[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
మా హైస్కూల్లో మాక్ పార్లమెంటు!
హెడ్మాస్టర్ సారు మా పదవ తరగతికి సోషియల్ చెప్పేకి మొదలు పెట్టినప్పటి నుండి మాకు భారతదేశ చరిత్ర మీదా ప్రపంచ చరిత్ర మీదా చెప్పలేనంత ఆసక్తి పెరగసాగింది. ప్రపంచ భౌగోళిక స్వరూపమూ భారతదేశ స్వాతంత్య్ర సమరమూ గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్ మొదలయిన గొప్ప వ్యక్తుల స్వాతంత్య్ర పోరాటాలూ అన్నీ కండ్ల ముందర మెదలసాగినాయి. ఐక్యరాజ్య సమితిని గురించీ దాని సెక్రటరీ జనరల్‌ను గురించీ భారత పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ని గురించీ మా సార్ పాఠం చెప్పుతా వుంటే నాకు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటా వుంటాయి.
నిన్న హెడ్మాస్టర్ సార్ మాకు సోషియల్ చెప్పేటప్పుడు మా స్కూల్ ముందరికి సడన్‌గా వొగ జీపొచ్చి ఆగింది. అందులో నుంచీ ఎవురో వొగ ఆఫీసర్ దిగి, హెడ్మాస్టర్ సార్ రూము వైపు పోయినాడు. ఆయన వెంట వొగ బిల్ల జవానొచ్చినాడు. మా సార్ మా వైపు చూస్తా పాఠం చెపుతా మధ్యలో సూయజ్ కాలువను అందులో సాగే నౌకల ప్రయాణాన్ని గురించీ ఆ కాలువ ప్రాముఖ్యతను గురించీ వివరిస్తా వుండాడు. మా సార్ పాఠం చెప్పేటప్పుడు ఈ లోకంలో వుండడు. సూయజ్ కెనాల్ని చూపిస్తా, అప్పుడా కాలువ దగ్గరుండాడు. అందుకే స్కూల్లోకి యెవురొచ్చేదీ ఆయన గమనిచ్చినట్లు లేదు. మా బెంచీలో వుండే వాళ్లకు స్కూల్లోకి యెవురొచ్చినా వాళ్ల పలకువ కనిపిస్తాది.
మేము పాఠంలో మునిగిపోయి పాఠం వింటా వుండాం. అంతలోనే స్కూల్ పీవన్ వొచ్చి, ‘సార్, డి.ఇ.వో. గారొచ్చినారు’ అని అంటా వుండంగనే డి.ఇ.వో. మా క్లాసులో కొచ్చినాడు. హెడ్మాష్టర్ సార్ ఎంతో వినయంగా ఆయనకు నమస్కారం చేసినాడు. మేము క్లాసు పిల్లోళ్లందరమూ పైకిలేచి ‘గుడ్ మార్నింగ్ సార్’ అన్న్యాం. ఆయన మా సార్ కూర్చుండే కుర్చీలో కూర్చొని మమ్మల్ని అందరినీ ‘సిట్ డౌన్’ అని చెప్పి కూర్చోమన్న్యాడు. మా సార్ చెప్పుతా వుండే పాఠాన్ని కంటిన్యూ చెయమన్న్యాడు. సార్ సూయజ్ కెనాల్ ప్రాముఖ్యతను గురించి అత్యద్భుతంగా చెప్పినాడు. కాసేపయినంక గోడమీద తగిలేసిండే మ్యాపును చూపిస్తా, వెంకట సత్యాన్ని పిలిచి ‘సూయజ్ కెనాల్ ఎక్కడుందో మ్యాపులో చూపించు’ అని అడిగినాడు డి.ఇ.వో. వెంకట సత్యం టక్కన చూపిచ్చినాడు. నన్ను పైకి లేపి ‘ఇంగ్లాండ్ కాపిటల్ సిటీ యేది?’ అని అడిగినాడు. ఆయన ప్రశ్న నోట్లో వుండంగనే ‘లండన్ సార్’ అని చెప్పినాను. ‘కేంద్ర పాలిత ప్రాంతాల్లో వొగ పేరు చెప్పమ్మాయ’ అని ఉమావతిని అడిగినాడు.
ఉమావతి ‘పాండిచ్చేరి’ అని వెంటనే చెప్పింది. ‘వెరీ గుడ్ మై డియర్ స్టూడెంట్స్’ అని అందర్నీ మెచ్చుకుండాడు డి.ఇ.వో. మా సార్ వైపు చూస్తా ‘వెల్‌డన్ మిష్టర్ దాస్!’ అని మెచ్చుకోలుగా అన్న్యాడు.
‘ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు యు సర్! మా స్కూల్ని ప్రప్రథమంగా మీరు విజిట్ చేయడం మా అదృష్టం సార్! డియర్ స్టూడెంట్స్, సార్ మన జిల్లాకు విద్యాశాఖాధికారిగా మొన్ననే వచ్చారు. వారి పేరు వెంకటస్వామి గారు. హైలీ లర్నెడ్ అండ్ గ్రేట్ ఆఫీసర్. నెక్స్ట్ మంత్ మన స్కూల్లో ఏర్పాటు చేయబోయే ‘స్టూడెంట్స్ మాక్ పార్లమెంట్’కు వారిని గౌరవ అతిథిగా రమ్మని అభ్యర్థించాను. వీలు చూసుకొని వారు తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను’ అని మాసార్ చెపుతానే అందరమూ చప్పట్లు కొట్టినాం.
తరువాత డి.ఇ.వో. గారు పైకి లేచి ‘వీలుంటే తప్పకుండా వస్తాను’ అని కొంచెం సేపు మాట్లాడినాడు.
ఆయన మా హెడ్మాస్టర్ సారు కంటే, సత్యనారాయణ సార్ కంటే గుడకా చిన్నోడుగా కనిపిస్తా వుండాడు. ఇంత చిన్న వయసులో యెంత పెద్ద ఉద్యోగమో! జిల్లాలో వుండే స్కూళ్లకు అన్నిటికీ అధికారి! ఎంత ఠీవిగా ఉండాడో! నా మాదిరే నల్లగా వుండినా ఎంతందంగా వుండాడో! ఏమి చదువుకుండాడో! ఎంత చదివి చదివినంక ఇట్లాటి ఉద్యోగమొస్తాదో? అబ్బా, ఎంతద్భుతమైన డ్రస్సు వేసుకుండాడు! శ్లాగులో నుంచి ట్రౌజర్‌కుండే నల్లని బెల్టు కనిపిస్తా వుంది! ఇట్లాటి బట్టలు యెవురూ ఇంతదంకా వేసుకొని రాలేదు! టెర్లీన్ బట్టలొ చ్చినాయని అంటా వుంటారు, ఇవేనేమో! ఆ ట్రౌజర్ యెంత ఇదిగా ఉందో!
డి.ఇ.వో. వైపూ, ఆయన వేసుకోనొచ్చిండే డ్రస్‌వైపూ చూసి నేను ఆశ్చర్యపోతా ఆలోచింపసాగినాను. నేనే కాదు, మా క్లాస్‌లో వుండే నా జతగాళ్లందరూ నా మాదిరే ఆశ్చర్యపోయినారు. పిల్లోని మాదిరుండే డి.ఇ.వో. చాలా అందంగా ఠీవిగా కనిపిచ్చినాడట. ఆయన అడిగిండే ప్రశ్నలన్నింటికీ మా తరగతి పిల్లోళ్లు టక టక జవాబులు చెప్పడంతో మా సారెంతో సంతోషంగా కనిపిచ్చినాడు.
ఆ తరువాత డి.ఇ.వో. వెళ్ళిపోయినాడు. వెళ్లిపోయినంక మధ్యాహ్నం పిల్లోల్లంతా డి.ఇ.వో.ను గురించీ ఆయన డ్రెస్సును గురించే మాట్లాడుకోసాగినారు.
***
హెడ్మాష్టర్ సార్ ఇంతకుముందు చెప్పినట్లే మా స్కూల్లో మాక్ పార్లమెంట్ ఏర్పాటు చేసినాడు. పార్లమెంట్‌లో ప్రధానమంత్రే ఫ్లోర్ లీడర్‌గా వుంటాడని, లోకసభకు ఎన్నికయ్యే పార్లమెంటు సభ్యులు (ఎం.పి.లు) స్పీకర్ని ఎన్నుకుంటారని, ఎన్నుకుండే విషయంలో అపోజిషన్ పార్టీ సభ్యులు గుడకా ఉంటారని, అపోజిషన్ పార్టీవాళ్లు స్పీకర్ పదవికి పోటీ చెయ్యల్లనుకున్నెప్పుడు ఎన్నిక జరుగుతుందని ల్యాకుంటే ఎన్నిక వుండదని అధికారంలో వుండే పార్టీ అనుభవముండే తమ పార్టీ ఎంపీని స్పీకర్‌గా సూచిస్తాదని, ఆ వ్యక్తి చేత ప్రమాణం చేయిచ్చడానికి వొగ ప్రోటెం స్పీకర్ని ఎన్నుకుంటారని ఈ విషయాలన్నీ మా హెడ్మాస్టర్ సార్ చాలాసార్లు ఎంతో వివరంగా చెప్పినాడు.
పార్లమెంటులో స్పీకర్ పదవి చాలా పవర్‌ఫుల్ అని, పార్లమెంటంతా ఆయన కంట్రోల్లోనే జరుగుతాదని, ప్రైమినిస్టర్ కూడా మాట్లాడాలనుకుంటే స్పీకర్ అనుమతితోనే మాట్లాడుతాడని ప్రైమినిస్టరయినా వేరే యెవురైనా సరే, లేచి మాట్లాడేటప్పుడు ‘మిస్టర్ స్పీకర్ సర్’ అని సంభోదిచ్చల్లని, సభలో నుంచీ యెవురినైనా రూల్స్‌ను బట్టి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు వుంటాదని మా సార్ మొత్తం పార్లమెంట్ రూపాన్ని గురించి చెప్పినాడు.
అనుకున్నెట్లే, స్కూల్ ముందరుండే స్థలంలో, దినామూ ప్రేయర్ జరిగే చోట, అర్ధ చంద్రాకారంలో బెంచీలూ, డెస్కులూ వేయిచ్చినాడు మా సార్. ప్లాట్ఫార్మ్ పైన రెండు టేబుళ్లు వేసి దాండ్ల మీద మంచి అందపైన టేబుల్ క్లాత్ పరిచినారు. ఇద్దరు కూర్చోడానికి రెండు చెక్క కుర్చీలు వేసినారు. విద్యార్థులందరూ వొచ్చి బెంచీల మీద కూర్చుంటారు. ఆ మాక్ పార్లమెంటుకు స్పీకర్‌గా మా ఊరి ఎలకంటి నాగభూషణం అని, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, ప్రధానమంత్రి ఫ్లోర్ లీడర్‌గా స్కూల్ పీపుల్ లీడర్ తిప్పన్న అని అపోజిషన్ పార్టీ నాయకునిగా జొన్నలగడ్డ వెంకట సత్యం అని, నేనూ, రాధాకృష్ణ, కుళ్లాయప్ప, కృష్ణారెడ్డి ఇంగా ముగ్గురు మంత్రివర్గ సభ్యులని, అశ్వత్థరెడ్డి, రామచంద్రారెడ్డి, బాలన్న, లక్ష్మిదేవి ఇంగా ముగ్గురు ప్రతిపక్ష సభ్యులనీ మా హెడ్మాస్టర్ సారూ, నారాయణరెడ్డి సారూ ముందుగానే నిర్ణయించి, యెవురెవురు యేమేమి మాట్లాడల్లనో నేర్పిచ్చినారు.
