[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
మా వూరు, మా ఇల్లు
మా వూరు బండమీదపల్లె అని ఇంతకు ముందే చెప్పినాను. బండమీదపల్లె అంటే వూరంతా బండమీదేమీ లేదు. మాదిగోళ్ల ఇండ్లు మాత్రం ముక్కాలు భాగం పెద్ద బండ దక్షిణం అంచుమీద ఉండాయి. మిగతా కాలు భాగం ఇండ్లు ఊరగొండ వారగా వుండాయి. ఊరగొండనూ వెంకటరమణస్వామి దేవర కొండనూ అనంతపురం నుండి తాడిపత్రికి పోయే రోడ్డు వేరు చేస్తాది. రోడ్డుకు ఉత్తరం వైపున ఊరగొండా దక్షిణం వైపున దేవరకొండా వుంటాయి. మా ఊరగొండ, చేనిలో కోసిన జొన్న సొప్పను నిలువు కుప్పగా వేసినట్లుంటాది. తాడిపత్రి రోడ్లో నుండి వూర్లోకి, కొండకు పడమట పక్కన కొండవారగా బండిజాడుంటాది. బండిజాడ మొదట్లోనే కుడిపక్కన నాగలకట్టా, కట్ట మధ్యలో పెద్ద రావిచెట్టూ దాన్ని పెనవేసు కొని పిదపదయిపోయిన వేపచెట్టూ, నాగలకట్ట పక్కన, ఎవురయినా పరస్థలం వొచ్చేవాళ్లుండడానికి వీలుగా నాలుగు రాతి స్తంభాల సత్రమూ, దాని వెనక కొండదడిలో మంచినీళ్ల చెలిమీ (చెలమ) కనిపిస్తాయి. బండిజాడకు ఎడమవైపున జాడకంటే తగ్గులో, జాడ వెంబడి వొచ్చే వంక, మా పల్లె పడమటి వైపును వొరుసుకొని వొచ్చి మా గడ్డిదొడ్డి దగ్గర కాలువలో కలుస్తాది.
బండిజాడ రెండు ఫర్లాంగుల దూరం సాగినంక దక్షిణం వైపు నుంచీ ప్రారంభమయిన వూరు, కొండవారగానే తూర్పు వైపున మాదిగిండ్ల వరకూ వ్యాపించి వుంది. తాడిపత్రి రోడ్లో నుండి వూర్లోకి వొచ్చే బండిజాడ, వూరి ప్రారంభంలో మంగలోళ్ళగేరి వీపు దగ్గర రెండుగా చీలుతాది. కుడివైపునకు చీలిండే రస్తా కాలిబాటగా వడ్డెగేరి గుండా కురవగేరి గుండా, సాగి మాదిగిండ్ల దగ్గర తేలుతాది. ఇంగ ఎడమవైపుకు చీలిండే బండిజాడ, వంకజాడలోకి దిగి ఆ జాడ వెంబడే వొచ్చి వూరి బయటున్న బందలదొడ్డి దగ్గర వూర్లోకి తిరిగి తూర్పు దిక్కుగా సాగి, పడమటి మాదిగిండ్ల వారగా బండమీదుండే మాదిగిండ్ల దగ్గరికి చేరుకుంటాది. అక్కన్నుండీ కొండవారగానే కొంతదంకా వెళ్లి అడ్డదారిలో చక్రాయపేటకూ పోతురాజు కాలవకూ పోతాది. పడమర వంకా, ఉత్తరాన శింగనమల చెరువు కాలువా, దక్షిణాన తుర్పుగా వూరగొండా హద్దులు కలిగిన మా బండమీదపల్లె, ఊరగొండ ఎక్కి చూస్తే వొగ కర్జీకాయ ఆకారంలో చిత్రంగా కనిపిస్తాది.
పడమటి నుండీ తూర్పున వూరి చివరి దంకా వెళ్లే ఇరవై అడుగుల వెడల్పుండే వీధే మా వూరి బజారు. ఈ బజారు, పీర్లచావిడి దగ్గర విశాలంగా వుంటాది. తోలుబొమ్మలాటలు, కృష్ణరాయబారం, రామాంజనేయ యుద్ధం వంటి నాటకాలు ఇక్కడుండే బయల్లోనే వేస్తారు. పరాయి వూర్ల నుండి వొచ్చే బెల్లం చెరుకు బండ్లూ, గెనుసుగడ్డల బండ్లూ, సున్నం బండ్లూ ఇట్లాటి వన్నీ ఈ బయల్లోనే ఆగుతాయి. దొమ్మరాటలూ, గుండ్లూ, ఇరుసులెత్తే ఆటలూ, పండగలప్పుడు కోలాటలూ, పండరి భజనలూ ఇక్కడే! వేలం బట్టలోళ్లు, గాజులోళ్లూ, పూసలోళ్లూ, సిలవరి సామాన్లోళ్లూ అందరూ ఈ పీర్లసావిడి అరుగుల మీదనే తమ వ్యాపారాలు చేసుకుంటారు. ఊరి పంచాయితీలూ, ఆఫీసర్ల మీటింగులూ ఎన్నికలప్పుడు రాజకీయనాయకుల సభలు అన్నీ ఈ చావిడి అరుగుల మీదనే! ఎండకాలంలో ఊర్లోని పెద్దమనుషులూ, ముసలీ ముతకలయిన మొగోళ్లూ, ఈ చావిట్లోనే డబ్బులు ల్యాకుండా సలాంచేసే ఇస్పేటాకులూ, బారాకట్టా, పులీమేకా ఆటలు ఆడతా సవాలాడతా పొద్దు బుచ్చుకుంటారు. అయితే ఆడోళ్లు ఎప్పుడూ చావిట్లోకి తీరుబడిగా వొచ్చి కూర్చోవడం నేను చూల్లేదు. అదెందుకో నాకు తెలియదు.
మా వూరి పీర్లచావిడి మొన్నటి వరకూ రెండు భాగాలుగా వుండేది. పడమటి వైపున ఒగ భాగం. తూర్పు వైపున మరొగ భాగం. మధ్యలో కోట లోపలికి పోయే పదడుగుల రస్తా! పైకప్పు ఏకాండంగా వుండేది. ఉత్తరం వైపున బయలు ప్రదేశానికి ఎదురుగా గోడలు ల్యాకుండా బయలుగా వుండేది. పైకప్పు అంతా జెముడు దంతెలతో వొంకిరి దూలాలూ స్తంభాలతో, కింద బండపరుపు లేని మట్టి ఫ్లోరింగ్‌తో వుండేది. అటువంటి పీర్ల చావిడిని మా వూరి పెద్ద మనుషులు మొన్న మొన్ననే మార్చేసినారు. తాడిపత్రి రోడ్డుకు ఇరువైపులుండే పాతకాలం నాటి వేపమాండ్లను కోయిచ్చి స్తంభాలూ దూలాలూ తీర్లూ చేయిచ్చినారు. రెండు లారీల నిండా మూడూ × రెండడుగుల బెలుం బండలు తెప్పిచ్చి, పైకప్పు, కింద ఫ్లోరింగూ అంతా బండపరువు వేయిచ్చినారు. మధ్యలో వుండే గోడల్ని తొలిగిచ్చినారు. బయలుకు ఎదురుగా వుండే చావిడిని చిన్న పీర్ల (కౌడి పీర్ల) కూ, కోట్లోకి పోయే రస్తా పక్క నుండే చావిడిని పెద్దపీర్లకూ కేటాయిచ్చినారు. ఇప్పుడు మా వూరి పీర్లచావిడి మాదిరిగా వుండే చావిడి, ఆమడదూరంలో యా వూర్లోనా లేదంట!
