[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
ఆయిలింజనూ, మునుగుత్త తోటా!
ఆయిలింజను ఆడేది చూడల్లని నేను కొండన్న వెంట మిషన్ రూములోకి పోయినాను. పొగాకు తోటకు నీళ్లు పెట్టల్లని కొండన్న ఆయిల్ ఇంజన్ ఆడిచ్చేకి పూనుకుండాడు. ఆయిలింజన్ పండుకోనుండే దున్నపోతు మాదిరుంది. దానికి రెండు పక్కలా పెద్ద ఇనప చక్రాలు వుండాయి. ఒగపక్కనుండే చక్రం పక్కన ఇంకొగ చిన్న చక్రం వెడల్పుగా ఉంది. దానికి తగిలిచ్చిండే పట్టను బయటకు లాగసాగినాడు కొండన్న. ఆ పట్ట వేలిమందంతో నాలుగైదు అంగుళాల వెడల్పుతో పొడవుగా ఉంది. దాన్ని రూము బయటుండే పంపు పుల్లీ చక్రానికీ ఇంజన్ చక్రానికీ బిర్రుగా తగిలిచ్చినాడు. అట్ల తగిలిచ్చినప్పుడు అది టైటుగా తిరగల్లంట! లూజుగా ఉంటే, ఇంజన్ ఆడేటప్పుడు బయటకొస్తాదంట! అందుకే పట్ట టైట్‌గా తిరిగేటట్లు, రెండు కొనల్ని కలిపినారు. మిషన్ పట్ట రెండు కొనల్లో, మూడు మూడు రంధ్రాలు చేసినారు. రెండు కొనల్నీ కలిపి రంధ్రాల్లో పిన్నీసు మాదిరిగా వుండే ఇనుపరింగుల్లోకి దూర్చినారు. ఇరువైపులా బయటకొచ్చిండే ఇనుపరింగుల్లోకి నాలుగంగుళాల పొడవు ఉండే రెండు ఇనుపతుండ్లను దిగ్గొట్టినారు.
జీతగాడు కొండన్న, పట్టను తగిలిచ్చిండే ఇంజన్ని స్టార్ట్ చెయ్యడానికి సాధ్యం కాదని, చేతులతో చక్రాన్ని తిప్పమని నాకు చెప్పినాడు. నేను నా బలాన్నంతా చూపి చక్రాన్ని మెల్లగా తిప్పసాగినాను. నేను తిప్పుతా ఉంటే ఇంజన్ చిన్న చక్రానికుండే పట్టను క్రాస్‌గా లాగుతూ కొండన్న పట్టను బయటకు తీసి, ఇంజన్‌కు ఇవతలివైపొచ్చినాడు. వొచ్చి, పెద్ద చక్రం ఇరుసుకు హ్యాండిల్ తగిలిచ్చేది చూపిచ్చినాడు. రౌండ్‌గా ఉండే హ్యాండిల్ లోపల ఒగ బటన్ ఉంది. దాన్ని వేలితో ఒత్తితే దాని కింద స్ప్రింగ్ వుందేమో అది లోపలికి పోయింది. అప్పుడు హ్యాండిల్‌ను ఇరుసుకు తగిలిచ్చినాడు. వేలు బయటికి తీస్తానే స్ప్రింగ్ బటన్ హ్యాండిల్ లోపలుండే గాడిలోకి వొచ్చి పటక్కన కూర్చుంది. కొండన్న హ్యాండిల్‌తో చక్రాన్ని మెల్లగా తిప్పుతా కడాకు స్పీడందుకొని ఎడమ చేతితో గేర్ బాల్ వేసి, సరక్కన హ్యాండిల్‌ని బయటకు లాక్కుండాడు. ఇంజన్ స్టార్ట్ అయింది. కొండన్న రెట్లావు గసపోసుకుంటా, చెమట కార్చుకుంటా ఇంజిన్ స్పీడ్ పెంచుతా, తగ్గిస్తా నాకు చూపిచ్చి, ‘నేను చెప్పినప్పుడు స్పీడు పెంచు నారాయనా’ అని నాతో చెప్పి, అవతలకి పోయి పట్టను క్రాస్‌గా పెట్టి, చిన్న చక్రానికి ఎక్కిస్తా ‘యెయ్, స్పీడెక్కిచ్చు’ అని గట్టిగా అరిచినాడు. నేను కొండన్న చెప్పినట్ల చేసినాను. పట్ట ఇంజన్ చిన్న చక్రం మీద కూర్చుంది. ఇంజన్ స్పీడందుకుంది. ఇద్దరమూ బయటికి పోయి చూసినాం. పొగ గొట్టంలో నుంచి భగ్ భగ్ భగ్ అని శబ్దం చేస్తా పొగ బయటికొస్తా ఉంది. మూడించిల పైపులో నుంచీ సిమెంటు తొట్టిలోకీ, తొట్టిలో నుంచీ బయట కాలువలోకీ నీళ్లు దుముకుతా ఉండాయి. అదంతా చూస్తా, పంపులో నుంచీ నీళ్లు బయటకి రావల్లంటే శానా కతుందే, కొండన్న రాకుంటే, మేము పెట్టుకుండే పంటకు నీళ్లు కావల్లంటే చాలా కష్టమే అనుకొని నాయనకు చెప్పినాను. ‘మనం పెట్టుకుండే పంటొగటే కాదు గదప్పా వుండేది! మిగతా పంటలకు నీళ్లు పెట్టల్లంటే వాళ్లు యెవురో ఒగరు ఉండాల్సిందే గదా! ఇంజన్ ఆడిచ్చేది చూస్తా వుంటే నీకూ తెలుత్తాది’ అని నాయన నా భయాన్ని పోగొట్టినాడు.
మా దిబ్బలో ఉండే ఎరువంతా తోటకు తోలి బాగా సేద్యం చేసి, పట్టెలో సగం, చిక్కుడు విత్తనాలు వేసినాం. మిగతా సగం పట్టెలో పరంగి నాటుకోవల్లని బోదులు ఎగేసి కొర్రపాడు నాగిరెడ్డోళ్లతోటలో పరంగి మొక్కల్ని కొనుక్కొని వొచ్చి నాటుకుండాం. రెండు పైర్లూ రెపరెప రాసాగినాయి. చిక్కుడుచెట్లు తీగలు పాకేకి వొచ్చినాయి. ఇంటందరమూ బాటమాన్లల్లో ఉండే చింతచెట్లెక్కి పెద్దపెద్ద రెమ్మల్ని రెండు దినాలు కొట్టుకొని వొచ్చి తోటలో వేసినాం. మల్లా రెండు మూడు దినాలకు ఆకంతా రాలిపోయి బర్రెలు బర్రెలుండే చింతరెమ్మలు మిగిలినాయి. నేనూ, నాయనా బోదెల మీద, చిక్కుడు చెట్ల పక్కన గడారుతో జానెడు లోతు బొక్కలు పెట్టి, ఆ బొక్కల్లో చింతరెమ్మల్ని గట్టిగా చెక్కి, కదలకుండా రెమ్మల పక్కన రెండు మూడు రాతి బెచ్చెలు పెట్టి, గడారుతో గట్టిగా పోటేసి, చిక్కుడు తీగల్ని చింతరెమ్మలకు అల్లిచ్చినాం.
పరంగి చెట్లు నాటిండే పట్టెలో పడమట పక్కన ఒగ ఐదారు సెంట్ల న్యాలలో మిరప, వంకాయ, బెండకాయ చెట్లూ, కొతిమీరా, చుక్కాకు, గోగాకు వేసుకుండాం. దసరా శెలవులు అయిపోయేటప్పటికి అన్నీ వాడుకుండేకి వొచ్చినాయి. శెలవుల్లో నేనయితే నిరంతరమూ తోటకాడనే గడిపినాను. ఆడే, చెట్లకింద చదువుకుంటా, మధ్య మధ్యలో చెట్లల్లో తిరుగుతా, ఇంత మాత్రం తోట, మూడు నాలుగెకరాలుంటే సకలమూ పండిచ్చుకొని యెంత హాయిగా బతకొచ్చునో కదా అనుకుండాను. పది దినాలాయ ఉమావతిని చూడక, యెట్లుందో యేమో, కాలు పరీక్షలు అయిపోయినంక శెలవులకు ఊర్లకు వెళ్లిపొయ్యేదినం పొయ్యొస్తానమ్మా ఉమావతీ అని చెప్పినప్పుడు మొగం చప్పగాపెట్టి ‘సరే’ అంటా ఆదొగ రకంగా చూసింది. ఆ చూపు కండ్ల ముందర కదలాడుతా ఉంది. శెలవులు ఎప్పుడైపోతాయో యేమో స్కూల్ రీ ఓపెన్ చేసిన్నాడే ఉమావతి స్కూలుకు వస్తాదో రాదో అనుకుంటా కాలం గడిపినాను.
చూస్తా చూస్తా ఉండంగానే చిక్కుడు చెట్లతీగలు చింతరెమ్మల నిండా అల్లుకుండాయి. విపరీతంగా పూతా, పిందెలు కనిపిస్తా వుంటే భలే సంతోషమైంది. పరంగి చెట్లు నాలుగైదు అడుగులు ఎత్తు పెరిగి ఆకులు విచ్చుకుండాయి. మిరప, వంకాయ, బెండచెట్లలో కాయలు పీకేకి రెడీ అయినాయి.
శెలవులు అయిపోయినాయి. రేపే బడివాకిలి తీసేది. రెండు మొలక పుటకల నిండా మిరపకాయలూ, వంకాయలూ, బెండకాయలూ ఇంగొగ పుటక నిండా గోగాకూ, చుక్కాకూ, కోతిమీర ఒగ పుటక కాయగూరలు తోట ఆసామి రామరంగయ్యోల్ల ఇంటికి పోయి ఇచ్చినాను. ఆ కాయగూర్లను చూసి రామరంగయ్య భార్య లక్ష్మిదేవమ్మ మురిసిపోయింది. ఆ యమ్మ మా అమ్మ కంటే చిన్నది. నేను ఆ యమ్మను అమ్మయ్య అని అంటాను. ఆ అమ్మయ్యనే కాదు మా ఊర్లో ఉండే బాపనోళ్లందరినీ అమ్మయ్యా అని మొగోళ్లందరినీ అయ్యా అని పిలుస్తాను. మిగతా సూద్రోళ్లందరూ ఆ రకంగానే పిలుస్తారు.
లక్ష్మిదేవి అమ్మయ్య నన్ను ‘రాప్పయా, ఎస్.నారాయణా! నువ్వు హైస్కూల్లో లీడరంటనే. చాలా సంతోషం నారాయణా! బాగా చదువుకుంటా వుండావంట! తప్పకుండా రేపుపొద్దున పెద్ద ఆఫీసరైతావులే నారాయణా! మా తోట చేసుకున్నెంక బాగుపడతారు లేప్పా! మా అశ్వత్థనారాయణ ఆరో తరగతిలో చేరినాడు. అప్పుడప్పుడొచ్చి కొంచెం లెక్కలు చెప్పిచ్చి పోతావుండు నారాయణా!’ అని ఇంట్లోకిపోయి వొగ కాగితంలో నాలుగు ‘అట్లు’ (అత్తిరసాలు) తెచ్చి ఇచ్చింది. ఇంటికి తెచ్చి, అమ్మయ్య చేîతికిచ్చినాను. అమ్మయ్య పిల్లోల్లకు తలా వొగటిచ్చింది. ఇస్తా ‘బెల్లం పులగమూ, అన్నమూ, పొప్పు చింతకాయతొక్కు వూరిమిండీ చేసినాను బూసీ! నీ జతగాన్ని కుల్లాయప్పను భోజనానికి పిలుత్తానంటివి, మల్ల పిలుచుకోని రాపోప్పా’ అనింది. అంతలోనే బజార్నుంచీ నాయనొచ్చినాడు.
మా ఇంటిని మా కులం నుంచి వెలెయ్యాలంట!
