[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
ఆకలి కడుపులూ, ఆకూ అలములు తిండి..
నాయన మల్లా ఆకుల గంపెత్తుకొని పల్లెలకు పోయినాడు. ఇంట్లో బువ్వ గింజలు పూర్తీ అయిపోయినాయి. నాయన తిరిగి వచ్చేకి మూడు నాలుగు దినాలు పడతాది. అంతదంకా యెట్ల జెయ్యల్లబ్బా! అని దిగులు పడతా చాకల చౌడక్క వాళ్ల ఇంట్లో నాలుగు శేర్ల కేసరి బియ్యం బదులు తెచ్చి, అర్థశేరు బియ్యం వండింది అమ్మయ్య. అన్నం అందరికీ చాలదని, వొంచిన గంజిలోకి ఉప్పు కలిపి తిరగ్గొట్టి తలాకొగ గ్లాసునిండా పోసి ఇచ్చింది. చిన్నోడు పెద్దన్న గ్లాసుతో గంజి తాగేకి అవస్థ పడతా ఆకలితో ఆత్రపడతా వుంటే చూసి నవ్వుతా అమ్మయ్య గంజిని పళ్లెంలో పోసి చల్లార్చి తాపిచ్చింది. పయిటాల కాకముందే కడుపులో పేగులు అరచబట్టినాయి. తమ్ముడు తన జతగాళ్లతో కలిసి ఆడుకున్నెంత సేపు ఆడుకొని వొచ్చి ‘ఆకిలయితాంది, బువ్వ పెట్టు మా’ అంటా అమ్మయ్యను సతాయిచ్చసాగినాడు. మేము అడగలేదు గానీ మాకందరికీ ఆకలిగానే ఉంది. వొండిండేది పయిటాల కాకముందే తింటే, పొద్దు మునగక ముందే మల్లా ఆకలని అడుగుతామని, అమ్మయ్య పొద్దు బుచ్చసాగింది. కడాకు తమ్ముడు ఏడ్చబట్టినాడు. మేము ఏడ్చల్యాక అడగల్యాక ప్రాణాలు బిగబట్టు కుండాం. చెల్లెళ్లు వొగరి తరువాత వొగరు ఆకలి మా యేందీ తినేకి లేదా? అంటా ఈడిగల పడసాగినారు. బువ్వలోకి కలుపుకుండేకి చింతొక్కు గుడకా అయిపోయిందర్రా! అని దొంతికుండలో ఉండే వొట్టి మిరపకాయలు ఐదారు తీసుకొని ఇత్తలి పళ్లెం వారగా వొంచి, మిరపకాయల్లోకి కాసిన్ని నీళ్లు. చింతపండు, ఉప్పు కలిపి వేళ్ళతో నలిపి, పిసికి అన్నంలో కలిపి తలా రెండు ముద్దలు పెట్టింది. అట్ల తినేది అందరికీ అలవాటే! అందుకే అందరమూ ఆవురావురమని తిని, వొగొగరు చెంబెడు నీళ్లు తాగినాం. కడుపులో అరట తగ్గింది. మా ఊరి పేదోళ్లు ముచ్చుకోట కనుమకు పోయి దేదారాకు (దేవదారు ఆకు) పీక్కొని వొచ్చి ఉడకబెట్టి తింటారని తెలుసుకొని, రేప్పొద్దున్నే నువ్వూ, పెద్దక్కా పోయి పీక్కోని రాండప్పా అని చెప్పింది అమ్మయ్య. మా ఊరికి ముచ్చుకోట కనుమ ఏడెనిమిది మైళ్ళ దూరం వుంటాది. నేనెప్పుడూ ఆ పక్కపోలేదు. మా ఊరోళ్లతో కలిసి పోవల్లనుకుండాం. నేను మూడో తరగతి చదివేటప్పుడు గంజి కరువులో మా చుట్టుపక్కలుండే పల్లెలోళ్ళు చాలా మంది దేవదారాకు పీక్కొని వొచ్చి తినిండే సంగతి గుర్తుకొచ్చింది. ఇప్పుడెట్లన్నా గాని పోదామనుకుండాం.
పాపచ్చి పండ్లు తిని..
పొద్దు వాలింది. పెద్దన్నగాడు మల్లా ఆకిలి మా, యేం దన్నా వుంటే పెట్టు మా అని అమ్మయ్యను బ్రతిమాలుతా వుండాడు. నేను కొడవలి తీసుకొని, వాన్ని పిలుచుకొని ఢమాంగుట్ట కాటికి పోయినాను. ఆడ ఏడెనిమిది పాపచ్చి చెట్లుండాయి. చెట్లనిండా బాకుల మాదిరి ముండ్లు (ముళ్ళు) యెల్లబొడుచుకుండాయి. ఆ ముండ్ల సందుల్లో పాపచ్చికాయలు ఎర్రగా వుండే దాండ్లకోసరం వెతికినాను. రెండు మూడు చెట్లల్లో మాగిండే పాపచ్చి కాయలను అప్పుడే ఎవురో కోసుకోని పోయినట్లుందనుకొని, పై పక్కనుండే చెట్లకాటికి పోయి చూసినాను. వొగొగ చెట్టులో ముప్ఫైనలభై మాగిండే పాపచ్చిపండ్లు కనిపిచ్చినాయి. కొడవలితో కొమ్మల ముండ్లను వొయినంగా జివిరి, కష్టపడి, ఇరవై పండ్లను కోసినాను. వొగ పండు మిందుండే ముండ్లను బండమీద మెల్లగా రాకీ, పై చిప్పను ఎగరగొట్టి, పండును వొగ చేతిలోకి వొత్తినాను. ఎర్రనిగడ్డ బయటకొచ్చింది. తినమంటే తమ్ముడు తినలేదు. యేందో అనుకుండాడు వాడు. నేను తిని, చూపిచ్చి వానినోట్లోకి సగం పెట్టినాను. ఎంత తీయ్యగుందో అని సంబరపడతా ఇంగొగటి కావల్లన్న్యాడు. ఆవురావురావురమని రెండు పండ్లు తిన్న్యాడు. మిగతావన్నీ వొల్లిగుడ్డలో మూటగట్టుకొని ఇంటికొచ్చి అందరికీ ఇచ్చినాను. సంబరపడతా తిని కడుపు నింపుకుండాం అందరమూ. దినామూ ముఫ్పై నలభై పాపచ్చి పండ్లను కోసుకొని రావొచ్చనుకొని, ఎక్కడెక్కడ పాపచ్చి చెట్లుండాయో ఆలోచించి నాను. పాపచ్చి పండ్లను తినేటప్పుడు దాంట్లో పై భాగంలో లోపల, విష్ణుచక్రం మాదిరి వొగ గుండ్రని రంపం ముండ్లుంటాయని, దాండ్లను తీసేసి తినకుంటే అవి గొంతులో ఇరుక్కుంటాయని, అందరికీ భయం చెప్పినాను.
దేదారాకు (దేవదారాకు) మాడ్చుకొని తిని..
తెల్లవారుజాముననే లేచి మొగాలు కడుక్కొని బోయ నారాయణ, రామాంజి నేయులు, రామాంజినమ్మ ఇంగా కొంతమంది మా ఊరోళ్లతో కలిసి ముచ్చుకోట కనుమకు నేనూ, పెద్దక్కా బయలుదేరినాం. తాడిపత్రి రోడ్డు వెంట చక్రాయపేట, పెరవలీ, నాయనపల్లి క్రాసింగూ, నాయనపల్లీ, మడ్డిపల్లీ, దాటిపోతానే కనుమ వొచ్చింది. ఈ కనుమలో నుంచే ఆకుకోసి బండ్లల్లో, మా చెరువు కింద ఉండే పల్లెలకు తెచ్చి అమ్ముతారనేది గ్నాపకమొచ్చింది. కనుమలో అడుగు పెట్టేటప్పటికే పొద్దు పొడిచింది. కనుమ అంటే పెద్ద పెద్ద మాన్లతో చాలా దట్టంగా వుంటాదనుకుండాను నేను, అదేందీ లేదు. అంతా, సోషియల్ బుక్కులో చదివిండే చిట్టడవి. ఎక్కువగా పలువరాకుచెట్లూ తురక్యాప నీర్యాప చెట్లూ రకరకాల కంపచెట్లూ వుండాయి. అంతా కణికరాళ్లు, తెల్లరాళ్ళు, సున్నారపు గరుగు! కనుమ లోపలికి పోయినాం. బోయ నారాయణ, దేవదారు చెట్టను చూపిచ్చినాడు. నేను తకుముందెన్నడూ చూల్లేదు. అదే, మొదటిసారి చూసినాను.
దేదారాకు (దేవదారు) చెట్లు పెద్ద మాండ్ల మాదిరి లేవు. చక్కగా, పొడవుగా పెరిగినాయి. పెద్దపెద్ద కొమ్మలు, రెమ్మలు లేవు. ఆకు మునగాకు కంటే చిన్నగా, చింతాకు కంటే రోంత పెద్దగా ఉంటాది. చాలా చెట్లల్లో అందినంతదంకా ఆకును ఎవురో పీక్కుండారు. మేము ఇంగా రోంత లోపలికి, ఆకు బాగుండే చెట్లకాటికి పోయి గబగబా ఆకునంతా వొగగంట లోపల దండిగా పీక్కొని దుప్పట్లల్లో మూటగట్టుకొని, ఊరికి బయలుదేరినాం. అంబిడిపొద్దుకంతా ఇల్లు చేరుకుండాం. ఆకు మూటల్ని చూసి అమ్మయ్య సంబరపడింది. అప్పుడే వొంచిన అన్నం గంజిలోకి ఉప్పు రాళ్ళేసి తిరగ్గొట్టి ఇచ్చింది.
వొగమూట దేదారాకులో ఉండే పుల్లల్నీ, ఈనెల్నీ, అందరమూ కలిసి యేరేసినాం. అమ్మయ్య ఆకునంతా డబరాగిన్నెలో కడిగి, వొగ పెద్ద కుండలో ఉడకబెట్టింది. ఉడికే లోపల చాకలి చౌడక్కోళ్ళ ఇంట్లో వొగ పావు తవుడు ఇప్పిచ్చుకొని వొచ్చింది. అయిదారు వొట్టి మిరపకాయలు, ఉప్పు రోట్లో వేసి దంచింది. దేవదారాకు వుడకబెట్టిన కుండలోని నీళ్లన్నీ వొంచి పారబోసింది. చల్లారిన ఆకునంతా గట్టిగా పిండేసి, వుల్లుల్లు అయిన ఆకును డబరాల్లో వేసి దాంట్లోకి తవుడూ, ఉప్పు, కారము వేసి బాగా కలిపి, రవ్వంత నోట్లో వేసుకుని రుచి చూసి బ్రమ్మాండంగా ఉందప్పా అని నాకు వొగ తట్టలో కణికెడు పెట్టింది. నేను రోంత తిని చూసినాను. చాలా బాగుంది మా, అని నేను తింటా ఉంటే చూసి, లొట్టలేసుకుంటా పిల్లోల్లందరూ పళ్యాలు తెచ్చుకుని, దేదారాకు పెట్టిచ్చుకొని నోటికి రుచిగా ఉందేమో, ఆవురావురుమని తిన్న్యారు. మిగిలిండే పచ్చి ఆకును రేపటికని అమ్మయ్య తడిబట్టలో చుట్టి పెట్టింది.
