Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాతి పర్రెలలో నుంచి..-15

[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]

కారే పెన్ను, జోబీ అంతా ఇంకు!

ఎనిమిదో తరగతి పూర్తి పరీక్షలు దగ్గరకు వొచ్చినాయి. ఆ పరీక్షల కంటే రెండు మూడు వారాల ముందు ప్రిపరేషన్ పరీక్షలు పెట్టినారు, నేను నార్పలలో కొనుక్కోని తెచ్చుకున్న పెన్ను అప్పుడే కారబట్టింది. స్క్రూ లూజ్ అయిందని, లూజ్ అయిన స్క్రూకు దారం చుట్టి పెన్నుకు పెట్టుకుండాను. రెండు దినాలు బాగానే వున్నింది. మూడోదినం ఏమయిందో ఏమో జోబీ అంతా ఇంకు. తీసి చూసినాను. మల్లా లూజ్ అయ్యి ఇంకు కారింది. పరీక్ష రాస్తా వుంటే చేతివేళ్లకంతా ఇంకే. సందకాడ ఇంటికి వొచ్చి బుడ్డిదీపం ముట్టిచ్చి పెన్ను కడుపుని దీపంపైన వేడిచేసి వొత్తినాను. వేడి ఎక్కువైందేమో కడుపు పైభాగం అంతా సొట్టబోయింది. దాన్నిచూసి భలే బాధయింది. రేపు పరిక్ష ఎట్లా రాయల్లనో దిక్కు తెలియక ఒగ పాతపెన్ను ఇమ్మని బచ్చు నాగభూషణాన్ని అడిగినాను. అడుగుతానే పాత పెన్ను ఇచ్చినాడు నాగభూషణం. ప్రిపరేషన్ పరీక్షలు అయిపోయినాయి. నాకు మార్కులు బాగా వొచ్చినాయి.

మా ఊరి లక్ష్మీనరసయ్య సార్ దగ్గరుండే ఎర్రపెన్ను లావుగా భలే ఉంటాది. నాలుగు ఐదు సమ్మత్సరాల నుంచి ఆ సార్ దగ్గర అదే పెన్నుంది. అది యానాడూ కారలేదు! అట్లా పెన్ను తీసుకుంటే ఎంత బాగుంటాది! అట్లా పెన్నుతో పరీక్షలు బాగా రాయచ్చని అనుకుంటా నాగభూషణం ఇచ్చిన పెన్నును చాలా జాగ్రత్తగా వాడుకోసాగినాను. వొగనాడు కోనయ్య నా దగ్గరుండే పెన్నిప్పిచ్చుకొని ఏమి చేసినాడో ఏమో పనికిమాలినోడు, సన్నగా గుండ్రంగా గసాల గింజంత ఉండే పెన్ను నాలుకను (స్టీలు) ఇరగ్గొట్టి గబ్బులేపి యెనక్కిచ్చినాడు. దాంతో అక్షరాలు రాసి చూస్తే ఒగొగ అక్షరం, పేపర్ మింద, చచ్చిపోయిన కప్పమాదిరి కనిపిచ్చింది. చూస్తానే బాధ అయింది. కోపం వొచ్చింది. కోనయ్యతో కొట్లాడల్లని అనుకుండాను. ‘యాడన్నా కొల్లబోనీలేప్పా, యెబ్బుడు బోయినా లేదనకుండా మజ్జిగ పోసేటోళ్లు వాళ్లు. అట్లా వాళ్ల ఇంటికి పోయి కొట్లాడుతావా? ఇంగొగ నాలిక కొనుకుందువులే’ అంటా అమ్మయ్య నన్ను వారిచ్చింది.

పూర్తి పరీక్షలు వొచ్చినాయి. ఆ లోపల రెండు పెన్నులు మార్చినాను. యా పెన్నూ రెన్నాల్లుండదు. స్క్రూ లూజు కావడమో, నాలిక పాయింట్ విరిగిపోవడమో యాదో వొగ సమస్య. మంచి పెన్ను కొనల్లంటే నాలుగైదు రూపాయలు పెట్టల్లంట. ఈ ఎండల కాలం శెలవుల్లో వెంకటాపురానికో, కొర్రపాడుకో తోటలో పనికిపోయి, కూలి తెచ్చినప్పుడు నాయనను అడిగి వొగఐదు రూపాయలు ఇప్పిచ్చుకొని మంచి పెన్ను కొనుకోవల్లని అనుకుంటా పరీక్షలు రాసినాను. రాసే లోపల జోబీకి చెక్కుకోనుండే పెన్ను కారి, జోబీ అంతా ఇంకు అంటుకోవడంతో నాలుగైదుసార్లు అమ్మయ్య పిండేసింది. పరీక్షలు అయిపోయిన కడారోజు హెడ్మాస్టర్ సార్ ఇంటికి పోయి, సార్ భార్య జయమ్మక్కతో పొయ్యొస్తానక్కా అని చెప్పినాను. అంతకుముందు ఏడెనిమిది సార్లు సారోళ్ల ఇంటికి పోయి సార్ పెద్దకొడుకు రవీంద్రని యెత్తుకొని తిరిగి ఆడిచ్చినాను.

సారోళ్లు, మా వూరికి పోయేదారిలోనే, సాంబయ్య వాళ్ల ఇంట్లో వొగపక్క బాడుగకు ఉండారు. ఆయనింటికి ఎదురుగానే ఘట్టప్పోళ్ల ఇల్లు. ఇద్దరివీ పెద్దపెద్ద గారమిద్దెలు. రెండింటికీì కమాండ్లు తిప్పి కట్టిన పెద్దవసారాలు. ఇద్దరూ బాపనోళ్లు. పెద్ద షావుకార్లు. ఘట్టప్ప శింగనమల పంచాయతీ ప్రెసిడెంట్. సాంబయ్య ఎప్పుడూ గ్లాస్కోమల్లు గోసిపంచ కట్టుకొని ఉత్తపయితో వుంటాడు. ఎర్రని భారీ శరీరం. లూజుగా ఉండే పెద్దకడుపు మింద జందెం. జందెంతో మాటిమాటికి వీపు రుద్దుకుంటా వుంటాడు. మనుషులతో మాట్లాడుతా నవ్వితే చంటి పిల్లోళ్ళు కిర్లుకొని బిత్తిరిపోయి ఏడుస్తారంట! నవ్వు ఎక్కువైనప్పుడు దాన్ని ఆపుకుండేకి పక్కనుండే మనిషి వీపుమింద అరచేతితో ధన్‌మని చరుస్తాడంట! ఆ దెబ్బకు వీపు విమానం మోత మోగుతాదంట! పక్కన మనుషులెవురూ ల్యాకుంటే వొచ్చే నవ్వును ఆపుకుండేకి అరచేతితో బండమీద చరుస్తాడంట! అట్లా చరిచినప్పుడు ఒగసారి బెలుబ్బండ పగిలిపోయిందంట! ఆయన నవ్వుతావుంటే పొట్టంతా తైతక్కలాడుతాదంట! ఆ సంగతి అంతా జయమ్మక్క చెపుతా వుంటే నేను, నా జతగాళ్లు బాలన్నా, తిప్పన్నా పగలబడి నవ్వినాం.

జయమ్మక్క శెలవులకు వెళ్లిపోతాండే మా ముగ్గురికీ వొగొగరికి కణికెడు పులగం పెట్టింది. అది, మా ఇండ్లల్లో సంక్రాంతి పండుగనాడు చేసే పులగం మాదిరి కాకుండా, అద్భుతమైన రుచితో ఉంది. దాన్ని అరవోళ్ళ పొంగల్ అని అంటారంట! కలిగినోళ్లు ఎన్నెన్ని రకాల తిండి తింటారో అనిపిచ్చింది నాకు. ఊర్లకు బయలుదేరి పోతా ఉండేñ నన్నూ, బాలన్ననూ చూస్తా, శెలవుల మధ్యలో అప్పుడప్పుడు వొచ్చి పోతా వుండండప్పా, అని ప్రేమగా చెప్పింది జయమ్మక్క. మేము సరే, అని బయలుదేరినాం.

మా ఊర్లోకి రోడ్డు-శ్రెమదానం

అనంతపురం-తాడిపత్రి రోడ్లో నుండి మా ఊర్లోకి రావల్లంటే రెండు ఫర్లాంగుల దూరం ఉంటాది. బండి జాడంతా అద్దుమానంగా ఉంటాది. ఊర్లోకి బండి రావల్లన్నా జీపులు అట్లాటివి రావల్లన్నా కొత్తోళ్లు రాత్రిపూట వొచ్చి పోవల్లన్న్యా బొగు యెడాముడిగా వుంటాది. బండిజాడ గుడకా సరిగ్గా లేదు. ఊర్లోకి వొచ్చే బండిజాడ ఊరగొండ దడికి ఆనుకోనుంటాది. అందుకే నాలుగైదుచోట్ల కొండదడిలో నుండి వొచ్చిండే పెద్దబండలు, బండిజాడలోనికొచ్చి తేలిపోయినాయి. దాండ్లను పీకెయ్యల్లంటే అయ్యెల్లేదు. చాలాసార్లు బండిజాడకాడ తేలిపొయ్యిండే బండలమింద బండి చక్రాలు తొసికి, బండ్లు వాటపడతా వుంటాయి. అట్లే తూర్పు పక్కన వూరికడద్దనుండీ దిగువమళ్లల్లోకీ, మోతలగడ్డ మళ్లల్లోకీ పోతురాజు కాలువా, సోదనపల్లెల కాలువల దగ్గరుండే బీట్లోకీ మనుషులు, పసువులు, బండ్లు పొయ్యే ‘ఓని’లో గుడకా బండి జాడ అద్దుమానంగా వుంటాది. ఈ రెండు జాడల్ని రోంత వెడల్పుచేసి, మూరడెత్తు మట్టి రోడ్డును వూర్లోళ్లంతా ఇంటికి వొగ మనిషి ప్రకారం శ్రెమదానం జేసి రోడ్డు వేసుకోవల్లని పెద్ద మనుషులు తీరుమానంజేసి దండోరా వేయిచ్చినారు. పనులు లేని కాలం కాబట్టి ఊర్లో వుండే వాళ్లందరూ దానికి వొప్పుకుండారు.

ఒప్పుకోనుండే దాని ప్రకారం శ్రెమదానం పని ప్రారంభమైంది. మొదట అనంతపురం-తాడిపత్రి రోడ్లో నుండి ఊర్లోకి మల్లే (తిరిగే) బండిజాడను తూర్పు వైపు నుంచి పడమటి వైపు నుంచి బండ్లు తిరిగేకి అనుకూలంగా, కిందికి వొంచిండే బకీటు ఆకారములో రెండు వైపులా మూరెడులోతు మట్టిని ఎల్లేసి, రాళ్లు గుండ్లు పాతెయ్యల్లని, ఆట్నుంచి మూడు బారెల వెడల్పుతో రోడ్డు వెయ్యల్లని అనుకుండారు.

పీర్ల చావిడి దగ్గర ఊర్లో వాళ్ళందరూ జమైనారు. సుంకు రంగప్ప, కొత్తపల్లి నారాయణ, వడుగూరు చండ్రాయుడు ఇంగా ఐదారుమంది పెద్దమనుషులు వాళ్ల గేర్లో వుండే ఇండ్లోళ్ల పేర్లన్నీ రాసుకుండారు. ఆ ప్రకారమే అందరూ పారలు, గడార్లు, పికాసులు, తట్ట గంపలు తీసుకొని వొచ్చినారు. మా ఇంటి తరఫున నేను పారతీసుకొని జనంలోకి చేరుకున్న్యాను. మాదిగోళ్లు నలుగురు తప్పెట్లు కొడతా ముందుకు పోతావుంటే వాళ్ల వెనకాల పెద్దమనుషులు, తలార్లు, వాళ్లవెంట జనం బయలుదేరి అందరమూ అనంతపురం రోడ్డు కాటికి చేరుకుండాం. ఆడ, ఊర్లోకి వచ్చే బండిజాడకు కొంచెం ఎడంగా సత్రం పక్కన నాగలకట్ట మిందుండే అశ్వత్థంచెట్టుకు టెంకాయకొట్టి, దేవునికి మొక్కుకుండారు పెద్దమనుషులు. అట్లే రోడ్డు పనిమొదలు పెట్టేచోట గుడకా ఇంకొగ టెంకాయ కొట్టినారు.

