[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
అనంతపురం తల్లి కొప్పులో రాళ్లబిల్ల..
నేనూ బాలన్నా కోర్టు కాంపౌండ్ లోపలికి అడుగుపెట్టినాం. సుమారు పన్నెండు ఎకరాల్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన మున్సిఫ్ కోర్టు, జిల్లా జడ్జి కోర్టు బిల్డింగులను, దగ్గరికి పోయి చూసినాం. జిల్లా జడ్జి బిల్డింగును చూసి నేను ఆశ్చర్య పోయినాను. 1920లో మొట్టమొదటి జిల్లా జిడ్జి గంగాధర సోమయాజులతో జిల్లా కోర్టు ప్రారంభమైనట్లు, నేమ్ బోర్డును చూసి తెలుసుకుండాను. కోర్టు బిల్డింగ్ మాత్రం 1930లో వాడకంలోకి వచ్చిందని, 1920 నుంచి 10 సంవత్సరాల పాటు తాత్కాలిక భవనంలో కోర్టు పనిచేసిందని అక్కడ రాసిన దాన్నిబట్టి అర్థం చేసుకుండాను.
మొత్తం కోర్టు అత్యద్భుతమైన రాతి కట్టడం! ఉత్తరం ముఖంతో, తూర్పు పడమరగా ఉన్న భవంతిలో పెద్ద వరండా! వరండా చివర, రాళ్లతో కట్టిన స్తంభాలపైన కమాను తిప్పినారు! మూడంగుళాల మందం గారతో ప్లాస్టింగ్ చేసిన స్తంభాలూ గోడలూ తెల్లగా నున్నగా నిగనిగలాడుతా ఉండాయి! వరండా పొడవునా, పైకప్పు కిందా బర్మాటేకు తీర్లు, మిల్లి మీటరంత తేడా లేకుండా వరుసగా అందంగా కనిపిస్తా ఉంటే ఆశ్చర్యమైంది. ఆ చివరి నుంచీ ఈ చివరి వరకూ వరండాలో నుంచి ఆఫీసు రూములు, ఎనిమిది అడుగుల ఎత్తైన వాకిళ్ళతో కిటికీలతో, తెరపిలేని రైలు పెట్టెల మాదిరి, ఎంత సుందరంగా ఉండాయో! మొత్తం బిల్డింగ్ మధ్యలో పైనుండే జిల్లా కోర్టు హాలుకుపోయేందుకు 10 అడుగుల వెడల్పుతో వేసిన మెటికలు( స్టెప్స్) మెటికల చివర, ఇనుప కడ్డీల పైన పొందించిన టేకు రైలింగ్, వరండాలో ఆఫీసు రూములలో పరిచిన ఫ్లోరింగ్ బండలు -మండల మధ్యలో వేసిన గార, ఏదీ ఎక్కడా వొగ అంగుళమంత గుడకా చెక్కుచెదరకుండా ఉండడం చూసి అబ్బుర పోయినాను నేను.
వెడల్పయిన మెట్ల మీద నుంచి పైకెక్కుతా నేను, నిగనిగలాడే నున్నని టేకు రైలింగ్ మీద అరచేతితో మెల్లగా మెత్తగా నిమురుతా జరుపుతా ముందుకు పోయినాను. మెటికలు దాటగానే ఎదురుగా ఎత్తైన తెల్లని గోడ!పదారడుగుల వెడల్పుతో పెద్ద వరండా! కోర్టు హాల్ ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. గోడకు తూర్పు వైపునా పడమర వైపునా మళ్లీ పన్నెండు అడుగుల వెడల్పుతో వరండాలు! మేము తూర్పు వైపున వరండాలోకి పోయినాం. అప్పుడు అర్థమైంది, రెండు వరండాల మధ్యలో ఉన్నది జిల్లా జడ్జి కోర్టు హాలని, స్టెప్స్‌కు ఎదురుగా ఉన్న ఎత్తైన గోడ, కోర్టుహాలుకు ఉత్తరం వైపున్న గోడ అని! ఆ గోడ దగ్గర నుంచి ఏటవాలుగా కిందికి, వాది ప్రతివాదులు కచ్చిదారులు కూర్చోవడానికి గ్యాలరీ! గ్యాలరీకి ఎదురుగా రెండు అడుగుల ఎత్తులో స్టేజి! స్టేజి పైన సింహాసనం మాదిరున్న ఎత్తైన కుర్చీలో, బంగారంచుల నల్లని లాంగ్ కోటు వేసుకొని జడ్జి కూర్చుండాడు. ఆయన కూర్చున్న కుర్చీ గానీ ఆయన కాళ్లు గానీ ఏవీ కనిపించకుండా ఆయన ముందర పొడవైన పెద్ద టేకు టేబుల్! టేబుల్ ముందువైపంతా, సినిమా స్క్రీన్ మాదిరి తెరలు తెరలుగా వుడ్ వర్క్! ఆ స్టేజికంటే వొగ అడుగు తక్కువ ఎత్తులో మరొగ చిన్న స్టేజి! దానిమీద ఎదురెదురుగా కుర్చీల మీద ఇద్దరు ఆఫీసర్లు, టేబుల్ మీద ఏవేవో ఫైల్స్ పెట్టుకుండారు. ఆ చిన్న స్టేజికి మధ్యలో U ఆకారంలో వకీళ్ల ముందర టేబుల్! ఎవరో ఇద్దరు వకీళ్లు వాదిస్తా ఉండారు. మేము తూర్పు వరండాలోకి పోతానే, వాకిలి దగ్గర కూర్చున్న బిళ్ళ జవాన్, మమ్మల్ని మాట్లాడవద్దని చేతితో సైగ చేసినాడు. తెల్లని డ్రస్సు తొడుక్కొని, తలకాయ మీద తెల్లని నెహ్రూ టోపీ పెట్టుకొని, భుజం మీద నుంచి క్రాస్‌గా పెద్ద కంచుబిల్ల పట్టీ వేసుకొని, జబర్దస్తీగా కూర్చుండాడు. మేము కోర్టులో వొగ వకీలు వాదించేది మౌనంగా వింటా, చక్రవర్తి మాదిరి సింహాసనం మీద కూర్చున్న జడ్జిని గమనిస్తా వుండాం. లోపలికి పోయేవాళ్లు వాకిలి దగ్గరనే కోర్టు వారికి తలొంచి నమస్కరించి లోపలికి పోతా ఉంటే, లోపలి నుంచి బయటికి వచ్చేవాళ్ళు తలొంచి నమస్కారం చేసి బయటికి వస్తా ఉంటే, అంతా బ్రిటిష్ వాళ్ల దర్పం మాదిరి కనిపించ సాగింది కోర్టు.
మేము వొగ అర్థగంటసేపు అక్కడే అంతా గమనించుకుంటా ఉండాం. తూర్పు పడమరల వరండాల్లోకి కోర్టుహాల్లో నుంచి ఇటువైపు ఐదు అటువైపు అయిదు వాకిళ్లు! వాకిళ్ళ పైన గ్లాసులతో బిగించిన వెంటిలేటర్స్! ఆ వెంటిలేటర్స్ పైన మళ్లీ వెంటిలేటర్స్! వెలుతురు ధారాళంగా వచ్చేకి పెట్టినారు! తూర్పు గోడ మీద నుంచి పడమటి గోడ మీదకి రెండు అడుగులు ఎత్తుతో మధ్యలో కొంచెం వొంచిన ఇనప గరండాలు! గరండాల మీద అడ్డంగా రెండు అడుగులకు ఒగ తీరు చొప్పున మొత్తం బర్మా టేకు తీర్లు పరిచి, తీర్లపైన ఏమేసినారో ఏమో గానీ, మొత్తం గారతో బ్రిటిష్ ప్రభుత్వమంత దృఢంగా కట్టినారు. జడ్జి వీపు గోడకు ఆ చివరా ఈ చివరా, జడ్జి రెస్ట్ తీసుకుండే రూముల్లోకి పోవడానికి రెండు డోర్లు ఉండాయి. ఆ డోర్లు కనిపించకుండా తలుపుల పైన సిల్క్ కర్టన్లు వేలాడదీసినారు. ఇప్పుడు కరెంట్ రావడంతో ఫ్యాన్లు ఉండాయి గానీ, కరెంటు లేని కాలంలో జడ్జి గారికి గాలి వీచేందుకు పెద్ద చాపల వంటి పంకాలు ఉండేవంట! ఆ పంకాను ముందుకూ వెనక్కీ లాగడానికి పంకా పైన ఒక మెత్తని తాడును బిగించి, బిగించిన తాడు రెండు చిన్నని చక్రాల మీద గోడ రంధ్రంలో నుంచి బయటికి వేలాడదీస్తారంట! గోడ దగ్గర వొగ మనిషి కూర్చొని, ఆ తాడును వెనక్కీ ముందుకూ లాగుతా ఉంటే, కోర్టు హాల్లో జడ్జి గారి పైనుండే పంకా ఊగుతాదంట! అది ఊగుతా ఉంటే, జడ్జి గారికి గాలి తగులుతా ఉంటాదంట! ఆ పంకా ఊపే మనిషిని పంకాపుల్లర్ అంటారంట! అదొగ ఉద్యోగమంట!
అదంతా తెలుసుకుంటా ఉండంగానే టైం అయిపోయిందేమో, జడ్జి పైకి లేస్తానే, ఆయన వెనకుండే బంట్రోతు, గట్టిగా ఏదో చెప్పినాడు. గ్యాలరీలో ఉండేవాళ్ళూ వకీళ్లూ అందరూ పైకి లేచి, ఆయనకు నమస్కారం చేసినారు. ఆయన గుడకా కోర్టుకు నమస్కారం చేసి, తన రూమ్ పక్కనే సపరేట్ గా ఉండే మెటికలగుండా కిందికి దిగిపోయినాడు. అదంతా చూసి నేనూ బాలన్నా అబ్బురపోతా, అధికారం చెలాయించల్లంటే ఇట్లాంటి ఉద్యోగం చేయల్లని అనుకుంటా కిందికి దిగొచ్చినాం.
ఎన్నిసార్లు చూసినా చూడల్లని పించే జిల్లా జడ్జి కోర్టును మళ్లీ చూస్తా, అనంతపురంలో ఇంత అద్భుతమైన కట్టడం ఏదీ లేదేమో అనుకుండాం. ఇది అనంతపురం తల్లి కొప్పులో ఒక రాళ్లబిల్ల మాదిరి మాకు కనిపించింది. కట్టడం పనితనానికి అబ్బురబోతా, మా శింగనమల హైస్కూల్ కొత్త రూములు కట్టి పదేండ్లు గుడకా కాలేదు, అప్పుడే వాకిలీ కిటికీల తలుపులు చీలిపోయినాయని, ఫ్లోరింగ్ నల్లబండల సందుల్లో సిమెంట్ అంతా పెచ్చులు పెచ్చులు ఊడిపోయిందని, 1930లో కట్టిన కోర్టు బిల్డింగు, 35 సంవత్సరాలైనా ఎక్కడేగానీ చెక్కుచెదరలేదని, అనంతపురానికి ఒక వరం మాదిరి, బ్రిటిష్ వాళ్ళ స్మారక చిహ్నంగా ఉండే ఈ భవంతిని జాగ్రత్తగా చూసుకుంటే ఇంకొగ ఇన్నూరు సంవత్సరాలైనా ఇదే రీతిలో భద్రంగా ఉంటుందని అనుకుంటా, ఇద్దరమూ కోర్టు కాంపౌండ్ లోపలి నుంచి రోడ్లోకి వచ్చినాం.