అటువంటి చావిడి మధ్యలో వుండే రస్తా గుండా లోపలికి పోతే ఎదురుగా సగం తేలిపోయిన చిన్న బురుజు! బురుజుపైన రెండు చిన్న గడ్డి వాములు! బురుజుకు ఆనుకొని వుండే కుడివైపు రస్తా గుండా లోపలికి పోతే బయలు స్థలం! ఆ స్థలానికి పడమట పక్కన గోడలు లేని నాలుగు రాతి స్తంభాల రాముల వారి గుడి! రస్తా ఇంగా రోంత ముందుకు పోతే, బోయ నారాయణ ఇల్లు! దానికి అవతల రెడ్డెమ్మ ఇల్లు, అట్లే ముందుకు పోతే ఎదురుగా వరట్ట రంగయ్యశెట్టి ఇల్లు! బోయనారాయణ ఇంటెనక సందులో రంగయ్యశెట్టి ఇంటికి ఆనుకొని వుండే చిన్న కొట్టమూ, కొట్టం వెనక మా చిన్నజేజీ కుంటి చిన్నాయనోళ్ల చిన్న మట్టిమిద్దె, వాళ్ల కొట్టం గోడ దాటి ఎడమవైపు తిరిగితే ఉత్తరం ముఖంగా కనిపిచ్చే మట్టిమిద్దె, అదే మా యిల్లు! తరతరాల నుండి వారసత్వంగా మాకు దక్కిండే పూర్వీకుల ఆస్తి!
మా ఇంటి వీపుగోడతో జాయింట్‌గా కలిసిపోయిన గోడే, కోటగోడ! ఇంటి పడమటి గోడ తర్వాత కొంచెం బయలు స్థలం మధ్యలో కూలిపోయి, నెలవంక మాదిరి మిగిలిండే గోడ, పెద్దమ్మదేవత గుడి గోడంట! మా బండమీదపల్లెకు మూలస్థలం మా ఇల్లేనని, పూర్వం వూరును కట్టే సమయంలో మొదట పెద్దమ్మ గుడినీ, ఆ గుడి పక్కనుండే మా ఇంటినీ కట్టినారనీ మా నాయన ముత్తాత చెప్పేవాడంట! మా ఇంటి వీపు గోడ వెనకసందు, తూర్పు వైపునకు వెళ్లి, ఐదిండ్ల తర్వాత ఉత్తరం వైపుకు తిరిగి మల్లా ఐదిండ్ల తర్వాత ఉత్తరం వైపుండే బజారి వీథిలో కలుస్తాది. ఆ మాదిరిగానే మా ఇంటి వెనక సందు, పడమటి వైపునకు వెళ్లి ఉత్తరం వైపుకు తిరిగి ఐదిండ్ల తర్వాత ఉత్తరం వైపున్న బజారు వీథిలో కలుస్తాది. జాగ్రత్తగా గమనిస్తే కోటలో నాలుగు వైపులా ఐదేసి లెక్కన ఇండ్లున్నట్లూ, అవన్నిటికీ ముఖద్వారాలు కోట లోపల వైపుననే ఉన్నట్లూ అర్థమయితాది. అందుకే ఇప్పుడుండే పీర్లచావిడి మధ్యలో కోట వాకిలి వుండేదని తెలుస్తాది. మమ్మల్ని కోట్లోవాళ్లని అంటారు. అయితే లోపల మా ఇంటి దగ్గరుండే బురుజు తప్పా కోటగుర్తులేవీ ఇప్పుడు కనిపిచ్చవు.
మా ఇంటితో కలసి ఆరిండ్లు తప్పా మిగిలిన ఇండ్ల వాళ్లందరూ తమ తమ ఇండ్ల తల వాకిండ్లను తమ సౌకర్యం కోసరం కోట చుట్టూ వుండే సందులోకీ బజార్లోకీ ఏర్పాటు చేసుకొని అవసరాన్ని అనుకూలాన్ని బట్టి ఇరువైపుల వాకిళ్లను వాడుకుంటా వుండారు. కొంత కాలం కిందటి వరకూ కోటలోపలుండే ఇండ్ల వాళ్లందరికీ మా ఇంటి పక్కనుండే పెద్దమ్మ గుడీ, రెండిండ్ల తర్వాత వుండే రాముల వారి గుడీ వాళ్ళ దైవభక్తికి గుర్తులుగా వుండేవేమో! మా పూర్వీకుడెవరో ఆ కోట పాలకుడై వుండే వాడేమో! అయితే, వొక్క బురుజు తప్పా ఏ ఆనవాళ్లూ లేని మా వూరి కోటకూ, వూరి పేరుకూ సంబంధమే లేదు. పెద్ద బండ దక్షిణం అంచు మీదుండే కొన్ని మాదిగిండ్ల కారణంగా మావూరికి బండమీదపల్లె అని పేరొచ్చి వుండొచ్చు. చాలా కాలం కిందట్నే మా వూరి కోట చుట్టూ అన్ని కులాలోళ్ళూ వొచ్చి స్థిరపడిండొచ్చు.
మా వూరికి మూలమయ్యింది మా ఇల్లే అయినందు వల్లనేమో, వూర్లో ఎప్పుడు దేవర జరిగినా మా ఇంటినుండే కుంభం కూడు బయలుదేరడం ఈనాటికీ జరుగుతానే వుంది. ఊరికి ఇంత ముఖ్యమయిన మా ఇల్లు చాలా పెద్దగా గంభీరంగా వుంటాదేమోనని. మీరందరూ అనుకుంటారేమో! కాని మా వూరి కోటలో వుండే ఇండ్లన్నిటి కంటే అన్ని కుటుంబాలకంటే మా ఇల్లూ, మా కుటుంబమే బతకడానికి ఏ ఆదరువూ ల్యాకుండా వుండే మా బండమీదపల్లె మూల కుటుంబం!