అమ్మిబిడి పొద్దయితాంది, తప్పెట్లు మోగుతా ఉండాయి. బండి జాడకు ఇరువైపులా కోపులు పెట్టి గడార్లతో, పికాసులతో మన్ను తొగేవాళ్లు తొగుతావుంటే, పార్లతో మట్టిని ఎల్లేసేవాళ్ళు ఎల్లేస్తావుంటే కొండదడిలో చిన్నచిన్న గుండ్లను, రాళ్ళను గడార్లతో పైకి కెల్లగిచ్చేవాళ్ళు కెల్లగిస్తావుంటే, ఆ గుండ్లను, రాళ్ళను మోసుకుని వొచ్చే వడ్డె వాళ్లు రోడ్డు ఇరవై అడుగుల వెడల్పు వుండేటట్ల పురికోసుతో కొలతపెట్టి ఆ పక్కన కొంతమంది ఈ పక్కన కొంతమంది పునాది గోడల్ని కట్టినట్ల రెండు అడుగులు ఎత్తు కడతావుంటే గోడల మధ్యలో నల్లగుండ్లు వేసేవాళ్లు వేస్తావుంటే, రాళ్ల మధ్యలోకి ఎర్రగరుసు గంపలతో తెచ్చిపోసేవాళ్ళు పోస్తావుండారు. ఇరవై ముప్ఫైమంది ఆడోళ్లు కడవలతో నీళ్లు తెచ్చి గరుసు మీద చల్లుతా వుండారు.

సత్రానికి రెండు వైపులా రెండు పగ్గాల దూరంలో ఊరగొండ దడికింద రెండు చెలిమలు ఉండాయి. తూర్పు పక్కనుండే చెలిమలో నీళ్లు పసువులు తాగేకి అనుకూలంగా ఉండాయి. ఈ చెలిమకు మూడు పక్కల ఏడెనిమిది అడుగుల లోతులో నుంచి కాలుపు రాళ్ల కట్టడం కట్టినారు. కట్టడంలేని వైపు నుండి నీళ్లు ఎండల కాలంలో గుడకా పారుతావుంటాయి. అందుకే ఆడ, గన్నేరు చెట్లు భలే పూలు పూస్తావుంటాయి. ఇంకొగ చెలిమ, సత్రానికి పడమర పక్కన ఊరివైపుండాది. దాంట్లో నీళ్లు టెంకాయ పాల మాదిరి కమ్మగా ఉంటాయి. అవి తాగే నీళ్లని, దాని అంచల పంచల ఎవురూ రొంటాలకు కుచ్చోరు. ఆడోళ్ళు రోడ్డు గరుసు మింద చల్లేకి ఆ చెలిమలోనుంచే నీళ్లు ఎత్తుకొని వస్తావుండారు.

పయిటాల కల్లా వొగ అర్ధఫర్లాంగుకు పైగానే మా ఊరికి ఇరవై అడుగుల కొత్త రోడ్డు తయారయ్యింది. ఆ ప్రకారంగా పెద్దమనుషుల పట్టుదలతో జనమంతా మూడు దినాలు సొంత పొలం దున్నుకున్నెట్ల ఉడుంపట్టు పట్టి శ్రెమదానంతో మా ఊరికి రోడ్డు వేసుకుండాము. అదే ఊపుతోనే మా ఊరి ఓనిలో పది అడుగుల వెడల్పుతో రెండు దినాలు పోరాడి భద్రంగా బండిబాటను వేసినాము. మా ఊరి పెద్దమనుషులు శ్రెమదానం చేసిన వాళ్లందరికీ నాగలకట్ట చెట్టుకింద కడాదినం గట్టిపాశికం పెట్టిచ్చి ఊరోళ్ల ఐకమత్యాన్ని పొగిడినారు. పొగడుతా, గోవిందరాయుని పేటోళ్లూ, శివపురమోళ్లూ చుట్టుపక్కలుండే చాలా పల్లెలోళ్లు, మన మాదిరే వాళ్ల వూర్లల్లో శ్రెమదానంతో రోడ్డు వేసుకుండారని, ఇట్ల వేసుకుంటే వూరందరికీ అనుకూలమని చెప్పినారు.

ఎండాకాలం సెలవులు పనీ పాటా లేకుండా ఊరకనే గడిచిపోతావుంటే నేను మనసులో బాధపడసాగినాను. ఇంట్లో వుండే తిండి గింజలు దిన దినానికీ తగ్గిపోతా వుంటే, మనసులో దిగులు పట్టుకుంది. మల్లా బడి వాకిలి తీసేలోపల బత్తెం గింజలన్నీ అయిపోతే, వొచ్చే వానకాలంలో చెరువుకు నీళ్లు రాకపోతే, నా చదువు ఎట్లయితాదో అనే దిగులు నిరంతరము మనసులో మెదలుతానే ఉంది. నీలంపల్లి, ర్యాగడికొత్తూరు పల్లెల్లో మూడు నాలుగు దినాలుండి వొస్తే, వొగపక్క నేను తినే తిండిగింజలు మిగులుతాయి. ఇంకొగ పక్క పల్లెల్లో కమ్మగా నేనూ తినొచ్చు అనుకుంటా, ప్రతివారమూ పొయ్యేకి వూకిస్తా వుండాను. కానీ నాయన ప్రతివారం నన్ను పిలుచుకొని పొయ్యేకి వెనకంజ వేస్తావుండాడు. వారానికి మూడు నాలుగు దినాలు మాకు ఇద్దరికీ అన్నం పెట్టేకి వాళ్లు ఇబ్బందిపడొచ్చునని నాయన బిడియ పడతా ప్రతివారం తనెంట నన్ను పిల్చుకొని పోవడం లేదు. పైగా తమలపాకులు గుడకా ఇంతకుముందు మాదిరి అమ్ముడుపోవడం లేదని భూదేవి పచ్చగుంటేనే పల్లెలు కళకళలాడుతా వుంటాయని, అవి కళకళగా వున్నప్పుడే జనం సంతోషంగా వుంటారని, అప్పుడే గంపల వ్యాపారాలు దిగులు ల్యాకుండా జరుగుతాయని నాయన పల్లెల పరిస్థితులను గురించి చెప్పినాడు. నాయన మాటలు వింటా పల్లెల పట్నాల అభివృద్ధికి వర్షమే ప్రధానమైనది అని అర్థమైంది నాకు.

తోటా, దొడ్డి లేని పల్లెల్లో ఎండాకాలమంతా ఆటిడిపే! ఎవురికీ పనులుండవు. బయల్నాటకాలు, నాటకాలు, తోలుబొమ్మలాటలు పల్లెల్లో ఇట్లాటప్ప్పుడే ఆడేది. మా ఊరికి తోలుబొమ్మలాటోళ్లు సవారి బండి కట్టుకొని పిల్లాజల్లా వొచ్చి పెద్దమ్మ గుడి యాపచెట్టు కింద దిగినారు. ఊర్లో వుండే పెద్ద మనుషులందరినీ కలిసినారు. ఒరుపు వొచ్చినప్పుడు పల్లెల్లో రామాంజనేయయుద్ధం, కృష్ణరాయబారం అట్లాటి నాటకాలు, తోలుబొమ్మ లాటలు ఆడిస్తే ఊరికి మంచి జరుగుతుందని పల్లెలోళ్ళకు వొగనమ్మకం. అందుకే పెద్ద మనుషులు తోలుబొమ్మలాట, దినం యిడిసి దినం రెండు ఆటలు ఆడిచ్చేకి ఒప్పుకుండారు.

తోలుబొమ్మలాట – బంగారక్క, పిల్లేబిత్తిరిగాడు

మా ఊర్లో యా ఆట ఆడినా ఉప్పర భీసన్నోళ్ల ఇంటి గోడపక్కన తూర్పు ముఖంగా వుండే ఖాళీ స్థలంలోనే ఆడేది. ఆ స్థలంలో బొమ్మలాటోళ్లు స్టేజి వేసుకొని, స్టేజి మింద చెక్క పలకలు పొందిచ్చినారు. ముందుపక్క తెల్లని పంచలు రెండు, పిన్నీసులతో జమటగాచేసి రెండువైపులా ఇగ్గి కట్టినారు. అది తెల్లని తెరమాదిరయ్యింది. తెర వెనకపక్క స్టేజీ పైన రెండు పెట్రోమాక్సు లైట్లు వేలాడదీసినారు.

చావిడి ముందర ఉండే బయలంతా చెత్తా, చెదారమూ ల్యాకుండా పెద్ద మనుషులు యెట్టోళ్ళతో వూడిపిచ్చి సందకాడే నీళ్లు చల్లిచ్చినారు. జనం అంతా ఎగబడి మేము ముందంటే, మేము ముందంటా చాపలు పరుచుకుండారు. ముసలీ ముతకోళ్లు, పెద్దోళ్లు కూర్చుండేకి, బయలుకు ఆ పక్కా ఈ పక్కా మంచాలు వేసుకుండారు. అందరూ పొద్దుగలగ బువ్వతినొచ్చి బొమ్మలాట స్టేజిముందర వాలినారు. నేనూ, పెద్దక్కా రోంత ముందరపక్కనే చాపలు పరిచి, సైడుకు, అంజినప్పోళ్ళ దాని పక్కన మంచం గుడకా వేసినాం. తొంభై ఆమడపోయి తోలుబొమ్మలాట చూడల్లని అనుకుంటా మా చుట్టు పక్కల పల్లెలోళ్లు సుమారుగా వొచ్చినారు.

బొమ్మలాట మొదలయ్యింది. తెరమీద వినాయకుని బొమ్మ కనిపిచ్చింది. తాళాలు, డోళ్లు కొడతా “పారా బ్రహ్మ పరమేశ్వర” అని లోపల ఆడోళ్లూ, మొగోళ్లూ ప్రార్థన చేసినారు. ఆ తరువాత తెర మింద రెండు బొమ్మలు మాట్లాడుతా చేతులూ, కాళ్లూ కదలాడిస్తా వుండాయి. చిన్న పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తా ఉండారు. తోలుబొమ్మల రూపాలు రంగులు తెరమీద ఎంత అందంగా కనిపిస్తా వుండాయో! ఆ బొమ్మలు రెండూ పిల్లే బిత్తిరిగాడు, బంగారక్కలంట! బంగారక్క యెగుర్లాడుకుంటా పోతావుంటే, పిల్లేబిత్తిరిగాడు అడ్డం వొచ్చి యాటికే అంత సంబరంగా పోతాండావు అని అడిగినాడు. ‘పిలక జుట్టోనికి నీకేం తెలుసు మామా? ఈ పొద్దు మనూర్లో మా సుంకు రంగప్ప మామ, ఆయన జతగాళ్ళు ‘సీతాపహరణం’ అనే తోలుబొమ్మలాట ఆడిస్తా వుండారు. నేను చూసేకి బిరీన పోవల్ల తీ మామా’ అంటా, బంగారక్క ఆత్రపడతా వుంది. ‘నేను ల్యాకుండా నువ్వొగదానివే ఎట్లపోతావే బంగారీ? ఆడ ఆటచూసేకి వొచ్చిన పోకిరీగాళ్లు నా బంగారుని ఎత్తకపోతే నేనెట్లా బతుకుదునే? నువ్వుంటే, ఇల్లంతా బంగారే! నీ యెంట నేనూ వస్తానే బంగారీ!’ అని బంగారక్క వెంటపడినాడు. పిల్లేబిత్తిరిగాడూ (కేతిగాడు), బంగారక్కల మాటలను బట్టి బొమ్మలా టోళ్ళు ‘సీతాపహరణం’ అనే ఆటను తోలుబొమ్మలతో ఆడిస్తారని జనానికి అర్థమయ్యింది.

