[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
మా మగపిల్లోళ్ల జట్టులో ‘ఎర్రెమ్మ’ కబడీ ఆడి..
సాయంకాలం లాస్ట్ పీరియడ్ డ్రిల్ క్లాసుంటాది. డ్రిల్‌మాస్టర్ లేనప్పుడు మా వూరూ శివపురం స్టూడెంట్స్ అందరమూ వూర్లకు బయలుదేరి మరవ వంక యేటి గడ్డన వొకచోట మెత్తని ఇసకలో చెడుగుడు (కబడీ) ఆట ఆడతా వుంటాం. అట్ల నిన్న ఆడినాం. ఆడ, మెత్తని యేటిగడ్డ తెల్లని ఇసకలో బలిగుడు ఆడేకి భలే బాగుంటాది. ఆడేవాళ్లను చూసి దారెంట పొయ్యేవాళ్లొచ్చి మేమూ ఆడతామంటారు.
అందరమూ పుస్తకాల బ్యాగులు పక్కన పెట్టి రెండు జట్లుగా అయినాం. ఈ మధ్యలో శివపురం పట్రోళ్ళ ఎర్రెమ్మ కూడా సిగ్గూ యెగ్గూ లేకుండా మా మొగపిల్లోళ్ల జట్టులో చేరి ‘చెడుగుడు’ ఆడతా వుంది. ఆ పాప నిన్న మా జట్టులో వుండి ఆడేకి దిగింది.
ఎర్రెమ్మ పూర్తీ నలుపూ ఎరుపూ కాని రంగులో చాలా బాగుంటాది. చక్కని ముక్కూ మొగం! వెండిపూసల సరం మాదిరి నిగనిగ మెరిసే తెల్లని పలుపరుస! పెద్ద కళ్లు! పక్కపాపిటి దువ్వి అందంగా వేసుకున్న జడ! ముందరి పక్క రెండు గుంతలుగా నొక్కుకున్న తల వెంట్రుకలు! నవ్వితే సొగసుగా కనిపించే గుంత చెక్కిళ్లు! రెండు చెంపలపైన గాలికి అందంగా కదలాడే పుల్లెంట్రుకలు! బుల్లిగడ్డం కింద నల్లని సన్నని పులిపిరి! గొంతులో రౌండుగా చుట్టినట్లుండే మూడు, చర్మం గీతలు! కింది గీతకింద వొగ చిన్న బంగారు గొలుసు! చెవుల తమ్మీలలో, నడిచేటప్పుడు నాట్యంజేసే లోలాకులు! కుంకుమరంగు లంగాపైన అదే రంగు మల్లెపూల తెల్లని జాకెట్టు! లంగాజాకెట్టుపైన పచ్చని నీలంరంగు పైట!
ఎర్రెమ్మ లంగాను గోసిపోసి, నీలం పైటకొంగును నడుముకు బిర్రుగా చుట్టుకొని, జడను ముడిచి కొప్పుకట్టుకొని, మా చెడుగుడు (కబడీ) జట్టులోకొచ్చి నిల్చుకుంది. బిర్రుగా నడుముకు చుట్టుకున్న పైట కొంగులో నుంచి చెస్టుబాల్స్ లావుగా గుండ్రంగా అందంగా కనిపిస్తావుంటే లంగా గోసికింద, మోకాళ్లపైన కింది తొడలు ఎర్రగా అగుపిస్తావుంటే చూపు పక్కకు తిప్పుకోబుద్ధి కాలేదు నాకు. కోనయ్య అయితే ఆవతలి జట్టులో నుంచీ ఆవురావురమని చూస్తా వుండాడు. ఓబుళ నారాయణ నీళ్లు నములుతా వుండాడు. ఆ పాప మాత్రం యాదీ పట్టిచ్చుకోకుండా, డోన్ట్‌కేర్ మాష్టర్ మాదిరుంది.
చెడుగుడు ప్రారంభమయ్యింది. అవతలి జట్టులో నుంచీ తాంబురాయప్ప కొడుకు తిరుపాల్ గుడుగుతా ఈకొన నుండే నన్ను అంటేసేకి వొడుపుగా వొచ్చినాడు. ఆ కొననుండి ఎర్రెమ్మ సింహం పిల్ల మాదిరొచ్చి తిరుపాల్ కాలుపట్టుకొని కిందపడేసింది. మిగతా మా జట్టోళ్లు తిరుపాల్ని అదంబట్టినారు. తిరుపాల్ ఔటయినాడు.
మా జట్టులో నుంచీ ఎర్రెమ్మ అవతలి జట్టులోకి వొడుపుగా స్టెయిల్‌గాపోయి గుడుగుతా దగ్గరికొచ్చే వాళ్లను తాకేటట్ల కాలును పైకెత్తి విసురుతా చిటెకె వేసుకుంటా కుడి వైపుండే వాళ్లను సోపుతా వుంది. అది చూసి ఎడమవైపు కొనానుండే కోనయ్య వొడుపుగా దూరి ఎర్రెమ్మను పట్టుకుండాడు. ఎర్రెమ్మ కిందపడింది. అంతటితో వదలకుండా కోనయ్య ఆ పాపను గట్టిగా అదంబట్టినాడు. కోనయ్య మీద మిగతావాళ్లు పడినారు. కోనయ్య ఏమిచేసినాడో ఏమో పైకి లేచినంక ఎర్రెమ్మ కోనయ్య చెంపల్ని పగలగొట్టింది. ‘సువర్నా కొడకా, నామిద పడి ఎక్కడెక్కడో చెయ్యేస్తావా? ఎవురనుకుండావు నన్ను? శివపురం పట్రోళ్ల వెంకటేష్ బిడ్డనని గుర్తుపెట్టుకో!’ అని గట్టిగా కోనయ్యను తిట్టసాగింది.
‘ఏయ్ నోర్మూసుకోవే లంజా! సిగ్గుల్యాక మొగపిల్లోళ్లతో బలిగుడి ఆడేకి దిగి, గేమ్‌లో నిన్ను పట్టుకుంటే నన్ను కొడతావా? నువ్వు నీ తొడలు చూపించుకుంటా, కాలెగరేసి చిటికెలేస్తా మమ్మల్ని ఔట్ చేసేకి చూస్తావుంటే మేము గాజులు తొడుక్కొని వూరకనే వుండల్లనా? కొట్టింది చాలక, నన్ను సువర్ నా కొడకా అని తిడతావా? ఎంత పొగురే నీకు? నువ్వు పట్రోళ్ల వెంకటేశ్ బిడ్డవయితే నేను భయపడతాననుకుండావా? నేనెవురో తెలుసునా? వడుగూరు చెండ్రాయుని కొడుకును, గుద్దమూసుకోని పక్కన కూర్చో’ అని కోనయ్య అసహ్యంగా మాట్లాడినాడు. ఆ పాప రెచ్చిపోయింది.
‘రేయ్ లవుడేకా బాల్, లంజా గింజా అని అంటా వుండావు, యేందిరా నీ కత? మీ నాయనా మా నాయనా యెవురూ వొద్దు! మొగోనివయితే రా రా’ మనిద్దమే చూసుకుందాం!’ అంటా తొడగొట్టింది ఎర్రెమ్మ. అది చూసి నేను ఆశ్చర్యపోయినాను, అందరమూ వూరకనే వుంటే ఎర్రెమ్మ కోనయ్యను తిప్పలాడిచ్చి తన్నేరకంగా వుందనుకొని నేను ముందుకు పోయి ఇద్దరినీ కంట్రోల్ చేసినాను. చెడుగుడు ఆడేటప్పుడు అపోజిట్ ప్లేయర్ని ఔట్ చేసేందుకు పట్టుకోవడం తప్పుకాదని, ఆడపిల్లను నిన్ను, చెడుగుడు జట్టులోకి తీసుకోవడమూ నువ్వు రావడమూ మాదీ నీదీ తప్పేనని, ఇద్దరూ దుబారుగా తిట్టుకోవడం గేమ్స్ స్పిరిట్ కాదని ఇద్దర్నీ మెల్లగా మందలించినాను.
‘గేమ్స్‌లో ఇంకా మొగోళ్ళూ ఆడోళ్లూ అనే భేదాలు యాడుండాయి నారాయణా? కలిసి ఆడేటప్పుడు ఎట్లుండల్లనో మొగోళ్లకు సంస్కారముండల్ల!’ అని ఎర్రెమ్మ తగ్గకుండా మాట్లాడింది. నేను సర్దిచెప్పినాను. అంతటితో ఎర్రెమ్మ వూరకనే అయింది. ఇంక చెడుగుడు చాలనుకోని అందరమూ వూర్లకు బయలుదేరినాం.
మాగాణి కింద వరిమళ్లన్నీ కరుకుతో వుండాయి. రెండేండ్ల నుంచీ సరిగా పంట పెట్టని భూముల్లో పైర్లు బ్రహ్మాండంగా వుండాయి. వొగ మడిని మించి వొగ మడి పోటీపడినట్ల అద్భుతంగా నవురుగా వొస్తా వుండాయి. పడమటి ఎండకిరణాలకు పైర్లు మెరుస్తా వుండాయి. వొక కయ్యలోనికి తీరుబండల మీద దొర్లే నీళ్ల శబ్దం వినసొంపుగా వుంది. పిల్లకాలువల్లో నీళ్లు పారుతా గలగలమంటావుండాయి. కొన్ని మళ్లల్లో నీళ్లు దండిగా పెట్టినారేమో, గెనాల మీద పోర్లిపోతా వుండాయి. బీటి మళ్లల్లో నడిచినట్ల కాకుండా పిల్లోళ్లందరమూ దావ గెనాల మీద వొగరి వెనకొగరు జాగ్రత్తగా నడుస్తా పోతా వుండాం.
ఎర్రెమ్మ చాలా గట్టిదే! కోనయ్యను ఎంతకోపంగా కొట్టింది! వొగ పరాయి వూరి మొగపిల్లోన్ని కొట్టడానికి ఎంతధైర్యముండల్ల! ఎంత గట్టిగా కొట్టిందో యేమో, కోనయ్య చెంపలు ఎర్రగయినాయి. చూస్తా వుంటే ఎర్రెమ్మ కరాటే నేర్చుకుందేమో! చాలా స్ట్రెంగ్తీగా వున్నెట్లుంది! లంగా, గోసి పోసుకొని, పైట కొంగును బిర్రుగా నడుముకు చుట్టుకొని మనిషి ఎంత అద్భుతంగా వుంది? తొడలపైకి లంగాను గోసిపోసుకొని అట్ల మొగపిల్లోళ్ల మధ్యలోకి వొగ పిల్లోనిమాదిరి, ఆ మొరటు గేమ్ చెడుగుడు ఆడేకి దిగిందంటే ఎంత ధైర్యముండల్ల? మిగతా ఆడపిల్లోళ్లు మొగపిల్లోళ్ల మధ్యలో వొక నిమిషం సేపు వుండల్లంటేనే సిగ్గు పడతారే! ఎర్రెమ్మకు కొంచెం గానీ సిగ్గని పించలేదేమో! ఆ పాపకు సిగ్గనిపించకపోతేమానె, చెడుగుడు ఆడేటప్పుడు ఆవతలి ప్లేయర్లు ఇవతలోన్ని, ఇవతలి ప్లేయర్లు అవతలోన్నీ వోడించల్లని గట్టిగా పట్టుకోవడమూ వాడు తప్పించుకోని పొయ్యేకి చూడడమూ అందరూ వాన్ని అదంబట్టుకోవడమూ మామూలే కదా! తనను గట్టిగా పట్టుకుండాడని కోనయ్యను అంత గట్టిగా కొట్టడమేమిటి? సువర్ నా కొడకా, లవడేకే బాల్ అని తిట్టడమేమిటి? అందులో వయసులో వుండే ఆడపిల్ల, అట్లాటి గబ్బుమాట అనొచ్చునా?’
కోనయ్య కూడా, ఆడపిల్ల అని అనుకోకుండా అంత గట్టిగా అదంబట్టకూడదు. ఇతగాడు చాలా అసాధ్యుడేలే, చెస్ట్‌బాల్స్‌ని పిసికింటాడు. తొడలకింద చెయ్యి పెట్టింటాడు! అంతలేనిదే ఆ పాప అంత సీరియస్ అయితాదా? కోనయ్య చాలాసార్లు ఆ పాప అందచందాలను చెస్టుబాల్స్‌నూ నడకతీరునూ వర్ణిస్తా గుటకలేసేవాడు! అట్లాది దొరికితే వొదుల్తాడా? పైగా ఆ ఆట అట్లాది, ఏదో చేసింటాడు! చేసినోడు వూరకనే వుండకుండా, ఆ పాపను లంజా లవుకా అని అట్లా గబ్బుగబ్బు మాటల్తో తిట్టగూడదు కదా! చాలా పనికిమాలినోడు! అట్లావాడు కాకపోతే, ఆ ఆవులోళ్ల మల్లేసుబిడ్డ నాగలక్ష్మి, చెల్లెలు వరసయితాది, అట్లా పిల్లకు లైనేస్తాడా! ఆ పిల్ల చాలా అందంగా నైస్‌గా వుంటాదనుకో! ఎంతందంగా వుంటే మాత్రం, చెల్లెలి వరసయిన ఆ పిల్లవెంట పడతాడా? ఉమావతి అంటే నాకూ ఇష్టమే! ఇష్టముందని యానాడయినా ఉమావతిని ఫాలో అయినానా?