నేను పోయి, కుళ్లాయప్పను పిల్చుకోనొచ్చినాను. కుళ్లాయప్ప, నాయనను అమ్మయ్యను అందర్నీ పలకరిచ్చి, కాళ్లూ చేతులూ కడుక్కోనొచ్చేకి జలాటిగుంత కాటికి పోయినాడు. అమ్మయ్య నన్ను ఇంట్లోకి పిల్చి ‘ఆ పిల్లోడు బయట అరుగుమింద కుచ్చుంటాడు లేప్పా! నువ్వూ మీ నాయనా లోపలే కూచ్చోండి’ అని మెల్లగా చెప్పింది. ‘నా పక్కనే లోపలే కుచ్చుంటాడు లేమా! ఏమయితాది?’ అని అన్న్యాను నేను. ‘వొద్దు లేప్పా, బాగుండదు అంతగా అయితే ఇద్దరూ అరుగుమిందే కుచ్చోండి’ అనింది అమ్మయ్య. నేను సరే అని, బయట వారపాక కిందుండే అరుగుమీద, మేమంతా ఎండకాలంలో భోంచేసేచోట సిరిచాపను వేసి, కుళ్లాయప్పను పిలిచినాను. ‘వొద్దులే నారాయణా! నేను మీ చిన్నాయనోళ్ల ఇంటి ముందర లోగిట్లో కూర్చుంటాన్లే’ అని బిడియా పడతా అన్న్యాడు కుళ్లాయప్ప. నేను వొప్పుకోలేదు. చేయి పట్టుకొని అరుగు మీదికి పిలుచుకోనొచ్చినాను. పర్వాలేదులే సన్నోడా అని అమ్మయ్య గుడకా అనింది. ఇద్దరమూ పక్కపక్కనే కూర్చొని భోంచేస్తా వుండాం. అంతలోనే మా ఉప్పరాయప్ప జోడోళ్ల గంగన్న మా ఇంటెనకలుండే గోడరాళ్ళెక్కి, యాటికో మా సందులో అడ్డం పోతా మమ్మల్ని చూసి ‘ఈ పిల్లోడు మాదిగోళ్ల ఓబిగాని కొడుకు గదా, యేమిరా నీ పక్కన కుచ్చోని బోంచేత్తాండాడు?’ అని నేనేందో నేరం చేసినట్ల అడిగినాడు.
‘అవును పెదనాయనా! నా స్నేహితుడు కుళ్లాయప్ప నా పక్కన కూర్చొని భోంచేస్తా ఉండాడు. యేమి, భోం చేయగూడదా?’ అంటా నేను యెదురు ప్రశ్న వేసినాను. దానికి బదులేమి చెప్పల్లనో అర్థం గాక, ‘యాల భోంచెయ్‌గూడదు! భోంచెయ్‌చ్చులే! ఊరికే అడిగితి లేప్పా’ అని వెళ్ళిపోయినాడు. భోంచేసినంక రేపే స్కూల్ రీ ఓపెన్ అని రోంతసేపు మాట్లాడి, అందరితోనా చెప్పి వెళ్లిపోయినాడు కుళ్లాయప్ప.
‘సూత్తివేమప్పా? ఆ తాగుబోతులోడు అడిగిండేది? పల్లెల్లో మాదిగీ మాలోల్లోచ్చి మన పక్కన కుచ్చోని తింటే తప్పు పడతారప్పా. ఇప్పుడు వాల్ల కొంపల కాటికి పొయ్ యేమేమి రాజ్జాంతరంజేత్తాడో ఆ తాగుబోతులోడు!’ అని అమ్మయ్య రోంత విచారపడింది. చెల్లెండ్రు పెద్దక్కా, వెంకటలక్ష్మీ ఇద్దరూ నేను చేసిండే పనిని తప్పు బట్టినారు. నాయన అందరినీ గదురుకుంటా ‘యేమి మన పిల్లోడు మాదిగోల్లింట్లో పెండ్లిగినా చేసుకుంటాండాడా? తప్పుబట్టేకి’ అని అన్న్యాడు.
‘అంతేలే మల్ల! చదువుకుండేకి పొయ్యే పిల్లోల్లు క్యారీర్లు తీస్కోనిపోయి పయిటాలబ్బుడు కాలువ కాడ, ఒగ£రి పక్కనొగరు కుచ్చోని తిండ్రాయేంది? ఆ పిల్లోని సెయిసంచిలో పెట్టుకోనుండే బుక్కులు మన పిల్లోడు ఇంట్లోకి తెచ్చి ద్యావరమూల పెట్టినాడు గదా! దానికి ఏమంటాడో ఈయప్ప. యేమి, మాదిక్కులం, ఆ పిల్లోని ఒంటిమీద కర్సుకోనుందా? అయినా ఈయప్ప కోటగోడ రాల్లెకి ఈపక్క యాలోచ్చినట్ల?’ అని అమ్మయ్య ప్రశ్నవేసింది. అదీయిదీ మాట్లాడుకుంటా రోంత సేవటికి అందరూ వూరికే అయినారు.
సాయంకాలం కావొచ్చింది. నీరుగంటి అంజనప్ప మామ మా ఇంటికాటికొచ్చి ‘యెంగడసామీ, సావిడికాడ పెద్ద మనుసులు పిలుత్త్తాండారు. నువ్వూ. నీ కొడుకూ రావల్లంట’ అని చెప్పి పోయినాడు. పెద్ద మనుషులు యాల పిలుస్తావుండారో మాకు అర్థమయింది. అమ్మయ్యా నాయనా నేనూ మదిచ్చుకోని చావిడి దగ్గరికి యెల్లవారినాం. అమ్మయ్య గుడకా బయలుదేరింది. ‘నువ్వు ఆటికొచ్చి పెద్ద మనుషుల ముందర గట్టిగా నోరు జెయ్యొద్దు’ అని నాయన అమ్మయ్యకు సూచన చేసినాడు. ముగ్గురమూ చావడి కాటికిపోయినాం.
చావిట్లో ఉప్పరోళ్ల ఎర్రెప్ప తాతా, బడగొర్ల నాగిరెడ్డీ, రామేవాళ్ళ నారాయణరెడ్డీ, లింగనపల్లి చెన్నారెడీ్డి ప్రసిడెంటు సుంకు రంగప్పా, ఎలకంటి సుబ్బయ్యా కొత్త కురువోళ్ల నారాయణప్పా ఇంకా ముగ్గురు నలుగురు కూర్చుండారు. వాళ్లకు ఎడంగా జోడోళ్ల గంగన్నా, మా అమ్మయ్యంటే సరిపోని జోడోళ్ల చిన్న కుల్లాయప్పా పెద్దోబన్నా మబ్బోళ్ల మల్లయ్యా కూర్చుండారు. కుళ్లాయప్పోళ్లను గుడకా పిలిపిచ్చినారేమో వాళ్లూ వొచ్చినారు. కుళ్లాయప్ప నాయన ఓబన్న చిన్నాయనా, ఇంకా కొంతమంది మాదిగోళ్లు కింద కూర్చుండారు. కుళ్లాయప్ప, వాళ్ళ నాయన దగ్గర నిలుచుకుండాడు. కుళ్లాయప్ప తల్లీ ఇంకా ఇద్దరు ఆడోళ్ళు చావిడి బయట, అవతలపక్క నిలుచుకుండారు. చావిడికి ఇవతలపక్క, బయట అమ్మయ్యా, పెదగొర్ల నర్సమ్మా, చెన్నారెడ్డి చిన్నాయన భార్య నాగమ్మా నిల్చుకుండారు.
నాయన చావిట్లో చెన్నారెడ్డి చిన్నాయన పక్కన కూర్చుండాడు. కూర్చుంటానే ప్రెసిడెంట్ సుంకు రంగయ్య నాయన పక్క జూసి, ‘ఏమి, వెంకటస్వామీ ఈ మాదిగోళ్ల పిల్లోన్ని కులాచారానికి విరుద్ధంగా మీ ఇంట్లో మీ పక్కన కుచ్చోబెట్టుకుని భోజనం చేసినారని ఆరోపిస్తా, మీ ఇంటిని వెలేయమని అడుగుతా ఉండారు గంగన్నోళ్లు. మాదిగ చిన్నోబన్న కొడుకు మీఇంట్లో, నీకొడుకు పక్కన కూర్చొని భోజనం చేసిండేది నిజమేనా? నిజమైతే, వాళ్ల ఆరోపణకు నువ్వేమంటావు?’ అని అడిగినాడు.
‘మా కులంలో పలానా కులస్తుల్ని ఇంట్లేకి పిల్సుకోగూడదనే ఆశారం యాదీ లేదు గదయ్యా! ఈ పొద్దు కొత్తగా వింటా వుండానే!’ అని నాయన గట్టిగానే చెప్పినాడు.
‘మీ కులానికి ల్యాకపోవచ్చు యెంగడసామీ! ఊరుంది, ఊర్లో రకరకాల కులాలుండాయి. అందరూ కుల మర్యాదల్ని పాటిచ్చల్ల గదా’ అని బడగొర్ల నాగిరెడ్డి కలగజేసుకుండాడు.
‘అది గాదు నాగిరెడ్డి, వొగ మాదిగోన్ని యీల్లు యీ పొద్దు ఇంట్లోకి పిలిసి, పక్కన కుచ్చోబెట్టుకుంటారు. రేప్పద్దన యీల్ల యింటిపక్కనే కొట్టం యేసుకోమంటారు? అప్పుడెట్ల?’ అని విడ్డూరంగా మాట్లాడినాడు గంగన్న.
‘దానికీ దీనికీ ఏమి సమ్మందం గంగన్నా? మాదిగోల్లు కాపోల్ల యిండ్లల్లో పనిజేసి వాల్లింట్లోనే బువ్వతింటావుండారే? మల్ల దాన్ని గుడకా తప్పంటావా?’ అని లింగనపల్లి చెన్నారెడ్డి అందుకుండాడు. ‘మనిండ్లకాటికొచ్చి మాదిగోల్లు బువ్వ తినే దానికీ మన పక్కన కూచ్చోని తినే దానికీ తేడా లేదేమన్నా? నువ్వూ అట్లనే మాట్లాడతావు’ అని గంగన్నోళ్ల గుంపు గట్టిగా నోరు చేసినారు.
‘తేడా ఉంటే ఇబ్బుడేమి జెయిమంటారప్పా! మీమాట పకారమే యెంగడసామి కుటుంబం తప్పే చేసిందనుకుందాం! మల్ల ఆ కుటుంబాన్ని ఏమి జెయ్యల్లని మీ వుద్దేశెం? ఊర్లో నుంచీ యెలెయ్యాలనా? కులంలో నుంచీ యెలెయ్యల్లనా? ఊర్లో నుంచి యెలేసేకి వాళ్లు ఊరికి అపకీర్తి తెచ్చే చెడ్డపనేమీ చెయ్‌లేదే! ఇంగ మీ కులంలో నుంచీ యెలేసేకి మేమెవురము’ అని చెన్నారెడ్డి చిన్నాయన గట్టిగా నిలదీసినాడు.
‘మా కులస్తులకు అవమానం కలిగిచ్చే పని మేము చేసినామనుకుంటే కులంలో నుంచి మా కుటుంబాన్ని యెలెయిమని చెప్పండన్నా! యెలేత్తే మేము వాల్ల్ల యిండ్లకాటికి పొయ్యేదుండదు, వాల్లు మా యిండ్ల కాడికి వొచ్చేదుండదు. అంతే గదా! యెవురూ యెవురి మిందా ఆదారపడి బతకడం లేదు గదా!’ అని అమ్మయ్య బయటన్నుంచే నోరెత్తింది.
‘కాదప్పయ్యా, గంగన్నా, నువ్వు గానీ మీ జోడోళ్లు గానీ టౌన్లకే పాకుండా వుండారా? పొయ్యినబ్బుడు, ఆడ వోటల్లో మాదిగోల్లో మాలోల్లో డొక్కలోల్లో ఎవురెవురో నోరు కర్సుకోని నీళ్లు తాగిండే గలాసుల్తోనే మీరూ తాగుతా వుంటారు గదా! మల్ల దాన్నేమంటారు?’ అంటా పెద్దగొర్ల నరసమ్మ నిలదీసింది.
‘అమ్మా కేశమ్మా, నరసమ్మక్కా! మీరు వూరకనే వుండండి. తలాకొగ మాట యాల మాట్లాడుతారు?’ అని సుంకు రంగయ్య ఆడోళ్ళను గదురుకుండాడు.
‘అది గాదురా కుళ్లాయీ! నేను ఒగ మాటడుగుతాను. నీ జతగాడు నారాయని గాడు, తెలిసో తెలీకో భోంచేసేటప్పుడు తన పక్కనే నిన్ను కూర్చోమన్న్యాడనుకో, నువ్వు కూర్చుండేదేనా? అది తప్పు గదా!’ అని ఎలకంటి సుబ్బయ్య సొట్టమాట మాట్లాడినాడు.
