Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాతి పర్రెలలో నుంచి..-19

[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]

మా చిన్నాయన అటువంటివాడంటే ఎవురూ నమ్మరు!

మా చిన్నాయనను చూడల్లని అమ్మయ్య చెప్పినట్లే నేను తెల్లవారుజామునే లేచి ఆకుల గంపెత్తుకొని నాయనెంట నీలంపల్లికి బయలుదేరినాను. మరవకొమ్మ కాటికి పోతానే చెరువులో వుండే నీళ్లపైన్నుంచీ ఈసుగాలికి అలల శబ్దం విపరీతంగా వస్తావుంది. దోసచెట్లను ముంచినప్పుడు వొచ్చిండే నీళ్లే ఇంగా వుండాయి. ‘ఈ వొచ్చే సంక్రాంతి కల్లా చెరువులో నీళ్లన్నీ అయిపోతే ఈసారి మల్లా దోసచెట్లు వేస్తారా నాయనా?’ అని నాయనను అడిగినాను. ‘యెవురూ యేసుకుండేకి ముగబడరప్పా! ఆ దోచ్చెట్లల్లో నాలుగు దుడ్లు చేతికొచ్చిండేది మనకొగరికే! ఇంగెవురూ వొగ నూర్రూ పాయలు గుడకా కండ్ల జూల్లేదు. అందరివీ మామూలు దోసకాయలు. అవి తినేకి రోంత పులుపుంటాయి. అందికే బండెడు కాయలు పల్లెలకు యేసుకోని పోయినా ఒగ మూటొడ్లు గుడకా యెవురికీ రాల్యా. అంత కస్టపడి చెట్లు పెంచినంక తీరా నోటికొచ్చినప్పుడే వానొత్తే, అంతా గబ్బుగబ్బయితాదని యెవురూ ఆ ఆలోశనే చెయి ల్యా. పైగా చెర్లో ఇంగా నీళ్లుండాయి గదా ఇంగ దోచ్చెట్లు పెట్టుకుండేకి యెట్లయితాది’ అని నాయన చెరువు కింద ఉండే పల్లెలోల్ల ఆలోచన గురించి చెప్పినాడు.

రోడ్లో నుంచి తిరిగి ముందుకు నడుస్తా చిన్నాయనోళ్ళను గురించి మాట్లాడుకుంటా పోతావుండాం. చిన్నాయనా, జేజీ రొన్నాళ్లు గుడకా మన ఊర్లో వుండకుండా యాల పల్లెలన్నీ తిరుగుతా పోతావుంటారని నాయనను అడిగినాను. సుల్తాన్‌పేటలో చిన్నాయన చెప్పిండే విషయమే నాయన గుడకా చెప్పినాడు. నిజమే దండిగా తోటలుండే పల్లెలే కళకళగా వుంటాయని, బీదాబిక్కికి నిరంతరం కూలి పనులుంటాయని అట్ల మా ఊర్లోనా ఇరవై ముప్పై తోటలుంటే మా కుటుంబం గుడకా కూటికి గుడ్డకు ఇన్ని ఇబ్బందులు పడేది కాదనుకుంటా నడుస్తా ఉండాను.

నాయన చిన్నాయన గురించి చెబుతా, నన్ను జాగ్రత్తగా వుండమన్న్యాడు. వాని నోరు దుబారని రెండు దినాలుండి ఊరికి పొమ్మన్న్యాడు. నేను సరే అన్న్యాను. మల్లా రోంతసేపయినంక నాయనే మాట్లాడుతా ‘వాని బుద్ధి మంచి బుద్ధి కాదు. వాడు శానా తుడుగునాయలు! సారాయి గుడకా తాగుతాడు! ఆడవి, పనికిమాలిండేటివి ఉంటాయి కదా. అట్లాదాండ్లకు, అంగిట్లో చేసిండేటివి తినేకి పెట్టి, మచ్చిక జేసుకొని ఆ ముసిలాయమ్మ ఊర్లోకి పొయినప్పుడు యాదో వొగ ముండతో వాకిలి యేసుకొని వుంటాడంట. మీ జేజి నాతో చెప్పి అంగలాత్తా ఉంటాది. నువ్వు ఇంతకు ముందొచ్చినప్పుడు నీలంపల్లిలో మన కులత్తుడే రుసింగప్పను చూసినావు గదా! వాడు ఆడింగిలోడు! వాని పెండ్లాము కిలాడీది! ఆ పనికిమాలిండేది ఈ కుంటోనికి అనుకూలం’ అని నాయన చెబుతా ఉంటే నేను ఆశ్చర్యపోయినాను. చిన్నాయన కుంటోడు కదా! ఆ యమ్మతో ఎట్ల సంబంధం పెట్టుకుంటాడు అని ఆలోచిస్తా నడుస్తా ఉండాను. అంతలోనే నీలంపల్లి వొచ్చింది.

ఇద్దరమూ పెద్దిరెడ్డోళ్ల ఇంటికి పోయి మొగాలు కడుక్కోని కాపీ తాగినాం. నాయన రోంతసేపు పెద్దిరెడ్డి పెద్దయ్యతో మాట్లాడి వొగ కట్ట తమలపాకులు ఆ ఇంటి పెద్దమ్మ చేతికిచ్చినాడు. ఆట్నుంచీ ఇద్దరమూ బయలుదేరి, రేగడి కొత్తూరు దావలో ఉండే రుషింగప్పోళ్ల ఇంటికాటికి పోయినాం. పోతానే ఆ పిన్నమ్మ ‘రా బావా! శానా దినాలకొత్తివే? రా బూసీ! బాగా సదువుకుంటా ఉండావంట గదా! మీ నాయినంతా సెప్పుతా వుంటాడు లే!’ అని ఇద్దరినీ ఇంట్లోకి పిలిచి ‘కుచ్చోండి కాపీ జేత్తాను’ అంటా వంట రూములోకి పోబోయింది. ఇప్పుడే తాగొచ్చినామని వొద్దన్న్యాడు నాయన. ‘మీ సిన్నాయినోల్ల దెగ్గ్గిరికి పోలేదా బంగారూ?’ అని నన్నడిగింది ఆ పిన్నమ్మ. నాయన నేనొచ్చిండే సంగతి చెప్పి, ‘రుషింగి’ లేడా అని అడిగినాడు. తోటకాటికి పోయినాడని పయిటాలకల్లా వొస్తాడని చెప్పింది ఆయమ్మ. నాయన ఒగ అరకట్ట ఆకులు ఇచ్చి, రేగడి కొత్తూరుకు బయలుదేరుతా ‘పిల్లోడు రెండు దినాలు వాళ్ల చిన్నాయన దగ్గరే వుంటాడ’ని చెప్పి, నన్ను చిన్నాయనోళ్ల ఇంటికాటికి పిలుచుకొని పోయినాడు.

అది పాత మట్టిమిద్దె. ఇంటి ముందర తడకలతో కప్పిండే వసారా ఉంది. ఇంటి పడమర వైపున పసువుల దొడ్డి ఉంది. దోడ్లోకి పసువులు పొయ్యేకి వసారా పక్కనే వొగ రేకుల గేటు వుంది. వసారాలో పడమర వైపు నుండే పొయ్యి దగ్గర కూర్చొని చిన్నాయన అలసంద వడలు చేస్తా వుండాడు. అంతకుముందే కర్జికాయలు, అలసంద గుగ్గిళ్ళు చేసినాడేమో, రెండు చిన్న డేక్షా గిన్నెల్లో పెట్టి పేపర్ మూసినాడు. వసారాకింద, పొయ్యిలకు గాలి తగలకుండా వుండేటట్ల, చేస్తా వుండే పదార్థాలు జనానికి కనిపిచ్చకుండా వుండేటట్ల అడ్డంగా తడకలు పెట్టిచ్చుకుండాడు చిన్నాయన. గోడవారన రోట్లో వూరిమిండి నూరుతావుంది జేజి. వాళ్లిద్దర్నీ చూస్తానే చాలా సంతోషమయింది నాకు. నన్ను చూసి, ‘వోరి దొంగబడవా యెన్నాలైంది రా నిన్ను సూడక! రారా’ అని ఆనందపడతా పిల్లోళ్లని గురించి అడిగినారు ఇద్దరూ.

నాయన వొగ అరకట్ట ఆకులు జేజికిచ్చి ‘పిల్లోడు రెండు దినాలు ఈడే ఉంటాడంట’ అని చెప్పి రేగడ కొత్తూరుకు బయలుదేరినాడు. ‘అంబిడి పొద్దు బువ్వ తిని పోదువు లేప్పా! రోంతసేపు కుచ్చో. ల్యాకుంటే గంపెత్తుకొని ఊర్లోకి పోయిరాపో, అంతలేకే బువ్వొండుతాను’ అని జేజి బలవంతం చేసినా నాయన వినకుండా కడాకు రెండు వడలు తిని, నీళ్లు తాగి బయలుదేరినాడు. నాయన వెళ్లిపోయినంక నేను రామరంగయ్యోళ్ళ తోట విషయం బాధపడతా చెప్పినాను. వాళ్లు గుడకా బాధపడినారు. నా చదువు సంగతులన్నీ విని చిన్నాయన సంతోషపడినాడు, మేమిద్దరమూ మాట్లాడు తుంటే జేజి మంచినీళ్ల కోసరం కడవ తీసుకొని బావి దగ్గరికి యెల్లవారింది. నేనూ వస్తానంటా, జేజి సందిట్లో ఉండే కడవను ఇప్పిచ్చుకొని జేజి వెంటపోయి, బావినీళ్లు చేదుకొని వొచ్చి కుండలన్నీ నింపినాను. జేజి రెండు కర్జీకాయలు, కాలే కాలే వడలు ఇచ్చింది. నాతోపాటు తానూ రెండు వడలు తిని చేసిండే పదార్థాలన్నీ అవిన్నీ ఇవిన్నీ గిన్నెల్లోపెట్టి, ఆ గిన్నెలన్నీ ఒగ గంపలో పెట్టుకొని అమ్ముకోనొచ్చేకి ఊర్లోకి పోయింది.

చిన్నాయన పొయ్యి మీద చేసినవన్నీ అయిపోయినంక పొయ్యిలోని నిప్పులన్నీ ఆర్పేసి వసారా అరుగు మీద దేకుకుంటా వొచ్చి అరుగుమోట్లో కాళ్లూ చేతులూ కడుక్కొని పొయ్యి దగ్గరుండే గిన్నెలన్నీ లోపల పెట్టమని నాతో చెప్పి అరుగు మీద కూర్చుని బీడీ అంటిచ్చుకొని నాలుగు దమ్ములు పీకి ‘ఆ, ఇప్పుడు చెప్పరా దొంగ బడవా? భలే వొచ్చినావు కదరా’ అని నాతో సంతోషంగా మాట్లాడి, బోనా కట్టెను వూదబొడుచుకొని కుంటుకుంటా ఇంట్లోకి వొచ్చి, లోపలి వాకిలి పక్కన గోనిపట్టమీద కూర్చుండాడు.

