Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాతి పర్రెలలో నుంచి..-21

[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]

మండే ఎండల్లో మట్టి పనులు-నా చాతకానితనం!

భయంకరమైన ఎండలు! చుట్టూరా నల్లరేగడి భూములు!  ప్రొద్దున పది గంటల నుంచే నెర్రెలు చీలిండే మడికయ్యల్లో నుంచీ వేడిగాలులు! కె.సి. కెనాల్లో పూడిక తీసే మట్టి పనులతో  శరీరం మెత్తబడసాగింది. అయినా తప్పడం లేదు. పనులకు వొంగిన నాలుగో రోజే వాంతులూ, బేదులయినాయి. నిప్పలు కురిసే ఎండలో సాయంత్రం వరకూ మట్టిపని చేయడంతో నెత్తురుచ్చలు వొచ్చినాయి. కాలవలో నాయన పారతో తట్టగంప నిండా మట్టిని నింపినాడు. నింపిండే తట్టగంపను నెత్తిమిందికి ఎత్తుకుంటూ, కళ్లకు మబ్బొచ్చి కిందపడిపోయినాను. పక్కనుండే కోపులో పని చేస్తావుండే అమ్మయ్యా, చెళ్లెళ్లూ నేను కింద పడడం చూసి గట్టిగా అరుస్తా యేడుస్తా దగ్గిరికొచ్చినారు. నన్ను పైకి లేపినారు. నేను సొమ్మసిల్లి పడిపోయినా తెలివిగానే వుండాను. మట్టి గంపెత్త్తుకోని కాలువలో నుంచీ పైకి పొయ్యేటప్పుడు పడింటే ఎంత ప్రమాదమయ్యిండేదని అమ్మయ్య యేడుస్తా బాధపడసాగింది. కడాకు నాయనా అమ్మయ్యా అందురూ నన్ను పట్టుకొని కాలవ కట్టపైకి నడిపిచ్చుకుంటా నీళ్లబిందే, సద్దులూ పెట్టిండే తుమ్మచెట్టు కిందికి పిలుచుకొని పోయి, చన్నీళ్లతో నా ముఖం కడిగి వొగ వొల్లిగుడ్డ పరిచి నన్ను పండబెట్టినారు. తుమ్మచెట్టు నీడకింద పండుకున్నెంక రోంత సేపటికి తేరుకుండాను. ప్రాణానికి నిమ్మలమయింది. సాయంత్రానికి అందరమూ ఇల్లు చేరుకుండాము.

జరిగిండేదంతా నాయన, సూపన్న చిన్నాయనకు చెప్పినాడు. వడదెబ్బ తగిలినట్ల వుండాదని ఆ చిన్నాయన నన్ను సైకిలు మింద ఎక్కిచ్చుకొని ప్రొద్దుటూరికి పోయి డాక్టరుకు చూపిచ్చుకొని వస్తానన్న్యాడు. నాకయితే నీరసంగానే వుంది. అయినా గుడకా యేం పర్వాలేదులే చిన్నాయనా, రెండు దినాలు రెస్టు తీసుకుంటే సరిపోతాది లే అని సర్దిచెప్పినాను. ఆ చిన్నాయన ఎవురింటి దగ్గరికో పోయి రెండు మాత్తర్లు తీసుకోనొచ్చి ఇచ్చినాడు. నేను అవి మింగి పండుకుండాను. అమ్మయ్య ఎనిమిది గంటలకల్లా యాదో బార్లీ గంజి అంట, అది చేసి తాపిచ్చింది.

రాత్రి పొద్దుబోయేదంకా వొగటే ఆలోచన్లు. కాలువలో పూడిక మన్నూ మశానమూ తీసి పైకి వేసే దానికి వొట్టుకూలి! పని చేసుకున్నంతా కూలి!  అమ్మిడిపొద్దు నుంచి సంద కాడదంకా బాగా చేసుకుంటే మనిషికి సరాసగటు నాల్గురుపాయల కూలి గిడతాది. మంచి కూలే! ఇంట్లో ఐదు మందికీ దినానికి ఇరవై రుపాయలకు తక్కువ పడదు. నేను ఆరోగ్యం బాగలేదని పనికి పోకుంటే దినానికి నాల్గు రుపాయలు నష్టం. ఇప్పటికే మూడు దినాలకు పన్నెండు రూపాయలు వచ్చేటివి రాకుండా పోయినాయి, అంత ఎండలున్న్యా ఆడపిల్లోళ్లు  పనిచేస్తావుండారు పాపం! వాళ్లకు యా వడదెబ్బా తగల్లేదు. మొగోనికి నాకే యెందు కిట్ల? నేను బడికి పోతా, ఇట్లాటి బరువయిన పనులకు దూరమయినందుకేనేమో, శరీరం రోంత సుఖపడినట్లుంది! అందికే నాయన అప్పుడప్పుడు ‘సుఖం మరిగిన దాసప్ప, పదం మరిచి పాయనంట’ అని చెప్పే సామెత నిజమే అనిపిస్తాది! యెట్లన్నాగానీ ధైర్యం తెచ్చుకొని రేపట్నుంచి మల్లా నాయనోళ్లెంట పనికి పోవల్లని గట్టిగా నిర్నయిచ్చుకుండాను.

పొద్దున అమ్మిడి (అంబలి) పొద్దుకల్లా అందరితోపాటు ఉషారుగా అంబలి తాగినాను. అంబలి తాగడం ఈ ప్రాంతంలో  వుండే బీదాబిక్కీ అనే తేడా ల్యాకుండా అందరికీ అలవాటే నంట! ముఖ్యంగా ఎండలకాలమంతా తాగుతారంట! రాత్రి అన్నం అదే పనిగా యెక్కువజేసి, సగం అన్నం వొగమట్టికుండలో వేసి నీళ్లు పోసి ఆల్తిగా ఉప్పువేసి, మూకటి మూసి పులియబెడతారంట! ఉదయం అది అంబలిగా తయారయితాదంట! అది తాగితే కడుపులో చల్లగా వుంటాదంట! తాగేటప్పుడు మధ్యమధ్యలో ఉల్లిగడ్డ ముక్కను కొరుక్కుంటా తాగితే చాలా బాగుంటాదని తెలుసుకొని, అట్లే చేసినాను. మధ్యమధ్యలో ఉల్లిగడ్డ ముక్కలు కొరుక్కుంటా అంబలి తాగుతా వుంటే భలే కమ్మగా వుందనిపిచ్చింది. అంబలి తాగేదంతా అయిపోయినంక, పయిటాలప్పుడు తినేకి చేసిండే బువ్వా వూరిమిండీ మూడు సద్దులు కట్టుకొని అందరమూ కాలవ పనికి బయలుదేరినాం. అమ్మయ్య ‘యింగా రెండు దినాలు నువ్వు రావద్దప్పా’ అనింది. నేను అమ్మయ్యకు నచ్చజెప్పి బయల్దేరినాను.

దినదినానికీ ఎండలు ఎక్కువయినాయి. బీటి పొలాల్లో నుండీ వేడి పొగలు గక్కుతావుంది. నిప్పులు చిమ్ముతా వుండే ఆ యెండలో వొగ గంటసేపు మట్టిపని చేస్తానే అందరూ అలసటపడతా చెట్టుకిందికిపోయి కడవలోని నీళ్ళు తాగి రోంతసేపు సేదతీర్చుకోని మల్లా పనికి వొంగుతావుండారు. నేను రోంత ఇబ్బంది అనిపిస్తానే చెట్టుకిందికి పోయి తలవాలుస్తా వుండాను. నీడలో కూర్చోని, నేను భయంకరమయిన ఎండలో పనిజేసే అమ్మా నాయనల్నీ ఆడపిల్లోళ్లనూ చూస్తా వుంటే కడుపులో నుండీ దుఃఖం తన్నుకోనొచ్చింది. కళ్లల్లో నుండీ ధారగా కారుతావుండే కన్నీళ్లను పెదవులతో లోపలికి అదుముకుంటా, యా జన్మలో పాపం చేసినామో, ఎంత కర్మజేసి ఇట్ల పుట్టినామో యేమో! పుట్టిన పిల్లోళ్లను బతికిచ్చుకోడానికి ఈ వయసులో నాయనా అమ్మయ్యా ఎంత కష్టపడతావుండారో! ఇట్ల కష్టపడకుండా బతికేకి వేరే మార్గమే లేదా? ఈ అవస్థపడే బదులు అడుక్కొని తినేది మేలు గాదా? ఇతరులు పెట్టే భిక్షకోసరం చేయిచాపడం నీచమయిన పని అని నాయన కథలు చెప్పేటప్పుడు అంటావుంటాడు. నిజంగా అడుక్కొని తినడం నీచమయిన పనా? అట్లయితే పాండవులు అడుక్కొని తిన్న్యారు గదా! ఋషులందరూ అడక్కతిన్న్యారంట! అది నీచమయిన పనయితే వాళ్ళంతా యెందుకు  చేసినట్ల! అవును, మా కుటుంబమొగటేనా యిట్ల? మాకు పైభాగంలో చాలామంది పనిచేస్తావుండారు గదా? కష్టపడే వాళ్ళంతా నా మాదిరి, అడక్కతిని బతికేది మేలని అనుకుంటా వుంటారా?

చలికాలంలో వరి మళ్ళల్లో మడక దున్నేటప్పుడూ, పారతో గెనాలు చెక్కేటప్పుడూ వేరే వూర్లకు పోయి చలికాలంలో వొణుక్కుంటా శెనక్కాయలు గోకేటప్పుడూ కొండలకు పోయి గడ్డి కోసుకోనొచ్చేటప్పుడూ యానాడూ ఇంత కష్టమనిపిచ్చలేదు. ఇట్ల ఎండలకాలంలో యానాడూ మట్టిపని చేసిండే అనుభవం లేనందువల్లనేమో, ఇప్పుడీపని, ఇంత కష్టమని పిస్తావుండేది!

రకరకాల ఆలోచనలు రావడంతో కన్నీళ్లాగి పోయినాయి. ధైర్యం తెచ్చుకొని పైకి లేచి మల్లా పనిలోకి పోయినాను. అనుకున్నెంత పని ముగిచ్చుకొని సంద కాటికి అందరమూ ఇండ్లుచేరుకుండాం.

***

సీతంపల్లికి వొచ్చి పద్దినాలయింది, వూర్లో అందరూ పరిచయమయినారు. ఊర్లో ఎక్కువమంది మా ఉప్పరోళ్లే వుండేది. మా వాళ్లు మా కులస్థులతో బాగా కలిసిపోయినారు. అందరికీ వేరే పరస్థలంలో వుండామన్న దిగులే లేదు. కాలవ పూడిక దీసే పనులు అయి పోతానే ఏటిగడ్డ మళ్లల్లో శెనక్కాయ పంట పీకే పనులుంటాయి. అంతలోపల బండమీద పల్లెకు  పోయి రావొచ్చునని ఆలోచనచేస్తా వుండంగనే, ఎస్సెల్సీ పుస్తకాలన్నీ ఇప్పిస్తానని హెడ్మాష్టర్ సార్ చెప్పిండే మాటలు గుర్తుకొచ్చినాయి. అదే విషయం నాయనా అమ్మయ్యల్లతో చెప్పినాను. అమ్మయ్య వెంటనే ‘పోయిరాపోప్పా, నువ్వు ఈ ఎండలకు తట్టుకోలేవు పో! పుస్తకాలు తెచ్చుకోని ఇంటికాడే వుండి బాగా సదువుకో! యెండకు యాడా తిరక్కుండా మీ జేజి చిన్నాయనోల్లను అనుసరిచ్చుకుంటా, బియ్యం గింజలు నువ్వే వుడకబెట్టుకోని వాల్లతో రోంత కురాకు ఇప్పిచ్చుకోని తింటావుండు. వాల్లు యావన్నా సన్నసన్న పనులు సెప్పితే సేత్తావుండు’ అని చెప్పల్సని జాగ్రత్తలన్నీ చెప్పింది. నాయన నాకు ఖర్చులకూ చార్జీలకూ అని తొమ్మిది రుపాయలిచ్చినాడు. నేను అందరికీ చెప్పి వూరికి బయలుదేరినాను. ఈసారి ప్రొద్దుటూర్నుంచీ యర్రగుంట్ల మీద పోమ్మన్న్యాడు నాయన. అట్లపోతే రోంత సలీసన్న్యాడు. కొత్తకొత్త ప్రాంతాలు చూడడమంటే నాకు భలే యిష్టం. అందుకే నేను నాయన చెప్పినట్లే ప్రొద్దుటూర్లో యర్రగుంట్ల బస్సెక్కినాను.

