏడుస్తూ వుంటే ఏమనుకుండాడో ఏమో, అరుగు మింద మౌనంగా కూర్చుండాడు. నా ఏడుపు మానిపోయి ఎక్కిళ్ళు పట్టినాయి. అమ్మయ్య మౌనంగా ఏడుస్తా నా తల నిమురుతా వుంది. ఎక్కిళ్లతోనే నేను నాయన పక్క చూసినాను. నాయన కళ్ళల్లో నీళ్లు కనిపించినాయి. నేను పరిగెత్తిపోయి నాయన పక్కనే కూర్చుని తొడలు మీదికి తలవాల్సినా. ఏమీ మాట్లాడకుండా నా తలమీద చెయ్యివేసి ఓదార్చినాడు. అందరమూ మౌనంగా అట్లనే చాలాసేపు కూర్చుండాం. నాయన కాసేపయినంక వూర్లోకి పొయ్యొచ్చినాడు. నిన్న సందకాడ మా చుక్కపోతు దిగవమోతలగడ్డ దగ్గర ఎనుగొడ్ల వెంట సోదనపల్లి వైపు పోతావుంటే బోయ రామన్న చూసినాడంట! ఆ సంగతి చెప్పి, నాయన సోదనపల్లికి పోయ్యొస్తానన్నాడు. నేనూ వస్తానన్నాను. అమ్మిడి పొద్దు ముద్దతిని నేనూ, నాయనా మాగాణికి అవతలుండే సోదనపల్లికి పోయినాం. నాయనకు తెలిసిన చాగంటి నారాయణరెడ్డి ఇంటికి పోయినాం. ఆయన నాయనను చూస్తానే పలకరిచ్చినాడు. నాయన విషయం చెప్పినాడు. ఏదో తప్పుడు పసరం వూర్లోకి వొచ్చిందంటే బందల దొడ్లేకి తోలిచ్చినాను, మీ దున్నపోతో కాదో చూడుపో వెంకటస్వామీ అని ఆయన చెపుతానే మేము పోయిచూసినాం. బందలదొడ్లో వుండేది మా చుక్కపోతే! దాన్ని చూస్తానే నేను సంతోషంతో పొంగిపోయినాను. అది గుడకా మమ్మల్ని చూస్తానే గ్వాంగ్‌ అంటా మూతి వూపసాగింది. పాపం నిన్నటి నుంచి ఏందీ తినలేదేమో, మమ్మల్ని చూసి ఏందైనా తినేకి పెట్టండి అని తలకాయ వూ పుతా వుంది. నారాయణరెడ్డితో అది మా దున్నపోతే అని చెప్పి బందలదొడ్లో నుంచి విడిపిచ్చుకొని ఇంటికి తోలుకొని వొచ్చినాం. ఇంటికి వొచ్చిన చుక్కపోతును చూసి ఇంటందరూ ఆనందపడినారు.

మదనగోపాలయవారు నాకు దేవుడై వొచ్చినాడు

ఎండాకాలం సెలవులు అయిపోయినాయి. మల్లా బడివాకిలి తీసినారు. మా వూరి బడికి ఎవురో కొత్తయివారు వొచ్చినాడని పేరు మదన గోపాల్‌ అని పిల్లోల్లు చెప్పినారు. ఆ అయ్యవారు దినామూ శింగనమల నుంచి వొచ్చి పోతాడని తెలిసింది. నా జతగాళ్లు శింగనమల ఐస్కూల్‌కు పోయేది చూసి నా మనసు పీకింది. ఆశతో గుంజులాడ సాగింది. అమ్మయ్య దగ్గర కన్నీళ్లు పెట్టి అడిగినాను. ‘ఏమో నాయినా, చెప్పితే మీ నాయిన యినేతట్ల లేడు’ ఆడిదాన్ని, నేనేం జేత్తును?’ అని అమ్మయ్య బాధపడింది. యా పని చేసేకి పోయినా మనసంతా ఐస్కూల్‌ మిందనే! లోపల బయటికి కన్నీళ్లు రాని ఏడుపు! నా బాధను ఎవురు తీరుస్తారు? ఇంగ నా చదువు ఇంతేనా, ఐస్కూలుకు పోయ్యే అదృష్టం ఇంగ నాకు రాదా?

బాధపడతా నాలో నేను కుమిలిపోతా మల్లా నాయనెంట ఆకుల గంపెత్తుకోని పోతావుండాను. ఇంతకుముందు పోయిండే పల్లెలకు పోయి మూడు దినాలు అయినంక నాయనెంట ఇంటికొచ్చినాను. సందకాడ, పంచ కట్టుకొని తెల్లగా అందంగా వుండే ఒగాయన ఇంటికొచ్చి ‘ఏమి చిన్నాయనా బాగుండావా?’ అంటా నాయనను పలకరిచ్చినాడు. నేను చాప తెచ్చి అరుగుమింద పరిచినాను. ఆయనను చూసి, ‘రాప్పా మదనా కూర్చో, యాటికొ చ్చింటివి ఇయ్యాలప్పుడు?’ అని నాయన ప్రేమగా పలకరిచ్చినాడు. ఈ వూరి స్కూలుకు ట్రాన్స్‌ఫర్‌ అయి వొచ్చినానని చెప్పుతానే ఆయనెవురో అర్థం అయింది నాకు. ఆయనకు కాఫీ ఇచ్చేకి నాయనా అమ్మయ్యా ఇబ్బంది పడతా వుంటే, ఇప్పుడే ఏమీ వొద్దని, రేపు భోజనానికి ఇంటికి వొస్తానని, వూరకనే పలకరిచ్చేకి వొచ్చినానని, చీకటి పడతాదని చెప్పి వెళ్లిపోయినాడు మదన గోపాల్‌ సారు.