పిల్లేబిత్తిరిగాడూ (కేతిగాడు) బంగారక్కా పక్కకు వెళ్ళిపోతానే సీతారామ లక్ష్మణులు తెర మిందికి వొచ్చినారు. ఎంతందంగా వున్నాయో బొమ్మలు! తెరమిందికి వాళ్ళు వొచ్చేటప్పుడు బొమ్మలాటోళ్ళు కొట్టే వాయిద్యాలు, పాడేపద్యాలు వింటా చూసే జనం నిజ్జంగా అడవి దగ్గరికిపోయి చూసినట్లయి సంతోషపడసాగినారు. ఇంగ£ రావణా సురుడు వచ్చేటప్పుడు చేసిన వాయిద్యాల శబ్దం, నిద్రబోయే వాళ్లను లేపింది. పది తలకాయల రావణాసురుని బొమ్మను ఎంత అద్భుతంగా చేసినారో! జరిగే కథను చెబుతా, మధ్య మధ్యలో రాగాలు తీస్తా, దానికి అనుకూలంగా పలకల మింద పాదాలతో తొక్కుతా, తాళాలను వాయిస్తా వుంటే బొమ్మలాటోళ్లు గొప్ప పనివంతులు అనిపిచ్చింది నాకు. పిల్లాపాపలు ముసలీ ముతకోళ్లు అందరూ తమ బతుకును బాధలను, కష్టాలను, కన్నీళ్లను అన్నీ మరిచిపోయి తోలుబొమ్మలాటను చూసినారు. మనుషులు నిద్రపోకుండా మధ్య మధ్యలో పిల్లేబిత్తిరిగాడు బంగారక్క వొచ్చి తమాషాగా, ఎగసక్యంగా, సరసంగా రోంత శృంగారంగా మాట్లాడుతా అందర్నీ భలే నవ్విచ్చినారు.

రెండు దినాలు ఆడిన తోలుబొమ్మలాట, సీతారాముల కథ చదువురానోళ్లకు గుడకా తెలిసేటట్టు చేసింది.

భక్త ప్రహ్లాద నాటకంలో నా వేషం కత!

తోలుబొమ్మలాటోళ్లు బొమ్మలాట ఆడిపోయినంక మా ఊరోళ్లు వొగ నాటకం నేర్చుకొని వెయ్యల్లనుకున్న్యారు. మా ఊర్లో మా కులస్తుడైన మా మామ, హార్మోనిస్టు అంజినప్ప, జిల్లాలోనే లెక్కకొచ్చిన గొప్ప హార్మోనిస్టు! ఆయన పీసపాటి, షణ్ముఖం ఆంజనేయులు అట్లా పెద్ద డ్రామా యాక్టర్లకే హార్మోనియం వాయిచ్చినాడంట! ఆ మామ దగ్గర పెట్టె మాదిరుండి, పైకి లేచే హార్మోనియం పెట్టే వుంది. వొగ కుర్చీ మింద కూర్చొని కాళ్లతో గాలితిత్తి పలకలను తొక్కుతా వుంటే గాలి హార్నోనియం పెట్టెలోకి పోతుందేమో, కీ బోర్డు మింద వేళ్లు పెట్టి వొత్తితే అవి సరిగమలు పలుకుతాయి. అట్లాంటి హార్మోనియం వాయించే దాంట్లో మంచి పేరుండే అంజనప్ప మామ, మా ఊర్లో వొగ జట్టును తయారుచేసి భక్త ప్రహ్లాద నాటకం నేర్పిస్తా వుండాడు. అందులో నన్ను ప్రహ్లాదుని వేషం వెయ్యమన్నాడు. నాకేమో ఇష్టమే గానీ, వేషం వేసేవాళ్ళు వొగొగరు వొగ మూట వడ్లు అంజనప్పకు ఇచ్చేకి ఒప్పుకుండారు. మూట వడ్లు అంటే మాటలా? వద్దన్న్యాడు మా నాయన. ‘నాటకంలో నా కొడుకు యేసేది సన్న యేసికం వొగ అర్ధమూటొడ్లిత్తాము లే అన్నా’ అని అంజనప్ప మామను వొప్పిచ్చింది అమ్మయ్య.

నాటకం నేర్పిచ్చేది రాత్రిపూట, మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో. వేషాలు వేసే వాళ్లల్లో నేనూ, గాండ్లపర్తి వెంకటరెడ్డీ ఇద్దరమే చదువుకున్నోళ్లం. మిగతా వాళ్లందరూ చదువురానోల్లే. నాకు రెండు పద్యాలు, నాలుగు డైలాగులు ఒగ పాట రాసిచ్చినాడు అంజనప్ప మామ. “కమలాక్షు నర్చించు కరములే కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ” అనే పద్యం భాగవతంలోనిదని మా ఊరి నారాయణరెడ్డి మామ భాగవతం పుస్తకంలోని పద్యాన్ని చూసి దాన్ని యెత్తి రాసుకోమన్న్యాడు. నేను ఆ పద్యాన్ని ఎత్తి రాసి, రాత్రి అంజనప్ప మామకు చూపిచ్చినాను. ఆ మామ కోపగిచ్చుకుని ‘పుస్తకాల్లో వుండే పద్యాలకు నాటకాల్లో వుండే పద్యాలకు తేడాలుంటాయి ఓయ’ అని దండిచ్చినాడు. అప్పటినుంచి ఆ మామకు నా మింద కోపం.

నేను భాగవత పుస్తకంలో వుండే పద్యాన్ని కంఠస్థంచేసి, రాత్రి హార్మోనియం ముందు బీంప్లాస్ రాగంలో పాడుతా వుంటే ‘నువ్వు చదువుకుండావు గాని, నీకంటే సాకలోడు మేలు రా, ఎన్నిసార్లు చెప్పినా నీకు రాగం రాదోయ్. నువ్వు ఈ వేషానికి తరంగావు’ అని తిడతా మాట్లాడినాడు. నేను యేడ్చుకుంటా యింటికొచ్చి అమ్మయ్యతో చెప్పినాను. ‘ఆ యేసికం యేత్తేనేమి యెయికుంటే నేమి, వద్దు తీరా’ అని అమ్మయ్య చెప్పడంతో నేను మానుకుండాను. మానుకుండానే గాని, ‘నాకు కళ్యాణి, బీంప్లాస్ రాగాలు సరిగా పలికేకి రాదా? భాగవతంలో వుండే పద్యం కరెక్టా? హార్మోనిస్టు అంజనప్ప చెప్పిండే పద్యం కరెక్టా? రాత్రిపూట బాగా భారతాన్ని, భాగవతాన్ని అవలీలగా చదివి అర్థాన్ని వివరించి చెప్పే నారాయణరెడ్డి మామ కంటే హార్మోనిస్టు అంజనప్ప బాగా చదువు కుండాడా?’ అని ఆలోచన చేయసాగినాను. ఆలోచన చేస్తావుంటే పోయిన సమ్మత్సరం వానకాలంలో వానలు రాలేదని. పెద్ద మనుషులు కోరుతానే రామేవాళ్ళ నారాయణరెడ్డి మామ భారతంలోని విరాటపర్వం చదివి అర్థం వివరించేదంతా కండ్లముందు మెదిలింది.

రాత్రి చుట్టుపక్కలుండే ఇండ్లోళ్లూ బోయగేరిలో, కురవగేరిలో వుండే పెద్దోళ్ల్ళందరూ భోజనాలు ముగిచ్చుకొని వొచ్చి చావిట్లో కూర్చుండారు. లైట్ల తిమ్మన్న వెలిగిచ్చి, కింది వరకు వేలాడదీసిన పెట్రోమాక్స్ లైటు వెలుగుతావుంది. గ్యాస్ శబ్దం సుయ్‌మంటా వుంది.

రామేవాళ్ళ నారాయణరెడ్డి గోడకు అనుకొని కూర్చుండాడు. ముందర క్రాస్‌గా ఇంగ్లీషు అక్షరాల్లో ఎక్స్ (X) మాదిరుండే చెక్క పలకలతో చేసిన దానిమీద భారతం పుస్తకాన్ని పెట్టుకుండాడు. ఆ చెక్క పలకల దాన్ని ఏమంటారని నల్లమ్మవ్వను అడిగినాను. అది వ్యాసపీఠం, దాన్ని మొరట భాషలో యాస పీఠం అంటారని చెప్పింది. నల్లమ్మవ్వ, భారతమంతా ఇంట్లో పెట్టుకుంది, నారాయణరెడ్డి చదివే పుస్తకం ఆ అవ్వదే. ఆ పుస్తకంలోని కాగితాలు నొసటికి తగిలే విధంగా తలవొంచి చూస్తా వుండాడు ఆ మామ. పాపం మామకు దగ్గర చూపంట! అంత దగ్గరికి పెట్టుకుంటే తప్ప అక్షరాలు కనిపిచ్చవంట! ‘నువ్వు ఎనిమిదో తరగతి చదివినావు కదా, నువ్వు చదువు రా, నారాయణా’ అని ఎలకంటి సుబ్బయ్య అన్న్యాడు. నేను భయపడతా పోయి చదివేకి ప్రయత్నం చేసినాను. అన్నీ పద్యాలు, వచనాలు. పద్యాల మధ్యలో యేంటివేంటివో అరసున్నలు ఉండాయి. నాకు చదవడానికి చేతకాలేదు. దాంట్లో రాసింది తెలుగే కదోయ్, చదవలేవా? అంటా సుబ్బయ్య మామ గేలిచేసినాడు. నేను సిగ్గుతో తలొంచుకొని వొచ్చి నాయన దగ్గర కూర్చుండాను. ‘భారతం, భాగవతం చదవల్లంటే మాటలేమర్రా. పెద్దపెద్ద చదువులు చదివినోళ్ళే ఆ గ్రంథాల్ని చదవలేరు. ఈ కందమ్మ యెట్ల చదువుతాడు? నా పెద్ద మనవడు బి.ఏ. చదువుతా వుండాడు. శెలవులకు ఊరికొచ్చినప్పుడు వానితో చదివిచ్చుకుందామనుకుంటే వాడే చదవల్యాకపాయ. ఇంగ ఈ పిల్లోడు యాడ చదువుతాడు?’ అని చక్రాయపేట నల్లమ్మ అనడంతో నేను సమాధానపడినాను.

నారాయణరెడ్డి మామ విరాటపర్వం చదవడం మొదలుపెట్టినాడు. సునాయాసంగా సన్నని రాగం తీస్తా, గడగడ ఏడెనిమిది పద్యాలు చదివి ఆటికి నిలిపి, దానికి అర్థం చెప్పసాగినాడు. చెబుతా వుంటే విరాటరాజు నగరానికి దక్షిణవైపున ఆ రాజుగారి ఆవుల మందను కౌరవ నాయకుడు అడ్డగిచ్చి తోలుకొని పోతా వుండే విషయాన్ని కండ్లకు కట్టినట్ల చెప్పడం విని, నేను ఆశ్చర్యపోయినాను. ఉత్తర గోగ్రహణంలో బృహన్నల, ఉత్తర కుమారున్ని సారథిగా చేసుకొని కౌరవ సైన్యంతో యుద్ధం చేయడానికి బయలుదేరేదంకా చదివి బ్రమ్మాండంగా వివరించి, పొద్దుపోవడంతో ఆటికి ముగిచ్చి నాడు ఆ మామ. నాలుగైదు దినాలు మా ఉప్పర అంజనప్ప మామ (హార్మోనిస్టు అంజనప్పకు సొంతం అన్న) పెద్ద కొడుకు మల్లయ్య మామ భారతం చదివితే నారాయణరెడ్డి అర్థం వివరిచ్చి చెప్పేవాడు. ఈ పొద్దు చదవడం, చదివిన దాన్ని వివరించడం రెండు పనులూ వొగడే చేయడంవల్ల కథ ముందుకు సాగలేదు. మల్లయ్య మామ గుడకా తడబడకుండా భారతాన్ని ఎంత అద్భుతంగా రాగం తీస్తా చదువుతాడో! వీళ్లు చదువుకోనుండేది ఐదో తరగతి వరకేనంట! ఎంత గొప్ప చదువులవి! ఐదో క్లాస్కే వీళ్ళు పద్యాలతో ఉండే భారత భాగవతాలను చదవడం, అందులో ఉండే విషయాన్ని కండ్లకు కట్టినట్ల వివరించడం చూసి వీళ్లు ఎంత గొప్పవాళ్లు అని అనుకుండాను. బి.ఏ. ఏం.ఏ. చదివినోళ్లు గుడకా వీళ్ల ముందర పనికిరారనిపిచ్చింది. నేను పై చదువులు చదువుకున్నెంక వీళ్ళ మాదిరి పద్యాల్లో వుండే భారత భాగవతాలను చదవగలనా? చదివి వీళ్లను మెప్పించగలనా? ఏమో, నా అదృష్టం ఎట్లుందో! అనుకుంటా నాయన వెంట ఇంటికొచ్చినాను.