బస్సు పెన్నానది బ్రిడ్జిమింద పోతావుంది. ఎట్లో నీళ్లు లేవు. వొగచోట సన్నగా పారతా వుండాయి. వెడల్పు చాలా పెద్దగా వుంది. పామిడి దగ్గరా తాడిపత్రి దగ్గరకంటే ప్రొద్దుటూరు దగ్గర పెన్నానది చాలా పెద్దదనిపిచ్చింది. దీంట్లోకి కొండాపురం దగ్గర చిత్రావతి నది కలుస్తాదని, రెండు నదులూ కలిసి గండికోట కొండల సందులో దూరి కిందికి వస్తాయని నాయన మొన్న చెప్పిండేది గుర్తు చేసుకుంటా యేటిగడ్డ నుండే పెద్ద పెద్ద ఇసకదిన్నెల్ని చూస్తా అబ్బురపోయినాను. బస్సు యర్రగుంట్ల దగ్గర దగ్గరికొస్తానే ఆ భూముల్ని చూసినాను. పూర్తీ నల్లరేగడి పూర్తీ ఎర్రన్యాల గాకుండా సిమెంటు కలర్లో భూములు అద్భుతంగా వుండాయి, వానకారు పంటకు అక్కిడిగా వేసిండే కంది, యెప్పుడు కోసినారో యెమో, వొక్కొక్క కందికొయ్య కాలిబోట్నేలంత లావుగా వుంది.

బస్సు, వూర్లోనుంచీ రైల్వేగేటు దాటుతా వుంది. పక్కనుండే మనిషినడిగి తెలుసుకుండాను. ఈ రైల్వేలైను తూర్పుకు కమలాపురం, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, పుత్తూరు మీదుగా మద్రాసుకు పోతాదంట! ఇదే లైను పడమటికి కొండాపురం, తాడిపత్రి, గుంతకల్, రాయచూర్ మీదుగా బొంబాయికి పోతాదంట! అతడు చెప్పింది వింటానే అబ్బబ్బబ్బా పడమర అరేబియా సముద్రం దగ్గర్నుంచీ తూర్పున బంగాళాఖాతం దంకా దక్షిణ భారతదేశంలో అడ్డంగా పోతాదేమో ఈ లైను! ఎన్ని మైళ్ల దూరమో! అన్ని మైళ్ల పొడవునా ఈ రైలు కమ్మిలేసినారేమో! అంతదూరమూ కమ్మీల మధ్యలో అడ్డంగా చెక్క మొద్దుల్ని రీపర్లుగా యేసినారేమో! అంతదూరమూ కమ్మీల కింద అడుగు మందానికి పైగా కంకర పోసింటారు గదా! వోరి వానెమ్మ కడుపు గాలా, ఎన్ని మొద్దులు కావల్ల, ఎంత కంకర కావల్ల! అన్ని మొద్దులూ అంత కంకరా కావల్లంటే ఎన్ని మాన్లు నరికేసిండల్ల, ఎన్ని గుండ్లు పగల గొట్టిండల్ల! ఇదంతా పేదోళ్లే కదా చేసింటారు! ఎన్నిలక్షల మంది ఎన్నేండ్లు కష్టపడింటారో పాపం!

అనుకుంటా వుంటే అంతా ఆశ్చర్యమే అనిపిచ్చసాగింది. ఇంతకూ ఈ రైల్వే లైను ఎప్పుడేసినారో అనే ప్రశ్న వేసుకొని, బస్సుదిగుతానే ఆ మనిషిని అడిగినాను. ఆయన చదువుకున్నోని మాదిరే వుండాడు. సొంతూరు యర్రగుంట్లేనంట, మా నాయనకంటే రోంత చిన్నోనిగా వుండాడు. “నూరేండ్ల కిందట్నే యేసినారంటబ్బీ! మా ముత్తాత చిన్నపిల్లోనిగా వున్నెప్పుడు మొదట రైలొచ్చిండేది చూసినాడని మా తాత చెప్పేవాడు” అని ఆయన చెప్పుతా వుంటే నేను నోరెల్లబెట్టి ‘వోయమ్మయా!’ అని అబ్బురపడతా, తాడిపత్రి బస్సు రాగానే ఎక్కినాను.

యర్రగుంట్ల దాటినంక, ఇక్కడ గుడకా కొడిమిగుండ్ల దగ్గరున్నైట్లే బెలుం గనులు వుండడం చూసి, ఇదంతా వొకే సోలుపు అనుకుంటా, ముద్దనూరు దాటుతా ఉత్తరం పక్కనుండే కొండల్నీ దక్షిణం పక్కనుండే కొండల్నీ గమనిచ్చసాగినాను. ఉత్తరం పక్కనుండే కొండలు ముద్దనూరు దగ్గర తేలిపోయినాయి. ఇంగ ఆ సోలుపులో కనుచూపుమేర తూర్పు వైపు వొగ చిన్న గుట్ట గుడకా లేదు. దక్షిణం వైపుండే కొండల సోలుపు, యాడేగానీ తేలిపోయినట్ల కనిపిచ్చలేదు. పక్క సీట్లో వుండే మనిషిని, దక్షిణం వైపుండే కొండల సోలుపు గురించి అడిగినాను. ఆ కొండల సోలుపు, పులివెందుల దంకా వుందని ఆ కొండల్ని పాలకొండలని అంటారని, పులివెందుల దగ్గర్నుంచి ఆ కొండల సోలుపు, అట్లే ముందుకుపోతా, కడప కొండల్తో కలిసి తిరుపతి కొండల వరకూ పోతాదని, అక్కడ ఆ కొండల్ని శేషాచలం కొండలంటారని ఆయనెవరో నాకు భలే వివరంగా చెప్పినాడు. పెద్దయినంక ఆ ప్రాంతాలన్నీ చూడల్లని అనుకుండాను.  ఆయన చెప్పేదంతా విన్నెంక, ఈ భూమ్మీద పంటభూములకంటే కొండలు, అడవులే యెక్కువ వుంటాయేమో అని అనుకోసాగినాను. బస్సు నిలబడింది. ఏమయిందని చూస్తే రైల్వేగేటు వేసినారు. పక్కనే చిన్న రైల్వేస్టేషనుంది. ఇది యావూరి స్టేషనో అని చూసినాను. మంగపట్నం! మా బస్సు రైల్వేగేటు పక్కనే నిలబడింది. ఇంగా రైలొచ్చేది లేటేమో, బస్సులో నుంచీ చాలామంది దిగినారు. నేనూ దిగి, వొంటికి పోసి, గేటు దగ్గరికిపోయి నిలుచుకుండాను. రైలొచ్చేది చూడల్లని పిల్లోళ్లందరూ దిగినారు. అంతలోనే తూర్పునుంచీ రైలొచ్చి స్టేషన్లో నిలబడింది. స్పీడుగా వొచ్చిందేమో, రైలింజన్, రైల్వేగేటు దగ్గర దగ్గరికొచ్చి ఆగింది.

నేను అంత దగ్గరగా రైలును చూసింది అదే మొదటిసారి. ట్యాంకు మాదిరుండే ఇంజనుకూ వెనక రైలు బొగ్గులతో నింపిండే లోడుకూ మధ్యలో ఇద్దరు డ్రైవర్లుండారు. తలకాయలకు బట్టలు కట్టుకుండారు. అంగీలూ ట్రౌజర్లూ మసిబట్టల మాదిరుండాయి. వొగాయన ఇనపగొట్టానికి కింద చాట మాదిరుండే దానితో బొగ్గులు నించుకోని నించుకోని రైలింజన్ పొయిలోకి విసురుతా వుండాడు. ఆ బొగ్గులు, నల్లబండల పలకల మాదిరుండాయి. ఇంజనుకు ముందరి పక్క నీళ్లట్యాంకుందేమో, రైలు బొగ్గులతో కాగిండే నీళ్లల్లోని ఆవిరి చిన్నచిన్న సందుల్లో నుంచీ సుయ్ మంటా బయటికొస్తావుంది. బొగ్గుల మంటలో నుంచీ పొగ, ఇంజన్‌పైన్నుంచీ పెదింత లావుతో బయటికొస్తావుంది. కమ్మీల మీద రైలింజన్ చక్రాలు రాకాసుల మాదిరుండాయి. చక్రాలకు ముందు పక్క నీళ్లట్యాంకు కింద వొగ పెద్ద ఇనప్పెట్టె మాదిరి యేందో వుంది. ఆ ఇనప్పెట్టెలో నుంచీ వొగ పిస్టను బయటికొచ్చి చక్రాన్ని ముందుకు తిప్పేటట్లు చేసినారు.

అదెట్ల పని చేస్తాదోనని అట్లే చూస్తా వుండాను. అంతలోనే స్టేషన్లో బెల్లుగొట్టినారు. స్టేషన్ దగ్గర వొగాయన తెల్లడ్రస్సు వేసుకోని, నెత్తిమీద టోపీ పెట్టుకోని, విజిలేస్తా పచ్చజెండా వూపసాగినాడు. ఇంజన్ దగ్గర వొగ డ్రైవర్ తాడుమాదిరుండేదాన్ని కిందికి లాగినాడు. రైలు కూతేసింది. ఇంగొగ డ్రైవర్ యేదో తిప్పసాగినాడు. రైలు ముందుకు కదిలింది. ఇనప్పెట్టెలో నుంచీ ఆవిరి, పిష్టన్ను ముందుకు నూకసాగింది. అది పోయి చక్రాన్ని తనవైపులాగుతా వుంది. ఇంజన్ నీళ్ళ ట్యాంకులో వుండే ఆవిరి, బయటికి పొయ్యేకి వీలుగాక ఇనప్పెట్టెలో కొచ్చి పిస్టన్ను ముందుకు నూకుతా, చక్రం ముదుకొచ్చినప్పుడు పిస్టన్ వెనక్కిపోతా, అబ్బా, ఎంతద్భుతంగా వుందో అని ఆశ్చర్యంగా చూస్తావుండాను. చూస్తావుండంగనే ఇంజన్ ముందుకు పోతా స్పీడందుకుంది. పొగగొట్టంలో నుంచీ పొగ, మొదట భగ్ భగ్ భగ్ మంటా తర్వాత భగభగభగమంటా సౌండ్ మార్చుకుంది. రైలు పెట్టెలు వొగదాని తర్వాత వొగటి కదిలిపోతావుండాయి. పిల్లోళ్లందరూ రైలు పెట్టెల్లో వుండే వాళ్ల పక్క చేతులూపుతా కేకలేయసాగినారు. రైలెల్లిపోయింది. పెట్టెలన్నీ యెంచుకుండాను, పదైదు పెట్టెలు!