నాయన ఆకులు అమ్ముకొని వొచ్చినంక వొగ దినం ఇంటికాడే వుంటాడు. అట్లనే ఈ పొద్దు వుండాడు. నాయన స్కూలు కాటికిపోయి మదన గోపాల్‌ అయ్యవారిని కలిసొచ్చి మదన పయిటాల భోజనానికి ఇంటికొస్తాడని ఢిల్లీ భోగాల అన్నము, చిగురుపప్పూ, చారూ, చింతకాయ తొక్కు వూరుమిండీ చేయమని అమ్మయ్యతో చెప్పినాడు. నేనూ, పెద్దక్కా చింతచిగురు ఇసుకచెంచిలాకు, అటకమామిడాకు పీక్కోని వొచ్చినాం. అమ్మయ్య చిగురు పప్పూ, చారూ చేసింది కంచు గంటెలో తిరగమోత గింజలూ, శెనిక్కాయనూనె వేసి నిప్పులమింద పెట్టి వాసనొస్తానే పప్పులో చారులో తిరగమోత పెట్టింది. అట్లనే చింతొక్కు వురిమిండికి తిరగమోత పెట్టింది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కమ్మటి వాసనొస్తా వుంటే నోట్లో నీళ్లు వూరినాయి.

మదనగోపాల్‌ సార్‌ వొచ్చినాడు. పప్పు చారు వూరిమిండి అన్నీ భలే రుచిగా వున్నాయని పప్పులోకి ఏమేమి పెట్టి చేసినావొదినా, అద్భుతంగా వుంది అని మెచ్చుకుంటా అడిగినాడు. అమ్మయ్య చెప్పింది. ఆ సారు తృప్తిగా భోంచేసినాడు.

భోజనాలన్నీ అయిపోయినంక బయట అరుగు మింద వారపాక కింద చాప పైన కూర్చొని నా వైపు చూస్తా ‘పిల్లోడు భలే వుషారుగా వుండాడు. ఏమి చదువుతా వుండాడు చిన్నాయనా’ అని అడిగినాడు. నాయన బిడియపడతా చెప్పినాడు. వాళ్ళ మాటల్లోకి కలగజేసుకొని అమ్మయ్య జరిగిండే సంగతంతా చెప్పింది.

‘పొరపాటు చేసినావు చిన్నాయనా! మనట్లా పేదోళ్లూ చిన్న కులస్తులూ చదువుకొని బాగుపడల్లని చూస్తే రెడ్లు, కమ్మోళ్ళు సహించలేరు చిన్నాయనా! వాళ్ల మాటలిని బంగారాకట్ల చదువుకుంటా వుండే పిల్లోన్ని చదువు మాన్పించినావా? ఎంత పొరపాటు చేసినావు! వీడు చదువుకుంటే తరతరాలు బాగుపడతాయి. విద్యాగంధం లేని మీ వొంశంలో ఎట్లనో వీనికి చదువు అబ్బింది. నువ్వేమీ మాట్లాడకుండా వీన్ని నా వెంట పంపిచ్చు. శింగనమల హైస్కూలుకు ‘చిత్తరంజన్‌దాస్‌’ అనే హెడ్మాష్టర్‌ వొచ్చినాడు. ఆయన పేద విద్యార్థులకు దేవుడు. ఆయన నాకు చాలా సన్నిహితుడు, ఎంతో కావలసినవాడు. వీన్ని ఆయనకు అప్పజెప్పుతాను. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇంకేమీ మాట్లాడకుండా రేపు వీన్ని శింగనమలకు పిలుచుకొని రా. నేను రేపు సెలవు పెట్టి మీకోసమే ఎదురు చూస్తూ వుంటాను. సరేనా, సరే’ అను’ అని మదనగోపాల్‌ నాయనను వొప్పిచ్చినాడు. నా కండ్లల్లో ఆనందం పొంగిపొర్లింది. ఆయన నా భుజం తట్టి, అందరికీ చెప్పి స్కూలుకు వెళ్లి పోయినాడు. వెళ్ళిపోతా వుండే ఆ సారు నా కోరికను తీర్చేకి వొచ్చిన దేవుని మాదిరి మా ఇంటికి వొచ్చినాడనిపించింది నాకు.

మదనగోపాల్‌ సార్‌ చెప్పినట్లుగానే నేనూ, నాయనా శింగనమలకు బయలుదేరినాం. అమ్మయ్య ఆనందంతో నాకు ముద్దుపెట్టింది. పోయిన సమ్మత్సరం నాగభూషణంతో ఇప్పిచ్చుకోనుండే ఏడవ తరగతి పుస్తకాలు బ్యాగులో పెట్టుకుని నేను కొత్త వుత్సాహంతో నాయన వెంట నడిచి శింగనమల ఐస్కూల్‌ దగ్గరికి చేరుకుండాను. మా కోసరం ఎదురు చూస్తాండే మదనగోపాల్‌ సార్‌ మమ్మల్ని హెడ్మాస్టర్‌ రూములోకి పిలుచుకొని పోయి ‘ఇతనే మా చిన్నాయన బావా’ అని పరిచయం చేసినాడు. ఆ హెడ్మాస్టర్‌ సారు మా నాయనను వివరాలన్నీ అడిగినాడు, నాయన అన్ని చెప్పినాడు.

‘ఏమి వెంకటస్వామీ, పిల్లోడిని సక్రమంగా స్కూలుకు పంపిచ్చల్ల, పనుల కాలంలో పనులుంటాయని వారాల తరబడి పిల్లవాడిని స్కూలుకు పంపకుంటే వాని పేరు తీసేస్తాం ఏదైనా కష్టమొస్తే వొచ్చి నాతో చెప్పు. పుస్తకాలు, ఫీజు నేను చూసుకుంటానులే. ఏమిరా బాబూ, నువ్వు శ్రద్ధగా చదువుకోవాల’ అని మా ఇద్దరికీ చెప్పినాడు హెడ్మాస్టర్‌ సార్‌. ఏడో క్లాసు అటెండెన్స్‌ రిజిస్టర్‌లో నా పేరు రాయించి, నన్ను ఏడో క్లాసులో కూర్చోమని చెప్పి ప్యూన్‌ వెంట నన్ను ఆ రూముకు పంపినాడు. ఆ క్లాసులో వుండే అయ్యవారితో చెప్పి నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయినాడు. పోగొట్టుకున్నది ఏందో మల్లా దొరికినట్లయింది నాకు! మదన గోపాల్‌ సార్‌కు మనసులో మొక్కుకుండాను.