పీవన్ వొగ బెల్లు కొట్టినాడు. ప్రధానమంత్రి తిప్పన్న ఫ్లోర్ లీడర్‌గా వెంకట సత్యం ప్రతిపక్ష పార్టీ నాయకునిగా స్పీకర్ నాగభూషణాన్నీ, పార్లమెంటుకు గౌరవ అతిథిగా వస్తావుండే హెడ్మాస్టర్ గారినీ ఒగ రూములో నుంచీ పిల్చుకోనొచ్చినారు. వాళ్ళ సభలోకి వస్తానే పార్లమెంటు సభ్యులూ మంత్రులూ అందరూ లేచి నిలబడినారు. స్పీకర్ వెనుక ఇద్దరు బంట్రోతులు తలకాయల మీద రుమాళ్ల మాదిరి టువ్వాళ్లను చుట్టుకుని వొచ్చినారు. వాళ్లను చూసి పిల్లోల్లందరూ నవ్వినారు. డ్రిల్ మాస్టర్ విజిలేస్తానే సభంతా నిశ్శబ్దమయ్యింది.
కొంచెం ఎత్తుగా ఉండే కుర్చీ మీద స్పీకరూ దానికంటే ఎత్తు తక్కువగా వుండే కుర్చీలో గౌరవ అతిథీ కూర్చుండారు. వొగ బంట్రోతు వొచ్చి యేందో వొగ ఫైల్, స్పీకర్ ముందర పెట్టిపోయినాడు. హెడ్మాస్టర్ పక్కనే, ఆయన కంటే కొంచెం ఎత్తుగా వుండే కుర్చీలో కూర్చొని ఫైలును చూస్తా వుండే నాగభూషణాన్ని చూసి మేమందరమూ ఈర్ష్య పడసాగినాం. నాగభూషణం ఎంత అదృష్టవంతుడో అని అనుకుండాం.
స్పీకర్ కూర్చునే, ప్రధానమంత్రిని ప్రభుత్వం చేస్తా వుండే అభివృద్ధి కార్యక్రమాలను గురించి సభకు తెలియజేయాలని కోరినాడు. ప్రధానమంత్రి తిప్పన్న పైకి లేచి, ‘రెస్పెక్టెడ్ స్పీకర్ సార్’ అని అంటా, హైస్కూల్లో జరుగుతా వుండే బిల్డింగ్ నిర్మాణాలను గురించీ, ప్లాట్ఫార్మ్ గురించీ వివరించ సాగినాడు. మధ్యలో ప్రతిపక్ష నాయకుడు జొన్నలగడ్డ వెంకట సత్యం పైకి లేచి, ‘మిస్టర్ స్పీకర్ సార్, ఆ నిర్మాణం చాలా నాసిరకంగా జరుగుతా వుంది. గృహమంత్రి తన బంధువయిన వ్యక్తికి కాంట్రాక్ట్ పనులు అప్పగించి అవినీతికి పాల్పడినాడు. ఆ కాంట్రాక్టర్ని నిర్మాణం పనుల నుండీ తప్పిచ్చవలసిందిగా మేము కోరుతున్నాం’. అని ఇంగా యేందో చెప్పబోయినాడు. అంతలోనే గృహమంత్రి రాధాకృష్ణ పైకి లేచి. ‘స్పీకర్ సార్, గౌరవ సభ్యుడు నిరాధారమైన ఆరోపణచేస్తూ సభను పక్కదోవ పట్టిస్తున్నాడు’ అని ప్రతిపక్ష నాయకుని మాటలను తప్పుపట్ట సాగినాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన మరొగ సభ్యుడు అశ్వత్థరెడ్డి పైకి లేచి ‘అధ్యక్షా, ఇది అసమర్థ ప్రభుత్వం, హైస్కూలులో విద్యార్థులకు కావాల్సిండే వసతులు యావీ కల్పించనే లేదు, నీటి సమస్యను తీరుస్తామని ఇంతవరకు తీర్చనే లేదు’ అని గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయసాగినాడు. మరొగ ప్రతిపక్షపార్టీ సభ్యురాలు లక్ష్మిదేవి పైకి లేచి ‘స్పీకర్ సార్, పాఠశాలలో బాలికలకు అవసరమైన వసతులేవీ కల్పించలేదు. ప్రత్యేకమయిన టాయిలెట్స్’ అని గట్టిగా అడగబోతా వుంటే స్పీకర్, ఆ ప్రతిపక్ష సభ్యురాలుకు మాట్లాడడానికి అవకాశమివ్వలేదు, దాంతో ప్రతిపక్ష సభ్యులందరూ నినాదాలు తీసుకుంటా సభ నుంచి వాకవుట్ అయినారు.
చూస్తా వుండే లోయర్ క్లాస్ విద్యార్థులకు అదంతా వింతగా ఉందేమో నవ్వుతా వుండారు. పది నిమిషాలయిన తర్వాత సభను వాకవుట్ చేసిండే సభ్యులందరూ మల్లా సభలోకొచ్చి కూర్చుండారు. సభ ప్రశాంతంగా జరిగేటట్ల సభ్యులందరూ సహకరించల్లని స్పీకర్ కోరినాడు. ఆనెంక, ‘ఈ రోజు సభా కార్యకలాపాలను ఇంతటితో ముగిస్తా వుండాను. మన సభకు గౌరవ అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, గొప్ప విద్యావేత్త శ్రీ చిత్తరంజన్ దాస్ గారిని, సభ నుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను’ అని అంటానే హెడ్మాస్టర్ సార్ పైకి లేచి, ‘మిస్టర్ స్పీకర్ సార్’ అని స్పీకర్ నాగభూషణం వైపు చూసినాడు. హెడ్మాస్టర్ సార్ తనను ‘సర్’ అన్నెందుకు పొంగిపోతా సిగ్గుతో తల వొంచుకుండాడు స్పీకర్ నాగభూషణం.
హెడ్మాస్టర్ సార్ ‘భారతదేశ అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ పార్లమెంటు, బలమైన ప్రతిపక్షం కారణంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం అయితా వుంది’ అని పదీ పదైదు నిమిషాల సేపు మాట్లాడి, చివర్లో అందర్నీ మెచ్చుకుండాడు. డి.ఇ.వో గారు మాక్ పార్లమెంటుకు గౌరవ అతిథిగా వొచ్చి వుంటే చాలా బాగుండేదని, అఫిషియల్ కార్యక్రమం వున్నందువల్ల ఆయన రాలేకపోయినాడని కొంచెం అసంతృప్తి చెందినాడు. లాంగ్ బెల్ కొడతానే పిల్లోళ్లంతా మాక్ పార్లమెంటును గురించి మాట్లాడుకుంటా ఇండ్లకు వెళ్లిపోయినారు. మేము జతగాళ్లందరమూ స్పీకర్ మా నాగభూషణాన్ని మెచ్చుకుండాం.
మా కుటుంబమంతా వలస పొయ్యేకి ముందు..
పదోతరగతి పరీక్షలు దగ్గరికొచ్చినాయి. ఇంట్లో బువ్వ గింజలు అయిపో వొచ్చినాయి. కాలం యెట్ల గడపల్లనో యేమో అనుకుంటా అమ్మానాయన దిగులు చేయసాగినారు. చెరువు కింద పల్లెల్లోనే కాదు చుట్టుపక్కలుండే పల్లెల్లో ఎక్కడా కూలి పనులు లేవు. తోటా దొడ్డి వుండే రైతులు, గొర్లమందలుండే కురవోళ్లు తప్పా మిగతా బేడి జనమంతా కూటి గింజలు ల్యాక అల్లాడిపోతా వుండారు. బతుకుదెరువు ఉండే చోట్లకు పోదామనుకుంటే జిల్లాలో యెక్కడా పచ్చగుండే ప్రాంతమే లేదని, యెక్కడికి పోయినా బతుకుదెరువే లేదని ఊర్లో బీదోళ్లంతా అనుకోబట్టినారు.
ఇంట్లో అందరూ బాగా తినేవాళ్లే! నలుగురూ వయసుకొస్తా వుండే పిల్లోళ్లం. కడుపునిండా తినల్లంటే వొగొగరికి పావు బియ్యం అన్నం కావల్ల! నాయన ఆకులెత్తుకోని పోతాడనుకుంటే, అమ్మయ్యతో కలుపుకొని ఐదు మందికీ పూటకు వొగటింకాలు శేరు బియ్యం కావల్ల! పయిటాలప్పుడు గంజి తాగి కడుపు నింపుకుందామని అనుకున్న్యా, రెండు పూట్లకు రెండున్నర శేర్ల బియ్యం కావల్ల! నాయన ఆకులమ్మి తెచ్చే బత్తెం గింజలు, రెండు దినాలకు గుడకా సరిపోవడం ల్యా! తడవకు మిగిలే మూడు నాలుగు రుపాయలు ఇంట్లో గబ్బునూనెకూ ఉప్పూ మిరపకాయలకే సరిపోతాండాయి. నెల దినాలు అయితావుంది, ఇంట్లో బ్యాళ్లు పెట్టి పప్పు చెయ్యక! దినామూ చింతకాయ తొక్కో వూరిమిండో, పచ్చికారమో, పండుగారమో తప్పా ఒగపూటన్నా పప్పో పులుసో చేసుకోని తినేకి గతి ల్యాకుండా అయ్యింది.
మా వూర్లో మా వుప్పరోళ్ల సూపన్న చెక్కపని చేస్తా ఉండేవాడు. ఆయప్ప నాకు చిన్నాయన వరుసయితాడు. ఇక్కడ బతుకుదెరువు లేదని, ఆ చిన్నాయనోళ్ల కుటుంబమంతా ప్రొద్దుటూరు దగ్గరుండే సీతంపల్లికి నాలుగేండ్ల కిందటనే చేరుకుంది. ఆ వూరు పెన్నానదికి చాలా దగ్గరగా ఉంటాదంట! దిగువకు పోయినంక పెన్నానదిలో నీళ్లుంటాయంట! కె.సి. కెనాల్ అనే కాలువ వల్ల ప్రొద్దుటూరు దిగవపక్కనుండే పల్లెలన్నీ కళకళలాడుతా వుంటాయని, సీతంపల్లిలో బంధువులంతా వుండారని బతుకుదెరువుకు దిగులుండదని సూపన్న చిన్నాయ నోళ్లు అక్కడ చేరుకుండారంట! వ్యవసాయం పనులు లేనప్పుడు ఎండల కాలంలో రెండు మూడు నెలలు ¹కెసి కెనాల్ పనులుంటాయంట! ఆ ఊరంతా మా ఉప్పరోళ్లేనంట! యెటూ తెలిసినోళ్లు, మా ఊరి జోడోళ్ల సూపన్న ఉండాడు కాబట్టి కూలి పనులకు ఆటికి పోతే బాగుంటాద’ని నాయనా అమ్మయ్యా ఆలోచన చేసినారు.