చిన్నాయన కూర్చోనుండే రూము వొగ అంగడి రూము మాదిరింది. వాకిలి పక్కన గోడ వారన, సుల్తాన్‌పేటలో మాదిరే, వొగ చెక్క పలక మీద కర్జీకాయలూ, వడలూ, గుగ్గిళ్లూ, అట్లూ, (అత్తిరసాలు) పెట్టిండే గిన్నెలుండాయి. గిన్నెల మీద ఈగలు వాలకుండా పేపర్లు మూసింది జేజి. పై పలకమింద బీడీల కట్టలూ సిగరెట్ల ప్యాకులూ పప్పరమెంట్లూ నిమ్మొప్ప్పులు పెట్టినారు. అన్నీ చిన్నాయనకు చెయ్యి చాపితే అందేటట్ల ఉండాయి. చిన్నాయన అడుగుతానే నేను లోపల ఉండే రూములోకి పోయి లోటాలో నీళ్లు తెస్తా ఉంటే వెనకపక్క దొడ్డివాకిలి తీసుకొని లోపలికొస్తా ‘యేం జేత్తా వుండావు బంగారూ! నారాయనా’ అని పలకరిచ్చింది రుషింగప్ప భార్య నాగలక్ష్మి పిన్నమ్మ. ఆ పిన్నమ్మ వెనకవైపుండే దొడ్లో నుంచీ దొడ్డి వాకిలి తీసుకొని లోపలికి వొచ్చేదంకా నాకు తెలీదు, ఆ ఇంటికి దొడ్డివాకిలి ఉందని. లోపలుండే రూము తర్వాత కొంచెం తగ్గులో పసువులు కట్టేసే గాటిపాడు ఉందని. ఆ పిన్నమ్మ యెనుగొడ్డును తోలుకోనొచ్చి తలుగుతో గాటిగుంజకు కట్టేస్తా, ‘ఇదీ మనిండ్లే బూసీ, యెనకుండే దొడ్డంతా మందే! ఆ పెద్దింట్లో తలం ల్యాక, కొన్ని పసరాల్ని ఈడ కట్టేత్తాం. ముందుపక్క రెండ్రూములు ఖాళీగా ఉంటే మీ చిన్నాయనోల్లకు మనోల్లే గదా అని అంగిడి పెట్టుకుండేకి ఇచ్చినాం’ అంటా, నా చెక్కిలిని వేళ్ళతో వొత్తి, చిన్నాయనుండే రూములోకి వొచ్చి ‘యేం సన్న బావా కొడుకొచ్చినాడు కోడ్నో గీడ్నో కోత్తాండావా లేదా?’ అని అడుగుతా వాకిలికి దూరంగా రోంత చాటుగా కూర్చుంది.

‘నువ్వు కోడ్ని యిస్తే కొయ్యనా?’ అని చిన్నాయన జాంతానమాడినాడు. ‘అదే మగాదము? నువ్వు అడిగితే ఈనా?’ అని ఆ పిన్నమ్మ గుడకా జాంతనమాడింది. వాళ్లు అట్లా మాట్లాడుతా ఉంటే నాకు సిగ్గయింది. బయటకు పోదామనిపిచ్చింది అంతలోనే ఆ పిన్నమ్మ ‘బూసీ నువ్వు ఇంతకుముందొచ్చినప్పుడు గుడికి అవతల, ఆ పెద్దిరెడ్డోళ్ల తోట పక్కనుండే మా తోటను చూసినావు గదా! ఆడ, నా మొగుడు మీ రుసింగప్ప సిన్నాయన వుంటాడు. బువ్వ తినేకి రావల్లంటని పిల్సుకోని రాపో బంగారూ’ అని చెప్పింది. ఆడుండేకి సిగ్గుతో బిడియపడతా ఉండే నాకు, ఆ పిన్నమ్మ, పని చెప్పడం మేలయిందని అనుకుంటా ఉండంగనే చిన్నాయన గుడకా ‘పోయిరాపో నాయనా’ అని బ్రతిమాలుతూ చెప్పినాడు. నేను వెంటనే ఆ తోట కాడికి బయలుదేరి పోతా ఉండాను.

పెద్దాయమ్మ, అయినా ఎంతందంగా ఉంది మనిషి! ఆయమ్మ చెంపగిల్లితే ఎట్లెట్లనో అయ్యింది! ఆయమ్మ, పెద్దాయమ్మే కావొచ్చు వొగ ఆడమనిషి అట్ల నా చెంపలు గిల్లచ్చునా? పిన్నమ్మా అని పిలుస్తా, ఆయమ్మ నా చెంపలు గిల్లిండే దాన్ని గురించి నేనునుకోవడం తప్పుగదా!

ఆలోచిస్తా నడుస్తా ఉంటే, నాయన చెప్పిండే మాటలు గుర్తుకొచ్చినాయి. ‘ఇంత బాగుండే నాగలక్ష్మి పిన్నమ్మ నిజంగానే చిన్నాయనతో సంబంధం పెట్టుకో నుంటాదా? ఎవురికైనా తెలిస్తే పిన్నమ్మ పరువు పోదా? రుషింగప్ప చిన్నాయనకు తెలిస్తే యెట్ల? ఈ యప్ప జూస్తే కుంటోడయిపాయ? తెలిస్తే చిన్నాయన ప్రాణాలు తీయరా? అయినా తెలీకుండా ఉంటాదా?’ అని అనుకుంటా మా ఊరి రెడ్డిబిడ్డ కురువోల్లాయప్పతో సంబంధం పెట్టుకుందని, రెడ్డి తమ్ముని కొడుకు నల్లపరెడ్డి, కురవోళ్ళ కొండన్నను యాటకొడవలితో నరికిండే దృశ్యాన్ని గ్నాపకం తెచ్చుకొని రోంతసేపు భయపడినాను. ఎందుకైనా మంచిదనుకొని నిదానంగా ఆ తోట కాటికి పోయి దూరంగా దిగువపక్కనుండే రుషింగప్ప చిన్నాయనను చూసినాను. తోటలో పెట్టిండే పంటలపక్క చూస్తా బెండకాయల్నీ అలసందకాయల్నీ పీక్కోని తింటా మెల్లగా చిన్నాయన దగ్గరికి పోయినాను. నన్ను గుర్తుపట్టి ‘యేమిరా పాపోడా యెట్లొత్తివి? మీ నాయనొచ్చినాడా?’ అని ఆ చిన్నాయన పని చేసుకుంటా నన్నడిగినాడు. నేను ఆ పిన్నమ్మ చెప్పిండే సంగతి చెప్పినాను. వొగ అర్ధగంటసేపు అయినంక ఇద్దరమూ తోటకాట్నుంచి మాట్లాడుకుంటా బయలుదేరినాం. రుషింగప్ప చిన్నాయన వాళ్ల ఇంటికి పోయినాడు. నేను మా చిన్నాయనోళ్ల ఇంటికి పోయినాను.

ఇంటి ముందర వాకిలేసినారు, ఇంకా జేజి రాలేదేమో అనుకుంటా సందేహిస్తా తటపటాయిస్తా రోంత సేపయినంక నేను వాకిలి తట్టినాను. ఎవురూ పలకలేదు. మల్లా రోంత సేపయినంక నేను వాకిలి తట్టినాను. తట్టినంక రోంత సేపటికి లోపలనుంచి చిన్నాయన ‘గడిపెట్ట లేదు, తలుపు గట్టిగా దొబ్బి రా’ అని గట్టిగా చెప్పినాడు. నేను బలంగా తలుపు దొబ్బినాను. చిన్నాయన దోక్కుంటా లోపలుండే వాకిలి దగ్గరకు వొచ్చి, ‘నడుములు నొస్తా వుంటే, బయట వాకిలి తలుపు ముందుకేసి పండుకోనుంటి నప్పా’ అంటా చేతులు వూదబొడిచి కడప్మాను దాటి అంగడి రూములోకొచ్చినాడు. చిన్నాయన సారాయి తాగినాడేమో వాసనొస్తా ఉంది. నాగలక్ష్మి పిన్నమ్మ వెనకపక్క దొడ్లో పసువులకు మ్యాత వేస్తా ఉండేది, దొడ్డి వాకిలి నుంచి నాకు కనిపిస్తా వుంది. నేను ఆ వాకిలి దగ్గరికి పోయి ఆ పిన్నమ్మతో చెప్పినాను. రుషింగప్ప చిన్నాయన ఇంటికొచ్చినాడని. ఆ పిన్నమ్మ ఇంట్లోకి రాకుండా, వారపాక పక్కనుండే రేకుల గేటు తీసుకొని ఇంటికి వెళ్లిపోయింది. నేను గాటిపాడు రూము తలుపేసి అంగడి రూములోకి వొచ్చి జేజి ఇప్పుడే రాదా? చిన్నాయనా అని అడిగినాను. ‘యేమి బువ్వ ఆకలైతా వుందేమి రా ఆకలయితా వుంటే రోన్ని గుగ్గిళ్లు తినప్పా! మీ జేజి యింగ రోంతసేపటి కొస్తాదిలే! వొచ్చినంక, నువ్వు రుషింగప్పోళ్ల తోటకాటికి పోయినట్ల మీ జేజితో అనొద్దురా!’ అంటా నాకు గుగ్గిళ్లు పెట్టేకి చూసినాడు. నేను వద్దన్న్యాను. గింజలన్నీ వొగ మూలలో రాశిలోకి పోసినాను.

సాయంత్రం కావొచ్చింది. పొద్దున్నే చేసిండే వడలూ, గుగ్గిళ్లూ అన్నీ అయిపోయినాయి. మిగతావి రోన్ని మిగిల్నాయి. సాయంత్రం మళ్లా పకోడాలూ, మిరపకాయ బజ్జీలూ చేసినాడు చిన్నాయన. ఇప్పుడు చేస్తే ఎట్ల అయిపోతాయని అనుకుండాను. దగ్గర్లో సారాయంగడి ఉందంట! అందుకే అవన్నీ చేసిండేటివి చేసినట్లల్లా అయిపోయినాయి. అదిచూసి నాకు ఆశ్చర్యమైంది. మా ఊర్లో ఇట్లాంటి తినే పదార్థాలు చేసి అమ్మేవాళ్లే లేరు. సారాయంగడి గుడకా మా ఊర్లో లేదు. బోయోళ్ల ఇద్దరు ముగ్గురు దేవరకొండ గొందిలో నాటు సారాయి తీసుకోనొచ్చి ఇండ్లల్లో అమ్ముతారని నేను విన్న్యాను. అట్లాది ఈ ఊర్లో సారాయంగడే పెట్టినారంట! తోటా దొడ్డి బాగుంటే కూలీ నాలీ చేసుకుండే పేదోళ్ల చేతుల్లో దుడ్లు తిరుగు మరుగులు అయితాయని, అందుకే ఈడ ఇట్లాటి అంగడి బాగా జరుగుతాదని చిన్నాయన చెబుతా ఉంటే నాకు అర్థమయింది.

రాత్రి అన్నం తిన్నెంక పండుకుండే ముందర చిన్నాయన మాట్లాడుతా ఈసారి గుత్తి దగ్గర జరిగే తొండపాడు తిర్నాలలో లడ్డంగడి పెడతానని అప్పుడు నాలుగైదు దినాలు నువ్వు రావల్లప్పా అని అడిగినాడు. నాయనా అమ్మయ్యలతో మాట్లాడతానన్నాడు. నేను సరే అన్న్యాను.

పండుకుండేకి ముందు ఎవురో ముగ్గురొచ్చి చిన్నాయనను పకోడాలు కావల్లని అడిగినారు. వాళ్ళు సారాయి తాగొచ్చినారు. చిన్నాయన వడలన్నీ అయిపోయి నాయన్న్యాడు. వాళ్లల్లో వొగడు లే, కుంటోడా, నేను పకోడాలు అడిగితే లేవంటావా? మల్ల, ఈనికెట్ల ఇచ్చినావోయ్? అంటా తూలుతా గొడవ చేసినాడు. చిన్నాయన వానికి సర్దిచెప్పినాడు. వాడు ఇంగా గట్టిగా అరచబట్టినాడు. నేను పరివెత్తిపోయి రుషింగప్ప చిన్నాయనకు చెప్పినాను. ఆ చిన్నాయన వెంటనే వొచ్చి ఆ తాగినోళ్లను మందలిచ్చి పంపిచ్చినాడు.

రాత్రి పండుకున్నెంక నాకు సరిగా నిద్ర పట్టలేదు. ఇట్లాచోట ఇంగా పెద్దగొడవ జరిగితే చిన్నాయనకు ఎవురు సపోర్టుంటారు? నాగలక్ష్మి పిన్నమ్మ సంగతి తెలిసి రుషింగప్పే చిన్నాయనపైన చేయి జేసుకుంటే దిక్కెవురు? రుషింగప్పోళ్లు అండగా వుంటారనే ధైర్యంతోనే చిన్నాయన ఇక్కడ అంగడి పెట్టుకుండాడేమో! అయినా అంత బాగుండే ఆయమ్మ మీద ఇంగా యెవురన్నా కన్నేస్తే అప్ప్పుడెట్ల?