క్లాసులో వుండే పిల్లోల్లందరూ కొత్తోళ్లే. నేను ఆరో తరగతిలో వున్నెప్పుడు వున్నోళ్లు ఎవురూ లేరు. వాళ్ళందరూ ఎనిమిదో క్లాసులో వుంటారనుకుండాను. పరిచయం లేని పిల్లోల్లను అడిగి అది ఇంగ్లీష్‌ క్లాస్‌ అని తెలుసుకొని బ్యాగులో నుంచి ఇంగ్లీష్‌ పుస్తకం బయటకు తీసినాను. అప్పుడే మొదటి పాఠం అయిపోయిందని, రెండో పాఠం తీసినాను. అంతలోనే బెల్లు కొట్టినారు. మూడో పీరియడ్‌ సోషియల్‌ అని అంజినప్ప సారు వస్తాడని పక్క పిల్లోడు రాధాకృష్ణ చెప్పినాడు. ఆ సార్‌ వొచ్చినాడు. నాలుగో పీరియడ్‌ హిందీ. ఇద్దరూ పాఠం బాగా చెప్పినారు. నాలుగో పీరియడ్‌ అయిపోతానే అన్నం తినొచ్చేకి లాంగ్‌ బెల్లు కొట్టినారు. అన్ని తరగతుల్లో నుంచి పిల్లోళ్ళు బయటికి వొచ్చినారు. ఎనిమిదవ తరగతిలో వుండే నా జతగాళ్లందరూ కనిపిచ్చి, పలకరిచ్చి, నేను మల్లా స్కూల్లో చేరినందుకు సంతోషపడినారు. వాళ్లతో మాట్లాడుతా వుండంగనే నాయనొచ్చి నన్ను మదనగోపాల్‌ సారింటికి పిల్చుకొని పోయినాడు. ఏడో క్లాసులో నా ముందు వరుసలో కూర్చోనుండే పిల్లోడు ఆ సారింటికి వొచ్చినాడు. ఆయన నన్ను ఆ పిల్లోనికి పరిచయం చేసినాడు. పేరు శంకర్‌. మదనగోపాల్‌ సార్‌ భార్యకు తమ్ముడంట! ఆ సార్‌ భార్య చెప్పింది. అందరమూ కలిసి సారింట్లోనే భోంచేసినాం.

రెండు గంటలకు మల్లా స్కూలు. మదనగోపాల్‌ సార్‌కు, ఇంట్లో వాళ్లకు చెప్పి శంకరప్పతోపాటు నేను స్కూలుకు బయలుదేరినాను. నాయన వూరికి యెల్లవారినాడు.

మధ్యాహ్నం రెండు పీరియడ్లు అయిపోయినంక లాస్ట్‌ పీరియడ్‌ డ్రిల్‌ క్లాసు. అన్నీ మరిచిపోయి, మా తరగతిలోని పిల్లోళ్లతో, పాత జతగాళ్లతో కలిసి వూరి బయటుండే హై స్కూల్‌ గ్రౌండ్‌లో గేమ్స్‌ ఆడేకి పోయినాను. నేను ఆరో తరగతిలో వున్నెప్పుడు ఈ గ్రౌండ్‌ లేదే! ఈ గ్రౌండ్‌ స్కూలుకు కొత్తగా వొచ్చిందేమోనని అనుకుంటా ఎనిమిదో తరగతిలో వుండే మా వూరి కుళ్లాయప్పను అడిగినాను. శింగనమలలో వుండే పెద్ద షావుకారి వుస్తిపల్లి సుబ్రమణ్యం శెట్టి హైస్కూలు రావడానికి ఐదువేల రూపాయలతో పాటు గ్రౌండు కోసరం ఈ భూమిని ఇచ్చినాడని, అందుకే హైస్కూలుకు వాళ్ళ నాయన పేరు పెట్టినారని కుళ్లాయప్ప చెప్పుతానే నేను అబ్బురపోయినాను. ఆనెంక పిల్లోళ్లతో కలిసి కబడ్డీ, కోకో ఆటలు ఆడినాను. చిదంబర రెడ్డి సారు మాకు కోకో, కబడ్డీ యెట్లా ఆడల్లనో నేర్పిచ్చినాడు. టైం అయిపోయిందేమో ఆసారు గట్టిగా ఈల వూదినాడు. అంతటితో అందరమూ ఇండ్లకు బయలుదేరినాం. బీటి మళ్ళల్లో కాలి దావకుండా మావూరి పిల్లోళ్లతో కలిసి వస్తావుంటే మల్లా యెన్నాళ్లకు వొచ్చిందో ఈ అదృష్టమని అనుకుంటా, మదన గోపాల్‌ సార్ను మనసులో తల్చుకుంటా జతగాళ్లతో పాటు నడుస్తా వుండాను.

కొంత దూరం వొచ్చినంక శివపురం పిల్లోళ్లు వాళ్ల వూరి దావకు తిరిగి మాకు చేతులూపుతా పోయినారు. రోంత ముందుకు పోయినంక ఆ దావ పక్క నుంచి పడమర జీ చెట్టు వరకూ, దక్షిణం పక్క మరవ వంక వరకూ వుండే ఇరవై ఎకరాల మడి, వొగే పరుపంతా ఉస్తిపల్లి సుబ్రహ్మణ్యం శెట్టిదేనని, అది మన వూరి మోతలగడ్డ మళ్ళ కంటే ఇంకా సారవంతమైనదని చెబుతా కుళ్లాయప్ప చేయెత్తి చూపిచ్చినాడు. అబ్బబ్బా ఎంత పెద్ద షావుకారి అని ఆశ్చర్యపోతా దావపొడవునా ఆయన విషయమే జతగాళ్ళతో మాట్లాడుకుంటా ఇల్లు చేరుకుండాను. సంతోషంతో ఇంటికొచ్చిన నన్ను చూసి అమ్మయ్య మురిసిపోయి స్కూలు సంగతులన్నీ అడిగింది. నాకు పెన్ను పెన్సిల్ల కోసరం చాటుగా రెండణాలు ఇచ్చింది.