‘అందులో నా తప్పేముందయ్యా? ఆటికీ నేను కిందనే కూర్చోని తింటాన్లే అన్న్యాను. నా స్నేహితుడు నారాయణ నాతోపాటు చదువుకుంటా వుండాడు కాబట్టి భోజనానికి నన్ను ఇంటికి పిలిచి, కింద కూర్చోబెట్టి భోంచేయమనడం మంచిది కాదనుకున్న్యాడేమో, బలవంతంగా నన్ను పక్కన కూర్చోబెట్టుకుండాడు. మేము స్కూలుకు పోయినప్పుడు గుడకా మధ్యాహ్నం కాలువ గట్టుమీద అందరమూ పక్కనపక్కనే కూర్చుని భోంచేస్తాం. నారాయణొక్కడే కాదు, ఇంకా చాలామంది కాపోళ్ల పిల్లోళ్లు గుడకా నా పక్కనే కూర్చుని తింటారు. వాళ్లెవురికీ కనిపిచ్చని మా కులం, ఈ గంగన్న పెద్దయ్యోళ్లకే కనిపిచ్చినట్లుండాది’ అని కుళ్లాయప్ప గట్టిగా మాట్లాడినాడు.
‘అది గాదు సుబ్బయ్యా, కందకులేని దురద కత్తిపీటకు యాల అనే వొగ సామెతుంది. అట్లుండాది యీల్ల కత! అయినా నేనొగ మాటడుగుతాను. నిరుడు మన కుంటి నారపరోడ్డోళ్ల ఇంట్లో మదన అనే అయివారమ్మా, శింగనమల సమితి ఆఫీసులో పన్జేసే సుబ్బన్నా ఇద్దురూ బాడిక్కి వుండ్రి గదా, ఆయమ్మ కిరస్తానమోల్లాయమ్మ. వాళ్లు నడూర్లో కాపోల్లింట్లో వుండ్రే! మల్ల ఆ పొద్దు యెవురూ అడగలేదే’ అని నాయన నిలదీసినాడు. దానికి ఎవురూ ఏమీ మాట్లాడలేదు. సుంకు రంగయ్య నోరిప్పినాడు.
‘చూడు గంగన్నా, మన ఊర్లో కులం పేరు జెప్పి వొగ కుటుంబాన్ని వెలివేయల్లని అడగడమూ, వెలివేయడమూ ఎప్పుడూ లేదు. వొక్క మాదిగోళ్ల ఇల్లు తప్పా మిగతా అన్ని కులాలోల్ల ఇండ్లు కలిసి మెలిసే ఉండాయి. కోమటోళ్ల ఇండ్ల మధ్యలో బోయోళ్లూ కురువోళ్లూ కాపోల్ల మధ్యలో ఉప్పరోళ్ళూ చాకలోళ్లూ, కురవోళ్లూ మధ్యలో మంగలోళ్లూ, ఊరి మధ్యలోనా మిగతా ఇండ్ల మధ్యలోనా సాయిబులూ ఇట్లా అందరం కలిసి మెలిసి వరుసలు పెట్టి మామా, పెదనాయనా, పెదమ్మా, పిన్నమ్మా అని అన్ని కులాలవాళ్లనూ పిల్చుకుంటా యెవురి బతుకులు వాళ్లు బతుకుతా ఉండాం. మాదిగోళ్ల గుడకా మన మాదిరే మనుషులే కదప్పా! యెవురో యెప్పుడో వాళ్లను అంటరానోళ్లని చెప్పి కొంచెం యెడగాల పెట్టినారు. గాంధీ మహాత్ముడు మాలా మాదిగల్ని హరిజనులని చెప్పి, వాళ్ల ఇండ్లల్లోకి పోయి వీథులూడ్చినాడు. ఆయన మా కోమటాయనే కదా! టౌన్లలో ఈ కులాల పేరుతో హరిజనులందరినీ వెలేసినారేమప్పా. వెంకటస్వామి కొడుకు నారాయణ చదువుకుంటా తన జతగాణ్ణి కుళ్లాయప్పను ఇంటికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని భోంచేయడం, కేశమ్మా వెంకటస్వామీ అందుకు అంగీకరించడం గొప్ప విషయం కాదా! దాన్ని తప్పని నువ్వెట్లంటావు? రేప్పొద్దున ఆ పిల్లోడు మాదిగోళ్ల పాపనే పెండ్లి చేసుకుంటాడనుకో! అప్పుడు నువ్వు అడ్డు చెపుతావా? చెప్పడానికి నీకేం హక్కు ఉంది?’ అని జాడిచ్చినాడు సుంకు రంగయ్య మామ. ఆ మామ అట్లా మాట్లాడతా వుంటే నాకు భలే సంతోషమయింది,
సుంకు రంగయ్య మాటల్ని సమర్థిస్తా రామేవాళ్ల నారాయణరెడ్డి మామ, పురాణంలో వుండే ఒగ సంగతిని అందరికీ చెప్పినాడు.
‘నేను పురాణం చెప్పేటప్పుడు అందరూ వినే వుంటారు. వశిష్టుడు గొప్ప ఋషి అని, ఋషులందరూ ఆయనను మహర్షి – మహాఋషి అని, అన్న్యారు. ఆయన భార్య అరుంధతి ఎవరనుకుండారు? ఆమె వొగ చండాల స్త్రీ, అంటే మాదిగ మహిళ. ఈనాటికీ కూడా పెండ్లయిపోగానే నూతన దంపతులకు అరుంధతీ నక్షత్రాన్ని చూడమంటారు. అంత పెద్ద మహర్షులకే కులాలు లేనప్పుడు మనకెందుకర్రా ఈ పట్టింపులు? పదండి పదండి’ అని పైకిలేచినాడు. దాంతో గంగన్నోళ్లు నోరు మూసుకొని ఇండ్లకు పోయినారు.
***
బడి వాకిలి తీస్తారని, ఉమావతిని తలుచుకుంటా చెంబుతో ఇస్త్రీ చేసుకోనుండే అంగీ నిక్కరా తొడక్కుండాను నెత్తిమీద క్రాపు దువ్వుకుంటా వుంటే చెక్కదువ్వాని విరిగిపోయింది. అది చూసి ‘ఎన్ని దువ్యాన్లు యిరగ్గొడతావప్పా? ఇది నాలుగోది! యెంటికలు యింత వొత్తుగా వుంటే యా దువ్య్యాన్లు తట్టుకుంటాయి’ అని వేరే కొత్త దువ్యానితో తల దువ్వింది అమ్మయ్య. హెడ్మాష్టార్ సార్ వాళ్ళకు ఇచ్చేకని నిన్న రామరంగయ్యోళ్ల తోటలో మలకపుటక నిండా పీక్కోని వొచ్చిండే కాయగూరలన్నీ వొగ చెయిసంచిలో వేసుకుని పుస్తకాల బ్యాగు చంకలో తగిలిచ్చుకొని జతగాళ్లతో కలిసి స్కూలుకు బయలుదేరినాను. నిన్న చావిట్లో జరిగిండే సంగతులూ సుంకు రంగయ్య మాట్లాడిందే మాటలు అన్నీ గుర్తుచేసుకుని కుళ్లాయప్పా నేనూ చర్చ చేసుకుంటా శింగనమలకు చేరుకుండాం.
నేను కూరగాయల సంచిని చేతికిస్తానే సంతోషపడింది జయమ్మక్కయ్య. హెడ్మాష్టార్ సార్‌తో గుత్తకు చేసుకోనుండే తోట విషయం చెప్పినాను. ‘ఎట్లన్నా గాని ఇంక ఒకటిన్నర సంవత్సరం కష్టపడురా ఎస్.ఎస్.ఎల్.సి. అయిపోగానే ఏదో ఒకటి చేస్తాను! ఎన్ని కష్టాలున్నా చదువు మీద బాగా దృష్టి పెట్టప్పా! ఇంట్లో ఏమైనా ఇబ్బంది కలిగితే భయపడకుండా నాతో చెప్పు. స్కూలుకు టైం అయింది పదా’ అని నన్ను పంపిచ్చి నా వెనకలే వొచ్చినాడు హెడ్మాష్టార్ సార్. నేను స్కూల్లోకి అడుగు పెడతానే ఫస్ట్ బెల్లు కొట్టినారు. నేను మా క్లాస్ రూమ్‌లోకి అడుగుపెట్టి ఉమావతిని చూస్తానే సంతోషపడుతా పలకరిచ్చినాను. ఉమావతి గుడకా నవ్వుతా మాట్లాడిచ్చింది. దాంతో ఎంతో తృప్తి కలిగింది.
యాడ అడుగు పెడితే ఆడ బూడిదే!
నాలుగైదు దినాలకంతా దసరా శెలవులకు పొయ్యిండే పిల్లోల్లందరూ వొచ్చినారు. అయ్యవార్లందరూ కాలు పరీక్షల పేపర్లిచ్చినారు. నాకు మార్కులు బాగానే వొచ్చినాయి గానీ క్లాసులో సెకండో, థర్డో వొస్తాననుకుంటే ఐదో స్థానంలో రావడం రోంత బాధనిపిచ్చింది. ఉమావతి క్లాస్ ఫోర్త్ వొచ్చింది. నాకంటే ఇంగ్లీషులో సైన్స్‌లో మార్కులు ఎక్కువ తెచ్చుకుంది. నేను ఉమావతి కంటే లెక్కలూ, తెలుగూ సోషియల్ పేపర్లలో ఎక్కువ మార్కులు తెచ్చుకుండాను. అయినా నాకంటే టోటల్ మార్క్స్‌లో ఉమావతికి ఐదు మార్కులు ఎక్కువొచ్చినాయి క్లాస్ ఫస్ట్ వెంకట సత్యం, సెకండ్ బాబు, థర్డ్ శంకరప్ప వొచ్చినారు. నేను ఉమావతి పైన ధ్యాస తగ్గిచ్చి బాగా చదువుకోవల్లనుకుండాను.
రామరంగయ్యోళ్ల తోటలో చిక్కుడు చెట్లు బ్రహ్మాండంగా కాస్తావుండాయి. చిక్కుడుకాయలు అమ్మడం కోసరం నాయన అనంతపురానికి పోయి తక్కెడ, కేజీ, అర్థకేజీ, కాలు కేజీ రాళ్లను తెచ్చినాడు. మరసటి దినం ఇంటందరమూ కలిసి చిక్కుడుకాయలు పీకినాం. మూడు గోనె సంచులు నిండా యెళ్లినాయి. మొదటసారి ఉండూరులోనే అమ్ముదామని చిక్కుడుకాయలన్నీ చావిట్లో పోయిచ్చినాడు నాయన. ముందుగానే నేనూ నాయనా లెక్కచారం చేసిండే దాని ప్రకారం దుడ్లకైతే అర్ధ రుపాయకి కేజీ అని, వడ్ల గింజలకైతే రెండుసేర్లు వడ్లకు వొగ కేజీ అని చిక్కుడుకాయల రేటు చెప్పినాం. జనం ఎగబడినారు. రెండు గంటలలోపల కాయలన్నీ అమ్ముడు పోయినాయి. నూటాఇరవై శేర్లు వడ్లు పదైదు రూపాయల లెక్క వొచ్చినాయి. మూడు మూటల కాయలు కనీసమంటే నూరు కేజీలకు పైగానే అయితాయని అనుకుండాను నేను. కాయల్లో రోంత ఇత్తనం ముదిరితే మూటకాయలు ముప్పై ఐదు కేజీలయితాయని అయినా పర్వాలేదని రెండో కోత నుండి నాలుగు మూటలకు పైగానే యెల్లుతాయని మొదట్లో నాలుగైదు దినాలకు ఒగ కోత కొయ్యొచ్చునని జీడితెగులు రాకుంటే మధ్యలో ఒగసారి ఎరువు పెడితే రెండున్నర మూడు నెలలదంకా చెట్లు కాత కాస్తాయని చెబుతా నాయన తృప్తిపడినాడు.