సూపన్న చిన్నాయనకు మా నాయన అంటే చాలా ఇష్టం. ఆయప్ప కొడుకు ఓబిలేసు, వాళ్లు మా ఊర్లో వున్నెప్పుడు ఊర్లో ఐదోతరగతీ శింగనమల హైస్కూల్లో ఆరో తరగతీ చదువుకుండాడు. వాడు నాకంటే మూడేళ్లు చిన్నోడు. వాడు ఆరో తరగతిలో వున్నెప్పుడే వాళ్ల కుటుంబమంతా సీతంపల్లికి చేరుకుంది. చేరుకున్న్యా, మా ఊర్లో చిన్న పీర్ల్ల పండగప్పుడు ప్రతి సంవత్సరమూ వొచ్చి, పీర్లు యేటికి పోయ్యేనాడు సూపన్న చిన్నాయన పులివేషం వేసి బ్రహ్మాండంగా ఆడుతా ఉంటాడు. మొన్న పీర్ల పండుగకు వొచ్చినప్పుడు, ‘ఊరికే మా సీతంపల్లికి రాండన్నా, లక్షణంగా బతుక్కోవచ్చు’ అని చెప్పినాడంట! అదంతా గుర్తుకు తెచ్చుకొని నాయన సీతంపల్లికి పొయ్యేకి నిర్ణయిచ్చుకుండాడు. పదో తరగతి పరీక్షలు దగ్గర్లో వుండాయని పరీక్షల అయిపోతానే పోదామన్న్యాను నేను. కుటుంబమంతా సీతంపల్లికి పోతే, దున్నపోతుల్ని యెవురు చూసుకుంటారు అని అందరమూ ఆలోచన చేసినాం.
‘మనకు ఈడేమన్నా పెద్దోల్లు సంపాయిచ్చి పెట్టిండే నూరారెకరాల బూములుండాయా, దున్నపోతుల్ని పెట్టుకుండేకి? చెరువుకు నీళ్లు రానబ్బుడూ వొచ్చినా కోరుకో గుత్తకో చేసుకుండేకి రొండు మడికయ్యలు దొరకనబ్బుడూ, ఇంట్లో కూటిగింజలు ల్యాకపోయినా అప్పో సప్పో తెచ్చుకోని పస్తు బండుకోకపోతిమి గానీ పిడికెడు మ్యాత ల్యాక గాటిపాట్న పసులు అగోరిత్తావుంటే యెంతగా పానాలు పిసుక్కుంటిమో గొత్తేగిదా? మనం పస్తు బండుకుండేదే గాకుండా దాండ్లను గుడకా పస్తులుబెట్టి, నోర్లేని ఆ మూగిజీవాల గోడెందుకు మూటగట్టుకోవల్ల! వూరికే, దాండ్లను యెంతకో వొగంతకు, అమ్మి యిత్తగిలిస్తే మేలు గదా!’ అని అమ్మయ్య పుల్ల యిరిసినట్ల చెప్పింది.
‘అరువూ తెరువూ ల్యాకుండా మాట్లాడతా వుండావు. ఈ పొద్దు దాండ్లను దుడ్లకు యిత్తగిల్సి అమ్మితే, రేప్పద్దన కొనల్లంటే యెట్ల?’ అని నాయన రేప్పొద్దున రాబొయ్యే ఇబ్బందిని గురించి మాట్లాడినాడు.
‘నేను అరువూ తెరువూ ల్యాకుండా మాట్లాతాండాన్లే, మల్ల నీకుందా అరువూ తెరువూ? అమ్మి యిత్తగిల్సకుండా, ఇంటందరమూ ఆ సీతంపల్లికి పోతే, మల్ల దున్నపోతుల్ని ఈడెవురు జూత్త్తారనుకుండావు? యెవుర్నన్నా జీతగాన్ని పెట్టల్లనుకుండావా? పసల కోసరం జీతగాన్ని పెట్టుకుండే యోగ్గితుంటే సంసారం ఇట్లెందుకుంటాది? పెద్దోడు రొన్నాల్లు సీతంపల్లిలో వుండి మల్లా సదువుకుండేకి వొత్తాడు గదా, దున్నపోతుల్ని వాడు సూసుకుంటాడ్లే అని అనుకుంటాండావా? చెరువుకు నీళ్ల సుక్కే రానబ్బుడు, వొచ్చినా సేతికింద నాలుగు మడికయ్యలే లేనబ్బుడు ఇంగ ఈ దున్నపోతుల్ని వాని మెడకుగట్టి వాని సదువును యాల పంగదెంగులు లేపుతావు? వూరికే అదంతా మనుసులో బెట్టుకోకుండా యాదో ఒగ రేటుకు దున్నపోతుల్ని అమ్మెయ్’ అని అమ్మయ్య నాయన ఆలోచన్లను తీసిపారేసింది. నాయన సరే అని ఒప్పుకొని, సాములూరోళ్లకు దున్నపోతుల్ని మంచి రేటుకే అమ్మేసినాడు.
సాములూరోళ్ళు దున్నపోతుల్ని తోలుకొని పోతాండారు. ఇంట్లో నుంచీ వెళ్ళిపోతా ఉండే దున్నపోతుల్ని చూసి ప్రాణం తనకలాడింది. మనసంతా వికారంగా మారింది. యెందుకో తెలియకుండా కండ్లల్లో నీళ్లు మెదిలినాయి. అమ్మయ్య గుడకా కంటతడి బెట్టింది. యెవురో రక్తసంబంధముండే వాళ్లు యెళ్లిపోతావున్నెట్లే అనిపిచ్చింది.
***
మా పూర్తీ పరీక్షలు అయిపోయినాయి. కడా పరీక్ష అయిపోతానే, ఉమావతి కనిపిస్తాదేమో వొగమాట చెప్పిపోదామని చూసినాను. ఎక్కడా కనిపిచ్చలేదు. కండ్లు ఆ పక్కా ఈ పక్క చూస్తా వుండాయి. రామలక్ష్మితో బాలన్నా రామచంద్రారెడ్డీ, పార్వతితో అశ్వత్థరెడ్డీ గంగరాజూ ఎర్రెమ్మతో కోనయ్యా, ఓబుళ నారాయణా మాట్లాడతూ పొయ్యొస్తామని చెప్పుతా వుండారు. నాకయితే ఉమావతి కనిపిచ్చలేదని మనసులో యేందో కుచ్చుకోసాగింది. అంతలోనే మా భోగం వెంకటస్వామి పెద్ద నాయన మనవరాలు లక్ష్మిదేవి, దగ్గరకు వొచ్చి ‘ఉమావతి కోసరం వెతుకుతా వుండావా? ఆయమ్మ వెళ్లిపోయిందిలేన్నా?’ అని నన్ను దెప్పిపొడిచింది
‘బాగుండావులే! నేనెందుకు ఉమావతి కోసరం వెదుకులాడుతాను లక్ష్మిదేవీ’ అని నేను కొంచెం గట్టిగా అన్న్యాను.
‘నాకు తెలుసులేన్నా! నువ్వు దాచి పెట్టుకుంటే నాకు తెలీదనుకుండావా? నీ మీద ఇష్టం లేకనే ఉమావతి అట్లుంటుందా?’ అంటూ రాగం తీసింది లక్ష్మిదేవి.
‘యేం మాట్లాడతా ఉండావు లక్ష్మిదేవి? నీకేమి తెలిసింది, నేనేమి దాచిపెట్టుకుండాను? ఇంతకీ ఉమావతి ఏమనింది?’ అని నేను ఉమావతిని గురించి యేమీ తాపత్రయపడని వాని మాదిరిగానే, ఏమనిందో తెలుసుకోవల్లని ఉత్సాహంతో అడిగినాను.
‘ఉమావతి సింగ్ డాక్టర్ వాళ్ల ఇంట్లో ఉండేది నీకు తెలుసు గదా! డాక్టరోళ్ల ఇల్లు మా ఇంటి దగ్గరే! మూడు నాలుగు దినాల కిందట కలిసినప్పుడు ‘ఏమి, మీ అన్నయ్య నారాయణ నాతో మాట్లాడేదే మానేసినాడే?’ అని బాధపడుతూ అడిగింది. యేమయినా వాదులాడుకుండారా? అని అడిగితే అదేమీ లేదనింది. నువ్వన్నా నిజం చెప్పన్నా, మీరిద్దరూ యేమయినా వాదులాడుకుండారా?’ అని గట్టిగా అడిగింది లక్ష్మిదేవి.
‘అదేమీ లేదమ్మా! షావుకార్ల అమ్మాయితో స్నేహం యెందుకని నేనే ఉమావతితో మాట్లాడటం తగ్గిచ్చినాను లక్ష్మిదేవి’ అని నా మనసులో ఉండే అభిప్రాయాన్ని చెప్పినాను.
‘అదీ నిజమే లేన్నా! పైగా వాళ్ల నాయన చెన్నవరం నారాయణరెడ్డి భలే అసాధ్యుడంట! వాళ్ల ఊర్లోనే గాకుండా చుట్టుపక్కలుండే పల్లెల్లో చాలా దౌర్జన్యం చేస్తూ వాళ్ల రెడ్ల దర్పం చూపిస్తా ఉంటాడంట! అంతే గాదన్నా, మన హెడ్మాస్టర్ సార్‌తో, ఏదో విషయంలో కొట్లాడి, అషండా మసూదుతో కలిసి మన సార్ని ఇక్కన్నుంచీ ట్రాన్సిఫర్ చేయిచ్చేకి చూసి చేతగాక గమ్మనుండాడంట! అట్లావాని బిడ్డతో యేమి స్నేహం లే!… శెలవుల్లో శింగనమలకు వొస్తే ఇంటి దగ్గరికి రాన్నా!’ అని చెప్పి వెళ్ళిపోయింది లక్ష్మిదేవి.
నేను హెడ్మాస్టర్ సారోళ్ల ఇంటికి పోయి జయమ్మక్కతో మేము ప్రొద్దుటూరు సీతంపల్లికి పోతా వుండే విషయం చెప్పకుండా కొంచెంసేపు మాట్లాడి ఊరికి బయలుదేరినాను. ‘శెలవుల్లో అప్పుడప్పుడు వొచ్చి పోతావుండు రా నారాయణా! వొగ పది దినాలయినంక వస్తే తిప్పన్న దగ్గరుండే ఎస్.ఎస్.ఎల్.సి. పుస్తకాలన్నీ ఇప్పిస్తాను, తీసుకొని పోయి, శెలవుల్లో ఒక్కొక్క సబ్జెక్టులో మూడు నాలుగు పాఠాలు నేర్చుకుందువు’ అని మా సార్ చెప్పుతానే సంతోషమయింది నాకు. జయమ్మక్క గుడకా ‘శెలవుల్లో వొచ్చి పోతావుండు నారాయణా!’ అని ఆప్యాయంగా చెప్పింది. సరే, తప్పకుండా వొస్తానని చెప్పి పుస్తకాల బ్యాగు తీసుకొని యెల్లవారినాను.
అప్పుడే జతగాళ్లంతా వెళ్ళిపోయినారని బీటి మడికట్లల్లో సీల్దావలో నడుస్తా వుండాను.
యాదో, ఋణానుబంధమేమో! ల్యాకుంటే, సారోళ్లు నన్నెందుకు ఇంత ఆప్యాయంగా కొడుకు మాదిరి చూసుకుంటారు? హెడ్మాస్టర్ సార్ శింగనమలకు రాకుండా వున్నింటే నేను చదువుకుండే వాన్నేనా? జయమ్మక్క తల్లి మాదిరి యెన్నిసార్లు అన్నం పెట్టి ఆకలి తీర్చిందో! ఋణానుబంధం గాకుంటే వీళ్లెవురు నేనెవురు?
అనుకుంటా వుంటే కండ్లల్లో నీళ్లు మెదిలినాయి. యెట్లన్నా గానీ బాగా చదువుకొని ఎసఎసఎల్‌సిలో మంచి మార్కులతో పాసుగావల్ల! అట్లయితేనే సహాయపడతావుండే హెడ్మాస్టర్ సారు సంతోషపడతారు! నాకోసరం కష్టపడతా వుండే అమ్మానాయనోళ్లు గుడకా ఆనందపడతారు. ఎసఎసఎల్‌సి పాసయినంక హెడ్మాష్టర్ సార్ సహాయంతో యాదయినా ఒగ చిన్న ఉద్యోగ మొస్తే అమ్మయ్య కల తీరినట్లే!