తొమ్మిదో తరగతి నుంచి కాంపోజిట్ లెక్కలు

శెలవులు అయిపోయినాయి. నేను తొమ్మిదో తరగతికి పోయినాను. ఎనిమిదో తరగతిలో ఉండిన స్నేహితులు ఎవురూ చదువు మానేయకుండా నాతోపాటు తొమ్మిదికి వొచ్చినారు. మొదటి దినమే ముందుగాపోయి హెడ్మాస్టర్ సార్‌ను, జయమ్మక్కను పలకరిచ్చినాను. సార్ మా ఇంటి పరిస్థితులను అడిగినాడు. నేను కుల్లాగా చెప్పినాను. ఆయన నేనుండాను లేరా అని ధైర్యం చెప్పినాడు. కొంచెంసేపు సార్ కొడుకులు రవీంద్ర, సురేంద్రలను ఆట్లాడిచ్చి జయమ్మక్క ఇచ్చిన పులిహోరాను తిని, ఎంత అద్భుతంగా ఉందో, యెట్లా చేస్తారో దీన్ని అనుకుంటా సార్ పాదాలకు మొక్కి స్కూలుకు పోయినాను.

వారం దినాలయినంక మాకు ఇంగ్లీషుకు, లెక్కలకు వచ్చే సత్యనారాయణ సార్, కాంపోజిట్ మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ ఎవురెవురు యేది తీసుకుంటారో చెప్పండి అని అడిగినాడు. బాబు, బాలన్నతో పాటు మొత్తం పన్నెండు మంది జనరల్ మ్యాథ్స్ తీసుకుంటామన్న్యారు. వెంకటసత్యం, అశ్వత్థరెడ్డి, గురుగుంట్ల రామచంద్రప్ప, మట్లగొంది రామచంద్రారెడ్డి, శంకరప్ప ఇంకా నలుగురు కాంపోజిట్ తీసుకుంటామన్న్యారు. నేను జనరల్ తీసుకుంటానంటే సత్యనారాయణ సార్ వొప్పుకోలేదు. మ్యాథ్స్‌లో క్లాసులో నువ్వు సెకండో, థర్డో వొస్తావు కదరా, కాంపోజిట్ తీసుకో, ఫర్వాలేదు అని నన్ను వొప్పిచ్చినాడు. నిజానికి సత్యం, బాబు, ఉమావతి తరువాత లెక్కల సబ్జెక్టులో నేను మంచి మార్కులు తెచ్చుకుంటా వుంటాను. వొగొగసారి ఉమావతి కంటే లెక్కల్లో నాకే ఎక్కువ మార్కులు వొస్తావుంటాయి. ఉమావతి కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకుంటే ఆయమ్మకు లేని భయం నాకెందుకు? అని ధైర్యం చేసి కాంపోజిట్ మ్యాథ్స్‌కే మారినాను. కష్టం అనిపిచ్చినా, స్లిప్ టెస్టుల్లో మంచి మార్కులే తెచ్చుకుండాను.

క్లాసులు బాగా జరుగుతా వుండాయి. మామూలుగా ఇంటి పనులు, బయట పనులు అన్నీ ప్రతిదినమూ చేస్తా స్కూల్‌కు సక్రమంగా పోతా వుండాను.

జూన్ నెల వెళ్ళిపోయినా, వాన పలకవే లేదు. ఎండలు తగ్గలేదు. చెరువుకు నీళ్లు వొస్తాయో రావో అనే దిగులు ఎక్కువయ్యింది. ఇంట్లో అట్లా టైంలోనే దంతులూరు నాగయ్య తన మోతలగడ్డ మడిని, గుత్త ఎక్కువ యిస్తారని మా ఉప్పరోళ్ల రొట్టేపుల్లప్ప గారికి ఇచ్చినాడని, నాయన బాధపడతా చెప్పి కోరుకో, గుత్తకో మడి దొరుకుతాదో, లేదో అని దిగులు పడసాగినాడు. అమ్మయ్య వాళ్ళను తిట్ట సాగింది. “ఏమి కూటికి ల్యాక సత్తావుండారా? నాలుగైదు ఎకరాలు మడికయ్యలు పదీపండెండెకరాలు చేన్లు ఉండాయి గదా! మేం గుత్తకు చేత్తాండే మడే యీళ్లకు కావల్సొచ్చిందా? సాటి కులత్తులు, పేదోళ్లు బతుకుతాండారులే, వాళ్లు తినే కూట్లో యాల మన్ను పొయ్యల్ల అనే కనికరమే ల్యాకుండా పొయ్యిందా యీల్లకు. ఈల్ల వొంశెమారా, ఈల్లకు దూము దగలా” అని ఏడుస్తా, ముక్కు చీదుకుంటా బాధపడ సాగింది అమ్మయ్య. నాయన గుడకా చాలా దిగులు పడతావుంటే చూసి, ‘యాలట్ల దిగులు పడతావు? ఊర్లో అందురూ బూములుండే వాల్లే వుండారా? వాల్లు బతకడం లేదా? ఆ ముదనట్టం మడికయ్యలు కోరుకో, గుత్తకో చేసుకుంటేనే మనం సావుకార్లమైనామా? చేసుకోకుంటే అడక్కతింటామా. వొగరు బతుకుతా వుంటే వోర్సుకోలేని కొంప యిది’ అంటా అమ్మయ్య నాయనకు ధైర్యం చెప్పింది.

నాయన ఒగ వారం దినాలు ఆకులమ్మేకి పోకుండా, వొగనాడు కొరివిపల్లికి పోయి బాపనోళ్ళ మడి అడిగొచ్చినాడు. ఇంకొగనాడు గుత్తికి పోయి వొనుమార మడి (వనంవారగా వుండే మడి) అడిగొచ్చినాడు. వాళ్లు వొగవారం దినాలయినంక రమ్మన్న్యారంట! అట్లే ప్యాపిలికి పోయి బాపనోళ్ళ బండకిందమడి అడిగొచ్చినాడు. ఆ రెండిట్లో యాదోవొగటి దొరుకుతుందన్నాడు. అవి బ్రమ్మాండంగా ఢిల్లీ భోగాలు పండే మళ్లు అని, దాండ్లల్లో యాది దొరికినా చాలని ఇంటందరమూ ఆరాటపడినాము. దాన్లకు చాలా పోటీ ఉందంట! సంసారాలు బాగుండే వాళ్లతో, కాడి దున్నపోతులుండే వాళ్లం మేము పోటీ పడేకయితాదా? అందుకే ఆ రెండు మళ్లూ గుత్తకు దొరకకుండా జారిపోయినాయి. కడాకు అనంతపురంలో ఉండే బాపనయ్య సీతయ్య తమ సీతయ్య కయ్యలు ముక్కాలెకరా, దానికి దగ్గరనే ఉండే సీతయ్యమడి వొకటింకాలెకరా ఇస్తానన్నాడంట! అయితే, అవి రెండూ ఢిల్లీ భోగాలొడ్లు పెట్టేకి అంత బాగుండవని, బత్తెం గింజల కోసరం యా వడ్లయితేనేమి అని అనుకుండాం. రెండూ శివపురం దావలోనే ఉంటాయి.

గాలికాలమొచ్చింది. ఇంట్లో బువ్వగింజలు, దొడ్లో పశువుల మేత అయిపో వొచ్చినాయి. బత్తెం గింజలు అయిపోతే అప్పో సప్పో తెచ్చుకొని బువ్వ తినొచ్చు! పసువుల మేత అయిపోతే, ఎవురిస్తారు? నాలుగు చినుకులు పడితే కొండలు పచ్చగయితాయి. గడ్డికోసుకొని రావొచ్చు. నట్లమింద, గట్ల మింద, బాటవారా, వంక గడ్డల మింద, యాడ గడ్డి మొలకలు కనిపిస్తే ఆటికిపోయి పారతో గడ్డి గోక్కొని వొచ్చి పసువులకు వెయ్యొచ్చు.

ఇంగా వొగ అర్ధమూట వడ్లు వుండంగనే నాయనా నేనూ శింగనమలలో ఉండే మా బోగం వెంకటస్వామి పెదనాయన ఇంటికి పోయినాం. అదీ ఇదీ మాట్లాడినంక నాయన అడిగేకి జంకుతా ఉంటే, నేనే ధైర్యంచేసి ‘ఏమీ లేదు పెదనాయనా, ఇంట్లో బువ్వ గింజలకు కష్టంగా ఉంది. వొగ రెండు మూటలు వడ్లు బదులు అడిగేకి వొచ్చినాం’ అని అడిగినాను. ఆయప్ప యేమీ మాట్లాడకుండా రోంతసేపు మౌనంగా వుండి నా పక్క చూస్తా ‘యేమిరా, నాకే గినకా పుట్టినారా మీరు?’ అని జాలి ల్యాకుండా అన్న్యాడు. ఆ మాట వింటానే నాకు పెదవులు ఆరిపోయినాయి. మరొగ మాట మాట్లాడకుండా సరే పెదనాయనా అని, ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చినాను. రెండు నిమిషాలైనంక నాయన బయటికొచ్చినాడు. ఇద్దరమూ మూగోళ్ల మాదిరి ఇంటికొచ్చినాం. విషయం తెలుసుకొని అమ్మయ్య చాలా బాధపడింది. బాధతో, కోపంతో నాయనను దెప్పి పొడిచింది. ‘వాల్ల బోగం బుద్ధులు యాటికి బోతాయి? ఎంతసేపూ పరగా వాల్లది గుంజుకుండే జాతి అది! మాయన్న, మాయన్న అని నువ్వు పీక్కుంటా వుంటావు, ఇబ్బుడేమైంది? సిగ్గు ల్యాక ఆ కొంపకు యాలబొయినావు? ఆ కొంపకు పోయి అడిగే బదులు యాడన్నా అడక్కతినేది మేలు కదా!’ అని అమ్మయ్య రుస రుసమని బయటికి వెళ్లిపోయి, వొగ అర్ధగంట కల్లా వొచ్చింది. ‘గుల్లే మునెప్పను అడిగొచ్చినాను, చెన్నంగొడ్లు రొండు మూటలు ఇస్తాడంట! రేపు పొద్దున్నే పోయి కొలుసుకొని రాండ’ని చెప్పింది. నాగు ఎంతని నాయన మెల్లగా అడిగినాడు. అందరూ యిచ్చినట్లే మూటకు వొగటింకాలు మూట ఢిల్లీ భోగాలని బదులు చెప్పింది అమ్మయ్య.

మరుసటి దినం పొద్దున్నే పోయి మునెప్పోళ్ల ఇంట్లో రెండు మూటలు చెన్నంగి వడ్లు (తోక వడ్లు) కొలిపిచ్చుకొని వొచ్చినాం నేనూ, నాయనా. రెండు మూటలు వడ్లు వడ్లబండమింద అమ్మయ్యా, నేనూ, పెద్దక్కా దంచుకొనివొచ్చినాం. అరవైశేర్లు ముడిబియ్యం అయినాయి. వేరే రకాల వడ్లు రెండుమూటలు దంచితే వొగపల్లా బియ్యం అయితాయి. బియ్యాన్ని చూసి నాయన బాధపడినాడు. ‘ఎన్నో వొగన్ని, సమయానికి ఇచ్చినాడు’ అని అమ్మయ్య సర్ది చెప్పింది.

జులై నెల చివర్లో మూడు నాలుగుసార్లు వాన బాగాపడింది. చెరువుకు ఒగ పంటకు అయ్యేటన్ని నీళ్లొచ్చినాయి. పల్లెల్లో జనాల్లో సంతోషం కనిపిచ్చసాగింది. మా ఇంట్లో అందరికీ ధైర్యమొచ్చింది. ఆయకట్టు పల్లెల పెద్ద మనుషులందరూ కలుసుకుని తూములెత్తిచ్చి పంట పెట్టుకుండేకి నిర్ణయించినారు. రైతులందరూ యా ఊరి వాళ్ళు ఆ ఊరి పొలిమేరలదంకా కాలువలు పట్టి గడ్డీ గాదమూ, చెత్తాచెదారం పారలతో తీసిపడేసి క్లీన్ చేసినారు. తూములెత్తిన దినమే నీళ్లు కిందిపల్లె వరకు సాగినాయి. సాయి వెళ్ళిపోతాదని ఎవురికి వాళ్లు ఆదరాబాదరా నార్లు పోసేకి దున్నుకుంటాండారు. నార్లుపోసి, ఎరువులు తోలే వరకు స్కూలుకు శెలవు పెట్టమన్న్యాడు నాయన. బతుకు ముఖ్యం, ఆ తరువాతనే మిగతావన్నీ అనే పద్ధతిలో సన్నకారు రైతులే కాదు పెద్ద రైతులు గుడకా తాపత్రయపడతా పంట పెట్టుకుంటేనే బతుకైనట్ల, సేద్యం పనుల్లో మునిగిపోయినారు. అందర్నీ చూస్తా అన్నిటికంటే బతుకే కదా ముఖ్యం అనుకొని నాయన మాటలను అర్థం చేసుకొని, ఏమైతే అదయితాది లే అని స్కూలుకు వారం దినాలు శెలవు పెట్టి సేద్యం పనుల్లోకి దిగినాను.