నాయన చెప్పిన ప్రకారం నేను మూడు నెలలకు ఎన్ని మూటల చిక్కుడుకాయలు ఎల్లుతాయో ఎన్ని మూటలు వడ్లు వొస్తాయో నగదు ఎంత లెక్క చేతికొస్తాదో ఒగ గంట సేపు లెక్కలేసి ఒగ ఇరవైఐదు మూటలు వడ్లు ఇన్నూర్రుపాయలు లెక్క రావొచ్చునని అందాజుగా అనుకొని ఇంకా పరంగి పంటొస్తాది కదా అనుకొని సంతోషపడసాగినాను.
చిక్కుడుకాయలు మూడో కోత కొయ్యడానికి ముందే చెట్లకు జీడి తెగులు వొచ్చింది. తెలిసిన వాళ్లు చెప్పితే దినమూ, రెండు మూడు దినాలు వరుసగా చిక్కుడు చెట్ల మీద ఇంటందరమూ ఆవు పంచితము చల్లి చూసినాం. తగ్గలేదు. విపరీతమైన పూత పూస్తా పిందెలు పడతా ఉండాయి. పూచిండే పిందెకంతా కాసిండే పిందెలకంతా జీడి తెగులు మోపయితాంది. అట్లనే విత్తనాలు ఊరిండే కాయలు పీకినాం. అయిదు మూటలు అయినాయి. అన్నీ చావిట్లో పోసి అమ్మేకి చూసినాం.
కాయలన్నిటిలోనా పచ్చపురుగులే! పురుగు పట్టిండే కాయలు వేరేసి వేరేసి జనం కొనుక్కుండారు. ఐదు మూట్ల కాయలకు ఒగ మూటొడ్లు వొచ్చినాయి. ఇదేమి గాశారమప్పా అనుకుంటా ఇంటందరమూ అంగలార్చినాం.
ఏమి చేసేకీ దిక్కు తోచలేదు. నాయన శింగనమలకు పోయి ఎరువుల అంగిట్లో యేందో మందు డబ్బా తెచ్చినాడు. మరుసటి దినం, మంచు పడతా వుంటే దానిమీదనే చల్లినాం. ఏందో మందు కొట్టే స్ప్రేయర్ వుందంట! తోటలే లేని మా ఊర్లో ఆ మిషన్ ఎవరి దగ్గరా లేదు. సమితి ఆఫీసులో గుడకా దొరకలేదు. ఆ ఆఫీసులో నగిరి సుబ్బన్న సారన్న ఉండింటే బాగుండేది. ఆయనా, ఆయన భార్య నెల కిందటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోయినారు. నాయన కొర్రపాడు నీలంపల్లెకు పోయి వొచ్చినాడు. వాళ్ళ స్ప్రేయర్లు చెడిపోయినాయంట! ఉత్తచేతుల్తో వొచ్చినాడు. కడాకు మా ఊరి బాపనయవార్ని అడిగినాం. ‘ఋషింగమయ్య కొండ పైనుండే అక్కమ్మ గారి దొనలో ఉండే నీళ్లు వొగ పెద్ద క్యారియర్ నిండా ముంచుకొని క్యారియర్ని యాడే గాని కింద పెట్టకుండా ఈ తోటంతా చిక్కుడుచెట్ల మీద చిలకరిస్తే ఆ తల్లి అనుగ్రహంతో తెగులూ గిగులూ పటాపంచలై పోతాదని’ ఆయన చాలా నమ్మకంగా చెప్పినాడు. ‘పోయిరాపోండప్పా! నట్టమొచ్చేది యేముంది చేతలకట్టమే కదా’ అని అమ్మయ్య బలవంతం చేసింది. నాయనా నేనూ పోయేకి ముగబడినాం.
సగిరి పొద్దుదాటుతానే నేనూ, నాయనా రుషింగమయ్య కొండకు యెల్లవారినాం. కొండపైన శిఖరంలో ఉండే రుషింగమయ్య గుడికాటికి పోయేసరికి తూర్పున చుక్క పొడిచింది. రుషింగమయ్య గుడిలోకిపోయినాం. గుడికి తలుపు ల్లేవు. ఋష్యశృంగికి మొక్కోని గుడి బయటకొచ్చి చుట్టూరా చూసినాం. మా ఊరితోపాటు రెండామడ దూరంలోని పల్లెల్లో వుండే కాసింత దీపాలు మినుకు మినుకుమంటా కనిపిచ్చినాయి. వెంటనే నాకు మూడో తరగతిలో నేర్చుకోండే గోరంత దీపం కొండంత వెలుగు అనేది గ్నాపకమొచ్చింది.
అక్కడినుంచి అక్కమ్మ గారి దొనదంకా రెండు మూడు ఫర్లాంగులంతా చదరం. బోదగడ్డికి వొచ్చినప్పుడు మూడు నాలుగు సార్లు నేను ఆ దొనను చూసినాను. ఆటికి ఎవురూ ఒంటిగా పోరు. ఏడు శిరసుల నాగుబాము అట్లే ఎవురో యోగులు తిర్లాడుతూ ఉంటారంట! పొదుబుట్టే లోపల అక్కమ్మ గారి దొనలో వుండే తీర్థం నీళ్లు ముంచుకొని పోవల్లని ఆటికి పోతావుండాం. నాకు నల్ల నాగంబామూ ఎవురో యోగులూ గుర్తుకొచ్చి భయపడతా నాయనతో చెప్పినాను. నాయన నాకు ధైర్యం చెపుతా ఆ దొనకాటికి పిలుచుకొని పోయినాడు. మాట్లాడుకుంటా దొనలోకి దిగేటప్పుడు ఏంటివో పొదల్లోకి పోయినాయి. చిన్నగా గాలిసురుతా ఉంది. గాజుల శబ్దం వస్తావుంది. ఆ శబ్దం అక్కమ్మ గారి చేతుల్లో ఉండే గాజుల శబ్దమా అని ఆలోచిస్తా భక్తులు అక్కమ్మ గారికి మొక్కుండేకి వొచ్చి వేపకొమ్మలకు వేలాడదీసిండే గాజుల్నీ పసుపు కొమ్మల్నీ గుర్తుకు తెచ్చుకొని భయపడకుండా దొనలోకి నాయనతో పాటు దిగినాను. దొనలో నీళ్లే కనిపియ్యలేదు. దొననిండా అంతరగంగ పరుచుకుంది. దాన్ని ఒకచోట పక్కకు దొబ్బి క్యారియర్ నిండా నీళ్లు ముంచుకొని ఆ తల్లికి మొక్కుకొని ఇంటికి బయలుదేరినాం. ఎన్నోసార్లు గడ్డిమోపులు ఎత్తుకొని ఆ నడవ మెటికల మీద కిందికి దుంకుతా పరిగెత్తినోన్ని ఆ అలవాటుతోనే గబగబా దిగుతా బొయ్‌మని ఈస్తా వుండే చలిగాలిని లెక్కచేయకుండా క్యారియర్ని ఆ చేతికి ఈ చేతికి మార్చుకుంటా కింద వుండే చెలిమ దగ్గరికి చేరుకొని నాయన వైపు చూసినాను. నాయనింకా దూరముగా వుండాడు. నన్ను చూసి క్యారియర్ నేల మీద పెట్టేవు అని గట్టిగా అరిచినాడు. నాయన చెపుతానే జాగ్రత్త పడినాను. పది నిమిషాలకల్లా నాయన కిందికొచ్చినాడు. ఆట్నుంచి ఇద్దరమూ బయలుదేరి గోవిందరాయునిపేట ఊర్లోకి పోకుండా బయట్నుంచే మా ఊరి దావలోకి కలుసుకొని పొద్దుబుట్టేకల్లా తోటలోకి చేరుకుండాం. పెద్దక్కనూ వెంకటలక్ష్మినూ పిలిపిచ్చి అందరమూ కలిసి అక్కమ్మ గారి తీర్థంనీళ్లలోకి తమలపాకులు అద్దుతా చిక్కుడు చెట్లకు అన్నింటికీ చిముకరిచ్చి ఆ తల్లి మీద భారమంతా యేసినాం.
అక్కమ్మగారి దొన నీళ్లు చిముకరిచ్చినంక నాలుగైదు దినాలు చూసినాం. చెట్లల్లో చీడ రోంత గానీ తగ్గలేదు. ఇంకా ఎక్కువైంది. చెట్లపక్క చూసి ‘అంతా కర్మ. మన కర్మ ఇట్లా యేడ్సినంక, యాతీర్థం నీళ్లు పనిచేస్తాయి’ అని అందరమూ బాధపడుతా కడాకు చిక్కుడు చెట్లన్నీ పీకేసి దిబ్బలోకి తోలినాం. ఇంగ పరంగిపంట యా మాత్రమో అనుకుంటా ఆ పంట కోసరం ఎదురు చూడసాగినాం.
ఎసిసి పెరేడూ నేనూ!
నేను మా స్కూల్లో ఎసిసి అండరాఫీసరని, సత్యనారాయణ సారు ఎసిసి ఆఫీసరని మా హెడ్మాస్టర్ సార్ నాకు ఎసిసి డ్రస్సు (ఖాకీ నిక్కర ఖాకీ అంగీ) రెండు జతలు ఇప్పిచ్చినాడని ఇంతకుముందే చెప్పినాను. నేను ఎసిసిలో చేరకముందు ఓబుళపతి సారు ఎసిసి ఆఫీసర్‌గా ఉండేవాడు. ఆయన వెళ్లిపోయిన తర్వాతనే సత్యనారాయణ సారు మా ఎసిసి ఆఫీసర్‌గా వొచ్చిండేది! ఆయనొచ్చినంక ప్రతి శుక్రవారం లాస్టు రెండు పీరియడ్లూ మాకు ఎసిసి క్లాసులు తీసుకొని మార్చిఫాస్ట్ నేర్పిచ్చినాడు. నేను క్యాన్వాస్ బూట్లు ల్యాకుండా ఎసిసి క్లాసులకు పోతా వుంటే సత్యనారాయణ సారే నాకు ఆ బూట్లు, క్యాపు ఇప్పిచ్చినాడు.
నేను ఖాకీ బట్టలేసుకొని పాదాలకు సాక్సులు ఎక్కిచ్చుకొని సార్ ఇప్పిచ్చిండే బూట్లు తోడుక్కొని నెత్తి మీద క్యాప్ పెట్టుకుని గ్రౌండ్‌కు పోతావుంటే యెంతో ఠీవిగా ఉన్నెట్ల అనిపిచ్చింది నాకు. సత్యనారాయణ సారింటి దగ్గరికి పోయి అటెన్షన్లో నిలబడి సార్‌కు సెల్యూట్ చేసినాను. నేను ఇంటికి పోయేటప్పటికే సారు డ్రెస్సు మార్చుకొని బూట్లు తోడుక్కొని రెడీగా ఉండాడు. ఇద్దరమూ గ్రౌండ్ దగ్గరకి బయలుదేరినాం. మేము గ్రౌండ్ దగ్గరకి పోయేటప్పటికే జవాను అబ్దుల్లా గ్రౌండ్‌కు బ్యాటరీ మైకు తీసుకొని పోయి రెడీ చేసినాడు. నేను విజిలేస్తానే ఎసిసి పిల్లలందరూ టక టక వొచ్చి క్లాసుల వారీగా లైన్లో నిలబడినారు. పిల్లోళ్లకు ఎదురుగా నేను మైకు దగ్గర నిల్చున్నాను. నాకు కొంచెం ఎడంగా ఎసిసి ఆఫీసర్ నిల్చుకున్నాడు. నేను అటెన్షన్ అని మైక్‌లో కాషన్ ఇచ్చినాను. లౌడ్ స్పీకర్లో నా కాషన్ అద్భుతంగా వినిపిస్తా పక్కనుండే గోల్కొండరాయుని కొండలో ప్రతిధ్వనిస్తా వుంది. ఆ శబ్దాన్ని విని మిగతా పిల్లోళ్లూ, రోడ్లో పొయ్యేవాళ్ళూ పరుగెత్తి వొచ్చి దూరంగా నిలబడి వింతగా చూస్తావుండారు. మైకు ముందర నిలుచుకోని నేను గొంతు విప్పిండేది అదే మొదటిసారి.