అట్లాటి మా ఇండ్లు ఎట్లుంటాదో చెప్పకపోతే ఏం బాగుంటాది? మా ఇండ్లు, ఇట్ల ఎనిమిదడుగులు అట్ల ఎనిమిదడుగులు పొడవు వెడల్పూ, వుండే మట్టిగోడల గూడు మిద్దె! పూర్తీ మధ్యలో కాకుండా కొంచెం దేవర మూలగా ఉత్తరం ముఖంగా తలవాకిలి! వాకిలికి రెండు చెక్కతలుపుల రెక్కలు! పావలా యెత్తు బంగారు వస్తువైనాలేని ఇంటివాకిలి చౌకట్టూ, తలుపు రెక్కలూ భద్రంగా వుండాయి! ఇంటి పంచల్లో చిన్నగూళ్లు ముద్దుగా వుండాయి! ఇంట్లోకి పోతానే రెండు వొంకిరి స్తంభాలు, స్తంభాల మీద నుండీ ఇంటి వీపుగోడలోకి చొప్పిచ్చిండే రెండు వొంకిరి దూలాలు! దూలాల మీద అడ్డంగా జెముడు దంతెలు! దంతెల మింద, తడకలు! అందుబాటులో ల్యాకనో, జరుగుబాటు ల్యాకనో, శక్తి చాలకనోయేమో, చిక్కెగా పరిచిన వేపమండల పుల్లలూ పత్తికట్టి పుల్లలూ! ఇంటి వీపుగోడకు దగ్గర్లో తూర్పు వైపునా పడమరవైపునా రెండు గవాక్షులు! గవాక్షి రంధ్రాలపైన మట్టికాగుల కంట్లాలు! వీపు గోడలో పడమటి మూలలో 1.6 × 2 అడుగుల రెండరల గూడు! గూటికి చిన్న చెక్క తలుపులు! గూడు కింద భాగంలో బట్టలు, ముఖ్యమైన వస్తువులు పెట్టుకుండే వొగ చెక్కపెట్టె! అదే గోడలో తూర్పు మూలలో నడుముల ఎత్తులో తలుపులు లేని 1.6× 2 అడుగుల గూడు! గూటినిండా చెక్కదువ్వెనలూ, ఈరు మాన్లూ, పిన్ని సూదులూ, చిన్న అట్టముక్కల్లో దూర్చిన దారం సూదులూ, కాటుక డబ్బీ, కుంకుమ డబ్బీలూ, తుంట బలపాలూ, మేకులు, వక్కాకు రోలూ, ఇంకా కొన్ని చిదుగు వస్తువులూ! అదే గోడమధ్య, పైభాగంలో సీతారామలక్ష్మణులూ ఆంజనేయుడూ వుండే పటమూ, వెంకటేశ్వరుని పటమూ! పడమటి గోడవారగా మట్టికాగూ, కుండల దొంతులు ఐదు! దొంతులపైన, విడిచిన బట్టలు వేసుకోడానికి వొగ దండెం! తూర్పు గోడమీద నాయన జుబ్బాలూ, నా అంగీలూ తగిలేసుకోడానికి దిగగొట్టిన నాలుగు పెద్దమేకులు! దేవరమూల కింది భాగంలో చిన్న గూడు, గూట్లో, ఆముదమూ దూదొత్తులూ వుండే మట్టి దీపాంతి! నాలుగు ఊదికడ్డీలు (ఊదుబత్తులు)! తూర్పు గోడవార అగదాళ్లన్నీ సల్లు సల్లయిన వొగ నులక మంచం! మంచం మింద పరిచిన రెండు గోనెపట్టలూ, తలపాట్న రాగిసరుగు తలదిండూ! మంచం పైభాగంలో దంతెలకు వేలాడగట్టిన ఉట్టి! ఇంటి వాయవ్యమూలలో వొగ పొయ్యీ వొగ పొంత పొయ్యీ! పొంత పక్కన వొగ పుటకలో పప్పుగిత్తీ, తెడ్డుకట్టి, రెండు కంచు చెంబులూ, వొగ కంచుగెంటీ, నాలుగు కంచులోటాలూ, మూడు కంచు పళ్ల్యాలూ, రెండు సిలవరి పళ్ళ్యాలూ, నాలుగు సిలవరి తట్టలూ! పొయ్యి గడ్డ మింద గోడకు ఆనిచ్చిన రొట్టె పెనమూ, గుంత పంగనాల పెనమూ, మిల్ట్రీవాళ్ల ఇనపటోపీ మాదిరుండే దోశెల మట్టిపెనమూ, పెనమ్మీద మూసే కొప్పుమూతా! ఇల్లంతా పేడతో అలికీ, అలికీ గట్టిపడిన మట్టి ఫ్లోరింగు! ఇదీ మా యింటి లోపలుండే సంపద!
మా ఇంటి బయట ఎడమవైపున అయిదారు మంది ఇరుక్కొని పండుకోడానికి వీలుండే రెండడుగుల ఎత్తున్న అరుగు! అరుగు చూట్టూరా పరిచిన కాలుబ్బండల తుండ్లు! బండల మధ్యలో ప్యాడతో అలికి గట్టిపడిన మట్టి ఫ్లోరింగు! అరుగు పడమటి చివర, నేల మీద సున్నపుకాగు! ఇంటివాకిలి కుడిపంచ కింద, అరుగులో దిగేసిన రోలు, రోలు పక్కన ఉత్తర దక్షిణంగా ఇద్దరు వొదుక్కొని పండుకోడానికి వీలుగా చిన్న ఆరుగు. ఈ రోలు అరుగు పక్కన మా కుంటి చిన్నాయనోళ్ల కొట్టం గోడ, కుడీ ఎడమల వైపుండే అరుగుల అంచుల్లో రెండు నిట్రాళ్లు! నిట్రాళ్ళు మీద వెదురు ఇంజాప! ఇంజాప మీద నుండి ఏటవాలుగా పైకి, మిద్దె మొరుము మీదికి అడ్డంగా వేసిన వెదురు సివ్వలు (బొంగులు)! సివ్వల పైన పురికోన్లతో బిగిచ్చిండే ఈత తడకలు, తడకలపైన పల్చగా వేసిండే బోదగడ్డి పుల్లలు! ఆ బోదగడ్డి పుల్లలు గాలికి లేెచిపోకుండా మొత్తం వారపాక మీద క్రాస్‌గా వేసి బిగిచ్చి కట్టిండే వరిగడ్డి యెంటెలు!
ఎండల కాలంలో ఎండపడకుండా ఇంటిముందర వేసిన వారపాక కింద నీడ చల్లగా వుంటాది. వారపాకవేసి నాలుగైదేండ్లు అయిందేమో పోయినేడు గాలికాలంలో త్యాపలు త్యాపలుగా బోదగడ్డి చెదిరిపోవడంతో ఈత తడకలు పెద్ద పెద్ద బొక్కలు పడినాయి. మొన్న వానకాలంలో అరుగు మింద పడుకుండేకి వీల్లేకుండా వారపాకంతా కారింది. ఇప్పుడు అరుగు మీదంతా బొక్కల్లో నుండి ఎండపడతా వుంది.
మా ఇంటి ముందర అరుగుల తర్వాత బయలు స్థలం ఉత్తర దక్షిణం పదడుగులు, తూర్పు పడమర ఇరవై అడుగులతో విశాలంగా బాగుంటాది. మా వూర్లో పదీపదైదు ఇండ్ల ముందర తప్పా ఇంగ ఎవురింటి ముందరా ఇంత బయలు స్థలం లేదు. పిల్లలం మేము ఆడుకుండేకి భలే అనుకూలంగా వుంటాది! అందుకే మా ఇంటి లోగిలి అంటే నాకు చాలా ఇష్టం! మా ఇంట్లో నుండి మేము వూర్లోకి పోవల్లంటే, ఇంటి లోగిట్లో నుండి దేవరమూల దగ్గర కుడిపక్కకు తిరిగి మా చిన్నాయనోళ్ల ఇంటి ముందరి కొట్టానికీ, బోయ నారాయణోళ్ల ఇంటి వీపుగోడకూ మధ్యలో వుండే సందుగుండా ముందుకుపోయి ఎడమ పక్కకు తిరిగి. బురుజు వారనవెళ్లి చావట్లోదూరి పోతాం. అందుకే కొత్త వాళ్లెవరూ మా ఇంటిని కనుక్కోలేరు, మా ఇంటికి నేరుగా దడగ్గన రాలేరు!
మా ఇంటి బయలు స్థలానికి ఉత్తరం పక్కన, బోయ నారాయణోళ్ల ఇంటి పడమటి మోట్లో మా పసుల కొట్టం తూర్పు కొమురు గోడ! అక్కన్నుండి పడమటగా ముప్పై అడుగుల పొడవుతో మా పశువుల కొట్టం! కొట్టం మధ్యలో నిట్రాయి మీదుగా పడమటి కొమురు గోడ మిందికి, వొగ దఢమైన పొడవైన నీలగిరి చెట్టు మొద్దుతో తయారుచేసిన ఇంజాప! ఇంజాప మింద ఇంటి ముందరి వారపాక మింద వేసినట్లే, వెదురు సివ్వలూ ఈత తడకలూ బోదగడ్డితో కొట్టం కప్పు! కప్పుపైన బోదగడ్డి గాలికి లేచిపోకుండా గట్టిగా బిగిచ్చిన యెంటెలు!