సీతయ్యమడిలో రెండు పెద్ద కయ్యలకు ఎరువేసి, దున్ని ఢిల్లీ భోగాల వడ్లు నారు పోసినాం. సీతయ్య కయ్యలకు ఎనిమిది బండ్లు ఎరువుతోలి, మడి అంతా శాడ, అడ్డసాలు, మెత్తగా దున్ని నానబెట్టినాం. సీతయ్యమడిలో నారొచ్చే లోపల దిబ్బలోని ఎరువంతా పన్నెండు బండ్లు మడికి తోలిచ్చినాం. సీతయ్య కయ్యల్లో పిట్టక వేసేకి ఇంగా రెండు దినాలు నానితే మేలని నాయన ఆకుల గంపెత్తుకొని రెండు దినాలకల్లా తిరిగొస్తానని పల్లెలకు పోయినాడు. ఆ రెండు దినాలూ బదులు మడకలు చేసుకుంటే సీతయ్యమడి నాటే నాటికి వాళ్ల మడకలు వొస్తాయని, పక్కనుండే నేసే బుడ్డన్న మడిలో దున్నేదానికి పోయినాను. వాళ్లది బంకమడి. మడక తోలుతావుంటే విపరీతంగా దిగబడి, దున్నపోతులు మడకను లాగేకి బరువుపడతా, గసపోసుకుంటా ఉండాయి. దాండ్లపక్క చూడబుద్ధి కాలేదు. బాధయింది. పాపం! రాత్రిపూట కడుపునిండా మ్యాతలేదు. పయిటాలప్పుడు మడకలు విడిచినంక, వెంకటలక్ష్మితో దున్నపోతుల్ని వంకగట్ల దగ్గర మేపుకొని రమ్మని చెప్పి, నేను పారతో దోకుడుగడ్డి దోక్కోని రావల్ల అని అనుకుంటా బుడ్డన్న బిడ్డ బువ్వ తీసుకుని రావడంతో మడకలను నిలబెట్టినాం.

మా ఊరి పెద్ద కాలువకింద ఉండే మళ్లల్లో బుడ్డనోళ్లదే మొదటి మడి. పక్కనే పెద్దబండా గుండ్లుండాయి. ఆ చుట్టుపక్కలుండే రైతులందరూ ఆ బండమిందనే కల్లాలు చేస్తారు. అట్లాంటి బండమింద బువ్వ తింటావుండాం. ఇంట్లో రాగులు లేవేమో, అందరికీ వరి అన్నమే తెచ్చింది బుడ్డన్న బిడ్డ. అందుకే అందరికీ పళ్యాలు తెచ్చింది. పళ్లెం నిండా కేసరి బియ్యమన్నం పెట్టి గురగాకు పప్పు, గోగాకు శెనిగిత్తనాలువేసి నూరిన ఉరిమిండి వేసింది. కేసరన్నంలో అవి రెండూ కలుపుకొని తింటా వుంటే యాలనో కండ్లలో నీళ్లు మెదిలినాయి. చాలా దినాలయినంక కమ్మని పప్పు, ఊరిమిండితో తృప్తిగా తింటా ఉంటే ఏదో తెలియని ఆనందము, బాధ మనసు నిండా ముసురుకుండాయి. మాగాణి పనులు ఉన్నన్ని రోజులు ఇట్ల మడకలు దున్నే కూలికి పోయి కమ్మగా తినొచ్చు! అయితే అన్ని దినాలూ బడికి పోకుంటే అటెండెన్స్ తక్కువైతాది. నెక్ట్స్ క్లాస్‌కు పాస్ చేయరు. నేను పాస్ కాకుంటే, నాయన బడికి పంపడు. స్కూల్లో హెడ్మాస్టర్ సార్ గట్టిగా తిడతాడు. మడక దున్నే కూలిపనికిపోతే కమ్మగా తృప్తిగా కడుపునిండా తినొచ్చు! కానీ చదువు పోతాది. తనకు తిండికంటే చదువే ముఖ్యం కదా! ఇంట్లో ఇంత మాత్రం తృప్తిగా తినేకి ఉంటే ఎంత బాగుండేది!

అట్లనుకోవడంవల్ల కండ్లల్లో నీళ్లు మెదలాడడంతో పక్కకు తిరిగి తుడుచు కుండాను. బుడ్డన్న బిడ్డ నాగలక్ష్మి కొసిరి కొసిరి అన్నంపెట్టి, మజ్జిగ పోసింది. నాగలక్ష్మి భలే అందంగా ఉంటాది. మూడో తరగతితోనే బడి మానేసింది. హైస్కూల్లో చదువుకుంటా ఉండానని ఆ పాపకు నేనంటే భలే ప్రేమ. నిండుగా ఎంతో అందంగా ‘నారాయణన్నా’ అని నన్ను పిలుస్తా వుంటాది.

పయిటాల దాటినంక నేనూ, పెద్దక్కా పారలు, గంపలు తీసుకొని బాటవారనా, పిల్లిగుండ్ల కాడా న్యాత పల్లెరాకు, గరకా దోక్కొని గంపలకెత్తుకొని వొచ్చి ఇంటి ముందరుండే బయల్లో పోసినాం. పార కట్టెను ఊడబీకి తిప్పి పట్టుకొని, దోకుడు గడ్డి అంతా నాలుగు పాయలుగా చేసి గడ్డిలో వుండే పెల్లలు, మన్ను, మశానము పోయేటట్ల నలగ్గొట్టి మన్నంతా విదిలిచ్చి శుభ్రంచేసి రాత్రి పశువులకు వేసేకి రెండు గంపల నిండా నించి పెట్టినాను. శుభ్రం చేసిన ఆ దోకుడు గడ్డిని దున్నపోతులు ఎంతో ఇష్టంగా తింటాయి.

పది దినాలయినంక నేను స్కూలుకుపోయినాను. అన్ని సబ్జెక్టుల్లోనా రెండు పాఠాలు అయిపోయినాయి. లెక్కల్లో మూడో చాప్టరు జరుగుతా ఉంది. నన్ను సత్యనారాయణ సార్ గట్టిగా మందలిచ్చినాడు. నేను విషయం అంతా చెబుతా వుంటే నాకు తెలియకుండానే కనుగుడ్ల మింద నీళ్లు పోరాడినాయి. మాసారు నా ముఖం లోకి చూసి బాధపడతా పేదోళ్ల బతుకులు ఏం బతుకులో ఏమో నప్పా! సరే అన్ని రోజులు క్లాసుకు రాకుంటే, కాంపోజిట్ మ్యాథ్స్ అర్థం కావు కదరా, సత్యంతో నోట్స్ ఇప్పించుకొని రాసుకో, వీలుంటే ఆదివారం పూట మా ఇంటికి రా. అర్థం కానివి చెపుతాను అని సత్యనారాయణ సార్ ప్రేమగా చెప్పినాడు. సరే సార్ అని అన్న్యాను. కానీ ఆదివారం కూలికి పోకుండా ఈటికొచ్చి సార్‌తో లెక్కలు చెప్పిచ్చు కుండేకి సాధ్యమైతాదా? అని ఆలోచించుకుంటా సత్యంతో నోట్స్ ఇప్పిచ్చుకుండాను. మధ్యాహ్నం హెడ్మాస్టర్ సారింటికి పోయినాను. పది దినాలు స్కూలుకు రానందుకు సార్ అరిచినాడు. జయమ్మక్క, వాడుమాత్రం ఏమి చేస్తాడు, వాళ్ళ ఇంటి పరిస్థితులు అట్లుండాయంట అని సారును వారించి, తలంచుకొని కన్నీళ్లు కారుస్తా ఉండే నన్ను ఓదార్చి, మధ్యాహ్నం మిగిలింది అన్నమూ కూరా కలిపి వొగ కణికడంత పెట్టింది. దాన్ని ప్రసాదం మాదిరి తిన్న్యాను. సాయంత్రం స్కూలు వొదిలినంక పొయిలో పెట్టే రెండు మొద్దుల్ని గొడ్లితో పగల గొట్టిచ్చి, ఊరికొచ్చినాను.

వారం దినాలు అయినంక సీతయ్య కయ్యల్లో పిట్టక దున్నినాడు నాయన. నేను పారతీసుకొని కయ్యల్లో చుట్టూరా గెనాలు చెక్కినాను. మళ్లల్లో అన్నిటికంటే బరువైనపని పారతో గెనాలు చెక్కడమే! నేను పార తీసుకుని గెనుం చెక్కడానికి వొంగితే, చుట్టూరా నాలుగు గెనాలు పూర్తి చెక్కేది అయిపోయేంతవరకూ పైకి లెయ్యను. ఆ మాదిరిగా ముక్కాలెకరాలోని గెనాలన్నీ చెక్కి, గడ్డీ గాదంతోపాటు పిట్టక తోలిన కయ్యల్లోని పెల్లంతా తొక్కి, మొత్తం గెనాలకు బురదమెత్తినాను. నాయన పిట్టక తోలేదంతా అయిపోయినంక పాకుమాను తోలినాడు. పాకుమాను తోలినంక కయ్యలన్నీ అద్దాల మాదిరి కనిపిస్తా వుండాయి.

పయిటాల కాకముందే అమ్మయ్య, పెద్దక్క గంపల్లో కేసరొడ్లు మొలకలను మోసుకొని వొచ్చినారు. నాయన మొదటి కయ్యల్లో గట్టిబురదతో జిత్తెడెత్తు అరుగుమాదిరి చేసి ఆరు మింద మూడు మట్టిముద్దల బొమ్మలను కూర్చోబెట్టి, ఆ బొమ్మప్పల ముందర పిడికెడు వడ్ల మొలకలను కుప్పలుగా పోసి మొక్కుకొని మలక పుటకలో మొలకను పోసుకొని కయ్యల్లో చల్లసాగినాడు నాయన. మొలకను చల్లుతావుంటే రెండు మొలక గింజలు ఒకే చోట ఎక్కడా పడలేదు. అర్ధ అంగుళమంత మొలక వొచ్చిన ఎర్రని కేసురొడ్లు కయ్యల్లో పడతా ఉంటే తళ్ తళ్ తళ్ అంటా వచ్చే శబ్దం వినడానికి ఎంత బాగుందో!

వారం దినాలయినంక సీతయ్య కయ్యల్లో కేసరొడ్లు చాలా బాగా మొలకెత్తినాయి. నాయన చెప్పినట్ల దినామూ పొద్దున్నే సీతయ్య కయ్యల్లో పల్చగా నీళ్లుపెట్టి స్కూలుకు పోతా వుండాను. సీతయ్యమడిలో నారుకయ్యల్ని సందకాడ చూసుకుంటా వుండాను. చూస్తా చూస్తా వుండంగానే నారు నాటేకి వొచ్చింది. మడిలో పిట్టక దున్నల్ల. పిట్టకనాడు, నారు నాటేనాడు, మూడు దినాలు స్కూలుకు శెలవు పెట్టమన్న్యాడు నాయన. ఆదివారం కలిసేటట్ల మడి నాటేపని పెట్టుకుంటే రెండు దినాలు శెలవు పెడతాను నాయనా అని మెల్లగా చెప్పినాను. నాయన సరే అన్న్యాడు. ఇద్దరమూ శుక్రవారం మడి గెనాలని చెక్కినాం. శనివారం నాడు బదులు మడకలు వొచ్చినాయి. మా మడకతో కలిపి మూడు మడకల్తో పిట్టక దున్నుతా పోతా ఉండాయి. నేనొక్కన్నే పెల్లతొక్కి గెనుముకు అటుపక్క వొగకాలు ఇటుపక్క వొగకాలు పెట్టుకొని వొంగి బురదతో గెనాలను మెత్త సాగినాను. అమ్మయ్యతో పాటు వొచ్చిన నలుగురు బదులు మనుషులు నారు పీకి కట్టలుకడతా వుండారు. పయిటాలకు పిట్టక దున్నేది, గెనాలు మెత్తేది అంతా అయిపోయింది. నారు పీకేవాళ్లు వొగ అర్ధం పీకకుండా వొదులేసినారు. పీకిన నారే దండిగా సరిపోతుందని మిగిలిన అర్ధం కయ్య నారు ఎవరికైనా అమ్ముకుంటే సులభంగా మున్నూరు రూపాయలు ఇస్తారని ఐదు వారాల ఢిల్లీ భోగాల నారును కొనుకొండేకి రైతులు పోటీపడి వస్తారని అనుకొండాడు నాయన. అనుకొని అర్ధం కయ్యనారును మిగిలిచ్చినాడు.

