Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాతి పర్రెలలో నుంచి..-23

[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]

బ్లిక్ పరీక్షలకు ప్రిపరేషన్ హాలిడేస్ వొదిలేకి ముందు, క్లాసుకు ప్రతి పీరియడ్‌లో సబ్జెక్టు టీచరొచ్చి పరీక్షలలో తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ రాసుకోమన్న్యారు. అన్నీ రాసుకుండాం. అయితే దీండ్లనే నమ్ముకొని ఇవి మాత్రమే చదువుకొని పోవద్దనీ, రెండు మూడు సంవత్సరాల ప్రశ్న పేపర్లను చూసుకోండని, అవి గైడ్స్‌లో ఇచ్చింటారని సూచించినారు. తెలుగు టీచర్ గురుమూర్తి సార్ తెలుగులో ఏవయినా డౌట్స్ వొస్తే, ‘ఫైవ్ పండిట్స్ గైడ్’ చూసుకోండని ఆ గైడ్ బాగుంటాదని చెప్పినాడు.

హాలిడేస్ వొదలకముందే మా క్లాస్ స్టూడెంట్సందరూ మాట్లాడుకొని సరస్వతీపూజ, క్లాస్ డే జరుపుకోవాలనుకుండారు. తలాకింత డబ్బులేసుకొని ఫంక్షన్ చెయ్యల్లనుకుండారు. నేను వచ్చే పబ్లిక్ పరీక్షలు మనసులో అనుకొని కొంచెం నసిగినాను. ఉమావతి ‘నారాయణ డబ్బులు నేనిస్తాన్లే’ అనింది. అశ్వత్థరెడ్డీ అదేమాట అన్నాడు. నేను అందుకు వొప్పుకోలేదు. మల్లా ఆలోచనచేసి రెండు మూడు దినాలు తర్వాత ఇస్తానన్న్యాను. ఏమొద్దులే నారాయణా

ఉమావతి ఇచ్చిందిలే’ అన్నాడు. నాకు సిగ్గు అనిపించింది. వొక్కతే ఉన్నప్పుడు ‘ఎందుకు ఇచ్చినావు ఉమావతీ? నాకు కొంచెం ఇన్‌సల్ట్‌గా వుంది’ అని మెల్లిగా అన్న్యాను.

‘అట్లెందుకనుకుంటావు నారాయణా? ఆ మాత్రం నేను అడ్జస్ట్ చేయలేనా? పోనీ నేనివ్వకూడదా?’ నా ముఖంలోకి చూసి అనింది. నేను తలంచుకొని బిడియపడతూ వుంటే మళ్లా తానే ‘ఏం పర్వాలేదు లేప్పా!’ అనింది. నేను థాంక్స్ చెప్పకుండా మౌనంగా వుండిపోయినాను.

మా క్లాస్ డే! సరస్వతీపూజ తరగతి గదినంతా రంగు కాగితాలతో అలంకరించినాం. క్లాసులో ఉండే టేబుల్ని వొగ మూలకు జరిపినాం. శారదాంబ మంచి టేబుల్ క్లాత్ తెచ్చి పరిచింది. రాధాకృష్ణ సరస్వతి పటం తెచ్చినాడు. ముందు రోజే చెప్పడంతో స్కూల్ పీవన్ పూలహారము, కొన్ని పూలు తెచ్చినాడు. పుల్లయ్యశెట్టి లడ్డూ బూందీ పొట్లాల బాక్స్ తెచ్చినాడు. వెంకటసత్యం బ్లాక్ బోర్డ్ మీద గుండ్రంగా ‘శ్రీ’ కారం, ఆ అక్షరం కింద ఎస్.ఎస్.ఎల్.సి.1964 వ సంవత్సరం బ్యాచ్ అని రాసినాడు. బాలన్న మా క్లాస్ టీచర్ సత్యనారాయణ సార్‌ను పిలుచుకొని వొచ్చినాడు.

ఆ సార్ రాగానే, పటానికి పూలహారం వేసి, ఊదుబత్తులు అంటించి పటం చుట్టూ మూడుసార్లు తిప్పి వొక మూల చెక్కి సరస్వతి బొమ్మకు కుంకుమబొట్టు పెట్టి టెంకాయ కొట్టినాడు వెంకటసత్యం. సత్యనారాయణ సార్ తరువాత వొక్కొక్కరూ పటానికి పూలు చల్లి మొక్కుకుండారు. బాలన్న పెద్ద పూలహారాన్ని బోర్డ్ మీద రాసిన ‘శ్రీ’ కారం చుట్టూ తగిలేసినాడు.

స్వీట్ బాక్స్ హెడ్మాస్టర్ రూములోకి తీసుకొని పోయి సార్లందరికీ యిచ్చి అందర్నీ క్లాస్ డే మీటింగ్‌కు రమ్మని పిలవమన్న్యాడు సత్యనారాయణ సార్. నేనూ బాలన్నా సార్ చెప్పినట్లే చేసొచ్చి క్లాసులో స్టూడెంట్సందరికీ స్వీట్స్ పంచినాం. మిగిలినవి పీవన్‌కు ఇచ్చి, సారోళ్ళందరూ మీటింగుకు వస్తారు, కుర్చీలు తెచ్చి వెయ్యండన్న్యాం. వెంటనే తెచ్చి వేసినారు. మొదట మా క్లాస్‌కొచ్చే టీచర్లందరూ వొచ్చి కూర్చుండారు. ఆ తరువాత హెడ్మాస్టర్ సారొచ్చినారు. అందరూ సరస్వతి పటానికి పూలు చల్లి మొక్కుకొని కూర్చుండారు. పార్వతి, సరస్వతి పటం దగ్గరికి పోయి నిల్చుకొని ‘తల్లీ నిన్ను తలంచి పుస్తకము..’ అని సరస్వతీ ప్రార్థన పద్యం చెప్పింది.

మొదట మా క్లాస్ టీచర్ రెండు మాటలు మాట్లాడి, పిల్లలు మాట్లాడిన తర్వాత టీచర్స్ మాట్లాడుతారని, మమ్మల్ని మాట్లాడమని పిలిచినా ఎవురూ లేయలేదు. కానీ కాసేపయినంక వెంకట సత్యం ధైర్యంగా వెళ్లి టీచర్సందరినీ గౌరవంగా ప్రస్తుతించి ‘ఇటువంటి గొప్ప హెడ్మాస్టర్ సారూ, మంచి టీచర్సందరూ మాకు పాఠాలు చెప్పడం మా అదృష్టమని, మీరు చెప్పిన నీతి వాక్యాలు, పాఠాలూ మాకు వెలుగు దీపాలని, జీవితాంతం మిమ్మల్ని గౌరవంగా స్మరించుకుంటామ’ని చాలా గొప్పగా మాట్లాడినాడు. తర్వాత అశ్వత్థరెడ్డిని మాట్లాడమని పిలిచినాడు సత్యనారాయణ సార్. అశ్వత్థరెడ్డి పైకి లేచి ‘అమ్మయ్యా, మనకు అదంతా అయ్యెల్యా సార్!’ అని అంటానే, అందరూ పక్కన నవ్వినారు.

‘అదంతా అంటే యేందిరా అది? మనకు అంటే యెవరెవరికప్పా!’ అని హెడ్మాస్టర్ నవ్వుతా అడిగినాడు.

‘అదే సా, మాట్లాడేది గీట్లాడేది అంటే నాకు యాడొత్తాది సా’ అని అశ్వత్థరెడ్డి అంటా వుంటే అందరూ పడిపడి నగినారు. మమ్మల్ని చూసి ‘యాలంతా అట్ల నగేది మీరు? నేను మొరటోన్ని, మీ లెక్కన నైసు నైసుగా మాట్లాడేకి నా కయ్యెల్ల్యా’ అని మల్లా అందరినీ నవ్వించినాడు. సత్యనారాయణ సార్ నన్ను మాట్లాడమన్నాడు. ఎప్పుడూ మాట్లాడని నాకు కొంచెం భయం అయింది. అయినా ధైర్యం తెచ్చుకొని మాట్లాడినాను.

‘ఆరో తరగతిలోనే నా చదువు ముగిసిపోతాదేమోనని దిగులు పడిన నేను ఎస్.ఎస్.ఎల్.సి. వరకూ వొచ్చినానంటే అది నా పూర్వజన్మ సుకృతం! నాకు ఈ విద్యాభిక్ష పెట్టి నన్ను వొక్క కొడుకు మాదిరి చూసుకుంటా, నన్ను ఈ స్థితికి తెచ్చిన గురుదేవుడు హెడ్మాస్టర్ సారూ, అమ్మ వంటి జయమ్మక్క! వాళ్ల ఋణం తీర్చుకోలేనిది. క్లాస్ టీచర్ సత్యనారాయణ సారూ, సైన్స్ టీచర్ కృష్ణమూర్తి సారూ చెప్పిన మాటలు మర్చిపోలేను. నా పేదరికాన్ని తెలుసుకొని టీచర్సందరూ ధైర్యంచెప్పి ఎంతో ప్రోత్సహించినారు. మన తెలుగు సార్, నాకు తెలుగు మీద ఎంతో ఆసక్తిని కలిగించినారు. ముఖ్యంగా క్లాస్మేట్స్‌గా మీ అందరి స్నేహం వల్ల, ప్రేమ వల్ల నేను నా బాధను మరిచిపోయి చదువుకోగలిగినాను. హెడ్మాస్టర్ సార్ ఆశీస్సుల వల్ల నేను స్కూల్ పీపుల్ లీడర్ అయినాను. సత్యనారాయణ సార్ ప్రోత్సాహం వల్లనే నేను ఏ.సి.సి. లీడర్నయినాను. ఇవి నేను కలలో కూడా ఊహించని విషయాలు.

మీవంటి మంచి స్నేహితులతో కలిసి చదువుకోవడం, ఇంత మంచి స్నేహితులమయిన మనం రేపటి నుంచి ఎవరికి ఎవరమో అని అనుకుంటే మాటలు రావు’ అంటా ఏడ్చేసినాను. అందరూ ఏడ్చినారు. ఉమావతీ రామలక్ష్మీ బొటాబటా కన్నీళ్లు కార్చినారు. మాటలు రాక కన్నీళ్లు కారుస్తున్న నన్ను సత్యనారాయణ సార్ పట్టుకుని మా బెంచీ దగ్గరికి వొచ్చి కూర్చోబెట్టినారు.