‘ఆ రోజు ఎర్రెమ్మకు ఆపోజిట్ జట్టులో నేను లేకుండా వుండడమే మంచిదయ్యింది లేకుంటే ఆ పాపను వోడించేకి నేనూ ఆ పాపను పట్టుకోడానికి పొయ్యిండేవాన్నే కదా! పోయి పట్టుకున్నెప్పుడు చెయ్యో కాలో ఆ పాపను తాకల్సిందే కదా! తాకింటే ఎర్రెమ్మ నన్ను గురించి ఏమనుకొని వుండేదో? ఛీ ఛీ’ తలకాయి విదిలించుకొని ఆలోచనల్లో నుంచీ బయటపడినాను.
చిన్నాయనకు ఆరోగ్యం బాగలేక నా ట్రౌజర్ ఆశ తీరలేదు
అర్ధపరీక్షలు అయిపోయినాయి. వూర్లకు వెళ్లిపోతా నేనూ, బాలన్నా, నరసాపురం డి.పి.ఖాసీం ముగ్గురమూ హెడ్మాష్టర్ సారోళ్ల ఇంటికి పోయినాం. ‘సంక్రాంతి శెలవులు అయిపోయినంక ముగ్గురూ ఈటికే వొచ్చి చదువుకోండిరా! నేను యాదొ వొగటి పాత ఇల్లు ఏర్పాటు చేస్తాను’ అని మా సార్ ప్రేమగా చెప్పినాడు. మేము ముగ్గురమూ సరే సార్ అన్న్యాము. కొంచెం సేపు జయమ్మక్కతో మాట్లాడి, అక్క పెట్టిన కారంచుట్లు తిని, సారోళ్లతో చెప్పి వూర్లకు బయలుదేరినాం. మాగాణిలో కల్లాల పక్క చూస్తా, అప్పుడే సగం మడికోతలు అయిపోయినాయి, రేపట్నుంచే మడికోతలకు పోయి కూలిగింజలు సుమారుగ జమజేసుకోని, అవి అమ్మి, యెట్లన్నాగానీ వొక ట్రౌజరూ శ్లాగూ కుట్టించుకోవల్లని అనుకుంటా ఇల్లు చేరుకుండాను.
ఇంటికొస్తానే చిన్నాయన మూలుగుతా వుండేది చూసి, జేజిని అడిగినాను. ‘పయిటాల నుంచీ వాంతులూ, బేదులూ అయినాయి నాయినా! ఇబ్బుడు జొరమొచ్చి మూలుగుతా వుండాడు. ఆ రామేవాల్లాయప్ప కోసరం పోతే ఆయప్ప పల్లెలకు పోయినాడంట! ఇబ్బుడొచ్చి నాడేమో, రోంత సూసిరాపో బంగారూ!’ అని జేజి బాధపడతా చెప్పింది. నేను నారాయణరెడ్డి మామ కోసరం పరుగెత్తినాను. ఆ మామ ఇంకా రాలేదని తెలిసి దిగులు పడతా వొచ్చి జేజికి చెప్పినాను. యెట్లచెయ్యల్లనో యేమో, ఇద్దరికీ దిక్కు తెలీలేదు. నేను చిన్నాయన దగ్గర కూర్చొని పలకరిస్తా గొంతు కింద చెయ్యిపెట్టి చూసినాను. విపరీతమయిన జ్వరం! వొళ్లంతా నిప్పుల కుంపటి మాదిరుంది! నాకు జ్వరం వొచ్చినప్పుడు అమ్మయ్య నా నొసటిపైన తడిబట్ట వేసిండేది గుర్తుకొచ్చి, వొగ బట్టను చన్నీళ్లతో తడిపి, నీళ్లన్నీ పిండేసి ఆ తడిబట్టను చిన్నాయన నొసటిమీద వేసి, పక్కనే కూర్చుండాను. వొగ అర్ధ్దగంటసేపయినా జ్వరం తగ్గలేదు. నేను దిక్కు తెలీక చాకలి చౌడక్కపెద్దమ్మ దగ్గరికి పరుగెత్తిపోయి చెప్పినాను. ఆ పెద్దమ్మ వెంటనే వొచ్చింది. చిన్నాయన దగ్గరికొచ్చి చూసి ‘దిష్టి తగిలింది నాగమ్మత్తా! దిష్టి తియ్యల్ల! బూసీ, మీ చిన్నాయన్ను రోంత లేపి కుచ్చోబెట్టప్పా’ అని చెప్పింది. నేను చిన్నాయనను పట్టుకోని లేపి, ఆ పెద్దమ్మ చెప్పినట్ల కూర్చోబెట్టినాను. దిష్టి తీసేకి పూనుకుంది ఆ పెద్దమ్మ.
వొగ టెంకాయ చిప్పలోకి మూడు వొట్టి మిరపకాయలూ, కాసింత ఉప్పూ కాసిన్ని ఆవాలూ వేసి, ఆ చిప్పను పాత కుండలోకి పెట్టి, కుండలో బట్టపేలికలు వేసింది. వొగ పల్లెంలో ఎర్రనీళ్లు పోసి పక్కన పెట్టింది. కుండలోని బట్టపేలికల్ని అంటించింది. ఆ కుండను రెండు చేతుల్తో పట్టుకొని చిన్నాయనకు ముందు పక్కన పైకీ కిందికీ తిప్పింది. అట్లే వెనక పక్కనా తిప్పి, ఆ కుండను ఎర్రనీళ్ల పల్లెంలో బోర్లించింది. బోర్లిస్తానే పళ్లెంలో నీళ్లన్నీ గప్ గప్ అని శబ్దం చేస్తా కుండలో పైకి పోయినాయి. దాన్ని చూపిస్తా మిరపకాయిలు గాటే రాలేదు. నీళ్లన్నీ యెట్లబోయినాయి ‘సూడు పిమ్మమ్మా! దిష్టి శానా తగిలింది’ అని చెప్పుతా వుంటే నేను ఆశ్చర్యపోయినాను. ఆ తర్వాత పాత చెప్పుతోనా, పరకతోనా దిష్టి తీసింది.
రాత్రంతా చిన్నాయన మూలుగుతూనే వుండాడు నాకు నిద్రపట్టలేదు. వొగ పొద్దప్పుడు వాంతి చేసుకుండాడు. నేను పక్కనే వుండి వొగ గిన్నెను చిన్నాయన మూతిదగ్గర పట్టుకోని, వాంతి చేసుకున్నదంతా బయటపడేసి, నీళ్లతో మూతి కడిగి పండుకోబెట్టినాను.
తెల్లారింది. చిన్నాయన జ్వరం తగ్గలేదు. ప్రొద్దున్నే నారాయణరెడ్డోళ్ల ఇంటి దగ్గరికి పరుగెత్తిపోయి ఆ మామను చూసి వూరటపడి, విషయమంతా చెప్పినాను. ఆ మామ వొగ చిన్న పెట్టెలో కొన్ని మాత్తర్లూ సూదీ సూదిమందూ తీసుకోని ఇంటికొచ్చి చూసినాడు. చాలా నీరసంగా వుండాడని, జ్వరం ఎక్కువగా వుందని ఇంజెక్షన్ వేసి నాలుగు మాత్తర్లిచ్చి, ‘బలవంతంగానయినా గంజి తాపండి! వాంతీ బేదీ ఇంగ కావులే పాపోడా! వోయ్ నారాయణా, తగ్గిపోతాదిలే! భయపడొద్దు! కడుపులో యేదీ లేకుంటే మబ్బొస్తాది. రోంత వోపిక తెచ్చుకోని వొగ గ్లాస్ నిండా బార్లీగంజి తాగు’ అని ధైర్యం చెప్పి బయటికొచ్చినాడు. జేజికీ దైర్యం చెప్పినాడు. ‘ఇంజెక్షన్ డబ్బు ఎంత మామా?’ అని నేను అడిగినాను. ‘పర్వాలేదులేరా నారాయణా మల్లా ఇస్తుర్లే!’ అంటా వెళ్లిపోయినాడు మామ.
చిన్నాయనకు అట్లుండేది చూసినంక, ఇంకెక్కడికీ పోవల్లని అనిపించలేదు నాకు. నేను కూలిపనికి పోతే జేజి వొక్కతే చిన్నాయనను చూసుకోలేదు. మధ్యాహ్నం నుంచీ చిన్నాయనకు చలీ జ్వరమొచ్చి వొణుకుతా వుంటే రగ్గు కప్పి పైన రెండు గోనిసంచులేసినాను. సాయంకాలం మళ్లీ నారాయణరెడ్డి మామను పిలుచుకోని వొచ్చి చూపించినాను. చూసి నాడీ పరిక్షచేసి, మలేరియా జ్వరమున్నట్లుంది అని వేరే మాత్ర ఇచ్చి మింగించినాడు. రేపంతా చూస్తాం, మొన్నాడూ ఇట్లనే వుంటే అనంతపురానికో శింగనమలకో ఆసుపత్రికి బండ్లో పిలుచుకోని పోయేది మేలన్న్యాడు మామ. నాకయితే భయమెత్తుకుంది. ఆసుపత్రికి బండ్లో పిలుచుకోని పోవల్లంటే ఎంత కష్టం? మామ ఇచ్చిన మందులతోనే నయం కావల్లని మనసులో దేవునికి మొక్కుకోసాగినాను.
రెండు దినాలయినా చిన్నాయనకు జ్వరం తగ్గలేదు. చిన్నాయన జతగాడు మా ఉప్పర భీషణ్ణ మామ గిత్తలబండిని శింగనమలకు బాడుగకు అడిగినాను. ‘బాడిగేమిత్తావులే వోయ్, బండి కడతాను, సావిడి దెగ్గిరికి యెత్తుకోని రాపో’ అని చెప్పుతానే సంతోషపడతా ఇంటికి పోయి బేజితో ఐదు రుపాయలు ఇప్పిచ్చుకోని చిన్నాయనను వీపుకు కరిపించుకొని ఎత్తుకొని వొచ్చి బండిలో పండబెట్టినాను. జేజి ఏడ్చుకుంటా ‘నేనూ వొత్తాను నాయినా’ అనింది. ‘నువ్వెందుకులే జేజీ, నేనుండాను కదా’ అని చెప్పి బండెక్కినాను. భీషణ్ణ మామ బండి నొగల మీద కూర్చోని గిత్తల్ని అదిలించినాడు. బండి అనంతపురం రోడ్డెక్కింది. గిత్తల స్పీడుగా నడుస్తావుండాయి.
భీషణ్ణ మామ ఉప్పర నారాయణప్ప తమ్ముడు అనంతమ్మ చిన్నాయన. మా వూర్లో మా ఉప్పరోళ్లలో నాలుగైదెకరాల చేను, రెండెకరాల మడీ వుండే రైతు. బండీ గిత్తలు పెట్టుకోని వరిగడ్డి వ్యాపారం చేస్తాడు. కోమటోళ్లతో వరిగడ్డి కొనుక్కోని పెద్దపెద్ద వరిగడ్డి కట్టలన్నీ కూలి మనుషులచేతి విప్పబీకించి వొక్కొక్క కట్ట గడ్డిని రెండు మూడు కట్టలుగా కట్టించి, ఆ కట్టల్ని తన బండిమీద టోపు వేసుకోని అనంతపురానికి పోయి అమ్ముకోని వొస్తాడు. వొచ్చేటప్పుడు ఖాలీ బండిని తోలుకోని రాకుండా, వూర్లో చిల్లరంగళ్లు పెట్టుకోని వ్యాపారం చేసుకుంటా వుండే కోమటోళ్ల సరుకులు వేసుకోని వొస్తాడు. అట్ల వారానికి రెండుసార్లు అనంతపురానికి పోయ్యోస్తా బాగానే సంపాదించుకుండాడు భీషణ్ణ మామ. వ్యాపారం చేసుకుండే వాడయినా చాలా మంచి మనిషి మామ. నన్ను ప్రేమగా పలకరిస్తా వుంటాడు. శెనక్కాయల మండలకోసరం నన్ను, బడగొర్ల నాగిరెడ్డి మామ చెలకోలతో కొట్టినప్పుడు భీషణ్ణ మామ కూడా నాగిరెడ్డిని మందలించినాడు. ఆ మామే ఈ రోజు సహయపడతా వుండాడనుకుంటా, ఇంతమాత్రం బండీగిత్తలు తీయిస్తే నాయన కూడా వరిగడ్డి వ్యాపారం చేసుకుంటానో, అనంతపురానికి బండి బాడుగకు పోతానో లక్షణంగా బతకొచ్చు ననుకోసాగినాను. అంతలోనే బండి శింగనమలకు చేరుకుంది.
ఆసుపత్రిలో సింగ్ డాక్టర్ వుండాడు. చిన్నాయనను బండిలోనుంచీ వీపుకు కరిపించుకోని ఎత్తుకోని పోయి లోపల కూర్చోబెట్టినాను. కొంచెం సేపయినంక డాక్టరొచ్చి చూసి ఏమయిందని, ఏవూరని అడిగినాడు. నేను అంతా వివరంగా చెప్పి చివర్లో, ‘నేను ఉమావతి క్లాస్‌మేటును సార్’ అని చెప్పినాను. ‘అవునా’ అంటా డాక్టర్ చిన్నాయనను చాలాసేపు చెకప్‌చేసి ‘గ్లూకోజ్‌తోపాటు మందు ఎక్కించల్ల’న్న్యాడు. సరే సార్ అన్నాను. ఏదో మందు బాటల్ పైన వేలాడగట్టి దాంట్లో నుంచీ మందు వొచ్చే వైరును సూదితో నరానికి ఎక్కించినాడు. సాయంకాలానికంతా చిన్నాయ కొంచెం తేరుకుండాడు. డాక్టర్ జ్వరానికీ బలానికీ ఏవేవో ట్యాబ్లెట్స్ ఇచ్చి, వొక పేపర్‌మీద యేదేది ఎప్పుడెప్పుడు వాడల్లనో క్లియర్‌గా రాసిచ్చినాడు. నేను డాక్టర్ ఫీజు ఇచ్చేకి పోతే వద్దు వద్దు బాబూ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని అంటా చిన్నాయనను పలకరించినాడు. ‘నమస్కారమయ్యా బాగుందయ్యా యిప్పుడు’ అని హుషారుగానే మెల్లగా మాట్లాడినాడు చిన్నాయన. ఆయన దగ్గర శెలపు తీసుకోని బయలుదేరి వూరికొచ్చి చేరుకుండాం.