దబ్బజమ్ము కంకులు తిని..
పయిటాల దాటింది. నేనూ, పెద్దక్కా మళ్లమధ్యలో వుండే కాలువపొర్రల్లో పచ్చిగడ్డి కోసుకొని వొచ్చేకి పోయినాం, అయితే ఆ పక్కనుండే పొలాల్లో పచ్చిగడ్డిని కోసుకోనీయలేదు. ‘మీకున్నెట్లే మాకూ పసులుండాయి గదప్పా’ అని దండిచ్చినారు. మేము యేటిగడ్డ కాడికి పోయి చిట్టితుంగా, సొంటిగడ్డీ కోసుకుండాం.
పయిటాల బువ్వ తినలేదు కదా, గంటసేపు గడ్డి కోసేటప్పటికి ఆకలి అయింది. ఇంటికి పోతే తినేకి ఏమీ ఉండదని తెలుసు. ఇంట్లో బత్తెం గింజలున్నెప్పుడు ఎందుకో ఆకలయ్యేదికాదు. లేనప్పుడే విపరీతమైన ఆకలి. ఆకలి పేదరికానికి గుర్తేమో అనుకుంటా యేటిమడుగులో పెరిగిండే దబ్బ జమ్ము పక్క చూసినాను. జమ్ము కంకులిడిసింది. అవి న్యాతగా వుండాయని పోయి వొగకంకిని చేతితో పైకి జవిరినాను. చేతినిండా మెత్తని సుంకు వొచ్చింది. ఇంతకుముందు తినిండే అలవాటుతో సుంకును తిన్న్యాను. తియ్యగా, వొగరుగా, కమ్మగా ఉంది. రెండు కంకుల సుంకు తిని యేటి నీళ్లు తాగినాను. కడుపు నిండింది. పెద్దక్క గుడకా రెండు కంకుల సుంకు తినింది. ఇంట్లో వాళ్లకోసరం ఐదారు కంకులు కొడవలితో తెంచుకొని గడ్డిమోపులో పెట్టుకొని ఇద్దరమూ ఇంటికొచ్చినాం. వొస్తానే తమ్ముడు దగ్గరికొచ్చి ‘ఆకిలయితాంది నా, పాపచ్చి కాయల చెట్ల కాటికి పోదాం పాన్నా’ అని చేయి లాగ సాగినాడు. వానికి జమ్ము కంకులు చూపించి, వొగదాన్ని జవిరి వానికి తినిపిచ్చినాను. వాడు ఇష్టంగా తిన్న్యాడు. అమ్మయ్యా, వెంకటలక్ష్మి తిని కడుపు నింపుకుండారు. అందరికీ ఆకలి తగ్గింది.
ఈ మాదిరిగా అడవులూ చెట్లూ చేమలూ మడుగులూ ఉంటే బీదాబిక్కి ఆకలైనప్పుడు ఆకులో, అలములో చెడిదీ పడిదీ యాదో వొగటి తిని బతకొచ్చునను కుండాను. అనుకుంటావుంటే, బాటమాన్లల్లోని జివ్విపండ్లూ, వేప్పండ్లూ, బంకిరికిపండ్లూ తినిండేదంతా గుర్తుకొచ్చింది.
సందకాడ నాయనొచ్చినాడు. కాళ్లూ మొగమూ కడుక్కున్నెంక పిల్లోళ్ళందరూ పాపచ్చికాయలు, దేదారాకు, దబ్బజమ్ము కంకుల సంగతంతా సంతోషంగా చెప్పినారు. ‘ఇన్నాళ్లు పోతే యెట్ల? ఇండ్లూ, పిల్లోళ్లు గ్నాపకమే రాలేదా? మా సితేమి, గతేమి అనేది అరువు ల్యాకుండా సంసారాన్ని గాలికి వొదిలేసిపోతే యెట్లనుకుంటివి?’ అని అంటా అమ్మయ్య కన్నీళ్లు కార్చింది. ‘ర్యాగడికొత్తూరు ఉత్సిలోళ్ల నాగలింగారెడ్డికీ ఆయప్ప తమ్మునికీ ఆస్తి పంపకాల్లో గొడవలొచ్చినాయని, ఊర్లో వుండే పెద్ద మనుషులందరూ బలవంతం చేయడం వల్ల అక్కడే వుండాల్సి వొచ్చింద’ని నాయన సంజాయిషి మాదిరి చెప్పినాడు. ఆ మాటలు విని అమ్మయ్య మల్లా నోరెత్తలేదు.
ఈ తడవ నాయన జొన్నలు, కొర్రలు, రాగులు అన్నీ కలిపి సుమారుగా ముప్పై శేర్లకు పైగా ఆకులమ్మిన గింజలు తెచ్చినాడు. అవి వొగవారం దినాలకు సరిపోతాయని అమ్మయ్య మనస్సు రోంత కుదటపడింది. ఈ వారం దినాలలో కోమటోళ్లను కాళ్లో కడుపులో పట్టుకుని నాలుగైదు మూటలు వడ్ల గింజలు నాగుకు తెచ్చుకొని కాలం గడిపితే, ఆ లోపల వరిమళ్లు కోస్తారని, కోతలప్పుడు అందరూ కష్టపడితే వొగ పది మూటలు కూలిగింజలు జమ చేసుకోవచ్చునని గట్టిగా అనుకుంది.
మొన్న ఆకులు అమ్ముకొని ఇంటికి వొచ్చినప్పటి నుంచి నాయనకు బాగాలేదు. వొగరోజు సందకాడ వాంతులైనాయి. అమ్మయ్య పరకతో, చెప్పుతో దిష్టి తీసింది. వాంతులు తగ్గినాయి గానీ, చలీ జ్వరము తగ్గలేదు. మల్లా సందకాడ టెంకాయ చిప్పలో మిరపకాయలు ఇంగా యేంటివేంటివో వేసి దిష్టితీసింది. ఆకలిగా లేదంటే గంజికాసి తాపిచ్చింది. రెండు దినాలు వరకు జ్వరం తగ్గలేదని, రామేవాళ్ళ నారాయణరెడ్డిని పిలుచుకోనొచ్చి చూపిచ్చింది. ఆ మామ నాయన చెయ్యి పట్టుకొని నాడిచూసి, లోజ్వరము, రక్తపోటు రెండూ వుండాయని చెప్పి, ‘వెంకటస్వామి ఎందుకో కొంచెం భయపడినట్లుంది కేశమ్మా! మాత్రలు ఇస్తాను. రెండు పూట్లా వాడండి. వొగ పూట అన్నం నున్నగా వొండి మిరియాలచారులో బాగా పిసికి తాగిపిచ్చండి. నాలుగు దినాలు ఆకులమ్మేకి పోకుండా రెస్ట్ తీసుకుంటే మేలమ్మా’ అని అమ్మయ్యతో చెప్పి మాత్రలు ఇచ్చి పోయినాడు. నాయన మాత్రలు మింగకుంటే బలవంతంగా మింగిచ్చింది అమ్మయ్య. నాయన దిగులుపడతా ఉంటే, అమ్మయ్య బాధపడింది. ‘యాల యెదారు పడతావు? యెదారు పడితే కట్టాలు తీరుతాయా? ఎట్లనో రొన్నాల్లు కాలం దొబ్బితే, అంతో ఇంతో పంట సేతికొత్తాది. నలుగురముండాము, వరి కోతలప్పుడు కూలికిపోయి సమ్మత్సరం బత్తెంగింజలు జమ జేసుకోలేమా? నువ్వు యాటికీ పోవద్దు, దిగులు పడొద్దు’. అని నాయనకు ధైర్యం చెప్పింది. యేమీ మాట్లాడకుండా నాయన పండుకుండాడు.
నాయన ఇంట్లో పండుకున్నన్ని నాళ్లూ మేము పిల్లోళ్లం యేమి తినేదీ, యేమి తాగేదీ నాయనకు తెలియనీయ లేదు అమ్మయ్య. చాకలి చౌడక్కతో బదులు తెచ్చిండే బియ్యం గింజలు, నాయన ఆకులమ్మి తెచ్చిండే బత్తెంగింజలు, పట్టుకొని పట్టుకొని చూచ్చూసి వాడతా, వొగపూట గంజి, వొగపూట రాగిముద్దా, వొగపూట జొన్న బువ్వ చేస్తా వుంది. పిల్లోల్లు ఆకలి అయినప్పుడు చప్పిడి కాకుండా వాళ్లకు నేనూ, పెద్దక్క పాపచ్చి పండ్లో, జమ్ముకంకులో తెచ్చి ఇస్తాండాం. రెండు మూడు దినాలు మా ఊరోళ్లతో కలిసి ముచ్చుకోట కనుమకు పోయి మూడు నాలుగు దినాలకు అయ్యేటంత దేదారాకును పీక్కొని వొచ్చినాం. వొచ్చేటప్పుడు కూతలేరు గట్లల్లో ఈతచెట్ల సుళ్లను నరికేసి, మధ్యలో వుండే ఈత కొబ్బరిని ఎవురో తింటాంటే చూసినాను. చూస్తానే నాకు కొత్త ఆలోచనొచ్చింది.
ఈత కొబ్బరి తిని..
రెండో శనివారం, ఆదివారం రెండు దినాలు శెలవులొచ్చినాయి. అమ్మయ్యతో అసలు సంగతి చెప్పి, దొడ్డికాడ కంప చెట్టును కొట్టేసి వస్తాం రాండని నేనూ, పెద్దక్కా మిగతా వాళ్ళిద్దర్నీ పిలుచుకొని చాకిరేవు గుట్ట కాటికి పోయినాం. గుట్టవారన సుమారుగా ఈత చెట్లుండాయి. కొన్ని పెద్ద చెట్లు, కొన్ని మనిషెత్తుండే చెట్లు. నేను గొడ్లితో వొగపక్కనుండే కొమ్మల్ని కొట్టేసినాను. పెద్దక్క చిన్న చిన్న రెమ్మలను మచ్చుగత్తితో నరికింది. చెట్టు దగ్గరికి పొయ్యేకి సందేర్పడింది. నేను చెట్టు దగ్గరికి పోయి పైనుండే సుడిరెమ్మల్ని జవిరేసి, సుడి మధ్యలో కొబ్బరి మాదిరుండే ఈత గడ్డను చెక్కలు చెక్కలు కొట్టి పెద్దక్క చేతికిచ్చినాను. పెద్దక్క చెక్కలన్నింటిని నా వొల్లిగుడ్డలో వేయసాగింది. ‘ఈత గడ్డల్ని, పీచు వచ్చేదంకా’ నరుక్కుండాను. ఈతగడ్డ చెక్కలు సుమారుగా వొగ చాటెడయినాయి.
‘దీండ్లను యేం జేత్తారన్న’ అని తమ్ముడు ఆసక్తిగా అడిగినాడు. ‘ఇది ఈత కొబ్బరి రా’ అని నేనూ, పెద్దక్కా తలా వొగ చెక్క ముక్క నోట్లో పెట్టుకొని కొబ్బరి నమిలినట్ల నమిలి యెంత కమ్మగా ఉందోనని మింగుతా వుంటే వాడూ, వెంకటలక్ష్మీ లొటకలేసుకుంటా నాలుగైదు ముక్కలు గబగబా నమిలి, అవును ఎంత కమ్మగా వుంది ఈతకొబ్బరి అని తృప్తిగా తింటా ‘అమ్మయ్యకూ, నాయినకూ తీసకపోదాం నా’ అంటా ఆరాటపడినారు.