***

ఈ సమ్మత్సరం మా చెరువుకు వొగ పంటకు సరి పొయ్యేటన్ని నీళ్లు వొచ్చినాయి. మోతల గడ్డలో దంతులూరు నాగయ్య శెట్టి మడిలో ఢిల్లీ భోగాల వరి పంట పెట్టినాం. మడి దున్నేటప్పుడూ, వరి నాటేటప్పుడూ మాత్రమే నేను బడికి శెలవు పెట్టినాను. ప్రతి ఆదివారం కూలి పనులకు పోతా వుండాను. బడికి పోయే దినాలంతా నసుకులోనే లేచి కొడవలి, లిక్కీ, చిక్కెమూ తీసుకొని వూరోళ్లతో కలిసి దేవరకొండకు పోయి న్యారడగడ్డి, జొన్నుగడ్డి, బోదగడ్డి కోసుకొని చిక్కెంనిండా కట్టుకొని వొచ్చి పశువుల గాట్లోవేసి బిరబిరా కాళ్లూ, మొగమూ కడుక్కొని గబగబా బువ్వ తిని అదే బువ్వ, వురిమిండి సిల్వర్‌ క్యారీలో అమ్మయ్య పెట్టిస్తే తీసుకొని జతగాళ్ళతో కలుసుకుంటాను.

మాగాణిలో వరి పంట పెట్టినప్పుడు గెనాల మిందనే దారి. గెనాల మింద పోయేటప్పుడు, కయ్యల్లో నీళ్లు ఎక్కువై దావగెనుం మిందికి వొచ్చినప్పుడు కాళ్ళు జారుతాయి. జారి కిందపడితే బట్టలు, పుస్తకాలు తడిసిపోతాయి. తడిసిపోతే ఆ పొద్దు స్కూలుకు సున్నే! అందుకు మేము పిల్లోలందరమూ చాలా వొయినంగా నడుస్తాం. అట్ల నడిచేటప్పుడు మా వూరి నుంచి శింగనమలకు మాగాణిలో కనీసం వొగ బండిజాడన్నా గవర్నమెంటోళ్ళో, రెండూర్ల వాళ్ళో వేస్తే బాగుంటాది కదా అని అనిపిస్తాది. పిల్లోళ్ళమంతా యెట్లో కష్టపడి మరవంక యేట్లో వరకూ పోతాం. యేట్లో నడుములలోతు నీళ్లు పారుతావుంటాయి. ఆ నీళ్లను దాటి పోవల్లంటే పుస్తకాల సంచిని వొగ చేత్తో తలకాయ మింద పెట్టుకొని ఇంకొగ చేత్తో నిక్కర గజ్జలవరకు పైకి మడుచుకొని పోవల్ల. ఒక్కొక్కసారి నిక్కర్‌ని విప్పబీకి నోటితో పట్టుకొని అంగీ పెకెత్తుకొని పోవల్ల. అట్ల అవస్తపడి స్కూలు దగ్గరికి పోయేటప్పటికి ప్రేయర్‌ అయిపోయి ఫస్ట్‌ పీరియడ్‌ జరుగుతా వుంటాది. అప్పుడు అందరూ క్లాసు బయట నిలబడల్ల. నిలబడితే అయవారు నాలుగు తిట్లు తిట్టి లోపలికి పిల్చుకుంటాడు.

మధ్యాహ్నం అన్నం తినేకి అందరమూ గోల కొండ్రాయుని కొండదడిలో వుండే చెలమ దగ్గరికి కాకుండా, వూరి బయటవుండే ఎవురూ రొంటాలకు పోనంత దూరంగా చిన్న కాలువ గట్టుమింద కూర్చొని క్యారీర్లు తీసి వొగరి కూర వొగరికి రోంత రోంత మార్చుకొని అన్నం తింటా వరిమళ్ళ వైపు చూసి మురిసిపోతా క్యారీలు ఖాళీ చేసినాం. నీళ్లు వొండులొండులుగా వస్తావున్న్యా అవే తాగినాం. శింగనమల చిన్న కాలువ మాదిరే మా వూరి పెద్ద కాలువ, వూరి పక్కనే పారుతాది. మా వూరి కాలువకు యెగువ పక్కన శివపురముంది. కాలువ, ఆ వూరిని చుట్టేసుకొని వస్తాది. ఆ వూర్లో కాలువలో బట్టలు పిండుతారు. ఎంగిలి తట్టలన్నీ కడుగుతారు. పసువుల్ని ఈదులాడిస్తారు. అయినా మా వూరి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కాలువ నీళ్లు శుభ్రంగా వుంటాయని పొలాల్లో పనులకు పోయే వాళ్లు ఆ నీళ్లే తాగుతారు. మేము పయిటాల బువ్వ తినే చోట శింగనమల చిన్న కాలువకు ఎగువన పల్లెలేవీ లేవు. నీళ్లు గలీజయ్యేకి అవకాశమే లేదు. అందుకే కొత్తనీళ్లు రోంత వొండులున్న్యా, మా వూరి దగ్గర పారే కాలువ నీళ్లకంటే బాగుంటాయని కోమటోళ్లు నాగభూషణం, వెంకటేశం, బచ్చు నాగభూషణం కూడా మాతోపాటే కాలువ నీళ్లు తాగుతారు.

గోకుడు శెనిక్కాయలకు మాల్యవంతానికి..

వరిమల్లు కోసినారు మా నాగయ్యోళ్ళ మడి మంచి పంటయ్యింది. మా వూరి ఎలకంటి పాపయ్యోల్ల మాదిరి కాకుండా దంతులూరి నాగయ్య వరిగడ్డిని ఆశించలేదు. అంతా మాకే. వరి కోతలప్పుడు వొగ పద్దినాలు స్కూలుకు శెలవు పెట్టి కోతకూలికి పోయినాను. ఈసారి అమ్మయ్య కూడా వరి కోతలకు వొచ్చింది. అమ్మయ్యా, నేనూ, పెద్దక్కా సుమారుగా ఏడెనిమిది మూటల కూలి గింజలు జమ చేసినాం. వానలు సరిగా పడక, చెరువు పూర్తీ నిండలేదు. అందుకే చెరువు కింద ఎండకారుపంట పెట్టలేదు. అయితే ఎలిభూముల్లో తీగ శెనిక్కాయపంట అందరికీ బాగా అయింది. మా వూరికాడనే కాదు, దేశమంతలక్కా శెని క్కాయ పంట బ్రమ్మాండంగా పండిందని అంటాండారు. మా వూరికి ఎలిపొలాలు, చేన్లు చాలా తక్కువ. చేన్లు వుండినా ఈటిడిసరు. శెనిక్కాయ గుంటకలతో పాస్తారు. గుంటక సరిగా న్యాలలోకి దిగకుంటే గుంటకమింద ఇసకమూట పెట్టుకొని, దాని పైన మనిషి నిలబడి గుంటక తోలుతాడు. ఎద్దులు బరువు పడితే రెండుగాళ్ల ఎద్దులుకట్టి గుంటక పాస్తారు. కూలోళ్లు శెనిగమండల్ని ఎదిరి, కుప్పలు వేసుకుంటా గుంటక వెంట పోతారు. శెనిక్కాయ కుప్పలన్నీ ఎండినంక ఎద్దుల బండిలో టోపు వేసుకొని దొడ్లల్లోకి తోలి, వాము లేసి, లద్దెపురుగులు తినకుండా గెమాక్సిన్‌ పౌడర్‌ చల్లుతారు.