సార్లందరూ తలా రెండు మాటలు మాట్లాడి దీవించినారు. ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎవరికి తెలుసు? మీరు జీవితంలో ఉన్నత స్థాయికి పోయి, ఎప్పుడయినా ఎదురుపడినప్పుడు ప్రేమగా పలకరించి, నేను మీ స్టూడెంట్‌ను సార్ అని అన్నప్పుడు అదే మాకు ఆనందం. తరగతిలో ఎప్పుడయినా ఏదో సందర్భంలో మిమ్మల్ని తిట్టి మందలించి వుంటాం. అది మీ మేలుకోరి అన్నమాటలే గానీ ఎవరిమీదా మాకు ద్వేష భావ ముండదంటా ప్రేమగా మాట్లాడినారు. చివరగా హెడ్మాస్టర్ సార్ మాట్లాడినారు.

ఈ స్కూలును ఈ స్థితికి తెచ్చేకి నేనెంత అవస్థపడినానో మీకందరికీ తెలుసు. ఇది నా ఇల్లనుకుండాను. టీచర్సందరూ నా సోదరులు. వాళ్లను నేనెప్పుడూ సబార్డినేట్స్‌గా చూడలేదు. మీరందరూ నా ఇంటి పిల్లలు. వొగ హెడ్మాస్టర్‌గా నేను ఈ స్కూల్ అభివృద్ధి కోసం, పేరు ప్రతిష్ఠల కోసం మిమ్మల్ని నేను తిట్టి వుండొచ్చు, కొట్టి వుండొచ్చు! అదంతా నా పిల్లలు మేలుకోరే చేసినాను. ఇటువంటి టీచర్స్ స్టాప్, ఇంకొక హెడ్మాస్టర్‌కు లభించదు. మీ అందరి కో`ఆపరేషన్ వల్లనే మన స్కూల్ గ్రౌండ్ అంతందంగా తయారయ్యింది. మీ సహకారం వల్లనే మన స్కూల్లో మనం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ నిర్వహించుకోగలిగినాం.

చాలా సంతోషం! మీ బ్యాచ్‌లోని వెంకటసత్యం తరువాతి బ్యాచ్‌లోని బాబు వంటి ఎక్‌స్ట్రార్డినరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వల్ల ఈ స్కూల్ పేరు ప్రతిష్ఠలు జిల్లాకే కాదు, మొత్తం మన రాయలసీమకే గర్వకారణమవుతాయన్న నమ్మకం నాకుంది. ఎంతోమంది పేద పిల్లలకు నా సొంత డబ్బులిచ్చి వాళ్లు చదువుకోడానికి అవకాశం కల్పించాను. టీచర్‌గా, హెడ్మాస్టర్‌గా అది నా బాధ్యత. నారాయణ తన కుటుంబ పరిస్థితుల కారణంగా మోస్ట్ బ్రిల్లియంట్ స్టూడెంట్‌గా కాలేకపోయినా, నాకెందుకో వాడు ఉన్నత స్థాయికి పోతాడనిపిస్తుంటుంది. మరి వాని అదృష్టం ఎట్లుందో చూడాలి. యెనీ హౌ, బాగా చదువుకొని సెంట్‌పెర్సెంట్ పాసయ్యేందుకు ప్రయత్నించండి. గుడ్ లక్! విష్ యు ఆల్ ద బెస్ట్!’ అని దీవించినాడు హెడ్మాష్టర్ సార్.

సార్లందరూ స్టాఫ్ రూములోకి వెళ్లిపోయినారు. స్నేహితులందరమూ వొకరినొకరు కరచాలనం చేసుకుంటూ విడిపోతున్నందుకు బాధ పడుకుంట, ఆరు సంవత్సరాల స్నేహ బంధాలను వొక్కసారిగా తెంచుకోలేక దాదాపందరమూ కళ్లల్లో నీళ్లు నింపుకుండాం.

ఆడపిలోళ్లు అందర్నీ ఆప్యాయంగా పలకరించినారు. మగ పిల్లోళ్ల అందరమూ, ముఖ్యంగా, అశ్వత్థరెడ్డీ, రామచంద్రారెడ్డీ, రాధాకృష్ణ, సత్యం, శంకర్ ఇంకా కొంతమంది జీవితంలో మళ్లీ ఈ దినాలొస్తాయా అని బాధపడి, అందరమూ డిస్పర్స్ అయితా చేతులూపుకుండాం. నేను ఉమావతి దగ్గరికి పోయి, ‘పొయ్యొస్తాను ఉమావతీ! మళ్లీ వొకరికొకరు కనిపిస్తామో లేదో!’ అని ముఖంలోకి చూస్తా వుంటే, అనుకోకుండా మళ్లీ కనుగుడ్ల మీద నీళ్లు పారాడినాయి. ఉమావతి పరిస్థితీ దాదాపు నామాదిరే వుంది. ‘పరీక్షలప్పుడు కలుసుకుంటాములే నారాయణా! మరీ అంత సున్నితంగా ఫీల్ కావొద్దు! సరేనా, పొయ్యొస్తాను’ అని చెప్పి ముందుకు పోయి స్నేహితురాళ్లతో కలుసుకుంది. నేను వాకిలి దగ్గర నిల్చుకొని ఆమె వైపే చూస్తా వుండాను. గేటు దాటుతూ వొకసారి వెనుదిరిగి నా వైపు అదొగ రకంగా చూస్తా మెల్లగా తలను వూపి చెయ్యి కొంచెం పైకెత్తి, ఇతరులకు కనిపించనంత సున్నితంగా వూపింది! ఆ మనోహరమైన దృశ్యాన్ని మనసులో అనుకుంటా, బాలన్నతో కలిసి మేమున్న ఇంటికి చేరుకుండాను.

మరుసటి దినమే ఇంట్లో అన్నీ సర్దుకుని మూటగట్టుకొని ఇద్దరమూ హెడ్మాస్టర్ సారోళ్ళ ఇంటికి పోయినాం. సార్ ఇంట్లో ఉండడం సంతోషమయింది. జయమ్మక్క పెట్టిన టిఫిన్ తిని కొంచెం సేపు మాట్లాడి, మళ్లీ వీలవుతుందో కాదోనని ఇద్దరి పాదాల మీదికి వొంగి మొక్కినాను. మొక్కుతా వుంటే ఏదో తెలియని వేదన! అర్థం కాని బాధ!

కంటతడి బెట్టిన నన్ను చూసి, ‘ఏమీ బాధపడొద్దు రా, నేనుండాను కదా! జాగ్రత్తగా చదువుకో! పరీక్షలయినాక నువ్వు ప్రొద్దుటూరికి పోవద్దు! మీ చిన్నాయన దగ్గరే వుండు! ఎస్.ఎస్.ఎల్.సి. రిజల్ట్స్ వొస్తానే! నేను ఎక్కడో వొకచోట నీకు ఏదో వొక వుద్యోగం వొచ్చేటట్లు నేను ఇప్పిస్తాను. అంతవరకూ ధైర్యంగా వుండు’ అంటా పది రూపాయలు నా చేతిలో పెట్టినాడు. జయమ్మక్కా ధైర్యం చెప్పింది. ఇద్దరికీ పొయ్యొస్తామని చెప్పి బాలన్నా, నేనూ మా మాఊర్లకు బయలుదేరినాం.

పరీక్షల సమయంలో అనంతపురంలో గూడెక్కడో?

ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు దగ్గరికొచ్చే కొద్ది పరీక్షల భయం కంటే పరీక్షలు జరిగే వారం దినాలు అనంతపురంలో యెక్కడ వుండాలనే అనే దిగులు యెక్కువైంది. అనంతపురానికి ఇరవై ముప్పై మైళ్ల దూరంలో ఉండే హైస్కూళ్లకు అన్నిటికీ పరీక్షల సెంటర్ అనంతపురమే నంట! ప్రతిదినమూ పరీక్ష రాయడానికి మా బండమీదపల్లె నుంచి అనంతపురానికి బస్సులో పోవల్లంటే అయ్యేపని కాదు. తాడిపత్రి నుంచీ అనంతపురానికి పొయ్యే ఫస్ట్ బస్సు ఎం.జి. బ్రదర్స్, మా ఊరి దగ్గరికి పొద్దున్నే ఆరున్నర గంటలకే వొస్తాది. ఆ బస్సులో కరెక్టు సీట్లు ఎన్ని సీట్లుంటాయో అంత మందిని మాత్రమే బస్సులో ఎక్కించుకుంటారు! కరెక్టు సీట్లకు మించి అర్ధం టికెట్టు ఎక్కువున్యా ప్యాసింజర్ని దించేస్తారు. ఆ బస్సులో అంత స్ట్రిక్టుగా ప్యాసింజర్స్‌ను ఎక్కించుకుంటారు. ఆ బస్సు తాడిపత్రి నుంచీ మా ఊరి దగ్గరకు వొచ్చేటప్పటికే ఫుల్ అయిపోయుంటుంది. వారంలో వొకటీì రెండు దినాలు మాత్రమే ఆ బస్సులో సీట్లుంటాయి. సీట్లు ఖాళీ లేకపోతే ఎంత గొప్పోళ్లు చెయ్యి చాపినా ఆ బస్సును నిలపరు. అందుకే ఆ బస్సును నమ్ముకోవడానికి వీలుకాదు.

సెకండ్ బస్సు తిమ్మంపల్లి బస్సు. అది, తిమ్మంపల్లిలో బయలుదేరి తాడిపత్రి మీద మా ఊరికి వచ్చేసరికి ఏడున్నర అయితాది. ఆ బస్సులో ప్యాసింజర్లు బస్సు పెకెక్కి వొస్తారు. ఓవర్ లోడ్‌తో బస్సు ఊగుతా వొస్తాది. అది అనంతపురానికి ఎన్ని గంటలకు పోతాదో బస్సోళ్లకే తెలియదంటారు. మూడో బస్సు అనంతపురం బుడ్డప్పోళ్ల బస్సు. అది మా ఊరికి తొమ్మిదిన్నరకు వొస్తాది. దాంట్లో సోమవారమూ సంత జరిగే శుక్రవారమూ ఎక్కడానికి వీలుగాదు. కష్టపడి ఎక్కినా పరీక్ష టైం పదిగంటలకు అనంతపురం చేరుకుండేకి సాధ్యం కాదంట! ఇట్లా పరిస్థితుల్లో ప్రతిదినమూ పల్లె నుంచి బస్సెక్కిపోయి పరీక్ష రాయడం చాలా కష్టం. వొక్కరోజు పరీక్ష రాయకపోయినా ఎస్.ఎస్.ఎల్.సి ఫెయిల్ కాక తప్పదు. పైగా ప్రతిదినమూ బస్ ఛార్జికి యెవురిస్తారు?