అంతలోనే బస్సు కండక్టర్, కిందికి దిగినోళ్లందరినీ బస్సెక్కమన్యాడు. అందరూ ఎక్కగానే బస్సు కదిలింది. గేటు దగ్గర బస్సురోడ్డు, పక్కకు తిప్పిన (Z) జెడ్ ఆకారంలో వుంది. గేటు దాటి వెంటనే ఎడమవైపు తిరిగి రైల్వేలైనుకు కొంతదూరం సమాంతరంగా పోతావుంది. నేను యర్రగుంట్లలో బస్సుదిగి, ఇదే రైలెక్కి తాడిపత్రి దంకా ప్రయాణం చేసింటే బాగుండేదనీ, చార్జీగుడకా రోంత తగ్గిండేదనీ, పొరపాటు చేసినాననీ రోంతసేపు బాధపడినాను.

రైలింజన్ మనసులో కనిపిచ్చసాగింది. రైలింజన్ని కనిపెట్టిండేది జేమ్సువాట్ అనే శాస్త్రవేత్తని మా సైన్సుటీచర్ చెప్పిన పాఠం గుర్తుకొచ్చింది.

తెల్లోడు ఎంతగొప్పవాడో! పొయ్యిమీద అన్నం వండేటప్పుడు పాత్రమీద మూసిండే మూతను, పాత్రలో వుండే నీటి ఆవిరి పైకెగరగొడతాది. ఇది మనందరికీ తెలుసు. మన మాదిరే తెల్లోడూ గమనిచ్చినాడు. గమనిచ్చినంక, వాడు మన మాదిరి వూరకనే వుండలేదు. నీటి ఆవిరి కుండమీదుండే మూతను ఎందుకు పైకి లేపుతావుందో ప్రశ్న వేసుకుండాడంట! వేసుకొని, మూత మీద కొద్దిగా బరువుండే వొగ రాయిని పెట్టి, కింద పొయ్యిలో మంట ఎక్కువచేసినాడంట! దాంతో నీటి ఆవిరి యెక్కువయి బయటికి పొయ్యేకి మార్గం ల్యాక, కుండమీదుండే మూతను ఎత్తి పడేసిందంట! దాన్ని గమనిచ్చిన తెల్లోడు, వోహో, ఆవిరికి ఇంత శక్తి వుందా’ అని ఆలోచన చేసిచేసి, కడాకు ఆవిరి యంత్రాన్ని కనిపెట్టినాడంట! ఆ మహానుభావుని ఆలోచన్లతో పుట్టిండేదే ఈ రైలింజనంట! ఎంతాశ్చర్యమో!

కమ్మీలమీద పదైదు పదారు పెట్టెలుండే రైలూ, ఇరవై ఇరవైఐదు పెట్టెలుండే గూడ్సురైలూ ఎంత బరువుంటుందో గదా! పెట్టెలన్నీ ఇనుమూ ఇనపరేకులతో చేసింటారు. అట్లాటి పెట్టెలుండే అంత బరువైన రైలును ఆవిరి యంత్రం లాగుతా, బస్సుకంటే స్పీడుగా పోతావుందంటే ఎంత ఆశ్చర్యమనుకోవల్ల! ఇంగ్లీషోడు ఎంత గొప్పోడనుకోవల్ల! ఇంగ్లాండ్ దేశం చాలా చిన్నదంట! అంత చిన్నదేశం, ముక్కాలు ప్రపంచాన్ని యేలిందంటే దానికి కారణం ఆ తెల్లోళ్ల తెలివి తేటలేనేమో!

రకరకాలుగా ఆలోచన చేస్తావుండాను. బస్సు ముందుకు పోతావుంది. బస్సురోడ్డుకూ రైలురోడ్డుకూ మధ్యలో వుండే కంకర మదిర్లవైపు చూసినాను. దాండ్లను చూస్తా, మా చెరువు మాగాణికింద వరికోతలప్పుడు, కుప్పలు కొట్టినంక కూలోళ్లు, గావుతో వుండే వడ్లన్నీ ఎగేసిన మదిర్లను గుర్తుకు తెచ్చుకుంటా, కుడివైపు కనిపిచ్చే కొండల్ని చూసినాను ఆశ్చర్యమయింది. ఆ కొండలన్నీ కంకర మదిర్ల మాదిరి, ధాన్యం మదిర్ల మాదిరి పై భాగమంతా సదునుగా సదరాగా కనిపిస్తా వుండాయి. ఆ కొండలపైన ఎర్రగరుసునంతా ఎవురో సదునుగా నెరిపినట్ల కనిపిస్తా వుండాయి. ఆ కొండల పైనంతా విశాలంగా బయలు వుందేమో అనిపిచ్చింది.

రోడ్డుకు ఎడమవైపుండే కొండల్ని చూసినాను. ఇవన్నీ కుప్పలు కుప్పలుగా చిన్నాపెద్దా శిఖరాలతో వుండాయి. ఈ తేడాలెందుకో నాకు అర్థం కాలేదు. కంకర మదిర్ల మాదిరి కనిపిచ్చే ఆ కొండల్ని ఎర్రమల కొండలని అంటారని వొగాయన చెప్పినాడు. నేను సోషియల్ పుస్తకంలో నల్లమల అడవుల పేరును చదివినాను, ఎర్రమల కొండల పేరు ఇప్పుడే విన్న్యాను. ఇవి ఎర్రగరుసు నేలలతో ఎక్కడేగానీ పెద్దపెద్ద బండలు ల్యాకుండా ఎర్రగా కనిపిస్తా వుండడంవల్ల దీండ్లను ఎర్రమల కొండలని అంటారేమోనని ఆలోచిస్తా వుండంగనే బస్సు కొండాపురంలో ఆగింది. బస్టాండేమీ లేదు. వొగ బయల్లో, బస్సు రోంత ముందుకు పోయి పక్కకు తిరిగి మల్లా రోడ్డు మీదికొచ్చింది. కాఫీ కోసరం కొంతమంది బస్సుదిగినారు. నేను సీట్లోనే కూర్చోని రైల్వేస్టేషన్ వైపు చూడసాగినాను. రైల్వేస్టేషన్ చాలా ఎత్తులో కొండదడిలో కనిపిస్తా వుంది. అదెందుకు అంతెత్తులో వుందో పక్కనుండే తాడిపత్రి మనిషిని అడిగినాను. రోంత ముందుకు పోతానే చిత్రావతి నది వుందని, దాని మీద రైల్వే బ్రిడ్జి చాలా ఎత్తులో వుంటాదని, అందుకే రైల్వేలైన్నూ స్టేషన్నూ ఎత్తులో కట్టినారని ఆ మనిషి చెప్పడంతో, మా బస్సు, చిత్రావతినదిని దాటుకొనే ముందుకు పోతాదని, చిత్రావతిని తొందరగా చూడల్లని వుబలాటపడతా, ఆ నదిని దాటినంక రోంతదూరం పోయి తూర్పువైపు చూస్తే కొండల సందులో దూరంగా కొండమీద గుడిగోపురం కనిపిస్తాదని, అదే గండికోట అని, ఆ కొండల సందుకు ఇవతల్నే చిత్రావతినది పెన్నానదిలో కలుసుకుంటాదని నాయన చెప్పిండే మాటల్ని గుర్తు చేసుకుండాను.

బస్సు కొండాపురం నుంచి బయలుదేరి చిత్రావతి బ్రిడ్జిమీదికొచ్చింది. నేను పైకి లేచి ఎడమ పక్క చూసినాను. ఏటిగడ్డ మళ్ళు కోసినారు. ఏటిగడ్డ దాటుతానే బ్రిడ్జి బ్రహ్మాండమయినది! చూస్తా వుంటే పెన్నానది కంటే పెద్దదనిపిచ్చింది. దూరంగా రైల్వేబ్రిడ్జి కనిపిచ్చింది. దాని మీద పెద్ద గరండాలుండాయి. ఏరు పారేటప్పుడు ఏదయినా ప్రమాదం జరిగితే రైలు ఏట్లోకి పడిపోకుండా వుండేకి ఆ గరండాలు బిగిచ్చినారేమో అనుకుంటా కూర్చుండాను. బస్సు, ఏరు దాటుతా వుంది. అంతలోనే నాయన చెప్పిండే మాటలు గుర్తుకొచ్చినాయి. నేను కిటికీలో నుంచీ తలకాయ బయటికి పెట్టి వెనక్కి చూసినాను. నా అదృష్టం కొద్దీ ఎవుర్నో మనిషిని ఎక్కిచ్చుకోడానికి బస్సు నిలబెట్టినారు. నేను నిగాగా చూసినాను. నాయన చెప్పినట్లనే రెండు కొండల సందులో ఎదురుగా వుండే కొండమీద యేదో గుడిగోపురం స్పష్టంగా కనిపిచ్చింది. కొండల సందులోకి దూరిండే పెన్నానది ఆ ఎదురుగా వుండే కొండదగ్గర ఎడమవైపుకు ఉత్తరానికి తిరిగి మల్లా తూర్పుకు మల్లినట్లుందని అంచనావేసుకొని, నేను పెద్దయినంక యెట్లన్నాగానీ వొగసారి గండికోటకు పోవల్లనుకుండాను. అనుకుంటా నాయన ఈ ప్రదేశాలన్నీ ఎప్పుడు చూసినాడో యెందుకు చూసినాడో ఆలోచిస్తా, గండికోటలో మిరపకాయలు అద్భుతంగా వుంటాయని నాయన చెప్పిండే మాటలు జ్ఞాపకం చేసుకుండాను.

బస్సు ముందుకు పోతా తాళ్ళప్రొద్దుటూరులో ఆగి రోంతసేపయినంక కదిలింది. అక్కడ పెన్నానది, రోడ్డు పక్కన్నే కనిపిచ్చింది. కణేకల్లుకు మడక దున్నేకి పోయినప్పుడు చోళసముద్రం దాటినంక దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు పారుతున్నెట్ల కనిపిచ్చిన పెన్నానది అక్కన్నుంచీ యెట్లెట్ల నడుస్తా వొచ్చిందో ఆలోచనచేస్తా తాడిపత్రికి చేరుకుండాను. మల్లా అక్కడ అనంతపురం బస్సెక్కి సాయంత్రానికి మా బండమీద పల్లెకు చేరుకోని, చిన్నాయనకూ జేజికీ సీతంపల్లి సంగతులన్నీ చెప్పినాను.

గోకుడు నీళ్లకోసరం దినామూ కొట్లాటే!

నేను సీతంపల్లె నుంచీ వొచ్చినంక ఇంటినంతా శుభ్రం చేసుకుండాను. మరుసటి దినం హెడ్మాష్టర్ సార్‌తో ఎస్.ఎస్.ఎల్.సి. పుస్తకాలు యిప్పిచ్చుకుండేకి శింగనమలకు పోయి, సారోళ్లకు, మా కుటుంబమంతా వలస పోయిండే విషయం చెప్పినాను. అంతా విని సారోళ్లు చాలా బాధపడి నాకు ధైర్యం చెప్పి ‘మరి ఇప్పుడు ఎక్కడుంటావురా? ఈడికే  వొచ్చి మా యింట్లోనే వుండు. యేం పర్వాలేదు’ అని ప్రేమగా పిలిచినారు. నేను మా జేజీ, కుంటి చిన్నాయనోళ్ల సంగతి చెప్పి, పుస్తకాలన్నీ ఇప్పిచ్చుకొని  వొచ్చి, అన్నిటికీ మట్టసంగా అట్టలేసుకొని జాగ్రత్తగా పెట్టుకుండాను.