అనుకుంటా యేందేందో ఆలోచన చేసుకుంటా ముందుకు నడుస్తా వుండాను. ఆలోచనల్లో లక్ష్మిదేవి చెప్పిండే మాటలు మెదిలినాయి.
నేను సరిగా మాట్లాడనందుకు ఉమావతి నిజంగా బాధపడి లక్ష్మిదేవితో అట్లనిందా? అనకుంటే లక్ష్మిదేవి యెందుకు నాతో చెప్పుతాది! నేను మాట్లాడకుంటే తానెందుకు బాధపడల్ల? నేనంటే ఉమావతికి ఇష్టమా? ఇష్టం ల్యాకుంటే అట్లనదు కదా! తనతో నేను సరిగా మాట్లాడడం లేదనేది కరెక్టే! నేనెందుకు తనతో మాట్లాడలేదో నాకు తెలుసు! ఆమెకెట్ల తెలుస్తాది? ఆమెతో మాట్లాడగూడదని నిర్ణయిచ్చుకున్నెంక, పరీక్షలయిపోతానే మల్లా నేనెందుకు ఆమెతో మాట్లాడేకి ఆరాటపడల్ల? ఆరాటపడతా ఉంటేనే గదా, లక్ష్మిదేవి పసిగట్టి నన్ను దెప్పిపొడిచిండేది! యాల అందని దానికి ఆరాటపడల్ల? ఆమె కోసరం నేను ఆరాటపడేది తెలిస్తే యెవురయినా నగరా? అర్హత తెలుసుకోకుండా ఒగ పెద్ద షావుకారి రెడ్డి బిడ్డను, అంతందంగా ఉండే ఉమావతి స్నేహాన్ని కోరుకోవడానికి నాకయినా సిగ్గుండల్ల గదా! పైగా వాళ్ల నాయన రెడ్ల దర్పముండే దౌర్జన్యం మనిషంట! అదట్లుండనీ! నన్ను ఆదుకుంటా వుండే మా హెడ్మాస్టర్ సార్‌తో కొట్లాడిండేది గాకుండా, ఆయనను ఇక్కన్నుంచీ ట్రాన్స్‌ఫర్ చేయిచ్చేకి పూనుకోనుండే దుర్మార్గుడంట! అట్లావాని బిడ్డతో నేను స్నేహం చేయడమేంది? ఈ విషయం సారుకు తెలిస్తే నా గతి ఏమిటి? లక్ష్మిదేవి జరిగిండే సంగతి చెప్పి మంచిపని చేసింది. ఎట్టి పరిస్థితుల్లో గాని ఉమావతితో ఎక్కువగా మాట్లాడకూడదు అని మనసులో అనుకుంటా ఇల్లు చేరుకుండాను.
మా కుటుంబం ప్రొద్దుటూరు సీతంపల్లికి వలస!
బతుకుదెరువు కోసరం సీతంపల్లికి పొయ్యేకి ఇంటందరమూ నిర్ణయించుకుండాం. రేపే ప్రయాణం. పోతానే దేనికీ ఇబ్బంది పడకుండా, రోంత ‘అణి’ కుదిరేదంకా బత్త్యానికి వుండల్లని, పద్నాలుగు పదైదు శేర్లు బియ్యం మూట గట్టిపెట్టింది అమ్మయ్య. ఉప్పూ మిరపకాయలూ, చింతపండూ ఇంకా కొన్ని దినుసులు సిద్ధం జేసింది. అన్నం వొండుకుండే సిలవరి పాత్రలూ, లోటాలూ, చెంబులూ, పళ్యాలూ, గెంటెలూ, కత్తిపీటా, కత్తీ, చాకూ, సలాకా వొగ గోనిసంచిలో కట్టింది. పరస్థలంలో యెవురినీ అడగడం బాగుండదని పప్పుగిత్తీ, ముద్దగెలికే తెడ్డుకట్టీ, రోకలిబండా, రొట్డెలపెనుమూ, పొయ్యి ఊదే గొట్టమూ, బకీ¡టూ, రెండు డబ్బా పావులూ, నొక్కులు పడిండే ఇత్తలి బిందీ, పొయ్యిలో కట్టెలు కొట్టుకుండేకని కొడవలి, మచ్చుగత్తీ, గొడ్లీ మిగిలిందీ సగిలిందీ పైన యెత్తిపెట్టుకుండేకని ఉట్టీ, మలక పుటకా, సిబ్బీ అట్లాటివన్నీ అమ్మయ్యను అడిగడిగి మేము పిల్లోళ్లందరమూ రెండు సంచుల్లో వేసినాం. అమ్మయ్య గుర్తుకు తెచ్చుకొని ఒక్కాకు చిత్తీ, వక్కాకురోలూ, కట్లపొడి డబ్బా సంచిలో వేసింది.
నావి ఒగ జత బట్టలూ మిగతా వాళ్లవి కట్టుకుండే బట్టలన్నీ వొగ దుప్పట్లో వేసి మూట గట్టినాడు నాయన. ఇంగొగ గోనిసంచిలో పరుచుకుండే గోనిపట్టలూ కప్పుకుండే పాతరగ్గులూ చుట్టిపెట్టి దాండ్ల మధ్యలో రెండు పారలూ, పికాసీ దురికి, గట్టిగా కట్టినాడు. ఇంగ తలదువ్వుకుండే చెక్క దువ్వాన్లూ, ఈరుమాన్లూ, కాటుక డబ్బీ, కుంకుమడబ్బీ, చెంప పిన్నులూ, పిన్నీసులూ కాళ్లలో ముండ్లిరిగితే తీసుకుండే మల్లి ముండ్లూ, పట్టకారా, చిన్న పాప జయమ్మకు పౌడరుడబ్బీ అట్లాటి చిదుగు సామాన్లన్నీ వొగ చెయిసంచిలో యాదీ మరిచిపోకుండా పెట్టింది అమ్మయ్య. నాయనయితే వొగొగటి గుర్తుకు తెచ్చుకుంటా, రెండు తాళ్లూ, చేంతాడూ, గ్లాసులేని కిరసనాయిలు బుడ్డీ, లాటినూ, గబ్బునూనె పోయిచ్చుకోనొచ్చేకి వొగ ఖాళీ సీసా, తలకాయలకు పూసుకుండే సమురూ (ఆముదం నూనె) కొబ్బర్నూనె తెచ్చుకుండే రెండు సన్న సీసాలూ, మంచి నూనె కోసsŸం వొగ£సీసా, అన్నీ యÖరియా సంచిలో వేసి మూటగట్టినాడు. రెండు ఈత చాపలూ, రెండు సిరి చాపలూ చుట్టజుట్టి కట్టగట్టినాడు.
నేను సీతంపల్లి నుంచి తిరిగి వొచ్చినంక నాకు వొగ రెన్నెళ్లకు కావల్సినన్ని బత్త్యెంగింజలూ, కాసింత చిట్లంపొడి పోసిండే గాజుసీసా, ముడి చింతొక్కు పెట్టిండే రాచ్చిప్పా, రోంత మిరప్పొడీ పసుప్పొడీ నావి రెండు జతల బట్టలు, పరుచుకుండే గోనిపట్టా రాగి సరుగు తలదిండూ, వొగ కుండా మూకటీ, వొగ చెంబూ, లోటా పళ్లెమూ, గూట్లో వొగ దువ్వానీ, సన్న సమురు సీసా, దేవరమూలలో నా పుస్తకాల బ్యాగ్గూ పైన గోడమీద సీతారాముల పటమూ ఇవి తప్ప మొత్తం మా ఇంట్లో ఉండే ఆస్తినంతా సీతంపల్లికి తీసుకొని పోయ్యేకి మూటలు గట్టిపెట్టినాం. ఇంగ రేప్పొద్దున్నే ప్రయాణం.
రెండు వారాల కిందటే జోడోళ్ల పెద్ద ఓబన్నతో అడ్రస్ ఇప్పిచ్చుకొని సీతంపల్లి సూపన్నకు జాబు రాసినాం. అక్కన్నుంచీ బదులు జాబు వొచ్చింది. తాడిపత్రి బస్సెక్కి తాడిపత్రిలో దిగి, ఆట్నుంచీ ప్రొద్దుటూరు బస్సెక్కి, ప్రొద్దుటూరులో దిగి, వొగ ఒంటెద్దు బండి మాట్లాడుకొని నేరుగా సీతంపల్లికి రమ్మని మీరొచ్చేలోగా ఖాళీగా ఉండే వొగ ఇండ్లు మాట్లాడుతానని సూపన్న చిన్నాయన బదులు రాసినాడు. దాంతో ఆటికి పోతానే గూటికేం పర్వాలేదనుకొని ఊపిరిపీల్చుకుండాడు నాయన.
పొద్దున్నే లేచి అమ్మిడి పొద్దుకల్లా రెండు పూట్లకు అయ్యేటంత బువ్వ వొండింది అమ్మయ్య. ఊరిమిండి నూరింది పెద్దక్క. రోంత గుగ్గిళ్లచారు చేసింది జేజి.
అందరమూ అమ్మిడి పొద్దు బువ్వతిన్న్యాం. బయలుదేరేముందు అందరమూ ఇంటి ముందర కూర్చుండాం. చిన్నాయనా, జేజీ పక్కనొచ్చి కూర్చుండారు.
‘పిల్లోడు రెండు మూడు వారాలయినెంక తిరిగొత్తాడప్పా! వొచ్చినంక వొగ సమ్మచ్చరం పాటు వానికి అండా దండా మీరే! మీరుండారనే దయిర్నెంతోనే వాడు ఈడే వుంటాడు. బతికే దారి లేనబ్బుడు యీడే ఉంటే పిల్లోల్లంతా కడుపు నిండా తిండి ల్యాక పస్త్తులుండల్సిందే! కండ్ల మందర పిల్లోల్లంతా పిడికెడు మెతుకుల కోసరం అగోరిత్తావుంటే యెన్నాల్లని సూసే దప్పా! ఈడ కూలి దొరికితేనే కుండగాలేది! కనిట్టం వారానికి రెండు మూడు దినాలన్నా ఈడే కూలి దొరికేతట్లుంటే కాల్లీడ్సుకుంటా తల్లులు పిల్లలంతా దేశాలు బట్టి పోయ్యే గాశార ముండేది గాదు’ అంటా అమ్మయ్య కన్నీళ్లు పెట్టింది. అమ్మయ్య యేడుస్తా వుంటే కడుపులో నుంచీ యేదో తెలియని దుఃఖం పొంగి వొచ్చింది. కారుతా ఉండే కన్నీళ్లను ఆపుకోల్యాక పోయినాను. ఏడుస్తా ఉండే నన్నూ అమ్మయ్యనూ చూసి పిల్లోళ్లలందరూ కన్నీళ్లు కార్చబట్టినారు.