ఆలోచన చేస్తావుంటే, నాకు కొంచెం భయమయింది. రెండు మూడు దినాలు నేను ఇక్కడుండే లోపలే, యేమయినా జరిగితే, నా చదువుకు అంతరాయమయితే యెంత కష్టం! రేపే వూరికెళ్లిపోయేది మేలు! అని అనుకుంటా పండుకుండాను.

***

పయిటాలన్నం తిని వూరికి బయల్దేరి సందకాటికల్లా మా ఇల్లు చేరుకుండాను. అనుకోకుండా నేను ఇంటికొచ్చినందుకు అమ్మయ్య సంతోషపడింది. చిన్నాయన పంపిచ్చిండే కర్జీకాయలూ, అట్లూ, వడలూ అమ్మయ్య చేతికిచ్చినాను. అమ్మయ్య పిల్లోల్లందరికీ పెట్టింది. పిల్లోళ్లు సంతోషపడతా తిన్న్యారు.

రెండు దినాలకే నాకు, వేరే దేశానికి పొయ్యొచ్చినట్ల అనిపిచ్చింది. మనసుకు నిమ్మలమయ్యింది. కడుపునిండా తినేకి వున్న్యా లేకున్న్యా సొంతూర్లో సొంతింట్లో వున్నెంత సంతృప్తి, ఇంగెక్కడా వుండదనిపిచ్చింది. ఇక్కడ ఆస్తిపాస్తులు గానీ, బతుకు దెరువు గానీ యాదీ ల్యాకపోయినా యాలనో సొంతూరంటే నాకింత మమకారం? రేప్పొద్దన, అదృష్టం బాగుండి, వేరే వూరికి చదువుకుండేకి పోవాల్సొస్తే అప్పుడెట్ల? ఈడే, ఈ బతుకుతోనే తృప్తిపడతావుంటే, పెద్దచదువులు చదువుకుండేదెట్ల? పైకి పొయ్యేదెట్ల? వుండూరు మీద ఇంత మర్లు, శెనక్కాయల కూలి కోసరం ఆ మాల్యవంతానికి పోయినప్పుడూ, మడకలు దున్నేకి ఆ బుక్కరాయసముద్రానికీ కణేకల్లుకూ పోయినప్పుడూ యెందుకు ల్యాక పోయిందో? కూలి చేతికొస్తాదని పనుల్లో మునిగి పోవడం వల్లనే కావొచ్చు! పనిలోనో, చదువులోనే మునిగిపోతే వుండూరు మీదా ఇంటిమీదా ఇంత నెర్లు వుండక పోవచ్చు! అనుకుంటా బజార్లోకిపోయి జతగాళ్లను కలుసుకొని రోంతసేపు గడిపి ఇంటికొచ్చినాను.

మా నాయన గోపాల కృష్ణుడంట!

రాత్రి అన్నం తిన్నెంక కుంపట్లో టెంకాయ పీచు అంటిచ్చి, బాగా అంటుకున్నెంక గాట్లో వుండే పచ్చి జమ్ముతుంటలు కుంపటి మిందేసినాను. పొగ బ్రమ్మాండంగా పైకి లేచింది. ముందు పసువుల కొట్టంలోనా, ఆనెంక ఇంట్లోనా, దోమలన్నీ బయటికి పొయ్యేటట్ల పొగబెట్టి, ఇంటి తలుపులు ముందుకేసి, లాటీను వొత్తి తగ్గిచ్చి, గుడ్డివెలుతుర్లో అందరమూ పండుకుండాం. ఇంట్లో నులివెచ్చగా వుంది. వెంకటలక్ష్మీ పెద్దన్నా చిన్నపాప జయమ్మా పండుకున్నెంక రోంత సేపటికే నిద్రబోయినారు. అమ్మయ్యా, నేనూ పెద్దక్కా చిన్నాయనోళ్ళను గురించి మట్లాడుకుంటావుండాం.

‘ఆడెవురో రుషింగప్ప వుండాడంటనే? వాల్ల పాతింట్లోనేనంట గిదప్పా యీల్లుండేది. ఆయప్ప పెండ్లాం అంగిడికి వొత్తావుంటాదా?’ అని అమ్మయ్య అడుగుతానే నేను ఆశ్చర్యపోయి, యేమి జవాబు చెప్పల్లనో అర్థ్ధంగాక మవునంగా వుండి పోయినాను. అమ్మయ్య మల్లా అడగడంతో జరిగిండే సంగతి బిడియపడతా చెప్పినాను.

‘ఈ మొగోల్లంతా అంతేలేప్పా! యేమి, మీ నాయన తక్కవోడనుకుండావా?’ అని నాయనను దెప్పిపొడిచింది అమ్మయ్య.

‘యేంది మా అట్లంటావు?’ అని నేను అబ్బురపోతా అడిగినాను.

‘ఊనప్పా! ఆ బోయిదుందే సుంకమ్మ, ఆ వొగలాడికీ మీ నాయినకూ పీకొత్తే పీక్కరాదు. పిల్లోల్లు పెద్దయినారన్న గ్నానం గుడకాలేదు ఈ మొగోనికి’ అంటా మూతి ముడిచింది అమ్మయ్య.

‘సుంకమ్మంటే, జయమ్మ పుట్టినప్పుడు కాన్పు జేసేకి వొచ్చిండెనే, ఆయమ్మేనా మా?’ అని ఆసక్తిగా అడిగితిని. ‘ఊ.. ఆ వొగలాడే?’ అంటా అమ్మయ్య ఇంగా మూతి ముడిచింది.

‘అట్లాయమ్మను కానుపుజేసేకి నువ్వెట్ల పిలిచినావు మా మల్ల?’ అని పెద్దక్క నగుతా అడిగింది.

‘ఇగో, నువ్వట్ల నగినావంటే నాకు పిత్తరం రేగుతాది? ఆ సుప్పనాతి దాన్ని నేనెందుకు పిలుత్తాను. మీ నాయినే అదేపనిగా దాన్నే పిలసకొచ్చినాడు. ఇంగ ఈ కొంపలో కానుపు జేసేకి ఇంగెవురుండారు? ఆ తుడుగుది, మీ నాయిన పిలుత్తానే పిర్రలు తట్టుకుంటా వొచ్చింది? యేరే గతిల్యాక నేనొప్పుకుంటిని. ఇంట్లో ఆడదిక్కు యెవురూ ల్యాక పాయిరి. అట్లాతబ్బుడు యెక్కడా ల్యానప్పుడు అక్కమొగుడే గతి అన్నెట్ల సరేనంటిని. పెండ్లాముకు కానుపు జేయిచ్చేకని ఈ మొగోనికీ, కానుపు చేసేకని ఆ రంకుదానికి యిద్దురికీ సందు బాగ దొరికె! బువ్వ దింటానే నువ్వట్ల యిస్కూలుకూ, యీల్లుద్దురూ గంపలు తీసుకోని ప్యాడకాల్ల కోసరం మడికట్లల్లేకీ పోతారు. మీ తమ్ముడేమో కందమ్మ పాపం, సన్నబిల్లను వూపుతా, ఆడిత్తా వుయ్యాల దెగ్గిర కుచ్చుంటాడు. అదే సందని, ఆ రంకుదీ మీ నాయినా కొట్టంలో దూరుకుంటారు. వొగనాడు కొట్టంలో యేందో అలికిడయితే సూసిరాపో అని పిల్లోన్ని పంపిత్తి! మీ నాయినా, ఆ తుడుగుదీ కొట్టం లోపలుండారంట! అది తెలిసి, రోంతసేపు బాదపడి, కడాకు యాడన్నా బోనీ లే అనుకుంటినప్పా! అది మీ నాయిన కత’ అని అమ్మయ్య రోంత కోపం తగ్గిచ్చుకొని చెప్పింది.

‘ఆ సుంకమ్మ పిన్నమ్మ కొట్టంలో బువ్వొండుతావుంటే, నాయిన వూరకనే పలకరిచ్చేకి పొయ్యింటాడు లే మా! నువ్వూరికే అనుమాన పడతావుండావు. వూర్లో నాయిన్ని అందురూ సీరామసెందురుడని అంటారు మా’ అని పెద్దక్క నాయన పక్క మాట్లాడింది. ‘అవున్లే, మీకు మీ నాయిన సీరామసెందురుడేలే అట్ల బోయి ఆ బోయోల్ల గేర్లో అడుగు, మీ నాయిన సీరామసెందురుడో గోపాలకిట్నుడో తెలుత్తాది!’ అని రుజువుజెప్పింది.

‘అయితే, నాయిన గోపాలకిట్నుడేనా మా?’ అని పెద్దక్క రోంత నవ్వింది. ‘సరే లే, తెలిసిందాని మాదిరి బొగు నగింటిని గాని’ అని అమ్మయ్య గుడకా నవ్వుతా, ఇంగ పండుకోండని చెప్పి మంచమెక్కి పండుకుంది.

నేను జంఖానం మింద పండుకొని కండ్లు మూసుకుందాను. ఆ సుంకమ్మ రూపం మనుసులో మెదిలింది.

ఆయమ్మ అమ్మయ్య కంటే రోంత చిన్నదేనేమో! అయినా అమ్మయ్య కంటే చాలా బాగుంటాది. ముక్కూ మొగమూ చక్కగా వుంటాయి. అమ్మయ్య అనుమాన పడినట్ల, నాయినకూ ఆ సుంకమ్మకూ చాట్నా మాట్నా నిజంగనే దోస్తీ వుందా? ఆ బోయగేరిలో నాయనను నిజంగానే గోపాలకృష్ణుడని అనుకుంటా వుండారా? ల్యాకుంటే, వరసయిన ఆడోళ్లు అట్లంటారేమో! వాళ్ళు అంటారో లేదో గాని నిజంగా నాయన చక్కని ముక్కూ మొగమూ నల్లరూపంతో శ్రీకృష్ణుని మాదిరే బాగా అందంగా వుంటాడు. నాకు, నాయన ముక్కు పడలేదెందుకో? అమ్మయ్య దబ్బిడి ముక్కే పడింది. ‘నీకు తల్లి పోలికొచ్చిందిరా, నువ్వు అదృష్టవంతునివి అయితావు!’ అని అందరూ అంటా వుంటారు! నిజంగా నేను అదృష్టవంతున్నయితానా?

అట్ల నన్ను నేను ప్రశ్నించుకుంటావుంటే మనసులో ఉమావతి మెదిలింది. మెదుల్తానే యేదో తెలీని ఆశ కలిగింది. వెంటనే నక్కెక్కడ నాగలోక మెక్కడ? ఆమె అంతస్తెక్కడ, బికారిగాన్ని నేనెక్కడ? నాలోపల యేదో నిలదీయసాగింది. నేను మవునంగా, యాల ఈ ఆలోచన్లు అని అనుకుండాను. అనుకుంటానే మొగం సప్పగయింది. యేదో తెలీని వికారంతోనే నిద్రలోకి జారుకుండాను.

నీలంపల్లికి పొయ్యొచ్చినంక మూడోదినం హైస్కూలుకు బయలుదేరినాను. అమ్మయ్య పప్పన్నం కారియర్ కట్టిచ్చింది. కట్టిస్తా, ‘బూగింజలు, ఉగాది దంకా గుడకా వొచ్చేతట్ల లేవప్పా! ఆనెంక యెట్ల జెయ్యల్లనోయేమో! కట్టకింద పల్లెల్లో యాడే గానీ కూలిపనులన్నా ల్యాకపాయ! పతి సెనీ ఆదివారాల్లో ఆ యెంగటాపురానికో, నడిమి దొడ్డికో, కొర్రపాడుకో మీరు ముగ్గురూ యెట్లన్నా గానీ కూలిపనికి పోకుంటే జరిగేది కట్టం నాయినా! ఆ రొండు మూడూర్లు దప్పా ఈ సగేల వానలు బడకుంటే బీదాబిక్కికి బతుకు దెరువే ల్యాకుండా పోతాది. మీ నాయిన ఆకుల గంపతో సంసారం గడిసేతట్ల లేదప్పా! ఆడపిల్లోల్లను పిల్సుకోని, దూరమో బారమో నేనన్నా పోదామనుకుంటే, ఈ పాల్దాగే పిల్లను నీ తమ్ముని మిందొదిలేసి పొయ్యేకి మనసు రాదు. నీ చెల్లెండ్లిద్దర్నీ దినామూ ఆ వూర్లకు పంపల్లంటే మనుసొప్పదు. ఎదిగిండే ఆడపిల్లోల్లు గదా నాయినా!’ అంటా అమ్మయ్య తన మనసులో వుండేదంతా చెప్పింది. అదంతా తలుచుకుంటా జతగాళ్ళతో కలిసి నడుస్తా వుండాను.