రేపు ఆదివారం మడిలో నారు నాటల్ల! అమ్మయ్య బదులు మనుషులందరినీ ముందుగానే పిలిచింది అయితే ఆయిదారు మంది, తమ నాటకమూ రేపేనని కలుపు తీసేటప్పుడు వస్తామని చెప్పినారంట. నాయన గుల్లే మునెప్పనే అడిగి, నాటకం కూలోళ్లకూ మడిలో చల్లే పిండికీì (పాస్పెట్, నైట్‌రేట్) దానికీ దీనికీ మున్నూరు రూపాయలు సుంగిడికి (నూరు రూపాయలకు నూరు శేర్లు వడ్డీగా) బాకీ చేసి తెచ్చి పెట్టుకుండాడు.

మా సీతయ్యమడి, మళ్ల మింద నుండి కిందికి దిగొచ్చే పులుసు నీళ్ల కాలువ పక్కనే ఉంటాది. మాగాణిలో వరి పంట పెట్టినప్పుడు ఆ కాలువలో నీళ్లు చాలా పోతా వుంటాయి. వర్షం వొచ్చినప్పుడు కాలువ నీళ్ళు పొర్లి, మా మడి దిగువ డొంపు గెనాల మింద పోతాయి. అట్లాటి మడిలో, రేపు ఢిల్లీభోగాల వరినారు నాటిచ్చల్ల.

అర్ధరాత్రి దాటినంక వర్షం మెల్లగా మొదలై రాన్రాను భయంకరంగా పడింది. తెల్లవారుజాము వరకు కురిసింది. మట్టి మిద్దె కూలిపోతాదేమోనని ఇంటి అందరమూ భయపడుతా కూర్చుండాం.

తెల్లారింది. అనుమానమొచ్చి నేనూ నాయనా పొద్దున్నే మడికాటికి పోయినాం. సీతయ్య కయ్యల దగ్గర మిట్టమింద నిలబడి చూసినాం. గెనాలు అనేవి కనిపిచ్చలేదు. అంతా చెరువు మాదిరుంది. మళ్ల మింద నీళ్లు పెద్ద నది మాదిరి పారుతా ఉండాయి. మెల్లగా దావగెనుం మింద మోకాళ్ళ లోతు నీళ్లు పారుతా వుంటే అడుగులో అడుగు వేసుకుంటా ముందుకు పోయినాం. నడుములలోతు నీళ్లు స్పీడ్‌గా పారుతా వుండాయి. నారు కయ్యల్లో పీకిపెట్టిన నారు కట్టలు వొక్కటీ లేవు. మొత్తం అన్నీ కొట్టుకొని పోయినాయి. దగ్గరకుపోయి చూసేకి కూడా సాధ్యం కాలేదు.

మడిపక్క చూసి మా పెదవులు ఆరిపోయినాయి. ‘అంతా సర్వనాసినం అయిపోయిందప్పా’ అంటా నాయన దొమ్మలు గుద్దుకుండాడు. నాకు మాటలు రాలేదు. ఇద్దరమూ ఇంటికెల్లవారినాం. ఆ పక్కనుండే పొలాల వాళ్ళు వొగొగరే వొచ్చి చూస్తా బాధపడసాగినారు. మేము ఇంటికి పోయి అమ్మయ్యతో బాధపడుకుంటా చెప్పినాం.

అమ్మిబిడి పొద్దుకల్లా నీళ్లు తగ్గిపోయినాయని తెలిసి ఇంటందరమూ మడి కాటికిపోయినాం. ఆ సోలుపులో ఉండే మళ్లల్లో కయ్యల నిండా ఇసక పేరుకొని పోయింది. బోదగుట్టలో నుంచి వచ్చే వంకా, గొందిలో నుంచి వచ్చే వంకా యాపక్క వాలు పడితే ఆపక్క పీక్కొని వొచ్చినట్లుండాయి. పెద్ద కాలువ గట్లన్నీ తెగిపోయినాయి. మొత్తం నీళ్లన్నీ తగ్గువైపు వొచ్చినాయి. వాలు పెట్టుకొని గెనాలను చీల్చుకొని పోయినాయి. మా మడిలో దిగువ నుండే రెండు డొంపుల్లో బంకమన్నే లేదు! నారు కట్టలు వొగటీ లేదు! పీకకుండా పెట్టిన నారు కూడా మొత్తం కనిపిచ్చకుండా పోయింది. కయ్యల్లో వాలుపడి, వరినారు వేర్లతో సహా లేచిపోయింది. అంతా చూసి అమ్మయ్య యేడ్చబట్టింది.

మా మడి వొగటే కాదు, ఆ సోలుపులో ఉండే యాభై అరవై ఎకరాల్లో అంతా అదే పరిస్థితి. అయితే, మిగతావాళ్ళు ఎవురూ నారు పీకలేదు గానీ నారు కయ్యలన్నీ ఇసకతో పూడిపోయినాయి. అన్ని మళ్లనూ చూపి అమ్మయ్యను వోదార్చినాను. చుట్టుపక్క లుండే పొలాల వాళ్ళు వొచ్చి చూసి, అన్యాయమై పోయిందని బాధపడినారు. పడమటి పక్కనుండే డొంపు అంతగా దెబ్బతినలేదని అర్ధయెకరా అంతుండే ఆ డొంపులో నాటుకుండేకి తలాకింత నారు ఇస్తార్లే వెంకటస్వామి, భయపడొద్దు అని ధైర్యం చెప్పినారు. ఎట్ల చెయ్యల్లనో, ఏమి చెయ్యల్లనో దిక్కు తెలీక అందరమూ ఇంటికొచ్చినాం. నాయన అంబిడి పొద్దు బువ్వతిని అనంతపురానికి పోయి పయిటాలకల్లా సీతయ్యను పిలుచుకొని వొచ్చి మడిని చూపిచ్చినాడు. బోడిగానిదొడ్డి నుంచి ఎగవన చుక్క వాన లేదని కొర్రపాడు దగ్గరనుంచి తూర్పుకే వర్షం పడిందని, యానాడూ లేనంత పెద్ద వర్షం అని సీతయ్య అర్థం చేసుకొని, నారు దొరికితే నీటికోతకు దెబ్బతినకుండా ఉండే అర్దెదకరాలో వరి నాటుకోమని, ఆ పంటలో తనకేమీ ఇవ్వొద్దని నాయనతో చెప్పినాడు సీతయ్య. ఊరికి పోతా పోతా నాకు పది రూపాయలిచ్చి ‘బాగా చదువుకోరా’ అని చెప్పి వెళ్లిపోయినాడు. మరుసటి దినం నాయనను పిలిచి దంతులూరి నాగయ్యోళ్ల మడిని మాకు దక్కకుండా చేసిండే రొట్టే పుల్లప్పోళ్లూ, వడుగూరు మడిని గుత్తకు చేసిండే వాళ్ళూ తలా పనకనిండా నారు ఇచ్చినారు. అదంతా తెచ్చుకొని సీతయ్య మడిలో ఎగువ డొంపును మల్లా అదును చేసుకొని నాటుకుండాం.

నాలుగు దినాలయినెంక దిగులు పడతా స్కూలుకు పోయినాను. స్లిప్ట్ టెస్టులు మొదలయినాయి. నేను ఏ సబ్జెక్టూ సరిగా రాయలేదు. అన్నిటిలోనా మార్కులు తక్కువ వొచ్చినాయి. క్లాస్ టీచర్ సత్యనారాయణ సార్ గట్టిగా మందలిచ్చినాడు. నేను జరిగిన విషయం అంతా చెప్పినాను. మధ్యాహ్నం హెడ్మాస్టర్ సార్ ఇంటికిపోయి జయమ్మక్కతో కూడా చెప్పినాను. అక్క బాధపడి ఓదార్చింది.

ఊర్లో గుల్లే మునెప్పతో నాగుకు తెచ్చుకున్న చెన్నంగి బియ్యం అయిపో వొచ్చినాయని, అమ్మయ్య అంబిడిపొద్దు బువ్వ మాత్రమే చేస్తా వుంది. అది గుడకా అరకడుపుకే పెడతా ఉంది. మా ఊరి జతగాళ్ళు వేరే పల్లెల క్లాస్‌మీట్స్ అందరూ స్కూలుకు వచ్చేటప్పుడు క్యారియర్లు తెచ్చుకొని మధ్యాహ్నం అందరూ ఊరికి పైపక్కనుండే చిన్న కాలువ తీరుకట్టమీద చేరుకొని తింటారు.

మొన్న వొగసారి క్యారియర్‌లో అమ్మయ్య వొగేవొగ పిడస రాగి ముద్ద పెట్టిచ్చింది. మధ్యాహ్నం జతగాళ్లతో పాటు చిన్న కాలువ కాటికి పోయి క్యారియర్ మూతతీసి చూసినాను. జతగాల్ల మధ్యలో కూర్చుండాను కాబట్టి అసలు సంగతి దాచి పెట్టలేక పోయినాను. నా పక్కనే కూర్చోనుండే నర్సాపురం శ్రీరాములు నా క్యారియర్ పక్కచూసి అయ్యో! నారాయణగాని క్యారీర్లో కూరగానీ, ఊరిమిండి గానీ ఏందీ లేదే అని గట్టిగా అన్న్యాడు. ‘అయ్యో!’ అని జతగాళ్లు అందరూ బాధపడతా తమ క్యారియర్‌లో ఉండే అన్నం పెట్టినారు. అదిచూసి నాకు కన్నీళ్లొచ్చినాయి. శ్రీరాములు, అశ్వత్థరెడ్డి, రామచంద్రప్ప మా ఇంటి పరిస్థితిని అర్థం చేసుకొని జాలి పడుతా నారాయణా నువ్వేమి క్యారీ తెచ్చుకోవద్దు. మధ్యాహ్నం స్కూల్ వొదులుతానే మాతోపాటు రా, మా క్యారియర్‌లో ఎక్కువ అన్నం తెస్తాము. నువ్వు బిడియపడకుండా తిను అంటా మనసారా చెప్పినారు. నేను సరే అన్న్యాను. అన్న్యాను కానీ నేను అట్లొచ్చి దినామూ వాళ్లు పెట్టిన అన్నం తినగలనా? అని మనసులో అనుకుండాను.

అదంతా గుర్తు చేసుకుని నేను మధ్యాహ్నం స్కూలు వొదులుతానే పక్కకు పోయినాను. పయిటాల అన్నం తినొచ్చినంక అందరూ అడిగినారు, ఏమి కాలువ కాటికి రాలేదని? ఏదో అబద్ధం చెప్పినాను. ఇట్లా ఎన్నిసార్లు అబద్ధం చెప్పగలను? మధ్యాహ్నం పస్తులుంటా జతగాళ్లకు అబద్ధం చెపుతా, ఎందుకు చదువుకోవల్ల నేను?