రాత్రి అన్నం తినేటప్పుడు ‘తాగేనీల్లతో శానా అగసాట్లగా వుందిరా! ఆ వంకలో బాయి నీల్లొగటే తాగేకి పనికొచ్చేది. రొండేండ్ల నుంచీ వంక పారక బాయిలో నీల్లూరడమే ల్యా! ఆ గోకుడు నీల్లు వొగ బిందెడు తెచ్చుకోవల్లంటే గగనమయితాంది. ఎవురూ లెయిక ముందే నువ్వు సుక్కబుట్టే లోపల్నే లేసి పోతే, బిందెలు మునిగేతట్ల నీల్లూరింటాయప్పా! అబ్బుడయితే దడగ్గన నాలుగు బిందెల నీల్లు సేదుకోని రాచ్చు’ అని జేజి చెప్పింది.

నేను జేజి చెప్పినట్లే మరసటి దినం, తూర్పున చుక్కపొడిచే పొద్దుకల్లా లేచి బిందె, చేంతాడూ తీసుకోని వంకలో బావి దగ్గరికి పోయినాను. ఎవురూ మనుషులు లేరు. బిల్లమింద చేంతాడుతో బిందెను బావిలోకి వొదిలినాను. నిజమే! బావిలో బిందెలు మునిగేటట్ల నీళ్లూరినాయి. నేను గబాగబా బిందెతో నీళ్లు చేదుకొని నాలుగు బిందెల నీళ్లు తెచ్చినాను. బిల్లకు కందిన వేయలేదేమో, నీళ్లబిందెను పైకి చేదినప్పుడల్లా అది ‘కయ్, కయ’ అంటా అరుస్తా వుంది. ఆ శబ్దం గంటగొట్టినట్ల చుట్టుపక్కలోళ్లందరినీ లేపిందేమో, నాలుగో బిందెనీళ్లు ఇంట్లో పోసొచ్చేలోపల్నే పదీ పన్నెండు మంది వొగొగరు ఐదారు కడవలు తెచ్చి సందిడచకుండా గబగబా నీళ్లు చేదిపోసుకోసాగినారు. వొగర్ధగంట కల్లా బావిలో వూరిండే నీళ్లన్నీ అయిపోయి  గోకుడు నీళ్లకు పడినాయి. అది చూసి, దినామూ యెట్లన్నాగానీ చుక్క పొడిచే లోపల్నే వంకలో బావినీళ్లు చేదుకోనొచ్చేది మేలనుకుండాను.

మా వూర్లో ‘తూరుబ్బాయి’ వూరికి తూర్పు పక్కన ఇంగొగబావి వుందని దాంట్లో వుండే నీళ్లు ఉప్పులని ఇంతకు ముందే చెప్పినాను గదా, కడాకు ఆ బావినీళ్లు గుడకా గోకుడు నీళ్లకు పడినాయి. పంట బెట్టుకుండే సాగునీళ్ల కథ అట్లుండనీ, కడాకు మనుషులకు తాగేనీళ్లు గుడకా దొరక్కపోతే అప్పుడు మనుషులెట్ల బతికేది? గోదావరీ కృష్ణా తుంగభద్రా నదుల్లో నీళ్లన్నీ సముద్రం పాలయితాయంట! ఆ నదుల పక్కనుండే జనాలు ఎంతదృష్టవంతులో! అంతెందుకు, ఈడుండే ప్రొద్దుటూరు సీతంపల్లి కాడ నీళ్ల సమస్సే లేదు గదా! ఎప్పుడో బ్రిటీషోళ్లు కర్నూలుకు ఎగవన, తుంగభద్రానదికి వొగ చిన్న ఆనకట్ట కట్టి, ఆ నీళ్లు కడప దంకా వొచ్చేటట్ల చేసినారు గదా, అట్ల ఈ గవర్నమెంటు గుడకా నీళ్ళు లేని అనంతపురం జిల్లాకు తెస్తే ఎంత బాగుంటాది.

ఊర్లో వుండే బావుల నీళ్లు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆలోచనచేస్తా దినామూ చిన్నాయన చేసే గుగ్గిళ్లూ బొరుగుముద్దలూ పూర్ణకడాలూ అమ్ముకోనొస్తా, తెచ్చుకోనుండే పుస్తకాలు చదువుకోసాగినాను. మొన్న రాత్రంతా దిగులుతో నిద్రరాక, తెల్లరుజామున మిద్దెమింద గాలి చల్లగా తోల్తావుంటే నెట్టుల్యాకుండా నిద్రబోయినాను. జేజి మిద్దెమీదికి రాల్యాక తెల్లవారినంక కిందనుంచి గట్టిగా పిలిచింది. నేను తెప్పరిల్లుకొని లేచి, గబాగబా చేంతాడూ బిందె తీసుకోని వంకబావికాటికి పరుగెత్తిపోయినాను. పొయ్యేటప్పటికే జనం బావిలోకి డబ్బాపావులూ బెంబులూ తాళ్లకు కట్టి వొగగ  బావిబిల్ల సందులో ఇద్దరు ముగ్గురు వొంగి, గోకుడు నీళ్లను చేది, బయట కడవల్లోకీ బిందెల్లోకీ పోస్తా వుండారు. పదిసార్లు డబ్బాపావులతో గోక్కోని పోసినా కడవ నిండడం లేదు. అట్లాటి నీళ్లకోసరం వొగొగరు నాలుగైదు కడవలూ బిందెలూ లైనుగా పెట్టి బావినీళ్ల గోకి పోసుకుంటావుండారు. వెనకుండే వాళ్లు కొట్లాడతా నోరు జేస్తా వుండారు.

‘నువ్వొగదానివే నాలుగైదు కడవలు నించుకుండే దంకా సందిడసకుంటే మేము నీ వుచ్చలు గినా తాగల్లనేమమ్మా’ అంటా వెనకుండే వాళ్లు ముందుండే వాళ్లమీద అక్కస పడతా వుండారు. అవతల పక్కనుండే బావిబిల్లకాడ మజ్జారి దాసన్న పెండ్లాం ఆరేటి నారాయణ పెండ్లాం గోకుడు నీళ్ల కోసరం మాటామాటా అనుకుంటా చెడ్డ చెడ్డ మాటల్తో తిట్టుకుంటా కడాకు కొప్పులు కొప్పులు పట్టుకుండారు. వాళ్లు అట్ల కొట్లాడుకుండేది చూసి లైట్ల తిమ్మన్న మామా దాసప్ప చిన్నాయనా వొచ్చి వాళ్ళను విడిపిచ్చినారు. అదంతా చూసి ఆ ఆడోళ్ల మధ్యలోకి దూరి, నీళ్లు గోక్కోని తెచ్చేకి సాధ్యంగాక, వుత్తబిందె తీసుకొని ఇంటికొచ్చి, జేజితో చెప్పి, చాకిరేవు గుట్టకాటికి పోయి బుగ్గకాలవలో నీళ్లు తెస్తానన్న్యాను.

‘అంతదూరం యాడబోతావప్పా! ఆ నీళ్లు తాగితే పయికాక అయి, సందకాటికల్లా వొల్లంతా సచ్చుబడిపోతాది నాయినా! సరే, యెట్లోగట్ల వొగ బిందెత్తుకోని రాపోప్పా’ అని అయిష్టంగా చెప్పింది జేజి. నేను తప్పు జేసినందుకు ఎంత ఇబ్బంది అయితావుంది అని బాధపడతా, వొగమైలు దూరంపోయి వూరోళ్లు కొంతమందితోపాటు బుగ్గకాలువకాటికి రెండుసార్లు తిరిగి రెండు బిందెల నీళ్లు తెచ్చినాను.

మా వూరి నాగభూషణం, కుళ్లాయప్పా రాసిన ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షల రిజల్ట్సు వొచ్చినాయి. వాళ్లిద్దరూ ఫస్ట్‌క్లాసులో పాసయినారు. స్నేహితులిద్దరూ పాసయినందుకు భలే సంతోషమయింది. నేను గుడకా వాళ్ల క్లాసులో వుండి, వాళ్లతోపాటు పరీక్షలు రాసిన్నింటే, నేనూ వాళ్లమాదిరి ఫస్ట్‌క్లాస్‌లో పాసయిన్నింటే, ఈ సంవత్సరంతో చదువు అయిపోయి వుండేది. హెడ్మాష్టర్ సార్ సహాయంతో యాదోవొగ చిన్న వుద్యోగంలో చేరిండొచ్చు! చేరింటే నాయనోళ్లందరూ తిరిగొచ్చిండొచ్చు! స్కూల్ రీ-వోపన్ అయినంక వొగ సంవత్సరం చదువుకుంటా గడపల్ల! అంతవరకూ నాయనోళ్లు తిరిగోస్తారో లేదో! తొందరగా తిరిగి రాకుంటే నేను ఏమేమి అవస్థ పడల్లనో యేమో! నేను అవస్థపడినా పర్వాలేదుగానీ వాళ్లకు సీతంపల్లిలో ‘అణి’ కుదురుకుంది. బతికేకి ఇబ్బందేమీ లేదు. మొన్న పోయినప్పుడు కాలువ పనులన్నీ అయిపోయినంక తోటల్లో వేసిండే ఎండకారు శెనక్కాయ పీకే కూలిపనులు మస్తుగా వుండడం చూసి ఎంతో సంతోషమయింది. ఆ పనులయిపోతానే కె.సి.కాలువ కింద మాగాణిలో దండిగా పనులుంటాయంట! నేను ఈ సంవత్సరం వొంటరిగా ఇబ్బందిపడినా వాళ్లు అంతవరకూ ఆడే వుండేది మేలనిపిస్తాది. చేతినిండా కూలిపనులు దొరికినంక వీలున్నెప్పుడల్లా ఐదోపదో పంపిస్తానని చెప్పినాడు నాయన.

ఆలోచనచేస్తా గట్టిగా చదువుకోసాగినాను. అప్పుడప్పుడు కుళ్లాయప్పనడిగి ఇంగ్లీషు పాఠాలు, నాగభూషణాన్ని అడిగి లెక్కలు చెప్పిచ్చుకోసాగినాను. కుళ్లాయప్ప ఇంగ్లీష్‌లోనా నాగభూషణం లెక్కల సబ్జెక్టులోనా చాలా ఇంటలిజెంట్సు.

ఇంట్లో పసువులు ల్యాకపోవడంతో సగం బరువు తగ్గిపోయింది. చిన్నాయనోళ్లు దినామూ గుగ్గిళ్లూ పూర్ణకుడాలూ కర్జీకాయలూ అట్లాటివి తయారుచేసేకి పొయ్యిలో కట్టెలు కావల్ల. రెండు మూడు దినాలకు వొగసారి దేవరకొండకూ బోదగుట్టకూ పోయి వొగ మోపెడు కట్టెలు కొట్టుకొని రావడమూ, తెల్లారూజామున్నే లేచి రెండు కడవలు మంచినీళ్లూ రెండు కడవలు ఉప్పునీళ్లూ చేదుకోనొచ్చి పోయడమూ, పయిటాల వరకూ చేసిండే పదార్థాలు వూర్లో అమ్ముకోని రావడమూ ఆనెంక చదువుకోవడమూ మామూలయిపోయింది. ప్రతి దినమూ, సాయంకాలం చదువుకుంటా వుండే స్నేహితులందరూ రోడ్లోకి వాకింగ్ పోతారు. దీపాలు ముట్టిచ్చేలోపల వస్తానని చిన్నాయనోళ్లతో చెప్పి నేనూ స్నేహితులతోపాటు రోడ్లోకి పోతాను.