వొక్కొక్క స్క్వాడ్‌కు స్క్వాడ్ లీడర్, ముందు భాగంలో నిల్చుకుండారు. లైన్లల్లో నిలబడిండే క్యాడెట్స్ అందరినీ కుడిచేతులు పక్క లైన్లో వుండే వాళ్లకు టచ్ కానంతవరకు ఎడమ వైపుకు జరగల్లని కాషన్ ఇచ్చినాను. తర్వాత లైన్లోవుండే క్యాడెట్స్ అందరూ కుడిచెయ్యిని ముందుకు చాపి, ముందరుండే క్యాడెట్స్‌కు టచ్ కానంతవరకు వెనక్కి జరగల్లని చెప్పినాను. ఆ తర్వాత ఎసిసి అండరాఫీసర్‌గా నేను, పిడికిలి బిగిచ్చిండే చేతుల్ని గట్టిగా స్టిఫ్‌గా ముందుకూ వెనక్కీ వూపుతా, నాలుగు స్టెప్పులు ముందుకేసి, నాలుగో స్టెప్పును పైకెత్తి, గట్టిగా బూటు శబ్దం వినిపించే మాదిరి నేలమీద కొట్టి, ఎడమ వైపు తిరిగి, అదే పద్ధతిలో నాలుగు స్టెప్పులేసి మా ఎసిసి ఆఫీసర్‌కు సెల్యూట్ చేసి స్క్వాడ్స్‌ను చెకప్ చేయడానికి ఇన్వైట్ చేసినాను. ఆయన వెంట నేను పిడికిలి బిగిచ్చిండే చేతుల్ని ముందుకూ వెనక్కీ వూపుతా స్టెప్స్ వేస్తా స్క్వాడ్స్ దగ్గరికి పిలుచుకొని పోయినాను. ఆయన, స్క్వాడ్స్ మధ్య లైన్లల్లో నడుస్తా సరిగా నిలుచుకోని వాళ్లకు వార్నింగ్ ఇస్తా, లైన్లో హైట్ వారీగా, హైట్ తక్కువ వుండేవాళ్లను ముందువైపుకూ, ఎక్కువ వుండే వాళ్ళను వెనక్కీ పంపుతా అన్ని స్క్వాడ్స్‌ను చెకప్ చేసి, మళ్లీ తన స్థానానికి పోయి నిలబడినాడు. ఇప్పుడు నేను అన్ని స్క్వాడ్స్‌కు ముందు భాగంలో, మా ఎసిసి ఆఫీసర్‌కు ఎదురుగా నిలబడినాను. పీవన్ నా దగ్గరికి మైకు తెచ్చిపెట్టినాడు. నాకు ఎదురుగా మా ఎసిసి ఆఫీసర్, ఆయన వెంట దూరంగా నిలుచుకోనుండే మా స్కూల్ పిల్లోళ్లూ ఊర్లో వాళ్ళూ కనిపిస్తా ఉండారు. నేను మళ్లీ అటెన్షన్ స్టాండటీజ్ అని కాషన్ ఇస్తా ఉంటే నా వెనకల మా ఎసిసి క్యాడెట్స్ అందరూ బూట్ కాళ్లతో గట్టిగా నేలను తాకిస్తా ఉంటే అందరి స్టెప్సూ ఒకేసారి నేల మీద శబ్దం చేస్తా ఉంటే నా రొమ్ములు ఉబ్బుకుండాయి. వెంట్రుకలు నిక్కబొడుసుకుండాయి. మనసులో గర్వం పొంగిపొర్లింది. ఇట్లా టైములో నాయనా అమ్మయ్యా చూస్తే ఎంత బాగుండేదో అనుకుండాను.
నేను ‘పెరేడ్, బాయేముడ్’ అని కాషన్ ఇచ్చినాను. క్యాడెట్స్ అందరూ ఎడమవైపు తిరిగి కుడికాళ్లు పైకెత్తి గట్టిగా నేలకు తాడించి కొట్టినారు. ‘పెరేడ్ ఆగే బడేగా, తేక్చల్’ అని కాషన్ ఇచ్చినాను. క్యాడెట్స్ అందరూ మార్చ్ ఫాస్ట్ చేస్తా వుండారు. కొంతదూరం పోయినంక ‘దహినే చలేగా’ అని గట్టిగా అన్న్యాను. మళ్ళీ కొంతదూరం పోయినంక మళ్లీ ‘దహినే చలేగా’ అని కాషన్ ఇచ్చినాను. మార్చ్ ఫాస్ట్ ఎసిసి ఆఫీసర్ దగ్గరికి చేరుకోగానే స్క్వాడ్ లీడర్స్ ‘బాయే దేఖ్’ అని గట్టిగా కాషన్ ఇచ్చినాను. క్యాడేట్స్ అందరూ తలకాయలు ఎడమవైపు తిప్పినారు. మా ఎసిసి ఆఫీసరూ నేనూ ఆ ట్రూపులకు లాంగ్ సెల్యూట్ చేస్తా నిలబడినాం. మార్చ్ ఫాస్ట్ చేసుకుంటా ట్రూప్స్ అన్నీ వాళ్ల వాళ్ల స్థానాల్లోకి పోయినాయి. అప్పుడు నేను ‘పెరేడ్ స్టాండటీజ్’ అని కాషన్ ఇచ్చినాను. మా ఎసిసి ఆఫీసర్ కొంచెంసేపు మాట్లాడినాడు. చివర్లో జాతీయ గీతం అందరూ పాడినంక డిస్పర్స్ అయినారు.
సత్యనారాయణ సార్ నా భుజం తట్టి ‘ఎక్సలెంట్ నారాయణా! బాగా నిర్వహించినావు, వెరీ గుడ్, బాగా చదువుకో’ అని చెప్పి వెళ్లిపోయినాడు. ఎసిసిలో ఉమావతీ ఇంకా కొంతమంది ఆడపిలోళ్లూ చేరింటే ఎంత బాగుండేదో! అని అనుకుంటా జతగాళ్లతో కలిసి ఊరికి బయలుదేరినాను.
***
మా డ్రిల్ మాస్టర్ చిదంబరరెడ్డి సార్ మా స్కూల్లో గ్రిక్స్ జరుగుతాయని అందుకోసమే ఎవురెవురు ఏయే గేమ్స్‌లో పాల్గొనల్లని అనుకుంటారో ఆ గేమ్స్ బాగా ప్రాక్టీస్ చెయ్యల్లని చెప్పడంతో తొమ్మిదీ పదీ పదకొండో తరగతుల పిల్లోళ్లు కొంతమంది రన్నింగ్ రేస్, హై జంప్, లాంగ్ జంప్, గేమ్స్ మరి కొంతమంది వాలీబాల్, ఫుట్బాల్, బ్యాట్‌మిటన్ మొదలగు గేమ్స్ ఆడేకి ఇష్టపడినారు. లోయర్ క్లాసుల పిల్లోళ్లు వొగ జట్టుగా హైయ్యర్ క్లాసుల పిల్లోళ్లు వొగ జట్టుగా కోకో ఆడేకి ప్రాక్టీస్ చేయబట్టినారు. నాకు బ్యాట్‌మింటన్, వాలీబాల్, కోకో ఆడేకి ఇష్టం. ఆడపిల్లోళ్లు కొంతమంది రింగ్‌టెన్నిస్, కొంతమంది త్రోబాల్ ఇంకా కొంతమంది కోకో ఆడేకి ముందుకొచ్చి ప్రాక్టీస్ చేయసాగినారు. ప్రతిదినమూ లాస్ట్ రెండు పీరియడ్స్‌లో అందరూ స్కూల్ గ్రౌండ్‌లో వాళ్ల వాళ్ల ఆటల్లో మ్యాచ్‌లు వేసుకుని ప్రాక్టీస్ చేస్తా వుండారు. లాస్ట్ పీరియడ్‌లో పిల్లోళ్లందరూ గ్రౌండుకు చేరుకొని గేమ్స్ ఆడుతా ఉండడంతో గ్రౌండ్ అంతా కళకళలాడసాగింది. ఆడపిల్లోళT్ల ఆడే గేమ్స్ దగ్గరకొచ్చి మగపిల్లోళ్లు చుట్టుకోసాగినారు. కొంతమంది వొగ జట్టు వైపూ, కొంతమంది ఇంకొగ జట్టు వైపు సపోర్టు చేస్తా వుండారు.
నాకు బ్యాట్‌మింటన్ గేమ్స్‌లో ఫైవ్స్‌లో సెంటర్ ప్లేయర్‌గా, ఫ్రెంట్ ప్లేయర్‌గా ఆడడం ఇష్టం. గేమ్ సరిగా ఆడని వాళ్లను బ్యాక్ ప్లేయర్‌గా ఆడమంటారు. ఫ్రెంట్‌లో ఆడేవాళ్లు చాలా అలర్ట్‌గా వుండల్ల. సెంటర్ ఆడేకి అందరూ పోటీ పడతారు. సోదనపల్లి రాజశేఖర్‌రెడ్డి గోవిందరాయునిపేట రామలింగారెడ్డి స్కూల్ పీపుల్ లీడర్ వెంకటనారాయణ సెంటర్ ఆడుతా బాల్ను కట్ కొట్టేదాంట్లో మంచి నైపుణ్యం వుండేవాళ్లు. వాళ్లున్నెప్పుడు నన్ను సెంటర్ ఆడనీయరు.
మా హెడ్మాష్టర్ సార్, సత్యనారాయణ సార్ బాల్‌బ్యాట్‌మింటన్ ఆడేదాంట్లో ఎక్స్‌పర్ట్స్. హెడ్మాష్టర్ సారు సెంటర్ ఆడుతా బాల్ను కట్ కొట్టేది చూడల్ల! అద్భుతంగా వుంటాది. సత్యనారాయణ సార్ ఫ్రెంట్ ఆడేదాంట్లో ఆయనకు మించినోడు ఎవురూ లేరు. అప్పుడప్పుడు అయవార్లందరూ వొగ జట్టు స్టూడెంట్స్ వొగ జట్టు అనుకొని బాల్ బ్యాట్‌మింటన్ ఆడతాం.
ఈరోజు టీచర్స్ వర్సెస్ స్టూడెంట్స్ బ్యాట్‌మింటన్ మ్యాచ్ ఉందని డ్రిల్‌మాష్టర్ చిదంబరరెడ్డి సార్ అనౌన్స్ చేసినాడు. ఆ మ్యాచ్‌కు ముందు ఆడపిల్లోళ్ళ రింగ్ టెన్నిస్ మ్యాచ్ ఉంది. మా క్లాస్‌మీట్స్ ఉమావతి, పార్వతి, శారద, రామలక్ష్మి ఒగ వైపు తొమ్మిదో తరగతి అమ్మాయిలు లక్ష్మిదేవి, ఎర్రెమ్మ, ఎస్.ఎల్.ఎల్.సి. లో ఉండే సరోజ, నాగమణి ఒగ వైపు ఆడతారు. ఆ మ్యాచ్‌కు నన్ను రెఫరీగా ఉండమన్న్యాడు చిదంబర రెడ్డి సార్.
మ్యాచ్ ప్రారంభం అయింది. గేమ్ కోర్టు చుట్టూరా ఆడపిల్లోళ్లు మగ పిల్లోళ్లు చుట్టుకుండారు. నేను పోల్ దగ్గర కుర్చీ మీద నిలబడి విజిల్ వేసి గేమ్ స్టార్ట్ చేసినాను.
ఉమావతి ట్రూప్‌లో పార్వతి ఉమావతి ఇద్దరే బాగా ఆడేవాళ్లు. ఆపోజిట్ సైడు లక్ష్మిదేవి ఎర్రెమ్మ బ్రహ్మాండంగా ఆడుతా వుండారు. లక్ష్మిదేవి ఫోర్సుతో వేసే రింగును ఉమావతి పట్టుకోలేక పోతావుంది. అట్లే పార్వతి వేసే రింగును సరోజ పట్టుకోడానికి భయపడతా వుంది. నాగమణి మెల్లగా వేసిన రింగును పైన్నే అందుకొని ఫ్రంట్‍౬లో ఆడే ఉమాపతి కోపంగా స్పీడుగా వేసింది. దాన్ని సరోజ పట్టుకోలేకపోయింది. మొదటి పాయింట్ ఉమావతి తెచ్చింది.