ఇంటి బయటకు పడమటి వైపున, అవతల వాళ్ల కొట్టం గోడల వరకూ నాలుగడుగుల ఎత్తున్న మట్టి చట్టం! ఆ చట్టం మీదనే వొగవైపున్న ముక్కాలు భాగం గోడలు కూలిపోయిన పెద్దమ్మ గుడి గుర్తులు! గుడికి ముందు భాగంలో వొగవేపచెట్టు! మట్టిచట్టం దక్షిణం వైపున నాలుగడుగుల వెడల్పుతో మూడడుగుల ఎత్తున్న పాతకాలంనాటి గోడ, మట్టి అంతా తేలిపోయి, పురుగూ పుట్రా సులభంగా చేరుకోడానికి అనుకూలమైన మొత్తం బొక్కలగోడ, మా బండమీదపల్లి కోటగోడకు ఇదొక్కటే గుర్తుగా నిలిచిన గోడ! ఇంటి బయలులో నుండి నాలుగు మెట్లెక్కి, ఇంటి పడమట గోడవారగా వెళ్లి బొక్కల గోడదగ్గర రెండు రాళ్లెక్కితే, ఇంటి వీపుగోడ వెనక యేటవాలుగా మార్చబడిన, కూలిపోయిన కోటగోడే, మా మట్టిమిద్దె మీదికి మెట్లుగాని మెట్లదారి.
ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు! నాకు వెలుగునిచ్చిన వెలుగులేని ఇల్లు! మా బండమిందపల్లెలో దేవర్లకూ, బోనాలకూ ముఖ్యమైన మా మట్టి ఇల్లు!
మా వూరి పేరు మొదటనే తెలియజేసినాను. మా వూరికి తూర్పున, ఊరగొండ దాటగానే తాడిపత్రి రోడ్డు పక్కనే ‘చక్రాయపేట’ వుంది. చాలకాలం కిందెప్పుడో ఎవురు కూల్చి వేసినారో యేమో, ఇప్పుడుండే ‘చక్రాయపేట’ కంటే ముందు రోడ్డుసమీపంలో కొన్ని కూలి పోయిండే ఇండ్లు కనిపిస్తాయి. ఆ కూలిండే ఇండ్లకు కొంచెం దిగువన వొగ కాలనీ మాదిరిగా వుండే పదైదు పదారిండ్ల వూరే చక్రాయపేట. ఆ ఇండ్లల్లో వొగటి తురకకోల్లది, వొగటి మంగలోళ్ళది. వొగటి గొల్లోళ్లది. మిగతావన్నీ రెడ్లవి. ఆ చిన్నపల్లె మా ఊరికి మజరా.. అందుకే మా పల్లెను సి (చక్రాయపేట). బండమీదపల్లె అని అంటారు. చక్రాయపేటకు మరికొంత దిగువన తాడిపత్రి రోడ్డుకు కొంచెం ఎడంగా వుండే నూరు గడపల పల్లె, ‘పోతురాజు కాలువ’, ఆ వూర్లో అందరూ బోయకులస్థులే!
ఇంక మా బండమీదపల్లెకు ఎగువన అంటే పడమట వైపున పిల్లిగుండ్ల గుట్ట పక్కనుండే వూరు శివపురం. సుమారు నూటా ఇరవై గడపల పల్లె, వూరంతా ఐదు కులాల వాళ్ళే! రెండే రెండు రెడ్లవి. మిగిలిన వూరంతా బోయ, వడ్డెర, పట్రగొల్ల, మాదిగ కులాలకు చెందినవి. వీళ్లల్లో అన్ని విధాలా బలమయిన వాళ్లు బోయోళ్లూ, పట్రగొల్లలు.
మా బండమీదపల్లె కొంచెం పెద్ద వూరే! శింగనమల చెరువు కిందుండే పదైదు పదారు పల్లెల్లో శింగనమల, పెరవలి తర్వాత మా వూరే పెద్దది. సుమారు నన్నూరు ఇండ్లుంటాయి. రెడ్లు, వైశ్యులు మొదలయిన పదైదు కులాల వాళ్లిండ్లు ఇంచుమించు సరిసమానంగా వుంటాయి. బాపనోళ్ల ఇల్లు మాత్రం వొక్కటే వొక్కటి! జనబలం తీసుకుంటే మా ఉప్పరోళ్లూ, బోయోళ్లూ, కురవోళ్లూ, మాదిగోళ్లు మిగతా కులాల వాళ్లకంటే ఎక్కువగా వుంటారు. ఎక్కువగా ఉన్న్యా వీళ్లల్లో ఎవురూ యానాడూ పంచాయితి ప్రసిడెంటు కాలేదు. చక్రాయపేటలో రెడ్ల ఇండ్లు రెండే అయినా పంచాయితి పెత్తనమంతా వాళ్లదే! కానీ ప్రసిడెంటు సీటు మాత్రం మా వూరి సుంకు రంగయ్యదే! పెత్తనం ఎవురిదయినా ప్రసిడెంటు సీటు మీద ఎవురున్న్యా. మా ఉప్పరోళ్లంటే, బోయోళ్లంటే, శివపురం పట్రోళ్లంటే అందరూ రోంత భయపడతారు. కురవోళ్ల గుంపు ఎక్కువగా వుండినా, వాళ్ళ గొర్లూ వాళ్ల వ్యాపారాలు తప్ప మిగతా విషయాలు యావీ వాళ్లకు కాబట్టవు. ఎటువంటి కురవోనికయినా వేపకాయంత వెర్రుంటాదంటారు గానీ అందరి కంటే వేపకాయంత ఎక్కువగా తెలివి వుంటాదని చెప్పడానికి ప్రతియేటా వాళ్లుకొనే భూములే సాక్ష్యం.
మా వూర్లో బాపనోళ్లు, కోమటోళ్లు, రెడ్లు, బోయ, కురవ, ఉప్పర, చాకల, మంగల, నంబి, గొల్ల, తురక, దాసర, వడ్డే, నేసే, కంసల, మాదిగ పేర్లతో పదారు కులాలోళ్లుండినా వొగ మాదిగోళ్ల ఇండ్లు తప్పా మిగతా కులాల ఇండ్లు యావీ ప్రత్యేకంగా లేవు. బోయోళ్ల ఇండ్ల మధ్యలో కురవోళ్లూ, కురవోళ్ల ఇండ్ల మధ్యలో వడ్డెవాళ్లూ, చాకలోళ్లూ, కోమటోళ్ల మధ్యలో రెడ్లూ, కురవోళ్ళూ, వడ్డెవాళ్ల మధ్యలో మంగలోళ్ళూ, రెడ్లూ, ఉప్పరోళ్ల మధ్యలో చాకలోళ్లూ ఈ మాదిరి అందరి ఇండ్లూ కలగాపులకంగా కనిపిస్తాయి. తురకోళ్ల ఇండ్లు వోగేచోట కాకుండా అందరి ఇండ్ల మధ్యలో వుంటాయి. వాళ్లెవురూ గడ్డాలు పెంచుకొని, టోపీలు పెట్టుకోరు. వాళ్ల ఆడోళ్లు బురఖాలు వేసుకోరు. పండగలప్పుడు పండరి భజనలు చేస్తారు. రాముల గుడిదగ్గర భజనపాటలు పాడతారు. వాళ్లవి మా వూర్లో పదైదు పదారిండ్లుండినా వూరిబయట వాళ్లకు దర్గా, మసీదులు లేవు. పీర్లపండగల్ని వూరి పెద్దమనుషులే జరిపిస్తారు.
అన్నికులాల వాళ్లిండ్లూ కలిసిమెలిసి పక్క పక్కన వుండడంవల్ల వొగ కులమోళ్లు మరొగ కులమోళ్లను అన్నా, మామా, చిన్నాయనా, పెదనాయనా, వొదినా, అత్తా, పిన్నమ్మా, పెద్దమ్మా అని వరసలతో పిలుస్తారు. మా నాయన వొగ కురవతన్ని అన్నా అని పిలిస్తే, ఆ కురవతను బోయతన్ని బావా అని పిలిస్తే, ఆ బోయతడు మా నాయనను మామా అని పిలుస్తాడు. కులాలు వేరయినా వరసలు మాత్రం ఎక్కడా తప్పవు.