ఇంట్లో చేతికెదిగిన పిల్లోన్ని నేను. చదువుకుంటావుండాను. కాబట్టి అమ్మయ్య కుటుంబ సమస్యలన్నీ నాతో చెపుతాది. నాతో గాక ఇంకెవురితో చెప్ప్పుకుంటాది? అమ్మయ్య మనసులోని బాధను నేను గాక ఇంకెవురు అర్థం చేసుకుంటారు? ఆడపిల్లోల్లిద్దరూ నా కంటే చిన్నోళ్లు. చదువుసందెలు లేవు. అమ్మా, నాయనా కుటుంబాన్ని గురించి దిగులుపడే విషయాలన్నీ వాళ్లకు ఏమర్థమయితాయి? అర్థం చేసుకోవల్సిండే నేను, వేరే ఆలోచన్లు చెయ్యడం సిగ్గుచేటు గాదా?

అట్లనుకుంటానే శరీరమూ మనసూ రెండూ బిగుసుకుండాయి. నాయంతకు నేను మాటలు రానివానిగా మారిపోయి స్కూలుకు చేరుకుండాను. సాయంత్రం ఇంటర్వెల్ బెల్లు కొట్టేవరకూ పుస్తకాలమీదనే దృష్టిపెట్టి సరిగా ఎవురితోనూ మాట్లాడలేదు. ‘యేమి నారాయణా, ఉదయం నుంచీ మౌనంగా వుండావు? ఇంట్లో ఏదయినా జరిగిందా?’ అని ఉమావతి పలకరిచ్చేదంకా ఆమెను చూడలేదు. పలకరిస్తానే మనసు రోంత మెత్తబడింది. ‘అదేమీ లేదమ్మా ఉమావతీ!’ అని మెల్లగా అన్న్యాను. అంటూనే ‘ఉమావతి పలకరిచ్చకుంటే బాగుండేది! ప్రేమగా నోరు తెరిసి అడిగినంక మాట్లాడకుంటే బాగుండదు కదా!’ అని మనసులో అనుకుండాను. ఆ తర్వాత గుడకా ఇంతకు ముందు ఇష్టంగా మాట్లాడినట్ల మాట్లాడకుండా, కాలం తొందరగా పరుగెత్తితే, ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు రాసి యాదో వొగటి బతుకుదెరువు చూసుకోవచ్చుగదా అని ఆలోచించసాగినాను.

తొండపాడు తిర్నాలలో కుంటి చిన్నాయన లడ్డంగడి!

పదో తరగతి పూర్తీ పరీక్షలు దగ్గర్లో ఉండాయని వేరే ధ్యాస లేకుండా చదువుకుంటా వుండాను. అంతలోనే తొండపాడు తిర్నాలలో లడ్డంగడి వెయ్యల్లని షాపు కరారు చేసుకోవడమూ, గుత్తి నుంచీ మ్యాదరోళ్లను పిల్చుకొని పోయి గుంజలు పాతిచ్చి షాపు వేసుకోవడమూ, లడ్డూ కారాలు తయారుచేసుకోవడమూ అంతా పనులుంటాయని నాలుగు దినాలు ముందుగా పోదామన్న్యాడు చిన్నాయన. గుత్తి మ్యాదరోళ్లతో మాట్లాడడానికీ, తిర్నాలలో వాళ్లతో షాపు వేయిచ్చడానికీ నాయనను గుడకా రమ్మన్న్యాడు. జేజీ, చిన్నాయనా, నాయనా నేనూ అందరమూ బయలుదేరి అనంతపురంలో వంటజేసేవాళ్ల దగ్గర అంగట్లోకి కావలసిన పాత్ర సామాన్లన్నీ బాడుగకు తీసుకొని వంట సరుకులు, ఇంకా యేంటివేంటివో కొనుక్కొని ఒగ చిన్న వ్యానట్లాదాన్ని బాడుగకు మాట్లాడుకొని అందరమూ తొండపాడు చేరుకుండాం. గుత్తిలోకి పోకముందే వేరే రోడ్డు గుండా అక్కడికి పోయినాం. గుత్తి నుంచి ఆరేడు మైళ్ల లోపలే తొండపాడు, రోడ్డు పక్కనే దేవాలయం ఉంది. అది రంగనాథస్వామి దేవాలయం అంట! రోడ్డుకు ఎడమవైపున దక్షిణం మొగంగా గుడి గోపురం అద్భుతంగా వుంది. ఆ మాదిరిగా గోపురం ఉండే దేవాలయాన్ని నేను చూడడం అదే మొదటిసారి. ఆ రోడ్డు తాడిపత్రికి పోతాదంట! రోడ్డుకు రెండు వైపులా అప్పుడే కొంతమంది షాపులు వేస్తా వుండారు.

రోడ్డు పక్కనుండే ఒగ చెట్టు కింద సామాన్లన్నీ దించుకుండాం. షాపులేసుకుండే జాగాలను బాడుగకు ఇచ్చే వాళ్లను కలుసుకుండారు నాయనా, చిన్నాయనా. మెయిన్ రోడ్డు మొగంగా ఉండే స్థలాలన్నీ అప్పుడే అయిపోయినాయంట! నాలుగైదు దినాల కిందటే అంగళ్లేసుకుండేవాళ్లు అడ్వాన్సులు కట్టి నారంట! ఆ మెయిన్ రోడ్లో నుంచి పదీ, పదైదు వీధుల మాదిరి సున్నం పొడితో లైన్లువేసినారు. ఆ వీధుల్లో తూర్పు మొగం జాగాలకు వొగ రేటు బాడుగా, పడమర మొగం జాగాలకు ఇంకొగ రేటు బాడుగంట! ఆ వీధుల్లో గుడకా మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండే జాగాలకూ కడానుండే జాగాలకూ బాడుగ తేడానంట! ఆ వీధుల్లో లడ్డంగళ్లు వేసుకుండే వీధిలో మెయిన్ రోడ్డుకు దగ్గరగా తూర్పు మొగంగా వుండే షాపు జాగాను అడిగినాడు చిన్నాయన. అన్ని జాగాల దగ్గర నంబర్లేసిండే రాళ్ళను నిలబెట్టినారు. రెండో నంబర్ జాగా వరకూ అప్పుడే అయిపోయినాయని, మూడో నంబర్ జాగా ఇస్తామని బాడుగ యాభై రుపాయలని దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ చెప్పి, ఆలస్యమైతే అది గుడకా వుండదని అన్న్యాడు. ఆయప్ప చెప్పేదాన్నిబట్టి చూసి, చిన్నాయన మూడో నెంబర్ జాగానే ఖాయం చేసుకొని ఇరవైఐదు రుపాయలు అడ్వాన్సుగా కట్టి, రసీదు తీసుకుండాడు. ఆ రసీదును నా చేతికిచ్చి జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పి, యెందుకో వెనక్కి ఇప్పిచ్చుకొని తన దగ్గరే పెట్టుకుండాడు చిన్నాయన. సాయంత్రం లోపలే మేదరోళ్లతో షాపు వేయిచ్చుకుంటే, రాత్రికి పండుకుండేకి ఇబ్బంది వుండదని నాయనను గుత్తికి పోయిరమ్మని చెప్పినాడు. అట్లే ఇద్దర్ని వంట కూలోళ్లను రేపటికి మాట్లాడుకొని రమ్మన్న్యాడు. నాయన గుత్తికి బయల్దేరి పోయినాడు.

సందకాటికల్లా నాయనా గుత్తనంతపురం (గుత్తి అనంతపురం)లో వుండే చిన్నప్ప చిన్నాయనా మ్యాదరోళ్లు సామాన్లతోపాటు వొచ్చినారు. వొస్తానే ‘యేమి పిన్నమ్మా, బాగుండావా?.. కాదురా నారాయణా, నాకు వొగ పద్దినాలు ముందుగలగ చెప్పింటే, మెయిన్ రోడ్డుకే షాపు యేసుకుండే యేర్పాటు చేసుందునే! అయినా యాల పెట్టుకుండావురా యింత లంపట! నువ్వు చూస్తేనా, అదవోనివి! పిన్నమ్మకా వయసయ్యింది! ఈ తిర్నాల ఎంత రద్దీగా వుంటాదో తెలుసునేమప్పా నీకు? వీడా, సదువుకుండే పిల్లోడు! ఈ తిర్నాల్లో లడ్డంగడి పెట్టి, నీకు తూగిచ్చేకి అయితాదా?’ అని చిన్నప్ప చిన్నాయన రోంత నిరుత్సాహపరుస్తా మాట్లాడినాడు.

‘యేందన్నా అట్ల మాట్లాడతావు? లడ్డంగడి పెట్టినంక, రోంతొచ్చి సూడు, తూగిస్తానో లేదో నీకే తెలుస్తాది! కాటమయ్య తిర్నాలలో రెండుసార్లు లడ్డంగడి పెట్టి యెట్ల తూగిచ్చుకొని వొచ్చినానో, మీ అన్నయ్యను అడుగు, చెప్తాడు! అంత లేందే ఈడ లడ్డంగడి పెట్టల్లని అనుకుంటానా?’ అని ఏమాత్రమూ తగ్గకుండా మాట్లాడినాడు కుంటి చిన్నాయన.

మ్యాదరోల్లు సాయంత్రానికల్లా షాపును తయారుచేసి, వాళ్లు తెచ్చిండే సామాన్లకు బాడుగా కూలీ ఇప్పిచ్చుకొని వెళ్లిపోయినారు. వెనక పక్కల పదార్థాలన్నీ వండేకి రెండు పొయ్యిలను తయారు చేసినాడు నాయన. చిన్నప్ప చిన్నాయన పొయిలో కట్టెలు తెచ్చినాడు. రాత్రిపూట వెలుతురు కోసరం బాడుగకు వొగ పెట్రోమ్యాక్స్ లైటు మాట్లాడినాడు. ఆ చిన్నాయనను గమనిచ్చినంక మంచి ఉషారైనా మనిషే అనుకుండాను. అంతో యింతో చదువుకుండాడేమో, జోబీలో నాలుగైదు పేపర్లు పెన్ను పెట్టుకుండాడు. మాట్లాడేది గుడకా అంత మొరట భాష కాదు. మనిషి ఎర్రగా జేజి మాదిరి భలే అందంగా ఉండాడు. ఐదారేండ్ల కిందట పీర్లపండగ సమయంలో మా ఊరికొచ్చినప్పుడు చూసిండేదే, ఈ చిన్నాయనను! మల్లా చూల్లేదు. చిన్నప్ప చిన్నాయన కంటే ఇంకా ఇద్దరు చిన్నోళ్ళుండారు. వాళ్లను గుడకా చిన్నప్పుడు చూసిండేదే! మల్లా చూల్లేదు. అందరూ అప్పుడప్పుడు కలుసుకుంటా వుంటే ఎంత బాగుంటాది! అన్నదమ్ములందరూ వొగే యింట్లో గాకపోయినా, వొగే ఊర్లో ఉంటే ఎంత బాగుంటాది! ఎంత బలంగా ఉంటాది! చార్జీలు పెట్టుకుని బస్సుల్లో వొచ్చి, ఒగరి నొగరు కలుసుకుండేకి వీలుగాకుండా చేస్తా వుండేది పేదరికమేనా, ల్యాకుంటే అమ్మయ్య గయ్యాలితనమా? పెద్దోనిగా నాయన చేతగాని తనమా?