చిన్నాయన నన్ను దగ్గరికి తీసుకొని నా తలకాయను తన తొడల మీదికి వొంచుకొని తలనిమురుతా ‘యాలేడుస్తార్లే వొదినా? మనం యేందన్నా ఈడ బూడ్సు కుండామా? బతుకుదెరువు యాడుంటే ఆటికి బోయి బతక్క తప్పదు గదా! యాదీ గతిలేని ఈడుండి, కడుపు కూటి కోసరం అంగలార్సే బదులు అందురూ బతుకుదెరువు ఉండే సోటికి పోతాండారు. యేం పర్వాలేదు పదండి! అన్నిటికీ ఆ దేవుడుండాడు? వీన్ని తొందరగా పంపిచ్చండి, మా ఇంట్లో కలిగిండేది తిని, పోయి సదువుకుంటాడు! నువ్వేమీ దిగులు పడద్దురా!’ అని నన్ను బుజ్జగిస్తా ధైర్యం చెప్పినాడు చిన్నాయన. ఆడపిల్లోల్లందరినీ దగ్గరికి పిల్చుకొని అందరినీ కరుసుకొని యేడ్చింది జేజి. యానాడూ కన్నీళ్లు కార్చని జేజి, మవునంగా ఏడుస్తా వుంటే మళ్లా అందరూ ఏడ్చబట్టినారు. ఏందో తెలియని బంధాలు గుంజులాడుకోసాగినాయి. అదంతా చూస్తా ‘యాల తీరా బయల్దేరే ముందర ఏడుత్తారు? మళ్లా రాకుండా పోతామా? మన మొగరమేనా దేశాలు పట్టి పోతాండేది? అబ్బుడే ఆ బోయోల్లు కొంతమందీ వొడ్డోల్లు కొంతమందీ వాల్ల వాల్ల గతికొద్దీ యెల్లిపోయినారు గదా? బుడ్డప్పోల్ల బస్సుకు టయిమయితాది. యెల్లవారండి’ అంటా నాయన బరువుండే మూటని ఎత్తుకుండాడు. అందరూ తలా వొగ మూట నెత్తి మీద పెట్టుకుండారు. అమ్మయ్య తలవాకిలికి మొక్కుకోని ఇంటికి బీగమేసి వొగ సన్నమూటనెత్తుకోని పాపను సంకలో యేసుకుంది. చిన్నోడు పెద్దన్న గుడకా వొగ చెయి సంచి పట్టుకుండాడు.
అందరమూ బయలుదేరినాం. చాకల చౌడక్కా, జోడోళ్ల నాగమ్మ పెద్దమ్మా ఇంకా ఐదారు మంది ఇరుగు పొరుగోళ్లు మమ్మల్ని పలకరిస్తా మేము కూలి కోసరం కడుపు కూటి కోసరం దేశాంతరం పోతావుండామని బాధపడినారు. చాకల చౌడక్క ఏడుస్తా దగ్గరకు వొచ్చి పెద్దన్న చంపలు నిమిరి ‘పాపం పసిబిల్లోడు, యేమి గాశారమో యేమో!.. జాగర్త బూసీ! తొందరగా తిరుక్కోని రాండి బంగారూ! పిల్లోల్లు బద్రం కేశమ్మా’ అని అంటా వుంటే తలకాయలొంచుకోని కన్నీళ్లు తుడుచుకుంటా వొగరెనక వొగరు నడుస్తా అడిగినోళ్లందరికీ చెప్పుకుంటా రోడ్లోకి చేరుకుండాం. ఆనెంక రోంత సేపటికే బస్సొచ్చింది అందరమూ ఎక్కినంక బస్సు కదలింది. అందరికీ సీట్లు దొరికినాయి.
బస్సు స్పీడ్‌గా పోతావుంది. నేను కిటికీ దగ్గర కూర్చొని పొలాల పక్కన చూస్తూ వుండాను. నాకూ నాయనకూ మధ్యలో కూర్చోనుండే తమ్ముడు కిటికీ దగ్గరే కూర్చోవల్లని వొగటే పట్టుపట్టినాడు. వాన్ని ముందు సీట్లో ఉండే అమ్మయ్య దగ్గరికి పంపిచ్చి, ఆలోచన చేయసాగినాను.
..ఇప్పుడు కన్నీళ్లు రాలేదు. ఇల్లు వదిలే వరకే బాధ. ఇప్పుడు బాధ పక్కకు పోయింది. సీతంపల్లిలో బతుకు ఎట్లుంటుందో అనేది ఆలోచన! యెట్లుండినా ధైర్యంగా వుండల్ల! మనుషులు యెవురూ లేని అడవిలోకి పోవడం లేదు గదా! తెల్లోడు వ్యాపారం చేసి బాగా బతకల్లని, భయంకరమైన సముద్రంలో వొగ సన్న వోడలో ఎన్నో దినాలు ప్రయాణం చేసి ఇండియాకొచ్చినాడంట! బండమీద పల్లెకు ప్రొద్దుటూరు వేల మైళ్ళ దూరంలో లేదు. సీతంపల్లి కొత్త ఊరైనా, ఆడ తెలిసినోళ్ళుండారు గదా! కూలిపనులు చేసుకుంటా వుంటే అందరూ పరిచయం అయినే అయితారు! యాల భయపడల్ల?
ఆలోచిస్తా ధైర్యం తెచ్చుకుండాను. అంతలోనే ‘ముచ్చుకోట’ కనుమ వొచ్చింది. ఆ కనుమలో ద్యాదారాకు (దేవదారాకు) పీక్కొని పోయిండేû సంగతి కండ్లముందర మెదిలింది. కనుమను చూస్తావుండాను. చాలా పెద్ద కనుమే! దాన్ని గురించి నాయనను అడిగినాను. మడ్డిపల్లి దగ్గర్నుంచీ ముచ్చుకోటా, కడవకొల్లు దంకా తూర్పు పడమరగా సుమారుగా ఏడెనిమిది మైళ్ళు, ఉత్తర దక్షిణంగా పెన్నానది పక్కనుండే ‘చిక్కేపల్లి’ దగ్గర నుంచీ ఓబుళాపురం దంకా, సుమారు ఇరవై మైళ్ళు అంతా అడవే అని చెప్పినాడు నాయన. దీనికంటే బుక్కపట్నం అనగొండపాళెం అడవి జిల్లాలోనే పెద్దదని, ముచ్చుకోట కనుమ అడవి రెండోదని కూడా చెప్పినాడు. అడవి పెద్దగానే వుంది గానీ మా ఊరి దగ్గరుండే బాటమాన్ల మాదిరి వొగ మానూ కనిపిచ్చలేదు. అన్నీ నార్యాప చెట్లూ తురక్యాప చెట్లూ ద్యాదారాకు చెట్లూ రకరకాల కంప చెట్లూ అట్లాటివే! అంతా అదొక రకమైన బండన్యాల! ఇట్లా న్యాలలో యా చెట్లు పెరుగుతాయి అని అనుకుంటా వుండంగనే కనుమ దిగింది బస్సు. దిగుతానే ఊరు! ఊరు పేరు ‘ముచ్చుకోట’ అని చెప్పినాడు నాయన.
ముచ్చు అంటే దొంగ అని అర్థమంట! అందుకే ‘ముచ్చునాయలా!’ అని అంటారంట! ముచ్చులుండే కోట ‘ముచ్చుకోట’ అని నాకు అర్థమయింది. నాయన ఇంగా చెప్పుతా రాత్రిపూట ఈ రోడ్లో వొంటరిగా మనిషిగానీ బండిగానీ రావల్లంటే భయపడతారని, చాలాసార్లు వొంటిగా వొచ్చే ఎద్దుల బండ్లనూ, లారీలనూ, కార్లనూ అటకాయిచ్చి వాళ్ళ దగ్గరుండేదంతా దొంగలు దోచుకొని పోయినారని నాయన అంటా వుంటే నేను రోంత జడుసుకుండాను. ముచ్చుకోట ప్రాంతంలో ఎంత లోతు తొగినా బావుల్లో నీళ్ళు సరిగా వుండవని, బావుల్లో నీళ్లు చేదుకోనొచ్చేకి వొగ మనిషి మోసే అంత చేత్తాడు (చెంతాడు) కావల్లని, అందుకే ఈ ప్రాంతం పల్లెలకు యెవురూ ఆడపిల్లను ఇయ్యరని నాయన చెపుతా వుంటే విని ఆశ్చర్యపోతా, రోడ్డుకు రెండు పక్కల ఉండే పొలాలను చూడసాగినాను. అన్నీ అద్భుతమైన నల్లరేగడ భూములు! తెల్లజొన్నా ధనియాలు తెల్లకుసుములూ పొగాకు అట్లాటి పంటలు బాగా పండుతాయని వానకాలం వెళ్ళిపోయేముందు వొగ పదును వాన పడితే చాలు, ఆ పంటలు పండుతాయని, అందుకే రేగడి పల్లెల్లో పెద్దగా కరువు వుండదని నాయన వివరంగా చెప్పుతా వుంటే అంతా విన్న్యాను. అంతలోనే తాడిపత్రి వొచ్చింది.
అందరమూ బస్సు దిగుతానే ప్రొద్దుటూరు బస్సు రెడీగా ఉండడంతో సామాన్లన్నీ తీసుకుని గబగబా ఆ బస్సెక్కి కూర్చుండాం. నేను ముచ్చుకోట కనుమ దాటి తూర్పుకు పోయిండేది అదే మొదటిసారి. తాడిపత్రి టౌన్ మధ్యలో బస్సు పోతావుంటే టౌనంతా చూడసాగినాను. ఊరి బయటకు పోయినంక బస్సు ఉత్తరం పక్క తిరిగింది. తూర్పుకు పోయే రోడ్డు కొండాపురం, ముద్దనూరు, యర్రగుంట్ల, కమలాపురం మీద కడపకు పోతాదని నాయన చెబుతా వుంటే అంతా వింటా చూస్తా వుండాను. అంతలోనే పెద్ద యేరొచ్చింది. ఇదే పెన్నానది అని నాయన చెప్పినాడు. ఇక్కడ పెన్నానది తూర్పు ముఖంగా ఉంది. పెన్నా నది అంటానే కణకల్లుకు మడకలు దున్నేకి పోయినప్పుడు చోళసముద్రం దాటినంక చూసిండే పెన్నానది గుర్తుకొచ్చింది. అక్కడ దక్షిణం నుంచి ఉత్తరం దిక్కుకు పోతా వుండే పెన్నానది ఎక్కడ తూర్పుకు మళ్ళిందో తెలుసుకోవల్లని అనుకుండాను. యేరు దాటుతానే ఇది ‘చుక్కలూరు’కు పోయేరోడ్డు అని యింగారోంత ముందుకు పోయినంక ఇది ‘యాడికి’కి పోతాదని అట్లే ముందుకు పోయి ఎడమపక్క తిరిగితే రాయలచెరువు, తొండపాడు మీద గుత్తికి పోతాదని వివరంగా చెప్పినాడు నాయన. ఆ ఊర్లన్నీ నాయన తమలపాకులు కొనుక్కొని వొచ్చే ఊర్లని అర్థమయింది నాకు.
వింత వింత రాతి పొరలు-బెలుం గనులు!
మా బస్సు రోంత ముందుకు పోయి గుట్టలెక్కింది. అట్లే రోంత ముందుకు పోయినంక బెలుం బండల తుండ్లన్నీ రాశులు రాశులుగా పోసిండేది చూచి ఆశ్చర్యపోతా నాయనను అడిగినాను. అవన్నీ బెలుం గనులంట! వోర్నాయనో! వొగొగ గని యెకరాలెకరాల బావిలో వుంది! పైనుండే నల్లమట్టిని ఐదారడుగుల లోతు తీస్తానే పొరలు పొరలు నల్లబండ! ఆ బండను మైసూరు పాకును శాకతో కోసినట్లు కోసుకుంటా పోయినారు. అర్ద యించి మందం పొరలు ముక్కాలించి, వొగించి, వొగటిన్నర యించి, రెండించులు మూడు నాలుగు ఐదు ఆరు కడాకు అడుగుమందముండే బెలుం పొరలు! దోస వొప్పుల్ని చీల్చినట్లు చీల్చి బండల్ని సైజు వారీగా బేర్లు బేర్లు పెట్టినారు. వొగొగ బెలుం గని లోతు నూరడుగులకు పైనే వుంటాదంట! అంత లోతులో ఉండే బండల్ని ట్రాక్టర్లతో లారీలతో పైకి తెచ్చేకి అడుగువరకు జాడలు వేసుకుండారంట!