మోగోళ్లకు మాదిరి ఆడోళ్లకు ‘ఇజా’ లుంటాయా?
చిన్నాయన శింగనమల డాక్టర్ దగ్గరికి పొయ్యొచ్చినంక నేను బయటికి పోకుండా ఇంటి దగ్గరే చదువుకుంటా చిన్నాయనను గమనించుకుంటా వుంటావుండాను. జేజి గుగ్గిళ్ళు మాత్రమే చేసుకోని వూర్లో అమ్ముకోనొస్తావుంది.
సంక్రాంతి పండనాడు జేజి చిన్నాయనకు స్నానం చేయించింది. స్నానం చేసినంక చిన్నాయన కొత్త తెల్ల అడ్డపంచ కట్టుకోని పయిమీద టువ్వాలు కప్పుకోని బోనాకట్టి వూదబోడుసుకుంటా మా కొట్టం పొయ్యిదగ్గర కూర్చోని మధ్యాహ్నం భోజనానికి అలసంద వడలు చేసేకి పూనుకుండాడు. మా కుటుంబమంతా సీతంపల్లికి వెళ్లిపోయినంక చిన్నాయనోళ్లు మా కొట్టం పొయ్యిమీదనే అన్నీ చేస్తా వుండారు. ‘నేను స్నానం చేసొస్తాను, కొంచెం సేపుండు చిన్నాయనా’ అని చెప్పి స్నానం చేసి ఉతికిన బట్టలు తొడుక్కోని, చిన్నాయనోళ్ల పైకప్పులేని కొట్టం జలాటి దగ్గర జేజి స్నానం చేసేకి వేడినీళ్ళ బకెట్టు తీసుకొనిపోయి పెట్టినాను. జేజి చెప్పినట్ల వాకిలీ తలుపూలు లేని కొట్టం మొండిగోడల పైన వొక పాత నొగను అడ్డంగా పెట్టి, తటక్కన ఎవురూ మొండికొట్టంలోకి రాకుండా నొగమీద వొక పాతచీరను దిగేసి నేను చిన్నాయన దగ్గరికి పోయినాను. స్నానం చేసోస్తానని జేజి వాళ్ల మొండి గోడల జలాట్లోకి పోయింది.
చిన్నాయన పొయ్యి మీద గోళం పెట్టి గోళంలో మంచినూనె పోసి, పొయ్యి అంటించినాడు. నూనె కాగిందే లేదో కొంచెం నీళ్ళు చిముకరించమన్న్యాను నేను. ‘ఊహూ అట్ల చెయ్యకూడదు రా బడవా? పొరపాటుతో యెప్పుడన్నా అట్ల చేసేవ్? మొన్న ఎండలకాలంలో ఆ బోయోళ్ళ సంకన్న పెండ్లాం, అట్లు (అత్తిరసాలు) చేస్తా నూనె కాగిందో లేదో సూడల్లని అట్ల నీళ్లు చిముకరిచ్చడం వల్లనే గదా వాల్ల కొట్టం అంటుకోని సుట్టుపక్కలుండే మూన్నాలుగు కొట్టాలు కాలిపొయ్యిండేది!’ అని చిన్నాయన చెప్పుతానే భయపడతా ఆ సంగతి గుర్తుకు తెచ్చుకుండాను. అంతలోనే జేజి గట్టిగా అరిచింది. ఏమయిందోనని పరుగెత్తినాను. జేజి జలాట్లో పడింది. చీర చుట్టుకోలేదు. నేను అయ్యో జేజీ అని వెనకల నుంచి భుజాలకింద చేతులేసి పైకెత్తి నిలబెట్టి చీరకోసరం చూసినాను. మొండి గోడమీద వేసిండే చీరను కోతి వొచ్చి ఎత్తుకోని పోతావుంటే దాన్ని అదిలిచ్చిందంట! అది కుర్ర్ అని మీదికొస్తావుంటే భయపడిందట! అయ్యోయ్యో అనుకుంటా నేను తలుపులు లేని వాకిలి మీద వేలాడేసిన పాత చీరను బిరీన లాక్కోని వొచ్చి ఇచ్చినాను. పాపం ఆడమనిషి జేజి నాకు ఎదురుగా అట్లే నిలబడింది. ‘సేతులొనుకుతాండాయి. పయిమీద నువ్వే సీరసుట్టు నాయినా’ అనింది. మళ్లా కింద పడుతుందేమోనని నేను జేజి పయిమీద చీర చుట్టుతా చూసి ఆశ్చర్యపోయినాను. కిందపడినప్పుడు అదృష్టవశాత్తు ఏమీ కాలేదని చేయి పట్టుకోని మెల్లగా నడిపించుకుంటా ‘అదేంది, మోగోళ్ల ఇజాల మాదిరి జేజికి ముందర యేదో యాలాడతావుంది? పాపం యేందో, అనుకుంటా పిలుచుకోనిపోయి ఇంటి ముందర అరుగుమీద కూర్చోబెట్టినాను. గోడమీద వేసిండే చీరను కోతి ఎక్కడ పడేసిందో చూడుపో నాయనా అని చెప్పుతానే నేను మొండిగోడల అవతలకి పోయి చూసినాను. చీర కింద పడింది. బొగ్గిట్లో చెక్కుకోనుండె నేమో, వక్కాకు చిత్తీ చిత్తిలో వుండే దుడ్లూ ఆకులూ వక్కలూ కట్లపొడీ అన్నీ చిల్లాపల్లా పడినాయి. కట్లపొడి తప్పా మిగతావన్నీ యేరుకోని వొచ్చి జేజికిచ్చి ‘కింద పడినప్పుడు దెబ్బలేమయినా తగిలినాయా జేజీ?’ అని అడిగినాను. ‘అదురుట్టం బాగుండబట్టి యేమీ తగల్లేదు నాయినా! తగిలింటే ఈ ముసలిముప్పన యేమి గతి? టయానికి నువ్వుండబట్టి సరిపాయ! ల్యాకుంటే పైకి లేసేకి అయితాండెనా?’ అంటా బాధపడింది జేజి.
చీరకింద వక్కాకు చిత్తి, యేదో మూట మాదిరి కనిపించిందేమో, అందుకే కోతి వొచ్చి చీరను ఎత్తుకోనిపోయి చూసి, అందులో యేందీ లేదని ఆడే వొదిలేసి పోయినట్లుందని చెప్పుతా, యేంది జేజీ, నీకు మోకాళ్ళపైన తొండం మాదిరి చర్మం అట్ల వేలాడబడింది? యెప్పుడయినా దెబ్బ తగిలి చర్మ బయటికొచ్చిందా? అని అడుగుదామనుకుండాను. దెబ్బ తగిలి గాయమై చర్మం బయటకొచ్చి, అట్ల వేలాడితే నొప్పి అయితాది కదా, నొప్పి అయితే జేజి చెప్పదా? యేదోలే! జేజికి నొప్పేమీ లేనప్పుడు యెట్లుంటే నేమిలే అనుకుంటా, ‘ఇంట్లోకి పోయి చీర కట్టుకోపో జేజీ! చిన్నాయన వడలు చేస్తా వుండాడు, అన్నం తిందాం’ అని చెప్పి, నేను చిన్నాయన దగ్గరికి పోయినాను.
రెండు వారాలకంతా చిన్నాయన పూర్తీ కోలుకుండాడు. అయితే వరిమళ్ల కోతలన్నీ అయిపోయినాయి. ఈ వరికోతల సీజన్లో కూలికి పోయి రెండు మూటల వడ్లు జమజేసి, అవి అమ్ముకోని వొక ట్రౌజరూ మంచి షర్టూ కుట్టించుకోవల్లని అనుకున్న ఆశయితే తీరలేదు. తీరకపోయినా సింగ్ డాక్టర్ సహాయంవల్ల చిన్నాయన పూర్తీ కోలుకుండాడు. అంతే చాలని తృప్తి పడినాను. నేను లేకుంటే చాలా ఇబ్బంది అయ్యిండేదని నామీద చాలా నెర్లు చూపబట్టినారు. ఈ సంగతులన్నీ తెలుపుతా ఇన్‌ల్యాండ్ లెటర్లో జాబు రాసినాను నాయనకు. అట్లే, హెడ్మాష్టర్ సార్ చెప్పిన దాని ప్రకారం నేనూ సోదనపల్లి బాలన్నా శింగనమలలోనే వొక ఇల్లు తీసుకోని, అక్కడే వుండి చదువుకుంటామని, వొక వారం దినాల్లో హెడ్మాష్టర్ సార్, ఇల్లు ఇప్పించినంక అక్కడికి చేరుకుంటానని జాబులో తెలియజేసినాను.
సంక్రాంతి శెలవులు అయిపోయినాయి. స్కూలు రీ-వోపన్ అయిన్నాడే ప్రొద్దున్నే లేచి చెయ్యవలసిన పనులన్నీ చేసి స్కూలుకు పోయినాను. మొదటిదినమే మాక్లాస్ స్టూడెంట్లు దాదాపందరూ వొచ్చినారు. టీచర్లందరూ అర్ధపరీక్షల పేపర్లన్నీ ఇచ్చినారు. ఇంగ్లీషులోనా మ్యాథ్స్‌లోనా తప్పా అన్ని సబ్జెక్ట్సులోనా మార్కులు బాగొచ్చినాయి. ‘వొచ్చేవి పబ్లిక్ పరీక్షలు. జాగ్రత్త పడకుంటే లెక్కల పేపర్లో దెబ్బతింటావురా’ అని సత్యనారాయణ సార్ నన్ను దండించినాడు. ఇంగ్లీషులో ఇంకా ఇంప్రూవ్ కావల్లని హెడ్మాష్టర్ సార్ గట్టిగా చెప్పినాడు.
సాయంకాలం బాలన్నా నేనూ హెడ్మాష్టర్ సారోళ్ల ఇంటికి పోయి జయమ్మక్కను మాట్లాడించినాం. స్కూలు నుంచీ సారొచ్చేవరకూ అక్కడే వుండాం. సార్, మా నాయనోళ్లను గురించి అడిగినాడు. నేను సెలవుల్లో మా నాయనోళ్ల దగ్గరికి పోలేదని చిన్నాయన విషయమంతా చెప్పినాను.
‘ఇది క్రూషియల్ పీరియడ్ రా నీకు! వీనికి బాలన్నకు పర్వాలేదు. ఇంటి దగ్గర బతకడానికి కొంత భూమీ గొర్లూ వుండాయి. నీకు తాడూ లేదు పేడూ లేదు! ఎలాగయినా ఎస్.ఎస్.ఎల్.సి. పాసయితేనే నీకు లైఫు! చిన్నాయనా గిన్నాయనా అనుకుంటా వుంటే కష్టంరా నారాయణా! అందుకే రోన్ని బియ్యపు గింజలూ చిట్లంపొడీ చింతకాయ తొక్కు తీసుకోని వొక వారం పది దినాల్లో మీరిద్దరూ శింగనమలకు వొచ్చేయండి. నేను ఆలోగా దగ్గర్లో వొక ఇల్లు మాట్లాడి పెట్టింటాను. అట్లే ఆ ఖాసీం గానికీ చెప్పండి’, అని సార్ ఎంతో బాధ్యతతో చెప్పినాడు. మేము తప్పకుండా వస్తామని చెప్పి వూర్లకు బయల్దేరినాం.
స్వయం పాకంతో జతగాళ్ల చదువు!
హైస్కూలు నుంచీ మా వూరికి వొచ్చే దావలోనే సారోళ్ల ఇంటికి దగ్గరగా మా హెడ్మాష్టర్‌సార్ వొగ ఇల్లు చూసి పెట్టినాడు. పెద్ద ఇల్లు అది. నేనూ బాలన్నా ఇంకా ఇద్దరు మొత్తం నలుగురం ఆ ఇంట్లో చేరల్లనుకుండాం.