అటువైపు వెనకనుంచీ లక్ష్మిదేవి సర్వీస్ చేసింది. రింగు ఇటువైపు వుండే కోర్టు సెంటర్ లైన్ మీద పడింది. ఉమావతి వేగంగా వొచ్చి పట్టుకోలేకపోయింది. అయినా రింగ్ సేమ్ సైడే పడిందని పాయింట్ మాదే అనింది. లక్ష్మిదేవి వొచ్చి, రింగు కొంచెం ఆపోజిట్ వైపే పడిందని గొడవ చేసింది. రెఫరీగా నేను సెంటర్ లైన్ దగ్గరికి వెళ్లి చూసి, అది రాంగ్ రింగ్ అని డిక్లేర్ చేసినాను. దాంతో రెఫరీ పక్షపాతం చూపుతా వున్నాడని అట్లా ఎందుకు పక్షపాతం చూపుతా వుండాడో తనకు తెలుసని నా మీద ధ్వజమెత్తింది లక్ష్మిదేవి. చుట్టూరా ఉండే పిల్లోళ్లు కొంతమంది అది రాంగ్ బాలేనని మరి కొంతమంది రైట్ బాలే అని గట్టిగా అరవసాగినారు. డ్రిల్‌మాష్టర్ సారొచ్చి అది రాంగ్ బాలే అని చెప్పినాడు. దాంతో ఉమావతి టీమ్ గెలిచినట్లు నేను డిక్లేర్ చేసినాను. పిల్లోళ్లు కేకలేసినారు. ఉమావతి చిరునవ్వుతో నా వైపు చూసింది. ఆ నవ్వు నాకు అమృతం మాదిరి అనిపించింది.
తర్వాత కాసేపటికి టీచర్స్ టీమ్ వొగ వైపు స్టూడెంట్స్ టీమ్ ఇంగొగ వైపు బ్యాట్‌మింటన్ గేమ్ మొదలయ్యింది. స్టూడెంట్స్ టీమ్‌లో సోదనపల్లి రాజశేఖర్ రెడ్డి సెంటర్, నేనూ బాలన్నా బ్యాక్ ప్లేయర్స్‌గా శంకరప్పా వెంకట సత్యం ఫ్రంట్ ప్లేయర్స్‌గా ఉండాం. టీచర్స్ టీమ్‌లో హెడ్మాష్టర్ సార్ సెంటర్, సత్యనారాయణ సారు సీతారాం సారు ఫ్రంట్ ప్లేయర్స్‌గా సోషియల్ అయ్యవారు నారాయణరెడ్డి చిదంబ రెడ్డి సారు బ్యాక్ ప్లేయర్స్‌గా వుండారు. ఆట మొదలయింది. హెడ్మాష్టర్ సారు, సత్యనారాయణ సారు చాలా ఎక్స్‌పర్ట్స్! ప్రతి బాలూ కట్ గొడతా ఉంటే మా టీమ్ అదిరిపోయింది. మాకు పాయింట్స్ రావల్లనుకుంటే నారాయణరెడ్డి సార్ దగ్గరికి బాల్ కొట్టల్లనుకుండాం. గని అక్కడ ఉందనుకొని, ప్రతి బాలును పైకిలేపి, సోషియల్ అయవారు దగ్గరికి కొట్టినాం. కొట్టినప్పుడల్లా మాకు పాయింట్ రాసాగింది. దాంతో ఆయనకి వేసే ప్రతి బాలును హెడ్మాష్టర్ సారే రిసీవ్ చేసుకొని విజృంభించినాడు. అట్లే సత్యనారాయణ సార్. చివరికి రెండు పాయింట్లు తేడాతో టీచర్స్ టీమే గెలిచింది. మా టీమ్‌లో రాజశేఖర్ రెడ్డీ శంకరప్పా ఇద్దరూ మంచి ప్లేయర్స్. నేను అంతంత మాత్రమే. వెంకట సత్యం, బాలన్నా నాకన్నా వీక్ ప్లేయర్స్. స్కూల్ పీపుల్ లీడర్ వెంకటనారాయణ లేకుండా మా టీమ్ టీచర్స్ టీమ్‌తో ఆడి గెలవడం కష్టమే అనుకుంటా పిల్లోళ్ల వైపు చూసినాను. అక్కడ ఉమావతీ, రామలక్ష్మీ, మా లక్ష్మిదేవీ ఇంకా ఇద్దరు మా దగ్గరకు వొచ్చినారు. ‘రింగ్ టెన్నిస్ గేమ్‌లో అట్లా మాట్లాడినందుకు సారీ నారాయణా’ అంట బాధపడింది లక్ష్మిదేవి. ‘గేమ్స్ ఆడేటప్పుడు అంతేలేమ్మా! నువ్వేమీ అంతగా ఫీల్ కావద్దు. కానీ నువ్వట్ల రెండర్థాలతో మాట్లాడితే బాధపడే వాళ్ళు బాధపడరా?’ అని ఉమావతి వైపు చూసినాను. ఉమావతి నవ్వుతా నా వైపు చూసి ‘కాదు వే, మరి బాధపడేవాళ్ళు బాధపడరా’ అని లక్ష్మిదేవిని నవ్వుతానే మందలిస్తా నా పక్క చూడసాగింది. ఆ నవ్వు, ఆ మందలింపు కొంచెంసేపు అర్థం కాలేదు నాకు. నేను ఆలోచిస్తా వుంటే, బాట్‌మింటన్‌లో ఆ సారోళ్ళ టీమ్‌తో మీరు పోటీ పడేకి అయితుందేమప్పా? అని ఇద్దరూ ఒకేసారి అంటూ సారోళ్ళను అభినందించేకి పోయినారు. మేమూ పోయి అభినందించినాం. ‘మీరు ఫ్రంట్‌లో ఉండి షాట్ కొడితే భయమయితాది సార్’ అని మా సత్యనారాయణ సార్ గేమ్‌ను పొగిడినాను నేను.
‘కాదురా నారాయణా, నువ్వు ఫ్రంట్ ప్లేయర్‌గా ఆడాల్సింది!. ఫ్రంట్లో ఆడితేనే గేమొచ్చేది రా! రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే నువ్వు బాగనే ఆడగలవు’ అంటా నా భుజం తట్టినాడు ‘సార్. వెళ్లొస్తాం సార్’ అంటూ ఒగసారి ఉమావతి వైపు చూసినాను. ఉమావతి గుడకా నా ముఖం లేకి చూసి సరే అన్నెట్లు తలూపింది.
మా తెలుగు సార్ మాధవరాజూ, మా తరగతిలో పిల్ల చేష్టలూ!
మా తెలుగు పండిట్ ఓబుళపతి సార్ వేరే ఉద్యోగం రావడంతో వెళ్లిపోయినాడు. ఆ సార్ వొచ్చి గుడకా ఏడెనిమిది నెలలు కాలేదు. అంతలోనే ఆయన వెళ్లిపోవడంతో మాకు తెలుగు పాఠం ఎవరు చెబుతారో అని పిల్లోళ్లందరమూ చింతజేయసాగినాం. ఉండే అయవార్లల్లో లోయర్ క్లాస్ టీచర్ భారతం సుబ్రమణ్యం సారొక్కడే తెలుగు పాఠం చెప్పగలిగిండేవాడు. కొత్త తెలుగు పండిట్ వొచ్చేదంకా హెడ్మాష్టర్ వొగ వేళ సుబ్రహ్మణ్యం సార్‌నే మాకు తెలుగు పాఠాలు చెప్పే ఏర్పాటు చేస్తే ఏమి చెయ్యల్లనో అందరమూ ఆలోచనచేస్తా శూద్రకులాలకు చెందిండే విద్యార్థుల్నీ మాదిగీ మాలా పిల్లోళ్లనూ ఆయన చులకనజేసి మాట్లాడిండేదీ తిట్టిండేదీ అంతా గ్నాపకం జేసుకొని నేనూ బాలన్నా అశ్వత్థరెడ్డీ గంగరాజూ మా పైక్లాసులో ఉండే తిప్పన్నా కుళ్లాయప్పా ఇంకా కొంతమంది పిల్లోళ్లం చర్చించుకోసాగినాం. మా అభిప్రాయాలను తెలుసుకుండాడో ల్యాకుంటే సుబ్రమణ్యం సార్ వ్యవహారాన్ని అర్థం చేసుకుండాడో యేమో మా హెడ్మాష్టర్. ఒగ రిటైర్డ్ తెలుగు పండిట్ మాధవరాజు సార్‌ని మాకు తెలుగు టీచర్‌గా ఏర్పాటు చేసి, మా క్లాసులోకి పిలుచుకోనొచ్చి ఆయనను గురించి గొప్పగా చెప్పి వెళ్లిపోయినాడు.
మాధవరాజు సార్ ఎప్పుడు రిటైరయినాడో ఏమోగానీ చాలా పెద్దాయన! ముసలివాడు! తెల్లని గ్లాస్‌కోమల్లు పంచెను బిల్ల గోసిగా కట్టినాడు. దానిమీద అంతే తెల్లగా ఉండే హాఫ్ షర్టు! కాళ్లల్లో అరిగిపోయిండే స్లిప్పర్స్! ముందరపండ్లు ఊడిపోయిండే నోరు! చెవుల మీద బెత్తెడెత్తు వెంట్రుకలు! మీసాలూ గడ్డమూ నున్నగా తీసేసుకోనుండే మూతి! తెలుపు నలుపు వెంట్రుకలతో గుబురుగా ఉండే కనుబొమలు! నన్నెత్తి మీద కోతిమీర పాసల మాదిరుండే తెల్లని జుట్టు! మెల్లకన్ను!
మా కొత్త తెలుగుసార్, పద్య భాగంలో నాలుగో పాఠం చెప్పడానికి మొదలు పెట్టినాడు. పద్యం చదువుతా ఉంటే పదాలు స్పష్టంగా వినిపించడం లేదు. నాకైతే చాలా అసంతృప్తయ్యింది. ఆయన పద్యం చదివి ‘క్యేవలము (కేవలము) దేవయాని’ అని అంటా పద్య భావం చెపుతా ఉంటే మా బాలన్నా, కోతోడు అశ్వత్థరెడ్డీ, మూలోడు గంగరాజూ తలకాయలొంచి ‘ప్ర్‌ప్ర్‌ర్‌ర్’ అని నవ్వసాగినారు. ఆడపిల్లోళ్లు గుడకా తలకాయలొంచి నిశ్శబ్దంగా నవ్వసాగినారు. నేను తలొంచి బాలన్ననూ అశ్వత్థరెడ్డినీ మెల్లిగా మందలిచ్చినాను. ముందర బెంచీలో ఉండే వెంకటసత్యం వెనక్కి తిరిగి చూసి ‘ఏమిటిది? ఇష్టం లేకుంటే బయటికి వెళ్లిపోండి’ అని కొంచెం కోపంగా అన్న్యాడు. పాపం, ఇదంతా ఏమీ పట్టిచ్చుకోకుండా మాధవరాజు సారు, పాఠం చెపుతానే ఉండాడు. నాకు మనసంతా యెట్లెట్లో అయ్యింది.
రిటైర్ అయినంక గుడకా ఈ వయసులో శింగనమలకొచ్చి ఈడే వుండి మల్లా టీచర్‌గా పాఠాలు చెప్పేకి వొచ్చినాడంటే, ఆయన ఇంటికాడ పరిస్థితులు ఎట్లుండాయో, యేమో? పాపం! అని అనుకుంటా మనసులో రోంత బాధపడతా, పద్యానికి ప్రతిపదార్థం, తాత్పర్యం చెబుతా ఉంటే నోట్స్‌లో రాసుకుండాను. బెల్లు కొట్టినారు. తెలుగు పీరియడ్ అయిపోయింది. మాధవరాజు సార్ వెళ్లిపోయినాడు. వెళ్లిపోతానే వెంకటసత్యం, రాధాకృష్ణ ఇంకా కొంతమంది, క్లాసులో తెలుగు సార్ పాఠం చెప్పేటప్పుడు తలొంచుకొని నవ్వినోళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇంకొగసారి ఇట్లే ఎగతాళి చేస్తే హెడ్మాస్టర్ సారుకు కంప్లైంట్ చేస్తామన్న్యారు. దాంతో ఎవురూ ఏమీ మాట్లాడలేదు.