నాయనకు జ్వరమొస్తా వుంది కదా, ఇది నాయన తినకూడదు. మీరెవురే గాని నాయనకు చెప్పగూడదని అందరికీ బెత్తుబెట్టి ఈత కొబ్బరిని రేపటికి అయ్యేటంత మూటగట్టుకొని ఇల్లు చేరుకొని అమ్మయ్యకు చూపిచ్చినాను. ఆకలిగా ఉందని అమ్మయ్య కూడా నాలుగైదు ఈత కొబ్బరి చెక్కల్ని మెచ్చుకుంటా తృప్తిగా తినింది.
***
చెరువులో నీళ్లు బాగా తగ్గిపోయినాయని పెట్టుకోనుండే పంటలకు సరిపోతాయో లేదోనని అందరూ అనుకుంటావుండారు. ఆ మాటలు వింటావుంటే ఇంట్లో అందరికీ భయం చుట్టుకుంది. నా చదువు, గాల్లో పెట్టిండే దీపం మాదిరి అయితా ఉంటే, నాకు మరింత భయం చుట్టుకుంది. మేము కోరుకు చేసిండే మళ్లు కొంచెం తగ్గులో వుండడంవల్ల పంటకేమీ ఇబ్బంది ఉండదని, చుట్టుపక్కలుండే రైతులు చెపుతా వుండినా, మనసులో మాత్రం భయంగానే ఉంది. చెరువులో నీళ్లు పంటకు సరిపోయినా పంట చేతికొచ్చేకి ఇంగా వొకటిన్నర నెల పడతాదని నాయన ఎలకంటి పెద్ద పాపయ్యను వొగ నాలుగు మూటలు వడ్లు నాగుకు అడిగినాడు. చెరువులో నీళ్లు పంటకు సరిపోతాయో లేదో అని అనుమాన పడతా పంట పండకుంటే నాగు గింజలు యెట్లిస్తావు వెంకటస్వామీ అని నాయనను కతికిచ్చి ములాజ ల్యాకుండా అడిగినాడు పాపయ్య. అవన్నీ పుకారు మాటలనీ పంటకు నీళ్లు సరిపోతాయని తగ్గులో వుండే మా మడికయ్యలకు ఆ ఇబ్బందేమీ ఉండదని, నాయన ధైర్యంగా చెప్పినాడు. నాయన మిగతావాళ్ల మాదిరి తారాతిగిడి మనిషి కాదని, పెద్ద పాపయ్య శెట్టికి తెలుసు. అందుకే నాలుగు మూటలు కేసరొడ్లు ఇచ్చేకి వొప్పుకొని నాలుగు మూటలకు నాగుతో కలిపి ఐదు మూటలు ఢిల్లీ భోగాలు ఇవ్వల్లని కండిషన్ పెట్టినాడు పాపయ్య. నాయన సరే అని వొప్పుకుండాడు. నాలుగు మూటల కేసరొడ్లు అమ్మయ్యా, పెద్దక్కా, నేనూ కలసి వడ్లబండ మింద ఉండే రోళ్లలో దంచి ముడిబియ్యం చేసుకుండాం. వడ్లు మంచి గట్టిగింజలు అయినందువల్ల ముడిబియ్యం రెండు మూటలకు పైబడే అయినాయి.
దశరా శెలవులు అయినంక స్కూలు ఓపెన్ అయ్యింది. మొదటి దినమే కాలు పరీక్షల పేపర్లు ఇచ్చినారు. నాకు ఇంగ్లీషు, లెక్కలు పేపర్లలో ఫెయిల్ మార్కులు వొచ్చినాయి. సత్యనారాయణ సార్ బాగా అరిచినాడు. సార్ అరిచినందుకు నేను బాధపడలేదు. మార్కులు తక్కువ వొచ్చినందుకు తక్కువ రావడానికి ఇంటి పరిస్థితులు కారణమైనందుకు చాలా బాధ అయింది. వచ్చే అర్ధపరీక్షల్లో ఇంటి పరిస్థితులు పట్టిచ్చుకోకుండా బాగాచదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవల్లని మనసులో గట్టిగా అనుకుండాను.
ఋష్యశృంగునికొండ-బోదగడ్డి
కూలి పనులు యావీ లేనందువల్ల సక్రమంగా స్కూలుకు పోతావుండాను. అయితే పొద్దు పొడచకముందు నుంచి ప్యాడాగసువు దిబ్బలో, వేసిరావడమూ, గాటిపాట్న వొగ మూల గుంతలో ఉండే పసువులు పోసిన గంజు, టెంకాయ చిప్పతో కడవలోకి తోడుకొని నెత్తిమింద గోనెసంచి కొప్పిరేసుకొని భుజమ్మీద ఎత్తుకొని దిబ్బలో పోసిరావడమూ తప్పడం లేదు. బోదగడ్డి మావూరి కొండల్లో సరిగా లేదు. వొగ కొండకు బోదగుట్ట అని పేరుందేగానీ బోదగడ్డి గంటలు వెతికితేగానీ కనిపిచ్చవు. అందుకే మా ఊరోళ్ళు పనులు లేనిదినాల్లో మట్లగొంది దగ్గరుండే రుషింగమయ్య కొండకు బోదగడ్డి కోసుకొని వచ్చేకి పోతారు. వాళ్లతోపాటు నేనూ పోతావుండాను. వొచ్చే సమ్మత్సరం కొరివిపల్లి బాపనోళ్ళ మడి కోరుకు ఇస్తారని దిబ్బలో ఎరువు ముప్ఫై బండ్లు అయ్యేటట్ల చూడల్లని పసువుల కిందికి బోదగడ్డి దండిగా కోసుకొని వొచ్చి వెయ్యల్లని నాయన గట్టిగా చెప్పినాడు. దాన్ని మనసులో పెట్టుకొని వెంకటలక్ష్మికీ అమ్మయ్యకూ ప్యాడగసువు గంజు దిబ్బలో వేసేపని పెట్టి నేనూ, పెద్దక్కా ఇద్దరమూ గడ్డి కోసుకోనొచ్చేకి రుషింగమయ్య కొండకు పోతావుండాము. నాకు స్కూల్లో స్లిప్ టెస్టులు ఉండే రోజు నేను గడ్డి కోసుకొని వొచ్చేకి పోకుండా, ప్యాడాగసువు నూకే పనిచేస్తాను. చెల్లెండ్రిద్దరూ రుషింగమయ్య కొండకు పోతారు.
రుషింగమయ్య (ఋష్యశృంగుని) కొండ మా ఊరికి మూడు మైళ్ళ దూరం వుంటాది. మా ఊరికి ఎదురుగా మాగాణికి ఉత్తరం పక్కన, గోవిందరాయునిపేట, అక్కడి నుంచి సలకం చెరువు రోడ్డు వెంట వొగ మైలు దూరంపోయి మాలకొండ మోట్లో ఎడమ పక్కకు తిరిగి బండి జాడెంట మల్లా వొగ మైలు దూరం పోతే, రుషింగమయ్య కొండ వొస్తాది. కొండదడి కింద మున్నూటా అరవై దినాలూ చిన్నగా పారే చెలిమ ఉంది. దాంట్లో నీళ్లు టెంకాయపాల మాదిరి తెల్లగా, తేటగా, కమ్మగా ఉంటాయి. అక్కడి నుంచి కొండపైన ఉండే రుషింగమయ్య దేవాలయానికి మెటికలు ఉండాయి. ఆ కొండ తూర్పు నుంచి పడమరకి పోను పోను ఎత్తుగా గుర్రం వీపు మాదిరి ఉంటాది. పడమర వైపునుంచి శింగనమల వాళ్లు వొచ్చేకి అక్కడా మెటికిలు వుండాయి. అవి తల్లకిందులుగా ఉంటాయి. అందుకే ఎక్కడం కష్టం. తూర్పువైపుండే మెటికలు, ఏటవాలుగా, ఎక్కడానికి సులభంగా వుంటాయి.
ఆ కొండలో గడ్డి కోసుకొని వచ్చేకి మా ఊరోళ్ళు ఆకాశంలో గొరుకొయ్యలు పుడతానే అందరూ బోనాకట్టెలూ, తాళ్లూ, చిక్క్యాలూ కొడవళ్లు తీసుకొని బయలుదేరుతారు.
మూడు మైళ్లు నడిచి కొండెక్కినా తెల్లవారదు. సగం ఎక్కినంక మెటికల పక్కనే వొగచోట పెద్ద బండ ఉంది. బండకు తూర్పు పక్కన గోడ కట్టినట్లు పెద్ద గుండ్లు వుండాయి.
ఈసుగాలి బుయ్యమని వీచినా ఆ గుండ్లచాటుకు గాలి పెద్దగా రాదు. బండమీద అందరమూ తెల్లవారే లోపల వొగ కునుకేస్తాం. తెల్లవారగానే దిక్కులకొగరు పోయి చిక్క్యాలతో వొంచి కట్టుకొని గబగబా గడ్డికోసుకొని నాలుగైదు వొంచెలు వొగచోట కుప్పబోసి మట్టంగా మట్టలు మట్టలు గడ్డి పేర్చుకుంటా మోపు విరిగిపోకుండా, మధ్యలో బోనాకట్టి పెట్టి దానిపైన గడ్డి పేర్చి ఆ చివరా, ఈ చివరా బోదగడ్డి వెన్నులు ఎల్లిడిసి నాలుగు తాళ్లతో బిర్రుగా బిగిచ్చి మోపును కడతాం. కట్టిన మోపుల్ని తలకాయల మింద కొందరు, మెడల మింద కొందరు యెత్తుకొని, మెటికల మింద గబగబా పరువెత్తుతా కొండదిగి, చెలిమ కాడ అందరూ మోపులు దించుతాం. బోదగడ్డి వెన్నులు బయటకు ఎల్లిచ్చి కట్టిండే మోపుల్ని ఎత్తుకొని గునక పరుగుతో కొండ దిగుతా వుంటే మోపులు జివ్వాడ్తా వుంటే వెన్నులు చుంగులు చుంగులుగా పైకి కిందికి ఊగుతా వుంటే ఎంతో దర్పంగా కనిపిస్తాది. గడ్డికోసే దాంట్లో, చుంగులుపోసి మోపుకట్టే దాంట్లో, మెటికల మీద కొండ దిగేదాంట్లో, మా ఉప్పరోళ్ల పుల్లన్న మామ, గాండ్లపర్తి వెంకటరెడ్డి వాళ్లిద్దరూ తప్ప మిగతా వాళ్లల్లో నన్ను మించినోడు ఇంకెవురూ లేడని అందరూ అంటా ఉంటే నేను గర్వంతో మురిసిపోతా వుంటాను. అందరూ మోపులు యెత్తుకొని కొండ దిగొచ్చినంక, చెలిమకాడ ఉండే సన్నని నున్నని ఇసుకతో పండ్లు తోముకొని మొగాలు కడుక్కొని ఆ తీయని నీళ్లు తాగి, మల్లా మోపులెత్తుకొవి బండి జాడెంట వరుసగా నడుస్తా ఇల్లు చేరుకుంటాం. చేరుకుంటానే నేను అమ్మయ్య పెట్టింది. బిరబిరా తిని పుస్తకాల బ్యాగు సంకకు తగిలిచ్చుకొని జతగాళ్లను కలుసుకొని స్కూలుకు పోతాను. ఒక్కొగసారి నేను బయలుదేరే లోపలే జతగాళ్లు చాకరేవుగుట్ట దాటుతా వుంటారు. అప్పుడు పరిగెత్తి పరిగెత్తి గస పోసుకుంటా పోయి వాళ్ళను కలుసుకుంటాను.