ఎంత ఆలోచన చేసినా దిక్కు తోచలేదు. పదైదు దినాలు ముందుగా చిన్నాయనతో ఆలోచన చేసినాను. ఒక్క పరీక్ష రాయకపోయినా యిన్నేండ్లు పడిన శ్రమంతా వ్యర్థమైపోతాది. ఎంతో ఆశతో చదివిస్తా వుండే తల్లిదండ్రుల కలలు చెదిరిపోతాయి. ఫెయిల్ అయితే అమ్మయ్య చాలా బాధపడతాది. ఊర్లో వాళ్లు ఎగతాళి చేస్తారు. ఎంతో సహాయపడతూ వుండే హెడ్మాస్టర్ సార్ మనసు విరిగిపోవచ్చు. ఆయన మనసు విరిగిపోతే చాలా కష్టం! నా ఆశలన్నీ కరిగిపోతాయి. పొరపాటున ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏమైపోతాదో!

అన్నీ చిన్నాయన దగ్గర వెల్లబోసుకుండాను. జేజీ, చిన్నాయనా నేనూ మేము ముగ్గురమూ చాలాసేపు ఆలోచన చేసినాం. కడాకు నాకు వొగ ఆలోచన తట్టింది. అదే చిన్నాయనతో చెప్పినాను. ‘ఊరకనే అట్ల చేసేది మెల్లే రా! పిట్టాబాబు వాళ్లబండి మాట్లాడుకొని వొగ దినం ముందుగా పోదాము లే’ అని చిన్నాయన వొప్పుకుండాడు. నా గుండె బరువు తగ్గింది.

 ప్రీ ఫైనల్ పరీక్షలు అయిపోయినాయి. అన్ని సబ్జెక్టులలోనా మంచి మార్కులే వొచ్చినాయి. మనసుకు ధైర్యం వొచ్చింది. ఉమావతికి కూడా మార్కులు బాగొచ్చినాయి. ‘అనంతపురంలో పరీక్షలప్ప్పుడు ఎక్కడుంటావు నారాయణా’ అని కొంచెం జాలిగా అడిగింది ఉమావతి. ‘అట్ల అడగడంలో ఆమెకు మా కుటుంబ పరిస్థితులు తెలుసునేమో! లేకుంటే జాలిగా ఎందుకు అడుగుతుంది?’. అని నా మనసులో అనుకుంటా వాస్తవం చెప్పకుండా, బంధువులుండారని అపద్దం చెప్పినాను. తాను ఓల్డ్ టౌన్ బీరప్ప గుడి వీథిలో, సింగ్ డాక్టరోళ్ల ఇంట్లో వుంటానని చెప్పింది. అట్ల, తనుండే అడ్రస్‌ను సూచిస్తా చెప్పడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు వొచ్చినాయి. నా హాల్ టికెట్ నంబర్ 32929. వెంకట సత్యం నంబరు 32930. అది తెలిసినంక మనసెందుకో సంతోషపడింది. పరీక్షల్లో ముఖ్యంగా ఇంగ్లీష్, లెక్కల ప్రశ్న పేపర్లు చాలా టఫ్‌గా వొస్తే వెంకట సత్యాన్ని అడగొచ్చుననే ఆశ కలిగింది. అయితే మా క్లాస్ టీచర్ సత్యనారాయణ సార్ పరీక్షలప్పుడు చాలా జాగ్రత్తగా వుండల్లని, భయపడకుండా కన్ఫ్యూజ్ కాకుండా ప్రశాంతంగా రాయల్లని, ఎట్టి పరిస్థితుల్లో నా కాపీ కొట్టకూడదని, అట్లాటి ప్రయత్నాలు చేస్తే డీబార్ అయితారని గట్టిగా చెప్పినాడు. మా సార్, అట్ల చెప్పడంతో, నేను మనసులో పుట్టిన ఆశను వొదులుకుండాను.

ఇంక రెండు దినాలకే ఎస్.ఎస్.ఎల్.సి. పబ్లిక్ పరీక్షలు. మా ఊరి బోయోళ్ల పిట్టా బాబు గిత్తల బండిని బాడుగకు మాట్లాడుకొని సామాన్లూ నా పుస్తకాలూ అన్నీ బండిలో పెట్టుకుని జేజీ చిన్నాయనోళ్లతో కలిసి బయల్దేరి అనంతపురం పాతూరులో కరెంట్ పవరాఫీస్ కాంపౌండ్ దగ్గరికి చేరుకుండాము. ధర్మవరం రోడ్డు పక్కన కాంపౌండ్ గోడ బాగా ఎత్తుగా ఉంది. బండిలో ఉండే సామాన్లన్నీ కిందికి దించుకుండాం.

పవరాఫీసు కాంపౌండ్ గోడకింద మా గుడారం గూడు!

చిన్నాయన చెప్పినట్ల ఊర్లోనే కుట్టుకొని తెచ్చిన గోనిపట్టల తెరను కాంపౌండ్ గోడకు ఏటవాలుగా కట్టినాను. తెరకింద, ఆ చివరా ఈ చివరా మధ్యలోనా బరువు ఉండే మూడు పెద్ద రాళ్లను తెచ్చి పెట్టి పురికోసుతో గోనిసంచుల తెరను బిర్రుగా లాగి రాళ్లకు గట్టిగా బిగించి కట్టినాను. ఆ గోడ పడమటి పక్కన వున్నింటే, గోడ నీడా తెరనీడా పడి కింద చల్లగా వుండేది. యాదోలే, ఈమాత్రమయినా నీడ దొరికిందనుకొని తెర కింద, గోడవారగా సామాన్లన్నీ సర్దిపెట్టినాను. దగ్గర్లో వెతికి, మూడు రాళ్లను మోసుకొని వొచ్చి పొయిగుండ్లుగా పెట్టినాను. రోడ్డుకు పడమటి వైపున వుండే ఇండ్ల దగ్గరికి పోయి రెండు బిందెలు నీళ్లు తెచ్చి పోసి, కట్టెల మండీ దగ్గరికి పోయి రెండు మణువుల కట్టెలు కొనుకొని వొచ్చినాను. చిన్నాయన పొయ్యి అంటించినాడు. జేజి అన్నం వండేకి పూనుకుంది. నేను కొంచెం సేపు తెర కింద నుంచీ బయటికొచ్చి చుట్టూరా చూసినాను. మా గుడారానికి పది అడుగుల దూరంలోనే కరెంటు స్తంభమూ, పైన కరెంటు బల్బు ఉండడం గమనించి రాత్రిపూట చదువుకోడానికి ఏమీ ఇబ్బంది వుండదని సంతోషపడినాను.

కరెంటు స్తంభం దగ్గరికి పోయి మా గోని పట్టల గుడారాన్ని చూస్తా వుంటే, అప్పుడప్పుడు మా ఊరి దగ్గరకొచ్చి, దొమ్మరోళ్లూ డొక్కలోళ్లూ ఎరికలోళ్లూ ఊరి పక్కనే మసూదోల్ల చేన్లో వేసుకుండే గుడారాలు గుర్తుకొచ్చినాయి. యా బాదర బందీలు లేకుండా ఊరూర్లు తిరుగుతా బతికే వాళ్ల జీవితాలే మేలనిపించింది నాకు. ఆలోచిస్తా, సరే ప్రస్తుతానికి యా ఇబ్బందీ లేకుండా చదువుకోవచ్చు. దురదృష్టవశాత్తు వర్షం వస్తేనే కష్టం. ఎంతాశ్చర్యమో పల్లెల్లో వుంటే వర్షం కోసరం ఆరాటపడే నేను ఇప్పుడు వర్షం రాకుండా, రాకుంటే చాలని అనుకుంటా వుండాను అని కొంచెం సేపు మనసులోనే నవ్వుకుండాను.

చీకటి పడింది. మా దగ్గర ఉండే కరెంటు స్తంభం పైన బల్బు వెలిగింది. లైటు వెలుతురు మా గుడారం దగ్గర బ్రహ్మాండంగా ఉంది. గుడారం బయట వొగ గోనిపట్ట పరచి కూర్చొని చదువుకుండేకి మొదలుపెట్టినాను. నోట్సులో అక్షరాలు భలే కనిపిస్తా ఉంటే సంతోషపడతా హాయిగా చదువుకుండాను. ఈ గుడారంలో లాటిన్ కూడా అవసరం లేదనుకొని దాన్ని అంటించలేదు.

ముగ్గురమూ అన్నం తిన్నెంక జేజి, అన్నం గిన్నెలన్నీ కడిగి, ఎత్తిపెట్టింది. రాత్రిపూట కుక్కలు దూరకుండా, గుడారం రెండు వైపులా ఉండే సందులకు గోనిపట్టల తెరలను దిగేసినాను. జేజీ, చిన్నాయనా గుడారం లోపల పండుకుండారు. నేను బయట చదువుకుంటా వుండాను. మా ఊర్లోనా చుట్టుపక్కలుండే పల్లెల్లోనా అందరూ పొద్దుగలగ అన్నం తిని, తూర్పున ఆకాశంలో గొరుకొయ్యలు బారెడు పైకెక్కుతానే దీపాలు ఆర్పేసి, పండుకుంటారు. ఈ టౌన్లో పొద్దు బోయేదంకా జనం బజార్లో పారాడుతానే ఉండారే, అనుకుంటా చాలా సేపు చదువుకొని గొరుకొయ్యలు నన్నెత్తికి వొచ్చినాయని, అర్ధరాత్రి అయింటాదనుకొని గుడారంలోకి దూరుకొని పండుకుండాను.

వెల్లకిల పండుకొని పైకి చూస్తా వుంటే గోనిపట్ట తెర బొక్కల్లో నుంచీ ఆకాశంలోని చుక్కలు మిణుకు మిణుకు మంటా కనిపిస్తా వుండాయి. ఆ చుక్కలన్నీ భూమికి ఎంతెంత దూరంలో వుండాయో? సూర్యగ్రహమే కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో వుందంట! సూర్యకాంతి వల్లనే నక్షత్రాలన్నీ మెరుస్తా కనిపిస్తాయంట! సూర్యగ్రహంతో పోలిస్తే భూమి సాసవ గింజంత ఉందంట! అట్లాంటి భూమి మీద ఎన్ని సముద్రాలు, ఎన్ని దేశాలు, ఎంత విశాలమైన ప్రపంచం! అంత విశాలమైన భూమి మీద ఎన్నో కోటానుకోట్ల జీవరాసులంట! అందులో మనుషులు వొగ భాగం! కోట్లాదిమంది మనుషుల్లో ఎన్నో కోట్ల మంది దాచుకుండేకి గూడులేనోళ్ళు! వాళ్ళల్లో నేనూ ఒకన్ని! ఈరోజు అనంతపురంలోని వొగ బజారులో, గుడారం మాదిరయినా లేని బొక్కలు పడిన గోనిపట్టల తెరకింద! ఈ జీవితం ఎట్లా మారుతాదో!