ఎదురుగా ఇంగ్లాండులో, బ్రిటిష్ రాజుల భవనం మాదిరి కనిపిస్తా ఉండే భవంతిని చూడల్లని ముందుకు పోయినాం. అయితే కోర్టు రోడ్డు అక్కడితో ఎండ్ అయిపోయింది. ఆ భవంతి, ఇంకా కొంచెం ముందరుండే వొగ నల్లగుట్ట మీద ఉన్నట్లు కనిపిస్తా ఉంది. కోర్టురోడ్లో నుంచి అక్కడికి దారి లేదు. అన్నీ నల్లగుండ్లు, బండలు అడ్డంగా ఉండాయి. ఆ భవంతిని పీస్ మెమోరియల్ హాల్ అని అంటారంట! ఎట్లయినా సరే, దాన్ని చూడల్లని,గుండ్లెక్కి రాళ్ల మధ్యలో నుంచి ఆ హాల్ దగ్గరికి చేరుకుండాం నేనూ బాలన్నా.
పీస్ మెమోరియల్ హాల్ కాంపౌండ్ పక్కనే పడమర వైపున ఉండే ఐటిఐ కాలేజి ని చూడల్లని ఇద్దరమూ ప్రయత్నం చేసినాం. ఆ మిట్ట మీద నుంచి మళ్లీ కోర్టు రోడ్లోకి వొచ్చి చిన్నగా ఉండే పడమటి సందులోకి దూరి, అక్కడ నుంచి ఆ ఐటిఐ రోడ్డు గుండా మిట్టమీద నల్లగుండ్ల పక్కనున్న ఐటిఐ కాలేజీ గ్రౌండ్ చేరుకుండాం. బిల్డింగులు ఏమీ లేవు. కాంపౌండు లోనే, మిట్టమీదకు పోయే చిన్న రోడ్డు పక్కనే పెంకులతో కట్టిన మూడు పొడవైన బిల్డింగులను చూసి నేనూ బాలన్నా ‘ఇదేమి కాలేజీ, ఇట్లుందబ్బా? అందుకేనేమో, ఐటిఐ అంటే చిన్నచూపు’అనుకుంటా మిట్ట మీదండే పెంకుల బిల్డింగ్ దగ్గరికి పోయినాం. దాన్ని బ్యారెక్ అని అంటారంట! పొడవుగా వుండే ఆ బ్యారెక్ లో ఐదు క్లాసులు ఉండాయి. ఒక్కొక్క క్లాసులో స్టూడెంట్స్ సుమారుగా ఉండారు. అందరూ మా వయసోళ్లే!
ఆ బ్యారెక్కును చూస్తా ఉంటే ఐటిఐ కాలేజ్ చాలా సంవత్సరాలు కింద నుంచే ఉందనిపించింది. నేను ఆలోచిస్తా ఉంటే, ఆ బ్యారెక్ గోడలో పొందించి పెట్టిన ఒక రాతి పలకా, దానిమీద అక్షరాలూ కనిపించినాయి. చదివి ఇద్దరమూ ఆశ్చర్యపోయినాం.
అది మద్రాస్ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ అంట! 2-7-1943 వ సంవత్సరంలో అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ ఆర్థర్ హోప్, కె టి. దాన్ని ప్రారంభించినాడంట! గోవింద కృష్ణ య్యర్ అనే ఆయన అప్పటి ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ అని, నేను పుట్టడానికి మూడేళ్ల ముందే ఆ కాలేజీ ప్రారంభమైందని అనుకుంటా బాలన్నతో కలిసి దూరంగా కనిపిస్తా ఉండే మూడు పెద్ద పెంకుల బిల్డింగుల దగ్గరికి పోయినాను. అవి మూడు బిల్డింగులూ చాలా ఎత్తుగా ఉండాయి. లోపల రకరకాల మిషన్లు, ఆయిల్ ఇంజన్లు ఇంకా ఏవేవో ఉండాయి. అందులో పని చేస్తా ఉండేవాళ్ళందరూ బ్లూ డ్రెస్సులు వేసుకుండారు. వాళ్ళందరికీ ఒకాయన ఇంజన్ లోని భాగాలన్నిటిని చూపుతా,ఏదో చెప్పుతా ఉండాడు. ఆ వినే వాళ్ళందరూ ఐటిఐ విద్యార్థులని, ఆ చెప్పే ఆయన ఇన్స్ట్రక్టర్ అని, అవన్నీ వర్క్ షాపులని, కాలేజీ స్థలమంతా 11 ఎకరాలని, కాలేజీ పీవన్ చెబుతా ఉంటే వింటా వర్క్ షాపులను గ్రౌండునూ చూడసాగినాం. కాలేజి స్థలం, పడమర రైల్వేలైన్ వరకు ఉంది. రైల్వే లైన్ అవతల వైపున కనిపించేవి లక్ష్మీ నగర్, కోవూరునగర్, రాంనగర్ అని పీవన్ చెప్పడంతో, వోయమ్మా, చాలా పెద్ద టౌనే అని నేను అబ్బురు పోతా ఉంటే, ‘టౌన్ ఇంకా చాలా ఉందప్పయా, లక్ష్మీనగరుకు ఉత్తరం పక్కన బళ్లారి రోడ్డు దంకా పోలీసు ట్రైనింగ్ కాలేజీ, ఆ రోడ్డుకు అవతల పక్కన వొగటో రోడ్డు రెండో రోడ్డు మూడో రోడ్డు నాలుగో రోడ్డు, ఇంగా నేను చెప్పేది మర్చిపోయినా, రాంనగర్ అయినంక మారుతీ నగర్, రైల్వే లైనుకు ఇవతల పక్కన మా కాలేజీ వారగా రహమత్ నగర్, అది అయినంక జడ్జిబంగ్లా, దానికి దక్షిణం పక్కన అరవిందనగర్, ఆట్నుంచి టౌన్ కల్లా వొస్తే సాయినగర్, బుడ్డప్పనగర్, అశోక్ నగర్, అట్ల కలెక్టర్ ఆఫీసుదంకా కొల్లబోయే అంత ఉండాది! సూడల్లనుకుంటే రేపో మర్నాడో పోయి సూడండప్పయా’ అని ఎంతో గొప్పగా చెప్పినాడు పీవన్.
ఇంతకు ముందు ఒకటో రోడ్డు రెండో రోడ్డు అని చెప్పితివి కదా, అవన్నీ వొట్టి రోడ్లేనా లేకుంటే ఊరా?ఊరయితే,రామనగర్ లక్ష్మీనగర్ మాదిరి ఆ ఏరియాకు పేరు లేదా అని కొంచెం అనుమానంగా అడిగినాను.
‘యేరే పేరేమీ లేదప్పయ్యా! మా ఇల్లు నాలుగో రోడ్డు కడానుంది. ఆ రోడ్లను అట్లనే పిలుస్తారు. గవర్నమెంట్ రికార్డుల్లో గుడకా అట్లనే ఉండేది!’ అని పీవన్ నా సందేహాన్ని తీర్చినాడు.బాలన్నా నేనూ, పీవన్ చెప్పినదంతా విని మళ్లీ అనంతపురం వొచ్చి ఆ ఏరియాలన్నీ చూస్తామో లేదో, ఈ వారం దినాల్లో చూసేది మేలని అనుకుంటా మా బాడుగ కొట్టానికి చేరుకుండాం.
మలేరియా సర్వెలెన్స్ వర్కర్‌గా ట్రైనింగ్!
ఉదయమే అన్నం వండుకొని తిని, నేనూ బాలన్నా మలేరియా ఆఫీసుకు బయలుదేరినాం. రెండు సంవత్సరాల నుంచి కలగనిన ట్రౌజర్, పొడుగు చేతుల శ్లాగు కొత్తవి తొడుక్కొని, నిన్న సాయంత్రం కొనుక్కున్న స్లిప్పర్స్ వేసుకొని నన్ను నేను చూసుకుండాను. ఈ ట్రౌజర్ తొడుక్కన్నది నేనేనా అని కొంచెం సేపు మనసులో అనుకుండాను. ట్రౌజర్ లోపల డ్రాయర్ వేసుకోవడం వల్ల గజ్జల్లో ఏదో తిక్క తిక్కగా ఉంది. ఇంతవరకు ఖాకీ నిక్కర్ లోపల ఎప్పుడూ డ్రాయర్ తొడుక్కోలేదు. నేనే కాదు, నా జతగాళ్లు గుడకా ఎవురూ తొడుక్కోరు. గోసిపంచలు కట్టుకుండే పెద్దోళ్ళు గుడకా మా పల్లెల్లో ఎవురూ పంచలోపల నిక్కర తొడుక్కోరు. నిక్కరు తొడుక్కుంటే పంచలోపల ఎట్లెట్లో ఉంటాదని, లోపల ‘సామాన్లకు’ గాలి తగలదని, కొన్నాళ్ల కిందట మా ఊరి లింగనపల్లి చెన్నారెడ్డి చిన్నాయన చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని, లోపల అనీజీగా ఉందని బాలన్నతో అన్న్యాను. పోయిన సంవత్సరం నుంచి బాలన్నకు ట్రౌజర్ తొడుక్కునే అలవాటు ఉండటం వల్ల రెండు దినాలు కొంచెం అనీజీగానే ఉంటాదని చెప్పడంతో, నేను సరే అనుకుండాను. బాలన్న మాదిరే నేనూ, ట్రౌజర్ర్ కింది వైపున మడుచుకుండాను.
ఇద్దరమూ మలేరియా ఆఫీసుకు పోతావుండాం. స్లిప్పర్స్ వేసుకొని ట్రౌజరూ శ్లాగూ తొడుక్కొని కాలేజీ రోడ్డు మీద నడుస్తా ఉంటే, నడకలోనే ఏదో కొత్తదనం కనిపించ సాగింది. ఈతపీచు చెప్పులు తొడుక్కొని నడిచిన కాళ్లల్లో స్లిప్పర్స్ భలే అద్భుతంగా కనిపిస్తా వుండాయి. నా వేషానికి నేనే మురిసిపోతా, వెంటనే మలేరియా ఆఫీసును గుర్తుకు తెచ్చుకొని, ఏమైతాదో ఏమో, హెడ్మాస్టర్ సార్ వొస్తాడో రాడో, రాకుంటే ఏం చెయ్యల్లనో ఏమో, సారొచ్చినా ఉద్యోగం ఇస్తారో లేదో, నేను కలగనినంత సులభంగా ఉద్యోగం వస్తాదా? ఇద్దరమూ జోరుగా పోతావుండాం, అక్కడ ఏమైతాదో ఏమో అని అనుకోగానే మనసులో కొంచెం ఆందోళన మొదలైంది.బాలన్నతో అదే అన్నాను.