చిన్న చిన్న పనులు చేస్తా చిన్నప్ప చిన్నాయనతో మాట్లాడుతా అంతా ఆలోచన చేసినాను. నేను పెద్దయినంక అందర్నీ వొగేచోటికి చేర్చగలనా? అప్పటికి పరిస్థితులు యెట్లుంటాయో? ఎటూ ఇంత దూరమొచ్చినాను, గుత్తిలో, మన ఊరి వొనుమార మడి ఆసామి వుండాడు, వొచ్చే వానకారు పంటలప్పటికి ఆ మడిని గుత్తకిస్తాడేమో అడిగిపోతానని చిన్నాయనతో చెప్పి ఊరికి బయల్దేరిపోయినాడు నాయన.

***

రెండోదినం సందకాటికల్లా లడ్డంగట్లో పెట్టే పదార్థాలన్నీ తయారైనాయి. లడ్డు, మైసూర్‌పాకు, జిలేబి, బాదుషా, బూందీ, కార, గట్టిపకోడా ఇంకా యేంటివేంటివో తయారు చేయిచ్చినాడు చిన్నాయన. బెండ్లు బెత్తాసులు బొరుగులు, పప్పులు తెప్పిచ్చినాడు. వంట మనుషులూ, పని మనుషులూ, నేనూ, చిన్నప్ప చిన్నాయనా అందరమూ కలిసి చేసిండే పదార్థాలన్నీ డబరాగిన్నెల్లో పెద్ద పెద్ద సిలవరి తట్టల్లో అందంగా బేర్సి, పలకల మీద పెట్టినాం. ఆ లైన్‌లో మా లడ్డంగడి అందంగా కనిపిస్తా వుంది. షాపు ముందర కూర్చుండేకి చిన్నాయన వొగ చిన్న టేబులు వేయిచ్చుకుండాడు.

మాఘమాసం పున్నమి రోజు రంగనాథస్వామి రథాన్ని లాగి, రథోత్సవం చేస్తారంట! పున్నమి ఇంగా రెండు దినాలుండంగనే తిర్నాల మొదలయ్యింది. అంగళ్లన్నీ తయారయినాయి. గుడికి ఎదురుగా రోడ్డు మొగంగా పెద్ద పెద్ద లడ్డంగళT్ల వేసినారు. ఆ అంగళ్లను చూసి నేను ఆశ్చర్యపోయినాను. దాండ్లలో గుంతకల్ మస్తాన్ సాబ్ వాళ్లంగడి యెంత పెద్దదంటే, చెప్పేకి సాద్యం కాదు! తీపి పదార్థాలు గుంతకల్లులో ఇంటికాడే చేయిచ్చుకొని ఒగ లారీలో వేసుకోనొచ్చి లడ్డంగడి పెట్టినారు. దాని పక్కన మెయిన్ రోడ్డుకుండే ఇంగా రెండు లడ్డంగళ్లు గుడకా అదే మాదిరుండాయి. వొగొగ దాంట్లో ఐదారు మంది తూకాలేసిచ్చే వాళ్లుండారు.

మెయిన్ రోడ్డుకు రెండు వైపులా అంగళ్ళ వీధులు ఎంతద్భుతంగా వుండాయో! వొగ వీధిలో ఎదురెదురుగా ఫ్రెంట్ వరసలో అన్నీ గాజుల అంగళ్లు! వొగవీధిలో అన్నీ పటాల అంగళ్లు! పటాలలో హిందువుల దేవతల పటాలు, ఏసుక్రీస్తు పటాలు, ముస్లింల పటాలు! వొగవీధిలో అన్నీ కంచు ఇత్తడి సిలబరీ సామాన్లుండే అంగళ్లు! వొగవీధిలో అన్నీ ఇనప సామాన్ల అంగళ్లు! వొగ వీధిలో అన్నీ పూసలంగళ్ళు! వొగ వీధిలో ఉంగరాలూ లోలాకులూ రకరకాల దండలూ జుంకీలూ గొలుసులువుండే అంగళ్లు! వొగ వీధిలో రంగురంగుల కుంకుమ రాసుల అంగళ్లు! వొగ వీధిలో అన్నీ బెల్లం చెరుకుల అంగళ్లు! ఇవి లేవని అనేకి లేదు. మనుషుల అవసరాలకు కావలసిండే అన్ని రకాల వస్తువులూ పెట్టినారు.

పుట్టలు పగిలిన చీమల మాదిరి జనం మూగుతా వుండారు. దేశపెద్దుల్నీ కోడెల్నీ గిత్తల్నీ అలంకరించి బండ్లకు రంగు కాగితాలూ రకరకాల పూలహారాలూ కట్టుకొని తప్పెట్లతో కొన్ని, మేళ తాళాలతో కొన్ని, బ్యాండ్ సెట్లతో కొన్ని బండ్లు వొస్తా వుంటే వొచ్చినోళ్లు రోడ్డుకు దక్షిణం పక్కనుండే చేన్లలో దిగి వంటావార్పు చేసుకుంటా వుంటే చూస్తా ఆశ్చర్యపోసాగినాను నేను.

గుడి దగ్గర నుంచి తూర్పుకు రెండు మైళ్లు, పడమటికీ రెండు మైళ్ల వరకు ఇసకేస్తే రాలనంత జనం! చుట్టూ ఇరవై ముప్పై మైళ్ల దూరంలో ఉండే పల్లెల జనమంతా నాలుగైదు దినాలు జరిగే పెండ్లికి వొచ్చినట్ల అలంకరింకొని వొచ్చినారు. కొన్ని వేల బండ్లు! కొన్ని వేల మంది జనం! అందరి మొగాళ్లో అంతులేని సంబరం! అంతులేని ఆనందం! అంతులేని వుత్సాహం! దాదాపు అందరూ పల్లెటూరోల్లే!

నిజానికి జిల్లా అంతా కరువే! ఇంత కరువులో గుడకా దిగులు లేకుండా ఇంత వుత్సాహంతో ఎట్లొచ్చినారో నాకు అర్థమే కాలేదు. వాళ్ల స్తోమతకు తగినట్ల తిర్నాలలో వస్తువులు కొనుక్కుంటా ఉండారు. ఊర్లకు తిరిగిపోతా వుండేవాళ్లు, ఇండ్ల దగ్గరుండే వాళ్ళ కోసరం తినేటివి అన్నీ కొనుక్కుంటా ఉండారు. రథోత్సవం అయిపోయినంక అన్ని అంగళ్లలోనా వ్యాపారాలు ఎక్కువైనాయి. ముఖ్యంగా లడ్డంగళ్లలో!

తిర్నాళ్లు – దోరవయసు ఆరాటాలు!

నేను ప్రొద్దున బిందె తీసుకొని నీళ్ల కోసరం పోయేటప్పుడు, అచ్చం ఉమావతి మాదిరే వుండే వొగమ్మాయి, తానూ నీళ్ల కోసరం బిందె తీసుకొని పోతా, వొగ పందిరి చాట్న నిలబడి నవ్వుతా నన్ను పలకరిచ్చింది. నేనూ నిలబడి పలకరిచ్చినాను. మనిషి చూస్తే చదువుకుండే అమ్మాయి మాదిరి వుంది. నా పేరూ వివరాలూ అడిగింది. తన వివరాలన్నీ చెప్పింది. ప్యాపిలిలో పదోక్లాసు చదువుతా వుందంట! పది ఎకరాల మామిడి తోట వుందంట! వాళ్ళ అమ్మానాన్నలకు తానొగతే కూతురంట! పేరు సుంకులమ్మంట! వాళ్ళ ఊరు ఏనుగుమర్రికి దగ్గరలోనే, బాట్లో సుంకులమ్మ గుడి వుందంట! అందుకే తమ నాయనోళ్లు తనకు ఆ పేరు పెట్టినారంట! పేరు యాదైనా యెంతందంగా ఉందో సుంకులు! అని అనుకుండాను. ఆ పాపతో మాట్లాడుతా వుంటే ఆ పాప నా పక్క చూస్తా సిగ్గుపడతావుంటే నా శరీరంలో ఏదో ప్రాకినట్లయింది. నాకు తెలీకుండా ఒళ్లంతా కంపిచ్చసాగింది.

సుంకులు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో! నిమ్మపండు రంగు! చక్కని ముక్కు! వొంగిండే ధనుస్సు మాదిరి కనుబొమ్మలు! కండ్లల్లో ఏదో అద్భుతంగా ఉండే కాంతి! పళ్ళు ఎంత బాగుండాయో! బుల్లిగడ్డంకింద చిన్న మచ్చ ఎంత సుందరంగా ఉందో! గొంతు కింద రౌండ్‌గా గీతలు ఎంత సొగసుగా ఉండాయో! గొంతులో బంగారు గొలుసు! చెవుల్లో లోలాకులు డాన్సు చేస్తా ఉండాయి!

కుంకుమ రంగు పావడా కట్టుకొని దానిమీద గులాబి రంగు పయిట వేసుకుంది. మంచి జాకెట్టు వేసుకుంది. పైట లోపల ఉండే అందాలు ఉబ్బుకొని తిక్కరేపుతా ఉండాయి. భయపడతా అడిగినాను, ‘అనంతపురం చూసినావా?’ అని. ‘చూసి లేను’ అనింది. అదేం భాషో! ఆ ప్రాంతం పల్లెల్లో అట్లనే అంటారేమో అనుకుండాను. ఏ భాషయితేనేమి, అప్సరస మాదిరుందని అనుకుంటా, ‘ఎస్.ఎస్.ఎల్.సి. అయిపోగానే అనంతపురం కాలేజీలో చేరుతావా?’ అని ఆసక్తిగా అడిగినాను. ‘ఏమో, నాకెరికి ల్యా’ అని అదే మొరట మాటల్తో చెప్పింది.

‘యెవురో దేవకన్యలుంటారంట కదా అట్ల, యెంతందంగా వుండావో!’ అని ధైర్యం చేసి అన్న్యాను. సిగ్గుతో పొంగిపోయింది ఆ అమ్మాయి. ‘నేనొగసారి మీ ఊరు ఏనుగుమర్రికి వొస్తునా? మీ నాయన పేరేమి?’ అని అడిగినాను. ‘వొద్దు వొద్దు, మా నాయన పేరు గొల్ల సుంకప్ప’ అని చెప్పుతా ఉండంగానే దూరం నుంచి వాళ్ళ నాయన గావొచ్చు, పేరు పెట్టి గట్టిగా పిలిచినాడు. సుంకులు వెళ్లిపోతా నా వైపు రెండుసార్లు తిరిగి చూస్తా జనంలో కలిసిపోయింది. మెరుపుతీగ మాదిరి మాయమయ్యింది. లడ్డంగడి గుర్తు చెప్పినాను కదా, ఊరికి వెళ్ళిపోయేటప్పుడు లడ్డూ కారాలూ కొనుక్కుండేకి వాళ్ళ పెద్దోళ్లను పిల్చుకొని వొస్తే ఎంత బాగుంటాది! రావొచ్చునేమో!

ఆశపడతా నీళ్ల కోసరం ముందుకుపోయి నీళ్ల బిందె ఎత్తుకొని తిరిగొస్తా తిర్నాళ్లూ, జాతర్లూ కొత్త ప్రేమికుల్ని కలుపుతాయంట! యెవురో యెంత బాగా చెప్పినారో! అనుకుంటా మా షాప్ దగ్గరికొచ్చినాను. రావడం చాలా ఆలస్యమైందని కుంటి చిన్నాయన తిట్టినాడు. ‘ఏమి ఇంతసేపు పోతివిరా? ఆడ ఏమైనా గాడిదలు గాస్తా ఉంటివా? ల్యాకుంటే ఎవురిదన్నా నాకుతా ఉంటివా? బేవర్సి నా కొడకా!’ అని నోటికొచ్చినట్ల మాట్లాడినాడు.

‘వొక ఫ్రెండు కనిపిస్తే మాట్లాడుతా వుంటిని’ అని చిన్నాయనకు అపద్దం చెప్పినాను.

‘ఈ గుత్తిలో నీకు యా ఫ్రెండు ఉండాడోయ్? అన్నీ తప్పుడు కూతలు, కూస్తాండావు సువర్నాకొడకా?’ అని మళ్లా తిట్టినాడు చిన్నాయన. నాకు చాలా బాధయింది. ఏమీ మాట్లాడకుండా ముఖం మాడ్చుకొని మౌనంగా ఉండాను.