మా వూరి కొండెక్కి మధ్యలో జారేబండ దగ్గర నిల్చుకొని చూస్తే మా వూరంతా వొగ ఎండిపోయిన జిల్లేడుకాయ లెక్కన, వొంపుగావుండే చింతకాయ తీరున, ఎడమ చేతిలో పట్టుకున్న కొడవలి మాదిరి, దక్షిణం పక్కనుండి ఉత్తరం దిక్కుకు మల్లిన నెలవంక చందమామ ఉన్నట్లే వుంటాది. కొండ ఇంగా రోంత పైకెక్కి పడమటి వైపున శివపురం ఎగువన మరవకొమ్మ దిబ్బ దగ్గర్నుంచీ ఉత్తరం వైపుండే గోలకొండ మోటుకు ఆనిచ్చి కట్టిండే శింగనమల చెరువుకట్ట కనిపిస్తాది. చెరువు నిండినప్పుడు సముద్రం మాదిరి వుంటాదంట! ఇంతవరకూ నేను చెరువు కాటికి పోలేదు. మా శింగనమల చెరువు మా రాయలసీమ జిల్లాల్లో వుండే పెద్ద చెరువుల్లో మూడోదని అనంతపురం జిల్లాలో రెండోదని మానాయన చెప్పుతా వుంటాడు. ఆ చెరువును శ్రీరంగదేవరాయలు చాలా భద్రంగా కట్టిచ్చినాడంట. మా చెర్లోకి అనంతపురం అవతల్నుంచి మూడామడ దూరం నుంచి తడకలేరూ, రెండామడ దూరం నుండి ఆకులేటి వంకా, అనంతపురం చెరువు మరవంకా, బోడిగానిదొడ్డి వంకా వస్తాయంట! వాన్లకాలంలో పెద్దవర్షం పడినప్పుడు మావూరి మొగోళ్లు ఊరగొండ ఎక్కిచూస్తే ఆ వంకల్లో నీళ్ళొచ్చేది కనిపిస్తాదంట! ఇంగ రోంత పెద్దగయినంక వాన్లకాలమప్పుడు నేనూ కొండెక్కి మా శింగనమల చెరువు చూడల్లనుకుండాను.
మా శింగనమల చెరువుకట్ట మధ్యలో వొగ ఎర్రగుట్ట వుంది. మా దొడ్డికాటికి పోయి, ఇరుక్కంతు దాటినంక చూస్తే చాలు, ఆ గుట్ట కనిపిస్తాది. గుట్టంటే అది గుట్ట కాదంట, ఎర్రగరుగు దిబ్బంట! దాని పైన ఆంజనేయస్వామి గుడీ, దుగ్గెమ్మ (దుర్గమ్మ) గుడీ వుండాయంట! అందుకే దాన్ని ‘దుగ్గెమ్మకుప్ప’ అని అంటారంట! పైన్నుంచీ వొచ్చే తడకలేటి నీళ్లు ఫోర్సుగా వొచ్చి మొదట ఆ గుట్టను తాకుతాయంట! అక్కడ గుట్టలేకుండా వుంటే ఆ ఏట్నీళ్లు తాకే తాకిడికి చెరువుకట్ట ఎప్పుడో తెగిపొయ్యేదని, ఇంజనీర్లెవురూ లేనికాలంలోనే భలే ప్లానుగా కట్టినారని మా వూరి పెద్దోళ్లు, మా నాయనా అందరూ చెప్పుతా వుంటారు. అది గుడకా నేను చూల్లేదు. ఆ దుగ్గెమ్మకుప్ప కాటికి పోయిచూస్తే, చెరువుకు ఉత్తరం పక్కన గొలకొండ వెంకటరమణస్వామి కొండ, దాని వెనకపక్క చిన్నగంపమల్లయ్య, పెద్ద గంపమల్లయ్య కొండలు చాలా దగ్గరగా కనిపిస్తాయంట! పెద్ద గంపమల్లయ్య కొండ, మా అనంతపురం జిల్లాలోనే చాలా ఎత్తయిన కొండంట! అందుకేనేమో మా దొడ్డికాటికి పోయి చూస్తే ఆ మూడు కొండలూ, గోవిందరాయునిపేట వెనక, చెరువు మాగాణికి ఆనుకొని వుండే మాలకొండా, దాని వెనకపక్క శింగనమలకు దేవరమూలలో వుండే ఋషింగమయ్య కొండా కనిపిస్తాయి.
పెద్ద గంపమల్లయ్య కొండలో, పైనుండే గంపమల్లయ్య స్వామి సత్రంలో వొండిన ప్రసాదాన్ని వొగ తళిగలో పెట్టి, ఆ తళిగను నడుముకు కట్టుకొని పూజారయ్య అందరి ముందర్నే, నూనె అంతా కారి, జిడ్డు జిడ్డుగా వుండే పెద్ద ఏటవాలు బండమింద నుండి కిందికి దుంకినట్ల పోతాడంట! పోయి, కింద గవిలో వుండే దేవునికి నైవేద్యం పెట్టి అదే బండ మింద నుంచి పైకి నడుచుకుంటా గంటకొట్టుకుంటా వొస్తాడంట! ఆ పూజారయ్య దుమికే బండ దగ్గిర్నుంచీ కిందికి చూస్తే కండ్లు తిరుగుతాయంట! చాలా లోతయిన లోయంట! పూర్వకాలం నుండి ప్రతి సమ్మత్సరమూ కార్తీక మాసంలో ఆ గుడి పూజారయ్యలు దేవుని మహిమతో ఆ పని చేస్తావుంటారంట! పెద్దయినంక ఆ కొండకుపోయి, పూజారయ్య లోయలోకి దుమికేది చూడల్లనుకుండాను. అట్లే ఋషింగమయ్య కొండకుపోయి ఆ పేరేందో తెలుసుకోవల్లనుకుండాను.
మా వూరి దేవరకొండ-సమారాధన:
మా వూరికి దూరంగా వుండే కొండల్ని గురించి నాకు తెలిసింది చెప్పినాను. ఇంగ మా వూరి కొండల్ని గురించి చెప్పల్ల గదా! మా వూరగొండను ఆనుకొని తాడిపత్రికి పోయే రోడ్డుకు దక్షిణం వైపుండే కొండ, వెంకటరమణ స్వామి దేవరకొండ! మా వూరి పెద్దమనుషులు మాదిగ ఓబన్నతో తప్పెట చాటింపు వేయించి, అన్ని కులాల వాళ్ళనూ చావిట్లో కలిపి చందాలు నిర్ణయించి ప్రతి సమ్మత్సరమూ కార్తీకమాసం మూడో శనివారం దేవరకొండ మింద గుడిదగ్గర సమారాధన ఏర్పాటు చేస్తారు. పోయిన సమ్మత్సరం సమారాధనప్పుడు మా నాయనోళ్లు పిల్లోళ్ళను మా నలుగుర్నీ కొండమీదికి పిల్చుకొని పోయినారు. ఇంతకు ముందు నేనెప్పుడూ మా దేవరకొండ మిందికి పోలేదు. తొలిసారిగా పోయిండేది నిరుడే!