‘మలేరియా ఆఫీసులో హామీ తీసుకున్నెంకనే హెడ్మాస్టర్ సార్ మనకు నమ్మకంగా చెప్పింటాడు నారాయణా! అంత లేనిదే వారం దినాలు అనంతపురంలో ఉండేకి సిద్ధపడి రాండని సార్ మనకెందుకు చెబుతాడు?’ అంటా బాలన్న నా ఆందోళన పోగొట్టినాడు. ఇద్దరమూ ధైర్యంగా నమ్మకంతో మలేరియా ఆఫీసు చేరుకుండాం. మేము పోయిన గంట సేపటికల్లా హెడ్మాస్టర్ వొచ్చినాడు. సార్‌ను చూసినంక నాకు ధైర్యం వొచ్చింది.
హెడ్మాస్టర్ సార్ మమ్మల్ని ఇద్దరినీ మొదట వొగ ఆఫీసు రూమ్ లోకి పిల్చుకొని పోయినాడు. ఎదురుగా వొగ ఆఫీసర్ నిల్చుకొని ఉండాడు. మనిషి తెల్లగా ఎత్తుగా నొక్కుల క్రాఫుతో చాలా అందంగా చురుగ్గా ఉండాడు. మనిషి చిన్న వయసే! ఆయనను చూసి మేము ఇద్దరమూ నమస్తే సార్ అని గోడ పక్కన నిలుచుకుండాం. టేబుల్ మీద నేమ్ బోర్డ్ పైన ఆర్.వి రమణ, యుడిసి అని రాసిన అక్షరాలను చదివినాను. ఆయనకు ఎదురుగా కూర్చొని మా హెడ్మాస్టర్ సార్ కొంచెంసేపు ఇంగ్లీషులో మాట్లాడినాడు. రమణాసార్ మా పేర్లు వివరాలన్నీ అడిగినాడు. మేము అన్నీ చెప్పి, మా ఎస్సెల్సీ సర్టిఫికెట్స్ చూపించినాం. మా దగ్గర ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ కార్డ్స్ ఇప్పించుకొని, ఆ సార్ మా హెడ్మాస్టర్ సార్‌ని పిలుచుకొని ఇంకొగ పెద్ద రూమ్ లోకి పోతా, మమ్మల్ని బయటే ఉండమని లోనికి పోయినాడు. మేము బయట నిలుచుకొని గోడకు తగిలేసిన నేమ్ బోర్డు చూసినాం. నల్లని పెయింట్ పూసిన పలకపైన కె. ప్రకాష్ రావు, జిల్లా మలేరియా ఆఫీసర్ అని రాసిన బంగారు కలర్ అక్షరాలు చాలా అందంగా కనిపిస్తా ఉండాయి. పెద్ద ఆఫీసర్ అయితే బయట వాకిలి పంచకు అట్ల రాసిన నేమ్ బోర్డు తగిలేసుకుంటారేమో అని మనసులో అనుకొని, లోపలికి పిలిచినంక అంత పెద్ద ఆఫీసర్ ఏం అడుగుతాడో అని కొంచెం ఆందోళన చెందసాగినాను. అంతలోనే కాలింగ్ బెల్ భయపెట్టే సౌండ్‌తో గట్టిగా మోగింది. వెంటనే పీవన్ వేరే రూములో నుంచి పరిగెత్తి వచ్చి, లోపలికి పోయి వెంటనే బయటికొచ్చి, మమ్మల్ని ఇద్దరినీ లోపలికి పొమ్మన్నాడు. మేము కొంచెం భయం భయంగా లోపలికిపోయి ఎదురుగా ఉండే ఆఫీసరుకు నమస్కరించినాం. ఆయన చాలా దర్పంగా మమ్మల్ని ప్రశ్నించినాడు. మేము వినయంగా జవాబులు చెప్పినాం.
‘మీకు ఎవరు చెప్పారు,మా డిపార్ట్మెంట్లో ఉద్యోగాలున్నాయని?’.
ఆ ప్రశ్నకు ఏమి జవాబు చెప్పల్లనో దిక్కు తెలియక “ఎవరో చెప్పితే తెలుసుకొని వొచ్చినాం సార్ “అని నేను మెల్లగా బదులు ఇచ్చినాను.
“ఎవరు చెప్పారు? ఏం తెలుసుకొని వచ్చారు?” అని గద్దించి అడిగినాడు ఆఫీసర్. ఆ గద్దింపులతో మేము బిత్తిరిపోయి ఎవరి పేరు చెప్పితే ఏమి ప్రమాదమైతాదో అని భయపడతా మౌనంగా ఉండి పోయినాం. ఆయన కూడా కొంచెం సేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి, ఏదో పేపర్ చూస్తా “ఆదోనికి వేస్తాను, పోతావా” అని అడిగినాడు. ఆ ప్రశ్నతో నాకు ధైర్యం వచ్చింది. చేతులు కట్టుకుని వినయంగా, “పోతాను సార్” అని అన్నాను.
“పోయి ఏం చేస్తావ్” ఆయన మళ్లీ అడిగినాడు.
“ట్రైనింగ్‌లో చెప్పిన పని అంతా చేస్తాను సార్’ అని ధైర్యంగా చెప్పినాను.
“పని సరిగా చేయకపోతే తోక కత్తిరిస్తాను తెలిసిందా? అని అధికారిగా చెప్పినాడు ఆఫీసర్. సరే సార్ అని మేము తల ఊపినాం. మమ్మల్ని బయట ఉండమని చెప్పినాడు. మేము బయటికి వొచ్చి హాల్లో బెంచీ మీద కూర్చుండాం. ఆ తర్వాత మా హెడ్మాస్టర్ సారూ రమణా సారూ బయటికి వొచ్చి నవ్వుతా సంతోషపడతా మమ్మల్ని పలకరించినారు. “కంగ్రాచులేషన్స్! ఇద్దరూ సెలెక్ట్ అయినారు. ఈరోజు నుంచి ఇదే ఆఫీసులోనే వారం దినాలు ట్రైనింగ్ ఉంటాది. ట్రైనింగ్ తర్వాత మీకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తాం” అని రమణా సార్ అభినందిస్తా చెప్పినాడు.
“ఏదో లేరా, జిల్లా ఆఫీసర్ కన్విన్స్ అయినాడు. ట్రైనింగ్ అయిపోతానే డిలే చేయకుండా పోయి డ్యూటీలో చేరండి. ఒక సంవత్సరం వర్క్ చేసినంక జాబ్ పర్మినెంట్ అయితాది. దూరం అని అనుకోకుండా పోయి చేరండి.కొన్నాళ్లయిన తర్వాత దగ్గరికి వేయించడానికి చూస్తాను.” అని హెడ్మాస్టర్ సార్ ధైర్యం చెప్పి వెళ్ళిపోయినాడు..
మధ్యాహ్నం భోంచేసి వొచ్చిన తర్వాత ట్రైనింగ్ మొదలైంది. అనంతపురంలో ఉండే మలేరియా ఇన్స్పెక్టర్ మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వొచ్చినాడు. “మీకు అలాట్ చేసిన ఏరియాలో ఇంటింటికి వారానికి వొకసారి పోయి ఇంటివాళ్లను పలకరించి, ఇంట్లో అందరూ బాగున్నారా అని అడగాలి. ఇంట్లో ఎవరికైనా దగ్గు చలి జ్వరము ఉంటే తెలుసుకోవాలి.ఇంటి పంచన గోడమీద పెన్సిల్ తో ఒక ఛార్ట్ వేయాలి.ఆ చార్ట్ మీద, పైన నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రాం ఎన్.ఎం.పి అని రాయాలి. ఇంటి యజమాని పేరు, కింది పెద్ద బాక్సులో తేదీ, దాని పక్కన రోగగ్రస్తుని పేరు, చివర సర్వెలెన్స్ వర్కర్ సంతకం ఉండాలి.” అని బోర్డుమీద చాక్‌పీస్‌తో ఛార్ట్ వేసి చూపించినాడు. ఆ తరువాత ఆయన మలేరియా వ్యాధి చరిత్రను సూక్ష్మంగా వివరించినాడు
“జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమాన్ని (National Malaria Eradication Programme) నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రాం అంటారు. అదే NMEP. ఈ ప్రోగ్రాం మొట్టమొదట అమెరికాలో 1942లో ప్రారంభించడింది. ఇది ప్రారంభించడానికి ముందు అమెరికాలోని దాదాపు 15 రాష్ట్రాలలో మలేరియా కారణంగా సుమారు 18500 మంది మరణించారు. అందువల్ల అక్కడ ప్రభుత్వం చేత 1942 నుండి ప్రతి సంవత్సరం పది లక్షల డాలర్ల బడ్జెట్టును కేటాయింపజేసుకొని మలేరియా నిర్మూలన కోసం విశేషమైన కృషి చేసింది. మందులతో పాటు డిడిటి పౌడర్ని దేశమంతటా చల్లి చివరికి 1951 నాటికి దేశంలో మలేరియాను దాదాపు పూర్తిగా నిర్మూలించింది.
మన దేశంలో మలేరియా వ్యాప్తి చెందుతున్న విషయాన్ని గుర్తించిన మన కేంద్ర ప్రభుత్వం, అమెరికా కలిగించిన స్ఫూర్తితో 1953లో జాతీయ మలేరియా నియంత్రణ కార్యక్రమాన్ని(National Malaria Control Programme-NMCP) ప్రారంభించి మలేరియా దోమలను, వ్యాధిని నిర్మూలించడానికి విశేషమైన కృషి చేస్తూ ఉంది. ఎన్.ఎం.సి.పి. అనేది 1958లో ఎన్ఎంఇపి గా రూపాంతరం చెంది 1960 నాటికి గొప్ప విజయాన్ని సాధించింది. దేశంలో స్వాతంత్ర్యానికి ముందున్న 10 లక్షల మరణాల సంఖ్యను జీరో చేసింది. ఇదంతా డిపార్ట్మెంటు సర్వెలెన్స్ వర్కర్లు, నర్సులు, మందులు సాధించిన విజయం కాబట్టి మీరందరూ బాధ్యతతో వ్యవహరించాలి. మీపైన సర్వెలెన్స్ ఇన్స్పెక్టర్, యూనిట్ ఆఫీసర్, జిల్లా ఆఫీసర్, జోనల్ ఆఫీసర్ల తనిఖీలు ఉంటాయి. మన జోనల్ ఆఫీసర్ ఐఎల్ నరసయ్య ఛండశాసనుడు. ఆయన తనిఖీ చేయడానికి వొచ్చినప్పుడు ఎవరైనా బాధ్యతారహితంగా ఉంటే వాళ్లను వెంటనే డిస్మిస్ చేస్తాడు.”