అనుకుంటా వుంటే కళ్లల్లో నీళ్లు మెదిలి చెంపల మీదికి దొర్లినాయి. కన్నీటి తడి తగలగానే ఆలోచనల్లో నుంచి బయటపడి, ఈ సమయంలో దిగులు పడకుండా వుండల్లని హెడ్మాస్టర్ సార్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటా కండ్లు మూసుకుండాను. మూసుకుంటానే ఉమావతి మనసులో కనిపించింది. చెప్పిన మాటలు వినిపించినాయి. ‘సింగ్ డాక్టరోళ్ల ఇంట్లో వుంటానని పాపం వీధి పేరు కూడా చెప్పింది. నన్ను రమ్మని చెప్పడానికేనా వీధి పేరూ డాక్టర్ పేరూ చెప్పింది? చెప్పినంత మాత్రాన నేను పోతానా? ఏమనుకుంటా వుందో నా గురించి?’ ప్రశ్నించుకుంటా కమ్మని ఊహలతో నిద్రబోయినాను.

మంచి నిద్రలో వుండాను. జేజి భయపడతా లేచి గట్టిగా అరిచింది. నేను వులిక్కిపడి లేచి ‘ఏమి జేజీ?’ అని అడిగినాను. ‘పెద్ద పందికొక్కు వొచ్చిందిరా!’ అని భయపడతా చెప్పింది. నేను నిగాగ చూసినాను. నిజమే, పెద్ద పందికొక్కు గోడ వారన దాక్కోని వుంది. నేను, చిన్నాయన దగ్గరుండే బోనాకట్టెను తీసుకొని దాన్ని కొట్టడానికి చూసినాను. మేము మెదలాడుతా వుండే శబ్దం విని అది, బయటికి పరిగెత్తింది. లైటు వెలుతురు పారిపోతా వుండే పందికొక్కును చూస్తా దాని మీదికి బోనా కట్టెను విసిరినాను. అది తప్పించుకొని పోయింది. ఆ తర్వాత చిన్నాయన పండుకోకుండా అది మల్లా వస్తాదని, దానికోసరమే మేల్కోనుండాడు. నేను నిద్రబోయినాను.

***

పరీక్ష మొదటి రోజు ప్రొద్దున్నే లేచి, చిన్నాయనోళ్ళకు నీళ్లు పోసినాను. కరెంటు ఆఫీసులో ఉండే వాచ్‌మెన్‌ను అడిగి, కాంపౌండు లోపలకి బకెట్‌తో నీళ్లు తీసుకొని పోయి స్నానం చేసొచ్చి అంగీ నిక్కర తొడుక్కొని హాల్ టికెట్టు నిక్కర జేబులో పెట్టుకొని రెండు పెన్నులు అంగీ పైజోబీలో చెక్కుకొని జేజీ చిన్నాయనల కాళ్లకు మొక్కి, పరీక్ష పేపర్లు పెట్టుకుని రాసేకి క్లిప్పు వుండే అట్ట తీసుకొని పరీక్ష సెంటర్ దగ్గరికి ముందుగానే పొయ్యేది మేలనుకొని బయలుదేరినాను. బయలుదేరుతా వుంటే చిన్నాయన ‘పరీక్ష బాగా రాసి రా నాయనా!’ అని దీవించి పంపినాడు. నేను గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ ఎక్కడుందో కనుక్కుంటా పాతూరుకూ కొత్తూరుకూ మధ్యలో ఐరన్ బ్రిడ్జి దగ్గరికి చేరుకొని దాని మీద నడుస్తా చిన్నప్పుడు, చెంచులక్ష్మి సినిమా చూసేకి వొచ్చినప్పుడు చూడల్లనుకోనుండే బ్రిడ్జిని చూస్తా ముందుకు పోయి అడిగినాను. అక్కడ కనిపించే మున్సిపల్ ఆఫీస్‌కు అవతలి పక్కనుండేదే గర్ల్స్ హైస్కూల్ అని చెప్పినాడు అటువైపు పోతా వుండే మనిషి. నేను ముందుకు పోతా వుంటే పరీక్ష రాసేకి నా మాదిరి అట్టలు తీసుకొని పోతావుండే పిల్లోళ్లు కనిపించినారు. అంతలోనే నా క్లాస్మేట్స్ బాలన్నా, సత్యం, శంకరప్ప కనిపిచ్చినారు. వాళ్లను చూసి సంతోషమయ్యింది. అట్లే ముందుకు పొయ్యే విశాలమైన రోడ్డునూ రోడ్డుకు ఎదురుగా వుండే క్రైస్తవుల చర్చిని గమనిస్తా స్కూల్ కాంపౌండ్ గేట్ దగ్గరికిపోయి స్నేహితులతో కలిసి చేరుకుండాను. గేటు మీద అర్ధ చంద్రాకారంలో వుండే రేకు మీద కాశంశెట్టి రాధాకృష్ణ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల అని అందంగా రాసిన అక్షరాలను చదువుతా అందరమూ లోనికి పోయినాం. కొత్త బిల్డింగు బ్రహ్మాండంగా ఉంది! బిల్డింగ్ ఎంట్రెన్సు దగ్గర వొక బోర్డు మీద హాల్ టికెట్ల నంబర్లూ రూమ్ నంబర్లూ టైపు చేసిన పేపర్లను కరిపిచ్చినారు. నేను హాల్ టికెట్ పట్టుకొని బోర్డు మీద నంబర్ వెతికినాను. నా నంబర్ రూము నంబర్ ఐదులో ఉంది. ఉమావతి నంబర్ రూమ్ నంబర్ రెండులో ఉంది. బెల్లు కొట్టేవరకు ఎవరినీ బిల్డింగ్ లోపలికి పంపలేదు.

అందరమూ బిల్డింగ్ బయట కాంపౌండులో వుండాం. నా మనసు ఉమావతి కోసరం చూడసాగింది. అంతలోనే కాంపౌండు గేటుదగ్గర సైకిల్ రిక్షాలో వొచ్చి దిగి, లోపలికొచ్చింది ఉమావతి. నన్ను మామూలుగానే చూసింది. నేనూ మామూలుగానే చూసి ఆమెకు దగ్గరగా పోయి ‘నీ నంబర్, రూమ్ నంబర్ రెండు లో ఉంది. బాగా ప్రిపేరయినావా ఉమావతీ?’ అని అడిగినాను. ‘బాగా ప్రిపేరయినాను. ‘నీ రూమ్ నంబర్ ఎంత నారాయణా’ అని అడిగింది. నేను చిరునవ్వు నవ్వుతా చెప్పినాను. తాను బోర్డు దగ్గర పోయి చూసుకుంది. అంతలోనే మా క్లాస్ టీచర్ సత్యనారాయణ సార్ వొచ్చినాడు. అందరమూ గుడ్ మార్నింగ్ చెప్ప్పుతా ఆయన దగ్గరికి పోయినాం. ఆయన చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి, మా క్లాస్‌మీట్స్ శారదాంబా, ఉమావతీ, పార్వతీ, రామలక్ష్మీ వాళ్ల దగ్గరికి పోయినాడు. మేము స్నేహితులంద రము తెలుగు పరీక్షలో రావొచ్చుననుకునే ప్రతి పదార్థ పద్యాలను గురించీ, సంధులూ, సమాసాలూ, అలంకారాలను గురించీ మాట్లాడుకుంటా వున్నంగనే బెల్లు కొట్టినారు. అందరమూ వొకరికొకరం విష్ చేసుకుంటా బిల్డింగ్ లోపలికి పోయినాం.

బిల్డింగ్ బ్రహ్మాండంగా వుంది! దీర్ఘ చతురస్రాకారంలో నాలుగు వైపులా రూములూ రూముల బయట ఎనిమిది పది అడుగుల నడవా, బిల్డింగ్ మధ్యలో అందమైన పూల మొక్కలూ, స్కూలు ఎంత బాగుందో అనిపించింది. మా ఐదో నంబర్ రూములో నా నంబర్ ఉండే డెస్క్ దగ్గరికి పోయి కూర్చుండాను. నా కుడిపక్కనుండే బెంచీల వరుసలో నా మాదిరిగానే కూర్చున్న స్టూడెంటును పలకరించినాను. పేరు పెద్దిరెడ్డి వాళ్లంతా తరిమెల హైస్కూల్ వాళ్లంట! ఈ సెంటర్లో యాయా స్కూల్ వాళ్లను వేసినారో అని అనుకుంటా హాలంతా గమనించినాను. పైన మధ్యలో వొగ సిమెంటు దూలమూ, దానిపైన సిమెంట్ శ్లాబు, బయటా లోపల పెద్దపెద్ద కిటికీలు దండిగా వెలుతురూ, గాలి రూమంతా తెల్లగా మెరిసిపోతా వుంటే పొంగి పోసాగాను. అంతలోనే రూమ్ సూపర్ వైజర్ సారొచ్చినాడు. అందరికీ ఆన్సర్ షీట్స్ ఇచ్చి, ఫ్రంట్ పేజీ మీదుండే హాల్ టికెట్ నంబర్ వేయించి, ఎక్కడా పేరుగానీ, స్కూల్ పేరు గానీ రాయకూడదని ఏవయినా చీటీ పేపర్లు తెచ్చుకోనుంటే ఇప్పుడే బయటికి పడేయమని, మధ్యలో స్క్వాడ్ వొచ్చినప్పుడు దొరికితే బుక్ చేస్తారని భయపెడతా చెప్పినాడు. ఆయన చెపుతా ఉంటే కొంచెం భయమయ్యింది. అంతలోనే మరొకసార్ వొచ్చి ప్రశ్న పేపర్లు ఇచ్చి పోయినాడు. ఏ ప్రశ్నలిచ్చినారో, ప్రతిపదార్థానికి ఏ పద్యం వొచ్చిందో, సంధులూ, సమాసాలూ అలంకారాలూ యావిచ్చినారో అని ఆలోచిస్తా వుంటే శరీరంలో కొంచెం దడ పుట్టింది. అన్ని ప్రశ్నలకు ఛాయిస్ ఉంటాదిలే అనే ధైర్యం తెచ్చుకోసాగినాను. అంతలోనే బెల్ కొట్టినారు. సూపర్‌వైజర్ సార్ గబగబా ప్రశ్న పేపర్లు ఇచ్చినాడు. ఇచ్చినంక ‘అందరూ క్వశ్చన్ పేపర్ని ప్రశాంతంగా చదువుకొని టెన్షన్ పడకుండా తొందరపడకుండా, ఛాయిస్ వుంటాది కాబట్టి యేది రాయలో నిర్ణయించుకొని జాగ్రత్తగా రాయండి. ప్రతి అర్ధగంటకొకసారి బెల్లు కొడతారు. టైమ్ గమనించుకుంటా రాయండి’ అని నెమ్మదిగా చెప్పినాడు. నేను కొంచెం టెన్షన్ పడుతా క్వశ్చన్ పేపరంతా చదువుకుండాను.