మడి కోతలయిపోయినంక చిన్నాయనోళ్ల గుగ్గిళ్ల వ్యాపారం బాగా జరుగుతావుంది. గుగ్గిళ్లకు తోడు కుడుములూ కర్జీకాయలూ అట్లూ చేస్తా వుండాడు చిన్నాయన. నేను శింగనమలలోనే వుండి చదువుకుంటానని, హెడ్మాష్టర్ మా కోసరం వొగ ఇల్లు మాట్లాడి పెట్టినాడని చిన్నాయనతో చెప్పినాను. ‘ఆడ అన్నమూ కూరా చేసుకుంటా చదువుకుండేకి కష్టమని, ఈడే వుండి, చేసి పెట్టింది తిని స్కూలుకు పొయ్యోస్తా చదువుకుంటే మాకూ రోంత సహయంగా వున్నట్ల అయితాది కదరా’ అని చిన్నాయన నాకు నచ్చజెప్పేకి చూసినాడు. ఇంగ్లీషూ లెక్కలూ నాకు కష్టంగా వుండాయని శింగనమలలోనే వుంటా రాత్రులపూట సారోళ్లతో కష్టంగా వుండే పాఠాలు చెప్పించుకోవచ్చునని, వారం వారమూ వొచ్చి పొయ్యిలో కట్టెలు కొట్టుకోనొస్తానని చిన్నాయనకు నచ్చజెప్పినాను. చిన్నాయన సరే అన్న్యాడు. జేజితో శెనక్కాయల పొడీ, చింతకాయతొక్కు నూరించుకుండాను. శని ఆదివారాల్లో దేవరకొండకు మచ్చుగత్తీ గొడ్లీ తీసుకోనిపోయి మంచి గట్టి కట్టెలు నాలుగు మోపుల కొట్టుకోని వొచ్చి మండీ మాదిరి పేర్చి పెట్టినాను. ఇంకా చిన్నాయనోళ్లు చేసుకోలేని పనులన్నీ చేసి పెట్టినాను. వొగ గంపనిండా కేసరొడ్లు బండమీదికి ఎత్తుకోనిపోయి, ముడిబియ్యం చేసుకోని వొచ్చినాను. అవన్నీ చాకల చౌడక్కోళ్ల గుంతరోట్లో, కుదురుపెట్టి దంచినంక, జేజి బియ్యం చెరిగి తవుడూ తాలూ పక్కకు తీసింది. పదారుశేర్ల బియ్యమయినాయి.
ఐదుశేర్ల బియ్యమూ, చిట్లంపొడిడబ్బా, చింతకాయతొక్కు సీసా, అన్నం వండుకుండే పాత్ర సామాన్లూ అన్నీ వొగ యూరియా సంచిలో యేసి మూటగట్టిచ్చింది జేజి. అంతకు ముందే నాయనకు సీతంపల్లికి జాబురాస్తా, ఖర్చులకు ఐదార్రూపాయలు సార్ పేరుమీద పంపమని, నేనూ, బాలన్నా ఇంకా ఇద్దరు శింగమలలోనే సొంతంగా వంటజేసుకుంటా చదువుకుంటామని, మా కోసరం హెడ్మాష్టర్ సారే వొక ఇల్లు చూసి పెట్టినాడని తెలియజేసినాను.
యేదయినా పనిబడితే, ఎవురితోనయినా చెప్పంపితే వెంటనే వొస్తానని నా పుస్తకాలూ బట్టలూ వుండే చెయి సంచిని పట్టుకోని, నెత్తిమీద సామాన్ల మూటెత్తుకోని చిన్నాయనోళ్లకు చెప్పి శింగనమలకు చేరుకుండాను. అంతకు ముందే బాలన్నా, ఖాసీమూ వొచ్చి ఇంట్లో దిగినారు. బాలన్న కిరోసిన్ స్టౌ, ఖాసీం లాంతరూ తెచ్చినారు. అది చూసి చాలా సంతోషపడినాను.
ముగ్గురమూ కలిసి ఇల్లంతా కసువులూడ్చి క్లీన్ చేసుకుండాం, నేను సారోళ్ల ఇంటికి పోయి బకెట్టూ ఇనపరేకు బిందే ఇప్పించుకోనొచ్చినాను. ఎవురో పాపం, వంట రూములో కట్టెలపొయ్యీ పొంతా ఆలికాగూ నీళ్ళతొట్టీ అన్నీ బాగా యేర్పాటు చేసుకుండారనుకోని, అన్నీ నీళ్లతో నింపుకుండాం. బోనాసి నారాయణోళ్ల అంగడికిపోయి వొగ సీసా నిండా గబ్బునూనె (కిరోసిన్) అగ్గిపెట్టీ తెచ్చుకోని సాయంత్రమే వంట చేసుకుండేకి పూనుకుండాం. స్వయంపాకం అనుకుంటా అవీ యివీ మాట్లాడుకుంటా అన్నం చేసుకుండాం. జయమ్మక్క తిప్పన్నతో కొంచెం పప్పూ చారూ ఇచ్చి పంపింది.
ఏ ఇబ్బందీ లేకుండా మోదటినాడే మా బ్రహ్మచారుల సంసారం సంతోషంగా ప్రారంభమయింది.
మా ఉప్మా కల – పుల్లయ్యశెట్టి!
నాకూ బాలన్నకూ ఉప్మా అంటే భలే ఇష్టం. ఎప్పుడయినా వొగసారి జయమ్మక్క, ఇంట్లో ఉప్మా చేసిండే రోజు, మిగిలింది నాకూ బాలన్నకూ తలా వొగ పిడచ పెడతాది. ఇద్దరమూ తింటా, అబ్బా ఎంతద్భుతంగా ఎంత కమ్మగా వుందో అని పొంగిపోతాం. అట్లాటి ఉప్మా కడుపునిండా తినల్లని ఇద్దరికీ విపరీతమయిన ఆశ!
మా క్లాస్‌మీట్ పుల్లయ్య (కొక్కుశెట్టి)ది శింగనమలే. వాళ్లది చిల్లరంగడి. బాగా జరుగుతుంది. వానికి ఎల్లుపండ్లు. కొక్కుమూతి. అందుకే అశ్వత్థరెడ్డీ రామచంద్రారెడ్డీ ఇంకా ముగ్గురు నలుగురు వాన్ని గేలిచేస్తా ఏడిపిస్తా ఆటపట్టిస్తా వుంటారు. వొక్కొగసారి మా బాలన్న కూడా వాళ్లలో కలుస్తా వుంటాడు. నేను పుల్లయ్యవైపున వుండి వాళ్లను కంట్రోల్ చేస్తా వుంటాను. పుల్లయ్య చదువులో కొంచం వీక్. మాటలు కూడా స్పష్టంగా వుండవు. అమాయకంగా మాట్లాడతా వుంటాడు. దగ్గరికిపోయి, వాన్ని పొగుడుతా నాలుగు మాటలు మాట్లాడితే చాలు, ఉబ్బిపోతాడు. వాళ్లన్న సూర్యనారాయణ అతితెలివైనోడు. అంగట్లో పెట్టెమీద వాళ్ల నాయన లేనపుడు సూర్యనారాయణే కూర్చుంటాడు కానీ తమ్మున్ని కూర్చోనీయడు. కూర్చుంటే, వాని జతగాళ్లొచ్చి మాటల్తో వాన్ని ఉబ్బిచ్చి, బెల్లమో చక్కెరో పొట్లాలు కట్టిచ్చుకోని పోతారని సూర్యనారాయణ తన తమ్మునిమీద వొగ£ కన్నుపెట్టేవుంటాడు.
నేనూ బాలన్నా ఖాసీమూ మనసులో ఆశపెట్టుకోని పుల్లయ్యను మా దగ్గరికి చదువుకుండేకి పిలుచుకుండాం. పుల్లయ్య మాకు ఇప్పుడు మంచి న్యాస్తుడయినాడు. మొన్న పుల్లయ్యను బాగా ఉబ్బిచ్చినాం. సాయంత్రం వొచ్చేటప్పుడు వొగ శేరు ఉప్మారవ్వ తెచ్చినాడు. రవ్వ అయితే వొచ్చింది గానీ మంచినూనె కావల్ల కదా అదెట్ల అని ఆలోచన చేసినాం. నూనె సీసాలో తీసుకోనిరాడం కష్టమన్న్యాడు పుల్లయ్య. మీరెవురయినా వొగ ఆణానో, రెండణాలో తీసుకోని, వొగసీసా పట్టుకోని అంగట్లో నేనున్నెప్పుడు వొస్తే కాలు కేజీ మంచినూనె పోసి పంపుతాను అని సూచన చేసినాడు. మేము సంతోషపడినాం. మేము ముగ్గురమూ తలావొగ అర్ధణా వేసుకుండాం. దుడ్లు తీసుకోని, బిరడా బిర్రుగా వుండే సీసాను చేతిలో పట్టుకొని పొప్పుగిత్తి (రామాంజనేయులు అడ్డపేరు) ఇంటికి పోయినట్ల పోతా అంగట్లో పుల్లయ్య వుండేది చూసి, దగ్గరికిపోయి ముందు దుడ్లు చేతికిచ్చినాను. కూర్చున్న పెట్టె అరను బయటకి లాగి, ఎదురుగా ఇంట్లో వాళ్లన్న సూర్యనారాయణ వుండాడేమో అతనికి వినించేటట్ల దుడ్లను అరలో వేసి ‘చెప్పు నారాయణా ఐదణాలకు ఏమి కావల్ల?’ అని అడిగినాడు పుల్లయ్య. వాని తెలివికి నేను మనసులో ఆశ్చర్యపోతా, ‘వొగ కాలు కేజీ మంచి నూనె, మిగతా దుడ్లకు తిరగవాత గింజలూ, వొగ పావు వొట్టి మిరపకాయలూ, వొగ అర్ధకేజీ ఉల్లిగడ్డలూ కట్టియ్యి పుల్లయ్యా’ అని అడిగినాను. పుల్లయ్య ఏమీ జంకూ గొంకూ లేకుండా అన్నీ ఇచ్చినాడు.
నేను సంతోషంతో అన్నీ తీసుకోని ఇంటికొచ్చి స్నేహితులతో చెప్పినాను. వాళ్ళు ఆనందపడతా ఉప్మా చేసేకి పూనుకుండారు. అంతలోనే పుల్లయ్య వొచ్చినాడు. యేమప్పా సంతోషమయిందా? అని అడుగుతా ఉప్మా చేసేదంతా చూపించినాడు.. అర్ధగంటకల్లా ఉప్మా బ్రహ్మాండంగా తయారయింది. అందులోకి మేము తెచ్చుకోనుండే చిట్లం పొడులు బాగా సూటయినాయి. అందరమూ తృప్తిగా ఉప్మా తిని పుల్లయ్యశెట్టికి కృతజ్ఞతలు చెప్పినాం.
కొట్టిన దెబ్బకంటే అనిండే మాటను మరిచిపోలేదు!
మా స్కూల్ ఎసిసి ఆఫీసర్ సత్యనారాయణ సార్ వారం దినాల్లో గొందిరెడ్డి పల్లికి ఎసిసి క్యాంప్ పోవల్లని అందరూ ఖాకీడ్రస్ వేసుకోని రావల్లని చెప్పినాడు. నాకు అంతకు ముందు ఇచ్చిన ఖాకీ డ్రస్సు చాలా దినాలు వాడుకోవడంతో ఐదారు నెలల కిందటనే అంగీ నిక్కరా రెండూ చినిగిపోయినాయి. ఆ విషయం నేను సార్‌తో భయపడుకుంటా చెప్పినాను. నన్ను రెండు మాటలు తిట్టి కొత్త డ్రస్ తెప్పించి ఇచ్చినాడు. ఎసిసి బుట్లయితే వుండాయి. వాటిని జాగ్రత్తగా పెట్టుకుండాను. కొత్త డ్రస్ వేసుకోని రెండుమూడు దినాలు గ్రౌండ్‌లో పెరేడ్‌చేసినాను. ఏసిసి అండర్ ఆఫీసర్‌గా ఎసిసి పిల్లోళ్లతో మార్చ్‌ఫాస్ట్ చేయించినాను. క్యాంప్‌కు పోడానికి ముందు రోజు హెడ్మాష్టర్ సార్ మా పెరేడ్‌కు వొచ్చి గౌరవ వందనం స్వీకరించినాడు. తర్వాత ఏసిసి క్యాంప్‌లో వుండాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పినాడు. పెరేడ్ అయిపోయిన తర్వాత ‘బాగా ఇంప్రూవ్ చేసుకున్నావు రా, వేరీ గుడ్. ఎస్.ఎస్.ఎల్.సి. అయిపోయినాక కాలేజిలో చేరి అక్కడ ఎన్.సి.సి.లో జాయిన్ అయితే బాగా షైనవుతావు’ అని అభినందించినాడు. ఆ సంతోషంతో క్యాంప్‌కు పొయ్యేకి అన్నీ సర్దుకుంటావుండాను. అంతలోనే మా వూరి నుండీ వొక మనిషి వొచ్చి మీ చిన్నాయన కిండపడినాడు, కాలు వాసింది. నిన్ను పిలుచుకోని రమ్మని నన్ను పంపించినాడు’ అని చెప్పడంతో నా పెదవులు ఆరిపోయినాయి. యేమి చేయల్లనో దిక్కుతోచలేదు. ఆ వొచ్చిన మనిషిని హెడ్మాష్టర్ సారోళ్ల ఇంటికి పిలుచుకొని పోయి విషయం చెప్పి కన్నీళ్ళు కార్చినాను. జయమ్మక్క ఓదారుస్తా ‘యేమి ఎసిసి క్యాంపులేరా? నువ్వొగనివీ పోకుంటే అది ఆగిపోతాదా? ఫస్టు వూరికిపోయి మీ చిన్నాయనకు ఏమయిందో చూడు! ముందే ఆయన కుంటోడు! ఇట్లా టైములో నువ్వు చూడక ఎవురు చూస్తారు? ఆ సత్యనారాయణ సార్‌తో మీ సార్ చెప్పుతాడుపో’ అని ధైర్యం చెప్పింది. సార్ కూడా అదే అని, ‘ఏమయిందో చూసుకొని రెండు దినాలుండి రాపో’ అన్న్యాడు. నేను, మేముండే ఇంటికి పోయి విషయం బాలన్నతో చెప్పి సత్యనారాయణ సార్‌తో కూడా పర్మిషన్ తీసుకోని రెండు పుస్తకాలు బ్యాగులో పెట్టుకొని, ఆ మనిషి వెంట వూరికి పరుగెత్తినాను.