అందరమూ ఇన్స్పెక్టర్ చెప్పింది జాగ్రత్తగా విని అర్థం చేసుకుండాం.. రేపటి నుంచి నాలుగైదు రోజులు ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయని చెప్పి, కొంచెం అర్లీగా రమ్మన్నాడు ఇన్స్పెక్టర్. సరే అని మేము ఆఫీసులో నుంచి బయటికొచ్చి మా కొట్టం చేరుకుండాం. రోంతసేపు కొట్టంలో పొద్దుబుచ్చిన తర్వాత బస్టాండ్ దగ్గరకు పోయి పది పైసలు ఇచ్చి ఇద్దరమూ బైటూ కాఫీ తాగి, టౌను చూడడానికి బయలుదేరినాం నేనూ బాలన్నా. నాకైతే కలెక్టర్ ఆఫీస్ చూడల్లని ఉంది. అదే విషయం బాలన్నతో చెప్పినాను. సరే అన్నాడు బాలన్న.
ఇద్దరమూ క్లాక్ టవర్‌కు తూర్పు వైపున్న బజారు వెంట ముందుకు పోతావుండాం. అది చాలా పెద్ద బజారు! దాన్ని సుభాష్ రోడ్డు అని అంటారంట! దానికి ఇరువైపులా చిన్న చిన్న బజారు సందులు చాలా ఉండాయి. ఎడమ వైపున రఘువీరా టాకీస్ అద్భుతంగా ఉంది. దాన్ని చూడగానే మాల్యవంతం రెండోళ్ళు గుర్తుకొచ్చినారు. టౌన్లో మొత్తం మూడు సినిమా టాకీసులు ఉండాయంట! రఘువీరా టాకీస్‌లో ఉన్నట్లు సౌండ్ సిస్టం రాయలసీమలోనే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇంక ఏ టాకీస్ లోనా లేదని బాలన్న చెప్పతా ఉంటే వింటా, రోంత ముందుకు పోయి గమనించినాను. అక్కడ ఎందుకో రోడ్డు చాలా పెద్దగా 150 అడుగుల వెడల్పుగా మారింది. కుడివైపున ఏదో క్లబ్బు, తర్వాత లలిత కళాపరిషత్తు కనిపించినాయి. దాండ్లను మల్లా చూడొచ్చుననుకుంటా ఇంకా ముందుకు పోయినాం. అక్కడ వొగ పెద్ద సర్కిల్ వచ్చింది. అక్కడ్నుంచి దక్షిణానికి పోయే రోడ్లోనే జిల్లా గ్రంథాలయమూ, మున్సిపల్ ఆఫీసూ, మేము ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాసిన గర్ల్స్ హైస్కూలు మొదట్లోనే ఉండాయి. ఆ తరువాత జిల్లా పరిషత్తు, కలెక్టర్ బంగ్లా, పోలీస్ సూపరెంట్ ఆఫీసు ఇంకా యావేవో గవర్నమెంట్ ఆఫీసులుండాయని తెలిసింది. అవన్నీ వొచ్చే కాలంలో ఎప్పుడైనా చూడొచ్చునని అనుకుంటా ఐరన్ బ్రిడ్జి దగ్గరికి చేరుకుండాం. అది, అనంతపురం చెరువుకు ఎగవన వుండే మరవంక మీద, పాతూరును కొత్తూరును కలుపుతా కట్టిన బ్రిడ్జి అని తెలిసింది. ఎప్పుడు కట్టినారో ఏమో చాలా అద్భుతంగా చెక్కుచెదరకుండా భద్రంగా ఉంది. చెరువు మరవ పారినప్పుడు ఎట్లుంటాదో యేమో గానీ ఇప్పుడు మురికి నీళ్ళు చిన్నగా పారుతా ఉండాయి. వంకకు రెండు వైపులా పచ్చిగడ్డి మడియ్యలు ఉండాయి.
బ్రిడ్జి దాటి కొంచెం దూరం పోయి, దక్చిణం వైపు పోయే ధర్మవరం రోడ్లో కలుసుకొని, పవర్ ఆఫీస్ దగ్గరికి చేరుకుండాం. ఎస్సెస్సెల్సి పరీక్షలప్పుడు, రెండు నెలల కిందట అక్కడ మేము వేసుకున్న గుడారాల స్థలాన్ని బాలన్నకు చూపించినాను. బాలన్న ఆశ్చర్యపోయినాడు. ఇద్దరమూ మా కుటుంబాల గురించి మాట్లాడుకుంటా వొక ఫర్లాంగ్ దూరం పోయి మళ్లా ఒగ ఐరన్ బ్రిడ్జిని చూసి, అదే మరవంకకు పై భాగంలో కట్టిన బ్రిడ్జి అని, అనంతపురం నుంచి మదనపల్లి తిరుపతి ధర్మవరం పోయే బస్సులు, హిందూపురం బెంగళూరు పోయే బస్సులు అన్నీ ఈ రెండు ఐరన్ బ్రిడ్జిల గుండా పోవల్సిందేనని, ఇంక వేరే మార్గం లేదని తెలుసుకుంటా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి చేరుకుండాం.
తూర్పు ముఖంగా ఉన్న గేటు దగ్గర, ధర్మవరం రోడ్డు పక్కన నిలబడి తూర్పు వైపు చూసినాం. రోడ్డు వారనే, అవతల పక్కనుండే అనంతపురం చెరువు నీళ్లు, దూరంగా ఉన్న బుక్కరాయసముద్రం దేవరకొండ వరకు పల్చగా కనిపిస్తావుండాయి. తూర్పున, బుక్కరాయసముద్రం అవతలి మిట్ట దగ్గర ప్రారంభమైన చెరువు కట్ట, పడమరగా ముసలమ్మ కట్ట మీదుగా రెండు మైళ్ల దూరం వొచ్చి, అనంతపురం పాతూరు తూర్పు మోట్లో చెన్నకేశవ స్వామి గుడి దగ్గర దక్షిణానికి తిరిగి అక్కడి నుంచి వొగటిన్నర మైలు దూరంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ మిట్ట దగ్గర ఎత్తు తగ్గి తేలిపోయింది. పాతూరుకు ఆగ్నేయ భాగంలో తేలిపోయిన చెరువు కట్ట దగ్గర, ఎత్తు మీద, చెరువు ముఖంగా కలెక్టర్ ఆఫీసును ఎంత గొప్ప ప్లాన్‌తో కట్టినారో, బ్రిటిష్ పాలకులు ఎంత దూర దృష్టి కలిగిన వాళ్లో, ఎంత గొప్ప ప్రకృతి ప్రేమికులో అని ఆశ్చర్యపోతా కాంపౌండ్ లోపలికిపోయినాం.
అద్భుత నిర్మాణం, అనంతపురం కలెక్టర్ ఆఫీస్!
ఎదురుగా అత్యద్భుతమైన రెండంతస్తుల బిల్డింగ్, ఐదు కమాన్లతో (ఆర్చిలతో), మొత్తం కాల్పురాళ్లూ గారతో కట్టిన రాతి కట్టడం! బిల్డింగ్ దగ్గరికి పోవడానికి, బిల్డింగ్ ముందర కోడిగుడ్డు ఆకారంలో మూడు అడుగుల ఎత్తున గోడను అలలు అలలుగా వొంచుతా లేపుతా కట్టి, మధ్యలో అందంగా పచ్చికనూ మొక్కల్నీ పెంచినారు. ఆ కోడిగుడ్డ ఆకారపు చిన్న తోటను ఇరువైపుల నుంచి చుట్టుకొని బిల్డింగ్ మధ్యలో కమాను కిందున్న మెట్ల దగ్గరికి పోయినాం. ఆ మధ్య కమాన్ ముందర, 18- 20 అడుగుల ఎత్తుతో పోర్టికోను కట్టినారు. కలెక్టర్ గారి కారు ఇరువైపుల నుంచి పోర్టికో కిందికి పోవచ్చు. ఆ పోర్టికోను నాలుగు వైపులా కమాండ్లు తిప్పి (ఆర్చిలతో) కట్టినారు. వొక్కొక్క కమాన్ వెడల్పు పది అడుగులకు పైగా ఉంది. చక్కగా మలిచిన సైజు రాళ్లతో కట్టిన స్తంభాలపైన పది అడుగుల ఎత్తులో నుంచి రాళ్లను క్రాస్‌గా వొగదాని పైన ఒగటి పేర్చుకుంటా, అర్థ చంద్రాకారంలో వొంపు తిప్పి, రెండు స్తంభాల మధ్యలో ఆ కమాన్లను ఎట్ల కట్టినారో, ఏ సపోర్టూ లేకుండా అర్థ చంద్రాకారంలో పేర్చి కట్టిన ఆ కమాన్ రాళ్ళు పడిపోకుండా ఎట్లుంటాయో చూసినప్పుడంతా నాకు ఆశ్చర్యమైతుంది. జిల్లా జడ్జి కోర్టు గుడకా ఈ మాదిరిగానే ఉంది. బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వ ఆఫీస్ బిల్డింగులన్నీ ఈ మాదిరిగానే ఉంటాయేమో అనుకుంటా ఓపెన్ ఆర్చిలకు బిల్డింగ్ కు మధ్యలో ఉన్న పది అడుగుల కారిడార్‌లో నడచడానికి భయపడినాం. అక్కడ తుపాకులు పట్టుకొని ఇద్దరు పోలీసులు నిలుచుకుండారు. ఇంకా నలుగురు పోలీసులు లోపలుండారు. బయటి ఆర్చిలకు ఎదురుగా, ఆఫీసులోకి పోవడానికి మల్లా పది అడుగుల ఎత్తున ఆర్చి ద్వారాలు, భద్రమైన రెండు తలుపుల వాకిళ్లు! అవి ఆఫీసు డోర్లు కాదంట! ఖజానా డోర్లంట! ఖజానా అంటే జిల్లాకు అంతటికీ కావలసిన డబ్బంతా లోపల ఉందేమో, అందుకే పోలీసులు తుపాకులు పట్టుకుండారేమో అని భయపడతా, ఇద్దరమూ చెరొక వైపు నుంచి పైకి పోవడానికి మెట్లెక్కినాం.
ఆ మెట్లను చూసి నేను అబ్బురపోయినాను. టేకుతో తయారు చేసిన మెట్లు! ఎన్ని యేండ్ల కిందట కట్టినారో, జనమూ ఆఫీసర్లూ నడిచి నడిచి మెట్ల అంచులన్నీ అరిగిపోయినాయి! అయినా భద్రంగా ఉండాయి. ప్రతి మెటిక చివరా చిన్న స్తంభాల మాదిరి ఉన్న మంచి పనితనపు టేకు కోళ్లను దిగగొట్టి, దాండ్ల పైన, పై వరకు ఏటవాలుగా వొగ చిన్నపాటి పనితనపు దూలాన్ని పొందించినారు! దాన్ని రైలింగ్ అని అంటారంట!