ఆ పాపంటే భలే ఇష్టం నాకు!
ఆదివారం ప్యాడాగసువు నేను నూకుతాన్లే, ముగ్గురూ గడ్డికోసుకొనొచ్చేకి పోండి అని అమ్మయ్య అనడంతో ముగ్గురమూ రుషింగమయ్య కొండకు మా ఊరి వాళ్లతో కలిసి పోయినాం. నా చెల్లెళ్లతో పాటు నలుగురైదుగురు ఆడోళ్లొచ్చినారు. అందులో అనంతమ్మ, చౌడమ్మ ఉండారు. ఇద్దరూ మా కులస్తులే! ఇద్దరూ నాకు వరసైనోళ్లే. అనంతమ్మ నాకంటే రెండేళ్లు పెద్దది. తెల్లగా బలే అందంగా ఉంటాది. నేను మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో చేరిన సమ్మత్సరానికి బడి వొదిలేసింది. ఆ అయమ్మను చూసినప్పుడల్లా ఇంత అందంగా ఉండే మనిషి చదువుకొని వుంటే, ఎంత బాగుండేది, పైగా మంచి చేను, మడి వుండాయి వాళ్లకు. ఆ మామ అనంతమ్మను చదివిచ్చొచ్చు కదా, అని అనుకుంటాను. చౌడమ్మ ఇంచుమించు
నా ఈటి వయసుదే. నల్లగనే ఉన్న్యా చాలా కళగా ఉంటాది. చక్కని పలువరస, చిలక ముక్కు ఉంగరాల జుట్టు! అన్ని రకాలా నాకంటే బాగుంటాది. భలే చలాకి పిల్ల. చదువుకోనుంటే నాతో పాటు శింగనమల హైస్కూల్కి వస్తే ఎంత బాగుండేదో!
ఆదివారం చౌడమ్మ రుషింగమయ్య కొండకు వొస్తాదని నాకు తెలీదు. ఆ పాప రావడం చూసి, మా చెల్లెండ్రు రాకుండా వుంటే బాగుండేది అనుకుంటా, అందరితోపాటు నడుస్తా రుషింగమయ్య కొండకు చేరుకుండాను. కొండెక్కేసరికి తెల్లారింది. దిక్కలకొగరు పోయి గడ్డి కోసుకుండేకి వొంగినారు. చౌడమ్మ నాకు దగ్గరలో, మా పెద్దక్క వెంకటలక్ష్మి కొంచెం దూరంగా గడ్డి కోస్తా వుండారు. అందరూ జాంతాన మాడ్తా, తమాషాగా మాటలు మాట్లాడుకుంటా నవ్వుకుంటా గడ్డి కోసుకొని వొంచెల్లోకి వేసుకుంటా వుండారు. చౌడమ్మ నాపక్క చూస్తా, నేను తనపక్క చూసినప్పుడు తల పక్కకు తిప్పుకుంటా వుంది. ‘ఏమే సౌడీ, చిలకముక్కు దానా, చదువుకుండే బావ దయదల్సి నీకు గడ్డికోసిత్తాడని మా అన్నయ్య పక్క పక్కనే తారాడతాండావే! యేంది కత?’ అంటా మా పెద్దక్క చౌడమ్మను జాంతనమాడింది.
‘నేనేమీ ఈ దబ్బిడి ముక్కాయప్ప మీ అన్నయ్య పక్కన తారాడలేదు లే వొదినా, మీ అన్నయ్యే తారాడుతా నా దెగ్గిరి దెగ్గిరికి వొత్తాండాడు. మీ అన్నయ్య దయదల్సి నాకు గడ్డి కోసీయ్యల్సిన పనేం లేదులే! కావల్లంటే మీ అన్నయ్యను అడగమను, నేనే కోసిత్తాను! బుక్కులు చదివేదనుకొని పాపం కొండగెడ్డికి వొచ్చినాడు. ఈ కర్రిమామ’. అని చాలా గడుసుగా మాట్లాడుతా అదొగ రకంగా నాపక్క చూసింది చౌడమ్మ. ఆ పిల్ల నన్ను దబ్బిడి ముక్కోడని అన్నెందుకు నాకు కోపం వొచ్చింది. నేను ఏమీ మాట్లాడలేదు. మాట్లాడేకి నాకు సిగ్గయ్యింది.
ఈ సిలక ముక్కు దానికి ఎంత గర్వం! ఈ పిల్ల నాకు గడ్డి కోసిస్తాదా? కోసీమని నేను అడగల్లనా? అవురా? ఈ పిల్లకు తెలీదా, నేను యా రకంగా కొండగడ్డి కోస్తానో, గడ్డిమోపుని ఎట్ల కడతానో? దీనికన్నీ తెలుసు! ఊరకనే నన్ను ఆట పట్టిచ్చల్లని అట్లా మాట్లాడతావుంది. నిజంగా నేను చేతగానోన్నయితే, నా పక్క అట్ల యాల చూస్తాది? అనుకుంటా, ఒగరినొగరు యెకసక్యాలాడుతా నవ్వుతా బేల్తా గడ్డి కోసేవాళ్లను చూస్తా ఉంటే అలుపే కలుగలేదు. గడ్డి కోస్తా ఉన్నట్లే లేదు. ఎవురికివాళ్లు గడ్డి కోసుకొని మోపులుకట్టి ఎత్తుకొని ఎల్లవారినాం. ‘రోంత మోపెత్తుదురాప్పా’ అని చౌడమ్మ పిలిచింది నన్ను. నేను వెళ్లి మోపెత్తుతా, ‘నేను దబ్బిడి ముక్కోన్యా? నాకు నువ్వు గడ్డి కోసిచ్చేదానివా? అయితే మోపెత్తుకోలేవా?’, అంటా ఆ పాప మొగం లోకి చూసినాను. ఏమీ మాట్లాడకుండా సిగ్గుతో తలొంచుకొని మోపెత్తుకొని మెటికల దగ్గరకు పోయింది. నేను మోపును నిలబెట్టి వీపుల మీదికెత్తుకొని మెడల మిందకు వేసుకొని ధన ధనమని దిగుతా, చౌడమ్మను దాటేసి గునక పరుగుతో చెలిమ కాటికొచ్చి మోపు కిందికేసినాను. ఇంకా చాలామంది కొండ దిగిరాలేదు. నేను ఎదురు పోయి చౌడమ్మ మోపును ఎత్తుకోనొచ్చినాను. అది చూసి ‘మన నారాయణగానికి చౌడమ్మంటే ఎంత ఇదో చూడప్పా! చెల్లెళ్లకు ఎదురుపోయి వాళ్ళ మోపులు ఎత్తక రాకుండా, చౌడమ్మ ఎత్తుకోనొచ్చినాడు’ అని జాంతనమాడినాడు వెంకట్రెడ్డి. నేను నవ్వుతా, మల్లా పైకి ఎదురుబోయి పెద్దక్క మోపెత్తుకోబోయినాను. పైనుంచి పెద్దక్క గమనిచ్చిందేమో, కోపంగా మొగం పెట్టి ‘బొగెత్తుకుంటావులే తీ’, అని మోపు ఇవ్వకుండా కిందికి దిగింది. నేను ఇంకా పైకిపోయి అవస్తపడతా వస్తా వుండే వెంకటలక్ష్మి మోపునూ ఎత్తుకొని దిగుతా, ‘పొరపాటు చేసినాను, వెంటనే ఎదురొచ్చి, పెద్దక్క మోపునూ మల్లా వెంకటలక్ష్మి మోపునూ యెత్తుకొని వొచ్చింటే బాగుండేది’ అనుకుంటా వెంకటరెడ్డి మాటల్ని గుర్తుచేసుకొని లోలోపలే నవ్వుకుంటా కిందికి దిగినాను.
వానొచ్చినప్పుడు మా ఇల్లు..
మమ్మల్ని నష్టపరిచేకే అన్నెట్లు జూలైలో వొచ్చిన వాన మా సీతయ్య మడిని నాశనం చేసి పాయ. మమ్మల్నే కాదు మా పెద్దకాలువ కిందుండే ఇరవై మంది రైతుల్ని గబ్బు లేపి పాయ. అంత పెద్దవాన అంతలక్కా పడిందా అంటే అదీలేదు. ఆ వాన, చెరువుకు పైదాల పడింటే చెరువు మరువ పారేది. రెండు పంటలు పండేటివి. అంత పెద్ద వాన, యాలొచ్చింది? అప్పటినుంచీ వానలు పడతానే ఉండాయి. అన్నీ దోన్లు పారే వానలే! అన్నీ రుతువు దప్పిన వానలే! ఎవురూ చేని పంటలే పెట్టలేదు. మాల్యవంతం, బండ్లపల్లి, పొప్పూరు, బత్తలపల్లీ ఎక్కడా శెనిక్కాయ పంటే పెట్టలేదంట! అనంతపురం చెరువుకు రెన్నెళ్ల నీళ్లు గుడకా రాలేదంట! సంక్రాంతి శెలవుల ప్పుడు ఈ చెరువు కిందా పంటలుండవు. దగ్గర్లో ఎక్కడా పనులుండవు. యాలనో దేవుడు వొగొగసారి ఇంత అన్యాయం చేస్తాడు! నిరంతరం వానల్ని నమ్ముకోకుండా బతికేకి వీలుకాదా?
రాబోయే గడ్డుకాలాన్ని గురించి ఆలోచిస్తా స్కూలుకు పోయొస్తా చదువుకో సాగినాను. చిత్తకార్తె వొచ్చింది. చిత్తమోదులు ఎప్పుడొస్తాయో తెలీదు. ఎండలు దంచుతా ఉండాయి. రాత్రిపూట ఉడక. ఇంట్లో పండుకోబుద్ధి కాదు. మిద్దె మీదికి పోయి చాపలూ, గోనెపట్టలూ పరుచుకొని పండుకుంటాం. పండుకున్నెంక రోంత సేపటికే దబదబా చిత్తమోదు వాన. అదన్నా పది నిమిషాలు పడతాదా అంటే అదీ ల్యా. వొగ మోదు, అర్ధనిమిషం పడి ఆగిపోతాది. చినుకులు పడతానే అందరూ కిందికి దిగి, ఆకాశంలో నక్షత్రాలను చూసి, ఇంగ వానరాదులే, అని మల్లా అందరూ పైకి పోతాం. తెల్లవారే లోపల మూడు నాలుగు సార్లు మిద్దెమిందికి ఎక్కడమూ దిగడమూ అయితా వుంది.