అవన్నీ నేను నోరెళ్లబెట్టి బస్సులో నుంచీ చూస్తా వుండాను. నాకయితే బస్సు దిగి ఆ గనుల్లోకి పోయి, బెలుం పొరల్ని పైకి లేపుకుంటా యెట్లా బయటికి తీస్తా వుండారో చూడల్లనిపిచ్చింది. వొగొగ గని పక్కన రాశులు రాశులు పోసిండే బెలుం బండల వడకలు మన్ను మశానమంతా కొండల మాదిరి కనిపిస్తాంటే నాకు మాటలు రాలేదు. ఆ ప్రాంతంలో భూముల అడుగులో అంతా బెలుం రాయేనంట! భూములుండే రైతులందరూ బెలుం గనులు ఉండే వాళ్లేనంట! గుట్టలూ, కొండలూ అన్నీ బెలుం బండలుండే గనులేనంట! ఈపక్క పల్లెల్లో దగ్గరుండే టౌన్లల్లో ప్రతి ఇల్లూ ప్రతి కొట్టమూ ప్రతి గుడిసీ గోడలన్నీ, ఇటుక పెల్లలు పేర్చి కట్టినట్లు సైజువారిగా బెలుం బండల తుండ్లను వరుసగా పేర్చి కట్టినారు. గోడల్ని లోపల పక్క మాత్రమే గారతో మెత్తుకుండారు.
ఎంత ఆశ్చర్యమో! మా ప్రాంతంలో వుండే రాయివంటి రాయి ఎక్కడా కనిపిచ్చలేదు. ఇక్కడ వుండే జనం ఎంత అదృష్టవంతులు! వాన రాలేదనీ పంటలు పండలేదనీ యెవురికీ దిగులే ఉండదేమో! ఈ గనుల్లో పనులు చేసే వాళ్లకు అనుభవం ఉండల్లని నాయన చెప్పింది నిజమనుకుంటా పల్లెల్ని చూడసాగినాను. అంకిరెడ్డిపల్లి, కనకాద్రిపల్లి, ఇటిక్యాల దగ్గర కనుచూపుమేరా అన్నీ బెలుం గనులే! ఆ గనుల్లో నుంచి కూలోల్లు బయటికి తెచ్చి పోసిండే మన్నూ మశానమూ బెలుం బండల తుంటలు రాశులు రాశులుగా కొండల మాదిరి కనిపిస్తా ఉండాయి. అదంతా కూల్లోల్లు పాపం ఎన్నేండ్ల నుంచీ గనుల్లో నుంచీ తెచ్చిపోసినారో అని అనుకుంటా వుంటే బస్సు తూర్పుకు తిరిగింది. ఆ క్రాసింగ్ పక్కనుండే ఊరి పేరు ‘కొలిమిగుండల్ల్’ అని చెప్పినాడు నాయన. అక్కడనుంచీ బెలుం గనులు లేవు. అంతా బల్లపరుపు రేగడి న్యాలలు! ఎక్కడే గానీ రేగడి చేన్లలో రాళ్లే కనిపిచ్చలేదు. ఎంత నల్లగుండాయో భూములు! జొన్న, పప్పుశనగ, ధనియాలూ, తెల్లకుసుముల పంటలు బ్రహ్మాండంగా పండుతాయేమో! పొలాల పక్క ఆసక్తిగా చూస్తా వుండాను. ఒద్దిరాల, ధనవాడ కమ్మలవారిపల్లి దాటినంక ఇంగ ఇక్కన్నుంచీ జమ్మలమడుగు అవతలదంకా బ్రహ్మాండంగా పొగాకు పండిస్తారు, చేన్లలో కట్టెలకు యాలాడేసిండే మట్టలన్నీ పొగాకు మట్టలు, ఆ పక్క చేన్లల్లో బర్రల మాదిరి కనిపిచ్చేవి పొగాకు చెట్లు, ఆ బర్రలన్నీ కోసి, నుసి జేస్తారు, ఆ నుసే ‘కట్లపొడి’ అని నాయన చెపుతా వుంటే వింటా ఆసక్తిగా చూడసాగినాను. అదంతా దాటినంక యాదో టౌనొచ్చింది. అది జమ్మలమడుగు అని చెప్పినాడు నాయన.
జమ్మలమడుగు బస్టాండుకు చేరుకుంది బస్సు. ఇక్కడ బస్సు చాలా సేపు ఆగుతుందని కండక్టర్ చెప్పడంతో మేము అందరమూ బస్సు దిగి ఎదురుగా ఉండే వేపచెట్టు కిందికి పోయినాం. ఎండ దంచుతా ఉంది. ఎక్కడెక్కడికో పోయే ప్రయాణికులు చెట్టు నీడలో కట్టమీద కూర్చొని బస్సుల కోసరం ఎదురు చూస్తా ఉండారు. మేము కట్ట అవతల పక్కకు పోయి, వెంట తెచ్చుకోనుండే సద్ది బువ్వ తినేకి కూర్చుండాం. నేనూ, నాయనా చెంబులు తీసుకొని పక్కనుండే సందులో వొగ ఇంటికాడికి పోయి మంచినీళ్లు అడిగినాం. ఇంట్లో వాళ్లు మమ్మల్ని గురించి అడిగి, చెంబుల నిండా చల్లని నీళ్లు పోసినారు. బస్సుకు టైం అయితాదని తెచ్చుకోనుండే సద్ది బువ్వ తలాకింత సర్దుకొని తిని నీళ్లు తాగినాం. నీళ్లు భలే కమ్మగా ఉండాయని నాయనను అడిగినాను. పెన్నా నీళ్ళని, జమ్మలమడుగు పక్కనే పెన్నానది పోతాదని వీళ్ళకు తాగే నీళ్లకు కొదవే ఉండదని నాయన చెప్పుతా ఉంటే పెన్నానదిని చూడల్లనిపిచ్చింది నాకు.
బస్సు హార్న్ కొట్టడంతో సద్ది బట్టలూ చెంబులూ తీసుకొనిపోయి బిరబిరా బస్సె క్కినాం. బస్సు రద్దీగా ఉంది. జనమంతా అదొగ£ రకమైన యాసతో మాట్లాడతా వుండారు. కదిలే బస్సు పక్కన్నే వొగ మనిషి నడుస్తా మా పక్కనుండే మనిషిని చూస్తా ‘జాగర్తగా పోబ్బీ సుబ్బాడ్డీ! మీ అబ్బతో చెప్పు నేను బేత్సారం వత్సానని’ అంటా చేయి వూపసాగినాడు. ఆ మనిషి తెల్లని ఖద్దరు బట్టలు తొడుక్కొని చూసేకి భలే తోజుగా వుండాడు గానీ యెంత మొరటుగా మాట్లాడుతా వుండాడనుకుంటా నాయనను అడిగినాను. తాడిపత్రి దాటొస్తానే భాష మారిపోతాదని మన మాటలు వీళ్లకు మొరటుగా ఉంటాయని నాయన చెప్పడంతో నాకు అర్థమయింది.
బస్సు జమ్మలమడుగు నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు వైపు పోతావుంది. రోడ్డుకు రెండు వైపులా పొలాలను ఆసక్తిగా గమనిస్తా వుండాను. అద్భుతమైన రేగడి నేలలు. నేనింతకు ముందు నాయన వెంట రేగడి కొత్తూరుకు పోయినప్పుడు, కణేకల్లుకు మడకలు దున్నే దానికి పోయినప్పుడు కొద్దికొద్దిగా రేగడి భూములు చూసినాను. ఈ పొద్దు వొచ్చేటప్పుడు ముచ్చుకోట కనుమ దగ్గర నుంచీ రేగడి పొలాలను గమనిచ్చినాను. ఆ భూములన్నిటికంటే జమ్మలమడుగు దగ్గర నుంచి వుండే నల్లరేగడి అద్భుతంగా వుంది. ఇక్కడి నుంచి కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ దంకా వుండే రేగడి అప్ప్పుటమయిన రేగడి అని, ఎకరాకు తొమ్మిది పదిమూటలు పప్పుశెనగలు అయితాయని, మన జిల్లాలో ఉరవకొండ గుంతకల్లు ప్రాంతాల రేగట్లో శెనగపంట తప్పిపోయినా ఈ ప్రాంతంలో పంట తప్పిపోదని దానికి కారణం నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చే తుఫాన్లు ఇక్కడ బాగా పడతాయని అనంతపురం జిల్లాకు వొచ్చే లోపల తుఫాన్లు తేలిపోతాయని నాయన చెప్పుతా వుంటే ఆశ్చర్యపోయినాను. ఈ ప్రాంతాలన్నీ నాయన ఎప్పుడు చూసినాడోనని ఆలోచిస్తా వుండంగానే ప్రొద్దుటూరొచ్చింది. ఊరి బయటకు కనిపిస్తావుండే గుడి గోపురాన్ని చూసి నాయనను అడిగినాను. అది అమ్మవారిశాల గోపురమని, ప్రొద్దుటూరు అమ్మవారి దేవాలయం చాలా ప్రసిద్ధమయిందని చెప్పినాడు.
ప్రొద్దుటూరు బస్టాండ్‌లో బస్సు దిగి సీతంపల్లి ఎక్కడో తెలుసుకున్నాడు నాయన. సూపన్న చిన్నాయన వొచ్చినాడేమోనని అక్కడా ఇక్కడా చూసినాం. ఎక్కడా కనిపిచ్చలేదు. పొద్దు వాటాలినా మనం రాలేదని, వొచ్చి ఎదురుచూసి, వెళ్లిపోయినాడేమో అనుకొని ప్రొద్దుటూరు నుంచీ సీతంపల్లికి ఎంత దూరమో పల్లెటూరోల్లను అడిగినాం. ఐదారు మైళ్ల దూరమని తెలుసుకొని, చిన్నోడు పెద్దన్న నడచలేడని వొగ ఒంటెద్దు బండిని పిలిచినాం. బండి మనిషి, బాడుగ పది రూపాయలు ఇస్తే వొస్తానన్న్యాడు. మేమందరమూ నోరెళ్ల బెట్టినాం మన బండమీదపల్లె నుంచి పన్నెండు మైళ్ల దూరముండే అనంతపురానికి బండి బాడుగ నాలుగు రుపాయలేనని, ఈడ ఆరుమైళ్ల దూరముండే సీతంపల్లికి వొంటెద్దు బండి బాడుగ పది రుపాయలా అని ఆశ్చర్యపోతా, పల్నెటూరోళ్లను చూస్తే టౌను నాయళ్లకు చాలా సన్నసూపని అనుకుంటా అందరమూ మదిచ్చుకొని, ఐదు రుపాయలు ఇస్తామన్న్యాం. ఆ బండి మనిషి ఎగతాలిగా చూస్తా వెళ్లిపోయినాడు. మనకు మించిన పనా ఇది అనుకుంటా, తలాకొగ మూట నెత్తిమీదెత్తుకొని, చిన్నచిన్న సంచుల్ని భుజం మీదొగరూ, సంకలో వొగరూ చేతులతో వొగరూ అట్ల అన్నీ ఎత్తుకొని మైదుకూరు రోడ్డు పట్టుకొని టౌన్లో నడుస్తా వుండాం. బజార్లో దొబ్బుడు బండ్ల మీద పెట్టుకొని అమ్ముతా వుండే పండ్లపక్క పిల్లోళ్లు ఆశగా చూస్తా వుండారు. రోంత ముందుకు పోయినంక వొగ లడ్డంగట్లో కనిపిస్తా వుండే లడ్డూ, జిలేబీ, మైసూర్ పాకూ, కారాలూ బూందీల పక్క చూస్తా తమ్ముడు నోరు చప్పరిస్తా వుండాడు.