‘యాల తిడతావు రా, ఆ చదువుకునే పిల్లోన్ని? యెవురో స్నేహితుడు కనిపిస్తే మాట్లాడుతా వుంటినని చెపుతా ఉండాడు గదా!’ అని చిన్నప్ప చిన్నాయన మా కుంటి చిన్నాయనను గదురుకుండాడు.

‘ఇతగానికి ఇంత దూరంలో యా ఫ్రెండుంటాడు లవడాలో ఫ్రెండు? నీకేం తెలుసు లేన్నా? సదువుకుంటావుండానని ఇతగానికి ఈ మధ్యలో రోంత కొవ్వెక్కువైనట్లుంది! అంత దూరం నుంచి బత్తుక్కుండేకి వొచ్చినంక ఎట్లుండల్ల? నువ్వూ చూస్తివి గదా, ఇద్దరు ముగ్గురు బ్యారగాళ్లొచ్చి లేటయితాదని పక్క షాపుకెళ్లి పాయిరి!’ అంటా యేందేందో గొనగసాగినాడు.

‘ఇంగ నోర్మూసుకోప్పా సాలుగానీ! ఇద్దరు బ్యారగాల్లు యెళ్లిపోతానే కొంపలేం మునిగిపావులే!’ అంటా జేజి, చిన్నాయనను మందలిచ్చింది. దాంతో చిన్నాయన గొనగడం మానుకుండాడు.

‘యానాడే గానీ నాయన గుడకా ఇంతింత మాటలనలేదు’ అనుకుంటా రోంతసేపు బాధపడి అంగడి దగ్గర కూర్చుండాను. తిర్నాలకొచ్చి వూర్లకు వెళ్లిపోయేవాళ్లు లడ్డంగళ్ల దగ్గర చుట్టుకోబట్టినారు. వొచ్చినోళ్లందరికీ యావి అడిగితే అవి తక్కెట్లో తూకమేసిస్తా వుండాడు చిన్నాయన. నేనూ చిన్నప్ప చిన్నాయన కుంటి చిన్నాయనకు లడ్డూ మైసూర్ పాకూ యాది అడిగితే అది అందిస్తా వుండాం. కుంటి చిన్నాయనా తక్కెట్లో తూకమేసేటప్పుడు పదార్థాలు వేసి తక్కెడ సిబ్బి పక్క రోంత ఒత్తుతా మోసం చేస్తా ఉండాడనేది నాకు అర్థమయింది. వ్యాపార లక్షణం ఇంతేనేమో! అనుకుంటా చూడసాగినాను.

పయిటాల దంకా ముగ్గురికీ రెస్టు ల్యాకుండా వ్యాపారం జరిగింది. నిన్న మొన్నటికంటే ఈ పొద్దు వ్యాపారం బ్రమ్మాండంగా అయిందని ముగ్గురమూ అనుకుండాం. తెచ్చిండే సరుకూ ఇక్కడ చేసిండే సరుకూ సుమారుగా అయిపోయింది. జరుగుతా వుండే వ్యాపారాన్ని చూస్తా కుంటి చిన్నాయన సంతోషపడసాగినాడు. చేతులకు రోంత రెస్ట్ దొరికినప్పుడు చిన్నప్ప చిన్నాయన అడిగినాడు ‘కాదు రా నారాయణా, తూకాల్లో మరీ అట్ల జేస్తే యెట్ల రా? యెవురూ అడగలేదు కాబట్టి సరిపాయ! యెవురన్నా గట్టిగా అడిగితే యెట్ల? కేజీకి నువ్వు ముక్కాలు కేజీ అయినా తూంచుతావున్నెట్ల లేదనిపిస్తాది. మల్లా అంతద్దుమానంగా తూకాలేసిస్తే యెట్ల రా?’ అని మెల్లగా నవ్వుకుంటానే అడిగినాడు.

‘యాహా.. అట్లేమీ లేదులేన్నా! తూకంలో అంత వారా ఎట్లుంటాది? నలభై యాభై గ్రాములు తేడా ఉంటాదంతే! అంత నీతిగా ఉంటే బతికేకి అయితాదా? జల్సా చేసేకి తిర్నాలకొచ్చినోళ్లు అంత నిగాగా యెవురు జూస్తారప్పా, నీ తిక్కగాకపోతే!’ అని కుంటి చిన్నాయన నవ్వినాడు. ఆ మాటలు వింటా చిన్నాయన చాలా అసాధ్యుడే అనుకుంటా నాయన చెప్పిండే మాటలు గుర్తుకు తెచ్చుకుండాను.

వొగవైపు అంగట్లో చిన్నాయనకు అడిగేవన్నీ అందిస్తా ఇంకొగ వైపు సుంకులు లడ్డూ బూందీలూ కొనుక్కోవడానికి వాళ్ళ నాయనను పిల్చుకోనొస్తాదేమో అని ఆశగా చూస్తా వుండాను. నేను ఆశపడినట్లే సుంకులు వాళ్ళ నాయనను పిలుచుకోనొస్తా కనిపిచ్చింది. దగ్గర కొచ్చినంక వాళ్ల నాయన ‘ఇంత సన్న సాపులో యాలమ్మా? ఆ గుంతకల్లు సాపోల్లు నాకి న్యాత్తులు గిదా, వాల్ల సాపులో సంగెన్ని రకాలుండాయి రా’ అని సుంకుల్ని గుంతకల్లు మస్తాన్ సాబోళ్ల లడ్డంగడి దగ్గరికి పిలుచుకొని పోయినాడు. నా ఆశ నిరాశయింది. మల్లా సుంకులు కనిపిచ్చలేదు. నా మనసంతా ఆ పాపను చూడల్లని చాలా సేపు తనకలాడింది. షాపులో ఉండబుద్ధి కాలేదు.

తొండపాడుకు వచ్చేటప్పుడే చిన్నాయనతో చెప్పినాను, నేను నాలుగైదు దినాల కంటే ఎక్కువ ఉండలేనని, పరీక్షలు దగ్గరకొస్తా వుండాయి చదువుకోవల్లని, వచ్చే సోమవారానికి స్కూలుకు పోవల్లని! రేపే సోమవారమని గుర్తుకు రాగానే నేను డైరెక్టుగా కుంటి చిన్నాయనకు చెప్పకుండా చిన్నప్ప చిన్నాయనకు నా పరీక్షల విషయం చెప్పినాను. పెద్ద చిన్నాయన మెల్లగా కుంటి చిన్నాయనతో చెప్పినాడు.

‘ఇsగ రెండు దినాలుంటే అందరమూ వొగేసారి వెళ్లిపోవచ్చు గదప్పా! నువ్విప్పుడు పోతానంటే యెట్ల రా?’ అని మెత్తగానే కుంటి చిన్నాయన బతిమాలినట్ల అన్న్యాడు.

‘లేదు చిన్నాయనా, మా హెడ్మాష్టర్ సార్‌తో, సోమవారం నాడు తప్పకుండా స్కూలుకు వస్తాను సార్ అని చెప్పి వొచ్చినాను. పోకుంటే ఆయన తిడతాడు. ఇప్పటికే ఇంగ్లీషూ లెక్కల పాఠాలు రెండు అయిపోయింటాయి చిన్నాయనా! అయిపోయిండే పాఠాలు అర్థం చేసుకోవల్లంటే చాలా కష్టం! పరీక్షలు దగ్గరికొచ్చినాయి. ఆ పరీక్షల్లో మార్కులు తక్కువ తెచ్చుకుంటే వచ్చే సంవత్సరం ఫీజు కట్టనని హెడ్మాష్టర్ సార్ కోపంగా చెప్పినాడు’ అంటా కన్నీళ్లు కార్చినాను. నా పరిస్థితి అర్థం చేసుకొని, చిన్నప్ప చిన్నాయన కుంటి చిన్నాయనకు నచ్చజెప్పినాడు. దాంతో ‘సరేనప్పా బయల్దేరు. మా కష్టమేదో మేము పడతాములే’ అని నిష్ఠూరంగా మాట్లాడి నా చేతికి వొగ పది రుపాయలిచ్చి, లడ్డూ మైసూర్ పాకూ కారాలూ బూందీలూ అవిన్ని అవిన్ని కట్టిచ్చినాడు చిన్నాయన. నేను అందరితోనా చెప్పి వూరికి బయలుదేరినాను.

రద్దీగా ఉండే జనంలో సుంకులు కోసరం, కండ్లు డేగ కండ్ల మాదిరి చుట్టూరా చూడసాగినాయి. సుంకులు ఎక్కడా కనిపిచ్చలేదు! ఒగర్ధగంటసేపు చేండ్లలో కనిపిస్తా వుండే బండ్ల దగ్గరికంతా పోయిచూసినాను. సుంకులూ నేనూ మాట్లాడుకోనుండే చోటికి పోయినాను. ఆడుండిన బండి వెళ్ళిపోయింది. ‘సుంకులు ఇంగ కనిపిచ్చకపోవచ్చు! వాళ్ల బండీ వెళ్ళిపోయినట్లుంది’ అని అనుకొని, ఆశను వొదులుకుండాను. ఎక్కువ ఆలస్యం అయితే గుత్తి నుంచి అనంతపురం పోయే బస్సులుంటాయో లేదో అని గుత్తి రోడ్డు పట్టుకుని స్పీడుగా నడక మొదలు పెట్టినాను.

తిర్నాల నుంచి వెనక్కు తిరిగిపోయ్యే వాళ్లు ఎద్దుల బండ్ల మీద కొందరూ, లారీలలో కొందరూ జట్కాలలో కొంతమందీ, సైకిళ్ల మీద కొంతమందీ, నడుస్తా కొంతమందీ గుత్తివైపు పోతా వుండారు. నేను రోడ్డు వెంట నడుస్తా ఎద్దుల బండి యెక్కి పోవల్లనే ఆశతో నిలిచి, చేయిచాపుతా చాలా తాపత్రయపడినాను. యాబండ్లోనా కూర్చోవడానికి ఖాలీ కనిపిచ్చలేదు. దాంతో ఆశ వొదులుకొని నడక స్పీడు పెంచినాను. యెక్కడెక్కడన్నుంచి వొచ్చినారో యేమో పల్లెలోళ్లు, రోడ్డు వెంట గుంపులు గుంపులుగా పోతావుండారు. తెలిసిన వాళ్లెవురన్నా కనిపిస్తారేమోనని గమనిచ్చుకుంటా నడుస్తా వుండాను. చూసిండే మొగాలు యావీ లేవు. అయినా శింగనమల ప్రాంతం నుంచీ ఇంతదూరం యెవురోస్తారనుకుంటా ముందుకు పోతా వుండాను. మధ్యలో ఎంగిలిబండ తర్వాత వెంకటాంపల్లి వొచ్చింది. ఆ వూరు దాటుతానే యెదురుగా గుత్తికొండ. కొండమీద కోట కనిపిస్తానే మనసులోని ధ్యాస చరిత్ర పక్కకు మళ్లింది. సూర్యుడు గుత్తికొండ అవతలికి పోతా వుండాడు. గుత్తికోట అద్భుతంగా కనిపిస్తావుంది. ఆ కోటను చూస్తానే అయ్యవార్లు చెప్పిండేû శ్రీకృష్ణదేవరాయలూ విజయనగర సామ్రాజ్యమూ గుర్తుకొచ్చినాయి. గుత్తి దుర్గానికి రాజు నరసనాయకుడు గ్నాపకమొచ్చినాడు.