మొన్న మిత్రులందరమూ రోడ్డు పక్కన మోరీమీద కూర్చొని అనేక విషయాలు మాట్లాడుకుండాం. బళ్లారికి ఎగువన హోస్పేట దగ్గర తుంగభద్రానది మీద డ్యాము కట్టిన విషయమూ ఆ డ్యాము నండి హైలెవల్ కెనాల్ తవ్వుతుండే సంగతీ మాట్లాడుకుంటా ఆ కెనాల్ మా శింగనమల చెరువుకు పైభాగంలో, ఏడెనిమిది మైళ్ళ దూరంలో తడకలేరు మీద అడ్డంగా, అనంతపురం పక్కనే దిగవకు పోతాదని, మా శింగనమల చెరువుకు ఆ కాలువ నీళ్లు తెప్పిచ్చుకుంటే, మాగాణి పల్లెలకు కరువుండదని చర్చించుకుండాం.

వాననీళ్లకు చెరువు కింద మాగాణి వుద్దరగా పండుతాదని, అట్లాటి చెరువుకు కాలువనీళ్లను తెప్పిచ్చుకుంటే అనవసరంగా విపరీతంగా నీటిపన్ను కట్టాల్సి వొస్తాదని, అందుకే పెద్దపెద్ద రైతులందరూ చెరువుకిందుండే ఆయకట్టును తుంగభద్రకాలువ ఆయకట్టుగా మార్చుకుండేకి వ్యతిరేకిచ్చినారంట! వ్యతిరేకిస్తా, చెరువు పై భాగంలో కాలువ ఆయకట్టుకు కాలువ నీళ్లొచ్చినప్పుడు ఆ మాగాణిలో నుంచీ పులుసునీళ్లు చెరువుకు రానే వస్తాయని, అటువంటప్పుడు చెరువు కిందుండే ఆయకట్టున కాలువ ఆయకట్టుగా చేసి అనవసరంగా పన్ను ఎందుకు కట్టల్లని రైతులు అతితెలివితో మా చెరువుకు తుంగభద్ర కాలువ లోకలైజేషన్ వద్దన్నారంట!

‘ఇది ఎంత మూర్ఖత్వం? ప్రతి సంవత్సరం నమ్మకంగా వచ్చే తుంగభద్ర కాలువనీళ్లను వద్దని, నీటి పన్ను నుంచీ తప్పిచ్చుకుండేకి ఎంగిలి నీళ్లను ఆశిచ్చి కాలువనీళ్లమీద వొచ్చే హక్కును వొదులుకుంటా వుండారంటే వీళ్లను ఏమనుకోవల్ల?’ అని నేనూ కుళ్లాయప్పా కొండన్నా ఓబుళనారాయణా బాధపడినాం. అయితే మా మాటల్ని నాగభూషణం, కోనయ్యా, తిరుపాల్ తప్పుబట్టినారు. ఎందుకంటే వాళ్లకు చెరువుకింద చాలా భూములుండాయి! చెరువును హైలెవల్ కెనాల్ కింద లోకలైజేషన్ చేస్తే నీటి పన్నును భూమి యజమానులే కదా కట్టాల్సింది! భూమిని గుత్తకో కోరుకో చేసుకుండే రైతులు కట్టరు కదా! భూమి యజమానులు నీళ్లను కొని, భూముల్ని  కౌలుకు ఇయ్యల్లనా? ఇది మా స్నేహితుల ఆలోచన! దీన్నే గదా సిరి రా మోకాలొడ్డడమంటే అని మేము గట్టిగా వాదిచ్చినాం. మా స్నేహితులయిన మావూరి భూస్వాముల కొడుకులు మా కంటే గట్టిగా వాదిచ్చినారు. వాళ్ల మాటలు విని నేను మౌనంగా చాలసేపు బాధపడినాను. ఆ తర్వాత మూడు నాల్గు దినాలు ఆ స్నేహితులు మాతో మాట్లాడలేదు. మేమయితే జరగబోయే అన్యాయాన్ని గురించి ఆలోచిస్తా, రాజకీయ నాయకులు చెరువుకిందుండే పెద్దపెద్ద రైతుల అభిప్రాయాలు గాకుండా, పేదోళ్ల అభిప్రాయాలను తెలుసుకుంటే మేలని అనుకుండాం. అయితే పేదోళ్ల మాటలు వినేదెవురు?

ఎస్.ఎస్.ఎల్.సి. లోకి నేను-నాలోకి దిగులు

ఎండకాలం శెలవులు అయిపోయినాయి. స్కూల్ రీ-వోపన్ అయ్యింది. ఎస్.ఎస్.ఎల్.సి. క్లాస్‌లోకి పోతావుండానన్న సంతోషం కలుగుతా వుంది. సంతోషం కలిగిన కొంచెం సేవటికే మనసునిండా చెప్పలేనంత దిగులు. అమ్మా నాయనా పిల్లలూ అందరూ ఎక్కడో వుండారు. ఎంత అవస్థపడతా వుండోరో యేమో! జేజీ చిన్నాయనా వున్న్యా ఎందుకో మనసునిండా వొంటరితనం.

చిన్నాయనోళ్ల ఇంట్లో పనులన్నీ చేసి ఇంట్లోకిపోయి బ్యాగులో పుస్తకాలన్నీ సర్దుకుండేకి కూర్చుండాను. బ్యాగులోకి పుస్తకాలు పెట్టుకోబుద్ధి కాలేదు. అమ్మా నాయనా గుర్తుకొచ్చినారు. వెంటనే కండ్లల్లో నీళ్లు మెదిలినాయి. నిశ్శబ్దంగా ఏడుస్తా కన్నీళ్లను పెదవులతో దిగమింగు కోసాగినాను. ధైర్యం చెప్పేవాళ్లెవురూ లేరు. జేజి అంతకు ముందే నాకు క్యారియర్లో కొంచెం బువ్వపెట్టి, గుగ్గిళ్ల గంపెత్తుకొని వూర్లోకి పోయింది. నేను అట్లే కూర్చొని, బయటికి రాలేదని చిన్నాయన గట్టిగా పిల్చినాడు. నేను జలాటి బండకాటికి పోయి ముఖం కడుక్కొని పుస్తకాల బ్యాగు తీసుకొని చిన్నాయనకు బయట్నుంచే చెప్పి స్కూలుకు బయలుదేరినాను.

‘జాగ్రత్తగా పోయి సందకాడ పొద్దుగలగ రా నాయనా’ అని చెప్పి, చిన్నాయన చేతిలో వొగ పావలా పెట్టినాడు. స్నేహితులందరూ బయల్దేరి పోయింటారని నేను గబగబా వూరి బయటికి పోయి చూసినాను. వాళ్లందరూ అప్పుడే చాకిరేవు గుట్టదగ్గర పోతావుండారని గమనిచ్చి స్పీడుగా నడవసాగినాను.

నాలుగు దినాల కిందట నాయన రాసిండే జాబు గుర్తు కొచ్చింది. దిగులు పడకుండా బాగా చదువుకోమని, చిన్నాయనోళ్లను అనుసరిచ్చి వుండమని, ఎవురితోనా గొడవ పడొద్దని, నీ చదువు కోసరమే మేమంతా ఈడ కష్టపడతా వుండేది మరిచి పోవద్దని, ధైర్యంగా వుండమని రాసిండే మాటలన్నీ మనసులో మెదలసాగినాయి. నాయనకు నేను చదువుకుండేది ఇష్టం లేదు. ఇంట్లో పెద్ద కొడుకును నేను తన కష్టాన్ని పంచుకోలేదని నాయనకు బాధ. నిజమే కావచ్చు. కానీ నేను చదువుకోకుండా కూలి పనులకు పోతా ఇంటికి సహాయపడచ్చు, అయితే నేను కూలికి పోయినంత మాత్రాన సంసారం అభివృద్ధి కాదుగదా! నేను చదువుకొని యాదో వొగ చిన్న ఉద్యోగం సంపాదిచ్చుకోకుంటే నాదీ అదే బతుకే గదా! కూలి డబ్బుల్లో అంతో యింతో మిగులుబాటు చేసుకోకుండా నాకు పంపడమనేది, కష్టమే! అయితే హెడ్మాష్టర్ సార్ ఆదుకోకుంటే నేను చదువుకోగలనా? ఆయన అవసరానికి ఆదుకుంటాడనే ధైర్యంతోనే కదా నాయన నన్ను స్కూలుకు పంపుతావుండేది! నాయనోళ్లు నాకోసరం కష్టపడేది మరిచిపోకుండా, వాళ్లు దూరంగా వుండారని దిగులు పడకుండా యెట్లయినా సరే ఈ సంవత్సరం కష్టపడి ఎస్.ఎస్.ఎల్.సి. పాసు కావల్ల, పాసయితే సార్ తప్పకుండా యెక్కడో వొగచోట ఉద్యోగం ఇప్పిస్తాడు. నేను దిగులు పడతావుంటే చదువు సాగదు. కాబట్టి దిగులు పడగూడదు.

ఆలోచన చేస్తా బిరబిరా నడుస్తా, స్కూల్ బెల్ వినపడడంతో సారోళ్ల ఇంటికి పోకుండా నేరుగా స్కూలుకు పోయినాను. స్కూల్ పీపుల్ లీడర్ తిప్పన్న ఎస్.ఎస్.ఎల్.సి. అయిపోవడంతో నేనే లీడర్‌గా ప్రేయర్ చేయిచ్చినాను. స్కూల్ పీపుల్ లీడర్‌గా ప్రేయర్లో నిలబడగానే ఇంటి విషయాలన్నీ మరిచిపోయినాను. నా క్లాస్‌మీట్ జొన్నలగడ్డ వెంకటసత్యం ప్రార్థన శ్లోకం పాడినాడు. హెడ్మాష్టర్ సార్ సూడెంట్స్‌కు చదువు, క్రమశిక్షణ విషయాలను గురించి చాలా సేపు మాట్లాడినాడు. ‘ఈరోజు నుంచీ ప్రతి దినమూ నోటీసుబోర్డు మీద వార్తాపత్రికలోని వొగ ముఖ్యమైన వార్తను విద్యార్థులు తప్పకుండా రాయల్ల’ని చెప్పినాడు. వెంకటసత్యం, తాను ఆ రోజు చదివిన వార్తను నోటీసుబోర్డు మీదరాసి, దానికింద ‘ఆంధ్రపత్రిక’ అని రాసినాడు. హెడ్మాష్టర్‌సార్ సత్యాన్ని మెచ్చుకొని ప్రతిరోజూ రాయమన్న్యాడు.

రీ-వోపన్ డే అని చాలామంది స్టూడెంట్స్ స్కూలుకు రాలేదు. ఉమావతి కూడా రాలేదు. ఎట్లుందో యేమో అని వొగ నిమిషం ఆలోచనచేసి వెంటనే స్నేహితులతో మాటల్లో పడిపోయినాను. ఇష్టమైన స్నేహితులు బాలన్నా రామచంద్రారెడ్డీ రాలేదు.