రెండు వారాలు గడిచిపోయినాయి. తెలుగు పాఠాలు సరిగా అర్థం కావడం లేదు. చివరికి వెంకటసత్యం వాళ్లు గుడకా తెలుగు క్లాసంటే బోర్ అనసాగినారు. ఆయన పాఠం చెప్పకుండా పద్యాలకు ప్రతిపదార్థం తాత్పర్యం చెప్పితే హాయిగా వ్రాసుకుండేది మేలని అనుకోసాగినారు. సోషియల్ నారాయణరెడ్డి సారూ అంతే! ఆయన మొన్న సోషియల్ పాఠం చెప్పేటప్పుడు హెడ్మాష్టర్ సారు గోడచాటునుండి విని పీవన్‌ను పంపి తన రూములోకి పిలిపిచ్చుకొని ‘ఇంటిదగ్గర సేద్యం చేసుకుంటా హాయిగా ఉండకుండా యెందుకొచ్చినావు నారాయణరెడ్డీ ఈ అయ్యవారు ఉద్యోగానికి? మౌర్యచంద్రగుప్తుడు గొప్ప కాకతీయరాజా? ఎవురయ్యా నీకు డిగ్రీలో ఇండియన్ హిస్టరీ చెప్పిండేది?’ అని బాగా దండిచ్చినాడంట! ఈ విషయం మాకు క్లర్క్ శ్రీనివాసులు సార్ చెప్పితే తెలిసింది. మరుసటి దినం నుంచి మాకు సోషియల్ చెప్పడానికి హెడ్మాష్టర్ సారే రాబట్టినారు. ఆయన లెసన్ విన్నెంక క్లాసులో ఎవురూ సోషియల్ టెక్ట్స్ బుక్ చదవల్సిన పనిలేదనుకుండాం. ఆయనెప్పుడూ క్లాస్‌కు టెక్ట్స్ బుక్ తెచ్చుకోడు. పాఠం పేరు సూచిస్తే చాలు మొత్తం దానికి సంబంధించిండే విషయమంతా అరటి పండు వొలిచిపెట్టినట్లు చెప్పసాగినాడు. తెలుగు పండిట్ మాధవరాజు సారు నోట్లో పండ్లు సరిగాల్యాక పాఠం బాగా చెప్పలేకపోవచ్చు గాని తెలుగులో గొప్ప పండితుడని జిల్లాలోనే ఆయనకు మంచి పేరుందని పదోతరగతి తెలుగు టెక్స్ట్‌బుక్ సెలక్షన్ కమిటీలో ఆయనే ముఖ్యమైన వ్యక్తి అని మాటల సందర్భంలో హెడ్మాష్టర్ సార్ చెపుతానే వెంకటసత్యం రాధాకృష్ణ ఇంకా కొంతమంది మేము ఆశ్చర్యపోయినాం. అయినా మాధవరాజు సారు క్లాస్‌లో అశ్వత్థరెడ్డీ బాలన్నా ఇంకా కొంతమంది కొంటెచేష్టలు చేసేది మానడం లేదు.
నిన్న హెడ్మాష్టర్ సారు ఊర్లో లేడేమో, స్కూలుకు రాలేదు. మాధవరాజు సారు మా క్లాస్‌కి వొచ్చి పాఠం చెప్తా ఉండాడు. సార్ ముసలోడయినా డ్రస్సు భలే వేసుకోనొస్తాడు. వైట్ అండ్ వైట్ అని ఆయనకు పిల్లోళ్లు పేరు పెట్టినారు. తెల్లని పంచా ఆఫారమ్ షర్టూ ఎక్కడేగానీ రవ్వంతగానీ మాసిపోకుండా నలగకుండా మల్లెపువ్వు మాదిరుంటాయి. సోషియల్ సార్ నారాయణరెడ్డి మాదిరి ఎడ్డీమడ్డిగా మా తెలుగు సార్ ఎప్పుడూ ఉండడు.
మా క్లాస్ బెంచీల డెస్కుల సందుల్లో, ఈ మధ్యలో నల్లులు ఎక్కువయినాయి. అశ్వత్థరెడ్డి తన ముందుండే డెస్క్‌లో పారాడే నల్లుల్ని చంపుతా, ఏమి ఆలోచన చేసినాడో యేమో, సార్ సార్ నల్లి సార్, మీ షర్టు మీద పారాడుతా వుంది సార్ అని గట్టిగా అరిచినాడు. ‘ఎక్కడ’ అని తెలుగు సార్ షర్టుకు ఇరువైపులా చూసుకోసాగినాడు. ‘నువ్వట్లే వుండు సార్ అది యెనిక్కి పోయినట్లుంది’ అని అంటా అశ్వత్థరెడ్డి లేచిపోయి, ఆయన షర్టు వెనకవైపుండే నల్లిని పట్టుకుండేవాని మాదిరి ప్రయత్నిస్తా ‘ఇదిగో ముందరి కొచ్చింది నువ్వు అట్లే ఉండు సార్’ అంటా దాన్ని పట్టుకొనేవానిమాదిరి యాక్షన్‌చేసి నల్లిని షర్టు మీదనే నలిపేసినాడు. పొట్టపై నుండే షర్టుమీద నల్లిని చంపిండే రక్తపు మరక అంటుకుంది.
ఆ మరకను చూసి మాధవరాజు సారు కొంచెంసేపు బాధపడినాడు. ఆ నల్లి నిజంగా ఆ సార్ షర్ట్‌మీద పారాడిందో ల్యాకుంటే అశ్వత్థరెడ్డి నల్లిని పట్టుకొని పోయి ఆ పనిచేసినాడో మాకెవురికీ అర్థం కాలేదు. ఆ సార్ ఆ విధంగా బాధపడతావుంటే, సార్, నీళ్ళు తెచ్చి తుడుత్తునా సార్ అని అశ్వత్థరెడ్డి అడిగినాడు. ‘యేమొద్దులేరా! నీళ్లు తెచ్చి నువ్వు షర్టంతా ఇంకా గబ్బు లేపేతట్లుండావ’ అని ఆయన అశ్వత్థరెడ్డి ప్రయత్నాన్ని నివారించినాడు.
తెలుగు పీరియడ్ అయిపోయినంక ఐదారు మంది అశ్వత్థరెడ్డిని మందలిస్తా ‘ఆయన బట్టలమీద మాకెవురికీ కనిపించని నల్లి నీకు వొగనికే కనిపిచ్చిందా అశ్వత్థ రెడ్డీ? తమాషా చేసేదానికి కూడా కొంచెం హద్దుండల్ల! పాపం, ఆయన ఎంతగా బాధపడింటాడు? నువ్వు చేస్తావుండే పనులు క్లాసుకంతా చెడ్డపేరు తెస్తాయి’ అని కోపగిచ్చుకుండారు.
‘ఆ నల్లి, మీయట్లా తెలివయినోళ్ళకు కనిపీకుండా నాయట్లా తెలివిలేనోనికి కనిపిచ్చింది, ఏం జెయ్యల్ల మల్ల?’ అని యెదురు ప్రశ్నవేసినాడు అశ్వత్థరెడ్డి. ‘నోరు మూసుకోప్పా, ఇంక చాలుగానీ’ అని రామచంద్రారెడ్డి గట్టిగా అంటే అశ్వత్థరెడ్డి ఊరికే అయినాడు.
ఆశకు పోతే గోసిలో రాయి పడింది!
మేము గుత్తకు చేసిండే రామరంగయ్యోళ్ల తోటలో పరంగిచెట్ల పట్టెలో పరంగి కాయలు దోరగాయలైనాయి. కాయల్లో అక్కడక్కడ ఎర్రపొడలు వస్తా వుండాయి. కాత వొగ రకంగా తగులుకుంది కానీ కాయలు బాగా ఊరలేదు. మొదట నాయనా నేనూ అనుకున్నెట్లు ఆ పట్టెలో ఉండే న్యాల అంత సారవంతమయింది కాదని అర్థమయిపోయింది. మధ్యలో ఉండే బండి జాడకు పడమట పక్కనుండే న్యాల, రోంత చవిటి పర్రని తెలిసింది. అందుకే కాపు సరిగా తగులుకోలేదు, కాసిండే కాయలూ బాగా ఊరలేదు. బండి జాడ నుంచి వొగ పగ్గం పొడవు దంకా సుమారు నూరుచెట్లే సరిగా కాసిండేది. మిగతా అన్ని చెట్లూ ఆకులు ముడుచుకొని బింగి చెట్ల మాదిరి అయినాయి. అవయినా నీళ్లు సరిగా పెట్టకపోవడంతో బాగా దెబ్బతిన్న్యాయి. రంగయ్యకు ఇప్పుడు వడ్ల మిషన్ ఆడిచ్చడంలో ఉన్నెంత శ్రద్ధ, నీళ్ల పంపు ఆడిచ్చడంలో లేదు. వడ్లు ఆడిచ్చడానికి రానప్పుడేమో తోటలో పెట్టిండే మిగతా పంటలకు నీళ్లు పెట్టేకే యాసిరికి పడతా వుండాడు కొండన్న. మా పట్టెకు తడి పెట్టేకి మిషన్ ఆడిచ్చమని యెంత బ్రతిమాలినా చెవులో యేసుకోడు. మా మింద దయదల్సి మిషన్ పెట్టినప్పుడు. ఎవురైనా వడ్లు ఆడిచ్చుకుండేకి వొస్తే నీళ్ల పంపును ఆపేసి పట్టను వడ్ల మిషన్‌కు తిప్పుతాడు. వొగొగసారి పట్ట తెగిపోతాది. వొగొగసారి డీజల్ అయిపోతాది. ఇట్లా అన్నీ అసెడ్డాలే! అంతా చూసి, నాయన బాధపడి ఇట్లయితే మేము మిగతా గుత్త కట్టలేము రంగయ్యా అని రంగయ్యతో చెప్పినాడు. రంగయ్య కొండన్నను పిలిచి దండిచ్చినాడు. ‘వాళ్ల పట్టికి తడి పెట్టుకున్నెప్పుడన్నా మిషన్ ఆడిచ్చేకి వాల్లెవురూ రాకుంటే ఎట్లయ్యా?’ అంటా కొండన్న, మాదే తప్పయినట్లు మాట్లాడినాడంట! హ్యాండిల్ పట్టుకొని ఆయిల్ ఇంజన్ ఆడిచ్చేకి నాయనకు శాతనయితాదా? నేను స్కూలుకు శెలవుపెట్టి ఆయిలింజన్ ఆడిచ్చేకి రెండు మూడుసార్లు చూసినాను. అప్పుడు కొండన్నకు వీలుగాలేదు.
పరంగి పంట దుసిపోయింది. ఎల్లిన కాయలు ఎల్లినట్ల బాడిగ బండిలో వేసుకొని పోయి నాలుగైదు పల్లెల్లో అమ్మినాం. అయిదు తడవలకు ఐదు మూటలు వడ్లు ఇన్నూర్రుపాయలు లెక్క వొచ్చినాయి. రంగయ్యకు కట్టాల్సిండే మిగతా గుత్త కట్టేటప్పుడు, శానా నష్టపోయినామని ఒగ నూర్రుపాయలు పోదోసుకోమని ఈడిగిలబడి అడిగితే గొనిగీ గొనిగీ వొప్పుకుండాడు రంగయ్య. కాయలమ్మిండే దుడ్లు ఇన్నూర్రు పాయలు రెండు మూటలు వడ్లు కొల్లబెట్టి తోటలో నుంచీ గుండెల బరువుతో ఇంటికొచ్చినాం.
అమ్మయ్య కండ్లనీళ్లు బెట్టుకుని శానాసేపు బాధపడింది. ‘ఇంట్లో దుడ్లుండేది చూసి నీకు నిమ్మలంగాకపాయ! తోట తోట అని, ఆ ముదనట్టమోడు ఎంత జప్పితే అంత, మునుగుత్తే మేలని, వొగేసారి నన్నూర్రుపాయలు తీసుకొనిపోయి ఆ క్వాంటాయప్ప ముండమోపిత్తివి! ఇప్పుడు మల్లా ఇన్నూర్రుపాయలు లెక్కా రొండు మూట్లు వడ్లు వాని వాతను కొల్లబెట్టి వొత్తివి’ అని అమ్మయ్య ముక్కు చీదబట్టింది.
‘అవును ఆ పొద్దు నువ్వు గుడకా సరేనంటివి గదా! మునుగుత్త ఇంతని వొప్పుకున్నెంక, ఈకుండా మాట తప్పేకి అయితాదా?’ అని నాయన బాధగా అన్న్యాడు.