నాయన ఆకులమ్మి తెచ్చే బత్తెము గింజలు ఇంటికి చాలడం లేదు. వరినాట్లు వేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు అమ్మయ్య బదులు మనుషుల్ని జమ చేసుకుండేకే సరిపొయ్యింది. ఆ బదులు మనుషులు రాకుంటే మేము మడి నాటిచ్చేటప్పుడు, కలుపు తీసేటప్పుడు కూలోళ్లకు కూలి డబ్బులు ఇవ్వాల్సిందే గదా! అమ్మయ్య కూలికి పోయినప్పుడు, కూలి డబ్బులు తీసుకోకుండా మా పనికి బదులు మనుషులుగా వస్తే వాళ్లకు మేము కూలి ఇవ్వల్సిన పనిలేదు. ఆ రకంగా అమ్మయ్య మా మడి నాటే కూల్లూ కలుపుకూల్లూ మిగిలినట్లే కదా! ఆ కూలి డబ్బుల కోసరం నాయన షావుకార్ల దగ్గర బాకీ చెయ్యల్సిందే కదా! పెద్దక్క ఇంకా చిన్నది కాబట్టి వరి నాటేకి ఎవురూ పిల్చరు. కలుపుకూలికి మాత్రమే పోతాది. వెంకటలక్ష్మి, చిన్న పాప జయమ్మ కోసం ఇంటికాడే వుంటాది. ఇంక నేను పనుల కాలమంతా కూలికి పోతే బత్తెం గింజలకు ఇరకాటం వుండదు. అందుకే నాయన నన్ను చదువు మానిపిచ్చల్లని చూసినాడు. ఇట్లా పరిస్థితుల్లో నేను ఎందుకు చదువుకోవల్లని అనిపిస్తాది. అయితే చదువు మానుకుండేకి నాకు మనసు రాదు. కానీ, కానీ ఏమైతాదో చూస్తాం!

నిరంతరమూ ఇదే ఆలోచనతో బడికి పోతావుండాను. అంతలోనే కాలు పరీక్షలు వొచ్చినాయి. నేను పరీక్షలు బాగా రాయలేకపోయినాను. పరీక్షలు అయిపోయి నంక శెలవులొచ్చినాయి శెలవుల్లో కూలి పనులు దొరుకుతాయనుకుండాను. మాగాణి లో మళ్లన్నీ కరుకుతో ఉండాయి. కూలి పనులు ఎక్కడా లేవు. నాయన సీతయ్య కయ్యల్లో సీతయ్యమడిలో పిండి (యూరియా) చల్లల్లని గుల్లే మునెప్పను నూర్రూపాయలు వడ్డీకి అడిగినాడు. వడ్డీకి అయితే ఇయ్యనని, ‘సుంగిడి’ అయితే ఇస్తానన్న్యాడు. ఆ దుడ్లు కూడా అనంతపురంలో తనకు లావాదేవీలు ఉండే షావుకారి దగ్గరికి పోయి అడిగి యిప్పిచ్చుకొని రావల్లని, అనంతపురానికి రానుపోను బస్సు చార్జీలూ ఖర్చుల కింద ఐదు రూపాయలు ఇవ్వల్లని షరతు పెట్టినాడు మునెప్ప. ఇప్పుడు ఐదు రూపాయలు తన దగ్గర లేవని అప్పుగా ఇచ్చే నూర్రూపాయలల్లో ఐదు రూపాయలు పట్టుకొని ఇమ్మన్నాడు నాయన. సరే, రేపు రమ్మన్న్యాడు మునెప్ప.

చెప్పినట్లనే మరుసటిదినం మునెప్ప నాయనకు తొంబైఐదు రూపాయలు ఇచ్చి నూర్రూపాయలకు ప్రాంసర్ నోటు రాయిచ్చుకుండాడు. నాయనా, నేనూ శింగనమలకు పోయి రెండు పిండి (యూరియా) మూటలు తెచ్చి సీతయ్య కయ్యల్లో సీతయ్య మడిలో చల్లినాం. చల్లిన నాలుగు దినాలకే సీతయ్య కయ్యల్లో కేసరొడ్లమడి బాగా తిరుక్కుంది. సీతయ్య మడిలో, వంక పారినప్పుడు సత్త్తవంతా కొట్టుకొని పోవడం వల్లనేమో, పైరు అంత నాణ్యంగా రాలేదు. ఇప్పటికే గుల్లే మునెప్ప దగ్గర సుంగుడికి నన్నూరు (నాలుగు నూర్ల) రూపాయలు, వొగమూట వడ్లు నాగుకు బాకీ చేసినాం. ఆ బాకీకి ఇచ్చేటన్ని గింజలన్నా సీతయ్యమడిలో వస్తాయో రావో అని నేనూ, అమ్మయ్యా ఆలోచన చేయసాగినాం.

ఇద్దరు పెండ్లాల మధ్యలో ముద్దుల మొగుడంట..

మా ఊరి స్కూలుకు ‘మదన’ అనే టీచర్ వొచ్చిందని ఎవురో చెప్పితే మదన గోపాల్ సారే అయ్యుంటాడని సంతోషంతో స్కూలుకు పోయి చూసినాను. హెడ్ మాస్టర్ జలీల్ సారే వుండాడు. ఒకటి రెండు తరగతుల దగ్గర నిరుడొచ్చిండే ఓబుళమ్మ టీచర్ లేదు. ఎవురో కొత్త టీచరమ్మ వుంది. నన్ను జలీల్ అయ్యవారు పలకరిచ్చి, నాతో ఏమైనా పనుందా నారాయణా అని అడిగినాడు. మదనగోపాల్ సార్ మళ్లా వొచ్చినాడని ఎవురో చెప్పితే పలకరిచ్చల్లని వొస్తిని సార్ అని అన్న్యాను. ‘లేదు లేదు మదన అని కొత్త టీచరమ్మొచ్చింది. ఆ పేరు విని నువ్వు మదనగోపాలనుకుండావేమో! ఓబుళమ్మ అనంతపురం దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయింది’ అని జరిగిండే సంగతి చెప్పి ఆ కొత్త టీచరమ్మకు నన్ను పరిచయం చేసినాడు జలీల్ సార్. ఆ టీచరమ్మకు నమస్తే చెప్పి, రెండు మాటలు మాట్లాడి ఇంటికొచ్చి బువ్వ తిని హైస్కూల్ కు బయలుదేరినాను.

నేనూ, కుళ్లాయప్పా మడికట్లల్లో నడుస్తా ఓబుళమ్మ టీచర్ సంగతులు మాట్లాడుకుంటా పోతావుండాం. ఓబుళమ్మ టీచర్‌ది అనంతపురం. ఆమె తండ్రి రఘువీరా టాకీస్ గేటు కీపర్ అని ఆ టీచరమ్మే చెప్పిండేదాన్ని బట్టి పేదరాలే అని, మా ఊరోళ్లకు చాలామందికి తెలుసు. టౌన్‌లో పుట్టి, పెరిగిన మనిషి కాబట్టి బాగా శుభ్రంగా, నాజూకుగా ఉంటాది. చాలా పొట్టి మనిషి. అయినా బాగా అందంగా వుంటాది. ఇంకా పెండ్లి కాలేదు. టీచర్ ట్రైనింగ్ అయిపోతానే మొదట మా ఊరు స్కూల్‌కే టీచర్‌గా వేసినారు. హెడ్మాస్టర్ జలీల్ సార్‌కు భార్యా పిల్లలు ఉండారు. కొత్తగా వొచ్చిండే టీచరమ్మ ముద్దు ముద్దుగా అందంగా ఉండడంతో, ఆమెను తన వలలోకి వేసుకోవల్లని చూసినాడు. అయితే ఆ టీచర్ అందుకు ఆస్కారం ఇవ్వలేదేమో, సాయిబు రోంత అతి చేసినట్లుంది. ఆమె వెంటనే విషయం ప్రెసిడెంటు దృష్టికి తీసుకుపోయింది. మా వూరిని నమ్మి వొచ్చిండే టీచరమ్మ, పెండ్లికాని ఆడమనిషి, కన్నీళ్లు పెట్టి చెప్పడంతో, ప్రసిడెంటు సుంకు రంగయ్యకు (సుంకు రంగయ్యను సుంకు రంగప్ప అని గుడకా అంటారు) చెప్పింది. జలీలయ్యవారిని పిలిపిచ్చి గట్టిగా బుద్ధి చెప్పినాడు. దాంతో జలీలయ్యవారు కొంచెం తగ్గినాడు.

ఓబుళమ్మ వొగ మంచి ఇల్లు బాడుగకు తీసుకొని ఎప్పుడూ చదువుకుండే పిల్లల్ని దగ్గరకు చేర్చుకొని వాళ్లకు ఫ్రీగా ట్యూషన్ చెప్పసాగింది. వాళ్ళందరి లోనా ఎనిమిదవ తరగతి చదువుతా వుండే ఓబుళ నారాయణ నాకంటే వయసులో వొగ సమ్మత్సరం పెద్దోడు. ఆ టీచరమ్మకు చాలా చనువుగా ఉండి ఎక్కువ సమయం ఆయమ్మ దగ్గరే ఉంటాడు. అది తెలిసి మా జతగాళ్ళు అంతా గుసగుసలాడుతా వుండారు. అంతలోనే ఆ టీచరమ్మ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ యమ్మకు బదులుగా ‘మదన’ అనే టీచరమ్మ వొచ్చింది. ఆయమ్మ భర్త శింగనమల సమితి ఆఫీసులో క్లర్క్‌గా పని చేస్తా వుండాడు. ఆయన పేరు నగిరి సుబ్బన్న. రెండు నవలలు రాసినాడని ఆయన చెప్పితే తెలిసింది. వాళ్లిద్దరూ మా ఊర్లో కాపురం పెట్టి సుమారుగా రెండు నెలలు అయితా ఉంది. ఇదంతా మాట్లాడుకుంటా టైంలోపలే స్కూలుకు చేరుకుండాం. నేనూ, కుళ్లాయప్పా.

మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ అయిపోయినంక సోషియల్, తెలుగు టీచర్లు లీవ్ పెట్టినారని డ్రిల్ మాస్టర్ పిల్లోలందర్నీ గ్రౌండుకు పిలుచుకొనిపోయి వాలీబాల్, బ్యాట్‌మిటన్ ప్రాక్టీస్ చేయిచ్చినాడు. గ్రౌండ్లో గేమ్స్ ఆడుతా ఉంటే టైమే తెలియలేదు. డ్రిల్ సార్ లాంగ్ విజిల్ వేస్తానే, పిల్లోళ్లందరూ ఇండ్లకు బయలుదేరినారు. నేను మా ఊరి జతగాళ్లతో కలిసి బయలుదేరినాను. మాతోపాటు శివపురమోళ్లు వొచ్చినారు. శివపురం పిల్లోళ్లలో ఎర్రెమ్మ కూడా ఉంది. నేను ఎర్రెమ్మను మొన్ననే చూసిండేది. ఆ పాప కూడా నాలుగైదు దినాల కిందటే మా స్కూల్లో ఎనిమిదో తరగతిలో చేరింది. ఆ పాపను దగ్గరగా చూసి మాట్లాడుతా వివరాలన్నీ అడిగినాను. ఆ పాప చెప్పినంక తెలిసింది శివపురం పట్రోళ్ల చిన్న వెంకటస్వామి అన్న కూతురని. తెలుస్తానే, ఓరి నాయనో! అని మనసులో బిత్తర పోయినాను. శివపురం పట్రోళ్ళు భలే మొరట మనుషులని, చాలా దౌర్జన్యపరులని, అందరూ అనే విషయమూ మా ఊరి నాగిరెడ్డి బిడ్డపెళ్లి మెరవణి సమయంలోనా, పీర్ల పండగప్పుడూ, పోతబోయిచ్చిన మూడు ఇరుసులను, ఇన్నూరు కేజీల రాతి గుండును ఎత్తిండే శివపురం పట్రోళ్ళ కండ బలమూ, గుండె బలమూ, గ్నాపకమొచ్చి ఆ పాపతో జాగ్రత్తగా మాట్లాడేది మేలను కుండాను. పట్రోళ్లు అంత మొరటుగా యెడ్డీమడ్డీగా వున్న్యా, ఈ పాప మొగంలో ఆ మొరటుతనం యేమీ కనిపిచ్చలేదు. మొరటుతనంలోనే కొంచెం నాజూకుతనమూ, ఎరుపూ, నలుపూగాని రూపంలో ఏందో వొగ ఆకర్షణా దాక్కొని వుండాయి. ఇంతమంది మగపిల్లల మధ్యలో వొగ ఆడపిల్ల ఎర్రెమ్మ నడుస్తా భయం ల్యాకుండా, మాట్లాడతా ఉంటే నాకు ఆశ్చర్యం కలగసాగింది. అదీ యిదీ మాట్లాడుతా నడుస్తా వుండంగానే శివపురం దావ వొచ్చింది. వాళ్ళందరూ టాటా చెప్పి వాళ్ల ఊరిదారికి మల్లినారు.