జూలైలో పెద్ద వానొచ్చి, మిద్దె మింద ఉండే చౌడుమన్నంతా కొట్టుకొని పోయింది. మల్లా చౌడు వేయాల్సిండె. పనుల వల్ల, సీతయ్యమడి దిగులువల్ల వెయ్యలేదు. చిత్తకార్తి వొచ్చినప్పటినుంచి అప్పుడప్పుడు దోన్లు పారే వాన్లు పడతా వుండాయి. ఆ మాత్రం పడినప్పుడల్లా ఇల్లు కారబట్టింది. పొటుకు ఎత్తబట్టింది. రెండు మూడు సార్లు గుమ్మళ్లు పడినాయి. సాయంత్రం స్కూలుకు పోయి వస్తానే ‘వానమాడం బాగా పట్టిందప్పా మిద్దె మిందికి పోయి రోంత గుమ్మళ్లు చూసిరా’ అని చెప్పింది అమ్మయ్య. నేను మిద్దె మిందికి పోయి అంతలక్కా కాళ్ళతో తొక్కి చూసినాను. మూడు నాలుగు చోట్ల కాలు పుసక్కన దిగబడింది. అయ్యెయ్యో అనుకుంటా గాట్లో వుండే గడ్డి తెమ్మని పెద్దక్కతో చెప్పినాను. ఆ పాప సందెడు గడ్డి తెచ్చింది. వరట్ట రంగయ్యోళ్ళ మిద్దెమిందికి మెల్లగా అడుగులో అడుగేసుకుంటా పోయి, వొగ మూలలో ఉండే చవుడు రెండు చాట్ల నిండా దొంగ మాదిరి తెచ్చింది. నేను గడ్డిని చుట్టలు చుట్టి గుమ్మళ్లల్లో దురికి, పైన చౌవుడు కప్పి, ఇంక ఫర్వాలేదులే అనుకొని కిందికి దిగొచ్చినాను.
రాత్రి బువ్వ తిన్నెంక బుడ్డీదీపం పూర్తిగా తగ్గించి పండుకుండాను, అప్పటకే అందరూ నిద్రపోతా ఉండారు. నేను ఎల్లెలకల (వెల్లకిల) పండుకొని పైన దంతెల పక్క చూస్తా ఆలోచిస్తా ఉండాను.
మిద్దెమీద కాళ్ళతో గట్టిగా తొక్కుతానే కాలు దిగబడింది. ఆ దిగబడిన కాలును బయటకు తీసి చూస్తే, కంది పుల్లలు, పత్తి పుల్లలు, జొన్నదంట్లు ఉండాయి, దాండ్లపక్కనే జముడు దంతెలు. ఎన్నాళ్లయిందో ఇల్లు కట్టి? ఇల్లు కట్టినప్పుడు వొంకిరి దూలాల మింద అడ్డంగా వొగదాని పక్కన వొగటి జముడు దంతెలు వేసినారు. వర్షం వొచ్చినప్పుడు కిందికి నీళ్లుదిగి ఆ పుల్లలూ, జముడు దంతెలూ నానితే మిద్దె కప్పు కుప్పకూలిపోతాది. కూలిపోతే ఏమిగతి? ఇల్లు కట్టి ఇన్నూరు మున్నూరేండ్ల య్యిందేమో నా కండ్ల ముందరే ఏడెనిమిది సార్లు ఇంటి పైకప్పు కారింది. కారినప్పుడల్లా దంతెలు నాని ఉంటాయి. అయినా భద్రంగా ఉండాయంటే ఆశ్చర్యమే!
ఆలోచిస్తా, నిద్రలోకి జారుకుండాను. అంతలోనే అమ్మయ్య చెప్పినట్లే వర్షం వొంగింది. నాకు మెలకువ వొచ్చింది. నేనొక్కడినే మేలుకుండాను. అందరూ బాగా నిద్ర పోతా ఉండారు. వాన, సుమారుగా వొగ అర్థగంట సేపు గట్టిగా పడి తగ్గినట్లుంది. నేను లాటిన్ ముట్టిచ్చి వాకిలితీసి చూసినాను. వాన మెల్లగా పడతావుంది. అంత లోనే, అమ్మయ్య పక్కన పండుకోనుండే చిన్నపాప జయమ్మ కిర్లుకొని లేచి, గట్టిగా ఏడ్చింది. అమ్మయ్య లేచి చూసింది. ‘పాప మింద పొటుకు చుక్కలు పడతా వుండాయిరా’ అని పాపను యెత్తుకుంది. తమ్ముని మింద పొటుకు పడతా వుంది. వాడు తెప్పరిల్లుకొని ‘అమ్మా నీళ్లు మా’ అని పైకి లేచినాడు. రోంతసేపటికి అందరూ లేచినారు. పొటుకెత్తే చోట డబరా పెట్టినాను. ఇంగొగ చోట పొటుకు! తపెల పెట్టినాను. పోటుకెత్తే చోటల్లా చెంబులూ, గిన్నెలూ, గ్లాసులూ పెట్టినాం! ఇల్లంతా పొటుకెత్తుతా వుంది! పరుచుకోనుండే గోనిపట్టాలూ, చాపలూ తడిచిపోకుండా చుట్టిపెట్టినాం. ఎక్కడా కూర్చుండేకే స్థలం లేదు. మిద్దె అంతా కారుతా ఉంది. నేను గోనిపట్టను కొప్పెరేసి తలకాయ మింద కప్పుకొని, బుడ్డిదీపం తీసుకోని కొట్టం తడకవాకిలి తీసి, అరగోడ అవతల, పొయ్యిల దగ్గర చూసినాను. కొట్టం పైనుండీ ఇంజాప దగ్గర కోళ్లు గెదిరిండే చోట తడకల సందుల్లో నుంచి చిన్నగా చినుకులు అరగోడమీద పడతా వుండాయి తప్ప, ఇంకెక్కడా కారలేదని అక్కడ పండుకోవచ్చునని అందర్నీ కొట్టంలోకి పిల్చుకొని పోయినాను. ఇంటికంటే కొట్టమే బాగుందనుకొని అందరూ వొగరి పక్కన వొగరు ఇరుక్కొని పండుకుండారు.
పాప ఎంతసేపటికీ పండుకోలేదు. ‘రేపు ఎట్లన్నాగాని ముగ్గురూ పోయి వొగిరవై గంపల చవుడు తొక్కోనొచ్చి మిద్దె అంతలక్కా యెయ్యల్లప్పా’ అని చెప్పింది అమ్మయ్య. ‘అవునమ్మా వేసుకొనే తీరల్ల’ అని ఇంటి తలుపులకు బీగం వేసొచ్చి కొట్టంలో పిల్లోల్ల పక్కన వొదుక్కోని పండుకుండాను.
కోరుగింజలన్నీ కల్లంలోనే అయిపాయ!
చెరువులో నీళ్ళన్నీ అయిపోయినాయి. అయితే మాగాణి పంటంతా బయట పడింది. వరి కోతలు ముమ్మరంగా సాగుతా ఉండాయి. నన్ను స్కూలుకు శెలవు పెట్టమన్నాడు నాయన. ఈసారి కూలి గింజలొక్కటే మిగిలేదని, సమ్మత్సరానికి అంతా అవే గతి అన్న్యాడు. స్కూలుకు పోకపోయినా పర్వాలేదు, తొమ్మిదో తరగతిలో ఫెయిల్ అయినా పర్వాలేదు, కూలి గింజలొచ్చే అవకాశాన్ని వొదులుకోగూడదని నేనూ అనుకుండాను. సొంతూర్లోనే, కండ్ల ముందర కనిపిచ్చే కూలి గింజల్ని పోగొట్టుకుంటే మల్లా రావనుకొని, స్కూలుకు సెలవు పెట్టి వరి కోతలకు పోవడం మొదలు పెట్టినాను. ఇప్పుడు ఇంట్లో నేనూ, అమ్మయ్యా, పెద్దక్కా, వెంకటలక్ష్మీ మొత్తం నలుగురం కూలికి పోతావుండాము.
ముగ్గురం వరి కోతలకూ, వెంకటలక్ష్మి దున్నపోతులు తోలుకొని పడుగులు తొక్కిచ్చేకి పోబట్టినాం. ఆరేండ్ల తమ్ముడు, ఉయ్యాలలో ఉండే చిన్న పాపను చూసుకుండేకి ఇంటి కాడే ఉంటాడు. చిన్న పాప ల్యాకుంటే వాడూ పరిగలు ఏరుకుండేకి పనికొచ్చేవాడే నని అనుకుండాను. నేను మడి కోత పనికీ, రాత్రిపూట కుప్పలు కొట్టి కల్లాల్లో నుంచి ఊర్లోకి వడ్లు మోసే పనికీ పోతా నేనొక్కడినే దినానికి సగటు ఇరవైఐదు శేర్ల వడ్ల గింజలు ఇంటికి తెస్తా వుండాను. మిగతా ముగ్గురూ దినానికి ముప్పై శేర్లకు పైబడే తెస్తా వుండారు. ఈ రకంగా వరి కోతలు వొగనెల దినాలుంటే, ఎంత బాగుంటాది! దరిద్రమంటే, పదైదు మూటలకు పైగానే కూలి గింజలు తెచ్చుకుంటే, సమ్మత్సరం పొడవునా బత్తెం గింజలకు దిగులే ఉండదు కదా అని అనుకుండాను. కానీ మూడు వారాల లోపల్నే వరి కోతలన్నీ అయిపోయినాయి. ఈ మూడు వారాల్లో మా మళ్ల కల్లాలు వొడుపుకుండేకే నాలుగు దినాలయిపాయ. ఆ నాలుగు దినాల్లో మేము తెచ్చుకుండే కూలి గింజలు రాకపాయ. దాంతో సొట్టాబట్టా ఎనిమిది మూటలు కూలి గింజలు జమైనాయి.
సీతయ్యమడిలో వొగఅద్దెకరానే కదా మేము మడి నాటుకోనుండేది. అది గుడకా సరిగా అతుక్కోలేదు. పిట్టకేసిండే మడిలోని పైబురదంతా సారమంతా రాకాసి మాదిరి పారిండే వంకనీళ్ళకు నున్నగా కొట్టుకొని పోయిండె కదా! మరి ఆ మడిలో ఊరోళ్ళు దయతలచి ఇచ్చిండే నారు నాటినంక పైరు సరిగా అతుక్కోక త్యాపలు త్యాపలుగా పేనుకొరికిన తలకాయజుట్టు మాదిరి ఉన్నింది. అట్లాంటి మడి కోసి పడుగు తొక్కిచ్చినంక వడ్లు ఐదు మూటలు అయినాయి. అయినా పర్వాలేదని సంతోషపడి, చెప్పిన మాటప్రకారం ఐదు మూటల ఢిల్లీ భోగాలు అన్నీ నాగుకు తెచ్చుకోండే బాకీకి గాను పెద్ద పాపయ్యోళ్ల ఇంటికి నేరుగా పంపిచ్చినాడు నాయన.