అదేమీ పట్టిచ్చుకోకుండా నాయన ముందుకు పోతా వుండాడు. నా మనసు నిండా ఎందుకో చెప్పలేనంత బాధ! అందరూ నోరు విప్పకుండా ముందుకు పోతావుండారు. మైదుకూరు రోడ్లో రెండు మైళ్ల దూరం పోయినంక సీతంపల్లి రస్తాలోకి తిరిగినాం.
రోంత ముందుకు పోతానే అంతా మాగాణి. వానకారు పంటబెట్టి, కోసినారు. మడికయ్యల్లో జానెడెత్తు వరికొయ్యలు. దాండ్లను చూస్తానే మా ఊరి మళ్లల్లోని వరి కొయ్యలు గుర్తుకొచ్చినాయి. మా ఊరి మళ్లల్లో వరి కొయ్యలు ఇట్లుంటే, మా ఎరువు దిబ్బను బ్రహ్మాండంగా పెంచుకుండే వాళ్లం అని అనుకుంటా నడుస్తా వుండాను. రస్తా ఏమీ బాగలేదు. తమ్ముడు గతుకుల రస్తాలో నడిచేకి అవస్తపడతా వుండాడు. చెల్లెలు వెంకటలక్ష్మి నెత్తిమీద మూట బరువైందేమో రోంత ఇబ్బంది పడతా వుంది.
దగ్గర్లో ఊరు కనిపిస్తా వుంటే అదే సీతంపల్లి అనుకొని మనసు రోంత తేలికపడింది. ఊరి మొగదాల వొగ మనిషిని అడిగినాం. ఇది తాళ్లమాపురం, ఆడ కనిపిచ్చేది సగిలిగుడ్డుపల్లి అబ్బీ! అది దాట్నాక సీతంపల్లె! దగ్గర్నే పోండి అని ఆ మనిషి చెప్పినాడు. ఇదే సీతంపల్లి అను కొని సంతోషపడతా వుండే పిల్లోళ్లందరూ మొగాలు జాలేసుకుని నడుస్తా వుండారు. పిల్లోళ్లంతా ఏడ్చేదొగటే తక్కువ. తమ్ముడు నడిచేకి చేతకాక కన్నీళ్లు పెట్టినాడు.
ఎండ ఇంగా పొగలు గక్కుతా వుంది. బండి జాడలో నల్లరేగడి న్యాల, పొయ్యిలో వుండే బూడిద మాదిరి విపరీతంగా కాల్తా వుంది. కాలేకాలే ఆ బూడిద న్యాలలో నడుస్తా వుంటే పాదాలు దిగబడతా వుండాయి. బీటిపొలాల్లో నుంచీ వడగాలి! తాడిపత్రి దాటినప్పటి నుంచే వుడక! చెమటతో పయిమీదుండే గుడ్డలు అందరివీ తడిసిపోయినాయి. తమ్ముడు పెద్దన్నగాడు పైన ఎండవేడికీì కింద రేగడి దుమ్ము వేడికీì తట్టుకోలేక ఏడ్చబట్టినాడు. నేను వాని బాధను చూల్లేక వొగ భుజం మీదికి ఎత్తుకుండాను.
అందరమూ చెమటలు గార్చుకుంటా ఎండకు వొగిరిచ్చుకుంటా సగిలిగుడ్డుపల్లి దాటుకొని కడాకు సీతంపల్లికి చేరుకొని ఊరి బయటనే రస్తా పక్కనుండే వొగ చెట్టు కింద బండల మీద కూర్చుండాం. సూపన్న యాడుండాడో కలుసుకోనొస్తానని ఊర్లోకి పోతా వుండంగనే సూపన్న చిన్నాయనే యెదురొచ్చినాడు. ‘పయిటాలదంకా ప్రొద్దుటూరు బస్టాండు కాడనే కాసుకొని కాసుకొని ఇంగ రారేమోనని యెల్లవారొస్తినన్నా! మీకోసరమే వొగ వొంటెద్దు బండిని మనోల్లదే మాట్లాడి పెట్న్యా! యాల యింత లేటు జేసినారు?’ అని అడుగుతా అందర్నీ రాముల గుడికి వెనక పక్కనుండే వొగ కొట్టం ఇంటికి పిల్చుకొని పోయినాడు. కొట్టమింట్లో లోపల చల్లగా వుంది. కిందంతా న్యాల మా ఇంట్లో మాదిరే ప్యాడతో అలికినారు.
గబగబా సామాన్లన్నీ దించి, రోంతసేపు యేమీ వొద్దన్నెట్ల అందరూ న్యాల మీద కూలబడినారు. ఇంతలోనే సూపన్న చిన్నాయన, ఇంటి కాట్నుంచీ నీళ్ల కడవా, చెంబూ, రెండు గ్లాసులూ తెప్పిచ్చినాడు. తెచ్చిన పిల్లోడు సూపన్న పెద్ద కొడుకు ఓబిలేసు. దప్పికతో అందరూ ఆయాసపడతా నీళ్లు తాగినారు. పాపం సూపన్న చిన్నాయన, మేము పయిటాల కల్లా సీతంపల్లికి చేరుకుంటామని అన్నమూ, పప్పూ చేయిచ్చినాడంట! మేము ఆకలితో వుండామని తెలుసుకొని అందర్నీ ఇంటికి పిల్చినాడు. అందరమూ ఇంటి బయటుండే తొట్టికాటికి పోయి చన్నీళ్లతో కాళ్లూ మొగాలూ కడుక్కుంటావుంటే ప్రాణానికి ఎంత హాయిగా వుందో!
పిన్నమ్మ అందరినీ ప్రేమగా పలకరిచ్చి కొసిరి కొసిరి అందరికీ అన్నం పెట్టింది. అందరమూ కడుపునిండా తిన్న్యాం. అన్నం మా ఊరి దగ్గరున్నెట్లు లేదు. అన్నం మెతుకులు చాలా లావుగా వుండాయి. అయితే అన్నం చాలా రుచిగా వుంది. ఇవి ఏమి బియ్యమో, వడ్ల పేరేమిటో తెలుసుకోవల్లని అనుకుంటా అన్నం తిన్న్యాను. రోంతసేపు వాళ్లతో మాట్లాడి అందరమూ మేము దిగిండే ఇంటికొచ్చినాం. మా వెంట ఓబిలేసు గుడకా వొచ్చినాడు. శింగనమల హైస్కూల్లో ఆరో తరగతి దంకా చదువుకుండాడు.
మా కొట్టంలో పొయ్యీ పొంతా రోలూ వుండాయి. తాగే నీళ్ల కోసరమని సూపన్న చిన్నాయన వొగ పెద్దకుండా మూకటీ, కుండ కిందికి చుట్ట కుదురూ తెచ్చినాడు. సూపన్న చిన్నాయన రెండో కొడుకు దస్తగిరి, పొయ్యిలో కట్టెలు తెచ్చినాడు. వాళ్లను చూస్తా వుంటే నాకు భలే ఆనందమయ్యింది. రక్తసంబంధముండే వాళ్లు కాదు, బంధువులు కాదు, సరి కులస్తులంతే! అయినా ఎంతో ఆదుకుంటా వుండారని సంతోషపడినాను. వాళ్ల ప్రేమనూ, అభిమానాన్నీ గమనిస్తా వుంటే శింగనమలలో షావుకారి పెదనాయన భోగం వెంకటస్వామి గుర్తుకొచ్చినాడు! వాళ్లింటికి పోయినప్పుడు ఆయప్ప మాట్లాడిండే మాటలు గ్నాపకం చేసుకొని మనసులోపల అసహ్యించుకుండాను.
ఓబిలేసు వెంట ఊరంతా తిరిగినాను. ఇండ్లన్నీ కొట్టాలే! అయితే ఈ కొట్టాలు మా ఊర్లో వుండే కొట్టాల మాదిరి లేవు. యా కొట్టానికీ కొమురు గోడలు లేవు. కొట్టం నాలుగు గోడలూ వొగే ఎత్తుండే గోడలే! నిలువు గోడల మీద అడ్డంగా తాటి దూలాలు! కొన్ని ఇండ్లల్లో చెక్కదూలాలు! ఆ దూలాల పైన నిలువుగా, క్రాస్‌గా వొగొగ దూలం మీద రెండ్రెండు నిట్రాళ్లు! ఆ రెండు నిట్రాళ్ల కొనలు రెండూ పై భాగంలో జానెడు గ్యాపుతో కలుసుకున్నెట్లుండాయి. రెండింటినీ కలుపుతా గొర్రు దిండంత లావుండే మొద్దును బిగిచ్చినారు. రెండు దూలాల మీదుండే నిట్రాళ్ల మొద్దుల పైన వొగ ఇంజాపను పండబెట్టి మొద్దులకు టెంకాయ తాళ్లతో కొంతమందీ, ఈత తాళ్లతో కొంతమందీ బిర్రుగా కట్టి ఇంజాప మీద నుంచీ గోడల మీదికి వెదురువాసాలు మూరెడుకొగటి దిగేసి కదలకుండా ఇంజాపకు కట్టినారు. కొంతమంది వాసాలపైన తడకలు పరిచి, తడకల పైన బోదగడ్డిని కప్పి, దాని పైన వెదురు దబ్బలûసి బిగిచ్చినారు. కొంతమంది బోదగడ్డికి బదులు జమ్ము పరచినారు. వాసాల మీద తడకలు గాకుండా కొంతమంది అదేందో వెర్రి చెరుకు మాదిరుండే దాన్ని పరిచినారు. ఇంగా కొంతమంది తాటాకులతో జొన్న దంట్లతో కొట్టం కప్పులేసుకుండారు.
కొట్టం గోడల్ని గురించి తెలుసుకొని నేను ఆశ్చర్యపోయినాను. దాదాపన్నీ మట్టి గోడలే! మట్టి గోడల్లో రాళ్లే వాడరంట! దరిదాపుల్లో రాళ్లే దొరకవంట! పదీ పదైదు ఇండ్లు మాత్రమే బెలుం బండలతుండ్లూ, దాండ్ల మధ్యలో రేగడి మన్ను కలవవేసి కట్టినారంట! జమ్మలమడుగు దాటి సుమారుగా పది మైళ్లు ఇవతల వరకు ఉండే అన్ని పల్లెల్లోనా మిద్దెల గోడలు, కొట్టాల గోడలు అన్నీ బెలుం బండల రాళ్లతోనే కట్టడమూ. ప్రొద్దుటూరు దాటొచ్చినంక ఇండ్ల గోడలన్నీ మట్టి పెల్లలతోనే కట్టడం చూసి ముప్పై నలభై మైళ్లలోనే ఇండ్ల నిర్మాణంలో ఎంత మార్పు అని ఆశ్చర్యపోసాగినాను. మట్టి పెల్లలు గుడకా పచ్చి మట్టిపెల్లలంట! ఇటికలు బట్టీలతో కాల్చిండే ఇటుక పెల్లలు కాదంట! మాగాణిలో ఉండే బంకమన్ను తెచ్చి నీళ్లు పోసి మెత్తగా పిసికి ఆ బంక బురదను అచ్చులు పోస్తారంట! ఎండకు బాగా ఎండినంక దాన్లతోనే కొట్టాల గోడలు కడతారంట! వానొచ్చినప్పుడు కరిగిపోవా? అని అడిగితే, అందుకే కొట్టం కప్పును. గోడల బయట వొగమూరెడు ఉండేటట్లు కప్పి, గోడల్ని బయట ప్యాడతో మెత్తుతామని! ఎంత పెద్ద వానొచ్చినా కొట్టాలు కారవని! పొటుకెత్తవని ఓబిలేసు చెప్పినాడు.