కుళ్లాయప్ప కనిపిచ్చకుంటే నేను వెనుతిరిగి చూసినాను. దూరంగా నగిరి సుబ్బన్నా, కుళ్లాయప్పా వొచ్చేది గమనిచ్చి, నేనూ, ఓబుళ నారాయణా రోంతసేపు నిలబడినాం. అంతలోనే వాళ్ళిద్దరూ వొచ్చి మమ్మల్ని కలుసుకుండారు. నేను సుబ్బన్న సారును దగ్గరగా చూసింది అప్పుడే! మనిషి భలే అందంగా ఉండాడు. ఆడవాళ్ళ మాదిరి ఒకవైపు ముక్కు పొడిపిచ్చుకుండాడు. ఎందుకు సార్ ముక్కు పొడిపిచ్చుకుండారని అడిగితే ఆడపిల్లలు లేని వాళ్ళమ్మకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం అని, నాలుగైదేండ్ల వయసు వరకు తనకు ఆడపిల్లల బట్టలేసి, రెండు జడలు వేసి, పూలు పెట్టేదని. అదీ చాలకపోవడంతో ముక్కు కుట్టిచ్చి ముక్కుపుడక పెట్టిందని, ఆయన తన పిల్లప్పటి సంగతులు చెప్పి అందర్నీ నవ్విచ్చినాడు. ఆయన నవ్వుతా వుంటే భలే సొగసుగా కనిపిస్తాడు. అందమైన పలువరస! నొక్కుల జుట్టు! చాలా ఖరీదైన బట్టలు! అంతే ఖరీదైన చెప్పులు! చేతికి బంగారు చైనుండే వాచి! గొంతులో పులిగోరున్న బంగారు చైను! మనిషి చూస్తే పెద్ద షావుకారి మాదిరి వుండాడు. మా ఊరిలో ముప్పైఐదు ఎకరాల భూస్వామి ఎలకంటి పెద్దపాపయ్య కొడుకులు గుడకా ఇంత స్టయిల్‌గా ఇంత అందంగా ఉండరు. ఇతని భార్య మదన టీచర్ ఇంతకంటే అందగత్తె! ఎంత అద్భుతంగా ఉండారు ఇద్దరూ! ఈయన మాదిరి అందంగా లేకపోయినా బాగాచదువు కొని మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిచ్చుకుంటే ఈ మాదిరిగా వుండొచ్చు నేమో! అనుకుంటా ఆయన వెనకాల నడుస్తా వుండాను. అంతలోనే మరవ ఏరొచ్చింది కుళ్లాయప్ప రొంటాలకు వొస్తా ఉందన్న్యాడు. సరే అని, ఆగినాను. సుబ్బన్న సారూ నారాయణా వెళ్ళిపోయినారు.

రోంత సేపు అయినంక మేమిద్దరం ఓబుళ నారాయణ గురించి మాట్లాడు కుంటా నడుస్తా వుండాము.

‘నారాయణా ఈ పిల్లోడు మీ ఇంటి దగ్గరే కదా ఉండేది. ఎప్పుడూ ఆ ఓబుళమ్మ టీచర్ దగ్గరే వుండేవాడంట. పెండ్లిగాని ఆ టీచరమ్మ దగ్గర రాత్రింబగళ్లూ యేం పని వుండేదప్పా ఈ పిల్లోనికి?’ అని కుళ్లాయప్ప అడిగినాడు. ‘ఆ టీచరమ్మకు మన పల్లెలో ఇంట్లో ఒంటరిగా పండుకోవడానికి భయమయ్యేదంట! అందుకే ఓబుళ నారాయణ పండుకుండే వాడని నాతో చెప్పేవాడు కుళ్లాయప్పా! అది గుడకా దూరంగా పండుకుంటే వొప్పుకుండేది కాదంట! చిన్న పిల్లోని మాదిరి పక్కనే పండుకోబెట్టు కుండేదంట!’ అని నాకు తెలిసింది చెప్పినాను.

‘ఏమో నారాయణా బయటోళ్లకు ఏమి తెలుస్తాది? ఈ పిల్లోడయినా అట్ల పోకుండా వుండాల్సిండె! వయసులో వుండే పెండ్లిగాని ఆ టీచరమ్మయినా, వయసొచ్చిండే మగపిల్లోన్ని అట్ల రాత్రిపూట ఇంట్లో పండుకోమని చెప్పకుండా వుండాల్సిండె. ఎట్లోలే పదిమంది గుసగుసలాడుకోకముందే ట్రాన్స్పరయ్యి ఆయమ్మ వెళ్లిపోవడం మంచి దయ్యింది’ అని అన్న్యాడు కుళ్ళాయప్ప. నిజమే అన్న్యాను నేను. రోంతసేపయినంక మల్లా కుళ్లాయప్ప మదనా టీచరు నగిరి సుబ్బన్నల సంగతి ఎత్తుకొని ఓబుళ నారాయణ, ఆ టీచరమ్మ దగ్గర గుడకా చాలా క్లోజ్‌గా వుంటాడని అంటారు. నేను మా మాదిగిండ్లు వొదిలి బయటికే రాను నారాయణా! వాళ్లూ వీళ్లూ అనంగా వినిండేదే’ అని అన్న్యాడు.

‘సిగ్గూ బిడియమూ ల్యాకుండా అదెట్లుంటాడో అర్థమే కాదు కుళ్లాయప్పా! మొత్తానికి ఈ మనిషి, కొత్తగా వొచ్చిండే టీచరమ్మలకు ఇట్ల ఎంత ఈజీగా దగ్గరయితాడో ఆశ్చర్యమైతాది. మనిషి గుడకా మనకంటే నల్లగా, ఏమంత బాగుండడు కదా! కొత్త టీచరమ్మలకు, వొచ్చిన రెన్నాళ్ళకే అట్ల క్లోజ్ కావడమంటే ఈ మనిషి మంచి నైపుణ్యముండే వాడే అనిపిస్తాది. ఉండనీలే, మనకేం గానీ ఈ సుబ్బన్న సార్ కతే ఆశ్చర్యమనిపిస్తాది. అంతా తెలిసి గుడకా ఆ కుంటి నారపరెడ్డి, వీళ్లకు ఇంటిని బాడుగకు ఎట్లిచ్చినాడో మల్ల!’ అని నేను తర్వాత సంగతి చెప్పేది ఇష్టం ల్యాక చెప్పలేదు.

‘అవునంట నారాయణా! ఈ సుబ్బన్నకు ఇద్దరు పెండ్లాలంటనే! ఇంగొగాయమ్మ తాడిపత్రిలోనో యాడో పనిచేస్తాదంట! రెండు వారాలకొగసారి వొస్తా వుంటాదంట! అది అందరికీ తెలుసునంటనే. నువ్వన్నెట్లు భార్యాభర్తలిద్దరూ కాపురముండే చోటికి ఇంకొగ ఆడమనిషి అప్పుడప్పుడు వొచ్చి పోతా వుంటే చుట్టుపక్కలుండే జనం ఏమనుకుంటారు అనేది గుడకా ల్యాకుండా ఈ రెడ్డోళ్లు అంతా తెలిసీ ఏమీ మాట్లాడకుండా ఎట్లుండారో? అసలు ఇంటిని బాడుగకు ఎట్లిచ్చినారు? పల్లెల్లో ఇట్లాటి విషయాలు జరుగుతా ఉండడం ఆశ్చర్యమే అనిపిస్తాది’ అన్న్యాడు కుళ్లాయప్ప విస్తుపోతా.

‘నారపరెడ్డోళ్ల యాల మాట్లాడతారప్పా? ఉండేది వాళ్లిద్దరే. పైగా పరమ పీసినోళ్లు, వీళ్ల పుణ్యాన కమ్మగా తింటా వుండారు. ఆదివారం వొచ్చిందంటే చాలు కోడి కొయ్యల్సిందే! చపాతీలో, అలసంద వడలో చేయ్యల్సిందే, కోడి కోసి బొచ్చు పీకి మచ్చు కత్తితో కోడికూర ముక్కలు ముక్కలు చేసేకి మనోడు వుండాడు కదా! నారపరెడ్డోళ్ల ఇంట్లో వంటా, సుబ్బన్న సారోళ్ల ఇంట్లో భోజనాలు! వొగ ఆదివారమే కాదు, మిగతా దినాల్లో గుడకా నారపరెడ్డోళ్లు సొంత వంట చేసుకుండేదే లేదంట! సుబ్బన్న సారోళ్లు బాడుగకు ఆ ఇంట్లో చేరినప్పటి నుండి నారపరెడ్డోళ్లకు దినామూ పండగేనంట! అట్లాంటప్పుడు సుబ్బన్నసారోళ్ల ఇంటికి ఆడోళ్లు ఎవురొస్తేనేమి ఎవురు పోతేనేమి? వాళ్లకొచ్చే బాడుగ వస్తా వుంది. దినామూ పండగ భోజనం అబ్బుతా వుంది. ఇంగ మిగతా సంగతులు వాళ్లకెందుకు?’ అని నేను గెనుం మింది నుండీ కిందుండే సీల్దావలోకి దిగినాను.

‘ఇంతకూ సుబ్బన్నకు ఒరిజినల్ భార్య మనూరి టీచరమ్మనా? లేకుంటే అప్పుడప్పుడు వచ్చే ఆయమ్మనా నారాయణా?’ కుళ్లాయ్యప్ప అడిగినాడు. ‘ఏమో కుళ్లాయప్పా ఎవురికీ పూర్తిగా తెలీదు. ఓబుళ నారాయణ చెప్పేదాన్నిబట్టి తాడిపత్రి నుంచో ఎక్కడి నుంచో వచ్చే ఆయమ్మ సుబ్బన్న మొదటి భార్య అంట! ఈ టీచరమ్మ రెండోభార్యంట! ఆయమ్మకు సంతానం కాకుంటే, ఈయమ్మను పెండ్లిచేసుకుండాడంట! చేసుకుండాడో, పెట్టుకుండాడో ఆ దేవునికే తెలసల్ల! అదంతా యాటికన్నా పోనీలే, రెండు కాకుంటే మూడు పెళ్లిళ్లు చేసుకోనీలే. ఎవురికి బాధ! నమ్మేకి వీలుగాని సంగతేమంటే, తాడిపత్రి నుండి ఆ మొదటి భార్య వొచ్చినా, ముగ్గురూ భలే వుంటారంట! శెలవులప్పుడు పగలుపూట గుడకా వొగే పరుపు మింద, మధ్యలో సుబ్బన్న, ఆ పక్కా ఈ పక్కా ఈ ఆడోళ్లిద్దరూ పండుకుంటారంట! మన ఓబుళ నారాయణ పోయినా సిగ్గూ ఎగ్గూ యేమీ ల్యాకుండా అట్లనే పండుకోనే మనోడ్ని మాట్లాడిస్తారంట! ముగ్గురూ చిలిపి చేష్టలు చేసుకుంటా ఉంటారంట! మనోడు ఇంకొగ విషయం గుడకా చెప్పినాడు. అదెంత నిజమో యేమో గానీ, ఈ గోపాలకృష్ణుడు సుబ్బన్న ఆడోళ్ల ఎదల మింద చేతులు పెట్టి, బస్సు రబ్బర్ హార్న్ వొత్తుతారే అట్ల వొత్తుతా, పియాంగ్ పియాంగ్ అని అంటా నవ్వుతాడంట! మనకు చెప్పేకీ, వినేకే సిగ్గయితాది. యేమో, మనకైతే తెలీదు గానీ మొగోళ్లు అట్లుంటారా? సంసారంచేసే ఆడోళ్లు అంత సిగ్గూ ఎగ్గూ ల్యాకుండా వుంటారా?’ అని నేను చెపుతానే కుళ్లాయప్ప ఆశ్చర్యపోయినాడు. ఏమైనా ఇట్లాంటివాళ్లు మన పల్లెల్లో వుండగూడదని అనుకుంటా ఊరు చేరుకుండాం.

(ఇంకా ఉంది)

Exit mobile version