టీచర్స్ అందరూ వొచ్చినారు. అయితే ఎవురూ పాఠాలు చేయలేదు. పదోతరగతి పూర్తీ పరిక్షల పేపర్లు, స్టూడెంట్సందరూ వొచ్చిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో ఇస్తామన్య్నారు. మధ్యాహ్నం మొదటి పీరియడ్ అయిపోతానే డ్రిల్ మాష్టర్ చిదంబరరెడ్డి సార్, పిల్లలందర్నీ గ్రౌండుకు పిలుచుకొనిపోయి గ్రౌండులో వుండే చెత్తా చెదారమూ రాళ్లూ రప్పలూ పశువులు వేసిండే ప్యాడా అంతా క్లీన్ చేయిచ్చినాడు. గ్రౌండుకు కాంపౌండ్ గోడలు లేనందువల్ల శెలవుల్లో పశువులూ గొర్లూ మేకలూ అన్నీ పారాడి గ్రౌండునంతా గలీజుచేసినాయని, తూర్పున ఇండ్లవైపునా రోడ్లో నుండీ పశువులూ బిక్షగాళ్లూ సంచార జాతులోళ్లు ఎవురూ రాకుండా దక్షణం వైపున కాంపౌండ్ గోడ కట్టిచ్చే ఏర్పాట్లు చేయడానికి స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీని పిలిచి మాట్లాడమని హెడ్మాష్టర్ సారుకు చిదంబరరెడ్డి సార్ విన్నవిచ్చినాడు.

సాయంకాలం నాలుగు గంటలకే స్కూల్ వొదిలినారు. నేను చాలా అదుర్దాగా హెడ్మాష్టర్ సారోళ్ల ఇంటికి పోయి జయమ్మక్కను పలకరిచ్చినాను. నేను పోయేటప్పటికే తిప్పన్న, సారోళ్ల పిల్లల్ని ఆడిస్తా వుండాడు. పిల్లలు రవీంద్రనాథ్, సురేంద్రనాథ్, రాధా ముద్దుముద్దుగా ఆడుకుంటావుండారు. చిన్నమ్మాయి రమాదేవి మూడేండ్ల పాప. అందరూ ఎంత ముద్దుగా వుండారో, సార్ పెద్ద కొడుకు రవీంద్ర శింగనమలలోనే ఎలిమెంటరీ స్కూల్లో మూడో క్లాస్ చదువుతావుండాడు. రవిని ఆడిస్తా వుంటే నాకు మూడోక్లాస్ చదివిండే నాటి గంజికేంద్రం సంగతులన్నీ గుర్తుకొచ్చినాయి. రవి, జయమ్మక్క మాదిరే వుండాడు. సూరీ రాధా మాసార్ మాదిరి వుండారు.

జయమ్మక్క చాలా దినాల తర్వాత నేను ఇంటికి పోయినందుకు రోంత మందలిచ్చింది. శెలవుల్లో బాగా వీకయిపోయినానని బాధపడింది. నేను మా కుటుంబ పరిస్థితులన్నీ చెప్పుతా వుండంగనే స్కూల్నుంచీ సారొచ్చినాడు. ప్రేమగా పలకరిచ్చినాడు. నా పరిస్థితినంతా విని బాధపడినాడు. ‘వొక్కనివే యెందుకు ఇబ్బంది పడతావురా? ఇక్కడికే వచ్చెయ్’ అని ఇద్దరూ ప్రేమగా రమ్మన్న్యారు. నేను కుంటి చిన్నాయనోళ్ల విషయం చెప్పినాను. ‘సరే ఎప్పుడు ఇబ్బందిగా వుంటే, ఎప్పుడు రావల్లని అనిపిస్తే అప్పుడు వచ్చేసెయ్, యేం పర్వాలేదు’ అని హెడ్మాష్టర్‌సార్ మనస్పూర్తిగా చెప్పినాడు. నేను సరే సార్ అన్న్యాను.

జయమ్మక్క అందరికీ కాఫీ చేసిచ్చింది. కాఫీ తాగుతా మా ఇద్దరితో చాలా విషయాలు మాట్లాడినాడు సార్. మాట్లాడుతా నవ్వుతా ‘నువ్వు కొంచెం భాష మార్చుకోరా! ఎస్.ఎస్.ఎల్.సి.కి  వొచ్చినావు, వయసూ చదువూ పెరిగేకొద్దీ మాట్లాడే భాషలో కూడా మార్పు రావాలిరా! ఇంకా ఆ గుడకా, రోంత, ప్యాడ, రాపిచ్చుకోని, రాల్యా, ఆనెంక, అట్లాంటి మొరటు పదాలు మానెయ్యల్ల’ అని అన్న్యాడు. నేను నవ్వుతా, సరే సార్ అని అన్న్యాను. జయమ్మక్క కల్పిచ్చుకొని, కాదు కాదు కల్పించుకొని అవి పుట్టుకతోపాటు వొచ్చిన మాటలండీ, పల్లెల్లో మొరటోళ్ల మధ్యలో జీవిస్తున్నప్పుడు ఆ మాటలు రాకుండా యెట్లుంటాయి?’ అని నాకు సపోర్టుగా మాట్లాడింది.

తర్వాత కొంచెం సేపు అక్కడే గడిపి వూరికి బయలుదేరినాను. దారిలో నడుస్తా, సార్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుండాను.

నిజంగా ప్యాడ, రోంత, గుడకా, ఆనెంక ఇట్లాంటి పదాలు మొరటు పదాలా? జయమ్మక్క చెప్పినట్ల, అవి పుట్టుకతో  వొచ్చిన పదాలు కదా! మాట్లాడేటప్పుడు మాటల్లో ఆ పదాలు రాకుండా యెట్లుంటాయి? నసుకు, అమ్మిడిపొద్దు, పయిటాల, సందకాడ ఇట్లాంటి పదాలు, ఈ ప్రాంతంలో పుట్టినోళ్లందరికీ సహజమైన పదాలు కదా! అవి వాడకుండా వూర్లో జనంతో యెట్ల మాట్లాడేది? ఇంక, ఆ కడప జిల్లా వాళ్లు మాట్లాడే మాటలు వింటే సార్ ఏమంటాడో?

ఆలోచిస్తా వూరు చేరుకోని పనుల్లో మునిగిపోయినాను.

***

పదో తరగతి పూర్తీ పరీక్షలు మార్కులు చెప్పినారు టీచర్లందరూ. నాకు తొమ్మిదో తరగతి మార్కులకంటే చాలా తక్కువొచ్చినాయి. ఇంగ్లీషు, హిందీ, సైన్సు, సబ్జెక్టులలో మరీ అద్వాన్నంగా, నలభైశాతం కంటే తక్కువొచ్చినాయి. తెలుగులో మాత్రమే ఫస్ట్‌క్లాస్ మార్కులొచ్చినాయి. నాకు ఇష్టమయిన సైన్సు, సోషియల్ సబ్జెక్టులలో ఫస్ట్‌క్లాస్ మార్కులు రానందుకు చాలా బాధయింది. అయ్యవార్లందరూ దండిచ్చినారు. హెడ్మాష్టర్ సార్, లెక్కల సార్ ప్రేమగానే మందలిచ్చినారు.

ఉమావతికి కూడా నాకంటే ఎక్కువ మార్కులు రాలేదు. వెంకటసత్యం, శంకర్, రాధాకృష్ణలకు మంచి మార్కులొచ్చినాయి. నాకు  వొక్క సబ్జెక్టులో కూడా వెంకటసత్యంకు వొచ్చినన్ని మార్కులు రానందుకు చాలా బాధయింది.  తెలుగులో శంకర్, రాధాకృష్ణల కంటే నాకు ఎక్కువ మార్కులొచ్చినా, టోటల్‌పైన నా కంటే వాళ్లకు ఎక్కువ మార్కులొచ్చినాయి. అందుకే నామోషీగా ఫీలయి ఇంటర్వెల్‌లో బయటికి పోకుండా తలొంచుకొని కూర్చున్నాను. యేవోవో గుర్తుకు రాగానే కండ్లల్లోనీళ్లు మెదిలినాయి. బాలన్నా, అశ్వత్థరెడ్డీ బయట్నుంచీ లోపలికొచ్చి నన్ను వోదార్చసాగినారు. అశ్వత్థరెడ్డి వోదారుస్తూనే జోకులు వేసినాడు. బాధతో నాకు నవ్వురాలేదు. సైడు బెంచీలో వుండే ఉమావతి పలకరించి ‘కొన్ని సబ్జెక్టులలో నాకు నీకంటే తక్కువ మార్కులొచ్చినాయి  నారాయణా. నువ్వు మరీ అంత సీరియస్‌గా తీసుకుంటే యెట్ల? ఇవేమయినా పబ్లిక్ పరీక్షలా! బాధపడొద్దు ప్లీజ్’ అని వోదార్చింది. పార్వతి కూడా ఉమావతి మాదిరే అనింది. ఉమావతి బాధపడొద్దు ప్లీజ్ అని అంటానే మనసు కొంచెం తేలికపడింది. తర్వాత ‘శెలవుల్లో ఎక్కడికీ పోలేదా నారాయణా?’ అని ఉమావతి మళ్లా పలకరించడంతో సంతోషమయింది. శ్లాగు అంచుతో కన్నీళ్లు తుడుచుకొని బంధువులుంటే ప్రొద్దుటూరుకు పోయొచ్చినానని వాస్తవ విషయం దాచిపెట్టి కొంచెం నవ్వు మొగంతో ఉమావతి ముఖంలోకి చూస్తూ చెప్పినాను. చెప్పుతూ మనసులో అపద్దం చెప్పడం తప్పు గదా! అని నన్ను నేను సమర్థించుకుండాను. ఇంకా ఏదో మాట్లాడబోయింది ఉమావతి. అంతలోనే ఇన్‌బెల్లు కొట్టినారు. బయటికిపోయిన మా క్లాస్ పిల్లలందరూ క్లాస్‌లోకి వొచ్చినారు. తర్వాత రెండు నిమిషాలకే సైన్స్ టీచర్ కృష్ణమూర్తి సారొచ్చినాడు.

స్కూల్ రీవోపన్ అయిన మూడు వారాలకు మాకు కొత్త తెలుగు పండిట్ వొచ్చినాడు. ఆయనపేరు గురుమూర్తి. అదేదే కొత్తకోర్సు విద్వాన్ చదివి మొట్టమొదట మా స్కూల్లోనే ఉద్యోగంలో చేరినాడంట! తెలుగు పాఠాలు బాగా చెప్పుతా వుండాడని సంతోషమైంది. ఆయన పాఠమే కాదు, మనిషి కూడా చాలా అందంగా వుండాడు. భారత భాగవత రామాయణాలూ ఇంకా పెద్దపెద్ద కవుల కావ్యాలన్నీ బాగా చదివినట్లు ఆయన కోట్ చేసే పద్యాలవల్ల మాకు తెలిసింది. పాఠం ఎంతబాగా చెప్పుతాడో అంతకంటే ఎక్కువగా సీరియస్‌గా వుండడంతో  వెకిలిచేష్టలు చేస్తావుండే అశ్వత్థరెడ్డీ రాధాకృష్ణల అల్లరి బాగా తగ్గిపోయింది. ఆ సార్ సందర్భం వొచ్చినప్పుడల్లా ఎస్.ఎస్.ఎల్.సి. అయిపోగానే ఎవరికయినా ఇంట్రెస్టు వుంటే తిరుపతి ఓరియంటల్ కాలేజీలో నాలుగు సంవత్సరాలు విద్వాన్ కోర్సు చదివి పాసయితే ఉద్యోగం గ్యారంటీ అని చెప్పినప్పుడు నా మనసు పీకసాగింది. కానీ వెంటనే తిరుపతిలో నాలుగేండ్లు చదవడమా అని అనుకుంటానే అది అయ్యే పనేనా? నక్క ఎక్కడ, నాగలోకమెక్కడ? అని మనసు వెక్కిరించింది. అందని దానికి అర్రులు సాచడమెందుకని ఆ ఆలోచనను పూర్తిగా వొదిలేసినాను.