మా వూరి రైతులు భలే పీసినోళ్ళు. శెనిక్కాయ పాసినంక రెండు నెలల వరకు శెనిక్కాయలు గోక్కోడానికి ఎవురినీ రానీయరు. గుంటక పాస్తానే రాలిండే పైకాయలను కూలోళ్లతో ఏరిస్తారు. ఆనెంక రెండుసార్లు చెక్కల గుంటక తోలి బయటకొచ్చిన కాయల్ని ఏరిస్తారు. అంతటితో వదలక బోదిగుంటక పాసి, బయటపడిన కాయల్ని మల్లా ఏరిస్తారు. అయినా బీదాబిక్కి గోకుడు కాయల కోసరం పెంకులు తీసుకునిపోతే గోక్కోనియ్యరు. అందుకే మా వూరి పేదోళ్లందరూ గోకుడు శెనిక్కాయల కోసరం బండ్లపల్లి, బండ్లపల్లిపొప్పూరు, మాల్యవంతం, బత్తలపల్లి ప్రాంతాలకు గుంపులు గుంపులుగా పోయి రెండు మూడు వారాలు అక్కడే వుండి అరవై డెబ్భై రూపాయలు గోకుడు శెనికాయలమ్మి తెచ్చుకుంటారు.

కరెక్టుగా ఇదే సమయానికే నాకు సంకురాత్రి సెలవులొచ్చినాయి. ఇరుగు పొరు గోళ్ళు ఆ వూర్లకు గోకుడు శెనిక్కాయల కోసరం బయలుదేరుతావుంటే పెద్దక్కనూ, నన్నూ పొమ్మని చెప్పింది అమ్మయ్య. నేను సరే అన్న్యాను. నాకూ పోడానికి ఇష్టమే. రేప్పొద్దున్నే పోవల్లని, శెనిక్కాయలు గోకే పెంకులు, రెండు గోనిసంచులు, కప్పుకోవడానికి దుప్పట్లు రెడీ చేసుకుండాం. అమ్మయ్య చెరీ ఐదు సేర్లు బియ్యము వొగ డబ్బా నిండా శెనిక్కాయలపొడి, వొగ సిల్వర్‌ క్యారీ నిండా చింతొక్కు, అన్నం వండుకుని తినడానికి సిల్వర్‌ తపెలా, పళ్లెమూ, చంబూ, లోటా అన్ని రెడీ చేసిపెట్టింది. అమ్మయ్య గుడకా మాతోపాటే వచ్చేదే! అయితే సన్నబిల్ల తల్లి! పైగా తమ్ముడు పెద్దన్న చిన్నపిల్లోడు. అందుకే అమ్మయ్య రాలేదు. నేనూ, పెద్దక్కా రెడీ అయినాం.

తెల్లవారుజామున కాయల కోసరం మాల్యవంతానికి పోవల్ల. ఆ వైపున మంచి కండగలిగిన ఎర్న్యాల చేన్లు భలే వుంటాయంట! శెనిక్కాయ బ్రమ్మాండంగా పండుతాదంట! కొత్త వూర్లు, పొలాలు, పంటలు చూడల్లని నాకెందుకో భలే ఇష్టం. అందుకే వుత్సాహంతో వుండాను.

నా జతగాళ్ళు ఎవురైనా వొస్తాండారేమోనని నేను తెల్సుకుండేకి వాళ్లిండ్ల కాటికి పోయినాను. ఎవురూ రావడం లేదని రోంత నిరాశ కలిగింది. ఇంటికి తిరిగి వొస్తానే అమ్మయ్య చెప్పింది పెద్దక్క రాదని. ఆ పాప పెద్దమనిషి అయిందని. నన్ను కూడా అమ్మయ్య పోవద్దని అంటాదేమో అనుకుండాను కానీ అనలేదు. ఉదయమే సామాన్లన్నీ గోనిసంచిలో మూటగట్టి నెత్తి మింద పెట్టుకొని మా గేరేళ్లతో కలిసి మాల్యవంతానికి బయలుదేరినాను. అమ్మయ్య జాగ్రత్తగా పోయిరా నాయనా అని చెప్పి పంపింది. మాల్యవంతం మా వూరికి ఇరవైఐదు మైళ్ళదూరం అని, చూసినోళ్లు అన్న్యారు. తాడిపత్రి రోడ్లో చక్రాయపేట దాటినంక కుడిపక్కకు తిరిగి బండిజాడలో సాములూరు చేరుకుండాం. ఆ వూరును చూస్తానే నాకు బట్టలమ్మే సుబ్బరాయుడు గ్నాపకమొచ్చినాడు మా బండమీదపల్లె కంటే చాలా చిన్న వూరు సాములూరు. వూర్లో నడిమధ్య నుంచి వూరు దాటి రోంత దూరం పోతానే ఇంకొగ పల్లె వొచ్చింది. దాని పేరు నిలువురాయి. సాములూరు కంటే ఇంకా చిన్నపల్లె. వూరు దాటుతానే అన్నీ వరిమళ్లు. కూతలేరు యేటి కాలువ నీళ్లతో పైర్లు పెట్టుకుండారంట! పొలాలు దాటినంక రోడ్డొచ్చింది. అది మాల్యవంతం బత్తలపల్లి మింద ధర్మవరానికి పోతుందంట! మా గుంపంతా పదైదు మంది రోడ్డుపట్టుకొని కుశాలుగా మాట్లాడుకుంటా, నవ్వుతా బేల్తా పోతాండాం. రోడ్డెక్కినంక మాకు యెనికిపక్క, రోడ్డు వార కనిపించే పల్లెల పేర్లు అడిగినాను మా ఇంటి దగ్గరుండే బోయ నారాయణను. ఆ యప్పను మేము చిన్నాయన అని పిలుస్తాం. భలే కుశాల మనిషి. ఆ యప్ప యాడున్న్యా తన మాటలతో అందరినీ బొగు నవ్విస్తాడు. నేను అడిగినదానికి బదులుగా అవి నడిమిదొడ్డి, కేశేపల్లె అని నడిమిదొడ్డిలో మీ ఉప్పరోళ్లుండారని, యేమి పిల్లను చూసేకి పోతావా? అని అన్న్యాడు. ఆ మాట విని అందరూ నవ్వుతా, ఎవురో ఆ పిల్లను పిల్చుకోనొచ్చి మన నారాయణ గానికి జత జెయ్యి మామ అని ఎంటికిలప్ప కొడుకు రామాంజినేయులు కువాడ మాడినాడు. అందరూ గొళ్ళున నవ్వినారు. నవ్వుతా నన్ను ఆట పట్టిచ్చినారు.