తళ్లికోట యుద్ధంలో బహుమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేసినారంట! అప్పుడు ఆ సుల్తాన్లు గుత్తి దుర్గం జోలికి రాలేదేమో, కోట గోడ దెబ్బతిన్నెట్లు లేదు. ఆ కాలంలో రాజులెందుకో, ప్రతొక్కడూ మైదానాల్లో గాకుండా, కొండ గుట్టల్లో కోటలు కట్టుకోని రాజ్యాలేలినారు? కొండల్లో అంతపైన ఇంతింత పెద్ద కోటలు ఎట్ల కట్టుకుండారో! కింద నేలమీద, వొగ చిన్న మట్టిమిద్దె సరిగా కట్టుకుండేకి మా ముత్తాతల ట్లాంటి పేదోళ్లకు చేతకాలేదే! అట్లాది, పైన కొండల మీద అంత అద్భుతంగా కోటలు కట్టిచ్చుకోని కోటలోపల అంత పెద్దపెద్ద రాజమహల్లు ఎట్ల కట్టిచ్చుకుండారో! పెద్దపెద్ద సోగరాళ్లతో కోటల్నీ భవంతుల్నీ కట్టిండేదంతా పేదోళ్లే కదా! వాళ్లు ఎంత కష్టపడినారో దీండ్లను కట్టడానికి? ఇట్లా కోటలు కట్టడానికి యెంతకాలం పట్టిందో! అంత పెద్ద రాళ్లు ఎత్తేటప్పుడు ఎంతమంది చనిపోయింటారో!

ఆలోచిస్తా కోటగోడను చూస్తా నడుస్తా ఉండాను. దక్షిణం వైపుండే కోట గోడంతా కనిపిచ్చింది. తూర్పు వైపు సగభాగం నుంచీ పడమర వైపు సగభాగం వరకూ కొండ చుట్టూ నడిచినట్లుంది. గుత్తిలోకి చేరుకొని పక్కనుండే బస్టాండ్ దగ్గరికి పోయి అనంతపురం బస్సు ఎప్పుడుందో కనుక్కుండాను. సాయంత్రం ఆరున్నరకు అని తెలిసింది. పక్కనుండే వాళ్లను టైం అడిగి, ఇంగా గంటసేపుండల్లనే అనుకొని లారీలు యావైనా వస్తాయేమో అని రోడ్డు పక్కన నిల్చుకుండాను. రెండు మూడు లారీలొచ్చినాయి యాదీ నిలబడలేదు. నీళ్లు తాగల్లనిపిచ్చింది. బస్టాండుకు అవతలవైపుండే శాకనా హోటల్ దగ్గరికి పోయి తాగేకి మంచినీళ్లడిగినాను. శాకనా తీసుకుంటేనే నీళ్లు, ల్యాకుంటే ఇచ్చెల్లేదన్నారు. శాకనా ఎంత అని అడిగినాను. అర్ధ రుపాయన్న్యారు. వోయమ్మా అర్ధ రుపాయితో బస్సులో గార్లదిన్నెకు పోవచ్చుననుకుంటా బయటకొచ్చినాను. పల్లెలోళ్లు నీళ్ల కోసరమే హోటల్లోకి పోయినారు. నేను మల్లా ఇవతలకొచ్చి రోడ్డుపక్క మోరీ మీద కూర్చుండాను.

బస్టాండ్ ఎంత చిన్నగుందో! దూరదూరంగా నాలుగు యాంగ్లర్ల మీద రేకులేసి బిగిచ్చినారు. రేకుల కింద రెండు పోళ్ల మధ్యలో కర్నూలు బస్సు నిలుచుకుంది. ఇంగ రెండు బస్సులే బస్టాండులో పట్టేది. నేను ఐదో క్లాసులో వున్నెప్పుడు చూసిన బస్టాండు ఎట్లుందో అట్లే ఉంది బస్టాండు ఏమీ మారలేదు. శాకనా హోటల్ గుడకా అదే! హోటలాయప్ప తాగేనీళ్లడిగితే శాకనా తీసుకుంటేనే నీళ్లిచ్చేదని ఐదారేండ్ల కిందట అనిండే మాటలు గుర్తుకొచ్చినాయి. గుత్తి టౌను! ఇట్లాంటి టౌన్లో నీళ్ల సమస్య! అప్పట్నుంచీ మంచినీళ్ల సమస్య అట్లే వుందేమో! దగ్గర్లోనే గుత్తి చెరువు వుందని నాయన చెబుతా వుంటాడు. గుత్తి చెరువు మరవ పారితే ఆ మరవొంక గుత్తి అనంతపురం పక్కనుంచే కిందికిపోయి పెన్నానదిలో కలుస్తాదంట! చెరువు పెద్దదేనంట! అట్లాంటి చెరువు పక్కనుండే గుత్తిలో మంచినీళ్లు దొరకడం కష్టమంటే ఏమనుకోవల్ల?

ఆలోచిస్తా అనంతపురం బస్సు కోసరం ఎదురుచూస్తూ ఉంటే జట్కాబండ్లు వొస్తా పోతావుండాయి. రోడ్లో వుండే మనుషుల్ని పక్కకు పోండని బస్సులూ జీపులూ, లారీలూ హార్న్ ఇస్తాయి. కానీ జట్కామనిషి హార్న్‌కు బదులు, చెలకోల కట్టెను తిరుగుతావుండే జట్కాబండి చక్రానికుండే ఆకుల్ని తాకిస్తా వుంటే టంట, టంట, టంట అని అద్భుతంగా సౌండొస్తా వుంది. అది జట్కా సౌండని ఎవురికయినా తెలుస్తాది. అట్లే గుర్రం గునక పరుగుతో పోతా వుంటే, దాని కాళ్ల గిట్టలకుండే లాలాల శబ్దం టక్, టక్, టక్, టక్, టక్, అని అంటావుంటే వినడానికి ఎంత బాగుందో అనిపిచ్చింది! ఆ మాదిరిగా జట్కా సౌండ్ విని మురిసిపోతా పాపిలి పక్క పోయే ఎద్దుల బండ్లలో సుంకులు కనిపిస్తాదేమోనని ఆశగా గమనిస్తా వుండాను. అంతలోనే అనంతపురం బస్సొచ్చింది. తిర్నాలకొచ్చిండే పల్లెలోళ్లు బస్సెక్కడానికి చుట్టుకుండారు. కష్టపడి బస్సెక్కినాను. సీటు దొరకలేదు. ఎక్కిన అర్ధగంటసేపటికి బస్సు కదిలింది. పామిడి దంకా బస్సు రద్దీగానే ఉంది. పామిడిలో సీటు దొరికింది. సీటు దొరుకుతానే కూర్చొని ఊపిరి పీల్చుకుండాను. సుంకులు మల్లా మనసులో మెదిలింది. ఇంగ జీవితంలో సుంకులు కనిపిస్తాదా? యేమో! యెవురు చెప్పగలరు? ప్రతొక్కరికీ జీవితంలో ఇట్ల యెవురో వొగరు తారసపడతారేమో! తారసపడేవాళ్లందరూ దగ్గరయితారా? ఆలోచిస్తా గార్లదిన్నె దగ్గర శింగనమల క్రాసులో బస్సు దిగినాను. అప్పుడు టైం రాత్రి తొమ్మిది గంటలని తెలిసింది.

గార్లదిన్నె నుంచీ శింగనమలకు ఎనిమిది మైళ్లని నాయన అప్పుడప్పుడు చెప్పేవాడు. అక్కన్నుంచి శింగనమలకు బస్సులేవీ లేవు. పగలుపూట గుడకా రెండే రెండు బస్సులు! యావైనా లారీలొచ్చేకి అదేమీ మెయిన్ రోడ్డు కాదు!

పల్లెలకు పోయే కాడు రోడ్డు! నడక తప్పదనుకొని ఆ కాడు రోడ్డు దావ పట్టినాను. వెన్నెల కాబట్టి రోడ్డు బాగానే కనిపిస్తా వుంది. అయితే ఎక్కడా నర మానవుడు కనిపిచ్చలేదు. వర్షాలు రాక పొలాలన్నీ బీళ్లే! నడుస్తా వుంటే మనసులో బిక్కుబిక్కు మనసాగింది. జోబీలో పదిరుపాయల దుడ్లుండాయి. ఎవురయినా దొంగలొచ్చి, నాలుగేట్లు పీకి దుడ్లన్నీ గుంజుకొని పోతే యెట్లా అని ఆలోచన చేస్తానే భయమయింది.

తిర్నాలకు పోయినప్పుడు మంచి గుడ్డలు ల్యాకుంటే యెట్లని మొన్నమొన్న చిన్నాయన నాకు వొగ అంగీ, లాంగ్ క్లాత్ పైజామా కుట్టిచ్చినాడు. తిర్నాలలో ఆ డ్రెస్సే వేసుకుండాను. అదే డ్రెస్‌తో శింగనమలకు పోతా వుండాను. అట్ల పైజామా తొడుక్కోని పోతావుండే నన్ను ఈ రాత్రప్పుడు ఎవురైనా దొంగలు చూస్తే, ఎవుడో టౌనోడు వస్తా వుండాడు, వీని దగ్గర తప్పకుండా దుడ్లుంటాయని అనుకుంటే ప్రమాదమని వెంటనే పైజామా తీసేసి తలకాయికి రుమాల మాదిరి చుట్టుకుని దుడ్లను పట్టాపట్టీల డ్రాయర్ లోపలిజోబీలో పెట్టుకొని, తొందరగా జనాలుండే పల్లె దగ్గరికి చేరుకోవల్లని స్పీడుగా నడుస్తా వుండాను.

సుమార్గా రెండు మైళ్లు నడిచినంక వొగ ఎగుమిట్ట వొచ్చింది. నేను తగ్గులోనుంచీ రోడ్డెంట మిట్ట ఎక్కుతా వుండాను. రోడ్డుకు రెండు పక్కలా వుండే కంపచెట్లలో నుంచీ కీచురాళ్లు అరుస్తా వుండాయి. ఇంకా యేంటివేంటివో శబ్దాలు వినిపిస్తా వుండాయి. దూరంగా చిన్న కొండ కనిపిచ్చింది. అది ‘దండుగొండ’ అని గుర్తుకు రాగానే భయ మెక్కువయింది. అంతలోనే దూరంగా ‘గల్‌గల్ గల్‌గల్’ అంటా గజ్జల శబ్దం వినిపిచ్చింది. ఆ శబ్దం దగ్గరయ్యే కొద్దీ భయంతో వొళ్లంతా చెమటపట్టింది. నోట్లో తడి ఆరిపోసాగింది. గుండెలు అదరసాగినాయి. భయపడతా, యేమన్నాగానీలే, భయపడితే అయితాదా? అని నాకు నేను ధైర్యం చెప్పుకుంటా నడుస్తా వుండాను. గజ్జల శబ్దం మరింత దగ్గరయింది. వెన్నెల్లో యాదో ఆకారం కనిపిచ్చింది. దయ్యమేమో అని గట్టిగా అరచల్లనుకుండాను. నోరు పెగల్లేదు. అంతలోనే ఆ ఆకారం పూర్తీ దగ్గరికొచ్చి, ‘యా వూరు నాయినా? యియ్యాలబ్బుడు వొగనివే పోతా వుండావు?’ అని పలకరిచ్చింది. ఆ ఆడమనిషి మాటలు విని ధైర్యం వొచ్చింది. ఆ యమ్మ తాండావాళ్లాయమ్మ అని గుర్తుబట్టినాను. వెంటనే పాపినేపాల్యం తాండా గ్నాపకం వొచ్చింది. నేను, నాయనెంట ఆకుల గంపెత్తుకొని వొగసారి ఈ తాండా మీద కనుంపల్లికి పోయిండే సంగతి గుర్తుకొచ్చింది. అన్నీ గుర్తుకొస్తానే ధైర్యమొచ్చింది. గుండె తేలిక పడింది. ఆ యమ్మను మాట్లాడిచ్చి ముందుకు నడిచినాను. కొంచెం ముందుకు పోతానే వెస్ట్ నరసాపురమొచ్చింది. రోడ్డు పక్కన వుండే ఇండ్లలో ఇంకా జనం మాట్లాడుకుంటా వుండారు.