“అవును, నువ్వు సత్తెఅరిచ్చంద్రునివి, మాట దప్పకుండా యెట్లుంటావు? నువ్వు మాట దప్పితే ఆయప్ప నిన్ను గల్లుకేత్తాండెనా? నువ్వేమో మాటమీద నిలబడ్నావు సరే, పెట్టిండే పంటంతా అట్ల నాసినమై పొయ్యిండేది ఆయప్పకు కనిపీలేదా? ఆ ముదనట్టం తోట్లో పంట యా మాత్తరం వొత్తా వుండేది దినమూ ఆయప్ప సూత్తానే వుండాడు గ£దా! యేమీ, సూడకుండా వుండేకి ఆయప్ప కండ్లు దెంగినారా ఎవురన్నా? ఊరికే అగనాగ్గా అంత లెక్క వాళ్ల ముండమోపిచ్చినట్లాయనే! దిబ్బలో ఉండే యెరువంతా తోలి ఆ పకారంగా సేద్దెం జేసి, కన్నగసాట్లు బడి, ఇత్తనాలు తీసకచ్చి బూడ్తిమి! ఇంటందరమూ ఏడెనిమిది నెలలు కట్టపడి సెమటంతా గుమ్మరిత్తిమి! అంతా జేత్తే కడాకు కొంపకు యేమి తెచ్చుకుంటిమి? సుక్కుడుగాయలకు మూడు మూట్లొడ్లు ఇరవై రుపాయల లెక్కా, ఇబ్బుడు పరింకాయిలకు మూడు మూట్లొడ్లూనా? ఈ సంబడానికి, యెంత లంపటపడ్తిమి? యిన్నాల్లూ ఇంటందరమూ కట్టపడిండేది యాటికి బాయ, పసులు కట్టం యాటికి బాయా? అంతా న్యాల పాలాయ గదా! పోనీ సేతల కట్టం యాటికన్నా బోనీలే! అగనాగ్గా ఆర్నూర్లు లెక్క రొండు మూట్లు వొడ్లూ అంతా గలిపి ఆర్నూటాయాభై రుపాయలు వాళ్లకు కొల్లబెట్టినట్లాయ గదా! ఆ లెక్కబెట్టి ఆ పొద్దే వడ్లు కొనుక్కోంటే, ఇరవయ్యారు ఇరవయ్యేడు మూట్లు వొచ్చిండేవి గదా! లచ్చినంగా సమ్మచ్చరం బత్తెం గింజలు అయితాండె గదా!” అని అమ్మయ్య శానా అంగలార్చింది. అయిపొయ్యిండేదాన్ని గురించి ఎంతంగలార్సీ యేం లాబం అని నాయన మవునంగా వుండిపోయినాడు.
‘ఉద్దర్నీల్లు పారే మాగాణిలో కోరుబూముల్లో యెంతద్దుమానం పంట పండినా, పెట్టిండే కర్చులన్నీ పోయి, చేసిండే కట్టానికి తగ్గట్టు మిగుల్తా వుండె. తోట, తోట అని ఆసికి బోతే గోసిలో రాయిపడె! సెర్లో దోచ్చెట్ల పంటొచ్చిన కాట్నుంచి యాల్నో దరిద్దరం యెంటాడుతా ఉండాది! అప్పటినుంచి పిల్లోని సదువెంత పంగదెంగులాయనో!’ అని అమ్మయ్య నా దగ్గరికి జరిగి నా తలకాయను కడుపుకు ఆనిచ్చుకొని వీపుమీద నిమురుతా కన్నీళ్లు కార్చబట్టింది. అమ్మయ్యని చూస్తా ఆడపిల్లోళ్లు గుడకా కన్నీళ్లు కార్చినారు. నాయన బాధపడతా అందర్నీ ఓదార్చినాడు.
వాళ్ళందరి కంటే నేనే పెద్దగా చదువుకోవల్లని కసి!
రెండో శనివారంతో కలిపి వరుసగా మూడు దినాలు శెలవులొచ్చినాయి. నీలంపల్లిలో గుగ్గిళ్లంగడి పెట్టుకోనుండే చిన్నాయన దగ్గరికి పోవల్లనుకొని అమ్మయ్యతో చెప్పినాను. రేపు మీ నాయనెంట పోదువులే అని వొప్పుకుంది అమ్మయ్య. నాయన తాడిపత్రి దగ్గరుండే చుక్కలూరు నుంచి ఆకుల పిడి వేసుకోనొస్తాడని నేను రోడ్డు దగ్గరికి పొద్దుగలుగ చేరుకుండాను. నేను పోయిన రోంతసేపటికే తిరుపాలు, ఓబుళ నారాయణ, కొండన్న, కోనయ్య, జానగొండ నారాయణ వొచ్చినారు.
తిరుపాలు, రుద్రవరం వెంకట్రామయ్యశెట్టి కొడుకు! నాకంటే రెండేండ్ల్లు పెద్దోడు! అనంతపురంలో పాల్టెక్నిక్ కోర్సు చదువుతావుండాడు. నెలకొగసారి ఊరికి వస్తా వుంటాడు. ఒగటి మెల్లకన్ను. చూపు సరిగా కనిపిచ్చదంట. అందుకే కంటద్దాలు పెట్టుకుండాడు. ఆ యప్ప తమ్ముడు వెంకటేశం. మహా తెలివైనోడు. నాకంటే వొగ సంవత్సరం చిన్నోడు. ఎనిమిదో తరగతిలోనే స్కూలొదిలేసినాడు. వానికంటే చిన్నోడు కృష్ణమూర్తి వానికి చదువే లేదు. చిన్నపిల్లప్పటి నుంచి కండ్లకు భూతద్దాలు. వాళ్ల నాయన వెంకట్రామయ్య మాదిగిండ్ల కాడ చిల్లరంగడి పెట్టుకొని సంవత్సరానికి ఆ చిన్నంగడిలోనే ఇన్నూరు మూటలు వడ్లు జమ జేస్తాడు. శెనక్కాయల సీజన్లో నలభై యాభై మూటలు శెనక్కాయలు కుప్పబోసుకుంటాడు.. మాగాణి కింద తొమ్మిదెకరాలు మడి ఉంది. యెలిపొలంలో ఐదెకరాలు చేనుంది. అంతవున్న్యా చిల్లరంగట్లో బీదాబిక్కిని పైకి కనిపిచ్చకుండా దోచుకోవడమే! అందుకే అందరికీ కంటి చూపులేదని, చేస్తావుండే పాపం ఊరికే పోతాదా? అని జనం అంతా అనుకుంటా వుంటారు.
అట్లా ఇంటి తిరుపాలు రోడ్లోకొచ్చినాడు. రోడ్డు పక్కన, మా ఊరి పక్కనే పారే పెద్దొంక మోరీ మీద ఇద్దరమూ దూరదూరంగా కూర్చొని మాట్లాడుతా వుండాము. అంతలోనే కుళ్లాయప్ప వొచ్చి నా పక్కన కూర్చుండాడు. అది చూసి తిరుపాలు లేచిపోయి ఎదురుగా ఉండే మోరీమీద కూర్చుండాడు. తిరుపాలు అట్ల లేచి అవతల పక్కకు పోవడం చూసి నాకు బాధయింది. ‘ఇతడేం మనిషి? టౌన్‌లో కాలేజీలో చదువుకుంటా ఉండాడు. ఆడ క్లాసులో తన పక్కన కూర్చుండేవాళ్ల కులాలను గురించి తెలుసుకోని ఇట్లనే లేచిపోతాడా? వీళ్ల నాయన మాదిగిండ్లకాడ చిల్లరంగడి పెట్టుకోని మాదిగోళ్ల ఆడోళ్లు కొంగుల్లో, గిన్నెల్లో తెచ్చే గింజల్ని ముట్టుకోడా? వొగసారి ఇతగాడు గుడకా అంగడి పెట్టిమీద కూర్చుంటాడే! అప్పుడు ఇతగానికి వాళ్ల కులం కనిపిచ్చదా?’ అని రోంతసేపు మనసులో అనుకుండాను. తిరుపాలు అవతలి మోరీ మీదికి పోయినాడే గాని మా జతగాళ్లెవురూ ఆయప్పతో చనువుగా మాట్లాడలేదు. యాల మాట్లాడలేదంటే, తాను అనంతపురం కాలేజీలో చదువుకుంటా వుండానని రోంత గర్వంగా మాట్లాడుతా వుంటాడు. అట్లా మాట్లాడినప్పుడల్లా నాకు బాధయితా వుంటాది. నా జతగాళ్లెవురూ మాట్లాడకపోయేసరికి తిరుపాలు ఇంటికి వెళ్లి పోయినాడు. రోంత సేపు అందరమూ ఊరి సంగతులు మాట్లాడుకున్నెంక చీకటి పడతావుందని జతగాళ్లందరూ ఇండ్లకెళ్లిపోయినారు. నేను ఆడే మోరీమీద కూర్చొని నాయనొచ్చే బస్సు కోసరం ఎదురు చూస్తా తిరుపాలును గురించి పోయిన సంవత్సరం ఎలకంటి పెద్ద పాపయ్య కొడుకులు మాట్లాడిండే సంగతిని గురించి గుర్తు చేసుకోసాగినాను.
అప్పుడప్పుడు ఎలకంటి పెద్దపాపయ్య కొడుకులు అంటే మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో నాతోపాటు చదువుకుంటా ఉన్నిండే సరోజమ్మ పెద్దన్నయ్య, రెండో అన్నయ్య వెంకటస్వామీ గోపాలూ ఊరికొస్తా వుంటారు. వెంకటస్వామి జెంషెడ్‌పూర్‌లో టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ఇంజనీర్‌గానూ, గోపాల్ అనంతపురంలో పసువుల డాక్టర్‌గానూ పనిచేస్తా వుండారు. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నెప్పుడు ఇద్దరూ వొగేసారి ఊరికి వొచ్చినారు. మా నాయన నాగుకు నాలుగు మూటలు వడ్లు అడిగేకి వాళ్లింటికి పోయినప్పుడు నాయనెంట నేనూ పోయినాను. పెద్దపాపయ్య నాయనతో మాట్లాడుతా ‘చేతికొచ్చిండే కొడుకును లక్షణంగా కూలి పనులకు పంపకుండా శింగనమల స్కూలుకు యాల పంపుతా వుండావు వెంకటస్వామీ? నీకేమి తిక్కగిననా?’ అని అన్న్యాడు. ఆ మాటలు వింటానే నాకు శానా బాధయింది. ‘నేను చదువుకుంటా వుంటే వీళ్ళ సొమ్మేమన్నా పోతావుందా? యాల వీల్లకంత సంగటం’ అని మనసులో తిట్టుకుండాను. తిట్టుకుండానే గానీ, ఏమీ నోరిప్పలేని శాతగానితనం! పెద్దపాపయ్య అట్లంటా వుంటే కొడుకులిద్దరూ ‘చదివించనీ లేయ్యా! ఇట్లా అప్పులు చేసయినా సరే, కొడుకును చదివిస్తే ఆ పిల్లోనికి ఏదో వొగ చిన్న ఉద్యోగం రాకపోతుందా? అని పాపం వెంకటస్వామి ఆశపడుతా వున్నట్లుంది’ అని అన్న్యారు. ఆ మాటలు నాకు ఎగతాలిగా అనిపిచ్చినాయి. ‘మేము పేదోళ్ళమనే గదా ఈ పెద్దోళ్లు ఇట్లా మాట్లాడుతా వుండేది! ఎట్టన్నాగాని వీళ్ల కంటే, ఊర్లో అందరికంటే పెద్ద చదువులు చదివినోనిగా నేను వీళ్ల ముందర తిరగల్ల’ అని మనసులో గట్టిగా నిర్ణయించుకొని నా చదువును గురించి ఆలోచన చేయసాగినాను. అంతలోనే బస్సొచ్చింది.
నేను బస్సెక్కి ఆకుల పిడిని ఎత్తుకొని మెల్లిగా కిందికి దిగొచ్చి డ్రైవర్ అంకుల్ని పలకరిచ్చినాను. ఆ అంకుల్ నా చదువును గురించి అడిగినాడు. నేనంతా చెప్పి ఆకుల పిడి మోసుకొని ఇంటికొచ్చినాను. రాత్రి అన్నం తిన్నెంక అందరమూ చుట్టుకొని ఆకులు మాటి, కట్టలన్నీ ఆకుల గంపలో పేర్చి పండుకుండాం.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