నాగుకూ సుంగిడికీ తెచ్చుకుండే బాకీకి, పేపర్లలో రాసుకుండేదీ బొట్నేలి వొప్పితం వేయిచ్చుకుండేదీ సాక్షి సంతకం చేయిచ్చుకుండేదీ ఏమీ ఉండదు. అట్లని బాకీతీసుకు న్నోళ్లు ఎగరగొట్టేదీ మల్లా ఇస్తాములే అనేదీ వుండదు. ఊర్లో షావుకార్ల దగ్గర డెబ్బై ఎనభై కుటుంబాల పేదోళ్లు సుంగిడికో, నాగుకో తెచ్చుకుంటారు. పెట్టిండే పంట కోస్తానే అనుకున్న మాట ప్రకారం బాకీలు తీరుస్తారు. ఇది మా ఊర్లోనే కాదు మా చుట్టుపక్కల ఉండే పల్లెలన్నీటిలోనా రైతులందరూ ఈ పద్ధతిలోనే బాకీ తెచ్చుకోవడాలూ, బాకీ తీర్చడాలు చేస్తారు. రైతులు ఎక్కడా ఎన్నడూ మాట తప్పిండే పుకార్లే లేవు. బాకీలిచ్చేండే ఆసాములు గుడకా ఐన్నూర్లిచ్చి, వెయ్యి ఇచ్చినామని నాలుగు మూటలు గింజలిచ్చి ఆరు మూటలిచ్చినామని బొంకిండే సంగతులు గుడకా లేవు.
సీతయ్యకయ్యల్లో కేసరొడ్లమడి ముక్కాలెకరా పుట్టెడు గింజలు అయింది. సరిగోరు కింద మాకు పందుమూ (ఆరున్నర మూటలు) సీతయ్యకు పందుమూ వొచ్చినాయి. మంచి పంట అయ్యిందని సీతయ్య సంతోషపడినాడు. వంక దెబ్బకు మూరెడు లోతు కోసుకుపోయిండే సీతయ్య మడికి ముప్పై నలభై లారీల చెరువు మన్ను తోలిచ్చి, మీకే కోరుకిస్తానని, అప్పుడు మూడు నాలుగు రోజులు మడి దగ్గరే ఉండి, తోలిచ్చిన మన్నంతా సదరం చెయ్యల్లని నాయనకు చెప్పినాడు సీతయ్య. నాయన సంతోషంగా ఒప్పుకొని సీతయ్యను సాగనంపి ఆ మడిలో మా భాగానికి వొచ్చిండే వడ్లన్నీ బాకీకి గానూ గుల్లే మునెప్పకు పంపినాడు. పండిన పంటంతా అప్పులోళ్ళకే సరిపోయినాయని అమ్మయ్య బాధపడింది. ఇంట్లో తిండి గింజలు లేనప్పుడు వాళ్ళు ఇచ్చిన గింజలతోనే కదా ఆకలి తీర్చుకోనుండేది, మనకు లేకపోయినా పర్వాలేదు, పశువులకు దండిగా మేత వొచ్చిందని అమ్మయ్యకు నచ్చజెప్పినాడు నాయన.
***
చలికాలమొచ్చింది. డిసెంబర్ నెలకంతా చెరువులో నీళ్లు పూర్తీ అయిపోయి, బురద మాత్రమే ఉంది. కట్టకింద ఉండే పేద రైతులందరూ చెరువులో కర్బూజా దోస వెయ్యల్లనుకొని, ఎవురికి చేతనైనంత వాళ్లు నేలలో గుర్తులు పెట్టి వొచ్చేకి ముసురుకుంటా ఉండారు. నాయనా, నేనూ చెదల్ల దగ్గరికిపోయి అక్కడి నుంచి చెరువులోకి నడుస్తా మోకాళ్ళ లోతు దిగబడే వొండు దగ్గరికి పోయి, అందాజుగా వొగ ఆరెకరాలంత వొండుబురదలో ఈతాకు మండలు చెక్కి గుర్తులు పెట్టినాం. బురద ఆరే లోపల నాయన సిద్దటం దగ్గరికి పోయి సిద్దోటం దోసకాయ విత్తనాలు కొనుక్కొని వొచ్చినాడు. ఇంటందరమూ ఆటికి పోయి ఒగ దినం విత్తనాలు వేసేకి దిగినాం. నాయనా, నేనూ బారెడు బారెడు సందిడిసి బేరీగా చేతులతో బురదలో చిన్నగా బారెడకు ఒగ గుంత పెట్టుకుంటా పోతావుంటే అమ్మయ్యా, పెద్దక్కా ఒక్కొగ గుంతలో ఒగటి రెండు సిద్దోటం విత్తనాలు పూడ్చుకుంటా వొచ్చినారు. విత్తనాలు పూడ్చేదంతా అయిపోయినంక చెరువు పక్క చూసినాం. చెరువుకట్ట దంకా, నల్లనేల అంతలక్కా ఎవురి ఓపిక కొద్దీ వాళ్లు విత్తనాలు పూడుస్తా కనిపిచ్చినారు. అందరమూ సందకాడదంకా ఆడే వుండి ఇంటికి యెల్లవారినాం.
‘అంతదూరం పోయి చెదల్ల కాడ గుర్తులుపెట్టి, యిత్తనాలేసుకుంటే రేప్పొద్దున దోస్చెట్లను చూసుకుండేకి ఎంత యెడాముడి? మనూరి కాలవతూముకు దగ్గరగా పెట్టుకోనుంటే బాగుండేది కదా, దినామూ మనూరు నుంచి అంతదూరం పోయి సుమారుగా నాలుగైదు మైల్లదూరం రావల్లంటే, ఎంత కట్టం’ అని గొనిగింది అమ్మయ్య.
‘తిక్కదానివి నీకేం తెలుస్తాది? మన ఊరు కాలవతూము కాడ ఇంగా పలుచగా నీళ్లుండాయి. ఆడ బురద ఆరేదెన్నడు. ఇత్తనం పెట్టేదెన్నడు? వైశాఖమాసంలో చెరువుకు ఎగదాల ఒగ పెద్ద వానొచ్చి తడకలేరు పారితే, దిగవకి తూము కాటికి నీళ్లొస్తాయి. నీళ్లల్లో దోస్చెట్లు తడిస్తే పంట అంతా గబ్బు గబ్బు కాదా? అంత అరువు ల్యాకుండా ఇత్తనం పెట్టినానని అనుకుండావా? అంతేగాదు చెదల్లనిండా మనకు కావాల్సి నోళ్లుండారు. వొగమాట చెప్పితే సాలు దోస్చెట్ల దగ్గరికి యెవుర్నీ రానియ్యరు. దూరం దూరం అని అంటా వుండావు. చెట్లు మొలిచి రోంత నిక్కినంక, యెనకలుండే వాళ్లకు ముందుండేవాళ్లు దావ వొదుల్తారు కదా!’ అని నాయన అసలైన కారణం చెప్పినాడు. అమ్మయ్య నవ్వుతా ‘బొలె మంచి యేసిన జేసినావే’ అని మెచ్చుకుంది. నాయన ఆలోచన తెలిసినంక నాకు సంతోషమయింది. అదీగాక ఎవురూ పెట్టని సిద్దోటం దోసిత్తనాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని ఆ విత్తనాలు తెచ్చినాడంట. సిద్దోటం దోసపండ్లు పచ్చని సారలతో, గుండ్రంగా, కిందిభాగంలో చంటిమొన మాదిరి బుడపతో భలే ముద్దు ముద్దుగా ఉంటాది. తినడానికి చాలా తియ్యగా ఉంటాది. అదంతా అనుకొనే నేను సంతోషపడినాను.
నాలుగైదు దినాలకు దోసిత్తనాలన్నీ మొలచినాయి. అయిదారు దినాలకి మొలకలు మారాకు లేసినాయి. ఒక్కొక్క చిన్న పాదులో రెండు మొక్కలు ఉండే చోట బాగా లేనిదాన్ని పీకేసినాం. కిందంతా సారవంతమైన వొండు మన్ను ఉండడం వల్లనేమో మొక్కలు భలే పెరుగుతా ఉండాయి. దోసచెట్లలో ఎక్కడా కలుపు మొక్కలే లేవు. లేకపోవడంతో పనేలేదు.
కణేకల్లు చెరువు కింద ఎండకారు పంటకు వరినార్లు పోసినారని, దూరమని అనుకోకుండా కాడిగట్టుకొని మడకదున్నేకి పోతే మంచి బాడుగలు ఇస్తారని నాయనతో ఎవురో అన్నారంట! ఆ సంగతి నాతోచెప్పి, మూడురోజుల్లో అయిదారు మంది కణేకల్లుకు యెల్లవారుతారంట! శెలవులొస్తానే నువ్వూ పోయి రాపోప్పా అని మెత్తగా చెప్పినాడు నాయన. ‘సలికి అంతదూరం సన్నపిల్లోడు యాడ బోతాడులే! ఆటికి పోయినంక జొరమో గిరమో వొత్తే యెవురు దిక్కు వానికి’ అంటా అమ్మయ్య వొద్దనింది. ‘యేం పర్వాలేదులే మా, నాకు తోడు మన ఊరోళ్ళు ఇద్దరు ముగ్గురొస్తేచాలు యేం భయం? అదేమన్నా వేరే దేశమా?’ అని అమ్మయ్యకు ధైర్యం చెప్పి కణేకల్లుకు పోయేకి సిద్దపడి, ఎట్ల పోవల్లనో అదెంత దూరమో వివరాలన్నీ నాయనను అడిగినాను.
మడక దున్నేకి నూరు మైళ్ల దూరం ఉండే కణేకల్లుకు..
మా ఊరి నుంచి కణేకల్లు సుమారుగా నూరు మైళ్ళు ఉంటాదని, అనంతపురం దాటినంక కూడేరూ, కడదరకుంటా బెళుగుప్పా వొస్తాయని, ఆట్నించీ మాళ్లెం మీద అడ్డం పోతే ఎనభై మైళ్లు ఉంటాదని, మధ్యలో తగ్గుపర్తి దగ్గర వొగ రోజు రాత్రి వుండిపోతే సరిపోతాదని చెప్పినాడు నాయన. బోయ నారాయణ వస్తా వుండాడు వానికి అన్నీ తెలుసులే అన్న్యాడు. అమ్మయ్య నాలుగుశేర్లు బియ్యము, అన్నం వండుకుండే తపెలా, చెంబూ, పళ్ళెమూ, చింతొక్కూ, చిట్లంపొడీ రాత్రి పరుసుకుండేకి, కప్పుకుండేకి వొగ గోనిపట్టా నల్లరగ్గూ వొగ అంగీ నిక్కరా అన్నీ మూటగట్టింది. నాయన బుడద మడక మోకును, పగ్గాలను అన్నీ సరిచేసి పెట్టినాడు. నేను బోయ నారాయణ, రామాంజినేయులు మిగతా ఇద్దరితో మాట్లాడొచ్చి రాత్రి దున్నపోతులకు మేత దండిగా యేసి దాండ్ల వీపుల్ని తట్టినాను.
రాత్రి ఆకాశంలో గొరుకొయ్యలు పడమటికి వాలేతలికే లేచినాను. నాయన దున్నపోతుల్ని కాడికి కట్టి కాడిమానుమీద మడకను తిప్పేసి కోటేరేసినాడు. నేను చలిపెట్టకుండా చెవుల మింద తలకాయకు టువ్వాలు బిర్రుగా చుట్టుకొని, కంబడి మాదిరుండే నల్లరగ్గును వీపుల మీదా దొమ్మల మీదా కప్పుకొని అంచులు భుజం పైన యేసుకుండాను. అమ్మయ్య రాత్రి కట్టిపెట్టిండే మూటను నా తలకాయమింద పొందిచ్చి పెట్టింది. అమ్మిడి పొద్దుకూ, పయిటాలకూ సరిపోయేటట్ల అన్నంచేసి సద్దిగట్టి ఇచ్చింది. ఖర్చులకు నాయన రెండు రూపాయలు ఇచ్చినాడు. ఇద్దరూ జాగ్రత్త అని సాగనంపినారు. ప్రయాణమైన అందరమూ పీర్లసావిడి దగ్గర కలుసుకొని బయలుదేరి అనంతపురం రోడ్డెక్కినాం. అదీ, ఇదీ మాట్లాడుకుంటా దున్నపోతుల కాండ్ల వెనక నడుస్తా ఉండాం.