పైనంతా కలెక్టర్ ఆఫీస్! తూర్పూ ఉత్తరం వైపున పది అడుగుల బాల్కనీ! తూర్పు బాల్కనీలో నిల్చుకొని ఇద్దరమూ చెరువువైపు చూసినాం! ఎండాకాలం అయినా, చెరువు నీళ్ల మీద నుంచి తేలాడి వచ్చే గాలి చల్లగా వీస్తా ఉంది! పైన బిల్డింగులో ఐదు కమాన్లకు ఎదురుగా, పది అడుగుల ఎత్తు ఆర్చ్ డోర్లు! పక్కన ఆర్చి కిటికీలు! రెండంతస్తులలోనా పైపరుపు, టేకు తీర్లపైన మద్రాస్ పెంకులు నిలువుగా, గారతో కరిపిచ్చి, ఎక్కడా చీమంత సందు లేకుండా గారతోనే ప్లాస్టింగ్ చేసినారు! కలెక్టర్ ఛేంబర్ దగ్గరా ఇంకా రెండు మూడు ఛేంబర్ల దగ్గరా బిళ్ళజవాన్లు, తలకాయల మీద టోపీల మాదిరి రుమాళ్లు పెట్టుకుండారు! ఆ ఎర్రని రుమాళ్ల మీద, కుట్టిన నక్కీపట్టీలు మెరుస్తా ఉండాయి! మేము చూసేకి పిల్లోళ్ల మాదిరి ఉండాము కదా, అందుకే మమ్మల్ని అక్కడ తిర్లాడగూడదని వెళ్లిపొమ్మన్నారు! మేము తెలివిగా పక్క వరండాలోకి పోయి, ఎట్లో కష్టపడి బిల్డింగ్ మధ్యలో ఉండే ఖాళీ స్థలంలోకి పోయి ఆశ్చర్యంగా చూసినాం! అక్కడ నాలుగు మూలలా నాలుగు,రాళ్లతో కట్టిన ముప్పై అడుగుల ఎత్తు స్తంభాలు ఉండాయి! ఆ స్తంభాల పైన గాజుకప్పు! గాజులో నుండి అద్భుతంగా వెలుతురు వొస్తావుంది! నాలుగు స్తంభాల మధ్యలో, స్తంభాలను కలుపుతా చిన్నపాటి టేకు దూలాలను స్తంభాలలోకి చొప్పించినారు! దూలాల కింద, మంచి పనితనంతో చేసిన కోళ్లను, కింద పొందేసిన దూలాల్లోకి అర్ధ అడుగుకు వొగటి చొప్పున దిగగొట్టినారు! దాన్ని చూస్తానే మధ్యలో వొగ పెద్ద వెలుతురు తొట్టె ఉందేమో అనిపించింది! దాని చుట్టూ తిరగడానికీ, వొగ ఆఫీస్ ఛేంబర్లో నుంచి ఇంకొగ దానిలోకి పోవడానికి ఆరడుగుల వెడల్పుతో నడవ ఉంది! ఆఫీస్ గదులన్నింటిలోకి పోవడానికి నాలుగు మూలల్లో నాలుగు ఆర్చి డోర్లుండాయి!
అంతా చూసి నేనూ బాలన్నా ఏదో మయసభలో ఉన్నట్ల ఫీలయినాం. బిల్డింగ్ వెనకవైపు నుంచి పై అంతస్తులోనే ఇంకొగ బిల్డింగులోకి పోవడానికి వొగ వంతెన మాదిరి కట్టినారు. ఆ బిల్డింగ్, ఆడిట్ బిల్డింగ్ అని, వొగ బిల్ల జవాన్ చెప్పినాడు. అట్లంటే ఏమిటో అర్థం గాక, కిందికి దిగొచ్చి, బిల్డింగు చుట్టూరా వొగ రౌండ్ వేసి అబ్బుర పోతా, అనంతపురంలో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కలెక్టర్ ఆఫీసే ఇంత మహాద్భుతంగా ఉంటే, మద్రాసులో గవర్నర్ బిల్డింగు ఇంకెంత అద్భుతంగా ఉంటాదో, ఢిల్లీలో 1927లో కట్టినారని హెడ్మాస్టర్ సార్ చెప్పిన పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవనం, మూడింట రెండు వంతుల ప్రపంచాన్ని పాలించిన ఇంగ్లాండ్ లోని బ్రిటిష్ పాలకుల రాజ భవనాలు ఇంకెంత మహోన్నతంగా ఉంటాయో, అవిట్లను మనవంటి వాళ్లం చూడగలుగుతామా అనుకుంటా, ఈ బిల్డింగును ఎవురు ఎప్పుడు కట్టించినారో తెలుసుకోవల్లని అనుకుండాం. నాకైతే అటువంటి గొప్ప చారిత్రక కట్టడాలను, ఆ కట్టడాల పుట్టు పూర్వోత్తరాలను క్షుణ్ణంగా తెలుసుకోవల్లని చిన్నప్పటి నుంచీ ఆసక్తి ఏర్పడింది.
దాదాపు పదైదు ఎకరాల కాంపౌండ్ లో, ఆగ్నేయం మూలలో, అనంతపురం చెరువు కట్టకు సమీపంలోని మిట్టమీద కట్టిన కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడు కట్టినారో తెలుసుకోవల్లని ఆశపడి, ఎక్కడా శిలాఫలకాలే లేక, చెప్పేవాళ్లే లేక, నేను చాలా నిరాశ చెందినాను. మేమిద్దరమూ పిల్లోళ్ల మాదిరి ఉన్నందువల్ల మాకు ఎవురూ వివరాలు చెప్పలేదేమోనని, కొంచెం పెద్దయినంక ఎట్లయినా సరే తెలుసుకోవల్లని అనుకుండాను.అయితే నా అదృష్టం కొద్దీ ఎవురో వొగ పెద్దాయన, పేరు గుత్తి రామకృష్ణ అంట! గంజికరువు మీద కథలు రాసినాడంట! ఆయన ఏదో పనిమీద కలెక్టర్ ఆఫీసుకొచ్చి బిల్డింగ్ ముందర కనిపిచ్చి, బిల్డింగును ఆసక్తిగా చూస్తా ఉండే మమ్మల్ని పలకరిస్తా, నా ఆసక్తిని తెలుసుకొని, ఆ బిల్డింగు వివరాలు కొన్నీ మొదటి కలెక్టర్ వివరాలు కొన్నీ తెలిపినాడు. నేను చాలా ఆసక్తిగా విన్నాను.
అనంతపురం క్రీ.శ.1800 సంవత్సరాలకు ముందు బళ్లారి జిల్లాలో ఉండేది. 1799 లో మైసూరు రాజయిన టిప్పు సుల్తానును, ఆంగ్లేయులు, మరాఠారాజులు, నైజాం నవాబులూ కుట్రతో యుద్ధంలో ఓడించి చంపిన తర్వాత రాయలసీమ ప్రాంతమంతా నైజాం నవాబుల పరిపాలనలోకి పోయింది. ఈ ప్రాంతంలోని పాలెగాళ్లను అదుపు చేయడానికి చేతగాక నైజాం నవాబు, సైన్య సహకార పద్ధతిలో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ కంపెనీ వాళ్లకు దత్తత ఇచ్చినాడు. అప్పటినుంచి ఈ ప్రాంతంలోని జిల్లాలు దత్త మండలాలుగా మారిపోయినాయి. అప్పుడు అనంతపురం, బళ్లారి జిల్లాలో కలిసి ఉండేది. దత్త మండలాలంటే బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు(కొంతభాగం)జిల్లాలు. దత్త మండలాలలో అప్పుడు చిత్తూరు జిల్లా లేదు. అది ఉత్తర ఆర్కాట్ జిల్లా. దత్త మండలాలకు ఆ కాలంలో రాయలసీమ అనే పేరు లేదు.
మహామనిషి, రైతు బంధువు థామస్ మన్రో అనంతపురం మొదటి కలెక్టర్!
దత్త మండలాల జిల్లాలకు అన్నింటికీ మొదట ఒక్కడే కలెక్టర్. ఆయనే సర్ థామస్ మన్రో! మన్రో, స్కాట్లాండ్లో, అంటే బ్రిటిష్ రాజ్యంలో పుట్టి అక్కడే గ్లాస్గో యూనివర్సిటీలో చదువుకుండాడు. తన తండ్రి అలెగ్జాండర్, వ్యాపారం చేస్తా, నష్టాలలో కూరుకొనిపోయి కోలుకోలేని పరిస్థితులలో వుండగా, తల్లిదండ్రులను, తన తోడబట్టువులను సంరక్షించుకోడానికి భారతదేశంలో వుండే ఈస్టిండియా కంపెనీలో వొక సైనికునిగా చేరడానికి 18 సంవత్సరాల వయసులో స్కాట్లాండ్ నుండీ వొచ్చిన సాహసవంతుడు మన్రో. సైన్యంలో చాలా క్రమశిక్షణతో పని చేస్తూ, చేతికొచ్చే తక్కువ జీతంలోనే సగం తల్లిదండ్రులకు పంపుతా అతి నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతా జీవితంలో ఆకలిదప్పికలూ అలసటతో కూడిన భయంకరమైన పేదరికాన్ని అనుభవించినాడు. మిగతా బ్రటీష్ మాదిరి విలాసాలవైపు మొగ్గకుండా తల్లిదండ్రుల పట్ల ఎంత మానవీతయతతో వ్యవహరించినాడో అంతే గొప్ప హృదయంతో, కూడూ గుడ్డా నీళ్లనిచ్చి తన అవసరాలను తీరుస్తున్న ఈ ప్రాంత ప్రజలను ప్రేమిస్తా, నిరంతరం వాళ్లకు సహాయపడిన, వాళ్లనుగురించి ఆలోచించిన మహానుభావుడు థామస్ మన్రో! సైన్యంలో క్రమశిక్షణగా పని చేయడం వల్ల తొందరగా కల్నల్‌గా ఉద్యోగంలో ప్రమోషన్ పొందినాడు.
దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని రాజ్యాన్ని పాలిస్తున్న హైదరలీకీ ఈస్టిండియా కంపెనీవాళ్లకూ ఆధిపత్యం పోరు 1767 లోనే ప్రారంభమైంది. ఆ యుద్ధాన్ని మొదటి ఆంగ్లో- మైసూర్ యుద్ధమంటారు. 1780 నుండి 1784 వరకు జరిగిన రెండవ మైసూర్ యుద్ధంలో గొప్ప యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించినాడు మన్రో. అతడు చిన్నతనంలోనే మంచి బాక్సర్‌గా, వ్యాయామ క్రీడాకారునిగా గొప్ప దేహదారుఢ్యాన్ని పెంచుకున్నాడు మన్రో. ఆజానుబాహుడైన మన్రో, ధైర్యశాలిగా గొప్ప యుద్ధ వ్యూహకర్తగా ఎదిగి, ఈస్టిండియా కంపెనీకి కీలకమైన విజయాలను సాధించి పెట్టినాడు. 1792లో జరిగిన మూడవ మైసూర్ యుద్ధంలో మన్రో, టిప్పు సుల్తాన్ రాజ్యము నుండి చాలా ప్రాంతాలను ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలోకి తెచ్చినాడు. కంపెనీ, అతని యుద్ధ విజయాలను గుర్తించి, కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ సహాయకునిగా మన్రోను నియమించి, యుద్ద వొడంబడికతో టిప్పు సుల్తాన్ నుంచి పొందిన బారామహల్ మలబార్, కూర్గ్ మొదలైన ప్రాంతాలలో చక్కని పరిపాలన సంస్కరణలకు ప్రోత్సహించింది. అక్కడ, మొట్టమొదట అలెగ్జాండర్ రీడ్ -థామస్ మన్రోలు ఇద్దరూ రైత్వారీ శిష్టాన్ని ప్రవేశపెట్టి ప్రజల చేత గొప్ప పాలకులుగా పేరు పొందినారు. టిప్పు సుల్తాన్ తో చివరిగా, ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్ వెల్లస్లీ నాయకత్వంలో యుద్ధం జరిగినా ఆ యుద్ధ విజయానికీ టిప్పు సుల్తాన్ పరాజయానికీ థామస్ మన్రోనే ప్రధాన కారకుడు.
నాల్గవ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత అతని అధీనంలో ఉన్నరాజ్యాన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం, మరాఠారాజులు, నైజాం నవాబు ముగ్గురూ పంచుకుండారు. ఆ పంపకంలో బళ్లారి, అనంతపురం, కడప కర్నూలు ప్రాంతాలన్నీ నైజాం నవాబ్ రాజ్యములో కలిసిపోయినాయి. ఎక్కడో దూరంగా హైదరాబాదులో ఉండే నైజాం నవాబు, ఈ ప్రాంత పాలెగాళ్ల మీద ఆధారపడి పరిపాలన చేయడం సాధ్యం కాక చివరికి ఈ ప్రాంతాన్నంతా ఈస్టిండియా కంపెనీకి దత్తత ఇచ్చినాడు. మైసూర్ యుద్ధాలలో ఆరితేరిన వాడయినందువల్లను, అప్పటికే పరిపాలన అనుభవం ఉన్నందువల్లను, కంపెనీ ప్రభుత్వం థామస్ మన్రోను ఈ ప్రాంతానికి కలెక్టర్‌గా 1800లో నియమించింది.
థామస్ మన్రో ఈ ప్రాంతానికి కలెక్టర్‌గా వొచ్చేనాటికి జిల్లాలు లేవు. బళ్లారి నుంచి చిత్తూరు ప్రాంతం వరకు అంతా ఒకే జిల్లానే! అంతటికీ ఆయనే కలెక్టర్! 1800 నుండి 1807 వరకు థామస్ మన్రో ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత రైతులను ఆదుకున్న మహానుభావుడు! అంతవరకూ ఉన్న జమీందారీ పద్ధతిని రద్దుచేసి, రైత్వారీ విధానాన్ని అమలు చేసిన గొప్ప భూ సంస్కరణ కర్త! రైతులకు తమ భూముల మీద యాజమాన్య హక్కులను కల్పించి, తద్వారా రైతులు తమ భూములను అమ్ముకోవడానికి వీలు కల్పించిన మహా పాలకుడు మన్రో! ఆ ఏడేండ్ల కాలంలో మన రాయలసీమలో రెండు లక్షలా పదివేల ఎకరాలకు పట్టాలిచ్చినాడు. అంతవరకు పాలెగాళ్లు రైతుల నుండి అధిక మొత్తంలో భూమి శిస్తు వసూలు చేసి అందులో కొంత భాగమే రాజులకు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లకు చెల్లించేవాళ్లు. మన్రో కలెక్టర్‌గా వొచ్చిన తర్వాత రైతులకూ ప్రభుత్వానికీ మధ్యలో ఉండి, ప్రజలను వేదించే పాలెగాళ్ల వ్యవస్థను రద్దుచేసి, శిస్తును బాగా తగ్గించి, రైత్వారీ పద్ధతిలో వ్యవసాయ సాగుబడినీ ప్రభుత్వ ఆదాయాన్నీ పెంచినాడు. పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసినంక, తరతరాలుగా శిస్తు వసూలు చేసిన వాళ్ల సేవకు ప్రతిఫలంగా, వాళ్లకు పెన్షన్ ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టినాడు. దానిని తిరస్కరించి ఎదురు తిరిగిన పాలెగాళ్లను ఉరితీయించినాడు. అట్ల ఉరి తీయబడిన వాళ్లలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వొగడు. ఆ రోజుల్లో పాలెగాళ్లందరూ ప్రజాకంటకులే! ఆ తరువాత థామస్ మన్రో, మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్ అయినాడు. అయిన తర్వాత రైత్వారీ చట్టాన్ని మొత్తం ప్రెసిడెన్సీ అంతటా అమలు చేసినాడు. ఆ మహానుభావుడు ప్రవేశపెట్టిన రైత్వారీ విధానాన్నే బ్రిటిష్ ప్రభుత్వం, దేశమంతటా అమలు చేసింది. ఆ రకంగా థామస్ మన్రో వ్యవసాయ ఆధారిత భారత దేశంలో మొట్టమొదటి వ్యవసాయ రంగ సంస్కర్తగా కీర్తింపబడినాడు. అటువంటి మహానుభావుడు మన జిల్లాకు, మన రాయలసీమ జిల్లాలకు మొట్టమొదటి కలెక్టర్ కావడం మన అదృష్టం!
రాయలసీమ ప్రాంతానికీ ఈ ప్రాంత ప్రజలకూ పాలెగాళ్లు చేసిన నష్టం అంతా ఇంత కాదు. దాదాపు 80 మంది పాలెగాళ్లు రైతాంగాన్ని పట్టి పీడించడం గమనించిన మన్రో, వాళ్లందరినీ తన అధికారం చేత అణిచివేసి, వాళ్ల నుంచి రాయలసీమకు విముక్తి కలిగించిన మహాత్ముడు. అటువంటి రాయలసీమ ప్రేమికుడు,ఎందుచేతనో రాయలసీమ జలవనరుల మీద, సర్ ఆర్థర్ కాటన్ దొర మాదిరి దృష్టి పెట్టలేకపోయినాడు. దృష్టి పెట్టి ఉంటే, 1820 నుండి 1827 వరకు మద్రాస్ గవర్నర్‌గా, బ్రిటిష్ ప్రభుత్వానికి ఎంతో ఇష్టమైన మేజర్ జనరల్‌గా ఉండిన థామస్ మన్రో, 1847-1852లో ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవలేశ్వరం ఆనకట్ట కంటే 20 సంవత్సరాలు ముందే కృష్ణా పెన్నార్ ప్రాజెక్ట్ పని పూర్తి చేసి, రాయలసీమను కోస్తా ప్రాంతం మాదిరి సస్యశ్యామలం చేసుండేవాడు. మద్రాస్ ప్రెసిడెన్సీలో వొగ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన కాటన్ దొర,ధవలేశ్వరం ప్రాజెక్టును కట్టగలిగినప్పుడు,మొత్తం ప్రెసిడెన్సీకే గవర్నర్‌గా, పరిపాలకునిగా ఉండిన మన్రో చాలా సునాయాసంగా కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును కట్టి, రాయలసీమ ప్రజల కండ్లల్లోని వెలుగుల్ని చూసి ఉండేవాడు! మన దురదృష్టం వల్ల ఆ మహానుభావుడికి ఆ ఆలోచన రాలేదేమో అనిపిస్తాది!
ఎక్కువ కాలం మన రాయలసీమలోనే కాలం గడపడం వల్ల మన్రో 1805 నాటికే తెలుగును చక్కగా మాట్లాడడమూ రాయడమూ చదవడమూ నేర్చుకొని, మన గ్రామీణ ప్రజల్ని తెలుగులోనే పలకరించి, వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకునేవాడు. కన్నడ ప్రాంతంలో కూడా చాలా కాలం పని చేయడం వల్ల కన్నడ భాషను నేర్చుకుండాడు. మొదటి కలెక్టర్‌గా బళ్లారి జిల్లా ప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టమైన పాలకునిగా దగ్గరైనాడు. అతని పరిపాలనలో సుఖశాంతులు పొందిన ప్రజలు అతనిపైన “మన్రోల సాహెబర పద” వంటి జానపద గేయాలు అల్లి, పాడినారు. వాళ్ల సంతానానికి మన్రోలప్ప, మన్రోలమ్మ అని పేర్లు పెట్టుకుండారు. అట్లనే మన రాయలసీమలోని పత్తికొండ ప్రాంతంలో కూడా ఆయన మీద ఎంతో గౌరవం పెంచుకొని ఆయన రూపాన్ని భక్తితో పూజించినారు.
శ్రీకృష్ణదేవరాయలు ఏలిన ఈ భూభాగంలో, తన 47 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో కేవలం మూడుసార్లు మాత్రమే తన జన్మస్థలానికి వెళ్లి వచ్చిన థామస్ మన్రో, ఎంతటి నిబద్ధ జీవో, ఎంత నిజాయితీపరుడో, ఎంత నిరాడంబరుడో, ఈ ప్రాంతాన్ని ఎంతగా గుండెలకు హత్తుకుండాడో చెప్పడానికి మాటలు చాలవు. అటువంటి రాయలసీమ ప్రేమికుడైన మన్రో చివరికి గవర్నర్‌గా పదవిని చాలించి స్వదేశానికి తిరిగిపోతూ, పత్తికొండ ప్రాంతంలో ప్రజలు కలరా వాతన పడి చనిపోతున్నారని తెలుసుకొని, ఎవరెంతగా వారించినా వినకుండా ఆ ప్రాంత కలరా బాధితులను పరామర్శించడానికి వెళ్లి అదే కలరా వాతనబడి, చివరికి భార్యా పిల్లల కడ చూపుకైనా నోచుకోకుండా, తన గుండెలకు హత్తుకొని ప్రేమించిన ఈ నెలలోనే శాశ్వతంగా కలిసిపోవడం చరిత్రలో ఒక విషాద ఘట్టం!