పేపర్ అంత కష్టంగానూ లేదు, అంత సులభంగానూ లేదు. ప్రతిపదార్థ పద్యాలు రెండూ అనుకున్నవి రాలేదు. మిగతా ప్రశ్నలన్నీ పరవాలేదనుకొని ధైర్యంగా జవాబులు రాసేకి పూనుకుండాను.

టైం అయిపో వొచ్చింది. మొదట సులభంగా ఉండే ప్రశ్నల్ని తీసుకోనుంటే బాగుండేద నుకుంటా రెండలంకారాలనూ వొగ చిన్న ప్రశ్ననూ చివర్లో తీసుకుండాను. సూపర్‌వైజర్ సార్ వొచ్చి అందరికీ దారాలు ఇచ్చి, మొదట పేపర్స్ కట్టి తర్వాత రాయండని చెప్పడంతో, దారంతో పేపర్లను జాగ్రత్తగా కట్టి, పేపర్ల మీద పేజీ నంబర్లు వేసి బిర బిర అలంకారాలు రాయసాగినాను. అంతలోనే లాంగ్ బెల్ కొట్టినారు. సూపర్‌వైజర్ సారొచ్చి పేపర్లు లాక్కున్నాడు.

పరీక్ష అయిపోయింది. అందరమూ బయటకొచ్చిన తర్వాత కలుసుకొని ఒకరినొకరు సంధులూ సమాసాలూ అడుగుకుంటా ఎవరికెన్ని మార్కులోస్తాయో లెక్కలు వేసుకుండాం. అంతలోనే మా క్లాస్ ఆడపిల్లోళ్లు కూడా దగ్గరికొచ్చినారు. ప్రతి సబ్జెక్టులోనా వెంకట సత్యమే అందరికంటే ప్రతి పరీక్షలోఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు కాబట్టి, తప్పొప్పుల్ని తెలుసుకుండేకి సత్యాన్నే అడిగినాం. సత్యం చెప్పిన తర్వాత నాకు ఈ పేపర్లో డెబ్బెయి మార్కులు రావచ్చుననుకుండాను. ఉమావతి తనకూ డెబ్బెయి వరకు రావొచ్చునని సంతోషపడింది. అందరమూ ఎవురెవురున్న చోటికి వాళ్ళు బయలుదేరినారు. పోతా పోతా నా వైపు చూసి పోయొస్తానన్నట్టు తలూపి వెళ్లిపోయింది ఉమావతి.

సత్యం, బాలన్నా, రామచంద్రారెడ్డ్డీ నువ్వు ఎక్కడ ఉండావని నన్ను అడిగినారు. నేను దాచిపెట్టకుండా విషయం చెప్పినాను. అందరూ బాధపడినారు. సత్యం నన్ను తన వెంట పిలుచుకొని పోతా, ‘ఇది బీరప్ప గుడి వీధి’ అని చెప్పినాడు. ఆ మాట వింటానే నా గుండెల్లో ఝల్లుమనింది. ‘ఈ వీధిలోనే తాను సింగ్ డాక్టరోళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పింది కదా ఉమావతి! నేనిప్పుడు ఈ వీధికొస్తే పొరపాటున నేనామెకు కనిపిస్తే, ఆమె నా గురించి చెడ్డగా అనుకోదా?’ అని మనసులో అనుకోగానే గుండె దడ దడ లాడింది. ఆమె కనిపించకుండా వుంటే మేలనుకుంటా తలొంచుకొని సత్యం వెంట నడుస్తా వుండాను. వీధి వొంపులో వొగ ఇంటిని చూపి ‘అది సింగ్ డాక్టరోళ్ల ఇల్లు, బహుశా ఉమావతి డాక్టరోళ్ల ఇంట్లోనే దిగింటుంది!’ అని చెబుతా ముందుకు పోసాగినాడు. నేను అటువైపు చూడకూడదనుకొని తలొంచుకొనే వోరగా చూసినాను. బయట ఎవురూ కనిపించలేదు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటా గబగబా ముందుకు అడుగులు వేస్తా ‘నేను ఉమావతి పట్ల అఫెక్షన్‌తో వుంటానని తెలిసే సత్యం నాకు సింగ్ డాక్టరోళ్ల ఇంటిని చూపించి, ఉమావతిని ప్రస్తావించినాడేమో’ అని అనుమానపడసాగినాను.

వెంకట సత్యం పోస్టాఫీస్ రోడ్లో కొంచెం ముందుకు పోయి కుడిపక్క సందులో వుండే వొకింటి దగ్గర ఆగి, ‘ఇది, మా పద్మావతమ్మత్త వాళ్ల ఇల్లు నారాయణా!’ అని నన్ను లోపలి పిలుచుకుని పోయి, వాళ్ల మామ వెంకటేశమయ్యకు పరిచయం చేసినాడు. ఆయన ప్రేమగా నన్ను పలకరించి, ఇద్దరినీ పరీక్ష యెట్లా రాసినారని అడిగి యెండలో వొచ్చినారు చల్లని నీళ్లు తాగండని ఇచ్చినాడు. రెండు మాటలు మాట్లాడిన తర్వాత, నేను మా చిన్నాయనోళ్ళ దగ్గరికి పోయి, అన్నం తినొస్తానని బయలుదేరినాను. వెంకట సత్యం అత్తా మామ లిద్దరూ నన్ను పోనీలేదు. వాళ్ళ ఆదరణను కాదనలేక చల్లని మనసుతో పద్మావతమ్మ పెట్టిన భోజనం తిని, మధ్యాహ్నం జరిగే రెండో పరీక్షకు బయలుదేరినాం. ‘నారాయణా, బజార్లో ఆ వీధిలైటు కింద ఎట్లా చదువుకుంటావు? రాత్రిపూట మా ఇంటికొచ్చి చదువుకొని ఈడే పండుకో! అని ప్రేమగా చెప్పినాడు వెంకటేశమయ్య. నా మనసు పొంగిపోయింది. సరే నయ్యా అన్న్యాను.

మధ్యాహ్నం రెండో పరీక్ష గుడకా బాగా రాసి మా గుడారం దగ్గరికి పోయి చిన్నాయనకు పరీక్షలు బాగా రాసినానని చెప్పినాను. రాత్రిపూట నేను దగ్గర లేకపోతే చిన్నాయనోళ్లు ఏమైనా ఇబ్బంది పడతారేమోనని బిడియాబడతా రాత్రీ, తెల్లవారు జామునా చదువుకుండేకి వెంకటసత్యం మామయ్య వాళ్ల ఇంట్లో అనుకూలంగా వుంటాదని తెల్లారుతానే వొచ్చి చేసే పనులు చేస్తానని చిన్నాయనని వొప్పించినాను. సత్యం వాళ్లు భోంచేయకముందు వాళ్ల ఇంటికి పోవడం బాగుండదనుకొని వీధిలైటు కింద చదువుకుండేకి కూర్చుండాను.

అనంతపురం బజార్లో గోనిపట్టల గుడారం కింద కూర్చొని తినడం, వీధిలైటు కింద చదువుకోవడం ఇది మూడోదినం. మొదటి దినం మనసు అవమానంతో ముడుచుకొని పోయింది. బజార్లో పారాడే మనుషుల పక్క తలెత్తి చూడడానికి నామోషీగా వున్నింది. ఈరోజు అంతగా లేదు. ఎంతమంది నా మాదిరి చావళ్లలో, సత్రాలలో, గోడల కిందా, మోరీల కిందా బతుకుతా చదువుకుంటా వుండారో! వాళ్లందరూ తమ పరిస్థితి తలుసుకొని అవమానంగా నలిగిపోతా వుంటారా? చిన్నాయనా, జేజీ ఇట్ల బతుకుతా వుండామే అని యానాడూ బాధపడ లేదే! మరి, నా మనసే ఈ పరిస్థితిని అవమానంగా ఎందుకు భావిస్తా వుంది? నేను చదువుకున్నందుకేనేమో! అయినా ఈ పరిస్థితిని అవమానంగా భావిస్తే, పరిస్థితి మారతాదా? అనుకున్నంతా బాధే కదా! ఈ సమయంలో బాధపడితే నష్టపోయేది నేనే కదా!

అనుకుంటా, మనసును గట్టి చేసుకుని చదువు మీదకి మళ్లించి తొమ్మిది గంటల వరకు చదువుకొని గుడారం లోపలికి పోయి కొంచెం అన్నం తిని సత్యం వాళ్ళ ఇంటికి పోయినాను.

***

ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలన్నీ అయిపోయినాయి. గుడారం దాపున రెండు రాత్రులూ, వెంకటేశమయ్యోళ్ల ఆశ్రయంలో మూడు రాత్రులూ, ఏడెనిమిది మంది నా క్లాస్‌మీట్స్ తో కలిసి స్నేహితుడు మురళీవాళ్ల యింట్లో వొగ రాత్రీ గడిపి. పరీక్షలు రాసిన సంగతిని జీవితంలో మరిచిపోలేనేమో! గురుగుంట్ల మురళి వాళ్ల బంధువు సీరిపి ఆంజనేయులు పెద్ద కవీశ్వరుడంట! ఆయన స్కూల్ పిల్లోళ్లకు తెలుగు వాచకాలు రాసినాడంట! అంతే గాకుండా ఇంగ్లీషు దొరలకు తెలుగు నేర్పించినాడంట! అందుకు ఇంగ్లీషు దొరలు ఆయనకు దండిగా భూమిలిచ్చినారంట! ఆ సంపాదనతో ఆయన ఆ భవనం కట్టించుకుండాడంట! ఎంత పెద్ద భవనమో! ఆయనకు ఎవురూ పిల్లలు లేరంట! నా క్లాస్‌మీట్ గురుగుంట్ల మురళీనే ఆ ఇంటికి వారసుడయితాడంట! ఎంత అదృష్టవంతుడో! ఎస్.ఎస్.ఎల్.సి. అయిపోతానే అనంతపురంలోనే బ్రహ్మాండంగా చదువుకుంటాడేమో!