కొండమిందికి మెటికలు సరిగా లేవు. ఒక్కొక్కచోట రెండడుగుల ఎత్తు మెటికలు, గసపోసుకుంటా పైకెక్క సాగినాను. మా వూరోళ్లందరూ గుంపులు – గుంపులుగా మెట్లెక్కి పోతా వుండారు. నా క్లాసు పిల్లోళ్ళు, ఇంగా చాలా మంది మాగేరి పిల్లోళ్ళూ కేకలేస్తా మెట్లెక్కుతా వుంటే వాళ్ళను చూసి భలే సంబరమయింది నాకు. ఆ సంబరంలో యేందీ కనపిచ్చలేదు. పైకెక్కి చూస్తానే నాకు ఆశ్చర్యమయింది. కొండమింద బయలు! ఆ బయల్లో గుబురుగా పెద్ద జీ (జువ్వి) చెట్లు! ఎప్పడు కట్టినారో రెండు పాత రాతిసత్రాలు బ్రమ్మాండంగా వుండాయి. సత్రాల దగ్గర వంటోళ్లు గాటి పొయ్యిల మింద వంటలు వండుతా వుండారు! ఐదారు అండాల నిండా అప్పుడే పరమాన్నంచేసి పెట్టినారు. జీ చెట్లకింద కన్నెగ ఆకులములంతా వూడ్చి, దుమ్ము లెయ్యకుండా చిక్కెగ నీళ్లు చల్లినారు. త్యామంతా ఆరినంక పెద్ద పెద్ద తార్బాల్లు పరిచినారు.
వొగసత్రంలో వరిగడ్డి పరిచి దానిమింద, నీళ్లల్లో తడిపి పిండిన రెండు తెల్లని పంచెలు పరిచినారు. ఆ పంచెల మింద చిత్రాన్నం కలిపి కుప్పబోసినారు. ఇంగొగ పక్క అన్నం కుప్పబోసినారు. అది చాలదేమోనని ఇంగా రెండు గుండ్రని ఆండాల నిండా అన్నం వండుతా వుండారు. రెండు సిలవరి డబరాల్లో గుడకా పప్పు, రెండు డబరాల్లో వంకాయకూర చేస్తావుండారు. చూస్తా చూస్తా వుండగానే ఇద్దరు వంటోళ్లు పొయ్యిమీదుండే అన్నం ఆండాల కంట్లాలకు పల్చని కొత్త గోనిపట్టను బిగిచ్చి, ఆ పక్క వొగటి ఈ పక్క వొగటి బోనాకట్టెల్ని కంట్లాలకు బిర్రుగా కట్టి చేరొగ పక్క కట్టెల్ని పట్టుకొని ఆండాలను దూరంగా తీసుకొనిపోయినారు. అక్కడ మరొగ గాటి పొయ్యిమీద అడ్డంగా వేసిండే కట్టెల మీద అన్నం ఆండాలను బోర్లిచ్చినారు. బోర్లిచ్చిన ఆండాల్లోని గంజి, పల్చని గోనిపట్ట బొక్కల్లోనుంచీ కిందికి కారుతా వుంది. అంతకు ముందే వొంచిన గంజి మింద ఈగలు వాల్తా వుండాయి.
తిరగబాత (తిరగమోత) పెట్టి కలిపిన పచ్చని చిత్రాన్నం రాశి మీద నల్లగయిన వొట్టి మిరపకాయలూ, కరేపాకూ, నిమ్మకాయల విత్తనాలు కనిపిస్తా వుండాయి. పరమాన్నంలోకి సోపు, (సోంపు) సొంటిపొడి కలిపినారేమో తీపివాసన ఘుమఘుమాలిస్తావుంది. వొక్కొక్క దాంట్లో నుండి వొక్కొక్క రకమయిన వాసన ముక్కు పుటాలకు తగుల్తా వుంటే నోట్లో నీళ్లూరసాగినాయి.
భోజనాలు వొడ్డిచ్చేది ఇప్పుడే కాదని, బాపనయవార్లు వొచ్చి దేవునికి పూజజేసి నైవేద్యం పెట్టి హారతిచ్చిన తర్వాతేనని తెలిసింది. అంతవరకూ దొన దగ్గరికీ దిగవన వుండే కుంట దగ్గరికీ పోదామని జతగాళ్లు అనడంతో అమ్మయ్య నడిగి వాళ్లవెంట యెల్లవారినాను. నన్ను జూసి చెల్లెళ్ళూ, తమ్ముడూ మేమొస్తామని వెంటబడినారు. వాళ్లకు భయంజెప్పి ఆపి, నాకు జాగ్రత్తలు చెప్పింది అమ్మయ్య. సరేనని వూకొడతా జతగాళ్లవెంట నేను దొన దగ్గరికి పోయిచూసినాను.
దొన దగ్గరికి పోతానే నేను అబ్బురపోయినాను. వొగపక్క పెద్ద బండ మరొగపక్క పెద్ద గుండ్లు, దాండ్ల సందులో రెండు బారల వెడల్పూ పదిబారల పొడవూ వుండే వొగ పరికలో ముక్కాలు భాగం నీళ్ళు, నీళ్ళమీదంతా పరిచిన పచ్చని విస్తరాకుల మాదిరి తామరాకులు ముఫ్ఫై నలభై తామర పూలు ఎంతందంగా వుండాయో! నా కంటే పెద్దపిల్లోల్లు నన్ను చెయ్యిపట్టుకొని నీళ్ళదగ్గరికి పిల్చుకొనిపోయి దోసిటి నిండా నీళ్ళు తీసుకుండారు. దొనలో నీళ్ళు పైకేమో నల్లగా కనిపిస్తావుండాయి. దోసిట్లో నీళ్ళు కన్నెగా శుభ్రంగా వుండాయి. దానికి నేనింకా అబ్బురపోయినాను. అంత ఎత్తులో కొండకొప్పు మీదుండే దొనలో మున్నూటా అరవై దినాలూ నీళ్ళుంటాయని, కొండకిందుండే వూర్లోని బావులన్నీ ఎండిపోయినా వెంకటరమణస్వామి దొనలో నీళ్ళు ఎండిపోవని, అదంతా ఆ దేవుని మహిమ అని, ఈ తామరపూలన్నీ దేవునికి పెట్టేకేనని, ఈ దొనలోని నీళ్ళు ఎంత లోతుండాయో ఇంతవరకూ చూసినోడే లేడని, జానగొండ నారాయణ వాళ్లన్నయ్య పెదనారాయణన్న చెప్పుతా వుంటే నాకేమీ అర్థంకాక ‘అవునా అన్నా!’ అని ఆశ్చర్యపడతా నిల్చుకుండాను.
సత్రాల దగ్గరికి పడమటివైపు నుండీ మేము యెక్కొచ్చిండే మెట్లు గాకుండా తూర్పున దొన దగ్గర్నుంచీ వేరే మెట్లుండాయి! ఆ మెట్ల మింద నిలబడి కొంచెం కిందుండే నీటి కుంటనూ కుంటకట్ట మిందుండే చింతమాండ్లనూ, జీ మాండ్లనూ చూపుతా, ఆ కుంట దగ్గర్నుండీ అట్లే దిగువకు మెట్లుండాయనీ, అవి చెట్ల మాటున కనిపించవనీ, అవి దేవరకొండకు తూరుపు మెట్లనీ, మెట్లు దిగుతానే చెన్నంపల్లి బండిజాడలో అడుగులు పెడతామనీ, ఆ దూరంగా కనిపించే పల్లెలు తూర్పు నరసాపురం, మట్లగొంది, సోదనపల్లి, పెరవలి, నాయనపల్లి, కేశేపల్లి, సాములూరు, నడిమిదొడ్డి, నార్పల అనీ, నాయనపల్లి అవతల కనిపిచ్చేది ముచ్చుకోట కనుమ అనీ, దాని తర్వాత దూరంగా మసవొగమసగ్గా కనిపిచ్చేదే తాడిపత్రి అనీ ఆ అన్నయ్య అంతా వివరంగా చెప్పతావుంటే నేను భలే కుశాలపడినాను. నేను సంబరపడతావుంటే నన్ను పడమట పక్కతిప్పి, దగ్గరగావున్నట్లు కనిపిస్తావుండే మా శింగనమల చెరువునూ చెదల్ల, నీలంపల్లి, దంతులూరు, రేగడి కొత్తూరు, గురుగుంట్ల, మదిరేపల్లి, చిన్నజలాలపురం, పడమటి నరసాపురం, దండుగొండ, ఆకులేడు, గార్లదిన్నె, వడియంపేట, పొడరాళ్ల; నైరుతి మూలలో బోడిగానిదొడ్డి, బుక్కరాయసముద్రం, దూరంగా పెద్దగా కనిపించే అనంతపురం, అట్ల చుట్టూరా కనిపించే వూర్లనూ కొండలనూ, చెరువులనూ వేలుబెట్టి చూపుతా చెప్పుతా వుంటే ఎంతో ఉబలాటంగా చూస్తా వింటా, దేశాన్నంతా చూసినంతగా మురిసిపోయినాను. ఈ వూర్లన్నీ ఈ అన్నయ్య చూసినాడేమో, నేనెప్పుడబ్బా చూసేది అని ఆశపడసాగినాను.