అందరమూ నవ్వుకుంటా నార్పల క్రాసింగ్‌ దగ్గరికి చేరుకుండాం. క్రాసింగ్‌ లోనుంచి తూర్పు పక్కన దగ్గరగా కనిపిచ్చే వూరు నార్పల అంట! పడమరకు పోయే రోడ్డు వెంకటాపురం, దయ్యాలకుంటపల్లి, రేకులకుంట, బుక్కరాయసముద్రం మింద అనంతపురం పోతాదంట! దక్షిణానికి పోయేదే మాల్యవంతం, బత్తలపల్లి మీద ధర్మవరం పోతాదంట! అన్నీ అడిగి తెలుసుకుంటా నడుస్తా పొలాలను చూస్తా వుండాను. నార్పల క్రాసింగ్‌ రోంత ముందుకు పోతానే బొందలేడు దగ్గర రోడ్డుపక్కనే తోటలో బావిగడ్డమింద కూర్చొని అందరమూ సద్దిమూటలిప్పి అమ్మిడిపొద్దుబువ్వ తిని మల్లా బయలుదేరినాం. సుమారుగా పోతానే పొప్పూరు రస్తా వొచ్చింది. పొప్పూరును బండ్లపల్లి పొప్పూరని అంటారంట! ఇంగొగ పొప్పూరు తాడిపత్రికి యెగవన వుందంట! దాన్ని అశ్వత్థంపొప్పూరని అంటారంట! అశ్వత్థం అంటానే మా నాయనోల్లు నాకు పేరు పెట్టిండే సంగతి, వాళ్లు అశ్వత్థం తిర్నాలకు పోయి వొచ్చిన సంగతి గ్నాపకమొచ్చి పెద్దయినంక అశ్వత్థానికి పోయి రావల్లని అనుకుంటా నడుస్తా వుండాను. అంతలోనే బండ్లపల్లి రస్తా, ఆనెంక ఏకునాదంపల్లి రస్తా వొచ్చినాయి. ఏకునాదం అంటే తంబుర. ఈ వూరికి ఈ పేరు ఎట్లొచ్చిందో అనుకుంటా రస్తా దగ్గరుండే మనిషిని, ఆడ కనిపించే వూరేనా ఏకునాదంపల్లి అని అడిగినాను. ఔను అదే, మా వూరిపేరు ఏకునాదంపల్లి కాదు, ఏకపాదంపల్లి. అదిగో, ఆ కొండమిందుండే ఆంజనేయస్వామి వొకపాదం మా వూరి దగ్గర పెట్టి కొండమిందికి ఎగిరినాడంట! అందుకే మా వూరు ఏకపాదంపల్లి అయ్యింది. మొరటోళ్ళు ఏకునాదంపల్లి అని అంటారని ఆ యప్ప వాళ్ళ వూరిపేరును గురించి చెప్పితే నేను విన్న్యాను. ప్రతొక్క వూరిపేరుకూ యాదో వొగ కథ వుంటాదనుకుంటా నడుస్తావుండాను.

ఆ రోడ్డుకి ఇరువైపులా అద్భుతమైన చేన్లు. శెనిక్కాయ పాసి గుంటకలతో తిరగదోలి పైకాయలన్నీ ఆసాములు యేరిపిచ్చుకొని ఈటిడిసినారేమో, అక్కడక్కడ చేన్లలో పేదోళ్లు పెంకుల్తో న్యాలను కెెల్లగిచ్చుకుంటా శెనిక్కాయలు యేరుకుంటావుండారు. వాళ్లను చూసి మేము గుడకా ఇట్లనే గదా శెనిక్కాయలు గెదిరేది, తొందరగా మాల్యవంతం చేరుకొని అన్నీ సగేసుకొని రేప్పొద్దున్నుంచి ఆ పనిలో మునిగిపోవల్లని అనుకుంటా కడాకు మద్యానానికంతా మాల్యవంతం చేరుకుండాం.

మాల్యవంతం వూరు మా వూరి మాదిరి కాకుండా జోరుగా వుంది. దొడ్ల నిండా పెద్ద పెద్ద శెనిక్కట్టి వాములు. అన్నీ మంచి మంచి గారమిద్దెలు. అనంతపురంలో రఘువీర సినిమా టాకీసు నేను చూల్లేదు కానీ దాని షావుకారి వెంకటరెడ్డిది మాల్యవంతమేనంట! వాళ్ల ఇల్లు చాలా గాఢాగా వుంది.

మేము ఏడెనిమిది మంది ఆంజనేయస్వామి గుడిలో దిగినాం. మూటాముల్లీ గుడికాడ పెట్టి అందరూ పొయిలో పుల్లలు తెచ్చేకి వూరిబయటకిపోతా నన్ను సామాన్ల దగ్గర పెట్టి పోయినారు. గుడికాడుండే మనుషులు నన్ను యావూరంటూ వివరాలు అడిగినారు. నేను చెప్పినాను. పాపం అంతదూరం నుంచి వొచ్చినారా? అని అంటా వూరికి తూర్పు పక్కనుండే చేన్లన్నీ మొరుసు న్యాలలని గోకుడు శెనిక్కాయలకు ఆ పొలాలే మేలని మాట సాయం చేసినారు. ఈ గుడికాటి కంటే పీర్లసావిడి అయితే పండుకుండేకి, బయల్లో అన్నం వండుకుండేకి అంతా బాగుంటాదని కూడా చెప్పినారు.