అనంతపురం చేరుకుండేసరికి తెల్లారింది. చలికి రోడ్లల్లో జనాలు ఎవురూ లేరు. ‘పగలుపూట టౌన్‌లో ఇట్లా మడకలు కోటేరేసుకొని పోతే, టౌన్ నాయాల్లు, అందరూ బలిసిన్నాకొడుకులు, బొలే ఎగతాళి చేస్తారు నారాయణా! బిరబిర నడిచి టౌన్ దాటిపోదాం పదండి’ అని తొందరపెట్టినాడు నారాయణ చిన్నాయన. ‘పల్లెటూరోల్లంటే టౌనోళ్లకు యాలనో చులకన? అతగాల్లకు తినేతిండి అంతా యాట్నుంచి వొస్తావుండేది తెలియదేమో’ అని అంటా దున్నపోతులను అదిలిస్తా టవును పక్క చూస్తా వుండాను. చాలా దినాలకిందట చెంచులక్ష్మి సినిమా చూసేకి వొచ్చినప్పుడు చూడలేక పోయిన, ఐరన్ బ్రిడ్జి ఇదే అని, దాన్ని చూస్తా, దానిమింద నుంచి అనంతపురం కొత్తూరులోకి అడుగుపెట్టినాం. బ్రమ్మాండంగా
వుండే బజారునూ, రఘువీర టాకీస్‌నూ అద్భుతంగా ఉండే పెద్దగడియారాన్నీ చూసి ఆశ్చర్యపోతా, తాలూకాఫీసును రైల్వే గేటును దాటి బళ్లారిరోడ్డు పట్టినాం. అంబడి పొద్దుకల్లా కూడేరు దాటి కడదరకుంటకు చేరుకుండాం. ఊరవతల వొగ తోటబావి దగ్గర దున్నపోతుల్ని తలుగులు తప్పిచ్చి మ్యాత కోసరం బీటిచేన్లలోకి తోలినాం. బావి దగ్గర అందరమూ ముఖాలు కడుక్కొని బావిగడ్డమీద కూర్చొని సద్దులు విప్పి అమ్మిడిపొద్దు బువ్వ తిని వొగగంట సేపు చెట్లకింద కూర్చుండాం.
ఋతువులు తప్పి వానలు పడినాయేమో చాలా చేన్లలో ఉలవ వేసుకుండారు. కొన్ని చేన్లు బీడుపెట్టినారు. దానిలో పచ్చనిగడ్డి బాగా పెరిగింది. దున్నపోతులు మేసి వొకచోట పండుకొని నెమురేయ బట్టినాయి. రోంతసేపు అయినంక మల్లా కాండ్లు కట్టుకొని బయలుదేరినాం. నాయన చెప్పిండే ఊర్లు దాటుకుంటా పోతావుండాం. కొత్త కొత్త ఊర్లూ, పొలాలూ చూడల్లంటే నాకు భలే ఇష్టం. పొలాలన్నీ దిబ్బలు దిబ్బలు! ఎక్కడా చదునే లేదు! భూములన్నీ తెల్లగరుగు నేలలు! ఎక్కడా మంచి పంటల్లేవు. తెల్లజొన్న, పచ్చజొన్న, అంతలక్కా కంది, ఆముదము, ఉలవ వేసినారు. దీండ్లకంటే మావైపుండే పొలాలే మంచి భూములని ఆలోచిస్తా దరిదాపుల్లో ఎక్కడా పల్లెలే లేవని అనుకుంటా ముందుకు నడుస్తా వొగ పెద్ద వంక చప్పిడి మిందికి పోయినాం. ఇదే పెన్నానది సన్నోడా, అని నారాయణ చిన్నాయన చెపుతానే నా వొళ్లంతా గగుర్పాటు పొడిచింది. పుస్తకాల్లో చదివిండే పెన్నానది ఇదేనా! మరెందుకో ఇక్కడ ఇంత చిన్నగుందే! మూడు నాలుగేండ్ల కిందట పెద్దమ్మోళ్ల ఊరు పత్తికొండకు పోతా, పామిడి దగ్గర పెన్నానదిని చూసినాను. ఇదేనా అక్కడొచ్చే పెన్నానది అని ఆశ్చర్యపోతా, వంకలోకి దిగి దోసిలినిండా నీళ్లు తీసుకొని తాగుతా, మురిసిపోతా, పయిటాల అయితా ఉంది, పయిటాల బువ్వ ఇక్కడే తిందామన్న్యాను. అందరూ సరే అన్నారు.
అందరమూ పయిటాల బువ్వ తిని, పెన్నేటి గడ్డన రోంతసేపు గడిపి, మల్లా ప్రయాణమైన రామసాగరం క్రాసింగ్ దగ్గరికి పోయేటప్పటకే పొద్దుమునగొచ్చింది. ఉత్తరానికి పోయే రోడ్డు ఉరవకొండకు, దక్షిణానికి పోయేది కళ్యాణదుర్గానికి అని చిన్నాయన చెప్పినాడు. ఉత్తరం పక్క రోడ్లో ముందుకు పోతే, మొదట యెర్రి స్వామి రాంపురం వస్తాదని, ఆనెంక కౌకుంట్ల వస్తాదని ఆ ఊర్లో ఉండే షావుకారి కేశన్న, అనంతపురం జిల్లాలో మూడు వేల ఎకరాల భూములుండే పెద్ద భూస్వామి అని ఆ చిన్నాయన చెపుతా ఉంటే విని ఆశ్చర్యపోతా అట్లే ముందుకు పడమటికి పోతా వుండాము.
ఆ క్రాసింగ్ దగ్గర్నుంచీ అన్నీ నల్లరేగడి పొలాలు. పప్పుశెనగ, తెల్లజొన్న, ధనియాల పంటలు పెట్టినారు. అన్నీ చదరం భూములే. ఫైర్లు చాలా బాగుండాయి. రేగడి రైతులే రైతులని, ఎర్రనేలల్లో సకాలంలో వానలు కురిస్తేనే పంటలు పెడతారని, రేగడి నేలల్లో అక్టోబర్ చివర్లో రెండు పదునులు వానపడితే చాలు, ఈ పంటలు పెడతారని పప్పుశెనగ ఈ చలికే బ్రమ్మాండమైన పంట పండుతాదని, రేగడి రైతు తెల్లని ఇస్త్రీ బట్టలు నలగకుండా,
మాయకుండా సేద్యం చేస్తాడని ఇక్కడినుంచి అట్ల బళ్లారి వరకు ఇట్ల గుంతకల్లు, ఆదోని, రాయచూరు వరకు నల్లరేగడి భూములేనని నారాయణ చిన్నాయన చెపుతా ఉంటే విని నేను అబ్బురపోయినాను. దేశంలో ఎన్ని రకాల భూములో ఎన్ని రకాల పంటలో ఎన్ని రకాల మనుషులో, దేశాన్ని చూస్తే తప్ప తెలియదని అనుకుంటా నడుస్తా ఉండాను. అంతలోనే తగ్గుపర్తి ఊరొచ్చింది. ఊరి బయట రోడ్డుపక్కన ఉండే సత్రాన్ని చూసి ఈ రాత్రికి ఈడే వుండి, పొద్దున్నే పోవాలని అందరమూ అనుకుండాం. రాత్రికి తగ్గుపర్తిలో ఉండిపోవాలని నాయన చెప్పిండేది గుర్తుకొచ్చింది.
అందరమూ సత్రంలో దిగినాం. రోడ్డుపక్కన కట్టమింద కూర్చోనుండే ఆ ఊరోళ్ళు మా గురించి అడిగినారు. మేము చెప్పిన మాటలు విని ‘అయ్యో! అంత దూరం నుండి కణేకల్లుకు మడకలు దున్నేకి పోతాండారా? ఎప్పుడు యెల్లవారినారో యేమో పాపం! మంచిపని చేసినార్లే! ఈ రేత్రికి ఈడే పండుకొని, తెల్లారగానే యెల్లవారి పోతే అంతా అంబిలి పొద్దుకంతా కణేకల్లు చేరుకుంటారులే! ఈ రేత్తిరికి ఈడ నిలిచిపోతే పసులకు, మనుషులకు రోంత ‘బిడువు’ దొరుకుతాదిలే! రేత్రి తినేకి కవళం యేందన్నా తెచ్చుకున్న్యారా లేదా?’ అని ఎంతో ఇదిగా అడిగినారు. బియ్యము అన్నీ తెచ్చుకుండాం. రోన్ని పొయ్యిలో పుల్లలు దొరికితే అన్నం వండుకుంటాంలే అని చిన్నాయన చెప్పినాడు. ఈ చీకట్లో పొయ్యిలో పుల్లలు యాడ దొరుకుతాయర్రా? సరే నాయెంట ఇద్దురు రండి, మా దొడ్లో పొయిలో పుల్లలూ, పసలకు ఇంత గడ్డీ తెచ్చుకుందురు’ అంటా’ అని వొగ పెద్దయ్య పిలిచినాడు. నేనూ, రామాంజినేయులూ ఆ పెద్దయ్య వెంట వాళ్ల దొడ్లోకి పోయినాం. ఆ పెద్దయ్య సందెడు కట్టెలు వొగ మోపెడు జొన్నసొప్పా యిచ్చి చదువుకుంటాండావా ‘పాపోడా నువ్వు’ అని నా పక్కచూసి అడిగినాడు. నేను చదువుకుంటా ఉండే సంగతి చెప్పినాను. ‘అవునా పాపోడా’ అంట నా తల నిమిరినాడు ఆ పెద్దయ్య. ఆ పెద్దయ్య నా తలకాయ మీద చేయిపెట్టి ఓదారుస్తావుంటే నా కండ్లల్లో నీళ్లు పారాడినాయి.
ఆ పెద్దయ్య ఇంటికి పోయి వాళ్ళ మనిషితో వొగ నీళ్లబిందె, వొగ క్యారియర్ పంపిచ్చినాడు. క్యారీలో సెనగలకూర ఉంది. అదిచూసి ఆ పెద్దయ్య మంచితనాన్ని తలుచుకుంటా పొయ్యిగుండ్ల మింద అన్నం వండుకుండాం. అన్నం ఉమ్మిగిలే లోపల ఖాళీ బిందె క్యారియర్ తీసుకొనిపోయి నేనూ, రామాంజినేయులూ ఆ పెద్దయ్య వాళ్ళకి ఇచ్చి, ఎంతో సంతోషంగా ధన్యవాదాలు చెప్పినాము. నీళ్లబిందె తెచ్చిన ఆ పెద్దయ్య కొడుకు నా ఈడే తొమ్మిదో తరగతి చదువుతా ఉండాడంట! నేను థాంక్స్ చెప్పుతానే ఆ పిల్లోడు దగ్గరకు వొచ్చి నా చెయ్యి పట్టుకొని ‘వెను దిరిగి పోయేటప్పుడు ఇట్లే వొచ్చి పోండి నారాయణా’ అని అన్న్యాడు. ఆ పెద్దయ్య, ‘జాగ్రత్తగా పోండి పోపోడా! నువ్వేం బయపడకుండా కట్టపడి చదువుకో, మంచికాలమొత్తాదిలే’ అని అన్న్యాడు. ‘సరే పెద్దయ్యా’ అని చెప్పి సత్రం కాటికి వొచ్చినాం.