స్కూలు బాగా జరుగుతావుంది. అన్ని సబ్జెక్టుల్లోనా పాఠాలు బాగా జరుగుతా వుండాయి. ఎస్.ఎస్.ఎల్.సి.లోకి వొచ్చినప్పట్నుంచీ మాకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పడానికి హెడ్మాష్టర్ సార్ వొస్తా వుండాడు. ఆయన ఇంగ్లీష్ పాఠం చెప్పుతా వుంటే ఆ ఇంగ్లీష్ విని తీరాల్సిందే! మామూలుగా మాట్లాడే మా హెడ్మాష్టర్ సార్ క్లాసులోకొచ్చి పాఠం పేరు మాత్రం చూసి టెక్స్ట్‌బుక్ టేబుల్ మీద పెట్టి పాఠం చెప్పుతావుంటే ఇంగ్లీష్ వాడొచ్చి మాట్లాడినట్లుండడం చూస్తూ వింటూ నేను ఆశ్చర్యపోసాగినాను. ఆ ఉచ్ఛారణ ఎంత అద్భుతంగా వుంటాదో చెప్పడానికి కాదు. రెండు మూడేండ్ల కిందట మాకు తెలుగు టీచర్‌గా వొచ్చిపోయిన ఓబుళపతి సారు, సైన్సు టీచర్ సీతారాం సారు మా హెడ్మాష్టర్ గారి ఇంగ్లీష్ విని మా సార్‌ను జాన్‌ మిల్టన్ అని రెండు మూడుసార్లు అన్న్యారంట! ఆ విషయం బయటకొచ్చింది. మా సీనియర్సు, మా క్లాస్‌మీట్స్ హెడ్మాష్టర్ సార్ ఇంగ్లీష్ పాఠం చెప్పి బయటికిపోతానే ‘జాన్ మిల్టన్’ పాఠమే పాఠం అని వొకరుకొకరు చెప్పుకుంటారు. జాన్‌మిల్టన్ ఎవరో నాకు తెలీక వొకసారి హెడ్మాష్టర్ సార్‌నే ఇంట్లో అడిగినాను. సార్ నవ్వుతూ చెప్పినాడు.

చెరువు మరవ పారింది-చదువుకు బ్రేకు పడింది

తొలి ముంగార్లలోనే మా శింగనమల చెరువుకు దండిగా నీళ్లొచ్చినాయి. రైతులు ఆవురావురుమని మాగాణిలో పంట పెట్ట్టేకి పూనుకుండారు. నేను నాయనకు జాబు రాస్తే ఆలస్యమయితాదని, చిన్నాయనతో బస్సుకు చార్జీలకు దుడ్లు ఇప్పిచ్చుకొని సీతంపల్లికి పోయి నాయనోళ్లను ఊరికి రమ్మని బ్రతిమాలినాను. ఇప్పుడొస్తే మనకు గుత్తకో కోరుకో మడి ఎవురూ ఇవ్వరని, అనంతపురం సీతయ్యకూడా తన మళ్లను ఎవరికో వొకరికి ఇచ్చేసింటాడని పశువులూ పశువుల మేతా ఎరువూ అన్నీ వొనగూర్చుకోవడం సాధ్యం కాదని, ఇక్కడే దండిగా కూలి పనులుండాయని కూలి కూడా మన ప్రాంతాలకంటే ఎక్కువని, నువ్వు శ్రద్ధగా చదువుకొని పదకొండో తరగతి పాయి యాదయినా వొగ చిన్న ఉద్యోగానికెక్కినంక వస్తామని, నాయనా అమ్మయ్యా ఇద్దరూ గట్టిగా చెప్పినారు. నేను ఆశగా పోయి వొకరోజుండి నాయనతో పదిరుపాయలు డబ్బులిప్పిచ్చుకొని అమ్మయ్య దంచిన చిట్లంపొడి పొట్లము తీసుకొని నిరాశగా వెనక్కి తిరిగొచ్చినాను.

పశువులూ పశువుల మేతా పేడాగసువూ ఈ పనులు మాత్రం లేకపోయినా మిగాతా పనులన్నీ ప్రతిదినమూ చేస్తా స్కూలుకు పోతావుండాను. శని, ఆదివారాలొస్తానే తప్పకుండా మళ్లల్లో కూలిపనులకు పోవల్సిందే! పోకుంటే జేజి గొనుగుతా వుంటాది. చిన్నాయన కూడా అదొగ రకంగా మాట్లాడుతాడు. సాయంకాలం స్కూలు వొదుల్తానే తొందరగా ఇంటికి రావల్ల! రానప్పుడు చిన్నాయన తిట్టడం మొదలుపెట్టినాడు. చిన్నాయన అట్ల తిట్టినప్పుడు భలే బాధయితాది. వొక్కొగసారి అనుకోకుండా కన్నీళ్లొస్తాయి, ఏడుపొస్తుంది. వాళ్లకు కనిపించకుండా పక్కకుపోయి ఏడుస్తా, వీళ్లు పెట్టే అన్నం తింటావుండానని కదా, ఈ మాటలన్నీ. వీళ్లు పెట్టింది తినకుండా నేనే పక్కన అన్నం వొండుకొని చింతకాయ తొక్కుతోనో చిట్లంపొడితోనో కొంటెం తిని కొంచెం మధ్యాహ్నానికి క్యారియర్లో పెట్టుకొనిపోతే సరిపోతాది కదా! అని ఆలోచనచేస్తాను. అవును, బియ్యమూ చింతొక్కు చిట్లంపొడీ అన్నీ అయిపోయినంక అప్పుడేంగతి అని నాలోనేను మదించుకుంటాను. చిన్నాయన తిట్టినప్పుడు అలిగి బాధపడతాను.

‘యేమి కట్టపడతా వుండావురా అంతగా బాధపడతావుండావు, మీ నాయనోళ్లు ఈడున్నెప్పుడు దినామూ రుషింగమయ్య కొండకు పోయి గడ్డి పీక్కోనొచ్చి ఇంట్లో యాదుంటే అది గతికి స్కూలుకు పరిగెత్తి పోతావుంటివి గదా! ఇప్పుడేమయింది నీకు? మేము పరగా వాల్లమని పని చెయికూడదనుకుండావా? మీ నాయినోళ్లెవురూ ల్యాకపోయినా లచ్చనంగా తిని స్కూలుకు పోతావుండావు గదా! ఇంగేమి నీకు నొప్పులు? మేమేందన్నా నీకు బరువయిన పని చెప్పుతావుండామా?’ అని చిన్నాయన మెల్లగనే అనాల్సిందంతా అన్న్యాడు నిన్న. నేను తలొంచుకొని బాధపడతా మౌనంగా ఇంట్లోకిపోయి గోడకు ఆనుకొని మోకాళ్లు ముడుచుకొని ముఖం పక్కకు తిప్పి మోకాళ్లమీద పెట్టుకొని బాధపడసాగినాను. బాధతో కన్నీళ్లు కారుతానే వుండాయి. ఎంతసేపు కారినాయో, మోకాళ్లు రెండూ తడిసిపోయినాయి.

జేజి వొచ్చి అన్నం తినేకి పిలిచింది. నాకొద్దు ఆకలిగా లేదన్న్యాను. దగ్గరికొచ్చి ‘పెద్దోడు మీ సిన్నాయిన రొండు మాటలు అనగూడదమేప్పా? రారా బువ్వదగ్గిర అట్లలిగితే యెట్ల నాయినా?’ అని చెయ్యి పట్టుకొని పోయి అన్నం పెట్టింది.

రాత్రి పొద్దుబోయినంక భయంకరమైన వర్షం పడసాగింది. జేజీ వాళ్లింట్లో రెండు గుమ్మళ్లు పడినాయి. నేను గోనిపట్టను తలమింద కొప్పిరేసుకొని, మిద్దెమీదికి పోయి, గుమ్మళ్లను కాళ్లతో తొక్కి, చవుడేసి వొచ్చినాను. ఇంట్లో వడ్లగింజలు తడిసిపోతాయని గబగబా గంపతో మా ఇంట్లో పోసినాను. వాళ్ల ఇండ్లంతా పొటుకెత్తడం మొదలుపెట్టింది. చిన్నాయనను వీపుకు కరిపిచ్చుకొని మా ఇంట్లోకి ఎత్తుకొనిపోయి నులకమంచం మీద కూర్చోబెట్టినాను. నేనూ, జేజీ మంచం పక్కన నేలమీద గోనిసంచులు పరుసుకొని పండుకుండాం. కొంచెం సేపయినంక చిన్నాయన నన్ను లేపి నా తలకాయను తన మోకాళ్లకు ఆనిచ్చుకొని ‘నా బంగార్రా నువ్వు చదువుకొని పెద్ద ఆఫీసర్ కావల్ల నాయనా’ అని తల నిమురుతా యేడ్చినాడు. వర్షం ఆగిపొయ్యేదంకా ముగ్గురమూ మాట్లాడుకుంటా ఆ తర్వాత నిద్రబోయినాం.

తెల్లారినంక చుట్టూ మూడు నాలుగు ఆమడల దూరంలో భారీవర్షమని మా చెరువు మరవ పారతావుందని తెలిసింది. అంబలిపొద్దు అన్నం తిని జతగాళ్లతో కలిసి శింగనమల స్కూలుకు బయలుదేరినాను. చాకిరేవు గుట్టదగ్గర మళ్ల మీద నీళ్లన్నీ బ్రహ్మాండంగా పారుతా వుండాయి. ప్రతి దినమూ నడిచే దారిగుండా నీళ్లల్లోకి దిగి, నిక్కర్లు పైకెత్తుకుండాం. నీళ్లు గజ్జలదంకా వొచ్చినాయి. నిక్కర్లు సగం తడిచిపోయినాయి. అందరమూ నవ్వుకుంటా ఆ మళ్ల మీద నీళ్లవంకను దాటుకొని, తడిసిన నిక్కర్లను పిండుకొని, శింగనమల దావ గెనాల మీద జారుతావుంటే మెల్లగా నడుస్తా మరవంక దగ్గరికి పోయినాం. వంకలో మరవనీళ్లు, పెద్ద నది మాదిరి పారుతావుండాయి. అవతలవాళ్లు ఆవతలే! ఇవతలివాళ్లు ఇవతలే! నిలిచిపోయినారు.

అందరూ ఏరుదాటేకి సాధ్యంకాదని, పొరపాటుతో దిగితే ప్రమాదమని, అంతకు ముందు శివపురమోళ్ల గిత్తలు రెండు కొట్టుకొని పోయినాయని అందరూ అనుకోబట్టినారు. చూస్తా చూస్తా వుండంగనే  యేట్లో నీళ్లెక్కువయి, మేము నిలుచుకోనుండే గట్టువరకూ వొచ్చినాయి. పైన్నుంచీ, వంక పక్కనుండే రెండు తుమ్మచెట్లూ, ఎవురివో మడకా పాకుమానూ నీళ్లల్లో కొట్టుకొని పోతావుంటే చూస్తా ఆశ్చర్యపోయినాం. చెరువు మరవకట్టమీద మూరెడు లోతుతో మరవ పారుతావుందని తెలిసింది. అందరమూ స్కూలుకు పోవడం వీలుగాక వెనక్కి  తిరిగొచ్చినాం.