మా వాళ్లందరూ తలాకిన్ని పొయిలోకి కట్టెపుల్లలు యేరుకోనొచ్చినారు. అందరమూ పీర్లసావిడే మేలని ఆటికి చేరుకుండాం. చేదబావి దగ్గరికిపోయి పక్కింటోళ్లను అడిగి బకెట్టూ చేత్తాడు ఇప్పిచ్చుకుండాం. బతుకుదెరువుకోసరం పరస్థలం వొచ్చినారని అడుగుతానే ఆ ఇంటోళ్లు బకెట్టుతో పాటు వొగ పెద్ద సిల్వర్‌ డేక్షా వొక అండా ఇచ్చినారు. మేమందరమూ నీళ్లు చేదుకొని కాళ్లూ మొగాలు కడుక్కొని పయిటాలకు మిగిలిచ్చుకోనుండే బువ్వతిని సద్ది బట్టలు పిండి ఆరేసుకొని సాయంత్రం అన్నం వండుకుండేకి పొయిగుండ్లు తయారు చేసుకుండాం. పీర్ల సావిట్లో రాత్రిపూట పండుకుండేకి, ఆ గోడకింద వండుకుండేకి, అక్కడ వుండే పెద్ద మనుషులను అడుగుతానే వాళ్లు మా వివరాలన్నీ అడిగి మారుమాట్లాడకుండా అంగీకరించినారు. ఎకసక్యాలాడకుండా బతుకుదెరువుకోసరం తమ వూరి దాపుకు వొచ్చినారు మంచి మాగాణి ప్రాంతంలో తొందర్లేకుండా బతికే పల్లెలోల్లు, గోకుడు శెనిక్కాయల కోసరం ఇంత దూరం వొచ్చినారని, అక్కడ ఎలి భూములు ల్యాక చెరువుకు సరిగ్గా నీళ్లురాక కూలి పనులేమీ లేనందువల్లనే ఈ పల్లెలకల్ల వొచ్చినారని మామింద సానుభూతి చుపినారు. ఆ రైతుల మాటలు మాకు సగం ధైర్యం నింపినాయి. రెండు వారాలపాటు దిగులు ల్యాకుండా వుండొచ్చనుకుండాం. చీకటిపడగానే సావిడి గోడకింద పొయ్యిలు అంటిచ్చి, అన్నం వొండుకొని పొద్దుగలుగ తిని పండుకుండాం.

చలికాలం, తలుపులు లేని సావిడి, చలి పెడుతుందేమో, బతుకుదెరువు కోసరం పర స్థలానికి వొచ్చినంక చలైనా, ఎండైనా భరించక తప్పదు కదా! కలిగినోళ్లు యాటికిపోయినా వుండూరి సుఖమే పొందుతారంట! అదే వుంటే ఈ అవస్థలంతా యాలుంటాయి? అనుకుంటా ఆడోళ్లొగ పక్కా మొగోళ్ళొగ పక్కా ఇరుక్కోని పండుకుండాం. దూరాబారం నడచడం వల్ల వొగరి పక్క వొగరు ఇరుక్కోని పండుకోవడంవల్ల వెచ్చగా వుంది. ఎప్పుడు నిద్రపోయినామో లేచేటప్పటికి తూర్పున తెల్లగా అయింది.

లేచి, గబగబా పొయ్యిలంటిచ్చి అన్నానికి పెట్టినాం. ఇటిక పెల్ల వొగ బండకు రాకి, రాలిన నున్నని ఇటుకపొడితో పండ్లు తిక్కోని ముఖాలు కడుక్కొనే లోపల అన్నాలు వుడికినాయి. గంజి వొంచి వేడివేడి పొయ్యిల మీదనే రోంత సేపు వుమ్మగిలిచ్చి తడిపిన సద్ది బట్టల పైన అన్నం గుమ్మరిచ్చి అమ్మిడి పొద్దుకు పయిటాలకు సరిపోయేటంత చింతతొక్కు చిట్లంపొడి అన్నంలో వేసుకొని, సద్దికట్టుకొని పెంకులు తీసుకొని మిగిలిన సామాన్లన్నీ రెండు మూటల్లో సర్దిపెట్టి దుప్పట్లు, రగ్గులు కప్పి చేన్లకు బయలుదేరినాం.

మంచు కురిసి, చలి పెడుతున్న్యా, అన్నం వండుకునే పనిలో తొందరగా చేన్లలోకి పోవాలనే ధ్యాసలో యా చలీ అనిపిచ్చలేదు. అందరమూ తాడిపర్రి రోడ్డుమీద రోంత దూరం నడిచి, ఈటిడిసిన వొగ పెద్దచేను పట్టెలోకి పోయినాం. అద్భుతమైన ఎర్రమొరుసు న్యాల. తలావొగ పక్కపోయి సంచులు, సద్దులు అన్నీ వొగగట్టు మింద పెట్టి ఇనప్పెంకులు తీసుకోని శెనిక్కాయ గోకేకి వొంగినాం.

వొంగి, పెంకులతో మట్టి గెదరడం నాకురాదు. అందుకే నడుముకు టువ్వాలు గుడ్డను ఒడిగట్టుకొని, కొక్కిరికాళ్ళమింద కూర్చొని ఇనప్పెంకుతో మట్టిని గెదిరి కాళ్లదెగ్గిరికి చిమ్ముకుంటా అడుగుల ముందుకేసుకుంటా పోతాండాను. ఒక్కొక్కసారి వొగ పెంకుమట్టిని కాళ్ల దగ్గరికి చిమ్ముకున్నెప్పుడు రెండు మూడు, ఒక్కొక్కసారి ఐదారు పెంకులకు ఒగటీి రెండు కాయలు బయటపడతాండాయి. కాయలు బొటికలు కాకుండా బాగా నిండుగా పెద్దగా వుండాయి. పెంకుకు ఒక్కొక్కసారి నాలుగైదు కాయలు కనిపిస్తాండాయి. కనిపిచ్చినప్పుడల్లా మనసుకు వుల్లాసమైతాంది. వొంగిన గంటసేపటికల్లా వొడినిండింది. గోనిసంచిలో పోసొచ్చినాను. సుమారుగా రెండు సేర్లుంటాయి.