అనుకుంటా నేను స్నేహితులందరికీ బాయ్ చెప్పినాను. చివరి పరీక్ష అయిపోయినంక ఉమావతిని పలకరించల్లని, మల్లా జీవితంలో చూస్తానో లేదోనని మనసు భలే ఆరాట పడింది. అదృష్టంకొద్దీ ఉమావతీ, రామలక్ష్మి, పార్వతీ, జగదాంబలతో కలసి దూరంగా చెట్టు కింద నిలబడి ఎవురి కోసమో ఎదురుచూస్తున్నెట్లు కనిపించినారు. నాకోసరమేనేమో అన్నంతగా పొంగిపోతా, నా జతగాడు సోదనపల్లి బాలన్నతో కలిసి వాళ్ల దగ్గరికి అడుగులేస్తా, బాలన్నకు కూడా రామలక్ష్మి అంటే చాలా ఇష్టమన్న విషయాన్ని గుర్తుచేసుకుంటా వాళ్ల దగ్గరికి పోయినాను. ఉమావతి కొంచెం పక్కకొచ్చి ‘అన్ని పరీక్షలూ బాగా రాసినావు కదా నారాయణా! ఫస్ట్ క్లాసొస్తుందా?’ అని ఎంతో ఇష్టంగా అడిగింది. ‘ఫస్ట్ క్లాసేమో చెప్పలేను గానీ సెకండ్ క్లాసయితే గ్యారెంటీగా వొస్తాదని అనుకుంటా వుండాను. నీకూ ఉమావతీ?’ అని ముఖంలోకి చూసి అడిగినాను. అట్ల అడుగుతా వుంటే, యెందుకో పెదవులు వొణికినాయి.

‘నేనూ అట్లే అనుకుంటున్నాను నారాయణా! ఏమి నెక్స్ట్? డిగ్రీలో చేరతావా?’ అని నా కళ్లల్లోకి చూస్తా అడిగింది. ఉమావతి ఎప్పుడూ నా కళ్లల్లోకి చూసి అట్ల మాట్లాడలేదు. ఆమె నా కళ్లల్లోకి చూసి మాట్లాడుతుంటే ఏదో కాంతి నాలోపలికి ప్రవహిస్తా వున్నెట్ల అనిపించింది. వొక్క క్షణం శరీరంలో ఏదో అయినట్లయ్యింది. వెంటనే తేరుకొని, నన్ను నేను ఊహించుకుంటా, ‘లేదు ఉమావతీ! మేము చాలా పేదవాళ్లం. నన్ను డిగ్రీ చదివించేంత స్తోమత మా కుటుంబానికి లేదు.’ అని అంటా వుంటే కనుగుడ్ల మీద నీళ్లు పారాడినాయి.

‘అయ్యో..! అవునా నారాయణా? సారీ!’ అని కొంచెంసేపు మౌనంగా వుంది. తర్వాత, ‘యేదయినా అవసరమయితే నేను హెల్ప్ చేస్తాన్లే! నేనింకా ఏమీ అనుకోలేదు. మా ఫాదరేమో తిరుపతిలో చేర్చల్లని అనుకుంటున్నాడు.. సరే పొయ్యొస్తాను’ అని పార్వతి వాళ్లను కలుసుకుంది. వాళ్లందరూ ‘పొయ్యొస్తామప్పా’ అంటా బయలుదేరి వెళ్లిపోతున్నారు.

వెళ్లిపోతావుండే ఉమావతి వైపు చూస్తా మనసు తనకలాడసాగింది. యేదో దూరమైపోతావున్నెట్ల, యేదో తెగిపోతా వున్నెట్ల, గుండెల్లో యేదో శూన్యం ఏర్పడ సాగింది. దాదాపు బాలన్న పరిస్థితీ నా మాదిరే వున్నెట్లుంది. ఇద్దరమూ కొంచెం మూగవాళ్లమై నడుస్తా విడిపోయి ఎవురి దారెంట వాళ్లం ముందుకు అడుగులు వేసినాం.

గుగ్గిళ్ల గంపెత్తుకొని పల్లె పల్లెకూ..

పరీక్షలన్నీ అయిపోయినాయి కదా, ఇంక పల్లెలకు పొయ్యేది మేలని, ఇక్కడ బజార్లో అడక్కతినే వాళ్ళ మాదిరి గుడారమేసుకొని గుగ్గిళ్లూ వడలూ చేసి అమ్ముతా వుంటే కొనుకుండేకి ఎవురూ రావడంలేదని, మన యాపారానికి పల్లెలే మేలని చిన్నాయన అనంతపురం నుండి వెళ్లిపోడానికి నిర్ణయించుకుండాడు. నన్ను తమ వెంట రమ్మని, కొన్ని పల్లెలు తిరుక్కుంటా, కడాన ఇల్లూరుకు పోదామని, ఆటికి మనం పొయ్యేటప్పటికి పెన్నేటి కాలువ కింద వుండే మాగాణిలో కల్లాలు చేస్తా వుంటారని తన ఆలోచన చెప్పినాడు చిన్నాయన. నేను సరే అన్న్యాను. మొదట నీలంపల్లికి పోవల్లని సామాన్లన్నీ మూటగట్టినాం. తాడిపత్రి బస్టాండ్ దగ్గరకి పోతే అక్కడ నీలంపల్లికి పొయ్యే ఎద్దుల బండ్లు వుండొచ్చునని మొదట అక్కడికి చేరుకుండాం. ఎంతసేపటికీ నీలంపల్లె వాళ్లెవురూ కనిపించలేదని వొక జట్కా బండిని బాడుగ అడిగినాం. జట్కామనిషి పది రూపాయలు బాడుగ అడిగినాడు. వోయమ్మా అనుకొని జట్కా వొద్దనుకుండాం.

ఎండ దంచుతావుంది! నిల్చుకోవడానికి ఎక్కడా చోటే లేదు! అన్నీ సోడా షాపులు! పండ్ల అంగళ్లు! వాళ్లెవురూ తమ షాపుల పక్కన యెవురినీ నిల్చుకోనీలేదు! దాదా సోడాషాప్ కింద దండిగా ఇసక పోసి మాటిమాటికీ నీళ్లు చల్లుతావుండారు! పందిరి పైన తడకలేసినారు! తడకల కింద నీళ్లు చల్లిన ఇసకలో చల్లగా ఉన్నెట్లుంది! ఎండలో నడిచొచ్చిన జనం ఆ చల్లని నీడ కోసరమే సోడాలు కూల్ డ్రింకులు తాగేకి పందిరికిందికి పోతావుండారు! జనం ఎక్కువయ్యేకొద్దీ గోలీ సోడాలు నిమిషానికి వొగటి కయ్ కయ్ మంటా ఉండాయి! అక్కడ చిన్నాయన బెంచీ కడాన కూర్చొని, సోడా తాగుతా, నీలంపల్లె వాళ్లు ఎవురైనా కనిపిస్తారేమోనని చూడసాగినాడు! దాదాపు రెండు గంటలసేపు అయినంక నీలంపల్లె వాళ్ల బండి పోతా ఉంటే చిన్నాయన గట్టిగా కేక వేసినాడు! బండి దగ్గరకొచ్చింది! సామాన్లన్నీ బండ్లో పెట్టి ముగ్గురం బండి ఎక్కినాం! నారాయణప్ప కుంట దగ్గర నుంచీ రస్తా బాగాలేదని బండి బోడిగానిదొడ్డి దగ్గర దంతులూరు రస్తాలోకి తిరిగి, సాయంకాలం పొద్దు మునగక ముందే నీలంపల్లె రుషింగప్పోళ్ల ఇంటి కాటికి చేరుకుంది!

***

నీలంపల్లెలో పదైదు దినాలుండి మదిరేపల్లికి బయలుదేరినాం. రుషింగప్ప చిన్నాయన, మదిరేపల్లె వరకు మాకు బండి పంపించినాడు. ముగ్గురమూ సాయంత్రం మదిరేపల్లె ఆంజనేయ స్వామి గుడిలో చేరుకుండాం. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా వుండే ఐదారు మంది పెద్ద మనుషులు మా గురించి అడిగినారు. మేము విషయం చెప్పినాం. నేను మా నాయన పేరు చెప్పుతానే వాళ్లందరూ ప్రేమగా పలకరించి నాయనను గురించి అడిగినారు. నేను యాదీ దాచుకోకుండా చెప్పినాను. వాళ్లు బాధపడి మాకు రెండు కడవల నీళ్లు, పొయ్యిలోకి కట్టెపుల్లలు పంపించినారు. చీకటి పడకముందే ఇద్దరు ముగ్గురు అన్నంలోకి ఊరిమిండీ కూరా పంపించినారు.

పొద్దుగలగ అన్నం తిని ముగ్గురమూ పండుకుండాం. నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. నాయన మంచితనాన్నీ ఈ పల్లెల్లో నాయన మీద ఉండే ప్రేమనూ తలుచుకొని సంతోషపడతా నిద్రలోకి జారుకుండాను.

తెల్లారింది. ఊరంతా తిరిగి చూసినాను. నూరూ నూటా ఇరవై ఇండ్లుండాయి. ఎక్కువగా కమ్మోళ్లుండారు. అందరూ రైతుపాయి! బావుల్లో నీళ్లు గుడకా బాగుండాయి. మా పల్లెలంత అద్దుమానం కాదనిపిచ్చింది. రెండు రోజులు అయితానే ఆకులేడుకు పోదాం అన్న్యాడు చిన్నాయన. వ్యాపారం జరగడం లేదన్న్యాడు. నేను సరే అన్న్యాను. సరుకులూ సామాన్లన్నీ వొగ గంపలో సంచిలో పెట్టినారు. ఆకులేటికి ఎట్ల పోవల్లని ఆలోచన చేసినాం. మొదట నేనూ జేజీ పొయ్యేది మేలని, గంపా మూటా యెత్తుకొని బయల్దేరి ఆకులేడు పీర్లచావిట్లో చేరుకుండాం. జేజి సామాన్లన్నీ సర్దసాగింది. నేను వెనుదిరిగి మదిరేపల్లెకొచ్చి చిన్నాయనను భుజాల మీదికి ఎత్తుకొని బోనాకట్టి చేతిలో పట్టుకొని ఎల్లవారినాను. అట్ల, చిన్నాయనను ఎత్తుకొని పోతా ఉంటే చుట్టుపక్కలుండే ఆడోళ్లు, ఏమి గాశారమో పాపం అని అంటా మా పక్క చూడసాగినారు. ఆ మాటలేవీ నేను పట్టించుకోకుండా వూరు దాటి నడుస్తా వొగ గంటసేపటికల్లా ఆకులేడు పీర్లచావిడి చేరుకుండాను.