నన్ను చూసి జేజి ఏడుస్తా బాధపడింది. చిన్నాయనకు కుడికాలు మెడిమంతా వాసింది. యెట్ల జరిగిందని తెలుసుకొని రామేవాళ్ళ నారాయణరెడ్డి మామను పిలుచుకోని వొచ్చి చూపించినాను. ఆ మామ పాదాన్ని కదిపి చూసినాడు. కాలు విరగలేదని, బాగా బెణికిందని, చింతపండూ సున్నమూ కలిపి దంచి, ఆ గుజ్జును మెడిమ చుట్టూరా పాదం మొత్తం మెత్తి వొక బట్టబిర్రుగా గట్టి, బట్టమీద అర్ధగంటకోసారి నీళ్ళు పోస్తే పొద్దునకంతా వాపు తగ్గి పోతాదని చెప్పిపోయినాడు. చౌడక్కపెద్దమ్మ సున్నం తెచ్చింది. నేను వొగ శేరు గింజలు తీసుకోనిపోయి వరట్ట రంగయ్యోళ్ల అంగట్లో చింతపండు కొనుక్కుండాను. జరిగిండేది చెప్పుతానే రంగయ్య, వడ్లు వాపసిచ్చి, చింతపండు సుమారుగ ఇచ్చినాడు. బండమీద సున్నమూ చింతపండూ నున్నగ దంచింది చౌడక్కపెద్దమ్మ, నేను దాన్నంతా చిన్నాయన మెడిమచుట్టూరా పాదమంతా కరిపించినాను. ఆ పెద్దమ్మ, వొగపాత చీర చించి వొనారుగా పాదం చుట్టూరా చుట్టి బట్టపేలికతో గట్టిగా ముడేసింది. ముడేసినప్పుడు నొప్పి అయిందేమో, అబ్బా, నొప్పి తల్లీ! అన్న్యాడు.
‘తగ్గిపోతాదిలేప్పా! అదురట్టమనుకో! గోడమింద నుండి అంతపాటు పడినప్పుడు కాలో సెయ్యో యిరిగింటే ఏమి గతి’ అంటా వోదార్చింది. అప్పుడు అర్థమయింది నాకు, చిన్నాయన యెక్కడ పడిండేది!
నారాయణరెడ్డి మామ చెప్పినట్లే రాత్రి ఏడెనిమిది సార్లు నేనూ జేజీ చిన్నాయన కాలికట్టుమీద నీళ్ళు పోసినాం. తెల్లారేసరికి వాపంతా తగ్గిపోయింది. ఆ మామ పది గంటలప్పుడు వొగసారి వొచ్చి చూసి రెండు మాత్రలేవో ఇచ్చి, రెండుపూట్ల యేదయినా తిన్న తర్వాత మింగమని, రెండు దినాలు నడచొద్దని చెప్పి పోయినాడు.
నాలుగు దినాలు వూర్లో వుండి, చిన్నాయనకు కాలు నొప్పి పూర్తీ తగ్గిపోయినంక శింగనమలకు చేరుకుండాను. అంతలోనే ఎసిసి క్యాంపుకు పోయినోళ్లందరూ క్యాంపు ముగించుకోని వొచ్చినారు.
***
క్లాసులు బాగా జరుగుతా వుండాయి. అప్పుడప్పుడు లాస్ట్ పీరియడ్స్‌లో చిదంబర రెడ్డిసార్ మమ్మల్ని గ్రౌండుకు పిలుచుకోనిపోయి గేమ్స్ ఆడిస్తా వుండాడు. నిన్న ఆడపిల్లోళ్లకు త్రోబాల్ మ్యాచ్ జరిగింది. ఉమావతి టీమ్‌కూ లక్ష్మిదేవి టీమ్‌కూ పోటీ! ఉమావతి టీమ్‌లో మా క్లాస్ పిల్లోళ్లూ లక్ష్మిదేవి టీమ్‌లో ఎర్రెమ్మా రామలక్ష్మీ వుండారు. ఎర్రెమ్మా లక్ష్మిదేవీ విసిరే త్రోబాల్ ఫోర్స్‌కు ఉమావతి టీమ్ వాళ్ళు జడుసుకుంటా వుండారు. మొత్తం స్కూల్ పిల్లలందరూ త్రోబాల్ కోర్టు చుట్టూరా చుట్టుకుండారు. కొంత మంది వొగ టీముకూ మరికొంత మంది ఇంకొగ టీముకూ సపోర్టుచేస్తా కేకలు వేస్తా కామెంట్ చేస్తా వుండారు. మా క్లాస్‌మీట్స్ అశ్వత్థరెడ్డీ రామచంద్రారెడ్డీ బాలన్నా రాధాకృష్ణా ఇంకా కొంతమంది ఉమావతి టీమును సపోర్ట్ చెయ్యకుండా, ఆపోజిట్ టీమును ఎంకరేజ్ చేస్తూ వుండారు. నేను ఎవరినీ కామెంట్ చెయ్యకుండా మ్యాచ్ వైపు ఆసక్తిగా చూస్తా వుండాను.
ఎర్రెమ్మ త్రోబాల్‌ను వొడుపుగా వేసింది. దాన్ని పట్టుకోలేకపోయింది ఉమావతి. కోనయ్య గ్రూపంతా కేకలు వేసింది. ‘శివపురం బాల్స్ చాలా గట్టిగా వుండాయి అందుకే అంత ఫోర్స్’ అని కోనయ్య గట్టిగా కామెంట్ చేసినాడు. ఆ కామెంట్ విని అటువైపున్న వాళ్లంతా నవ్వుతా కేకలు వేసినారు. ఆ కామెంట్‌లోని డబల్ మీనింగును పసిగట్టిందేమో, ఎర్రెమ్మ కోనయ్యవైపు బిర్రుగా చూసింది. బాల్‌ను పట్టుకోలేక ఆపోజిట్ టీము వాళ్లకు పాయింట్ ఇచ్చిన బాధతో కోపంతో ఉమావతి బాల్ చేతికి తీసుకోని గట్టిగా విసిరింది. ఆ బాల్‌ను లక్ష్మిదేవి సులభంగా క్యాచ్‌చేసి ఉత్సాహంతో ఇటువైపు విసిరింది. ఉమావతి టీమ్ వాళ్లు దాన్ని పట్టకోలేక పోయినారు. పిల్లోళ్లందరూ లక్ష్మిదేవికి సపోర్టుగా ఎగిరెగిరి కేకలు వేసినారు.
‘చెన్నవరం టీమోళ్ల బాల్సన్నీ మెత్తబడిపోయినాయి. వొగ బాలూ గట్టిగా లేదు శివపురమోళ్ల గట్టి బాల్స్ ముందర ఈ మెత్తబడిండే బాల్స్ యాడ తట్టుకుంటాయ్’ అంటా అశ్వత్థరెడ్డీ రామచంద్రారెడ్డీ రెండర్థాలతో కామెంట్ చేసినారు. ఉమావతి ముఖాన్ని గంటేసుకోని వాళ్లవైపు చూసింది. పక్కనుండే నన్నుకూడా కోపంగా చూసింది.
చివరికి ఉమావతి టీమ్ వోడిపోయింది. చిదంబరరెడ్డి సార్ లాంగ్ విజిల్ వేసినాడు. అందరూ ఇండ్లకు బయలుదేరినారు. ఆడపిల్లోళ్లు వోడిపోయినోళ్లూ గెలిచినోళ్లూ అందరూ కలుసుకోని డ్రిల్‌మాష్టర్ సార్‌తో యేందో చెప్పినారు. ఆయన ఏమి చెప్పినాడో యేమో, వాళ్లందరూ మా వైపు చురచురా చూస్తా వెళ్లిపోయినారు. నేను ఇంటికొచ్చినంక, వాళ్లు గ్రౌండ్‌లో కామెంట్ మాటల్ని గుర్తుచేస్తా మందలించినాను. ‘బాల్ అంటే ఆ బాల్స్ అని నువ్వెట్లా అనుకుంటావు నారాయణా? ఆడపిల్లోళ్లు గేమ్స్ ఆడేటప్పుడు ఇట్లాటి కామెంట్స్ మామూలే! ఆ మాత్రం సరదా లేకుంటే యెట్ల?, అని రామచంద్రారెడ్డీ బాలన్నా నా మాటల్ని తీసిపడేసినారు. నేను ఎక్కువగా వాళ్లతో వాదించలేదు. రాత్రి పండుకున్న తర్వాత, రేపు ఏమయినా జరగొచ్చుననుకుంటా నిద్రబోయినాను.
ఉదయం స్కూల్లోకి అడుగు పెడతా వుండంగనే, నిన్న త్రోబాల్ ఆడిన అమ్మాయి లందరూ హెడ్మాష్టర్ సార్ రూములోనుంచీ బయటికిరావడం చూసినాను. చూస్తానే వాళ్లు హెడ్మాష్టర్ సార్‌కు కంప్లైంట్ చేసింటారని అనుమానమొచ్చింది. నా పేరు కూడా చెప్పింటారేమో అని అనుకోగానే మనసులో భయం చుట్టుకుంది.
ప్రేయర్ అయిపోయింది. ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్‌కు సారొచ్చినాడు. క్లాస్‌లోనే దండించి కొడతాడనుకుండాను. సీరియస్‌గా పాఠం చెప్పుతా వుండాడు. ఉమావతీ రామలక్ష్మీ తలకాయలొంచుకొని ఏడుస్తున్నెట్లు కనిపించినారు. సార్ వాళ్లను గమనిస్తానే పాఠం చెప్పి వెళ్లిపోయినాడు. రెండో పీరియడ్ తెలుగు సారొచ్చినాడు. ఆ వెంటనే పీవన్ అబ్దుల్లా వొచ్చి, వొగ తెల్లపేపర్ తెలుగుసార్ చేతికిచ్చి ఏదో చెప్పినాడు. తెలుగు సార్ పేపర్ మీదుండే పేర్లు, అశ్వత్థరెడ్డీ, రామచంద్రారెడ్డి, బాలన్నా, రాధాకృష్ణా, నారాయణా అని చదివి మీరంతా హెడ్మాష్టర్ రూము దగ్గరికి పోవల్లంట అని చెప్పినాడు. మేము భయపడుకుంటా హెడ్మాష్టర్ రూము దగ్గరికి పోయినాం. టెన్త్ క్లాసులో నుంచి కోనయ్యా ఓబుళ నారాయణా వొచ్చినారు. హెడ్మాష్టర్ సార్ పెద్ద ఈతబర్ర తీసుకొని బయటికుపచ్చి “ఏమిరా, స్కూలుకు చదుకుండేకి వొచ్చినారా, లేకుంటే పనికిమాలిన మాటల్తో అమ్మాయిలను కామెంట్ చేసేకి వొచ్చినారా? అంటూ మొదట అశ్వత్థరెడ్డిని ఉతికినాడు. అశ్వత్థరెడ్డీ రామచంద్రారెడ్డీ ఏదో చెప్పడానికి నోరిప్పినారు.
‘యేందిరా రాస్కెల్స్, మల్లా నోరెత్తుతా వుండారు? ఏమి రెడ్ల దర్బారు చేస్తారా? ఏమి కూసినార్రా, త్రోబాల్ గట్టిగా వుందని వొగడూ, మెత్తగా లూజుగా వుందని యింగొగడూ రెండర్థాలతో కామెంట్ చేస్తారా? వొగొగనికి వొళ్ళు బలిసిందిరా’, అంటా అందర్నీ ఈతబర్రతో వాయించినాడు. కోనయ్య ఏదో మాట్లడబోయినాడు. ‘నోరెత్తితే వొకొకర్నీ స్కూల్ నుంచీ వారం దినాలు సస్పెండ్ చేస్తాను. ఏమనుకుంటున్నారో’ అంటా బర్రతో పీకినాడు. కడాన నా దగ్గరికొచ్చి ‘యేమిటిరా నువ్వు కూడా నా?’ అని పిర్రలమీద గట్టిగా జవిరినాడు. సార్, ఆ మాట అని ఈతబర్రతో వొగదెబ్బ కొడతానే కన్నీళ్లొచ్చినాయి. లోపల్నుంచీ దుఃఖం పెల్లుబికి వొచ్చింది. మనసంతా వికలమయింది. చెప్పలేనంత బాధ కలిగింది.
వీళ్లు నామీద కూడా కంప్లైంట్ చేసినారా? నేను నోరే విప్పలేదే! ఎవరినీ కామెంట్ చెయ్యలేదే! అసహ్యంగా కామెంట్ చేసినోళ్ల పక్కన నిల్చుకున్నందుకా ఈ శిక్ష! ‘యేమిరా, నువ్వు కూడానా?’ అని సార్ నన్నూ వాళ్లతో కలిపి తిట్టినాడు. ఆ మాట అనకుండా రెండు దెబ్బలు కొట్టినా ఇంత బాధ అయిండేది కాదు. సార్ నన్ను ఏమనుకుండాడో? నీచంగా అనుకోనుంటే సార్‌కు మొగమెట్లా చూపించేది? ఛీ, ఛీ, ఎంత పని అయిపోయిందో! నిన్న ఆ మ్యాచ్ దగ్గరికి పోకుండా ఉంటే బాగుండేది!