ఎండ బాగా కాస్తా వున్న్యా చలికాలం కదా, నీరెండ వెచ్చగా సుగిచ్చినట్లు వుండాది. కాయలు ఆ మునంలో బాగా కనిపిస్తావుండాయని మల్లా ఆటికే పోయినాను. అమ్మిడి పొద్దుకల్లా నాలుగు శేర్లన్ని శెనిక్కాయలు జమచేసినాను. రామాంజినేయులు, అంజినమ్మ కూడా నాలుగైదు శేర్లు జమచేసినారు. అందరూ అమ్మిడిపొద్దు బువ్వ తినేకని లేచి నా సంచి దగ్గరికి వొచ్చి చూసి అందరికంటే నారాయణగాడు మేలు గదరా, అప్పుడే ఐదారు శేర్లు గోకినాడు! చదువుకుండే పిల్లనాయాలయినా బొగు వుశారయినోడిరా అంటూ నారాయణ చిన్నాయన నన్ను పొగడబట్టినాడు. ‘అదేం కాదులే చిన్నాయనా! రామాంజినేయులు, అంజినమ్మ నాకంటే ఎక్కువ గెదిరినార’ని వాళ్ళ సంచుల్ని చూపినాను.

అమ్మిడిపొద్దు బువ్వ తినుకుంటా ఆ ప్రాంతంలో శెనిక్కాయ పంటను గురించి, ఆ నేలల్నీ, రైతుల్నీ గురించి మాట్లాడుకుంటా, కాలావతన నాలుగైదు వానలు పడితే శెనిక్కాయపంటంత సలీసయింది ఇంగ యాదీ లేదనుకుంటా రోంతసేపు సేదదీర్చుకొని మల్లా చేన్లోకి పోయినాం.

సాయంత్రానికల్లా ఒక్కొక్కరూ పదీ పదైదు శేర్లు మూటగట్టుకొని వూర్లోకి బయలుదేరినాం. గోకుడు శెనిక్కాయలు కొనుక్కుండే శెట్టిగార్లు, మనుషుల్ని వెంటబెట్టుకొని ఎదురయ్యి, శెనిక్కాయలు కొనుక్కుంటాం వేస్తారా? అని అడిగినారు. మేము రేటడిగినాం. శేరు పావలా అన్న్యారు వాళ్లు. కొలతలు యెట్లుంటాయో శేరు చూపమన్న్యాం. వాళ్ళు చూపిచ్చినారు. కంట్లం పెంచినశేరు! అది అంత పెద్దశేరా? కరెక్ట్‌ శేరుతో కొలుచుకుంటే వేస్తామని చెప్పినాము. శెనిక్కాయల్లో తాలూ తరకా వుంటాదని అందుకే మామూలు శేరు కన్నా ఇది వొగ పిడికెడు కాయలు ఎక్కువుంటాదప్పా అంతే! అని శెట్టి నిజాన్ని వొప్పుకుంటా, దానికి తాలూ తరకా వుంటాయనే సాకు చెప్పినాడు.

మా బోయ నారాయణ అసాధ్యుడు కదా! గవర్మెంట్‌ ముద్ర వుండే శేరు తెచ్చినట్లుంది. దీనితో కొలుచుకుంటే శెనిక్కాయలు నీకే వేస్తామన్న్యాడు. శెట్టి తన శేరుతో శెనిక్కాయలు కొలిచి బోయ నారాయణ శేరులోకి పోసినాడు. పిడికెడు కాదు, కణికెడు కాయలు తేడా వుంది. ‘వోరినీపాసుగులా, పతొక్క శేరు మిందా కనికెడు కాయలు యెక్కువ తీసుకుంటే నాలుగు శేర్లకు వొగశేరు అగనాగ్గా పోతాయి గదయ్యా! అట్లయితే శేరుకు ఐదనాలు యేసుకో! అని మెల్లగానే శెట్టిని తగులుకుండాడు నారాయణ. కడాకు ఆ శెట్టి శేరుతోనే శేరు నాలుగున్నర ఆనాల ప్రకారం కొలుచుకున్నాడు. నావి పద్నాలుగు శేర్లయినాయి. నాలుగు రూపాయలు చేతికొచ్చినాయి. చాలా సంతోషమయ్యింది.

ఆ రకంగా ఆటిడుపు ల్యాకుండా పదైదు దినాలు గోకుడు శెనిక్కాయలు యేరుకొని అమ్ముకుండాం. వొక్కొక్కరికి రోంత ఎక్కువ తక్కువ అరవై రూపాయలు చేతికొచ్చాయి. మంచి కూలే అనిపిచ్చింది. దుడ్లను చూసి ఇంగా వొగ పది దినాలుంటే నూర్రూపాయలు తీసికోని పోవచ్చునుకుండాను. కానీ మనసు ఇంటిపక్క పీకింది. ఇంటందర్నీ చూడల్లనిపిచ్చింది. పైగా దినామూ శెనిక్కాయలపొడీ, చింతతొక్కు తినీతినీ నాలుక చెడిపొయ్యింది. తెచ్చుకో నుండే జతబట్టలు ఎర్రమట్టి దుమ్ముతో శానా మాసిపోయినాయి. మధ్యలో సందకాడ పూట రెండుసార్లు వొగ తోట బాయికాడ స్నానంచేస్తా బట్టలు పిండేసుకుండాను. అయినా, మంగు తేలినాయి. దినామూ చలికి వొనుకుతా చేన్లలోకి పోయి, బిగుసుకో నుండే చేతుల్తో ఇనప్పెంకు పట్టుకొని పుట్లకొద్దీ మన్ను గెదిరి చలికి అందరికీ కాళ్లూ, మొగాళ్లు పగిలినాయి. తలకాయ మింద జుట్లన్నీ చింపిరి చింపిరైనాయి. నాకైతే ఇంగొగ రోజు గుడకా వుండబుద్ధి కాలేదు. అందరమూ మాట్లాడుకొని మూటాముల్లే సర్దుకోని, సాయపడిండే ఇంటోళ్లందరికీ చెప్పి బయలుదేరి మా బండమీదపల్లి చేరుకుండాం. ఇల్లు చేరుకుంటానే అమ్మయ్య నా మొగం పక్క చూసి కన్నీళ్లు కార్చింది. తమ్ముడూ, దోగాడుతాండే సన్నపాపా మొగమెల్సినారేమో నన్ను చూస్తానే ఎగబడి వొచ్చి కరుసుకుండారు.

(ఇంకా ఉంది)

Exit mobile version