ఆకులేడు దాదాపు మా ఊరంతుంది. మా శింగనమల చెరువులోకి వొచ్చే వొగ వంకను ఆకులేటి వంక అని అంటారు. ఆకులేటికి చేరుకున్న మరుసటి దినమే వంకను చూసి, పక్కనుండే తోటలోళ్లను అడిగినాను. బ్రహ్మాండంగా పారుతాదని, మర్తాడుకు ఎగువనుంచి కోటంక గుట్టల్లో నుంచి ఆ వంక వొస్తాదని చెప్పినారు. మా చెరువుకు వొచ్చే తడకలేరు తర్వాత ఇదే పెద్ద వంక అని చెప్పడంతో నేను చాలా ఆసక్తిగా వింటా చూసినాను.

ఆకులేడులో పెద్ద పెద్ద రైతులతో పాటు కూలీ నాలీ చేసుకుండే జనం బాగుండారు. తోటా దొడ్డీ బాగుండడంతో బీదాబిక్కికి బతుకుదెరువు నిరంతరం ఉన్నెట్ల గమనించినాను. చిన్నాయన జనాన్ని గమనిస్తా రెండు రకాల గుగ్గిళ్లతో పాటు పూర్ణకుడుములు, కర్జికాయలు, అత్తిరసాలు, కారంచుట్లు దినానికి వొగ రకం చేయబట్టినాడు. వ్యాపారం గుడకా బాగానే అయితా వుండడం వల్ల ఐదుదినాలు ఆకులేడులోనే వుండాం. వొగ పది దినాలకల్లా ఇల్లూరుకు చేరుకోవల్లని, ఇల్లూరు దగ్గర కల్లాలు మొదలయ్యే సమయానికి పోతేనే మేలని చిన్నాయన అభిప్రాయం. ఇల్లూరుకు చేరుకుండే లోపల వెస్ట్ నరసాపురమూ చెన్నవరమూ పాపినేపాళెంలో రెండ్రెండు దినాలుండి కనుంపల్లెకు పోదామని, అది చాలా పెద్ద ఊరని, కాబట్టి అక్కడ నాలుగైదు రోజులు వుండల్లని అన్న్యాడు చిన్నాయన. నరసాపురం, చెన్నవరం పేర్లు వింటానే వెంటనే నాకు చెన్నవరం నారాయణరెడ్డి బిడ్డ ఉమావతి గుర్తుకొచ్చింది. గుర్తుకొస్తానే మనసులో ఏదో అలజడి మొదలయ్యింది.

“అంత చిన్న చిన్న పల్లెలకు వొద్దులే చిన్నాయనా! రెండు దినాలకొగసారి సామాన్లూ సరుకులూ మూట కట్టడమూ దించడమూ సర్దుకోవడమూ, వొగ పల్లె నుంచి వొగ పల్లెకు నడచడమూ ఇదే సరిపోతాది. పైగా నర్సాపురమూ చెన్నవరమూ ఆకులేటికి దిగవన వుంటాయి. దిగవకు పోయి పాపినేపాళెంకు, కనుంపల్లికి పోవల్లంటే మళ్లా ఎగవకు రావల్ల గదా! వూరకనే నేరుగా పాపినేపాళెంకు పోదాం చిన్నాయనా!” అని నేను సర్ది చెప్పినాను. చిన్నాయన సరే అన్నాడు. నా మనసులో ఆలజడి తగ్గింది.

ఆకులేడు నుంచి పాపినేపాళెంకు సుమారుగా మూడు మైళ్ల దూరం వుంటాదని తెలుసుకొని వొగ గిత్తలబండి వొగటిన్నర రూపాయి బాడుగకు మాట్లాడుకొని, సామాన్లన్నీ సర్దుకొని బండెక్కి బయలుదేరినాం. గార్లదిన్నె- శింగనమల రోడ్లోకి చేరుకుంటానే దండుగొండ కనిపించింది. తొండపాడు తిర్నాలలో చిన్నాయన లడ్డంగడి వేసినప్పుడు గుత్తి నుంచీ వొచ్చి, గార్లదిన్నెలో బస్సు దిగి రాత్రి సమయంలో నడుచుకొని పోయిన విషయమంతా గుర్తుకొచ్చింది. తిర్నాలలో పరిచయమై మెరుపు మాదిరి మెరిసి మాయమైపోయిన ‘సుంకులు’ మనసులో మెదిలింది. పెదవుల మీద రోంతసేపు నవ్వు పారాడింది. ఎంతమంది ఆ రకంగా జీవితంలో ఎదురైతారో! ఎవురు ఎదురైతే మాత్రం పేదోని బతుకులో యాది సాధ్యమైతాది?

ఇంగా ఏవేవో ఆలోచనలు రాబట్టినాయి కానీ కంకర రోడ్లో, బండి చక్రం కింద పడతావుండే కంకరరాళ్ల మాదిరి అన్నీ ఎగిరిపోసాగినాయి. ఆ శబ్దాలకు మనసు కరకరలాడసాగింది. రోడ్డుమీద గార్లదిన్నె వైపు పోతావుండే బండి, ఉత్తరం పక్కకు తిరిగి చేన్లలో బండిజాడలోకి మళ్ళింది. బండికమ్మీల శబ్దం తగ్గింది. మంచి ఎర్రనేల భూములు, శనక్కాయ పంట బాగా పండిన దాండ్ల మాదిరి వుండాయి. అయితే ఎక్కడా దరిదాపుల్లో తోటలు కనిపించలేదు. శింగనమల రోడ్డు నుంచి వొగటీ వొగటిన్నర మైలు దూరం పోయినంక ఒక పల్లె వొచ్చింది. ఇదే పాపినేపాళెం అని బండిమనిషి బండిని ఆపినాడు. ఆ వూరిని చూసినాం నేనూ చిన్నాయనా. అంతా బేడికొంప మాదిరి పాపర పాపరగా వుంది. పైగా తోటా దొడ్డీ సరిగా లేని చిన్న పల్లె. ఈ వూర్లో ఎందుకు దిగల్ల చిన్నాయనా అని నేను పెదవి విరిచినాను. చిన్నాయన గుడకా అదే అనుకొని కనుంపల్లికి పోదామప్పా, దగ్గరే గదా అని అన్నాడు. అయితే ఇంకొగ రూపాయి బాడుగ ఇవ్వల్లన్నాడు బండిమనిషి. అర్ధరుపాయి ఇస్తామని చెప్పి వొప్పిచ్చినాం. బండి అట్లే ముందుకు పోయింది.

ఊరి దగ్గర దగ్గరికి పోయినా కనుంపల్లె కనిపించలేదు. చుట్టూ తోటలు కనిపిస్తావుండాయి గానీ ఊరు కనిపిచ్చడం లేదు. నేను బండి మనిషిని అడిగినాను. కనుంపల్లె, గంప మల్లయ్య కొండ కనుమకు దగ్గరగా, పూర్తీ తగ్గులో వుంటాదన్న్యాడు బండిమనిషి. పీర్లచావిడి గానీ యాదైనా గుడి గానీ ఊర్లో ఉండాయా అని అడిగినా. మనం పొయ్యే దావకే, ఊరికి తూరుప్పక్కన నల్లమ్మ గుడి వుందని, అది మాకు సరిపోతాదని నేరుగా గుడి దగ్గరికి బండి తోలుకొని పోయినాడు బండిమనిషి.

కనుంపల్లిలో నల్లలమ్మ గుడి దాపున..

సామాన్లన్నీ కిందికి దించుకొని బండిమనిషికి రెండ్రుపాయలు బాడుగ ఇచ్చి పంపిచ్చినాం. గుడి పూజారి వొచ్చినాడు. మేము విషయం చెప్పినాం. అతడు సరే అని వొప్పుకుండాడు. అతని పేరు నల్లప్ప. గుడిలో దేవత నల్లమ్మ కాదు, నల్లలమ్మ! నల్లలమ్మ దేవత చుట్టూ గొర్లగూడు మాదిరి చిన్న గుడి! దాన్ని గర్భగుడి అంటారంట! ఐదడుగుల వెడల్పూ ఐదడుగుల పొడవుతో చుట్టూ గారవేసి భద్రంగా కట్టినరాతిగోడ! తూర్పుముఖంగా రెండున్నర అడుగుల వెడల్పుతో గుడివాకిలి! అడుగు మందమూ వెడల్పూ ఉన్న రాతిగడప పైన అంతే సైజులో రాతి నిలువులు! నిలువుల పైన గడప సైజుతో రాతి చుంచు! గోడల పైన కాలుబ్బండలు పరిచి, బండలపైన గారతో చిన్న గోపురం కట్టినారు. గర్భగుడి బయట ఇరవై అడుగుల వెడల్పూ ముప్పై అడుగుల పొడవున్న రాతి స్తంభాల మంటపం కట్టినారు. మంటపం కింద గారవేసి పరిచిన కాలుబ్బండలు భద్రంగా ఉండాయి.

గర్భగుడికి తలుపులు లేవు. గర్భగుడి మధ్యలో నల్లలమ్మ రాతి విగ్రహం గుడ్లప్పగించి తూర్పువైపు చూస్తావుంది. విగ్రహాన్ని నేను నిగాగా చూసి ఆశ్చర్యపోయినాను. నల్లలమ్మకు మీసాలుండాయి! గుడి పూజారి నల్లప్పను, నల్లలమ్మ మీసాల విషయం అడిగితే అది నల్లలమ్మ తల్లి ఉగ్రరూపం నాయినా అని అన్న్యాడు. సరే అనుకొని, పూజారిని అడిగి గుడికి ఉత్తరం వైపు గోడ చాటున వొండుకుండేకి రాళ్లను పొయిగుండ్ల మాదిరి పొందిచ్చి, అతనితోనే రెండు కడవల నీళ్లు ఇప్పించుకుండాను. దగ్గర్లోనే చేన్లల్లో కందికొయ్యలు, మాండ్లల్లో ఎండిన కొమ్మలు కొట్టుకొని వొచ్చి, పొయ్యిలో పుల్లలు రెడీ చేసినాను. చిన్నాయన పొయ్యి అంటించి అన్నం చేసినాడు. గుడికి ఉత్తరం వైపునా దక్షిణం వైపునా రెండు వేపమాన్లు, గుడి ముందర గారవేసి, కాలుబ్బండలు పరిచి కట్టిన మండపం కింద చల్లగా వుంది. వైశాఖమాసం ఎండలు పొయిశాకం మాదిరి వేడిని గుమ్మరిస్తా వున్న్యా, మంటపం కింద చల్లగా హాయిగా వుండడంతో మనసు కుదటబడింది.