చుట్టుపక్కలుండే పల్లెలోళ్లూ మావూరోళ్లూ  చెరువు మరవ అద్భుతంగా పారుతా వుందని చూడడానికి ఎద్దులబండ్లు కట్టుకొని పోతావుండారు. చిన్నాయనను అడిగి నేను జతగాళ్లతో కలిసి చెరువు మరవకొమ్మ దగ్గరికి యెల్లవారినాం. శివపురం దాటుతానే మరవపారే నీళ్ల శబ్దం వినిపిస్తా వుంది. మరవ దగ్గర్నుంచీ నీళ్లు పెద్దపెద్ద గుండ్ల మీద నుంచీ ముసలి మడుగులోకి దుంకుతావుంటే, పొగ పైకెగురుతా వుంది. అందరమూ పరుగెత్తుకుంటా పోయి చూసినాం. అత్యద్భుతం! నీళ్లు అంతద్భుతంగా పారుతా వుంటే నేను చూడడం అదే మొదటిసారి. మరవనీళ్లలోకి మనుషుల్ని దిగనీయకుండా తలార్లూ నీరుగంటోళ్లూ తాళ్లు కట్టి బోనా కట్టెలు పట్టుకొని జనాన్ని అదుపు చేస్తా వుండారు. మరవకొమ్మ టర్నింగులో, తాడిపత్రి రోడ్లో నుంచీ ఇరవై ముప్పై అడుగులు లోతుకు వాలుగా వుంది! శింగనమలకు పోయే కట్టకింద రోడ్డు, ఆ రోడ్డుకు కుడిపక్కన, మరవనీళ్లు ఇటువైపురాకుండా, అవతలికి వొత్తి, ముసలి మడుగులోకి పడేట్ల చేస్తావుండే చిన్న ఎర్రగుట్ట దడిలో గంగమ్మగుడి వుంది. జనమంతా గంగమ్మగుడి దగ్గర టెంకాయలు కొట్టి, టెంకాయొప్పుల్నీ, వక్కపేళ్లనూ తమలపాకుల్లో పెట్టి నీళ్లల్లో విసిరేస్తా వుండారు. ఆ టెంకాయొప్పుల కోసరం నీళ్లల్లోకి పోకుండా పిల్లోళ్లను అదుపుచేస్తా వుండారు తలార్లు. మేము జతగాళ్లందరమూ ఆ చిన్న గంగమ్మ గుట్టనెక్కి నీళ్లు, మడుగులోకి దుముకేది చూసి అబ్బురపోయినాం.

నేను, ఆ గుట్టమీద నుంచీ ఉత్తరంవైపున, మాగాణి అవతల కనిపిస్తా వుండే శింగనమల వైపు చూసినాను. శింగనమల కుమ్మరగేరినీ, చిన్న కాలువగేరినీ ఆనుకొని దిగవకు, గోవిందరాయునిపేట, సోదనపల్లి పొలాలకు పొయ్యే చిన్న కాలువ మోరీ కనిపిస్తా వుంది నాకు. మధ్యాహ్నం స్కూలు వొదుల్తానే పిల్లోళ్లం అందరమూ పయిటాలన్నం తినడానికి కూర్చుండే మోరీ అది! శింగనమల వాళ్లు అర్జెంటుగా అనంతపురం పోవల్లన్న్యా, తాడిపపత్రికి పోవల్లన్న్యా, ఆ మోరీ దగ్గర్నుంచీ ఈ మరవకొమ్మకు రావల్సిందే! మడికట్లల్లో ఆ దావ కనిపిస్తా వుంది. ఆ సీల్దావెంట వొచ్చే మనుషులు కనిపిస్తా వుండారు. వాళ్లు, మరవకొమ్మ రోడ్లోకి రావల్లంటే మరవ వంకలో దిగి దాదాపు నూటాయాభై అడుగులు పైకి రావల్సిందే! అట్లాటి గుట్ట మోటుకు దక్షిణం వైపుండే చెరువుకట్టను ఆనించి, మున్నూరు నన్నూరేండ్ల కిందటనే చెరువుకట్టను ఎంత ప్లాన్డ్‌గా కట్టినారో చూస్తా అబ్బురపోయినాను. చెరువుకట్టంతా బయటా లోపలా మెట్లమాదిరి కాలుపురాళ్లు పొందించి, మధ్యలో మట్టిపోసి కట్టినట్లుంది. అయినా ఇంతవరకూ చెరువుకట్ట తెగిందే లేదంట! అదెట్ల కట్టినారో అనుకుంటే, ఆశ్చర్యమయి తాది.

ఆరేండ్ల కిందట, తూము ఎత్తేనాడు నాయనవెంట  వొచ్చినప్పుడు చెరువుకట్టనూ మరవనూ, మరవనీళ్లు కిందికి దుమికే లోయనూ ఇంత నిగాగా చూల్లేదు. ఇప్పుడు చూస్తా, ఆనాటి ఇంజనీర్ల పనితనం ఎంత గొప్పదో అని ఆశ్చర్యపోయినాను. మరవ పారేటప్పుడు మా శింగనమల చెరువు మరవ దగ్గరున్నంత గంభీరమయిన సౌండు, నీళ్లు కిందికి దుముకే విధానం ఇంక యా చెరువు మరవ దగ్గరా వుండదేమో అనుకుంటా స్నేహితులతో కలిసి ఇంటికొచ్చినాను.

***

చెరువు మరవ పారేది కొంచెం తగ్గింది కానీ మరవ వంకలో దాటు కొని శింగనమల స్కూలుకు పొయ్యేకి వీలుకాలేదు. చెరువు ఎగవప్రాంతంలో రెండు మూడు కుంటలు తెగిపోయి ఆ నీళ్లన్నీ తడకలేరులోకి వొస్తా వుండాయని, ఇంకా వారం దినాల వరకూ మరవ పారేది తగ్గదని, అందరూ అనుకోవడంతో వారం దినాలు స్కూలుకు పోకుంటే ఎంతకష్టమని, మరవ పారక ముందే సారోళ్ల ఇంట్లో వుంటే బాగుండేదని మనసు గిలగిల తనకలాడింది. అయినా ఏమి చేసేకీì కాదు. చెరువుకు ఇవతల వైపునుండే కొర్రపాడు, నీలారెడ్డిపల్లి, శివపురం, మా వూరు నుంచీ స్కూలుకు పోయే పిల్లోళ్ల అందరి పరిస్థితీ ఇదే కదా అనుకొని ఈ వారం దినాలూ మళ్లల్లో కూలి పనులకు పొయ్యేది మేలుగదా అని ఆలోచనచేసి చిన్నాయనతో చెప్పినాను. సంతోషపడినాడు చిన్నాయన. అయితే, శని ఆదివారాల కూలి మాత్రం మీకిచ్చి మిగతా దినాల కూలి దుడ్లతో నేను వొగ అంగీ నిక్కరా కుట్టిచ్చుకుంటానని చెప్పినాను. సరే అన్న్యాడు చిన్నాయన.

చెరువు మరవ పారేది పదిదినాలకు బాగా తగ్గిపోయింది. పదిదినాలు మళ్ళల్లోకి కూలికి పోయినందుకు పదైదు రుపాయలు చేతికొచ్చింది. పదైదు రుపాయలకు అయితే వొక ట్రౌజరూ వొక శ్లాగూ కుట్టిచ్చుకోవచ్చు. కానీ రెండు దినాల కూలి మూడు రుపాయలు ఇంట్లో ఇస్తానని చెప్పినాను. ఇవ్వకుంటే బాగుండదు. చాలా దినాల నుంచీ ట్రౌజర్ కుట్టిచ్చుకోవల్లని ఆశ. ఆ ఆశ ఇప్పుడు తీర్చుకోవచ్చు. అదే చిన్నాయనతో చెప్పినాను. చిన్నాయన కొంచెం కోపంగా నిష్టూరంగా మాట్లాడినాడు. దాంతో నేనేమీ మాట్లాడకుండా ఐదు రుపాయలు చిన్నాయన చేతికిచ్చి, ‘నాకు వరి మడి కోతలప్పుడు వొక ట్రౌజర్ కుట్టిచ్చు చిన్నాయనా’ అని అడిగినాను. చూస్తాన్లే అన్న్యాడు గానీ తప్పకుండా కుట్టిస్తానని చెప్పలేదు. మనసు చప్పగ చేసుకొని పదకొండోదినం వంకలో అవస్థపడి వూరి స్నేహితులతో పాటు స్కూలుకు పోయినాను.

స్పెషల్ ఫీజు కట్టలేదని అటెండెన్స్ రిజిష్టర్లో మా పేర్లు తీసేసినారు. మా పేర్లతోపాటు, సోదనపల్లి బాలన్న, మట్లగొంది గంగరాజు, ఈస్ట్ నరసాపురం డి.పి. ఖాసీం పేర్లు తీసేసినారు. మా క్లాస్ టీచర్ సత్యనారాయణ సారు పది దినాలు స్కూలుకు రానందుకు సీరియస్‌గా దండించినాడు. మేము చెరువు మరవ విషయం చెప్పినాం. వేరే మార్గం చూసుకోని రావొచ్చు కదా అన్నాడు. యేట్లొచ్చేకీ వేరే దారే లేదు సార్ అని చెప్పినాన్నేను. అందర్నీ హెడ్మాష్టర్ దగ్గరికి పొమ్మన్నాడు. హెడ్మాష్టర్ సార్ కోప్పడతా ‘ఈ సంవత్సరం మీకు పబ్లిక్ పరీక్షలు రా! వారం రోజులు క్లాసులకు మిస్సయితే యెట్లరా?’ అని అందరిపేర్లూ అటెండెన్సు రిజిష్టర్లో రాయించినాడు. నేను మా క్లాస్‌లోకి పోయినాను.

‘ఎందుకు నారాయణా పది రోజులు స్కూలుకు రాలేదు? ఏమైంది?’ అని ఉమావతి ప్రేమగా అడిగింది. నేను విషయం చెప్పినాను. ‘మ్యాథ్స్‌లో రెండు ఛాప్టర్లు అయిపోయినాయి. వెంకట సత్యంతో నోట్స్ ఇప్పిచ్చుకోని రాసుకో’ అని సలహా ఇచ్చింది. నేను సత్యంతో నోట్స్ ఇప్పిచ్చుకొని, నాలుగో పీరియడ్ టీచర్ లేక, ఖాలీగా వుండడంతో నా నోట్స్‌లో రాసుకుంటా, ‘ఉమావతి తన నోట్స్ ఇవ్వొచ్చు కదా!, సత్యంతో ఇప్పిచ్చుకోమని ఎందుకు చెప్పినట్లు? తన నోట్సు ఇస్తే, ఎవురయినా ఏమనుకుంటారో అని బిడియపడిందేమో! ముందే అశ్వత్థరెడ్డీ, రామచంద్రారెడ్డీ కోతినాయళ్లు, ఉమావతి నోట్సు నాకు ఇచ్చిందని తెలిస్తే వూరకనే వుంటారా? ఇదంతా వూహించుకొనే, ఉమావతి నాకు తన నోట్సు ఇవ్వలేదేమో!’, అనుకుంటా కొంత నోట్స్ రాసుకుండాను. రాసుకుండానే గానీ నాకు ఆ లెక్కలు అర్థం కాలేదు. నేను కాంపోజిట్ మ్యాథ్స్ కాకుండా జనరల్ మ్యాథ్స్ తీసుకోనుంటే బాగుండేది! వొక ఆదివారం సత్యం దగ్గరికిపోయి నాకు అర్థంకాని లెక్కను చెప్పిచ్చుకుండేది మేలు! అట్లే ఇంగ్లీషు నోట్సూ తెలుగు నోట్సూ ఇప్పిచ్చుకొని రాసుకోవల్ల అని అనుకొని సాయంకాలం స్కూల్ వొదులగానే తొందరగా ఇల్లు చేరుకుండాను.

(ఇంకా ఉంది)

Exit mobile version