పున్నమి వెన్నెల సత్రంలోకి పడతా ఉంది. అందరమూ రౌండుగా కూర్చొని సెనగల కూరను తలాకింత పంచుకొని, పల్లెటూరి గాపుదనం రైతుల మంచితనాన్నీ సాటి మనుషుల మింద వాళ్లకుండే ప్రేమనూ తలుచుకుంటా వెన్నెల్లో కూర్చొని అన్నం తిని సామాన్లన్నీ సర్దిపెట్టుకుండాం. దున్నపోతుల్ని చెట్లకు పగ్గాలతో కట్టేసి అన్నిటికీ జొన్న సొప్ప మ్యాతేసి పొద్దుగలగ పండుకుండాం.
నేను ఎండయినా తట్టుకుంటాను గాని చలికి తట్టుకోలేను. అందుకే చెవులకు తలకు బిర్రుగా తువ్వాలు చుట్టుకొని సత్రంలో మూలకు చేరుకొని రగ్గుకప్పుకొని పండుకుండాను.
ఎంతసేపటికీ నిద్రపట్టలేదు. ఆ పెద్దయ్య కండ్లముందర కనిపిస్తా వుండాడు. అచ్చం నాయన మాదిరే ఉండాడు. నాయన మాదిరే ముతక పంచ గోసి పోసి కట్టుకొని మోకాళ్ళ పైకి యెగజెక్కినాడు. పైన సైనుబట్టతో కుట్టిచ్చిండే చేతుల బనీను తొడుక్కుండాడు. ముక్కూ, మొగము, రంగు అంతా నాయన మాదిరే! ఈ సత్రము ఎంత అనుకూలంగా ఉందో! పూర్వకాలమోళ్లు, తమ ఊరికి ఎవురైనా పరస్థలం మనుషులూ, పేదోళ్లూ వస్తే, రాత్రిపూట వాళ్లు తలదాచుకుండేకి ఇట్లాటి సత్రాలు, సావళ్లూ ఎంత బాగా ఆలోచనచేసి కట్టిచ్చినారో! ఎంత మంచి మనుషులు వాళ్లు! ఎంత మంచి ఆలోచన వాళ్ళది! పల్లెల్లో ఇప్పటికీ ఆ పెద్దోళ్ల ఆలోచనలు కొనసాగిచ్చడం ఎంత బాగుందో! అనుకుంటా నిద్రలోకి జారుకుండాను.
నిద్రలేచేటప్పటికి ఊర్లో కోళ్లు కూస్తా వుండాయి. అందరమూ కాల్లూ, మొగాలూ కడుక్కొని అన్నీ సర్దుకొని కాండ్ల మింద మడకలు కోటేరేసుకొని బయలుదేరినాం. బెళుగుప్పలో నుంచి బండి రస్తాలో నడుస్తా అనకనహాల్, మాళ్ల్యెం దాటి నారాయణ చిన్నాయన వెనక యేట్లోకి దిగినాం. యాదో చాలా పెద్ద యేరనుకొని చిన్నాయనను యేటి పేరు అడిగినాను. పెద్దహగరి అని చెప్పినాడు. యేటి మధ్యలో చిన్నగా నీళ్లు పారుతా ఉండాయి. అందరమూ యేరు దాటి కణేకల్లు మధ్యలో నడిబజారు పక్కనుండే ‘చంబేశ్వర’ గుడి కాటికి అమ్మిడి పొద్దుకంతా చేరుకుండాం. గుడి చుట్టుపక్కలంతా చూసి గుడి వెనకాల పసువుల్ని కట్టేసి, అన్నం వండుకుండేకి పూనుకుండాం. చుట్టుపక్కలుండే వాళ్లను అడుగుతానే పొయ్యిలో కట్టెపుల్లలు రెండు బిందెలు నీళ్లు ఇచ్చినారు.
***
పయిటాల దాటుతానే అయిదారు మంది వొచ్చి మమ్మల్ని చూసి మామడిలో దున్నేకి వస్తారా అని అడిగినారు. చాలాదూరం నుంచి వొచ్చినామనీ పసువులు ఈ పొద్దంతా తేరుకున్నెంక రేపటి నుంచి వస్తామన్న్యాం. మడక బాడుగ నాలుగున్నర రూపాయలుగా ఖరారు చేసుకుండాం. వాళ్ళను రెండు మోపుల పసువుల మ్యాత అడిగినాం. వాళ్లు సరే అన్న్యారు. రాత్రి గుడిలో పండుకుండేకి అనుకూలం చేసుకుండాం. అందరమూ తెల్లవారుజామునే అన్నం వండుకొని సద్దికట్టుకొని మడకలు ఎత్తుకొని దున్నపోతుల్ని తోలుకుంటా భూముల ఆసాములెంట మళ్లల్లోకి పోయినాం. కనుచూపుమేరా మళ్లే. అనంతపురం ప్రాంతం కంటే ఈ ప్రాంతం కొంచెం ఎత్తు మింద ఉందేమో విపరీతమైన చలి, వొణికిస్తా ఉంది. వానకారు మళ్లు ఆరబెట్టకుండానే కోసినట్లుంది. అందుకే మోకాలెత్తు వరి కొయ్యలుండాయి. అంతా బంక న్యాలలు కాబట్టే ఆరలేదు. అన్నీ నీళ్ల మిందనే వుండాయి. గెనాల మింద పచ్చిగడ్డి పసువులకు బ్రమ్మాండంగా పెరిగింది. అడుగడుగునా మిట్ట కయ్యల్లో కల్లాలు చేసి, అక్కడే వరిగడ్డి వాములేసినారు. యెండకారు పంటకోసరం అంతలక్కా నార్లు పోసినారు.
అంతా చూస్తా చలికి గడగడా వొణుకుతా మడికయ్యల్లోకి దిగి అందరూ మళ్లు దున్నేకి మొదలుపెట్టినాం. మడకలు ఎంత ఎగగట్టినా మడకకర్రులు లోపలికి పోతా ఉండాయి. విపరీతంగా దిగబడతావుంది. అడ్డసాలు తోలేటప్పుడు బురద, దున్నపోతుల బొడ్డులకు ఆనుకుంటా వుంది. బంకలో దిగబడతావుండే కాళ్లను పైకి పీక్కొని ముందుకు అడుగేసేకి దున్నపోతులు చాలా ఆయాసపడతా వుండాయి. అదంతా చూసి ‘ఓరి నాయనో, ఇవేం న్యాలలప్పా! ఇట్ల దిగబడితే, నాలుగు కాండ్లతో దినానికి వొగ ఎకరా అయినా దున్నేకి కాదేమో! అందుకే, కూలోళ్లు పార్లతో మళ్లల్లో బంకమన్ను తిరిగేస్తా ఉండారేమో’ అని పక్కనుండే మడికయ్యల్లో వొంగిండే కూలోళ్లను చూస్తా అనుకుండాను.
పయిటాలకంతా దున్నపోతులు బాగా అలసిపోయినాయి. వొగొగ ఆసామి పొలంలో మూడు మూడు మడకలు అద్దెకరా మడి దున్ని, మడకలు ఇడిసినాం. పక్క మడిలో పదిమంది కూలోళ్లు పార్లతో వొగ ఎకరా న్యాలయినా తిరగ్గొట్టల్యాక అల్లాడిపోతా వుండారు. ఆసాములు వెళ్ళిపోయినంక కూలోళ్లను అడిగి విచారిచ్చుకుండాం. వొగొగ మనిషికి పయిటాల వరకు ఐదు రూపాయలు కూలి అని తెలుసుకుండాం. మరుసటిదినం నుంచీ ఐదు రూపాయలు బాడుగ మాట్లాడుకుండాం.
తెల్లారి పొద్దెక్కినప్పట్నుంచీ పయిటాల వరకు మడకదున్నే బాడుగ ఐదు రూపాయలు, పయిటాల బువ్వ తిన్నెంక సందకాటిదంకా గెనాలు చెక్కి, బురద మెత్తినందుకు రెండ్రుపాయలు, మొత్తం దినానికి ఏడు రుపాయలు సంపాదిచ్చుకుంటా పన్నెండు దినాలు పోరాడినాం. ఆటికి దున్నపోతులు మెత్తబడినాయి. మేము అలిసి పోయినాం. అదీ గాకుండా ఇంగ రెండు దినాలకు శెలవులు అయిపోతాయి. స్కూలు ఓపెన్ అయ్యే నాటికి నేను ఊరికి పోవల్లని జతగాళ్లకు చెప్పినాను. వాళ్లు సరే తలా ఎనబై, తొంభై రూపాయలు కూలి చేసుకుండాం, ఇంగ చాలని ఊరికి బయలుదేరేకి వొప్పు కుండారు. అందరమూ సాయంకాలం కణేకల్లు చెరువును చూసినాం. చెరువుకు భైరవానితిప్ప ప్రాజెక్టునీళ్ళు వొస్తాయని చెరువు కింద కరువు ఉండదని తెలుసుకొని, ఊరంతా తిరిగి వొగ కాకా హెూటల్లో తలా ముక్కాలు రూపాయి ఇచ్చి బిరియాని తిన్న్యాం.
తెల్లవారుజామున్నే అందరమూ లేచి అన్నీ సర్దుకొని మడకల్ని కోటేరేసుకొని బయలుదేరి, వొచ్చిండే దావగుండానే నడుస్తా మరుసటి దినం పయిటాలకంతా మా శింగనమల చెరువు మరవకొమ్మకు చేరుకుండాం. మరవకొమ్మ దగ్గర నిలబడి చెరువులో కనిపిస్తా ఉండే దోసచెట్లపక్క చూసి ఆశ్చర్యపోయినాను. రెండు వారాలకే దోసచెట్లు తీగలు బారినాయి. సాల్లు సాల్లు కనిపిస్తా వుండాయి. కొంతమంది సాల్ల మధ్యలో గుంటకదిండ్లు తోలుతా వుండారు. మా చెట్లు ఎట్లుండాయో, దగ్గర్లో ఉంటే చూసి పొయ్యుండొచ్చునని అనుకుంటా ఆత్రంగా ఊరు చేరుకుండాను. చేరుకుంటానే తమ్ముడు పెద్దన్న వురికెత్తుకుంటా వొచ్చి కరుసుకుండాడు. చిన్నపాప జయమ్మ దోగాడుకుంటా వొచ్చి ఎత్తుకోమన్నట్లు చెయ్యి చాపింది. ‘రా నాయనా కళ్ళల్లో మెదులుతాండావు’ అంటా దగ్గరకు వొచ్చి నా తలను గడ్డానికి ఆనిచ్చుకుంది అమ్మయ్య. సందకాటికల్లా దోసచెట్ల దగ్గర్నుంచి నాయనొచ్చినాడు. ఎనభైరెండు రూపాయలు చేతికిస్తానే నాయనా అమ్మయ్యా ఇద్దరూ సంతోషపడినారు.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