సాయంకాలం ఊరంతా తిరుగుతా ఆశ్చర్యపోయినాను. వొగ వీధిలో నడుస్తా వుంటే దక్షిణం వైపున వరుసగా ఇండ్లు, ఇండ్లముందర లోగిళ్లు! ఉత్తరం వైపున ఎదురుగా ఇల్లు లేవు, ఇండ్ల పైకప్పులుండాయి! అంటే రెండు మూడు చిన్న గుట్టల దడులకు స్టెప్స్ మాదిరి వొగ వరస ఇండ్లు, ఇండ్ల ముందర మట్టి రోడ్డు, దానికి పదీపదైదు అడుగుల తగ్గులో మరొగ వరస ఇండ్లు, ఇండ్ల ముందర మట్టిరోడ్డు భలే చిత్రంగా కనిపించింది నాకు. మట్టిరోడ్డు మీద పోయే బండ్లో పశువులో పక్కవీధి మిద్దెల మీదికి పోతే ఎంత కష్టం? సైడ్ వాల్స్ గుడకా లేవని అనుకుంటా గుడి దగ్గరకొచ్చినాను.

పొద్దు మునిగేటప్పుడు గుడి పూజారి నల్లప్ప వొచ్చినాడు. గర్భగుడిలోని కంచార్తిలో ఆముదం పోసి దీపం ముట్టిచ్చి ఊదు కడ్డీలు అంటిచ్చి నల్లలమ్మ విగ్రహం దగ్గర మైనం దిమ్మెకు చెక్కి మొక్కుకుండాడు. ఆనెంక ఐదారు మంది ఊరి వాళ్ళొచ్చి, పైన బండకు వేలాడేసిన కంచు గలగంటను కొట్టి పూజారితో టెంకాయలు కొట్టించుకొని మొక్కుకొని పోయినారు. నేనూ జేజీ కాళ్లూ మొగాలూ కడుక్కొని ఆ తల్లికి మొక్కుకుండాం. చిన్నాయన ఒక అర్ధణా దక్షిణ వేసినాడు. రోంత సేపయినంక పూజారి ఇంటికి పోయినాడు.

దీపం ఆరిపోక ముందే ఆ గుడ్డి వెలుతుర్లో ముగ్గురమూ అన్నం తిని సామాన్లన్నీ ఎత్తిపెట్టి మంటపం అంచుల్లో గోని సంచులు పరుచుకొని, పల్లెను గురించి మాట్లాడుకుంటా వుండాం. అంతలోనే గుడి పూజారి నల్లప్ప మళ్లా వొచ్చి మా పక్కన కూర్చొని ఊరి విషయాలు కొన్ని చెప్పసాగినాడు.

“మా ఊర్లో రోంత జాగర్తగా వుండల్ల నాయినా! కడపాత్రంతో ఊర్లూర్లూ తిరుగుతా రొన్నాల్లు ఈడుండి పోవల్లని వొచ్చినారు పాపం! ఊర్లో వాల్లు ఎవురైనా అడిగితే నా మీద చెప్పేరు నాయినా! రొన్నాల్లు గుగ్గిల్లూ అవీ యివీ అమ్ముకుండేకి వొచ్చినామని సెప్పండంతే! ఈ ఊర్లో రొండు పార్టీలుండాయి సన్నోడా! ఈ మద్దెనే మూడు కూనీలైనాయి. అంతకుముందు గుడకా కొట్లాటల్లో ఇద్దుర్ని చంపేసినారు. ఈ పార్టీలూ కూనీలూ జరక్కుంటే తుంగబద్ర కాలవ నీల్లు మా వూరిమింద పొయ్యేటివి నాయినా! ఆ తరిమెల కాలవ, మా ఊరి పొలాల మింద పొయ్యేకి పిలాను యేసినారంట! అయితే మా ఊర్లో ఉండే పార్టీలనూ జరిగిండే కూనీలనూ గురించి తెలుసుకోని, ఆ నీలం సంజీవిరొడ్డి తుంగబద్ర కాలవను, ఆ కల్లూరు ఎగదాల నుంచి వాల్ల ఇల్లూరికి మల్లిచ్చుకోని పోయినాడు. అదీ నాయినా సంగతి! ఎవురెవురికి పార్టీలుండాయి, కూనీలు యాల జరిగినాయి అని యివరాలు అడగద్దండి. రొన్నాల్లు మీ పనేదో మీరు సూసుకోని పోండి. నల్లమ్మ తల్లి పున్న్యాన,

ఆ తల్లి మాన్నెం తొమ్మిదెకరాల పొలం చేసుకుంటా బతుకుతాండాం. నేనే మిమ్మల్ని ఈడ వుండండని చెప్పినట్ల పెద్దోల్లకు తెలిత్తే బాగుండదు నాయినా! యాల్నో, మిమ్మల్ని చూసినంక నేనే ఉండండని సెప్పినాను. ఈ సంగతి యాడా ఉసురిడసకుండా రొన్నాల్లుండి యెల్లిపోండి పాపోడా!” అని పూజారి నల్లప్ప రోంత భయపడతా చెప్పినాడు.

మరుసటి దినం చిన్నాయన రెండు రకాల గుగ్గిళ్ళు, వడలు చేసినాడు. ఆకులేడులో మిగిలిండే కర్జికాయలు ఉండాయి. అన్నీ గంపలో పెట్టుకొని నేనూ జేజీ కనుంపల్లెలో అమ్మడానికి పోయినాం. బేడి జనాలుండే సందుల్లో పదార్థాలన్నీ బాగానే అమ్ముడుపోయినాయి. రెండోదినం చిన్నాయన పదార్థాలన్నీ కొంచెం ఎక్కువ చేసినాడు. నేనూ జేజీ అన్నీ గంపలో పెట్టుకొని నిన్న తిరగని సందుల్లోకి పోయినాం. గుగ్గిళ్లూ వడలమ్మో అని నేను గట్టిగా అమ్ముతా ముందుకుపోయినాను. ఇండ్ల మధ్యలో అక్కడక్కడ గడ్డి దొడ్లుండాయి. వొగ దొడ్డిలో ఆరేడు మంది కూలోల్లు కందికట్టి విదిలిస్తా పనిచేస్తా ఉండారు. నా కేక విని, వొగ మనిషి మమ్మల్ని పిలిచినాడు. అందరూ “ఈ పొద్దు చిన్న సుబ్బారెడ్డి మామ మనందరికీ గుగ్గిళ్లూ వడలూ తినిపిచ్చల్లని అనుకుండాడర్రా” అని నవ్వ సాగినారు. వాళ్ల మాటల్ని బట్టి నాకు ఆ రెడ్డి పేరు తెలిసింది. నాయంత చిన్న వయసుండే పిల్లోడు ఆయన కొడుకేమో, మమ్మల్ని చెట్టుకిందికి పిలుచుకొని పోయినాడు. ఆ పిల్లోని పేరూ సుబ్బారెడ్డే! ఆ పెద్దాయన నన్ను గురించి అడిగి తెలుసుకొని “అంత సదువు సదువుకొని ఎంత అవస్త పడుతాండావప్పయా? ఏమీ దిగులు పడొద్దు! నీ కట్టం రుతా పోదులే! మల్లా యెండకు యాడ తిరుగుతారుగానీ, గంపలో వుండేటివన్నీ, ఇగో ఈ పేపర్ల మింద గుమ్మరిచ్చి, అంతా ఎంతయితాదో లెక్క జెప్పు” అన్నాడు. నేను ఉబ్బిపోతా, లెక్కవేసి అన్నీ పదారు రుపాయలని చెప్పినాను. చిన్న సుబ్బారెడ్డి ఐదు రూపాయల నోట్లు నాలుగు ఇచ్చినాడు. మా దగ్గర చిల్లర లేదు పెద్దయ్యా అన్న్యాను నేను. అవునా? సరే సరే పోరా, పర్వాలేదు పో! యావన్నా రొండు పుస్తకాలు కొనుక్కో ఆ నాలుగు రూపాయలకు!” అని అంటా ఉంటే నా కండ్లల్లో నీళ్లు మెదిలినాయి. పరమానందపడతా గుడి దగ్గరికి చేరుకుండాం నేనూ జేజీ.

ఆ ప్రకారంగా కనుంపల్లెలో ఎనభై రూపాయలు జమ చేసుకొని, గుడి పూజారికి ఒక అర్ధ రూపాయి ఇచ్చి, రెండు రూపాయలకు బాడుగ బండి మాట్లాడుకొని, ఇల్లూరికి బయలుదేరినాం. సీల్దావగుండా గుట్ట ఎక్కిపోతే మూడు మైళ్లదూరం ఉంటాదంట! చిన్నాయనను వీపుమీద కరిపిచ్చుకొని గుట్టనెక్కి పోవడం కష్టమని బండి మాట్లాడుకుండాం. బండిలో అయితే దత్తాత్రేయుని గుడిచెరువు కట్టమీద నుంచి గుట్టకింద, వారగా బండి జాడెంట పోతే, ఇల్లూరు నాలుగు మైళ్లు ఉంటాదంట! అందుకే బండిలో బయలుదేరినాం. దత్తాత్రేయుని గుడి వొచ్చింది. దత్తాత్రేయుడంటే ఎవురో, అదేమి పేరో అనుకుంటా చెరువు దాటినాం. అంతా చిట్టడవి. నరమానవుడు కనిపించలేదు. గుట్టవారగా, గుట్టను చుట్టేసుకొని గుట్ట అవతల ఉండే ఏకలాపల్లిని దాటుకొని సాయంత్రానికల్లా ఇల్లూరు పీర్లచావిట్లోకి చేరుకుండాం.

(ఇంకా ఉంది)

Exit mobile version