గుత్తి రామకృష్ణ చెప్పిన థామస్ మన్రో కథంతా విని నేను ఆశ్చర్యపోయినాను. అంతకుముందే హైస్కూల్లో మా హెడ్మాస్టర్ సార్ సోషియల్ పాఠం చెప్పేటప్పుడు, ఇండియాలో బ్రిటిష్ పాలకులు ఆధునిక విద్యావ్యాప్తి కోసరం ప్రతి జిల్లాలో ఉన్నత పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు స్థాపించడం వల్లనే భారతీయులకు ప్రపంచ పరిణామాలన్నీ తెలుసుకునే అవకాశం కలిగిందని, భారత దేశంలోని సాంప్రదాయ విద్యా విధానం వల్ల బ్రాహ్మణులకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండేదని, డల్హౌజీ- మెకాలే-విలియం బెంటింగ్ వంటి ఆంగ్లేయుల వల్లనే మనదేశంలో అందరికీ విద్యావకాశం దక్కిందని, చీకటింట్లో ఉన్న భారతీయులకు ఇంగ్లీష్ విద్య, బయటి వెలుగులు చూపే ఒక కిటికీ వంటిదని చెప్పినప్పుడే నాకు బ్రిటిష్ పాలకుల మీద గొప్ప గౌరవభావం ఏర్పడింది. వాళ్లు కట్టించిన కలెక్టర్ ఆఫీసు వంటి బిల్డింగులు, వేయించిన రైల్వే లైన్లు, ఇప్పుడు గుత్తి రామకృష్ణ వివరించిన థామస్ మన్రో, ఆర్థర్ కాటన్ దొర వంటి మహానుభావుల చరిత్రలు అన్నీ తెలియడం వల్ల ఆ బ్రిటిష్ పాలకుల మీదా వాళ్ల డిసిప్లిన్ మీదా నాకు అంతులేని గౌరవమేర్పడింది.
థామస్ మన్రోను మనసులో తలచుకుంటా, బాలన్నా నేనూ గుత్తి రామకృష్ణ గారికి నమస్కారం చెప్పి, కాంపౌండ్ బయటికొచ్చినాం.ధర్మవరం రోడ్లో కొంచెం ముందుకు పోయి కుడివైపుకు చీలే రోడ్లో వొగటిన్నర మైలు దూరం నడిచిపోతే, రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందిన ఇంజనీరింగ్ కాలేజీ వొస్తుందని తెలిసింది. అంత దూరం నడిచిపోయి నడిచి రావడానికి చాలా టైం పడుతుందని, కాలేజీకి ఎండాకాలం సెలవులు ఉండొచ్చునని, ట్రైనింగ్ ముగించుకొని ఉద్యోగంలో చేరిన తర్వాత వీలున్నప్పుడు వచ్చి దాన్ని చూడొచ్చునని, అటువైపు పోకుండా ఇద్దరమూ వెనుదిరిగి టవర్ క్లాక్ చేరుకుండాం.
అమరవీరుల సుందరస్మారక చిహ్నం టవర్ క్లాక్!
అనంతపురం నడిబొడ్డులో మూడు రోడ్ల జంక్షన్ మధ్యలో దక్షిణం వైపున్న రైల్వే స్టేషన్-ఆర్ట్స్ కాలేజీ రోడ్డు గుండా పోయినప్పుడు ‘T’ ఆకారంలో కనిపించే రోడ్ల మధ్యలో, నేలమట్టానికి నాలుగు అడుగుల ఎత్తున్న గుండ్రని అరుగుపైన, నాలుగు సమ ముఖాలుగా సుమారు యాభై అడుగుల ఎత్తుతో నాలుగు వైపులా నాలుగు, ఒకే సైజున్న గోడ గడియారాలతో కనిపించే గోపురం వంటి కట్టడమే క్లాక్ టవర్! దీన్ని టవర్ క్లాక్ అని చదువుకున్నోళ్లు, పెద్ద గడియారం అని చదువు రానోళ్లు అంటా ఉంటారు.అదే పనిగా దాన్ని గురించి తెలుసుకోవల్లని దాని వైపు నిగాగా చూసి, ఎంత అందంగా కట్టినారో అనుకుంటా మురిసిపోతా దాని చరిత్రను గురించి తెలుసుకుండాను.
కర్నూలు అనగానే కొండారెడ్డి బురుజు గుర్తుకొస్తాదని, ఆ బురుజు కర్నూలుకు చిహ్నమని, అట్లే అనంతపురానికి చిహ్నం టవర్ క్లాక్ అని తెలిసినప్పుడు నాకు భలే ఆనందం అయింది. ఆనందంతో చాలా విషయాలు తెలుసుకుండాను.
అందమైన అనంతపురం పట్టణానికి చెదిరిపోని సరికొత్త అందాన్ని ఇచ్చే టవర్ క్లాక్‌కు గర్వించదగిన చరిత్ర ఉంది. 1857వ సంవత్సరంలో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సమరం దగ్గర నుంచి ఎన్నో లక్షల మంది అమరవీరుల ప్రాణత్యాగ ఫలితంగా భారతదేశానికి 15-8-1947 వ తేదీ అర్ధరాత్రి స్వతంత్రం దక్కిన సంగతి మనకందరికీ తెలుసు! దేశం కొరకు ప్రాణాలర్పించిన ఆ అమరవీరులకు మనం ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. మనమూ, మన రాబోయే తరాల వాళ్ళందరూ నిరంతరం ఆ అమరవీరులను స్మరించుకోవడం మన కనీస బాధ్యత! ఆ బాధ్యతను అనంతపురం ప్రజలకు నిరంతరం గుర్తు చేయడానికి అనంతపురంలోని ప్రముఖులు 15-8-1947 తేదీ నాడు, స్వాతంత్ర్య సమర వీరులైన అమరవీరుల స్మారక చిహ్నంగా టవర్ క్లాక్ అనే సుందరమైన కట్టడాన్ని నిర్మించినారు.
1945లో బ్రిటిష్ క్యాబినెట్ కమిషన్, స్వాతంత్ర్యం ఇచ్చే విషయంలో భారతదేశం అంతటా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఆ సందర్భంలో ఆ క్యాబినెట్ కమిషన్ అనంతపురానికి కూడా వొచ్చింది. అప్పుడు అనంతపురం ప్రజలు ఆ కమిషన్‌ను వ్యతిరేకించి 30 వేల రూపాయలు విరాళాలు ఇచ్చినారు. అప్పటి జిల్లా జడ్జ్ శ్రీ భక్తవత్సలం నాయుడు గారి నాయకత్వంలో ప్రజల విరాళాలతో టవర్ క్లాక్ ను నిర్మించనారు. 15-8-1947వ తేదీన అప్పటి కలెక్టర్ రాజనాల కోటేశ్వరరావు గారు దీన్ని ప్రారంభించినారు.
అనంతపురం టవర్ క్లాక్ గోపుర నిర్మాణం! దాన్ని ఆ షేపులో ఎందుకు కట్టినారో తెలుసుకొని నేను మురిసిపోయినాను. 15-8-1947వ తేదీలోని 15 సంఖ్యను సూచిస్తూ దాని వ్యాసార్థం 15 అడుగులుగా, ఎనిమిదవ నెలను సూచిస్తూ టవర్ క్లాక్ కట్టడం 8 భుజములుగా, 47 వ సంవత్సరాన్ని సూచిస్తూ 47 అడుగుల ఎత్తుగా ఈ టవర్ క్లాక్ ను నిర్మించడం, స్వాతంత్ర్య దినానికి ఒక అద్భుత చిహ్నం అని గర్వపడతా, అనంతపురంలోని మిగిలిన మాన్యుమెంట్సును అన్నిటినీ ముందు ముందు చూసే తీరల్లని అనుకుంటా మా కొట్టానికి చేరుకుండాం.
మలేరియా సర్వెలెన్స్ వర్కర్‌గా ఉద్యోగం!
మలేరియా సర్వెలెన్సు వర్కర్‌గా వారం దినాల ట్రైనింగ్ అయిపోయింది. నన్ను కర్నూలు జిల్లా ఆదోనిలో చేరమని జిల్లా మలేరియా అధికారి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినాడు. రమణా సార్ ఆర్డర్ కాపీని నా చేతికిచ్చి, విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి నా భుజం తట్టినాడు. నేను ఆయనకు వినయంగా ధన్యవాదాలు చెప్పి నమస్కరించి, మా ఊరికి చేరుకొని సంతోషంగా చిన్నాయనకూ జేజికీ విషయం చెప్పగానే వాళ్ళు మురిసిపోతా, జీతం ఎంత అని అడిగినారు, నెలకు 60 రూపాయలని చెప్పి, ప్రతి సంవత్సరమూ పెరుగుతాదని తెలిపినాను. యెట్లోలే నాయినా, ఆ మాన్నుబావుడు సాయం చేసినాడు! ఉద్యోగంలో చేరుకున్నెంక రెండు మూడు నెలలు నాయనోళ్లకు నీ జీతం దుడ్లు పంపిస్తే, వాళ్లు తొందరగా మన ఊరు చేరుకుంటారు అని చిన్నాయన ఆరాటపడతా చెప్పినాడు. తొందరగా అన్నీ సర్దుకోవల్ల, ఈ పొద్దే శింగనమలకు పోయి హెడ్మాస్టర్ సారోళ్లను కలిసొచ్చేది మేలనుకొని బయలుదేరి సారోళ్లను కలిసి విషయమంతా చెప్పినాను. జయమ్మక్క చాలా సంతోష పడింది. ఆదోని కొంచెం దూరం రా, దూరం అని అనుకోకుండా రేపే బయలుదేరిపోయి డ్యూటీలో చేరి జాగ్రత్తగా ఉద్యోగం చేస్తా ఉండు. కొన్నాళ్ళయినంక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. జీతం వచ్చినంక ఇస్తువు, అంతవరకు ఖర్చులకు ఇది పెట్టుకోరా అని 25/- రూపాయలు చేతికిచ్చి ధైర్యం చెప్పినాడు హెడ్మాస్టర్ సార్. నేను ఆనందబాష్పాలు కారుస్తా ఇద్దరి పాదాలకు నమస్కారం చేసి ఊరికి బయలుదేరి ఇల్లు చేరుకుండాను.
మా ఊరి బ్రాంచ్ పోస్టాఫీస్, రుద్రవరం సూరయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. సూరయ్యే మా ఊరి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. నాకంటే మూడేళ్ల పెద్దోడైన దాసరోళ్ల గోపాల్ పోస్టుమ్యాన్. నాకు అన్నవరసయిన గోపాల్, ప్రతిరోజూ శింగనమల సబ్ పోస్టాఫీసుకు పోయి, మా ఊరోళ్ల ఉత్తరాలన్నీ సబ్ పోస్టాఫీస్‌లో అప్పజెప్పి, మా ఊరికొచ్చిన టపాలంతా తీసుకొని వొచ్చి అందరికీ బట్వాడా చేస్తాడు. మా ఊరి నుంచి బయటికి పోయే జాబులన్నీ టార్బాల్ పట్టమాదిరి ఉండే వొగ మందమైన బ్యాగులో పెట్టి, లావు దారంతో కట్టి, దారం ముడి మీద లక్కసీలు వేసిస్తాడు సూరయ్య. శింగనమల నుంచి మా ఊరికొచ్చే పోస్ట్ బ్యాగు గుడకా లక్క సీలుతోనే వొస్తాది. సూరయ్య శెట్టిని మేము పిన్నయ్యా అని పిలుస్తాం. ఆయనకు చదువుకుంటా ఉండే నామీద భలే ప్రేమ. అందుకే రాత్రిపూటైనా నేను పోయి అడుగుతానే పోస్టాఫీస్ రూమ్ తలుపు తీసి, ఇరవై నయా పైసలకు వొగ ఇంగ్లాండ్ లెటర్ ఇచ్చినాడు. నేనక్కడే కూర్చొని, నాయనకు సీతం సీతంపల్లికి లెటర్ రాస్తా, ఉద్యోగ విషయమంతా తెలిపి, లెటర్ని మడిచి, దాని అంచుకున్న బంకను నాలుకతో తడిపి, గట్టిగా కరిపించి పోస్ట్ బాక్స్‌లో వేసి ఇంటికొచ్చి, నా జతగాళ్లందరికీ సంతోషంగా ఉద్యోగ విషయం చెప్పినాను.