నేను మురిసిపోతా వుంటే చూసి నవ్వుతా, ‘వూర్లే కాదు సిన్నా, ఈటికి కనిపిస్తావుండే కొండలన్నీ తిరిగినాన్రా! మన దేవరకొండకు ఏడు సిగలు! అంటే ఏడు కొండలు! ఆ తిరపతి యెంగటేస్వరున్ని ఏడు కొండలవాడా, యెంగట్రమనా అని మొక్కుతారు. ఆ తిరపతి దేవునికి ఏడుకొండలు వుండాయో లేదో గాని, మనూరి యెంగటేస్వరసామి దేవరకొండ, ఏడు సిగల్‌తో వుందిరా! నేను పసలగెడ్డి కోసరం ఈ ఏడు కుప్పలన్నీ తిరిగినాను నారాయనా’ అని గర్వపడతా చెప్పినాడు పెదనారాయణన్నయ్య. అంతా విని, నేను గుడకా ఈ దేవరకొండ కుప్పలూ, ఆ దూరంగా కనిపిస్తావుండే ఋషింగమయ్య కొండా, ముచ్చుకోట కనుమా అన్నీ తిరుగుతానేమో, అన్నయ్య చెప్పిన వూర్లన్నీచూస్తానేమో అని ఆలోచనచేస్తా మన వెంకటేశ్వరస్వామి గుడి యాడుందన్నా అని అడిగినాను. అక్కడికే పోతావుండామని మెట్ల మింద కిందికి దిగినాడు నారాయణన్న. అందరమూ మెటికలు దిగుతావుండాం.
దొన దగ్గరుండి సుమారుగా యాభై మెటికలు కిందికి దిగినాం. పైనుండే సత్రాల దగ్గరికి పోకుండా పడమటివైపు నుండి వచ్చే మెట్లదారిలోకి కలుసుకుండాం. అక్కన్నుండీ నాలుగు పగ్గాల దూరం రాళ్లు పరిచిన, చదరంగా వుండే దార్లో ముందుకు పోయినాం. జనం గుంపులు గుంపులుగా వొస్తావుండారు. అక్కడ పెద్దగుడీ, గోపురమూ, చుట్టూరా ప్రాకారమూ వుంటాదని అనుకుండాను. ఊహూ, అట్లాది ఏమీ లేదు! కొండదడిలో, తెరిచిన నోటి పై దవడ మాదిరి, మొలకెత్తే విత్తనంపైన వొగవైపు పైకి లేచిన మట్టి పెలక మాదిరి, వొగ పెద్ద బండ, నోరు తెరిచినట్లు పైకిలేచింది. లేచిన బండకింద ఇరువైపులా భద్రంగా రాతిగోడ కట్టి మధ్యలో తూర్పుముఖంగా వాకిలి పెట్టినారు. వాకిలిగుండా మనుషులు లోపలికిపోయి మొక్కుకొని వొస్తావుండారు. మా గుంపు వెంట నేనూ లోపలికిపోయి చూసినాను. అక్కడ దేవుని విగ్రహమేదీ లేదు. వెనక గోడకు ఆనుకొని చక్కాబిక్కిలి (పద్మాసనం) వేసుకొని కూర్చున్న మనిషి మాదిరి, వొగ నల్లని, నొక్కుబడిన రాయి కనిపించింది. ఆ రాయే వెంకటరమణస్వామి అని విని, నేను మాటలురాని వాన్నయినాను. ఈయన ఏమి దేవుడబ్బా! అని మనసులో అనుకుండాను.
విగ్రహం పక్కన కూర్చొని, మా వొగటో క్లాస్ టీచర్ లక్ష్మినరసయ్య సారు, పట్టు పంచమీద జరీ అంచు టువ్వాలును నడుముకు బిర్రుగా బిగిచ్చుకొని ఏవో మంత్రాలు చదువుతా పూజ చేస్తావుండాడు. వొగ స్పష్టమైన ఆకారం లేని విగ్రహానికి వెండి కనుగుడ్లు, కనుగుడ్ల మధ్యలో నుండి మూడు వెండినామాలు, కిందికి చూపుతున్నట్లు వొగటి, అభయమిస్తున్నట్లు వొగటి రెండు వెండి హస్తాలూ మైనానికి కరిపిచ్చినారు. పై భాగంలో వొగ పట్టుపంచె, మడతలు విప్పకుండా భుజాల మింద వేసినారు. విగ్రహం కింద, మధ్యలో ఐదారు తామరపూలు పెట్టినారు. ఇంకా దండిగా పూలూ, పండ్లూ పక్కనుండాయి.
వెంకటేశ్వరస్వామి విగ్రహం, పైనుండే పెద్ద రాతిబండను పైకి లేపినట్లుంది. పాదాల దగ్గర నుండి కుడివైపు పూజారి కూర్చోడానికీ, పూజా వస్తువులూ, గిన్నెలూ అన్నీ పెట్టుకోడానికీ వొగ అరుగును కట్టినారు. ఆ అరుగుకు దిగువన మా వూరి పెద్ద మనుషులు ఏడెనిమిది మంది కూర్చుండారు. వాకిలి దాటి లోపలికి వెళ్లిన తర్వాత వొగ పది మంది కన్నా ఎక్కువ మంది నిల్బుకోడానికి చోటులేదు. అందుకే అందరూ లోపలికివెళ్లి మొక్కుకొని వొస్తావుండారు. మేమూ వొగనిమిషం మొక్కోని బయటికి వొచ్చినాం. బయట గుడిగోడల మింద అవి కట్టిచ్చిన వాళ్ళ పేరూ ఊరి పేరూ రాయిచ్చిన పలకాన్నీ, బయట బండలు పరిపిచ్చినవాళ్ళ పేర్లనూ, పక్కన సత్రాలు కట్టిచ్చిన వాళ్ళ పేర్లనూ, ఆభరణాలు యిచ్చినవాళ్ళ పేర్లనూ చదివి నేను ఆశ్చర్యపోయినాను. వాళ్ళందరూ వేరే జిల్లాల వాళ్ళు! బయట పరిచిండే బండల మింద మావూరి పెద్దోళ్లు నూరు మందికి పైగా కూర్చుండారు. పూజారయ్యవారు కొడుకు, ఇంటి దగ్గర వండిచ్చుకొని నైవేద్యం యింగా తీసుకోనిరాలేదంట! ఆయనొచ్చేది, యింగా లేటయితాదని, అంతలోపల కుంటదగ్గరికి పోయి రావచ్చునని మేము మళ్లీ మెట్లగుండా కిందికి దిగినాం. అక్కడ కుంట కట్టమిందుండే చెట్లకింద చాలామంది పిల్లోళ్ల పెద్దోళ్లుండారు.