బాధపడతా, వాళ్లకు కొంచెం దూరంగా హెడ్మాస్టర్ సార్ చెప్పినట్లే, ఆ పీరియడ్ అంతా బయటే వుండాను. పీరియడ్ అయిపోతానే గురుమూర్తి సార్ బయటికొచ్చి, మమ్మల్ని చూసి ‘ఏమైందోయ్?’ అని అడిగినాడు. ఏమీ మాట్లాడకుండా అందరమూ క్లాస్‌లోకి పోయి కూర్చుండాం. హెడ్మాస్టర్ సార్ మమ్మల్ని కొట్టేది చూసినారేమో, ఆడపిల్లోళ్లు అందరూ మౌనంగా వుండారు. మధ్యాహ్నం ఇంటికి పోయినాం. అన్నం తినబుద్ధి కాలేదు. బాలన్న బ్రతిమాలినాడు. ‘రా నారాయణా, అన్నం తిందాం రా! దానికల్లా అంతగా బాధపడితే యెట్ల? స్టూడెంట్స్‌గా వున్నెప్పుడు ఇవన్నీ మామూలే! వొగ£ దెబ్బ కొట్టినందుకే నువ్వంత బాధపడితే, నాలుగైదు దెబ్బలు తిన్నోళ్లం, మేమెంత బాధపడల్ల? మన సారే కదా! కోపమొచ్చినప్పుడు తిడతాడు, కొడతాడు! ఆడపిళ్లోల్లు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ల తృప్తికోసం కొట్టినాడని అనుకోవల్ల! అంతే!’ అని యే మాత్రమూ ఫీల్ కాకుండా మాట్లాడినాడు బాలన్న.
‘కొట్టినాడని బాధపడలేదు బాలన్నా! ‘యేమిరా నువ్వు కూడానా’ అని సార్ అనడం నాకు బాధ కలిగించింది. ఇంతవరకూ మన మీద మంచి అభిప్రాయంతో వుండే హెడ్మాస్టర్ సార్ మనసులో, మీరు చేసిన పనికిమాలిన పనివల్ల దురభిప్రాయం ఏర్పడిందేమోనని భయం బాలన్నా! ఏమైనా మీరు ఆ విధంగా కామెంట్ చెయ్యకుండా ఉండాల్సిండె’ అని కోపంగా అన్నాన్నేను.
‘ఆ కోతి నాకొడుకులు అశ్వత్థరెడ్డీ, రామచంద్రారెడ్డీ, మీ ఊరి కోనయ్యా, వాళ్లు ముగ్గురే ఓవర్ చేసిండేది. సరే, పోనీలే! ఇంక ఆ విషయం వదిలేయ్!’ అంటా నన్ను బుజ్జగించేకి చూసినాడు బాలన్న. ఏమైనా నాకు అన్నం తినబుద్ధి కాలేదు. ముఖం కడుక్కొని ఒగ గ్లాస్ మంచినీళ్లు తాగి బాలన్న వెంట మౌనంగా స్కూలుకు పోయి, క్లాసులో సైలెంట్‌గా తలొంచుకొని కూర్చుండాను.
మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ సోషల్ టీచర్ నారాయణరెడ్డి సార్ వొచ్చినాడు. పాఠం చెపుతా ఆయన మొరటుగా ఏదో చెప్పినాడు. దానికి అశ్వత్థరెడ్డి జోకుకు అందరూ గొల్లున నవ్వినారు. ఉమావతి కూడా నవ్వింది. నాకు నవ్వు రాలేదు. మనసులో హెడ్మాస్టర్ సార్ అనిండే మాట కుచ్చుతా వుంది. అందుకే ఉమావతి వైపు సీరియస్‌గా చూసినాను. ఆమె తలొంచుకుంది.
రెండో పీరియడ్ అయిపోయింది. ఇంటర్వెల్‌లో నేను బయటికి పోలేదు. ఉమావతి రామలక్ష్మి కూడా బయటకు పోకుండా కూర్చుండారు.
‘సారీ నారాయణా, నీ పేరూ, బాలన్న పేరూ హెడ్మాస్టర్ సార్‌కు మేము చెప్పలేదు. జగదాంబ చెప్పింది.’ అని సంజాయిషీగా మాట్లాడింది.
‘ఎవరో వొకరు చెప్పినారు కదమ్మా! సంతోషం!’ అని అటువైపు ముఖం తిప్పకుండాను.
‘వెరివెరీ సారీనప్పా! మేమిద్దరమూ హెడ్మాస్టర్ సార్ దగ్గరికి వెళ్లి నీ పేరూ, బాలన్న పేరూ జగదాంబ అనవసరంగా ఇరికించిందని చెబుతాం, సరేనా?’ అని అడిగినారు ఇద్దరూ.
‘వొద్దు, వొద్దమ్మా! మీరు చెప్పినంత మాత్రాన కొట్టిండే దెబ్బా, అనిండే మాటా వెనక్కిపోవు గదా!’ అని బయటికి వెళ్లిపోయినాను.
సాయంకాలం ఎక్కడికీ పోకుండా ఇంట్లోనే మౌనంగా కూర్చొని చదువుకుంటా వుండాను. ప్రతిరోజు సాయంకాలం సారోళ్ల ఇంటికి పోయి, జయమ్మక్కతో కొంచెంసేపు మాట్లాడి, చిన్న పిల్లలను ఆడించి, సన్నసన్న పనులు ఏమైనా ఉంటే చేసి వస్తాను. వొచ్చేటప్పుడు ప్రతిదినమూ పప్పో చారో కూరో యేదో ఒకటి ఇస్తాది జయమ్మక్క. అక్కా అని పిలచడం అలవాటయింది గానీ అమ్మ తర్వాత అమ్మే కదా! అందుకే పోవాలని ప్రాణంపీకింది. కానీ హెడ్మాస్టర్ సారుకు ముఖం చూపడానికి భయం అయితావుంటే పోకుండా ఇంట్లోనే ఉండాను.
చీకటి పడే సమయంలో అబ్దుల్లా వొచ్చి ‘మేడమ్ పిలుస్తా వుంది నారాయణా! నువ్వు రావల్లంట!’ అని చెప్పినాడు. వెంటనే ‘సారున్నాడా అన్నా?’ అని అడిగినాను. లేడన్న్యాడు అబ్దుల్లా. నేను పరుగెత్తి పోయినాను. నన్ను చూస్తానే ‘ఏమిరా, నారాయణా, సార్ కొట్టినాడంటనే! ఇప్పుడే అబ్దుల్లా చెబితే తెలిసింది. ఏమి జరిగింది రా?’ అని ప్రేమగా అడిగింది. నేను జరిగిండే విషయం అంతా చెప్పినాను. చెప్పుతావుంటే నాకు తెలీకుండానే కన్నీళ్లొచ్చినాయి. ఊరుకో, బాధపడొద్దు అని నన్ను ఓదార్చింది.
‘ఆ పనికిమాలిన ముండలు నీ పేరెందుకు చెప్పినారంట! ఆ ఉమావతి చెన్నవరం నారాయణరెడ్డి బిడ్డంటనే! ఆ తండ్రి బుద్ధులే దీనికీ వొచ్చినాయేమో’ అంటా ఉమాపతిని తిట్టింది జయమ్మక్క. నాకు మనసులో బాధ అయింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుండాను. అంతలోనే సారొచ్చినాడు. డ్రస్సు విప్పదీసి అడ్డ పంచ కట్టుకొని, బాత్రూంలోకి పోయి ముఖం కడుక్కొని బయటకొచ్చినాడు. నేను సార్‌కు టువ్వాలు అందించినాను. జయమ్మక్క సార్‌కు కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతా, ‘వానికీ కొంచెం కాఫీ ఇయ్యే!’ అని అక్కకు చెప్పినాడు. ఆ మాట అంటానే ఆనందంతో నాకు కన్నీళ్లొచ్చినాయి.
‘పాపం అమాయకున్ని వాన్ని స్కూల్లో కొట్టి, ఇంటికొచ్చినంక కాఫీ తాగమంటావా?’ అని అంతా చెప్పింది జయమ్మక్క.
‘కాదురా దొంగబడవా, ఆ విషయం నువ్వు నాకు చెప్పాల కదా, నాకు ఎట్లా తెలుస్తాది. ఆ జగదాంబ ఏడ్చుకుంటా నీ పేరు కూడా చెప్పింది. ఆ పిల్ల చెబితే నేను నమ్మలేదనుకో!’ అని సార్ నన్ను కొట్టినందుకు ఫీలయినాడు. ఒకనాడు మా నాయన చెలకోలతో కొట్టినపుడు అమ్మయ్య మాట్లాడినట్లే జయమ్మక్క మాట్లాడడమూ, నాయన మాదిరే మా సార్, ఫీల్ కావడమూ చూసి నా గుండె బరువు పూర్తీ తగ్గిపోయింది.
మా స్కూల్‌డేకి నాయని కృష్ణకుమారి!
ఫ్రీ ఫైనల్ పరీక్షల కంటే ముందే స్కూల్‌డే జరిపించమని హయ్యర్ క్లాసు విద్యార్థులందరూ హెడ్మాస్టర్‌గారిని అడిగినారు. సార్ స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని అందరి అభిప్రాయాలనూ తీసుకొని స్కూల్‌డే చేయడానికి వొప్పుకుండాడు. స్టోర్స్‌లో గేమ్స్‌లో విద్యార్థులకు పోటీలుంటాయని పోటీలలో పాల్గొనదలచిన విద్యార్థులు తమ పేర్లను ఇవ్వాలని డ్రిల్ మాస్టర్ చిదంబరరెడ్డి సార్ సర్కులర్ పంపినాడు. నేను లాంగ్ జంప్, రన్నింగ్ రేసులో పాల్గొనడానికి బాల్ బ్యాట్‌మింటన్, వాలీబాల్ షాట్‌పుట్‌లలో ఆడేకి పేరు ఇచ్చినాను. తెలుగు టీచర్ గురుమూర్తి సార్ వ్యాసరచన, వక్తృత్వం పోటీలు నిర్వహించడానికి పేర్లు తీసుకున్నాడు.
గేమ్స్, స్పోర్ట్స్ మొదలయినాయి. మూడు దినాలు గ్రౌండ్ అంతా విద్యార్థులతో ఊరి వాళ్ళతో కళకళలాడింది. నేను లాంగ్ జంప్‌లో మాత్రమే గెలిచి ఫస్ట్ ప్రైజు తెచ్చుకుండాను. రన్నింగ్ రేస్‌లో మా ఊరి ఓబుళ నారాయణ ఫస్ట్ వొచ్చినాడు. నరసాపురం అశ్వత్థరెడ్డి సెకండూ, నేను థర్డ్ ప్రైజ్ తెచ్చుకుండాం. కబడీలో మా టీమ్ ఓడిపోయింది. కొర్రపాడు చెన్నప్పోళ్ల టీమ్ గెలిచింది. బ్యాట్‌మిటన్‌లో శంకరప్ప టీమ్ ఫస్ట్ ప్లేస్‌లో, బాలన్న లీడర్‌గా ఆడిన మా టీమ్ సెకండ్ ప్లేస్‌లో వొచ్చింది. ఆడపిల్లోళ్లలో రింగ్ టెన్నిస్‌లో ఉమావతి టీమ్ ఫస్టొచ్చింది. లక్ష్మీదేవి టీమ్ సెకండొచ్చింది. త్రోబాల్‌లో ఎర్రెమ్మ టీమ్ గెలిచింది. ఖోఖో లోనూ, కబడి లోనూ ఎర్రెమ్మ టీమే గెలిచింది. రన్నింగ్ రేస్‌లో ఎర్రెమ్మ ఫస్ట్ ప్రైజ్, చక్రాయపేట రామలక్ష్మి సెకండ్ ప్రైజ్ కొట్టేసినారు. వాళ్ళిద్దరూ టెన్త్ క్లాసే. ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉండే ఆడపిల్లోళ్లు మొదట్లోనే వెనకబడిపోయినారు. వాలీబాల్ మా బాలన్న టీమ్ పైన రామచంద్రారెడ్డి టీమ్ గెలిచింది. మా టీమ్ వోడిపోవడమే కాకుండా నా చేతులవేళ్లు వాలీబాల్‌ను రిసీవ్ చేసుకుండేటప్పుడు గట్టిగాతగిలి వాచిపోయినాయి. టీచర్స్‌కు జరిగిన బ్యాట్‌మిటన్ మ్యాచ్‌లో సత్యనారాయణ సారోళ్ళ టీమ్ గెలిచింది.
గురుమూర్తి సార్ సీనియర్స్‌కు, జూనియర్స్‌కు వ్యాసరచన వక్తృత్వం పోటీలు పెట్టినాడు. రెండింటిలోనా వెంకట సత్యానికే మొదటి బహుమతి వొచ్చింది. నాకూ లక్ష్మీదేవికీ వక్తృత్వంలో సెకండూ, థర్డ్ ప్రెజు లొచ్చినాయి. వ్యాసరచన పోటీలో శంకరప్పకూ, నాకూ ద్వితీయ తృతీయ బహుమతులొచ్చినాయి.
స్కూల్ డేకి చీఫ్‌గెస్ట్‌గా తెలుగు సాహిత్యంలో పేరుపొందిన నాయని సుబ్బారావు గారి కూతురు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నాయని కృష్ణకుమారిగారు వొస్తున్నారని మన స్కూల్ డే ఫంక్షన్ అంతా, పక్కనుండే ఎలిమెంటరీ స్కూల్ బయట, ఓపెన్ ప్లేస్‌లో డయాస్ వేసి గ్రాండ్‌గా చేద్దామని, దాని డెకరేషనంతా సత్యనారాయణ గారూ చిదంబర రెడ్డి గారూ చూడాలని, పిల్లలందరూ స్కూల్లో వుండే బెంచీలన్నీ అక్కడికి చేర్చాలని, క్లాస్ లీడర్స్ అంతా ఆ పని చూసుకోవాలని హెడ్మాస్టర్ సార్ ప్రేయర్లో చెప్పినాడు. రేపు ప్రేయర్ అయిపోగానే క్లాసెస్ జరగవని, అందరూ వేదిక ఆడియన్స్ కూర్చుండే ఏరియా అంతా రంగు కాగితాలతో అలంకరించే పనిలో శ్రద్ధగా వుండాలని, స్కూలుకు ఎవరూ ఆప్సెంట్ కాకూడదని సీరియస్‌గా చెప్పినాడు. వచ్చే ముఖ్యఅతిథి చేతనే రకరకాల ఈవెంట్స్‌లో గెలిచిన విద్యార్థులందరికీ బహుమతు లందజేస్తామన్నాడు.