నడక స్పీడు పెంచినాను. చిన్న జలాలపురం దాటినంక మా ఊరి చెరువు ఉత్తరం మోటుకు చేరుకొని ఊపిరిపీల్చుకొని, తలకాయికి చుట్టుకోనుండే పైజామా విప్పబీకి తొడుక్కొని బిరబిరపోయి హెడ్మాష్టరు సారోళ్ల ఇల్లు చేరుకొని మెల్లగా తలుపు తట్టి ‘అక్కా’ అని పిలిచినాను. అప్పుడప్పుడే పండుకుంటా వుండారేమో జయమ్మక్క లేచి నా గొంతు గుర్తుపట్టి ‘ఎవురు నారాయణా’ అని అడిగింది. అవునక్కా అని బదులిచ్చినాను. అక్క తలుపు తీసి ‘ఏమి నారాయణా ఇవ్వాళప్పుడు?’ అని అడిగింది. నేను టూకీగా చెప్పినాను. అక్కయ్యకు విషయం అర్థమయిందేమో కాళ్లూ, చేతులూ కడుక్కోమని చెప్పి మిగిలిండే అన్నమూ, పప్పూ పెట్టింది. నేను ప్రసాదం మాదిరిగా భావించి తిని, పండుకుండాను.

మా సారూ, తిప్పమ్మా ఎం.ఎస్!

నేను ఈమధ్య కాలంలో వారానికి మూడు దినాలు మా హెడ్మాష్టర్ సారోళ్ల ఇంట్లోనే ఉండి చదువుకుంటా ఉండాను. మా సీనియర్ తిప్పన్న గుడకా ఎక్కువగా సారోళ్ల ఇంట్లోనే ఉంటా వుండాడు. తిప్పన్న ఇప్పుడు మా స్కూల్ పీపుల్స్ లీడర్. మిరియాల వెంకటనారాయణ, యెందుకో స్కూల్ వొదిలి పెట్టినాడు. ఆయప్ప స్కూలొదిలి పెడతానే తిప్పన్న లీడరయినాడు. లీడరే గానీ చాలా మెతకోడు. తిప్పన్నది సొంతూరు శింగనమలే! నాయంత పేదోడు కాదు. బంధువులంతా దండిగా ఉండారు శింగనమలలో. సార్ కుటుంబానికి నమ్మినబంటు మాదిరి వుంటాడు. అందుకే తిప్పన్నను అందరూ ఆంజనేయుడని అడ్డపేరు పెట్టినారు. నిజంగా తిప్పన్న, మా సారోళ్ళకు సీతారాముల దగ్గర ఆంజనేయుడు ఉన్నెట్లే ఉంటాడు. అందుకే, మా హెడ్మాష్టర్ సార్ ఎక్కడికి పోయినా, వెంట తిప్పన్న వుండాల్సిందే! ఇప్పుడు తిప్పన్నకు నేను తోడై ఇద్దరమూ సారోళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటా వుంటాము.

మా హెడ్మాష్టర్ సారంటే శింగనమలలో సరిపోనోళ్లు గుడకా ముగ్గురు నలుగురుండారు. అందులో అషండా మసూదూ, ఉమావతి వాళ్ల నాయన చెన్నవరం నారాయణరెడ్డి ముఖ్యమయినోళ్లు. అషండా మసూద్ స్కూల్ కమిటీ మెంబర్. శింగనమల దర్గా కమిటీలో గుడకా అతడు ముఖ్యమైన వ్యక్తి. శింగనమల పంచాయతీ ఎన్నికల్లోనో పాత హై స్కూలుకు జాయింట్‌గా రూములు కట్టిచ్చేదానికి కాంట్రాక్టు విషయంలోనో కొంత గొడవ జరిగిందంట! మా సారు ఎప్పుడూ బాపనోళ్ల ఘట్టప్పా సత్యమూర్తి స్వాములకు క్లోజుగా వుంటాడు. అషండా మసూద్‌కు, ఆ బాపనోళ్లకూ పంచాయతీ ఎన్నికల కారణంగా, బిల్డింగ్ కాంట్రాక్టు మూలంగా విభేదాలుండాయంట! అందువల్ల గుడకా అషండా మసూదుకూ ఆయన స్నేహితునిగా వుండే చెన్నవరం నారాయణరెడ్డికీ మా సార్‌కూ పడేదికాదు. వొగసారి వాళ్ళిద్దరినీ మా సారు చాలా తీవ్రంగా మాట్లాడిండేది నేను విన్న్యాను.

మా హెడ్మాష్టర్ చిత్తరంజన్ దాస్ సార్ నాలుగైదేండ్ల్ల నుంచీ శింగనమల హైస్కూల్లో హెడ్మాష్టర్‌గా పనిచేస్తా, పేద విద్యార్థులకు సహాయపడతా, హైస్కూల్ అభివృద్ధి కోసరం కష్టపడతా వుండడంతో ఆయనకు చుట్టుపక్కలుండే పల్లెల్లో మంచి పేరొచ్చింది. తరిమెల నాగిరెడ్డికి చాలా దగ్గరగా వుండే సోదనపల్లి సి.నారాయణరెడ్డీ, గార్లదిన్నె దగ్గరుండే కలగాసపల్లి రామన్నా, మట్లగొంది నారాయణరెడ్డీ, కొర్రపాడు రామిరెడ్డీ, ఈస్ట్ నర్సాపురం మల్లయ్య గారి ఓబిలేసూ వాళ్లందరూ మా సార్‌కు మంచి న్యాస్తులు. సమితి ఆఫీసుకు ఎవురు బి.డి.వో.గా వొచ్చినా, అగ్రికల్చర్ ఆఫీసరొచ్చినా, జిల్లా నుంచి యే ఆఫీసరొచ్చినా వాళ్లకు మా సారోళ్ల ఇంట్లోనే ఆతిథ్యం! ఆ రోజు వొగటో రెండో కోళ్లు కొయ్యాల్సిందే! జయమ్మక్కకు సహాయంగా స్కూల్ ఫీవన్లూ, నేనూ, తిప్పన్నా వుండాల్సిందే! ఆ పొద్దు నాకు పండగే! ఖర్చు పెట్టే దాంట్లో సార్‌ది ధారాళమైన చేయి అనుకుంటే, అద్భుతమైన వంటలు చేసి, వొచ్చిన వాళ్లకు తృప్తిగా పెట్టే దాంట్లో జయమ్మక్కది చాలా పెద్ద చెయ్యి. నేను సారోళ్ల ఇంట్లో వుండడం వల్ల ఇదంతా నా కండ్లరా చూసి ఆశ్చర్యపోతా వుంటాను.

పోయిన సంవత్సరం వరకు సమితి ఆఫీసులో ఎం.ఎస్. గా పని చేసిండే తిప్పమ్మ అనే ఆఫీసర్ మధ్యాహ్నం వొగటిన్నర గంటలకు సారోళ్ల ఇంటికి జీపులో వొచ్చింది. జీపులో నుంచి పీవన్ వొగ పెద్ద బాక్స్ తెచ్చి ఇంట్లో పెట్టినాడు. అవన్నీ యెందుకన్నెట్లు సార్ ఇంగ్లీషులో అడిగినాడు. చిన్నపిల్లలకు స్మాల్ గిఫ్ట్స్ అని చెప్పింది ఆయమ్మ. ఇంట్లోకొస్తానే సార్ కొడుకుల్ని దగ్గరికి పిల్చుకొని ముద్దు ముద్దుగా లాలిచ్చింది. ఆయమ్మ వొస్తాదని కోడి కూరా, పలావూ, అలసంద వడలూ, మటన్ ఖైమా చేసింది జయమ్మక్క. మా సారూ ఆయమ్మా కొంచెం సేపు మాట్లాడుకున్నెంక భోజనానికి కూర్చుండారు. నేనూ, తిప్పన్నా వడ్డిస్తా వుండాం. నేను సారోళ్ల ఇంట్లోకి చేరిన మొదట్లో ఎవురైనా కొత్తోళ్లు వొచ్చినప్పుడు నాకు స్పూన్లతో వొడ్డిచ్చేది తెలిసేది కాదు. ఇప్పుడు బాగా అలవాటయింది. నేను కొంచెం కొంచెం వొడ్డిస్తా వుంటే సార్ నా చేతిలో ఉండే గిన్నెను లాక్కొని పట్టకార్‌తో సారే యింగా నాలుగు వడల్ని ఆయమ్మ ప్లేట్లో వేసినాడు. ఆయమ్మ ఇంగ్లీష్‌లో స్టెయిల్‌గా యేందో అనింది. మా సార్ అంతకంటే అందంగా ఇంగ్లీషులో మాట్లాడినాడు. ఆయమ్మ సిగ్గుతో సొట్టలు సొట్టలు పోయింది. తినడానికి సిగ్గుపడతా వుంటే ‘ఏమి ఈ పొద్దు కొత్తగా మా యింటికొచ్చినట్ల సిగ్గుపడతా వుండావే?’ అని జయమ్మక్క ఆయమ్మ సిగ్గును పోగొట్టింది.

భోజనాలయినంక పది నిమిషాలు రెస్టు తీసుకొని జీపు అనంతపురానికి బయలుదేరింది. లోపలికి పోయి జయమ్మక్కతో మాట్లాడి సార్ కూడా జీపెక్కి ఆయమ్మ పక్కనే కూర్చొని అనంతపురానికి వెళ్లిపోయినాడు. వాళ్లు వెళ్లిపోయినంక నాకూ, తిప్పన్నకూ పలావన్నం పెట్టి, కోడికూర వేసి, తలావొగ ఖైమా వుంట పెట్టింది. నేను ఖైమా పేరు వినిండేది అదే మొదటిసారి. ఖైమా వుంట తింటా వుంటే నా కండ్లల్లో ఆనందభాష్పాలు పెల్లుబికినాయి. పలావన్నమూ, కోడికూరా ఎంతద్భుతంగా వుందో! తింటా వుంటే కోడికూరను ప్రపంచంలో ఇట్ల యెవురూ చెయ్యలేరేమో అనుకుండాను.

అన్నం తిన్నెంక నేనూ, తిప్పన్నా గిన్నెలన్నీ ఎత్తిపెట్టి జయమ్మక్క దగ్గరికి హాల్లోకొచ్చి కూర్చుండాం. తిప్పమ్మను గురించి చాలా సేపు మాట్లాడింది అక్కయ్య. మధ్యలో ఎం.ఎస్. అంటే ఏమిటో ఇద్దరమూ అడిగినాం. ఎం.ఎస్. అంటే ముఖ్య సేవక్ సమితి ఆఫీస్‌లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (బి.డి.ఓ) తర్వాత పెద్ద ఆఫీసరని, ప్రమోషన్ మీద తిప్పమ్మ ఇప్పుడు జిల్లా ఆఫీసరయిందని చాలాకాలం నుంచి ఆమె మీ సార్‌కు మంచి ఫ్రెండ్‌రా అని నవ్వుతా చెప్పింది. చెబుతా, ‘మీ సార్ గోపాలకృష్ణుడప్పా’ అనింది. ఆ మాటంటానే నాకు మా నాయనను గురించి మా అమ్మయ్య అనిండే మాటలు గుర్తుకొచ్చినాయి. ‘మా సార్ అట్లావాడు కాదులే అమ్మయ్యా’ అని తిప్పన్న, మా హెడ్మాష్టర్ సారును వెనకేసుకొచ్చినాడు. ‘మీ సారు నోట్లేకి వేలు పెడితే కొరకలేనంత అమాయకుడు కాదులేరా తిక్కోడా! అయినా ఆ పాప చాలా మంచిదిలే!’ అని మెచ్చుకుందే గానీ జయమ్మక్క మా సార్‌ను గురించి వొక్కమాట గానీ చెడ్డగా మాట్లాడలేదు. అది నాకు ఆశ్చర్యమని పిచ్చింది. నేను మూడు నాలుగేండ్ల నుంచీ సారోళ్ల ఇంటికి పోతా జయమ్మక్కనూ సార్నీ చూస్తా వుండాను, యానాడే గానీ వాళ్ళిద్దరూ వాదులాడుకొనిండేదీ వొగరి మీదొగరు అలిగిండేదీ నేనెప్పుడూ చూల్లేదు, ఇద్దరూ ఎంతో ప్రేమగా జోకులేసుకుంటా చాలా అన్యోన్యంగా ఉంటారు. భార్యాభర్తలంటే ఇట్లుండల్లని మనుసులో అనుకుండాను.

(ఇంకా ఉంది)

Exit mobile version