అర్ధగంటలో ఊరందరికీ తెలిసిందేమో చాలామంది వొచ్చి నన్ను పలకరించి సంతోషపడినారు. లింగనపల్లి చెన్నారెడ్డి, భీషన్న, ఎలకంటి సుబ్బయ్య ఇంకా ఐదారు మంది వొచ్చి, “మనూర్లో చదువుకొని ఉద్యోగాల్లో చేరిండేది, ఇంతవరకు ఎలకంటి పెద్ద పాపయ్య కొడుకులు ఇద్దరే రా! నువ్వు మూడో వానివప్పా” అని మెచ్చుకుండారు. రాత్రంతా ఎన్నెన్నో ఊహించుకుంటా నిద్రబోయినాను.
తెల్లారినంక చౌడక్క పెద్దమ్మోళ్లది ట్రంకు పెట్టె, మల్లా ఇస్తానని చెప్పి ఇప్పించుకొని వొచ్చి, బట్టలన్నీ దాంట్లో సర్దుకుండాను. అన్నం వండుకుండేకి కావలసిన దినుసులూ సామాన్లూ అన్నీ వొగ సంచిలో మూట కట్టుకుండాను. అంబలి పొద్దు అన్నం తిని చిన్నాయనోళ్లకు, చుట్టుపక్కల అందరికీ చెప్పి బయలుదేరి అనంతపురంలో రైలెక్కి, గుంతకల్లు జంక్షన్లో దిగినాను. జంక్షన్ చూసి ఆశ్చర్యపోయినాను.
ఎంత పెద్ద జంక్షనో!ఆరు రైళ్లు వొగేసారి కలుస్తాయంట! విజయవాడ, హైదరాబాద్, మద్రాస్, బొంబాయి, బెంగళూరు, హుబ్లీల నుంచి వచ్చే రైళ్లన్నీ వొగదానికొకటి కనెక్షన్ అంట! జంక్షన్లో ఏడు ప్లాట్‌ఫారాలు ఉండాయని తెలుసుకొని అబ్బురపోతా, ఆదోనికి పోయే రైలు ఏ ఫ్లాట్ఫారంకు వొస్తాదో అడిగి, ఫ్లైఓవర్ ఎక్కి ఆ ఫ్లాట్‌ఫారం మీదికి పోయినాను.పోయిన అర్థగంటసేపటికి రైలొచ్చింది. జనరల్ బోగీలు చాలా రద్దీగా ఉండాయి. కష్టపడి లగేజీ మోసుకుంటా వెళ్లి కొంచెం రద్దీ తక్కువగా ఉండే బోగీ ఎక్కినాను. అదృష్టం కొద్దీ సీటు దొరికింది. తెలుగు హిందీ కన్నడ తమిళం మాట్లాడే వాళ్లు కలగా పులగంగా ఉండారు.
నేను రైల్లో ప్రయాణం చేయడం అదే మొదటిసారి! ఎంత విచిత్రంగా ఉందో బోగీ అంతా! కాఫీ టీలంటా, కూల్ డ్రింకులంటా, వెజిటబుల్ బిర్యాని అంటా, కర్డ్ రైసంటా, చల్లని మజ్జిగంటా అరిచే వాళ్లు; వేరుశెనక్కాయలంటా మసాలా మిక్చర్ అంటా బత్తాయి బనానా సపోటా అంటా అరిచే వాళ్లు; బాబూ కుంటోన్ని బాబూ అని అడుక్కుతినే వాళ్ళు: హార్మోనియం వాయించుకుంటా చిటికెలు కొట్టుకుంటా పాటలు పాడేవాళ్లు; అంగీ లేకుండా నిక్కరు మాత్రమే తొడుక్కొని సీట్ల కిందున్న తోలూ తొక్కలూ బీడీ సిగరెట్ల తుంటలూ చిత్తు పేపర్లూ అన్నీ వొగ బట్టతో ఊడ్చి క్లీన్ చేస్తా దీనంగా చేతులు చాపే పిల్ల నాయాళ్లూ, అందరితో కంపార్ట్మెంట్ అంతా, రైలు కమ్మీల మీద నడిచే టౌన్ బజారు మాదిరి కనిపిస్తా ఉంటే, రైలు పేదోల్లందరికీ వొగ గొప్ప బతుకుదెరువు అనిపించింది నాకు. చిటికెలు కొట్టేవాడు ఎంత నైపుణ్యంగా కొడతా పాడతా ఉండాడో! హార్మోనియం పెట్టె వాయించుకుంటా, తన పసిబిడ్డను కొంగులో వీపుకు కట్టుకున్నామె ఎంత అద్భుతంగా పాడుతా వుందో!
వీళ్లంతా ఎక్కడెక్కడి వాళ్లో? ఎక్కడెక్కడికి పోతా ఉండారొ? రకరకాల ప్రాంతాల వాళ్లు, రకరకాల మతాల వాళ్లు, కులాల వాళ్లు, ఎంత అద్భుతంగా కలిసినారో! ఎవురెవురు యాయా పనుల మీద పోతా ఉండారో! వొక్క రైల్లోనే ఇంత సందడిగా ఉంటే, మొత్తం జంక్షన్ కు వచ్చే ఆరు రైళ్లు వొక్కసారిగా కలిస్తే ఇంకెంత సందడిగా ఉంటాదో!
ఆలోచన చేస్తా జనాన్ని చూస్తా ఉండాను. అంతలోనే రైలు కదిలింది. సీట్లో కూర్చొని పరిసరాలన్నీ గమనిస్తా ఉండాను. గుంతకల్లు సగం ఊరంతా రైలు పట్టాలూ గూడ్సులూ రైలింజన్లే! అబ్బా, ఎన్ని వేల మంది ఈ రైళ్ల వల్ల బతుకుతా ఉండారో అని అనుకుంటా ఉండగానే రైలు స్పీడందుకుంది. ఆ స్పీడులో, రైలు ఆవిరి ఇంజన్లో నుంచి వచ్చే శబ్దమూ పట్టాల మీద రైలు పెట్టాల శబ్దమూ చిన్నచిన్న స్టేషన్లను సెకండ్ల కాలంలో దాటిపోతా పక్క కమ్మీల దగ్గర చేస్తా ఉండే శబ్దమూ అంతా వింటా ఆశ్చర్యపోతా, మానవుని విజ్ఞానం ఎంత గొప్పదో అని తలుచుకొని మురిసిపోసాగినాను. రైలనేది లేకపోయి ఉంటే ఇన్ని కోట్ల మందికి ప్రయాణ సౌకర్యం ఎంత కష్టమయ్యేదో? రోడ్డుమీద బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణం ఎంత హాయిగా ఉందో! ఒంటికీ దొడ్డికీ వొస్తే రైల్లో యా ఇబ్బందీ ఉండదు కదా! రైలు కనిపెట్టిన వాడు ఎంత గొప్పవాడు! వొక్కని విజ్ఞానం వల్ల ప్రపంచంలో కోటానుకోట్ల మందికి ఎంత సౌకర్యం ఏర్పడిందో!
అనుకుంటా రైలును కనిపెట్టిన ఆ శాస్త్రజ్ఞునికీ, రైళ్లను దేశమంలో ప్రవేశపెట్టిన బ్రిటిష్ వాళ్లకూ మనసులోనే ముక్కుకో సాగినాను. అంతలోనే ఆదోని దగ్గరకు వొచ్చిందని కొంతమంది ప్రయాణికులు తమ సామాన్లను సర్దుకో సాగినారు. ఆదోనిలో దిగిన తర్వాత నేను ఎక్కడికి పోవల్లనో ఆలోచన చేయకముందే స్టేషన్ వొచ్చేసిందే అని గాబరా పడతా, నా ట్రంకుపెట్టీ మూటా సర్దుకుండాను. రైలాగింది. రైలు దిగి స్టేషన్ బయటికొచ్చి ఆఫీసర్ మాదిరుండే వొగాయన దగ్గరికి పోయి, మలేరియా ఆఫీసు అడ్రస్ అడిగినాను. ఆయనకు స్పష్టంగా తెలిసిందేమో, ఏమాత్రం ఆలోచన చేయకుండా అడ్రస్ చెప్పినాడు.
నేను మలేరియా ఆఫీస్ చేరుకుండాను. సామాన్లన్నీ వొగచోట పెట్టి, ఆఫీసులో నేను వచ్చిన విషయం చెప్పి, ఎవరిని కలవల్ల సార్ అని వొగాయనను అడిగినాను. “మీ పేరు ఎస్ నారాయణ కదండీ! అనంతపురం నుంచి వొచ్చినారు కదా!” అని ఆయన నా పేరు చెప్పుతానే ఆనందమయింది నాకు. మీరెవరు సార్ అని అడిగినాను. నా పేరు నల్లన్నండీ. నేను సీనియర్ సర్వెలెన్సు వర్కర్ని. ఈ టౌన్ లోనే పనిచేస్తున్నాను అని తనను గురించి చెప్పి, నన్ను యూనిట్ ఆఫీసర్ దగ్గరికి పిల్చుకొని పోయినాడు. నేను ఆఫీసర్‌కు నమస్కారం చేసి, నా పోస్టింగ్ ఆర్డర్ కాపీ అందజేసినాను. ఆయన నన్ను డ్యూటీ లోకి చేర్చుకొని, నేను పనిచేయవలసిన ఏరియాలను తెలిపినాడు. ఆదోనిలోని పడమర వైపునుండే నాలుగు వార్డులు కొథారి కాటన్ మిల్ , రాయల్ కాటన్ మిల్, టిజియల్ హై స్కూల్ ఏరియాలు, టౌన్ పక్కనుండే కల్లుబావి, ధనాపురం, నాగనాథహళ్లి, ఇస్వి అనే నాలుగు పల్లెలు-ఇదంతా నీ జ్యూరిస్డిక్షన్ అని పక్కనుండే వొగాయనను చూపి, ఈయనే మీ ఇన్స్పెక్టర్ అని పరిచయం చేసినాడు. రేపు ఆఫీసుకు వచ్చి మలేరియా కిట్టు తీసుకొని డ్యూటీకి కల్లుభావికి ఇన్స్పెక్టర్ వెంట పోవల్లని అన్నాడు యూనిట్ ఆఫీసర్. “సరే సార్” అని నేను నల్లనతో పాటు హాల్లోకి వొచ్చినాను.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