విద్యార్థులందరూ స్కూల్‌డే కార్యక్రమాన్ని పండగ మాదిరి చేయడానికి పూనుకుండారు. మధ్యాహ్నం లోపలే స్కూల్ పీవన్స్ అబ్దుల్లా, ఫక్రుద్దీన్ పనిమనుషులతో మైదానమంతా, దుమ్ము అనిగేటట్ల చిక్కగా నీళ్లు చల్లించినారు. పెద్ద పిల్లోళ్లందరూ క్లాసులో వుండే బెంచీలన్నీ, వేదిక ముందు, చిన్న పిల్లలూ ఊరివాళ్ళూ కూర్చోడానికి స్థలం వదిలిపెట్టి, 20 అడుగుల అవతల నుండీ వరుసగా వేసినారు. ఆడపిల్లోళ్లందరూ రంగురంగుల కాగితాలు కరిపించిన పురికోసుల సరాలను మొగపిలోళ్ళు తలా వొగటి పట్టుకొని వేదిక పందిరి పైభాగం నుంచి క్రాసుగా తీసుకొనిపోయి చివర్లో పాతిపెట్టిన గుంజలకు కట్టినారు. వేదిక ముందర జనం కూర్చోడానికి టార్బాళ్లు పరిపించినాడు చిదంబరరెడ్డి సారు, సత్యనారాయణ సార్ వేదికపైన అద్భుతంగా డెకరేట్ చేయించినాడు. బి.డి.ఓ. ఆఫీసులో ఉండే మైకు సరిపోతాదో లేదోనని హెడ్మాస్టర్ సార్ అనంతపురం నుండి మైకుసెట్ తెప్పించినాడు.
ఎలిమెంటరీ స్కూలుకు వొగపక్కన పాత అరుగుమాదిరుండే కట్టమీద ఇప్పుడు స్కూల్ డే జరుపుకుండే వేదిక అద్భుతంగా తయారయ్యింది.
ఆ పెద్ద అరుగు, రెండేళ్ల కిందట ఉస్మాన్ అలీఖాన్ ఎం.పీ.గా నిలబడినప్పుడు శింగనమలలో ఆయన ఎన్నికల మీటింగ్ కోసరం కాంగ్రెసోళ్ళు కట్టించినారు. ఆ మీటింగ్‌కు ఆంథోనిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, తరిమెల రామచంద్రారెడ్డి ఇంకా ఎవురెవురో పెద్ద పెద్దోళ్ళు వొచ్చినారు. అట్లాంటి వాళ్ళ మీటింగు కోసరం కట్టిన అరుగు కట్టమీద మా స్కూల్ డే మీటింగ్ జరపల్లని మా సార్ ఎంతద్భుతంగా ఆలోచన చేసినాడో అనుకుంటా వేదిక మీద నుంచి బెడ్‌షీట్ పరచి ఫ్లవర్‌వాజ్‌లు పెడతా వుండే ఉమావతి రామలక్ష్మి వాళ్ళ దగ్గరికి పోయినాను.
‘ఏమప్పా, మా మీద ఇంకా కోపం తగ్గిందా లేదా?’ అని నవ్వుతా అడిగింది ఉమావతి. నేను ఏమీ మాట్లాడకుండా ఊరకనే చిరునవ్వు నవ్వినాను. ‘చెప్పు నారాయణా కోపం తగ్గిందా లేదా?’ అని రామలక్ష్మి గట్టిగా అడిగింది.
‘ఆ రోజే తెలిసిందిలే రామలక్ష్మీ! నా పేరూ, బాలన్న పేరూ చెప్పి, సార్ దగ్గర గట్టిగా మాట్లాడి కంప్లైంట్ చేసిండేది జగదాంబేనని సార్ చెప్పినాడు. ఉమావతీ నువ్వే నా పేరు చెప్పినారేమోనని నిజానికి నేనయితే చాలా బాధపడినాను’ అని మనసులో ఏదీ దాచుకోకుండా చెప్పినాను.
‘నీ మీద నేను కంప్లైంట్ ఇస్తానా నారాయణా? యెట్లనుకుండావు నువ్వు’ అంటా నా కళ్ళలోకి చూసింది ఉమావతి. ఆ బుంగమూతినీ కండ్లనూ చూసి నాకెట్లో అయిపోయింది. ఏమి చెప్పల్లనో మాటలు రాక, ‘పొరపాటుగా అనుకుండాన్లే ఉమావతీ! నామీద నువ్వు గానీ రామలక్ష్మి గానీ కంప్లైంట్ చెయ్యరని నాకు తెలుసు. సరే యేదో అయిపోయింది లే’ అని అంటా వుండంగనే పార్వతీ జగదాంబ వొచ్చినారు. బాలన్న వాళ్ళను వెంటబెట్టుకొని సత్యనారాయణ సారొచ్చి డయాస్ డెకరేషనంతా చూసి, ‘ఎక్సలెంట్ మై డియర్ గర్ల్స్! ఉమావతి డెకరేట్ చేసినాక, ఇంక దాన్ని పేరుపెట్టడానికి అవుతుందా? వెరీ ఫైన్ రా బంగారూ!’ అంటా ఉమావతి తలమీద మెల్లిగా చేతితో తట్టినాడు. ఉమావతి చెక్కిళ్ల మీద సిగ్గు పారాడింది. అది చూస్తా, అబ్బా, ఎంత బాగుందో అనుకుంటా మురిసిపోయినాను.
‘ఏమిరా నారాయణా, ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయిరా! ఎప్పుడూ ఇంత గ్రాండ్‌గా స్కూల్ డే ఏర్పాట్లు చేయలేదు. మీది మంచి బ్యాచ్ రా!’ అంటా మా బ్యాచ్ స్టూడెంట్స్‌ను మెచ్చుకోసాగినాడు సత్యనారాయణ సార్.
‘ఈరోజు మన స్కూల్ డే ఫంక్షన్‌కు చీఫ్‌గెస్ట్ ప్రొఫెసర్ నాయని కృష్ణకుమారి గారంట! ఎవురు సార్ ఆయమ్మ?’ అని బాలన్న అడిగినాడు.
‘ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తా వుందంటరా ఆమె! నాకు తెలిసింది అంతేనప్పా! వాళ్ళ ఫాదర్ నాయని సుబ్బారావు పేరు డిగ్రీలో మా తెలుగు లెక్చరర్స్ చెప్పుతా వుంటే విన్నాను. అంతకుమించి నాకేమీ తెలియదు రా! మీ సార్‌కు ఆ యమ్మ ఎట్లా తెలుసునో యేమో మరి? ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తా వుండే ఆమెకూ, ఈయనకూ ఏమి లింకో మనకేమి తెలుస్తాదప్ప!’ అని అదొగ రకంగా అన్న్యాడు సత్యనారాయణ సార్. ఆ సార్, అట్లనడం నాకు నచ్చలేదు. మా సార్‌కూ ఈయనకూ కొంచెం పడదని మాకు తెలుసు! అందుకే అట్ల రాగం తీస్తా అన్న్యాడని నాకు అర్థమయింది.
సత్యనారాయణ సార్ ఆ రకంగా మాట్లాడతా వున్నంగనే గురుమూర్తి సారొచ్చినాడు. నాయని కృష్ణకుమారి తెలుగు సాహిత్యంలో గొప్ప విద్యావంతురాలని, జానపద సాహిత్యం పైన గొప్ప కృషి చేసిందని, ఆమె పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ‘ఆంధ్రుల కథ’ పేరుతో వొగ పుస్తకం రాసి పబ్లిష్ చేసిందని, ఆ పుస్తకాన్ని స్కూల్ పిల్లలకు ప్రభుత్వం కొన్నేళ్లపాటు టెక్స్ట్ బుక్కుగా పెట్టిందని, మంచి ప్రతిభావంతురాలని అది తెలుసుకొని హెడ్మాస్టర్‌గారు ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించినారని, ఆమె తండ్రి నాయని సుబ్బారావు స్వాతంత్య్ర సమరయోధుడే కాకుండా తెలుగు సాహిత్యంలో గొప్ప వ్యక్తి అని చెప్పినాడు. ఆయన మాటలు విని, ‘అవునా గురుమూర్తి గారూ! అయితే చాలా ప్రముఖమైన వ్యక్తే అన్నమాట! రేయ్ నారాయణా! నీకు తెలుగు మీద చాలా ఇంట్రెస్ట్ కదా, మీ తెలుగు సారే చెప్పుతున్నాడు. ఆమె గొప్ప సాహిత్యవేత్త అని, ఆమె స్వీచ్‌ను శ్రద్ధగా విను!’ అని సత్యనారాయణ సార్ చెప్పుతా వుండంగనే బెల్లుకొట్టినారు. పిల్లలందరూ వాళ్ల వాళ్ల క్లాసుల్లోకి పోయినారు. డ్రిల్ మాస్టరు సారూ, నేనూ జాతీయ పతాకాన్ని ముడేసి, పోల్ పైకి పంపినాం.
హెడ్మాస్టర్ సార్ స్టూడెంట్సందరికీ చిన్నచిన్న స్వీటూ కారా పొట్లాలు ఏర్పాటు చేసినాడు. పీవన్ వొచ్చి వొక్కొక్క క్లాస్‌కు వొక బాక్స్ ఇచ్చుకుంటా పోయినాడు. క్లాస్ టీచర్సు ఎదురుగా క్లాస్ పీపుల్ లీడర్ ఆ పొట్లాలను పిల్లలకు పంచినాడు. అంతలోనే హెడ్మాస్టర్ సార్ ఇంటి దగ్గర్నుంచి కార్లో వొచ్చి దిగినాడు. అదే కార్లో నుంచే వొక లేడీ దిగింది. చీఫ్‌గెస్ట్ ఆమే కావొచ్చునని అనుకుండాం. ఆమెను హెడ్మాస్టర్ సారు తన ఆఫీసు రూమ్‌లోకి పిలుచుకొని పోయినాడు.
పది నిమిషాలయిన తరువాత పీవన్ అబ్దుల్లా వొచ్చి ‘ఇప్పుడు బెల్లు కొట్టగానే స్టూడెంట్సందరూ ప్రేయర్ జరిగేచోటికి క్లాసుల వారీగా రావల్లని, ఫస్ట్ ప్రేయరూ ఆ తర్వాత ఫ్లాగాయిస్టింగ్ వుంటాదని, ఆ తర్వాత అందరూ వరసగా మీటింగ్ దగ్గరికి పోయి కూర్చోవల్లని హెడ్మాస్టర్ మాటలుగా చెప్పిపోయినాడు.
బెల్లు కొట్టినారు. పిల్లలందరూ వరుసగాపోయి మామూలు ప్రేయర్లో నిలుచుకున్నట్లే నిలబడినారు. నేను స్కూల్ పీపుల్ లీడర్‌గా ప్లాట్‌ఫార్మ్ మీద ఫ్లాగ్ పోల్ పక్కన నిలుచుకుండాను. హెడ్మాస్టర్ సార్ చీఫ్‌గెస్ట్‌ను పిలుచుకొని వొచ్చి ఇద్దరూ కొంచెం పక్క పక్కగా నిలబడినారు. నాకు కుడివైపున ఉమావతీ, లక్ష్మీదేవి నిలుచుకుండారు. డ్రిల్ మాస్టర్ సారు విజిల్ వూదినాడు. నేను, స్కూల్ అటేన్షన్, స్టాండటీజ్, అటేన్షన్ అని కాషన్ ఇచ్చినాను. స్టూడెంట్స్ అందరూ అటెన్షన్‌లోకి రాగానే ‘ప్రేయర్’ అన్న్యాను. లక్ష్మీదేవి ‘తల్లీ నిన్ను దలంచి’ అని పద్యం పాడింది. నేను మళ్లీ మూడుసార్లు కాషనిచ్చి, మార్చ్‌ఫాస్టింగ్ స్టెప్స్ వేసుకుంటా చీఫ్‌గెస్ట్ దగ్గరికి పోయి సెల్యూట్ చేసి, ఫ్లాగ్ హాయిస్టింగ్‌కు ఆహ్వానించినాను. ఆ మేడమ్ పోల్ దగ్గరకొచ్చి ఫ్లాగ్ హాయిస్ట్ చేసింది. నేను ‘సెల్యూట్ టు ద ఫ్లాగ్, సెల్యూట్’ అని కాషనిచ్చినాను. అందరూ ఫ్లాగ్‌కు సెల్యూట్ చేసినారు. ‘ఆర్డర్’ అన్న్యాను. అందరూ చేతుల్ని కిందికి దించినారు. నేను వెంటనే ‘ఫ్లాగ్ సాంగ్’ అని కాషనిచ్చినాను. ‘విజయీ విశ్వ తిరంగా ప్యారా, జండా ఊంఛా రహే హమారా’ అని ఉమావతి పాటనెత్తుకుంది. లక్ష్మిదేవి గొంతు కలిపింది. పిల్లలందరూ నిశ్శబ్దంగా వున్నారు. పరిసరాలన్నీ నిశ్శబ్దంగా వుండాయి. ఇద్దరి గొంతులూ మనోహరంగా పాడుతున్నాయి. ఉమావతి గొంతు ప్రత్యేకంగా వినిపిస్తావుంది. వింటూ నేను కరిగిపోయినాను.