ఓబిలేసు చెప్పే విషయాలన్నీ ఆసక్తిగా వింటా అన్ని ఇండ్లనూ గమనిచ్చసాగినాను. అన్ని ఇండ్లలోనా ఫ్లోరింగ్ మట్టి న్యాలలే! గట్టిపడిండే న్యాల మీద ప్యాడతో అలుకు తారంట! అంతా వింటా, ప్రతి సంవత్సరమూ తప్పకుండా పంటలు పండే ప్రాంతంలోని ఈ కొట్టాల ఇండ్ల కంటే మా ఊరు ఎంతే బాగుండాదనుకుండాను. ఓబిలేసు వెంట ఊరి బయట పొలాల్లోకి పోయినాను. చుట్టూ కనుచూపుమేర మాగాణే! కెసి కెనాల్ నీళ్లొస్తాయని చెప్పినాడు ఓబిలేసు. కె. సి. కెనాల్ అంటే యేమని, ఆ నీళ్లు యెక్కడినుంచి వొస్తాయని అడిగినాను. కెసి కెనాల్ అంటే కర్నూలు`కడప కాలవ అని, కర్నూలుకు ఎగవ భాగంలో ఉండే సుంకేసుల ఆనకట్ట దగ్గర నుంచి ఆ కాలవ వొస్తాదని, ఓయబ్బ దానికింద దెంగుమాలినంత ఆయకట్టు ఉందనుకో! అని చెపుతా నన్ను కెసి కెనాల్ దగ్గరికి పిల్చుకొని పోయినాడు. ఊరికి రెండు ఫర్లాంగుల దూరంలోనే కాలువ. కాలువ మీద ఉండే మోరీపైన కూర్చుండాం ఇద్దరమూ. మోరీ మింద నుంచి ఈ మట్టి రోడ్డు చాపాడుకు పోతాదన్న్యాడు ఓబిలేసు.
కాలువ మోరీ దగ్గర నుంచీ ఓబిలేసు నన్ను సీతంపల్లికి దక్షిణం వైపు దగ్గరలో వుండే ఇంకొగ పల్లెకు పిల్చుకొనిపోయినాడు. ఆ ఊరి పేరు యర్రగుంటపల్లి. సీతంపల్లికి రెండు ఫర్లాంగుల దూరమే! మొత్తం ఆ చుట్టు పక్కలంతా బెల్లం చెరుకు తోటలూ శెనక్కాయ తోటలే! తోటల మధ్యలో బెల్లం తయారుచేసే బట్టీలే! ఆ బట్టీల దగ్గర్నుంచీ బెల్లం వాసన తియ్యగా ముక్కులకు తగుల్తా వుంది. వాసన పీల్చుకుంటా ఊర్లోకి పోయినాం. ఓబిలేసు ఆ ఊర్లో ఒగ ఇల్లు చూపిచ్చినాడు. ఆ ఇల్లంతా బెలుం రాళ్లతో కట్టినారు. అంత పెద్ద భవనం కాకపోయినా, ఒగ రకంగా హుందాగా శుభ్రంగా వుంది. ఎవురో పెద్ద షావుకార్ల ఇండ్లనుకుండాను.
ఆ ఇంటి గురించి చెప్పసాగినాడు ఓబిలేసు. ఆ ఇంటాయన అబ్బయ్య. అదేం పేరు అని అడిగినాన్నేను. ఆయన అసలు పేరు వెంకట నరసింహారావు అంట! బ్రాహ్మణులంట! ఈ చుట్టుపక్కల మాగాణి అంతా ఆయనదే! దాదాపు వెయ్యి ఎకరాల భూస్వామి! కడప జిల్లాలో అబ్బయ్య అందరికంటే పెద్ద జమీందారు అని ఓబిలేసు చెప్పుతానే నేను ఆశ్చర్యపోయి అంత భూమిని యెట్లా సంపాదించుకున్నాడని అడిగినాను. అదంతా ఈయన సంపాయిచ్చిండేది కాదు, పూర్వం ఆస్తి అన్న్యాడు ఓబిలేసు. అంత ఆస్తి వున్న్యా ఆ బాపనయ్యకు ఆశ తగ్గలేదని, నీళ్ళను గుడకా అమ్ముకుంటాడని, ఆ సంగతులన్నీ చెప్పినాడు.
ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడా కరెంటు లేదు. కానీ జమిందారు అబ్బయ్య తన బావికి కరెంటు తెచ్చుకొని కరెంటు మోటార్‌తో బావిలో నీళ్లు బయటకు కొట్టి వేసవిలో జీతగాళ్లతో నలభై యాభై ఎకరాలు మాత్రం పంట పెట్టుకుని తన పొలం పారినాక, వేరే రైతుల పొలాలకు వొగ గంట సేపు పారిచ్చేకి ఐదు రూపాయలు వంతున నీళ్లు అమ్ముకుంటాడని చెప్పినాడు ఓబిలేసు. పెన్నేటికి ఉత్తరం గడ్డన బావుల్లో దెంగుమాలినన్ని నీళ్లు పడతాయని. అన్నీ బిల్ల బావులని, అబ్బయ్య తన బావిలో ఎంత పెద్ద కరెంటు మోటారేసినాడో గానీ ఎనిమిదించిల పైపుతో నీళ్లు బయటకొత్సావుంటే వొగ పెద్దకాలవ పారినట్లుంటాదని, ఎన్ని నీళ్లు బయటకు కొట్టినా బావిలో నీళ్లు తరగవని ఓబిలేసు చెపుతా వుంటే ఆ బావిని చూడల్లనిపిచ్చింది నాకు. అది చాలా దూరంగా ఉందని మల్లా ఎప్పుడైనా పోదాంలే అన్న్యాడు ఓబిలేసు. అదీ ఇదీ మాట్లాడుకుంటా వొచ్చినాం ఇద్దరమూ.
నేను కెసి కెనాల్ వైపు చూస్తా పూడిక తీసేపనులు ఈ కాలువలోనేనా అని అడిగినాను. ఆ పైభాగంలో అని చెప్పుతా, రేపు మనూరికి కూలోళ్లను మాట్లాడేకి కాంట్రాక్టరొస్తాడు నారాయణా! మా నాయన మాట్లాడుతాడ్లే!’ అని ఓబిలేసు ఇంగా యేదో చెప్పబోయినాడు. అంతలోనే రోడ్డెంట పరిగెత్తుతా వొగ యెనుముగొడ్డు మా వైపు రా సాగింది. దాని వెనకొస్తా వుండే ఒగ పెద్దాయన ‘ఓబ్బీ! ఆ బరిగొడ్డును ఇట్ల దెంగు’ అని గట్టిగా అన్న్యాడు. ఆ మాట విని నేను ‘అదేంది ఓబిలేశ్, ఆ మనిషి అట్లంటా వుండాడు?’ అని అడిగినాను. ‘ఇట్ల తోలు’ అనేదానికి ఈ ప్రాంతంలో ఆడోళ్లు గుడకా అట్లనే అంటారు’ అని నవ్వినాడు ఓబిలేసు. నేనూ నవ్వినాను. ఇద్దరమూ నవ్వుకుంటా ఇండ్లు చేరుకుండాం.
సీతంపల్లి ఇంట్లో అన్నీ అనుకూలమయినాయి. ఓబిలేసోళ్ల బంధువులందరూ పరిచయమయినారు రెండో రోజుకే. ఊర్లో దాదాపందరూ అమ్మిడి పొద్దు బువ్వకు బదులు అంబలి తాగుతారంట! అదెట్లా చేస్తారో ఓబులేసోళ్ల అమ్మ మేముండే ఇంటికొచ్చి అంబలి చేసేదంతా చెప్పింది. మా అమ్మయ్యను అక్కా అక్కా అంటా ఎంతో ప్రేమగా మాట్లాడిచ్చి, ‘యాది కావాల్సినా అడుగక్కా, బిడియపడబాకు’ అని ధైర్యం చెప్పింది.
మధ్యాహ్నానికంతా కాలువ పూడికతీత పనులు చేయిచ్చే కాంట్రాక్టరొచ్చినాడు. ఆయన, నాయననూ సూపన్న చిన్నాయననూ కాలువ దగ్గరికి పిల్చుకోని పోయి పూడిక తీసే స్థలాన్ని చూపిచ్చినాడు. నేనూ వాళ్ళెంటపోయి ఆ స్థలాన్ని చూసినాను. మాకు చూపిచ్చిండే కాలువ భాగానికి యెగువన నాలుగైదు గుంపులోళ్లు మట్టిపని చేస్తా వుండారు. కాలువ అడుగు భాగంలో జానెడు లోతు మట్టిని పారలతో తవ్వుతా కాలువ దడుల్లో పెరిగిండే జమ్మూ తుంగా గడ్డీ గాదమూ పిచ్చి మొక్కలూ అన్నీ పారలతో నరుకుతా అంతా వొగచోట కుప్పజేసేవాళ్లు చేస్తా వుంటే, ఆ కుప్పల్ని తట్ట పుటకలతో నింపేవాళ్లు నింపుతా ఉంటే, తట్ట గంపలెత్తుకొని కాలువగట్ల పైకి ఎక్కి ఆ మట్టిని, గట్ల అవతలికి పోసేవాళ్లు పోస్తావుండారు.
దినకూలి కాకుండా గజం పొడవు మట్టి తవ్వి క్లీన్ చేసేకి వొగ రుపాయ ప్రకారం ఇస్తానన్న్యాడు కాంట్రాక్టర్. అనుమానమయితే కాలువలో పనిచేసే వాళ్లను విచారిచ్చుకో మన్న్యాడు. సరే అని నాయన వొప్పుకుండాడు. రేపే పనిలోకి దిగమన్న్యాడు. మేము సరే అన్న్యాం.
***
మేము కాలువలో పనికి వొంగిన చోట కాంట్రాక్టర్ ఏందో గుర్తుపెట్టినాడు. అక్క న్నుంచీ కొలత తీసుకుంటానన్న్యాడు. అందరమూ పొద్దున ఎనిమిది గంటలకే పనికి వొంగినాం. కాలువలో కొన్నిచోట్ల పూడిక ఎక్కువగా ఉంది. దడులకు కొన్ని చోట్ల కంపచెట్లూ రకరకాల పిచ్చిచెట్లూ దండిగా ఉండాయి. విపరీతంగా చిదుగు వుంది. గొడ్లీ మచ్చుగత్తీ కొడవండ్లతో దాండ్లనన్నీ నరికి బయటకి వేసినాం.
మొదటి దినం పయిటాల వరకూ పని బిరబిరా సాగలేదు. విపరీతమైన ఎండలు! కొత్త రకమైన పని! కాలువ గట్లెక్కి మన్నూ మశానమూ బయటికి పోసి రావడమే గసగా వుంది! ఎంత ఎండైనా ఇంటోల్లందరమూ ఒగేచోట పనిచేస్తా వుండడంతో ఒంటరితనం అనిపిచ్చలేదు. మధ్యలో నాయన వైభాగంలో పనిచేస్తా వుండేవాళ్లను కలుసుకోనొచ్చినాడు. వాళ్లందరూ అనంతపురం అవతల ఉండే కామారుపల్లె వాళ్లని, ఇంగా పైన అనంతపురం ప్రాంతం నుంచీ చాలామంది వొచ్చినారని తెలిసి వూరటపడినాం.
పొద్దు వాలేదంకా పదైదు గజాల పని చేసి, చాలిచ్చుకొని ఇంటకొచ్చినాం.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