రెండు కొండసిగల మధ్యలో, కిందుండే భూమైదానానికి ఐదారు నూర్లడుగుల ఎత్తులో కట్టిన కుంట అది. ఎప్పుడు కట్టినారో ఎవురికీ తెలీదంట! రెండు మూడేండ్ల నుంచీ సరిగా వర్షాలు లేకనో యేమో కుంటలో నీళ్లు చాలా తక్కువుండాయి. గడ్డి మేయడానికి వచ్చే గొర్లకూ, మేకలకూ ఆ కుంటనీళ్లు చాలా ఉపయోగపడతాయంట! దండిగా వర్షాలోస్తే కుంటలో నీళ్లుపారి కొండకిందుండే పొలాలన్నీ ఈమిరెక్కుతాయని చెప్పి, అక్కన్నుంచీ కిందికి పోయే తూరుపు మెట్లను చూపిచ్చి, కొండకు తూరుపు వైపుండే పల్లెల వాళ్ళకు అవి చాలా అనుకూలమని పెదనారాయణన్న అంతా తెలియజేసినాడు. జతగాళ్ళతో కలిసి చింతమాన్లెక్కి చింతకాయలు పీక్కుందామనుకుంటే అప్పటికే కిందికొమ్మల కాయలన్నీ ఖాళీ అయినాయి. పైన చిటారు కొమ్మలెక్కడానికి భయమయింది. అమ్మయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నేను మానెక్క లేదు. జానగొండ చిన్నారాయణగాడూ ఈడిగోళ్ళ కొండన్నగాడూ సరసరమని చెట్లెక్కి అందిన కాయలు నిక్కరజోబీల్నిండా పీక్కొని కిందికిదిగి తలాకిన్ని పెట్టినారు.
చింతకాయలు పూర్తీ బలసలేదు. అందుకే చాలా పుల్లగుండాయి.. చాలా పుల్లనివీ, చల్లనివీ ఎక్కువగా తింటే పండ్లు బిరీన వూడిపోతాయని అమ్మయ్య చెప్పుతా వుంటాది. అయినా తినకుండా పిల్లోళ్లు ఎవురుంటారు? అందరమూ పిల్లకాయలం, తినేటివి తినొద్దంటే యెట్ల? పైగా ఆకలి! పైన సమారాధన భోజనాలు యెప్పుడు పెడతారో యేమో అనుకుంటా కసకస నముల్తా, పులుపు తగిలి పండ్లన్నీ జిల్లుమంటా వుంటే ముఖాలన్నీ ముడేసుకుంటా నవ్వుతా వుండాం. అంతలోనే చెల్లెలు గుడిదగ్గర్నుండి గట్టిగా కేకలేస్తా పిలిచింది. స్వామికి మంగళ హారతి ఇస్తావుండారేమో, గంటలు మోగుతావుండాయి, దాసప్ప తిరుమంతరం చదువుతా వుండాడు. మేము బిరబిరా గుడిదగ్గరికి చేరుకుండాం.
గుడి బయట వాకిలిదగ్గర అందరూ టెంకాయలు కొట్టి దేవునికి మొక్కుతావుండారు. నాయన గుడకా టెంకాయ కొట్టినంక, అందరమూ మొక్కుకుండాం. పూజారయవారి పెద్ద కొడుకు గుడిలో నుంచి బయటికి వొచ్చి ఎడమ చేతిలో రాగిచెంబు పట్టుకొని కుడిచేతిలోని మూడు తమలపాకుల్ని చెంబులో మాటిమాటికి అద్దుతా ఆకులతో జనం మిందికి అభిషేకం నీళ్ళను చిముకరిచ్చసాగినాడు. పూజారయ్యవారు ఒకచోట నిల్చుకొని వొగ పెద్ద వెండిగిన్నెను పట్టుకొని వరుసగా లైెన్లో వస్తున్న వాళ్ళచేతుల్లోకి పంచామృత ప్రసాదాన్ని (ఉద్దరిణి) చెంచాతో వేస్తున్నాడు. ప్రసాదం తీసుకున్నోళ్లు, ప్రసాదాన్ని జుర్రుకొని అరచేతిని నాక్కుంటా పైకి సత్రాల దగ్గరికి సాగిపోతావుండారు.
జువ్వి చెట్ల కింద పరిచిన టార్బాల్ మింద జనమంతా బంతులు బంతులుగా కూర్చుండారు. కోమటోళ్ళు కొంచెం ఎడంగా అలాదాగా కూర్చుండారు. దాసప్ప గుడి దగ్గర్నుండి తెచ్చిన తీర్థం నీళ్లను వంటల మీదంతా చిముకరిచ్చినాడు. మా శూద్రోళ్లలో వుషారయిన మొగోళ్ళు నలుగురు వొక్కొక్క బంతికి వొక్కొక్కరు గబగబా విస్తరాకులు వేస్తా పోతావుండారు. తనకు విస్తరాకులు వేయకుండా కురవ పుల్లన్న మామ ముందుకుపోవడంతో తమ్ముడు యేడుపందుకుండాడు. సన్నపిల్లోనివి, నీకూ యిత్తరాకు కావల్లేమోరు? వాన్ని నీ పక్కన కుచ్చోబెట్టుకో కేశమ్మత్తా! పిల్లోల్లు సపరేటుగా కుచ్చుంటే అన్నమంతా అలాకు జేత్తారు అని ముందుకుపోయినాడు పుల్లన్న మామ. అమ్మయ్య బుజ్జగించి తమ్మున్ని తన దగ్గర కూచ్చోబెట్టుకుంది.
విస్తరాకులు వేసేదంతా అయిపోయినంక వొక్కొక్క బంతికి వొగరు బకీటు నిండా పరమాన్నం తెచ్చినారు. ఇంకొగరు ‘సోమసూత్రం’తో విస్తరాకుల్లో పరమాన్నం పోసినారు. పరమాన్నం పొగలు గక్కుతావుంది. చిన్నపిల్లోల్లు నాలుకలు చప్పరిస్తా వుండారు. ఇద్దరు పెద్దమనుషులు బంతుల మధ్యలోనికొచ్చి, ‘దాసంగం బంతిలో దాసప్ప తిరుమంతరం చదివి ‘గోవిందా’ అని చెప్పేదంకా ఎవురూ తినగూడదు. పెద్దోళ్ళు పిల్లోల్లకు చెప్పండి’ అని అన్న్యారు. దాసప్ప గరుడస్తంభం పట్టుకొని గంట కొట్టుకుంటా వొచ్చి తిరుమంతరం చదవడం మొదలుపెట్టినాడు.
విస్తరాకుల్లోని పరమాన్నం సువాసనతో నోరూరిస్తా వుంది. పిల్లోళ్లు లొటకలేస్తా నాలుకలు చప్పరిస్తా వుండారు. ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా..!,’ అంటా దాసప్ప చదువుతా వుండే తిరుమంతరం ఇంగా ఎంతసేపు అని పిల్లోళ్ల ప్రాణాలు తండ్లాడతా వుండాయి. కడాకు దాసప్ప తిరుమంతరం ముగిచ్చి ‘గోవిందా, గోవింద’ అని చెయ్యెత్తి ఇంక కానీయండని సైగజేస్తానే పిల్లోళ్ళూ, పెద్దోళ్లూ నోటికి పనిబెట్టినారు. పరమాన్నం రెండో వరస అయిపోతానే కొత్త వెదురు చాటల్తో చిత్రాన్నమూ, అన్నమూ, కాడగిన్నెల్తో గరిటెల్తో పప్పు, వంకాయకూరా ఉరుకులు, పరుగులు మీద వొడ్డిచ్చినారు. ఆకలిగొన్న ప్రాణాలు అడవిలో కడుపులు పెద్దవి చేసుకొని తిని పైకిలేచినారు.
ఆ రకంగా నిరుడు మావూరి దేవరకొండ మీద సమారాధన ముగిసింది.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