పాట అయిపోగానే నేను స్టాండటీస్ చెప్పినాను. హెడ్మాస్టర్ సార్ అందర్నీ వరుసగా మీటింగ్ హాల్‌దగ్గరికి పోయి కూర్చోమన్న్యాడు. క్లాస్ లీడర్స్ అందరూ వాళ్ల వాళ్ల క్లాస్ పిల్లల్ని పిలుచుకొని పోయినారు. ఆ మేడమ్ నా చేతిలో చేయి కలిపి ‘మై డియర్ బాయ్!’ అని మెచ్చుకుంది. అట్లే ఉమావతినీ లక్ష్మీదేవినీ మెచ్చుకుంటా ‘చాలా బాగా పాడారమ్మాయిలూ! ఇంకా కాసేపు వినాలనిపించింది. వెరీ నైస్’ అంటా ఉమావతి తల నిమిరింది. ఉమావతి మురిసిపోయి నవ్వింది. ఆ చిరునవ్వును చూసి నేనూ మురిసిపోయినాను. బాలన్నా, సత్యమూ ఇంగా ఇద్దరు ముగురొచ్చి ‘కాషన్ అదరగొట్టినావు నారాయణా! మీ పాట అద్భుతంగా వుందమ్మా మీ ఇద్దరి గొంతులో జాతీయ పతాకమే కనిపించింది’ అని పొగిడినారు. ఉమావతి వాళ్లకు థాంక్స్ చెప్పి, చిరునవ్వు మొగంతో స్నేహితురాళ్లను కలుసుకుని మీటింగ్ దగ్గరికి పోయింది.
నేను సార్ దగ్గరికి పోయొస్తానని స్నేహితులతో చెప్పి, హెడ్మాస్టర్ సార్ రూమ్‌లోకి పోయినాను. ‘రా రా’ అంటా సార్ నన్ను లోపలికి పిలిచినాడు. సత్యనారాయణ సార్, నా పేరు చెప్పి, ‘హి ఈజ్ వెరీ పూర్ బాయ్ మేడమ్! మా హెడ్మాస్టర్ గారే చదివిస్తున్నాడు. వీన్నే కాదు, ఇంకా ఫోర్ స్టూడెంట్స్‌ను ఆయనే చదివిస్తున్నాడు’ అని మేడమ్ గారికి చెప్పుతా వుంటే నాకు ఆనందమయ్యింది. ఆ మేడమ్ గారు ఆశ్చర్యపోతా ‘వావ్, యు ఆర్ ఎ గ్రేట్ మాన్ సార్! మనసారా మిమ్మల్ని అభినందిస్తున్నాను’ అని ఆ మేడమ్, సార్‌ను మెచ్చుకుంది.
‘సరే నువ్వెళ్లి పిల్లలందర్నీ నిశ్శబ్దంగా కూర్చోబెట్టు పో నారాయణా’ అని సార్ చెప్పగానే నేను పిల్లలందరి దగ్గరికి పోయినాను. నేనూ బాలన్నా రామచంద్రారెడ్డీ పిల్లలందరినీ నిశ్శబ్దంగా కూర్చోబెట్టసాగినాం. అంతలోనే బి.డి.వో. జీపొచ్చింది. బి.డి.వో. జీపు దిగి హెడ్మాస్టర్ రూములోకి పోయినాడు.
స్కూల్ పీవన్లు ఇద్దరూ వేదిక ముందుపక్క వొక సైడు ముప్పె నలబై కుర్చీలు వేసినారు. వేసిన కాసేపటికే హెడ్మాస్టర్ సార్ చీఫ్‌గెస్ట్‌నూ, బి.డి.వో. సార్‌నూ వేదిక దగ్గరికి పిలుచుకొని వొచ్చినాడు. వాళ్ల వెంట ఉస్తిపల్లి సుబ్రమణ్యం, గ్రామపంచాయతి ప్రెసిడెంటు ఘట్టప్పా, స్కూల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సత్యమూర్తి, సాంబయ్య, అషండా మసూద్ ఇంకా పదీపదైదు మంది వొచ్చినారు. అందరూ సైడులో వేసిండే కుర్చీలలో కూర్చుండారు.
స్టేజి ముందర పరిచిండే టార్బాల్ పట్టలూ బెంచీలూ డెస్కులూ యావీ పట్టలేదు. మైదానం నిండా జనమే!
చిదంబరెడ్డి సారు విజిల్ గట్టిగా ఊదినాడు. అంతా నిశ్శబ్దం. మా తెలుగు టీచర్ గురుమూర్తి సార్ స్టేడియం దగ్గరుండే మైకు దగ్గరికి పోయి, సభకు నమస్కారం చేసి, పెద్దలందరినీ వేదిక మీదికి ఆహ్వానించినాడు. చీఫ్‌గెస్ట్ నాయని కృష్ణకుమారి గారి గొప్పతనాన్ని గురించి చెప్పినాడు. 22 సంవత్సరాల వయసులోనే ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు డిపార్ట్‌మెంటులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిందని, దివాకర్ల వెంకటావదానితో కలిసి పనిచేసిన గొప్ప విధుషీమణి, తెలుగు సాహిత్యంలో మహోన్నతమైన ‘ఆంధ్ర మహా భారత సంశోధిత ప్రతి’ ఎనిమిది సంపుటాలుగా వెలువరించడంలోనూ, తెలుగు డిపార్ట్‌మెంట్ పేరు ప్రతిష్ఠలను పెంచడంలోనూ ఆమె గొప్ప కృషి చేశారని తెలుగు సార్ వివరిస్తా వుంటే పెద్దలందరూ అబ్బురపోయినారు. నేను ఆశ్చర్యపోతా విన్న్యాను. మా క్లాస్‌మేట్స్ వొక్కొక్కరు వొక్కొక్కరికి వేదిక మీదికి రాగానే పూలహారమేసినారు. పూలహారాలన్నీ అబ్దుల్లా ఉదయమే అనంతపురానికి పోయి తెచ్చినాడు. సభకు అధ్యక్షులుగా మా హెడ్మాస్టర్ సార్‌ని గురుమూర్తి సార్ ఆహ్వానించినాడు. మా సార్‌కు నేను పూలహారమేసినాను. చీఫ్‌గెస్ట్‌కు ఉమావతి వేసింది. సత్యం ప్రత్యేక అతిథి బి.డి.వో.సార్‌కు వేసినాడు.
స్టేజి మీద ముందు వరుసలో హెడ్మాస్టర్ సారూ, చీఫ్‌గెస్టూ, బి.డి.వో, స్కూలు స్థలదాత ఉస్తిపల్లి సుబ్రమణ్యం, ఘట్టప్ప కూర్చుండారు. మిగతా వాళ్ళందరూ వెనక వరుసలో కూర్చుండారు. ప్రార్థన చేయడానికి అదేపనిగా పిలిపించినారేమో సరోజమ్మ వొచ్చింది. మైకు ముందు నిల్చుకొని ఆమె ‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ’ అని పాడుతా వుంటే సభంతా పిండ్రాప్ సైలన్సు! లౌడ్ స్పీకర్లో ఆ ప్రాంతమంతా మనోహరంగా ప్రతిధ్వనించింది. అద్భుతంగా వినసొంపుగా పాట రాగమూ స్వరమూ వినిపిస్తా వుంటే చుట్టుపక్కలుండే ఇండ్లల్లో నుంచీ జనం పరుగులు తీస్తా రాసాగినారు. సగం శింగనమలంతా అక్కడికొచ్చి వాలింది.
మొదట హెడ్మాస్టర్ సార్ మాట్లాడినాడు. వెనకబడిన ప్రాంతం శింగనమలను గురించీ, హైస్కూల్ గురించీ 1958 లోనే హైస్కూల్ కోసం ఐదు వేల రూపాయల నగదునూ, గ్రామానికి పక్కనే రోడ్డుసైడున్న విలువైన భూమినీ విరాళంగా ఇచ్చిన ఉస్తిపల్లి సుబ్రమణ్యాన్ని గురించీ, స్థానిక సమితి ఆఫీసునూ, అన్ని విధాలా సహకరించే బి.డి.ఓ. ను గురించీ, ఊరి పెద్దలను, ప్రజలను గురించీ, సార్ మాట్లాడుతా వుంటే మాటమాటకు జనం చప్పట్లు కొట్టినారు. మా సార్ మధ్యలో కొంచెం సేపు ఇంగ్లీషులో మాట్లాడినాడు. ఆయన ఇంగ్లీష్ స్పీచ్‌ను వింటా పెద్దలందరూ ఆశ్చర్యపోయినారు.
తర్వాత ముఖ్య అతిథి ప్రొఫెసర్ నాయని కృష్ణకుమారిగారు అమోఘంగా మాట్లాడినారు. మా స్కూల్ విద్యార్థుల క్రమశిక్షణను, అమ్మాయిలు పాడిన జెండా గీతాన్నీ సరోజ పాడిన పాటనూ పరవశిస్తూ పొగిడింది. హెడ్మాస్టర్ గారి ఔన్నత్యాన్నీ ఇంగ్లీష్‌ను విని నాకు మాటలు రావడం లేదనీ వొగ నిమిషం మౌనంగా ఉండి, తరువాత స్పీచ్ ఇచ్చింది. మనిషి ఎంతందంగా ఉందో, అంతకంటే అందమైన కంఠంతో అద్భుతంగా మాట్లాడింది. ఆమె మాట్లాడతా ఉంటే నేనూ ఆ విధంగా తెలుగు సాహిత్యాన్ని చదువుకోవాలనిపించింది. వెంటనే పేదరికాన్ని తలుచుకొని అది ఈ జన్మలో సాధ్యమయ్యేపని కాదని, ఆ ఆశను తుంచేసుకుండాను. ఆ మేడమ్ మాట్లాడినంక మిగతావాళ్లు రెండ్రెండు నిమిషాలు మాట్లాడినారు. ఆ తర్వాత మేడమ్‌కు మా హెడ్మాస్టర్ సార్ శాలువా కప్పి సన్మానం చేస్తా ఆమె వైపు చిరునవ్వుతో చూసినాడు. ఆ మేడమ్ కూడా పరవశించిపోతా సార్‌ను చూడసాగింది. ఫోటోగ్రాఫర్ రాజు ఆ దృశ్యాన్ని ఫోటో తీసినాడు. ఎలాగయినా ఆ ఫోటోను అడిగి యిప్పిచ్చుకోవల్లని అనుకుండాను. ఫోటోగ్రాఫర్ రాజు హాల్‌టికెట్ల కోసరం మా క్లాస్ వాళ్ల ఫోటోలన్నీ మొన్ననే మా స్కూలుకొచ్చి తీసినాడు.
సన్మానాలన్నీ అయిపోయినంక స్టూడెంట్సుకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం. మొదట ఆడపిల్లోళ్లకు నాలుగు ప్రైజులు ఎర్రెమ్మ తీసుకుంటా వుంటే చప్పట్లు మోత! శివపురమోళ్లు ఈలలు వేసినారు. ఉమావతి రెండు ప్రైజులు తీసుకుండేకి పోయినప్పుడు స్టూడెంట్సందరూ చప్పట్లు కొడతా ఈలలు వేస్తా కేరింతలు కొట్టినారు.
సభంతా మారుమోగింది. మగ పిల్లోళ్లలో బెస్ట్ ఎ.సి.సి. క్యాడెట్‌గా, స్కూల్ పీపుల్ లీడర్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టూడెంట్‌గా నాకు సర్టిఫికెట్టూ, షీల్డు ఇచ్చినప్పుడు మా క్లాస్‌మీట్స్ అందరూ పెద్దగా కేకలు వేసినారు. వ్యాస రచనలో, వక్తృత్వంలో ప్రథమ బహుమతి విజేతగా అన్ని తరగతుల్లో హైయెస్ట్ మార్క్స్ విన్నర్‌గా జొన్నలగడ్డ వెంకటసత్యం అని పిలుస్తానే శింగనమలంతా మారుమోగేటట్ల విద్యార్థులు చప్పట్లు కొట్టినారు.
చివర జాతీయ గీతంతో మా స్కూల్ డే ఫంక్షన్ ముగిసింది. స్కూలుకు రేపు శెలవు అని హెడ్మాస్టర్ చెప్పగానే పిల్లలందరూ సంతోషంగా కేకలు వేస్తా వెళ్లిపోయినారు. జతగాళ్లందరూ గుమిగూడినారు. ఫంక్షన్ గురించీ, నాయని కృష్ణకుమారిని గురించీ మాట్లాడుకుంటా ‘బ్రహ్మాండమైన ఫంక్షన్ నప్పా! భలే బాగా జరిగింది! చీఫ్‌గెస్ట్ అద్భుతంగా మాట్లాడింది రా. ఫిగర్ కూడా బ్రహ్మాండంగా ఉంది! అదిరిందనుకో! యెక్కడ హైదరాబాదు, యెక్కడ శింగనమల? మన సార్‌కు యెట్లా కనెక్షనో యేమి కనెక్షనో! మన నారాయణకు తెలిసింటాది!’ అని రామచంద్రారెడ్డీ అశ్వత్థరెడ్డీ రాధాకృష్ణా అదొగ రకంగా నవ్వినారు.
‘నోరు మూసుకోండయ్యా. ఇంక చాలు గానీ!’ అని నేను కొంచెం కోపగించుకుండాను. దాంతో అందరూ నోరుమూసుకుండారు.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
